9. నేను చూసిన ఉగాదులు


👾👾👾👾👾👾👾👾👾👾
         ఉగాది తో ఊసులు
👾👾👾👾👾👾👾👾👾👾

*విశ్వ విడ్డూరాలు*

స్వాగతం విశ్వావసూ!
రారా!ఇలారా!
నిన్ను చూడగలగడం
చాలా సంతోషం
నేను చూడని ఉగాదులలో 
ఆఖరిదానివి నీవే 
పరాభవలో పుట్టిన నేను 
ఇప్పటివరకూ 
ప్రతి ఉగాదినీ 
పేరుపేరునా పలకరించి 
ఏడాదిపాటు స్నేహం చేసి
ఎన్నో అనుభవాలను పంచుకుంటూ వచ్చాను
ప్రతివారితో చేసిన
ప్రయాణంలోనూ
ఎన్నెన్నో తీపి చేదు అనుభవాలను మిగుల్చుకున్నాను 
గత క్రోధి అయితే 
ఏకంగా 
నన్ను వెంటబెట్టుకు పోవడానికి సిద్ధపడింది కూడానూ 
ఎలాగో నీ పరిచయభాగ్యం అబ్బే 
అదృష్టం ఉండి కాబోలు 
ఇదిగో నీకిలా స్వాగతం చెప్పడానికి 
మిగిలి ఉన్నాను
ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం 
వచ్చిపోయిన చుట్టానివి 
నేటి లోకంపోకడ 
నీకు మింగుడుపడడం 
కాస్త కష్టమే
తెలుసుకుని తీరాల్సిన వార్తలు చాలానే ఉన్నాయి 
మచ్చుకి కొన్ని పరిచయం చేస్తాను
నీవు ఒకప్పుడు చూసిన,విన్న ప్రతి యుద్ధానికి కాలపరిమితి
ఉండే ఉంటుంది కదూ!
కానీ 
ఈనాటి యుద్ధాలు 
అలనాటి రావణకాష్టాలు 
నిత్యమూ రగులుతూనే ఉన్నాయి 
యమహా నగరి అని 
కీర్తించబడ్డ కలకత్తాపురిలో 
వైద్యవిద్యార్థినిపై 
జరిగిన లైంగిక దాడి 
అమానవీయతకు 
పరాకాష్టగా నిలిచింది
ప్రసాదాలకే తలమానికమైన 
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం 
ఆధ్యాత్మిక ప్రపంచంలో 
మింగుడుపడని విడ్డూరమైంది 
అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు 
అంతటా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి 
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 
అధికారంలోకి వచ్చిన 
కొత్త ప్రభుత్వాలు
ఆశల నిచ్చెనలు ఎక్కిస్తుంటే 
పడిపోయిన ప్రతిపక్షాలు 
లోలోపల ఉలికిపడుతూనే
మేకపోతు గాంభీర్యంతో
విమర్శల విన్యాసాలు 
ప్రదర్శిస్తున్నాయి
కూటమి ప్రభుత్వానికి 
అఖండ విజయం చేకూర్చిన క్రోధి 
అంతలోనే 
వరదలతో విరుచుకుపడి 
అగ్నిపరీక్ష పెట్టింది
అందరికీ
అందుబాటులోకి వచ్చిన 
కృత్రిమ మేధస్సు 
రెండంచుల పదునున్న కత్తిలా 
ఆనందాన్ని పంచుతూనే ఆందోళననూ కూడా 
రేకెత్తిస్తోంది 
ప్రకృతి పట్ల మానవుడి నిర్లక్ష్యాన్ని 
కాలిఫోర్నియా కార్చిచ్చుతో సహా 
అనేకానేక ఘటనలు 
ఎత్తిచూపి 
హెచ్చరికలు చేస్తున్నాయి
భారత పారిశ్రామిక ప్రగతి జ్యోతి 
రతన్ టాటా నిష్క్రమణ 
జాతికొక తీరని వెలితిగా 
మిగిలిపోయింది 
చలనచిత్ర వనంలో 
వికసిస్తున్న పుష్పాలు 
గరికపూవులై ఆకర్షిస్తున్నాయే తప్ప 
మానవతా పరిమళాలను 
వెదజల్లటం మానుకున్నాయి
ఎంత క్రోధి అని పేరు పడ్డా
మంచిచెడ్డలు రెండూ
తనలోనూ ఉంటాయికదా !
అందుకే 
ఈ ఏడాది
ఉగాది పచ్చడిని 
కలుపుకుని ఆస్వాదించడం కోసం
రోహిత్ శర్మ నేతృత్వంలోని 
భారత క్రికెట్ జట్టు చేతిలో 
ఛాంపియన్స్ ట్రోఫీ కప్పును పట్టుకొచ్చి పెట్టేసి
సునీతను భూమ్మీదకు
సురక్షితంగా తీసుకొచ్చి అప్పగించి,
రాబోయే నీకు 
రాగానే చెడ్డపేరు
ఎందుకు తేవాలని కాబోలు
మయన్మార్ భూకంపాన్ని 
తన ఖాతాలో వేసేసుకుని 
నిష్క్రమించడానికి సిద్ధపడింది
ఇవీ కొన్ని వెలుగు నీడల జాడలు 
మరి నీతోపాటు 
నన్ను కూడా
పరాభవానికి నడిపించి 
60 ఏళ్ళ ఆనందాన్ని నాకు 
అంతులేని ఆత్మ విశ్వాసాన్ని 
విశ్వానికి 
అందజేస్తావు కదూ!

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
30.3.2025





*నా (టు) ఉగాది*(2023 శోభకృత్ నామ ఉగాది)

అదొక అందమైన కల
అదో అద్భుతమైన ఊహ
అది ఉర్రూతలూగించే ఆశ

నదులన్నీ సముద్రంలో కలవాలని పరుగులు పెట్టినట్టు
బాలీవుడ్
కోలీవుడ్
టాలీవుడ్
ఏ వుడ్ అయితేనేం
హాలీవుడ్ లో 
ఆస్కార్ అందుకోవాలని
ఒక తహతహ

ఒకప్పటి భారతీయ 
సినిమాకు
ఈ తపన లేదు
కానీ 
ప్రపంచం నేడు
గ్లోబల్ విలేజ్ గా మారిపోగా
సినిమా కూడా నేడు
బడ్జెట్ హద్దుల్నే కాదు
భాషల హద్దుల్ని కూడా చెరిపేసింది
పాన్ ఇండియా సినిమాలు
పాన్ ఇండియా స్టార్ల శకం మొదలయ్యింది

స్వర్ణనందులు
జీవన సాఫల్య పురస్కారాలు
పద్మశ్రీ, 
పద్మభూషణ్,
 పద్మవిభూషణ్
దాదా సాహెబ్ ఫాల్కే
లాంటి అవార్డుల
సోపానాలు అధిగమించి
ప్రపంచ గుర్తింపు దిశగా
సారించిన దృష్టిలో
 పడింది ఈ ఆస్కార్

