4/5.గేయ రామాయణం సుందరకాండ


సుందరకాండ గేయ రామాయణం 
సుందర కాండ 

గేయ రామాయణం
సుందర కాండ(124 చరణాలు) 



1.
మొదలాయె సుందర కాండ యిపుడే
కాలూనె లంకలో హనుమంతుడే
విరహాల వారధి జంటకతడే
విహ్వలము కలిగించె లంక కతడే 

2.
వినయాన సీతమ్మ పదము కొలిచి
రౌద్రాన లంకనే తాను కాల్చి
భక్తితో రామయ్య మనసు‌ గెలిచి
కావ్యంపు హృదయమై హనుమ నిలిచె 

3.
సీతకై లంకలో వెదికేందుకు
హనుమయ్య కృతనిశ్చయుండయ్యెను
పంచ భూతాలకత డంజలించి
వింతగా తనువునే పొంగించెను 

4.
పొంగేటి పున్నమి సంద్రమల్లే
ఆ హనుమ ఆకార ముప్పొంగగా
మహేంద్ర పర్వతము క్రుంగెనంట
దేవగణ మెగిరెను నింగి‌వంక. 

5.
ఆశీస్సులందించ ఋషి వాక్కులు
అద్భుతము తిలకించ అనిమేషులు
తన ఒళ్ళు విదిలించి ఒక్కసారి
వెళ్ళగా సిద్ధమై బ్రహ్మచారి

6.
బాహువులు కటిసీమ బంధించెను
కొద్దిగా మోకాళ్ళ పై క్రుంగెను
తన దృష్టి నింగిలో నిగిడించెను
శ్వాసను హృదయాన బంధించెను 

7.
నే రామబాణమై లంక జేరి
శ్రీరామ రామనే కనుగొందును
కాంతయే కనిపించకున్న యెడల
లంకనే పెళ్ళగించుకు వత్తును 

8.
అని పలికి హనుమయ్య ఖగరాజులా
రివ్వుమని నింగిలో దూసుకెళ్ళె
బాహువులు సాచి యతడెగురుతుంటే
రెక్కల పర్వతము వలెనె తోచె 

9.
వినువీధి చూస్తున్న‌గంధర్వులు
విరివాన కురిపించి మెచ్చుకొనిరి
దినకరుడు చల్లబడి సహకరించె
అనిలుడు ప్రియమార సేదదీర్చె 

10.
శ్రీ రామ దూతయౌ ఆ హనుమకు
విశ్రాంతి నొసగుటే కర్తవ్యము
అని తలచి కృతజ్ఞుడై సాగరుండు
ఆతిథ్యమివ్వమనె మైనాకుని 



11.
మెరిసేటి బంగారు శిఖరాలతో
ఉదయించు సూర్యుడై మైనాకుడు
ప్రీతితో  ఆతిథ్యమును చేకొని
తరియింపజేయమని వేడుకొనగా 

12.
ఓ!పర్వతోత్తమా!మెచ్చినాను
మార్గాన ఆగనని ప్రతిన నేను
చేసితిని కనుకనే నిలువలేను
దయచేసి తెలుసుకో నా మనసును 

13.
అని పలికి వీడ్కొని పోవువేళ
హనుమయ్య దీక్షనే తరచి చూడ
దేవతలు కోరగా నాగమాత
సురస తను రాక్షసిగ రూపుదాల్చి 

14.
హనుమయ్య దారికే అడ్డునిలిచి
తనకతడు ఆహారమని పలికెను
 తెరువుమా నీ నోరు అనుచు హనుమ
తన రూపు యోజనాలకు పెంచెను 

15.
ఒక నూరు యోజనమ్ముల పొడవున
తను నోరు పెంచగా సురస హనుమ
కడు బుద్ది కుశలుడై‌ దాని నోట
అంగుష్ఠ మాత్రుడై దూరివచ్చె 



16.
వెరగంది నిజరూపుదాల్చి సురస
మెచ్చుకొని‌ ఆశీర్వదించి పంపె
హనుమయ్య సలుపు ఘనకార్యమ్ములు
దేవతల కానంద హేతువయ్యె 

17.
ఆవలి ఒడ్డునకు చేరువేళ
కడలిలో సింహిక అను రాక్షసి
తగినంత భోజనము దొరికెనంటూ
ఆకర్షణము చేసె హనుమ నీడ. 

