గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)
నా బ్లాగు *జ్యోతిర్మయం*
వ్యాసేన గ్రథితాం పురాణమునినా
అద్వ్యైతామృత వర్షిణీం
అంబ! త్వామనుసందధామి
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
మామకాః పాండవాశ్చైవ
కిం నో రాజ్యేన గోవిన్ద
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః||2-11||
తథా దేహాన్తరప్రాప్తిః
ప్రతిపదార్థం:-
దేహినః = జీవునకు;అస్మిన్ దేహే= ఈ శరీరమునందు;కౌమారమ్= బాల్యము;యౌవనమ్= యౌవనము ;జరా = వార్ధక్యము ;యథా =ఎట్లో ;తథా =అట్లే ;దేహాన్తర ప్రాప్తిః= మరియొక దేహమును పొందుటయు (కలుగుచున్నది);తత్ర =ఈ విషయమున ;ధీరః =జ్ఞాని ;న ముహ్యతి = మోహమునొందడు .
తాత్పర్యం:-
4. శ్లో||
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ(2:22)
ప్రతిపదార్థం:-
నరః =మనుజుడు ;జీర్ణాని =శిధిలములైన (చినిగిపోయిన);వాసాంసి= వస్త్రములను ;విహాయ =విడిచి ;అపరాణి =ఇతరములైన ;నవాని (వాసాంసి)= క్రొత్త వస్త్రములను ;యథా= ఏ ప్రకారముగా;గృహ్ణాతి= గ్రహించుచున్నాడో ;తథా= ఆ ప్రకారంగానే;దేహీ =ఆత్మ ;జీర్ణాని= శిధిలములైన ;శరీరాణి= దేహములను ;విహాయ= విడిచి ;అన్యాని= ఇతరములైన ;నవాని (శరీరాణి) = క్రొత్త శరీరములను ;సంయాతి =పొందుచున్నాడు.
తాత్పర్యం:-
చినిగిపోయిన పాత వస్త్రములను విడిచి మనుజుడు ఇతరములైన క్రొత్త వస్త్రాలను ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు శిధిలములైన పాత శరీరములను వదలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు.
న చైనం క్లేదయన్త్యాపో
ప్రతి పదార్థం:-
ఏనమ్= ఈ ఆత్మను; శస్త్రాణి =ఆయుధములు; న ఛిందంతి= ఛేదింపజాలవు; పావకః =అగ్ని ;ఏనమ్= ఈ ఆత్మను ;న దహతి= కాల్చజాలదు ;ఆపః చ= నీరున్ను ;ఏనమ్= ఈ ఆత్మను ;న క్లేదయంతి= తడుపజాలదు ;మారుతః= గాలి;న శోషయతి =ఎండింపజాలదు;
తాత్పర్యం :-
6.శ్లో||
జాతస్య హి ధ్రువో మృత్యుః
ధృవం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేऽర్థే
న త్వం శోచితు మర్హసి|| 2-27 ||
ప్రతిపదార్థం :-
జాతస్య = పుట్టిన వానికి;మృత్యుః= చావు;ధ్రువోహి= నిశ్చయము గదా!;మృతస్య =మరణించిన వానికి;జన్మ చ= పుట్టుకయు; ధ్రువం= నిశ్చయము;తస్మాత్ = ఆ కారణము వలన ;అపరిహార్యే =తప్పింప శక్యము గాని;అర్థే =(ఈ) విషయమునందు ;త్వమ్= నీవు; శోచితుమ్= దుఃఖించుటకు;న అర్హసి= తగవు.
తాత్పర్యం :-
పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
హతో వా ప్రాప్స్యసే స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ
యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||
ప్రతిపదార్థం :-
కౌంతేయ =ఓ అర్జునా! ;హతో వా =చంపబడినవాడివైతివేని;స్వర్గమ్= స్వర్గమును;ప్రాప్స్యసే =పొందగలవు; జిత్వావా= జయించితివేని ;మహీమ్= రాజ్యమును ;భోక్ష్యసే= అనుభవింపగలవు ;తస్మాత్ =అందువలన ;యుద్ధాయ =యుద్ధము కొరకు ;కృతనిశ్చయః =చేయబడిన నిశ్చయము కలవాడవై ;ఉత్తిష్ఠ =లెమ్ము .
తాత్పర్యం :-
అర్జునా! ఒకవేళ నీవీ ధర్మయుద్ధమునందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందెదవు.అట్లుకాక నీవే జయించినచో భూలోక రాజ్యమును అనుభవించెదవు.ఈ ప్రకారముగా రెండు విధములా నీకు మేలే జరుగును.కావున లెమ్ము.యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము.
అనువాద పద్యం :-
7.కందం.
మరణము స్వర్గము నిచ్చును
వరవిజయము రాజ్యభోగభాగ్యము నిచ్చున్
నరుడా!కావున లెమ్మిక
స్థిరమౌ బుద్ధిని రణముకు సిద్ధము కమ్మా! (2-37-6.)....13*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
8. శ్లో||
కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూః
మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||
ప్రతిపదార్థం:-
తే =నీకు ;కర్మణి ఇవ =కర్మలు చేయుట అందే;అధికారః =అధికారము (అస్తి= కలదు);కదాచన =ఒకప్పుడును;ఫలేషు =(వాని) ఫలముల యందు;(అధికారః =అధికారము );మా= వలదు; కర్మఫలహేతుః =కర్మఫలములకు కారణమైన వాడివి; మాభూః =కాకుము ;అకర్మణి =కర్మలు చేయకుండుటయందు ;తే =నీకు ;సంగః =ఆసక్తి ;మా అస్తు =కలుగకుండునుగాక!.
తాత్పర్యం :-
కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.
అనువాద పద్యం :-
8.కందం.
నిర్మలమగు చిత్తముతో
కర్మలు చేయంగ నీకు కర్తవ్యము నీ
ధర్మము మఱువకు పార్థా!
కర్మఫలాసక్తి వలదు కర్మ విడకుమా! (2-47-7)...14*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
9.శ్లో||
దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః
స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
ప్రతిపదార్థం :-
దుఃఖేషు = దుఃఖములయందు ;అనుద్విగ్న మనాః =క్షోభమునొందని మనస్సు గలవాడును;సుఖేషు =సుఖములయందు ;విగతస్పృహః= ఆసక్తి లేనివాడును ;వీతరాగభయక్రోధః =అనురాగము భయము కోపము తొలగిన వాడును అగు ;మునిః =మననశీలుడు ;స్థితధీః =(ఇతి) స్థితప్రజ్ఞుడు అని;ఉచ్యతే= చెప్పబడుచున్నాడు.
తాత్పర్యం :-
దుంఖములందు కలతనొందని మనస్సు గలవాడును,సుఖములందు ఆసక్తి లేనివాడును , అనురాగము,భయము, క్రోధము తొలగినవాడును అయిన మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు.
అనువాద పద్యం :-
9.కందం
కలగక శోకము నందున
చెలగక సంతోషమందు స్థిర చిత్తముతో
వలపున భయమున కినుకల
తలకక తాముండు వారె తపసులు ధీరుల్. (2-56-8.)....15*
తలకక..చలింపక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
10. శ్లో||
ధ్యాయతో విషయాన్పుంసః
సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సంజాయతే కామః
కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
ప్రతిపదార్థం :-
విషయాన్ = విషయాలను ;ధ్యాయతః = చింతిస్తున్న ;పుంసః = పురుషుడికి ;తేషు = ఆ విషయాలలో ;సంగః = ఆసక్తి ; ఉపజాయతే = కలుగుతుంది ; సంగాత్ = ఆసక్తి వలన ;కామః = కోరిక ; సంజాయతే = కలుగుతుంది ; కామాత్ = కోరిక వలన;క్రోధః = కోపం ; అభిజాయతే = పుట్టుచున్నది.
తాత్పర్యం :-
విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందు అనురాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును.
అనువాద పద్యం :-
10.కందం
నిరతము విషయాసక్తిని
చరియించెడు మానవులకు సడలవు కోర్కెల్
మరిమరి పెరుగుచు కామము
దరి తెలియని క్రోధమునకు దారిని తీయున్ (2-62-9.)...16*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
11.శ్లో||
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి || 2-63
ప్రతిపదార్థం :-
క్రోధాత్ = క్రోధం వలన ;సమ్మోహః = వ్యామోహం ;భవతి = కలుగుతుంది ; సమ్మోహాత్ = ఆ వ్యామోహం వలన ; స్మృతివిభ్రమః =జ్ఞాపకశక్తి నశిస్తుంది ; స్మృతిభ్రంశాత్ = జ్ఞాపకశక్తి నశించుటవలన ;బుద్ధినాశః = బుద్ధి నశిస్తుంది ; బుద్ధినాశాత్ = బుద్ధి నశించడం వలనప్రణశ్యతి = పతనమవుతున్నాడు
తాత్పర్యం:-
క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2:63)
అనువాద పద్యం :-
11.కందం
కోపమునను సమ్మోహ
మ్మాపై కల్గు నవివేక మాపై మఱపున్
విపరీతపమ్మగు బుద్ధియు
అపమార్గము జన నశింతు రధమత మనుజుల్ (2-63-10.)..17*
విపరీతము...వ్యతిరేకము
బుద్ధి వ్యతిరేకం కావటం అంటే
బుద్ధి నశించుట అని అర్థం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
12. శ్లో||
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వా2స్యామన్తకాలే2పి
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||
ప్రతిపదార్థం :-
పార్థ = ఓ అర్జునా ; ఏషా = ఇది ; బ్రాహ్మీ = బ్రహ్మనిష్ఠ ; బ్రహ్మ సంబంధమైన; స్థితి = స్థితి ; ఏనామ్ = దీనిని ; ప్రాప్య = పొంది ; న, విముహ్యతి = (యోగి ఎప్పుడు) మోహాన్ని పొందడు; అంతకాలే = మరణ సమయంలో ; అపి = కూడా ;అస్యాం = ఈ బ్రాహ్మీస్థితిలో ; స్థిత్వా = ఉండి ; బ్రహ్మనిర్వాణం = బ్రహ్మానందాన్ని ; ఋచ్ఛతి = పొందుతున్నాడు.
తాత్పర్యం :-
అర్జునా! ఇది యంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి.ఇట్టి బ్రాహ్మీస్థితిని పొందినవాడు మరల ఎన్నటికిని విమోహమును చెందనేరడు.అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితియందు ఉన్నవాడు బ్రహ్మానందరూపమైన మోక్షమును పొందుచున్నాడు.
(2:72)
అనువాద పద్యం :-
12.కందం
పొందిన బ్రహ్మజ్ఞానము
చెందక మోహము మనుజుడు చిన్మయ మగు ఆ
నందపు ఘనతర శిఖరము
లందుచు మోక్షమునకు జను నంత్యము నందున్ (2-72-11.)...18*
(2.సాంఖ్య యోగము 11 శ్లోకములు,11 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తృతీయ అధ్యాయం -
కర్మ యోగము
13.శ్లో||
జ్ఞానయోగేన సాంఖ్యానాం
ప్రతిపదార్థం :-
శ్రీ-భగవాన్-ఉవాచ — భగవంతుడు పలికెను;
అనఘ =పాపరహితుడవగు ఓ అర్జునా!;పురా= పూర్వము; అస్మిన్ లోకే =ఈ లోకమునందు; మయా= నాచేత ;సాంఖ్యానాం= జ్ఞానమార్గంలో నడిచే వారికి; జ్ఞానయోగేన= జ్ఞానయోగము చేతను ;యోగినామ్= యోగులకు(కర్మమార్గంలో నడిచే వారికి ); కర్మయోగేన= కర్మయోగము చేతను; ద్వివిధా= రెండు విధములగు; నిష్ఠా= అనుష్ఠాన క్రమము; ప్రోక్తా =చెప్పబడినది.
తాత్పర్యం :-
యజ్ఞాద్భవతి పర్జన్యో
ప్రతిపదార్ధం :-
అన్నాత్= అన్నము వలన; భూతాని =ప్రాణులు ; భవన్తి= కలుగుచున్నవి ; పర్జన్యాత్= మేఘము వలన ; అన్నసంభవః= అన్నము కలుగుచున్నది; యజ్ఞాత్= యజ్ఞము వలన; పర్జన్యః= మేఘము; భవతి =కలుగుచున్నది; యజ్ఞః= యజ్ఞము; కర్మసముద్భవః= సత్కర్మాచరణము వలన కలుగుచున్నది.
తాత్పర్యం :-
15. శ్లో||
ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో
మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
ప్రతిపదార్ధం :-
పార్థ = అర్జునా ; యః = ఎవరు ; ఇహ = ఈ లోకంలో ; ఏవం = ఈ విధంగా ;ప్రవర్తితం = నడుస్తున్న ; చక్రం = సృష్టిచక్రానికి ; న, అనువర్తయతి = అనుగుణంగా నడవడో ; సః = అతడు ; ఇంద్రియారామః = ఇంద్రియలోలుడై ;అఘాయుః = పాపజీవితాన్ని ;మోఘం = వ్యర్థంగా ; జీవతి = జీవిస్తున్నాడు
తాత్పర్యం :-
పార్థా ! ఈ ప్రకారముగ నాచే నడుపబడు ఈ ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి ప్రవర్తింపడో అతడు పాపజీవితమును గడుపువాడును,ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగ బ్రతుకుచున్నాడు.
అనువాద పద్యం :-
15.కం.
నాదగు లోకపు చక్రము
కాదని పాటింపకుండు ఖలు లజ్ఞానుల్
మీదను యింద్రియలోలత
నే దరి గనరాక చెడుదు రిహ జీవనులై (3-16-3)....21*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
16.శ్లో||
యద్యదాచరతి శ్రేష్ఠః
తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే|| 3-21 ||
ప్రతిపదార్ధం :-
శ్రేష్ఠః = ఉత్తముడు ; యత్, యత్ = ఏ ఏ విధంగా కర్మలను ;ఆచరతి = ఆచరిస్తాడో ; ఇతరః = ఇతరులు (అగు); జనః = జనులు ; తత్, తత్ = అదే విధంగా ; ఏవ = మాత్రమే (చేయుచున్నారు) ; సః = అతడు ; యత్ = దేనిని ; ప్రమాణం = ప్రమాణంగా ; కురుతే = చేస్తున్నాడో ; లోకః = సమస్త లోకం ; తత్ = దానినే ; అనువర్తతే = అనుసరిస్తోంది.
తాత్పర్యం :-
ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.
అనువాద పద్యం :-
16.కం.
ఉత్తము లొనర్చు కర్మల
మొత్తము జను లాచరింత్రు ముదమున నెపుడున్
వేత్తల ప్రామాణ్యములే
చిత్తమలర ననుసరింత్రు జేజే లనుచున్ (3-21 -4) 22*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
17.శ్లో||
మయి సర్వాణి కర్మాణి
సన్స్యాస్యా ధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా
యుధ్యస్వ విగతజ్వరః||3-30||
ప్రతిపదార్థం :-
సర్వాణి = సమస్త; కర్మాణి = కర్మలను; మయి=నాయందు;సంన్యస్య = పూర్తిగా అర్పించి;అధ్యాత్మ-చేతసా = భగవంతుని యందే ధ్యాస ఉంచి; నిరాశీః = కర్మ ఫలములపై ఆశ లేకుండా; నిర్మమః = నాది అన్న భావన లేకుండా; భూత్వా — ఉండి; విగతజ్వరః =సంతాపరహితుడవై ;యుధ్యస్వ = యుద్ధం చేయుము;
తాత్పర్యం :-
అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము.
అనువాద పద్యం :-
17.కం
స్థిరమగు బుద్ధిని కర్మల
నరవర! నాయందు నిలిపి నైరాశ్యమ్మున్
మరలించి మమత్వ మహము
దరి జేరగనీక సల్పు త్వరపడి రణమున్ -(3-30-5) 23*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
18.శ్లో||
శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః ||3-35||
ప్రతిపదార్థం :-
స్వనుష్ఠితాత్ = చక్కగా ఆచరింపబడిన ; పరధర్మాత్ = ఇతరుల ధర్మం కన్నా ;విగుణః = గుణరహితమైనప్పటికీ ;స్వధర్మః = స్వీయ ధర్మం ; శ్రేయాన్ = అత్యుత్తమమైనది ;స్వధర్మే = తన ధర్మము నందు ;నిధనం = చనిపోవడమైననూ ; శ్రేయః = ఉత్తమమైనది ; పరధర్మః = ఇతరుల ధర్మము ;భయావహః = భయంకరమైనది.
తాత్పర్యం :-
చక్కగా ఆచరింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది
అనువాద పద్యం :-
18.కం
తన ధర్మము గుణ రహితమ
యిన ఘనము సుమా సలుపుట యిద్ధరలోనన్
విను పరధర్మము భయమిడు
తన ధర్మము నందు మృతియు తనకిక మేలే.(3-35-6) 24*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
19.శ్లో||
ధూమేనావ్రియతే వహ్ని
ర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భ
స్తథా తేనేదమావృతమ్|| 3-38 ||
ప్రతిపదార్థం :-
యథా = ఏ విధంగా ; ధూమేన = పొగచేత ; వహ్నిః = నిప్పు ; చ = మరి ; మలేన = ధూళిచే ; ఆదర్శః = అద్దం ; ఆవ్రియతే = కప్పబడి వుంటుందో ;యథా = ఏ విధంగా ; ఉల్బేన = మావి పొరచే ; గర్భం = గర్భంలోని పిండం ;ఆవృతః = కప్పబడి వుంటుందో ;తథా = అదే విధంగా ; తేన = ఆ కామం ద్వారా ; ఇదం = ఈ జ్ఞానం ; ఆవృతం = కప్పబడి వుంటుంది
తాత్పర్యం :-
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు
కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.