శతాబ్దం దాటిన భారతీయ సినిమా చరిత్ర
95 ఏళ్ళ ఆస్కార్ అకాడమీ అవార్డులు
ఒకటీ అరా అందుకున్నా
తెలుగువారికి రాలేదన్న లోటు తొలుస్తూనే ఉంది 
తెలుగు చిత్ర పరిశ్రమ మనసులో
 
అదుగో సరిగ్గా అప్పుడే 
సవాలుకి
*సై* అనటానికి నేనున్నాను అంటూ
 ఊడిపడ్డాడు ఈ
తెలుగు చలనచిత్రరాజ మౌళి
చిత్రసీమలో కొత్త సిలబస్ చదవటం మొదలుపెట్టిన ఈ 
*స్టూడెంట్ నెంబర్ వన్*
*యమదొంగ* ను
*మగధీర* ను కలుపుకుని
*విక్రమార్కుడి* లా పరాక్రమాన్ని 
*ఛత్రపతి* లా సాహసాన్ని ప్రదర్శించి
*సింహాద్రి* అప్పన్న దయతో
*బాహుబలి* లా ద్విగుణమై ఎదిగి
ఆస్కార్ ను సాధించి
తెలుగు వారి
*మర్యాదరామన్న* గా మన్నన పొందాడు 
*ఈగ* లా మమ్మల్ని
చిన్నచూపు చూడొద్దు సుమా!
మేం తలచుకుంటే చరిత్రను తిరగరాయటం కాదు
చరిత్రనే సృష్టించగలం 
అని 
*ప్రేమ్ రక్షిత్* స్టెప్పుల సాక్షిగా
*రాహుల్ సిప్లిగంజ్,కాలభైరవ* ల గళం సాక్షిగా 
నిరూపించాడు


ఎన్నో అత్యద్భుత గీతాలు,నాట్యాలు ఉన్న తెలుగు పాటల్లో
ఈ నాటు నాటు గొప్పేమిటి?అని కొంతమంది పెదవి విరిచినా
జనం నాడి పట్టుకున్న
*చంద్రబోసు* పల్లె పదం 
*కీరవాణి* రాగంలో పల్లవించాక
ఈ పాటకి
ముమ్మాటికీ 
ఆ అర్హత ఉన్నదని 
స్వర్ణగోళ పురస్కారం కూడా అంగీకరించాక
   ఇక ఆస్కార్ అవధిని  అందుకోవడానికి అడ్డు ఏముంటుంది?
ఇది తెలుగులకు
ప్రపంచ వేదికపై లభించిన గుర్తింపుకాక
మరేమౌతుంది?
ఏదేమైనా
*శుభకృత్* శుభమంటూ
వెళ్ళిపోతూ
*శోభకృత్* కి శోభనద్దిన 
ఈ ట్రిపులార్ *RRR*
( *రాజమౌళి*
*రామారావు*
*రామ్ చరణ్*) కు 
*త్రీ చీర్స్*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.3.2023


****************************
శుభకృత్ నామ సంవత్సర ఉగాది (2022)
***************************

బంధుమిత్రులందరికీ *శుభకృత్* నామ ఉగాది శుభాకాంక్షలతో 
 కష్టసుఖాల కలబోతతో నా  కవిత ( కాదు,కాదు కవితలాంటిది😍)

*స్వయం(శుభ) కృతమా?*(🤔)

ప్లవా!ఓ ప్లవా!
ఆగాగు.
ఏమిటా పరుగు?
నిన్ను ఇల్లు ఖాళీ చేయించి
నేను గృహప్రవేశం చేయబోతున్నాననా!
అలా ముఖం చాటేసి
 వెళ్ళిపోతున్నావు?
ప్లవ అంటే
దాటించేదే కానీ
ఇలా దాటుకుపోయేది కాదు కదా!
ఆరునెలలు సావాసం చేస్తే
వారు వీరవుతారు అంటారు
కాల స్వరూపానివైన
నువ్వు కూడా
ఏడాది సహవాసం చేసి
ఈ మానవుల రాగద్వేషాలు
మనసుకు పట్టించుకున్నావా ఏమిటి?

అదేం లేదు శుభా!
వికారి చూపించిన వికారాలను
శార్వరి కప్పిన చీకట్లను
నేనేదో తప్పించి
తమను 
కష్టాల కడలిని దాటించేస్తానని
గంపెడాశతో
తెలుగు వారు
నాకు 
కరోనా ముసుగు మాటులోనే
కాసింత
ఘన స్వాగత సత్కారాలే చేశారు నిరుడు
కానీ
నేను వారికి ఏమీ చేయలేకపోయానే!
 అనే బాధతో వెళ్ళిపోతున్నాను 
ఇప్పుడిప్పుడే
కాస్త ముఖానికి తగిలించుకున్న
ఆ ముసుగును తొలగించి
ఊపిరి పీల్చుకుంటున్నారా!
నా ఊపిరి నీకు తగిలితే
అది నాల్గవ  వేవ్ 🌊 గా
నిన్ను కూడా ముంచేస్తుందేమోనని భయపడి
వెనక్కి తిరిగి చూడకుండా
వెళ్ళిపోతున్నా!
అపార్థం చేసుకోకు సుమా!
అర్థం
చేసుకో మిత్రమా!

సరేలే ప్లవా!
కష్టాలు 
మనుషులకు కాక
మానులకొస్తాయా!
నీ అనుభవాలు
నాలుగు ముక్కల్లో చెప్పిపో
విని తెలుసుకుంటాను
నా పేరు నిలుపుకునే
 ప్రయత్నమూ చేస్తాను

ఏముంది చెప్పడానికి?
ఈ ఏడు ఉగాది పచ్చడిలో 
చేదు పాలే ఎక్కువగా ఉంది

సినీ వినీలాకాశాన్ని
వెలిగించిన సిరివెన్నెలను 
మృత్యు అమావాస్య కబళించింది

పాటల తోటలో
రాగాలహాయి నింపిన
నైటింగేల్ లతాదీదీని
కరోనా పొట్టనపెట్టుకుంది

బూటకాల మొసలి కన్నీళ్ళు
బూతులు పంచాంగాలు
కంటికి,చెవికి 
భరించరానివై
అసలే
అర్థనగ్నంగా ఉన్న
రాజకీయ వలువలను
మరింతగా దిగజార్చాయి

 రష్యా ఉక్రెయిన్ యుద్ధమేఘాలు
భయంకరమైన
బాంబుల వర్షాలతో
అక్కడి జనజీవితాన్ని అస్తవ్యస్తం జేయటమే కాక
మిగిలిన ప్రపంచాన్ని కూడా
ఆర్థిక సంక్షోభపు వరదలో ముంచి
అతలాకుతలం చేస్తోంది