18.
ఛాయాగ్రాహి యని గ్రహియించినా
హనుమ‌ మరల తన తనువుపెంచి
సూక్ష్మరూపుడై‌ రాకాసి నోట దూరి
అద్దాని తనువునే‌ చీల్చివేసె 

19.
ఈ రీతి ఎదురైన గండమ్ములు
గడచి ఆవలి దరి చేరుకొనెను
రాక్షసుల దృష్టి లో పడరాదని
తనరూపు సంక్షేప మొనరించెను 

20.
ఆ‌ విశ్వకర్మచే నిర్మితమ్మై
రావణ బ్రహ్మ చే పాలితమ్మై
బంగారు ప్రాకార సహితమ్మునై
ఆ లంక అబ్బురమ్మనిపించెను

21.
సూర్యాస్తమయముకై వేచియుండి
మార్జాలమాత్రమౌ రూపుదాల్చి
కడు అప్రమత్తమై అలరుచున్న
లంకనే పరికించి చూచువేళ. 

22.
లంకాపట్టణపు అధిరాక్షసి
లంకిణి గమనించి హనుమంతుని
వికటాట్టహాసమ్ము సలిపి తాను
ఎవడవు నీవనుచు గద్దించెను 

23.
హనుమయ్య చెప్పేది చెవిబెట్టక
అరచుచు అతడినే చరిచినంత
కోపాన నినదించి హనుమంతుడు
పిడిగుద్దు వేసెను ఎడమచేత 

24.
లంకిణి బాధతో సుళ్ళుతిరిగి
హా!రక్ష రక్షయని శరణువేడె
విధాత తనకిడిన వరము తెలిపి
మూడెను చేటు ఇక లంకకనియె 

25.
లంకిణి శుభవాక్కు విన్నంతనే
ఉరకలే వేయగా ఉత్సాహము
తానెగిరి అందుకొని ప్రాకారము
తన ఎడుమ కాలునే ముందుమోపె



26.
నగరంత ఒకసారి తిరిగి చూసి
రావణుని మందిరము కనిపెట్టెను
అందాల ఆ దివ్యభవనమ్ములో
మత్తిల్లి నిద్రించు స్త్రీల గనెను 



27.
తొలుతగా మండోదరిని గాంచి
సీతయై ఉండునని భ్రమియించెను
అంతలో బుద్ధియే మేల్కాంచెను
అపరాధ భావమ్ము తలయెత్తెను 

28.
ఎంతటి పొరపాటు ఊహ నాది
వివేకమది నాది ఏమైనది!
శ్రీరామ పత్ని‌ తన శత్రువింట
ఈ రీతి నిర్భీతి నిదురించునా!

29.
అని క్షణము తలపోసి సంతసించె
అంతలో‌ తిరిగి మది కలతనొందె
ప్రమత్తులై ఉన్న పర స్త్రీ లను
చాటుగా చూచుటకు వెతనుపొందె 

30.
నిద్రించు పరస్త్రీల నీరీతిగా
చూచుటే పాపమని చింతించెను
కలగనే లేదుగా కామదృష్టి
కాబోదు పాపమని తృప్తిపడెను 

31.
అణువణువు గాలించి అంతఃపురం
అతివనే కనలేక దిగులుచెందె
విఫలుడై వెనుదిరిగి పోరాదని
మదిలోన ధృడముగా నిశ్చయించె 

32.
అంతలో అశోకవనము గాంచి
తానచట వెదికేందుకై వెడలెను
యత్నమ్ము సఫలమ్ము చేయమంటు
అతడెల్ల దేవతల ప్రార్థించెను 

33.
అశోకవనముకే హనుమ జేరి
శింశుపావృక్షమే అధివసించి
సీతమ్మజాడయే తనకచ్చట
తప్పక దొరకునని తలపోసెను 

34.
అచట వేయి స్తంభాలతోటి
ఎత్తయిన చైత్యంపు వనములోన
శింశుపా వృక్షంపు నీడలోన
అగుపించె అతనికొక దీనురాలు 

35.
రాక్షసీ గణములే చుట్టుముట్ట
ధూళి ధూసరిత వస్త్రమ్ముతో
శుక్లపక్షాన కనవచ్చు చంద్రరేఖై
పొగచేత కప్పిన అగ్నిశిఖయై 