అనువాద పద్యం :-
19.కం.
కప్పును పొగ యనలమ్మును
కప్పునుగా దర్పణమును కమ్మి మలినమే
కప్పును శిశువును మావియు
కప్పబడును జ్ఞాన మటులె కామము చేతన్ (3-38 -7) 25*
(3.కర్మ యోగము 7 శ్లోకములు,7 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చతుర్ధ అధ్యాయం -
జ్ఞాన యోగము
20.శ్లో||
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్|| 4-7 ||
ప్రతిపదార్థం :-
భారత = భరత వంశీయుడైన అర్జునా ; యదా యదా = ఎప్పుడెప్పుడైతే ;ధర్మస్య = ధర్మానికి ;గ్లానిః = హాని ;అధర్మస్య = అధర్మానికి ; అభ్యుత్థానమ్ = వృద్ధి ; భవతి = అవుతుందో ; తదా హి = అప్పుడప్పుడంతా ;అహం = నేను ;ఆత్మానం = నన్ను ;సృజామి = సృష్టించుకుంటూ ఉంటాను
తాత్పర్యం :-
“ ఓ భరత వంశీయుడవైన అర్జునా!ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను
అనువాద పద్యం :-
20.కం.
ఎప్పు డధర్మము చెలగియు
నెప్పుడు ధర్మంపు ముప్పు యిల కేర్పడునో
యప్పుడు ధర్మము గావగ
నొప్పుగ సృజియించుకొందు నొగి నను నేనున్ -(4-7-1) 26*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
21.శ్లో||
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ
సమ్భవామి యుగే యుగే||4-8 ||
ప్రతిపదార్థం :-
సాధూనాం = సత్పురుషుల యొక్క ; పరిత్రాణాయ = రక్షణ కోసం ; దుష్కృతాం = దుష్టుల యొక్క ; వినాశాయ = నాశనం కోసం; చ = మరియు ;ధర్మసంస్థాపనార్థాయ = ధర్మాన్ని స్థాపించటానికి ; యుగే యుగే = ప్రతియుగంలోనూ ;సంభవామి = (నేను) అవతరిస్తాను
తాత్పర్యం :-
“ సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను.
అనువాద పద్యం :-
21.కం.
సుజనుల రక్షించు కొఱకు
కుజనుల నిర్జించు కొఱకు కుంతీతనయా!
ఋజువుగ నే ప్రతి యుగమున
భుజముల ధర్మము వహించి పుట్టెద నిలలో (4-8-2) 27*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
22.శ్లో||
వీతరాగభయక్రోధా
మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞానతపసా
పూతా మద్భావమాగతాః|| 4-10 ||
ప్రతిపదార్థం:-
వీతరాగభయక్రోధాః = అనురాగం, భయం, క్రోధం లేనివాళ్ళు ;మన్మయాః = నాయందే లగ్నమైన చిత్తముకలవారు ;మాం, ఉపాశ్రితాః = ‘ నన్ను ’ ఆశ్రయించిన వారు ;బహవః = అనేకమంది ;జ్ఞానతపసా = జ్ఞాన తపస్సుచేత ;పూతాః = పవిత్రులై ;మద్భావం, ఆగతాః = నా స్వరూపాన్ని పొందారు.
తాత్పర్యం :-
అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
అనువాద పద్యం :-
22.కం.
రేగెడు భయమును క్రోధము
రాగము విడనాడి మదిని, రక్తిని నాపై
బాగుగ నిల్పు తపసులకు
యోగమునను నన్ను జేరు యోగ్యత గలుగున్ (4-10-3) 28*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
23.శ్లో||
యే యథా మాం ప్రపద్యన్తే
తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తన్తే
మనుష్యాః పార్థ సర్వశః|| 4-11 ||
ప్రతిపదార్థం :-
పార్థ = ఓ పార్థా ; యే = ఎవరు ; మాం = నన్ను ;యథా, ప్రపద్యంతే = ఎలా సేవిస్తారో ; అహం = నేను ; తాన్ = వారిని ; తథా, ఏవ = అదే విధంగా ; భజామి = అనుగ్రహిస్తాను ; మనుష్యాః = మనుష్యులు ;సర్వశః = అన్ని విధాలుగా ; ‘మమ ’ = ‘ నా యొక్క ’; వర్త్మ = మార్గాన్నే ; అనువర్తంతే = అనుసరిస్తారు.
తాత్పర్యం :-
ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)
అనువాద పద్యం :-
23.కందం
ఏ విధముగ నెవ్వారలు
నా వాడవు స్వామి నీవు నమ్మితి ననగా
నా విధముగ నవ్వారిని
నే వత్సలతను వహింతు నిత్యము పార్థా (4-11-4) 29*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
24.శ్లో||
యస్య సర్వే సమారమ్భాః
కామసఙ్కల్పవర్జితాః|
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం
తమాహుః పణ్డితం బుధాః||4-19||
ప్రతిపదార్థం :-
యస్య = ఎవరి యొక్క ; సర్వే = సమస్త ;సమారంభాః = కర్మలు ; కామసంకల్ప వర్జితాః = కోరిక , సంకల్పాలు లేకుండా ఉంటాయో; జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం = జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైన కర్మలు కల ; తం = అతనిని ; బుధాః = జ్ఞానులు ; పండితం = పండితుడు అని ; ఆహుః =అంటారు.
తాత్పర్యం :-
ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులు పల్కుదురు. (4:19)
అనువాద పద్యం :-
24.కందం
నిర్మలమగు చిత్తముతో
కర్మలు సంకల్పము విడి కాంక్ష లుడుగ నా
కర్మలు జ్ఞానాగ్నికి నిడి
ధర్మముగా నడచువారె ధరలో విబుధుల్ (4-19-5) 30*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
25.శ్లో||
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి
ర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గన్తవ్యం
బ్రహ్మకర్మసమాధినా|| 4-24 ||
ప్రతిపదార్థం :-
(యజ్ఞము నందు) అర్పణమ్= సమర్పించు హోమసాధనములు; బ్రహ్మ= బ్రహ్మమే; హవిః= హోమద్రవ్యములు; బ్రహ్మ= బ్రహ్మమే; బ్రహ్మాగ్నౌ= బ్రహ్మ మనెడి అగ్నియందు; బ్రహ్మణా= బ్రహ్మ స్వరూపుడగు యజమాని చేత; హుతమ్ =హోమము చేయబడినది ;బ్రహ్మ కర్మ సమాధినా= సర్వమూ బ్రహ్మ స్వరూపమే యనెడి ఏకాగ్రభావముతో ఆ యజ్ఞాది కర్మలను జేయు; తేన =అతనిచేత; గంతవ్యమ్= పొందదగిన ఫలముకూడా ;బ్రహ్మ ఏవ= బ్రహ్మమే యగును.
తాత్పర్యం :-
యజ్ఞ పాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును.
అనువాద పద్యం :-
25.కందం
బ్రహ్మము హోమద్రవ్యము
బ్రహ్మమగును హోమమందు వస్తుచయములున్
బ్రహ్మము హోమాగ్ని , కడకు
బ్రహ్మయగును యాజ్ఞికుడును బ్రహ్మ నియతిచే(4-24-6) 31*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
26.శ్లో||
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తి
మచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||
ప్రతిపదార్థం :-
శ్రద్ధావాన్ =శ్రద్ధ గలవాడును;తత్పరః = తదేక నిష్ఠతో కూడినవాడును;సంయతేంద్రియః = జితేంద్రియుడును ; జ్ఞానం = ఈ తత్త్వజ్ఞానాన్ని ;లభతే = పొందుతాడు ; జ్ఞానం, లబ్ధ్వా = (ఈ) జ్ఞానాన్ని పొంది ; అచిరేణ = తత్ క్షణమే ; పరం, శాంతిం = పరమ శాంతిని ; అధిగచ్ఛతి = పొందుతాడు.
తాత్పర్యం :-
శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
అనువాద పద్యం :-
26.కందం
వృద్ధియగును జ్ఞాన మెపుడు
సద్ధర్మమ్మున జయింప సర్వేంద్రియముల్
శ్రద్ధయు నిష్ఠయు కలిగిన
వృద్ధత్వము నొందు నరుడు పెంపగు శాంతిన్ (4-39-7) 32*
(4.జ్ఞాన యోగము 7 శ్లోకములు,7 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పంచమ అధ్యాయం -
కర్మ సన్న్యాస యోగము
శ్రీభగవానువాచ
27.||శ్లో||
సన్న్యాసః కర్మయోగశ్చ
నిశ్శ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసన్యాసాత్
కర్మయోగో విశిష్యతే|| 5-2 ||
ప్రతిపదార్థం:-
సన్న్యాసః= కర్మ త్యాగము; చ= మరియును; కర్మయోగః = కర్మయోగమును; ఉభౌ= రెండును; నిశ్శ్రేయస కరౌ =మోక్షమును కలుగజేయునట్టివి; తు =కానీ; తయోః =రెండింటిలోనూ; కర్మసన్న్యాసాత్ =కర్మత్యాగము కంటే; కర్మయోగః= కర్మయోగమే; విశేష్యతే =శ్రేష్టమైనది.
తాత్పర్యం:-
కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)
అనువాద పద్యం :-
27.కందం
కనగా కర్మత్యాగము
ననయమ్మును కర్మయోగ మనునవి రెండున్
ఘనమైనను రెండింటను
వినుము ధరను కర్మయోగ విధి యున్నతమౌ (5-2-1) 33*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
28.శ్లో||
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన
పద్మపత్రమివామ్భసా|| 5-10 ||
ప్రతిపదార్థం:-
యః =ఎవడు; కర్మాణి =కర్మలను; బ్రహ్మణి =పరమాత్మయందు; ఆధాయ= సమర్పించి; సంగమ్= (ఆసక్తిని) ఫలాపేక్షను; త్యక్త్వా= విడిచి; కరోతి= చేయుచున్నాడో; సః= అతడు; అంభసా= నీటిచే; పద్మపత్రమ్ ఇవ= తామరాకు వలే; పాపేన= పాపముచేత; న లిప్యతే= అంటబడడు.
తాత్పర్యం:-
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)
అనువాద పద్యం :-
28.కందం
తను జేసెడి ప్రతి కర్మయు
మనమున పరమాత్మపరము మనుజుం డిలలో
వినయమ్మున జేయ నఘము
తనకంటదు తామరాకు తలమున జలమౌ.(5-10-2) 34*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
29.శ్లో||
జ్ఞానేన తు తదజ్ఞానం
యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవత్ జ్ఞానం
ప్రకాశయతి తత్పరమ్|| 5-16 ||
ప్రతిపదార్థం:-
ఆత్మనః=ఆత్మయొక్క; జ్ఞానేన తు జ్ఞానము చేత; ఏషామ్ =ఎవరి యొక్క; తత్ అజ్ఞానమ్= ఆ అజ్ఞానము; నాశితమ్= నాశనమొనర్చబడినదో; తేషామ్= వారియొక్క; జ్ఞానమ్= జ్ఞానము; ఆదిత్యవత్ =సూర్యుని వలే ;తత్ పరమ్= ఆ పరబ్రహ్మ స్వరూపమును; ప్రకాశయతి= ప్రకాశింపజేయుచున్నది.
తాత్పర్యం:-
ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)
అనువాద పద్యం :-
29.
జ్ఞానముచే యజ్ఞానము
మాను నెవని యందు నట్టి మనుజుని లోనన్
భానుని వలె దీపించును
కానగ యా బ్రహ్మమనెడు కాంతికిరణముల్ (5-16-3) 35*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
30. శ్లో||
విద్యావినయసమ్పన్నే
బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ
పణ్డితాః సమదర్శినః|| 5-18 ||
ప్రతిపదార్థం:-
విద్యావినయ సంపన్నే =విద్య వినయము కలిగియున్న; బ్రాహ్మణే= బ్రాహ్మణుని యందును; గవి= గోవునందును; హస్తిని= ఏనుగు నందును; శునిచ ఏవ= కుక్కయందును; శ్వ పాకే చ= శునకమాంసము వండుకుని తినువానియందును; సమదర్శినః= సమదృష్టి గలవారు; పండితాః= జ్ఞానులు (అని చెప్పబడును).
తాత్పర్యం:-
విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును, గోవు నందు,ఏనుగునందు,శునకము నందు, శునక మాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు.
అనువాద పద్యం :-
30.కందం
చక్కని విద్యావినయము
లొక్కట గల విప్రవరుల నొగి గో కరులన్
కుక్కను దినువానిని యా
కుక్కను సమదృష్టి గాంచ కోవిదు డతడే.(5-18-4) 36*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
31.శ్లో||
శక్నోతీహైవ యః సోఢుం
ప్రాక్ఛరీరవిమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగం
స యుక్తః స సుఖీ నరః|| 5-23||
ప్రతిపదార్థం:-
యః =ఎవడు; శరీర విమోక్షణాత్= శరీరమును విడుచుటకు; ప్రాక్= మునుపు; ఇహ ఏవ= ఇచ్చటనే; (ఈ లోకమునందే); కామక్రోధోద్భవం= కామక్రోధముల వలన పుట్టిన; వేగమ్ =తీవ్రతను; సోఢుమ్= సహించుటకు; శక్నోతి= సమర్థుడు అగుచున్నాడో; సః నరః= ఆ మనుజుడు ;యుక్తః =యోగియు; సః= అతడు; సుఖీ= సుఖవంతుడును అగును.
తాత్పర్యం:-
దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)
అనువాద పద్యం :-
31.కందం
తనువును విడువక మునుపే
మనుజు డెవం డిహము నందె మది కామంబున్
తనలో పెంపగు క్రోధము
మొనసూపక వీడు నతడె మునియును సుఖియౌ(5-23-5) 37*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
32 A .శ్లో||
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్
చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా
నాసాభ్యంతరచారిణౌ ।। 5 -27 ।।
(ఈ శ్లోకం ఘంటసాల పాడిన భగవద్గీత లో లేదు కానీ భావం మాత్రం చెప్పబడింది.అందుకనే ఈ శ్లోకం కూడా చేర్చటం జరిగింది.)
ప్రతిపదార్థం:-
(యః ఎవడు) బాహ్యాన్ స్పర్శాన్= వెలుపలనున్న శబ్ద స్పర్శాది ఇంద్రియ విషయాలను; బహిః కృత్వా =వెలుపలికే నెట్టివేసి; చక్షుః= చూపును; భ్రువోః అంతరే ఏవ =కనుబొమల మధ్యనే (కృత్వా నిలిపి);నాసాభ్యంతర చారిణౌ =ముక్కు లోపలనే సంచరించునట్టి; ప్రాణాపానౌ= ప్రాణాపాన వాయువులను; సమౌ చ కృత్వా =సమముగా చేసి (తరువాతి శ్లోకంతో అన్వయం)
తాత్పర్యం:-
వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివేసి (లోన ప్రవేశింపనీయక)
చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగ చేయవలెను.(తరువాతి శ్లోకంతో అన్వయం)
అనువాద పద్యం :-
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
32.శ్లో||
యతేన్ద్రియమనోబుద్ధి
ర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో33. శ్లో||
భోక్తారం యజ్ఞతపసాం
సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి|| 5-29 ||
ప్రతిపదార్థం:-
యజ్ఞతపసామ్= యజ్ఞములకు తపస్సులు;భోక్తారమ్ =భోక్తగాను; సర్వలోక మహేశ్వరమ్= సమస్త లోకములకు ఈశ్వరునిగాను; సర్వభూతానామ్= సమస్త ప్రాణులకు; సుహృదమ్= హితమొనర్చువానిగాను ;మామ్= నన్ను; జ్ఞాత్వా= ఎఱిగి; (మనుజుడు)శాంతిమ్= శాంతిని; మృచ్ఛతి= పొందుతున్నాడు.
తాత్పర్యం :-
సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)
అనువాద పద్యం :-
ఆత్మ సంయమ యోగము
34.శ్లో||
యం సంన్యాసమితి ప్రాహు
ర్యోగం తం విద్ధి పాణ్డవ|
న హ్యసంన్యస్తసఙ్కల్పో
యోగీ భవతి కశ్చన|| 6-2 ||
ప్రతిపదార్థం:-
పాండవ =ఓ అర్జునా ;యమ్= దేనిని ;సన్యాసమ్ ఇతి = సన్న్యాసమని; ప్రాహుః = చెప్పుదురో; తమ్ = దానిని; యోగమ్ (ఇతి) =యోగమని; విద్ధి= తెలిసికొనుము; హి= ఏలయనగా; అసన్న్యస్తసంకల్పః =సంకల్పమును వదలనివాడు; కశ్చన =ఎవడును; యోగీ =యోగి; న భవతి= కానేరడు.
తాత్పర్యం :-
అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు.
అనువాద పద్యం :-
34.కందం
యోగమనగ సన్న్యాసము
కాగల దదె కర్మయోగ కలితము పార్థా!
