13.పద్య స్పందన




🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

         పద్య స్పందన

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

.*భీష్మ ఏకాదశి* సందర్భంగా

1.*పితామహా! నమోస్తు* 

1.*సీ.*
పరమపావనియైన సురగంగ గర్భాన
...జనియించి నట్టి యో!శాంతనవుడ!
తండ్రి కొరకు నీవు త్యజియించి సుఖమెల్ల
...భీష్మించి తమ్ముల పెద్దజేసి
అనుజుల తనయులన్ కనురెప్ప వలె సాకి
...సామ్రాజ్యమర్పించి సంతసించి
మనుమల మధ్యన మచ్చరములు మాప
...వసుధను విభజించి పంచియిచ్చి

*ఆ.వె.*
సభను జరుగుతున్న రభస కనులజూచి
మనుమరాలి గతికి మనసు చెదిరి
ముదిమివయసులోన కదనము చేయుచు
నంపశయ్య మీద అలసి వ్రాలి

*2.సీ.*
చేసినట్టి ప్రతిన త్రోసిరాజనలేక
...దేవర న్యాయమున్ ధిక్కరించి
నమ్మిన ధర్మమున్  వమ్ము చేయగలేక
... గురువు భార్గవు తోడ దురము సలిపి
 మానిని ద్రౌపది దీనత గనలేక
...ధార్తరాష్ట్రుల ధూర్తత కెద నల్గి
రారాజు దూషణల్ రణభూమి వినలేక
...అంపశయ్యను కోరి ఆశ్రయించి

*ఆ.వె*
విక్రమించి  హరిని చక్రము పట్టించి
వేయి పేర్ల నతని వినుతి జేసి
ధర్మజునకు శాస్త్ర మర్మమ్ము లెఱిగించి 
వెలయు  భీష్మ! నిన్ను వినుతి జేతు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.2.2023
[20/11, 11:20 am] Guruvugaru: 
2.సంధ్యావందనం 
కం.
చేయగ సంధ్యావందన 
మాయువు నారోగ్య భాగ్య మమరును, విధిగా 
గాయత్రీ మంత్రముతో 
పాయక పాటించు వాని వర్ఛసు గనరే!🙏🙏🙏
[22/11, 5:31 am] Guruvugaru: 

3.*పంచవటికి ఏడాది ఉత్సవం*

సీసం+ఆటవెలది 

*పం* డుగ యీనాడె వచ్చె పంచవటికి 
*చ* ప్పున గడచిన దప్పుడె యొక 
*వ* త్సర మిటు  గురువర్యులు తమ    వాక్ప
*టి* మను సాధకుల లోపములను
*కి* నియక సరిదిద్ద యనవరతము, జారి
*యే* మర తగదింక నీమములను
*డా* బును చూపకుండగ నమ్మకముతోడ 
*ది* నదినమ్ము నడచుకొనుటె చాలు

*ఉ* ల్లమునకు వచ్చు నుత్సాహమనగ ను
*త్స* వము చేయ నిటకు సంతసమున
*వ* చ్చి చేరుకొన్న వారిదే భాగ్యము
*ము* రిసి పోదమింక మూడునాళ్ళు

సింహాద్రి జ్యోతిర్మయి 
పంచవటి శిష్యురాలు 
22.11.2024
శుక్రవారం

4.*ఆనతినీయగా...విశ్వనాథుడు*

సీ.
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి
...సోపానములు వేయు సూత్రమనగ
వటపత్రశాయికి వరహాల లాలిని
...పాడగా పనియున్న పథికుడనగ
సన్నిధి సేరగా సమ్మతినీయరా
...యనివేడ హరునాజ్జ అయ్యెననగ
నాద వినోదము నాట్య విలాసము 
...విశ్వనాథుకు చూపు వేళయనగ

తే.గీ.
చిత్రజగతిని విడనాడి చింత నింపి
తరలి నావేమొ నీవిట్లు మరణమంది
ఓ కళాతపస్వీ! నమోవాకములిడి
సాగనంపెదమిక చేరు స్వర్గసీమ.🙏🙏🙏

స్వర్గీయ *కళాతపస్వి* కి

మా న ర సం తరపున,
కళామిత్రమండలి తరపున 
నివాళులు అర్పిస్తూ...

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.2.2023.







 

06/02/2022/ఆదివారం

శంకరాభరణం వారి సమస్య

దత్తపది.అట్ట.కట్ట.చుట్ట.తట్ట.భారతార్థంలో ఛందమైఛ్ఛికం

శంకరాభరణం కవిమిత్రులకు నమస్సులతో నా పూరణ

సందర్భం...

కురుక్షేత్ర యుద్ధానంతరం పుత్రుల మరణానికి దుఃఖిస్తున్న ధృతరాష్ట్రునితో శ్రీ కృష్ణుడు..

*అట్ట* లుగ బడిరి సంతతి
*కట్ట* డి చేయమని హితవు గఱపిన వింటే?
*చుట్ట* గ నాశము, దుఃఖపు
*తట్ట* ను తప్పదు వహింప తలపై మామా!

*అట్టలు..తలతెగిన శరీరాలు*
సింహాద్రి జ్యోతిర్మయి 6.2.2022

                   🙏🙏

నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన 
శ్రీ‌ బీనీడి కృష్ణయ్య గారి నాటకఫలం అనే ఏడు నాటకాల సంకలన గ్రంథ ఆవిష్కరణ సభలో

సభాధ్యక్షులు
శ్రీ నాగభైరవ ఆది నారాయణ గారు
ముఖ్య అతిథి,
కావ్య ఆవిష్కర్త
జిల్లా పరిషత్ ఛైర్మన్
శ్రీ ఈదర హరిబాబు గారు
కావ్య స్వీకర్త 
శ్రీ  నల్లూరి వెంకటేశ్వరరావు (నల్లూరన్న)గారు
కావ్య విశ్లేషకులు
శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారు
అభినందన 
న ర సం గౌరవాధ్యక్షులు
శ్రీమతి తేళ్ళ అరుణ గారు
నిర్వహణ
న ర సం ఉపాధ్యక్షురాలు
శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి (నేను)
గ్రంథ కర్త
శ్రీ బీనీడి కృష్ణయ్య గారు

ఆదివారం నాడు 27.1.2019 న మల్లయ్య లింగం భవనంలో జరిగిన

శ్రీ బీనీడి కృష్ణయ్య గారి

5.నాటక ఫలం

 అనే ఏడు నాటికల  సంకలన గ్రంథ ఆవిష్కరణ సభలో
నేను సభానిర్వహణ చేసిన సందర్భం

పది తేటగీతులలో

1.
నాటకఫల మనెడు పేరు నయమున నిడి
సప్త నాటిక లొకటిగ సంకలనము
జేసియున్నారు బీనీడి కృష్ణ గారు
గ్రంథ మావిష్కరణ మిదె రండు‌ రండు

2.
అనుచు ఆహ్వాన మొసగగా ఆర్యులకును
నిర్వహణ భారమిది తల్లి !నీది యనుచు
ఆది నారాయణుల వారు వేదికకును
పిలువమనిరి సాదరమున పిలిచి నన్ను.

3.
వచ్చి మల్లయ్య లింగంపు భవనమందు
చేరియున్నట్టి మీకెల్ల చేతులెత్తి
మొక్కుచుంటిని ముందుగా మోదమలర
భళిర!దక్కిన దిదె నాకు భాగ్యమనుచు

4.
ఉత్తమమగు కావ్య రసాన నోలలాడ
సభకు విచ్చేసి కొలువైన సరసమతుల
కంజలించి పలుకుచున్న దార్యులార!
నాగభైరవ పీఠమ్ము స్వాగతమ్ము.

5.
సభకు నధ్యక్షులైనట్టి సన్మతుండు
ఆది నారాయణార్యున కాదరమున
మొక్కి యాహ్వాన మొసగెద ముందుగాను
వేగ రావయ్య కూర్చుండ వేది పైకి.

6.
అన్న నందమూరిని దైవ మనగ నెంచి
యన్ టి యారను పరిషత్తు నేర్పరచిన
ఈదర హరిబాబను ఘనులీ సభకును
ముఖ్య అతిథిగా వచ్చుట ముదము మాకు.

7.
తెల్లనైన పంచెను దాల్చు నల్లనయ్య
మెల్లగా పల్కు, చూపుకు చల్లనయ్య
అన్న నల్లూరి జిల్లాకు నెన్న వెలుగు
కృతికి స్వీకర్త కిదె నేను స్తుతులు జేతు

8.
కందిమళ్ళ సాంబశివుల ఖ్యాతి గనగ
తొలి తరంపు డి లిట్టుగ తలతు మదిని
కృతి సమీక్షను చేయగా నుతులు జేసి
పిలుచుచుంటిని మనసార కొలువుదీర.

9.
అరుణ కేతనమే తేళ్ళ అరుణ గారు
హితము సాహిత్య మిక యభిమతము సేవ
దీనగతి నున్న‌ స్త్రీలకు దిక్కువమ్మ
కవిని అభినందనము జేయ కదలి రమ్మ!

10.
దేశదేశాల విఖ్యాతి దీప్తి జెంద
నాటకమ్ముల సృజియించు మేటి కవివి
కృతికి కర్తవౌ బీనీడి కృష్ణ వర్య!
వచ్చి కూర్చుండరే‌ యిట మెచ్చి మమ్ము.

సింహాద్రి‌ జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.1.2019


6.జాతీయ కవి నాగభైరవ గారికి నివాళి  

1.తే.గీ.
జా...తికి రతన మొంగోలు జాతివాడు
తీ....య తేనియ కవితల తెలుగు బిడ్డ
య...శము పొంది ప్రకాశపు యశము పెంచి
క...లిత కనకాభిషేకంపు ఘనత గాంచె
2.తే.గీ.
వి...శ్వ విఖ్యాత నటరత్న పిలచి మిమ్ము
వ..సతి జూపి తన సినిమా వ్రాయమనగ
రు...చిరముగను విశ్వామిత్ర కుచిత రీతి
లు...క్కు కలుగక వ్రాసినా రక్కజముగ.
3.తే.గీ.
నా...కు పరిచయ భాగ్యము లేక యున్న
గ...ణుతి కెక్కిన మీఖ్యాతి కవుల నోట
భై..రవీ దేవి కృపచేత పల్మరు విని
ర...మణ నిడుచుంటి పద్య నీరాజనములు

4.ఆ.వె.
వ..లచి గుండ్లకమ్మ వాగు చెప్పిన కథ
కో...ట్ల తెలుగు వారు కోరి వినగ
టే...కు వోలె విలువ ,ఠీవియు నమర వి
శ్వ..మున కొసగిన మిము సన్నుతింతు
5.తే.గీ.
ర...చన మీది రంగాజమ్మ రమ్య కావ్య
రా..జమనగ వినుతికెక్కె ,తేజమున క
వు..లును కవన విజయమాడి నలు దిశలను
గా...రవము నందినారు మీ కైత కతన
6.ఆ.వె.
రి..క్క లున్న వరకు చెక్కిన శిల్పమై
కం..దువమున చెలగ గలుగునట్టి
కి..టుకదేమి?నాకు చటుకున దెల్పుడీ!
తం...పరగ రచింతు తలచి మిమ్ము.

