14. ఊహలు---ఊసులు
1.మనసెరిగిన స్వామి
2.బోధ...నా..వృత్తిలో
3.నాలోని నేను
4.ఎన్నిసార్లు ప్రేమలో పడ్డానో!
5.తరం మారుతున్నది
6.నాన్నతో నా ఊసులు.. చైతూ
7.కరోనా కాఠిన్యం లో తల్లడిల్లుతున్న ఓ నాన్న మనసు
8.నాన్నగారికో లేఖ
9.సంసారం-సంస్కారం
10.హనుమజ్జయంతి
11.నా ఉద్యోగానుభవాలు-1
12.ముప్ఫై ఏళ్ళనాటి ముచ్చట్లు
13.మార్కులు-పాయింట్లు
14.అత్తమ్మ స్మృతి లో
15.ఆ కాపురం -ప్రేమ సుధాపూరం
16.జై చిరంజీవ
17.సంసారంలో సరిగమలు
18.అనింద్య గణపతి
19.ఏది బెటర్?
20.అసలు పాసవుతానా!
21 చిన్న తమ్ముడు
22.శాడిస్ట్ అత్తగారు
23.సంధ్యా దీపం
24.నాన్నగారితో నా ప్రయాణం
25.అతను ఏమయ్యాడో!
26.అవసరమా!
27.ఆటోవాలా
28.మూడుముళ్ళబంధం..ముప్ఫైమూడళ్ళదిశగా
29.పెను విషాదం
30.నేను-నా కాఫీ ముచ్చట్లు
31.పుస్తకం-నా నేస్తం
32.అతడు,ఆమె అ..సమానం
33.మీకు అర్థమౌతోందా! తెలుగు సినిమాలు
34.వినాయకుడు అమాయకుడు
35.మన (వరాల) తెలుగు
36.ఎందుకంటే ప్రేమంట
37.నా ముగ్గు ముచ్చట్లు
38.ఇంతమాత్రమైనా చేయలేమా
39.నివురుగప్పిన నిప్పు చిలకమర్తి వారి గణపతి
40.ఈ పయనం ఎటువైపు?
41.మౌనమె నా భాష
42.ఎలా పెంచుతున్నాం పిల్లల్ని?
43.నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
44.అమ్మానాన్నలు నాకిచ్చి పోయిన ఆస్తి (పుట్టింటి ఐశ్వర్యం)
45.స్వాగతం చెబుదామా!
46.కల నిజమాయెగా
47.ఈ జిల్లా నాకేమిచ్చింది?
48.నిన్నటికి నేటికి ఎంత మార్పు?
49.ఈ ఒక్కరోజు మీదే
50.ఇది ప్రేమంటారా!
51.ఎవరున్నారు పాపా!
52.నేనే కూతురు నేనే తల్లి
53.అపురూపమైన బంధం
54.కరోనాలో పనిమనుషులు
55.సహ(న)జీవనం
56.సిగ్గుపడుతున్నాను
57.మానవ (రాత్రి) ఉత్సవాలు
58.ఆశ్రమంతో నా అనుబంధం
59.గ్లాసెడంత చరిత్ర
60.కృతజ్ఞతాంజలి
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
1.*మనసెరిగిన స్వామి*
నేను తిరుపతి
వెళితే నేను తప్పకుండా, ఇష్టం గా తినే టిఫిన్ పొంగల్.
శరవణా భవన్ , లేదా హోటల్ భీమాస్ లోని మాయా రెస్టారెంట్ లోనో చాలా బాగుంటుంది.కానీ ఈసారి టైం కుదరక మాకు దగ్గరలో ఉన్న హోటల్లో తినేశాము.నాకు పెద్దగా నచ్చలేదు.
రుచి చాల సుఖమా!
స్వామి సన్నిధి సేవ సుఖమా!
అని స్వామి దర్శనానికే వీలు చిక్కలేదు.
ఇక పొంగలనగా ఎంత?
అనుకుని నిట్టూర్చానా!
నా మనసెరిగిన స్వామి సాయంత్రం శ్రీనివాస మంగాపురం లో దర్శనమిచ్చి, వేడి వేడి పొంగలిని ప్రసాదం గా అనుగ్రహించారు.
హోటల్లో పొంగలి తినలేకపోయానని నీకు దిగులెందుకు ? నా నైవేద్యాన్నే నీకు పెడతానని చెప్పకనే చెప్పినట్లు లేదూ!
నేతి ఘుమఘుమలతో వేడి
వేడి ఆ ప్రసాదాన్ని ఆకు దొన్నె లో అందుకుని రెండుసార్లు తెచ్చుకుని మరీ ఆరగించాము.
మనసెరిగిన వాడు
మా దేవుడు
శ్రీనివాసుడు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.9.2019
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
2.*బోధ..నా వృత్తి కిక సెలవు...*
1993 జూన్ 16 వ తేదీన నా 26 వ ఏట నేను డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్ గా నా ఉద్యోగ జీవితం ప్రారంభించాను.
ఈ 29 ఏళ్ళలో నేను పనిచేసిన విద్యాసంస్థలు
1.
1993 నుండి 2008
వరకు
15 సంవత్సరాలు
*PNC&KR డిగ్రీ కాలేజీ* నర్సరావుపేటలో
తెలుగు లెక్చరర్ గా పనిచేశాను.
ఇందులోనే ఒక్క ఏడాది ఉదయం పూట (అప్పట్లో PNC కాలేజీ లో ఇంటర్ వాళ్ళకి ఉదయం పూట,మా డిగ్రీ వాళ్ళకి మధ్యాహ్నం పూట కాలేజీ జరిగేది)
పార్ట్ టైమ్ గా సత్తెనపల్లి *కృష్ణవేణి జూనియర్ కాలేజీ* లో ఇంటర్ వాళ్ళకి సంస్కృతం ,
మరొక ఏడాది *కృష్ణవేణి జూనియర్ కాలేజీ*
నర్సరావుపేట బ్రాంచ్ లో సంస్కృతం చెప్పాను.(ఆశకు లొంగిపోయి,మీరు మంచి లెక్చరర్ అన్న పొగడ్తలకు పొంగిపోయి పెట్టిన పరుగులకు,పెంచుకున్న ఒత్తిడికి వచ్చిన బహుమతి B.P.)ఆ తరువాత కాలేజీ ఫుల్ డే గా మార్చటంతో ఇంటర్ బోధన వదిలేశాను.
2.
2008 to 2009
1 సంవత్సరం
*కృష్ణవేణి డిగ్రీ కాలేజీ* నర్సరావుపేటలో డిగ్రీ పిల్లలకి తెలుగు,సంస్కృతం చెప్పాను.
3.
2009 నుండి 2013 వరకు ఒంగోలు లోని
*ఇండియన్ బ్లోజమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్* లో హైస్కూల్ తెలుగు టీచర్ గా పనిచేశాను.
4.
2013 లో ఒంగోలు *సాయిబాబా సెంట్రల్ స్కూల్* లో హైస్కూల్ టీచర్ గా (6నెలలు)పనిచేశాను.
5.
2014 నుండి 2016 వరకు
2 సంవత్సరాలు
*ఒంగోలు పబ్లిక్ స్కూల్* (ఒంగోలు) లో హైస్కూల్ టీచర్ గా పనిచేశాను.
2016 నుండి 2017 వరకు ఒక అకడమిక్ ఇయర్ (మా వారికి ట్రాన్స్ఫర్ కావడంతో గిద్దలూరు వెళ్ళిపోయాం) ఖాళీగా ఉన్నాను.
6.
మళ్ళీ
2017 నుండి 2022
ఏప్రిల్ 30 వరకూ అంటే ఈ రోజు వరకూ ఈ
5 సంవత్సరాలు ఒంగోలు పబ్లిక్ స్కూల్ లోనే హైస్కూల్ తెలుగు టీచర్ గా పనిచేసి ప్రస్తుతం
మావారు రిటైర్ అయి ఇంటిపట్టున ఉండటం,మనవరాళ్ళు పుట్టి అప్పుడప్పుడూ అయినా వారి వద్దకు వెళ్ళాలని మనసు లాగటం,
వంటి కారణాల రీత్యా
ఈ 29 ఏళ్ళ నా ఉద్యోగ జీవితం నుండి ఇక విశ్రాంతి తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను.అంటే కేవలం
టైమ్ టేబుల్ కి,
ప్రత్యక్ష బోధనకు మాత్రమే విశ్రాంతి ఇస్తున్నాను గానీ నా
బోధనకు కాదు.ఎందుకంటే పిల్లలకు పాఠం చెప్పాలి అనే నా ఆశ,నా ఉత్సాహం,నా తపన ఇంకా తీరనేలేదు.
పిల్లలకు నాకు తెలిసిన విషయాలను ఏదో ఒక రూపంలో అందించటంలోనే నా మనసు ఆనందంగా ఉండగలదు అనిపించింది.
అందుకే
అతి
త్వరలోనే
*మన(..వరాల) తెలుగు*
అనే పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ ఒకటి ప్రారంభించి
*అమ్మమ్మ పద్యాలు*
*నాన్నమ్మ పాఠాలు*
వినిపించబోతున్నాను.
ఇందులో కూడా రాణించగలననే నమ్మకం ఉంది.
ఇంతకాలం వృత్తే ప్రవృత్తిగా జీవించాను. ఇకపై
నా ప్రవృత్తినే వృత్తి గా కొనసాగించాలనుకుంటున్న నా ఆశకు,ఆశయానికి ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షం లభిస్తుందని నమ్ముతూ....
రేపు నా ఉద్యోగ జీవితం లోని సాధకబాధకాలు కూడా తీరికగా మీతో పంచుకుంటాను.
సింహాద్రి జ్యోతిర్మయి
30.4.2022
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
66 లో పుట్టి,
60 కి మరో
5 ఆమనుల దూరంలో ఉన్న ఈ ......
3.*నాలోని నేను*
*సింహా (ద్ర్య) వలోకనం*
ఒక్కసారి నా 55 ఏళ్ళ జీవన గమనాన్ని సింహావలోకనం చేసుకుని,నా ఇష్టానిష్టాలను, ఆశలను, అభిరుచులను ఇలా ఒకచోట పోగేసుకుని రాసుకుందాం అని అనిపించగా చేసిన ప్రయత్నమిది.
నా ఇష్టదైవం..
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి🙏
ఇష్టమైన పేరు..
రాజశేఖర్😍
ఇష్టమైన వ్యక్తి.. రాజశేఖర్
నాకు బాగా నచ్చిన వేడుక..
నా పెళ్ళి
30 ఏళ్ళ తర్వాత మళ్ళీనచ్చిన వేడుక నా కూతురి పెళ్ళి
నాకు నచ్చిన టిఫిన్...పూరీ
నాకు నచ్చిన వస్త్ర ధారణ..కాటన్ చీర, లంగా ఓణీ కూడా (కానీ ఇప్పుడు వేసుకోనులెండి)
నచ్చిన సినిమాలు.. మిస్సమ్మ, నర్తనశాల
ఇష్టమైన నటులు..SV రంగారావు, చిరంజీవి.
నటీమణులు..సావిత్రి, భానుప్రియ.
ఇష్టమైన పాట..
ఆదిభిక్షువు వాడినేది కోరేది?
ఇష్టమైన కూర..
కాకరకాయ
ఇష్టమైన పిండివంట.. పులిహోర.
ఇష్టమైన స్నాక్స్. కార్న్ తో చేసినవి ఏవైనా సరే.
నవరసాలలో ఇష్టమైనది.. అద్భుత రసం
సినిమాలలో నాకు నచ్చే రసం..హాస్యం
నచ్చిన మాటల రచయిత..పింగళి, త్రివిక్రమ్ శ్రీనివాస్
నచ్చిన గాయని.. జిక్కి
నచ్చిన గాయకుడు.. ఘంటసాల
నచ్చిన దర్శకుడు..ఆదుర్తి సుబ్బారావు
నచ్చిన సంగీత దర్శకుడు.. ఘంటసాల
నచ్చిన సాహితీ ప్రక్రియ..పద్యం
ఇష్టమైన ఊరు..
హైదరాబాద్
నచ్చిన నవల..మీనా
నాకు నచ్చిన ప్రాచీన కవి..పోతన
ఆధునిక కవి.. కరుణశ్రీ
తీరని కోరికలు..
వీణ నేర్చుకోవడం, స్వర్గీయ
ఎన్టీఆర్ గారిని ప్రత్యక్షంగా చూడాలనుకోవడం
భయపడే విషయం.. విమానం ఎక్కడం
నన్ను బాగా బాధ పెట్టిన విషయం.. 16 సంవత్సరాల పాటు చేసిన ఉద్యోగం లోనుండి తెలుగు చదివే పిల్లలు తగ్గిపోయారని నన్ను తొలగించడం
నేను చూసిన రెండే రెండు సీరియల్స్..
1.ఋతురాగాలు (తెలుగు డిడి 8)
2.బాలికా వధూ ( హిందీ కలర్స్ టీవీ ఛానల్ లో ప్రసారం అయ్యేది. ఇది కూడా విసుగు పుట్టి చివర్లో మానేశాను చూడటం)
నచ్చిన గేమ్ షో..కౌన్ బనేగా కరోర్ పతి
నచ్చిన హిందీ హీరో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్
నచ్చిన యాంకర్...సుమ
నచ్చిన స్పోర్ట్.. జిమ్నాస్టిక్స్
నేను ఇష్టం గా చూసే గేమ్.. క్రికెట్ 🏏(ఒకప్పుడు, ఇప్పుడు పెద్ద చూడటం లేదు.)
నచ్చిన క్రికెటర్.. హర్యానా హరికేన్ కపిల్ దేవ్
నాకు అమితంగా నచ్చిన హిందీ సినిమా..ఆరాధన (రాజేష్ ఖన్నా)
నాకు నచ్చిన హిందీ పాట..యే మేరె వతన్ కీ లోగో
నా సంతృప్తి..నా ఉపాధ్యాయ వృత్తి
పశ్చాత్తాపపడే అంశం... జీవితంలో విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం
చాలా
అసహనం కలిగించే విషయం... ఎదుటి వారు
సమయాన్ని పాటించకపోవడం
నాకున్న మంచి అలవాటు... సమయాన్ని పాటించడం
నాలో నాకే నచ్చనిది..నా బద్దకం
నాలో నాకు నచ్చేది.. నన్ను ఎవరైనా తిట్టినా,అపకారం చేసినా క్షమించగలగటం,
త్వరలోనే మర్చిపోగలగటం.
నాకంటే చిన్నవాళ్ళయితే పిల్లలతో పంతమేంటి అనుకుంటాను.
నా కన్నా పెద్దవాళ్ళయితే ..పెద్దవారు ఒక మాట అంటే,మనం పడితే తప్పేంటి అనుకుంటాను.
నా స్వభావం..పైకి కూల్ గా కనిపిస్తూ,లోపల టెన్షన్ పడిపోవటం
నా ఆస్తి... పుస్తకాలు📚
నా బలగం.. స్నేహితులు
నా బలం..మా ఆయన(😍)
నా బలహీనత..అది కూడా మా ఆయనే (😜)
ఒక మధురానుభూతి... తొలిసారి తల్లిని కావడం(ఒక మంచి కొడుక్కి తల్లిని అయ్యానని తరువాత తెలిసింది)
నాలోని సుగుణం.. స్నేహం కలుపుకోవడం,కలుపుకున్న స్నేహాన్ని నిలుపుకోవడం
నాలోని దుర్గుణం..నా పనిని నేనే మెచ్చుకుంటూ ముచ్చటపడిపోవడం,ఇతరుల పనికి వంకలు పెట్టడం
అభ్యాసం చేయాలి అని అనుకునే ఒక మంచి అలవాటు..
