4/2.*గేయ రామాయణం.* అయోధ్య కాండ
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
గేయ రామాయణం అయోధ్య కాండ. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
గేయ రామాయణం
అయోధ్య కాండ(170 చరణాలు)
I
72/18(1-11 చరణాలు)
పట్టాభిషేక నిర్ణయం -- కైక వరాలు
1.పాపలూ! అయోధ్య కాండ ఇదిగో
ఇటుపైన ఆరంభ మవుతున్నది
ఆదర్శమూర్తియా రఘురాముని
సుగుణాలకిదె అద్దమవుతున్నది.-143
2.
శుభమైన పదహారు కళలతోటి
ప్రతిదినము వర్థిల్లు చంద్రుడల్లె
సకలమౌ సుగుణాల రాశి తానై
రాముడు సర్వులకు హితుడాయెను.144
3.
రాజ్యరమ మనసుపడి ఆశించెను
తననింక రాముడే ఏలాలని
ముదముతో సాకేత ప్రజ తలచెను
తమ ప్రభువు రాముడే కావాలని 145
4.
తన ప్రజల హృదయమ్ము తానెరింగి
దశరథుడు మదినెంతొ సంతసించి
అటుపైన పరిపాలనా భారము
తనయునకు తానప్పగించ దలచి 146
5.
సభ తీర్చి మహరాజు తన యోచన
సర్వులకు వినిపించి సమ్మతడుగ
ఎనలేని హర్షాతిరేకమ్ముతో
అందరూ భళి భళీ బాగు అనిరి 147
శ్రీరామ రామ రామా
శుభనామ సీతామనోభిరామా
6.
శ్రీరామ పట్టాభిషేకానికి
చైత్రమే సరియైన తరుణమనుచు
ప్రియమార తనయుణ్ణి చేరబిలిచి
దశరథుడు శుభవార్త వినిపించెను 148
7.
నాయనా!రేపె నీ అభిషేకము
నా తండ్రి!నా ఆజ్ఞ పాలించుము
వైదేహితో గూడి నేటినుండి
నీవింక ఉపవాస దీక్ష గొనుము 149
8.
వల్లెయని పల్కి ఆ శ్రీరాముడు
తన తల్లి కౌసల్య గృహము జేరి
సీతయు లక్ష్మణుడు వినుచుండగా
మహరాజు నిర్ణయము వినిపించెను 150
9.
చెవులార ఆ వార్త విన్నంతనే
కౌసల్య ఆనంద వార్థి దేలె
నేటికిక తన తపసు పండెనంటూ
తనయుణ్ణి దీవించి మురిసిపోయె 151
10.
లక్షణుని వదనమ్ము తిలకించుతూ
దాశరథి ప్రేమతో పలికెనిటుల
నాకు రెండవ ఆత్మవై నా తమ్ముడా
నాదైన ప్రతి భాగ్య మనుభవించు 152.
11.
అట్టి తరి వశిష్ట మౌని వచ్చి
త్వరపెట్టి వ్రతదీక్ష నొసగినాడు
దీక్షగొని రాఘవుడు సీతతోటి
నియతాత్ముడై తాను మెలగినాడు 153.
శ్రీరామ రామ రామా!
శుభనామ సీతామనోభిరామా!
నీ పేరు వేయి నామాల సాటి
వరనామ!మమ్మేలు కరుణతోటి
(సశేషం)
II
72/19(12-23 చరణాలు)
12.
శ్రీరామ పట్టాభిషేకానికి
ప్రతియిల్లు పర్వదిన శోభదాల్చె
రాచనగరమ్మంతయు సంబరాన
పున్నమి సంద్రమటు పొంగిపోయె 154.
13.
కైకేయి ప్రియ దాసియౌ మంధర
పురిలోన సందడిని గని సైపక
ఈర్ష్యతో తన రాణి కైక జేరి
దుశ్శీల దుర్భోధలే జేసెను 155
14.
తొలుత ఆ కైకమ్మ మురిసిపోయి
దాసికి బహుమానమే జేసెను
కాని చెవికెక్క ఆ చెనటి దాసి మాట
మదిలోన భగ్గుమని మండిపడెను156
15.
పిదప లోభమ్మునే పొంది పుత్రమోహం
ముంచేయ దశరథుని పై అలిగెను
ఎల్లరకు సంతోష దాయకమ్మౌ
ప్రియవార్త దుర్వార్తగా నెంచెను 157
16.
ఎటులైన నాథుని మనసు మార్చి
నిజ సుతుని రాజుగా చేయనెంచి
అలకతో కోపగృహమ్ములో జొరబడి
క్రోధన నేలబడి పంతగిలెను.158
17.
ఆ వేళ త్వరతోటి పంక్తిరథుడు
స్వయముగా శుభవార్త చెప్పనెంచి
కైకేయి మందిరము చేరుకొనెను
కాంతను కనుగొని కలతపడెను. 159.
18.
ఇక్ష్వాకు డా కైక హృదయమ్మును
ఎరుగక దరిజేరి అనునయించె
ఓ సఖీ!నీకేమి కావలయునో
కోరుమా!తక్షణమె చేతుననియె 160
19.
అపుడు ఆ కైక దశరథునికి
ఒకనాడు తనకతడు ప్రీతితోటి
వాగ్దానమిచ్చిన వరద్వయమ్ము
తక్షణమె ఇమ్మనుచు ఇటుల పలికే
ప్రీతితో ఇమ్మనుచు ఇటుల పలికె 161
20.