రాగాదులు మది విడువక
యోగి యనగ దగడు సుమ్మ! యుర్విని నొకడున్ (6-2 -1) 41*
కలితము...ఎఱుగబడినది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
35.
శ్లో||
యుక్తాహారవిహారస్య
యుక్తచేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖహా|| 6-17 ||
ప్రతి పదార్థం:-
యుక్త=తగినట్టి ;ఆహారవిహారస్య= ఆహారము ,నడత కలిగినవాడును; కర్మసు= కర్మలయందు; యుక్త చేష్టస్య =తగిన ప్రవర్తన కలవాడును; యుక్త స్వప్న అవబోధస్య= తగిన నిదుర మెలకువలు కలవాడును; (అగు మనుజునకు) యోగః= యోగము; దుఃఖహా= దుఃఖములను పోగొట్టునదిగ ;భవతి =అగుచున్నది .
తాత్పర్యం:-
మితమైన ఆహారము,నడత గలవాడును,కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్ర,జాగరణము కలవాడునగు మనుజునకు యోగము జననమరణాది సంసార దుఃఖమును పోగొట్టునదిగా అగుచున్నది.
అనువాద పద్యం :-
35.కందం
మితముగ గొను ఆహారము
మితమగు నిదురయు విహితపు మెలకువ మరియున్
నుతమౌ నడతయు గలిగిన
మతిమంతుడె యోగ మంది మను ముక్తుడనన్ (6-17 -2) 42*
విహితము...విధింపబడినది
నుతము..పొగడదగినది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
36.శ్లో||
యథా దీపో నివాతస్థో
నేఙ్గతే సోపమా స్మృతా|
యోగినో యతచిత్తస్య
యుఞ్జతో యోగమాత్మనః|| 6-19 ||
ప్రతిపదార్థం:-
నివాతస్థః= గాలివీచని చోటనున్న; దీపః= దీపము; యథా= ఏ ప్రకారముగా; న ఇంగతే= కదలకనుండునో; సా =అది; ఆత్మనఃయోగమ్ =ఆత్మధ్యానమును ;యుంజతః= అభ్యసించుచున్న ;యోగినః =యోగి యొక్క; యతచిత్తస్య= నిగ్రహింపబడిన మనస్సునకు; ఉపమా= దృష్టాంతముగా; స్మృతా= తలంపబడినది.
తాత్పర్యం:-
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.
అనువాద పద్యం :-
36.కందం.
నిశ్చలముగ దివ్వె వెలుగు
నిశ్చయముగ గాలి హోరు నెరయని గదిలో
నాశ్చర్యము గా దటువలె
నిశ్చలమౌ నాత్మధ్యాననియతుల మనముల్ (6-19-3) 43*
నెరయని...వ్యాపించని
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
37.శ్లో||
సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని|
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః|| 6-29 ||
ప్రతిపదార్థం:-
యోగయుక్తాత్మా =యోగముతో కూడుకొనిన మనస్సు గలవాడు; సర్వత్ర =సమస్త ప్రాణుల యందును; సమదర్శనః =సమదృష్టి గలవాడై ;ఆత్మానమ్= తనను ;సర్వభూతస్థమ్= సమస్త భూతకోటుల యందు ఉన్నవానిగను; చ =మరియును; సర్వభూతాని =సమస్త భూతములను; ఆత్మని= తనయందు ఉన్నవిగను; ఈక్షతే= చూచుచున్నాడు.
తాత్పర్యం :-
సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములను తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును.
అనువాద పద్యం :-
37.కందం
సమదృష్టిని గల యోగులు
తమను సకల భూతములను దర్శింతు రహో !
సమమని సర్వప్రాణుల
తమయందున గాంచగలరు తాపసు లగుచున్ (6-29-4) 44*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీభగవానువాచ|
38.శ్లో||
అసంశయం మహాబాహో
మనో దుర్నిగ్రహం చలమ్|
అభ్యాసేన తు కౌన్తేయ
వైరాగ్యేణ చ గృహ్యతే|| 6-35 ||
ప్రతిపదార్థం:-
మహాబాహో =గొప్ప బాహువులు గల ఓ అర్జునా!; మనః =మనస్సు; దుర్నిగ్రహమ్ =నిగ్రహించుటకు కష్టసాధ్యమైనది ;చలమ్= చంచలమైనది ;అసంశయమ్ =(ఈ విషయములో) సందేహము లేదు; (తథాపి= అయినను) కౌంతేయ= ఓ అర్జునా!; అభ్యాసేన తు= అభ్యాసము చేతను! వైరాగ్యేణ చ= వైరాగ్యము చేతను; గృహ్యతే=(మనస్సు) నిగ్రహింపబడుచున్నది.
తాత్పర్యం:-
అర్జునా! ఎట్టివానికైనను చంచలమైన మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే.ఇందులో ఎట్టి సందేహములు లేదు. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
అనువాద పద్యం :-
38.కందం
మనుజుల కెవ్వరికైనను
మనసును నిశ్చల మొనర్చి మనుటది యన్నన్
కనగా నసాధ్య మైనను
వనట తొలగు నభ్యసనము వైరాగ్యములన్ (6-35-5) 45*
వనట..శోకము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
39. శ్లో||
యోగినామపి సర్వేషాం
మద్గతేనాన్తరాత్మనా|
శ్రద్ధావాన్భజతే యో మాం
స మే యుక్తతమో మతః|| 6-47 ||
ప్రతి పదార్థం:-
సర్వేషాం యోగినామ్ అపి= యోగులందరిలోనూ; యః= ఎవడు; మద్గతేన= నాయందు నిలువబడిన ;అంతరాత్మనా= మనస్సుతో; శ్రద్ధావాన్ =శ్రద్ధ గలవాడై ;మామ్= నన్ను; భజతే =సేవించుచున్నాడో; సః =అతడు; యుక్తతమః =మిక్కిలి శ్రేష్ఠుడని; మే మతః =నా అభిప్రాయము.
తాత్పర్యం:-
అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములుఅని నేను భావింతును.
అనువాద పద్యం :-
39.కందం.
చెదరని విశ్వాసముతో
వదలక నా పదము పట్టి భజియించెడి యా
వదనత ఫాలుల వినయము
నెద మెచ్చెద యోగవర్యు లిద్ధర ననుచున్ (6-47-6) 46*
(6.ఆత్మ సంయమ యోగము 6 శ్లోకములు,6 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సప్తమ అధ్యాయం -
విజ్ఞాన యోగము
40.శ్లో||
మనుష్యాణాం సహస్రేషు
కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్త్వతః||7-3 ||
ప్రతి పదార్థం:-
మనుష్యాణామ్ =మనుష్యులలో; సహస్రేషు= అనేక వేలయందు; కశ్చిత్ =ఒకానొకడు; సిద్ధయే= మోక్ష సిద్ధి కొరకు; యతతి= ప్రయత్నము చేయుచున్నాడు; యతతామ్= (అట్లు) యత్నించుచున్న; సిద్ధానామ్ అపి= ముముక్షువులయుదును; కశ్చిత్= ఒకానొకడు ;మామ్= నన్ను; తత్త్వతః =వాస్తవముగా; వేత్తి= తెలుసుకొనుచున్నాడు.
తాత్పర్యం:-
వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్ధముగా తెలుసుకో గలుగుచున్నాడు.
అనువాద పద్యం :-
40.కందం.
వేలాదులలోన నొకడు
చాల తపము లాచరించి సాధన తోడన్
మేలుగ నన్నెఱుగ దలచు
జాలము వారల నొకండె చక్కగ తెలియున్ (7-3-1) 47*
జాలము..మాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
41.శ్లో||
భూమిరాపోऽనలో వాయుః
ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతిరష్టధా||7-4||
ప్రతిపదార్థం:-
భూమిః =భూమి; ఆపః= జలము; అనలః=అగ్ని; వాయుః=గాలి; ఖమ్= ఆకాశము; మనః= మనస్సు; బుద్ధిః= బుద్ధి ;అహంకార ఏవచ= అహంకారమున్ను ;ఇతి= అని; మే= నాయొక్క; ఇయం ప్రకృతిః =యీ ప్రకృతి ;అష్టధా= ఎనిమిది విధములుగా; భిన్నా= విభజింపబడినది .
తాత్పర్యం:-
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.
అనువాద పద్యం :-
41.కందం
అనలము జలమును నభమును
యనిలము వసుధయు క్రమమున నౌద్ధత్యంబున్
మనమును బుద్ధియు కనగా
నెనిమిది విధముల నలరెడు నిల నా ప్రకృతుల్ (7-4-2) 48*
అనలము ...అగ్ని
అనిలము...వాయువు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
42.శ్లో||
మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ|
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ|| 7-7 ||
ప్రతిపదార్థం:-
ధనంజయ =ఓ అర్జునా!; మత్తః= నాకంటే ;పరతరమ్= వేఱుగా నున్నది లేక శ్రేష్టమైనది; అన్యత్= మరియొకటి; కించిత్= ఏదియు; న అస్తి= లేదు; సూత్రే= దారమునందు; మణిగణా ఇవ =మణుల సమూహమువలే; మయి= నా యందు; ఇదం సర్వమ్= ఈ సమస్త ప్రపంచము; ప్రోతమ్= కూర్చబడినది.
తాత్పర్యం:-
అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈజగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)
అనువాద పద్యం :-
42.కందం
వినుము విజయ!నా కన్నను
ఘనతర మీ జగతియందు కనజాలరుగా !
మనుచున్నది నాలోననె
గొని సూత్రమునందు మణులు కూర్చిన రీతిన్.(7-7-3) 49*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
43.శ్లో||
పుణ్యో గన్ధః పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ|
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు|| 7-9 ||
ప్రతి పదార్థం:-
చ =మరియును; పృథివ్యామ్= భూమియందు ;పుణ్యః గంధః చ= మంచి వాసనయు; విభావసౌ= అగ్నియందు; తేజః చ =ప్రకాశమును; అస్మి =అయి ఉన్నాను; సర్వభూతేషు= సమస్త ప్రాణుల యందు; జీవనమ్= ప్రాణమును; తపస్విషు= తాపసులయందు; తపః చ= తపస్సును; అస్మి =అయిఉన్నాను.
తాత్పర్యం:-
భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.
అనువాద పద్యం :-
43.కందం
నేనే భువిని సుగంధము
నేనే మరి యగ్ని యందు నిండిన వెలుగున్
నేనే ప్రాణుల నాయువు
నేనే తాపసుల యందు నిత్య తపంబున్ (7-9-4) 50*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మామేవ యే ప్రపద్యన్తే
46.శ్లో||
బహూనాం జన్మనామన్తే
జ్ఞానవాన్మాం ప్రపద్యతే|
వాసుదేవః సర్వమితి
స మహాత్మా సుదుర్లభః|| 7-19 ||
ప్రతిపదార్థం:-
బహూనామ్= అనేకములైన; జన్మనామ్= జన్మల యొక్క; అంతే= చివర; జ్ఞానవాన్= జ్ఞానవంతుడు; సర్వమ్= సమస్తమున్ను; వాసుదేవః ఇతి =వాసుదేవుడే అని (తెలుసుకుని);మామ్= నన్ను; ప్రపద్యతే =పొందుచున్నాడు; సః మహాత్మా =అట్టి మహాత్ముడు; సుదుర్లభః= మిక్కిలి అరుదు.
తాత్పర్యం :-
జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)
అనువాద పద్యం :-
46.కందం.
గడచి గడచి పలు జన్మలు
ధృడముగ మది జ్ఞానయుతుడు తెలియును నన్నున్
పుడమిని సకలము నేనని
కడకను మహితాత్ము లటుల కలుగుట యరుదౌ (7-19-7) 54*
కడక.. ప్రయత్నం
( 7.విజ్ఞాన యోగము 7 శ్లోకములు,8 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎనిమదవ అధ్యాయం –
అక్షరపరబ్రహ్మయోగము
47.శ్లో||
అన్తకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేబరమ్|
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః|| 8-5 ||
ప్రతిపదార్థం :-
యః =ఎవడు ;అంతకాలే చ= మరణకాలమునందు కూడా; మామ్ ఏవ =నన్నే; స్మరన్= స్మరించుచూ ;కలేబరమ్= శరీరమును; ముక్త్వా= విడిచి; ప్రయాతి= వెడలుచున్నాడో; సః =అతడు; మద్భావమ్ =నా స్వరూపమును; యాతి= పొందుచున్నాడు; అత్ర= ఈ విషయమునందు; సంశయః= సుదేహము; న అస్తి =లేదు.
తాత్పర్యం :-
ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)
అనువాద పద్యం :-
47.కందం
తనువు నొదులు వేళ నెవడు
మనమున నను దలచుకొనుచు మనికి విడచునో
యనుమానము వల దిందుల
తను నా రూపొంది సన్నిధానము జేరున్.(8-5-1) 55*
మనికి.. జీవితం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
48. శ్లో||
అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచిన్తయన్|| 8-8 ||
ప్రతిపదార్థం :-
పార్థ =ఓ అర్జునా!; అభ్యాసయోగ యుక్తేన =అభ్యాసమనెడి యోగముతో కూడినదియు; న అన్యగామినా= ఇతర విషయముల మీదికి పోనిదియునగు; చేతసా =మనస్సు చేత; దివ్యమ్ =అప్రాకృతుడైనట్టియు; పరమమ్= సర్వోత్తముడైనట్టియు; పురుషమ్= పరమపురుషుని; అనుచింతయన్= మాటిమాటికీ స్మరించుచున్నవాడై (తమ్ ఏవ =ఆ పరబ్రహ్మ నే) ;యాతి= పొందుచున్నాడు .
తాత్పర్యం :-
అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు.
అనువాద పద్యం :-
48 .కందం
పర విషయములందు బడక
నరయుచు నభ్యాసయోగ మందు మనమునన్
తిరముగ బ్రహ్మమ్మును గను
పురుషుం డా పరమపురుషు పురమును జేరున్(8-8 -2)56*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
49.శ్లో||
కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్|| 8-9 ||
ప్రతిపదార్థం :-
కవిమ్= సర్వజ్ఞుడును ;పురాణమ్= పురాతనుడును; అనుశాసితారమ్= సర్వలోక నియామకుడును; అణోః= అణువుకన్నను; అణీయాంసమ్= మిక్కిలి సూక్ష్మమైనవాడును; సర్వస్య =సమస్త ప్రపంచమునకును; ధాతారమ్= ఆధారమైనవాడును ;అచింత్య రూపమ్ =చింతింప శక్యముకాని స్వరూపము కలవాడును; ఆదిత్య వర్ణమ్= సూర్యుని వంటి కాంతిగలవాడును; తమసః= అజ్ఞానాంధకారమునకు; పరస్తాత్= ఆవలనుండువాడును(తరువాతి శ్లోకంతో అన్వయం)
తాత్పర్యం :-
50.శ్లో||
అవ్యక్తోऽక్షర ఇత్యుక్త
స్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే
తద్ధామ పరమం మమ|| 8-21 ||
ప్రతిపదార్థం :-
(యః= ఏ పరమాత్మ) అవ్యక్తః= ఇంద్రియములకు అగోచరుడనియు; అక్షరః ఇతి= నాశరహితుడనియు; ఉక్త= చెప్పబడెనో; తమ్= అతనిని; పరమామ్= సర్వోత్తమమైన; గతిమ్= ప్రాప్య స్థానముగా; ఆహుః= (వేదవేత్తలు) చెప్పుచున్నారు; యమ్ =దానిని; ప్రాప్య= పొంది ;ననివర్తన్తే =మరల జన్మింపరో; తత్ =అది; మమ= నా యొక్క; పరమమ్= శ్రేష్ఠమైన; ధామ= స్థానము.
తాత్పర్యం :-
ఏ పరమాత్మ అగోచరుడనియు,నాశరహితుడనియు చెప్పబడెనో అతనినే సర్వోత్తమమైన ప్రాప్య స్థానముగా వేదవేత్తలు చెప్పుచున్నారు.దేనిని పొందినచో మరల జన్మింపరో, అదియే నా యొక్క శ్రేష్ఠమైన స్థానము అయి ఉన్నది.
(8:21)
అనువాద పద్యం :-
50.కందం
ఏ పరమాత్ము డగోచరు
డే పరమాత్ముడు వినాశ మెఱుగని వాడో
యే పరమాత్ముని పొందిన
మాపును జన్మల వలయము మాధామ మదే(8-21-4)59*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
51.శ్లో||
శుక్లకృష్ణే గతీ హ్యేతే
జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తి
మన్యయావర్తతే పునః|| 8-26 ||
ప్రతిపదార్థం :-
శుక్లకృష్ణే =శుక్ల కృష్ణము లనెడు; ఏతే గతీ హి= ఈ రెండు ప్రసిద్ధములైన మార్గములును; జగతః= లోకమునకు; శాశ్వతే మతే= శాశ్వతములని తలపబడుచున్నవి; ఏకయా= అందొకదానిచేత; అనావృత్తిమ్= పునర్జన్మ రాహిత్యమును; (మనుజుడు) యాతి= పొందుచున్నాడు; అన్యయా= మరొకదానిచేత; పునః =మరలా; ఆవర్తతే =జన్మమెత్తుచున్నాడు.
తాత్పర్యం :-
జగత్తునందు శుక్ల,కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.