సింహాద్రి జ్యోతిర్మయి
16.6.2018.

లుక్కు.... లోపము
భైరవీదేవి....పార్వతి
రిక్క....నక్షత్రం
తంపర...కోకొల్లలు
కందువ...సామర్థ్యం
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

7.మాతృదేవోభవ

కన్నతల్లి కన్న కాంచ దైవము లేదు
తండ్రి దైవసముడు తలపగాను
గురువు దైవమనుచు గుర్తించు మదినెప్డు
అతిథి దైవ మతని నాదరించు

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
8.డోలు విద్వాంసులు 

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

9.మాయాబజార్

మాయాబజార్
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ
మనసుదోచుకునే చిత్రరాజం
ఈ టీవీ సినిమాలో వస్తుంటే నా మనసు ఇలా స్పందించింది.

సీసం.
శ్రీకృష్ణదేవుని చిద్విలాసము చూపి
.....యెల్లర నలరించె *నెన్టియారు*
అభిమానవంతుడౌ‌ అతని మేనల్లుడౌ
.....అభిమన్యుడై యొప్పె *అక్కినేని*
చిలిపియౌ శశిరేఖ సింగారి *సావిత్రి* 
....మాయజేసెను గదా మనసుదోచి
*యస్వి రంగారావు* అద్భుత నటనకు
..‌‌‌మాయాబజారొక్క మచ్చుతునక

తే.గీ.
లక్ష్మణ కుమారుడుండె *రేలంగి* లేడు
హాయి మన *సూర్యకాంతమ్మ* అలమలమ్ము
మది సుభద్రగా   *ఋష్యేంద్రమణి* యె నిలిచె
శకుని యనగ *సీయస్సారె* సాటి యెవరు.

తే.గీ.
*అల్లు ,గుమ్మడి,వంగర,అంజి ,ఛాయ*
వీరు వారని చెప్పంగ వీలుకాదు
తెర వెనుక శిల్పులను చెప్ప తరమె యికను
యశము మన వెండి తెరకు *మాయాబజారు*.

సింహాద్రి జ్యోతిర్మయి
20.9.2017.








🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

10.గురజాడ జయంతి

[21/9/2017, 11:43 am] Jyothirmai Simhadri: గురజాడ జయంతి సందర్భంగా

సీసం.
ముచ్చటొప్పగ గుచ్చి ముత్యాల సరములన్
......ఆధునికత భాష కమరజేసె
మట్టి కాదుర దేశమన్న మనుషులంచు
......శక్తి నింపెడు దేశ భక్తి చాటె
దిద్దుబాటొనరించి తెలుగు కథానికన్
......తొలి యడుగుల జాడ త్రోవజూపె
ఆధునిక కవిత్వమందున యుగకర్త
.....యై మహాకవియను యశము పొందె

తే.గీ.
నాటి పుత్తడి బొమ్మ కన్నీటి కథను
కనుల నిప్పులు గురిసిన కన్యకలను
నాకు సంస్కరణ పతాక తోకచుక్క
అనుచు చూపిన గురజాడ కంజలింతు.

సీసం.
పడుపు వృత్తిని చేయు పడతి మధురవాణి
.......సౌజన్య మేమిటో చాటినాడు
కన్నకూతురి నైన కనికరించని తండ్రి
.....,అగ్నిహోత్రుల యాశ కవధి లేదు
బ్రతుకు భారమవగ బాల విధవలైన
.......మీనాక్షి బుచ్చెమ్మ దీనగతులు
నమ్మించి యెల్లరిన్ నయవంచనలు జేయు
.....,ఆ గిరీశము సల్పు ఆగడాలు

తే.గీ.
వింత లుబ్దావధానుల పెళ్ళి తంతు
డాబు రామప్పపంతుల డాంబికములు
కథను అడ్డము తిప్పినా కాలమందు
మాయబోదు కన్యాశుల్క మహిత ఖ్యాతి.

సింహాద్రి జ్యోతిర్మయి
21.9.2017.

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
11. చిన్నారులకు కన్నీటి నివాళి


సీసం.
నిదురమత్తున తూగు నిశిరాత్రి వేళలో
          మితిలేని వేగమ్ము మృత్యువగుచు
కలవారి లోగిళ్ళ కలల దీపాలైన
        పసికూన లిర్వురి యుసురుదీసె
పగవారికైననూ వలదిట్టి దుఃఖమ్ము
        కడుపుకోతను మించు కష్టమేది?
చిన్నారులకు రెండు కన్నీటిబొట్లతో
         కడసారి వీడ్కోలు నిడుటకంటె

తే.గీ.
చేయగలిగినదింకేమి? చిరుతలార!
బ్రతుకు గాలిలో దీపమ్ము పగిదిజేసి
పెద్దవారి గుండెల చిచ్చు పెట్టకండి
వేగమున కన్న ప్రాణమే విలువ సుమ్ము.

సింహాద్రి
11.5.2017.

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
12. వృత్తాలు


[10/9/2017, 9:26 am] Jyothirmai Simhadri: నా ఉత్పలమాల

ఉల్లము సంతసిల్లునటు ఉత్పలమాలల నల్లదల్చితిన్
తొల్లిట రాయనైతినిటు దొర్లిన తప్పులు సైపగావలెన్
చల్లని మీదు దీవెనలె చాలును పద్యము సాగిపోవుగా
యెల్లరు నన్ను మెచ్చి యిక యీ చిరు యత్నము ప్రోత్సహింపరే!.

సింహాద్రి జ్యోతిర్మయి
9.9.2017
[12/9/2017, 11:08 pm] Jyothirmai Simhadri: ఉ.
ఓర్వగ రానివీ రుణము లో తిరు వేంకట శ్రీనివాస నే
నేర్వగజాల సైచుటని నీ చరణాంబుజ మాశ్రయించితిన్
సర్వము చక్కజేసి సిరిసంపదలిచ్చి కుచేలు రీతిగన్
ఖర్వమొనర్చి లేమి నను గావుము తీర్పుము యీతి బాధలన్
[13/9/2017, 1:45 pm] Jyothirmai Simhadri: ఉ.
నమ్మితి నా మనంబున యనాదర మేలనొ?భక్తురాలిపై
నమ్మిక వమ్ము చేయకిక నాదగు యార్తిని మాపగా వడిన్
రమ్మని వేడుచుంటి ,కరి రాజును గాచిన చందమొప్పగన్
కమ్మని పద్యమే తలచి కమ్మగ రావయ !లక్ష్మి తోడుతన్.

కమ్మ ---జాబు,వర్తమానం.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

13 ముక్కోటి ఏకాదశి

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ వైకుంఠ వాసునికి నా పూజా పుష్పం గా ఈ 
సీస పద్యం

సీసం
కర్మేంద్రియము లైదు కావలెననుచుండు
       నింగిత మెరుగక యింపులెల్ల
జ్ఞానేంద్రియము లైదు కావలె ననుచుండు
        ప్రతి సుఖమ్మును తాము ప్రత్యహమ్ము
సాధనమున కడ్డు స్వామి !యీ మోహమ్ము
        మనసును నీవైపు మరల నీదు
పురుషోత్తమా!నాదు బుద్ధిని నీవుండి
       తరియింపజేసెడి తెరువునంగ

ఆ.వె.
ముక్తిపథము గాదె ముక్కోటి యేకాశి
ద్వారముత్తర దిశ దర్శనమ్ము
జ్ఞానధనము నొసగి దీనత బాపగా
గరుడగమన నీవె గతివి సుమ్ము.


ఉత్తరం అంటే జ్ఞానం, ధనం అనే రెండర్థాలను గ్రహించి రాసిన పద్యం.

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం
 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.12.2018.

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
14. వీర సింహం
సీసం
దాయాది చేతిలో తాను చిక్కితినన్న
....వెరపు మోమునలేని విధము జూచి
గుట్టుమట్టు లరికి రట్టు కారాదని
...పత్రముల్ మ్రింగిన ప్రజ్ఞ జూచి
గూఢత శత్రువుల్ గుచ్చి ప్రశ్నించినా
...నోరు మెదపని యా తీరు జూచి
దేశభక్తి నెదలన్ దీపింప జేయగా
.... స్ఫూర్తి నీయగ జాలు మూర్తి జూచి

ఆ.వె.
వీరసింగ మొకటి చేరవచ్చెడు ఠీవి
వర్థమానుడా !ప్రవర్థమాన
యశముజూచి మురిసి దిశలు మ్రోగగ జేతు
మందుకొమ్మిదె యభినందనములు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.3.2019
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

15. కాకరకాయ వేపుడు


సీసం
కాకర కాయలు చేకొని లేతవి
....ముచ్చిక తొలగించి పెచ్చుగీరి
నిలువుగా నొక గంటు నేర్పు మీర నొసంగి
....పైన ఉప్పు ను రుద్ది పక్కనుంచి
నొక్కి నీటిని పిండి నూనె లో వేయించి
..... వరుసగా తీర్చియు పళ్ళెమందు

వేరుశనగ పప్పు వేపిన పల్లీలు
.... జిహ్వ ననుసరించి చేర్చి తొలుత  

ఆ.వె.
నూరియుంచుకున్న కారపు పొడి కూరి
వేడి నూనె పైన వేసి నంత
కమ్మదనము పెంచ కరివేప వెల్లుల్లి
ఆరగించవచ్చు అన్నమందు.

