17/2.గేయారాధన (భక్తి పాటలు)
1.చేకొను మా పూజలను శ్రీవినాయకా!
2.శ్రీ మహలక్ష్మీ!స్వాగతమమ్మా!
3.మంగళహారతి మాతా భారతీ!
4.మంగళగౌరీ!మరువైరి దేవేరీ!
5.కేశవ! మాధవ! ముకుంద! మురారి!
6.అష్టమి పుట్టిన కృష్ణయ్యా!
7.కలగంటి కలగంటి కలగంటి నేను
8.వేణుమాధవా!దీనబాంధవా!
9.ఏమి చేసినగాని,ఎచట చూసిన గాని
10.క్షీరసాగర శయన!శ్రీసతీ ప్రియరమణ!
11.శ్రీయుత శ్రీకర శ్రీరామా!
12.తిరుమల యాత్రను చేయుటకై
13.శరణాగతి
నిన్ను నమ్మి నీ పదముపట్టి
11.కలిదైవమా!కరుణించుమా!
14.మేలుకో!నారాయణ మేలుకో!
15.గరుడగమన!నీ చరణకమలమెద సతతము నిలిపెద స్వామీ!
16.వేణుమాధవా!దీనబాంధవా!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
1.వినాయక హారతి
చేకొను మా పూజలను శ్రీవినాయకా
శ్రీ వినాయకా!
విఘ్ననాయకా!
విఘ్ననాయకా!
విజయదాయకా!
భాద్రపద శుద్ధ చవితి శుభదినమ్మన
నిను కొలువుంచి కొలిచేము శ్రీ గజాననా!
శ్రీ గజాననా! ఉమా నందనా!
ఉమా నందనా! ఒసగు దీవెన
మూషికమ్మునెక్కి తిరుగు ముద్దు గణపతీ!
నీకు ఏకవింశతి పత్రముల పూజలు ప్రీతి
ఏకవింశతి పత్ర పూజలు
అందుకోవయా మోదకప్రియా!
మాచీ బృహతీ బిల్వము దూర్వయుగ్మము
దత్తూరము బదరీ మరి అపామార్గమూ
తులసి పత్రమూ చూతపత్రమూ
కరవీరమ్మూ విష్ణుక్రాంతమూ
దాడిమి మరి దేవదారు మరువకమ్ముతో
సింధువార జాజీ ఇక గండకీలతో
శమీ పత్రమూ అశ్వత్థ పత్రమూ
అర్జున పత్రం ఇక అర్కపత్రమూ
ఏకవింశతి పత్రములివె స్వీకరించుమా!
కుడుములనూ ఉండ్రాళ్ళను ఆరగించుమా
ఆరగించుమా!ఆదరించుమా!
ఆదరించుమా! ఆనందమీయుమా!
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
13.9.2018
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
......,....2..లక్ష్మీ హారతి..................
శ్రీ మహలక్ష్మీ! స్వాగతమమ్మా!
శుభ వరలక్ష్మీ!వేంచేయవమ్మా!
నా మనసే నీ కోవెల చేతునే
కొలువుదీరగా కదలిరాగదే!
త్రిభువన శుభకరి చంద్ర సహోదరి
క్షీరాబ్ధి కి సుత క్షేమము లీయవే
శుక్రవారపు పూజలొ శ్రీ దేవీ
కొలువుండి కరుణించవే
హరి ఇల్లాలివి కలుముల రాణివి
కామితమీడేర్చి మము దయగనవే
అష్టలక్ష్మిగా జగముల నేలే
అంబా!కొనుమా హారతులే
బాధలు దీర్పవె భాగ్యము గూర్పవె
మందస్మిత ముఖి మమ్మేల గదే!
శ్రావణమాసపు శుభవేళలలో
పడతులొనర్చే పూజలనందే
మాధవదేవుని హృదయ నివాసిని
సౌభాగ్యదాయిని నిత్యానపాయిని
పాణి పద్మము పాణినిపద్మము
పాదము పద్మము పదపీఠి పద్మము
నయనము పద్మము నగుమోము పద్మము
పద్మాసనస్థిత పాలయమాం జననీ
సింహాద్రి జ్యోతిర్మయి
24.8.2018.
నా చిన్నతనంలో మా అమ్మ వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు
రాజరాజేశ్వరీ దేవికన్యా కుమారి
రక్షించు జగదీశ్వరీ
అనే మంగళహారతి పాడేది.
నాకు ఆ పాట బాణీ యే గుర్తుంది గానీ అందులోని పదాలు గుర్తులేవు.అమ్మ జ్ఞాపకం గాఆ ట్యూన్ కితగినట్లు పాట రాసుకున్నాను.
మీలో ఎవరికైనా ఆ పాట తెలిస్తే పంపగలరు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
శరన్నవరాత్రులలో ఈ రోజు జగజ్జనని సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు కదా!
ఆ తల్లిని స్మరిస్తూ నేను రాసుకున్న పాట
3.సరస్వతీ స్తుతి
మంగళ హారతి మాతా భారతి
మమ్మెల్ల దయజూడుమా!
జ్ఞాన స్వరూపిణి గాన వినోదిని
కచ్ఛపి ధారిణి కామిత దాయిని
విద్యలకెల్లను ఒజ్జవు నీవట
వినయాన కొలిచేములే
హంస విహారిణి పుస్తక ధారిణి
శ్వేతాంబరధరి స్మితముఖ శోభిని
జ్ఞానపు కాంతుల. అజ్ఞాన తిమిరము
పరిమార్చు పరదేవతా
పద్మాసన స్థిత వ్యాస సంపూజిత
పాశాంకుశధరి పాలయ మాం జననీ
ధాతకు రాణివి వీణాపాణివి
వాగ్దేవి శారద వరముల నీయవె
అల కాళిదాసుని కవికుల గురువుగ
మలచిన దేవీ! పలుకుల తల్లీ| |
అమ్మను నిన్ను నమ్మవె నన్ను
కైటభ దైత్యారి గాదిలి కోడల
అని పోతన్న. ఓదార్చినందున
నింపితివో సుధ భాగవతమ్మున. | |
ఈ పాటకు ఎవరైనా ట్యూన్ చేసి పాడగలిగితే ధన్యురాలను.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.10.201
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
.4.పార్వతీ స్తుతి
*పార్వతీ స్తుతి*
మంగళగౌరీ మరువైరి దేవేరి
ముక్కంటి సుదతి మ్రొక్కెదమమ్మా
ముగురమ్మలకును
మూలపుటమ్మవు
శుభదృక్కులగను
శాంభవి మమ్ము
దుర్గగ వెలసిన రుద్రుని రాణీ
దనుజుల నడిచిన శార్దూల వాహిని
ఆర్య అష్టాదశ శక్తిపీఠముల
భక్తుల బ్రోవగ కొలువైన భార్గవి
పసుపు ముద్ద తో పార్వతి నీవు
పసివాని సృజియించి
ప్రాణము పోయగ
అతడగజానన పద్మార్కుడాయెను
ఆదిపూజ్యుడై గణనాథుడాయెను
దక్షుని సుతగా తనువును చాలించి
హిమశైల పుత్రిగ
మరుజన్మ ధరియించి
అపర్ణవై నీవు తపమాచరించి
హరు చేపట్టిన అర్ధనారీశ్వరి
శ్రీ శైలమ్మున భ్రమరాంబికవే
ఉజ్జయినీ పురి మహాకాళి నీవే
కాంచీపురమున కామాక్షి నీవే
వారణాసిలో విశాలాక్షి నీవే
శాంకరి శృంఖల చాముండేశ్వరి
మాణిక్యాంబవు మాధవేశ్వరీ
పురుహూతికవు జోగులాంబవు
మంగళగౌరివి ఏకవీరవు
వైష్ణవి గిరిజవు వరమహాలక్ష్మివి
కాశ్మీరమ్మున సరస్వతి రూపివి
కామరూపవై కరుణను బ్రోచే
మా శ్రీమాతా!శ్రీమహారాజ్ఞీ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
5.ముకుంద స్తుతి
కేశవ మాధవ ముకుంద మురారి
అచ్యుత శ్రీహరి కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
బలరామానుజ యదుకుల బాంధవ
యశోదతనయా కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
నవమౌక్తికధర నవనీతచోరా
వేణుగానప్రియ కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
గోవింద గోపాల గోవింద గోపాల గోపాల గోవింద కృష్ణ నమో
విషపూతనహర భళి దామోదర
వర పశుపాలక కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
కాళియ మర్ధన గోవర్ధనోద్ధార
దనుజకంసాంతక కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
గోపీలోలా గోకులబాలా
శిఖిపింఛమౌళీ కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
గోవింద గోపాల గోవింద గోపాల
గోపాల గోవింద కృష్ణ నమో
మానరక్షకా గీతాచార్యా
మన్మథజనకా కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీ వత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
విశ్వరూపధర విజయసారధి
వసుదేవాత్మజ కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీ వత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
దుష్టశిక్షకా శిష్టరక్షకా
ధర్మసంస్థాపక కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
గోవింద గోపాల గోవింద గోపాల
గోపాల గోవింద కృష్ణ నమో
ఓ పురుషోత్తమ పుండరీకాక్ష
పీతాంబర ధర కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీ వత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
హే మధుసూదన శౌరి జనార్ధన
వైకుంఠ వాసా కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీ వత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
గరుడవాహనా ఘనమేఘ శ్యామా
శ్రీ శేషశయనా కృష్ణ నమో
నందనందనా నారాయణ
శ్రీవత్సాంకిత శ్రీపతి కృష్ణ నమో
గోవింద గోపాల గోవింద గోపాల గోపాల గోవింద కృష్ణ నమో
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
6.కృష్ణమ్ వందే జగద్గురుమ్
అష్టమి పుట్టిన కృష్ణయ్యా!
అల్లరి చేష్టల కన్నయ్యా!
భావములో నిను నిలిపేము
భక్తితొ మేము కొలిచేము
ద్వాపరయుగమున కంసుని చెరలో
దేవకి కడుపున పుట్టావు
గోకులమందున నందుని ఇంట
యశోద ఒడిలో పెరిగావు
పిల్లనగ్రోవి,పింఛము దాల్చిన
నల్లని స్వామీ దండమయా!
భావములో నిను నిలిపేము
భక్తితొ మేము కొలిచేము
పాలూ వెన్నెలలు దొంగిలి మసలుట
పాపము మాపుట కొకలీల
చీరలు, చిత్తము దోచుటయనగా
అజ్ఞానమ్మును మాపుట కాదా!
ఆలను గాచుట
అసురుల చంపుట
అద్భుత లీలలు గోవిందా!
భావములో నిను నిలిపేము
భక్తితొ మేము కొలిచేము
కాళీయుడినే మడుగున త్రొక్కి
తాండవకేళిని సలిపితివి
గోవర్ధనమును గోటిని నిలిపి
ఇంద్రుని గర్వము నణచితివి
సభలో ద్రౌపది మానముగాచిన
చల్లని స్వామీ! సన్నుతులు
భావములో నిను నిలిపేము
భక్తితొ మేము కొలిచేము
గీతాబోధన చేసితివయ్యా!
