4/4.గేయ రామాయణం కిష్కింధ కాండ
కిష్కింధ కాండ
గేయ రామాయణం
కిష్కింధ కాండ(127 చరణాలు)
1.
ఇపుడింక వినరండి ఈ కాండను
శ్రీ రామ చరితమే అత్యద్భుతం
విని మీరు తన్మయమునందగలరు
పాడుకొని పరవశము పొందగలరు
2.
కిష్కింధ కాండ లో దాశరథి కి
కపిరాజు సుగ్రీవు మైత్రి దొరికె
బలశాలి వాలి నేలను కూలగా
రాజ్యరమ సుగ్రీవు సొంతమయ్యె
3.
శ్రీరామ కార్యమ్ము సాధించగా
కపిసేన దిక్కులకు పయనమాయె
పశుపక్షులాదిగా ప్రతిప్రాణియు
రామునకు తోడ్పడి ధన్యమాయె
4.
మతంగవనమునే అధిగమించి
మనసెరిగి సేవించు సౌమిత్రితో
చిత్తమ్ము సీతకై తొందరింప
ఒక చిన్న ఆశయే ఆదరువుగా
5.
వడివడిగ నడక సాగించి వారు
ఋష్యమూకమ్మునే చేరినారు
నిండుగా పారేటి పంపానది
నీటితో స్నానమ్ము లాడినారు
6.
తొలుతగా పంపాసరోవరమ్ము
ఆ పిదప మహితమౌ ఋష్యమూకం
కనుముందు కనువిందు చేయగానే
రామునకు చిత్తమ్ము కలతదేరె
7.
తరులతలు నిండుగా విరగబూసి
వనమంత వాసంత శోభనలరు
అందమౌ పంపానదీ తీరము
కాంచి మది పరవశించెను రాముడు
8.
కనపడక నా దేవి వైదేహియు
కనుముందు కళలొలికి వాసంతుడు
తమ్ముడా!లక్ష్మణా!కాంచినావా!
నా మదిని కలతపడ జేయుచుండె
9.
నా అంతరంగాన నా జానకి
నా సీత తలపులందీ రాముడు
స్థిరముగా సతతమ్ము నిలిచేములే
నాయనా!సత్యమ్ము మా మమతలే
10.
అని పలికి ఒకమారు ఆశపడుతూ
అంతలో ఒకమారు దుఃఖపడుతూ
మరిమరీ మదిలోన పరితపించే
అన్నను లక్ష్మణుండోదార్చెను
11.
తగు ధైర్యవచనాలు పలికి తాను
సౌమిత్రి అన్నయ్య నూరడించె
తమ్ముని ఓదార్పు నాలకించి
రాముడు చిత్తాన కలతదేరె
12.
అటు సాగి వస్తున్న సోదరులను
కనుచూపు మేరలో కాంచగానే
కపిరాజు మదిలోన కలతనొంది
శత్రువుల చారులని తలపోసెను
13.
వారంత దూరాన ఉండగానే
కొండంత భయముతో సుగ్రీవుడు
మనసులో శంకించి కంపించుతూ
మర్మమ్ము తెలియమని హనుమనంపె
14.
భిక్షుకుని రూపమ్ము దాల్చి హనుమ
శ్రీరామలక్ష్మణుల చేరుకొనియె
అచ్చెరువునందుతూ మదిలోపల
వారితో మృదువుగా పలికెనిటుల
15
మీదు వేషమ్ము చూడగా తాపసులది
కనగ మీరూపమ్ము క్షత్రియులది
ఏ దివ్య పురుషులో కాబోలని
నా మదిని సందియము కలుగుతోంది
16.
మా నేత మహరాజు సుగ్రీవుడు
అన్నచే వంచింపబడె నాతడు
నేనతని సేవించు సచివుండను
ఆతడిటు పంపగా వచ్చినాను
17.
అని పలుక రాముడా హనుమనెరిగి
వాక్యజ్ఞుడనుచు తా ప్రస్తుతించె
అటుపైన సౌమిత్రి తమ చరితము
వినిపించి సుగ్రీవు చెలిమికోరె
18.
అవ్వారి చరితమ్ము నెరిగినంత
మదిలోన తనకెంతొ కలుగచింత
హనుమయ్య ఓదార్పు పలికి సుంత
వారిని చేర్చె సుగ్రీవు చెంత.