సింహాద్రి జ్యోతిర్మయి
25.2.2019
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

16. కవిత్రయ సాహితీ సౌరభాలు

నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో డిసెంబర్ నెల 12,13,14 వ తేదీలలో జరిగిన

*కవిత్రయ సాహితీ సౌరభాలు *
అనే 
కార్యక్రమం పై 
నా స్పందన

సీసపద్యంలో

నాగభైరవ వారి నవ సాహితీ వన
      వాటి కవిత్రయ భారతాన
చాల యద్భుతముగ చంద్రమౌళి వరులు
     శిశుపాల వధ కథ చెప్పినారు
ఉత్కంఠ కలిగించు ఉద్యోగమున నేను
      తిక్కన ద్రౌపదిన్ తెలిపినాను
సైంధవాధమునికి జరుగు శాస్తిని గూర్చి
      ఖ్యాతి మీర వినిచె జ్యోతి వాసు


ఆ.వె.
సరస కవిత మెచ్చు సాహితీ ప్రియులెల్ల
చదువులమ్మ గుడిని సమయమునకు
వేడ్క మీర వచ్చి వినిమెచ్చినందుకై
చేతు వందనములు చేతులెత్తి.

సింహాద్రి‌ జ్యోతిర్మయి న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.12.2018

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

17. అన్నవరం ప్రసాదం

నిన్న కార్తికమాసం శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.

తే.గీ.
తేనె రంగున చవులూరు తీయనైన
సత్యదేవుని దివ్య ప్రసాద మిదియె
కథను విని శ్రద్ధతో ,భక్తి కనుల కద్ది
స్వీకరించిన తొలగుగా చింతలెల్ల.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

18. విళంబి ఉగాది

సింహాద్రి జ్యోతిర్మయి 
11.11.2018.ముఖ పుస్తక మిత్రులందరికీ
శ్రీ విళంబి నామ సంవత్సర 
ఉగాది శుభాకాంక్షలు.

శ్రీ...లు విలసిల్లి సుఖములు స్థిరము గాగ
వి..జయ పథ మెన్నడును మిము వీడక, నక
ళం...క చరిత సీతమ్మ మీ వంక దయను
బి..ట్టు జూపగ తొలగు చెట్ట లెట్టివైన.

నా..కవిత కోయిల గళఫు నాద మెగయ
మ..ధుర వాసంత శోభలు మల్లె గురియ
నూ..పురములు ఘల్లన దాల్చి నూత్న కళల
త..రలి వచ్చినది యుగాది ధరణి కిపుడు.

న..వ్వు లన్నియు మీ యింట గువ్వలవగ
ఉ..న్నతియు ,సమృద్ధియు నొప్పునటుల
గా..సి బెట్టెడు కష్టమ్ము కలుగకుండ
ది..నము మిము గాచు గావుత దేవగణము.

వ..రుస శుభములు జరిగి, వ
త్స..ర మెల్లను పండుగై సతము మీకు వికా
ర..రహిత జీవితమిడి పర
శు..రామ గర్వాపహారి చూచెడు గాకన్.

భా..వి యాశలు నెరవేరి బ్రతుకు నిండ
కాం..తి పుంజము ప్రసరించి కలలు పండి
క్ష..మకు నెలవై హృ దయములు శాంతి సుఖము
లు... జగతి జనుల కెల్ల కలుగును చూవె.

సీంహాద్రి జ్యోతిర్మయి
18.3.18.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

19. సల్మాన్ వేట
ఆ.వె.
పైడి లేడి వెంట‌ పరుగుదీయుటచేత
భామ గోలుపోయె రామవిభుడు
వేట నేరమనుట విస్మరించుట చేత
జైలుకెళ్ళె నేడు సల్మనుండు

ఆ.వె.
రామచంద్రవిభుడు రక్షింప జగతిని
వంకపెట్టి వెడలె జింక వంక
కండ కావరమున కండల వీరుడు
అధిగమించి చట్ట మందె శిక్ష.

సింహాద్రి జ్యోతిర్మయి
7.4.2018

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

20.పంచారామాల స్తుతి

సీసం

అమరలింగేశ్వరా!అమరావతీ సీమ
...చాముండికా దేవి స్వామివీవు
వెలసి దక్షారామ భీమేశ భక్తులన్
....కనికరించెడు మాణికాంబ పతివి
మహిని సోమేశ !సోమారామమున రాజ
...రాజేశ్వరీదేవి రమణు డనగ
ఈశ !భీమేశ!భీమారామ
...వాస!త్రిపురసుందరీ సతీశ!

ఆ.వె.
కామితములు దీర్చు రామలింగేశ్వరా!
పాలకొల్లున గల పార్వతీశ!
నాదు మదిని తలతు నీదు పంచారామ
క్షేత్ర మహిమలు శివరాత్రి వేళ.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.3.2019


🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
21.కామ్య చైత్రిక
***********
ఆటవెలది పద్యం

చైత్ర మాసమందు చక్కని చిన్నారి 
పుట్టి శుభములెన్నొ పట్టుకొచ్చె
ఉంగ ఉంగయనుచు మంగళవారాన
చిట్టి గౌరి యింట చేరవచ్చె

సింహాద్రి జ్యోతిర్మయి
4.3.2020

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ముఖ పుస్తక మిత్రులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
రామాయణం గురించి నేను విన్న వ్యాఖ్యానాలలో నాకు నచ్చిన మూడింటిని నా ఊహ కొద్దీ ముచ్చటగా మూడు సీసపద్యాలలో కూర్చాను.
22.రామాయణ అంతరార్థం 
1.సీసం.
రామచంద్రుండాత్మ రమణి సీతయె బుద్ధి
      హనుమ ప్రాణమగు దేహమునకును
యెఱుకయే సౌమిత్రి యెల్ల వేళలయందు
      నాత్మ నంటి తిరుగ నభిలషించు
నహము రావణుడేను హరియింప జూచును
  ‌‍ మనలోని బుద్ధిని మాయజేసి
జాడను కనుగొన జాలని వేళల
     ప్రాణమాత్మను జేరు బంధువగుచు

తే.గీ.
ఆత్మ బుద్ధిని కోల్పోయి యలమటింప
తరలి రాలేని బుద్ధిని తనకుతాను
వెతికి చెంతకు చేర్చెడు విధములోన
ఆత్మ కెఱుకయు ప్రాణమ్ము లండయగును

 2.తే.గీ.
అహము నిశ్శేష మొనరించి యాత్మతాను
తిరిగి బుద్ధిని గ్రహియించి తరియజూచు
రామ చరితలోని పరమార్థ మిదియంచు
తెలియజెప్పిన వారికి తలనువంతు.

3.సీసం.
తామస గుణమన్న తాటక యగుగాన
      కొట్టి రాముడు దాని మట్టుబెట్టె
శాపమగు రజస్సు సంస్కరింపకయున్న
     కాన రాము డహల్య కలుషమడచె
సత్వ గుణము సీత సాధింపవలె గాన
     చేరి రామవిభుడు స్వీకరించె
సత్వమైన తగదు మోక్ష సాధనమున
     కాన వీడె సతిని కానలందు

ఆ.వె.
రామచంద్రవిభుని రమ్యగాథ తెలుపు
సత్యమిదియె యనుచు చాటినారు
గరికపాటి వారు గ్రహియించి యద్దాని
సీసపద్యమందు చెప్పినాను.

4…సీసం
అంతస్థములలోన నలరు ద్వితీయమై
   ' రా' యను వర్ణము రాసి తొలుత
పంచమ వర్గలో పంచమ వర్ణమౌ
  ' మ 'యను దానిని కడమన నిలుపుచు
ముచ్చట రెంటిని ముమ్మారు గుణియించ
     విష్ణు నామమ్ములు వేయికి సరి
యగుచు పాపములెల్ల యణగార్చి బ్రోచును
    స్వామి పేరు పరమ పావనమ్ము

ఆ.వె.
రామ రామ రామ నామమ్ము నే పల్కి
రామసతిని గొల్చి రక్ష నొంది
రామనవమి వేళ సేమమందగ  రండి
రామ నామ మహిమ నేమి చెబుదు?

****************************
👾👾👾👾👾👾👾👾👾👾
****************************

మీ గీతకు నా రాత

24.రాదే చెలీ నమ్మరాదే చెలీ
కం.
చిక్కని కాఫీ నిచ్చితి
పక్కన ‌కూర్చొని కొసరుచు‌ ఫలహారమ్మున్
మక్కువ మీరగ నిడితిని
చక్కగ తా దినుటె గాని సతిని పొగడడే!

కం.
అక్షయమగు నీ ప్రేమను
లక్షల నే తూచలేను లలనా! నీకీ
యక్షయ తృతీయ నాడిదె
తక్షణ మొక కానుకనిన తబ్బిబ్బవనే!

కం.
ఏలా!ఈ  మగవారలు
చాలరు సతి మనసెరుంగ జాలరు నేనే
జాలము చేయగ వలెనని
సాలోచన చేయుచున్న సఖియన‌ తోచున్.

సింహాద్రి‌ జ్యోతిర్మయి
18.4.2018

****************************
👾👾👾👾👾👾👾👾👾👾
****************************

ముఖ పుస్తక మిత్రులందరికీ హాయ్. ఈటీవీ లో
మిస్సమ్మ సినిమా వస్తోంది. దీని మీద నేనెప్పుడో రాసిన పద్యం.దానిని మీతో షేర్ చేసుకోవాలనిపించింది.

25.విజయా వారి మిస్సమ్మ.

సీసం.
కస్సుబుస్సుల కాంత మిస్సమ్మ‌ సావిత్రి
.....యలకల్లు చూడగా తలచితేని
బతకనేర్చిన వాడు బడిపంతులెన్టియార్
 ....నేర్పులు చూడగా నెమ్మియేని
మొండి జడల సీత ముద్దుగుమ్మ జమున
....గారాలు చూడగా కోరితేని
నేర శోధన చేయు ధీరు డేయన్నారు
...,హాస్యమ్ము చూడగా నాశయేని

తే.గీ.
దండి రేలంగి తైలమ్ము పిండుకొనుట
మంచి యిల్లాలు ఋష్యేంద్రమణిని కనుట
యస్వియార్ యూతపద 'మదే' యనుట వినగ
వేడుకయ్యెనా!మిస్సమ్మ చూడుమింక.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.4.2020


*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
                 26.దేవదాసు
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

విషాదాన్ని పండించిన వినోదావారి దేవదాసు సినిమాను ఇదివరకెప్పుడో ఈటీవీ సినిమా లో చూసి‌ రాసిన సీసం.
మళ్ళీ ఈ రోజు అదే సినిమా ను,అదే ఛానల్ లో చూస్తూ గుర్తు చేసుకుని పోస్ట్ చేస్తున్నాను.

