4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ


గేయ రామాయణం
 యుద్ధ కాండ (265 చరణాలు)

1.
ఇపుడింక మొదలాయె యుద్ధకాండ
శ్రీహరికి హరిసేన అండదండ
ధరణిసుత కష్టాల చెరలు వీడ
ధరణికి తొలగించ దనుజు పీడ. 

2.
కడలికి వారధిని కట్టించెను
తనవైరి తమ్మునికి శరణొసగెను
అసురుని అసువులను హరియించెను
విమలాత్మ నిజసతిని గ్రహియించెను

 3.
రాముని చరితమ్ము రమణీయము
తన కాంతపై ప్రేమ కమనీయము
మహినంత కాచుమతి మహనీయము
యుగములకు ఈ గాథ స్మరణీయము 

4.
బింకాన కడలినే అధిగమించి
లంకలో ఒక వంక సీత గాంచి
జంకక రాక్షసుల నెదిరినిల్చి
గొంకక చెలరేగి నగరు కాల్చి 

5.
సీతమ్మ క్షేమమ్ము నెరిగి తిరిగి
విచ్చేసి శుభవార్త వినిపించిన
హనుమయ్య సరిలేని స్వామిభక్తి
రామయ్య మనసునే హరియించగా 

6.
ఆనందముప్పొంగ ఆదరమున
ఉపకారమెంచి ఆ రఘురాముడు
మారుతిని ప్రియమార చేరబిలిచి
మనసార మెచ్చుకొని పలికెనిటుల. 

7.
పావనీ!అన్యులకు అలవిగాని
ఘనకార్య మొనరించినావు నీవు
నీవల్ల నిలిచె మా ప్రాణమ్ములు
చింతలను వీడె మా చిత్తమ్ములు 

8.
మాకీవు చేసిన ఈ మేలుకు
ప్రతిమేలు నేనేమి చేయగలను?
ఒకమారు మనసార‌ కౌగిలించి
ప్రేమనే బహుమతిగ నీయగలను 

9
అనుచు అలవి మీరిన ప్రేమతోడ
హనుమను బిగియార కొగిలించి
దాశరథి సమరాభిలాషియగుచు
లంకలో వింతలను చెప్పమనియె 

10.
స్వామి ఇదె వినుమంచు హనుమంతుడు
లంకలో తను గన్న గుట్టుమట్లు
తెలియగా రామునకు వివరమ్ముగా
తెలిపెను తానపుడు ‌ఈ రీతిగా 


11.
శ్రీరామ!సాగరపు నడిమధ్యలో
త్రికూట శిఖరమ్ముపై ఠీవిగా
అందాల ఆ పురము నిలిచియుంది
బంగారు శిఖరాల మయమైనది 

12.
 సింహద్వారములున్నవి‌‌ ఒక నాలుగు 
ఉన్నది లోతైన కందకమ్ము
శతఘ్నులున్నవట వందలాది
రాక్షసుల సైన్యమొక‌ కోటిమంది 

13.
ప్రవేశ మార్గమే లేనట్టిది
నా చేత ఒకకొంత భగ్నమైంది
సాగరము దాటుటే జరిగెనేని
తథ్యమ్ము సాధ్యమిక జయమన్నది 

14.
అనుచు జయవాక్కునే  పలుక హనుమ
ఉత్సాహవంతుడై శ్రీరాముడు
ఇవియేను శుభఘడియలనుచు పలికి
నీలుణ్ణి అధిపతిగ నిశ్చయించి 

15
తానంత కిష్కింధ పురము వీడి
ఆ ఋక్ష వానరుల గుంపుగూడి
అడవులు నగరాలు అధిగమించి
దక్షిణపు దిక్కుగా దండు వెడలె 


16.
సాగరపు తీరాన విడిదిచేయ
చూచుటకు కపిసేన కనుదోయికి
కడలికి పక్కనే వేరు కడలి
వెలసెనా అనునట్లు భ్రాంతిగొలిపె 

17.
భీకరపు సాగరము గని రాముడు
సీతమ్మ అపహరణ వేళ తలచి
నాదేవి తానెంత భీతిల్లెనో
ఆ వేళ అనియెంచి తపియించెను 

18.
భూమిపై చెరియొక్క పక్కమేము
జీవించి యుంటిమను ఆశతప్ప
ఆనందమేముంది ఈ బ్రతుకులో
వేదనలు తొలగేటి క్షణమెప్పుడో! 

19.
అటునుంచి నను తాకు చల్లగాలి
నా కాంత ఆలింగనమ్ము నాకు
ఇరువురము చూసేటి ఒక జాబిలి
చూపులను కలిపేటి సుఖభావము 

20.
ఈ రీతి దురపిల్లి తల్లడిల్లు
ఇనవంశ తిలకుని దుఃఖానికి
కలగిన మనసుతో కమలాప్తుడు
పడమటి కొండలకు జారినాడు 



21.
 లంకలో ఆవేళ రావణుండు
మంత్రులను రావించి సభతీర్చెను
వానరుడు విలయమిటు చేయుటేమి?
మనమిపుడు చేయగల కార్యమేమి? 

22.
అని తమను అడిగేటి‌ ప్రభువు తోటి
అనుచరులు ఆయుధాలెత్తిపట్టి
జయజయధ్వానాలు మిన్నుముట్టి
చెలగగా పలికిరిటు ప్రభువుతోటి 

23.
ఏలికా!లోకాల నోడించిన
నీవంటి వీరునకు రాముడెంత!
వానరుల క్షణములో మట్టుబెట్టి
ఆ నరుల తృటిలోన గెలిచేములే 

24.
శ్రీ రామ లక్ష్మణుల హనుమాదుల
చంపుదును నేనంటె నేను అనుచు
చెలరేగి గంతులిడు అసురాళిని
వారించి విభీషణుం డిటుల పలికె 

25
ఓ అన్న!అరి బలము నెంచకుండ
పోరుకై ఉరుకుటిది ప్రజ్ఞ యగునె?
తప్పంత నీవైపు నిలిచియుండ
సజ్జనుల గెలుచుటది సాధ్యమగునె? 


26.
అవనిజను కొనివచ్చినది మొదలుగా
పొడసూపసాగె నపశకునమ్ములు
ఇకనైన ఆ సాధ్వి నొదిలిపెట్టు
లేకున్న లంకకే మూడు చేటు 

27
ఆ హితవు నచ్చని లంకేశుడు
కలకంఠి నొదులుట కల్లయనుచు
సేనాధిపతి యైన ప్రహస్తుని
పనిచెను యుద్ధమిక తథ్యమ్మని 

28
కుంభకర్ణుణ్ణి సభకపుడు పిలిపించెను
జరిగిన కథయెల్ల వినిపించెను
శత్రువును వధియించు మార్గమేదో
చెప్పమని యోధులను ప్రశ్నించెను 

29
మహాపార్శ్వుడనునట్టి ఒక యోధుడు
బలిమితో చేపట్టు సీతననగా
అప్సరస కథనపుడు యెరిగించుతూ
విధాత శాపమిటు వివరించెను 

30
పుంజికస్థల యనెడు అప్సరసను
నేనొకనాడు కామించి వెంటాడుతూ
బలిమితో చేపట్ట యత్నించగా
భామిని బ్రహ్మ నే శరణుజొచ్చె 



31.
విధాత కృద్ధుడై వెనువెంటనే
పాపమ్ము క్షమియింప రానిదనుచు
శాపమ్ము నిచ్చెనిటు బ్రహ్మ సభలో
సీతను కాచెనది ఈ లంకలో 

32
మరులు మది గొననట్టి మగువ నికపై
బలిమితో చేపట్ట యత్నించితే
తలపగిలి ముక్కలగు తథ్యమనెను
కనుకనే అశక్తుండైతి నేను 

33.
అయిననూ  జానకిని విడువబోను
రామునికి మృత్యువును నేనగుదును
అని‌సభను పరుషోక్తులాడుచుండ
అనుచరుల ఉద్రేకముప్పొంగెను 


34
యుద్దమే చేయగా సిద్ధమైన
అన్నను అనుచరుల ననునయిస్తూ
విజ్ఞుడౌ విభీషణుండపుడు లేచి
కడపటి మాటగా పలికెనిటుల. 