కర్తవ్యమ్మును బోధింప
రణయజ్ఞమ్మును నడిపితివయ్యా
భూభారమ్మును తొలగింప
ధర్మము దారి తప్పినవేళ
అవతరింతునని అంటివయా
భావములో నిను నిలిపేము
భక్తితొ మేము కొలిచేము
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
7. కార్తిక పున్నమి రేడు
కార్తిక పౌర్ణమి సందర్భంగా నేను రాసుకున్న పాట
కలగంటి కలగంటి కలగంటి నేను
కనుగొంటి కనుగొంటి
కనుగొంటి నేను
కమనీయ రమణీయ
మహనీయ మోహనా
వర వేంకటాద్రి వాస
కలిదైవమా!నిన్ను
కలగంటి కలగంటి కలగంటి నేను
కనుగొంటి కనుగొంటి
కనుగొంటి నేను
సూర్యేందు లిర్వురూ
నీ దాసదాసులవగ
వర మహాలక్ష్మి నీ
వక్షాన కొలువుకాగ
కోటి కోటి కార్తీక
పున్నమలే నిండి వెలుగు
కోనేటిరాయ నీ
వదనమ్ము కన్నులార
llకనుగొంటి ll
నారదుడే నీ దివ్య
నామమ్ము జపియింప
అన్నమయ్య మధురమైన
కీర్తనలే ఆలపింప
కోటి కోటి కార్తీక
పున్నమలే చిందులాడు
చిరునవ్వు వెలయించు
స్వామి నీ అధరాలు
ll కనుగొంటిll
నీరజాక్ష నిన్నుతప్ప
అన్య దైవ మెరుగమని
ఆర్తితోడ పదముపట్టి
ఆశ్రయించు నీ భక్తుల
కోటి కోటి కార్తీక
పున్నమలే ప్రసరించెడు
కరుణార్ద్ర వృష్టి కురిసి
కాచి బ్రోచు కడకన్నుల
llకనుగొంటిll
ఆపదమొక్కుల వాడా!
ఏడు కొండల వాడా!
ఆనంద నిలయుడా!
గోవింద !గోవిందా!
కోటి కోటి కార్తీక
పున్నమలే మదిని నిండ
నా జన్మ తరియ నిన్ను
ఆపాదమస్తకమ్ము
ll కనుగొంటిll
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
8.వేణు (మాధవ) గానం*
వేణుమాధవా!
దీనబాంధవా!
కోర్కెలెరుగవా!
కొరతదీర్పవా!
సహస్రమౌ ఘన నామాళితో
సన్నుతించినా కనికరించవా!
శతవిధమ్ములా పిలిచివేడినా
ఆలకించవా!ఆదరించవా!
దశావతారముల్ ధరణికావగా
దాల్చినావుగా వాసుదేవా!
నవగ్రహమ్ముల అనుగ్రహమ్మునే
కలుగజేయవా!కలత మాపవా!
అష్టాక్షరమ్ముల దివ్యనామమే
మహామంత్రమౌ మా కేశవా!
సప్తగిరులపై ముక్తి శిఖరమై
కొలువుదీరినా దయాసింధువా!
షడ్విధమ్ములౌ శత్రుసీమలో
చిక్కినట్టి నా చిక్కుదీర్పవా!
పంచాయుధమ్ముల దాల్చిన ప్రభూ
పాపరాశినే పరిహరింపవా!
చతురాస్యు తండ్రివే!దామోదరుండవే!
మోహపాశమే త్రెంచివేయవా!
త్రికరణమ్ముల శుద్ధితో నిను
నమ్మి కొలిచెద శ్రీ రమాధవా!
ద్విజరాజ వాహనా!ఓ జనార్ధనా!
నీ చరణమంటితి శరణమీయవా!
ఏకైక దైవమా!కలి వేంకటేశ్వరా!
ఆనంద నిలయుడా! కడకంట జూడవా!
*ఓం నమో వేంకటేశాయ*
సింహాద్రి జ్యోతిర్మయి
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
9.సర్వాంతర్యామి
తిరుమల కొండపై స్వామివారి సన్నిధిలో
నా హృదయం స్పందించి రాసిన పాట
......................సర్వాంతర్యామి.....................
ఏమి చేసినగాని ఎచట చూసిన గాని
తిరుమలేశా! నీవె తలపుకొచ్చేవు
రెప్పమూసిన గాని కనులు తెరచినగాని
ఆనందనిలయ! నా ఆత్మలో మెదిలేవు | |
నీటిమబ్బుల లోని నీలవర్ణము జూడ
శ్యామలాంగా!నీవె స్ఫురణకొచ్చేవు
వినువీధి విహరించు పక్షి గుంపులుజూడ
గరుడగమనా!నీవె గరుతుకొచ్చేవు
నిండి తొణికిసలాడు పాల పాత్రను జూడ
క్షీరసాగర శయన! నీవె మది మదిలేవు||
పూలమాలలు చూడ పురుషోత్తమా!నీదు
తోమాల సేవ యది మదిని మెదిలేను
కప్పురము వెలిగించి కనులకద్దెడు వేళ
స్వామి నీ చుబుకమ్ము మదిని మెదిలేను
వెదురు పొదలను చూడ వేణులోలా నీదు
మధుర మురళీ రవము నా మనసు వినియేను
గోవింద యనువేళ గోకులమ్మున నీదు
గోపాలకత్వమది మదిని మెదిలేను
లేగదూడకు చేపు ఆవుపొదుగును చూడ
బ్రహ్మ గోవైన కథ గురుతుకొచ్చేను
నా బుజ్జిపాపడికి బువ్వపెట్టేవేళ
నైవేద్య గంటలవి నా మదిని మ్రోగేను
తలయంటి నా సుతుకు లాలపోసేవేళ
అభిషేకసేవనీవందుటను తలచేను
తూగుటూయలలోన బిడ్డనూచేవేళ
నీదు ఊంజల్ సేవ నేను తలచేను
జోకొట్టి పాపలను నిదురపుచ్చే వేళ
ఏకాంతసేవ గొను నిన్ను తలచేను
మండించు గ్రీష్మాన విరియు మల్లెలగాంచి
ఆపదల నీ అభయముద్రగా తలచేను
శిశిరాన మురిపించు మంచుబిందువులట్లు
నైరాశ్యమును దీర్చి నీ చూపు నడిపేను
వానజల్లున నేను తడిసిముద్దగు వేళ
నీదు కరుణావృష్టి యది యనుచు మురిసేను
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
..................10.శయన ఏకాదశి......................
పాట
క్షీరసాగరశయన శ్రీసతీ ప్రియ రమణ
శేషశాయీ నేడె శయన ఏకాదశి
సృష్టి కర్తకు జనక !లయకారునికి సఖుడ!
స్థితి కారకా !నీవు సేదదీరుము నేడు
వరగర్వమున చెలగి హిరణ్యాక్షుడు నాడు
పుడమి చాపగ చుట్టి కడలిలో ముంచేయ
క్రోడవై యద్దాని కొమ్ముపై నిలబెట్టి
దేవదానవులెల్ల పాలకడలిని చిలుక
కమలనయనా!నీవు కమఠ రూపముదాల్చి
మునిగేటి మంథరము నీ మూపుపై మోసి
అలసిపోయిన స్వామి కాసేపు శయనించు
జో అచ్యుతానంద !జోజో ముకుందా
నీశత్రువై నిన్ను దూషించె రక్కసుడు
నీ భక్తుడై సతము నినుకొల్చె తనసుతుడు
కలడేని నీహరిని స్తంభాన చూపమని
పసివానినే వేచ పాపడిని రక్షింప
ఉనికి చాటుచు నీవు ఉగ్ర నరసింహమై
అసురు చీల్చిన నాటి అలసటే తీరునటు
కనుమూసి మా స్వామి కాసేపు శయనించు
జో అచ్యుతానంద జోజో ముకుందా
బల గర్వమణచగా బలిని కరుణించగా
చిట్టి వడుగై వెడలి కోరి దానము కొనుచు
రెండు పదముల తోడ నిండు జగమును కొలిచి
మూడవది యగు పదము మోపి ఆ బలితలను
పాతాళమున కతని ప్రభువునే గావించి
కరుణతో అతనింట కావలిగ నీవుండి
అలసి సొలసిన స్వామి కాసేపు శయనించు
జో అచ్యుతానంద జోజో ముకుందా
పదునాల్గు వర్షములు వనవాసమును జేసి
ధర్మ మార్గము నడచి దనుజ కోటుల దునిమి
అసురుండు నీ సతిని అపహరించగ కుమిలి
వానరులతో గలసి వారధిని బంధించి
రామబాణము తోడ రావణుని వధియించి
జనవాణి పాటించి జానకిని త్యజియించి
చాల అలసితివయ్య సేదదీరుము స్వామి
రామ లాలీ నీల మేఘ శ్యామా లాలి
చెరలోన జనియించి వ్రేపల్లె చరియించి
మాయావులను ద్రుంచి మామ కంసుని జంపి
గోవర్ధనము మోసి ఆలమందలు మేపి
కొల్లగా చీరలిడి చెల్లి మానము గాచి
రాయబారము నడిపి ధర్మపక్షము నిలిచి
గీత పార్థుకు తెలిపి సారధ్యమును సలిపి
చాల అలసిన స్వామి కాసేపు శయనించు
జో అచ్యుతానంద జోజో ముకుందా
వేంకటాద్రి కి సమము వెదకి చూచిన లేదు
వేంకటేశా!నీకు సరి దైవమికలేడు
అని నమ్ము భక్తులను ఆదుకొనుటకు నీవు
కలిలోన పాపమ్ము హరియించ వెలిశావు
ఏడుకొండలవాడ!వడ్డి కాసులవాడ
గోవింద !గోవింద! గోవింద! యనుఘోష
విని వినీ అలిసేవు!కాసేపు శయనించు
జో అచ్యుతానంద జోజో ముకుందా
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
01.7.2020
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
11.శ్రీరామ నామాలు............
శ్రీయుత శ్రీకర శ్రీరామా!
స్మితముఖ శోభిత శ్రీరామా!
శ్రీసతివల్లభ శ్రీరామా!
శ్రితజనపోషక శ్రీరామా!
రామ రామ జయ శ్రీరామా!
రాక్షస సంహర శ్రీరామా!
సీతారమణా! శ్రీరామా!
శిరసానమామి శ్రీరామా!
అ యోధ్యపాలక శ్రీరామా!
ఆ ర్తుల నేలుము శ్రీ రామా!
ఇ నకులతిలకా!శ్రీరామా!
ఈ ర్ష్యను మాపుము శ్రీరామా!
ఉ య్యాలమనసును శ్రీరామా!
ఊ గక నిలుపుము శ్రీ రామా!
ఋ క్కువు నీవే శ్రీరామా!
ౠ యన సకలము శ్రీ రామా!
నీవని నమ్మితి శ్రీ రామా!
నీపదమంటితి శ్రీ రామా!
సీతారమణా శ్రీ రామా!
శిరసా నమామి శ్రీరామా!