శ్రీ రామచంద్రునకు మారుగాను
భరతునకు రాజ్యమ్ము నీయవలయు
ఇటుపైన పదునాలుగేండ్ల వరకు
రాముడు కారడవి మెలగవలయు 162
21.
పిడుగులా వినపడిన ఆ మాటకు
నిజసతిని నిర్ఘాంతపడి చూచెను
వివశుడై భోరుమని విలపించుతూ
మహరాజు మతిచెడి మూర్ఛిల్లెను 163
22.
నీవెంత దుర్మార్గురాలవంటూ
దూషించి దుఃఖాన కూలబడెను
కైకను,భరతుడిని ఆ క్షణమ్మే
తానింక విడిచివేసితినని పలికెను 164
23.
అంతలో మెల్లగా తెల్లవారె
ఆరిన దశరథుని ఆశలటుల
రావణాద్యసురాళి కింక భువిపై
చెల్లి తెల్లారిన బ్రతుకులటుల 165
(సశేషం)
III.
72/20(24-37 చరణాలు)
24.
రాముణ్ణి నీవిటకు గొని రమ్మని
కైకేయి సుమంత్రుని పంపించెను
జనులెల్ల జేజేలు పలుకుచుండ
రాముడు సౌమిత్రితో వచ్చెను 166
25.
చినబోయి ఉన్నట్టి తన జనకుని
మోముగని రాముడే తల్లడిల్లె
అనునయమ్మొప్పగా కైకమ్మను
అసలేమి జరిగెనో చెప్పమనియె 167
26.
కైకమ్మ తెలియజేసిన వార్తకు
కాస్తయిన కలతపడలేదాతడు
మోవిపై చిరునవ్వు చెదరలేదు
చిత్తాన ధైర్యమే సడలలేదు 168
27.
నాదు అనుగుతమ్ముని కోసము
నేను నా ప్రాణమైనా ఇవ్వనా!
ప్రియమైన నా తండ్రి మాటనిలుప
నే వేయి వెతలైన వెనుదీతునా! 169
28.
అని పలికి భక్తితో శ్రీరాముడు
తలిదండ్రి పాదాలు తాకిమొక్కి
యువరాజ చిహ్నాలు విడిచిపెట్టి
తను పాదచారియై పయనమాయె 170
29
అదిగని లక్ష్మణుడు క్రుద్ధుడయ్యి
కోపాన అవధులే మర్చిపోయి
ఇతడెంత పాపాత్ముడని పలుకుతూ
తండ్రి నే వధియింతునని ఉరికెను 171
30.
నయశాలి అయినట్టి శ్రీరాముడు
శపియించు తమ్ముణ్ణి శాంతపరచి
కౌసల్య మందిరము చేరుకొనెను
తల్లికా విషయమ్ము వినిపించెను 172
31.
ఆ మాట భరియింప రానిదవగా
కౌసల్య కన్నీట తపియించెను
నాయనా !నిన్నేల కంటి నేను?
నువులేక నేనెటుల జీవింతును?173
32.
నినువీడి మనజాలలేను తండ్రీ!
నను గూడ నీవెంట గొనిపొమ్మని
దీనయై కన్నీరు మున్నీరుగా
విలపించు తల్లికిటు రాముడనియె 174
33
వీరపత్నివి గద ఓ వీరమాతా
బేలవై నీవిటుల పలుక మేలా!
నను వీడి మనలేని నా తండ్రి కి
నీవైన ఉపశాంతి నీయవలదా!175
34.
పెను దుఃఖమగ్నుడౌ మహరాజును
నీవును విడచుటది న్యాయమగునా!
పతి సేవయే సతికి ధర్మమనుట
సాధ్వియౌ నీకు నే చెప్పవలెనా176
35
ఆ మాటలకు తల్లి ఊరడిల్లి
దుఃఖాన్ని దిగమ్రింగి తెప్పరిల్లి
చిన్నారి నా తండ్రి పోయిరారా!
నీ ధర్మ దీక్షయే నీకు రక్ష177
36
పదునాల్గు వర్షాలు నీ రాకకై
క్షణమొక్క దినముగా గడుపుచుందు
అనుచుండ శోకమ్ము అడ్డుపడియె
ఆపైన కంఠమ్ము పెగలదాయె178
37
చేయెత్తి తనయుణ్ణి దీవించుతూ
తలనిమిరి ప్రియమార కౌగిలించి
మూర్కొని శిరమును ముద్దాడుతూ
వీడ్కోలు పలికెను ప్రియ సుతునకు179
(సశేషం)
IV
27/21(38-51 చరణాలు)
38.
అటుపైన శ్రీరామచంద్రుడంత
పయనమై వైదేహి మందిరమును
విషణ్ణ వదనుడై చేరుకొనెను
పతినిగని సీతయిటు ప్రశ్నించెను 180
39.
పట్టాభిషేకంపు శుభవేళలో
మోమిట్లు మ్లానమై ఉన్నదేమి?
అని యడుగు జానకికి శ్రీరాముడు
తన తండ్రి ఆజ్ఞ నిటు తెలియజేసె 181
40
.సీతరో!సత్యసంధుడౌ నా జనకుడు
ఒక రెండు వరములను తానొకపరి
ప్రేమతో కైకమ్మ కొసగి యుండ
అవి నేడు పినతల్లి కోరుకుంది 182
41.