ఒక పని చేసేముందు,
ఒక మాట అనే ముందు,
ఒక ఖర్చు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి అని అనుకోవడం(ఇది ఈ మధ్యనే అనుకున్నాను.పాటించే ప్రయత్నమూ చేస్తున్నాను.కొంతవరకూ చేయగలుగుతున్నాననే అనుకుంటున్నాను.)
వదిలించుకోవాలి అనుకునే ఒక చెడ్డ అలవాటు..
రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు సెల్ఫోన్ వాడకూడదు అని ఈ రోజు నుండి నిర్ణయించుకోవడం.
వదిలించుకోలేని, వదిలించుకోవాలి అని అనుకోబోని అలవాటు...అందరూ వద్దు మొర్రో అంటున్నా వినకుండా పాటలు పాడటం 😜🎤🙈
గర్వపడే అంశం.. ఆచారి గారి అమ్మాయిని అని చెప్పుకోవడం
జీవితం గనుక వెనక్కి వస్తే చేయకూడదు అని అనుకునే తప్పు...నేను మనసులో ఎంతగానో ప్రేమించే నా కూతుర్ని తిట్టకుండా , బాధపెట్టకుండా మళ్ళీ చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచాలి అని అనుకోవడం 😔
నాకు నచ్చిన వాహనం.. ఏసీ స్లీపర్ బస్సు🚎
నాకు నచ్చిన విహారం..కారులో దూర ప్రయాణం
ఒక మధుర జ్ఞాపకం..మా ముప్పై ఏళ్ల వివాహ వార్షికోత్సవానికి మా చిన్నతమ్ముడు,మరదలు అమెరికా నుంచి వచ్చి మమ్మల్ని కేరళ ట్రిప్(spice village resort ⛵,Thakkadi) కి తీసుకెళ్ళడం.
నా సరదా.. షాపింగ్,నెయిల్ పాలిష్ వేసుకోవడం
నా అభిరుచి.. కవిత్వం రాయడం
నా కలం పేరు... *సింహాద్రి*
నా బ్లాగ్ పేరు...*జ్యోతిర్మయం*
నా వీలునామా..నా తదనంతరం నా పుస్తకాలు మన ప్రకాశం జిల్లా గ్రంథాలయానికి బహూకరించడం
నాకు నచ్చే పిలుపు..వదిన,అత్త
ఎక్కువ మంది స్నేహితుల్ని ఇచ్చిన ఊరు.. ఒంగోలు
అపురూపమైన బంధం..నా చిన్న తమ్ముడు
అపురూపమైన కానుకలు..నా మనవరాళ్ళు
ఈ ప్రపంచంలో నన్ను భయపెట్టగలిగే ఏకైక వ్యక్తి,
నా ఆవేశానికి స్పీడ్ బ్రేకర్,నా గురువు,ఫిలాసఫర్,మార్గదర్శి ,కష్టంలో నా మనసు తలుచుకునే ఏకైక తోడు,నా ప్రియమైన శత్రువు.. మా పెద్ద తమ్ముడు శ్రీరామమూర్తి
నేను గర్వపడే బంధాలు..నా తమ్ముళ్ళు,నా పిల్లలు
నా ఆశ..నా పిల్లలు కూడా నేను,మా తమ్ముళ్ళలాగే ఎప్పటికీ ప్రేమగా ఉండాలని
నా ఆశయం...పిల్లలకు తెలుగు నేర్పడానికి ఒక యూ ట్యూబ్ ఛానెల్ త్వరలో ప్రారంభించాలి అనుకోవడం
నా ఛానెల్ పేరు...
*మన...వరాల తెలుగు*
జీవితం ఇంకెన్ని అవకాశాలను,ఆనందాలను,ఆందోళనలను , సుఖదుఃఖాలను,ఆయుష్షును ఇస్తుందో చూడటానికి నన్ను నేను సంసిద్ధం చేసుకుంటూ...ఈ 56 వ పుట్టినరోజు ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
Now I am 55+
ఇంక 5 ఏళ్ళ వరకూ ఇంతే.🤣🤣
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.8.2021
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
4.🌹 ఎన్నిసార్లు ప్రేమలో పడ్డానో తెలుసా!🌹
ఔను, నేను అంటున్నది, మీరు వింటున్నది నిజమే.నేను చాలా సార్లు ప్రేమలో పడ్డాను.
రాజశేఖర్
రాజశేఖర్
రాజశేఖర్
మొదటిసారి ఈ పేరుతో ప్రేమలో పడ్డాను.
నా చిన్నతనం నుండి ఎందుకో తెలీదు గానీ ఈ పేరంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం.
విచిత్ర కుటుంబం,
సెక్రటరీ,
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈ సినిమాలు చూసినప్పుడు ఆ పేరు నా మనసులో అందంగా ముద్రించుకుపోయింది.అష్టాచమ్మా సినిమాలో చెప్పినట్లు ఆ పేరులో ఏమి వైబ్రేషన్స్ ఉన్నాయో,అవి ఎలా నా మనసునుండి అతనిని తాకాయో కానీ,
సరిగ్గా 33 సంవత్సరాల క్రితం 1987 జులై నెలలో 7 వ తేదీన అదే పేరున్న ఒక అందమైన రూపం తొలిచూపులోనే నా మనసులో నిలిచిపోయింది.అతనిని మా సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో మా తెలుగు డిపార్ట్మెంట్ లో చూసిన ఆ క్షణం లో నాకు తెలియదు నా మనసుకు నచ్చిన ఆ వ్యక్తి పేరు రాజశేఖర్ అని.
*తెలుసా !మనసా!
ఇది ఏ జన్మ సంబంధమో !* అన్నట్లు నాకు నచ్చిన రూపం, నచ్చిన పేరు ఒక్కరిదే కావటం ఆ తిరుమల వెంకన్న కు నాపై గల అపార అనుగ్రహం గానే నేను భావిస్తాను.
నా అదృష్టం కొద్దీ అక్కడ ఉన్న 10,15 మంది అమ్మాయిలలోనూ అతని చూపులు నన్నే త noదేకంగా చూడటం గమనించాను.(నా కంటే చాలా అందమైన అమ్మాయిలు ఆ గుంపులో ఉన్నారండోయ్.)అందుకునే నా అదృష్టం అన్నాను మొదటే.
తొలిరోజు, తొలిసారిగా నేను చూసిన అతను అదే డిపార్ట్మెంట్ లో మా సీనియర్ అని మా మేనమామ సోమయాజుల సూర్యనారాయణ (ఆయన అక్కడే మా తెలుగు డిపార్ట్మెంట్ లోనే సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవారు)పరిచయం చేశారు.మా మేనకోడలోయ్ అంటూ నన్ను అతనికి పరిచయం చేశారు. అలా అలా
ఆ చూపులు పరిచయమై ,పరిచయం స్నేహమై, స్నేహం ప్రణయమై,ప్రణయం పరిణయమై,పరిణయం నిత్య వసంతమై సాగిన నా జీవితంలో అతనితో మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడిన,పడుతున్న సందర్భాలెన్నో,ఎన్నెన్నో!
మనం పెళ్ళి చేసుకుందాం అని నేను అడిగినప్పుడు, మా ఇద్దరి మధ్య ఉన్న సామాజిక అంతరాన్ని వివరించి చెప్పి, వివాహం తో ఎదుర్కోబోయే సమస్యలను ఏకరువు పెట్టి నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పుడు
పెళ్ళికి ఇరువైపులా అందరినీ ఒప్పించి,మెప్పించి కట్నకానుకల ప్రస్తావనే లేకుండా , నా మెడ లో మూడు ముళ్ళు వేసి నప్పుడు,
అప్పటికీ,ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేని ఆయన ప్రేమను తలచుకున్నప్పుడు,
ఆయన అందంగా ఓ చిరునవ్వు నవ్వి నప్పుడు(మా ఆయన నవ్వటం బహు అరుదు సుమండీ!( ఏం చేయనే!వాడు బాగుంటాడు అని *అతడు* సినిమాలో త్రిష డైలాగ్ లాగా, నవ్వకున్నా ఆయన బాగుంటారు మరి.ఏం చేద్దాం! ఆయనకు నేను,మా తమ్ముళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు విసుగు వీరుడు😍)
ఏం వండి పెట్టినా ఎప్పుడూ ఎలాంటి వంకలు పెట్టకుండా బుద్ధిగా తినేస్తున్నప్పుడు (చాలా బాగా కుదిరినప్పుడు మాత్రం జ్యోతీ!మనమింక ఒక హోటల్ పెట్టుకోవచ్చమ్మాయ్ అని అంటుంటారు)
బయటి నుండి రాగానే గుమ్మం లో నేనెదురుపడితే *మా అమ్మ ఏదమ్మాయ్ * అని అడుగుతున్నప్పుడు, ( మా అత్తగారంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ.ప్రస్తుతం ఆవిడ లేరు లెండి.)
అలాగే నేను కనపడకపోతే వాళ్ళ అమ్మని జ్యోతి ఏదమ్మా అని అడుగుతున్నప్పుడు,
ఏ కాస్త నలతగా ఉన్నా జ్యోతీ!మా అమ్మ కావాలమ్మా !అని బేలగా అడుగుతున్నప్పుడు
పిల్లలంటే పంచ ప్రాణాలైనా, వాళ్ళు నన్ను బాధపెడితే కోపం తెచ్చేసుకున్నప్పడు
( మా అమ్మాయి ఇప్పటికీ అంటుంటుంది ,అలుగుతుంటుంది, డాడీకి మా కంటే నువ్వంటేనే ఇష్టమని)
ఆయన ఆఫీస్ కొలీగ్స్ ఆడవాళ్ళు నేనెప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు మేడమ్! సర్, ఎంత మంచివారు! మమ్మల్ని సొంత అక్కచెల్లెళ్ళలాగా ఎంతో ఆదరంగా , ఆప్యాయంగా చూస్తారు , సార్ అంటే మాకందరికీ చాలా ఇష్టం, మీరు చాలా లక్కీ . సార్ తరువాత ఎంతమంది MPDO లు వచ్చినా,మాకు మాత్రం MPDO అంటే రాజశేఖర్ గారే అని వాళ్ళు ఆప్యాయత కురిపించినప్పుడు (ఆయనకు సొంత అక్కాచెల్లెళ్లు లేరు.మా అత్తగారికి ఆరుగురూ మగపిల్లలే)
విధినిర్వహణలో నీతి నిజాయితీలతో, సమర్ధతతో అనేకమైన అవార్డులు అందుకున్నప్పుడు,
తాను తప్పు చేయనప్పుడు ఎంత పెద్ద అధికారినైనా లెక్కచేయక ఒడిదొడుకులు,అవమానాలు ఎదురైనా భరించిన ఆయన ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం చూసినప్పుడు,
మా ముప్ఫై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఎంత కోపం వచ్చినా ఎప్పుడూ నన్ను చెయ్యెత్తి కొట్టలేదని తలచుకున్నప్పుడు ( నాకు ఆడవారిపై చేయి చేసుకునే మగవారంటే అసహ్యం.అది తండ్రి,అన్న, భర్త ఎవరైనా కావచ్చు)
మా ముప్ఫై మూడేళ్ళ జీవితంలో ఆయన ఎప్పుడూ నువ్వంటే నాకిష్టం అని,ఐ లవ్ యూ అని ఒక్కసారి కూడా చెప్పకపోయినా ఆ కళ్ళల్లో తొణికిసలాడే ప్రేమను చూసినప్పుడు,
నా పనిలో నేను బిజీ గా ఉంటే
*నన్ను కొంచెం పట్టించుకోమ్మాయ్* అని చిన్నపిల్లాడిలా అడుగుతున్నప్పుడు
చేతిలో చాలా డబ్బులు ఉన్నరోజున,ఒక్క రూపాయి కూడా లేని రోజున కూడా తొణకకుండా నిబ్బరంగా, సంతోషంగా ఉన్నప్పుడు,
తన పిల్లల్లాగే నన్ను కూడా ఒక చిన్న పిల్లగా ట్రీట్ చేసేటప్పుడు
ఆయన జీవితంలో ఎన్నో ప్రాధాన్యత లున్నా మనసులో మాత్రం అమ్మ, జ్యోతి, చిన్నమ్మ , చిన్నోడు (మా పిల్లలు) ఈ నాలుగు పేర్లే సదా ప్రాధాన్యత ను సంతరించుకున్నాయని తలచుకున్నప్పడు,
తల్లిని అంతగా ప్రేమించే ఒక సంస్కారవంతుడికి భార్యనని తలచుకున్నప్పుడు
జ్యోతీ!అని ఆయన తీయగా నన్ను పిలిచినప్పుడు
ఇంట్లో కాస్త పని ఎక్కువైతే,అయ్యో! నీకు పని ఎక్కువైపోయింది.ఆ పని ఆపేసి కొద్దిసేపు వచ్చి కూర్చుని రెస్ట్ తీసుకో జ్యోతీ అని అన్నప్పుడు
నేను ఇల్లు సర్దితే చూసి నీట్ గా ఉందమ్మాయ్ అని మెరిసే కళ్ళతో మెచ్చుకున్నప్పుడు
ప్రస్తుతం అల్లుడు,కోడలు,ఒక మనవరాలు వచ్చి వాళ్ళ సంసారాలు వాళ్ళకు ఏర్పడినా, పిల్లలకు ఏదైనా ఇవ్వటమే గానీ ,వాళ్ళ నుంచి ఏ రకంగానూ ఏమీ ఆశించని ఆయన నిర్మలమైన,నిస్వార్థమైన హృదయాన్ని చూసినప్పుడు
పెంచుకున్న ఒక చిన్నారి పై కూడా ( ఆ పాప గిద్దలూరు లో మా పక్కింటి వాళ్ళ పాప.మమ్మల్ని అమ్మమ్మా తాతయ్యా అంటుంది.తరచూ మా దగ్గర కు వస్తుంటుంది) అవ్యాజమైన ప్రేమను పంచే నిష్కల్మషమైన హృదయాన్ని చూసినప్పుడు
ఇలా ప్రతీ క్షణం, ప్రతీ సందర్భంలోనూ ఆయనతో నేను ప్రేమ లో పడిపోతూనే ఉన్నాను.పడిపోతూనే ఉంటాను.
ఇన్ని చెప్పానని ఆయన పై నాకు కోపం వచ్చిన సందర్భాలు లేవా! అని అనుకోకండి.అవి కూడా బోలెడు ఉన్నాయి. ముందే చెప్పాను కదా మా ఆయన పెద్ద విసుగు వీరుడని.
కానీ ఆయన చూపించే ప్రేమ ముందు అవన్నీ సూర్యుడి ముందు దివిటీల్లా వెలవెలబోయి, వెలలేని ఆ ప్రేమ మాత్రమే మనసులో దేదీప్యమానమై ఈ *జ్యోతి* లో వెలుగుతుంటుంది. అలాంటి
ప్రియాతిప్రియమైన
మా శ్రీవారు నేటికి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 62 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ పుట్టిన రోజున
ఆయనకు నా శుభాకాంక్షలు.