ఎ ల్లప్రాణులకు శ్రీ రామా!
ఏ లికనీవే శ్రీ రామా!
ఐ హికమందున శ్రీ రామా!
ఐశ్వర్యమే నీవు శ్రీ రామా!
ఒ రులను ఒల్లను శ్రీ రామా!
ఓ టమి దీర్పుము శ్రీ రామా!
ఔ నని నీ ఆజ్ఞ శ్రీ రామా!
ఔదలధరింతు శ్రీరామా!
అం క పీఠిపై శ్రీ రామా!
అంబను నిలిపిన శ్రీ రామా!
అః.యన విష్ణువు శ్రీ రామా!
విష్ణువు నీవే శ్రీ రామా!
క పిరాజ మిత్రా!శ్రీ రామా!
ఖ గరాజ గమనా!శ్రీ రామా!
గ. ర్వము నణచి శ్రీ రామా!
ఘ నతను చాటుము శ్రీ రామా!
ఙ యన వాంఛలు శ్రీ రామా!
వారించవయ్యా శ్రీ రామా!
సీతారమణా!శ్రీ రామా!
శిరసా నమామి శ్రీరామా!
చ రణము శరణము శ్రీ రామా!
ఛ త్రము నీ దయ శ్రీ రామా!
జ లధర దేహా! శ్రీ రామా!
ఝ. రి నీ కరుణా శ్రీ రామా!
ఞ యన పదమట శ్రీ రామా!
ఇదిగో పట్టితి శ్రీ రామా!
సీతారమణా!శ్రీ రామా!
శిరసా నమామి శ్రీరామా!
ట క్కరి హృదయము శ్రీ రామా!
ఠ వఠవ పెట్టును శ్రీ రామా!
డ క్కిన నీ పేరు శ్రీ రామా!
ఢ మరుక ధ్వానము శ్రీ రామా!
ణ యన జ్ఞానము శ్రీ రామా!
నాకది ఈయవె శ్రీ రామా!
సీతారమణా శ్రీ రామా!
శిరసా నమామి శ్రీరామా!
త పించి వేడెద శ్రీ రామా!
త థాస్తు దీవెన శ్రీ రామా!
థః యన నలుపట శ్రీ రామా
శ్యామసుందరా! శ్రీ రామా!
ద శరథ తనయా! శ్రీ రామా!
దశకంఠ వైరి శ్రీ రామా!
ధ రణిజ నాథా! శ్రీ రామా!
ధ ర్మ స్వరూపా శ్రీ రామా!
న లువకు తండ్రివి శ్రీ రామా!
నరులకు దిక్కువి శ్రీ రామా!
ప రమ దయాకర శ్రీ రామా!
పదములు విడువను శ్రీ రామా!
ఫ లము ముక్తిగా శ్రీ రామా!
బ హుదా వేడుదు శ్రీ రామా!
భ వ సాగరమును శ్రీ రామా!
మ ము దాటించుము శ్రీ రామా!
య శో విరాజిత శ్రీ రామా!
ర మా మనోహర శ్రీ రామా!
ల వకుశ సంస్తుత శ్రీ రామా!
వ రగుణ మండిత శ్రీ రామా!
శ తపత్ర వదనా! శ్రీ రామా!
ష ట్పది నా మది శ్రీ రామా!
స తతము స్మరింతు శ్రీ రామా!
హ రించు కలుషము శ్రీ రామా!
షోడశ క.* ళ. * లను శ్రీ రామా!
ళ కారమున్నది శ్రీ రామా!
చంద్రుని కళలవి శ్రీ రామా!
స్థిరమౌ నీయందు శ్రీ రామా!
ఱ ప్ప నహల్యగ శ్రీ రామా!
రక్షించి బ్రోచిన శ్రీ రామా!
క్ష మించి పాపము శ్రీ రామా!
క్ష. తము జేయవే శ్రీ రామా!
రామ రామ జయ శ్రీ రామా!
రాక్షస సంహర శ్రీరామా
సీతారమణా శ్రీ రామా!
శిరసా నమామి శ్రీరామా!
క లికి సీతతో శ్రీ రామా!
కా నల కేగిన శ్రీ రామా!
కి నియకు నాపై శ్రీ రామా!
కీ ర్తన చేయుదు శ్రీ రామా!
కు శలవ జనకా! శ్రీ రామా!
కూ రిమి మమ్మేలు శ్రీ రామా!
కృ త లక్షణుడవు శ్రీ రామా!
కె లవున బ్రోవుము శ్రీ రామా!
కే శవ !మాధవ!శ్రీ రామా!
కై వల్య దాయక శ్రీ రామా
కొ లువు జేయవే శ్రీ రామా!
కో వెల నా మది శ్రీ రామా
కౌ సల్యా సుత శ్రీ రామా!
కం జాత నయనా !శ్రీ రామా!
సీతారమణా శ్రీ రామా!
శిరసా నమామి శ్రీరామా!
ఓం నమో వేంకటేశాయ!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.10.2018.
.
12.కలియుగ వైకుంఠం.
తిరుమల యాత్రను చేయుటకై
తరలెడు భక్తుల అనుభవము
భావన చేతును వినరండి
కలి ధామమునే కనరండి
అలిపిరి వద్దే ఆరంభం
ఆత్మతొ ఆలయ దర్శనమే
కాలినడకతో ఏడుకొండలు
ఎక్కి చేరుటే పుణ్యప్రదం ". "
గోవిందు మహిమల గానముతో
మార్గాయాసము మాయములే
సప్తగిరులపై అడుగిడుటే
స్వామి అనుగ్రహ సాక్ష్యములే.
పవలూరేలూ శోభిల్లే
పావన క్షేత్రము తిరుమలలో
పిన్నాపెద్దా ధనికాపేద
వేంకటపతి దయ వేడుదురే.
తమ మొక్కులను తీర్చుకొన
తలనీలాలను ఇత్తురదే
తిరునామమ్ము,చందనము
తీరుగ అలముకు తిరుగుదురే.
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవింద గోవింద గోవిందా
చీకటి చాయలు వీడకనే
సుప్రభాతము వినపడులే
ఆర్జిత సేవలు తోమాల
అర్చన కాంచుటె ధన్యతలే
స్వామి పుష్కరిణి గ్రుంకిడిన
శమించు జన్మల పాపములే
వరాహస్వామికి తొలి వందనము
చేయక ఫలితము దొరకదులే
తిరుమల వాసుని సన్నిధికి
చేర్చెడు వైకుంఠ మార్గమదే
వేచిన భక్తులు మొరలిడగా
మిన్నంటు గోవింద ఘోషలవే
సింహ ద్వారపు కుడి ప్రక్క
అనంత ఆళ్వార్ గునపమదే
విస్మయమ్ముతో భక్తాళి
వింతగ ఆ కథ తలతురదే.
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవింద గోవింద గోవిందా
ధ్వజ స్తంభమున కిరుదిశలా
పరుగులు తీసెడి తొందరలే
వెండి వాకిలికి వేంచేయ
అంతరంగమున అలజడిలే
బంగరు వాకిలి చేరగనే
చెప్పగజాలని కలకలమే
దర్శనభాగ్యపు తహతహలో
తొక్కిడి పట్టని పరవశమే
ఆ వాకిటిలో అల్లదిగో
గరుడాళ్వారులు అగపడులే
ప్రభుని కెదురుగా వేంచేసి
సతతము స్వామిని కనుగొనులే
బంగరుమంటప కప్పునదే
దశావతారములగపడులే
సుప్రభాతమును పఠియించే
జయవిజయులు గల ద్వారమదే
ఆ ద్వారానికి చెంగటనే
ఘంటామంటప ముండునులే
నైవేద్యవేళకు శ్రావ్యముగా
దివ్య నాదమట వినబడులే
స్నపన మంటపం దాటగనే
రాములవారి మేడయదే
కులశేఖరపడి దాటగనే
ఆనంద నిలయుని వాసమదే.
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవింద గోవింద గోవిందా
ఎనిమిది అడుగుల
రూపముతో
నిలిచిన స్వామిని చూడగనే
తెలియగరాని
తన్మయమే
అణువు అణువునా అలమునులే
తోమాలలతో,తిరునామముతో
వరదాభయముల ముద్రలతో
ఎదపై శ్రీ ,భూ దేవేరులతో
వెలిగే వేంకట రమణుడదే
శంఖము,చక్రము,పీతాంబరము
వజ్రాభరణా లవిగవిగో
పద్మ పీఠిపై చిద్విలాసమున
నిలిచే చెలువము చూడుడదే.
ఎంత చూసినా తనివి తీరని
అంతర్యామిని అరనిముషం
చూచుటె భాగ్యమ్మని మురిసి
మరి మరి గాంచుచు మరలుదురే
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవింద గోవింద గోవిందా
బయటకు వచ్చిన భక్తులదే
సాష్టాంగ పడుటను
గాంచుడదే
వకుళమాతను చూచు తరి
పోటును గాంచెడు వేడుకలే.
పరమ భక్తితో పాదతీర్థమును
సేవించనేగెడు మార్గమదే
శఠ గోపముతో స్వామి దీవెన
అందుచు ఆనంద మందెదరే
నిమిషమ్మక్కడ కూర్చుండి
స్వామిని ధ్యానము చేతురదే
వెడలుచు విమాన వేంకట పతికి
మొక్కి మురిసెడు స్థలమదియే
వడ్డీ కాసుల వానికదే
హుండీని కానుకలిత్తురదే
ప్రసాదమ్ముగొని పరమ ప్రీతితో
ఆరగించుటను చూడుడదే
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవింద గోవింద గోవిందా
మాడ వీధులన్ మలయప్ప స్వామికి
జరుగు ఉత్సవాల్చూతురదే
వేంగమాంబ కడ ఉచిత ప్రసాదం
కడుపార తినుటను గాంచుడదే.
అభిషేకమ్ము,నేత్ర దర్శనం
నిజ పాదసేవలు అద్భుతమే
కొలువు,పూలంగి,ఏకాంతసేవ
ఎన్నని చెప్పను?ఎరుగుడదే
ఊరెరిగింపులు,ఊంజల్ సేవలు
సహస్ర దీపాలంకరణాలు
నిత్య,వార,పక్ష, మాసోత్సవాలూ
బ్రహ్మోత్సవముల గాంచుడదే.
నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
కనివిని ఎరుగని వైభోగం
శ్రీ నివాసుడే కలియుగ దైవం
తిరుమల భువిపై వైకుంఠం
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోవింద గోవింద గోవిందా
ఓం నమో వేంకటేశాయ.
చాగంటి వారి తిరుమల దర్శనం ప్రసంగం విని రాసిన పాట
నన్ను తిరుపతిలో కన్న మా తల్లిదండ్రులకు
సభక్తికంగా అంకితం.
సింహాద్రి
14.12.2016.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
13.శరణాగతి
గరుడగమన తవ
చరణకమల మిహ
మనసి లసతు మమ నిత్యం
బాణీలో
నిన్ను నమ్మి నీ పదము పట్టి
నా దిక్కువంచు
కొలిచేను శ్రీనివాసా!
