8.కళ్యాణం - వైభోగం (పెళ్ళి పాటలు)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*కళ్యాణం వైభోగం" 
(పెళ్ళి పాటలు)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
1
*పెళ్ళి అమ్మాయి అభిప్రాయం* 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

పెళ్ళీడు కొచ్చింది మా చిన్నారి
పేరున్న ఇంటి వరుని జతగూర్చాలి
తగ్గవాడెవరంటు
తరచి అడిగాము
బుగ్గల్లో సిగ్గుపుట్ట
భావమ్ము తెలిపె

వరకట్నమడిగే వరుడు నాకు వద్దండీ 
కోరి వలచి మనువాడు
కోర్కె చాలండీ
సిరులున్న మన్మథుణ్ణి కోరబోనండీ
మనసున్న మారాజు తోడు చూడండీ 
పుట్టిల్లు మరపించు
పురుషుడైతే చాలు
అపరంజి హృదయమ్ము
అర్పింతునండీ

సంస్కారమున్న ఇంట
సర్దుకోగలను
సంసారమే స్వర్గ
మనిపించగలను
శ్రీ దేవిగా మదిని
మన్నిస్తే చాలు
భూదేవి ఓర్పుతో
భరియించగలను

అని పలికి అమ్మాయి 
తలవంచింది
మందారమై మోము
ముద్దులొలికింది
అమ్మాయి మనసెరిగి ఆ తల్లితండ్రి
సీతమ్మే మా తల్లి అని పొంగినారు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

*కళ్యాణం వైభోగం

(పెళ్ళి పాటలు)

2.
 *పెళ్ళి-అబ్బాయి అభిప్రాయం* 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
పాతికేళ్ళ ఈడువాడు మా అబ్బాయి
పరువాల విరిబోణి తోడు వెదకాలి
ఏలాటి పిల్లనీకు కావాలి చెప్పు
అనగానె అబ్బాయి తన మనసు విప్పె

సంప్రదాయము మెచ్చు సౌశీల్యగుణము
కనుముక్కు తీరైన కళలొల్కు మోము
చిరునవ్వు ఆభరణం సీతమ్మ సహనం
పసిపాపలా నన్ను ప్రేమించే హృదయం
కలిగి ఉన్న కలికిని కలిమి కోరబోను
గుండెల్లొ నిలుపుకొందు గృహలక్ష్మి గానూ

నా తల్లిదండ్రుల్ని మన్నించవలెను
మర్యాద నిలపాలి బంధుగణములోనూ
తూలనాడరాదు నా తోబుట్టువులను
తలలోని నాలుకై తానుండవలెను
ఇష్టాలు మన్నించి తోడున్నచాలు
కష్టాలు‌ రాకుండ కాపాడగలను

అబ్బాయి గుణమెరిగి ఆ తల్లిదండ్రి
రామయ్యె మావాడు అని మురిసినారు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 

*కళ్యాణం వైభోగం*

(పెళ్ళి పాటలు)

3.పెళ్ళి చూపులు 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కలవారి ఇంటిలోన కలదొక్క పిల్ల 
కాలు పెడితే కదలి వచ్చు సౌభాగ్య మెల్ల
 మరునింటి వారసుడు మగ పిల్లవాడు
 కాగలడు మీ కన్నె కతడు తగ్గ వరుడు 

ఆ నోట ఈ నోట ఆ మాట తెలిసి 
ఆ వైపు ఈ వైపు పెద్దలంతా కలిసి 
ఈడు జోడు చూడగా ఇద్దరినీ చేర్చి 
మాట మనసు కలుపుకోను మార్గమని ఎంచి
 మర్యాదతో వచ్చి మగ పెళ్లి వారు
 అమ్మాయి నిమ్మంటూ అర్థించినారు 
అదె భాగ్యమని పొంగి ఆడపిల్ల వారు
 సంతోషపడితాము సమ్మతించారు

సంబంధం మాటలాడ సమయాన్ని చూసుకోని 
పెళ్లి చూపులేర్పరచి రాడపిల్ల ఇంట
 వియ్యమంద గోరు వారి వేడుకను చూడనించి
 ముఖ్యమైన బంధుగణము మూగినారంట

ఠీవీతో అబ్బాయి సిగ్గుతో అమ్మాయి
 వచ్చి కూర్చున్నారు పదిమంది ఎదుట
 తమ వారి సముఖమ్ము తమలోని బిడియమ్ము 
తడబాటు కలిగించ తలవంచి రచట