36.
కలతతో కనపడిన స్త్రీ మూర్తి ని
సీతగా గుర్తించి హనుమంతుడు
ఆ సాధ్వి దుర్గతిని తలచి తలచి
దుఃఖాన మదినెంతొ తల్లడిల్లి 

37
ఈ మూడు లోకాల ఆధిపత్యం
ఈమెకు ఎన్నటికి సాటిరాదు
కనుకనే ఈ పుణ్య దంపతులది
తథ్యమ్ము అనురూప దాంపత్యమే 

38
అని మదిని తలపోసి ముదమునొందె
ఆ చెట్టు కొమ్మపై నక్కియుండె
ఆ అసుర కాంతలను మభ్యపెట్టి
అమ్మనే చేరగా వేచియుండె

39
అంతలో నిశిరాత్రి గడచిపోయె
తెలవారి వేదఘోషలు వినపడె
కైపుతో ఎరుపెక్కినట్టి కనుల
మత్తుడై రావణుడు నడచివచ్చె 

40
రావణుని మోములో తేజస్సుకు
హనుమయ్య రవ్వంత జంకినాడు
గజగజా వణికేటి సీతమ్మను
రావణుడు ఒకసారి గాంచినాడు 



41
మైథిలీ! నీవంటి స్త్రీ రత్నము
మరి నాకు సాటి వచ్చే వీరుడు
ఈ మూడు లోకాలలో లేరుగా
మూఢత్వమికనైన విడువరాదా! 

42.
లంకేశు రౌద్ర వచనాలతోటి
నిలువెల్ల వణికింది సీత తొలుత
ఆ పిదప ధైర్యమ్ను చిక్కబట్టి
ఒక గడ్డిపోచనే అడ్డుపెట్టి 

43
రావణా!పర దార నాశించితే
నీ వంశ నాశనము జరుగగలదు
అధముడా!ఇకనైన తప్పు నెరిగి
నన్నిపుడె రామునకు అప్పగించు 

44.
అది విని క్రోధాన ఊగిపోయి
రావణుడు గడువపుడు గుర్తుచేసి
అందులో పది నెలలు గడచిపోయి
పై రెండు నెలలింక మిగిలెననియె 

45.
జానకీ!ఈ గడువులోన నీవు
మనసింక మార్చుకోకున్న యెడల
ఆపిదప మరునాటి‌ సూర్యోదయం
నీవింక కాగలవు నా భోజనం 


46.
ఓసోసి రాకాసి మూకలారా!
మీరన్ని విధములా యత్నించుడీ!
దండోపాయమ్మునైన వాడి
మగువ మది నా వైపు మళ్ళించుడీ! 

47.
అనుచు అట్టహాసము చేయుచూ
రావణుడు ఆజ్ఞ నిడి మరలిపోయె
రాక్షసీ గణమంత చుట్టుముట్టి
సీతను మాటలతొ హింస పెట్టె

48.
వినలేక సీతమది కలతపడెను
విధికి దయ లేదనుచు విలపించెను
విషమిచ్చు వారైన ఇచట లేరే!
దిక్కేది నాకింక అని పొగిలెను 

49.
విభీషణుని కూతురౌ త్రిజట యపుడు
రాకాసి మూకలను వారించుతూ
నిదురలో కల ఒకటి కంటి నేను
రామునకు జయమునే కాంచినాను 

50.
కనుకనే మానండి మీ హింసను
శరణింక వేడండి ఈ సీతను
నాకు మన రాక్షసేంద్రుడి నాశనం
కలలోన పొడసూపె ఈ ఉదయము 



51.
మహా తేజస్వియగు నొక్కడు
శ్రీ రామ దూతగా వచ్చినట్లు
లంకనే దహియించి వేసినట్లు
నేడు నే కలగంటి నిజము ఒట్టు 

52
ఆ త్రిజట మాటలను విన్నంతనే
జానకి మనసెంతొ సంతసించె
తనువులో వామ భాగమ్మదిరెను
శుభమైన శకునములు ఉదయించెను 

53
ఇదియెల్ల గమనించి హనుమంతుని
ఉల్లమున సంతోష ముప్పొంగెను
కాబోదు కల్ల  నా తల్లి తపసు
చెల్లునిక దుఃఖమ్ము సీతకనుచు 

54
సీతమ్మ జాడనే కనుగొంటిని
శత్రువుల బలమునే గ్రహియిస్తిని
తెలిసెనిట లంకేశు ప్రాభవమ్ము
తెలుపవలె స్వామికీ కథ సర్వము 

55
 దిక్కెవ్వ రీచోట నాకనుచును
దుఃఖించు తల్లికే ముదము కలుగ
రాముని క్షేమమ్ము నెరిగించెద
సీతమ్మ ఉత్తరము గొనిపోయెద. 