సీసం
చిలిపితనము చిందు చిన్ననాటి చెలిమి
......,మాట పట్టింపులో మాటు పడగ
పార్వతి పెళ్ళి తో పసిడి కల చెదర
.......మత్తులోన జగమె మాయయనుచు
మరువజాలని బాధ మధురమని తలచి
......దినదినమ్ము తపించి దేవదాసు
తనపారు నొకసారి  కనులార చూడగా
........ఆశతో పోయి నిరాశ చెంది

తే.గీ.
కన్నుమూయు ఘటన గుండె కలచివేయు
రాలునపుడు కన్నీరైన రాల్చువారు
లేని యా మందభాగ్యుని దీనగాథ
యెంత కఠినాత్మునైనను యేడిపించు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.03.2020.

27.జె.డి.లక్ష్మీనారాయణ



 ‌‌           
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
                28. దీపావళి
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

1.కం. దీపావళి పెద్దలు మరి
  ‌‌     ‌   పాపాయిలు మెచ్చునట్టి పర్వదినమ్మే.
          గోపాలుడు నరకునిపై
          తా పొందిన గెలుపనంగ ధర భావించున్.

2.కం. భామా జయమును,బలికథ,
          రామా విజయమ్మి దియని రకరకములుగాన్
    ‌‌ ‌‌‌‌    తామిల కొందరు పలుకుదు
         రేమైనను గాని మోదమిది యెల్లరకున్.

3.కం. ప్రమదలు ఈ అమవశి నిశి
    ‌‌‌     ప్రమిదల దీర్తురు వరుసల వాకిళులందున్.
          సముదంబుగ కాంచుడదిగొ
         సుమనోహర దీపకాంతి శుభములొసగెడున్.

4.కం. పెరిగిన చీకటి రాత్రుల
          సురలోకపు దారిగనక  స్రుక్కు పితరులన్
         నరకము దాటగ దివ్వెలు
         దరి చూపగ నిలుపుదురట ద్వారములందున్.

5.కం. దివ్వెలు ,చిటపట కాకర
         పువ్వులు, మరి చిచ్చుబుడ్లు, భూచక్రములున్
        రవ్వలు చిమ్మెడు తారా
        జువ్వలు ,బాంబులు,మతాబు చుర చుర మెరుపుల్.

6.కం. బాలల నెపమును చూపుచు
         ‌వేలకు వేల్గుమ్మరించి వేడుక చేయన్
        మేలేమి? అందు కొంచెము
        శ్రీ లేమిని కుములువారి శ్రేయసుకిడుమా!

7.కం. చెప్పెను శాస్త్రము దీపము
         చెప్పదు ఈ బాణసంచ సంరంభములన్.
         తప్పిది తెలియుము కాల్చుట
         ఒప్పదు కాలుష్యము భువి ఓ జనులారా!

8.కం. పెద్దల బాధ్యత పిల్లలు
          ముద్దుగ మారాము చేయ మూఢత మాన్పన్
          సుద్దులు చెప్పుడు మన సరి
          హద్దుల ఒరిగిన జవాన్లకది అంజలిగాన్.

కాలుష్య రహిత, అపాయ రహిత ,బాధ్యతానందాల సహిత దీపావళి శుభాకాంక్షలు.
మీ.........................సింహాద్రి.

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
       29.బాలమురళీరవం
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

స్వర శిఖరానికి‌ కందాంజలి.

1.కం.
లాలిత గానామృత ఝరి
బాలమురళి నారదాది భాగవతులకున్
వేలును విడిచిన బంధువొ
ఏలగ స్వర జగతి దిగిన ఏ తుంబురుడో!

2.కం.
పలుకే బంగారమనుచు
చిలికెను ఆ స్వరము సుధలు క్షితి నలుగడలన్
సలలిత రాగపు వైద్యుడు
అలరెను గుప్పెడు మనసుల అజరామరుడై.

3.కం.
సరిగమలందున బ్రహ్మ గ
సరికొత్తగ సృష్టి జేసె శ్రావ్యపు స్వరముల్
బిరుదావళి వరియించగ
గిరి శిఖరము వంటి కీర్తి గెలిచె  స్థిరముగన్.

4.కం.
ఎంగిలి నీకెటులిత్తును?
లింగా! నేనేమి చేతు? లెంకను అనుచున్
సంగీతమ్మున మొరలిడ
చెంగట పాడించుకొనగ  చేర్చుకొనితివో!

5.కం.
స్వర రారాజా!అంజలి
మురళీకృష్ణా! నివాళి ముత్యాశ్రులతో
చిరకాలము కొలువుందువు
స్థిరముగ రసహృదయులందు చేరుము పరమున్.

                        సింహాద్రి.

హలో! అందరికీ ఆదివారపు సాయంత్రపు అభివాదం.
వార్ధా తుఫాను కారణంగా వాతావరణం చల్ల చల్లగా ఉంది కదూ!ఇలాంటి సమయంలో వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది కదూ!మరి ఇంకెందుకు ఆలస్యం?ఇదిగో బజ్జీలు.రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. 

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
       30.మిరపకాయ బజ్జీలు.
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

1.తే.గీ.
బజ్జి మిరపకాయలు తెచ్చి, బాగ కడిగి
పొట్ట ‌చీల్చి లోపల వాము పొడిని కూరి
శనగపిండి లో ఉప్పును చాలినంత
వేసి,కాసింత బియ్యపు పిండి చేర్చి

2.తే. గీ.
గరిట జారుగా నీళ్ళతో కలుపుకోని
తొడిమతో పట్టి మిర్చిని తోపు లోన
ముంచి మునివేళ్ళతో తీసి ముందుగానె
కాగిన నూనెలో దోరగా వేగనిచ్చి

3.తే. గీ.
వన్నె బంగరు‌తేలిన వాటినింక
దేవి పళ్ళెము లోనికి తీసి పెట్టి
ఉల్లి తరుగును పైపైన చల్లుకొనుచు
నోరు ఊరించు బజ్జీలు ఆరగించు.

ఎలా ఉన్నాయి నేను వేసిన బజ్జీలు?

సింహాద్రి
11.12.2016.

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
    31.🍀  జ 🍀న🍀 వ 🍀రి🍀
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

తే.గీ.
జ....రిగి పోయిన కాలమ్ము మరలిరాదు
న.....దిని వెనుకకు మరలింప నరులకగునె?
వ.....చ్చు కాలమ్ము తప్పక తెచ్చు శుభము
రి.....క్త  హస్తమ్ము లనబోకు రేపు మనదె.


🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
        32.కాషాయపు ఠీవి
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

కం.
కమనీయము కాషాయము
అమరెనుగా ఠీవి నీదు అణువు అణువునన్
అమలిన స్వచ్ఛత మోమున
విమలమతీ!వందనము  వివేకానందా!

సింహాద్రి
12.1.2017.

సంక్రాంతి
💅💅💅💅💅💅💅💅💅💅
     ‌‌    33.శ్రీ(మతు)ల ముగ్గు
💅💅💅💅💅💅💅💅💅💅

1తే.గీ.
నిన్న రాత్రి తళుకులొల్కి నింగినిండ
గుంపులై చుక్కలెల్లను గోచరించె
తెల్లవారి‌ తలుపుతీసి తెల్లబోతి
వరుసలై పేర్చియున్నవి వాకిలంత

2. తే. గీ.
పగటి వెలుగులోనుండక పారిపోవు
దొంగలనుచు శ్రీమతికవి తోచెనేమొ!
తెల్ల ముగ్గుల సంకెళ్ళు తెచ్చియిచట
బంధనములు వేసెనిట్లు బాగు బాగు

3.తే. గీ.
నాల్గు వైపుల వాకిళ్ళు నయముగాను
ఉంచి కట్టుదిట్టము జేసె నువిద తాను
ఆవుపేడతో గొబ్బెమ్మలచట తీర్చి
కాపుగానుంచె కాంచితే కలికి తెలివి.

4.ముగ్గుపై నెంత మక్కువో ముదితమదిని
వెచ్చదనముకోరి చెలికై వెదుకు వేళ
పక్కనుండక తొలిసంజ పడకటింట
లెక్క చేయక పొగమంచు లేచివెళ్ళు.

5.తే. గీ.
ఊడ్చి వాకిలి శ్రీమతి ఉదయవేళ
పేడ కళ్ళాపి చల్లును పెంచ కాంతి
ఒంగి తనమేనిలో గల ఒంపులన్ని
పరచి ముగ్గులోన పడతి పరవశించు.

6.తే. గీ.
ఇంటికందము ఇల్లాలు ఇది నిజమ్ము
ముగ్గు వాకిట శుభమది మోహనమ్ము
ఇలను ఈ రెండు లేనట్టి ఇల్లు చూడ
ఆదిలక్ష్మిని ఒల్లని ఆలయమ్ము.
   
7.ఆ.వె.
రాతి ముగ్గులోన రాజిల్లు చూడరా
కాంత చేతిలోని కౌశలమ్ము
కలికి ముగ్గులోన కనువిందు చేయదా
పొలతి మేనిలోని పొందికెల్ల.

8..తే.గీ

పసుపుకుంకుమ చల్లగా పావనమ్ము
తీర్చి గొబ్బెమ్మలుంచగా తెలుగదనము
ముగ్గు మనజాతి ముచ్చట ముదిత సొమ్ము
పల్లె వెలిగించు సంక్రాంతి పర్వదినము.

సింహాద్రి
13.1.2017
*****************************
👾👾👾👾👾👾👾👾👾👾
*****************************

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
          34.   సంకురాత్రి
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

ఆ.వె.
భోగి ఇంటనింప భోగభాగ్యములను
మకర సంక్రమణము మంచి చేయ
కనుమ పాడి పశుల ఘనముగా పూజించు
సౌఖ్య మొసగుగాక సంకురాత్రి.

సింహాద్రి
14.1.2017.


యశోదమ్మ చిన్ని కృష్ణుని పిలిచే సందర్భం
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
     35.రారా రారా రారా రారా
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

కం.
రారా!కృష్ణా! ఇటు నో
రారా అమ్మా  యనగదరా!విని,అలిగే
రా,రాచిలుకలు ,నను గన
రా!రాజీవ నయన !వినరా!నా పలుకుల్.

సింహాద్రి
21.1.2017.

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
   ‌  36.   ఘన గణతంత్రం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కం.
శుభమీ గణతంత్ర దినము
సభలను జరుపుచు పతాక సంబరములతో
నభమును తాకగ మన ఘన
విభవము ,చేతము  జననికి వినయాంజలులన్.

సింహాద్రి
26.1.2017.

ఈ రోజు మా నాన్నగారి జయంతి.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
              37.  నాన్నగారు 
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

తే.గీ.
మమ్ము కనురెప్ప వలె సాకి మమత పంచి
ఎన్నడెవరిని నొప్పించు టెరుగనట్టి
నాన్న పుట్టిన రోజిది నా మనస్సు
తలచె యా జ్ఞాపకాలను తనివిదీర.