తలచేను తిరుమలేశా!
కరుణించవేమి స్వామీ!
నను కావవేమి స్వామీ!
అలసిపోతి పోరాడజాలనని
మొరపెట్టుకున్న ఆ కరిని గాచినావే!
తన ఆర్తి బాపినావే!
గజరాజు భాగ్యమేమి?
నాయందు దోషమేమి?
కరుణించవేమి స్వామీ!
నను కావవేమి స్వామీ!
వనిత ద్రౌపదికి వలువలూడ్చుతరి
నిండుకొలువులో
అవమానమాపినావే!
ఆశ్రితను బ్రోచినావే
పాంచాలి పుణ్యమేమి!
నాయందు దోషమేమి!
కరుణించవేమి స్వామీ!
నను కావవేమి స్వామీ!
ఎందుగలడు హరి ?నీ విందు చూపమను
ఆ దనుజు నడచగా
స్తంభాన వెడలినావే!
ప్రహ్లాదు గాచినావే!
బాలకుని భాగ్యమేమి?
నాయందు దోషమేమి?
కరుణించవేమి స్వామీ!
నను కావవేమి స్వామీ!
ధూళి కప్పబడి తపియించు గౌతమికి
నీ పాదస్పర్శతో
శాపమ్ము తీర్చినావే!!
పాపమ్ము మాపినావే!
ఆ నాతి పుణ్యమేమి?
నాయందు దోషమేమి?
కరుణించవేమి స్వామీ!
నను కావవేమి స్వామీ!
పాపమేమి నను కట్టి కుడిపెనో
భవసాగరమున
తలమునకలైతి నేను
తపియించుచుంటి సతము
తరియింపజేతువనుచు
నెరనమ్మియుంటి నిన్ను
కరుణించవేమి స్వామీ!
నను కావవేమి స్వామీ!
సింహాద్రి జ్యోతిర్మయి
25.8.2018.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
14. కలిదైవమా!
కలిదైవమా! కరుణించుమా!
అఘరాశినే హరియించుమా!
కామమునకు నే కట్టుబడితినే
క్రోధమందు నే కూరుకొంటినే
లోభమొక్కటే లాభమంటినే
మోహమగ్నమౌ దేహినైతినే
మదము మనసులో
మాపనైతినే
మాత్సర్యభావమును
మాననైతినే
శత్రులార్వురన్ సంహరింపుమా
ఎరుకదివ్వె నా ఎదను నిల్పుమా
శ్రీ వల్లభా! నన్ను గావుమా!
భవ జలధినే దాటించుమా!
కలిదైవమా! కరుణించుమా!
అఘరాశినే హరియించుమా!
ధర్మబద్ధమౌ దారినడుపుమా!
అర్థమత్తతన్ అణచివేయుమా!
కన్నులారగా నిన్ను గాంచుటే
కామమవ్వగా ధ్యాసనివ్వుమా!
నిన్ను సతతమూ సన్నుతించుటే
మోక్షమంచు నన్
మురియనీయుమా
పురుషోత్తమా!
పొడగట్టుమా!
పురుషార్థముల్ పొందజేయుమా!
శ్రీనివాస! నా మొక్కులందుమా!
తిరుమలేశ!నా దిక్కు జూడుమా!
కలిదైవమా! కరుణించుమా!
అఘరాశినే హరియించుమా!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
15. ఉత్థాన ఏకాదశి*
కార్తిక ఏకాదశి
మేలుకో నారాయణ మేలుకో
ఇది కార్తిక ఏకాదశి మేలుకో
యోగనిద్ర మేలుకో
లోకాల నేలుకో
ఆషాఢ మాస శుక్ల
ఏకాదశి శుభవేళ
పాల కడలిలోన
పన్నగపు పాన్పుపైన
మహతిమీట నారదుండు
తుంబుర గానము వింటూ
శయనించిన శ్రీరమణా! మేలుకో
ఇది ఉత్థాన ఏకాదశి మేలుకో || ||
అదితి గర్భాన స్వామి
వామనునిగ జననమంది
అసురుడైన బలినణచగ
అతనినే యాచించి
మూడడుగుల దానముగొని
త్రివిక్రమునిగ విక్రమించి
అలసిసొలసినావంచు
అదితి నిద్రపుచ్చెనేమొ || ||
కౌసల్య గర్భాన
రాముడవై ప్రభవించి
తపసి యాగము గాచి
వనవాసము చేసి చేసి
రావణాది రాక్షసులను
సంహరించి, సతిని బాసి
అలసితివని కౌసల్య
నిన్ను నిద్రపుచ్చెనేమొ|| ||
దేవకి గర్భాన ప్రభూ!
కృష్ణుడవై ఉదయించి
యశోదమ్మ ఒడిని పెరిగి
కంసాదుల మట్టుబెట్టి
అర్జునునకు గీతచెప్పి,
ధర్మరథము నడిపి నడిపి
అలసితివని దేవకి
నిన్ను నిద్ర పుచ్చెనేమొ|| ||
తిరుమల యే వైకుంఠం
తిరునాథుడె శ్రీహరి
అని నమ్మిన భక్తకోటి
ఆర్తులై నిన్ను చేర
కొరతలు కోర్కెలు దీర్ప
రేబవళ్ళు నిలిచి నిలిచి
అలసితివని వకుళమాత
నిన్ను నిద్రపుచ్చెనేమొ|| ||
జో అచ్యుతానంద
జోజో ముకుందా
అని పాడిన అన్నమయ్య
కీర్తన విని హాయిగా
శయనించినావేమో
చాలునింక ఈ నిదుర
విన్నపాలు వినవలే
విచ్చి కనులు మేలుకో!
మేలుకో నారాయణ మేలుకో
ఇది కార్తిక ఏకాదశి మేలుకో || ||
సింహాద్రి జ్యోతిర్మయి
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
గరుడగమన
శృంగేరీ పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామి వారి స్తోత్రానికి నా స్వేచ్ఛానువాదం
16.గరడగమన...
గరుడగమన
నీ చరణకమల మెద
సతతము నిలిపెద స్వామీ!
సన్నుతి సలిపెద స్వామీ!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
1.సృష్టికర్త
ఇంద్రాదులెల్ల
కొలిచేటి పాద
పద్మములు శేషశయనా!
పట్టితిని కమలనయన!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
2.
భవతారకుడవు
వలరాజ జనక!
సంసారవిపది
భయమార్చు పద్మనాభా!
దరిజేర్చు వాసుదేవా!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
3.
శంఖుచక్రములు
చేదాల్చి అసురులన్
పరిమార్చి ,సుజనులన్
బ్రోచేటి దానవారీ!
శరణొసగు చక్రి!శౌరీ!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
4.
గణియింపరాని
గుణరాశి వీవు
దీనాళికెల్ల
దిక్కవుదువీవు
దేవతల వైరివరుల
కడతేర్చు దేవదేవా!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
5.ఘనభక్తులందు
నే చేరబోను
ఆచార్యవరుల
కొనగోటికైన
నే చాలలేను స్వామీ!
కరుణించు నన్ను పాహీ!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
గరుడగమన
నీ చరణకమల మెద
సతతము నిలిపెద స్వామీ
సన్నుతి చేసెద స్వామీ!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
నా తాపము హరించలేవా!
నా పాపము క్షమించరావా!
సింహాద్రి జ్యోతిర్మయి
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
18.స్వామి సన్నిధిలో
నేటికి పండెను నా పుణ్యం
ధన్యమైనదిక ఈ జన్మం
ఇదివరకెపుడూ నీ సన్నిధిలో
ఎరుగనింతటి దివ్యానందం
స్వామీ నీవే సత్యరూపివై
తోడై నీడై నను నడిపించి
నీ నైవేద్యం ప్రేమతొ కొసరి
తినిపించావో తిరుమల దేవా!
చిరునవ్వొలికి నీ కెమ్మోవి
కుశలము నన్నే అడిగినది
కరుణను కురిసి నీ కనుదోయి
నను చూసినదో తిరుమల దేవా!
కలదో లేదో పాత్రత నాకు
అను అనుమానం తీర్చగ నీవే
వచ్చావేమో నిజమై ఋజువై
ఏమన గలనిక తిరుమల దేవా!
తనివే ఎరుగని ఈ నరజన్మం
తగులుచు నుండును కోర్కెల సతతం
తరణోపాయం ఇక నీ భారం
సరళాత్ముడవో తిరుమల దేవా!
కృష్ణమ్ వందే జగద్గురుమ్ అని
నేర్చినందుకు నమ్మినందుకు
మది యద్భావమ్ తద్భవతీ యని
గురువైనావో తిరుమల దేవా!
సింహాద్రి జ్యోతిర్మయి
3.4.2024
బుధవారం
తిరుమల కొండపై రాసిన పాట
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
18.*సీతా చరితం*
1.శ్రీకరమ్ము సీతమ్మ తల్లి
నీ పుణ్య గాథ
గానమ్ము చేతునమ్మా!
తరియింప నాదు జన్మ
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
2.జనకరాజు
యాగమ్ము చేయ
నాగేటి చాలున
ప్రభవించినావు తల్లీ !
ప్రభవించినావు తల్లీ !
3.జనకవిభుని
గారాల పట్టి
నీవనగ మిథిలలో
పెరిగినావు తల్లీ!
పెరిగినావు తల్లీ!
4. స్వయంవరంలో
శివధనువు త్రుంచ
శ్రీరామచంద్రుని
పెళ్ళాడినావు తల్లీ!
పెళ్ళాడినావు తల్లీ!
5.సాకేతపురిని
ఒక పుష్కరమ్ము
దాంపత్య జీవితం
గడిపినావు తల్లీ !
గడిపినావు తల్లీ !
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
6. అడవి కేగుపతి
నెడబాయకుండ
విభువెంట కానకు
తరలినావు తల్లీ!
తరలినావు తల్లీ!
7.అత్రిపత్ని
అనసూయ మెచ్చ
తన అంగరాగములు
పొందినావు తల్లీ !
పొందినావు తల్లీ!
8.మాయలేడి గని
మనసాయె తెమ్మని
శ్రీరామ చంద్రుని
కోరినావు తల్లీ!
కోరినావు తల్లీ!
9.హా సీతరో!యని
హా లక్ష్మణా!యని
విభు ఆర్తనాదము
విని వెఱచినావు తల్లీ!
వెఱచినావు తల్లీ!
10.మిము కాచుటిదియె
నా అన్న ఆజ్ఞ
అను రాము తమ్ముని
నిందించినావు తల్లీ!
నిందించినావు తల్లీ!
11.మరిది లక్ష్మణుని
నొప్పించి మాటతో
నీ పతికి రక్షగా
పంపించినావు తల్లీ!
పంపించినావు తల్లీ!
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
12.భిక్ష కోరె
లంకేశుడనుచు
నీ వెరుగలేక
దయ జూపినావు తల్లీ!
దరి జేరినావు తల్లీ!
13.ముని రూపు వీడి
దనుజుండు ఎదుట
నిలువంగ జూచి
వెరగందినావు తల్లీ!