19.
అగ్నినే రగిలించి హనుమంతుడు
సుగ్రీవ రాములకు మైత్రి నెరుప
ఇరువురూ ఒకరి కష్టమ్ము నొకరు
తీర్పగా ప్రతినలే జేసినారు
20.ఒకకొంత యోచించి సుగ్రీవుడు
గుహలోన దాచిన ఒకమూటను
కొనివచ్చి రామునకు చూపించుతూ
ఆనాటి సంఘటన వివరించెను
21.
మిత్రమా! ఆర్తనాదములతోడ
వినువీధి అసురుని చేజిక్కిన
దీనాతిదీనయౌ దివ్యకాంత
ఈ నగల మూటనిట జారవిడిచె
22
ఆ పలుకు చెవులార విన్నంతనే
జానకి కడకొంగు కనినంతనే
పొంగేటి దుఃఖమ్ము నాపలేక
రాముడా మూటనే హత్తుకొనెను
23.
కన్నీరు నాకనుల కప్పివేసె
కనజాలకుంటిని ఓ లక్ష్మణా!
మీ వదిన ధరియించు భూషణములు
ఇవియేన ఒకసారి చూడవయ్యా!
24.
అనినంత లక్ష్మణుడు ఉద్విగ్నుడై
ఆ నగల మూటనే విప్పిచూసి
భక్తితో తనచేత దాల్చి యతడు
ఆర్తుడై అన్నతో పలికెనిటుల.
25.
వదినమ్మ కుండలాలను తెలియను
కేయూరహారాలు కనియెరుగను
నే దినము మొక్కేటి పాదాలను
అలరించు నూపురాలివి తెలుసును.442
26.
అదివిని వివశుడై శ్రీరాముడు
మది రోషదుఃఖాల నోపలేక
ఈ రీతి మృత్యువాకిలి తెరచిన
మూఢునికి మూడెనని మండిపడెను
27.
ఊరడిల్లి యుండుమా!ఓ మిత్రమా!
ఇక ధైర్యశాలివై వర్తిల్లుమా!
దీనగతి నందుచు ధీమంతులు
ఇటువలే శోకాన క్రుంగదగునా!
28
అని చేరి కపిరాజు ఓదార్చగా
దుఃఖాన్ని వీడి ఆ రఘువీరుడు
కర్తవ్యమూహించి కలతదేరి
స్నేహితుని చరితమే చెప్పమనెను
29.
మిత్రమా!రఘురామ!ఆలకించు
బలశాలి వాలి మా అన్నగారు
కిష్కింధ పురమునకు రాజు తానై
కపులను చల్లగా ఏలుచుండె.
30
ఇటులుండ ఒకనాటి అర్ధ రాత్రి
మాయావి యనునొక్క రక్కసుండు
కవ్వించి యుద్ధానికే పిలువగా
మా అన్న క్రోధానతలపడియెను
31
బిలమందు దూరిన అసురునిపుడే
నే వెళ్వళి ధియించి వత్తుననుచు
గుహ ముఖ ద్వారాన నన్ను నిలిపి
నా అన్న లోపలికి తానేగెను
32.
అచటనొక యేడాది గడచిపోయె
వెలుపలకు ఒక్కరూ రాకపోయె
ఆపైన మరికొంత కాలానికి
రాక్షసుల కేరింత చెవినబడియె
33
గుహనుండి అన్న మూలుగు వినబడి
అంతలో రుధిరధారలు కనబడి
మరణించె అన్నయని మదిని వగచి
బిలమునే మూసి నే మరలిపోతి
34
మంత్రులకు దుర్వార్త వినిపించగా
వారెల్ల నాకు పట్టము గట్టిరి
అంతలో అగ్రజుడు తిరిగివచ్చి
వంచకుడవని నన్ను దూషించెను
35
పదమంటి నేనెంత వేడుకున్నా
నా అన్న నా మాట నమ్మలేదు
పురినుండి నన్నతడు వెడలగొట్టి
నా ధర్మ పత్ని నే చెరబట్టెను
36.