పద్యవిద్య ప్రతిభకు పట్టం కట్టి ప్రభుత్వం
పద్మశ్రీ తో సత్కరిస్తే,
అనాదిగా వస్తున్న
సామెతను
అప్పుడే విన్నట్లు
అతనే పుట్టించినట్లు
కులం బురదను తవ్వి దానికి
అంటించే ప్రయత్నం జరిగింది
బురదలోనే కదా!
పద్మం ప్రకాశించేది
అని విజ్ఞత నవ్వుకుంది
సారీ చెప్పేస్తే పోలా!అని
చేతులు జోడించి
క్షమాభిక్షనూ కోరింది

టీజింగ్ *వినోదా* నికి
అమాయక బాలిక
ఆత్మహత్య 
నాలుగు రోజుల
కాలక్షేపపు కబురై
కనుమరుగయ్యింది

ఒలింపిక్స్ లో
నీరజా చోప్రా విసిరిన జావలిన్
బంగారు పతకాన్ని 🏅
భరతమాత మెడలో అలంకరించింది

రామానుజుల
సమతామూర్తి విగ్రహం 
రాజకీయాలలోని
అసమానతా మూర్తిమత్వానికి 
నిలువెత్తు నిదర్శనమయ్యింది

చివరగా ట్రిపుల్ ఆర్
సంరంభంతో 
ఇదిగో ఇలా
కాసింత ఉత్సాహాన్ని
నింపుకుని వెళ్తున్నా

విన్నావుగా
  ఇవి కొన్ని
తక్కినవి నువ్వే ఆకళింపుచేసుకో.
శుభకృతవై
నీ ఉగాది పచ్చడిలో
తీపి పాలు పెంచి
జగతిని ఆదరించు
తెలుగు వారిని అలరించు
మరి వెళ్ళి 
(అరవయ్యేళ్ళకు మళ్ళీ) వస్తాను
శుభకృతా!
శుభమ్ భూయాత్.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.4.2022
**************************
ప్లవనామ సంవత్సర ఉగాది
(2021)
*************************
బంధుమిత్రులందరికీ *ప్లవ* నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
అందమైన కందంతో...

కందం.
శార్వరి తపింపజేయగ
నిర్వీర్యత కుములుచున్న నిఖిల జగతికిన్
సర్వము శుభమై తరియగ
పర్వమ! రమ్మా! ఉగాది ప్లవ వత్సరమా!

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.4.2021





***************************
శార్వరి ఉగాది (2020)
***************************
శార్వరి ఉగాది కవిత
మళ్ళీ మరోసారి....
అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలతో నా 
దీర్ఘ కవిత

  ***కకావికలం***

ఏమిటిది వికారీ!
ఉగాది సందడేదీ ఈసారి?
వేపపూత దూసిన జాడ లేదు
మావిడాకు తోరణాలు కానరావు
దేవుళ్ళు తలుపుల్ని మూసేసుకున్నారు
మానవులు కన్నెత్తి నను చూడకున్నారు
కవి కోయిలల కంఠాలు వినబడవు
పంచాంగ శ్రవణాల
ఆసక్తి కనబడదు
విధుల్లో ఉన్న 
యంత్రాంగం తప్ప
వీధులన్నీ నిర్మానుష్యం
అక్కడక్కడా అరకొరగా
ఉన్నవారిలో వింతభయం
సీతారామలక్ష్మణులు వనవాసం వెళ్ళాక
పుత్రశోకంతో దశరథుడు
ప్రాణాలు విడిచాక
రాజ్యంలో అడుగిడిన
భరతుడికి కనిపించిన
అయోధ్య లా అగుపిస్తున్నదేల
ఈ తెలుగు నేల?
మనసేదో కీడును శంకిస్తోంది
నీ మౌనం కలవరపెడుతోంది
ఇంతటి నిర్వేదం నిండడానికి
ముంచుకొచ్చిన ఆ ముప్పేమిటి?
కాలాన్ని శాసించే
నిర్వికార రూపానికి
కన్నుల్లో ఆ సన్నటి
కన్నీటి తెరదేనికి?
చెప్పు వింటాను
ఇకపై నే చూసుకుంటాను

ఏం చెప్పను శార్వరీ!
నోటమాట రాకున్నది
ఉన్న ఏడాదిలో
ఉగాది షడ్రుచులూ
చూపించేశానని
అన్నిటినీ తట్టుకొనే
ఆత్మబలం నింపాననే
నిన్నమొన్నటి దాకా
అనుకున్నా

మూడు రాజధానులుగా
ముక్కలైన పులుపులో
అభివృద్ధి ఫలాలు
వేగంగా 
అందుతాయిలే అని సంబరపడ్డా

ఇంగ్లీషు మీడియం
తప్పదన్న చేదులో
పేదింటి చిన్నారులు
పెద్ద పదవులకొస్తారని
సర్దుకుని సంతోషించా

దిశకు జరిగిన అన్యాయం
మండించిన కారాన్ని
నిర్భయ హంతకుల ఉరితో
ఊరటచెంది చల్లార్చుకున్నా

చంద్రయానం సఫలం
అనుకుంటున్న ఆఖరిక్షణంలో
ఒరిగిందన్న వగరు తగిలినా
సాధించింది తక్కువ కాదని
అర్థం చేసుకుని ఆనందించా

గోదావరి పడవ మునక
కన్నీటి ఉప్పదనాన్ని రుచి చూపించినా
గుండె దిటవు చేసుకుంటూ
దుఃఖాన్ని దిగమింగుకున్నా

యువనేత నాయకత్వం లో
ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం
తొలి తీపి కబురు గా
ఆంధ్ర ప్రజల కందించా

సంతృప్తితో సెలవు తీసుకుందామని
సన్నాహం చేసుకుంటున్న
సమయంలో
కరోనా మహమ్మారి
కబళించ వచ్చింది
విదేశాల నుంచి సంక్రమించి
మృత్యుదేవత
వికటాట్టహాసాలతో
విలయతాండవం చేస్తానని
భయపెడుతున్న
ఈ ఉపద్రవాన్ని
నయం చేసే మందులేదుట
నివారించే మార్గం తప్ప
సామాజిక దూరం అనివార్యం
శార్వరీ!ఆ ఫలితమే ఈ దృశ్యం
భారం నీపై వదిలేసి
భారమైన హృదయంతో
వెళ్ళలేక వెళుతున్నా
భద్రతను, భరోసాను
నీకు అప్పగించి పోతున్నా
ప్రభుత్వాలలాగే నీవు కూడా
కాస్త కఠినంగా ఉండు 
కనిపెట్టుకొని ఉండు

ఈ చేదుని నాతోనే పోనివ్వు
నీ రాకతో బ్రతుకు తీపినందివ్వు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.03.2020

*************************
వికారి నామ ఉగాది (2019)
**************************
అందరికీ
వికారి ‌ నామ 
******
సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
నా కవిత