మరి మీరు కూడా మా శ్రీవారికి మీ శుభాకాంక్షలు అందజేస్తారు కదూ!
సింహాద్రి జ్యోతిర్మయి
W/O జంగం రాజశేఖర రావు
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.9.2020.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
5. 💅 తరం మారుతున్నది
మా తరం మారుతున్నది 💅
కాలం అనంతం.మానవ జీవనగమనంలో మార్పులు అనివార్యం.
ఆటవికుడిగా జీవించిన మానవుడు అత్యంత ఆధునికతను అందుకునే వరకు జరిగిన పరిణామక్రమంలో కుటుంబ వ్యవస్థ ఏర్పడి,బలపడి, ప్రస్తుతం బలహీనపడి నేటికి మానసికమైన ఒంటరితనం అనుభవించే స్థితికి వచ్చేశాడు. దీనికి కారణాలేమిటి?సమస్య ఎక్కడుంది? పరిష్కారం ఉందా!లాంటి విషయాలన్నీ నాకున్న అనుభవం, అవగాహన మేరకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
పదిలమైన, ప్రశాంత మైన మనుగడ సాగించడానికి మనిషికి తొలి ఆలంబన కుటుంబమే.తల్లిదండ్రులు, అన్నదమ్ములు ,పిల్లలు , పనివాళ్ళు పదిమందితో కూడినదే కుటుంబం అని పాతకాలపు నిర్వచనం కుటుంబానికి.మనం పాత సినిమాల్లో చూస్తే నమ్మినబంటులా యజమానిని అంటిపెట్టుకుని ఉండే పనివాడు కూడా ఒకప్పుడు కుటుంబం లో ఒక భాగమే అనే విషయం అర్థమవుతుంది.ఈ రోజుల్లో కూడా అందరికీ పనిమనుషులు ఉన్నారు కానీ వాళ్ళకి యజమానులపై అభిమానం కానీ, యజమానికి వారిపై ఆదరణ కానీ ఉండటం లేదనే చెప్పాలి.ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ అవసరాలే ప్రధానమై ఆ బంధం బలహీనపడి పోయింది.
ఇక రెండవదిగా ఈ ఉమ్మడి కుటుంబ బంధం నుండి బయటకు వచ్చినవాళ్ళు అన్నదమ్ములు. వృత్తి విద్యలు వెనుకబడటం, ప్రవృత్తులు మారిపోవడం, చదువులు ,ఉద్యోగాల పేరిట ఊరుదాటి పట్టణాలకు, పరాయి దేశాలకు వలస పోవడం,సంపాదనలో వ్యత్యాసాలు, ఆస్తి తగాదాలు, డబ్బు ఒక్కటే ప్రాధాన్యత ను సంతరించుకోవడం వంటి అంశాలన్నీ ప్రధాన పాత్ర ను పోషిస్తూ అన్నదమ్ముల అనుబంధాన్ని అతుకులబొంతగా మారుస్తున్నాయి.
ఇక నా ప్రధాన విశ్లేషణాంశమైన తల్లిదండ్రుల విషయానికి వస్తే ఉమ్మడికుటుంబ భావన విచ్ఛిన్నం కావడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా తక్కువేమీ కాదు అన్నది నా అభిప్రాయం.
ఎందుకంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.ఆ ఉరుకులపరుగుల జీవితంలో పిల్లలతో మానసికమైన దగ్గర తనాన్ని కోల్పోతున్నారు.చదువుల పేరుతో చిన్నతనం లోనే పిల్లలను దూరంగా పంపి హాస్టల్స్ లో ఉంచడం, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ను తెలియజేసే విషయాలు,కథలు,సంఘటనలు చెప్పకపోవడం, మేం సంపాదించేదంతా మీ కోసమే అంటూ ,ధనం పట్ల వ్యామోహం కలిగేలా ప్రవర్తించటం,
కులాన్ని బట్టి,చదువును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి,పేరు ప్రఖ్యాతులు పలుకుబడిని బట్టి కట్నాలు ,లాంఛనాలు నిర్ణయించటం, అలాంటి భావాలను చిన్నతనం నుండి పిల్లల్లో పెంచిపోషించటం,పిల్లలు ప్రవర్తనపై, స్నేహాలపై నియంత్రణ లేకపోవడం వంటివన్నీ తల్లిదండ్రుల వైఫల్యమే నని నేను భావిస్తాను.
8 వ తరగతి తెలుగు వాచకం లో ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠంలో ఉన్న
*పిల్లల సమస్త సద్గుణాలకు, దుర్గుణాలకు ఇల్లే పునాది*
అనే వాక్యం అక్షరసత్యం అని నేను నమ్ముతాను.
పిల్లలను పెంచడం లోనే కాదు, తల్లిదండ్రుల ఆలోచనా విధానం లో కూడా ఈనాడు ఎంతో మార్పు వచ్చింది.
ఒకప్పుడు పిల్లలకు పెళ్లిళ్లు చేశాక ఇక తమ జీవితం కొడుకు నీడలోనే వెళ్ళిపోవాలని,మనుమల ముద్దు ముచ్చట్లు తో మురిసిపోతూ కృష్ణా రామా అనుకుంటూ శేషజీవితాన్ని గడపాలని
తల్లిదండ్రులు భావించేవారు.కొడుకులతో, కోడళ్ళతో వచ్చే చిన్న చిన్న భేదాభిప్రాయాలను పట్టించుకునేవారుకాదు.
అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల , అత్తామామల సాధింపులను,సణుగుళ్ళను ముసలితనపు ఛ చాదస్తంగా భావించి
సర్దుకుపోయేవాళ్ళు.
కానీ ఇప్పట్లో అత్తాకోడళ్ళు ఇద్దరూ ఉన్నత విద్యావంతులే.ఇద్దరికీ సొంత వ్యక్తిత్వం, కొన్ని నిశ్చితమైన అభిరుచులు, అభిప్రాయాలు ఉంటున్నాయి.అత్తగారి వయసును గౌరవించటం కోడలికి తెలియదు.కోడలి మాటలు,చేతలు పోనీలే ఏదో చిన్నతనం అని క్షమించడం అత్తగారికి తెలియదు.
తల్లిదండ్రులకు కూడా ఆర్థిక స్వావలంబన ఉండటంతో పిల్లల దగ్గర ఉండి అభిప్రాయభేదాలెందుకు? హాయిగా మనపాటికి మనం ఉందాం.ఏ పండుగకో, పబ్బానికో చుట్టపుచూపుగా వెళ్ళి నాలుగు రోజులు ఉండివస్తే సరి అని అనుకుంటున్నారు.
మనం డబ్బులు పెట్టగలిగే స్థాయిని బట్టి సౌకర్యాలను అందించే వృద్ధాశ్రమాలు నేడు అన్ని నగరాలలోనూ అందుబాటులో ఉన్నాయి.అక్కడ ఉండటం అవమానకరమని నేడు ఎవ్వరూ భావించటం లేదు కూడా.పిల్లల స్వేచ్ఛ కు,పెద్దల ప్రశాంత విశ్రాంత జీవితానికి కూడా ఈ వృద్ధాశ్రమాలే నేడు ఆధారం,అవసరం, అనివార్యం అవుతున్నాయి.ఇది కొత్త విషయం ఏమీ కాదు.
ఒకప్పుడు మానవుడికి చెప్పబడ్డ నాలుగు ఆశ్రమాలైన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలోనివే.
వానప్రస్థం అంటే వనాలకు వెళ్ళి పోవడమే కదా! అప్పట్లో అయితే మనుమలు,ముని మనుమలను కూడా చూసుకున్న తరువాత వనాలకో ,కాశీకో ఎక్కడికో వెళ్ళి పోయేవారు.ఆ పరిస్థితి మారి ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు కాగానే వానప్రస్థం అవుతోంది.అది భార్యాభర్తల ఏకాంత వాసమో,లేదా వృద్ధాశ్రమవాసమో.
స్వస్థానవేషభాషలను అభిమానించే సంస్కారం అలవరచుకోవడం, నేర్పడం కొరవడుతున్న ఈ కాలానికి ఇదే అనుసరణీయమేమో.
అందుకే
నేనంటున్నాను
తరం మారుతున్నది.
మా తరం మారుతున్నది.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.6.2020
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷🌻
6 🦋 నాన్నతో నా ఊసులు 🦋
🌻🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷
ఒంగోలు
27.4.2020
హాయ్ నాన్నా!
నేను నీ బుజ్జి చైతూని. ఈ రోజు మీ మొదటి పెళ్ళిరోజట కదా! అమ్మమ్మా వాళ్ళు ఆ సంగతులు గుర్తుచేసుకుని చెబుతుంటే విన్నాను. ముందుగా అమ్మకు , మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు .
నాన్నా! మొన్న నువ్వు రాసిన ఉత్తరం అమ్మ నాకు చదివి వినిపించింది.నాకు సంతోషం, ఏడుపు రెండూ ఒకేసారి వచ్చేశాయి తెలుసా!అందరూ మగపిల్లలే కావాలి అనుకుంటున్న ఈ రోజుల్లో మీరు ఆడపిల్ల పుట్టాలని మరీ మరీ కోరుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నా!మా నాన్న ఎంత సంస్కారవంతుడో అని గర్వపడుతున్నాను. నిన్ను రోజూ వీడియో కాల్ లో చూస్తున్నానుగా.నువ్వు చాలా బాగున్నావు నాన్నా! చాలా అందంగా ఉన్నావు.
నాకెంతో నచ్చేశావు. నేను నీ పోలికట కదా! అయితే నేను కూడా బాగుంటాననమాట.😍
నాన్నా!అమ్మ రోజూ నన్ను ఎత్తుకుని నీ గురించే చెప్తుంటుంది.చైతూ! మోడీ తాత లాక్ డౌన్ పెట్టారు కదా!అందుకే నాన్న రాలేకపోయారు.కానీ నాన్నకు ఈ చైతూ బేబీ అంటే ఎంత ఇష్టమో తెలుసా!నాన్న నీ కోసం వచ్చేటప్పుడు బోల్డు బొమ్మలు, డ్రెస్సులు ఇంకా చాలా చాలా తెస్తారు సరేనా!అని బోల్డు కబుర్లు చెప్తుంటుంది.అన్నీ నీ గురించే.కానీ నాన్నా అలా చెప్పేటప్పుడు అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి.ఒక్కోసారి అవి జారి నా బొజ్జ మీద పడుతుంటాయి.వెంటనే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది.నేను కూడా ఏడ్చేస్తాను.అమ్మ నిన్ను చాలా మిస్సవుతోంది నాన్నా! అప్పుడప్పుడూ కారు మాట్లాడి నన్ను, నా కూతుర్ని మా ఆయన దగ్గరకు పంపించేయ్ అని అమ్మమ్మ తో అంటుంటుంది.అప్పుడు నాకు కూడా వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలి అని అనిపిస్తుంటుంది.కానీ ఏం చేద్దాం ! అలాంటి అవకాశం ఉంటే నువ్వే వచ్చేసేవాడివి కదా!పాపం అమ్మ పిచ్చిది. నిన్ను చూడాలని,నీ దగ్గరకు వచ్చేయాలి అనే తొందరలో అలా అంటుంటుంది.
కొద్దిసేపటికి సర్దుకుని ధైర్యం తెచ్చుకుంటుంది. నాకు రకరకాల ఫోటోలు తీసి సరదాపడుతుంటుంది.
నిన్నంతా అమ్మమ్మా వాళ్ళు మీ పెళ్ళి ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు.పోయిన ఏడాది సరిగ్గా ఈ టైమ్ కి ఇది జరుగుతోంది కదా అని.మీ పెళ్ళి చాలా బాగా జరిగిందట కదా నాన్నా! కొన్ని పెళ్ళి ఫోటోలు అమ్మమ్మ దగ్గర నేను చూశాను.అమ్మా నువ్వు భలే ముద్దుగా ఉన్నారులే.మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు నాన్నా! ఏడాది తిరిగే సరికి పండంటి పాపాయిని ఎత్తుకోమని దీవించిన పెద్ద లందరి ఆశీస్సులు ఫలించి ఏడాది తిరిగేటప్పటికి నేను పుట్టేశాను కదా! ఇంకొక్క నాలుగు రోజుల్లో నాకు నెల నిండుతుంది గా నాన్నా! అప్పుడే నేను పుట్టి నెలరోజులైపోతోంది.
అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, పుట్టినప్పుడు హాస్పిటల్ లో డాక్టర్ లు, నర్సులు వీళ్ళని తప్ప నేను ఇంకెవరినీ చూడనే లేదు తెలుసా నాన్నా!
మొన్న ఇరవై ఒకటో రోజు అమ్మమ్మ నన్ను ఉయ్యాలలో వేసింది.అంతా బాగుండి ఉంటే బారసాల ఘనంగా చేసేవాళ్ళమని అమ్మమ్మ, నాన్న మొట్టమొదట నీ ఒంటిమీద తన చేతుల్తో తానే బంగారం వెయ్యాలనుకున్నారు చైతూ అని అమ్మ చాలా బాధపడ్డారు నాన్నా!
అన్నట్టు నాకు *కామ్య చైత్రిక* అనే పేరు అనుకున్నారు కదూ!పేరు భలే ఉంది నాన్నా! నా పేరు నాకు చాలా నచ్చింది .సూపర్ గా, కొత్తగా ఉంది. నేను పుట్టగానే నీకు ఆఫీసర్ గా , మామయ్య కు డిప్యూటీ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందని అందరూ నన్ను లక్కీ బేబీ అని కూడా అంటున్నారు. లక్కీ అనే ముద్దుపేరు కూడా వినటానికి నాకు చాలా బాగుంది. అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా కూడా ఉంది నాన్నా!
నాన్నా! నాకు తాత రాజశేఖర్ కూడా చాలా సేవలు చేస్తున్నారు.తాత కూడా తెగ నచ్చేశారు.అమ్మమ్మ నాకు ఏది తెమ్మన్నా ఒకటి తెమ్మంటే పది తెస్తున్నారు. రిటైర్ అయిపోయినా తాత చాలా స్మార్ట్ గా ఉన్నారు నాన్నోయ్.
ఇక అమ్మమ్మ నన్ను బాగానే చూసుకుంటోంది కానీ పాటలు పాడి విసిగిస్తోంది నాన్నా! నీకు తెలుసా! నేను ఒక్కోసారి వెంటనే నిద్ర పోయినట్టు యాక్షన్ చేస్తున్నాను.మరీ వినలేక పోయినప్పుడు ఏడుస్తున్నాను. పాటలు బాగానే రాస్తుందట కానీ సొంత బాణీ లు కట్టి పాడేయటమే కొంచెం ఇబ్బంది గా ఉంది నాన్నా!సరే, ఏం చేద్దాం! ఎంతైనా అమ్మమ్మ కదా!నన్ను, అమ్మని బాగా చూసుకుంటోంది కదా!అందుకని వినక తప్పట్లేదు.తప్పేటట్లు కూడా లేదు.కానీ పాపం నాకు డ్రెస్సులు కొనే అవకాశం లేక తన చీరలకు వచ్చిన బ్లౌజ్ పీసులతో ఎదురింటి ఆంటీ చేత రకరకాల ఫ్రాకులు,పట్టులంగాలు కూడా కుట్టించేసి, నాకు వేసి తన సరదా తీర్చుకుని మురిసిపోతోంది.నీకు తెలుసా నాన్నా! అమ్మమ్మ కు షాపింగ్ అంటే సరదా అట. కానీ లాక్ డౌన్ వల్ల ఆ సరదాకి బ్రేక్ పడింది.లేకపోతే ఈ పాటికి నాకోసం ఎన్ని కొనేసిఉండేదో అని అమ్మ చెప్తోంది.