వెరగందినావు తల్లీ!
14.మాయజేసి
ఆ రావణుండు
నిన్నపహరించ
మొర పెట్టినావు తల్లీ!
మొర పెట్టినావు తల్లీ!
15.వినువీధి పోవు
ఆ పుష్పకమున
భయవిహ్వలతను
శోకించినావు తల్లీ!
శోకించినావు తల్లీ!
16.శ్రీరామ సతిని
నను గావు మనుచు
దిశలెల్ల మ్రోయ
అర్థించినావు తల్లీ!
అర్థించినావు తల్లీ!
17.ప్రాణపతికి
నీ జాడ తెలియ
నగలన్ని మూటగా
దిగజార్చినావు తల్లీ!
దిగజార్చినావు తల్లీ!
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
18.శోకమూర్తివై
అశోకవనిని
దనుజాంగనల చెర
కుమిలినావు తల్లీ!
కుమిలినావు తల్లీ!
19.తనను వలచి
రాముణ్ణి మరచి
సుఖియించు మనగ
కంపించినావు తల్లీ!
కంపించినావు తల్లీ!
20.పాపి రావణా!
నా స్వామి చేత
నీ చావు మూడెనని
శపియించినావు తల్లీ!
శపియించినావు తల్లీ!
21.విధికి లేదు దయ
విషమైన దొరకదే!
విభు నెట్లు చూతునని
రోదించినావు తల్లీ!
రోదించినావు తల్లీ!
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
22.హనుమ వచ్చి
శ్రీరామ చరిత
గానమ్ము చేయ విని
మురిసినావు తల్లీ!
మురిసినావు తల్లీ!
23.నీ స్వామి చెంత
నిను చేర్తు నిపుడె
అను రామబంటును
వారించినావు తల్లీ!
వారించినావు తల్లీ!
24.నాథుడే వచ్చి
వైరి నని ద్రుంచి
పగతీర్ప తగవంచు
పలికినావు తల్లీ!
పలికినావు తల్లీ!
25.లంక గాల్చు
హనుమయ్య కాపదే
రానీక చల్లగా
కాపాడినావు తల్లీ!
కాపాడినావు తల్లీ!
26.ఉంగరమ్ము గొని
తల మానికమ్మిడి
పతి చేరగలనని
ఆశించినావు తల్లీ!
ఆశించినావు తల్లీ!
27.ఇటుపైన మాసమే
నే బ్రతికియుందు నిక
అని పతికి హనుమతో
కబురంపినావు తల్లీ!
కబురంపినావు తల్లీ!
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
28.దుష్ట రావణుడు
వధియిస్తి రామునని
తల తెచ్చి చూపగా
దుఃఖించినావు తల్లీ!
దుఃఖించినావు తల్లీ!
29.లంకేశు మాయలివి
నీ విభుడు కుశలమే
అను త్రిజట మాటకు
ముదమందినావు తల్లీ!
ముదమందినావు తల్లీ!
30.ఇంద్రజిత్తు
వధియించె రామునని
దుర్వార్త అందగా
భయమందినావు తల్లీ!
భయమందినావు తల్లీ!
31.సంగ్రామ సీమకు
గొనిపోయి నీ కట
రాముణ్ణి చూపగా
అడలినావు తల్లీ!
అడలినావు తల్లీ!
32.నేలబడియున్న
ప్రాణవిభు గాంచి
యనాథ నైతి నని
విలపించినావు తల్లీ!
విలపించినావు తల్లీ!
33.పుష్పకమ్ము
పుని స్త్రీలనే మోయు
నను నిజము నెఱిగి
వెఱ తేరినావు తల్లీ!
వెఱ తేరినావు తల్లీ!
నీ సాటి సాధ్వి ఏదీ!
అకలంక చరిత నీది
34.రఘువంశ విభుడు
దశకంఠు గూల్చె
నని తెలియరాగ
శాంతించినావు తల్లీ!
శాంతించినావు తల్లీ!
35.చచ్చె రావణుడు
తీరె కష్టమిక
నన్నేలు రాముడని
నమ్మినావు తల్లీ!
నమ్మినావు తల్లీ!
36.చేరవచ్చు నిను
చూడజాలనను
విభుని మాటకు
స్థాణువైనావు తల్లీ!
స్థాణువైనావు తల్లీ!
37.వహ్ని జొత్తు
చితి పేర్చు లక్ష్మణా!
అని తెగువ జూపి
శిఖి దూకినావు తల్లీ!
దూకినావు తల్లీ!
38.బ్రహ్మాదు లెల్ల
నిను వినుతి జేయ
నీ వగ్ని పూతగా
వెడలినావు తల్లీ?
వెడలినావు తల్లీ?
నీ సాటి సాధ్వి ఏదీ
అకలంక చరిత నీది
39.రాజ్యమ్ము చేరి
సామ్రాజ్ఞి వగుచు
ప్రజనెల్ల సుఖముగా
ఏలినావు తల్లీ!
ఏలినావు తల్లీ!
40.పతి కౌగిటింట
నువు సేదదీరి
గర్భమ్ము దాల్చి
ఉప్పొంగినావు తల్లీ!
ఉప్పొంగినావు తల్లీ!
41.అపవాదు తోడ
సాకేతవిభుడు
త్యజియించ నిన్ను
వ్యధచెందినావు తల్లీ!
వ్యధచెందినావు తల్లీ!
42.నిండు నెలలతో
నీలాపనిందతో
వాల్మీకి ఆశ్రమం
చేరినావు తల్లీ!
చేరినావు తల్లీ!
43.అశ్వమేధమున
అవ్యాజ ప్రేమకు
ఋజువనగ బంగారు
బొమ్మవైనావు తల్లీ!
బొమ్మవైనావు తల్లీ!
నీ సాటి సాధ్వి ఏదీ
అకలంక చరిత నీది
44.కవలపుత్రులౌ
కుశలవుల గాంచి
ఇనవంశ వారసుల
నిచ్చినావు తల్లీ!
ఇచ్చినావు తల్లీ!
45.నిండు కొలువు
నిను ప్రస్తుతించ
నీ పాతివ్రత్యమును
రూపించినావు తల్లీ!
రూపించినావు తల్లీ!
46.కన్నులారా
కడసారి రాముగని
తరియించి తనువునే
విడనాడినావు తల్లీ!
విడనాడినావు తల్లీ!
47.ఎన్ని కష్టములు
ఎదురైన గాని
సహనమ్ము వీడని
సతివి నీవు తల్లీ!
సతివి నీవు తల్లీ!
48.షట్కర్మయుక్తలౌ
కుల ధర్మపత్నులన్
భువి నెన్ని చూడగా
తొలి పేరు నీది తల్లీ!
తొలి పేరు నీది తల్లీ!
49.అవనిలోన
ఆదర్శ దంపతులు
ఎవరన్న నేటికీ
మీ జంట యేను తల్లీ!
మీ జంట యేను తల్లీ!
50.వాల్మీకి మౌని
మీ దివ్య కథకు
సీతమ్మ చరితమని
పేరుంచినాడు తల్లీ!
పేరుంచినాడు తల్లీ!
51.వైదేహీ!మైథిలీ!
సీతమ్మ!జానకీ!
కౌసల్య కోడలా!
శ్రీరామ పత్ని జయము
భువికెల్ల కూర్చు శుభము
శ్రీరామ రామ రామా
సీతామనోభిరామా!
ఓం నమో వేంకటేశాయ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.క్షీరాబ్ధి ద్వాదశి
క్షీరాబ్ధి ద్వాదశి శుభవేళ
సతులార రారే!
పూజించ హరినే మనసారా
కార్తిక ద్వాదశి సాయంత్రమ్మున
కళకళలాడే లక్ష్మీ రమణుడు
ప్రియమార బృందావనమునకు
వేంచేసి మనల
దీవించి వరముల నిచ్చేను
క్షీరాబ్ధి ద్వాదశి శుభవేళ
సతులార రారే పూజింప హరినే మనసారా
అల పాల కడలిని శయనించి
మేల్కొన్న స్వామి
రమతోడ బృందావనమునకు
వచ్చెడివేళ వేడ్కలు మీర
సన్నాహముతో స్వాగతమీయగ
ముత్యాల ముగ్గులు వేయండి
అడుగడుగున హరికి
దీపాల స్వాగతమీయండి
క్షీరాబ్ధి ద్వాదశి శుభవేళ
సతులార రారే పూజింప హరినే మనసారా
అణువణువు ఉసిరిక చెట్టును
దామోదరుండు నెలవుగ చేకొనియుండును
తులసి రూపున శ్రీ మహాలక్ష్మి
హరి చేపట్టగ కొలువే తీరును
కళ్యాణము చేతము రారండి
ఇంటింట నేడు
వైకుంఠము దిగివచ్చేనండీ
క్షీరాబ్ధి ద్వాదశి శుభవేళ
సతులార రారే పూజింప హరినే మనసారా
ఇహమందు సకలైశ్వర్యములు
ఇచ్చేను మనకు
పరమందు హరిసాయుజ్యమును
పొందేము తుదకు
వ్రాలిన భక్తిని వ్రతమును సలిపిన
కొరతలు మాన్పి కోర్కెలు తీర్చే
శ్రీహరికి హారతులీరమ్మా
ఆ సిరికి తులసికి
మనసార మంగళమనరమ్మా
క్షీరాబ్ధి ద్వాదశి శుభవేళ
సతులార రారే పూజింప హరినే మనసారా
20.నవదుర్గా! నమోస్తుతే !
నవదుర్గల పేర వెలయు నారాయణీ!
హరుని దేవేరి అర్థనారీశ్వరీ!