38.రథ సప్తమి పర్వదినాన
శ్రీ వారి వాహన సేవలు.

సీసం.
కోటి సూర్య సముడు కోనేటి రాయండు
            వెలుగు సూర్యప్రభ న్వేడుకలర
హరుని నెచ్చెలియగు ఆ శేషశయనుండు
             చిన శేషవాహన సేవ గొనును
తిరుమలేశు డదిగొ తిరుమాడ వీధుల
             గరుడ వాహనమున నరుగుదెంచు
కోరి భక్తుని మది కొలువు జేసెడి ఱేడు
            హనుమంత వాహన మధివసించు

తే.గీ.
వెలుగు చక్రి చక్రస్నాన విధులు గొనుచు
కల్ప వృక్షము పై వచ్చి కనికరించు
సర్వభూపాల వాహనాసక్తుడైన
స్వామి చంద్ర ప్రభల గాంచి సాగి మ్రొక్కు

*తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్*

రథ సప్తమి సందర్భంగా
నమస్కార ప్రియుడైన సూర్యునకు నా పద్యాంజలి.

సీసం.
సప్తాశ్వరథముపై సాగివచ్చెడు స్వామి
              ధాత్రిని నడిపించు మిత్రుడితడు
ఉప్పు నీటిని గొని యుదకముల్ వానగా
         కురిపించి కరుణించు యరుణుడితడు
మొక్కినంతనె పొంగి చక్కని యారోగ్య
        భాగ్యమందించేటి భానుడితడు
కర్మసాక్షి యగుచు చర్మ చక్షువులకు
         నగుపించు భగవాను డర్కుడితడు

తే.గీ.
ద్వాదశాత్ము డితండు దివాకరుండు
పద్మినీ వల్లభుడు చిత్రభానుడితడు
తరణి ,తపనుండు, రవియు మార్తాండుడితడు
భాస్కరుండు సూర్యుడు  లోకబాంధవుండు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.1.2023

సింహాద్రి
3.2.2017.
36.అ(మెరిక)భాగ్యులు.

1.తే.గీ.
కన్నవారినిట విడిచి కాసు కొఱకు
వేద భూమిని వలదని విద్య కొఱకు
వలసపోయెడు యువతకు కలుగుచున్న
కష్టములను తలచినంత కలుగు చింత.

2.తే. గీ.
అమెరికా భూతలస్వర్గ మనుచు భ్రమసి
రెక్క కట్టుకు వాలగా రేబవళ్ళు
కలలు గనుచుంటిరే గాని ఖర్మగాలి
వచ్చు ముప్పు నూహించెడి వయసులేదు.

3.తే. గీ.
కాస్త సొమ్ముకే పైబడి కత్తిదూయు
కాదు లేదన్న కసిదీర కాల్చివేయు
వారి జాత్యహంకారమ్ము వంశి వంటి
పసిడికలల యువతనయో ఉసురు దీయు.

4.తే. గీ.
మృతి ని పొందు నిర్భాగ్యత మీరు పొంద
మాతృమూర్తి కడుపుకోత మాన్పతరమె?
కూర్మి సంతును భరతాంబ కోలుపోవు
వద్దు అమెరికా మోజొద్దు ముద్దు కన్న.

5.తే. గీ.
రత్నగర్భగా జగతిలో రాణకెక్కి
ఎన్నొ జాతుల కాశ్రయ మిడిన తల్లి
పొట్ట కూటికై బిడ్డలు పొరుగు నేల
చనుట,చనిపోవుటను వార్త సైప గలదె!

6.తే. గీ.
వేష,భాష, స్వస్థానము విమల మతిని
మెచ్చు సంస్కారమే గదా!మేలి గుణము
అనెడు జంఘాల‌ శాస్త్రిని వినగలేదె!
పానుగంటి పలుకు నిత్య వాస్తవమ్ము.

7.సీసం.
పిలువని వారింటి పేరంట మేలయా!
  ‌‌            అమ్మ పెట్టెడు ముద్ద అమృత సమము
తాడి నీడను నీవు తలదాచు టేలయా!
   ‌‌            జన్మ భూమి ఘనము స్వర్గ మయము
డాలర్ల మోజులో డాంబికాలేలయా!
               కొద్ది నీ ధన మిట కోట్ల సమము
ఉనికి కాని యెడను ఊడిగమ్మేలయా!
                సేవ జాతికి  దైవ సేవ సమము

తే.గీ.
ఛీ యనుచు ట్రంపు పొమ్మన్న సిగ్గు వీడి
చూరు పట్టుకు వేలాడ శోభ యగునె!
ఆశ మనదైన వారిదే అవసరమ్ము
బెట్టు చూపి పరువు నిలబెట్టు కొనుడు.

సింహాద్రి
19.2.2017.

అమరావతి సాహితీ మిత్రుల సభలో చదివిన పద్యకవిత


40.శరణాగతి.

సీసం.
కరిరాజు కష్టమ్ము పరిమార్చి నావట్టి
             కరుణ జూపుచు నన్ను కావ రావె!
డింభకు రక్షింప సంభవించిన యట్టి
             దయను జూపుచు నాకై తరలి రావె!
ఆప్త మిత్రుని లేమి హరియించి నావట్టి
               మైత్రి జూపుచు నాకు మాడలీవె!
పడతి‌ ద్రౌపది వేడ పరువు నిల్పినయట్టి
            ‌శరణు నా‌కొసగుచు వరములీవె!

తే.గీ.
పాప మే జన్మదో నన్ను బాయకుంది
వేచు చున్నది ధనరూప వేదనలతొ
పదము‌ పట్టితి నీ మీద పదములల్లి
అడుగు చుంటిని రావయ్య ఆర్తి‌ దీర్ప.

సింహాద్రి
20.2.2017.

ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

  
       41.తెలుగే వెలుగు.

1.తే. గీ.
అ  మ్మ జోలపాటకు సమమైన తెలుగు
ఆ  వు పాల కమ్మదనము లమరు తెలుగు
ఇ  టలి భాషతో సమమని ఎనయు తెలుగు
ఈ డులేని మాధుర్యపు ఇంపు తెలుగు.

2.తే. గీ.
ఉ  గ్గు పాలతో అబ్బెడి ఊసు‌ తెలుగు
ఊ హకు తొలిపలుకు నేర్పు ఒజ్జ తెలుగు
ఋ  ణము దీర్పలేము జనని ఇడిన తెలుగు
ఋా  తొ‌ మొదలగు పదముల నిడని తెలుగు.

3.తే. గీ.
ఎ  న్న భాషల లోకెల్ల మిన్న తెలుగు
ఏ  టి  గలగల వినిపించు తేట తెలుగు
ఐ  క మత్యాన ప్రాంతీయ ఆస్తి తెలుగు
ఒ. రుల భాషకు అచ్చుల ఊత తెలుగు

4.తే.గీ.
ఓ  పు చుండె నిర్లక్ష్యము చూప తెలుగు
ఔ  ర సహనాన భూదేవి,  అమ్మ తెలుగు
అం  త మవనీకు భవితపై ఆశ తెలుగు
అః వలదు నాకనకు మన ఆత్మ తెలుగు.

5.తే. గీ.
క. వన సామ్రాజ్య విభవమ్ము  గన్న తెలుగు
ఖంగుమను బుర్రకథ వేయు ఛెంగు తెలుగు
గ  తపు మన ప్రౌఢ కావ్యంపు గరిమ తెలుగు
ఘ  నత గల అవధానంపు  గడుసు తెలుగు

6.తే.గీ.
చ  తుర  చాటు పద్యమ్ముల చరిత తెలుగు
ఛ టల వెల్గు ప్రబంధాల సవిత తెలుగు
జ  నులు‌ పాడు జానపదాల జలధి తెలుగు
ఝ  రుల తుళ్ళింత లిడియాడు ఝషము తెలుగు.

7.తే. గీ.
ట  ముకు చాటించు విఖ్యాతి కొమరు తెలుగు
ఠ  వర కవిలోక  కంఠంపు రవళి తెలుగు
డ. గ్గరించిన ఆంగ్లంపు డాగు తెలుగు
ఢ  క్క పగిలించు శ్రీ నాథ డమరు తెలుగు

8.తే. గీ.
త. ళుకు రేకుల శోభించు తమ్మి తెలుగు
థ. యను వర్ణ మారంభపు త్యక్త తెలుగు
ద  ప్పి దీర్చెడి సాహిత్య దరియె తెలుగు
ధ  వళ  దరహాస  భాసురా దయిత తెలుగు

9.తే. గీ.
న  లువ చెలువకు సిగపువ్వు నాదు తెలుగు
ప. లుకు పలుకున పూదేనె లొలుకు తెలుగు
ఫ  ణితి సురభాష దీటైన పదము తెలుగు
బ  మ్మెర సుశబ్ద యుత ముద్దు గుమ్మ తెలుగు.

10.తే. గీ.
భ  రత ఖండాన నుప్పొంగు పాడి తెలుగు
మ  దిని రసడోల లూగించు మధువు తెలుగు
య  క్ష గానాల విలసిల్లు యశము తెలుగు
ర  సన  చవులూర జాలించు రసము తెలుగు

11.తే. గీ.
ఱ ట్టు పడనీని వ్యంగ్యార్థ గుట్టు తెలుగు
ల  లిత పదబంధ లాస్యంపు లతిక తెలుగు
వ  డుకు చిక్కని భావాల పడుగు తెలుగు
శ  తక పద్యాల ముత్యాల సరము తెలుగు

12.తే. గీ.
ష. ట్పదము చేయు ఝంకార సడియె తెలుగు
స. సహజ వైచిత్రి శతవిధా చాటు తెలుగు
హ. ల్లు చేయూత వినసొంపు హాయి తెలుగు
క్ష. తము కానీక బ్రోవు నీ బ్రతుకు తెలుగు.

సింహాద్రి
21.02.2017.

అందరికీ మాఘ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

42.అమర (కోశ)వినుత శివ నామావళి.

1.తే. గీ.
అమరకోశము నీ పేర్లు అమరు విధము
సంఖ్య యాబది పై రెండు సాంబ!చెప్ప
తేటగీతుల నిమిడించి తెలిపినాను
అర్థనారీశ్వరా! ప్రీతి నాలకించు.