ఇంకేంటి సంగతులు నాన్నా! నా గురించి నువ్వు దిగులు పడకు.నేను నీ కూతుర్ని.పరిస్థితులు అర్థం చేసుకుని ధైర్యంగా ఉండమని, తొందర్లోనే వచ్చేస్తానని అమ్మను నువ్వు బుజ్జగించటం నేను వింటూనే ఉన్నాను.నువ్వు చెప్పినట్లు గానే నేను బుద్ధిగా పాలు తాగేసి బజ్జుంటున్నాను.అమ్మను జాగ్రత్త గా చూసుకుంటున్నాను.మరి నువ్వు కూడా జాగ్రత్త నాన్నా! నాయనమ్మ నిత్యకు, తాతయ్య రామకృష్ణ రాజుకు నా ముద్దులు.తాతయ్య ఆరోగ్యం జాగ్రత్త.పెద్దమ్మని, పెదనాన్న ని డాలీ అక్కని అడిగానని చెప్పండి.ఇక ఉంటాను నాన్నా! నాకు నిద్దరొస్తోంది.బజ్జోవాలి.
మళ్ళీ మరొక్కసారి మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు .
బై నాన్నా!
నీవు పంపించిన ముద్దులకు డబుల్, త్రిబుల్ ముద్దులతో
నీ గారాల కూతురు
కామ్య చైత్రిక (చైతూ)
మొన్న నేను ' నాన్న మనసు' అంటూ రాసిన ఉత్తరం చదివి, చాలా బాగుందమ్మా!మరి కూతురి ప్రత్యుత్తరం కూడా రాస్తే బాగుంటుంది అని సూచించిన డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాస్టారికి కృతజ్ఞతలతో....
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.4.2020.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
కరోనా కాఠిన్యం లో
తల్లడిల్లిపోతున్న
7. ఓ నాన్న మనసు
నా బంగారు తల్లీ!
నేను ఎవ్వరోనని చూస్తున్నావా!నేను రా తల్లీ! మీ నాన్నని. నువ్వు అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నిన్ను తడిమి చూసుకున్నానో,నీ గురించి మీ అమ్మ తో ఎన్నెన్ని కబుర్లు చెప్పానో గుర్తులేదూ! తొమ్మిది నెలలు గా ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఆశగా, ఆతృతగా ఎదురు చూసిన నాన్ననురా కన్నా నేను. నువ్వు పుట్టీ పుట్టగానే అమ్మ బజ్జోని ఉంటుంది కదా!అందుకని అమ్మ బొజ్జలోనుంచి నువ్వు బయటికి వచ్చీరాగానే నిన్ను నా చేతుల్లోకి తీసుకొని తనివితీరా నీ చిట్టి మొహాన్ని, గులాబీ రంగు గుప్పిళ్ళను, పాదాలను చూసి గుండెలకు హత్తుకుని మురిసిపోవాలని, నీ కంటే ముందు మన పాపని నేనే ఎత్తుకున్నాను చూశావా!అని మీ అమ్మ ను ఉడికించాలని ఎన్నెన్ని ఊహలు మనసులో అల్లుకున్నానో తెలుసా!
నీ కోసం బోలెడు బొమ్మలు, డ్రెస్సులు , ఉయ్యాల అన్నీ ముందే కొనిపెట్టాలనుకున్నాను.కానీ మీ అమ్మమ్మ, నాన్నమ్మ పుట్టకముందే అలా కొనుక్కోకూడదు అని అనడంతో ఏవీ కొనలేకపోయాను.ఇంకా నయం అమ్మమ్మ కి నచ్చచెప్పి ఎలాగో అమ్మాయైనా,అబ్బాయైనా సరిపోయేటట్టు నాలుగు జుబ్బాలు కొనబట్టి సరిపోయింది.లేకుంటే నా తల్లికి వేసుకోవడానికి నాలుగు డ్రెస్సులు కూడా లేవని ఈ నాన్న మనసు మరింతగా తల్లడిల్లిపోయి ఉండేది.
నాకు అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ఓకే గానీ,ఎందుకో తెలీదు మనసులో ఒక మూల ఆడపిల్ల పుడితే బాగుంటుంది అనే ఆశ, ఆడపిల్లే పుడుతుంది అనే నమ్మకం బలంగా ఉన్నాయిరా తల్లీ! ఈ నాన్న మనసు తెలుసు కున్నట్లుగా నువ్వు ఆడపిల్లవై పుట్టి నాన్న ఆశ నెరవేర్చావు. తల్లీ! నువ్వు నా మనసు తెలుసుకున్నట్లే, నేను కూడా భవిష్యత్తులో నీ మనసు తెలుసుకుని లోకాన్ని ఎదిరించైనా నీకు అన్ని వేళలా అండగా ఉంటానని ,నీ ఆశలన్నీ నెరవేరుస్తానని నీకు ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నాను.
మార్చి 31. ఆ రోజు నాకు బాగా గుర్తుంది.ఉదయాన్నే మీ అమ్మమ్మ ఫోన్ చేసింది.మీ అమ్మకు బొజ్జలో నొప్పి గా ఉందని, హాస్పిటల్ కి తీసుకెళ్ళామని.నేను చాలా టెన్షన్ పడ్డానురా! ఇంతలో 8 గంటలకల్లా మీ తాత ఫోను. జితేందర్! నీకు ఆడపిల్ల పుట్టింది అని.ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను రా కన్నా!మీ తాత చెప్పారు నువ్వు ఎర్రగా,బొద్దుగా,ముద్దుగా చాలా బాగున్నావని. ఆ నిమిషం రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలిపోవాలని ఈ నాన్న మనసు ఎంతగా ఆరాటపడిందో తెలుసా తల్లీ! కానీ ఏం చేద్దాం నాన్నా!ఈ కరోనా బూచి నాన్న కాళ్ళు కట్టేసిందిరా కన్నా! చైత్రమాసంలో
మంగళవారం సూర్యోదయం తోనే మా జీవితాల్లో సంతోషాల ఉషస్సులు నింపావు.పుట్టగానే నిన్ను చూసుకోలేని దురదృష్టవంతుడైన ఈ నాన్నకి నువ్వు మాత్రం అదృష్టదేవతవయ్యావు.నువ్వు పుట్టిన రెండు గంటల్లో నే ఈ నాన్నకు ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చిందన్న వార్త మోసుకొచ్చావు.ఇరవై నాలుగు గంటల లోపే మీ మేనమామ కి కూడా అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ కూడా పట్టుకొచ్చావు. నీ కూతురు అదృష్టవంతురాలోయ్! మంగళవారం నీ ఇంటి మహాలక్ష్మి పుట్టింది అని అందరూ నిన్ను పొగుడుతుంటే ఈ నాన్న మనసు గర్వంతో ఎంత పొంగిపోయిందో తెలుసా చిట్టితల్లీ!
తల్లీ! నీతో ఎంత మాట్లాడినా నా తనివి తీరడం లేదు.నిజానికి నిన్న ఏప్రిల్ 14తోనే లాక్ డౌన్ ముగిసిపోతుంది,ఈ రోజు ఉదయాన్నే నిన్ను చూసేస్తానని చాలా ఆశపడ్డాను. కానీ లాక్ డౌన్ మళ్ళీ మే 3 వరకు పొడిగించేశారు తల్లీ! ఈ నాన్న మీద అలగకమ్మా! మనం ఒకరినొకరం చూసుకోలేకపోతున్నామనే బాధ తప్పితే , మోడీ తాత విధించిన ఈ లాక్ డౌన్ వల్ల అన్ని విధాలా మనకే మంచిది తల్లీ! ఆ వివరాలు నీకు ఇప్పుడే అర్థం కావులే.పెద్దయ్యాక చెప్తాను సరేనా!
అమ్మను నా కోసం ఏడవవద్దని చెప్పు.ఇప్పుడు నాన్న కూతురుగా అమ్మను జాగ్రత్త గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే .ఈ నాలుగు రోజులు గడచిపోనీ.ఇక నా జీవితాంతం నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు మీ నాన్న.మరి ఈ నాన్న మాట నమ్ముతావు కదూ! భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు నేను పుట్టినప్పుడు నువ్వు ఎందుకు నన్ను చూడటానికి రాలేదు నాన్నా!అని అడిగితే ఆ రోజు ఈ నాన్న కన్నీళ్ళతో మూగవాడైపోతాడు తల్లీ! అందుకనే నాలోని నాన్న మనసు ను ఇలా నాలుగు మాటల్లో చెప్పుకుంటున్నాను. ఈ నాన్నను అర్థం చేసుకుంటావుకదూ! ప్రతిరోజూ వీడియో కాల్ చేసి నిన్ను చూస్తున్నా ,నిన్ను కళ్ళారా చూసి, చేతులారా ఎత్తుకుని ,మనసారా ఆనందించే ఆ మంచి క్షణాలు కోసం ప్రతీ క్షణం ఎదురుచూస్తూ
బంగారు తల్లికి వేలవేల ముద్దులతో
మీ నాన్న
జితేందర్ రాజు రాళ్ళబండి.
**నేను వచ్చేటప్పుడు నీ కోసం తాతయ్యని, నాయనమ్మ ని ,డాలీ అక్కని కూడా తీసుకువస్తాను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.04.2020
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
8నాన్నగారికో లేఖ
నాన్నగారూ!మీరు లేక....
నాన్నగారండీ!
నోరారా ఇలా పిలిచే అదృష్టానికి మేము దూరమై ఈనాటికి సరిగ్గా ఐదేళ్ళయ్యింది. అందుకే మనసారా ఈరోజు ఓసారి తలచుకోవాలని అనిపించింది.
నాన్నగారూ! మీకు గుర్తుందా! ఈ రోజు నా పుట్టిన రోజు.మీరు ఉండి ఉంటే ఉదయాన్నే ఫోన్ చేసి అమ్మలూ! ఈ రోజు కి నీకు ఇన్నేళ్ళు నిండాయి అని చెప్పేవారు.కానీ మీరు లేరుగా! నేను యాభయ్యో పడిలో పడ్డాను .53 ఏళ్ళు నిండిపోయాయి.పెద్దదాన్ని అయిపోతున్నాను నాన్నగారూ! ఈసారి మీ ఆబ్దికం కూడా ఈ రోజే పడింది.పెద్ద తమ్ముడు ఈ రోజు శాస్త్రోక్తంగా మిమ్మల్ని ఆహ్వానించి పూజించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు.
నాకు వెళ్ళడానికి వీలవలేదు. రాలేదని మీ అమ్మలు మీద అలగకండేం!
ఈ అయిదేళ్ల లో మీ పిల్లల జీవితాల్లో ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. ఉత్తరంలో అన్ని విషయాలు పూసగుచ్చినట్టు రాయడం మీ దగ్గరే నేర్చుకున్నాను.చెప్పడానికి ఏ విషయం మిగల్చకుండా అన్నీ రాసేస్తారు అని అమ్మ మిమ్మల్ని విసుక్కునేది కూడానూ.మీ పెద్ద మనవడు, నిశాంత్ బ్యాంక్ ఆఫీసర్ అయ్యాడు.పెద్ద తమ్ముడి పెద్ద కొడుకు పండుగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు.
నాలుగు నెలల క్రితమే మీ పెద్ద మనవరాలి పెళ్లి అయింది. మీరు లేరన్న లోటు తప్ప పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. మీ అల్లుడి లాగే మా అల్లుడు కూడా చాలా మంచివాడు నాన్నగారూ! చిన్నమ్మని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది చివరిలోగా నిశాంత్ పెళ్లి కూడా చేసేస్తాము. కిరణ్ కూతుళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు.పెద్దది స్నిగ్ధ సిలికానాంధ్ర వారి ఆసుపత్రి కి నిధులు సమీకరించి, ముఖ్యమంత్రి చేతులమీదుగా సన్మానం కూడా అందుకుంది.మీ ఆశీస్సుల వల్ల అందరం సంతోషంగా , చక్కగా కలిసిమెలసి ఉన్నాము.
నాన్నగారూ!
మీరు వెళ్ళిపోయే ముందు అనారోగ్యం వల్ల చివరి నాలుగు రోజులు రాయలేకపోయిన మీ డైరీని నేను పూర్తి చేసి ముగించాను.
పుట్టినరోజు కి చీర కూడా కొనుక్కున్నాను.మీరు ఉంటే అమ్మలూ! పుట్టినరోజు కి ఇంకా చీర కొనమని అడగలేదే అనేవారుకదూ! పిల్లలు, తమ్ముళ్ళు, మీ అల్లుడు అందరూ పుట్టిన రోజు కి చీర కొనుక్కో మని డబ్బులు ఇస్తారు.
కానీ, చీర కొనమని అడగమని మరీ అడిగి కొని పెట్టే మీ మురిపమే వేరు.
నేనెప్పుడైనా అలిగినప్పుడు సంధ్య మావయ్య గారు లేరని దిగులు లేదు.వదిన ఉంది అలగడానికి అంటూ ముద్దుగా విసుక్కుంటూ ఉంటుంది.
అన్నట్టు మీరు వెళ్ళపోయినప్పుడు నాకంటే కూడా సంధ్యే ఎక్కువగా ఏడ్చింది తెలుసా నాన్నగారూ!
ఇంకో ముఖ్యమైన విషయం. శేఖర్ మొన్ననే రిటైర్ అయ్యారు.
ఇక షాపింగ్ లు తగ్గిస్తాను లెండి.పొద్దస్తమానం షాపింగ్ లంటూ డబ్బులు తగలేస్తావు, అని విసుక్కునే వారుగా!ఇక జాగ్రత్త గా ఉంటాను. సరేనా!
ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది.చిన్నాన్న కూతురు కాంతి అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.దానికి పాపం మీరంటే చాలా ఇష్టం.
అన్నట్టు చెప్పడం మరిచాను.ఈ రోజు మా పెద్దమామయ్య సోమయాజుల భాస్కరరావు గారి పుట్టిన రోజు కూడానూ.మామయ్యకు కూడా మా తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేయండి.
మీరు పజిల్స్ రాసేటప్పుడు మీకు ఏవైనా పదాలు రాకపోతే నాకు ఫోన్ చేసి అడిగేవారు.నేను చెప్తే నేను కూడా అదే అనుకున్నాను అనేవారు.చెప్పకపోతే అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టి నిన్ను ఎమ్.ఎ.తెలుగు చదివించాను.నీకేమీ రావు అనేవారు.కానీ, ఆనాడు మీరు చదివించిన చదువే మంచి టీచరుగా, కవయిత్రి గా నాకు కాస్త గుర్తింపు ని , గౌరవాన్ని సన్మాన సత్కారాలను, పురస్కారాలను ఈ ఆచారిగారి అమ్మాయి కి తెచ్చి పెడుతోంది.ఇప్పుడు సంతోషమేనా మరి!