ఎన్ని కల ల రాశులు

ఇది ఎన్నికల ఉగాది
ఎన్నో కలల ఉగాది

ఎన్నికల సూర్యుడు
ఎక్కడ లేని వేడి పుట్టిస్తుంటే
తాపం తట్టుకోలేని విళంబి
కాలం తలుపు చాటుకు 
తరలిపోయింది
ఉత్సుకతను నింపుకున్న ఉగాది మాత్రం
వికారిని వెంటేసుకుని వచ్చేసింది

చైత్రం
వసంతుడు
మల్లెలు
మామిళ్ళు
ఆకులందున
అణిగి మణిగిన
కవిత కోకిల కలకూజితంలా
అక్కడక్కడా
అరకొరగా
కవుల గళంలో
వినిపిస్తున్నప్పటికీ
ప్రతి సామాన్యుడి ధ్యాస
రాజకీయ పంచాంగం పైనే
ప్రతి నాయకుడి ఆశ
ఓటరు పురోహితుడు
ప్రవచించబోయే
తమ రాశిఫలాల గురించే

మనసులో ఎన్ని భయాలున్నా
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ
గెలుపు మాదే అని
చాటుతున్న
మేష హృదయం కొందరిది

వృషభం ఊరేగిస్తుందో!
కొమ్ము సాచి విసిరేస్తుందో!
అన్న ఊగిసలాట కొందరిది

గెలుపు ఖాయమనుకున్న
పార్టీ లోకి
గెంతేసి చేరుకుని
కొత్త పొత్తులు పెట్టుకొని
జతకట్టిన
మిథునాలు కొందరు

ఏమీ ప్రయోజనం లేని
ఎండ్రకాయలంటూ
ప్రజలు పెదవి విరుస్తున్నా
పగలబడి నవ్వుతున్నా
పీత కష్టాలు పీతవన్నట్లుగా
ప్రచారం చేసుకుపోతున్న
కర్కాటకాలు కొందరు

అడవికి రాజు మృగరాజు
ఆంధ్ర రాష్ట్రానికి నేనే రాజు
అని నమ్మబలుకుతూ
మహానేత మంత్రాన్ని
పఠించే
సింహాలు కొందరు

అమ్మవారి ని మంచి చేసుకుంటే
అయ్యవారి అనుగ్రహం పొందవచ్చునని
మము బ్రోవమని చెప్పవే 
అన్నాడు రామదాసు

ఆడబడుచులను
ఆకట్టుకుంటే
ఓటు కన్యల
హృదయ బ్యాంక్ లు
కొల్లగొట్టవచ్చునని
ఊహించి
పసుపు కుంకాలిచ్చి
పండిపోదామని కొందరు

తమతమ పదవీకాలాలను
సరిచూసి తులతూచి
తగిన నాయకుణ్ణి
ఎన్నుకోమని
ప్రజల విజ్ఞతకు
పదును పెడుతున్నవారు కొందరు

కులం విషం చిమ్ముతూ
కూటనీతి చూపుతూ
వృశ్చిక మై కాటువేస్తున్న
వినీతులు కొందరు

ప్రచారాల సంగ్రామంలో
ప్రలోభాల ధనుస్సు
నెక్కుపెట్టి
పదవీ విజయం
పొందాలన్న
పట్టుదల తో కొందరు

ఆదమరచి ఉన్న
ఓటరు కరి కాలును
నోటు నోట
కరచి పట్టుకుని
లాక్కోవాలని ప్రయత్నిస్తూ
మందు మత్తులో
ముంచేస్తున్న
మకరాలు కొందరు

గెలుపు అవకాశాలు
తమ పార్టీ అభ్యర్థులకు
అంతంత మాత్రమే
అసలున్నాయో లేదో కూడా
అన్న సందేహాలు
అంతటా ఉన్నా
పైకి మాత్రం గుంభనంగా
పూర్ణ కుంభాలల్లే కొందరు

తాము పార్టీ చెరువునుండి
ఒడ్డున పడ్డ
చేపలమని
తెలిసిపోతున్నా
ఆశచావక
ఎవరో ఒకరు
ఆదుకోకపోతారా 
అనే బింకం తో
కొట్టుకుంటూ న్న
మీనాలు కొందరు

ఏదేమైనా
పదవి ప్రభుత్వం
చిటారుకొమ్మన
మిఠాయి పొట్లం

రేపు నాయకులెక్కే
పల్లకీని మోసే
బోయీలు కానున్న
ఈ ఓటర్లు
నేడు మాత్రం
వరాలిచ్చే దేవుళ్ళు
నాయకుల రాశి ఫలాలు
తేల్చి చెప్పే పూజారులు

మరి
ఆ దేవుళ్ళు వరమిస్తారో
పూజారులు
కరుణిస్తారో
వేచి చూద్దాం

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.4.2019.



*************************
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది (2018)
*****************************🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀*****************************

ముఖ పుస్తక మిత్రులందరికీ
శ్రీ విళంబి నామ సంవత్సర 
ఉగాది శుభాకాంక్షలు.

            శుభ విళంబి 

శ్రీ...లు విలసిల్లి సుఖములు స్థిరము గాగ
వి..జయ పథ మెన్నడును మిము వీడక, నక
ళం...క చరిత సీతమ్మ  మీ వంక దయను
బి..ట్టు జూపగ తొలగు చెట్ట లెట్టివైన.

నా..కవిత కోయిల గళఫు నాద మెగయ
మ..ధుర వాసంత శోభలు మల్లె గురియ
నూ..పురములు ఘల్లన దాల్చి నూత్న కళల
త..రలి వచ్చినది యుగాది ధరణి కిపుడు.

న..వ్వు లన్నియు మీ యింట గువ్వలవగ
ఉ..న్నతియు ,సమృద్ధియు నొప్పునటుల
గా..సి బెట్టెడు కష్టమ్ము కలుగకుండ
ది..నము మిము గాచు గావుత దేవగణము.

వ..రుస శుభములు జరిగి, వ
త్స..ర మెల్లను పండుగై సతము మీకు వికా
ర..రహిత జీవితమిడి పర
శు..రామ గర్వాపహారి చూచెడు గాకన్.

భా..వి యాశలు నెరవేరి బ్రతుకు నిండ
కాం..తి పుంజము ప్రసరించి కలలు పండి
క్ష..మకు నెలవై హృ దయములు శాంతి సుఖము
లు... జగతి జనుల కెల్ల కలుగును చూవె.

సీంహాద్రి జ్యోతిర్మయి
18.3.18.

*****************************🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀*****************************

*****************************
హేవిళంబి నామ ఉగాది (2017)
****************************

ముఖపుస్తక మిత్రులందరికీ
ఉగాది శుభాకాంక్షలు.

నా ఉగాది కవిత

వార్తా కదంబం

హేవిళంబి,హేవళంబి
హేమలంబ,హేమలంబి
ఏది నీ నామధేయం?
మార్చి ఇరవై ఎనిమిదా!
ఇరవై తొమ్మిదా!
ఎప్పుడు నీ ఆగమనం?
సందేహాల తోరణాలు వేలాడదీసిన
వివాదాల వాకిట్లోకి
విచ్చేస్తున్న వేళ నీకు
దూరమవబోతున్న దుర్ముఖి
నడిచి వచ్చిన దారిలో
నాలుగు మైలు రాళ్ళను
పరిచయం చేస్తాను.