శారద నవరాత్రులలో
శాంభవియే రోజుకొక్క
అలంకార శోభితయై
అలరించును ప్రియ భక్తుల
1.దక్షుని సుతగా తనువును విడిచి
హిమవంతునికి పట్టిగ పుట్టి
త్రిశూలము కమలము
ఇరుచేతుల ధరియించి
తలపైన చంద్రవంక
కాంతులీన అలరారి
వృషభ వాహనమెక్కి
వేంచేసే *శైలపుత్రి*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
2.పరమేశ్వరుని పతిగా కోరి
సేవజేయగా శంభునిజేరి
అపర్ణగా అపూర్వమౌ
తపమునాచరించి
జపమాల కమండలం
పాణిద్వయము నందు పట్టి
ముక్కంటిని మగనిగా
పొందె *బ్రహ్మచారిణి*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
3.పది చేతులలో శస్త్రాస్త్రములు
దాల్చి యుండుగా యోగముద్రలో
ఘంటాకృతి శిరసున
అర్థచంద్రుడమరియుండ
రాక్షసులకు రౌద్రరూపి
భక్తులకిల సుప్రసన్న
సింహ వాహనాన వచ్చి
అనుగ్రహించు *చంద్రఘంట*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
4.సూర్యమండలం తానై వెలిగి
చరాచరమ్ముల తేజమునింపి
దరహాస రుచిలోనే
జగములెల్ల సృజియించి
అష్టభుజాదేవియై
అవనినెల్ల పాలించే
సింహవాహనారూఢ
జగజ్జనని *కూష్మాండ*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
5.కార్తికేయుని ఒడిలో దాల్చి
అభయముద్రతో చతుర్భుజాలతో
కుడిచేతిని పద్మమమర
పద్మాసన సంస్థితయై
కటాక్షముల కరుణ గురిసి
కామితముల నీడేర్చుచు
తల్లియై లోకాలను
బ్రోచు *స్కందమాత*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
6.ఆ త్రిమూర్తుల అనంతశక్తితో
ప్రభవించినది పార్వతి ఇలలో
కాత్యాయన మౌనికి గారాల తనయయై
మహిషాసురు మట్టుబెట్టి
భువనాలను రక్షించి
వరదాభయ ముద్రల
మహినేలెడు *కాత్యాయని*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
7.అంధకారమే అమ్మ వర్ణము
చెల్లాచెదరౌ కేశపాశము
త్రినేత్రముల రౌద్రము
శ్వాసలే అగ్నిసమము
ఇనుపముండ్ల ఆయుధం
గార్ధభమే వాహనం
సాధుజనుల శుభంకరి
అంబ *కాళరాత్రి*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
8.ప్రాయమన్నచో అష్టవర్షము
తనూవిభవమే ధవళ వర్ణము
అభయముద్ర వరదముద్ర
త్రిశూలము డమరుకం
తన నాలుగు హస్తముల
కలిగియున్న కౌమారి
కల్మషాలు బాపి బ్రోచు
మాత *మహాగౌరి*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
9.అర్థభాగమై హరుని తనువున
సకల సిద్ధులు స్వామి కొసగెను
శంఖచక్రగదాయుధం
కమలమ్ములు చేతదాల్చి
కమలమే ఆసనముగ
అందముగా అధివసించి
కరతలామలకముగ సిద్ధులొసగు *సిద్ధిధాత్రి*
నవదుర్గల పేర వెలయు నారాయణీ
హరుని దేవేరి అర్థనారీశ్వరీ
ఓం శ్రీ మాత్రే నమః
21.
*బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
దివ్యోత్సవం
నవదుర్గల రూపమెత్తి
నవరాత్రుల వేళలందు
నారాయణి కొలువుదీర
ఆ తల్లి అన్నకు తిరు
మాడవీధులందు జరుగు బ్రహ్మోత్సవం
బ్రహ్మ తాను చేసినట్టి
దివ్యోత్సవం
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని నేత్రోత్సవం
నవపాలికలందు తొలుత
నవ ధాన్యములను నింపి
వృద్ధిచేయుటదే అదే అంకురార్పణం
శ్రీవారి సేనాని విష్వక్సేనుడు తానే
చెంతనుండి చేయునంట పర్యవేక్షణం
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
దివ్యోత్సవం
1.గరుడ ధ్వజ పటము తోటి
సర్వదేవగణములకు
ఆహ్వానము పలుకుటే *ధ్వజారోహణం*
శేషతల్పసాయి అయిన
శేషాద్రి వాసునకు
తొలిసేవగ నమరు *పెద్ద శేషవాహనం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
నేత్రోత్సవం
2.శేషభూతమైన భువికి
శ్రేయస్సును కలుగజేయ
వచ్చు హరికి వాసుకియే *చిన శేషవాహనం*
అజ్ఞానము వేరుచేసి
ఆత్మజ్ఞానమును గ్రోలిన
పరమాత్మను చేర్చు సేవ *హంసవాహనం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
దివ్యోత్సవం
3.దుష్టశిక్షణమ్ము చేయు ప్రహ్లాదవరదుడైన
నారసింహు డెక్కివచ్చు *సింహవానం*
మనసు ముత్యమైన చాలు
ముక్తి సులభమని చాటగ
*మత్యాల పందిరి* యే స్వామి వాహనం
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
నేత్రోత్సవం
4.కొంగు పసిడి తానగుచు
కామితార్థ మీడేర్చెడి
మలయప్పని కిదే *కల్పవృక్ష వాహనం*
అష్టదిక్పతులు మోయ
భువనాలను ఏలు రేడు
అందునంట *సర్వభూపాల వాహనం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని దివ్యోత్సవం
5.దేహముపై మోహమ్మును
తొలగించెద శరణుకోరు
మనగ దాల్చు పరమాత్మ *మోహిని యవతారం*
జ్ఞానము వైరాగ్యము రెక్కలుగా దాల్చినంత
సన్నిధి నేనిత్తుననగ *గరుడవాహనం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
నేత్రోత్సవం
6.దాస్యభక్తి నీదైతే దరిజేర్చుకొందు ననుచు
ఆదరమ్ము చూపుచు *హనుమంత వాహనం*
సంసారపు మకరిపట్టు
భక్తులార!విడిపించెద
ననగ స్వామి అధివసించు *గజరాజవాహనం*
స్వామి దయకు పారమేది అదే పుష్పకం
స్వర్ణ రథం ముక్తిపథం స్వామి మానసం
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని
దివ్యోత్సవం
7.ప్రత్యక్ష దైవమగుచు లోకాలను వెలిగించెడి
నారాయణమూర్తికి *సూర్య ప్రభవాహనం*
చలువనొక్క కంటనిలిపి
చల్లగ ఈ జగతినేలు
పాల్కడలి అల్లునకు *చంద్రప్రభ వాహనం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని నేత్రోత్సవం
8.తనువనియెడి రథమునందు తనను సారథిని జేయ
ముక్తి పథం సుగమ మనును హరి *రథోత్సవం*
ఇంద్రియముల పరుగును
అదుపుజేతు నన్ను వేడు
మనగ స్వామి ఎక్కి వచ్చు *అశ్వ వాహనం*
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని దివ్యోత్సవం
9.తిరుమాడ వీధులలో
ఇరుసంధ్యల వెడలి వెడలి
అలసినట్టి అచ్యుతునకు *చక్ర స్నానము*
ఉత్సవాలు తిలకించి పులకించి మరలుతున్న
దేవతలకు వీడుకోలు *ధ్వజావరోహణం*
శ్రీదేవిని భూదేవిని కూడి దర్శనం
ఇచ్చిన మలయప్పనికిదె భూరి మంగళం
మహా మహా వేడుకలే బ్రహ్మోత్సవం
అహో అహో తిరునగరిని దివ్యోత్సవం
*బ్రహ్మోత్సవ వాహన సేవలు సంపూర్ణం*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.10.2023
అచ్యుతం కేశవం హిందీ భజన్ కి తెలుగు లో స్వేచ్ఛానువాదం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.7.2023
22.అచ్యుతం కేశవం
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు పరమాత్మ రాబోడని
మీరా వలే నువ్వు పిలవాలంతే
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు పరమాత్మ తినబోడని
నువ్వు శబరల్లె తినిపించి చూడాలంతే
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు హరి యాడ రాడేమని
గోపికల్లే మైమరచి ఆడాలంతే
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు పరమాత్మ నిదరోడని
యశోదల్లె జోకొట్టి పాడాలంతే
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు పరమాత్మ వినబోడని
ద్రౌపదల్లే మొరపెట్టు కోవాలంతే
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు పరమాత్ముడే లేడని
ఆ ప్రహ్లాదుడై నువ్వు నమ్మాలంతే
అచ్యుతా! కేశవా! కృష్ణ! దామోదరా!
రుక్మిణీ వరా! జానకీ వల్లభా!
ఎవ్వరన్నారు పరమాత్మ కనరాడని
తన్మయత్వాన మదినింపు కోవాలంతే
సర్వకాలాలలో సకల కార్యాలలో
హరిని భావించుమా
పేరు జపియించుమా
రామ రూపం కను
కృష్ణ రూపం కను
రామ నామం అను
కృష్ణ నామం అను
ఓం నమో భగవతే వాసుదేవాయ
23.శ్రీ సత్యనారాయణా!
(వ్రత కథల పాట)
శ్రీసత్యనారాయణా
మాస్వామి కావాలి నీ దీవెన
అన్నవరమున వెలసి
అన్ని వరములనొసగు
ఆరాధ్యదైవమా
అద్భుతము నీ మహిమ
కడుపేద బ్రాహ్మణుడు
కట్టెలమ్మెడు వాడు
రాజ్యమేలే ప్రభువు
వ్యాపారి సాధువు
భక్తిమీరగ గొల్లలూ
గర్వాంధుడైనట్టి భూపాలుడు
నియమాలు పాటించి
వ్రతమాచరించి
అనుగ్రహము పొందిన
ఆపదలు గడచిన
విధమునే విన్నామయా
శ్రద్ధతో నీ వ్రతము జేసేమయా
సత్యదేవా నిన్ను
పూజింప శుభమగును
కథవిన్న వారలకు
కష్టాలు తొలగును
తీర్థప్రసాదమ్ములూ
కాదనక స్వీకరించుటె వరమని
తలపోయు వారలకు
సర్వకార్యములందు
సిద్ధించులే ఫలము
సకలమూ జయప్రదము
అగునంచు నమ్మేమయా
శ్రద్ధతో నీ వ్రతము జేసేమయా
చేసెదము వ్రతమంచు
చేతులారగ మ్రొక్కి
తరియించినంతనే
ఆ మాట మరచి
నిర్లక్ష్యమును చూపుచో
తగుఫలము అనుభవించుట తథ్యము
వేదనల పడద్రోసి
శోధింప న్యాయమా
అపరాధ శతమును
మన్నించి బ్రోవుమా
అని శరణు జొచ్చేమయా
శ్రద్ధతో నీ వ్రతము జేసేమయా
ఏ కులము వారైన
ఎట్టివారైననూ
శుభకార్యమేదైన
ఏ వేళ నైననూ
కలిమి కొలదీ వ్రతమునూ
ప్రీతితో బంధుమిత్రుల తోడనూ
జరుపుకొని మృష్టాన్న
మారగించిన పిదప
నృత్యగీతాలతో నిన్నలరజేయగా
కరుణతో గాచేవయా
సకల సంపదల నొసగేవయా
సత్యమౌ స్వామి వయ్యా
శ్రద్ధతో నీ వ్రతము జేసేమయా
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.6.2023
24.ఎన్నెన్ని కనులు?
ఎన్ని కనులు కావాలి
నిన్ను చూడ నా స్వామి
ఎన్నలేను నీ రూపు
తనివితీర దిదేమి?
కరుణతోడ మమ్ము బ్రోవ
కలియుగ వైకుంఠమందు
వెలసిన శ్రీ శ్రీనివాస
నమో నమో తిరుమలేశ!