ఈ ఋష్యమూకమ్ము నా అన్నకు
చొరరాని ప్రాంతమ్ము అయినందున
నే ప్రాణభయముతో నాటినుండి
ఇచటనే తలదాచుకొనియుంటిని
37
దుందుభి అనువాని చంపి వాలి
మతంగ వనములో విసిరె నొకట
ఆ చేతకొక మౌని శపియించగా
వాలి కిది చొరరాని నెలవయ్యెను
38
మిత్రమా!వింటివా నా గాథను
కంటివా నేటినా దురవస్థను
తెలుపుమిక చూపగలవా శౌర్యము
నాకింక చేయగలవా సాయము
39.
నా అన్న సామాన్యుడని యెంచకు
మిత్రమా!అలసటే ఎరుగడతడు
వరయుతుడు అమితబల సంపన్నుడు
కనుకనే కలవరము నాకెప్పుడు
40
రామ!నీవసమాన శూరుండవే
కాని నే ప్రత్యక్షముగ నెరుగను
వాలి తను అపజయమ్మే ఎరుగడు
అది నేను కనులార గనియుంటిని
41.
మిత్రమా! నీ బలము రూపించితే
నే ప్రాణభయమునిక వీడగలను
అతని సాహసములలో నొక్కటి
నీవిపుడు చూపితే నమ్మగలను
42
ఇట సాల వృక్షమ్ము లేడు గలవు
ఒక్కొక్క బాణాని కొక చెట్టును
ఒడుపుగా మా అన్న నేల కూల్చె
నీవును అటువలే చేయగలవా!
43.
కపివరుని మాటవిని శ్రీరాముడు
చిరునవ్వు మోముపై చిందులాడ
సంధించి తానొక్క బాణమ్ముతో
అట సాలవృక్షమ్ము లేడు కూల్చె
44
ఆ అద్భుతము గనినంతనే
సుగ్రీవు డాశ్చర్య చకితుడయ్యె
సరిలేని వీరుడవు నీవేనని
స్తుతియించి పాదాల వాలిపోయె
45.
మంత్రులౌ నలుడు,నీలుడు,తారుడు
మరియును హనుమయ్య వెంటరాగా
శ్రీరామ లక్ష్మణుల సాయమ్ముతో
సుగ్రీవుడా క్షణమె బయలుదేరె
46.
తన మదిని నెలకొన్న శంక తీరి
ఇన్నాళ్ళ కోపమ్ము అవధి మీరి
వేగమే కిష్కింధ పురము జేరి
హూంకార మొనరించె నొక్కసారి
47
అందరూ చాటుగా దాగియుండ
సుగ్రీవుడొక్కడే పోయి నిలచి
యుద్ధమే చేయగా తన అన్నను
రౌద్రాన సిద్ధమై పిలిచె తాను
48.
సుగ్రీవు కంఠమ్ము గుర్తుపట్టి
వాలి ఎదురొచ్చెను పరుగుపెట్టి
పంతమే మీరగా ఒళ్ళుమరచి
ఇరువురూ తలపడి చెలరేగిరి
49
పోలికలలో ఒక్క రూపున కనపడే
వారిలో ఎవరెవరొ తెలియలేక
సందేహమున చిక్కి శ్రీరాముడు
బాణమ్ము సంధింప లేడాయెను
50.
వాలి ఘన శౌర్యాని కాగలేక
వెన్నిచ్చి పరుగెత్తె సుగ్రీవుడు
నీవల్ల పరువంత మాసెననుచు
రాముణ్ణి నిష్టూరమాడినాడు 466
51.
మిత్రమా!కనులకొకే తీరున కనపడే
మీలోన ఎవరెవరొ తెలియలేక
ఏదైన పొరపాటు జరుగునేమో
అనునట్టి శంకతో వెనుకాడితి
52.
కొనుమిదే గజపుష్పమాల నీవు
ఈ మారు మెడలోన దాల్చి వెళితే
ఆ మరు క్షణములో వాలి నేసి
నీ కిడిన మాటనే చెల్లింతును
53
అని చెప్పి శ్రీరాము డనినంతనే
సుగ్రీవు డటులనే మాలదాల్చి
శ్రీరామలక్ష్మణుల కూడితాను
తిరిగి యా కిష్కింధ పురము జేరి
54.
వాలి గృహ ద్వారమ్ము చెంత నిలిచి
సమరాభిలాషియై సుగ్రీవుడు
భీకరపు సింహనాదము చేసెను
అదివిని వాలియే మండిపడెను
55.