అమ్మాయినేమైనా అడగదలుచుకుంటే
 మేమేమి వినబోము మాట్లాడవయ్యా
 అబ్బాయి నొకసారి చూడదలచుకుంటే
 మేమేమి అనుకోము మోమెత్తవమ్మా 
అని అయిన వారంతా మేలమాడువేళ
 చిరునవ్వు చిందులాడ బిడియాలు వీడ ఒకసారె తల ఎత్తి తామొకరి నొకరు
 చూసినంత నవ్వారు చూస్తున్న వారు

అమ్మాయి కడచూపు అతని మది దోచే
 అబ్బాయి రంగు రూపు అమ్మాయి మెచ్చే 
ఈడు జోడు బాగుంటుంది ఈ జంట కంటూ 
ఇరువైపు పెద్దలంతా ఇష్టపడ్డారు


సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

*కళ్యాణం వైభోగం*
పెళ్ళి పాటలు 

4.
పెళ్ళి వేడుక 
 🍀🍀🍀🍀🍀🍀🍀🍀

సిరివంటి వధువుకు
హరివంటి వరునికి
సరిజోడు కుదిరింది
పరిణయము కానుంది
అందరూ రారండి
ఆశీర్వదించండి
వేదవిహితపు పెళ్ళి వేడుకలు చూడండి

శాస్త్రవిద్యలు నేర్చి
స్నాతకుండై వరుడు
బ్రహ్మచర్యమువీడి పసిడి నగలను దాల్చి
ఈశాన్యదిక్కుగా కాశియాత్రకు కదల
కాళ్ళకడ్డము తగిలి కన్య సోదరుడు
సమావర్తనవేళ సన్యసించగనేల?
మా సోదరిని నీవు మనువాడరావా!
సౌందర్య సౌశీల్య సౌభాగ్యవతి యామె
ఇచ్చు శుభములు నీకు ఇల్లాలి ప్రేమ
సంసార సౌఖ్యమ్ము సంతాన లాభమ్ము
ఆమె పొందున నీకు కలిగేను సుమ్ము
అలిగివెళ్ళకు బావ ఓ అందగాడ
అనివేడుకొనువేళ ఆ సంబరము చూడ
"అందరూ రారండి"........

నిశ్చయించిన వధువును పాణిగ్రహణము చేయ
తనవారితో వరుడు తరలి వేంచేయును
విడిదింటిలో దిగును అదె వరాగమనము
అచట కన్యాదాత పలుకు ఆహ్వానము
వరుడు పురుషోత్తముడని
మదిలోన‌ యెంచును
మంత్ర సహితమ్ముగా పాదాలు కడుగును
పలు కానుకలనిచ్చి పానకాదులనిచ్చి
కళ్యాణ వేదికకు కదలి రమ్మని మొక్కి
బంధు జనులతొ వచ్చి కళ్యాణశుభవేళ
వరపూజలొనరించి గారవించుట చూడ
అందరూ రారండి.....

ఇరువైపు పెద్దలు ఒకచోట చేరి
తమ గోత్ర ప్రవరలు తెలుపుకుంటారు
ధర్మసంతతి కొరకు మీ కన్యనివ్వండి
అని వరుని తండ్రి అర్థించుతాడు
పదితరమ్ములు‌ తనవి తరియించవలెనంటు
పలికి కన్యాదాత పిల్లనిస్తాడు
మహా సంకల్పమది మనసంప్రదాయమది
లక్ష్మినారాయణ‌ప్రీతి కలిగించు దానమది
ఇంపు సొంపూ మీర ఇద్దరొకటై కూడు
కమనీయమైనట్టి కళ్యాణమును జూడ
అందరూ రారండి........

గణపతిని పూజించి కలశమును స్థాపించి
పుణ్యాహవచనము పూర్తి చేసిన పిదప
కళ్యాణ వేదికకు వరుడు వేంచేయును
శ్రీగౌరి నర్చించి సిద్ధమగు వధువును
వేడుకే మీరగా తన మేనమామ
వెదురుగంపలొ ఎత్తి వేదికకు తెచ్చును
తెరచాటు చేసిన పెళ్ళిపీటలపైన
అభిముఖముగానున్న అమ్మాయి అబ్బాయి
జీలకర్రాబెల్ల మద్దుకుని శిరసున
సుమూహుర్తమువేళ శుభవీక్షణాలతో
తిలకించి పులకించు తీయని క్షణముల
శ్రీరస్తు శుభమస్తు కళ్యాణ మస్తు
అనిపలికి మనసార అక్షింతలేయగా
అందరూ రారండి.....

