4/1.*గేయ రామాయణం* ‌ బాలకాండ


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
గేయ రామాయణం
బాలకాండ (142 చరణాలు)
                


ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సులు.మా ఇంటి పేరు జంగం. నా కలం పేరు సింహాద్రి‌ జ్యోతిర్మయి.
నేను 2002 వ సంవత్సరంలో గేయరామాయణం వ్రాశాను.
స్వర్గీయురాలైన మా తల్లిగారు శ్రీమతి సింహాద్రి విశాలాక్షి గారికి అంకితంగా‌ ఈ గేయరామాయణం రాయటం జరిగింది.దీనిని ఈ శ్రీరామ నవమి నుండి ముఖ పుస్తక మిత్రులందరికీ అందించాలనే సంకల్పం ఈ శుభోదయాన నాకు కలిగింది. 

ఈ గేయం దాదాపుగా వెయ్యి చరణాలు కలిగి ఉంటుంది.రాముడికి వెయ్యి నూట పదహార్లు‌ సమర్పించాలని నా ఆశ.ఈ గేయాన్ని యథా‌వాల్మీకంగా రాశాను.ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వచనం ఆధారంగా స్వీకరించాను.
భద్రాచలం గురువులు   నా గేయ రామాయణం విని నన్ను వనితా వాల్మీకి అని ప్రస్తుతించి ఆశీర్వదించారు.
ఈ గేయాన్ని కస్తూరి రంగ రంగా ట్యూన్ లో పాడుకోవచ్చు.మిత్రులు నా ప్రయత్నాన్ని ఆదరించి ,ఆశీర్వదిస్తారని ఆశిస్తాను.
అందరికీ ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ

మీ సింహాద్రి జ్యోతిర్మయి.

  

 

   శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్       

1.
శ్రీరామ రామ రామా!
శుభనామ!సీతా మనోభిరామా!
నీ పేరు వేయి నామాలసాటి
వరనామ! మమ్మేలు కరుణ తోటి.

2
.వినరండయా ఆదికావ్యం
పూర్వమిది వాల్మీకి విరచితమ్ము
తొలుత కుశలవులు పాడిరంట
భాగ్యమది నేడు నాకబ్బెనంట

3.
ఈ కథకు ఒక పేరు రామాయణం
మరియొక్క పేరేమొ సీత చరితం
పౌలస్త్య వధ అన్నది
వేరొక్క పేరుగా స్థిరపడినది 

4.
శ్లోకాలు ఇరువది నాల్గువేలు
ఐదు వందలట సర్గలిందు
ఆరు కాండలుగ విభజించిరి
ఆపైది ఉత్తర కాండ అనిరి

5.
వాల్మీకి!గిరులు ఝరులెంతకాలం
భువిలోన నిలుచునో అంతవరకు
నీదు కావ్యమ్ము నీవు సైతం
స్థిరముగా ఉందురని  బ్రహ్మ పలికె

శ్రీరామ రామ రామా
శుభనామ సీతామనోభిరామా

6.
శ్రీ రామ ప్రభువు ఘనత
శ్రీకరము సీతమ్మ పుణ్య చరిత
ముదమారగా భక్తిమీర
నోరార పాడండి తనివిదీర

7.
నారదుడు బోధసేయ
బ్రహ్మయే స్వయముగా ఆనతీయ
వాగ్దేవి వరము నీయ
వాల్మీకి వ్రాసె నీ వరకావ్యము

8.
అసురశక్తులు మించగా
అందరూ ఆర్తితో అర్థించగా
విష్ణువే వెడలినాడు
ఇలలోన రాముడై వెలసినాడు




శ్రీ రామ జననం

9.
కోసలకు ఏలికై పాలించెను
చల్లగా మహరాజు దశరథుండు
అతనికి  మహరాణులొక మువ్వురు
కౌసల్య సుమిత్రా కైకమ్మలు

10.
పుత్ర సంతాన లేమి చేత
ఆ రాజు సతతమ్ము దుఃఖించెను
మదిలోన‌ తనకున్న  తలపుదీరా 
మరి తాను యాగమ్మునే చేసెను.

11.
ఋష్యశృంగుడే ఋత్విక్కుగా
తొలుత అశ్వమేధమ్ము జరిపె
పిదప కులగురువు లానతీయ
భక్తితో పుత్రకామేష్టి సలిపె

12.
సంతుష్టి చెందెను‌ దేవగణము
సాకారమయ్యెను యజ్ఞ ఫలము
ఒక దివ్యపురుషుడట ఉద్భవించె
దీవించి పాయసపు పాత్రనొసగె

13.
ధన్యుణ్ణి అని తలచి దశరథుండు
త్వరతోటి తన అంతిపురము జేరి
రాణులకు శుభవార్త వినిపించెను
ప్రీతితో పాయసమునందించెను

14.
సగపాలు కౌసల్య కాతడిచ్చె
సుమిత్రకు సగములో సగమునిచ్చె
శేషమున సగపాలు కైకకిచ్చె
మిగిలినది మరల సుమిత్రకిచ్చె.