2.తే.గీ.
శంభుడా!ఈశ! పశుపతీ!సన్నుతింతు
శివ!మహేశ్వరా!శూలి !నీ‌ సేవ జేతు
ఈశ్వరా!శర్వ!ఈశాన!ఇదె నమింతు
శంకరా!చంద్ర‌శేఖరా!శరణు జొత్తు.

నమింతు... నమస్కరిస్తాను

3.తే.గీ.
ఖండ పరశుడా!భూతేశ!కావవయ్య!
గిరిశ !హే గీరీశ !మృడ!నా‌ కెలను నీవె
కృత్తివాస!మృత్యంజయ!కృపను గనుమ!
ఉగ్ర!ప్రమథాధిప!పినాకి!ఉద్ధరించు.

కెలను...దిక్కు.

4.తే.గీ.
హే కపర్థి!విరూపాక్ష!హితము గూర్చు
ఓయి శ్రీకంఠ!శితి కంఠ!ఉదిల దీర్చు
హే కపాలభృత్!భవ!భర్గ!మోకరింతు
వామదేవ!మహాదేవ!వలను‌జూపు

ఉదిల.....పరితాపం
వలను..దిక్కు.

5.తే.గీ.
ఓ త్రిలోచనా! సర్వజ్ఞ! ఓట దీర్పు
ధూర్జటీ!నీల లోహితా!దోయిలింతు
హే కృశానురేతస!రుద్ర! హృదిని నిలుమ
హర!స్మరహర!గంగాధర!ఆర్తి బాపు

6.తే.గీ.
త్ర్యంబక!త్రిపురాతక!మాకు రక్ష నిమ్ము
అంధకరిపు!క్రతుధ్వంసి!ఆదరించు
వ్యోమకేశ!వృషధ్వజ! నామమెంతు
భీమ!స్థాణు!ఉమాపతీ!భీతి బాపు

7.తే గీ.
అష్టమూర్తి! యహిర్భుధ్య్న! కస్టముడుపు
ఓ మహాకాల!ఇదియె నా ఒరిగ గొనుము
ఓ మహానటా! వరుస నీ నామములను
ఉంచి విరచిస్తి పద్యమ్ము లూహ కొలది.

ఒరిగ..మొక్కు

8.తే.గీ.
ఓం నమః శివాయ యనుచు ఉచ్ఛగతిని
పలుకుచూ శివ పంచాక్షరి భక్తి మీర
జాగరమ్ముండి రేయెల్ల జపము చేయ
జన్మ జన్మల పాపమ్ము సడలి పోవు.

9.తే.గీ..
మాఘ శివరాత్రి జాగరమ్మాచరించి
నిండు మనమున మారేడు నిడిన చాలు
జన్మ రాహిత్య మొసగులే‌ జంగమయ్య
కరిగి కైలాస వాసమ్ము కలుగజేయు.

ఓం నమశ్శివాయ.

సింహాద్రి
24.2.2017.

43.అమరజీవి 
తే. గీ.
ఉక్కు సంకల్పమును బూని ఉద్యమించి
ఆంధ్ర రాష్ట్ర సాధనమున‌ అసువులొదిలె
అనుపమాన త్యాగధనుడు అమరజీవి
పొట్టి శ్రీరాములకు మొక్కి పొగడరయ్య.

సింహాద్రి
16.3.2017.

44.ఉగాది పచ్చడి

సీసం
చింతపండు రసము,చిటికెడు లవణము
            తురిమిన బెల్లము,మిరప కాయ
వగరైన మామిడి,తగు వేప పూతయున్
            చేర్చ ప్రసాదమ్ము సిద్ధమగును
తీపి ఉప్పు పులుపు వేప చేదు కలిసి
             వగరు కారము లారు వరుస రుచులు
అంతతో మెచ్చరీ ఆధునికులు గనుక
             ఇవికూడ చేర్చండి ఇష్టమవగ

ఆ.వె.
అరటిపండు గుజ్జు అదనపు రుచినిచ్చు
జీడిపప్పు కాస్త చేర్చ వచ్చు
కూర్చినంత కొన్ని కొబ్బరి పలుకులు
మేటి రుచిని మెచ్చు నేటి తరము.

సింహాద్రి
29.3.2017.


45.నర్తనశాల
ఈటీవీ సినిమాలో ఈరోజు
నర్తనశాల సినిమా చూడగానే కలిగిన ఆనందంలో రాసిన సీసం.

ఔనౌను నటరత్న అతడే యని యనంగ
           సావిత్రి నటనకు సాక్ష్యమనగ
యస్వి రంగారావు యశపు ధ్వజమనంగ
             లాస్యమన్న విజయలక్ష్మి యనగ
శోభను బాబుకు శోభగూర్చె ననంగ
                 రేలంగి హాస్యంపు హేల యనగ
మేటి కాంతారావు మేలు నటననంగ
              సంధ్య. ,  మిక్కిలినేని జాలమనగ

తే.గీ.
రామలింగయ్య ,సత్య నారాయణయును
దండమూడి,ముక్కామల  తదితరులతొ
తెలుగు తెరకెక్కి అసమాన దీప్తి నించె
చలనచిత్రము నర్తనశాల సుమ్ము.

సింహాద్రి
19.4.2017.

46.పుస్తకం 

సీసం.
పాఠశాలల కేగు పసివారి కరమందు
         పాఠ్య పుస్తకములు భవిత యగును
పండితవర్యులు పఠియించి బోధించు
         కావ్య పుస్తకములు సేవ్యమగును
జ్ఞాన భాండ మగుచు గ్రంథాలయమ్ములన్
         వెలయు పుస్తకములు వెలుగులగును
మేధావులందరూ శోధించి వెలయించు
      ‌     సకల పుస్తకములు శాస్త్రమగును

తే.గీ.
జరిగిపోయిన చరితల సాక్ష్యమగుచు
మనెడు పుస్తకమ్ములెపుడు మరువబోకు
మంచి పుస్తకమన్నను మనకు హితుడు
ఎంచి చదువుచునుండు నీ వెదుగగలవు.

సింహాద్రి

47.దాదా సాహెబ్ ఫాల్కే విశ్వనాథ 

కళాతపస్వికి అభినందనలు.
సీసం.
వంక పెట్టగ లేని శంకరాభరణమ్ము
        స్వర్ణకమలమన వాసి కెక్కె
చలనచిత్రములందు సాగర సంగమం
         స్వాతిముత్యమనగ చరిత నందె
సప్తపదియు,శుభ సంకల్పము చెలగి
           స్వాతికిరణములన్ వసుధ నింపె
అభిమానులలరంగ అతని స్వయంకృషి
            ఇల శుభప్రదముగా ఇనుమడించె

తే.గీ.
జనని జన్మభూమికి ప్రియతనయు డనగ
చేసె శారదకు స్వరాభిషేకమనగ
దాద సాహెబు ఫాల్కెతో ధన్యుడైన
విశ్వనాథ కళాతపస్వి కిదె జయము.

సింహాద్రి
24.4.2017.

.
48.డాక్టర్ సర్వేపల్లి 
తే.గీ.
తెలుగువారి బిడ్డగ పుట్టి తేజరిల్లి
తత్వశాస్త్రము చదివి సద్వర్తనమున
అంది‌ ఆదర్శవిద్యార్థి అను యశమును
రాణకెక్కె సర్వేపల్లి రాధకృష్ణ

తే.గీ.
చూడచక్కని తలపాగ సొంపుమీరు
దాల్చు మీ కోటు మోకాళ్ళు దాటియుండు
కళ్ళజోడు వెనుక జ్ఞానకాంతి సుధలు
చిందు నీ రూపు మొక్కులనందె గాద.

తే.గీ.
గురువుపై అభిమానంపు గురుతు చాట
శిష్య గణము మైసూరున  చేతులార
మీదు గుర్రపు బగ్గీని మోదమలర
వీధులన్ మోయ మీ ఖ్యాతి విదితమయ్యె.

తే.గీ.
రత్న మనదగ్గ గురువులై రమ్య కీర్తి
అలర భారతరత్నమ్ము నందినారు
మేటివై రాష్ట్రపతి యను మేలి పదవి
అధివసిస్తిరి గురులెల్ల ఆత్మ మురియ.

తే.గీ.
మీరు పేర్గన్న వృత్తిలో మేముకూడ
భాగమగుటచే గౌరవ భాగ్యమబ్బి
వృత్తి కంకితమగు స్ఫూర్తి వెల్లివిరియ
అందుదుము గురుపూజోత్స వాదరమును.

సింహాద్రి జ్యోతిర్మయి
5.9.2017.
కవిసామ్రాట్ విశ్వనాథ వారి జయంతి

తే.గీ.
జ్ఞానపీఠతో తెల్గుల ఘనత చాటి
వేయి పడగల  తన  కీర్తి విస్తరించి
విశ్వనాదమై యెలుగెత్తు విశ్వనాథ
సుకవిసామ్రాట్టుల జయంతి శుభదినమిది.

సింహాద్రి జ్యోతిర్మయి
10.9.2017.


 భగినీ హస్త దర్శనం

తే.గీ.

అక్కచెల్లె లింటికి జని ఆదరమున
ఆమె చేతి మృష్టాన్నము లారగించి
శక్తి కొలది కాన్కలిడిన సంతసమున
శుభములిడునిది భగినికిన్ సోదరులకు

సింహాద్రి జ్యోతిర్మయి

అక్కను అపురూపంగా చూసుకునే మనసున్న
నా తమ్ముళ్ళిద్దరికీ
ఆయురారోగ్య ఐశ్వర్యాలు నిండుగా ఇవ్వమని
ఆ తిరుమల శ్రీనివాసుని వేడుకుంటున్నాను.

గుండమ్మ కథ

నిన్నరాత్రి ఈటీవీ సినిమా లో గుండమ్మ కథ మరొకసారి చూసి సూర్యకాంతం నటనకు మురిసి రాసిన సీసం.

సీసం
సవతి కూతురి నెప్డు సాధించిపోసేటి
........గయ్యాళిగా గాంచి కడుపు రగులు
గుంటనక్కను బోలు గంటన్న నే నమ్ము
........గుండక్కనే గాంచి గుండె మూల్గు
పతి పాదరక్షల కతిభక్తి మొక్కేటి
.......నటనమ్మునే గాంచి నవ్వు పుట్టు
విభవమ్ము నశియించి పెరటింట కుమిలేటి
.........బేలతనము గాంచి జాలిపుట్టు

తే.గీ.
ఎందరుండె మహానటు లిందులోన
కాని చిత్రమ్ము గుండమ్మ కథగ ఖ్యాతి
గాంచినది సూర్యకాంతమ్మ కతన గాదె!
విజయ కేతనమ్మెగిరి యీ నిజము చాటు.