35.
సోదరా!కాలసర్పము జానకి
కోరి ఇటు కౌగిలించుట దేనికి?
బంధువులు చేరకనె యమునిపురికి
మైథిలిని అర్పించు దాశరథికి 



36.
పినతండ్రి మాటలను విని రావణి
భీరుడవు నీవనుచు ఈసడించె
ఇంద్రుణ్ణి గెలిచిన తనముందర
నరులెంత వారనుచు పరిహసించె 

37.
సభలోన రావణుడు  పరుషోక్తుల
తమ్ముణ్ణి నిరసించి తూలనాడె
వంశాన చెడబుట్టినావు నీవు
దాయాది బుద్ధినే చూపినావు 

38.
విభీషణుండా మాట విన్నంతనే
నలుగురు హితులతో నింగి కెగసి
మంచిని మన్నించనట్టి నీవు
త్వరలోనె తగు ఫలిత మందగలవు 

39.
అనుచు తన అన్ననే విడిచి వచ్చె
రాఘవుని పాదాల నాశ్రయించె
అతడిని శంకించి సుగ్రీవుడు
చంపుటే ఉచితమని తాను పలికె 

40.
అది విని రాఘవుడు కపి వీరుల
నిర్ణయము చెప్పమని కోరినంత
తలకొక్క మాటగా చెప్పుచుండ
హనుమంతు డీరీతి పలికినాడు 


 

41.
నీవెంతొ బుద్ధిశాలివి రఘువరా!
చాలడు బృహస్పతి యు నీ ముందర
అయిననూ అడిగావు గనక నన్ను
చెప్పెదను వినుమయ్య నా మాటను 

42.
ముఖములో సౌమ్యతే కానవచ్చె
పలుకులో దుర్బుద్ధి తోచదాయె
నిశ్చయము శుద్ధాంతరంగు డితడు
మది నమ్మి చేపట్టు టుచితమగును 

43
ఆ మాటలాలించి రఘురాముడు
చిరునవ్వు చిలుకుతూ పలికె తాను
హనుమతో ఏకీభవింతు నేను
శరణార్థి నెన్నడూ విడువబోను 

44
అనుచు తన నిశ్చయము వెల్లడించె
అతనిని చేపట్ట మది దలంచె
స్నేహాన చేకొని అభయమిచ్చె
రాజునే చేతునని మాట ఇచ్చె 

45
తమ్ముని పుణ్య జలములు కొనితెమ్మని
తన వైరి తమ్ముని రాజు జేసె
శత్రువును వధియించ సాయపడగా
విభీషణుండావేళ ప్రతిన జేసె 



46.
శ్రీరామ!వరగర్వి దశకంఠుడు
లోకాన సర్వులకు అనవధ్యుడు
యుద్ధాన ఇంద్రుడికి ప్రతియోధుడు
దశకోటి‌ సహస్రమౌ సైన్యయుతుడు 

47.
అనుచు‌ విభీషణుడు  చెప్పుచుండ
అడ్డుపడి హనుమాదు లడిగిరిటుల
వానరుల సైన్యమీ సాగరాన్ని
దాటగల మార్గమ్ము కలదా యని 

48.
సాగరము దాటగల అనువేమిటో
చెప్పెనిటు అసురుని అనుజుడపుడు
ఇక్ష్వాకువంశజుల దీ సాగరం
ఇక్ష్వాకు వర్థనున కిది సాధ్యము 

49
.ఆ పలుకు లాలించి రఘువీరుడు
ధ్యానియై సాగరుని శరణువేడె
భక్తితో మూణ్ణాళ్ళు పూజించినా
సాగరుడు వరమీని కఠినుడాయె 

50.
అదిగని అలవిమీరిన క్రోధము
అలముకొని అణువణువు కంపించగా
తన కనులు అరుణవర్ణము దాల్చగా
రాముడు అర్ణవముపై అలిగెను 



51.
రౌద్రమ్ము మదిలోన రగులుకొనగ
విల్లంది చేసెనిటు ప్రతిన తాను
అసమర్థుడని ఇతడు నన్నెంచెనో!
ఇంకించి నా ప్రజ్ఞ చూపింతును 

52
అని పలికి అగ్నిలా ప్రజ్వరిల్లి
సంధించి నిలువగా బ్రహ్మాస్త్రము
మేరువున ఉదయించు సూర్యుడల్లే
సాగరుడు దిగివచ్చి మోకరిల్లె 

53
వినయాన మొక్కెను కడలిరేడు
అదిగని శాంతించె శ్రీ రాముడు
తానెక్కుపెట్టిన బాణమ్మును
ఏ దిక్కు విడవాలి చెప్పుమనెను 

54
శ్రీ రామ!ఉత్తరపు తీరమ్ములో
దస్యుల పీడనే వదిలించుమా!
అని పలికి సాగరుడు అర్థించగా
రాముడు ఆమాట చెల్లించెను 

55.
సంతృప్తి చెందిన సాగరుండు
కడలికి వారధిని కట్టుమనెను
నలుడు విశ్వకర్మకు తనయుడు
సులువుగా ఈ పనిని చేయగలడు 



56.
నా మీద సేతువును నిర్మించుము
ఆ మీద భరియింతు నేననుచును
అదృశ్య మైనాడు సాగరుండు
ఆజ్ఞ నిడె నలునికి శ్రీ రాముడు 

57.
పెకలించి వృక్షాలు పర్వతాలు
ఆ ఋక్ష వానరులు తెచ్చివ్వగా
దీక్షతో పూనుకొని నలుడు తాను
నిర్మించె సేతువును నేర్పుగాను 

58
శత యోజనములున్న సాగరాన
పాపిడి తానేమొ అన నిలిచిన
వారధిని తిలకించి అబ్బురమున
అందరూ తెలిపిరి అభినందన. 

59.
పిదప ఆ సమయాన లంకలోన
ఎన్నొ అపశకునాలు పొడసూపగా
ఆ తీరు గమనించి రఘు వీరుడు
దాడి కదె సమయమని‌ నిర్ణయించె 

60.
సౌమిత్రి సహితుడై శ్రీ రాముడు
సేనకు అగ్రభాగాన నడువ
కపిసేన లంకాభిముఖముగాను
జయఘోష చేయుచు కదిలె తాను 



61.
ఈ వార్త తెలుసుకొని లంకేశుడు
శత్రువుల బలమేమి?తంత్రమేమి?
గూఢముగ గ్రహియించి రారమ్మని
పంపించినాడు శుకసారణులని 

62.
కపిరూపధారులై కపిసేనలో
కలగలిసి గుట్టుగా తిరిగి వారు
లెక్కకే రానట్టి సేనజూచి
మిక్కిలి అచ్చెరువు నొందినారు 

63
విభీషణుండిది తాను గమనించెను
మాయను ఛేదించి బంధించెను
కొనితెచ్చి రామునకు చూపించెను
కని స్వామి వారినే కరుణించెను 

64.
చిరునవ్వు చిందించి శ్రీ రాముడు
లంకకు తుది ఘడియలొచ్చెననెడు
సందేశమందించి విడిచినంత
వారేగి చెప్పిరిటు ప్రభువుచెంత. 

65
లెక్కింపరానిదా కపి సైన్యము
రాముణ్ణి గెలుచుటది దుస్సాధ్యము
వైరాన్ని విడుచుటే శుభదాయకం
వైదేహి నొసగుటే హిత కారకం 



66.
అని హితవు పలికిన వారిపైన
కోపించి లంకేశు డటుపిమ్మట
విద్యుజ్జిహ్వుడను మాయావిచే
రాముని శిరసొకటి కల్పించెను 

67.
ఆ తలను చూపించి సీతమ్మను
భీతిల్లజేసె నా కఠినాత్ముడు
ప్రాణపతి దుర్గతిని తలచి తలచి
భూమిసుత దుఃఖాన పలవరించె 

68.
పసినాడె జరిగె మన పరిణయమ్ము
జతబాయనని చేసి వాగ్దానము
నేడిట్లు దయమాలి విడిచినావా! నాథ!నన్ననాథను చేసినావా! 