యువరాజ పట్టాభిషేకమ్మును
తమ్ముడౌ భరతునకు చేయమంది
పదునాలుగేండ్లు నను వనవాసము
దండకావనియందు చేయమంది 183
42.
నా తండ్రి వాగ్దానమును జానకీ
నిలుపగా నే పోవుచుంటి వనికి
నీవిచట అత్తమామల సేవలో
వ్రతోపవాసాల వసియించుమా! 184
43
ఈ రీతి రాముడా ప్రియపత్నికి
వీడ్కోలు పలికి జాగ్రత్త తెలిపె
సాధ్వియా సీతమ్మ చిగురాకులా
దుఃఖాన కంపించి కన్నీరు ఒలికె 185
44
ఇది ఎంత కఠినమౌ ఆజ్ఞ స్వామీ!
నీవిలా పలుకుటకు అర్థమేమి?
నువ్వు నా చెంతగా లేనినాడు
నేనింక జీవించి ఫలితమేమి? 186.
45.
నను వీడి వనములకు నీవొకడివే
పోనెంచు చుంటివని తానెరిగెనా
మదిలోన నొచ్చుకొను నా జనకుడు
తానొక్కనాటికీ నిను మెచ్చడు187
46.
పురుషుడని భ్రమియించి నా కూతును
ధీరతే లేని ఒక స్త్రీ కిస్తినే!
అని యెంచగల డార్య!తాను నిన్ను
ఆ నింద భరియింప జాల నేను
188
47
కనుకనే యోచించు ప్రాణేశ్వరా!
నిను వీడి నీ సీత బ్రతుకగలదా!
కానలకు గొనిపొమ్ము నన్నుగూడ
కాకున్న నేనిపుడె మరణించెద. 189
48.
నీవెంట వనములకు వచ్చి నేను
అడవిలో అనుక్షణము సేవింతును
ఎటువంటి వనవాస క్లేశమైనా
భరియించి నిన్నంటి జీవింతును 190
49.
కందమూలమ్ములైననూ కానలోన
నీవుంటె పంచభక్ష్యమ్ము లౌను
కారడవులైననూ ప్రాణనాథా!
నీవెంట నందనమ్మనిపించును 191
50
అని సీత దుఃఖాన పలికినంత
రాముడు ప్రియపత్ని నోదార్చుతూ
నీ దుఃఖకారణము స్వర్గమగుచో
తక్షణమె దివినైన నే విడుతును. 192
51..
అవగతమ్మాయె నీ ఆంతర్యము
నీ వల్ల ధన్యమగు మా వంశము
అని రామచంద్రుడా సీత మురియ
వనములకు గొనిపోవ సమ్మతించె
193
(సశేషం)
V
72/22 (52-62 చరణాలు)
52.
సీతయూ రాముడు వనసీమకు
పోనెంచు ఆ వేళ లక్ష్మణుండు
తన అన్న పాదాలపై వ్రాలెను
మీ వెంట నే గూడ వత్తుననెను 194
53
అతడెంత వారించినా ఒప్పక
సౌమిత్రి సోదరుని ఒప్పించెను
తమ సకల సంపదలు దానమొసగి
మువ్వురూ మహరాజు కడకేగిరి 195
54
వైదేహి లక్ష్మణులు వెంటరాగా
ఓ తండ్రి !వనవాసమేగేందుకు
అనుమతిని ఇవ్వండి అని మొక్కుతూ
రాముడు దశరథుని అర్థించెను 196
55
మదిలోన దుఃఖమే పొంగిపొరల
మహరాజు మారాడలేకుండెను
వధియించి నాయనా !నన్నిప్పుడే
వసుధనిక చేపట్టుమని చెప్పెను..197.
56
తన తండ్రి దైన్యమ్ము చూచినంత
రాముని హృదయమ్ము కరగిపోగా
దుఃఖోపశాంతినే కలిగించగా
ఓదార్పు వాక్యాలనిటు పలికెను
198
57.
మీరింత దుఃఖించనేల తండ్రీ!
నేనింతలో తిరిగి రాకుందునా!
పూజ్యులగు మీ వాక్యపాలనమ్మే
నాకు శిరోధార్యమ్ము కాకుండునా!
199
58.
అని పలికి తనతండ్రి నూరడించి
రాముడు నారచీరలు కోరగా
కలుషాంతరంగ యగు కైక తాను
సత్వరమె తెప్పించి ఇప్పించెను 200
59
నారచీరను దాల్చి నిలిచియున్న
సీతను కనుగొని ఎల్లవారు
వేదనా భరితులై దుఃఖించిరి
కైకను ద్వేషించి దూషించిరి201
60
గారాన జనకుని ఇంట పెరిగి
కష్టమే ఎరుగని సీత యట్లు
వల్కలము దాల్చగామని సైపలేక
దశరథుడు కైకపై మండిపడెను 202
61
సద్వినుత సుకుమారి నా కోడలు
వనవాస నియమమ్ము తనకు లేదు
అని పలికి దశరథుడు ఆదరమున
ఘన వస్త్ర భూషణములానతిచ్చి203
62
తెప్పించి భూషలు వస్త్రాదులు
దశరథుడు కోడలికి కానుకిచ్చె
వినయాన పెద్దలందరకు మొక్కి
రాముడు తమకింక సెలవు కోరె 204
(సశేషం)
VI
72/23 (63-76 చరణాలు)
63
వాగ్దాన బద్ధుడౌ దశరథుండు
భారమౌ మదితోడ వీడ్కొలుపుతూ
పొలిమేర వరకైన విడిచిరమ్మా!