52.శ్లో||
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ||8-28||
ప్రతిపదార్థం :-
యోగీ =యోగియైనవాడు ;ఇదమ్ విదిత్వా =దీనిని (అక్షర పరబ్రహ్మ తత్త్వమును) తెలుసుకుని; వేదేషు= వేదముల యందును; యజ్ఞేషు= యాగములయందును; దానేషు= దానములయందును; తపః సు చ = తపస్సులయందును; యత్= ఏ; పుణ్యఫలమ్= పుణ్య ఫలము; ప్రదిష్టమ్= చెప్పబడియున్నదో; తత్ ఏవ సర్వమ్ =అదియంతయు ;అత్యేతి= అతిక్రమించుచున్నాడు: చ= మరియును; ఆద్యమ్= అనాదియు; పరమ స్థానమ్= సర్వోత్కృష్టమైన స్థానమును; ఉపైతి= పొందుతున్నాడు.
తాత్పర్యం :-
యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.
అనువాద పద్యం :-
52.కందం
మేదిని యోగులు దానము
వేదము యజ్ఞము తపముల విధిచే పుణ్యం
బేది తెలుపబడె దానికి
మీదైన ఫలమును, బ్రహ్మమేరను బొందున్.(8-28-6) 61*
మేర..ఎల్ల,హద్దు
బ్రహ్మ మేర.. బ్రహ్మ ఎల్ల అంటే బ్రహ్మ లోకం.
కల్పక్షయే పునస్తాని
54.శ్లో||
అనన్యాశ్చిన్తయన్తో మాం
యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్|| 9-22
||
ప్రతిపదార్థం :-
యేజనాః= ఏ జనులు ;అనన్యాః= ఇతరభావములు లేనివారై; మామ్= నన్ను; చింతయంతః =చింతించుచు; పర్యుపాసతే =ఎడతెగక ధ్యానించుచున్నారో; తేషాం= అట్టి; నిత్యాభియుక్తానామ్= ఎల్లప్పుడూ నా యందే నిష్ఠ గలవారియొక్క; యోగక్షేమమ్ =యోగక్షేమములను; అహమ్= నేను; వహామి= వహించుచున్నాను.
తాత్పర్యం :-
ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించు చుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను.
అనువాద పద్యం :-
54.కందం
ఏ మానవు లితరము విడి
యేమరువక నన్ను గూర్చి యెంతయు భక్తిన్
తాము తలతురో వారల
క్షేమ మెపుడు నే వహింతు చేరి భజింపన్.(9-22-2) 63*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
55.శ్లో||
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృత
మశ్నామి ప్రయతాత్మనః|| 9-26 ||
ప్రతిపదార్థం :-
యః =ఎవడు; మే =నాకు ;భక్త్యా= భక్తితో; పత్రమ్= ఆకును గాని; పుష్పమ్= పువ్వునుగానీ; ఫలమ్= పండును గానీ; తోయమ్ =జలమును గానీ; ప్రయచ్ఛతి= ఇచ్చుచున్నాడో; ప్రయతాత్మనః= (అట్టి)పరిశుద్ధాంతరంగము కలవాని యొక్క; భక్త్యుపహృతమ్= భక్తిపూర్వకంగా సమర్పింపబడిన; తత్ =ఆ పత్ర పుష్పాదులను; అహమ్= నేను; అశ్నామి= ఆరగించుచున్నాను.
తాత్పర్యం :-
ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
అనువాద పద్యం :-
55.కందం
పత్రము పుష్పము ఫలము ప
విత్రమగు జలమ్ము నాకు విమలాత్మకులై
ధాత్రిని యొసగగ ,భక్తికి
సూత్రమ్మదియని గ్రహింతు సూడిద ప్రీతిన్.(9-26-3) 64*
సూడిద...కానుక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
56.శ్లో||
మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవ
మాత్మానం మత్పరాయణః|| 9-34 ||
ప్రతిపదార్థం :-
మన్మనాః =నాయందే మనస్సు గలవాడవును; మద్భక్తః= నా భక్తుడవును; మద్యాజీ= నన్నే పూజించువాడవును; భవ= అగుము ;మామ్ =నన్నే; నమస్కురు= నమస్కరింపుము; ఏవమ్= ఈ రీతిగా; ఆత్మానమ్= మనస్సును; యుక్త్వా= నాయందే నిలిపి ;మత్పరాయణః =నన్నే పరమగతిగ ఎన్నుకొనిన వాడవై; మామ్ ఏవ= నన్నే ;ఏష్యసి= పొందగలవు.
తాత్పర్యం :-
పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)
అనువాద పద్యం :-
56.కందం
నాయందే మనసు నిలిపి
చేయుము యారాధనమ్ము స్థిర చిత్తముతో
పాయని భక్తిని శ్రద్ధను
శ్రీయుతుడను నన్ను పార్థ!చెందగలవులే.(9-34-4) 65*
(9.రాజవిద్యా రాజగుహ్య యోగము 4 శ్లోకములు,4 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదవ అధ్యాయం -
విభూతి యోగము
57. శ్లో||
మహర్షయః సప్త పూర్వే
చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా
యేషాం లోక ఇమాః ప్రజాః||10-6 ||
ప్రతిపదార్థం :-
లోకే =లోకమునందు ఇమాః ప్రజాః= ఈ ప్రజలు యేషామ్= ఎవరి యొక్క (సంతతి అయి ఉన్నారో అట్టి) పూర్వే =పూర్వీకులైన మహర్షయః= మహర్షులు సప్త= ఏడుగురు తథా= అటులనే చత్వారః =సనకాదులైన నలుగురు దేవర్షులు మనవః =మనువులు (పద్నాలుగు)ను మద్భావాః=నా యొక్క భావము కలవారై (నన్ను గూర్చి ధ్యానము,భక్తి కలవారై) మానసా జాతాః =నా యొక్క మనః సంకల్పము వలననే పుట్టిరి.
తాత్పర్యం :-
కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోక మందలి సమస్త భూతములు జన్మించును.
అనువాద పద్యం :-
57.కందం
మునులగు సప్తర్షి గణము
సనకసనందాదులైన సంయమివరులున్
మనువులు పదునల్గురు నా
మనమున సంకల్పభవులు మహి భూతతతుల్ (10-6-1) 66*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
58.శ్లో||
మచ్చిత్తా మద్గతప్రాణా
బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం
తుష్యన్తి చ రమన్తి చ||10-9||
ప్రతిపదార్థం :-
(తే వారు) మచ్చిత్తా= నాయందు మనస్సు గలవారును; మద్గతప్రాణాః =నన్ను పొందిన ప్రాణములు గలవారును; మామ్= నన్ను గూర్చి; పరస్పరమ్= ఒకరికొకరు; బోధయన్తః= బోధించుకొనుచు; కథయన్తః చ= ముచ్చటించుకొనుచు; నిత్యమ్= ఎల్లప్పుడును; తుష్యన్తి చ= సంతృప్తిని పొందుచున్నారు; రమన్తిచ =ఆనందించుచున్నారు.
తాత్పర్యం :-
పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించు కొనుచు బ్రహ్మానందము నను భవించుచున్నారు.
అనువాద పద్యం :-
58.కందం
మనసును నాయందె నిలిపి
తనువును నాకొఱకె విడిచి తనివియె తీరన్
నను దలచుచు చర్చించుచు
యనుభవమున కనుగొన గల రానందమ్మున్ (10-9-2) 67*
59.శ్లో||
అహమాత్మా గుడాకేశ
సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామన్త ఏవ చ|| 10-20 ||
ప్రతిపదార్థం :-
గుడాకేశ= ఓ అర్జునా!; సర్వభూతాశయస్థితః= సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్న; ఆత్మా= ఆత్మను; అహమ్ ఏవ (అస్మి )=నేనే (అయిఉన్నాను); భూతానామ్= ప్రాణుల యొక్క; ఆదిః చ= ఆదియు (సృష్టియు); మధ్యం చ= మధ్యమును (స్థితియు); అన్తః చ= అంతమున్ను (లయమును); అహమ్ (ఏవ అస్మి) నేనే (అయిఉన్నాను).
తాత్పర్యం :-
సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)
అనువాద పద్యం :-
59.కందం
నేనే పరమాత్ముండను
నేనే యీ సకల భూత నివహమ్ములలో
నేనే నిండిన వాడను
నేనే పుట్టువు స్థితియును నేనే లయమున్ (10-20-3) 68*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
60.శ్లో||
వేదానాం సామవేదోऽస్మి
దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా|| 10-22 ||
ప్రతిపదార్థం :-
వేదానామ్ =వేదములలో; సామవేదః= సామ వేదము; అస్మి= (నేను) అయిఉన్నాను; దేవానామ్= దేవతలలో; వాసవః =ఇంద్రుడను; అస్మి= అయిఉన్నాను; ఇంద్రియాణామ్= ఇంద్రియములలో; మనః చ= మనస్సును; అస్మి= అయిఉన్నాను; భూతానామ్= ప్రాణులలో; చేతనా= చైతన్యము; అస్మి =అయిఉన్నాను.
తాత్పర్యం :-
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)
అనువాద పద్యం :-
60.కందం
నేనేను సామ వేదము
నేనే దేవతల నింద్రుని యగుదుఁ పార్థా!
నేనే ప్రాణుల చేతన
యానితమౌ యింద్రియముల యాత్మను నేనే (10-22-4) 69*
ఆనితము...ధరించబడినది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
61.శ్లో||
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోऽహం
వైనతేయశ్చ పక్షిణామ్||10-30 ||
ప్రతిపదార్థం :-
అహమ్ =నేను ; దైత్యానామ్= రాక్షసులలో; ప్రహ్లాదః చ= ప్రహ్లాదుడను; కలయతామ్= లెక్కపెట్టు వారిలో; కాలః= కాలమును; మృగాణాం చ= మృగములలోను; మృగేంద్రః= మృగరాజగు సింహమును; పక్షిణామ్= పక్షులలో; వైనతేయః చ= గరుత్మంతుడును; అస్మి= అయిఉన్నాను.
తాత్పర్యం :-
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
అనువాద పద్యం :-
61.
రాక్షసులను ప్రహ్లాదుని
వీక్షించెడు కాలగతిని విజయా!నేనే
యీ క్షితి మృగముల సింహము
పక్షులలో గరుడుడనెడు ప్రవరుడ నేనే.(10-30-5) 70*
ప్రవరుడు.. శ్రేష్ఠుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
62. శ్లో|| యద్యద్విభూతిమత్సత్త్వం
శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం
మమ తేజోంऽశసమ్భవమ్|| 10-41 ||
ప్రతిపదార్థం :-
విభూతిమత్= ఐశ్వర్య యుక్తమైనదియు; శ్రీమత్= కాంతివంతమైనదియు; ఊర్జితమ్ ఏవ వా= ఉత్సాహముతో కూడినదియు అగు; సత్త్వమ్= వస్తువు; యత్ యత్ =ఏదియేది (కలదో); తత్ తత్ =ఆయా వస్తువును; మమ= నా యొక్క; తేజో2ంశ సంభవమ్ ఏవ =తేజస్సు యొక్క అంశము వలన కలిగినదానిగానే; త్వమ్= నీవు; అవగచ్ఛ= తెలిసికొనుము.
తాత్పర్యం :-
లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. (10:41)
62.
కాంతియుతములైనవి సిరి
వంతము లైనవియు శక్తి వంతమ్ములునై
యెంతయు విఖ్యాత మయిన
దంతయు నా తేజమనుచు నాత్మ నెఱుగుమా! (10-41-6) 71*
(10.విభూతి యోగము 6 శ్లోకములు,6 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదకొండవ అధ్యాయం - విశ్వరూప సందర్శన యోగము
శ్రీభగవానువాచ|
63.శ్లో||
పశ్య మే పార్థ రూపాణి
శతశోऽథ సహస్రశః|
నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ|| 11-5 ||
ప్రతిపదార్థం:-
పార్థ= ఓ అర్జునా; నానావిధాని= అనేకవిధములైనవియు; దివ్యాని= అలౌకికములైనవియు; నానావర్ణాకృతీని చ =అనేక రంగులు ఆకారములు కలవియు; శతశః అథ సహశ్రసః =వందలకొలది మరియు వేలకొలది ఉన్నవియు (అగు) ;మే= నాయొక్క; రూపాణి= రూపములను; పశ్య= చూడుము.
తాత్పర్యం :-
పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము.
అనువాద పద్యం
63.కందం
నానా వర్ణాకృతులును
నానావిధ దివ్యములగు నా రూపములున్
తానవి వేవేలు నెవడు
కానని నా విశ్వరూపు కనుమిదె పార్థా! (11-5-1) 72*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అర్జున ఉవాచ
64.శ్లో||
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్||11.15
ప్రతిపదార్థం :-
దేవ =దేవా; తవదేహే= నీ శరీరమందు; సర్వాన్ దేవాన్= సమస్త దేవతలును; తథా= అట్లే; భూత విశేష సంఘాన్ =స్థావర జంగములగు ప్రాణికోట్ల సమూహములును; కమలాసనస్థామ్= నాభికమలమున వెలయు; బ్రహ్మాణామ్ =సృష్టి కర్తయగు బ్రహ్మ దేవుని ;ఈశమ్= పరమశివుని; సర్వాన్ ఋషీన్ చ= సమస్త ఋషులను; దివ్యాన్ ఉరగాన్ చ =దివ్యములగు సర్పములను; పశ్యామి= చూచుచున్నాను
తాత్పర్యం :-
ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి
అనువాద పద్యం :-
64.A కందం
కనుగొంటిని సర్వసురల
కనుగొంటిని ప్రాణికోటి కలిత భువనముల్
కనుగొంటిని కమలాసను
కనుగొంటిని భూతపతిని కనులా దేవా! (11-15-2A) 73*
64.B.కందం
కనుగొంటిని మునివరులను
కనుగొంటిని దివ్యమైన కాకోదరులన్
వనమాలీ!మీ తనువున ఁ
గని ధన్యత నొందినాను కమనీయముగా(11-15-2B) 74*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
65.శ్లో.
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప||11-16||
ప్రతిపదార్థం :-
విశ్వేశ్వర= ప్రపంచమునకు అధిపతియైన వాడా!;విశ్వరూప= జగద్రూపుడా! ;అనేక బాహూదర వక్త్ర నేత్రమ్ =అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు గలవానిగను; త్వామ్= నిన్ను; సర్వతః =అంతటను; పశ్యామి =చూచుచున్నాను; పునః= మరియు; తవ= నీయొక్క; ఆదిమ్= మొదలును; న పశ్యామి= చూడలేకున్నాను; మధ్యమ్= మధ్యమును న (పశ్యామి)= చూడలేకున్నాను; అన్తమ్= తుదను; న (పశ్యామి) =చూడజాలకున్నాను .
తాత్పర్యం :-
ఓ జగత్ప్రభూ!జగద్రూపా!మిమ్ము సర్వత్రా అనేక హస్తములు,ఉదరములు,ముఖములు,నేత్రములు గలవానిగను,అనంత రూపములుగను నేను చూచుచున్నాను.మఱియును మీయొక్క మొదలును తుదనుగాని నేను కాంచజాలకున్నాను.
అనువాద పద్యం :-
65.కందం
బహుముఖములు నుదరంబులు
బహునయనంబులు కరములు బహురూపంబుల్
అహహో!నీ మొదలు తుదను
విహగధ్వజ!కనగజాలఁ విస్మితు డైతిన్.(11-16-3) 75*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
65.A శ్లో||
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతం |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయం ||11- 17||
(ఘంటసాల పాడిన శ్లోకాలలో ఈ శ్లోకం లేదు)
ప్రతిపదార్థం :-
త్వామ్ =నిన్ను ;సమన్తాత్= అంతటను; కిరీటినమ్= కిరీటముగల వానినిగను; గదినమ్= గదను ధరించిన వానినిగను ;చక్రిణమ్ చ= చక్రము ధరించిన వానినిగను; తేజోరాశిమ్= కాంతిపుంజముగను; సర్వతః= అంతటను; దీప్తిమంతమ్= ప్రకాశించు వానినిగను; దీప్తానలార్క ద్యుతిమ్= జ్వలించు అగ్ని వంటి, సూర్యుని వంటి కాంతిగలవానిగను; అప్రమేయమ్= పరిమితి లేని వానినిగను; పశ్యామి= చూచుచున్నాను.
తాత్పర్యం :-
మిమ్ము ఎల్లెడలను కిరీటముగలవానిగను గదను ధరించిన వానినిగను చక్రమును బూనినవానిగను కాంతిపుంజముగను అంతటను ప్రకాశించు వానినిగను జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతిగలవా నినిగను చూచుచున్నాను.
అనువాద పద్యం :-
65 A/1.కం.
కంటిని మీ కిరీటమును
కంటిని చక్రిగ తమనిక గదదాల్చి నటుల్
కంటిని తేజోరాశిగ
కంటినయా మీదు దీప్తి కనులారంగాన్ (11-17-3A/1) 76*
అనువాద పద్యం :-
65.A/2.కం.