బలము లేని అబలను
నీ కొండకు నడవలేను
కలిమి లేని పేదను
కాన్కలేమి ఈయలేను
మనసులోన సతతము
చేసెద నీ స్మరణము
నా పాట నా పద్యము
స్వామి నీకు నైవేద్యము
మెలకువలో దర్శింతును
నిదురనైన కలగందును
మరపురాదు స్వామి నీదు
మందస్మిత వదనము
భవ సాగర మందునేను
దరితోచని నావవోలె
కష్టాల కడలిలోన
మునకలేయు చుంటిని
గత కర్మలు తెలియలేను
భారమింక మోయలేను
నమ్మితి నీ కటి హస్తము
శరణమయ్య నీ చరణము
తప్పులన్ని మన్నించి
ఆర్తిబాపి బ్రోవవయ్య
అనుగ్రహించు శ్రీనివాస
నమో నమో తిరుమలేశ
విన్నపాలు వినవలే
నన్న ఆ అన్నమయ్య
కున్న చనువు లేకున్నను
వేడుకొందు స్వామి నిన్ను
నోరారగ కీర్తించగ
నీవిచ్చిన ఈ భాగ్యమె
పున్నెముగా పరిగణించి
నా పాపము పరిహరించు
పాహి పాహి గోవిందా!
పద్మనాభ గోవిందా!
నమో నమో గోవిందా!
నారాయణ గోవిందా!
సింహాద్రి జ్యోతిర్మయి
*అయోధ్య రామయ్య*
అయోధ్యలో రామయ్యకు ఆలయం
అవనిలోన వెల్లివిరిసె సంబరం
ధర్మమన్న ఆతడే
దైవమన్న ఆతడే
మర్యాదా పురుషోత్తము
డనగ భువిని ఆతడే
సౌఖ్యాలకు సంపదలకు
పొంగిపోని వైనము
కష్టాలకు కన్నీళ్ళకు
క్రుంగిపోని ధైర్యము
పితృవాక్య పాలనం
ఏకపత్నీ వ్రతం
పాటించిన రాముడే
అందరికీ ఆదర్శం
శత్రుసోదరునికే
శరణొసగిన కారుణ్యము
జాతి మతం కులమెప్పుడు
చూడనట్టి స్నేహము
వీరుడన్న ఆతడే
వినయశీలి ఆతడే
గురువర్యులు మెచ్చినట్టి
శిష్యుడనగ ఆతడే
యుగములెన్ని గడచినా
మరపురాని దా చరితం
రాజులెందరేలినా
రామరాజ్యమే స్థిరం
సీతాపతి ఆతడే
దాశరథియు ఆతడే
కౌసల్యా సుప్రజా
రాముడన్న ఆతడే
సీతయన్న పేరే
పాతివ్రత్య మంత్రము
రాముడన్న నామమే
సహస్రనామ తుల్యము
అన్నయన్న ఆతడే
మిత్రుడన్న ఆతడే
రామబంటు హనుమ మదిని
నెలకొన్నది ఆతడే
అయోధ్యలో రామయ్యకు ఆలయం
అవనిలోన వెల్లివిరిసె సంబరం
రామ రామ రామా
రామ రామ రామా
రామ రామ రామ రామ
రామ రామ రామా
రామనామ మందు ఉంది అమృతం
రామ నామ స్మరణ ఫలిత మక్షయం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.01.2024
మిత్రులందరికీ కార్తిక మాసారంభ శుభాకాంక్షలు.
హరిహరులిద్దరికీ ప్రీతి పాత్రమైన ఈ పవిత్రమాసంలో నేను రాసిన హరిహరస్తుతి లోనుండి రోజుకొక్క చరణాన్ని మీకందించాలన్న నా సంకల్పాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాను.
26.హరిహర స్తుతి
హరి హరి నమో నమో
శంభో హర హర నమో నమో
వైకుంఠ వాసా పాహీ !
కైలాసవాసా పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః !
1
ఆదిశేషుడే పానుపుకాగా
శయనించెదవీవు
వాసుకి గళమున హారము కాగా
విలసిల్లెద వీవు
పన్నగశయనా పాహీ!
పన్నగభూషణ పాహీ !
మీశుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః!
2.కురిసే మేఘం మేని ఛాయగా
కలిగిన కమలాక్షా!
గరళము గళమున ధరించి జగముల
గాచిన విరూపాక్షా!
నీలమేఘశ్యామా!పాహీ!
నీలకంధరా!పాహీ!
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
3
సీతాపహరణం చేసిన దుష్టుని
దశకంఠుని కూల్చితివి
సతి కవమానం సలిపిన దక్షుని
శిరమును ద్రుంచితివి
సీతారమణా పాహీ !
సతీశ నీవే పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
4.
శ్రీరామ బాణం తిరుగులేనిదను
యశమును చాటితివి
విజయుని తపసుకు మెచ్చి పాశుపతం
వరముగ నిచ్చితివి
కోదండపాణీ పాహీ
పినాకపాణీ పాహీ
*5వ చరణం*
తరింపజేసెడి తారకమంత్రం
అయినది నీ నామం
పాపము మాపగ పంచాక్షరిలో
ఇమిడెను నీ తత్వం
నారాయణాయ పాహీ !
నమశ్శివాయ పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
9.11.2021
హరి హర స్తుతి
6 వ చరణం
నీ పాదాలను కడిగిన జలమే
సురగంగై పారినది
నీదు శిరమ్మే ఉరికేగంగను
జటలను ఆపినది
వామనమూర్తీ పాహీ !
గాంగ జటాధర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.11.2020.
ఈ గీతాన్ని హిందీ భజన్
జయ జగదీశ హరే
ట్యూన్ లో పాడుకోవచ్చు.
*హరిహర స్తుతి*
*7 వ చరణం*
పత్రము,పుష్పము,ఫలము,తోయమున
తనివిని చెందెదవు
గుక్కెడు గంగకు,గుప్పెడు పత్రికి
మురిసి కొరతలు తీర్చెదవు
దామోదరాయ పాహీ !
మృత్యుంజయాయ పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
2.12.21
8
చంద్రునిలోగల పదహారు కళలు
ధరించి వెలిగితివి
శాపము నోపని చంద్రుని దయతో
శిరమన దాల్చితివి
శ్రీ రామచంద్రా !పాహీ !
చంద్ర శేఖరా! పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
హరి హర స్తుతి
9 వ చరణం
నీవే దిక్కని మొక్కిన గజరాజు
మొరవిని కాచితివి
గజాసురునిపై దయగొని నీవు
వరమిడి బ్రోచితివి
కరిరాజ రక్షక పాహీ !
కరి చర్మాంబర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.11.2019.
హరి హర స్తుతి
10 వ చరణం
10
వరించి రుక్మిణి చేకొనిపొమ్మని
నిను ఆహ్వానించినది
తపించి పార్వతి అపర్ణగానిను
పరిణయమాడినది
మన్మథజనకా పాహీ !
మదనాంతక మాం పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.11.2020.
...........హరి హర స్తుతి...........
11 వ చరణం
స్థితికారుడవై భక్తులనేలగ
కలిని తిరుమల వెలిశావు
లయకారుడవై ప్రళయాంతములో
కాశిని శూలాన నిలిపేవు
వేంకట నాయక పాహీ !
శ్రీ కాశివిశ్వేశ్వర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.11.2019.
12
ఆనందనిలయపు గోపురమందున
విమాన వేంకటపతివి కదా!
శ్రీశైల క్షేత్రపు శిఖర దర్శనం
పాపము హరించివేయు కదా!
శేషాద్రి వెంకన్న పాహీ
శ్రీశైల మల్లన్న పాహీ
హరి హర స్తుతి
13 వ చరణం
శబరి కతిథివై ఎంగిలి పండ్లను
ప్రీతితొ తింటివట
శబరుడు కన్నప్ప మాంస నైవేద్యం
ప్రియమున గొంటివట
భక్తసులభ హరి పాహీ !
బోళాశంకర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.11.2019.
*హరిహర స్తుతి*
*14 వ చరణం*
గోకులమందున ఆలమందలను
కాచుచు పెరిగితివి
నందీశ్వరునే అధిరోహించి
వృషభధ్వజునిగ చెలగితివి
నందగోపాలా పాహీ !
నంది వాహనా పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
18.11.2021
*హరిహర స్తుతి*
*15 వ చరణం*
విజయుని మోహం తొలగించెనుగా
నువు పలికిన శుభగీత
విద్యారంభం చేసెడువేళల
నీ నామమె తొలిరాత
గీతాచార్య పాహీ!
సర్వజ్ఞ నీవే పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
19.11.2021
*హరిహర స్తుతి*
*16 వ చరణం*
అహల్య పాపం హరించివేసెను
మృదువుగ తాకిన నీ పాదం
రావణ గర్వము ఖర్వము చేసెను
తాడించి అణచిన నీ పాదం
అహల్యసేవిత పాహీ !
రావణసంస్తుత పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
20.11.2021
..............*హరి హర స్తుతి*......,.
*17వ చరణం*
సోదరి మానం కాపాడేందుకు
చీరలు కొల్లగ నిచ్చితివి
నరజన్మమ్మిది నశ్వరమనుటకు
శ్మశాన వాసిగ తిరిగితివి
పీతాంబరధర పాహీ !
సాంబ దిగంబర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.11.2021.
హరి హర స్తుతి
18 వ చరణం
నీ పదదాసులు ధృవ ప్రహ్లాదులు
భక్తాగ్రగణ్యత నందిరిగా
మార్కండేయుడు మదినిను నమ్మగ
యమపాశము మరలెనుగా
కేశవ మాధవ పాహీ !
శివ మహదేవ పాహీ!
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.11.2019
*హరిహర స్తుతి*
*19 వ చరణం*
మూడడుగులతో ముల్లోకాలను
కొలుచుటె విడ్డూరం
నీ మొదలు తుది శ్రీపతి బ్రహ్మలు
ఎరుగరు ఆశ్చర్యం
త్రివిక్రమరూపా పాహీ !
త్రిపురాంతక మాం పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
23.11.2021
*హరిహర స్తుతి*
*20 వ చరణం*.
వేణుగానమున మోహజాలమున
జగముల నూపితివి
ఢమరుక స్వనమున సర్వ వాజ్మయపు
ధ్వనులను నింపితివి
మురళీ మోహన పాహీ !
సామగాన ప్రియ పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
24.11.2021
హరి హర స్తుతి
21 వ చరణం
ఏకాదశిలో ఉపవసించితే
వైకుంఠ ద్వారము పిలుచునట
మహ శివరాత్రి కి జాగరముంటే
కైలాసవాసము కలుగునట
వాసుదేవ ! హరి !పాహీ !
వామదేవ !హర !పాహీ !
మీశుభ చరణం శరణం
హరి ఓం హర ఓం నమః
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.11.19
22
పంచాయుధమ్ములు ధరించి శిష్టుల
నిరతము రక్షింపబూనెదవు
పంచారామములందున కొలువై
ముక్తి మార్గము చూపెదవు
అచ్యుత మాధవ పాహీ
శివ పంచానన పాహీ!
*హరిహర స్తుతి*
*23 వ చరణం*
కాళీయుపడగల తాండవమాడి
గోకులకష్టము తీర్చితివి
నంది మూపుపై నర్తనమాడి
నటరాజుగ వెలిగితివి
తాండవకృష్ణా పాహీ!
తాండవశంకర పాహీ!