అని తనదు మాతలికి ఆజ్ఞ నొసగె 205
64
మువ్వురూ రథమెక్కి సాగుతుంటే
రాజ్యమే రోదిస్తు వెంట నడిచే
నాయనా!ఒకసారి ఆగమంటూ
దీనుడై దశరథుడు వెంబడించె 206
65
క్షణకాల మాపమని పంక్తిరథుడు
తక్షణమె సాగమని శ్రీరాముడు
తననట్లు ఇరువురూ తొందరింప
మతిపోయి సతమతము పడె మాతలి 207
66
మహరాజు ఆనతిని మీరి రామా!
నగరుకు తిరిగి చేరిన మీదట
ప్రభువునకు మోమెట్లు చూపగలను?
నిలదీయ బదులేమి పలుకగలను?208
67
అనుచున్న మాతలిని అనునయించి
ఈరీతి పలికెను శ్రీరాముడు
రధచక్ర సవ్వడిని మీ కంఠము
వినలేక పోతినని బదులివ్వుము209
68
నే క్షణము నిలుచుచో ఫలితమేమి?
నాతండ్రి దుఃఖార్తి తీర బోదు
ఇది ఆతని ఆజ్ఞయే కనుక మనకు
అసత్య ఫలితమిక అంటబోదు210
69
అనుచున్న దాశరథి ధర్మదీక్ష
మాతలికి కర్తవ్య బోధ అయ్యె
ఆపైన రథవేగమే మించెను
రాజ్యమ్ము కనుమరుగు కాజొచ్చెను211
70.
రథగమన వేగాన దుమ్మురేగి
రామయ్య రూపమ్ము మసకబారె
ప్రియతనయుడే కనుల కానరాక
మహరాజు నడివీధి కుప్పగూలె 212
71.
పయనించి పొలిమేరలన్ని దాటి
వెన్నంటు ప్రజలనే మభ్యపరచి
మువ్వురూ గంగ ఒడ్డుకు చేరిరి
ఆ రాత్రి అచటనే వారాగిరి 213
72.
అడవిలో అక్కడొక బోయరాజు
గుహుడతడు ఎదురొచ్చి ఆదరమున
వారికి అతిథి పూజలు చేసెను
ఆ వేళ మిత్రుడై అలరించెను 214
73.
మరునాడు తెల్లవారిన యంతనే
సుమంత్రుని దాశరథి వీడుకొలిపె
వారెల్ల నది దాటి పోయేందుకు
గుహుడొక్క నావనే సిద్ధపరచె 215
74.
జనపదమ్ము లన్నిటిని దాటివారు
దుర్గమారణ్యాలు చేరుకొనిరి
అచ్చోట ప్రయాగ చెంతనున్న
భరధ్వాజ ఆశ్రమము దర్శించిరి 216.
75.
అతిథులని అర్ఘ్యపాద్యమ్ములొసగి
ఆ మౌని శుభమనుచు దీవించెను
వసతికి అనువైన ప్రాంతమంటూ
గిరి చిత్రకూటమ్ము చేరుమనెను 217
76.
వల్లెయని ఆ పర్వతమ్ము చేరి
అందముగ నిర్మించి పర్ణశాల
అయోధ్య నగరంపు మాట మరచి
వారచట సుఖముగా జీవించిరి 218
(సశేషం)
VII
72/24 (77-89 చరణాలు)
77.
ఇచట రాచనగరమ్ములోన
ఆరని శోకాగ్ని అలముకొనియె
దుర్భరమ్మౌ పుత్రశోకమ్మున
రాజుకు మూణ్ణాళ్ళె యుగములాయె 219
78.
ఇటులుండ ఆరవనాటి రాత్రి
అతనికి అంత్యఘడియలు వచ్చెను
తలపోసి వృద్ధతాపసి శాపము
కౌసల్యతో చెప్పి తల్లడిలెను 220
79
ఓదేవి!ఎల ప్రాయమందు నేను
ఒకనాడు వేటాడ వనికేగితి
అచట సరయుతీరమ్ము వెంట
మృగముకై చాటుగా నే దాగితి..221.
80.
నీటిలో కడవ ముంచిన శబ్దము
విని యేన్గు తొండాన నీరుత్రాగు
సవ్వడిగ భ్రమియించి కొట్టినాను
మూల్గువిని పరువెత్తి చేరినాను 222
81.
గుండెలో దిగిన బాణమ్ముతోటి
గిలగిల కొట్టుకొను మునిబాలుని
కాంచిన నా మనసు వికలమాయె
అపరాధభావమ్ము అలముకొనియె 223
82.
అంధులు,వృద్ధులౌ తలిదండ్రుల
దాహార్తి తీర్చమని వేడుకొంటూ
బాలకుడు మరణించె కనుల ఎదుట
నే పోయి నిలిచితిని ముని ముంగిట 224
83.
నే విన్నవించిన దుర్వార్తను
విని వృద్ధ దంపతులు వివశులైరి
పుత్ర శోకాన తపియించి నీవుకూడా
మరణింతువని నన్ను శపియించిరి 225
శ్రీరామ రామ రామా
శుభనామ సీతామనోభిరామా
84.