వెనుతిరిగి అంతలో తిరిగివచ్చి
పోరుకై కవ్వించు సుగ్రీవుని
విధముగని తల్లడము మదినందుతూ
తార తన వల్లభుని వారించెను
56.
నీదు అనుజన్మునకు నేడు నాథా!
దాశరథి స్నేహమ్ము దొరికెనంట
నీకట్టి వీరునితొ వైరమేల?
సంధికై యోచనము చేయరాదా!
57.
ఆ మాట పెడచెవిన పెట్టి వాలి
క్రోధాన తమ్మునితొ తలపడియెను
భీకరమ్మయినట్టి ఆ పోరులో
వాలిదే పైచేయిగా తోచెను
58.
అదనునే కనిపెట్టి రఘురాముడు
తన విల్లు సంధించి బాణమేయ
తనువెల్ల రుధిర ధారలు గ్రక్కుతూ
ఇంద్రధ్వజ మన వాలి నేలకూలె
59
రక్తసిక్తమ్మైనట్టి దేహమ్ముతో
గళమందు ఇంద్రుడొసగిన మాలతో
అరుణ కాంతులతో నొప్పు మేఘమల్లే
అలరిన ఆ వాలి అడిగె నిటుల.
60.
నీవంటి వానికిది న్యాయమేనా!
శ్రీ రామ!నే నీకు అపకారినా!
అధర్మపరుడవైనావు నేడు నీవు
ఇటుపైన అపఖ్యాతి పాలగుదువు
61.
అని పలికి ప్రశ్నించు వాలికపుడు
నిలువెత్తు ధర్మమౌ శ్రీరాముడు
ధర్మసూక్ష్మమ్ము తెలియమని వివరించుతూ
నయముగా బదులిట్లు పలికినాడు
62
వినుము !ఈ నేలంత కపినాయకా!
ఇక్ష్వాకు రాజులది ఇది తెలియుమా!
ఆపైన దుష్టశిక్షణ కార్యమునకే
నేనిటుల చేస్తుంటి వనవాసము
63
అధర్మ వర్తనుల నడ్డగించి
శిక్షించు అధికారముంది మాకు
ఆ మీద రాజులకు వేటాడుట
విహితమను సత్యమ్ము మరువబోకు
64.
పుత్రసముడైనట్టి నీ తమ్ముని
భార్యనే చెరబట్టినావు నీవు
ఇలలోన కామాత్ములకు సర్వదా
ఇటు మరణదండనే తగినశిక్ష.
65.
అనుచు రామయ్య ధర్మమ్ము చెప్పినంత
వాలి తనతప్పునే తాను తెలిసి
ధర్మాత్ముడా!నన్ను మన్నించుమా!
అని వేడి తుదిశ్వాస విడిచినాడు
66.
ఆ పిదప శ్రీ రామ చంద్రమూర్తి
అందరిని ఓదార్చి అనునయించి
మరణించినట్టి ఆ కపిరాజుకి
అంత్యక్రియలు జరుప ఆనతిచ్చె
67.
కిష్కింధ పురము కిక నేటినుండి
సుగ్రీవ! రాజువై పాలింపుమా!
నీ అన్న తనయుడౌ అంగదుణ్ణి
యువరాజుగా జేసి మన్నింపుమా!
68.
ఈ ఆషాఢమాసమూ శ్రావణమ్ము
మరి బాధ్రపదమును ఆశ్వయుజము
మిత్రమా!వార్షుకము లైనందున
సీతకై అన్వేషణము కుదరదు
69.
కనుకనే ఈ నాల్గు నెలలు నీవు
రాజ్యరమ సౌఖ్యాల ననుభవించు
ఆ పిదప నా కార్యమును మిత్రమా!
దీక్షతో స్వీకరింతువు గానిలే
70.
అని అతని వీడ్కొని రఘురాముడు
తమ్మునితొ ప్రస్రవణ గిరికిచేరి
అచట తమకావాస యోగ్యమైన
గుహనొకటి యెంచుకొని వసియించెను
71.
తపియించి విరహాబ్ది నీదులాడి
కపిరాజు సతి ఒడిని సేదదీరె
తన సీత ఎడబాటు సైపలేక
రాముడు ప్రతిక్షణము పరితపించె
72
మెల్లగా వానకారే ముగిసెను
చల్లగా శరత్తులే మొదలాయెను
సౌఖ్యాబ్ధిలో తాను మునిగితేలి
కపిరాజు మిత్రకార్యము మరచెను
73.