షోడశోపచారాల పూజలను అంది
పెద్దముత్తయిదువుల చేతి చలువను పొంది
పసిడి బొట్లతొ మెరియు మంగళపు సూత్రాన్ని
మూడు ముళ్ళతొ వరుడు వధువు మెడలో కట్టి
పసుపు కుంకాలతో తాళి నర్చించి
కలికి ఈ బంధమే నను కాపాడు నూరేళ్ళు
అర్థాంగివిక నాకు ఆహ్వానమిదె నీకు
తొలి అడుగులకు ప్రీతి తొడిగేను మట్టెలు
అనుగమించుము నన్ను ఆదరింతును నిన్ను
అని పలుకు మురిపాలు ఆ సంబరాలు
వేడకలు మీరగా చూసి తరియించగా
అందరూ రారండి.....

మాంగల్య బంధాన ముడిపడ్డ జంట
చవిచూచు నునుస్పర్శ సరదాల పంట
బిడియాల పరదాలు తొలగించి వేసి
దోసిళ్ళతో దూసి తలంబ్రాలు పోసి
మధుర భావాలూర మధుపర్కములు చేర్చి
బ్రతుకు బంధము తెల్పు బ్రహ్మముడి గూర్చి
సన్నికల్లున పొందు పదములకు పొందు
పాణి గ్రహణము నందు కరములకు విందు
ఉంగరాలాటలో దొంగ అల్లరి జరుగ
పూబంతులాటలో పులకింత పెరుగ
ఒకరి మెడలో ఒకరు వరమాలలేసి
సప్తపది తో సాగి అడుగులో అడుగేసి
అరుంధతిని దర్శించి ఆశీస్సులంది
పుణ్య దంపతులకును తాంబూలమిచ్చి
జతగూడు జంటను శతమానమని పల్కి
నిండార దీవించి విందారగించగా
అందరూ రారండి ఆశీర్వదించండి
వేద విహితపు పెళ్ళి వేడుకలు చూడండి.

పెళ్ళి వేడుక సంపూర్ణం

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

18.11.18


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

5.బావా మరదళ్ళ సరసం
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

బావ వచ్చాడంట బహు అందగాడంట
చెలియారా రండి చూసి వద్దాము

ఇడిగిడిగొ మా బావ
మన్మధాకారుడు
మా అక్క కీతడు సరి ఈడు జోడు

చూశాము చూశాము గొప్పలిక చాలించు 
ఇతగాడి ఇంపులు అడిగేము ఆలించు

ఇంత నల్లని వాడేమి ఈ పెళ్ళి కొడుకు
నలుపులో నారాయణ స్వామి కళ ఉంది చూడు

మూగవాడా ఏమి మాట్లాడరాడు
మగువలతొ మా బావ మాట్లాడబోడు

మెల్లకన్నా ఏమి సూటిగా చూడడు
కాంతలతొ మా బావ కనుకలపబోడు

రాముడా!కృష్ణుడా! మీ బావగారు?
చెప్పవే అమ్మాయి మీ‌బావతీరు

లోటేమి?వారితో సరిసాటి కాగలడు
సుగుణాన రాముడు
సరసాన కృష్ణుడు



మెచ్చాములే చెలీ మీ బావ సుగుణాలు
నచ్చాము నచ్చాము
సెహబాసులన్నాము
ఇన్ని సుగుణాలున్న ఈ నల్లనయ్య
మీ అక్క మగడగుట మీ భాగ్యమేను


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

6.*అత్తాకోడళ్ళ సరసం*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
అపర శారదవమ్మ అందాలబొమ్మా

అత్తమ్మ అత్తమ్మ మావారి అమ్మా
అపర పార్వతి వమ్మ ఆనతీయమ్మ

పనిపాటలేమొచ్చు ఓ కొత్త కోడలా!
పని రాదు పాటొచ్చు వినిపించమందురా!

అతిథులొచ్చిన వండి వడ్డించగలవా!
మీరు వండిన‌ కొసరి వడ్డించగలను

ఆడబడుచును ప్రేమతో ఆదరిస్తావా!
సగము పని నే‌ చేసి సాయపడతాను

మరిదితో మనసార మాట్లాడతావా!
బిడ్డలా భావించి దండించగలను

మామగారిని తండ్రి లా మన్నించగలవా!
నాన్నలా భావించి నగలడుగుతాను

కట్నకానుకలేమైన తీసుకొస్తావా!
సొగసు కట్నము నా సుగుణాలె కానుక

ఎంత గడసరివే పిల్ల
ఎటు వేగగలమో!
మాట వినవే తల్లి పరువు కాపాడు

అమ్మలా చూసుకో అత్తమ్మ నన్ను
నీ మాట కాదనక నడచుకుంటాను
నీ కంటి పాపనై నట్టింట లక్ష్మి నై
పదిమంది లో మంచి పేరు తెస్తాను

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

7.
*తలంబ్రాల వేడుక*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
తనివారా చూడండిదె తలంబ్రాల వేడుక
తలపులోకి‌ వచ్చేనట మీ పెళ్ళి ముచ్చట
వరుడు శ్రీరాముడని వధువు సీత సమమని
భావిస్తే శ్రీరామ నవమి కళ్ళముందర