తనయు నెడబాటుతో విగతులైన
ముని దంపతుల వాక్కు ఫలియించెను
ఈ పుత్రశోకాన్ని సైపలేను
రాముణ్ణి కనలేక బ్రతుకలేను . 226
85.
ధర్మాత్ముడైన నా ప్రియపుత్రుని
కానలకు పంపిన కఠినాత్ముని
ఎడమాయె రాముణ్ణి కనుభాగ్యము
ఏ రీతి తీరునిక నా దుఃఖము 227
86.
కనుచూపు క్రమముగా మందగించె
దేవి! నా జ్ఞాపకము సన్నగిల్లె
యమదూతలొచ్చిరి నా కోసము
కడగట్టుచున్నది నా ప్రాణము 228
87.
అల్లారు ముద్దుగా పెంచుకొంటి
అరక్షణము కనకున్న నల్లాడితి
పదునాలుగేండ్లు నిను చూడకున్న
ప్రాణ మెటు లాగు నా చిట్టితండ్రీ! 229
88.
నాయనా! గారాల రామచంద్రా!
నీవెక్కడుంటివో ఎరగనైతి
నే దిక్కు తోచని వాడనైతి
అని యేడ్చె నా రాజు రాము దలచి 230
89.
పత్నులౌ సుమిత్రా కౌసల్యలు
చెంతనే చేరి ఓదార్చుచుండ
రామ!రామా!రామ రామ యనుచు
దశరథుడు ప్రాణాలు వదిలేసెను 231.
(సశేషం)
VIII
72/25 (90 - 102)
90.
అతిదీర్ఘ కాలమ్ము తన నేలిన
మహరాజు దశరథుని మరణమ్ముతో
కళతప్పి పోయినది రాజ్యలక్ష్మి
కన్నీట మునిగినది జనవాహిని232
91.
పండంటి పుత్రులొక నల్వురున్నా
మహరాజు మరణించు సమయమ్మున
ఒకరైన తనచెంత లేకుండిరే!
అని యెల్లవారచట దుఃఖించిరి 233
92
దుఃఖాన్ని దిగమ్రింగి మంత్రులంతా
కర్తవ్యమేమిటని యోచించిరి
వసిష్ఠ మౌనీంద్రు ఆజ్ఞ తోటి
భరతుణ్ణి రప్పింపగా నెంచిరి234
93
అతడొచ్చు నందాక మృతదేహము
చెడకుండ తైలంపు ద్రోణిలోన
వెనువెంటనే వారు భద్రపరచి
దూతలను తక్షణమె రావించిరి235
94
దుర్వార్త లేమియు తెలుపకుండా
భరత శత్రుఘ్నులను శీఘ్రమ్ముగా
కొనితెచ్చు బాధ్యతను మరువకండి
కడువేగమే పురికి మరలిరండి236
95
అను ఆనతిని వారు పాటింపగా
జవనాశ్వముల నెక్కి పయనమైరి
విశ్రాంతి కైననూ ఆగకుండా
అశ్వపతి నగరమ్ము చేరుకొనిరి237
96
తన తండ్రి మరణించినట్టి రాత్రి
భరతునకు దుస్వప్నములు తోచెను
నిదురలో ఉలికిపడి మేల్కొనియెను
మనసేమొ కీడునే శంకించెను238
97
అంతలో దూతలట కరుదెంచిరి
కోసలకు పోవలయునని చెప్పిరి
కలవరము నిండిన హృదయమ్ముతో
సోదరులు వెంటనే పయనమైరి239
98
అతిశీఘ్ర గమనాన పయనించిరి
ఎనిమిదవ నాటికి పురి చేరిరి
వెలవెలాబోతున్న నగరు చూచి
ఏమైనదో యనుచు దుఃఖపడిరి240
99
పరుగు పరుగున పోయి భరతుడంత
తన తండ్రి మందిరము చేరి అచట
తండ్రియే కనరాక తల్లడమున
కైకమ్మ మందిరము చేరుకొనెను241
100
తనయుణ్ణి కాంచి కడు సంతసమున
కైకమ్మ ఎదురేగి సంభ్రమమున
వివరించి జరిగిన విషయమంతా
ప్రీతితో రాజ్యమ్ము పొందుమనెను 242
101
అప్రియములన్నియూ అతి ప్రియముగా
చెబుతున్న తల్లినే ఛీత్కరించి
నీవల్లనే నాతండ్రి యిటుల
దుర్మరణ మందెనని నింద జేసె243
102
నాతండ్రి సముడైన నా అన్నను
అడవులకు పంపిన నిన్ను నేను
క్షమియింప జాలనని భరతుడనుచు
పెదతల్లి కౌసల్య కడకు నేగె 244
(సశేషం)
IX
72/26 (103 -117)
103
వత్సమును కనలేని గోమాతలా
దుఃఖాన వివశమౌ పెదతల్లిని
అల్లంత దూరాన కనినంతనే
భరతుని హృదయమే వికలమాయె245
104
తనతల్లి కతన మరి తనవల్లనే
రామయ్య తల్లికీ కష్టమనెడు
అపరాధ భావాన కైక సుతుడు
సిగ్గుతో పెదతల్లి పాదమంటె 246.