69
అని కంట కన్నీటి వరదపొంగ
మింటికి మంటికి ఏకధారై
విలపించు సీతగని ఊరడించి
సరమ అను రాక్షసి పలికెనిటుల. 

70
ఓయమ్మ!ఊరడిల్లి యుండుమా!
కల్లలివి తేరుకొని కలత విడుమా!
మోగేటి రణభేరి నాలకించు
నీ విభుడు విజయుడై నిను గ్రహించు 



71.
ఇదె మీదు ఇలవేల్పు ఈ సూర్యుడు
ప్రత్యక్ష దైవమ్ము లోకాలకు
భక్తితో ధ్యానించు శుభము కలుగు
భర్తతో సుఖియించు వరమునొసగు 

72.
ఆ సరమ పలుకులను విన్న సీత
ఆశతో దుఃఖాన్ని నిగ్రహించె
త్వరలోనె తనపతిని చేరగలను
అని తలచి మదిలోని కలత వీడె

73.
అచట ఆ రావణుని సభలోపల
కైకసికి పినతండ్రి యైనవాడు
మాల్యవంతుడు లంకేశు తాతగారు
మనవడికి హితవిట్లు పలికినాడు 




74.
నా మాట ‌లాలించు ఓ రావణా!
నరులచే వానరుల చేతనీకు
ముప్పున్నదని మదిని గ్రహియించుమా!
రామునితొ సంధికై యత్నించుమా! 

75.
సీతనిడి రాముణ్ణి శరణుకోరు
కులమెల్ల క్షేమమ్మునంది తీరు
అని తాత మనవడికి హితవుపలికె
లంకేశు డతనిపై మండిపడియె 


76.
యుద్ధమే చేయగా నిశ్చయించె
లంకనే రక్షించ ఆజ్ఞ లొసగె
నగరపు నాలుగు ద్వారాలను
కాపాడ వీరులను అచట నిలిపె 

77
తూరుపు ద్వారాన ప్రహస్తుడు
దక్షిణము కాచు మహాపార్శ్వుడు
పశ్చిమము రక్షించు నింద్రజిత్తు
ఉత్తరము వైపు నే నిలిచియుందు 

78.
గుల్మమును రక్షించుకొను బాధ్యత
మన విరూపాక్షుడే నెరవేర్చును
సాగరము దాటిన శ్రీ రాముడు
ఇటనుండి వెనుదిరిగి పోజాలడు 

79.
అని ప్రతిన బూనెను లంకేశుడు
హితవచన మనునదే చెవిబెట్టడు
మృత్యువుచె ప్రేరితుండా అసురుడు
మరణాన్ని వరియించు మతిహీనుడు 

80.
 రాఘవుడు సైతము ఆ వేళలో
లంకను గెలిచేటి విధము తెలియ
వీరులతొ విషయాలు చర్చించెను
ప్రతివీరులను తాను నియమించెను 



81.
తూర్పుదిక్కున కాచుకొను మన నీలుడు
దక్షిణపు భాగాన వాలిసుతుడు
పశ్చిమపు ద్వారాన హనుమంతుడు
గుల్మమును రక్షించు సుగ్రీవుడు 

82
సౌమిత్రితోగూడి నేను చేరి
ఉత్తరపు ద్వారాన్ని ముట్టడింతు
లోకాల పీడించు గర్వాంధుని
వధియించు సమయమిదె వచ్చె నేడు 

83.
విభీషణా! నేను మరి సౌమిత్రియు
నీవును నీ  మంత్రులీ నలుగురు
అనిలోన మనమేడుగురము తప్ప
ఇంకెవరు నరరూపు దాల్చరాదు 

84.
అనుచు వ్యూహమ్మునే రచియించెను
సువేల గిరిపైకి చేరుకొనెను
అటనుండి కనిపించె‌ లంకాపురం
రావణుడు కూర్చున్న దివ్యభవనం 

85.
సుగ్రీవుడది గాంచి‌ క్షణములోన
రావణుని చెంతకే‌ ఎగిరివెళ్ళి
అసురుని మకుటాన్ని నేల‌‌విసిరి
అతనితో మల్లయుద్ధము‌ చేసెను 



86.
కనురెప్పపాటులో తిరిగివచ్చి
తనచెంత నిలిచిన కపివీరుని
సాహసము తగదంచు మందలించి
శౌర్యాన్ని దాశరథి ప్రస్తుతించె 

87.
 మరునాటి సూర్యోదయము నందు
లంకలో చొరబారె రామదండు
నీతివిదుడైన శ్రీరాముడనుప
దూతగా వెళ్ళినా డంగదుండు 

88.
బ్రహ్మ వరములు పొంది విర్రవీగి
లోకాల పీడించినావు నీవు
ఆ పాప ఫలమునే అనుభవించ
నా చేత మరణమే నీకు‌ శిక్ష. 

89.
అనుచు  శ్రీరాము డంపిన సందేశమే
సభలోన అంగదుడు వినిపించెను
రావణుని ప్రాసాద శిఖరమ్మును
కూల్చి తను‌ సింహనాదము చేసెను 

90.
తొలిసారి ఖిన్నుడై రావణుండు
అపశకునమని‌ దాన్ని తలచినాడు
విరిగిన శిఖరాన దశకంఠుడు
తన ‌ఆత్మ నాశనము గాంచినాడు 



91.
 మహా వానర సైన్యమే సన్నద్ధమై
జయజయ ధ్వానాలు మిన్నంటగా
లంకాపురి ప్రాకార ద్వారాలను
ఉత్సాహముప్పొంగ ముట్టడించె 

92.
పర్వతపు శిఖరాలు ,బండరాళ్ళు
 వృక్షాల నవలీల పెళ్ళగించి
తమ ఆయుధాలనగ కపిసైన్యము
నలుదిశల లంకనే చుట్టుముట్టె 

93
సంకులపు సమరమే మొదలాయెను
నెత్తురే యేరులై ప్రవహించెను
జయనాద మొకసారి వినిపించును
హాహాకారమ్ము లంతలో చెలరేగును 

94.
హనుమయ్య జంబుమాలిని‌ చంపెను
నీలుడు నికుంభుని వధియించెను
ద్వివిదుడు అశనిప్రభుని ద్రుంచె
 విద్యున్మాలిని సుషేణు డేసె 

95.
నెత్తుటి ముద్దలౌ దేహాలతో
హత శేషులైనట్టి అసురులంతా
శూరులౌ వానరుల గెలువలేక
సూర్యాస్తమయమునే కాంక్షించిరి 



96.
మెల్లగా సూర్యాస్తమయమయ్యెను
ఇక నిశాయుద్ధమే మొదలయ్యెను
రాక్షసుల శక్తియే ఇనుమడించె
రణభూమి మరుభూమి వలెనె తోచె 

97.
అంగదుడి ధాటికే నిలువలేక
రణుభూమి వీడిన ఇంద్రజిత్తు
అదృశ్య రూపుడై నింగి నిలిచి
కూటయుద్ధమ్మునే‌ మొదలుపెట్టె 

98.
నాగాస్త్ర మట నుండి సంధించెను
శ్రీరామ లక్ష్మణుల బంధించెను
పదునైన బాణాలు గుప్పించెను
ఇరువురిని నిలువెల్ల నొప్పించెను 

99.
ముందుగా దాశరథి మూర్ఛపోయె
అదిగని సౌమిత్రి కూలిపోయె
మరణించిరని తలచి ఇంద్రజిత్తు
ఆ వార్త తండ్రికే తెలియజేసె 

100.
త్రిజటను పిలిపించి రావణుండు
సీతను గొనిపోయి రణభూమికి
శ్రీ రామ లక్ష్మణుల దేహాలను
చూపించి తెమ్మనుచు ఆజ్ఞ నిడెను 