కంటిని జ్వలించు యగ్నిని
కంటిని భాస్కరుని వంటి కాంతులు తమలో
కంటిని పరిమితు లెఱుగక
మింటను మంటిని పరగిన మిమ్ముల స్వామీ! (11-17-3A/2) 77*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
65 B.శ్లో ||
ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం
తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||11-20||
(ఈ శ్లోకం కూడా ఘంటసాల పాడిన భగవద్గీత లో లేదు )
ప్రతిపదార్థం :-
మహాత్మన్= ఓ మహాత్మా; ద్యావా పృథివ్యోః=భూమ్యాకాశముల యొక్క; ఇదమ్ అంతరమ్ =ఈ మధ్య ప్రదేశం అంతయూ ;సర్వాః దిశః చ =దిక్కులన్నియును; త్వయా ఏకేన= నీ ఒక్కని చేతనే; వ్యాప్తం హి= వ్యాపింపబడి యున్నదికదా!; ఉగ్రమ్= భయంకరమైనదియు; అద్భుతమ్= ఆశ్చర్యకరమైనదియు నగు ;తవ= నీయొక్క; ఇదమ్ రూపమ్= ఈ విశ్వరూపమును; దృష్ట్వా =చూచి; లోకత్రయమ్ =ముల్లోకములును; ప్రవ్యథితమ్= మిగుల భీతిని బొందియున్నవి.
తాత్పర్యం :-
ఓ మహాత్మా!భూమ్యాకాశముల యొక్క ఈ మధ్యప్రదేశమంతయును దిక్కులన్నియును,నీ యొక్క ని చేతనే వ్యాపింపబడియున్నది కదా!మఱియు భయంకరమైనదియు,ఆశ్చర్యకరమైనదియు నగు నీయీ రూపమును జూచి ముల్లోకములను మిగుల భీతిని బొందియున్నవి.
అనువాద పద్యం :-
65.B.కందం
అక్కజముగ పరమాత్మా!
దిక్కులు భూనభములెల్ల దివ్యమ్మగు నీ
యొక్కని యుగ్రత నిండెను
బిక్కున ముల్లోకములును భీతిలుచుండెన్.(11-20-3B) 78*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
66.శ్లో||
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానల సన్నిభాని
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ! జగన్నివాస||11-25||
ప్రతిపదార్థం :-
దంష్ట్రాకరాలాని =కోరలచే భయంకరములైనవియు; కాలానల సన్నిభాని చ= మరియు ప్రళయాగ్నిని బోలినవియునగు; తే= నీయొక్క; ముఖాని= ముఖములను; దృష్ట్వా= చూచి; దిశః= దిక్కులను; నజానే =తెలియకున్నాను; శర్మ చ= సుఖమును గూడ; న ఏవ లభే= పొందకయే యున్నాను; దేవేశ =ఓ దేవదేవా; జగన్నివాస= జగదాశ్రయా; ప్రసీద= ప్రసన్నుడవగుము.
తాత్పర్యం :-
కోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్నిని బోలినవియునగు నీ ముఖములను జూచి నేను దిగ్భ్రమ చెందియున్నాను.సుఖమును కూడా పొందలేకయున్నాను.కావున ఓ దేవదేవా! జగదాశ్రయా! నాకు ప్రసన్నుడవగుము.
అనువాద పద్యం :-
66.A.కం.
కోరలచే భయము గొలుపు
మీరిన ప్రళయాగ్ని బోలు మీ ముఖములచే
మేరలు తెలియగ నైతిని
సైరింపగ జాల సుప్రసన్నుడవగుమా!(11-25-4 A) 79*
66.B.కం.
కలిగెను దిగ్భ్రాంతి మదికి
కలుగక యుండెను సుఖమ్ము కలవరమాయెన్
తలపున జగదాశ్రయ! నిను
తెలిసితి దేవేశుడవని స్థిరముగ నిపుడున్(11-25-4 B) 80*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీభగవానువాచ|
67.శ్లో||
కాలోऽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేऽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః|| 11-32 ||
ప్రతిపదార్థం :-
(అహమ్ నేను) లోకక్షయకృత్= లోకసంహారకుడనై ;ప్రవృద్ధః= విజృంభించిన; కాలః= కాలుడను; అస్మి= అయిఉన్నాను; లోకాన్= ప్రాణులను; సమాహర్తుమ్= సంహరించుటకు; ఇహ= ఈ ప్రపంచమున; ప్రవృత్తః= ప్రవర్తించినవాడను; ప్రత్యనీకేషు= ప్రతిపక్ష సైన్యములయందు; యే యోధాః =ఏ వీరులు; అవస్థితాః= ఉన్నారో; (తే) సర్వే= వారందరున్ను; త్వా ఋతే2పి= నీవు లేకపోయినను(నీవు యుద్ధం చేయకపోయినను); న భవిష్యన్తి= జీవించియుండరు.
తాత్పర్యం :-
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు.
అనువాద పద్యం :-
67.కందం
కాలుడనై లోకమునను
క్రాలుచు సంహారమునకు కడగితి,నీవీ
యాలము మానిన నేమగు?
రాలుదు రరి వీరులెల్ల రణమున పార్థా!(11-32-5) 81*
క్రాలుచు..సంచరించుచు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
68. శ్లో||
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా
వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్||11-34||
ప్రతిపదార్థం :-
మయా =నాచేత ;హతాన్ =ఇదివరకే చంపబడిన; ద్రోణం చ= ద్రణాచార్యుని; భీష్మం చ= భీష్మాచార్యుని; జయద్రథం చ= జయద్రథుని; కర్ణమ్ =కర్ణుని; తథా= అట్లే ;అన్యాన్ యోధవీరాన్ అపి= ఇతర యుద్ధ వీరులను గూడ; త్వమ్= నీవు; జహి =చంపుము; మావ్యధిష్ఠాః =భయపడకుము; యుధ్యస్య =యుద్ధము చేయుము; రణే= యుద్ధమందు; సపత్నాన్= శత్రువులను; జేతాసి= గెలువగలవు.
తాత్పర్యం :-
ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము.
అనువాద పద్యం :-
68. A కందం
వీరులు భీష్ముడు ద్రోణుడు
కారే దుస్సల పతియును కర్ణాదులికన్
వీరెల్లరు రణశూరులు
వారల నాలోన నీవు పార్థా!కనుమా! (11-34-6 A) 82*
అనువాద పద్యం :-
68.B.కందం.
భరతాన్వయ!నాచేఁ మును
మరణించిన వీరవరుల మరలా నీవీ
దురమున చంపగ కడగుము
దొరకొను విజయము, భయపడి దురపిల్లకుమా!(11-34-6B) 83*
దురము...యుద్ధం
దొరకొను..లభించు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
69.శ్లో||
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే|| 11-46 ||
ప్రతిపదార్థం :-
అహమ్= నేను; త్వామ్ =నిన్ను; తథా ఏవ =మునుపటి వలెనే; కిరీటినమ్= కిరీటముగల వానినిగను ;గదినమ్= గదను ధరించిన వానినిగను; చక్రహస్తమ్= చక్రము చేత గలవానినిగను; ద్రష్టుమ్ =చూచుటకు; ఇచ్ఛామి= కోరుచున్నాను; సహస్రబాహో= అనేక హస్తములు గలవాడా!; విశ్వమూర్తే= సమస్త ప్రపంచము స్వరూపముగా గలవాడా!; చతుర్భుజేన= నాలుగు చేతులు గల ;తేన రూపేణ ఏవ =ఆ రూపముతోనే ;భవ= అగుము.
తాత్పర్యం :-
అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా...
69.A.కందం
వేయి భుజమ్ముల నొప్పెడు
నీ యీ మూర్తిని కనంగ నేనోపను నా
రాయణ !దయతో నీవిక
చేయుము నుపసంహరణము చిద్రూపమ్మున్ (11-46-7A) 84*
69.B.కందం
గదయును కరమున చక్రము
వదనత ఫాలమ్ము గప్పు వజ్రమకుటమున్
విదితపు నాలుగు భుజముల
మొదటి యటుల జూపు కృష్ణ!మోహన రూపున్.( 11-46-7B) 85*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీభగవానువాచ|
70.శ్లో||
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాఙ్క్షిణః|| 11-52 ||
ప్రతిపదార్థం :-
మమ= నా యొక్క; యత్ఏ= రూపమును; దృష్టవాన్ అపి= చూచినవాడవయితివో; ఇదమ్ రూపమ్= ఈ విశ్వరూపము; సుదుర్దర్శమ్= చూచుటకు అత్యంత దుర్లభమైనది ;దేవాః అపి= దేవతలు కూడా; నిత్యమ్= ఎల్లప్పుడును; అస్య రూపస్య= ఈ విశ్వరూపము యొక్క; దర్శన కాంక్షిణః =దర్శనమును అభిలషించువారు (భవంతి= అగుచున్నారు).
తాత్పర్యం :-
అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)
70.కందం
నీవు గనిన యీ రూపము
దేవత లెల్లరు కనుగొన తెఱగు వెదకుచున్
దేవురులాడినను సతము
వావృత్తము గాకయుండు వారికి పార్థా!(11-52-8)86*
దేవురులాడు..దీనత పొందటం
వావృత్తము...వరింపబడినది
(11 . విశ్వరూప సందర్శనయోగము 8+2 శ్లోకములు 15 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పన్నెండవ అధ్యాయం -
భక్తి యోగము
శ్రీభగవానువాచ|
71.శ్లో||
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః
తే మే యుక్తతమా మతాః|| 12-2 -1||
ప్రతిపదార్థం :-
మయి =నాయందు; మనః= మనస్సును; ఆవేశ్య= నిలిపి; నిత్యయుక్తాః =నిరంతర దైవచింతనాపరులై ;పరయా= మిక్కిలి; శ్రద్ధయా= శ్రద్ధతో; ఉపేతాః= కూడుకున్న వారై; యే= ఎవరు; మామ్ =నన్ను; ఉపాసతే= ఉపాసించుచున్నారో; తే =వారు; యుక్తతమాః =ఉత్తమ యోగులని; మే మతాః =నా యొక్క అభిప్రాయము.
తాత్పర్యం :-
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
అనువాద పద్యం :-
71.కందం
నిలిపి మదిని నా యందున
సలుపుచు నా చింతనమును శ్రద్ధను సతమున్
కొలిచెడు వారలె నా మతి
తలచెద నుత్తమ యతులని ధరణిని పార్థా!(12-2-1) 87*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
71.A.శ్లో||
అభ్యాసేऽప్యసమర్థోऽసి
మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి
కుర్వన్సిద్ధిమవాప్స్యసి||(12-10-1A)
(ఈ శ్లోకం కూడా ఘంటసాల పాడిన శ్లోకాలలో లేదు)
ప్రతిపదార్థం :-
అభ్యాసే అపి =అభ్యాసము చేయుటయందును; అసమర్థః అసి= సమర్థత లేనివాడవైనచో; మత్కర్మపరమః =నా సంబంధమగు కర్మలను ఒనర్చుటయందు ఆసక్తి కలవాడవు; భవ =అగుము; మదర్థమ్= నా కొరకు ;కర్మాణి= కర్మములకును; కుర్వన్ అపి= చేయుచున్ననుగూడ; సిద్ధిమ్ =మోక్ష సిద్ధిని; అవాప్స్యసి= పొందగలవు.
తాత్పర్యం :-
ఒకవేళ అభ్యాసము చేయుటయందు నీవసమర్థుడవైతివేని నా సంబంధమైన కర్మలను ఆచరించుటయందు ఆసక్తికలవాడవగుము.అట్లు నాకొరకు కర్మలను చేయుచున్న నూ నీవు మోక్షసిద్ధిని పొందగలవు.
(12:10)
అనువాద పద్యం :-
71A.కందం.
చిత్తము నేకాగ్ర పరచి
యుత్తమ యోగాభ్యసనము నొనరింపంగా
సత్తువ లేని నరులు నా
దత్తముగా కర్మ సలుప తరియింతురికన్.(12-10-1A) 88*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
72.శ్లో||
శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్
జ్ఞానాద్ధ్యానమ్ విశిష్యతే
ధ్యానాత్కర్మ ఫలత్యాగః
త్యాగాచ్ఛాన్తిరనంతరమ్||12-12||
ప్రతిపదార్థం :-
అభ్యాసాత్=అభ్యాసము కంటే; జ్ఞానమ్= జ్ఞానము ;శ్రేయః హి= శ్రేష్టమైనది కదా; జ్ఞానాత్= జ్ఞానము కంటే; ధ్యానమ్= ధ్యానము; విశిష్యతే= శ్రేష్టమైనది; ధ్యానాత్= ధ్యానము కంటే ;కర్మఫలత్యాగః= కర్మఫలత్యాగము; విశిష్యతే= శ్రేష్టమైనది ;త్యాగాత్ అనంతరమ్= త్యాగము చేసిన తదుపరి; శాంతిః= శాంతి; భవతి= కలుగుచున్నది.
తాత్పర్యం :-
అభ్యాసము కంటే జ్ఞానము, జ్ఞానము కంటే ధ్యానము, ధ్యానము కంటే కర్మఫలత్యాగము శ్రేష్టమైనవి.అట్టి కర్మఫలత్యాగము వలననే శాంతి లభించుచున్నది.
అనువాద పద్యం :-
72/1కం.
ఘనమైనది జ్ఞాన మిలను
కన నభ్యాసమ్ముకన్న కౌంతేయా తా
ఘనమంతకుపై ధ్యాన
మ్మనువగునిక కర్మఫలము త్యజియించుటనన్(12-12-2 A) 89*
అనువు...యుక్తము,తగినది.
అనువాద పద్యం :-
72/2.కం.
ఇంత యెఱిగి కర్మలపై
సుంతయు నాసక్తి లేక శుద్ధాంతముతో
చింతన జేయుము పరమును
శాంతి యమరు హృదయమునకు జన్మ తరించున్(12-12-2B)90*
అంతము.. స్వభావం, నిశ్చయం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
(నిత్యజీవిత సాధన ఏ విధంగా ఉండాలో మా గురువు గారు శ్రీయుతులు రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మగారు మాకుబోధించిన అమూల్యమైన ఈ క్రింది గీతాశ్లోకాలు రెండు కూడా ఇందులో చేర్చాను.ఇవి ఘంటసాల పాడిన గీతా శ్లోకాలలో లేవు.)
72.A.శ్లోకం
అద్వేష్టా సర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః
సమదుఃఖసుఖః క్షమీ ।। 12-13-2A ।।
ప్రతిపదార్ధం :-
అద్వేష్టా=ద్వేషభావములేకుండా;సర్వ భూతానాం = సమస్త ప్రాణుల పట్ల; మైత్రః = మైత్రీ భావము; కరుణ = కారుణ్యము; ఏవ = నిజముగా; చ = మరియు; నిర్మమః = ప్రాపంచిక వస్తువిషయములపై మమకారము/ఆసక్తి లేకుండా; నిరహంకారః = అహంకార రహితముగా; సమ = సమత్వ బుద్ధితో; దుఃఖ = దుఃఖములు/కష్టాలు; సుఖః = సుఖములు; క్షమీ = క్షమాగుణము కలిగి;(తరువాతి శ్లోకం తో అన్వయం)
తాత్పర్యం :-
ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారో వారు నా ప్రియమైన భక్తులు.
అనువాద పద్యం :-
72. A.కందం
ద్వేషము జూపక ప్రాణుల
దోషము లెన్నక కరుణయె ద్యోతక మవగా
భూషణమే మైత్రిగ ని
శ్శేషముగ మమత్వ మహము చేయగ వలయున్(12-13-2A) 91*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
72.B. శ్లోకం
సంతుష్టః సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిర్యో
మద్భక్తః స మే ప్రియః ।। 12- 14 -2 B||
ప్రతిపదార్థం :-
సంతుష్టః — తృప్తితో ఉంటూ; సతతం — ఎల్లప్పుడూ; యోగీ — భక్తితో ఏకమై; యత-ఆత్మా — ఆత్మ-నిగ్రహము కలిగి;దృఢ-నిశ్చయః — దృఢసంకల్పము/నిశ్చయముతో; మయి — నాకు; అర్పిత — అర్పితము చేసి; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; యః — ఎవరైతే; మత్-భక్తః — నా భక్తులు; సః — వారు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైనవారు.
తాత్పర్యం :-
ఎవరు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారో వారు నా ప్రియమైన భక్తులు.
అనువాద పద్యం :-
72.B.కం.
సతతము సంతుష్టులగుచు
మతి యోగమునందు మునుగ మనమును బుద్ధిన్
ధృతి గలిగిన వారల నేఁ
క్షితి నా ప్రియ భక్తులంచు క్షేమము లిడెదన్ (12-14 -2B) 92*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
73.శ్లో||
అనపేక్షః శుచిర్దక్ష
ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ
యో మద్భక్తః స మే ప్రియః|| 12-16-3 ||
ప్రతిపదార్థం :-
అనపేక్షః= కోరికలు లేనివాడును; శుచిః =బాహ్యాభ్యంతర శుచిత్వము కలవాడును; దక్షః= సమర్థుడును ;ఉదాసీనః= తటస్థుడును; గతవ్యథః= దిగులు వీడినవాడును; సర్వారంభ పరిత్యాగీ =సమస్త కార్యములందును కర్తృత్వము విడిచినవాడును; మద్భక్తః= నా యందు భక్తి గలవాడును; యః= ఎవడు (కలడో) ;సః =అతడు; మే= నాకు; ప్రియః =ఇష్టుడు.
తాత్పర్యం :-
ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
అనువాద పద్యం :-
73.కందం.