15.
ఆ దివ్య పాయసము నారగించి
ఆ సతులు తేజస్సు పొందినారు
అచ్యుతుని గర్భాన దాల్చివారు
ఎనలేని భాగ్యమ్ము‌ నందినారు





16.
దశరథుని మదిలోని కొరతదీర్ప
ధరలోన ధర్మమ్ము పాదుకొలుప
పుత్రకామేష్టి పుణ్యఫలమై
పుట్టె హరి కౌసల్య కంటివెలుగై

17.
పునర్వసు చివరి పాదమ్మున
కర్కాటకమ్మనెడు లగ్నమ్మున
శుభగ్రహము లైదింటి ఉచ్చదశలో
పురుషోత్తముడు తానిలను వెలసె

18.
నవమి పుట్టిన తోడనే
పుడమి చైత్రమై పులకరించె
అందాల రాముడే జననమంద
రమ్యమౌ కాంతులీ జగతిదాల్చె

19.
భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు
మరునాడు వరుసగా జన్మించిరి
ఆకాశవీధిలో అమరులంతా
ముదముతో విరివాన కురిపించిరి

20.
పుత్రులకు నామకరణోత్సవం
జరిపించి దశరథుడు మురిసినాడు
అనురూపమైనట్టి తమపేర్లతో
కొమరులు విఖ్యాతి నందినారు

21.
తనలోని సద్గుణమ్ముల చేతనే
సర్వులను సమ్మోహపరచువాడై
కౌసల్య కందిన పుణ్యఫలమై
వర్థిల్లె శ్రీరామచంద్రమూర్తి.

22.
రామని సేవించుటను భాగ్యమే
ఎనలేని సంపదగ నెంచువాడై
సుమిత్రా దేవికి తొలికానుపై
ప్రవర్థుడైనాడు లక్ష్మణుండు

23.
రాముని వనవాస కాలమందు
రాజ్యమ్ము భరియించగల డీతడు
అనునట్లు తనపేరు అమరియుండ
పెరిగెను భరతుడన కైకసుతుడు

శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్
శ్రీరామ రామ రామా
శుభనామ సీతామనోభిరామా
నీ పేరు వేయి నామాల సాటి
వరనామ మమ్మేలు కరుణతోటి 
24.
సంహారమొనరించి శత్రువులను
వీరుడై విఖ్యాతి నందగలడు
అనదగిన లక్ష్మణుని అనుజన్ముడు
సుమిత్ర మలిసంతు శత్రుఘ్నుడు.


25.
అరమరికలన్నవే అసలెరుగక
కలహించుటన్నదే కానరాక
సరిలేని సోదరుల ప్రేమకిలలో 
నల్వురూ సాక్ష్యమై నిలిచినారు.

26.
అన్నపై లక్ష్మణుని అనురాగము
వచియింప లేనిదది అసమానము
తమ్మునెడ దాశరథి వాత్సల్యము
వివరింపజాలమది అత్యంతము

27.
రాముణ్ణి సోదరుడు లక్ష్మణుండు
క్షణమైన విడువక అనుసరించు
భరతుణ్ణి ప్రేమతో శత్రుఘ్నుడు
ప్రాణాధికమ్ముగా మదిని తలచు

28.
శుభ లక్షణాలతో ఒప్పారెడు
ప్రియసుతులు నల్వురితో కూడిరాజు
ఇంద్ర యమ వరుణాది దిక్పతులతో
కొలువైన బ్రహ్మ వలె తేజరిల్లె.

29.
ఘననీలనీరదపు‌ ఛాయవాడు
 యెల్లరూ  మది మెచ్చు  మహితాత్ముడు
 వశిష్ఠ మౌనీంద్రు శిష్యుడగుచు
తమ్ములతో తొలి చదువు నేర్చెనంట.



🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కౌశికుని యాగసంరక్షణ
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

30.
ఆంతలో  కౌశికుడు ఒక్కనాడు
యేతెంచి యాగమ్ము కాచేందుకు
నీ సుతుని నా వెంట పంపమనగా
దశరథుడు ‌విడలేక వినిచెనిటుల

31.
తాపసీ !పసితనము  వీడలేదు
తనయునికి  పదహారు నిండలేదు
మాయావులైనట్టి రాక్షసులను
బాలకుడు  యెదిరించి నిలువలేడు

32.
అని పుత్రస్నేహమే ఉప్పొంగగా
కుమిలేటి  మహరాజు కలతదీర్చి
కులగురువు మెప్పించి ఒప్పించెను
రాముణ్ణి మునివెంట  పంపించెను

33.
పాల్గారు పదహారు  ప్రాయమ్మున
సౌమిత్రి వెన్నంటు  ప్రాణమ్మన
 చేకొన్న అవతార పరమార్థమై
 అతడేసె తొలియడుగు  మౌనివెంట.

34.
విధాత వెన్నంటి సాగిపోవు
అశ్వినీ దేవతల జంటవోలె
భక్తితో గురువునే అనుగమించి
సరయు దక్షిణ దరి చేరుకొనిరి



35.
తన వెంట వచ్చిన దాశరథికి
శుభములు ,శ్రేయస్సు కలుగజేయ
దివ్యమౌ బలాతిబలవిద్యలు
కౌశికుడు ఉపదేశ మొనరించెను

36.
ఆకలిని దప్పికను కలుగనీక
నాయనా!అలసటే రానీయక
రూపాన్ని కాంతిని తరగనీక
అనుకోని ఆపదలు దరికి రాక

37.
మిముగాచు ఈ దివ్యమంత్రమ్ములు
రాణించు మిముజేరి ఈ విద్యలు
అని పలికి దీవించె గురుదేవుడు
వని గడిపి రా రాత్రి దాశరథులు.


38.
కొసల్య నందనా!సుగుణ ధామా!
తొలి సంధ్య పొడిచెనిక మేలుకొనుమా!
వేళాయె దైవకార్యాలు సలుప
మేలుకో కర్తవ్య మాచరింప.

39.
అని మౌని లాలించి మేల్కొలుపగా
సోదరులు గుర్వాజ్ఞ పాటించిరి
ఆ పిదప సాగింది వారి గమనం
ఎదురాయె చొరరాని ఒక కాననం

40.
అచ్చెరువు నొందిన  శ్రీరాముడు
ఆ వివరమేమిటని ప్రశ్నించగా
శ్రద్ధగా వినుమంచు గురువతనికి
యక్షిణి తాటక కథ చెప్పెను

41.
విరించి వరముచే ఈ తాటక
ఒక వేయి యేనుగుల బలమునొందె
అగస్త్య మౌనీంద్రు శాపమ్ముతో
యక్షిణి రాక్షసిగ మారిపోయె

42.
మునివరుని ఆశ్రమము నాక్రమించి
అది జీవహింసనే మొదలిడినది
తనయుడౌ మారీచు తోడుగూడి
నరమాంస భక్షణము చేస్తున్నది

43.
వర ,శాపబలములూ కల్గినట్టి
ఈమెను చంపగలవాడవీవె
స్త్రీ వధను పాపమని భావించకు
జనహితము రాజులకు కర్తవ్యము

44.
అను మౌని‌ పలుకులను ఆలకించి
నీ ఆజ్ఞ పాటింతుననె రాముడు
నా తండ్రి ఆదేశమిది గురువరా
శిరసావహించెదను నే సర్వదా

45.
గోబ్రాహ్మణాదులను కాచేందుకై
ఈ రాక్షసిని నేను  వధియింతును
అని ఘోర‌రణమునే సాగించెను
మాయావి తాటకను దునుమాడెను


46.
సంహార కార్యమిట మొదలాయెను
బ్రహ్మాదులకు ఎంతొ ముదమాయెను
దివ్యాస్త్ర బలమిచ్చి దీవింపుమా
అని వజ్రి కౌశికున కాజ్ఞయిడెను

47.
దేవకోటులకైననూ దుర్లభమ్మౌ
శతసంఖ్య యుత దివ్య అస్త్రాలను
ప్రయోగోపసంహార విధముతోటి
బ్రహ్మర్షి రామునకు బోధించెను

48.
భక్తితో రాముడవి స్వీకరించె
అస్త్రాలు కైమోడ్చి ఎదుట నిలిచె
పురుషోత్తమా!చెప్పు ఆజ్ఞ ఏమి?
అని వేడినవి స్వామి ఘనత ఏమి?