సరే నాన్న గారూ! ఇక నాకు స్కూల్ కి టైం అవుతోంది.మళ్ళీ ఇంకోసారి ఇంకొన్ని విశేషాలతో పలకరిస్తాను. ఇప్పటికే అమ్మ పక్కనుండి తిడుతూ ఉండి ఉంటుంది ఇంకా దాని ఉత్తరం అవలేదా ! అని.
మరి ఉండనా!
నాకు పుట్టిన రోజు శుభాశీస్సులు అందజేస్తారు కదూ!
ప్రేమతో
మీ అమ్మలు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.8.2019
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
9.సంసారం....సంస్కారం
జారుతున్న సంస్కారాలు
కూలుతున్న సంసారాలు
పదేళ్ళ క్రితం నేను నర్సరావుపేటలో డి.ఎస్.పి.మధు సూదన్ గారు పదిమంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో ఒకదానిగా ఒకఏడాది పాటు ఉండి,
ఇటీవలి కాలంలో టీవీ ల్లో వస్తున్న రచ్చబండ లాంటి కార్యక్రమాల గురించి విని,
ఈ నాలుగు మాటలు నేను చాలా వేదనాభరిత హృదయంతో నిత్య జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాను.
అసలు లోపం ఎక్కడుంది?
ఒక సంసారం అంటే నాకు తెలిసి అందులో ప్రధాన పాత్రలు
అత్తామామలు
కొడుకు కోడలు.
ఈ నలుగురి మధ్య సయోధ్య కుదరకపోవటం వల్ల పర్యవసానంగా తలెత్తుతున్న తదనంతర పరిణామాలు.
వీటిని ఒకసారి దృష్టిలో పెట్టుకుని నిశితంగా ఆలోచిస్తే నాకు తోచిన
సమస్యలు పరిష్కార మార్గాలు.
1.చిన్న కుటుంబాలు
ఈ రోజుల్లో అన్నీ చిన్న కుటుంబాలే.తాతయ్యా
నాయనమ్మల ఊసేలేదు.
అమ్మా నాన్నలకు పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చెప్పించాలన్న తపనే తప్ప కాసింత సంస్కారం నేర్పాలన్న ఆలోచనే లేదు.
మగపిల్లల స్నేహాలపై నిఘా,వారి ఆండ్రాయిడ్ ఫోనుల వాడకంపై నియంత్రణ
ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్న కఠినమైన సూచనలు ,మందలింపులు లేకపోవటం
చిన్నతనం నుంచీ ఇంటిలోని పెద్దలతో మానసికమైన దగ్గరతనం లేకపోవటం (దీనినే ఇప్పట్లో మాకు కొంత స్పేస్‌కావాలి అని అంటున్నారు),బ్రేకప్ సెలబ్రేషన్ అనే కొత్త కాన్సెప్ట్
వంటి కారణాలు మగపిల్లలను బంధాలపట్ల
నిబద్ధత ఏర్పడే అవకాశం లేకుండాపోయింది.
ఇక ఆడపిల్లల విషయానికి వస్తే
అతి గారాబం చేయటం
చదువుకుంటున్నారు కదా
అని పనిపాటలు,ఇంటిని తీర్చిదిద్దుకునే విధానం ,ఉదయాన్నే లేవటం ,అమ్మకు కాస్త ఇంటిపనుల్లో సాయం చేయాలని నేర్పకపోవటం,అతి స్వేచ్ఛ ఇవ్వటం,ప్రేమించారని తెలిస్తే అతి కఠినంగా వ్యవహరించటం
వస్త్ర ధారణలో విపరీత ధోరణులను అడ్డగించక ఉపేక్షించటం ఇవన్నీ కారణాలే.
వస్త్ర ధారణ విషయం గురించి చాలామంది నా అభిప్రాయం తో ఏకీభవించకపోవచ్చు.
కానీ ఇది ఒక చేదు వాస్తవమే.
ఎందుకంటే వస్ర్త ధారణ వల్లనే అకృత్యాలు జరగవు.
కానీ వయసు ఉద్రేకంలో ఉన్న కుర్రవాళ్ళు యూ ట్యూబ్ లోనో ,సినిమాలోనో ,నిజ్ జీవితం లోనో అలాంటివి చూసినప్పుడు ఆ దృశ్యాల ప్రభావం వారి వయసులో అలజడి రేపుతుంది.
సరిగ్గా దయ్యం సినిమా చూసి రాత్రిళ్ళు భయపడి నిద్రలో ఉలిక్కిపడ్డట్లే,
ఆ భావన మనసులో ముద్రించుకున్నప్పుడు ఎదురుగా ఏ ఆడది కనబడినా వయసుతో సంంబంధం లేకుండా ,ఇంట నేర్పిన సంస్కారం పూజ్యం కనుక పశుబలంతో కామవాంఛలు తీర్చుకోవాలని చూసి క్షణికావేశంలో అమానుషచర్యలకు పాల్పడి జీవితాన్ని అంధకారమయం చేసుకుంటున్నారు.
ఇది పచ్చి నిజం.
కనుక బిడ్డల చెడు నడవడికకు అధికభాగం బాధ్యత పెద్దలదేనన్నది నా అభిమతం.
ఇక పెళ్ళయ్యాక అత్తింటిక వెళ్ళేఆడపిల్లకు అత్తింటి మర్యాదలు అనుసరించే ప్రయత్నం చేసి అణకువతో మెలగాలని తల్లి నేర్పకపోవడం.
దీనితో రోజూ పదింటికి లేచి వాట్సప్ చూసుకుని పదకండు గంటలకు పళ్ళు తోముకునే పిల్లకు అత్తగారు ఆరింటికి లేచి కోడలు కాఫీ పెట్టిస్తే తాగాలనే కోరిక పెద్ద సాధింపుగా కనపడటం అది ఆ పిల్ల పెంపకం తప్పేగానీ పిల్లతప్పు ఎంత మాత్రమూ కాదు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో ఖర్చుదారీ పెద్దమ్మను,అన్నిటికీ గొణిగే పిన్నమ్మను,గయ్యాళిలా అరిచే నాయనమ్మను,పిసినారి బాబాయిని పుట్టింటిలోనే చూసేవారు.
చిన్నతనంలోనే పెళ్ళి చేసి పంపటం వల్ల,తాను చూసిన స్వభావాలే అత్తింటిలోనూ ఉండటం వల్ల ,అప్పటికింకా వ్యక్తిత్వం ఒకటి ఏర్పడక పోవటంవల్లా, ఇక నీకు పుట్టిల్లైనా అత్తిల్లైనా అదే అని చెప్పటం వల్ల సర్దుకుపోయేవాళ్ళు.
కానీ ఇప్పట్లో ఒక వ్యక్తిత్వం,సమానమైన చదువు,ఆర్థిక స్వాతంత్ర్యం వంటి అన్ని విషయాలలోనూ పరిపూర్ణత సాధిస్తున్న అమ్మాయిలు
తమ ప్రవర్తన సరి అయినదే అని భావించటంలో తప్పేముంది?
కనుక కాస్త తల్లి మందలింపు,అత్త ఆదరింపు లభిస్తే,వివేకవతి అయిన ఆధునిక యువతి ఆ మాత్రం అర్థం చేసుకోలేదా!కొడుకు తప్పు చేసినప్పుడు ఆ తల్లి కోడలికి మానసికమైన స్థైర్యాన్నిచ్చి, కోడలికి అండగా నిలబడి కొడుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఆ కోడలు తన కష్టాన్ని పుట్టింట్లో కూడా చెప్పదు.
అత్తగారే దైవమని పూజిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
అలాగే కోడలు కూడా
నాకు నా భర్తే కావాలి.
అతని తల్లిదండ్రులు ,తోబుట్టువులు అక్కరలేదు అనుకుంటున్నారు.
కానీ తానే అత్తామామల్ని ప్రేమగా చూసుకుంటే భర్త తనను అంతకంటే ప్రేమగా చూసుకుంటాడని,తన పట్ల ప్రేమ పదింతలవుతుందని గ్రహించలేకపోతున్నారు.
ఆడబడుచు ఒక పూట ఇంటికి వస్తే అతను చెప్పేలోపే తానే ఒక నచ్చిన చీర కొనిచ్చి,పసుపు కుంకాలతో సాదరంగా సాగనంపితే ఆ భర్త తన గౌరవం దక్కినందుకు పొంగిపోయి నిన్ను నెత్తిన పెట్టుకోడా!
సహనంతో,
ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని మహాత్ములంతా నిరూపించిన సత్యమే కదా!
కనుక తల్లిదండ్రులు పిల్లలకి
ముందుగా
సంస్కారం నేర్పండి
ఆ తరువాత
సంసారం ఏర్పరచండి.
అప్పుడే
ప్రేమవివాహాలైనా
పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళయినా
పది కాలాల పాటు పచ్చగా ఉంటాయి.
మన సంస్కృతిని కాపాడతాయి.
నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా
ఆ యువతను మంచి మార్గాన నడపవలసింది మనమే కనుక
పెద్దలకు నమస్సులతో
పిల్లలకు ఆశీస్సులతో
*ఇది ఒక కోణం మాత్రమే.
సామాన్యమైన సమస్యలను ఎదుర్కొనే వారిని దృష్టిలో పెట్టుకుని నా బుద్ధికి తోచినట్లు విశ్లేషించాను.
మరొక కోణం గురించి మరొకసారి చర్చిద్దాం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
12.1.2019.
[5/29, 1:14 PM] Jyothirmai Simhadri:
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
10నేడు హనుమజ్జయంతి సందర్భంగా నాలుగు మాటలు.
ఆశయ సాధకులకు సూర్య బింబమైనా చంద్రబింబమే
సూర్యుడు కాలస్వరూపుడు.
క్షణకాలం కూడా వృథా చేయక కాలంతో పోటీ పడుతూ జ్ఞానార్జన చెయ్యాలి.
పర స్త్రీలను ఏ పరిస్థితుల్లో చూసినా మనసులో ఎటువంటి కామవికారాలు కలుగకూడదు.రావణుని అంతఃపురం లో ప్రమత్తులై ఉన్న పర స్త్రీ లను చాటుగా చూసినందుకు ముందు అపరాధ భావం తో కలతపడినా తనకు కామదృష్టి కలుగలేదు పైగా అది స్వామి కార్యం కనుక తప్పులేదని వితర్కించుకున్న నిగ్రహశీలి.
అలాగే మాటలో క్లుప్తత, స్పష్టత.అందుకే తొలి పరిచయం లోనే రాముడు హనుమ వాక్యజ్ఞుడు అని గ్రహించి,నమ్మి సీతాన్వేషణ భారం అతనిపై ఉంచాడు.
లంకలో సీతను చూసి వచ్చే వేళ కూడా రాముడి ముందు వాలుతూనే
దృష్టా మయా సీతా
అంటూ చూశాను అన్న మాట ముందు చెప్పి రాముడి హృదయ తాపాన్ని చల్లార్చే వచనామృతం వర్షించిన హనుమ. నిజంగా వాక్యజ్ఞుడే కదా!
ఇక వినయం
లంకను దాదాపు నేలమట్టం చేసినా అది ఘనకార్యమని విర్రవీగలేదు.రావణుని సభలో మాట్లాడుతూ
రామ బంటు నైన నేనే ఇంత చేస్తే ఇక నా ప్రభువు ఎంత శక్తివంతుడో ఊహించు అని హితవు పలికాడు.
తన బలాన్ని తాను మరవటం.
అంటే బలం అన్ని వేళలా ప్రదర్శించటం తగదు.బలదర్పం ప్రదర్శించేవారు లోకకంటకులౌతారు అన్నది నిరూపిత సత్యం.
కనుకనే హనుమ రామకార్య ఆవశ్యకత వరకూ తన బలాన్ని విస్మరించాడు.
అలాగే కార్యసాధన దక్షత
సంకల్ప బలం ఉంటే సకలమూ సాధ్యమే అనటానికి హనుమ యే ఉదాహరణ అని మనం చిన్నప్పుడే అర్థాంతరన్యాస అలంకారం లో చదివేసుకున్నాం కదా!
నూరు యోజనాల సముద్రాన్ని దాటడానికి, అవరోధాలను అధిగమించడానికి హనుమ కు సహకరించింది ఆ సంకల్ప బలమే.
ఇలా చెప్పుకుంటూ పోతే హనుమ జీవితమే లోకక్షేమానికి అంకితం.
శ్రీ రామ దూతం శిరసా నమామి.🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.5.2019.
[5/29, 1:15 PM] Jyothirmai Simhadri: ఈ సందర్భంగా నేను రాసిన
గేయ రామాయణంలోని
సుందర కాండ లో హనుమ గురించి రాసిన చరణాలు
121
మేఘమై వినువీధి పయనించెను
వేగమే రాముణ్ణి చేరుకొనెను
భాగమై సీతమ్మ దుఃఖమ్ములో
రాగమై జంటలో రవళించెను 665
122
అంగుళీయకము నందువేళ
సీతమ్మ పొందిన సంతసమును
ప్రియరమణి పంపిన చూడామణి
కాంచిన రామయ్య కనువెలుగును 666
123
కన్నార కాంచిన కపిముఖ్యుడు
ధన్యుడు మహిలోన మహితాత్ముడు
మారుతాత్మజుడొక్కడే
సుందరకాండకు ఆత్మయతడే 667
124
కావ్యాన ఈ కాండయే సుందరం
జానకీరాముల మది మందిరం
కొలువైన హనుమ కథయే సురుచిరం
కొలిచేము భక్తితో మనమందరం 668
సుందర కాండ సంపూర్ణం
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
11*నా ఉద్యోగానుభవాలు..1*
లెక్చరర్ గా
నిన్న నేను చెప్పినట్టు నా 26 వ ఏట 1993 లో డిఙగ్రీ కాలేజీ లెక్చరర్ గా నర్సరావుపేట PNC &KR డిగ్రీ కాలేజీ లో ఉద్యోగం లో చేరాను.
అప్పటికి 89 లో నా PG అయిపోయింది.మళ్ళీ మా సెంట్రల్ యూనివర్సిటీ లోనే M.phil జాయిన్ అయ్యాను. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచనలు ఒక పరిశీలన అంటూ అనుభూతి కవిత్వం టాపిక్,నా గైడ్ ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు.ఇంతలో 89 డిసెంబర్ లో వివాహం కావడం,91మార్చిలో బాబు పుట్టడం తో M.Phil పూర్తిచేయలేకపోయాను.ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే పూర్తిచేసి డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత సామాన్య గృహిణిగా మారిపోయి కనీసం సవర్ణదీర్ఘసంధి సూత్రం కూడా మరచిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాను.వేటపాలెం నుండి మా కాపురం చీరాలకు మారింది.
ఇంటద్దె రెండు వందలు.మా వారు VDO (village devolopment officer) గా నాగులుప్పలపాడు లో చేసేవారు.