కోరిక లుడిగిన భక్తులు
చేరక దుఃఖమ్ము మదిని చిదిమిన వారున్
కోరక కర్మఫలమ్ముల
నోరిమి శుచియగు తటస్థు లొగి నా ప్రియులే (12-16-3) 93*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
74.శ్లో||
సమః శత్రౌ చ మిత్రే చ
తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు
సమః సఙ్గవివర్జితః|| 12-18-4 ||
ప్రతిపదార్థం :-
శత్రౌ చ=శత్రువుయందును; మిత్రే చ= మిత్రునియందును: తథా= అటులనే; మానావమానయోః= మానావమానములయందును; సమః =సమముగా నుండు వాడును; శీతోష్ణ సుఖదుఃఖేషు= శీతము, ఉష్ణము,సుఖము దుఃఖములయందును; సమః= సమముగా నుండు వాడును; సంగవివర్జితః =దేనియందును సంగము లేనివాడును (తరువాతి శ్లోకంతో అన్వయం)
తాత్పర్యం :-
శత్రుమిత్రుల యందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ది కలిగి సంగరహితుడై యుండు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. (12:18)
అనువాద పద్యం :-
74.కందం
వైరుల మిత్రుల యందును
తోరపు శీతోష్ణ సుఖము దుఃఖము లందున్
చేరక సంగములందున
వేరుపడెడు నరుడు నాదు ప్రియభక్తుండౌ.(12-18-4) 94*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
75.శ్లో||
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ
సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతి
ర్భక్తిమాన్మే ప్రియో నరః||12-19-5 ||
ప్రతిపదార్థం :-
తుల్యనిందాస్తుతిః= నిందాస్తుతులయందు సమముగా నుండు వాడును; మౌనీ= మౌనముతో నుండువాడును; యేనకేనచిత్ =దేనిచేతనైనను (దొరికిన దానితో) ;సంతుష్టః =తృప్తి నొందు వాడును; అనికేతః= నిర్దిష్టమైన నివాస స్థానము లేనివాడును; స్థిరమతిః =నిశ్చయ బుద్ధి గలవాడును; భక్తిమాన్ =భక్తి గలవాడును (అగు); నరః =మనుజుడు; మే= నాకు; ప్రియః= ఇష్టుడు.
తాత్పర్యం :-
నిందాస్తుతులందు సమముగా నుండు వాడు,మౌనముతో నుండువాడు,దొరికిన దానితో తృప్తి చెందెడు వాడు, స్థిరనివాసం లేనివాడు,నిశ్చయబుద్ధి గలవాడు, భక్తి గలవాడు అగు మనుష్యుడు నాకు ఇష్టుడు.
. (12:19)
అనువాద పద్యం :-
75.కందం.
నిందాస్తుతులను సమముగ
నెందును భావించి మౌన మెడబాయక, యే
మందిర మెఱుగక, స్థిరమతి
నందితుడగు భక్తియుతుడు నా కిష్టు డగున్.(12-19-5) 95*
( 12.భక్తి యోగము 5+3 శ్లోకములు,9 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదమూడవ అధ్యాయం -
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
శ్రీభగవానువాచ|
76.శ్లో||
ఇదం శరీరం కౌన్తేయ
క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః|| 13-2 ||
ప్రతిపదార్థం :-
కౌంతేయ = కుంతీకుమారా ; ఇదం, శరీరం = ఈ శరీరం ; క్షేత్రం, ఇతి = ‘క్షేత్రం’ అని ;అభిధీయతే = పిలువబడుతుంది ; ఏతత్ = దీనిని గురించి ; యః , వేత్తి = ఎవరు తెలుసుకుంటారో ; తం = అతనిని ; క్షేత్రజ్ఞః , ఇతి = ‘క్షేత్రజ్ఞుడు‘ అని ;తద్విదః = తత్త్వజ్ఞానులు ; ప్రాహుః = అంటారు
తాత్పర్యం :-
అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.
అనువాద పద్యం :-
76.కందం
ఈ తనువే క్షేత్రమ్మిది
చేతము నందెఱుగు వాడె క్షేత్రజ్ఞుండౌ
నీ తత్వమ్మును కౌంతే
యా!తెల్లముజేయు నిలకు నార్యుల నుడువుల్.(13-2-1) 96*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
77.శ్లో||
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
తత్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతజ్ఞానమితి ప్రోక్త
మజ్ఞానం యదతోన్యథా || 13-12||
ప్రతిపదార్థం :-
అధ్యాత్మ—ఆధ్యాత్మిక; జ్ఞాన—జ్ఞానము; నిత్యత్వం—ఎల్లప్పుడు కలిగియుండుట;తత్త్వ-జ్ఞాన-ఆధ్యాత్మిక సూత్రాల జ్ఞానం; అర్థ—ప్రయోజనం;దర్శనం-తెలిసికొనుట
; ఏతత్—ఇదంతా; జ్ఞానం—జ్ఞానం; ఇతి—ఈ విధంగా (అని);ప్రోక్తం—ప్రకటించబడింది; చెప్పబడింది;యత్-ఏది;అతః అన్యథా -దీనికంటె వేరుగా నుండునో (తత్ -అది);అజ్ఞానం- అజ్ఞానము(అని తెలియుము).
తాత్పర్యం :-
అధ్యాత్మ జ్ఞానం నిరంతరం కలిగియుండుట,తత్త్వ జ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసు కొనుట అనునిది యుతయు జ్ఞానం అని చెప్పబడును.దీనికి వ్యతిరేక మైనది అజ్ఞానము అని తెలియదగినది.
అనువాద పద్యం :-
77.కందం.
కలిగియు నాధ్యాత్మికతను
తెలిసియు తత్త్వార్థములను,తెలియగ నిదియే
యిలలో జ్ఞాన మనంబడు
నలకువ యిందు గలిగినను యజ్ఞానమదే (13-12-2) 97*
అలకువ...విముఖత
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
78.శ్లో.
కార్యకారణ కర్తృత్వే
హేతుః ప్రకృతి రుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే||13-21||
కార్య — కార్యము; కారణ — కారణము; కర్తృత్వే — ఉత్పన్నము చేయుటలో; హేతుః — హేతువు; ప్రకృతిః — భౌతిక శక్తి; ఉచ్యతే — చెప్పబడును; సుఖ-దుఃఖానాం — సుఖ దుఃఖముల యొక్క; భోక్తృత్వే — అనుభవించుటలో;హేతుః — హేతువు; పురుషః --పురుషుడు(అని)ఉచ్యతే — చెప్పబడును.
తాత్పర్యం :-
కార్యకారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు, సుఖదుఃఖములను అనుభవించుటయందు పురుషుడే(పరమాత్ముడే) హేతువనియు చెప్పబడుచున్నది.
అనువాద పద్యం :-
78.కందం
హేతువు యీ ప్రకృతి యగును
గాత!భువిని పార్థ! కార్య కారణములకున్
హేతువు పురుషుం డగునిక
నాతడె సుఖదుఃఖ జనిత యనుభవమునకున్(13-21-3) 98*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
79.శ్లో.
సమం సర్వేషు భూతేషు
తిష్ఠాంతః పరమేశ్వరం
వినశ్యత్స్వ్ అవినాశ్యంతః
యః పశ్యతి స పశ్యతి(13-28)
ప్రతిపదార్థం :-
సమం — సమానముగా; సర్వేషు — సమస్త; భూతేషు — ప్రాణులలో; సమమ్-సమానముగాతిష్ఠంతం — నివసిస్తూన్న ;పరమ-ఈశ్వరమ్ — పరమాత్మను;వినశ్యత్సు — నశించేవాటిలో;అవినశ్యంతం — నాశములేనిదిగా ఉండి; యః — ఎవరైతే; పశ్యతి — చూచెదరో; సః — అతడు; పశ్యతి — చూచుచున్నాడు.
తాత్పర్యం :-
సమస్త ప్రాణులలో, ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.(అతడే యథార్థమును తెలిసికొనినవాడని భావము).
అనువాద పద్యం :-
79.కందం
సకలము నందున సమముగ
నకలంకుడు యాత్మవోలె నలరుచు కాయం
బిక నశియించినను నశిం
పక యుండుటనెవ్వ డెఱుగు ప్రాజ్ఞుండతడే(13-28-4 ) 99*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
80.శ్లో||
అనాదిత్వాన్నిర్గుణత్వా
త్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ
న కరోతి న లిప్యతే|| 13-32 ||
ప్రతిపదార్థం:-
కౌంతేయ= ఓ అర్జునా!; అనాదిత్వాత్ =ఆదిలేనివాడు అగుటచేతను; నిర్గుణత్వాత్= గుణరహితుడగుటచేతను; అవ్యయః =నాశరహితుడగు; అయం పరమాత్మా= ఈ పరమాత్మ; శరీరస్థః అపి= శరీరమందున్నవాడైనను; న కరోతి= ఏమియు చేయుటలేదు; న లిప్యతే= దేనితోను అంటబడుట లేదు.
తాత్పర్యం:-
అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడైనప్పటికీ ఏమియు చేయక,దేనిచేతను అంటబడక యున్నాడు . (13:32)
అనువాద పద్యం :-
80.కందం
కౌంతేయా! గుణ రహితుడు
అంతమ్మును ఆదిలేక అంటబడని వా
డంతట తనువుల నుండియు
పంతుగ చైదములు లేని పరమును గనుమా! (13-32-5) 100*
పంతు...మేలు
చైదములు..చేతలు,కర్మలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
81.శ్లో||
యథా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం
ప్రకాశయతి భారత||13-34||
ప్రతిపదార్థం :-
భారత= ఓ అర్జునా!; ఏకః= ఒకడైన; రవిః =సూర్యుడు; ఇమమ్= ఈ; కృత్స్నమ్= సమస్తమైన; లోకమ్= లోకమును; యథా= ఏ విధంగా; ప్రకాశయతి= ప్రకాశింపజేయుచున్నాడో; తథా= అట్లే; క్షేత్రీ =క్షేత్రజ్ఞుడైన పరమాత్మ; కృత్స్నమ్= సమస్తమైన ;క్షేత్రమ్= క్షేత్రమును; ప్రకాశయతి= ప్రకాశింపజేయుచున్నాడు.
తాత్పర్యం :-
పార్దా! సుర్యుడొక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ దేహములను ప్రకాశింప జేయుచున్నాడు. (13.34)
అనువాద పద్యం :-
81.కందం
ఒక సూర్యుడె జగమెల్లను
ప్రకాశనము జేయునెట్లు పార్థా! యటులే
సకలాత్మకుడైన ప్రభుడు
సకలంబగు క్షేత్రములను ఛటలను నింపున్.(13-34-6) 101*
(13.క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 6 శ్లోకములు 6 పద్యములు సమాప్తము )
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదునాలుగవ అధ్యాయం -
గుణ త్రయ విభాగ యోగము
శ్రీభగవానువాచ|
82.శ్లో||
పరం భూయః ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యజ్జ్ఞాత్వా మునయః సర్వే
పరాం సిద్ధిమితో గతాః|| 14-1 ||
ప్రతిపదార్థం:-
యత్ =దేనిని ;జ్ఞాత్వా= తెలిసికొని; సర్వే మునయః= మునులందరును; ఇతః =ఈ సంసారబంధము నుండి; పరామ్ సిద్ధిమ్ =సర్వోత్తమమైన మోక్షసిద్ధిని; గతాః =పొందిరో (తత్= ఆట్టి) ;పరమ్= పరమాత్మ సంబంధమైన; జ్ఞానానామ్= జ్ఞానములలోకెల్లా; ఉత్తమమ్= ఉత్తమమైనది అగు జ్ఞానమును; భూయః =మరల; ప్రవక్ష్యామి= చెప్పుచున్నాను.
తాత్పర్యం :-
జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు దేనిని తెలుసుకొని మోక్షమును పొందిరో అట్టి మహత్తరమైన జ్ఞానమును గూర్చి నీకు మరలా ఉపదేశించుచున్నాను. (14:1)
అనువాద పద్యం :-
82.కం.
మునిగణములు దేని నెఱిగి
మునుగక మోహమ్మునందు ముక్తులగుదురో
వినుమా జ్ఞానమ్ము మరల
వినిపించెద నుత్తమమగు విద్దియ యదియే (14-1-1) 102*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
83.శ్లో||
సర్వయోనిషు కౌన్తేయ
మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోని
రహం బీజప్రదః పితా|| 14-4 ||
ప్రతిపదార్థం :-
కౌంతేయ= ఓ అర్జునా!; సర్వయోనిషు =సమస్త జాతులయందును; యాః మూర్తయః= ఏ శరీరములు; సంభవంతి =పుట్టుచున్నవో; తాసామ్ =వానికి ;మహత్ బ్రహ్మ= మూల ప్రకృతి; యోనిః =కారణము మాతృస్థానము ;అహమ్ =నేను; బీజప్రదః పితా= బీజమునుంచునట్టి తండ్రిని.
తాత్పర్యం :-
అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను(పరమాత్మ) తండ్రి వంటివాడను. (14:4)
83.కందం
వినుము సకల గర్భమ్ముల
జనియించెడు ప్రాణికోట్ల జగమంతటయున్
జనని యగును నా మాయయె
జనకుడ నేనగుదు పార్థ! సత్య మ్మిదియే(14-4-2) 103*
*భగవానుని మాయయే ప్రకృతి అనబడును*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
83.A.శ్లో||
సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసమ్భవాః|
నిబధ్నన్తి మహాబాహో
దేహే దేహినమవ్యయమ్|| 14-5 ||
(ఈ శ్లోకం కూడా ఘంటసాల పాడిన శ్లోకాలలో లేదు )
ప్రతిపదార్థం :-
మహాబాహో= గొప్ప బాహువులు గల ఓ అర్జునా !;ప్రకృతి సంభవాః= ప్రకృతి వలన పుట్టిన; సత్త్వం రజస్తమ ఇతి =సత్త్వము రజస్సు తమము అను; గుణాః =గుణములు; అవ్యయమ్= నాశరహితుడైన; దేహినమ్ =ఆత్మను; దేహే= దేహమునందు; నిబంధ్నంతి= బంధించుచున్నవి.
తాత్పర్యం :-
అర్జునా! ప్రకృతి వలన పుట్టిన సత్త్వరజస్తమోగుణములు మూడును నాశరహితుడైన ఆత్మ ను దేహమునందు బంధించుచున్నవి.
అనువాద పద్యం :-
83.A.కందం
క్రమముగ నిదె సత్త్వరజ
స్తమములు పార్థా!జనించు తనుధారులకున్
గమకించును,యీ ప్రకృతిభ
వము లాత్మను దేహమందు బంధింపంగాన్ (14-5-2 A) 104*
గమకించు.. ప్రయత్నించు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
84.శ్లో||
తత్ర సత్త్వం నిర్మలత్వాత్
ప్రకాశకమనామయమ్
సుఖసంగేన బధ్నాతి
జ్ఞానసంగేన చానఘ ||14-6||
ప్రతిపదార్థం :-
అనఘ= పాపరహితుడవగు ఓ అర్జునా!; తత్ర =ఆ సత్త్వాది గుణములలో; సత్త్వమ్= సత్త్వగుణము; నిర్మలత్వాత్= స్వచ్ఛమైనదగుటవలన; ప్రకాశకమ్= ప్రకాశమును గలుగజేయునదియు; అనామయమ్= ఉపద్రవము లేనిదియు (అగుచు); సుఖసంగేన= ఇంద్రియ సుఖములయందలి ఆసక్తిచేతను; జ్ఞాన సంగేన చ= జ్ఞానము నందలి ఆసక్తి చేతను జీవుని బంధించుచున్నది.
తాత్పర్యం :-
పాపరహితుడవగు ఓ అర్జునా!సత్త్వాది గుణములలో సత్త్వగుణము స్వచ్ఛమైనదై ఉపద్రవము లేనిదై ప్రకాశనము కలుగజేసి సుఖాసక్తిచేత, జ్ఞానాసక్తిచేత ఆత్మను లేదా జీవుని బంధించుచున్నది.
అనువాద పద్యం :-
84.కం.
అనఘా!విను సత్త్వ గుణము
కనగా నిర్మలమునై ప్రకాశము గలదై
మనుపుచు నిరపాయత నా
త్మను బంధించును సుఖమున మరి జ్ఞానము చేన్.(14-6-3)105*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
85.శ్లో||
రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ
కర్మసఙ్గేన దేహినమ్||14-7||
ప్రతిపదార్థం:-
కౌంతేయ =ఓ అర్జునా; రజః= రజోగుణము ;రాగాత్మకమ్= దృశ్యవిషయముల యెడల ప్రీతిని కలుగజేయునదియు; తృష్ణాసంగ సముద్భవమ్= కోరికను, ఆసక్తిని కలుగజేయునదియు అని ;విద్ధి= తెలిసికొనుము; తత్ =ఆ రజోగుణము; కర్మసంగేన= కర్మములందలి ఆసక్తి చేత; దేహినమ్ =ఆత్మను (జీవుని); నిబధ్నాతి =లెస్సగా బంధించుచున్నది.
తాత్పర్యం :-
ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
అనువాద పద్యం :-
85.కం.