56.
ఈ చోట ఈ గుంపు కన్నుగప్పి
సీతమ్మ చెంతకే చేరుటెట్లు?
పలు మాయలను చూచి విసిగి ఉన్న
తల్లికి నమ్మకము కలుగుటెట్లు?   

57.
అనుచు మది తలపోసి హనుమంతుడు
శ్రీరామచరితమ్ము వివరమ్ముగా
భక్తితో గానమ్ము చేసినంత
నిలువెల్ల పులకించి రామకాంత.  

58.
కనపడని కంఠమ్ము ఎక్కడిదని
తలయెత్తి హనుమనే గమనించెను
రాక్షసుల మాయగా భ్రమియించెను
సత్యమ్ము కనలేక కలతపడెను    

59
హనుమయ్య కొమ్మపైనుండి దూకి
తను రామబంటునని మోకరిల్లె
రాముణ్ణి నఖశిఖము వర్ణించుతూ
గుర్తుగా అంగుళిని సీతకొసగె    

60.
రాముని ఉంగరము గనినంతనే
రమణిలో సంతోష దుఃఖమ్ములు
కలగలిసి ఒక్కసారే ముసిరెను
పతియొక్క క్షేమమ్ము ప్రశ్నించెను   


61.
నేనేమి చెప్పుదును ఓ మైథిలీ!
నువు లేక రామునకు సౌఖ్యమేది?
విలపించి విరహాబ్ధి నీదులాడి
తపియించుచున్నాడు దుఃఖార్తిని 

62.
తన తనువుపై ప్రభువు ధ్యాస విడిచె
నిండుగా నిదురించుటెపుడొ మరిచె
ప్రతి యొక్క సొగసులో నిన్నుగాంచి
నీవిభుడు నిట్టూర్పు విడుచుచుండె 

63.
ఆ మాటలాలించి లలనామణి
పతిమాట తానెంచి తనదు మదిని
దుఃఖమో స్నేహమో తెలియరాని
భావాన పలుకాడె నీ రీతిని 

64.
పావనీ! నాపైన విభునికున్న
ప్రేమ యది ఆనందకరమె అయినా
విషమింత కలసినా అమృతములా
నా స్వామి దుఃఖమ్ము నన్ను కలచు 

65
అని పలికి ఆర్తితో తల్లడిల్లే
అమ్మను హనుమయ్య అనునయించె
తల్లికి ముదమునే చేకూర్చగా
తలపోసి తానొక్క మాట తెలిపె 

66.
ఓ జనని!దుఃఖాన్ని విడిచిపెట్టు
కాకున్న నా మూపు నధివసించు
అగ్ని‌ గతి హవ్యాన్ని హరికి వోలె
నే నిన్ను రామునకు అప్పగింతు 

67.
ఆ పలుకు వినినంత సీత సుంత
చిరునవ్వు మోముపై చిందులాడ
హనుమయ్య శక్తినే కనలేనిదై
పావనితొ పలికెనిటు విమలాత్మయై 

68.
నాయనా!పిల్లివలె ఉన్నాడవు
నన్నింక నీవెట్లు మోయగలవు?
నీ కోతి బుద్ధినే చూపినావు
అనినంత నొచ్చుకొని హనుమ అపుడు  

69.
దీప్తితో ప్రజ్వరిలు అగ్ని వోలె
తను వృద్ధి చెందెను మేరువల్లె
తన శత్రు భీషణపు విశ్వరూపం
చూపించి లంకనే మోతుననియె 

70
జానకి తిలకించి అచ్చెరువుతో
హనుమయ్య శక్తినే గ్రహియించెను
ఐననూ నీవెంట నే వచ్చుట
ఎవరికీ క్షేమమ్ము కాదు‌అనెను 