101
త్రిజట పుష్పకముపై‌ సీతను
రణస్థలికి గొనిపోయి చూపించగా
నిశ్చేష్టులై ఉన్న వారి గాంచి
నిహతులని భావించి సీత యేడ్చె 

102.
శోకాన తల్లడిలిపోతున్న సీతమ్మను 
ఆ త్రిజట స్నేహాన ఊరడించె
నీ భర్త మరణించలేదు తల్లీ
దానికి ఋజువిదే ఆలకించు 

103.
మహిమగలిగిన దివ్య విమానమ్మిది
ముత్తయిదు స్త్రీ లనే  మోయునమ్మా
కనుకనే దుఃఖాన్ని విడిచిపెట్టు
అనినంత జానకి తెప్పరిల్లె

104.
అంతలో ప్రభంజనమే వీచెను
గరుత్మంతుడటకు దిగివచ్చెను
అతని గని అస్త్రబంధము వీడెను
ఖగరాజు దాశరథులకు మొక్కెను 

105.
పిదప తన చేతితో మెలమెల్లగా
ఇరువురి దేహాలు తాకినంత
ఉత్సాహవంతులై మేల్కాంచిరి
ఎవరీతడను రీతి అతని గనిరి 



106.
నేను నీ  మిత్రుడను ఖగరాజును
స్వామీ !బహిఃప్రాణాన్ని నీకు నేను
నా మైత్రి కారణము యోచించకు
త్వరలోనె అవగతమ్మగును నీకు 

107.
రాక్షసులు చేయరు ఋజు యుద్ధము
జాగ్రత్తపడుట మీ కవసరమ్ము
నీకింక జయమగును అని పలుకుతూ
గరుడుడు వినువీధి కెగిరిపోయె 

108.
అది తెలిసి చింతించి రావణుండు
ధూమ్రాక్షు డనువాని పంపించెను
గాడిదల రథమెక్కి వచ్చివాడు
హనుమయ్య చేతిలో హతుడయ్యెను 

109
వజ్రదంష్ట్రుడను రాక్షసుండు
అంగదుని చేతిలో అంతమొందె
ఆ పిదప‌ అకంపనుడొచ్చెను
బాణాల‌ వానరుల ముంచెత్తెను 


110
అదనునే గమనించి హనుమంతుడు
మహా సాల వృక్షమ్ము చేతదాల్చి
అకంపనుడి తలపైన మోదినాడు
తక్షణమె వాడు మరణించినాడు. 



111.
భయక్రోధ భావాలు అలముకొనగా
మంత్రులతొ యోచించి దశకంఠుడు
అత్యధిక సేనతో ప్రహస్తుని
పోరుకై రణభూమి కంపినాడు 

112.
నేర్పుతో యుద్ధమ్ము చేసి యతడు
కపివీరులెందరినొ చంపినాడు
రణభూమి నెత్తుటి నదిగ మారి
యముడనే సాగరము వైపు సాగె 

113
నిలువెల్ల నెత్తుటి ముద్ద అయిన
నీలుడు క్రోధమ్ము నాపలేక
మహాశిల నొకదాన్ని విసిరినాడు
తలపగిలి మరణించె ప్రహస్తుడు 

114
ఇంద్రుణ్ణి సైతము భయపెట్టిన
సేనాని ప్రహస్తుని మరణవార్త
తెలుసుకుని కంపించి లంకేశుడు
స్వయముగా పోరుకై పోయినాడు 

115
రణభూమి రావణుని గని రాముడు
అచ్చెరువు‌పొందె నా తేజస్సుకు
సొమిత్రి సహితుడై వెనువెంటనే
పగదీర్ప విల్లంది సంధించెను 



116.
కపిసేన చీల్చుకుని రావణుండు
బాణాల వాననే కురిపించుతూ
చొరబడి వానరుల ‌చెదరగొట్టె
రాక్షసుల జయఘోష మిన్నుముట్టె 

117.
సుగ్రీవు డెదిరించి మూర్ఛపోయె
మారుతి సైతము మతిదప్పెను
నీలుడు పోరాడి స్పృహతప్పెను
అదిగని సౌమిత్రి తలపడియెను 

118.
లక్ష్మణుని శరలాఘవమ్ము గాంచి
రావణుడు ఆశ్చర్య చకితుడయ్యె
తన విల్లు ముక్కలైనందు కలిగి
సౌమిత్రిపై యతడు శక్తి నేసె 

119.
మంత్రించి వదిలిన ఆ ఆయుధం
లక్ష్మణుని వక్షమ్మునే తాకగా
శ్రీ విష్ణు నామాన్ని స్మరణ జేస్తూ
సౌమిత్రి మూర్ఛిల్లి ఒరిగిపోయె 

120.
స్పృహ తప్పి పడియున్న లక్ష్మణుణ్ణి
ఎత్తగా రావణుడు యత్నించెను
అతనికది‌ సాధ్యమ్ము కాకపోయె
అది గని హనుమయ్య కృద్ధుడయ్యె 

121.
వాయువు వేగాన వచ్చి పడియె
 గుండెపై పిడిగుద్దు ఒకటి వేసే 
నెత్తురు కక్కుకొని రావణుండు 
స్పృహ తప్పి నేలపై కూలిపోయే

122.
సౌమిత్రి నెత్తుకొని హనుమంతుడు 
రాముని సన్నిధి కి చేర్చినాడు 
శక్తి తన పట్టునే వదిలివేయ 
క్రమముగా తేరుకొనె లక్ష్మణుండు

123.
స్పృహలోకి వచ్చిన రావణుణ్ణి
ఎదిరించ దాశరథి బయలుదేరె
రథమేమి లేనట్టి ఆ స్వామిని 
తన మూపుపైన ఆ హనుమ మోసె

124.
రామయ్య చేసె ధనుష్ఠంకారము
ఆ రవము ముల్లోకాలందు మ్రోగె
నిలు నిలు రావణా! నీకు మూడె
నిన్నింక రక్షించు వాడు కలడె!

125.
అని పలికి దాశరథి దశకంఠుని 
కోపాన ఎదిరించి నిలువరించె 
హనుమను హింసించు లంకేశుని
రాముడు శరవృష్టి ముంచివేసె

126.
అతని రథ చక్రాలు వెల్లగొడుగు 
ధ్వజమును సారథిని పడగొట్టెను
రావణుని క్షణములో కుప్పకూల్చి 
శరమున మకుటాన్ని నేలరాల్చె

127.
అసురేంద్ర!అలసినట్లుంటివయ్యా!
ఈ స్థితిలో నిను చంపబోను నేను 
విశ్రాంతి తీసుకో ఇల్లు చేరి 
సిద్ధమై రేపురా నేడు వెళ్ళి 

128.
ఉదారమౌ  మాట లాలకించి 
అవమాన భారమ్ము దహియించగా 
రావణుడు లంకకే చేరుకొనెను 
ఆప్తులను పిలిపించి సభ తీర్చెను 

129.
ఫలియించు కాబోలు విధి వాక్యము 
ఈ సీత వేదవతి నిజము సుమ్ము 
అప్సరస,అనరణ్య వరుణ కన్య
నంది,ఉమ, ఋషి వాక్కు నాకు తగిలె

130.
అని పలికి నిదురించు తన తమ్ముడు
కుంభకర్ణుని అనికి లేపమనెను 
ఒక వేయి ఏన్గులతో తొక్కించగా 
ఆ భీకరుండపుడు మేల్కాంచెను

131
ఆరు మాసమ్ములకు ఒక్కరోజు
మేల్కాంచు వరమునే కలిగియున్న 
అతనిని మేల్కొలిపి యూపాక్షుడు
మహరాజు ఆజ్ఞ నే విన్నవించె

132.
సభలోన ఉన్నట్టి తన అన్నను
దర్శించి దండమిడి పలికెనిటుల 
ఓ అన్న నన్నేల పిలిచినావో 
తెల్లముగా తెలుపుమా!వినగోరెద

133
తమ్ముడా!రాముని బాణమ్ములు 
మెరుపులై నామీద కురియుచున్న 
భ్రాంతితో భయమందు చుంటి నేను 
అనిలోన నేనోడి పోయినాను 