ఒకరోజు సాయంత్రం ఆయన ఒక పేపర్ కటింగ్, అప్లికేషన్ పట్టుకొచ్చి నర్సరావుపేట లో తెలుగు లెక్చరర్ పోస్టులు పడ్డాయి, అప్లై చెయ్యి అన్నారు.
నేను అప్పటికే చిలకలూరిపేట లో,పిడుగురాళ్ళలో ఇంటర్వ్యూ లకు వెళ్ళి ఉన్నాను.
పిడుగురాళ్ళలో అయితే 500 జీతం ఇస్తాం అన్నారు.మీరేమన్నా డొనేషన్ కడతారా అని అడిగారు.ఇదేం కుదిరేది కాదులే అని వెనక్కి వచ్చేశాం.అప్పట్లో నాకసలు ఉద్యోగం చేయాలనే ఆలోచన, ఆసక్తి రెండూ లేవు.పైగా
ఈ అనుభవాలతో నాకెందుకులే శేఖర్! ఉద్యోగం? నేను ఇంట్లో ఉంటాలే.పైగా చిన్నోడు(మా బాబు ముద్దు పేరు) కూడా చిన్నోడు కదా! వద్దులే అన్నాను.అదీ కాకుండా అప్లై చేయడానికి ఆ రోజే లాస్ట్ డేట్ కూడానూ.
కానీ మా వారు ఒప్పుకోలేదు .ఊరికే అప్లై చేద్దాం జ్యోతీ!వస్తే వస్తుంది లేకుంటే లేదు అని బలవంతంగా అప్లై చేయించారు.మా ఆయనకి నా చదువు మీద,నా తెలివితేటల మీద మహా నమ్మకం పాపం.
సరే అని అప్లై చేశాను కానీ ఆ సంగతి నేను మర్చిపోయాను.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంటర్వూ ఉంది రమ్మని కాల్ లెటర్ వచ్చింది. సరే వెళ్ళాము.
ఇంటర్వ్యూ చేశారు.వాళ్ళేవో కొన్ని అడిగారు.నాకు వచ్చినవి చెప్పాను,రానివి నాకు రావు అని చెప్పేశాను.
కాలేజీ ప్రిన్సిపాల్ గాలి సుబ్బారావు గారు.ఆయన నన్ను అడిగారు.చూడటానికి చిన్నదానిలా ఉన్నావు.కానీ డిగ్రీ స్టూడెంట్స్ అంటే నీకంటే పెద్దవాళ్ళలా ఉంటారు.మరి వాళ్ళని నువ్వు కంట్రోల్ చెయ్యగలవా!అని అడిగారు.చేయగలను అని ధీమాగా చెప్పేశాను.
అయితే ఒక 30 వేలు డిపాజిట్ కట్టాలి. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాం అన్నారు.
అమ్మో!30 వేలే!మనకి ఎక్కడినుండి వస్తాయి ఇప్పుడు అని వద్దనుకున్నాం.పైగా ఇంటర్వ్యూ కి వచ్చిన మరొక అతను నేను లక్ష రూపాయలు అయినా డొనేషన్ కడతాను అన్నాడు.ఇక సరే ,ఇది మనకి వచ్చేది కాదులే అనుకున్నాం. వచ్చేశాం.
సరిగ్గా మళ్ళీ వారానికి మీరు సెలెక్ట్ అయ్యారు, వచ్చి డిపాజిట్ కట్టి జాయిన్ అవమని లెటర్ వచ్చింది.
మా ఆయన చాలా సంబరపడిపోయారు.మా దగ్గర పది వేలు మాత్రమే ఉన్నాయి.తక్కిన
డబ్బులెక్కడ తెస్తాం అని నా బాధ.మా ఆయన మాత్రం భరోసాగా ఉన్నారు.
అప్పుడు మా నాన్నగారు అమ్మలూ!నేను పదివేలు ఇస్తాను అన్నారు.మా పిన్నత్తగారు (మా అత్తగారి చెల్లెలు)ఆవిడ ఒక పదివేలు సంతోషంగా ఇచ్చారు.ఈ వారంలో ఆ డబ్బు సమకూర్చుకుని కాలేజీలో కట్టి ఉద్యోగం లో జాయిన్ అయి, అపాయింట్మెంట్ తీసుకున్నాను.
జీతం..15 వందలు.
తక్కువ అనుకోకండి.అప్పట్లో లెక్చరర్స్ కి అంత జీతం ఇచ్చిన కాలేజీలు గుంటూరు, ప్రకాశం జిల్లాల లోనే లేవు.మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ శివలింగ ప్రసాద్ గారు ఈ జిల్లాలలో నా కన్నా ఒక్క రూపాయి ఎక్కువగా ఇచ్చే కాలేజీ ఉంటే చెప్పండి అని ఛాలెంజ్ కూడా చేసేవారు.
అలా డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా నా ఉద్యోగ జీవితం ప్రారంభమయింది.
కొసమెరుపు ఏమిటంటే
ఆ పోస్ట్ లో అంతకుముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీపార్వతి గారు చేసేవారు.ఆవిడ రామారావు గారి జీవిత చరిత్ర రాస్తూ, తరచూ ఎక్కువగా సెలవలు పెట్టవలసి వచ్చి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.అలా ఖాళీ ఏర్పడిన ఆ ఉద్యోగం నాకు వచ్చింది.అన్నగారి వీరాభిమానిని అయిన నేను ఒక రకంగా అన్నగారి వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది కదా! అని మనసులో అనుకుని సంతోషించాను కూడానూ.
(సశేషం)
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.5.2022
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
12.ముప్పై ఏళ్ల నాటి ముచ్చట్లు
1989 డిసెంబర్ 2 వ తేదీ
విజయవాడ బెంజ్ సర్కిల్ లో గల చెన్నుపాటి కళ్యాణ మంటపం
దేదీప్య మానంగా వెలిగిపోతోంది
Jyothirmai
Weds
Rajasekhar
అని దీపాలకాంతులలో
అందమైన రెండు పేర్లు
వెలుగులీనుతున్నాయి ఈ జంట భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతోంది అని సూచిస్తూ.
సమయం రాత్రి 7 గంటలు.
ఆహ్వానితులందరూ వస్తూ ఉన్నారు.
అయినా మా నాన్నగారి ముఖంలో ఆందోళన.
మధ్యాహ్నం 3 గంటలకే వస్తామన్న మగపెళ్లి వారి జాడలేదు.రాత్రి తొమ్మిది కావచ్చింది.
ఈ ఆందోళన నాలో తప్ప మెల్లమెల్లగా అందరిలోనూ పాకింది.
మూడింటినుండి ఎదురుచూస్తున్న బ్యాండు వాళ్ళు పక్కనే ఉన్న జ్యోతి మహల్ వైపు వెళ్ళారు కాలక్షేపం కోసం.
అప్పట్లో ఫోను సౌకర్యం లేదు.అందరూ మంటపం బయటే ఎదురుచూస్తూ తోచిన ఊహాగానాలు చేసుకుంటున్నారు.
అంతలో మా పద్దుపిన్ని (తను కాస్త అయోమయం లెండి)
అయితే బావా! ఇంతకీ
మీరు అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారా!వాళ్ళు అబ్బాయిని రానివ్వకుండా ఆపేశారేమో!అంటూ సందేహం వ్యక్తం చేసింది.అసలే టెన్షన్ తో ఉన్న మా నాన్నగారి కోపం తారాస్థాయికి చేరింది.నువ్వు నోరు మూసుకుని అవతలికి పో అని మా పిన్నిని ఒక్క అరుపు అరిచారు.
అసలే ప్రేమ వివాహం.ఆపై వర్ణాంతరం.ఎంత లోకాన్ని లెక్కచేయని మనస్తత్వమైనా కూతురి భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు.
పెళ్లి కి పిలిచిన వాళ్ళంతా వచ్చేశారు.
ధైర్యం చేసి మా నాన్నగారు భోజనాల కార్యక్రమం ప్రారంభించమని చెప్పేశారు.
తమలపాకు బజ్జీ, లడ్డు, కాలీఫ్లవర్ పచ్చడి ఆనాటికి అవన్నీ కాస్త కొత్తరకాలు.మొదటిబంతి పూర్తయింది.భోజనాలు చాలా బాగున్నాయన్న ప్రశంసలు నాన్నగారికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి.రెండవ బంతి ప్రారంభమైంది.అంతట్లో కలకలం .మగపెళ్ళివారు వచ్చారని. నేను గదిలోనుండి తొంగి చూడటానికి ప్రయత్నించాను.మా అన్నపూర్ణ పిన్ని అమ్మలూ!ఏమిటది? నువ్వు పెళ్లి కూతురివి.సిగ్గుపడాలి.అలా చూడకూడదు అని మందలింపు.లేనిది ఎక్కడినుండి వస్తుంది అని స్నేహితుల వేళాకోళం .లోపల ఇలా సాగుతుండగా బయట పెళ్ళి
వాళ్ళని ముఖద్వారం వద్ద నే ఆపి బ్యాండ్ మేళం వాళ్ళని పిలుచుకురావటానికి ఎవరో సినిమా హాల్ దగ్గరకి పరుగెత్తారు.
పెళ్లి కొడుకు మొహం నీరసంగా ఉంది.మొహంలో నవ్వు లేదు.(మొదలే మావారు నవ్వటం తక్కువ. కానీ నవ్వితే మాత్రం చాలా బాగుంటారండోయ్.) ఏం జరిగింది? పెళ్లి కొడుకు బస్సులో వచ్చాడేంటి అనుకున్నారు.మెల్లమెల్లగా విషయం తెలిసి అందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే పెళ్ళి కొడుకు ని చేసినప్పుడు బంధువులెవరో అతి ప్రేమతో కాస్త నెయ్యి ధారాళంగా పోసి వండిపెట్టి తినిపించిన పిండి వంటలు పెళ్లి కొడుకు పొట్టను అప్ సెట్ చేశాయి.పైగా పెళ్లి కొడుకు ఎక్కిన కారు మధ్యలో ఆగిపోయింది. మరోకారు మాట్లాడి డెకరేషన్ దానికి మార్చుకుని బయల్దేరి వస్తుంటే ఆ కారు కూడా ఆగిపోయింది.చివరకు ఆలస్యమవుతోందని పెళ్లి కొడుకుని బస్సు ఎక్కించి పంపించారు.
అదీ సంగతి.
తెల్లవారు ఝాము ముహూర్తం కనుక బ్రతికి పోయాం అని అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
ఆ తర్వాత పెళ్ళి వేడుకలన్నీ సందడిగా, సరదాగా సాగిపోయాయి.
కొసమెరుపు ఏమిటంటే ఈ సందడిలో పెళ్లి వాళ్ళు పెళ్లి కూతురి బట్టలు సర్ది పెట్టిన సూట్ కేస్ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చారు.అలా నా పెళ్లి ఒక్క చీరమీదే జరిగిపోయింది.
ఇవండీ! నేటికీ నాకు నిన్నమొన్న జరిగినట్లు అనిపించే నా పెళ్లి ముచ్చట్లు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.12.2019.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
13. మార్కులు - పాయింట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పదవ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ,వారి తల్లిదండ్రులకి ఒక ఉపాధ్యాయురాలిగా నాదొక విన్నపం. ఇది చదివిన వారు దయచేసి దీనిని షేర్ చెయ్యండి.
ఈ రోజు పాసైన ఎంతోమంది విద్యార్థులను చూశాను.ఎవ్వరి మొహాలలోనూ పాసయ్యామన్న సంతోషం లేదు.తల్లిదండ్రులలో సంతృప్తి లేదు.మీ బాబు ఏడండీ అభినందనలు చెప్తాను అంటే వాడు దిగులుగా ఉన్నాడండీ,ఏడుస్తూ కూర్చున్నాడు.వాడికి తొమ్మిది పాయింట్లే వచ్చాయి.పది వస్తాయనుకున్నాడు.ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం?ఇంకాస్త శ్రద్ధగా చదివితే బాగుండేది అన్న నిరాశలు ,నిస్పృహలు వినిపించాయి.
ఈ రోజు మార్కులకే విలువ.
విజ్ఞానానికి కాదు.పోటీ చాలా ఉంది.
ఇవన్నీ నేను కూడా ఒప్పుకుంటాను.
కానీ ఒక్కసారి ఆలోచించండి.
నేటి పిల్లలు చదువులో పడి తమ పసితనాన్ని కోల్పోతున్నారు.
ఎన్ని కార్పొరేట్ పాఠశాలలకు ఆటస్థలాలు ఉన్నాయి?
పదవతరగతి పిల్లలకు వేసవి సెలవలు ఉన్నాయా!
తొమ్మిది పూర్తి అయ్యీ కాకముందే వాళ్ళకి టార్చర్ మొదలు.
చిన్న చిన్న ఆనందాలకు కూడా దూరమయ్యాక వారు తమ ఒత్తిడిని అధిగమించే మార్గాలేవి?
ఒక్కసారి ఏ చెరుకు రసం బండి దగ్గరైనా నిలబడి నిదానంగా గమనించి చూడండి.అందులో వేసిన చెరుకు గడలకు,మన టెంత్,ఇంటర్ విద్యార్థులకు ఏమైనా తేడా కనబడుతుందా!
వారి బాల్యపు ఆనందాల్ని చెరుకు పిప్పిలా పీల్చేసి,వారి విజయాల ఆనందాన్ని మనం చెరకు రసంలా ఆస్వాదిస్తున్నామేమో కదూ!
మనకు పిల్లల మీద చాలా ప్రేమ ఉంది.
దాన్ని వ్యక్తం చేసే పద్ధతిని మార్చుకుందాం.
తక్కువ మార్కులు వచ్చాయనుకుంటున్న పిల్లల్ని లాలించి ఆ దిగులుని పోగొట్టండి.
వారి విజయాన్ని ఆనందిద్దాం.
అపజయాన్ని గెలిచే ఆసరా అందిద్దాం.
వారు ఫెయిల్ అయినా,తక్కువ మార్కులు వచ్చినా ఓదార్చి రేపటి గెలుపుపై నమ్మకాన్ని కలిగిద్దాం.
సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్
న.ర.సం.రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.4.2018
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
14.అత్తమ్మ స్మృతి లో
అత్తమ్మ స్మృతి లో
మా అత్తగారి పేరు రోశమ్మ.ఆవిడ 2012 ఆగస్ట్ 2 వ తేదీన చనిపోయారు. నేటికి ఆవిడ మాకు దూరమై 8 సంవత్సరాలు పూర్తయింది.చనిపోయే నాటికి ఆవిడ వయసు 85 సంవత్సరాలు ఉంటుందనుకుంటా. దాదాపుగా పాతికేళ్ళ అనుబంధం మాది.నా జీవితంలో అంత సహృదయం కలిగిన స్త్రీ మూర్తి ని నేను చూడలేదు.
మా జీవితంలో ఒక్క విషయంలోనూ అభిప్రాయ భేదం రాలేదంటే మీరు నమ్మగలరా!కానీ ఇది అక్షర సత్యం.ఆవిడేమీ చదువుకోలేదు.
ఆరుగురు కొడుకులు .కూతుళ్ళు లేరు.నేను ఐదవ కోడల్ని.
నాతోనే కాదు ఏ కోడలితోనూ ఆవిడకు గొడవలు లేవు.నాకు కూతుళ్ళయినా కోడళ్ళయినా వాళ్ళే అని మురిపెంగా చెప్పుకునేది.