71.
అసహాయురాలనగు నన్ను నాడు
బలిమితో తెచ్చె నీ దుర్మార్గుడు
నీ వెంట వచ్చుచో నేనిప్పుడు
నా వర్తనము పతికి పరువుకాదు 

72.
నే పాతివ్రత్యమ్ము మరువరాదు
నీకెట్టి నష్టమ్ము జరుగరాదు
రాఘవున కపకీర్తి కలుగరాదు
రావణుని వంశమ్ము మిగలరాదు 

73.
 పతిభక్తి  విడువను హనుమ నేను
అన్యమౌ పురుషులను తాకబోను
 నాకొరకు రాముడే రావలయును
శత్రువును చంపి నను కావవలెను 

74.
నా పాట్లు విభునకే విన్నవించు
పావనీ!నా పతిని నన్ను చేర్చు
గుర్తుగా నా శిరోభూషణమును
నాథునకు అందించి మమ్ము మనుపు

75.
అనుచు మాటిమాటికి పలుకుతూ
దుఃఖాన పలవరించే సీతకు
మృదువైన ఓదార్పు వచనాలతో
హనుమయ్య సాంత్వనము కలిగించెను 

76.
నీ విభుడు త్వరలోన వచ్చునమ్మా
కపులతో లంకకే చేరునమ్మా
అనిలుని సహితుడౌ అగ్ని వోలె
సౌమిత్రి తోగూడి చెలగునమ్మా 

77.
అని హనుమ సీత ఆశీస్సు పొంది
ఆ తల్లి వీడ్కోలు స్వీకరించి
స్వామినే చేరగా బయలుదేరి
శత్రువుకు తమబలము చూపనెంచి 

78.
నందనము కాబోలు అన  ఒప్పుతూ
కనువిందు కలిగించు ఆ వనమును
తన శక్తి ప్రకటించి హనుమంతుడు 
క్షణములో మరుభూమిగా మార్చెను 

79.
సీతమ్మ వసియించు స్థలము తప్ప
తక్కిన వనమంత ధ్వంసమాయె
నిదురను మేల్కొన్న మూకలన్నీ
హనుమయ్య రూపుగని బెదరిపోయె 

80.
పరుగున పోయి తమ రాజు జేరి
సరగున విషయమ్ము వివరించిరి
క్రోధాన మండిపడి లంకేశుడు
ఆ కపిని అంతమ్ము చేయుడనెను

81.
ఆజ్ఞ విని వేలకొలది గా అసురులు
హనుమను నలువైపు చుట్టుముట్ట
అట ద్వారతోరణముపై నిలబడి
హనుమయ్య సింహనాదము చేసెను 

82.
క్షణములో రాక్షసుల మట్టుబెట్టి
ఆ చైత్య ప్రాసాదమే కూల్చెను
అంతలో రావణ ప్రేషితుండై
జంబుమాలియె అనికి అరుదెంచెను 

83.
వాడొచ్చి హనుమనే బాధించెను
హనుమయ్య వాడినే వధియించెను
మారుతి మోముపై విజయహాసం
లంకేశు గుండెలో మీరె క్రోధం 

84.
ఏడుగురు మంత్రితనయులు వచ్చిరి
ఫలమేమి క్షణములో అంతమైరి
ఐదుగురు సైన్యాధిపతులొచ్చిరి
ఆ హనుమ క్రోధాగ్ని కాహుతైరి 

85.
కోతిని బంధించి కొనితెమ్మని
రావణుడు అక్షకుమారు నంపె
ఒక దివ్య రథమెక్కి తరలివచ్చి
ఆ వీరుడనిలోన రాలిపోయె 

86.
తొలిసారి భయపడిన లంకేశుడు
సరిలేని వీరుడని ఖ్యాతిగన్న
బ్రహ్మ చే వరములే పొందియున్న
ప్రియ సుతుని పిలిపించి పలికెనిటుల. 