వినసొంపుగ మ్రోగాయి బాజాలు సన్నాయి
ఒకరికొకరు ఎదురెదురుగ అమ్మాయి అబ్బాయి
వరుడు చూడ తడబడి వధువు కళ్ళు వాలాయి
గమనించిన పెద్దల అనుభవాలు నవ్వాయి
అబ్బాయి చొరవతోటి అమ్మాయి బెదురుతోటి
జారిపడెను ముత్తయిదుల జ్ఞాపకాల దొంతరలు

నడుము విరగనట్టి మంచి నాణ్యమైన బియ్యము
నడిమధ్యన ఉంచినారు కొత్తజంట కోసము
కొసరి కొసరి పోయమంటు గుంపుగూడి బంధుజనము
తొందరించుచుండిరి తొలగించగ బిడియము
మంత్ర పూర్వకమ్ముగా ముమ్మారు పోయించి
గెలుపెవరిదొ చూపమంటు గేలిచేయు సరదాలు

అబ్బాయి దోసిట అమరినట్టి తలంబ్రాలు
నీలాలు అయ్యెననీ మేలమాడె మరదలు
అమ్మాయి అరచేత అవే తలంబ్రాలు
బుగ్గ సిగ్గు ప్రతిఫలించి అనిపించెను పగడాలు
చిలిపినవ్వు ముత్యాలు వలపు తలపు వజ్రాలు
పులక పుష్యరాగాలు వయసు వైడూర్య మణులు
నవరత్నాలై కురిసెను వధూవరుల తీపి కలలు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

8.*సత్యనారాయణ స్వామి వ్రతం*

శ్రీ సత్యనారాయణా!
మా స్వామి కావాలి నీ దీవెన
అన్నవరమున వెలసి
అన్ని వరముల నొసగు
ఆరాధ్యదైవమా!
అద్భుతము నీ మహిమ

క్రొత్తగా పెళ్ళయిన ఈ జంట నేడు
నీ వ్రతము చేసేరు కరుణతో చూడు
పురుషార్థముల తాము ఒక్కటై నడిచి
పుణ్య కార్యములెల్ల జతగూడి సలిపి
గార్హస్థ్య ధర్మాన్ని కాపాడుకుంటూ
దాంపత్య మధురిమలు తామందుకుంటూ
అర్థనారీశ్వరులు అనిపించు రీతిగా
 నూరేళ్ళు హాయిగా జీవించునట్లుగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన
ఎదలోన నిను నమ్మి భక్తితో కొలువగా
ఏటేట నీ వ్రతము చేసుకుని మురియగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన 


కష్టాల కడలిని దయతోటి దాటించు
దుఃఖాల క్రీనీడ పడనీక రక్షించు
పిల్లపాపలనిచ్చి చల్లగా కాపాడి
సుఖము సంతోషము బ్రతుకులో వెలిగించి
సంసారమను తరువు కల్పతరువవ్వగా
నిండుదంపతులంటు ఎల్లరూ పొగడగా
జానకీరాములే అనిపించురీతిగా నూరేళ్ళు హాయిగా జీవించునట్లుగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన 
ఎదలోన నిను నమ్మి భక్తితో కొలువగా
ఏటేట నీ వ్రతము చేసుకొని తరియగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన 

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

9.*వియ్యాలవారి కయ్యాలు*

విడిదిలోన దిగినారు వియ్యాలవారు
ఆదరము చూపారు అబ్బాయి వారు
మర్యాద మన్నన మదికెంతొ నచ్చినా
ఆటపట్టించగా అలకబూనారు

అది తెలిసి వచ్చింది అమ్మాయి తల్లి
అది లేదు ఇది లేదు అనె వరుని తల్లి
రుసరుసలు ఆడుతూ ఆవిడిట్లడిగె
ముసిముసిగ నవ్వుతూ ఈమె బదులొసగె

ఏమమ్మ వదినమ్మ!మీకెంత లోకువ మేము
మగపెళ్ళి వారికీ మర్యాదలేవీ!
ఓయమ్మ మన్నించు వయ్యారి వదినా
ఏమి తక్కువ జరిగె?మీకేమి కావాలి?

పళ్ళు తోమాలంటె వేప పుల్లలు లేవు 
ఒళ్ళు రుద్దాలంటె నలుగు పిండెక్కడ?
 తలకు పోయాలంటె కుంకుళ్ళు ఏవి ?
మగ పెళ్లి వారికి మర్యాదలేవి ?