134
ఆ మాట లాలించి కుంభకర్ణుడు 
అన్నపై తీవ్రముగా మండిపడియె
ఆనాడు మా హితవు వినవైతివి
ఆ ఫలిత మీనాడు పొందుచుంటివి

135
అయిననూ నిన్ను రక్షింతునేను
సోదరా!వారినిక నిర్జింతును
వీడుమయ్య మదిలోని నీ కలతను
విజయమ్ము చేకూర్చి పెట్టగలను

136.
ఈరీతి అన్నకు అభయమొసగి 
శూలాయుధముదాల్చి అని కేగెను 
వికటాట్టహాసాలు చేసుకుంటూ
విరుచుకుని తినసాగె కపిసేనను

137.
మూర్ఛితుండైనట్టి సుగ్రీవుని 
రక్కసుడు లంకకే గొని పోయెను 
మేల్కొన్న కపిరాజు ఆ అసురుని 
ముకుచెవులు కొరికేసి వెనుదిరిగెను

138
ముద్గరము చేదాల్చి ఆ అసురుడు 
వేగమే రణభూమి తిరిగి చేరె
ఐంద్రాస్త్రమును వేసి శ్రీరాముడు 
కుంభకర్ణుడి శిరసును త్రుంచి వేసె 

139
దేవతలు విరివాన కురిపించిరి 
లంకలో దానవులు శోకించిరి
నగరులో మిగిలిన వీరులందరూ 
వరుసగా యుద్ధానికే ఉరికిరి 

140
నరాంతకు డంగదుడి చేతచచ్చె 
మహోదరుడు నీలుని చేత మడిసె 
హనుమయ్య చెలరేగి రణభూమిలో
త్రిశిరుని శిరసులను తరిగివేసె 

141
లంకేశు తనయుడౌ అతికాయుడు 
రాముని తమ్మునితో పోరు సలిపె 
బ్రహ్మాస్త్రమును వేసి లక్ష్మణుండు 
అసురుణ్ణి భస్మమ్ము చేసి వేసె 

142
ఈవార్త తెలుసుకొని ఇంద్రజిత్తు
మంత్రించి రథమును అస్త్రాలను 
అదృశ్య రూపుడై నింగి నిలిచి 
భీకరపు యుద్ధమ్ము సాగించెను

143
సమ్మోహకమ్మయిన బ్రహ్మాస్త్రము 
సంధించి ఆతడా సాయంత్రము
విడువగా విగతులై త్రుళ్ళిరట్లు
వానరులు అరువది ఏడు కోట్లు 

144
బ్రహ్మాస్త్ర శక్తినే మన్నించగా 
మూర్ఛిల్లినట్లుగా నటియించిన 
హనుమయు విభీషణుం డపుడు లేచి
రణభూమి కాగడాలతో వెదకిరి 

145
ఒకచోట పడి ఉన్న వృద్ధమూర్తి 
జాంబవంతు డీరీతి పలికినాడు 
హనుమయ్య జీవించి ఉన్న చాలు 
అందరూ జీవించి ఉన్నయట్లే 

146
ఆ మాట విన్నట్టి హనుమంతుడు 
భల్లూకరాజుకు మ్రొక్కి నిలువ 
నాయనా!సర్వ వానర వీరుల 
బ్రతికించు బాధ్యతను చేపట్టుమా!

147
చేరుకో హిమాలయ పర్వతం
కనిపించునచట కైలాస శిఖరం
సర్వ ఓషధులకు అది నిలయము 
దశదిశలు చిందునవి కాంతివలయం 

148
సౌవర్ణ్య సంధాన విశల్యకరణి 
మృతసంజీవనియు ఉండునచట 
అవి తెచ్చి బ్రతికించు వానరులను
అనగానె చలిమలకు హనుమ చేరె 

149
అర్థిని కనినంత లతలన్నియు 
అదృశ్య మైపోవ అలిగి హనుమ 
రాముని స్మరియించి శిఖరమ్మునే 
అవలీలగా ఎత్తి ‌ప్రభుని చేరె

150
ఓషధుల పరిమళాలు సోకగానే 
అలసిన యోధులు తేరుకొనిరి 
తనువుల గాయాలు మాయమయ్యె 
మృతులైన వానరులు జీవించిరి

151
ప్రతిరోజు మృతిచెందు అసురాళిని 
కడలిలో విసరమని దశకంఠుడు
నియమమ్ము నేర్పరచి నీటగలుప 
రణభూమి రాక్షసుల జాడలేదు
 
152
కపులతో సుగ్రీవుడటు పిమ్మట 
ఆ రాత్రి లంకపై దాడిచేయ 
వ్యూహమ్ము రచియించి నడిపించెను 
పురికాల్చి రక్కసుల హతమార్చెను 

153
ఇది తెలిసి మండిపడి లంకేశుడు
మిగిలిన వీరులను పంపించెను 
సంగ్రామ సింహులౌ ఆ వీరులు 
ఒకరొకరే ఈరీతి మరణించిరి

154
కంపనుడు మరియొకడు ప్రజంఘుడు
అంగదుని చేతిలో చచ్చినారు 
ద్వివిదుని చేచచ్చె యూపాక్షుడు
శోణితాక్షుని  మైందుడు చంపినాడు

155
కుంభుణ్ణి హతమార్చె సుగ్రీవుడు 
నికుంభుని నిర్జించె హనుమంతుడు 
పావకాస్త్రము విడువగా శ్రీరాముడు 
యమపురికి చేరుకొనె మకరాక్షుడు 

156
చంపుదును నే రామలక్ష్మణులను
భూమిని నిర్వానరము చేతును 
అని ప్రతిన చేయుచు ఇంద్రజిత్తు 
గుర్రాల రథమెక్కి అని కేగెను

157
అదృశ్య రూపుడై ఆకసాన 
నిలబడి కురిపించ బాణవృష్టి 
కోపించి సౌమిత్రి తన అన్నను 
బ్రహ్మాస్త్రమును వేయ ఆజ్ఞ వేడె 

158
దాశరథి తమ్ముణ్ణి అనునయించి 
ధర్మమ్ము నీరీతి విశదపరచె 
సోదరా!నీకింత కోపమేల?
ఒకరికై సర్వులను చంపనేల?

159
పరుగెత్తు భీరువుని ప్రమత్తుని 
మ్రొక్కిడిన వానిని ప్రచ్ఛన్నుని 
శరణన్న వాడిని చంపరాదు 
నీవంటి వారికది మర్యాదకాదు 

160
ఏ మూలలో వీడు దాగి ఉన్నా
వెంటాడి చంపగల దివ్యాస్త్రము
ప్రయోగింపగలనయ్య నేనిప్పుడే 
అనుట విని రావణి పారిపోయి

161
మాయా సీత రూపొకటి కల్పించెను
రథముపై తెచ్చి యట హింసించెను
సిగబట్టి ఎల్లరూ చూస్తుండగా 
ఆ తనువు రెండుగా ఖండించెను

162
అది గని వెనుదిరిగె కపిసేనలు 
అది విని మూర్ఛిల్లె శ్రీరాముడు 
రాముణ్ణి ఓదార్చి విభీషణుండు 
వాస్తవము తెలియమని తెలిపెనిట్లు
 
163
మిత్రమా‌! నాకెరుకె రాజు మనసు
సీత దరికెవరినీ పోనీయడు 
ఇది యెల్ల ఇంద్రజీ మాయ సుమ్ము 
త్వరపడి వధియించ పూనుకొనుము

164
నికుంభిలను హోమమ్ము చేయు వేళ 
నిను చేరి ఆటంక పరచు వాడే
నీ మృత్యు వగునంచు బ్రహ్మ పలికె 
అతడిని చంపగల సమయమిదియె

165
నా వెంట పంపించు సౌమిత్రిని
అని వేడి లక్ష్మణుని తీసుకెళ్ళి విఘ్నమ్ము కలిగించె హోమానికి
రావణి వచ్చెను యుద్ధానికి 