49.
రాముడా అమ్ములను చేత తాకి
ఆత్మలో నివసించమని కోరెను
వల్లెయని అస్త్రాలు మాయమాయె
ముని వెంట దాశరథి పయనమాయె

50.
  సిద్ధాశ్రమమ్మును చేరి పిదప
తాపసి యాగదీక్షను బూనగా
సిద్ధమై కౌశికుని ప్రియ శిష్యులు 
ఏమరక యాగమ్మునే గాచిరి

51.
  ఆరవ దినమునకు చేరె యాగం
 అడ్డుపడ యత్నించె అసురగణము
శ్రీరామలక్ష్మణులు  చెలగి‌ నాడు
రయమున‌ గుప్పించె‌ బాణచయము

52.
 మానవాస్త్రమ్ము నే రాముడేయ
మారీచు‌డెగిరిపడె యోజనములు
ఆగ్నేయ అస్త్రమ్ము విడిచినంత
సుబాహు డొదిలేసె ప్రాణమ్ములు.

53.
మునులెల్ల‌ మదినెంతొ మురిసిపోయి
రాముని పలుమారు ప్రస్తుతించి
పయనమై మిథిలకే పోదమనిరి
జనకుని యాగమ్ము చూతమనిరి.



54.
ఆమార్గమధ్యమ్మునందు వారు
గంగలో స్నానాలు చేసినారు
దివ్యమౌ గంగావతరణ కథను
శిష్యులకు వినిపించె‌ గాధి సుతుడు.




🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గంగావతరణ కథ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

55.
నాయనా! పరమ పావని ఈ నది
త్రిపథగామిగా పేర్గన్నది
మేనాహిమవంతులకు తొలికానుపు
బహు పుణ్యరాశి‌   యీ భాగీరథి

56.
సగరుడను ఒక రాజు కలడు
మీ సూర్యవంశాన పూర్వుడతడు
కేశిని సుమతియు అతని సతులు
కేశిని తనయుడే అసమంజుడు

57.
గరుడుని సోదరి సుమతి కనెను
అరువది వేలుగా ప్రియసుతులను
అసమంజు డగుటతో బహుతుంటరి
సగరుడు పురినుండి వెడలగొట్టె.

58.
 అసమంజు సుతుడేమొ తాత జేరె
అంశుమంతుడని తాను వినుతికెక్కె
వీరము,ధర్మము,వినయమ్ముతో
సగర పౌత్రుడు ప్రజల మెప్పుగనియె



59.
సగరుండు తలపెట్టె నొక యజ్ఞము
దీక్షగొని సాగించె ఘనయాగము
సవనమ్ము విఘ్నమ్ము చేయదలచి
ఇంద్రుండు హరియించె యాగాశ్వము.

60.
సగరసుతు లరువది వేలమంది
హయమునే వెదుకగా వెళ్ళినారు
భూమినే తవ్వుచూ పోయివారు
పాతాళలోకాన్ని చేరినారు

61.
ఆచోట కపిలముని ఆశ్రమాన
కనిపించె వారికా యాగాశ్వము
దుశ్చర్య మునిదంచు దూషించిరి
ఆ తపసి కోపాగ్ని కాహుతైరి

62.
తనసుతుల జాడకై  సగరుడంత
పౌత్రుడౌ అంశుమంతుని పంపెను
వినయాన‌ మెప్పించి ఆ వీరుడు
యాగాశ్వమును తిరిగి గ్రహియించెను

 

63.
పినతండ్రులందిన దుర్మరణము
అతనిమది నెంతయో కలచివేసె
తర్పణము విడువగా గంగోదకం
కావలయునని గరుడుడానతిచ్చె

64.
తన సుతుల మరణదుఃఖాన్ని మింగి
సగరుడు యాగమ్ము పూర్తిజేసె
దివిగంగ‌ ఏ రీతి భువికొచ్చునో!
తెలియక చింత పడి కన్నుమూసె

65.
తదుపరి అంశుమంతుడు ఏలెను
దిలీపు డాపిదప రాజాయెను
ఎల్లరూ తపియించినారు గానీ
గంగను భువి జేర్చు టెరుగరైరి



66.
దిలీపు సుతుడైన భగీరథుండు
సంతానహీనుడై పరితపించి
తన తాతతండ్రుల‌ వాంఛితమును
తను తీర్చవలెనంచు నిశ్చయించె

67.
రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి
గోకర్ణమును జేరి తపముజేసె
ఆ ఘోర తపసుకు బ్రహ్మ మెచ్చె
 దిగివచ్చి   వరములను కోరుమనియె

68.
గంగోదకముతో తర్పణములు
ముత్తాతలకు నిడగ వరమునిమ్మా!
ఇనవంశ తేజమే ఇనుమడింప
పుత్రసంతతి నాకు దయచేయుమా!