మా అత్తగారికి నాకూ ఎంత స్నేహం అంటే మా ఆయనకు నాకు మధ్య కొన్ని రహస్యాలు ఉన్నాయిగానీ, ఆవిడకీ నాకూ రహస్యాలే లేవు.
అన్ని విషయాలు చెప్పేసేదాన్ని.ఈ మాట అబ్బాయి తో అనకులేమ్మా!కోప్పడతాడేమో అనేది.ఆయన నన్ను ఒక చిన్న మాట కూడా అననిచ్చేది కాదు.నన్ను అంతగా ప్రేమించే ఆవిడ
మా పెళ్ళికి ముందు మాత్రం చాలా బాధ పడ్డారట.ఎందుకంటే ఆవిడకు ఒక కోయదొర నీ ఆరుగురు కొడుకుల్లో ఒకడు నీకు దూరం అవుతాడు అని చెప్పాడట.అందుకని నన్ను పెళ్ళి చేసుకుంటానని ఆయన ఇంట్లో చెప్పడంతోటే ఆ కొడుకు ఈయనే అని ఫిక్స్ అయింది.
ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, పెద్దింటి పిల్ల నా కొడుకుని నాకు దూరం చేస్తుంది అని ఏడ్చిందట.అయినా కొడుకు మీద ఉన్న ప్రేమతో పెళ్ళి ని కాదనలేక పోయింది.ఆ
తరువాత నాకు ఆ సంగతి తెలిసి అడిగాను. అమ్మాయ్!నువ్విలా కలిసిపోతావని నాకేం తెలుసు? అని నవ్వింది.
మేం మా ఊరికి వెళ్లి నప్పుడు ఇద్దరం ఆరుబయట మంచం వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూసి ఏం పెద్దమ్మా! ఈ కోడలు గురించి అప్పుడు ఏడిస్తివే! అని ఆమెను చూట్టుపక్కల వాళ్ళంతా ఆటపట్టించేవాళ్ళు.మంచంలో ఉన్న మా మావగారికి ఏడేళ్ళ పాటు ఎంతో సేవ చేసింది.ఆయన
చనిపోయిన ఇరవై రోజులకి మా పాప పుట్టింది.మనవరాలిని చూసుకోవడానికి అప్పుడు మా దగ్గరికి వచ్చేసింది.అప్పటినుంచీ మా అనుబంధం మరింతగా బలపడింది.మా కాలేజీ వెనకే మా ఇల్లు ఉండేది.ఎప్పుడైనా
నేను కాలేజీ నుంచి రావటం లేటయితే కేరేజీ సర్దుకుని అక్కడికే తెచ్చేసేది.
సాయంత్రం ఇంటికి రాగానే చూడుఎంత సాలిపోయావో అంటూ కొంగుతో మొహం అద్దేది. గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చేది.ఆవిడకి గ్యాస్ పొయ్యి వెలిగించడం అంటే భయం.అందుకని వెళ్ళి కాస్త కాఫీ కలుపుకుని తాగమని చెప్పేది. నేను చెప్పే కబుర్లన్నీ ఆసక్తిగా వినేది.
అప్పట్లో మాకు సప్లిమెంటరీ పరీక్ష పేపర్లు ఇంటికి ఇచ్చేవారు దిద్దడానికి.అవి నేను దిద్దుతుంటే నా పక్కనే కూచునేవారు.ఎవరైనా ఫెయిల్ అయ్యాడు అని తెలిస్తే అమ్మాయ్! నాలుగు మార్కులు వేసి పాస్ చెయ్యమ్మా! పాపం! వాళ్ళ అమ్మానాన్నలు ఎంత కష్టపడి చదివి స్తున్నారో ఏమో అనేది. నా స్నేహితులందర్నీ ఆప్యాయంగా పలకరించేవారు.
ఒకటేమిటి!ఆవిడతో ఎన్ని అందమైన స్మృతులు పెనవేసుకున్నాయో!
నా కొడుకుని కోరి చేసుకుంది కదా!అన్నంత అపురూపంగా చూసుకునేది.
పిల్లల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించి ఎరుగదు.నా పెన్షన్ నాకు వస్తుంది.మీరెందుకివ్వాలి అనేది. నేనేమో! అత్తమ్మా! నీకు ఆరుగురు కొడుకులు ఉండీ నీ మందులు నువ్వు ఎందుకు కొనుక్కో వాలి?అయినా ఇది నీ కోడలి సంపాదన అని చెప్పి
నేనే బలవంతంగా మందులకు, హాస్పిటల్ కు ఇచ్చేదాన్ని.క్రిస్మస్ కి, ఈస్టర్ కి ,
రెండేసి చీరల చొప్పున కొనేదాన్ని. ఆ మాత్రానికే ఊళ్ళో అందరికీ నా కోడలు కొనిచ్చింది అని సంతోషంగా చూపించి చెప్పేది.
2002 లో మా అమ్మ చనిపోయింది.నేను ఏడుస్తుంటే అమ్మాయ్!ఊరుకో!మీ అమ్మ లేకపోతే ఏం? నేను లేనూ!అని ఓదార్చింది.
అన్నట్టు గానే నాకు ఆపరేషన్ జరిగినప్పుడు నా తల్లిలాగే నాకు అన్ని సేవలూ చేసింది.కానీ ఆవిడకు ప్రేమను పంచడమే గానీ ,సేవ చేసే భాగ్యం మాత్రం నాకు కలగలేదు.ప్రైవేటు, ఉద్యోగం కావడం,నెలకు రెండు కంటే ఎక్కువ సెలవులు ఇవ్వకపోవడం చేత ఆవిడకు అనారోగ్యం కలిగినప్పుడు మా శాంతక్కే ( మా 4వ తోడికోడలు) ఎంతో సేవ చేసింది. కనీసం హాస్పిటల్ ఖర్చన్నా పెట్టుకుందామని బిల్లు మేం కడితే, కాస్త ఓపిక రాగానే బ్యాంకు కి వెళ్ళి మా డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చేసింది.నా కాడ లేకపోతే మీరు పెట్టాలి.ఉన్నాయి కదా! అని అన్నది.అప్పట్లో ఆ బిల్లు పెట్టుకుంటే 80 శాతం రీ ఎంబర్స్మెంట్ ఉంటుందని మా వారికి తట్టలేదు.తరువాత ఎప్పుడో చాలా కాలానికి ఆ సంగతి గుర్తుకొచ్చింది.
ఇక
నేను అందరికీ అన్నీ ఎక్కువ ఎక్కువగా ఇచ్చేస్తానని అమ్మాయ్!ఎందుకలా అందరికీ అన్నీ పెడతావు,డబ్బులుంటే చద్ది పడతాయా! అంటూ మందలించేది. .వెంటనే నేను
*సంతోషముతో ఇచ్చెడి వాని
ఎంతో దేవుడు ప్రేమించునులే *అని ఒక బైబిల్ పాట పాడేదాన్ని.వెంటనే మురిపెంగా నవ్వుకునేది. అత్తమ్మా!దేవుడికి దశమభాగం ఎందుకు?ఎవరైనా పేద వాళ్ళకు నీకు తోచినంత సహాయం చేయచ్చు కదా!అని నేను ,మా వారు కూడా చెప్పేవాళ్ళం. కొడుకు మాటంటే ఎంతో గురి ఆవిడకు.
తరువాత , తరువాత తను కూడా తన పెన్షన్ తీసుకోగానే పిల్లలు పట్టించుకోని ఇద్దరు ఆడవాళ్ళకు చెరొక వంద రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టింది. అలా ఆవిడను మా దారిలోకి మార్చేశాము.ఎన్నని చెప్పను?
మా అత్తమ్మతో అనుబంధం తీయతీయని జ్ఞాపకాల ఊట.దాన్ని తవ్వేకొద్దీ ఆనందాల దోసిళ్ళు నిండుతూనే ఉంటాయి. ఒక్కసారైనా, ఒక్క చిన్నమాట తేడా అయినా రాకుండా ఏ అనుబంధమూ ఉండదు.అత్తాకోడళ్ళ బంధం అసలే ఉండదు.కానీ మా బంధం మాత్రం లోకానికి భిన్నమనే చెప్పాలి. దానికి కారణం నూటికి నూరుపాళ్లు ఆవిడ సహృదయమే .
ఇదంతా విని నేనెంత కట్నం తెచ్చానో!అనుకునేరు.
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సుమండీ!
అత్తను కూడా అమ్మలాగే చూసుకోవాలి అని నా తల్లి నేర్పిన సంస్కారం తప్ప నేను పట్టుకెళ్ళినది ఏమీ లేదు.
అలాంటి అత్తగారిని ఇచ్చిన మా ఆయనకు జన్మంతా ఋణపడి ఉంటాను.ఆవిడ మధురస్మృతులు మనసంతా నిండిపోగా మనసులోనే మా అత్త(అ)మ్మకు అంజలి ఘటిస్తూ నేను సమర్పిస్తున్న
నివాళి .
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
02.08.2020
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
15.ఆ కాపురం
ప్రేమ సుధాపూరం
ఏమండీ!ఈ రోజు ఏం కూర చేయమంటారు?
ములక్కాయలు వేసి పప్పుచారు పెట్టి,బంగాళదుంపలు వేయించు.
టమాటాలు పాడయిపోతున్నాయి.
దొండకాయలు పండిపోతున్నాయి. దొండకాయ వేపుడు చేసి,టమాటా పప్పు చేస్తాను.
మరి ఈ మాత్రం దానికి నన్ను అడగడమెందుకో?
*******************
ఏమోయ్! స్నానం చేసి వచ్చి చాలా సేపయింది.మరో కప్పు కాఫీ ఇస్తావేమిటి?
అబ్బబ్బ! వస్తున్నానుండండి. వంటింట్లో పని తెమలక నేను చస్తుంటే, గోవిందరాజుల స్వామిలా తీరిగ్గా పడుకుని ఆర్డర్లు వేస్తుంటారు.తెచ్చేలోపు హడావిడి.ఒక్క క్షణం ఆగలేరూ!
*******************
ఎక్కడికన్నా వెళ్దామంటే ఒక్క పట్టుచీర కూడా లేదు కదా!
నాకు కోపం తెప్పించకు.ఇప్పుడే వెళ్ళి ఓ అరడజను పట్టుచీరలు తెచ్చి పడేస్తాను. ఏమనుకున్నావో!
ఆ కోపం మీకు వచ్చేది లేదు.తెచ్చేదిలేదు.
మీరు తెచ్చిన చీరలతోటే ఇక్కడ బీరువా నిండిపోయింది.
*******************
ఏమోయ్! పప్పు తాళింపులో వెల్లుల్లి పాయ వేశావా!
వేశాను.
ఏదీ!నా కొక్కటీ తగల్లేదు.
అదేం ఖర్మమో!ఈ పిల్లలకు వస్తాయి.తీసి పక్కన పడేస్తారు.మీకేమో ఒట్టు పెట్టుకున్నట్లు ఒక్కటీ రావు.
*******************
అబ్బా! ఈ బొబ్బట్టులో ఈ రాయేమిటి?నా పళ్ళు నలభయ్యేళ్ళకే ఊడిపోయేలా ఉన్నాయి నీ వల్ల.
ఆ పెసరపప్పు శుభ్రంగా గాలించాను కూడాను.ఎక్కడో మిగిలిపోయిన ఆ ఒక్కటీ శాపం పెట్టినట్లు మీకే వస్తుంది అదేమిటో?
*******************
ఈ బంగాళదుంప ముక్కలేమిటి? ఇలా కళ్ళిప్పుకుని చూస్తున్నాయి?
ఏం చెయ్యను? స్టవ్వు హైలో పెడితే మాడిపోయి ఛస్తాయి.సిమ్ లో పెడితే వేగి ఛావవు.అయినా,ప్రతి దానికీ ఏదో ఒక వంక పెడతారు.అందుకే మా అమ్మ అనేది వంట వచ్చిన మగవాడిని పెళ్ళి చేసుకోకూడదు అని.
ఇలా నిత్యం ఈ విసుర్లు, కసుర్లు వారి సంసారంలో సర్వ సాధారణమైనా, వారి కాపురం మాత్రం అన్యోన్యం.వారి జీవితం ఆదర్శప్రాయం.వారి జంట మా చుట్టాలందరికీ కన్నుల పంట.నాకు తెలిసి ఈ గిల్లికజ్జాలు తప్పించి వారు సీరియస్ గా పోట్లాడుకుని ,గొడవలు పడిన సందర్భాలే లేవు.
వారు 55 ఏళ్ళ క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మా అమ్మానాన్నలు కీర్తిశేషులు సింహాద్రి వీరభద్రాచారి , విశాలాక్షి గార్లు.
నాకంటే ఒక్క ఏడాది పెద్ద వారి వివాహ వయస్సు.
1965 ఆగష్టు 13 మా అమ్మానాన్నల పెళ్ళి రోజు.
సర్టిఫికెట్ ప్రకారం నా పుట్టినరోజు కూడా ఆగష్టు 13.
వారానికో సినిమా, నెలకొక ప్రయాణం,సంవత్సరానికొక విహారయాత్ర , బంధువులందరికీ తలలోనాలుకలా శుభాశుభాలన్నింటికీ చేదోడు,తాము కాపురమున్న ఇంటి చుట్టుపక్కల అందరికీ పెద్ద దిక్కుగా మెలిగిన అమ్మానాన్నల జంట ప్రయాణం 2002 లో అమ్మ వెళ్ళి పోవడంతో ఆగిపోయింది.2014లో నాన్నగారు వెళ్ళిపోయేవరకూ ఆయన మనసులో ,తలపులలో నిత్య జ్ఞాపకం గా నిలిచిపోయింది.ఆ పన్నెండు ఏళ్ళ లో నాన్నగారు అమ్మను గుర్తుచేసుకోని సమయమూ ,సందర్భమూ లేవు అనడం అతిశయోక్తి కాదు.
ఆలుమగలలో ఒకరు మరణించినా, రెండవ వారు ఆ జ్ఞాపకాలతోనే నిత్యమూ సహజీవనం చేస్తూ ,ఇద్దరి ప్రేమనూ తామే బిడ్డలకు పంచుతూ,
*ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు*అనే కవి వాక్కును నిజం చేస్తూ జీవించటం కూడా ప్రేమే.
నాకు 18 ఏళ్ళు వచ్చేవరకూ అమ్మ మెడలో ఒక బంగారు గొలుసు కూడా లేదు.అయినా చింతా లేదు.పదిమందిలోకి వెళ్ళడానికి చిన్నతనంగా ఫీలయిందీ లేదు. ఆస్తులు కూడబెట్టాలన్న ఆలోచన కూడా లేదు.
అప్పు చేయడం అన్న కాన్సెప్ట్ అసలే లేదు.
ఉన్నదానిలోనే సర్దుకుని, సర్దుకుంటున్నామనే భావనలేకుండా, సంతృప్తిగా గడపటం వారికి అలవాటు.మమ్మల్నీ అలాగే పెంచారు. అలాగని మాకు ఏ విషయంలోనూ తక్కువ చేసిందీ లేదు.