166
సౌమిత్రి హనుమయ్య మూపునెక్కి
మూణ్ణాళ్ళు రావణితో పోరుసలిపి 
శుభవీక్షణాలతో సురలు చూడ 
మనసులో ధ్యానించె తన అన్నని

167
ఇనవంశ తిలకుడౌ శ్రీరాముడే 
సత్యాన్ని ధర్మాన్ని తప్పకుంటే 
చంపునీ అస్త్రమ్ము అసురుననుచు 
మంత్రించి విడిచెను ఐంద్రాస్త్రము

168
చల్లారిపోయిన అగ్ని వోలె 
కిరణాలు అణగిన సూర్యుడల్లే 
అస్త్రాన మరణించె ఇంద్రజిత్తు 
రణభూమి రాలిపడె అతని శిరసు

169.
దేవతల మునివరుల ఆశీస్సులు 
అందుకొని లక్ష్మణుడు తనకు మ్రొక్క 
తమ్ముణ్ణి ముద్దాడి శ్రీరాముడు
ఉపచార మందించి సేదదీర్చె 

170
ప్రియతనయుడైనట్టి ఇంద్రజిత్తు 
మరణమ్ము రావణుని కలచివేసె 
సీతను వధియించ సమకట్టెను 
సుపార్శ్వు డతని మతి మళ్ళించెను

172
మిగిలిన సైన్యాలు కూడగట్టి
రావణుడు వచ్చెను యుద్ధానికి 
ఎదిరించి రాఘవుడు అసురాళిని
ముంచెత్తి వేసెను శరవృష్టిని

172
పంచభూతాల నుండు పరమాత్ముని 
పామరులు గుర్తించలేనట్లుగా 
బాణాలనే తప్ప శ్రీరాముని
కనలేకపోయిరా వేగానికి 

173
దాశరథి వీరవహారమ్ము చేసి
అందరి మన్ననలు అందుకొనుచు 
ఈశ్వరుని కున్నట్టి అస్త్రబలము 
తనకునూ కలదంచు ప్రకటించెను 

174
మహోదర మహాపార్శ్వ విరూపాక్షులు
లంకేశు సైన్యాధిపతులు వారు
సుగ్రీవు నెదిరించి పోరాడిరి 
వారతని చేతిలో అంతమైరి 

175
రణభూమి రామలక్ష్మణుల ఎదుట 
నిలుచున్న రావణాసురుని చూడ 
సూర్యుని చంద్రుని ఎట్ట ఎదుట
నిలుచున్న రాహువే అనిపించెను 

176
భయభ్రాంతమై పంచ భూతమ్ములు 
అని మాని రాక్షసులు కపిసేనలు 
నిశ్చేష్టులై నిలిచి చూచినారు 
శ్రీరామ రావణుల యుద్ధమ్మును 

177
ఆగ్రహము మితిమీర లంకేశుడు 
సౌమిత్రి పై తనదు శక్తినేసె 
దానితో లక్ష్మణుడు మూర్ఛపోయె
అదిగని దాశరథి ఉగ్రుడయ్యె

178
అరావణమ్మో లేక అరామమో 
ఈభూమి కాగలదు ఈనాటితో 
కపులార!తొలగండి మీరెల్లరూ
రామత్వమేమిటో నే చూపెద

179
అని ప్రతిన చేసిన శ్రీరాముడు
ప్రళయ ఝంఝా మారుతమై చెలగగా 
లంకేశు డా ధాటి కాగలేక 
భీరువై లంకకే పారిపోయె 

180
నిశ్చేష్టుడై ఉన్న సౌమిత్రి ని
చూసిన దాశరథి గుండె చెదిరె 
నా తమ్ముడే నాకు లేకున్నచో 
ఈ జీవితము ఇంక వ్యర్థమనియె
181
భార్యలు లభియింతు రెచటనైనా
బంధువులు దొరుకుదురు ఎక్కడైనా 
రక్తాన్ని పంచుకొను సహజన్ముడు
మరియొకడు ఎన్నటికీ దొరకబోడు 

182
ఈ యుద్ధమేల? ఇక రాజ్యమేల ?
వైదేహి ఏల? నా ప్రాణమేల ?
అని దుఃఖ పడుతున్న దాశరథి కి
ఉపశాంతి నివ్వగా కపివైద్యుడు

183
సుషేణుడావేళ ప్రభుని చేరి
అనునయపు వాక్యాలు పలికెనిట్లు
మరణించలేదు మన లక్ష్మణుండు
దుఃఖించ పనిలేదు ఊరడిల్లు 

184
అని పలికి హనుమనే చేరబిలిచి 
లక్ష్మణుని రక్షింప సంజీవని 
తెమ్మనగ నగమునే ఆ మారుతి 
మరియొక్క మారు తను తీసుకొచ్చే

185
విశల్య కరణితో లక్ష్మణుండు 
పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యె
గగనాన సూర్యాస్తమయములోపూ 
రావణుని చంపమని అన్ననడిగె 

186.
వేరొక్క రథమెక్కి లంకేశుడు
యుద్ధమే చేయగా మరలవచ్చె 
మాతలి సారథిగ దివ్యరథము 
 రామునకు దేవేంద్రు డంపించెను

187
పది తలలు ఇరువది బాహువులను 
ధరియించి రావణుండను రాహువు
శ్రీరామ చంద్రుణ్ణి గ్రసియించెను
విడిపించుకొని స్వామి చెలరేగెను

188
అలసిన రావణుని కాచేందుకు
సారథి  రణభూమి తప్పించెను
అగస్త్య మౌని ఆ తరుణమ్ములో
దాశరథి చెంతకే చేరవచ్చె

189
శత్రువును త్రుంచగా చింత తీరగా 
ఆయువును పెంచగా శుభము కూర్చగా 
ఆదిత్య హృదయమను మంత్రమ్మును 
ఉపదేశమొనరించె అగస్త్య మౌని 

190
శ్రీరామభద్రుడా!ఈ మంత్రము 
ముమ్మారు జపియించు శౌచమ్ముతో
అనుట విని రాముడటులాచరించె 
రామరావణ యుద్ధ మారంభమాయె 

191
నింగికి సాటియన నింగి యౌను
కడలికి సాటియన కడలియౌను
రామరావణ పోరుకీ యవనిలోన 
రామరావణ యుద్ధమే సాటియౌను

192
అని సకల దేవతలు కీర్తించగా 
దాశరథి దశకంఠు శిరసు ద్రుంచె 
క్షణములో ఆ శిరసు తిరిగి మొలిచె
ఒక వందమారులది యటుల జరిగె 

193
అదిచూసి రాముని రథసారథి
మాతలి ఈరీతి బోధించెను
శ్రీరామ!తెలియనట్లుంటివేమి?
బ్రహ్మాస్త్రమును వేసి చంపవేమి?

194
అదివిని వెంటనే రఘువీరుడు
స్మరియించి సంధించె బ్రహ్మాస్త్రము
నాటెనది రావణుని గుండెలోన 
అతని ప్రాణాలతో జొచ్చె భూమిలోన
 
195
అమితమౌ బలశాలి తపశ్శాలి 
 మహా తేజస్వియును నీతివిదుడు
అయినట్టి రావణబ్రహ్మ చరిత 
ముగిసెనిటు శ్రీరామ ప్రభువు చేత 

196
సురలోక దుందుభులు మారుమ్రోగె
చల్లగా పరిమళపు గాలివీచె 
దివినుండి కురిసింది పూలవాన 
అందుకొనె రాఘవుడు అభినందన

197
నేలపై రాలిన అన్నదేహం 
కనినంత కట్టతెగె విభీషణుడి శోకం 
సోదరుని దుర్గతికి పరితపించె
పరిపరి విధముల పరితపించె 

198
సకల వేద వేదాంగ వేత్తవీవు 
సోదరా!ఈరీతి రాలినావు 
శ్రీరాముడను సింహ శౌర్యానికి 
మత్తగజమై నేల కూలినావు

199
ఈ నీలమేఘుడను వర్షధార 
ఆర్పెనా చెలగెడు రావణాగ్ని
అని ఎంతో దుఃఖించె విభీషణుడు
అతనిని ఓదార్చె రఘు రాముడు