69.
అని  వరములడిగె భగీరథుండు
అట్లె యగునని పల్కె ధాతయపుడు
సురగంగ వేగమిల భవుడొక్కడే
భరియింప గలడతని మెప్పింపుమా!

70.
అనినంత శివునకై మరల తాను
తపమును జేసె దిలీపుసుతుడు
దిగివచ్చి ధూర్జటి‌ వరమునిచ్చె
గంగనే ధరియింప సమ్మతించె



71.
ముప్పతిప్పలు పెట్టి  ముక్కంటిని
ఈడ్చుకొని పోయెదను పాతాళము
అని తలచు గంగకు‌ గర్వభంగం
చేయగా నెంచె ఆ పరమశివుడు.

72.
జటలనెడు గుహలందు బంధించగా
అశక్తురాలైన సురగంగను
కనలేక చింతపడి భగీరథుండు
మరియొక్కపరి తిరిగి తపముజేసె

73.
అతనిని కరుణించె నా ధూర్జటి
ఇలవైపు విడిచెను పాయనొకటి
అది జారె బిందుసరోవరాన
సప్త పాయలై పారె భూమిపైన

74.
హ్లాదిని పావని మరియు నళిని
అను మూడు సాగినవి తూర్పు దిశకు
సింధువు సీతయు సుచక్షువు
పశ్చిమము వైపుగా పరుగులెత్తె

75.
ఏడవది భగీరథు ననుసరించె
తెలినురుగు లెగయుచూ కులుకులొలికె
దేవగణ మదిగాంచి సంభ్రమాన
వెన్నంటి సాగిరి అంబరాన.


 
76.
సురకోటి శిరసుపై జల్లుకొనియె
మునిగణము భక్తితో ఆచమించె
మనుజాళి తరియింప మునకలేసె
ముల్లోకములకామె ముదముగూర్చె

77.
నడమంత్ర సిరిచేత కనుగానక
మిడిసిపడు వారివలె గంగచెలగి
ముంచెత్తె జహ్నుముని ఆశ్రమాన్ని
క్రుద్ధుడై ముని త్రావె జలరాశిని

78.
ఎల్లరూ ప్రాధేయపడినంతనే
శాంతించి ముని విడిచె వీనునుండి
అ కారణాన ఆ నాటి నుండి
జాహ్నవి అనబడెను గంగానది.

79.
పిదప ఆ గంగమ్మ ఉరకలెత్తి
పాతాళకుహరమ్ము చేరుకొనెను
భగీరథు పితరులను  తాకినంత
వారికిక స్వర్గమ్ము ప్రాప్తించెను

80.
అత్తఱిని ధాతయట ప్రత్యక్షమై
భగీరథు నీరీతి ప్రస్తుతించె
ఇక ప్రథమ సుతయౌను ఈమె నీకు
భాగీరథి యనగ వినుతికెక్కు

81.నాయనా! నీవెన్నో శ్రమలకోర్చి
పితరులకు దైన్యమ్ము తప్పిస్తివి
జగతి సాగరజల ముండువరకు
సగరపుత్రులు స్వర్గమందుందురు

82.
అని పలికి మరలగా ధాత యపుడు
శుచి యగుచు ఆ రాజు శాస్త్రవిధిని
సగరులకు తర్పణము లర్పించెను
పితౄణమును తాను తీర్చుకొనెను

83.
రాఘవా!వింటివా గంగచరిత
ఏకాగ్రచిత్తాన ఎవరువిన్నా
నశియించిపోవును పాపరాశి
సమకూరు నెల్లరకు సకలసిద్ధి

84.
అని గురువు వినిచిన పుణ్య కథను
విని రామలక్ష్మణులు ముగ్థులైరి
తెలవారినంతనే‌ బయలుదేరి
నది దాటి ఆవలకు పయనమైరి.


🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
అహల్యా శాప విమోచనం
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶


85.
దారిలో వారికి ఒక ఆశ్రమం
 ధూళితో కప్పబడి కనిపించెను 
 మునివరా!   కారణమ్మది యేమిటో
చెప్పమని దాశరథి ప్రశ్నించెను

86. 
ఇదియేను గౌతముని ఆశ్రమమ్ము
అహల్య అతని ఇల్లాలు సుమ్ము
నేడిచట ధూళితో ఆమె రూపం
కప్పబడె కారణం భర్త శాపం

87.
అమరేంద్రు డాశించె నతివపొందు
చేరె తన మక్కువను తీర్చమంటు
క్షణకాల మోహానికామె లొంగె
వేవేల ఏళ్ళుగా కుములుచుండె

88.
శ్రీరామ దర్శనము కలిగినంత
పాపము,శాపము తీరునింక
అని భర్త పలుకగా  ఈ దినముకై
తపియించి వేచెనిదె నీ రాకకై