ప్రపంచం నిన్న గ్లోబల్ విలేజ్
నేడది వైఫై గూటి గువ్వ
కృష్ణుడి నోట ముల్లోకాలనూ గని
మురిసిన యశోదలాగా
స్మార్ట్ ఫోనులో
సకల ప్రపంచాన్ని
వీక్షించి విస్తుపోతోంది నిన్నటి తరం.

విష్ణుమూర్తి చూపుడువేలు
సుదర్శనాన్ని ధరించినట్లు
నేటి మానవుడి చూపుడువేలు
ప్రంపంచాన్ని చుట్టేస్తోంది.
అరచేతిలో వైకుంఠం నాటిమాట
అరచేతిలో ఆండ్రాయిడ్
కొత్త పాట.

రక్తం రుచి మరిగిన దాయాది దేశం
ఉరీ దారుణానికి తెగబడటంతో
రక్తం మరిగిన భారత సైన్యం
సర్జికల్ దాడులతో 
సమాధానం చెప్పి
శాంతి మబ్బుల మాటు
భారత సూర్యుడి ప్రతాపాన్ని
బహిర్గతం చేసింది.

సాగరతీరాన్ని
సునామీ తుడిచినట్లు గా
పెద్దనోట్ల రద్దుతో
పెను సంచలనం సృష్టించిన
నరేంద్రుడి‌ సాహసం
గడ్డి పోచలకు గడ్డుకాలమయ్యింది గానీ
ఏనుగు కుంభస్థలాన్ని
బద్దలు కొట్టలేకపోయిందని
నిరాశావాదులు నిట్టూరిస్తే
విత్తు నాటగానే
ఫలసాయం రాదుకదా!
వేచిచూద్దాం
అంటున్నారు ఆశావాదులు.

భవిష్యత్తులో బంగారంపై
ఆంక్షలు విధిస్తారని
ఊహించి కాబోలు
సింధు స్వర్ణం జోలికి పోక
రజతంతో సరిపెట్టుకుంది.

ఆసుపత్రిలో చేరడం మొదలు
అంత్యక్రియల వరకూ
ఆద్యంతమూ ఉత్కంఠను రేకెత్తించిన
పురుచ్చితలైవి నిష్క్రమణం
పన్నీరుకు కన్నీరును
శశి కళ కు చెరసాలను
మిగిల్చిపోయింది
సహచరి సమాధివద్ద
చిన్నమ్మ చేసింది శపధమా!
పెట్టింది శాపనార్థమా!
అర్థంకాని అయోమయంలో
ఎవరికి తోచిన భాష్యం
వారు చెప్పేశారు.

వెల్లువెత్తిన నిరసనల మధ్య
అమెరికా అధ్యక్షుడైన ట్రంపు
జాతి విద్వేష బీజం నాటి
విషవృక్షంలా విస్తరింపచూస్తున్నాడు
అతని పోకడ
మూడవ ప్రపంచ యుద్ధానికి
ముహూర్తం పెడుతుందేమోనని
అందరూ   హడలిపోతున్నారు.

అత్యాధునిక హంగులతో
అసెంబ్లీనైతే నిర్మించారుగానీ
పాలక ప్రతిపక్షాల
వైఖరిలో మాత్రం మార్పులేదు.
పిల్లి ఎలకా పోరాటం
టాం అండ్ జెర్రీ టీజింగ్ లా మారిందంతే.

శతాధిక శాటిలైట్ లను
గగనతలానికి
ఏకకాలంలో తరలించిన
శ్రీ హరి కోటవైపు
విశ్వం విస్మయంతో వీక్షించింది.

నిన్నటి కొన్ని వార్తలివి
నువ్వేం చేస్తావో చూడాలి మరి
అన్ని రుచులూ ఆస్వాదించాల్సిందే గానీ
అధిక మోతాదులో 
తీపినందించమని ఆశించడం
తప్పుకాదుగా!
అన్నిటికంటే ముందుగా
కట్టప్ప బాహుబలిని చంపిన
కారణాన్ని వెల్లడి చేసి
మెదళ్ళను తొలిచేస్తున్న ప్రశ్నకు
బదులు చెప్పబోతున్నావన్న
ఆనందం అతిశయిస్తోంది 
సినీ అభిమానుల్లో.
దుర్ముఖి చివరగా
ఆస్ట్రేలియా పై అందించిన
టెస్ట్ సిరీస్ కప్పులో
ఉగాది పచ్చడి ప్రసాదాన్ని
ఆస్వాదింపజేస్తూ అరుదెంచిన
హేవిళంబీ!
నీకు స్వాగతం
శుభ స్వాగతం
ఘన స్వాగతం.

సింహాద్రి
29.3.2017.

**************************
దుర్ముఖి నామ ఉగాది (2016)
****************************

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది 2016 

*విహంగ వీక్షణం*

అనంతకాలగమనంలో 
అరుదెంచిన మరొక్క ఉగాది 
శిశిర మన్మథాన్ని వీడ్కొలిపి 
వసంత దుర్ముఖాన్ని వరించింది 

ఒక చైత్రం 
సీతారాముల కళ్యాణానికి 
ప్రకృతిని సింగారించడానికి 
ఆత్మబంధువులా అరుదెంచి 
సన్నాహాలు మొదలుపెట్టింది 

ఒక అపార జ్ఞానసాగరం 
మచ్చలేని మన భారతరత్నం 
పాఠం చెబుతూనే 
ప్రాణం విడవాలన్న 
సంకల్పాన్ని సాకారం చేసుకుంటూ 
షిల్లాంగ్ లో ఉపన్యసిస్తూనే 
చివరి శ్వాస తీసుకుంది 

ఒక నిరంతర రాగసాధన 
గొంతు రెక్క విప్పుకున్న 
మన గానకోకిలను 
గిన్నిస్ కొమ్మపై కూర్చోబెట్టింది 

ఒక స్వాప్నికుడి కళాతృష్ణగా
బాహుబలికి ప్రారంభమై
వెండితెరపై జక్కన్న చెక్కిన 
అపురూప చిత్ర శిల్పానికి 
జాతీయ గుర్తింపు తెచ్చింది

ఒక పరాజయం 
విరాట్ పోరాటాన్ని విఫలం చేస్తూ 
ప్రపంచకప్పులో 
ఉగాది పచ్చడిని 
ఆస్వాదించాలని ఆశపడిన 
క్రీడాభిమాన కెరటాన్ని 
అణగార్చిపోయింది 

ఒక సుందర స్వప్నం 
అంబరాల అమరావతిని 
తెలుగునేలకు దింపి 
ఆవిష్కరించబోయే అద్భుతానికి 
అంకురార్పణ చేసుకుంది 