పేస్టు బ్రష్షుండగా వేప పుల్లలు ఏల!
లక్సు సోపుండగా నలుగుపిండేలా!
కురులు షాంపుతొ రుద్దు కుంకుళ్ళు దేనికి?
ఏమి తక్కువ జరిగె మీకేమి కావాలి?

ముఖము మెరవాలంటె పసుపు ముద్దలు లేవు 
స్నాన మాడాలంటె వేణ్ణీళ్ళు లేవు 
మోము చూడాలంటె చేతి అద్దము లేదు
 మగ పెళ్లి వారికి మర్యాదలేవి?

 పసుపుతో పని ఏమి పాండ్సు క్రీమున్నది
 మీట నొక్కితె చాలు వేణ్ణీళ్ళు వచ్చు
 చక్కదనమును చూప నిలువుటద్దము కలదు
 ఏమి తక్కువ జరిగె మీకేమి కావాలి?

నడుము వాల్చాలంటె నులకమంచము లేదు
విడిదింటిలో విసనకర్రలే లేవు
విందుభోంచేయగా విస్తళ్ళు లేవు
మగ పెళ్ళి వారికీ మర్యాదలేవీ

పట్టు పరుపిచ్చాము సుకుమారులనుకొనీ
చలువ గదులిచ్చాము శ్రమకోర్వలేరనీ
వెండి కంచము కాన్క బంగారు వదినా
ఏమి తక్కువ జరిగె మీకేమి కావాలి

సరసాలు ఆడేటి ఆ తీరులోన
సరదాలు పొంగేటి ఆ విడిదిలోన
బంధుమిత్రులు చేరి సందడెంతో చేసి
నిండు హృదయాలతో శుభము పలికారు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు) 

*10.గృహప్రవేశం*

గృహప్రవేశము‌చేయ
గుమ్మాన నిలుచున్న
ఆదిదంపతుల వంటి
అన్ననూ వదిననూ
ఆడబడుచులు వచ్చి అడ్డగించారు
అమ్మలక్కలు చేరి ఆటపట్టించారు

ఆగాగు అన్నయ్య ఆత్రపడబోకయ్య
మా వదిన పేరేమి?మనసార చెప్పు
తొందరగ చెబితేను తొలగి దారిచ్చేము
ప్రీతితో చెబితేను హారతిచ్చేము
అడుగు కదపాలంటె పేరు చెప్పాలి
హారతియ్యాలంటె కానుకియ్యాలి

అల్లరిక ఆపవే అందాలచెల్లీ
బ్రతిమాలుకొందు నిను బంగారుతల్లి
నీవు కోరినవెల్ల కాదనక ఇస్తాను
రానివ్వు మమ్ము 
 మీ‌ వదినతో వచ్చాను

సీతవంటీ వదిన సిగ్గుపడబోకమ్మ
మా అన్న పేరేమి?మక్కువతొ చెప్పు
తలవంచి నిలుచుంటె వదిలేది లేదు
తడబడుతు పలికావు వినబడనె లేదు
ఏది మరియొకసారి
తల ఎత్తి ఇటు చూసి
వినసొంపుగా చెప్పు వదిలేము దారి

ఆడబడుచువు నీవు అలగబోకమ్మా
అర్థమొగుడివి కనుక ఆదరించమ్మా
మీ అన్నతో వచ్చాను గృహలక్ష్మి నై నేను
గడపకడ్డము తొలగు గారాలు మాను

అన్న మాటకు నవ్వి
వదిన మాటకు మురిసి
కవ్వింపుగా పలికి
కానుకిట్లడిగే 

వన్నె బంగరు వదిన
వరమొకటి అడిగేను
అత్తమ్మ అను పిలుపు
ఆశపడుతున్నాను
కోడలో అల్లుడో కావాలి నాకు
ఏడాదిలో ఇవ్వు ఎదురు చూసేను

అని ఆడబిడ్డ కొంటెగా కోరగా
చూస్తున్న వారంత గొల్లుమని నవ్వగా
వాలిపోయిన కనుల
మోము దాచెను వధువు
అందరూ గ్రోలారు ఆనందమధువు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

*11.అప్పగింతలు*

వేయి శుభములు‌ నీకు
వెళ్ళిరావే అమ్మ
పుట్టిల్లు మరువకు
పోయిరావమ్మా 
పసుపుకుంకుమ సిరుల
పండంటి పాపల
నిండుగా నీ బ్రతుకు
పండునోయమ్మా

పసిపాపగా నువ్వు పారాడినా ఇల్లు
పట్టు పరికిణి కట్టి పరుగులెత్తిన ఇల్లు
నట్టింట లక్ష్మి వై నడయాడినా ఇల్లు
నీ చిలకపలుకులతొ సందండించిన ఇల్లు
చిన్నబోయేనింక‌ చిన్నారి తల్లీ
మగని మురిపాలలో మము మరువకమ్మా