విజయా!రాగాసక్తులు
రజోగుణముచే జనించి ప్రాణులయంద
క్కజముగ జీవుల ఆత్మల
నిజ కర్మల బంధనముల నిరతము గట్టున్ (14-7-4 )106*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
86.శ్లో||
తమస్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభి
స్తన్నిబధ్నాతి భారత|| 14-8 ||
ప్రతిపదార్థం :-
భారత =ఓ అర్జునా!; తమః తు= తమోగుణమన్నచో; అజ్ఞానజమ్= అజ్ఞానము వలన కలుగునదియు; సర్వదేహినామ్= సమస్త ప్రాణులకును; మోహనమ్= మోహమును కలుగజేయునదియు (అని) ;విద్ధి= తెలిసికొనుము; తత్= అది ;ప్రమాదాలస్య నిద్రాభిః= మఱపు సోమరితనము నిద్ర మొదలగు వానిచే; నిబధ్నాతి= లెస్సగా బంధించుచున్నది.
తాత్పర్యం :-
అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము. అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.
అనువాద పద్యం :-
86.కందం
విమలమతీ!జీవుల కిల
తమోగుణము మోహమయము తలపగ నజ్ఞా
న మదియె అతినిద్రయు మర
పు మరియు సోమరితనముల పొలియుచు నుండున్ (14-8-5) 107*
పొలియు..చెడిపోవు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
86.A.శ్లో||
యదా సత్త్వే ప్రవృద్ధే తు
ప్రళయం యాతి దేహభృత్
తదోత్తమ విదాం లోకా
నమలా న్ప్రతి పద్యతే (14-14)
(ఈ శ్లోకం ఘంటసాల భగవద్గీత లో పాడలేదు రజస్తమో గుణములతో పాటు సత్త్వ గుణమును వర్ణించిన శ్లోకం కూడా ఉంటే బాగుంటుందని నేను ఈ శ్లోకం కూడా చేర్చాను).
ప్రతిపదార్థం :-
యదా తు= ఎప్పుడయితే; సత్త్వే= సత్త్వ గుణము; ప్రవృద్ధే సతి= అభివృద్ధి పొందినదగుచుండగా; దేహభృత్= జీవుడు; ప్రలయమ్= మరణమును ;యాతి= పొందుచున్నాడో; తదా= అప్పుడు; ఉత్తమవిదామ్= ఉత్తమ జ్ఞానము గలవారియొక్క; అమలాన్= పరిశుద్ధములైన; లోకాన్= లోకములను; ప్రతిపద్యతే= పొందుచున్నాడు.
తాత్పర్యం :-
ఎప్పుడైతే జీవుడు సత్త్వగుణము అభివృద్ధి పొందినదగుచుండగా మరణించునో అప్పుడతడు ఉత్తమ జ్ఞానం గలవారియొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును.
అనువాద పద్యం :-
86A.కం.
ఎన్నడు సత్త్వము జీవుల
కున్నదియై వృద్ధి నొంద ఉసురు విడచునో
పన్నుగ నుత్తములాగతి
విన్నుల పరలోక మంది విలసిల్లు నటన్ (14-14-5A) 108*
పన్నుగ...ఒప్పుగ, తగినవిధంగా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
87.శ్లో||
మానావమానయోస్తుల్య
స్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ
గుణాతీతః స ఉచ్యతే||14-25||
ప్రతిపదార్థం :-
పాండవ =ఓ అర్జునా; యః= ఎవడు; మానావమానయోః=సన్మాన అవమానములయందు; తుల్యః= సమబుద్ధి గలవాడును; మిత్రారిపక్షయోః= శత్రుమిత్రులయందును; తుల్యః= సమబుద్ధి గలవాడును; సర్వారంభపరిత్యాగీ= సమస్త కార్యములందును కర్తృత్వము విడిచినవాడును అయి ఉండునో; సః= అతడు; గుణాతీతః= గుణాతీతుడని; ఉచ్యతే= చెప్పబడుచున్నాడు .
తాత్పర్యం :-
మానావమానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
అనువాద పద్యం :-
87.కం.
గౌరవ మవమానములన్
వైరుల మరి మిత్రుల సమభావముతోడన్
చేరిక విడిచియు కర్మల
నేరుపుతో నుండువాడె నిర్జిత గుణుడౌ.(14-25-6) 109*
(14.గుణత్రయ విభాగ యోగము 6+2 శ్లోకములు,8 పద్యములు సమాప్తము.)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదిహేనవ అధ్యాయం -
పురుషోత్తమ ప్రాప్తి యోగము
88.శ్లో||
ఊర్ధ్వమూలమధఃశాఖ
మశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్|| 15-1 ||
ప్రతిపదార్థం :-
యస్య =దేనికి ;ఛందాంసి= వేదములు ;పర్ణాని= ఆకులుగా నున్నవో (అట్టి) ;అశ్వత్థమ్= సంసారమను రావిచెట్టును; ఊర్ధ్వ మూలమ్= పైన వేళ్ళు గలదిగను; అధశ్శాఖమ్= క్రింద కొమ్మలు కలదిగను; అవ్యయమ్ =నాశనము లేనిదిగను; ప్రాహుః= చెప్పుదురు; తత్= దానిని; యః= ఎవడు; వేద= తెలిసికొనుచున్నాడో; సః =అతడు; వేదవిత్ =వేదార్థమునెరిగినవాడు.
తాత్పర్యం :-
బ్రహ్మమే మూలముగా , అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములుఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.
అనువాద పద్యం :-
88.A.కందం
చిత్రము రావి తరువునన్
పత్రములై వేదరాశి, పై మూలమునై
ఛత్రమును బోలు కొమ్మలు
చిత్రితమై క్రింద యమరు చిన్నెలు కనగా(15-1-1A) 110*
88.B.కందం.
అవ్యయమై యొప్పెడు యీ
దివ్య జ్ఞానమ్మునెవడు తెలిసినవాడై
సవ్యముగను నడచు నతడె
భవ్యముగా వేదవిదుడు భారతవీరా!(15-1-1B) 111*
భవ్యము..సత్యం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
89.శ్లో||
న తద్భాసయతే సూర్యో
న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే
తద్ధామ పరమం మమ||15-6 ||
ప్రతిపదార్థం :-
తత్= ఆ పరమాత్మ స్థానమును; సూర్యః =సూర్యుడు; న భాసయతే= ప్రకాశింపజేయజాలడు; శశాంకః =చంద్రుడు న (భాసయతే)= ప్రకాశింపజేయజాలడు; పావకః= అగ్ని; న (భాసయతే)= ప్రకాశింపజేయజాలడు; యత్= దేనిని ;గత్వా= పొంది; న నివర్తన్తే= తిరిగి రానేరరో ;తత్ =అది ;మమ= నా యొక్క; పరమమ్= శ్రేష్ఠమైన; ధామ= స్థానము.
తాత్పర్యం :-
పునరావృత్తి రహితమైన మోక్షపదము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
అనువాద పద్యం :-
89.కం.
భానుడు చంద్రుడు నగ్నియు
దేనిని దీపింపజేయ తెలియగలేవో
ఆ నా పరమపదమ్మున
మానితమగుచో కలుగదు మరుజన్మ మికన్(15-6-2) 112*
మానితము..మన్నింపబడినది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
90.శ్లో||
అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్|| 15-14 ||
ప్రతిపదార్థం :-
అహం= నేను; వైశ్వానరః= వైశ్వానరుడను జఠరాగ్నిగా; భూత్వా= అయి; ప్రాణినామ్= ప్రాణుల యొక్క; దేహమ్= శరీరమును ;ఆశ్రితః =ఆశ్రయించిన వాడనై ;ప్రాణాపాన సమాయుక్తః= ప్రాణ అపాన వాయువులతో కూడుకొని; చతుర్విధమ్= నాలుగు విధములగు; అన్నమ్= అన్నమును; పచామి= పక్వము చేయుచున్నాను.
తాత్పర్యం :-
నేను దేహులందు వైశ్వానరుడను పేర జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను. (15:14)
అనువాద పద్యం :-
90.కందం
నేనే ప్రాణులయందున
మానిత వైశ్వానరముగ మసలుచు,ప్రాణా
పానముల జరిపి జీర్ణము
నే నాల్గు గతుల నొనర్తు నిత్యము బువ్వన్ (15-14-3) 113*
(15. పురుషోత్తమ ప్రాప్తి యోగము 3 శ్లోకములు,4 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదహారవ అధ్యాయం -
దైవాసురసంపద్విభాగ యోగము
91Aశ్లో||
అభయం సత్త్వసంశుద్ధి
ర్జ్ఞానయోగవ్యవస్థితిః,
దానం దమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయస్తప ఆర్జవమ్.(16-1)
ప్రతి పదార్థం :-
భారత= ఓ అర్జునా!; అభయమ్= భయము లేకుండుట; సత్త్వ సంశుద్ధిః= అంతఃకరణశుద్ధి; జ్ఞానయోగవ్యవస్థితిః =జ్ఞాన యోగము నందుండుట; దానమ్= దానము; దమః చ =ఇంద్రియ నిగ్రహమును; యజ్ఞః చ =యజ్ఞమును; స్వాధ్యాయః =అధ్యయనము; తపః= తపస్సు; ఆర్జవమ్= ఋజువర్తన;
91B.శ్లో
అహింసా సత్యమక్రోధ
స్త్యాగశ్శాంతిరపైశునమ్,
దయా భూతేష్వలోలత్వం
మార్దవం హ్రీరచాపలమ్.(16-2)
(92&93 శ్లోకాలు ఘంటసాల పాడిన భగవద్గీత లో లేవు )
తాత్పర్యం :-
అహింసా= అహింసయు; సత్యమ్= సత్యము పలుకుట; అక్రోధః= కోపము లేకుండుట; త్యాగః= త్యాగబుద్ధి; శాంతిః= శాంతస్వభావము; అపైశునమ్= కొండెములు చెప్పకుండుట; దయా భూతేషు= ప్రాణులందు దయ కలిగి ఉండుట; అలోలత్వమ్= విషయ లోలత్వము లేకుండుట; మార్దవమ్= మృదుత్వము; హ్రీః = ధర్మవిరుద్ధ కార్యములు చేయుటయందు సిగ్గు; అచాపలమ్= చంచలత్వము లేకుండుట;
91.శ్లో.
తేజః క్షమాధృతిశ్శౌచ
మద్రోహో నాతిమానితా,
భవంతి సంపదం దైవీ
మభిజాతస్య భారత.(16-3)
ప్రతిపదార్థం :-
తేజః =బ్రహ్మ తేజస్సు; క్షమా= ఓర్పు; ధృతిః =ధైర్యము; శౌచమ్= శుచిత్వము; అద్రోహః= ద్రోహము చేయకుండుట ;నాతిమానితా= స్వాతిశయము లేకుండుట అను ఈ గుణములు; దైవీమ్= దైవసంబంధమునందు; అభిజాతస్య= పుట్టినవానికి; భవన్తి= కలుగుచున్నవి.
తాత్పర్యం :-(వరుసగా మూడు శ్లోకాలకు)
భగవంతుడు చెప్పెను:- ఓ అర్జునా! 1. భయములేకుండుట, 2. అంతఃకరణశుద్ధి, 3. జ్ఞానయోగమునందుండుట, 4. దానము, 5. బాహ్యేంద్రియనిగ్రహము, 6. (జ్ఞాన) యజ్ఞము, 7. వేదశాస్త్రాదుల అధ్యయనము, 8. తపస్సు, 9. ఋజుత్వము (కపటము లేకుండుట), 10. ఏ ప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట (అహింస), 11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట లేక నిజము పలుకుట (సత్యము), 12. కోపము లేకుండుట, 13. త్యాగబుద్ధి గలిగియుండుట, 14. శాంతిస్వభావము, 15. కొండెములు చెప్పకుండుట, 16. ప్రాణులందు దయగలిగియుండుట, 17. విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందాసక్తి లేకుండుట వానిచే చలింపకుండుటయు, 18. మృదుత్వము (క్రౌర్యము లేకుండుట), 19. (ధర్మవిరుద్ధకార్యములందు) సిగ్గు, 20. చంచల స్వభావము లేకుండుట, 21. ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు), 22. ఓర్పు, (కష్టసహిష్ణుత), 23. ధైర్యము, 24. బాహ్యాభ్యంతర శుచిత్వము, 25. ఎవనికిని ద్రోహము చేయకుండుట, ద్రోహచింతనము లేకుండుట, 26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగిన వాడనను అభిమానము గర్వము లేకుండుట), అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నవి. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము.) .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
16వ అధ్యాయములో 1,2,3 శ్లోకాలకు
4 అనువాద పద్యములు
అనువాద పద్యం
91.A.కం.
శాంతమహింసయు సత్యము
సుంతయు గన ద్రోహచింత చొరని హృదయమున్
సంతత యోగము దానము
అంతఃకరణంపు శుద్ధి త్యాగాదులనన్(16-1-1A) 114*
అనువాద పద్యం :-
91.B కం.
ఆగ్రహలోలతలు విడుట
నిగ్రహభావము మృదులత నిరతము దయ యే
కాగ్రత యజ్ఞము తపమును
సుగ్రాహ్యత అధ్యయమున సుగుణములనగా(16-1B)115*
అనువాద పద్యం :-
91.C.కం.
కలిగి త్రపయు నిర్భయతయు
పలుకక కొండెముల నిలను బ్రతుకగ వలయున్
వలదుసుమా చాంచల్యము
వలయును నిష్కపటముగను వర్తించుటయున్ (16-1C) 116*
అనువాద పద్యం :-
91.D.కం.
తేజము క్షమయును ధైర్యము
సాజమ్మగు శుచియు,విడిన స్వాతిశయంబున్
భాజనమై దైవకృపకు
యీజగతిని బ్రతుకు వారె యీదృశులెన్నన్16-1D) 117*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
92.శ్లో||
దమ్భో దర్పోऽభిమానశ్చ
క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య
పార్థ సమ్పదమాసురీమ్||16-4 ||
ప్రతిపదార్థం :-
పార్థ =ఓ అర్జునా !;దంభః= కపటవేషము; దర్పః =గర్వము; అభిమానః చ =దురభిమానమున్ను; క్రోధః= కోపము ;పారుష్యమ్ ఏవ చ =వాక్కు మున్నగువానియందు కఠినత్వమున్ను; అజ్ఞానం చ= అవివేకమున్ను ;ఆసురీమ్= అసుర సంబంధమైన; సంపదమ్= సంపత్తియందు ;అభిజాతస్య= పుట్టినవానికి (భవన్తి కలుగుచున్నవి).
తాత్పర్యం :-
పార్దా! డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.
అనువాద పద్యం :-
92.కందం
మనమున గర్వము డంబము
తనపై అభిమానమున్ను తన అజ్ఞానం
బును కాఠిన్యము క్రోధము
దనుజాంశను జననమంద తవులును పార్థా! (16-4-2) 118*
తవులు...చిక్కుకొను,తగులుకొను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
93.శ్లో||
త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభ
స్తస్మాదేతత్త్రయం త్యజేత్|| 16-21 ||
ప్రతి పదార్థం :-
కామః= కామము; క్రోధః= కోపము; తథా= అటులనే; లోభః= లోభము (ఇతి =అను); ఇదమ్= ఇది; త్రివిధమ్= త్రివిధములగు; నరకస్య ద్వారమ్= నరకము యొక్క ద్వారము ;ఆత్మనః =తనకు (జీవునకు); నాశనమ్= నాశనము కలుగజేయునది ;తస్మాత్ =ఆ కారణము వలన; ఏతత్ త్రయమ్= ఈ మూడింటిని ;త్యజేత్= విడువవలెను.
తాత్పర్యం :-
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. (16:21)
అనువాద పద్యం :-
93.కం.
కామము క్రోధము లోభము
లీ మూడును నరకమునకు నిరవులగుటచే
తామవి విడువంగవలయు
నే మానవు లుత్తమగతు లేగదలతురో (16-21-3) 119*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
94.శ్లో||
యః శాస్త్రవిధిముత్సృజ్య
వర్తతే కామకారతః|
న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాం గతిమ్|| 16-23 ||
ప్రతిపదార్థం :-
యః =ఎవడు; శాస్త్ర విధిమ్= శాస్త్రోక్తమగు విధిని ;ఉత్సృజ్య= విడిచిపెట్టి ;కామకారతః =తన ఇష్టం వచ్చినట్లు; వర్తతే= ప్రవర్తించుచున్నాడో; సః =అతడు; సిద్ధిమ్= అనుష్ఠానముచే పొందదగు ఫలమును; న అవాప్నోతి= పొందడు ;సుఖమ్ సుఖమును ;న (అవాప్నోతి)= పొందడు ;పరాంగతిమ్= ఉత్తమమగు మోక్షమును; న (అవాప్నోతి)= పొందడు .
తాత్పర్యం :-
శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్ఛామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు. (16:23)
అనువాద పద్యం :-
94.కందం
పొరబడి వర్తించి జనులు
సరియగు మార్గమ్మిదియను శాస్త్రపు నుడులన్ ,
గురువాక్యము పాటింపక
పురుషార్థము మోక్షసుఖము పొందగ తరమే! (16-23-4) 120*
(16.దైవాసుర సంపద్విభాగ యోగము 4+2 శ్లోకములు,7 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పదిహేడవ అధ్యాయం -
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీభగవానువాచ|
95.శ్లో||
త్రివిధా భవతి శ్రద్ధా
దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ
తామసీ చేతి తాం శృణు|| 17-2 ||
ప్రతిపదార్థం :-
దేహినామ్ =ప్రాణుల యొక్క; స్వభావజా= స్వభావముచే కలిగిన; సా శ్రద్ధా= ఆ శ్రద్ధ; సాత్త్వికీ= సాత్త్విక శ్రద్ధ యనియు; రాజసీ చ ఏవ =రాజస శ్రద్ధయనియు; తామసీ చ ఇతి= తామసశ్రద్ధ యనియు; త్రివిధా= మూడు విధములుగా; భవతి =అగుచున్నది; తామ్= దానిని; శ్రుణు =వినుము.