200
యుద్ధమన వీరులకు సహజధర్మం
గెలుపోటములు మన మెరుగలేము
నీ అగ్రజుడు పొందె వీరమరణం
విలపించుటది నీకు తగదు సుమ్ము 

201
అనునయపు వాక్యాలకు తెప్పరిల్లి
అన్నకు ప్రేతకర్మ లాచరించగా
అనుమతిని కోరె విభీషణుండు 
అంగీకరించెను శ్రీరాముడు 

202
మిత్రమా!మరణమ్ముతో పాటుగా
అణగారిపోవును శత్రుత్వము
మరణించినట్టి ఈ వీరుడిపుడు 
నీకు వలే నాకునూ భ్రాతసముడే

203
అనుచుండ వచ్చినది మండోదరి
దీనాతిదీనయై ఆర్తి తోటి
చూస్తున్న ప్రతివారి గుండె కరగగా 
విలపించి పలవించె నీ రీతిగా 

204
శివ బ్రహ్మలను నాథ ! మెప్పిస్తివి
 కడకు కామోపహతుడవై  మరణిస్తివి
విష్ణువే రాముడని విస్మరించి 
ఈరీతి దుర్గతుల పాలైతివి

205
పంచేంద్రియాలను నిగ్రహించి 
ఒకనాడు నీవెంతో తపము చేయ
పగబట్టెనా ఏమి అన్నట్లుగా 
అవి నేడు నిన్నిట్లు చంపెనేమొ

206
సీతాపహరణమను పిరికి చేష్ట
మన వంశ నాశనపు హేతువయ్యె
హితవాలకించని నీ గర్వము
అది నేడు‌ఇచ్చినది ఈ ఫలితము

207
అని రమణి దుఃఖించి మూర్ఛిల్లెను
రావణునికి ఉత్తరక్రియ లయ్యెను 
మాతలి రథముతో మరలిపోయె 
విభీషణుడు లంకకు ఏలికయ్యె

208
అటుపైన శ్రీరామ చంద్రుడపుడు
తన విజయ వార్తను వైదేహికి 
ఎరిగించి సందేశమును తెమ్మని 
హనుమను సీతదరికి పంపినాడు

209
ఎంత గొప్ప ప్రియవార్త తెచ్చినావు 
ఎనలేని ఆనంద మిచ్చినావు
దీనికేను సరిబహుమతి నీయలేను 
అని సీత హనుమకు మ్రొక్కె తాను

210
శ్రీరామ దర్శనమే తన కోరిక
అను సీత సందేశ మంది విభుడు
సర్వాలంకృతగాను కొని‌తెమ్మని
ఆజ్ఞ యిడి‌ పంపె విభీషణుణ్ణి

211
పతిమాట తలదాల్చి సాధ్వీమణి
పల్లకిలో చేరుకొనె‌ శ్రీరాముని
తెలియని విముఖత దాశరథి లో
అది గని ఒక కలత ప్రతివారిలో 

212
ప్రాణపతిని కనులముందు కాంచగానే
సీతమ్మ దుఃఖమే వరదలయ్యె
ఆమెనుగని దాశరథి పరుషోక్తుల 
పలికెనిట్లు ప్రతిమాట శూలమవ్వగ

213
 పౌరుషాన్ని చాటగా అరిని త్రుంచగా 
అవమానము తీరగా రణము చేసితి
భరియించలేను నీ సముఖమ్మును
శంకించుచుంటి నీదు శీలమ్మును 

214
దీపంపు కాంతిని నేత్రరోగి 
కనలేని విధముగా నిన్ను నేను 
చూడలేకుంటిని తొలగిపొమ్ము
నీ వర్తనమ్ము‌ ఇక నీ ఇష్టము

215
నీ మనసుకు నచ్చినట్టి ఎవరినైనా
చేపట్టు స్వేచ్ఛను నీ కిచ్చుచుంటి 
అను రాముని  వాక్యాలను విన్నసీత 
పలికెనిటు లజ్జయే కాల్చివేయ 

216
రాముడా!జనకుని తనయను నేను
భూసుతను అయోనిజను దివ్య వనితను
నా పాతివ్రత్యము మది నెంచకుండ
ఈరీతి పలికేవు ఇది న్యాయమా!

217
అశక్తురాలనై నేనుండగా
అసురు డపహరించుటది నా దోషమా!
త్రికరణముల శుద్ధిగా నిన్ను కొలిచెడి
నన్నిట్లు పదుగురిలో శంకింతువా !

218
అనుటకు వినుటకు తగనిమాట 
అని కించపరతువ నీ ధర్మపత్నిని
హనుమతో ఈ వార్త పంపి ఉంటే 
ఆనాడె ఈతనువు త్యజియించనా!

219
ఈరీతి పతితోటి పలికి సీత 
సౌమిత్రి వైపు జూచి పలికెనిట్లు
అపవాదును అవమానము నోపలేను
చితిపేర్చు నాయనా!మరణింతును 

220
వదినమ్మ ఆజ్ఞ తో అన్న సైగతో 
చితి పేర్చె సౌమిత్రి దుఃఖమ్ముతో 
రామునకు ప్రదక్షిణము నాచరించి 
అగ్నికి అభిముఖముగా నిలబడి

221
త్రికరణపు శుద్ధితో స్థిరముగాను రాముణ్ణి తప్ప నేను మరి ఎవరినీ
ఎన్నడూ తలపని దాననైతే 
పావకుడు నన్ను రక్షించుగాక!

222
అని ప్రతిన చేయుచూ సాధ్వీమణి 
అగ్నికి ముమ్మారు ప్రదక్షిణించి
ఈ మూడు లోకాలు బెదిరిపోవ 
అగ్నిలో దూకె సీత ఏమి తెగువ 

223
విస్మయము పరమేష్ఠి పరమశివుడు 
అష్ట దిక్పాలకులు అమరేంద్రుడు
దిగివచ్చి అచట ప్రత్యక్షమైరి 
విష్ణువే రాముడని వినుతించిరి 

224
చితినుండి సీతమ్మ తల్లి తోటి 
వెలువడిన అగ్ని యిటుల విన్నవించె 
ఈ సాధ్వి నిరతమ్ము నిన్ను తలచు 
శీలవతి నే ఋజువు స్వీకరించు
 
225
ఆ సకల దేవతల సముఖమ్ములో 
వానరుల రాక్షసుల నివహమ్ములో 
అగ్ని శాసనమ్ము రాము డాలకించి 
ఉప్పొంగి ప్రకటముగా పలికె నిటుల 

226
నా సీత హృదయమ్ము తెలుసు నాకు 
మదిలోన ఎడబాటు లేదు మాకు
తన పాతివ్రత్యాన అగ్నిలోనూ 
రక్షించుకోగలదు తనను‌ తాను 

227
జగతికీ సత్యమ్ము చాటేందుకే 
జానకిని నేనుపేక్ష చేసినాను 
పావనియౌ నా సీతను స్వీకరింతును
అనుట వని ఎల్లవారు ముదమునందిరి 

228
కడువీర కృత్యమును నెరపినట్టి 
తన పుత్రుల కతమున పంక్తిరథుడు 
ఇంద్రలోకము పొంది తరియించెను
దిగివచ్చి తనయులను దీవించెను

229
ఈ మూడు లోకాలను కాచినావు 
వరమునే కోరుకో రామ!నీవు
అని యపుడు ఇంద్రుడే పలికినాడు 
అంజలించి రాముడిట్లడిగినాడు
 
230
నా కొరకై ప్రాణాలు అర్పించిన 
కపివీరులందరిని బ్రతికించుము 
క్షతగాత్రులకు పూర్ణ ఆరోగ్యము 
వారుండు గిరి కానలు ఫల భరితము
 
231
చేయుమని ఈ మూడు వరములడుగ 
దేవేంద్రు డవి తీర్చి‌ వెడలిపోయె 
తక్షణమే భరతుణ్ణి చూడగోరి 
రామయ్య అయోధ్యకు బయలుదేరె 