ఆ విధము గమనించి హనుమంతుడు
రాజునకు కర్తవ్య బోధజేసె
మేల్కొన్న సుగ్రీవుడావెంటనే
నీలుణ్ణి పిలిపించి ఆజ్ఞ లొసగె
74
దశదిశల నున్నట్టి వానరులకు
వర్తమానము పంపి రప్పించుము
గడువింక పదిహేను రాత్రులనుచు
కఠినంపు నియమమ్ము నేర్పరచెను
75
ఆ లోన కపిరాజు అలసత్వము
రామునకు ఆగ్రహము తెప్పించెను
మరచెనా మిత్రుడు మేలుమదిని
అనుచు తానొకయింత శంకించెను
76.
విషయమ్ము నెరిగిరమ్మని రాముడు
లక్ష్మణుని కిష్కింధ పురముకంపె
బుసకొట్టు పన్నగము అన్నట్లుగా
సౌమిత్రి కోపాన సాగి చనెను
77.
వస్తున్న లక్ష్మణుని తీరుగాంచి
కపిరాజు భయముతో వణికిపోయి
అతనిని శాంత పరచే బాధ్యత
తన దార తారకే అప్పగించె
78.
మృదువుగా భాషించి తార సుంత
సౌమిత్రి కోపాగ్ని చల్లార్చెను
ఆ అదను గమనించి సుగ్రీవుడు
పరుగున ఎదురొచ్చి పలుకాడెను
79
లక్ష్మణా! మిత్రకార్యము నేనెప్పుడో
మొదలిడితి నమ్ముమని శరణువేడె
ఆ పిదప అతనితో బయలుదేరి
రాముణ్ణి చేరుకొని చరణమంటె
80.
తనదైన కోటానుకోట్ల కొలది
అనుచరుల రామునికి వశము జేసి
ఆనతుల నీయమని విన్నవింప
దాశరథి మిత్రుణ్ణి ప్రస్తుతించి
81
మిత్రమా!రావణుని ఆవాసము
ఆపైన నా పత్ని యోగ క్షేమం
తొలుతగా తెలియగా యత్నించుము
ఆ పిదప యోచనలు సాగింతము
82
అనుచు ఆ దాశరథి పలికినంత
వల్లెయని వినయాన సుగ్రీవుడు
తన ఆజ్ఞ ఆలింప కపివీరులు
గాలించి రమ్మనియె నలుదిక్కులు
83
కపిరాజు వినతుడను వీరునొకని
శత సహస్ర వానరులు చేదోడుగా
పోయి తూర్పు దిక్కున సకలమూ
సరగున గాలించి రమ్మనియెను
84.
నీలుని,అంగదుని ,హనుమంతుని
భల్లూకరాజైన జాంబవంతు
దక్షిణపు దిక్కుగా పొమ్మనియెను
అణువణువు శోధించి రమ్మనియెను
85.
ఆపైన సుషేణాది ఋషి తనయుల
దరిజేరి వినయాన అంజలించి
మీరెల్ల పశ్చిమపు భాగమంతా
ప్రత్యణువు వెతకమని వేడుకొనెను
86.
ఆ పిదప శతవలిని చేరబిలిచి
ఉత్తరపు దిక్కుగా వెళ్ళమనెను
మనకచట సీత జాడే తెలిసెనా!
మిత్రుని రుణమింక తీరుననెను
87
నేటికిక ఒక్కనెల గడువు మీకు
నాటికి తీరవలె మిత్రకార్యం
అని తనదు మూకలకు ఆనతిచ్చి
ఆపిదప హనుమనే చేరబిలిచి
88
నీదు గమనానికే అడ్డు కానరాదు
పావనీ!అవని నీ కెదురు లేదు
నీ సాటి ఇంకెవరు లేరుసుమ్ము
ఈ పనిని చేయగలవాడ వీవే
89
అనుచున్న సుగ్రీవు ఆజ్ఞ చేత
తన కార్య సాధకుడు హనుమేనని
గుర్తించి దాశరథి సతికిమ్మని
గుర్తుగానిచ్చె తన ఉంగరాన్ని
90
వాత్సల్య భావాన శ్రీ రాముడు
ఒసగిన అంగుళిని తలనుదాల్చి
భక్తితో ఆ ప్రభుని చరణమంటి
హనుమయ్య అటనుండి బయలుదేరె
91
కపిరాజు కోట్లాది సైన్యమంతా
దిక్కులను అణువణువు గాలించినా
సీతమ్మ జాడయే దొరకదాయె
అంతలో నెలగడువు ముగిసిపోయె
92
సీతకై మూడు దిక్కులకేగినా
వానరులు విఫలులై తిరిగిరాగ
దక్షిణపు దిక్కులో వెదకుతున్న
హనుమాదు లాశయే వీడలేక.