తొలి పండుగని యంటు పిలిచేము ఒకసారి
ఆషాఢమనుపేర ఆశతో ఒకసారి
సీమంత మనువేడ్క జరుపగా ఒకసారి
చిట్టిపాపడినెత్త కాన్పుకై ఒకసారి
మాటిమాటికి మనసు నీవైపె‌ లాగగా
వంకతో పిలిచేము వచ్చిపోవమ్మా

నేనొస్తె అత్తకు చేదోడు ఎవ్వరు
నేనొస్తె మామకు సేవచేసే దెవరు
నేలేక మావారు ఒక నిమిషముండరు
నేలేక మాఇంట క్షణమైన గడవదు
అని చెప్పబోకమ్మ ఆరిందలా నీవు
మగనితో‌ నీవొస్తె మా‌ఇంట‌ పండుగ

అమ్మ చెప్పిన మంచి నాన్న‌ నేర్పిన నడత
అన్నదమ్ముల ప్రేమ మన సంప్రదాయము
మదిలోన నిలపాలి‌ మాపేరు‌ నిలపాలి
పుట్టిల్లు మెట్టిల్లు నిను చూసి మురవాలి
అప్పగించక తప్పదు ఆడపిల్లవు నీవు
అప్పడపుడూ ‌వచ్చి ఆనందమివ్వు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

*12.పెళ్ళికూతుర్ని చేయడం*

నళినాక్షి సీతకిదే నలుగు పెట్టరమ్మ
పెళ్ళికూతురవుతున్నది మా పసిడి బొమ్మ

శనిదోషం, చెడు దృష్టి  పడకుండా రక్షసేయ
నీలాల కురులు విప్పి మునివేళ్ళతొ తైలమద్ది
నళినాక్షి సీతకిదే నలుగు పెట్టరమ్మా

పసిమి వన్నె మేని ఛాయ మిసమిసమని నునుపుదేరి
పెళ్ళికళలు వెల్లివిరియ సున్నిపిండి మేనికద్ది
నళినాక్షి సీతకిదే నలుగు పెట్టరమ్మా

అద్దాల చెక్కిళ్ళవి అందాల కానవాళ్ళు
మెరిసిపోవ సుతారంగ పసుపు ముద్ద మోముకద్ది
నళినాక్షి సీతకిదే నలుగు పెట్టరమ్మా

వెచ్చనైన నీళ్ళుతొరిపి ముచ్చటగా జలకమార్చి
సాంబ్రాణి ధూపమేసి చక్కగా కురులనార్చి
అందాల బొమ్మనిక తీర్చిదిద్దరమ్మ

పట్టుచీర కట్టబెట్టి మల్లెపూల జడలనల్లి
పెళ్ళి బొట్టు నుదుటదిద్ది బుగ్గ చుక్క సవరించగ
అందాల పసిడి బొమ్మ పెళ్ళికూతురైనదమ్మ
హారతిచ్చి దిష్టి తీసి ఆశీస్సులీయరమ్మ

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు) 

*13.సప్తపది*

వేయవే ఓ చెలియా
వేలుపట్టి నా‌ వెనుక
అడుగు వెంట అడుగుగా ఏడడుగులు
అగ్నిహోత్రుడు సాక్షి
అతిథులంత సాక్షి
వేడ్కచూడ వేంచేసిన
వేల్పులెల్ల సాక్షి

దారిచూపు నీ వెనుక
వేలుపట్టి వేస్తాను
అడుగులోన అడుగుగా ఏడడుగులు
అగ్నిహోత్రుడు సాక్షి
అతిథులంత సాక్షి
వేడ్క చూడ వేంచేసిన
వేల్పులెల్ల సాక్షి

అన్నమొకటి బలమొక్కటి
శుభములొకటి సౌఖ్యమొకటి
పశువృద్ధి ఋతుసంపద
సప్తహోత్రము
అడుగుకొక్క వరముగా
ఆ లక్ష్మీనాథుడు
ఇచ్చు మనకు ఇందువదన
అందుకొనగ ఆ దీవెన
వేయవే ఓ చెలియా
వేలుపట్టి నా‌ వెనుక
అడుగు వెంట అడుగుగా ఏడడుగులు

నేస్తమై నన్ను నీవు
ప్రేమ చూపి అనుసరించు
వియోగాన్ని సైపలేను
వీడకు నా చేతినెపుడు
మనసు మనసు కలుపుకొని
ఒకరికొకరు తోడుగా
కష్టసుఖములన్నిటా
ఎడబాయని జంటగా
అనురాగం అన్యోన్యత
పెనవేసి సాగగా
వేయవే ఓ చెలియా
వేలుపట్టి నా‌ వెనుక
అడుగు వెంట అడుగుగా ఏడడుగులు