89.
నాయనా!నీ దర్శనమ్ము చేత
కాగలదు మునిపత్ని ఇక పునీత
కాలూనుమీ దివ్య ఆశ్రమాన
తరియించు యీ సాధ్వి నీ కతమున

90.
అనుటతో రాముడట కాలుమోపె
ఆమెను గప్పిన పొరలు తొలగె
గ్రహియించి గౌతముడు మరలివచ్చె
నిజసతిని మన్నించి స్వీకరించె

91.
శ్రీరామలక్ష్మణుల కాదరమున
ముని దంపతులు అతిథిసత్కారము
చేసిరి దేవతలు సంతసింప
వినయాన సోదరులు స్వీకరింప

92.
ఆ పిదప వీడ్కొని రామాదులు
ఈశాన్య దిక్కుగా పయనమైరి
జనకుని యాగశాలకు చేరుకొనిరి
నిర్జనపు ప్రాంతాన బసచేసిరి


🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
   ‌       శివధనుర్భంగం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾


93.
మిథిలను చేరిన  ఆ మీదట
జనకుడే ఎదురేగి స్వాగతించె
శ్రీరామలక్ష్మణుల రూపు జూచి
రాజర్షి తన్మయము మదిని పొందె

94.
మౌనీంద్ర!  సూర్యచంద్రులను ‌బోలిన
అశ్వినీ దేవతలు అనజాలిన
సుకుమారు లీ చిరంజీవు లెవరు?
మీవెంట వీరేల వచ్చినారు?

95.
అని యడుగు జనకునికి కౌశికుండు
ఈ రీతి బదులిచ్చె మురిపెమొప్ప
దశరథుని తనయులు వీరిరువురు
శ్రీరామలక్ష్మణులు వీరి పేర్లు

96.
రాక్షసులను వధియించి ఈ వీరులు
నా యా ఉందిగ రక్షణము జేసినారు
అహల్య శాపమ్ము తొలగించిరి
హరువిల్లు చూడగా ఏతెంచిరి

97.
అదివిని ముదమంది జనకరాజు
ఆ వింటి చరితనిటు వివరించెను
దేవతలు మా పూర్వుడైన నిమికి
న్యాసముగ నిచ్చిరీ శివధనువుని

98.
యాగమ్ము చేయగా నెంచినేను
 పుడమిని‌ ఒకనాడు దున్నుచుండ
ఉందిఎనలేని నా భాగ్యవశముచేత
లభియించె నొకబాల ఆమె సీత

99.
అయోనిజ యైనట్టి నా తనయను
అల్లారుముద్దుగా పెంచినాను
వినుమయ్య వైదేహి వీర్యశుల్క
అని తెలిపె రాజర్షి తన కోరిక

100.
శివధనువు నెక్కిడగ జాలు వాడే
నా‌ముద్దు పట్టికి‌ మగడతండే
అని చాట వీరాగ్రగణ్యులొచ్చి
యత్నించి విఫలులై వెనుదిరిగిరి





101.
శివ ధనువు రామునకు‌ చూపించెద
అత డెక్కుపెట్టెనా సీతనిడెద
మాకిట్టి మారుడే వరుడైనచో
మరియేమి!మా జన్మ తరియించదా!

 102
అని తాను పలుకుతూ జనకరాజు
 ఆనతిడ వీరులొక ఐదువేలు
అష్టచక్ర యుతమౌ శకటమ్మున
అలరు ధనుః పేటికను గొనివచ్చిరి

103
ఆ దివ్య ధనువును గాంచి మౌని
చూడమని రామునకు చెప్పినాడు
తమ ఆజ్ఞ !అని పలికి రఘువీరుడు
ఆ ధనుః పేటికను తెరచినాడు

104.
చేతితో విల్లంది శ్రీ రాముడు
నారినే సంధించి లాగినంత
పిడుగల్లె భీకరపు సడి చేయుచూ
ఫెళ్ళుమని విరిగింది హరునివిల్లు

105.
ఫెళఫెళారావాలు విన్నంతనే
ప్రజలంత భీతిల్లి మూర్ఛిల్లిరి
శ్రీరామ శక్తి గని జేజేలతో
జనులంత జగదేక వీరుడనిరి



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
సీతారామ కళ్యాణం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

106.
కడుముగ్ధుడైనట్టి  జనకరాజు
ముదమార కోసలకు వార్త పంపె
సకల బాంధవకోటి గూడి రాగ
దశరథుడు మిథిలకు సాగివచ్చె