232
సుగ్రీవుడాదిగా కపిముఖ్యులు
లంకాధిపతియైన విభీషణుండు
సపరివారమై తన వెంటరాగా
భరద్వాజ ఆశ్రమము చేరె రాముడు

233
తమ్మునకు తనదు ఆగమన వార్త
త్రోవలో గుహునకు తన క్షేమము
తెలుపని రామయ్య కబురంపగా
హనుమయ్య  శుభవార్త పోయి వినిచె

234
ప్రియవార్త విన్నంత పరవశాన
భరతుండు పలికెనిటు ఈ తీరున
నూరేళ్ళు జీవించ శ్రమలకోర్చి
శుభవార్త వినవచ్చు ఒకనాటికి

235
అనుచు శత్రుఘ్నుతో కూడి తాను
అన్నకు ఘన స్వాగతమ్మునీయ
సన్నాహ మొనరించె సంబరాన
అంతలో కలకలము అంబరాన

236
పౌరులకు కనిపించె పుష్పకమ్ము
అగుపించె నందులో రాము మోము
నింగిలో నిండు జాబిల్లి వోలే
ఆ మోము గని పురము సంద్రమయ్యె


 237
అన్నకు సాష్టాంగ పడెను భరతుడు
తమ్ముడిని హత్తుకొనెను శ్రీరాముడు
లక్మణుని ప్రేమతో పలుకరించెను
వదిన సీతమ్మకు మ్రొక్కులిడెను

238
మానవుల రూపాన వచ్చినట్టి
కపి ముఖ్యులందరిని పేరుపేరునా
వరుసగా పిలిచి మన్నించె భరతుడు
వారెల్ల సంతోషమంది‌ రప్పుడు

239
సస్నేహభావాన సుగ్రీవుని
హత్తుకొని భరతుడపు డిట్టులనియె
అన్నకీవు ప్రియమెంతొ చేసినావు
నీవు మాకైదవ సోదరుడవు

240
అని పలికి సంతుష్టితో భరతుడు
రామునకు పాదుకలు తొడిగినాడు
పదిరెట్లు పెంచితిని రాజ్యమ్మును
చేకొని ఇక ఏలుకొనుము నీ ప్రజలను

241
సోదరుల మధ్యనున్న  ప్రేమ గాంచి
అచ్చెరువుతో కనులు చెమ్మగిల్ల
రాక్షసులు వానరులు మురిసినారు
భరతాశ్రమానికే చేరినారు

242
శ్రీరామ చంద్రుడపుడు పుష్పకమును
ధనపతిని చేరమనుచు పంపివేసె
అటుపైన పట్టాభిషేకానికి
రాముడు ముదముతో సమ్మతించె

243
మంగళస్నానాలను ఆచరించి
అందరూ అయోధ్యకు చేరుకొనిరి
ఋషిదేవ గంధర్వ యక్షకోటి
రామునకు ఆశీస్సులందించిరి

244
ప్రియతనయుని సందర్శనమ్ముతోటి
కౌసల్య మదిపొంగి కడలి యయ్యె
తల్లులకు పాదాభివందనాలు
చేసి రాముఆ డాశీస్సులందుకొనియె

245
పుణ్యోదకములను తెప్పించగా
వశిష్ఠుడు వేదమ్ము పఠియించగా
సింహాసనమ్మును సిద్ధపరచి
జానకీరాములను కొలువుంచిరి

246
బ్రహ్మయే స్వయముగా నిర్మించిన
పూర్వము మనువు తన తలదాల్చిన
నవరత్న ఖచితమౌ దివ్యమకుటం
వేదోక్త విధితోడ తలనుంచగా

247
అందరీ హృదయాలు పరవశింప
అభిషేకమందుకొనె శ్రీరాముడు
అష్టదిక్పాలకులొచ్చి ఆ‌వేళలో
దివ్యా భరణమ్ములిడి దీవించిరి

248
శత్రుఘ్నుడే పట్టె వెల్లగొడుగు
విభీషణుండును సుగ్రీవుడు
చెరియొక్క వైపున నిలిచి తాము
స్నేహాన వీచిరి వింజామర

249
రాజుగా అలరి ఆ రఘురాముడు
ధనకనక వస్తువులు వాహనములు
తగురీతి ఎల్లరకు కానుకిచ్చె
ముత్యాలహారమ్ము సీతకిచ్చె

250
ఆ మేలి ముత్యాలహారమ్మును
తన కంఠ రత్నాల హారమ్మును
పతి ఆమోదమ్మును పొంది జానకి
ముదముతో హనుమకు కానుకొసగె

251
మారుతి మనసెంతొ పొంగిపోయె ఆనందమాచోట వెల్లువాయె
రాముని వీడ్కొని అతిథులంతా
తమ తావులకు తాము మరలినారు

252
రాముడు లక్ష్మణుని చేరబిలిచి
యువరాజుగా నిన్ను చేతుననియె
వలదని సౌమిత్రి ఆ పదవిని
భరతునకు అర్పించి ధన్యుడాయె

253
రాముని పరిపాలనమ్ములోన
నిత్యకళ్యాణమై నిఖిలజగతి
పచ్చతోరణమల్లె భాసించెను
రామమయమైపోయి రాజిల్లెను

 254
సద్గుణమ్ముల రాశి సత్పురుషుడు
వీరాగ్రగణ్యుడు విఖ్యాతుడు
ధర్మమార్గము నడచు ధన్యజీవి
మేలు మరువనివాడు కృతజ్ఞుడు

255
ఆడితప్పనివాడు సత్యవాది
ధృడమైన సంకల్పమున్నవాడు
సదాచారములందు సంపన్నుడు
సర్వప్రాణుల హితము కోరువాడు

256
సకలశాస్త్రములందు విద్వాంసుడు
సర్వకార్యములందు నిష్ణాతుడు
ఎల్లరకు సంతోషమిచ్చువాడు
ధైర్యాన్ని ఎన్నడూ సడలనీడు

257
క్రోధాన్ని తన దరికి చేరనీడు
తేజస్సు తో నిండి ఒప్పువాడు
మాత్సర్యమే లేని స్నేహశీలి
దేవగణములకైన అజేయుడు

258
పదహారు కళలున్న చలువరేడు
పదహారు శుభలక్షణాల రేడు
శ్రీరామ చంద్రుని ఏలుబడిలో
జీవించు ప్రజలెంత ధన్యాత్ములో

259
కరువులూ కాటకములన్న వెరుగక
దుఃఖమూ కష్టమంటే తెలియక
జనులెల్ల సుఖియించ రాజ్యమ్మును
చిరకాల మా ప్రభువు పాలించెను

 260
తలిదండ్రులను కొలుచు విధమెట్టిది
గురువులను సేవించు విధమెట్టిది
తమ్ములను లాలించు విధమెట్టిది
ప్రియసతిని ప్రేమించు విధమెట్టిది

261
ఆశ్రితులను రక్షించు విధమెట్టిది
అసురులను శిక్షించు విధమెట్టిది
మిత్రులను మన్నించు విధమెట్టిది
పౌరులను పాలించు విధమెట్టిది

262
తెలియవలె నన్నచో ఆ విధమును
తెలుసుకోవలెను శ్రీరామ కథను
మానవుడు మహనీయుడగు విధమును
మహిలోన శ్రీరామ కథచాటును

263
రాముని చరితమే రమ్యమౌను
రాముని నామమే మంత్రమౌను
రాముని హృదయమే రాగమౌను
రాముని రూపమే ధర్మమౌను

264
మందస్మితమ్ము శ్రీరామవదనం
మధురాతి మధురము రామనామం
భవజలధి తారకం రామ మంత్రం
కైవల్య దాయకం రామచరణం

265
దశరథుడు కలవరించిన నామము
ధరణిసుత మరువని ప్రియనామము
హనమ మది నెలకొన్న శుభనామము
అవనికి శ్రీకరము హరినామము 
అవనికి శ్రీకరము హరినామము
అవనికి శ్రీకరము హరినామము

గేయ రామాయణం సంపూర్ణం

Comments

Popular posts from this blog

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