ఆకాశం నీవుగా అవని నేనవ్వగా
బీజమింక నీదిగా క్షేత్రం నేనవ్వగా
మనసంటే నీవుగా మదికి మాట నేనుగా
భర్తవై దారిచూపు
పడకు నీవు‌ పొరబాటు
భార్యనైన నన్నెపుడూ
పడనీయక తడబాటు
దారిచూపు నీ వెంట
వేలుపట్టి వేస్తాను
అడుగులోన అడుగుగా ఏడడుగులు

సామమును ఋక్కువోలె 
నన్ను‌ నీ వనుసరించు
సౌశీల్యపు నిధినీవై
సంతానపు భాగ్యమివ్వు
సత్సంతును కానుకగా
సమాజాని కందించి
నిండుదనం బ్రతుకుకిచ్చి
నూరేళ్ళు జంటగా
కలసి సాగిపోదాము
ఒకరి వెంట‌ ఒకరుగా
వేయవే ఓ చెలియా
వేలుపట్టి నా‌ వెనుక
అడుగు వెంట అడుగుగా ఏడడుగులు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

*14.పెళ్ళికొడుకుని చేయడం*

చూడరండి వీడే మా చక్కనైన పెళ్ళికొడుకు
సరిసాటి ఇతనికింక శ్రీరామచంద్రుడు


హరుని కోపాగ్ని కపుడు తనువు విడిన మన్మథుడు
ఇడుగో మా ఇంట మరల పుట్టిపెరిగినాడు

శివధనుస్సు విరిచి నాడు సీతకు వరుడైన ఘనుడు
కన్నె మనసు గెలిచె నేడు కళ్యాణరాముడితడు

అల రుక్మిణి ప్రేమకలరి చేయందుకున్న నాటి
శ్రీకృష్ణుని వంటివాడు నేటి మా ఇంటి వరుడు

సతికి మేన సగము నిచ్చి శివునివోలె మన్నించును
ఎదపైన సతిని నిలిపి
శ్రీనివాసుడనిపించును


సిరిసంపదలున్నవాడు గుణగణముల మేటి వీడు
ప్రేమకేమి కొదువలేని అందచందాల రేడు


సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)

*14.పెళ్ళికొడుకును చేయడం*

మా ఇంటి‌వరుడు నవ మన్మథాకారుడితడు
నలుగుపెట్ట రారండి శ్రీరామచంద్రుడితడు

చక్కనైన తలకట్టుకు సంపెంగ నూనె లద్దు
పరమశివుడు తానై పార్వతీ కరముపట్టు 


తీరుగా కళ్యాణతిలకాన్ని‌ నుదుట‌ దిద్దు 
శ్రీరాముడై తాను కలికి సీత కరము పట్టు 

ఇందీవరాక్షుడితడు ఇదే బుగ్గ చుక్క పెట్టు
శ్రీకృష్ణుడై తాను‌ రుక్మిణీ కరము పట్టు 

అందచందాల రేడు పెళ్ళికొడుకు హారతివ్వు
శ్రీనివాసుడై తాను పద్మావతి కరముపట్టు 

సిరిసంపదలున్నవాడు గుణగణముల మేటి వీడు
సాక్షాత్తు విష్ణువై శ్రీదేవి కరము పట్టు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం కమనీయం*
(పెళ్ళి పాటలు) 

*15.కన్యాదానం*

అల్లుడా రావయ్యా దానమందుకోవయ్యా
నారాయణ మూర్తివనుచు పిల్లనిత్తును

బంగారు సిరుల నగల 
బంగారపు నా తల్లిని
బ్రహ్మలోక ప్రాప్తి కొరకు దానమిత్తును 


 నా లోకమె తానగుచు
నా ముందు నిలిచి ఉన్న
నా తల్లిని దానమిచ్చి నా అల్లుడా!
ఆ పుణ్యము పండగా
మోక్షప్రాప్తి నందగా
నా ముద్దుల తనయను దానమిత్తును

పరమాత్ముడు నాకు సాక్షి
పంచభూత చయము సాక్షి 
దేవతా గణము సాక్షి కాగ అల్లుడా!
నాదుపితృదేవతలే
తనివిచెంది తరియించగ
మురిపాల నా తనయను దానమిత్తును

అలంకారశోభితయై అనుకూలవతి కాగల
సౌశీల్యమణి ఈమెను ఓ అల్లుడా!
ధర్మార్థకామముల సిద్ధింపజేయునని
నియమముతో నా తనయను దానమిత్తును