ఒక సభాపర్వం 
పాలక ప్రతిపక్షాల 
వ్యక్తిగత దూషణలకు వేదికగా మారి 
ప్రజాభిమానాన్నే కాదు 
ప్రజాభిప్రాయాన్ని కూడా పరిహాసం చేస్తోంది

ఒక తొందరపాటు నిర్ణయం 
చైతన్యపు స్ఫూర్తిగా ఊహించుకున్న 
ప్రత్యూష కిరణమై ప్రకాశించవలసిన 
చిన్నారి పెళ్ళికూతుర్ని చిదిమేసింది 

ఒక విశ్వవిద్యాలయం 
బలవన్మరణాన్ని బజారుకీడ్చి 
వేళ్ళూనుకున్న వర్ణవివక్షను వేలెత్తి చూపుతూ 
రాజకీయ స్వార్థాల రణస్థలమయ్యింది

ఒక బాధ్యతారాహిత్యం 
వైద్యుడే నారాయణుడన్న 
వాస్తవాన్ని వమ్ముచేసి 
కాసుల కక్కుర్తిలో 
మూర్ఖుడి కాళ్ళువిరిచిన 
తన సాహసాన్ని 
సమర్థించుకుంటోంది

ఒక స్వార్థపరత్వం 
చుట్టరికాల చెట్టుకొమ్మల్ని 
నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ 
పూజించాల్సిన పెద్దరికాన్ని 
వృద్ధాశ్రమాల వాకిళ్ళముందు
వదిలేసి పోతోంది 

ఒక నల్లధనపు భాండాగారాన్ని 
బద్దలుకొడుతున్న 
పనామా పంచాంగం 
అవినీతి ప్రపంచంలో 
ప్రకంపనలు సృష్టిస్తోంది 

ఒక ప్రకృతి వైపరీత్యం 
నీటి చుక్కలు నిండుకుని 
ఆర్చుకుపోయిన అమ్మ కడుపు 
మూలాలను కదిలిస్తూ 
పడిలేస్తున్న ఈతచెట్టు 
ప్రమాదఘంటికలను 
వినిపిస్తోంది 

ఊపిరికోసం పెనుగులాడుతూ 
మంచం పట్టిన మన్మథుణ్ణి 
ఓ దుర్ముఖీ!
నీవే శుచిముఖివై 
ఆశల ఊపిరినింపి 
ఊరడించి పంపించు 
సమస్యలతో సతమతమవుతూ 
విలవిలలాడుతున్న 
ఈ సమాజాన్ని 
హేవిళంబికి నడిపించు



ఉగాది పచ్చడి

సీసం
చింతపండు రసము,చిటికెడు లవణము
            తురిమిన బెల్లము,మిరప కాయ
వగరైన మామిడి,తగు వేప పూతయున్
            చేర్చ ప్రసాదమ్ము సిద్ధమగును
తీపి ఉప్పు పులుపు వేప చేదు కలిసి
             వగరు కారము లారు వరుస రుచులు
అంతతో మెచ్చరీ ఆధునికులు గనుక
             ఇవికూడ చేర్చండి ఇష్టమవగ

ఆ.వె.
అరటిపండు గుజ్జు అదనపు రుచినిచ్చు
జీడిపప్పు కాస్త చేర్చ వచ్చు
కూర్చినంత కొన్ని కొబ్బరి పలుకులు
మేటి రుచిని మెచ్చు నేటి తరము.


*****************************
మన్మథ నామ ఉగాది (2015)
*****************************


 మన్మథ నామ సంవత్సరం ప్రభుత్వం వారు నిర్వహించిన కవి సమ్మేళనం లో చదివిన కవిత.

కలగాపులగం.

తలవాకిట నిలబడి
తటపటాయిస్తున్నావేం మన్మథా!
మీ తాతగారు సముద్రుడు
విశాఖ మీద విరుచుకుపడి
సృష్టించిన విలయానికి
నిన్ను నిందిస్తారనా!
మానవ తప్పిదాలనే శిక్షించలేని మేము
ప్రకృతి పై కత్తికట్టగలమా!
అదీగాక
మన్మథుడంటే నాగార్జున
అనుకునే నవతరానికి
నీ చరిత్ర తెలిసే అవకాశమే లేదు
ధైర్యం గా వచ్చేసేయ్
నమ్మలేనట్లు ఏమిటలా
నలువైపులా చూస్తున్నావు?
నగరం నేడు కాంక్రీటు కీకారణ్యం
పసుపు గడపలు,పచ్చ తోరణాలు
పనిగట్టుకు వెతికితే గానీ కనపడవు
వేగం‌ పెరిగిన జీవితాల్లో
సంప్రదాయ వేడుకలకు సమయమేదీ!
అందుకే మేము
చేసుకోవలసిన పండుగలన్నీ
బుల్లితెరపై చూసి ఆనందిస్తాము

హద్దులు మారిన ఆంధ్రదేశంలో
స్వయం ప్రకాశక శక్తిలేని
మా చంద్రుడు
కేంద్ర సూర్యుడి నిధుల కిరణాలు తగిలితేనేగానీ
మమ్మల్ని చల్లగా పాలించటం సాధ్యం కాదంటుంటే
ప్రజా సమస్యలు అప్రధానమై
ప్రజాధనం దుర్వినియోగ మై
శాసనసభ పరస్పర శాపనార్థాల
వేదికగా మారింది
అంతర్జాలపు సాలెగూటిలో
చిక్కుకున్న నేటి తరం
రాజమౌళి ఈగలా అద్భుతాలు ఆవిష్కరిస్తూనే
అపాయాలూ కొనితెచ్చుకుంటోంది
పిజ్జా లూ బర్గర్లతో బొజ్జలు నింపుకుని
భూతద్దాల కళ్ళజోళ్ళతో
బొద్దుగా కనపడుతున్నది
మరెవరో కాదు, మా పిల్లలే.
ఒంటికి పూర్తిగా విశ్రాంతి నిచ్చి
కంటికీ పంటికీ మాత్రమే
శ్రమనిస్తున్న ఫలితంగా
అరవయ్యేళ్ళకు రావలసిన జబ్బుల మూలాలు
ఇరవయ్యేళ్ళకే కనబడుతున్నాయని
ప్రపంచ ఆరోగ్యసంస్థ
పదే పదే హెచ్చరిస్తున్నా
పట్టించుకునేదెవరు?
పాఠశాల పంజరంలో
పుస్తకాల జామముక్కలు
కొరుక్కునే చిన్నారులకు
రెక్కవిప్పి ఎగిరే స్వేచ్ఛ ఏదీ!
మన్మథా!నువ్వు మాకు ఇష్టుడవేగానీ
అప్పుడప్పుడూ దుష్టుడివి కూడా
అందుకే నీకో షరతు
నీ ప్రతాపాన్ని ఆలుమగలపై చూపించి
అన్యోన్యత పెంచుగానీ
నీ సమ్మోహనాస్త్రాలను
చిత్రాలతో ప్రయోగించి
పసిమనసుల్ని పాడుచేయకు.
మానభంగానికి‌ ఎదురుతిరిగితే
మారణమే తగినశాస్తి అని
నిస్సిగ్గుగా ప్రకటిస్తున్న కామాంధుల్ని
నీ జీవితం సాక్ష్యంగా చూపించి హెచ్చరించు