87.
ఇంద్రజీ!కాంచినావా !దుర్గతి
విహ్వలము కలిగించె నొక్కకోతి
నీదైన దివ్యాస్త్ర బలము జూపి
విజయాన్ని వరియించు పరువు నిలిపి 

88.
అనుచున్న పిత్రాజ్ఞ తలనుదాల్చి
నాలుగౌ సింహాల రథమునెక్కి
రావణి హనుమతో పోరు సలిపి
దీటైన వీరుడను నిజము తెలిసి 

89.
సంధించి విడిచెను బ్రహ్మాస్త్రము
వినయాన తలవంచె కపితేజము
రాజుతో భాషించు అవకాశము
కలుగునని భావించి మరునిముషము 

90.
బంధనము తెంచుకొను శక్తియున్నా
అశక్తుని తీరుగా హనుమ నిలిచె
మూఢులౌ రాక్షసులు అతని మూగి
తాళ్ళతో బంధించి గంతులేసె 


91.
అన్యమౌ బంధనము వేసినంత
బ్రహ్మాస్త్ర బంధనము తొలగిపోవు
తెలిసినా హనుమయ్య కదలడాయె
తెలియదని రావణి నవ్వుకొనియె 

92.
గర్వాన కొనిపోయి ఇంద్రజిత్తు
హనుమను తండ్రి కే అప్పగించె
నిశాచరాగ్రణి  నిండుసభలో
నిర్భయుండగుచు ఆ హనుమ నిలిచె 

93.
అంతట రావణుని ఆజ్ఞ పైన
ప్రహస్తుడు వివరమ్ము ప్రశ్నించగా
తడయక ,తడబడక హనుమంతుడు
సూటిగా తన రాక కతము తెలిపె 

94
రావణా!నే వాయుపుత్రుండను
కపిరాజు సుగ్రీవు సచివుండను
శ్రీరామ దూతనై వచ్చినాను
సీతమ్మ దురవస్థ కాంచినాను 

95.
హితవునే చెబుతుంటి ఆలకించు
సీతను రామునకు అప్పగించు
నీలోని విజ్ఞతను మేలుకొలుపు
నీ వంశ నాశనము పరిహరించు 

96.
విధాత వరములే నాకు కలవు
అస్త్రాలు  బంధించలేవు నన్ను
నాకున్న శక్తినే గ్రహియించుమా
శ్రీరాము శౌర్యమ్ము నూహించుమా! 

97.
అను హనుమ
  మాటలను ఆలకించి
రావణుడు క్రోధాన ఊగిపోయి
పట్టండి చంపుడీ కోతిననుచు
తక్షణమె తనసేన కాజ్ఞనొసగె 

98.
అంతట రావణుని సోదరుండు
సత్పురుషుడైన విభీషణుండు
దూతవధ నేరము పాపమనుచు
అన్నను నయమున ‌శాంతపరచె 

99.
నీతివిదుడైనట్టి లంకేశుడు
శాంతించి యోచించి కొంత తడవు
కోతులకు వాలమే ప్రియము సుమ్ము
కనుకనే ఆ తోక నంటించుము 


100
అని ఆనతిచ్చిన ఆ మీదట
రాక్షసులు వేడుకే చూడనెంచి
కొరివితో తలగోకు చందమ్మున
హనుమయ్య తోకనే అంటించిరి

101.
అది తెలిసి సీత అగ్నిని వేడెను
అగ్నియే చల్లగా కాపాడెను
అనుగ్రహము గ్రహియించినట్టి హనుమ
రెట్టించి లంకనే దహియించెను 

102
విభీషణుడుండెడు మేడ తప్ప
తక్కిన నగరెల్ల కాల్చివేసి
తోకను మనసును చల్లబరచె
అంతలో ‌తలపులో సీత మెదిలె 

103
అమ్మకు ఆపదే కల్గెనేమొ
నావల్ల అని క్షణము తల్లడిల్లె
పావకుండైన ఆ శీలవతిని
తాకనే లేడనుచు ఊరడిల్లె 

104.
ఈ రీతి ధైర్యమ్ము చిక్కబట్టి
తక్షణమె తల్లికై పరుగుపెట్టి
సీతమ్మ క్షేమమే గని మురిసెను
వీడ్కొని తిరుగు పయనము చేసెను 

105.
అరిష్ట పర్వతము నధివసించి
ఎగసి యా వినువీధి నెగురువేళ
అనిపించి నాడతడు చంద్రుడల్లె
విరహకథ రమ్యమ్ము అతని వల్లే. 