105
మాతరో!మన్నింపవమ్మ నన్ను
అమ్మరో! అపరాధి కానునేను
అన్నను అడవులకు పంపినట్టి
ఆ ఘోరపాపమ్ము నాది కాదు247
106
అన్నపై ప్రేమనే వీడలేదు
అవనిని నేనెపుడు కోరలేదు
నా అన్న రామయ్య పాదసాక్షి
కలనైన నాకిట్టి తలపురాదు. 248
107
అన్నను అడవులకు పంపినట్టి
ఆ క్రూర నిర్ణయము నాది అయితే
ఓ తల్లి !ఆ పాప ఫలితమ్ముగా
నాకిదే నరకమ్ము కలుగుగాక! 249.
108
పతితులు భ్రష్టులు పాపాత్ములు
క్రూరులు చోరులు కఠినాత్ములు
వీరెల్ల పొందేటి నరకమ్ములు
నేగూడ పొందెదను నిజము సుమ్ము250
109
అని పలికి దుఃఖించి మూర్ఛిల్లిన
కల్మషము లేనట్టి కైకసుతుని
శపథాలు విని మురిసి రామజనని
ఒడిజేర్చి ఓదార్చె ఆ భరతుని251
110
చల్లనౌ నీ పలుకు విని నంతనే!
నామదికి ఉపశాంతి కలిగె తండ్రీ!
నీలోన లేదు ఏ కపటత్వము
ధన్యుడవు నాయనా!నీకు శుభము252
111
అనుచున్న కౌసల్య దీవెనలకు
భరతుని హృదయమ్ము తేరుకొనెను
మంత్రుల ఉద్బోధ లాలకించి
తండ్రికి అంత్యేష్టి జరిపించెను253
శ్రీరామ రామ రామా
శుభనామ సీతామనోభిరామా
112
రాకుమారులు ఇద్దరూ శాస్త్ర విధిని
తండ్రికి ఉత్తరక్రియలు జరుప
అమాత్యులొచ్చి ఇక కర్తవ్యము
భరతునికి ఈ రీతి బోధించిరి 254
113
నీ అన్న వనవాసమున కేగెను
నీ తండ్రి పరలోక గతుడాయెను
నీ తల్లి పొందిన వరము వలన
రాజ్యాధికారమ్ము నీకందెను255
114
ఇది తండ్రి ఆజ్ఞగా మదినెంచుము
నీ యన్న సమ్మతిగ భావించుము
అరాచకమ్మునే వారింపగా
నీవిపుడె రాజ్యాన్ని చేపట్టుము256
115
అనుమాట లాలించి భరతుడపుడు
తానట్టి పాపమ్ము తలపననెను
నే వెళ్ళి రాముణ్ణి రాజ్యానికి
తక్షణమే తోడ్కొని వత్తుననెను257
116
రామునకు మారుగా వనవాసము
నే చేతు ననుచున్న భరతుగాంచి
ముదమందినా రచట ఎల్లవారు
భరతుని వెనువెంట సాగినారు258
117
సకల పరివారమూ వెంటరాగా
సర్వసైన్యాలు తన ననుసరింప
తల్లులను తోడ్కొని వనసీమకు
అన్నకై సాగెనా ధర్మాత్ముడు 259
(సశేషం)
X 72/27
(118-131 చరణాలు)
గంగానదీ తీర ప్రాంతమందు
శృంగిబేర పుర సమీపమందు
అరుణకాంచన ధ్వజ రథముగాంచి
భరతుడని ఊహించినాడు గుహుడు260
119
పరివార సహితుడై భరతుడిటకు
తానేల వచ్చెనో తెలియకుంది
అన్ననే చూడగా మనసాయెనో!
అపకారమేమైన తలపెట్టునో!261
120
ఈరీతి తలపోసి సన్నద్ధుడై
భరతుని దర్శించి అతని మనసు
తెలుసుకుని మదినెంతొ సంతసించి
ఆతిథ్యమొసగెనా బోయరాజు 262
121.
మరునాడు వారెల్ల బయలుదేరి
భరద్వాజ ఆశ్రమము చేరుకొనిరి
ఆ మౌని ఆశీస్సులందుకొనిరి
ఆరాత్రి ఆతిథ్యమును పొందిరి263
122.
తన అన్న జాడనే తెలుపమన్న
భరతునికి భరద్వాజు డిట్లు తెలిపె
దశక్రోశ మిచటికి చిత్రకూటం
కలదచట రాముని శుభ కుటీరం264
123.
అనుచున్న మౌనీంద్రు వచనాలకు
ముదమంది భరతుడు మ్రొక్కలిడుచు
తన అన్న దర్శనము శీఘ్రమ్ముగా
చేయగా వెంటనే పయనమాయె265
124
దక్షిణపు దిక్కుగా కదలి వారు
మందాకినీ తటిని చేరినారు
కనుచూపు మేరలో చిత్రకూటం
కని పొంగి పోయెను వారి హృదయం266
125
అడవిలో వినపడిన కలకలమ్ము
విని రామచంద్రుడు సౌమిత్రిని
కారణము తెలియమని ఆజ్ఞ నిడెను
చెట్టెక్కి లక్ష్మణుడు అటు చూసెను267
126.
అన్నరో!భరతుడిదె వచ్చుచుండె
వేలాదిగా సేన వెంటనుండె
మనజాడ తెలుసుకొని మట్టుబెట్టి
పోనెంచెనేమొ ఆ కైక సుతుడు268
127
ఓఅన్న!ఇక జాగు సేయనేల?
తమ్ముడని మనసులో తలపనేల?