93
మరికొంత కాలమ్ము వారెల్లరు
వెదకగా అవధి పుష్యము గడిచెను
మాఘమాసము గూడ మించిపోయె
అంతలో ఫాల్గుణము వచ్చిపడియె
94
విడువక వింధ్యాద్రి వెదకివారు
అటనుండి యోజనము సాగినారు
అచట వారంధకారము నిండిన
ఒకానొక బిలములో జారినారు
95
అచటొక్క బంగారు వనమున్నది
అక్కడొక తపస్విని కనపడినది
స్వయంప్రభ అనుపేరు తనదన్నది
ఆతిథ్య మిచ్చెదను ఆగమంది
96.
వచ్చిన పనియేమి తెలుపమంది
చెప్పిన కథయెల్ల తాను వింది
ధారపోసినదామె తన తపసును
కడలి దరి చేర్చింది కపివరులను
97.
ఆ పిదప దీవించి మరలిపోయె
కనుముందు కడలేని సంద్రమాయె
ఇచ్చిన గడువెపుడొ దాటిపోయె
ఆపదే గడువగా రానిదాయె
98
శిక్షించి తీరునిక సుగ్రీవుడు
ప్రాయోపవేశమే మార్గాంతరం
అని వారు తలపోయు సమయమ్మున
సంపాతి మృత్యువై వారి కెదురై
99.
కపులార!నే మిమ్ము భుజియింతును
అనగానె వానరులు భీతిల్లిరి
ఆ మాట విన్నట్టి అంగదుండు
హనుమతో ఈ రీతి పలికినాడు
100.
పావనీ!రామ కార్యము కోసమై
జటాయువానాడు ప్రాణమిచ్చె
పుణ్యమిది సీతకై వెదకువేళ
మరణించ నేడు మన వంతు వచ్చె
101.
తమ్ముడగు జటాయు ప్రస్తావన
వినరాగ సంపాతి వివరమడిగె
కథనంత పూర్తిగా యెరిగినంత
ఖగరాజు చింతించి పలికెనిటుల.
102
అంగదా! నే శక్తి హీనుండను
అయిననూ మాటసాయము చేతును
రావణాసురుడతడు లంక ప్రభువు
ఆ లంక ఈ కడలి కవలగలదు
103.
వైనతేయుల వంశీయులము మేము
జ్ఞానదృష్టిని భువిని మేమధికులం
ఈ పనిని కలుగునిక మీకు విజయం
సీతమ్మ దర్శనము జరుగు తథ్యం
104.
నావల్ల రామకార్యము జరిగినంత
తెగినట్టి నా రెక్కలవి మొలుచును
అనియతడు తనవరము చెప్పుచుండ
అంతలో అద్భుతము జరిగెనచట
105
చిరంజీవి యైనట్టి సంపాతికి
క్షణములో బంగారు రెక్కలొచ్చె
ఊర్థ్వలోకాలవైపుగా అతడెగురుతూ
శుభమంచు కపులకు దీవెనొసగె
106.
సంపాతి వాక్కులకు కపివీరులు
ఉత్సాహవంతులై ఉరికినారు
గాంభీర్య ముట్టిపడు కడలి గాంచి
భీతిల్లి వెనుకంజ వేసినారు
107
నిరుత్సాహము చెంది నీరుగారే
వానరుల గమనించి అంగదుండు
సామర్థ్య మేపాటి యెవరికుందో
తెలుపమని యెల్లరిని అడిగినాడు
108
శతయోజనపు మేర విస్తరించు
ఈ జలధి లంఘించి లంకజేర
తమకున్న శక్తియు సామర్థ్యము
చాలదని ఒకరొకరు చెప్పిరిటుల.