106
పయోధి మీదుగా పయనించెను
ఉత్తరపు తీరమ్ము చేరుకొనెను
వేచిన వానరుల గుంపుగాంచి
వేడుకే మీరగా నినదించెను 

107
ప్రచండవాయువై చెలరేగెను
గిరిపైన మేఘమల్లే వాలెను
అచ్చెరువు పొందగా కపివీరులు
మెల్లగా పుడమిపై కాలూనెను 

108
బిలబిలా మూగిన వానరులను
కనిహనుమ గమనించి ఆసక్తిని
చూసితిని లంకలో సీతననుచు
వివరించి కథనంత వినిపించెను 

109
 దూత గా నావిధియె నెరవేరెను
నేతను దర్శించు వేళాయెను
అను తలచి అంగదాదుల తోడుగా
పావని పయనించె ప్రభుని జేర. 

110
తోవలో మధువనము గాంచివారు
మధుపానసక్తులై ఆగినారు
దధిముఖుడు వినిపించ ప్రభుని ఆజ్ఞ
త్వరపడి రాముణ్ణి చేరినారు 



111
వాక్యజ్ఙు డైనట్టి హనుమంతుడు
మనసులో ధ్యానించి సీతమ్మను
వృత్తాంత మెరిగించె విపులమ్ముగా
సందేశమందించె ఈ రీతిగా 

112
నా కొరకు కాకిపై బ్రహ్మాస్త్రము
వేసిన నాథుండు నేడేలనో
మదిలోన దయమాలి నన్ను విడిచె
అని సీత నాతోటి చెప్పి వగచె 

113
గుర్తుగా ఒసగింది చూడామణి
గుట్టుగా వివరించె తన బాధని
 ఇటుపైన మరియొక్క రెండు నెలలే
నిలిచేను అచట తన ప్రాణాలని 

114
ఆ మాట లాలించి రఘువీరుడు
అందుకొని ఆ మణిని హత్తుకొనెను
వత్సమును కాంచినా గో మాతలా
దుఃఖించి కన్నీరు వర్షించెను 

115
తన బాధ పలుమార్లు చెప్పుకున్నా
సీతమ్మ గుండె తడి ఆరలేదు
హనుమయ్య పదిసార్లు వినిపించినా
రామునికి తనివియే తీరలేదు 

116
పావనీ!నా సీత సందేశమే
నను నేడు బ్రతికించు దివ్యౌషధం
అని స్వామి దుఃఖాన పలవించెను
మరి మరీ సఖి మాట కోరివినెను 



117.
నాయనా!నా సీత ఏమన్నది?
ఆ చోట ప్రియరమణి ఎటులున్నది?
నను గూర్చి తానేమి అంటున్నది?
చెప్పుమా!నా మనసు నిలవకుంది 

118
అని పలుకు శ్రీరాము పరివేదన
లంకలో సీతమ్మ పడు యాతన
తెలిసిన ప్రియబంధువతడేనులే
దంపతుల ఆశలకు దరి చూపెలే 

119
వియోగమగ్నులై విలపించెడి
ల పుణ్య దంపతుల ప్రాణాలను
నిలిపిన నిర్మల భక్తియుతుడు
అసమాన వీరుడౌ హనుమంతుడు 

120
కనులార సీతమ్మ రూపుగాంచి
నోరార రామకథ ఆలపించి
చెవులార సందేశ మాలకించి
మనసార జ్ఞాపికను తలను దాల్చి 


121
మేఘమై వినువీధి పయనించెను
వేగమే రాముణ్ణి చేరుకొనెను
భాగమై సీతమ్మ దుఃఖమ్ములో
రాగమై జంటలో రవళించెను 

122
అంగుళీయకము తా నందువేళ
సీతమ్మ పొందిన సంతసమును
ప్రియరమణి పంపిన చూడామణి
కాంచిన రామయ్య కనువెలుగును 

123
కన్నార కాంచిన కపిముఖ్యుడు
ధన్యుడు మహిలోన మహితాత్ముడు
శ్రీరామ బంటు ఆ హనుమ ఒకడే
సుందరకాండకు ఆత్మయతడే 

124
కావ్యాన ఈ కాండయే సుందరం
జానకీరాముల మది మందిరం
కొలువైన హనుమ కథయే సురుచిరం
కొలిచేము భక్తితో మనమందరం 

సుందర కాండ సంపూర్ణం

 సింహాద్రి జ్యోతిర్మయి







Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)