అనుమతిని ఇవ్వండి నాకిప్పుడే
వధియించి వచ్చెదను నేనిప్పుడే269
128
అనుచున్న లక్ష్మణుని తీరుజూచి
బుసకొట్టు తమ్ముని శాంతపరచి
దిగిరమ్ము నాయనా నీవిచటికి
అతనిపై నీకింత అలకేటికి 270
129.
శుద్ధాంతరంగుడే నా తమ్ముడు
చెడు తలపులన్నవే లేనివాడు
మన తోడ బుట్టిన మన భరతుడు
మనకట్టి చెడునెపుడు చేయబోడు 271
130
మనయొక్క వనగమన వార్తనెరిగి
నగరుకు మరలించ యత్నించగా
వచ్చేను కాబోలు నా తమ్ముడు
తమ్ముడా! కాసేపు వేచి చూడు 272.
131.
అని రామచంద్రుండు అనునయింప సిగ్గుపడి తలవంచె లక్ష్మణుండు
అంతలో శత్రుఘ్ను తోటి కలసి
భరతుడు వడివడిగ నడచివచ్చె273
(సశేషం)
XI
132 -143
132.
రాముని కట్టెదుట కాంచగానే
భరతుని దుఃఖమ్ము కట్టతెగెను
పరుగున అన్ననే చేరుకొనెను
పాదాలపై వ్రాలి శోకించెను 274
133
శోకించు తమ్ములను ఊరడించి
రాముడు ఇరువురిని లేవనెత్తి
ఒడిలోన చేర్చుకుని కుశలమ్మును
అడుగుతూ ఈరీతి ప్రశ్నించెను275
134.
నాయనా!భరతుడా!మీరిచటికి
వచ్చిన కతమేమి చెప్పవేమి?
బంధుజను లెల్లరూ క్షేమమేనా!
మన తండ్రి దశరథుడు కుశలమేనా!276
135.
అనుచున్న రామయ్య కా భరతుడు
కంఠాన దుఃఖమే అడ్డుపడగా
సీతయూ లక్ష్మణుడు వినుచుండగా
వినిపించె తమతండ్రి మరణవార్త277
136.
ఓ అన్న !నీదు ఎడబాటు చేత
కలిగిన దుఃఖమ్ము సైపలేక
స్వర్గస్తులైనారు తండ్రిగారు
అని తెలిపె రామునకు భరతుడపుడు 278
137.
వాడియౌ శరాఘాతము మాదిరి
వారిని ఆ వార్త బాధించెను
తండ్రిని మరిమరి తలచి తలచి
రాముడిటు దుఃఖాన పలవించెను279
138.
ఓ తండ్రి!ఇటువంటి దుర్మరణము
నావల్లనే మీకు ప్రాప్తించెనా!
నా జీవితాంతమూ ఈ నరకము
నే సైప వలెనిట్టి దురదృష్టము280
139.
తండ్రిని కడచూపు చూడనైతి
అంత్య సంస్కారమ్ము సలుపనైతి
నావల్ల మరణించె మన జనకుడు
నా వంటి నిర్భాగ్యు లింకెవ్వరు 281
140.
ఓ భరత శత్రుఘ్నులార! పురిని
తండ్రికి ఉత్తరక్రియలు జరిపి
పితౄణమును తీర్చు భాగ్య మంది
ధన్యాత్ములైనారు మీరిర్వురూ. 282
141.
ఈ రీతి పలవించి శ్రీరాముడు
తన మామగారిని తలచి సీత
తక్కిన మువ్వురును తండ్రి దలచి
విలపించి నారచట విపినమ్మున 283
142.
ఆ రీతి దుఃఖించి కొంత తడవు
ఆ పిదప తేరుకుని తమ తండ్రికి
సౌమిత్రితో గూడి రాముడచట
జలతర్పణమ్ములను అర్పించెను 284
143.
గారపిండియు మరి రేగుపండ్ల
మిశ్రమపు ముద్దలను సిద్ధపరచి
తిలతర్పణములతో తండ్రికచట
పిండ ప్రదానమ్ము కావించెను285
(సశేషం)
XII
(144 -152)
144.
తదుపరి వాత్సల్య ముట్టిపడగా
భరతుని కుశల ప్రశ్నలు వేసెను
పరిపాలనను గూర్చి ప్రశ్నించెను
అదివిని భరతుడిటు బదులొసగెను 286
145
అన్నరో! నన్నిటుల ప్రశ్నింపగా
న్యాయమా!ఇది నీకు భావ్యమౌనా!
అన్నవు,అర్హుడవు నీవుండగా
అల్పుడను అగు నేను రాజగుదునా !287
146
నీదైన మకుటమ్మునో అగ్రజా!
నాదనుచు నేనెటుల ధరియింతును
నా తల్లినీ నన్ను మన్నింపుమా!