అర్థాంగి ఈమె నీకు
అతిక్రమించి పోబోకు
అనుకూల దాంపత్యము అమరు అల్లుడా!
నీ వంశము వృద్ధినొంద
సత్సంతతి నివ్వగలుగు
వరహాల నా తనయను దానమిత్తును

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు) 

*16.వియ్యాలవారి విందు*


విందుచేయరే వియ్యాలవారికీ
ఆరు రుచులు మేళవించి
అభిమానం రంగరించి
నిండు మనసు సంతసించ
ఆత్మీయత కుమ్మరించి


అల్లారుముద్దుగా పెరిగెను మా అమ్మాయి
కల్లకపట మెరుగదు
కష్టమంటె‌ తెలియదు
పుట్టినిల్లు మరిపించి
బ్రతుకు తీపి చూపమని
పరమాన్నం బూరెలు పాయసాలు ‌వడ్డించి
విందు చేయరే వియ్యాలవారికీ

తప్పుచేసి ఎరుగదు
తలవంపులు తేబోదు
చెప్పినట్లు వినగలదు
చెలిమి చేయు గుణము కలదు
ఉప్పనైన కంటి నీరు
ఎప్పుడూ రానీయక
చెప్పినేర్పుకోమని 
ఉప్పువేసి గుర్తుచేసి
విందు చేయరే వియ్యాలవారికీ

తల్లితండ్రి తోబుట్టువు లందరినీ విడిచిపెట్టి
ఆలంబన భర్తయని
నమ్మి అతని వేలుపట్టి
మాకంటిపాప నేడు 
మీ ఇంటికి వస్తున్నది
తన నోములు పండునని
కలలెన్నో కంటున్నది
కష్టమనే కారాన్ని ప్రేమ‌ అనే నెయ్యివేసి
తోడు ఉండి తొలగించగ
వేడుకోలు విన్నవించి
విందు చేయరే వియ్యాలవారికీ

కలతతోటి ఎపుడైనా
నడుము వాల్చి నట్లైతే
కోపగించబోకండి
కోర్కెలేమొ అడగండి
వేవిళ్ళ నోటి రుచులు మంచి కబురు కాగలదని
పండంటి పాపణ్ణి పడతి ఇవ్వబోతోందని
ఆవ వగరు మెంతి చేదు
ఆవకాయలోన కలిపి
కోరి కోరి కొసరి కొసరి 
బంతి మీద వడ్డించి
విందు చేయరే వియ్యాలవారికీ

దొంగచాటుగా ఏదో 
చిరుతిళ్ళు తింటోందని
తెలియనీక తానేదో
కొంగులోన దాస్తోందని
నిలదీయబోకండి నిజము చెప్పలేదు
నెల తప్పి ఉంటుంది నెలత తప్పు లేదు
పుల్లమామిడడిగెనేమొ  పిల్లమనసు తెలియమని
పులుపులోని ఆనందం
పులిహారతొ జోడించి
విందు చేయరే వియ్యాలవారికీ

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు) 

*16.వియ్యాలవారి విందు*


ఆరగించ రమ్మంటివి ఆకేదీ? పీటేదీ?
వరుసకట్టి నిలిచేరు?వైనమేమి ఓ వదిన?

ఆకుచేతికిస్తారు అడిగితేనె పెట్టేరు
తిరుగుతూ తింటారు దీన్ని బఫే అంటారు

మా బాగా దొరికావే వంటరాని వదినమ్మా 
పచ్చికూర ముక్కలు
తినేదెలా చెప్పమ్మా!

భలేభలే దొరికావే పల్లెటూరి వదినమ్మా
సలాడిది ఒక్కసారి తినిచూసి చెప్పవమ్మ! 

బూరెలేవి?గారెలేవి?ఆవడలు అరిసెలేవి?
పిండివంటలేవమ్మా! పిసినారి ఓ వదినా!
కాజు బర్ఫీ బ్రెడ్ హల్వా
కట్ మిర్చీ సమోసా
ఈనాటి స్వీటు హాటు తింటే మరి వదలవు

పాయసం పులిహోర పరమాన్నం లేవేమిటి?
ఈపాటి దానికే విందంటూ పేరొకటి
పన్నీరు ఫ్రైడు రైసు వెజిటబుల్ బిర్యానీ
ఒకటేమిటి పలురకాలు ఆరగించి చూడొదినా!

బాగున్నది సంబడం మేమెరుగము ఈ చోద్యం
పండైనా ఉన్నదా!ఆకువక్కలున్నవా!
పండెందుకు ఫ్రూట్ సలాడు ఉన్నదమ్మ తిని చూడు
 చెర్రీతో స్వీటుపాను అదిరిందని అంటావు

కొత్తవింత బాగున్నది నేటితరం పోకడ ఇది
వదినా మీ మర్యాదలు
మాకెంతో నచ్చినవి


Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