మెదడుకూ మనసుకూ మధ్య
సంబంధం తెంచుకుంటున్న
మర మనుషులకు
అవయవ దానంతో అమరుడై
మానవత్వపు మెడలో అమరిన
మణికంఠ హారాన్ని చూపించు

బదిలీమీద వెళ్ళిపోయిన
భద్రాద్రి రామయ్యను
వెతికి పట్టుకుని
కల్యాణ వేడుక వేదిక సిద్ధం చేసుకుంటున్నాము
కాస్త వసంతుణ్ణి వెంట తెచ్చుకుని
చలువ పందిళ్ళకు సాయమందించు
గూడులేని మమ్మల్ని గుర్తుపెట్టుకు కాపాడమని
ఆపద మొక్కుల వాణ్ణి అర్థిస్తున్నామని చెప్పు
రాజధాని నిర్మాణానికి
భూములిచ్చిన రైతన్నల ఇంట
కాసుల పంట పండించి కరుణించమని
కనకదుర్గమ్మకు విన్నవించు.
చేదు పాళ్ళు తగ్గించి
తీపి మోతాదు పెంచిన
ఉగాది పచ్చడిని
ప్రపంచ కప్పులో పట్టుకొచ్చి
పరమానందం కలిగించు
ఉగాదిని మా జీవితాల్లో
శాశ్వతంగా ఉంచేసి వెళ్ళు.

సింహాద్రి
21.3.2015.
****************************
జయ నామ ఉగాది (2014)
****************************

🍁🍁🍁🍁🍁
 మధ్య తరగతి పెళ్ళి రుచులు
🍁🍁🍁🍁🍁

అమ్మాయి పెళ్ళి...
తీపి అనుభవం
అభిమానం చంపుకుని
అందరిముందూ
చేయి చాచటం...
చేదు వాస్తవం
పెరిగిపోతున్న ఖర్చు లు ...పులుపు
పెట్టుపోతల తర్జనభర్జనలు... వగరు
అందిన చోటల్లా
తెచ్చుకుంటున్న అప్పు... ఉప్పు
కన్నబిడ్డ ఇక 
పరాయి ఇంటిదైపోతుందని
కన్నీరు పెట్టిస్తున్న 
మమకారం... కారం
లేదని ఒప్పుకోలేక
చేయలేమని చెప్పుకోలేక
ఉన్నదని భ్రమపెడుతూ
లేనిపోని భేషజాల
పులితోలు కప్పుకున్న
మేకపోతు గాంభీర్యం
మధ్య తరగతి మనస్తత్వం.


**************************
విజయ నామ ఉగాది (2013)
**************************

**************************
నందన నామ ఉగాది (2012)
**************************

భక్తి నందనం

భక్తి వసంతం
మనసులోకి రాగానే
సంసారపు చేదు
అనుభవంలోకి వచ్చింది
ధ్యానం మల్లె సుగంధమై
పరవశింప జేసింది
శ్రవణం కోయిలగానంలా
మైమరపించింది
కీర్తనం తీయ మామిడి రుచిలా
చవులూరించింది
దర్శనం చైత్రాన్ని తిలకించిన
అనుభూతినిచ్చింది
మనసు
మూర్ఖపు ఖరాన్ని వీడి
నందనందన నిలయమై
నాట్యమాడింది

ఆరు ఋతువుల
కాలగమనాన్ని అధిగమించి
జీవితం
మోక్ష విజయ పథానికి
పయనమయ్యింది.

**************************
విరోధి నామ ఉగాది (2009)
***************************

వి (రో )ధి

నాకు ఉగాదులు లేవు
నాకు ఉషస్సులు లేవు
కాదిది ఒక కవి వేదన
నా చిన్ని గుండె ఆవేదన

పాలైనా మరవక మునుపే
పాకడం మానక మునుపే
నాన్న ఆశల నిచ్చెనపై
నడక మొదలుపెట్టిన నేను
నర్సరీ స్కూలు లో బొమ్మనయ్యాను

అమ్మ కౌగిట్లో‌ ఆదమరచి
జోలలు వింటూ బజ్జోవాలను
తీయని నా కల తీరకమునుపే
కాన్వెంట్ స్కూలులో
ఖైదీనయ్యాను

బాల్యమంటే నాకు తెలుసు
వేసవి సెలవల్లో ఆడుకునే
వీడియో గేములని
ఆటలంటే నాకు తెలుసు
ఎప్పుడైనా టీవీలో చూసే
క్రికెట్టు లాంటివని
ఇల్లంటే నాకు తెలుసు
పది రోజులు సరదాగా
గడిపివచ్చే హాలీడే రిసార్టని
అమ్మానాన్న నాకు తెలుసు
అప్పుడప్పుడూ
పలకరించటానికి వచ్చే
ఆత్మీయ అతిథులని
సంతోషమంటే నాకు తెలుసు
సెలవురోజున హాస్టలుకి వచ్చి
చెల్లి ఇచ్చే చాక్లెట్లు
అమ్మ తినిపించే లడ్లు
నాన్న తెచ్చే కారుబొమ్మ
అమ్మ కళ్ళల్లో నీటిచెమ్మ

గంటలు నిమిషాలుగా కరిగి
నా గుండెల్లో దిగులు నింపి
వారి కలలబరువు నాపై మోపి
టాటా చెబుతూ వెళ్ళిపోతుంటే
తలవంచుకుని నేను తల్లడిల్లాను

పది దాటి వచ్చాను
ఇంటరులో చేరాను
కార్పొరేటు కాలేజీ కార్ఖానాలో
విశ్రాంతి లేని శ్రామికుడినయ్యాను

ఇక్కడ ర్యాంకులనే భూతాలు
నన్ను భయపెడుతున్నాయి
నాన్న లక్ష్యం సాధించలేనేమో
అనే ఆలోచనలు బాధపెడుతున్నాయి
ముంచుకొచ్చే పరీక్షలు
ముసురుకునే ఆందోళనలు

ఆనందాలు అనేవి
నాకు అందని ఎండమావి
కంప్యూటర్ యుగంలో
కష్టం తప్పనిదే అగుగాక
నేను పోగొట్టుకున్న బాల్యం
నాకెవరు తెచ్చివ్వగలరిక?

విరోధీ!
ఇదేనా జీవిత పరమావధి!
అందుకే మీ అందరినీ
అడుగుతున్నా మరొక్కసారి

నాకు ఉగాదులేవి?
నాకు ఉషస్సు లేవి?

సింహాద్రి జ్యోతిర్మయి
24.7.2018

నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా
నేను మన్మథ నామ సంవత్సరం ప్రభుత్వం వారు నిర్వహించిన కవి సమ్మేళనం లో చదివిన కవిత.