విచ్చేసి రాజ్యమ్ము పాలింపుమా! 288
147
మన తండ్రి మాటనే నిలిపేందుకు
నా తల్లి పాపమ్ము తొలగేందుకు
అన్నరో!నీ బదులు నేనిచ్చట
వనవాస గడువంత చెల్లించెద289
148
అని భరతు డెంతగా వేడుకున్నా
తను మరలి రాననియె శ్రీరాముడు
తమ్ముడా!మన తండ్రి లేకున్ననూ
పిత్రాజ్ఞ మీరగా తగదు మనకు290
149
రాజ్యపాలన తండ్రి నీకిచ్చెను
వనసీమ ఏలుబడి నా కొసగెను
అని రాముడెన్ని విధముల చెప్పినా
రాజ్యమ్ము వలదనియె ఆ భరతుడు 291
150
అటజేరి వింటున్న వారందరూ
విస్మయానందాల మునిగిపోయి
ఇటువంటి అన్నదమ్ముల ప్రేమను
తామెచట చూడలేదని మురిసిరి 292
151
విధిలేక చివరకా భరతుడంత
రాముణ్ణి మెప్పించి పాదుకలను
వేడుకొని భక్తితో గ్రహియించెను
నీరాజ్య భారమిక వీటిదనెను 293
152
ఓ అన్న!పదునాలుగేండ్ల పిదప
నీవు రాకున్నచో మరణింతును
ఆనాటి వరకు నే శత్రుఘ్నుతో
అట నందిగ్రామాన నివసింతును 294
153
అనిపలికి శ్రీరాము పాదుకలను
తన తండ్రి దైనట్టి భద్రగజము
శత్రుంజయమున నుంచి భరతుడంత
పురి మరల అనుమతిని వేడుకొనెను
295
154
తల్లులకు గురునకు భక్తిమీర
మ్రొక్కులిడి వీడ్కొలుప శ్రీరాముడు
విడలేక భారమౌ హృదయాలతో
అందరూ అయోధ్య మరలినారు 296
(సశేషం)
XIII
155
కొన్నినాళ్ళట గడిపి శ్రీరాముడు
ఆ చిత్రకూటమ్ము విడిచిపెట్టి
అత్రిముని ఆశ్రమము చేరుకొనెను
ఆ తపసి ఆశీస్సులను పొందెను 297
156.
అనసూయ ప్రేమతో సీతమ్మకు
పతివ్రతా ధర్మాలు బోధజేసి
దివ్యమౌ తన అంగరాగమ్ములే
తానిచ్చి మెచ్చుకొని దీవించెను. 298.
157
వింతగా జరిగె మీ స్వయంవరమ్ము
అని కొంత వినియుంటి నే వివరము
తెలుసుకొన మనసయ్యె ఆ వేడుక
అని వినిచె అనసూయ తన కోరిక 299
158
అమ్మరో!నా తండ్రి జనకరాజు
యజ్ఞమ్ము చేయగా సంసిద్ధుడై
అనువైన క్షేత్రాన్ని దున్నువేళ
నాగేటిచాలులో నే వెడలితి 300
159
సంతతే లేనట్టి నా జనకుడు
సంతసముతో నన్ను ఒడి జేర్చెను
ఈ దివ్యశిశువు ఇక నీ కూతురే
అను వాణి గగనాన విని మురిసెను 301
160
అల్లారుముద్దుగా నన్ను పెంచె
తగు వరుని గానక దిగులుచెందె
అయోనిజనైనట్టి నన్ను గెలువ
శివధనువు వంచుటే తగినత్రోవ. 302.
161
అని తండ్రి ధృడముగా నిశ్చయించె
వర పరీక్ష కై మదిని నిర్ణయించె
రాకొమరులెందరో యత్నించిరి
విఫలులై సిగ్గుతో వెనుదిరిగిరి 303
162
ఒకనాడు దాశరథి అరుదెంచెను
శివధనువు అవలీలగా విరిచెను
నా తండ్రి నన్ను చేపట్టుమనెను
తన తండ్రి నడగమని రాముడనెను 304
163.
దశరథుడు ముదముతో సమ్మతించె
దాశరథి ఆ పిదప నను గ్రహించె
ఓ తల్లి! ఇదియె నా పెళ్ళి గాథ
అనుగమించెద రామునే సర్వదా 305
164
అని సీత తన గాథ వివరించెను
అనసూయ ఆ కథను విని మురిసెను
ఆ రాత్రి సుఖముగా అచట గడిచె
మరునాడు మునిగణము వీడుకొలిపె 306
165
తాపసుల ఆశీస్సులే రక్షగా
ఇల్లాలు తమ్ముడే ఇల తోడుగా
అట నుండి దండకావని దిక్కుగా
దాశరథి పయనమై తరలిపోయె 307.
166
కానలో కాషాయ వస్త్రములతో
శ్రీరామలక్ష్మణులు గడుపుచుండ
భరత శత్రుఘ్నులిట పురినుండియు
భోగములు త్యజియించి బ్రతుకుచుండె308
167
వనవాస నియమమ్ము అన్నకైనా
తమ్ములు మువ్వురూ తాము కూడా
సుఖమును భోగమును విడిచిపెట్టి
జీవించిరది యెంత ఆదర్శము309
168
కాంచగా తనయుడన శ్రీరాముడే
భువిలోన తమ్ముడన లక్ష్మణుండే
ధన్యుడన వేరెవరు మరి భరతుడే
తధ్యమ్ము సాధ్వియనసీతమ్మయే 310
169
ధర లోన ఘనమైన ఈ ధర్మము
చాటుటే ఈ కావ్య పరమార్థము
గడువనీ యుగములవి ఎన్నయిననూ
ఎల్లరకు ఆదర్శమీ మార్గము. 311
170.
జగతిలో మది మదీ మధురమ్ముగా
కోదండరాముడే కొలువుకాగా
ఈ రీతి అయోధ్య కాండ ఇంక
ఇంతతో ముగిసినది ఈ విధముగా 312
*అయోధ్య కాండ సంపూర్ణం*
సింహాద్రి జ్యోతిర్మయి
13.5.2018.
Comments
Post a Comment