109
దశ యోజనములనియె గజుడప్పుడు
గవాక్షుడు ఇరువది యోజనములు
గవయుడు తన శక్తి ముప్పదనియె
శరభుండు మరియొక్క పది తాననె
110
గంధమాదనుడు యాబదనియె
మైందుడు దాటగలననె యరువది
ద్వివిదుడు డెబ్బది యోజనములు
ఆపైన పది అనియె సుషేణుడు
111.
జాంబవంతుడప్పుడు లేచి నిలిచి
తానిపుడు ముదుసలిని అయినందున
కేవలము తొంబది యోజనములే
సాగరము దాట గలవాడ ననియె
112.
ఆ పిదప యువరాజు అంగదుండు
శత యోజనములను తా నెగిరినా
వెనుకకు మరలి వచ్చుట అన్నది
తనకింక అసాధ్యమని తెలిపెను
113.
భల్లూక రాజపుడు ముందుకొచ్చి
కల్లోల పడతున్న కపివీరుల
ఉల్లాసమూరగా ఊరడించి
మెల్లగా హనుమనే చేరి పలికె
114.
మారుతీ!బలము ధైర్యము తేజము
గలనీవె ఈ కార్య సాధకుడవు
భువి ప్రాణి కోటిలో నీ కన్ననూ
సత్యమిది మిన్నయగు వారులేరు
115
వీరుడౌ కేసరియె జనకుడంట
నీ జనని అంజనాదేవి యంట
ఆమెను మనసుతో చేపట్టిన
పవనుడు నిన్నామెకొసగెనంట.
116.
పావనీ!పసితనములోన నీవు
పండుగా భ్రమియించి భానుబింబం
అందుకొనగోరి యా రవిని చేర
మూడు శతయోజనము లెగిరినావు
117.
ఆ చర్య గమనించి దేవేంద్రుడు
నీపైన వజ్రాయుధము విసరగా
అది నీదు ఎడమ దవడను తాకెను
నీ పేరు హనుమంతుడని మారెను
118.
శస్త్రాస్త్రముల చేత చావులేని
వరమునే విధాత నీకొసగెను
ఆపైన స్వచ్ఛంద మరణమ్మును
ఇంద్రుడు మెచ్చుకొని తానిచ్చెను
119.
కనుక నీ ఉపేక్ష మాని యింక
కార్యోన్ముఖుడవై కదలవయ్యా
అనుచు జాంబవంతుడే పలుకగా
హనుమలో ఉత్సాహ మురకలెత్తె
120
ఓ వీరవరులార!ఇది నిజమ్ము
నా తండ్రి అనిలుండు అమితబలుడు
ఔనౌను ఔరసుడ నతనికేను
సరిలేని ఆశక్తి పొందినాను.
121.
నే మహా మేఘమై పయనింతును
అమృతపు భాండమైనా తెత్తును
లంకనే పెకలించగలను నేను
తథ్యమిది జానకిని చూడగలను
122.
విహగేంద్రు డా వైనతేయుండును
దిక్పాల ప్రముఖుడౌ పవనుండును
వేగాన లోకమున నాకు సాటి
నా శక్తి కీ కడలి కొద్దిపాటి
123.
కాని నా లంఘనపు వేగమ్మును
ఈ నేల భరియింప లేదు సుమ్ము
అని హనుమ నలుదిశలు వెదకి చూసి
మహేంద్ర గిరినంత కాంచి పలికె
124
మహితమౌ మహేంద్ర గిరి శిఖరము
నా బరువు వేగాల కాగగలదు
సాగరము సులువుగా దాటేందుకు
అనువైన ఊపునిది ఈయగలదు
125
అని పలికి గిరిశిఖరమెక్కినంత
అ కొండ మత్త గజమై వెలిగెను
గిరి గుహలలో అచట దాగిఉన్న
ప్రాణుల కలకలము చెలరేగెను
126
అతి వేగ వంతుడై ఎగిరేందుకు
కడు మేటి వీరుడై ఠీవి తోడ
ఆత్మనే ఆయత్తపరచి హనుమ
మనసుతో ముందుగా లంకజేరె
127.
జనులార!ఇది యేను కిష్కింధము
మనసార విన్నచో ఈ కాండను
తరియింప సంసార సాగరమ్ము
అగపడును మార్గమిది నిజము సుమ్ము
కిష్కింధ కాండ సంపూర్ణం
సింహాద్రి జ్యోతిర్మయి.
Comments
Post a Comment