107.
ఆదరమ్మొప్పగా అయోధ్యపతికి
జనకుడు శుభస్వాగతము పలికెను
ముదముతో ఇక్ష్వాకు డా జనకుని
తనయలను కోడళ్ళు గా కోరెను

108.
ఉప్పొంగి మనసార సమ్మతించి
విన్నపము జేసెనిటు జనకవిభుడు
కుశధ్వజుడు ప్రియమైన నా తమ్ముడు
కూతుళ్ళు కలరతని కొక ఇద్దరు

109.
నా సుతలు వైదేహి ఊర్మిళలను
తమ్ముడౌ కుశధ్వజుని కూతుళ్ళను
 తరియగా మా జన్మమూ వంశమూ
మహరాజ!నీ సుతుల కిత్తునయ్యా

110.
అనుచు ఆ రాజర్షి సంతసమున
అమ్మాయిలకు పెళ్ళి నిశ్చయించె
శుభమంటు పలికి ఆ పంక్తిరథుడు
తనయులకు వధువులను నిర్ణయించె


111.
శ్రీరామచంద్రునకు ధరణిసుతను
ఊర్మిళను లక్ష్మణుని వధువుగాను
మాండవిని భరతునికి భార్యగాను
శ్రుతకీర్తి శత్రుఘ్ను పత్నిగాను

112.
నిశ్చితార్థము జేయ మిథిలలోన
లోకాల ఆనంద మవధి మీరె
 అరుదైన కళ్యాణ శుభవేళకు
మిథిలయే వేదికై మురిసిపోయె

113.
కులగురువు లిరువురీ సముఖమ్ములో
తమ వంశ చరితలను చెప్పుకొనిరి
కళ్యాణ వేడుకకు శుభ‌ఘడియగా
ఉత్తర ఫల్గుణి ని స్థిరపరిచిరి

114.
తనయుల సమావర్తనపు వేడ్కలోన
తన మనసు తనియగా పంక్తిరథుడు
స్వర్ణ ధన గోదాన విధులతోటి
అర్థులను సంతృప్తి పరచినాడు

 
115.
సర్వాంగసుందరముగా తీర్చిన
కళ్యాణ వేదిపై అగ్ని వ్రేల్చి
వర వరుల నాశీనులను జేసిరి
వధువుల రాక కొరకై వేచిరి



116.
అట్టి శుభ తరుణాన జనకరాజు
అపురూప సౌందర్యవతి సీతను
పెన్నిధిని దైవానికప్పగించు
భక్తుడన వేదిక కు గొనితెచ్చెను

117.
మధురమౌ భావాల మోమువాల్చి
వధువుగా ఒదిగి నిలిచిన సీతను
రాజర్షి రామునకు అభిముఖముగా
కూర్చుండజేసి తా నిటుల పలికె

118.
శ్రీరామ !ఈమెయే నా తనూజ
సుందరి ,సుకుమారి అయోనిజ
మా వంశ ప్రతిష్ఠ కే ప్రతీక
నీడవలె నీ వెంట నడచునింక

119.
ధర్మార్థకామాలలో సర్వదా
కలిమిలేములయందు ఎడబాయక
సాధ్వియై నిన్నీమె అనుసరించు
సహధర్మచారిణిగ స్వీకరించు

120.
అనిపలికి ముదముతో జనకవిభుడు
రామునకు కన్యనే దానమొసగె
ఆదర్శదాంపత్య మిది యగునని
దేవమునిగణము శుభదీవెనొసగె




121.
పిదప అన్నదమ్ములు నలుగురూ
ప్రియముతో ఆ ఆక్కచెల్లెళ్ళను
పాణిగ్రహణము చేయు మూర్తమందు
విరివాన దివినుండి భువిగురిసెను



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
పరశురామ గర్వభంగం
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

122.
వివాహ వేడుకలు ముగిసినంత
వేగమే తిరుగుపయనము చేయగా
మార్గమున భార్గవుడు అడ్డగించె
భయముతో దశరథుడు అంజలించె

123.
జమదగ్ని తనయుడీ మౌనీంద్రుడు
ప్రళయకాలాగ్నివలె దుస్సహుండు
గండ్రగొడ్డలి దాల్చి వచ్చినాడు
త్రిపురాంతకుండైన  శివుని సముడు.