తాత్పర్యం :-
జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నది.దానిని గూర్చి వినుము .(17:2)
అనువాద పద్యం :-
95.కందం
గత జన్మల సంస్కారము
జతగూడగ మువ్విధముల శ్రద్ధ మనుజులన్
నుత సాత్త్విక రాజసములు
మతి తామస మది వినుమిక మద్వచనంబుల్ (17-2-1)121*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
96.శ్లో||
యజన్తే సాత్త్వికా దేవా
న్యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే
యజన్తే తామసా జనాః|| 17-4 ||
ప్రతిపదార్థం :-
సాత్త్వికా= సత్వగుణం గలవారు; దేవాన్= దేవతలను; యజన్తే= పూజించుచున్నారు ;రాజసాః= రజోగుణము గలవారు; యక్షరక్షాంసి= యక్షులను, రాక్షసులను; అన్యే= ఇతరులగు; తామసాః జనాః =తమోగుణము గల జనులు; ప్రేతాన్= ప్రేతములను; భూతగణాన్ చ =భూతగణములను; యజన్తే= పూజించుచున్నారు.
తాత్పర్యం :-
సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. (17:4)
అనువాద పద్యం :-
96.కం.
ఈ జగతిని దేవతలను
పూజింతురు సత్త్వగుణులు,భూతగణములన్
పూజింతురు తామసికులు
రాజసికుల్ కొలుచు యక్షరాక్షస గణమున్ (17-4-2) 122*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
97.శ్లో||
అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే||17-15||
ప్రతిపదార్థం :-
అనుద్వేగ కరమ్= ఇతరుల మనస్సునకు బాధకలిగించనిదియు; సత్యమ్= సత్యమైనదియు; ప్రియహితమ్ చ= ప్రియమైనదియు అగు; వాక్యమ్= వాక్యమున్ను; స్వాధ్యాయాభ్యసనమ్ చ ఏవ= వేదాదులయొక్క అధ్యయనము వలన; యత్ =ఏదికలదో (తత్ అది); వాజ్మయం= వాక్కునకు సంబంధించిన; తపః (ఇతి)= తపస్సు అని; ఉచ్యతే= చెప్పబడుచున్నది.
అనువాద పద్యం :-
ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషణ ము, వేదాధ్యయనమొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును. (17:15)
అనువాద పద్యం :-
97.కం.
నొప్పింపక పరుల మనసు
చొప్పడ సత్యము పలుకుచు చూడ ప్రియముగన్
యెప్పుడు వేదమ్ము జదువ
తప్పక యది వచనరూప తపమగు పార్థా! (17-15-3)123*
(17.శ్రద్ధాత్రయ విభాగ యోగము 3 శ్లోకములు,3 పద్యములు సమాప్తము సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పద్దెనిమిదవ అధ్యాయం
మోక్షసన్న్యాస యోగం
98. శ్లో||
కామ్యానాం కర్మణాం న్యాసం
సంన్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం
ప్రాహుస్త్యాగం విచక్షణాః||18-2 ||
ప్రతిపదార్థం :-
కామ్యానామ్= ఫలమును కోరి చేయబడు ;కర్మాణామ్= కర్మములయొక్క; న్యాసమ్= వదలుటను; సన్న్యాసమ్= సన్యాసము గా; కవయః =(కొందరు) పండితులు ;విదుః= తెలిసికొనుచున్నారు; సర్వకర్మఫలత్యాగమ్ =సమస్త కర్మములయొక్క ఫలమును త్యజించుటను; త్యాగమ్= త్యాగముగా; విచక్షణాః= (మరికొందరు) పండితులు; ప్రాహుః= చెప్పుదురు .
తాత్పర్యం :-
జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమని కొందరు పండితులు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమని మరికొందరు విద్వాంసులు చెప్పుదురు. (18:2)
అనువాద పద్యం:-
98.కం.
ఇలలో కర్మలు విడచుటె
కొలువడి జడదారులకన కొందరు విబుధుల్
ఫలమును గోరక కర్మల
సలుపుటె సన్న్యాసమంచు చాటెద రితరుల్ (18-2-1) 124*
కొలువడి...కొలత
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
99.శ్లో||
అనిష్టమిష్టం మిశ్రం చ
త్రివిధం కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య
న తు సంన్యాసినాం క్వచిత్||18-12 ||
ప్రతి పదార్థం :-
అనిష్టమ్ =దుఃఖకరమైనదియు; ఇష్టమ్ =సుఖకరమైనదియు; మిశ్రమ్ చ =సుఖదుఃఖాలు రెండును కలసినదియు అగు; త్రివిధమ్= మూడు విధములైన; కర్మణః ఫలమ్= కర్మములయొక్క ఫలము ;అత్యాగినామ్= కర్మఫలత్యాగము చేయనివారలకు; ప్రేత్య= మరణానంతరము; భవతి= కలుగుచున్నది; సన్యాసినామ్ తు= కర్మఫలత్యాగము చేసినవారికైనచో; క్వచిత్= ఒకప్పుడును ;న= కలుగదు.
తాత్పర్యం :-
కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. (18:12)
అనువాద పద్యం :-
99.A.కం.
ఫలముగ కర్మల కొలదిగ
చెలగుచు మువ్విధము నరులు చెందుదు రివియే
నిలయము నరకము స్వర్గ
మ్మిలలో సుఖదుఃఖభరిత యీ జన్మంబుల్ (18-12-2A) 125*
అనువాద పద్యం :-
99.B.కం.
చిక్కక భవబంధములకు
మ్రొక్కుచు పరమాత్మపదము మునిగి తపమునం
దొక్కెడ కర్మఫలము విడ
దక్కును మరుజన్మ లేని దైవైక్య మికన్.(18-12-2 B) 126*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
100. శ్లో||
ప్రవృత్తిం చ నివృత్తిం చ
కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి
బుద్ధిః సా పార్థ సాత్త్వికీ|| 18-30 ||
ప్రతిపదార్థం :-
పార్థ= ఓ అర్జునా!; యా బుద్ధిః= ఏ బుద్ధి ;ప్రవృత్తిమ్ చ= ధర్మమునందు ప్రవృత్తిని (ప్రవృత్తి మార్గమగు కర్మమార్గమును); నివృత్తిమ్ చ= అధర్మమునుండి నివృత్తిని (నివృత్తి మార్గమగు సన్న్యాసమార్గమును); కార్యాకార్యే= చేయదగువానిని, చేయకూడనివానిని ;భయాభయే= భయమును, అభయమును; బంధమ్= బంధమును; మోక్షమ్ చ= మోక్షమును; వేత్తి= తెలుసుకొనుచున్నదో! సా =అట్టిబుద్ధి ;సాత్త్వికీ= సాత్త్విక మైనది యగును.
తాత్పర్యం :-
అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము.
అనువాద పద్యం :-
100.కం.
మనమున కార్యమకార్యము
మొనకొని ధర్మము లధర్మముల తత్త్వ మెఱిం
గిన వారై నిర్భయమున
చని చేరుట మోక్ష పథము సత్త్వమగునదే (18-30-3) 127*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
101.శ్లో||
ఈశ్వరః సర్వభూతానాం
హృద్దేశేऽర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వభూతాని
యన్త్రారూఢాని మాయయా|| 18-61 ||
ప్రతిపదార్థం :-
అర్జున= ఓ అర్జునా!; ఈశ్వరః= జగన్నియామకుడగు పరమేశ్వరుడు ;మాయయా= మాయచేత; సర్వభూతాని= సమస్త ప్రాణులను; యంత్రారూఢాని (ఇవ)= యంత్రమునాడించువానివలె; భ్రామయన్= తిప్పుచు; సర్వభూతానామ్= సమస్త ప్రాణుల యొక్క; హృద్దేశే= హృదయ ప్రదేశమునందు; తిష్ఠతి= వెలయుచున్నాడు.
తాత్పర్యం :-
ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయములందున్నవాడై, జంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణులను భ్రమింపజేయుచున్నాడు. (18:61)
అనువాద పద్యం :-
101.కం.
కొలువై ప్రాణుల మది చి
ద్విలాసముగ జంత్రగాని విధమున పార్థా!
కలయగ ద్రిప్పెడు మాయకు
నిలయుడు పరమేశ్వరుండు నిఖిల జగతికిన్ (18-61-4) 128*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
102.శ్లో||
“ సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః || 18-66||
ప్రతిపదార్థం:-
సర్వధర్మాన్స=మస్త ధర్మములను; పరిత్యజ్య =విడిచిపెట్టి ;మామ్= నన్ను; ఏకమ్= ఒక్కని మాత్రమే; శరణం వ్రజ= శరణుపొందుము; అహమ్= నేను; త్వా= నిన్ను; సర్వపాపేభ్యః =సమస్త పాపములనుండి ;మోక్షయిష్యామి= విడిపించెదను; మాశుచః= శోకింపకుము.
తాత్పర్యం :-సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణు పొందుము.నేను నిన్ను సమస్త పాపములనుండి విముక్తుని జేసెదను.శోకింపకుము.
అనువాద పద్యం :-
102.కం.
విడిచియు ధర్మములన్నియు
విడువక నను శరణు పొందు విజయా! నిను నే
విడిపించెద పాపచయుము
నెడబాపియు మోక్షమిత్తు నీగుము వగపున్.(18-66-5) 129
ఈగుము తొలగించుము
వగపు... శోకము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
103.శ్లో||
య ఇదం పరమం గుహ్యం
మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా
మామేవైష్యత్యసంశయః|| 18-68 ||
ప్రతిపదార్థం :-
యః= ఎవడు; పరమమ్ గుహ్యమ్= అతి రహస్యమైన; ఇమమ్= ఈ గీతాశాస్త్రమును; మద్భక్తేషు= నా భక్తులకు; అభిధాస్యతి= చెప్పునో ( సః అట్టివాడు); మయి =నాయందు; పరామ్= శ్రేష్ఠమైన; భక్తిమ్= భక్తిని; కృత్వా =చేసి( కలిగి); అసంశయః= సంశయరహితుడై (నిస్సందేహముగా); మామ్ ఏవ =నన్నే; ఏష్యతి =పొందగలడు.
తాత్పర్యం :-
ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.
అనువాద పద్యం :-
103.కం.
పరమరహస్యమ్మగు
వర గీతాశాస్త్ర మెవడు భక్తుల కిలలో
మురియుచు బోధించు నతడు
పరమగు నను పొందగలడు వాస్తవ మిదియే(18-68-6)130*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
104. శ్లో||
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః
ప్రనష్టస్తే ధనఞ్జయ||18-72 ||
ప్రతిపదార్థం :-
పార్థ=ఓ అర్జునా ;ఏతత్= ఇది (నాచే ఉపదేశింపబడిన ఈ గీతా శాస్త్రము) ;త్వయా =నీచేత; ఏకాగ్రేణ చేతసా= ఏకాగ్రచిత్తముతో; శ్రుతమ్ కశ్చిత్ =వినబడినది కదా! ;ధనంజయ= ఓ అర్జునా!; తే నీయొక్క; అజ్ఞానసమ్మోహః= అజ్ఞానము వలన పుట్టిన మోహము; ప్రణష్టః కశ్చిత్= సంపూర్ణంగా నశించినది గదా!
తాత్పర్యం :-
ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?
అనువాద పద్యం :-
104.కం.
ఏకాగ్రతతోడ నిపుడు
నా వాక్యము వింటివి గద! నశియించినదా!
నీ విభ్రమ సంపూర్తిగ
ఓ విజయా!ఉడిగెను గద! ఉద్వేగ మికన్(18-72-7) 131*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అర్జున ఉవాచ|
105.శ్లో||
నష్టో మోహః స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితోऽస్మి గతసన్దేహః
కరిష్యే వచనం తవ|| 18-73 ||
ప్రతిపదార్థం :-
అచ్యుత =ఓ కృష్ణా !;త్వత్ ప్రసాదాత్ =నీ అనుగ్రహం వలన; మోహః =నా అజ్ఞానము; నష్టః= నశించినది ;మయా= నాచేత; స్మృతిః= జ్ఞానము; లబ్ధ్వా= పొందబడెను; గతసందేహః= సంశయ రహితుడనై; స్థితః అస్మి= ఉన్నాను; తవ= నీయొక్క; వచనమ్= వాక్యమును( ఆజ్ఞను); కరిష్యే= నెరవేర్చెదను.
తాత్పర్యం :-
కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నా సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.
అనువాద పద్యం :-
105.కం.
అజ్ఞానము నశియించెను
నా జ్ఞానపు వికసనమ్ము నాకు కలిగె నీ
యాజ్ఞను పాటించెద నో
యజ్ఞపురుష!సంశయమ్ము లన్ని తొలగెగా(18-73-8) 132*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
106.శ్లో||
సంజయ ఉవాచ:-
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతి
ర్ధ్రువా నీతిర్మతిర్మమ|| 18-78 ||
ప్రతిపదార్థం :-
యత్ర= ఎచట; యోగేశ్వరః= యోగేశ్వరుడగు; కృష్ణః =శ్రీకృష్ణుడు; యత్ర =ఎచట; ధనుర్ధరః= ధనుస్సు చేపట్టిన; పార్థః =అర్జునుడు; తిష్ఠతి= ఉండునో; తత్ర =అచట; శ్రీః= లక్ష్మియు; విజయః= విజయమును; భూతి= ఐశ్వర్యమును; ధ్రువా =ధృడమైన; నీతిః =నీతియు; (సంతి ఇతి =కలవని); మమ= నా యొక్క; మతిః= అభిప్రాయము.
తాత్పర్యం :-
యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును
అనువాద పద్యం :-
106.కం.
యోగేశ్వరుడగు కృష్ణుడు
బాగుగ గాండీవధారి పార్థు డిరువురున్
రాగముతో నిలుచు నెడల
భోగమ్ముగ నీతి జయ విభూతులు గలుగున్(18-78-9) 133*
(18.మోక్షసన్న్యాస యోగము 9 శ్లోకములు,10 పద్యములు సమాప్తము)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఫలశ్రుతి
107.శ్లో||
గీతాశాస్త్ర మిదం పుణ్యం
యః పఠేత్ ప్రయతః పుమాన్.
విష్ణోః పదమవాప్నోతి
భయశోకాది వర్జితః .
తాత్పర్యం :-
గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.
నిరతము గీతాశాస్త్రము
పరమమ్మగు భక్తితోడ పఠియించినచో
సరగున భయశోక ముడిగి
హరిసాయుజ్యము లభించు నంచు నెఱుగుమా!134*
.కం.
అల్పము గాదీ శాస్త్రము
కల్పతరువు గీత ఘనము కైమోడ్పులివే
సల్పుచు భగవద్గీతకు
నిల్పెద గోవిందుడినెద నించిన భక్తిన్ 135*
శ్లో||
ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం,
ఏకో దేవో దేవకీపుత్ర ఏవ |
ఏకో మంత్రస్తస్య నామాని యాని,
కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ||"
కం.
ఒకడే దైవము కృష్ణుం
డొకటే శాస్త్రమ్ము గీత యొప్పిదముగ, దే
వకిసుతు నామమె మంత్ర
మ్మొకటే తత్సేవ కర్మ యురవు హరికినిన్.136*
ఉరవు...ఔచిత్యం,ఉచితమైనది
శ్లో||
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం
కం.
అతడే వసుదేవ సుతుం
డతడే కంసాదులకిల నంతకుడతడే
సతమానందము దేవకి
కతడే గురువీ జగతికి యతనికి ప్రణతుల్.137*
కం.
మంగళమీ శుభ గీతకు
మంగళమౌ పలికినట్టి మాధవునకు నే
మంగళ మనియెద పార్థుకు
మంగళమౌ వ్యాసునకును మహి *జయ* మునకున్.138*
(భగవద్గీతలోని ఘంటసాల పాడిన 106+2+ నేను అదనంగా అనువాదం చేసిన 11 శ్లోకాలు మొత్తం 119 శ్లోకాలకు 138 పద్యాలు +ఆరంభ పద్యాలు 19 కలుపుకుని మొత్తం 157 పద్యాలతో ఈ *గీతా కంద మరందం*
కందానువాదం సంపూర్ణం.)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*గీతయందలి అధ్యాయముల పేర్లు*
1.అర్జునవిషాద యోగము:
2. సాంఖ్య యోగము
3. కర్మ యోగము
4. జ్ఞాన యోగము
5. కర్మసన్న్యాస యోగము
6.ఆత్మ సంయమ యోగము
7. విజ్ఞాన యోగము
8.అక్షరపరబ్రహ్మ యోగము
9.రాజవిద్యారాజగుహ్య యోగము
10.విభూతి యోగము
11.విశ్వరూప సందర్శన యోగము
12.భక్తి యోగము
13.క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
14.గుణ త్రయ విభాగ యోగము
15.పురుషోత్తమ ప్రాప్తి యోగము
16.దైవాసుర సంపద్విభాగ యోగము
17.శ్రద్ధాత్రయ విభాగ యోగము
18.మోక్షసన్న్యాస యోగము
Comments
Post a Comment