కలగాపులగం.

తలవాకిట నిలబడి
తటపటాయిస్తున్నావేం మన్మథా!
మీ తాతగారు సముద్రుడు
విశాఖ మీద విరుచుకుపడి
సృష్టించిన విలయానికి
నిన్ను నిందిస్తారనా!
మానవ తప్పిదాలనే శిక్షించలేని మేము
ప్రకృతి పై కత్తికట్టగలమా!
అదీగాక
మన్మథుడంటే నాగార్జున
అనుకునే నవతరానికి
నీ చరిత్ర తెలిసే అవకాశమే లేదు
ధైర్యం గా వచ్చేసేయ్
నమ్మలేనట్లు ఏమిటలా
నలువైపులా చూస్తున్నావు?
నగరం నేడు కాంక్రీటు కీకారణ్యం
పసుపు గడపలు,పచ్చ తోరణాలు
పనిగట్టుకు వెతికితే గానీ కనపడవు
వేగం‌ పెరిగిన జీవితాల్లో
సంప్రదాయ వేడుకలకు సమయమేదీ!
అందుకే మేము
చేసుకోవలసిన పండుగలన్నీ
బుల్లితెరపై చూసి ఆనందిస్తాము

హద్దులు మారిన ఆంధ్రదేశంలో
స్వయం ప్రకాశక శక్తిలేని
మా చంద్రుడు
కేంద్ర సూర్యుడి నిధుల కిరణాలు తగిలితేనేగానీ
మమ్మల్ని చల్లగా పాలించటం సాధ్యం కాదంటుంటే
ప్రజా సమస్యలు అప్రధానమై
ప్రజాధనం దుర్వినియోగ మై
శాసనసభ పరస్పర శాపనార్థాల
వేదికగా మారింది
అంతర్జాలపు సాలెగూటిలో
చిక్కుకున్న నేటి తరం
రాజమౌళి ఈగలా అద్భుతాలు ఆవిష్కరిస్తూనే
అపాయాలూ కొనితెచ్చుకుంటోంది
పిజ్జా లూ  బర్గర్లతో బొజ్జలు నింపుకుని
భూతద్దాల కళ్ళజోళ్ళతో
బొద్దుగా కనపడుతున్నది
మరెవరో కాదు, మా పిల్లలే.
ఒంటికి పూర్తిగా విశ్రాంతి నిచ్చి
కంటికీ పంటికీ మాత్రమే
శ్రమనిస్తున్న ఫలితంగా
అరవయ్యేళ్ళకు రావలసిన జబ్బుల మూలాలు
ఇరవయ్యేళ్ళకే కనబడుతున్నాయని
ప్రపంచ ఆరోగ్యసంస్థ
పదే పదే హెచ్చరిస్తున్నా
పట్టించుకునేదెవరు?
పాఠశాల పంజరంలో
పుస్తకాల జామముక్కలు
కొరుక్కునే చిన్నారులకు
రెక్కవిప్పి ఎగిరే స్వేచ్ఛ ఏదీ!
మన్మథా!నువ్వు మాకు ఇష్టుడవేగానీ
అప్పుడప్పుడూ దుష్టుడివి కూడా
అందుకే నీకో షరతు
నీ ప్రతాపాన్ని ఆలుమగలపై చూపించి
అన్యోన్యత పెంచుగానీ
నీ సమ్మోహనాస్త్రాలను
చిత్రాలతో ప్రయోగించి
పసిమనసుల్ని పాడుచేయకు.
మానభంగానికి‌ ఎదురుతిరిగితే
మారణమే తగినశాస్తి అని
నిస్సిగ్గుగా ప్రకటిస్తున్న కామాంధుల్ని
నీ జీవితం సాక్ష్యంగా చూపించి  హెచ్చరించు

మెదడుకూ మనసుకూ మధ్య
సంబంధం తెంచుకుంటున్న
మర మనుషులకు
అవయవ దానంతో అమరుడై
మానవత్వపు మెడలో అమరిన
మణికంఠ హారాన్ని చూపించు

బదిలీమీద వెళ్ళిపోయిన
భద్రాద్రి రామయ్యను
వెతికి పట్టుకుని
కల్యాణ వేడుక వేదిక సిద్ధం చేసుకుంటున్నాము
కాస్త వసంతుణ్ణి వెంట తెచ్చుకుని
చలువ పందిళ్ళకు సాయమందించు
గూడులేని మమ్మల్ని గుర్తుపెట్టుకు కాపాడమని
ఆపద మొక్కుల వాణ్ణి అర్థిస్తున్నామని చెప్పు
రాజధాని నిర్మాణానికి
భూములిచ్చిన రైతన్నల ఇంట
కాసుల పంట పండించి కరుణించమని
కనకదుర్గమ్మకు విన్నవించు.
చేదు పాళ్ళు తగ్గించి
తీపి మోతాదు పెంచిన
ఉగాది పచ్చడిని
ప్రపంచ కప్పులో పట్టుకొచ్చి
పరమానందం కలిగించు
ఉగాదిని మా జీవితాల్లో
శాశ్వతంగా ఉంచేసి వెళ్ళు.

సింహాద్రి
21.3.2015.

నా (రీ) ఉగాది

అతడి చుట్టూ
అల్లుకున్న నా జీవితం
అలరించే షడ్రుచుల సమాహారం

అందం,చదువు,ఆస్తి
అన్నిటా అతడితో సమానమైనా
కట్నమిచ్చి తనను
కొనుక్కోవాలనే
అతడి అహంకారం
నా బ్రతుకులో కారం

ఇల్లు,పిల్లలు,ఉద్యోగం
బాధ్యతల బరువునంతా మోస్తున్నా
సానుభూతినైనా నాపై చూపని
అతడి పొగరు
నా జీవితం లో వగరు

అందం చెదిరిందని
ఆసక్తి తరిగిందని
నా ప్రేమను చిన్నబుచ్చి
అన్య కాంతలపై అతడు
ఒలకబోసే వలపు
నా పంటికింద పులుపు

తాగుడు,జూదం,వ్యభిచారమనే
తప్పులతో
అతడు తెచ్చుకునే ముప్పు
నా మనుగడ కబళించే ఉప్పు

నలుగురితో నా కలివిడితనం
అతడికి నచ్చకుంటే అపవాదు
నా గొంతుకది
మింగుడుపడని చేదు

ఇన్ని రుచులనూ
ఇముడ్చుకుంటూ
మాతృత్వపు మాధుర్యంతో
మగని వంశాన్ని నిలిపి
నే చాటుతుంటాను
బ్రతుకులోని తీపి

మగవాడి 
మనసు కొమ్మపై కోయిలనై
వసంతాలతో అలరించి
మల్లెలతో గుబాళించి
మామిళ్ళతో నోరూరించి
ఉగాదులే తీసుకొచ్చే
ఉవిదను నేను.

సింహాద్రి
26.3.2017.


Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