సింహాద్రి జ్యోతిర్మయి
29.10.2017.

నిన్న‌ రాత్రి మళ్ళీ మరొక్కసారి విజయా వారి గుండమ్మ కథ సినిమా ‌చూసిన ఆనందం లో రాసిన పద్యాలు

సీసం

చిరుబుర్రు లాడేటి చిట్టెమ్మ జమునకున్
    చక్కని జోడాయె అక్కినేని
ఇంటికి వెలుగైన ఇంతి సావిత్రికిన్
    నచ్చిన‌ మగడాయె నందమూరి
జత తాను సరి యల్ విజయ లక్ష్మి కనునట్లు
‌  హరనాథు మెప్పించె‌ నందరి నటు
గయ్యాళి భార్యయౌ‌ గడుసు హేమలత నో
రడ్డలేక రమణ రెడ్డి యమరె

తే.గీ.
యస్వియార్ రామ భద్రయ్య యనగ నొప్పె
రాజనాల భూపతిగను రాణకెక్కె
కాకిబుద్ధి దుర్గమ్మగా‌ కనులముందు
ఛాయదేవి నిలిచిపోయె సతము మనకు

తే.గీ.
అంజియై జూప‌ నటరత్న హాస్యపటిమ
సూర్యకాంతమ్మ నటనయే  శోభ గూర్ప
మదిని గుండమ్మ కథ నిల్చె మరపురాక
నేటికైన యీ సినిమాకు సాటిలేదు

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.1.2019



24.1.2018.ముఖ పుస్తక మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒక పద్యంలో కూర్చి ఇప్పుడే నేను రాసిన సీస పద్యం

సీసం

సౌరాష్ట్ర సోమేశ!సర్వజ్ఞ జగదీశ!
     శ్రీ‌శైల మల్లేశ!చిద్విలాస
ఉజ్జయినీ వాస! ఓ మహా కాళేశ!
    శరణ మోంకారేశ!హర!మహేశ!
కేదార నా థేశ! కృపగను భూతేశ!
     భీమేశ!శితి కంఠ!వ్యోమకేశ!
అల కాశి విశ్వేశ!ఆ అన్న‌పూర్ణేశ!
     సాంబ శివా!హే‌ త్రయంబకేశ!

తే.గీ.

వైద్య నాథేశ్వరా! నీదు భక్త జనుల
కావ నాగేశ్వరా!నీవు కదలి వేగ
రమ్ము రామేశ్వరా!నిను నమ్మినాము
పాహి!ఘృష్ణేశ్వరా! దేవ! పార్వతీశ!

సింహాద్రి‌ జ్యోతిర్మయి
13.2.2018.
తే.గీ.

పూలరెక్కలు కొన్నింటి పోగుచేసి
తేనె చుక్కలు చిలికించి దానిలోన
తీర్చెనంట విధాత శ్రీదేవి నిన్ను
 కనగ మనసాయెనో యేమొ కబురుజేసె


 అందరికీ ప్రపంచ‌ కవితా దినోత్సవ శుభాకాంక్షలు

సీసం
నన్నయాది కవుల నాటిపద్య కవిత
    తలమానికమ్మైన  తరుణివీవు
భావకవితలన్న బంగారు గాజులన్
    దాల్చి సొగసులొల్కు తన్వి వీవు
ఆవేశముప్పొంగు అభ్యుదయ కవిత
     లొడ్డాణముగ దాల్చు ఉవిద వీవు
వచన కవితల రవ్వల హారముల కంఠ 
   సీమ ధరించిన భామ వీవు

తే.గీ.
పాద మంజీరము లవగ పద కవితలు
కమ్మనైన కథలు చెవి కమ్మలవగ
సర్వ సాహితీ భూషణ సహితవైన
నెలత వీవమ్మ యీ తెల్గు నేలపైన.





కవిసంగమం వారిచ్చిన ‌ఇడ్లీల చిత్రానికి నేను రాసిన కంద పద్యం

గడ్డివలెను నిస్సారపు
చెడ్డవి యగునట్టి నేటి చిరుతిండ్లేలా!
అడ్డక నాస్వాదించుము
ఇడ్డెనులవి శక్తినిచ్చు నెవ్వరికైనన్.

సింహాద్రి జ్యోతిర్మయి
8.4.2018.

కందం

పుస్తకము‌ జనులకొక ప్రియ
నేస్తము ,వెలలేని‌ జ్ఞాన నిధియై వెలయున్
మస్తిష్కము వికసింపగ
పుస్తకముల చదువుడు పరిపూర్ణత కలుగన్.

ఈ రోజు ఆంధ్రుల‌ అన్నగారు‌‌ విశ్వవిఖ్యాత నట‌సార్వభౌమ నటరత్న నందమూరి తారక‌రామారావుగారి జయంతి.
నేను ఆయన పౌరాణికాలకు పిచ్చ ఫాన్ ని.
అందుకే ఈ సీసం

రామయ్యలోనున్న కోమలత్వము జూప
     రామరావుకు సరి రామరావె
శ్రీ కృష్ణు రూపులో చిద్విలాసము జూప
    రామరావుకు సరి రామరావె
అభిమానధనునిలో ఆభిజాత్యము జూప
      రామరావుకు సరి రామరావె
చేడియ కుల్కులన్ పేడియందున జూప
     రామరావుకు సరి రామరావె

ఆ.వె.
దానకర్ణుడైన ,దశకంఠుడైననూ
భీమసేనుడైన, భీష్ముడైన
భక్తుడైన గాని, భగవంతుడే గాని
రామరావుకు సరి రామరావె.

సింహాద్రి జ్యోతిర్మయి
28.3.2017.

రుబాయి  రామాయణం

సంతుకొరకు పంక్తిరథుడు చేసె యాగము
యజ్ఞ ఫలము పాయసాన అర్థభాగము
కౌసల్యకు ఒసగెనామె జన్మతరియగా
కలిగెనంట రామయ్యను కనెడు యోగము

సింహాద్రి‌ జ్యోతిర్మయి
 17.6.2018

రుబాయి రామాయణం

దైవమంచు పతిని సీత మది నెంచింది
అతనివెంట అడవిబాట పయనించింది
పతివియోగ మోపలేని ఊర్మిళ తాను
పదునాలుగు యేండ్లపాటు శయనించింది

[6/18, 7:02 PM] Jangam Jyothirmai: రుబాయి రామాయణం

యాగ రక్షణమ్ము కొఱకు మౌని పిలిచెను
యజ్ఞమ్మును గాచి రాము డతని కొలిచెను
సంతసించి కౌశికుండు విద్యలొసగగా
అచ్చెరువుగ రామునకవి మొక్కి నిలిచెను
[6/18, 7:02 PM] Jangam Jyothirmai: రుబాయి రామాయణం

దైవమంచు పతిని సీత మది నెంచింది
అతనివెంట అడవిబాట పయనించింది
పతివియోగ మోపలేని ఊర్మిళ తాను
పదునాలుగు యేండ్లపాటు శయనించింది
[6/18, 7:02 PM] Jangam Jyothirmai: రుబాయి  రామాయణం

సంతుకొరకు పంక్తిరథుడు చేసె యాగము
యజ్ఞ ఫలము పాయసాన అర్థభాగము
కౌసల్యకు ఒసగెనామె జన్మతరియగా
కలిగెనంట రామయ్యను కనెడు యోగము

సింహాద్రి‌ జ్యోతిర్మయి
 17.6.2018
[6/18, 7:02 PM] Jangam Jyothirmai: రుబాయి రామాయణం

మంధరమ్మ మాటవిన్న కైక చెడ్డది
పట్టాభిషేకానికి అడ్డుపడ్డది
రామపాదుకలను తెచ్చి గద్దెనుంచిన
కైక సుతుడు భరతుని మనసెంత దొడ్డది
[6/18, 7:02 PM] Jangam Jyothirmai: రుబాయి రామాయణం

పితృవాక్య పాలనమ్ము సుతుడు చేసెను
నారచీరలందు తండ్రి తనయు జూసెను
అడవికేగు రామునిగని గుండెపగులగా
కలవరించి దశరథుండు కన్నుమూసెను

రుబాయి రామాయణం

రామున కెడమైతినంచు తపియించింది
అశోకవనిని పతినామమె జపియించింది
విషమైనా దొరకదాయె విడువ ప్రాణము
అనుచు సీత విధిరాతను శపియించింది

రుబాయి రామాయణం

అరదమెక్కి అనిసేయగ రాక్షసేంద్రుడు
నేలనిలిచి పోరుసలిపె రామచంద్రుడు
ధర్మానికి దైవమెపుడు సహకరించుగా
రామునకై దివ్యరథము పంపెనింద్రుడు
[6/20, 11:12 AM] Jangam Jyothirmai: రుబాయి రామాయణం

రామపదము సోక తొలగె అహల్య శాపము
రాముడెక్కుపెట్ట విరిగె హరుని చాపము
రాముడనగ రూపెత్తిన ధర్మమే కదా!
రాము డలగ పండిన దసురాళి పాపము
[6/20, 11:12 AM] Jangam Jyothirmai: రుబాయి రామాయణం

అగ్ని చొరగ మౌనము సతి మేలు కోసమే
సతిని విడిచి వేయుట జనవాణి కోసమే
ప్రేమలోన రామవిభుని సాటి ఎవరయా!
స్వర్ణ సీత మనసుకు ఉపశాంతి కోసమే
రుబాయి రామాయణం

తాటకయే తామసమది మట్టుబెట్టెను
రాజసమన అహల్యయౌ చక్కబెట్టెను
అనుసరించి గురుని రాముడాత్మ నెరుగుచూ
సాత్వికమౌ సీతమ్మను చెట్టపట్టెను

.....తెలుగు లెస్సేనా!...