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
27.11.2021
*హరిహర స్తుతి*
*24 వ చరణం*
దుష్ట శిక్షణ కు శిష్ట రక్షణకు
దశావతారములెత్తితివి
దశదిశలందున ధరణిని కావగ
దశాయుధమ్ములు దాల్చితివి
దశకంఠ వైరి పాహీ
దశకంఠ వినుత పాహీ
మీ శుభ చరణం శరణం
హరి ఓం హర ఓం నమః.
దశ ఈశ్వరాయుధములు
*ఖడ్గము,త్రిశూలము,పరశువు,శంఖము,డమరువు,నాగపాశము,అక్షమాల,ధనుస్సు,పాశుపతము,శరము*
*సింహాద్రి జ్యోతిర్మయి*
28.11.2021
25
కోతిని ,పక్షిని ,ఉడుతను సైతం
దయతో ఏలితివి
సర్పము,సాలీడు ,సామజములకు
సాయుజ్యమిచ్చితివి
కపిసేవిత పద పాహీ !
శ్రీ కాళహస్తీశ్వర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*ఉడుత సంఘటన వాల్మీకం కాకపోయినా, లోకంలో ప్రచారం లో ఉన్నందున గ్రహించాను.
26.
రమాదేవిని ఎదపై నిలిపి
రాజిల్లెదవీవు
ఉమాదేవికి తనువున సగమిడి
మన్నించితివీవు
శ్రీ శ్రీనివాస పాహీ !
అర్థ నారీశ్వర పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*హరిహర స్తుతి*
*27 వ చరణం*
నిత్యోత్సవముల కన్నుల పండువ
స్వామీ నీ నిలయం
లింగరూపము,భస్మాభిషేకం
కనుటయె కైవల్యం
అలంకార ప్రియ పాహీ !
అభిషేక ప్రియ పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
1.12.2021
28
నిండుమనసుతో నీ కర్పించెడు
తులసీ దళముకె తూగెదవు
మది నమ్మికతో మొక్కి ఒసగెడు
మారేడు దళముకె మురిసెదవు
తులసి మాల ధర పాహీ !
బిల్వదళార్చిత పాహీ !
మీ శుభ చరణం శరణం
హరి ఓమ్ హర ఓమ్ నమః
*హరిహర స్తుతి*
*29 వ చరణం*
నరసింహుడివై హిరణ్యకశిపుని
స్తంభాన వెలువడి చీల్చితివి
తపోభంగమును చేసిన మదనుని
నీ అగ్ని నేత్రాన కాల్చితివి
ప్రహ్లాద వరద పాహీ!
స్మరసతి వరద పాహీ!
మీ శుభ చరణం శరణం
హరి ఓం హర ఓం నమః
*సింహాద్రి జ్యోతిర్మయి*
3.12.2021
*30
రామభద్రుడే సైకతలింగం
ప్రతిష్ఠ చేసెకదా!
రామనామ ఘనమహిమను శివుడే
జగదంబకు తెలిపె కదా!
శివ కేశవులకు భేదం
లేదను పలుకే వేదం
ఆత్మకు కార్తిక దీపం
హరిహర అద్వైతం
30 రోజులకి 30 చరణాలు అని సంకల్పించి రాసిన ఈ హరిహర స్తుతి నేటితో సంపూర్ణం. 2016 లో నేను రాసిన ఈ
*హరి హర స్తుతి* ని
ఆదరించిన
ఆనందించిన
అభినందించిన
అందరికీ
ధన్యవాదాలు.
నమస్సమాలు.
🙏🙏🙏
*సింహాద్రి జ్యోతిర్మయి*
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.12.2021.
27.
అన్ని జీవుల నేలు స్వామి
నన్ను విడిచిన కతమదేమి
నీదుకొండను ఎక్కలేదని
చేతులారా మ్రొక్కలేదని
అలిగినావో తొలగినావో
వేడుకొను నా గోడు వినవో
పానుపవగా పాము నేలి
వాహనము గా పక్షి నేలి
బంటుగా గొని కోతినేలి
చేతి స్పర్శతొ ఉడుతనేలి
ఆదరించిన శ్రీరమాధవ!
ఆర్తివిని నన్నేల రావా!
మీనువై వేదాలు గాచి
కూర్మమై దేవతల బ్రోచి
వరాహమై ఈ వసుధ గాచి
నరసింహమై ప్రహ్లాదుగాచి
మహిమజూపిన శ్రీనివాస
నీ కటాక్షమె నాకు రక్ష
కరిరాజు కష్టము తీర్చినావట
బలికోట వాకిట బంటునీవట
అహల్య శాపము నార్చినావట
పాంచాలిపరువును నిలిపినావట
ఆ మాట నమ్మి నమ్మినందుకు
పరీక్షలెందుకు పలకవెందుకు
సతతమూ నిను సంస్మరించే
భక్త కోటికి బాంధవుడవే
నిరతమూ నిను నిందజేసే
ఖలులపైనా కక్షగొనవే
మాపలేని పాపమేమది
చేసినానని చేదుకొనవో
దుఃఖాగ్నిలో నా దురితమంతా
కాలలేదా కరుణ రాదా
మొల్ల అల్లిన కవిత గైకొని
అన్నమయ పద మాలకించి
రామదాసును రక్షజేసి
వెంగమాంబ ననుగ్రహించి
నీ పదముపట్టి పదములల్లే
నాతిపై ఈ శీతకన్ను
ఏల స్వామీ ఏలవేమీ
పరమాత్మ నీ పరమార్థమేమీ
ఆతిథ్యమెంచి వృద్ధ శబరిని
ప్రేమనెంచి భీష్మకుని సుతను
వాత్సల్యమెంచి వకుళమాతను
స్నేహమెంచి ప్రియ కుచేలుని
ఆనందపరచిన నందనందన
నీ దయను పొందగ నేను తగనా
బ్రహ్మ కడిగిన పదము నీది
సురగంగ పుట్టిన పదము నీది
బలితలను తాకిన పదమునీది
అహల్య కొలిచిన పదమునీది
ఆ పదము ఋషులకు పరమపదము
దాసకోటికి అభయప్రదము
ఆపదము సుందర కోకనదము
పట్టి కొలుచుటె నాకు ముదము
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఈరోజు 5.11.2024
స్వామి వారి దర్శనం చేసుకుని రాసిన పాట
*స్వామి సన్నిధి*
ఏదీ ఏదీ మరియొకసారి
తనివితీర నీ సన్నిధి చేరి
కనులారా నిను కనుగొని మురిసే
భాగ్యము దొరికిన ఈ శుభవేళ
శ్రీనిలయమునే మౌని తాచెనని
అలిగిన తొలగిన సిరినే కనుగొను
నెపమిడి నీవే వైకుంఠము విడి
మము బ్రోవగ ఈ భువి చేరితివా
గోవుని కావగ గొల్లని దెబ్బకు
గాయము పాలై తొలిదర్శనమిడి
వేచిన జనని వకుళను చేరి
తనయుడవైన శ్రీనివాసుడా!
పద్మావతినే పరిణయమాడే
వేడుక కొరకై చేసిన అప్పుకు
ఆ ధనపతికి అసలును మించిన
వడ్డీకాసుల నొసగే స్వామీ!
శ్రీమహలక్ష్మికి పద్మావతికి
జరిగిన వాదున బదులిడలేక
శిలవైనీవే కలిదైవమువై
తిరుమల వెలసిన శ్రీతిరునాథా
బావాజీతో పాచికలాడి
వెంగమాంబ యిడు హారతి గైకొని
ఆళ్వార్ గునపపు పోటుకు గురియై
సత్యము నీవై రూపించావట
సురలు మునులు నరులు ఘనులు
సతతము కొలిచే నీ రూపము నా
భాగ్యము పండగ
బంగరు వాకిట
నిలబడి కనగా ఆనందనిలయా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.11.2024
*కళ్యాణం వైభోగం*
(పెళ్ళి పాటలు)
8.*సత్యనారాయణ స్వామి వ్రతం*
(నూతన వధూవరులు)
శ్రీ సత్యనారాయణా!
మా స్వామి కావాలి నీ దీవెన
అన్నవరమున వెలసి
అన్ని వరముల నొసగు
ఆరాధ్యదైవమా!
అద్భుతము నీ మహిమ
క్రొత్తగా పెళ్ళయిన ఈ జంట నేడు
నీ వ్రతము చేసేరు కరుణతో చూడు
పురుషార్థముల తాము ఒక్కటై నడిచి
పుణ్య కార్యములెల్ల జతగూడి సలిపి
గార్హస్థ్య ధర్మాన్ని కాపాడుకుంటూ
దాంపత్య మధురిమలు తామందుకుంటూ
అర్థనారీశ్వరులు అనిపించు రీతిగా
నూరేళ్ళు హాయిగా జీవించునట్లుగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన
ఎదలోన నిను నమ్మి భక్తితో కొలువగా
ఏటేట నీ వ్రతము చేసుకుని మురియగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన
కష్టాల కడలిని దయతోటి దాటించు
దుఃఖాల క్రీనీడ పడనీక రక్షించు
పిల్లపాపలనిచ్చి చల్లగా కాపాడి
సుఖము సంతోషము బ్రతుకులో వెలిగించి
సంసారమను తరువు కల్పతరువవ్వగా
నిండుదంపతులంటు ఎల్లరూ పొగడగా
జానకీరాములే అనిపించురీతిగా నూరేళ్ళు హాయిగా జీవించునట్లుగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన
ఎదలోన నిను నమ్మి భక్తితో కొలువగా
ఏటేట నీ వ్రతము చేసుకొని తరియగా
శ్రీ సత్యనారాయణా
మా స్వామి కావాలి నీ దీవెన
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
క్షీరాబ్ధి సుతవమ్మ
సిరులిచ్చు మాయమ్మ
మాపూజలందగా
రావమ్మ రావమ్మ
అష్టలక్ష్మీ మాపై
ఆదరమ్మును జూపి
జాబిల్లితోబుట్టు
చల్లంగ చూడమ్మ
అచ్యుతుని అర్థాంగి
*ఆదిలక్ష్మీ* ఇంట
*ధనలక్ష్మివై* వెలసి
సంపదల నీయగా
కమలాసనా నీవు
కదలి రావమ్మా
పాడిపంటలు పొంగ
*ధాన్యలక్ష్మీ* యింట
ఘనపదవి గౌరవము
*గజలక్ష్మివై* యొసగ
కమలాలయా నీవు
కదలి రావమ్మా
పిల్లపాపలు పుట్టి
నట్టింట దోగాడ
*సంతానలక్ష్మివై*
సంతసమ్మీయగా
కమలహస్తా నీవు
కదలిరావమ్మా!
ధైర్యస్థైర్యము నింప
*ధైర్యలక్ష్మీ* లోన
విద్యలందున సిద్ధి
నొసగ *విద్యాలక్ష్మి*
కొలువుతీర్చితిమింట
కరుణించరావమ్మా
సర్వవేళలయందు
సకలకార్యములందు
విజయలక్ష్మీ మాకు
విజయమ్ములీయగా
శ్రావణపు వ్రతపూజ
చేకొనగ రావమ్మా
సింహాద్రి జ్యోతిర్మయి
7.8.2025
గురువారం
Comments
Post a Comment