124.
పూర్వమా కార్తవీర్యార్జునుండు
చంపెనీ పరశురాముని తండ్రి ని
దానితో ‌ఈ మౌని‌‌ అలకబూని
నిశ్శేషమొనరించె భూపతులని

125.
నేడితడు ఇటకేల వచ్చినాడో!
అను భయము‌,సంశయము ముప్పిగొనగ
చర్చించుకొని యంత జనకాదులు
అర్ఘ్యపాద్యమ్ములిడి సేవించిరి




126.
మౌనియౌ భార్గవుడు రాము గాంచి
ఘన వీరవరుడవని‌ ప్రస్తుతించి
తన చేతిలోనున్న విష్ణుధనువు
రామునకు చూపుతూ పలికెనిటుల

127.
శివధనువు విరిచి నంతనే రఘువరా!
నీవె పటు  వీరుడవు గానోపవు
నా విష్ణు ధనువునో రామచంద్రా!
నయముతో సంధించి చూపవోయి

128.
ఆ మాటలాలించి‌ శ్రీరాముడు
మునిచేత నున్న ధనుర్బాణమ్ములు
గ్రహియించు నెపముతో అతనిలోని
వైష్ణవీ శక్తినే లాగివేసె

129.
ఆ పిదప‌ సంధించి బాణమ్మును
ఇటులనియె రాముడా మౌనితోటి
పూజ్యుడవు గాన ఓ ! విప్రోత్తమా!
నిను నేను వధియింప వెనుకాడెద

130.
అయిననూ ఎక్కుపెట్టిన బాణము
వ్యర్థమ్ము కారాదు కనుక చెపుమా!
నీ గమన శక్తినే తొలగింతునా!
నీ పుణ్యరాశినే హరియింతునా!

131.
అని అడుగువేళ‌ ఆ భార్గవుండు
గుర్తించి రాముడే విష్ణు వనుచు
హరియించు నా తపోరాశినెల్ల
నేనిపుడె మహేంద్ర గిరి‌చేరెద

132.
అనుటవిని చిరునవ్వుతో రాముడు
అంగీకరించి ఆ వినతి తాను
ఆ పరశురాముని ‌గర్వమణిచి
అతని తపోలోకాలు దహియించెను

133.
భార్గవుడు రాముణ్ణి  ప్రస్తుతించి
మనోవేగమ్ముతో మరలిపోయె
సుగుణాభిరాముడా‌ దివ్యధనువు
ఆ క్షణమె వరుణునకు అప్పగించె


134.
అటుపైన వారంత సంతసాన
పయనించి అయోధ్య జేరుకొనిరి
ఎనలేని దాంపత్య భోగాలతో
అలరారి సుఖశాంతులను పొందిరి

135.
తదుపరి భరతుడూ శత్రుఘ్నుడూ
తమ తండ్రి ఆజ్ఞ నే అనుసరించి
భరతుని మామయౌ యుథాజిత్తుతో
తాతగారింటికి వెళ్ళినారు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
   సీతారాముల‌ దాంపత్యం
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
136.
శ్రీరామలక్ష్మణులు రాజ్యమందు
తలిదండ్రి సేవలో తరియించుతూ
ధర్మానురక్తులై చరియించుతూ
ఎల్లరకు ఇష్టులై మెలగినారు

137.
పతిసేవయే పరమధర్మ మనుచు
సౌందర్య సౌశీల్య సహనాలతో
మెలిగేటి సీతపై రాముమదిలో
  దినదినము అనురాగమధికమయ్యె

138
మరియాద మన్నన ఎరిగినట్టి
రఘువరుడు పతిదేవుడగుట చేత
సీతకా శ్రీరామ‌చంద్రు‌నెడల
ప్రేమమ్ము ద్విగుణమ్ము గానైనది

139.
శ్రీ రామ చంద్రుని హృదయమ్ములో
సతతము‌ నిలిచినది‌‌ సీతమ్మయే
సాధ్వియౌ‌ సీతకీ‌ జగతిలోన
సకలమూ తానయ్యె శ్రీ రాముడే

140.
  నేటికీ  ఇలలోన ఈ జంటకు
సాటియౌ దంపతులు కానరారు
     అన్యోన్యమైనట్టి దాంపత్యము
అనగానె స్ఫురియింతు రాయిర్వురు

141.
ఈ కథను మనసార విన్నంతనే
 కలుషమ్ములన్నియూ అంతరించు
సర్వులకు రాముడాదర్శమైతే
శ్రీ రామ రాజ్యమే‌ అవతరించు

142
ఇనవంశ తిలకుని దివ్యకథలో
సంపూర్ణ మైనదిక బాలకాండ 
ఇంపుతో జనులార!కోరివినిన
 తీరేను మదిలోని ప్రతికోరిక.

సింహాద్రి‌ జ్యోతిర్మయి విరచిత 

గేయ రామాయణం 

బాలకాండ  సంపూర్ణం.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁👾👾👾👾👾👾👾👾👾👾🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁




Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