ఆటవెలదులు

వేనవేలు సొమ్ము వెచ్చించి  నిన్ను నే
నాంగ్ల పాఠశాల కంపియుండ
మనసు దీర నన్ను మమ్మి యంచనవేమి?
అమ్మ యనగ నేల ఆదమరచి

దేశభాషలందు తెలుగు లెస్స యగును
మనదు మాతృభాష మధుర తమము
కాన కమ్మనైన తేనెలొలుకు తెల్గు
పలుకమన్నదమ్మ పంతులమ్మ

అనెడు బిడ్డపలుకు లాలించి యాతల్లి
తెలివిలేని మీదు తెలుగు పంతు
లమ్మ మాట వినకుమయ్య, మహిని నేడు 
ఇంగిలీషు భాష ఇంపు సుమ్ము

అనగ కలతతోడ అబ్బాయి అనెనిట్లు
కంటివెంట నీరు కారుచుండ
తెలుగు పలుకు వేళ తెలియని యానంద
మేదొ యలమునమ్మ యెదను నాకు

అమ్మ గోరుముద్ద లారగించినయట్లు
అమ్మ ఒడిని యాట లాడినట్లు
అమ్మ జోలపాట నాలకించిన యట్లు
అమ్మ కొంగు మొగము నద్దినట్లు

తిన్నయట్టులుండు తిరుపతి లడ్డును
కొరికినట్టులుండు నరిసె ముక్క
రామనవమి వేళ స్వామి నామము పల్కి
ఆనినట్టులుండు పానకమ్ము

అందమైనదైన నందన వనమది
తులసి మొక్కతోటి తూగ గలదె?
ఆంగ్ల భాష చదువు‌ టవసర మ్మయినను
తనివినిచ్చు భాష తెనుగు గాదె?

కన్నబిడ్డ మాట కనువిప్పు కలిగించ
మురిసి తల్లి వాని ముద్దులాడె
తేట తెలుగునెపుడు తేలిక‌ చేయకు
విలువ నెఱిగి ఖ్యాతి విస్తరించు.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

29.12.2018

వసంత పంచమి శుభాకాంక్షలతో

సీసం
తొలికవి వాల్మీకి  లలితమౌ కావ్యాన
...గాయత్రివై నీవు గణుతికెక్కి
వ్యాసుడల్లిన మహా భారతమందీవు
...పంచమవేదమై పరిఢవిల్లి
కాళిదాసాదుల కమనీయమైనట్టి
..పంచకావ్యములందు మించి వెలిగి
 సమ్రాట్టులును, కవి సార్వభౌములు తగ
..‌.వ్రాసిన కావ్యాల వాసి కెక్కి

తేటగీతి.ఖ్న
అమరభాషకు సొగసుల హాయి దిద్ది
తెలుగు కైతల తీయని తేనెలద్ది
వెలుగు జననికి మ్రొక్కెద వేడ్క మీర
పర్వదినము శుభ వసంత పంచమికిని

వసంత పంచమి సందర్భంగా
వాణికి వందనమిడుతూ
నా పద్యం

సరస్వతీ నమస్తుభ్యం.

సీసం

చదువుల తల్లిరో పదములు  మ్రొక్కెద
....కొలువుదీరవె నాదు కలము నందు
వాగ్దేవి నిన్నొక్క వరమును వేడెద
....బాయక నిలుము నా వాక్కులందు
శారదాంబ సతము సన్నుతి జేసెద
...చేరియుండవె నాదు చిత్తమందు
భారతీ దేవిరో భక్తిని కొలిచెద
....కమ్మదనమిడు నా కైతలందు

ఆ వె.

వాణి యీ వసంత పంచమి  శుభవేళ
విన్నవింతు నాదు చిన్న మనవి
కవిగ ఖ్యాతి నొసగి కామిత మీడేర్చి
దయను జూపవమ్మ ధాత రాణి.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.2.2022


వసంత పంచమి సందర్భంగా
వాణికి వందనమిడుతూ
నా పద్యం

సీసం

చదువుల తల్లిరో పదములు  మ్రొక్కెద
....కొలువుదీరవె నాదు కలము నందు
వాగ్దేవి నిన్నొక్క వరమును వేడెద
....బాయక నిలుము నా వాక్కులందు
శారదాంబ సతము సన్నుతి జేసెద
...చేరియుండవె నాదు చిత్తమందు
భారతీ దేవిరో భక్తిని కొలిచెద
....కమ్మదనమిడు నా కైతలందు

ఆ వె.

వాణి యీ వసంత పంచమి  శుభవేళ
విన్నవింతు నాదు చిన్న మనవి
కవిగ ఖ్యాతి నొసగి కామిత మీడేర్చి
దయను జూపవమ్మ ధాత రాణి.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.2.2019

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి వేడుకల సందర్భంగా...

నా పద్యాన్ని గానం చేసినవారు..
శ్రీ యుతులు ప్రతాప గౌరీనాథ శాస్త్రి గారు🙏🙏🙏

సీసం

ఎదురైనచో నీదు మద కరీంద్రము  డిగ్గి
....చేయిచ్చి పెద్దనన్ చేదుకొనుట
ముక్కుతిమ్మన గారి ముద్దుపలుకులు మెచ్చి
....కావ్య ప్రసూనమ్ము కాన్కగొనుట
మంత్రి తిమ్మరుసును మన్నించి తండ్రి గా
.....ప్రేమ నప్పాజీగ పిలుచుకొనుట
తెలుగు వల్లభుడను తెలుగొకండ ననుచు
...యెల్లరి మనములన్ కొల్లగొనుట

తే.గీ.

ఐదువందల యేళ్ళకున్ అధిప మేము
మరువకుంటిమి సాక్ష్యమీ  మహిత మూర్తి
నింగిలో సూర్యచంద్రులు నిలుచువరకు
వెలుగు నో ప్రభూ !మీ ఖ్యాతి చెలగి భువిని

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి వేడుకల సందర్భంగా...

 అందించి యాంధ్రుల కాముక్తమాల్యదన్
....ఆంధ్రభోజుండన్న యశము వడసి
పోషించి కవులను భువన విజయమందు
....అష్టదిగ్గజముల నందజేసి
సేవించి తిరుమల శ్రీవారి పదములన్
....ఘన విభూషణములు కాన్కలిచ్చి
పాలించి చల్లగా ప్రజ నేలుబడి నీది
.....స్వర్ణ యుగమటన్న వన్నె దెచ్చి

తేగీ
దేశ భాషల లెస్స నా తెలుగటంచు
చాటి చెప్పిన నీకింక సాటి గలరె
సాహితీ సమరాంగణ సార్వభౌమ!
కృష్ణ రాయ నృపవరేణ్య కీర్తి గరిమ.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.2.2019


ఈ వీర సైనికుని సందేశానికి నా స్వేచ్ఛానువాదం సీస పద్యం లో

తల్లి నీ గర్భమ్ము తరియించి పోతుంది
...కన్నీరు నించబోకమ్మ నీవు
వేచి నా కొరకింక వేసార పనిలేదు
...తలయెత్తు గర్వాన తండ్రి నీవు
సోదరా! నా బండి నీదిరా ఇటుపైన
...చదువు పై చూపుమా శ్రద్ధ నీవు
చెల్లి నీ అన్నకై తల్లడిల్లగ బోకు
...తెల్లవారని నిద్ర తెలియు మీవు

ఆ.వె.
పొందిన పతకాలు పొందికన్ ఎదపైన
తీర్చి నా గృహముకు చేర్చుడయ్య
మట్టి ఋణము దీర్ప పుట్టియుంటిని నేను
జాలినొంద వలదు జాతి నీవు

నివాళులతో

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.2.2019


*అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు* 

సీ.
ఆంధ్రభోజు డితడె యష్టదిగ్గజముల
...నాస్థానమందున నాదరించె
అన్నమయ్య యితడె యల్లి పదకవిత
...లాంధ్రభాషకు నంద మమరజేసె
తెలుగు తల్లి యిచట కొలువుదీరె గనుము
...ముద్దుబిడ్డలచెంత మురిపెమొప్ప
మాతృభాషకు ఘన మహిమలద్దిన మహా
...మహుల నెల్ల తలచి మన్ననలిడి

తే.గీ.
పలికి జేజేల నొంగోలు పట్టణమున
కూడి భాషా దినోత్సవ వేడుకలకు
మహిత మూర్తులకు *గులాబి మాల* లేసి
జరిపినా మిదె తల్లికి విరులపూజ.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.2.2023

దిల్ రాజు గారికి శుభాకాంక్షలు., శుభాశీస్సులు. నిన్న విడుదలైన ‌మీ చిత్రం 'శతమానం భవతి 'నిన్ననే చూశాను.చాలా బాగుంది.నేను కవయిత్రి ని.కనుక నా స్పందనను ఒక మూడు కంద పద్యాలలో తెలియజేస్తాను.

1.కం.
మతి మమతలు మరచిన సం
తతి తీరును,కన్నవాళ్ళ తల్లడపాటున్
సుతిమెత్తగ చెప్పిరిగద!
శతమానం భవతి యందు సర్వులు మెచ్చన్.

2.కం.
బల్ రసమయమగు సినిమా
దిల్ రాజిటు తీసి జనుల దిల్ తా దోచెన్
ఘల్ ఘల్లని కాసుల జడి,
వెల్ డన్ అను మెప్పుల సడి వినజాలునికన్.

3.కం.
పర్వదినము సంక్రాంతి కి
గర్వించుచు ఆంధ్రులెల్ల కాంచి మురియగన్
శర్వానందుడు చేసెను
సర్వుల మెప్పించజాలు సచ్చిత్రమ్మున్.

శతమానం భవతి

5.కం.

పాటన్నను తెలుగుదనము
ఫైటన్నను చెంపదెబ్బ భళి యీ సినిమా
మాటన్నను గుండెలసడి
నీటుగ రూపొందెనిందు నిజ జీవితమే!

ఈ రెండు పద్యాలు కూడా చేర్చాలనిపించింది.

సింహాద్రి.


సింహాద్రి జ్యోతిర్మయి
కవయిత్రి
16.1.2017.


🌅🌅🌅 *శుభోదయం* 🌅🌅🌅

🔏🔏🔏🔏 *పద్యరచన* 🔏🔏🔏🔏

తేది. 02 - 03 - 2019   శని వారం 

చిత్రం. *535*

ఈ దిగువ చిత్రాన్ని గాంచి అనువైన  పద్యాన్ని/ పద్యాలను వ్రాయండి.

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴

సీసం
దాయాది చేతిలో తాను చిక్కితినన్న
....వెరపు మోమునలేని విధము జూచి
గుట్టుమట్టు లరికి రట్టు కారాదని
...పత్రముల్ మ్రింగిన ప్రజ్ఞ జూచి
గూఢత శత్రువుల్ గుచ్చి ప్రశ్నించినా
...నోరు మెదపని యా తీరు జూచి
దేశభక్తి నెదలన్ దీపింప జేయగా
.... స్ఫూర్తి నీయగ జాలు మూర్తి జూచి

ఆ.వె.
వీరసింగ మొకటి చేరవచ్చెడు ఠీవి
వర్థమానుడా !ప్రవర్థమాన
యశముజూచి మురిసి దిశలు మ్రోగగ జేతు
మందుకొమ్మిదె యభినందనములు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.3.2019







Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