నేను , తమ్ముళ్ళు నేటికి కూడా ఎంతో ప్రేమగా ఒకరితో ఒకరం ఉంటున్నామంటే అది వారు నేర్పిన సంస్కారమే. మా వైవాహిక జీవితాలు ఆనందంగా ఉన్నాయంటే అది కూడా వారిని చూసి నేర్చుకున్నదే.
మరణించిన వారి పుట్టినరోజులను జయంతి అంటారు.చనిపోయిన రోజు ను వర్ధంతి అంటారు.మరి పెళ్ళి రోజును ఏమంటారో ?
ఆ లోకంలో కూడా వాళ్ళు ఇలాగే ఆనందంగా , అన్యోన్యంగా , ఆదర్శం గా ఉండి ఉంటారని నమ్ముతూ
అమ్మానాన్నలకు పెళ్ళి రోజు శుభాకాంక్షలతో
మీ అమ్మలు
పెదబాబు
చినబాబు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.8.2020
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
16.జై చిరంజీవ
మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాటిలో 131 సినిమా పేర్లతో
సురేఖా పరిణయ కథ.
*జై చిరంజీవ*
ఈ కథ ఇప్పటిది కాదు.
ఇది చాలా ఏళ్ళ క్రితం మాట .
సురేఖ గారి *డాడీ* అదేనండీ! మన అల్లు రామలింగయ్య గారు,ఆమె *అన్నయ్య* అరవింద్ గారు వాళ్ళ అమ్మాయికి *హీరో* లాంటి *మొగుడు కావాలి* అనుకున్నారు.
అమ్మాయికి పెళ్ళి చేసి *చూడాలని ఉంది* అని అల్లు గారూ, *బావగారూ! బాగున్నారా* అని పిలవాలని అరవింద్ గారు పెళ్ళి కొడుకు ల *వేట* లో పడ్డారు.మంచి సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పండి అని అల్లు గారు *స్నేహం కోసం* ప్రాణం ఇచ్చే తన *ఇద్దరు మిత్రులు* అయిన *తాయారమ్మ బంగారయ్య* లను అడిగారు.
వాళ్ళు దానికేం భాగ్యం! అలాగే చూస్తాం .కానీ నువ్వొక *మొండి ఘటం*.
మొన్నటికి మొన్న *కొండవీటి రాజా* సంబంధం తెస్తే , వాడు *కొండవీటి దొంగ* లా ఉన్నాడు వద్దు పొమ్మన్నావు. ఆహా సరేలే అని ఆ *శంకర్ దాదా MBBS* సంబంధం తెచ్చాం. *శంకర్ దాదా జిందాబాద్* అంటావనుకుంటే ,దాదానా! అదేం పేరు? *రుస్తుం*, *బిగ్ బాస్*, *స్టేట్ రౌడీ* , *గ్యాంగ్ లీడర్* ఇవా పేర్లు? .ఆ పేరు నాకు నచ్చలేదు వద్దు అనేశావు. ఈసారి నీకు తప్పక నచ్చుతుందని *SP పరశురాం* సంబంధం తెచ్చాం.నాకు ఈ ఎస్పీలు, *గూఢచారి నెంబర్ వన్* లు నచ్చరన్నావు.
అవునోయ్.అన్నాను. అన్నావు అంటే అననూ మరి! నా తిప్పలు మీకేం తెలుసు? నా కూతురు నా ప్రాణం .*ప్రాణం ఖరీదు* కట్టగలమా! మొన్నామధ్య పెళ్ళిళ్ళ పేరయ్య కనబడితే అమ్మాయి కి సంబంధాలుంటే చెప్పమని అడిగాను.ఏవరో *మెకానిక్ అల్లుడు* అట.పేరు *నాగు* అని,వాళ్ళ మేనమామ షెడ్డుకి వాడే *బిగ్ బాస్* అని ఫోటో చూపించాడు.నాగు ఏమిటి? *పున్నమి నాగు* లాగా. వాడు బిగ్ బాస్ లా లేడు . సినిమాలలో *కిరాయి రౌడీలు* చుట్టూ చేరే
*కొత్తపేట రౌడీ* ఉంటాడు చూడు.అలా ఉన్నాడు. పేరయ్య తమ్ముడు వీరయ్య పంతులు ఇంకో ఫోటో చూపించాడు.వీడు *పల్లెటూరి మొనగాడు* బహు *రోషగాడు* .పేరు *రుద్రనేత్ర* అన్నాడు.తీరా చూద్దును కదా!చింత నిప్పుల్లాంటి కళ్ళతో వాడు
*యమ కింకరుడు* లాగా ఉన్నాడు.చూడబోతే ఆ పెళ్ళిళ్ళ పేరయ్య,అతని తమ్ముడు *తోడు దొంగలు* లా ఉన్నారు.లేకపోతే పెళ్ళికి *పునాది రాళ్ళు* వేయవలసిన వీళ్ళు ఇలాంటి *టింగురంగడు* సంబంధాలు చూపిస్తే ఒళ్ళు మండదూ!
అర్థం అయింది.
నువ్వు
మనసులో నాకిలాంటి అల్లుడే కావాలి అని *చాణక్య శపథం* ఏదో చేసి ఉంటావు.అందుకనే ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక సాకు చెప్పి వద్దంటున్నావు.నీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటో చెప్తే దానిని బట్టి తగిన సంబంధం చూద్దాం అన్నారు.
దానికి అల్లు గారు ఆ! అబ్బే! పెద్దగా ఏముంటాయి? నాకేమీ *మంత్రిగారి వియ్యంకుడు* అయిపోవాలనే *అభిలాష* లేదు.కానీ రోజులు చూస్తే బాగోలేవు.అమ్మాయిల వెంటపడి *ఐ లవ్ యూ* అంటూ *ప్రేమ నాటకం* ఆడే *ప్రేమ పిచ్చోళ్ళు* తయారయ్యారు ఎక్కడ చూసినా! అలాంటి *నకిలీ మనిషి*, *మోసగాడు*, *కోతల రాయుడు*, *మహానగరంలో మాయగాడు* వస్తే వాడు *అత్తకు యముడు అమ్మాయికి మొగుడు* అయి కూర్చుంటాడు.
*ఇది కథ కాదు* కదా! నిండు నూరేళ్ళ జీవితం.
తెలిసీ తెలియకుండా పెళ్ళి చేస్తే ,వాడు మా కర్మ కాలి *గూండా*, *దొంగ* (వాడు *జేబు దొంగ* *మంచి దొంగ* ఎవరైనా కావచ్చు ) అయితే, మా అమ్మాయి భర్త *దొంగ మొగుడు* అని చెప్పుకోలేం కదా! ఏ పోలీస్ ఆఫీసరో వాడి ని *ఖైదీ* గా పట్టుకుని ,*స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్* కు పట్టుకుపోయి *ఖైదీ నెంబర్ 786* అనో, *ఖైదీ నెంబర్ 150* అనో ముద్ర వేస్తే మా పరువేం కావాలి? అసలే *చట్టానికి కళ్ళు లేవు*. ఇక *న్యాయం కావాలి* అంటూ *చట్టంతో పోరాటం* చేసి అల్లుణ్ణి విడిపించుకోవటం మా వల్ల అవుతుందా!
ఇక చూస్తూ చూస్తూ *ముఠా మేస్త్రి* *రిక్షావాడు* లాంటి సంబంధాలు చేయలేం కదా!
అలాగని *రాజా విక్రమార్క* నో *చక్రవర్తి* నో మా అమ్మాయి కి *ఘరానా మొగుడు* గా తెమ్మనేంత అత్యాశ లేదు నాకు.
*ఠాగూర్* లాంటి దేశభక్తుడు కాకపోయినా, *ఇంద్ర* వైభవం లేకపోయినా మరీ *హిట్లర్* , *స్టాలిన్* లాంటి *దేవాంతకుడు , *రౌడీ అల్లుడు* మాత్రం వద్దు.
అలాంటి *కిరాతకుడు* , *రాక్షసుడు* మొగుడైతే అమ్మాయి కాపురం *సంఘర్షణ* లో పడిపోతుంది. పిల్ల కాపురం *ఆరని మంటలు* *జ్వాల* లు చెలరేగే *అగ్ని గుండం* అవుతుంది.జీవితం *యుద్ధభూమి* అయి ,కూతురి బ్రతుకులో *మరణమృదంగం* మోగటం ఏ కన్నతండ్రి అయినా భరించగలడా!
*ఇంటి గుట్టు* రచ్చకెక్కుతుంది.
నా కూతురు ,నా *రక్తబంధం* దాని నుదుట నేను *రక్త సింధూరం* దిద్దగలనా! అది *అడవిదొంగ* లు సంచరించే కారడివిలో క్రురమృగాలైన *పులి* ,*మృగరాజు,* *కొదమ సింహం* చేత వేటాడ బడుతున్న జింక పిల్లలా కన్నీళ్ళతో బేలగా నా వైపు చూసి నాన్నా! *ఇది పెళ్ళంటారా!* అని నన్ను నిలదీసే రోజు ఎప్పటికీ రాకూడదు. అంటూ ఒక్క క్షణం ఆగి మిత్రుల వైపు చూశారు అల్లు.
సీతమ్మ కష్టాలు చూసి తల్లడిల్లిన *శ్రీ రామ బంటు* లాంటి తండ్రి మనసును చూసి ఒకపక్క అయ్యో అనిపిస్తున్నా,మరొక పక్క ఆ సుదీర్ఘ మైన సుత్తికి
వాళ్ళ సహనం చచ్చిపోతోంది.ఇంతలో *ఆపద్బాంధవుడు* లాగా వంటవాడు వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళాడు.అది తాగి తేరుకున్న తరువాత
అయ్యా! నీ కూతురికి సంబంధం ఆ *త్రినేత్రుడు* కూడా తేలేడు.మమ్మల్ని చంపక ఎలాంటి అల్లుడు కావాలో చెప్పు.అదుగో ఒకసారి ఆ *చంటబ్బాయి* వైపు చూడు , పాపం బిత్తర పోయిన ఆ *పసివాడి ప్రాణం* ఎలా విలవిల లాడిపోతోందో చూడు అని అక్కడ పక్కనే బిక్కమొహంతో ఆడుకోవడం మరచిపోయి నించున్న పిల్లాడిని చూపించి విసుక్కుంటూ ఉంటే,
వస్తున్నా,వస్తున్నా అక్కడికే వస్తున్నా!
నాకు కాబోయే అల్లుడు *ధైర్యవంతుడు* అయి ఉండాలి.
*బంధాలు అనుబంధాలు* తెలిసిన వాడై ఉండాలి. *స్వయంకృషి* తో పైకి వచ్చి *విజేత* గా నిలిచిన *తిరుగులేని మనిషి* అయి ఉండాలి. *ఆలయ శిఖరం* అంత ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. నా కూతురు, అల్లుడు జంట *జగదేక వీరుడు అతిలోక సుందరి* లా లేకపోయినా, *పార్వతీ పరమేశ్వరులు* లా ఉండాలి. *ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య* లా వేషాలేయకుండా, మా అమ్మాయిని *ఆరాధన* తో గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి.అలాంటి వాడు, *అందరివాడు* స్కూల్ *మాస్టర్* అయినా ఫరవాలేదు.
అనగానే మిత్రులు ఇంకేం చెప్పకు సంబంధం సిద్ధంగా ఉంది.ఒరేయ్ *శివుడు శివుడు శివుడు* కాస్త చక్కెర పట్టుకురా! మీ అయ్యగారి నోరు తీపి చేద్దాం.మంచి అల్లుడు దొరికేశాడు అంటూ పనివాణ్ణి కేకేశారు.
రామలింగయ్యా! మీ అమ్మాయి అదృష్టవంతురాలోయ్!
నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న కుర్రాడు ఉన్నాడు.
అబ్బాయి చాలా మంచివాడు.
పేరు *అంజి* అంటూ పాతకాలం పేరు అనుకున్నావేమో.! కాదు *చిరంజీవి*.ఎవర్ గ్రీన్ నేమ్. అబ్బాయి *మగధీరుడు* లా *మగమహారాజు* లా చాలా *స్టైల్* గా ఉంటాడు . బుద్ధిమంతుడు.
*లంకేశ్వరుడు* భక్తితో *రుద్రవీణ* ను పలికిస్తే కరుణించ వచ్చిన ఆ *శ్రీ మంజునాథ* స్వామి భక్తుడు కూడానూ. ఎలిజిబుల్ బ్యాచిలర్ అని *ఛాలెంజ్* చేసి చెప్పగలం.కావాలంటే వాళ్ళ ఊరి పెద్ద *సైరా నరసింహా రెడ్డి* ని ఒకసారి వాకబు చేసి చూడు అంటూ, ఇంకేం మాట్లాడనివ్వకుండా
ఆ సంబంధానికి ఒప్పించి , *శుభలేఖ* లు వేయించారు.పెళ్ళి కోసం *ఆచార్య* ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.
*ప్రేమ తరంగాలు* పేరుతో మేరేజ్ బ్యూరో నడుపుతూ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే *బిల్లా రంగా* *కాళి* అనే *ముగ్గురు మొనగాళ్లు* వచ్చి పెళ్ళి పనులన్నీ చకచకా కానిచ్చారు. *47 రోజులు* లోపే అంగరంగ వైభవంగా పెళ్ళి చేయించి *శ్రీరస్తు శుభమస్తు* అని దీవించారు.పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళి కొడుకుని *ది జెంటిల్ మేన్* అంటూ అల్లూగారి *అల్లుడా! మజాకా!* అని చెప్పుకున్నారు. ఇక బ్యూటీషియన్ *రాణీ కాసుల రంగమ్మ,*, సురేఖ స్నేహితురాళ్ళు *ప్రియ* ,*చండీప్రియ* పెళ్ళి కూతుర్ని
ఎంతో ముచ్చటగా అలంకరించారు! అమ్మాయి అచ్చు *సీతాదేవి* లా ఉంది సుమా అని అందరూ మెచ్చుకోవడం చూసి హమ్మయ్య! అల్లూగారికి మంచి అల్లుణ్ణి తేగలిగాం అని సంతోషంతో సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తరువాత అల్లు గారు *కొత్త అల్లుడు* సిగ్గుపడతాడేమో అని వారిని ఎటైనా ఓ పదిరోజులు తిరిగి రమ్మని అన్నారు. వెంటనే వధూవరులిద్దరూ *లవ్ ఇన్ సింగపూర్* అంటూ హనీమూన్ కి చెక్కేయటంతో
సురేఖా పరిణయం సుఖాంతం అయ్యింది.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.8.2020
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
17.సంసారం లో సరిగమలు
నిజమేగా!
ఆ రోజు శ్రావణ శుక్రవారం.తల స్నానం చేసి స్కూల్ కి ఆలస్యం అయిపోతోంది అని హడావిడిగా రెడీ అవుతున్నాను.మా వారు పేపర్ లోంచి తలెత్తి ఒకసారి నా వైపు చూశారు.
ఆ చూపు అర్థమై వేడిగా ఒక కప్పు కాఫీ తెచ్చి ఇచ్చాను.
ఆ కాఫీ అందుకుంటూ అబ్బో!కళకళలాడి పోతున్నావే అని అన్నారు మెరిసే కళ్ళతో .పాపం! నిజానికి మా ఆయన కు అంతకంటే ఎక్కువగా పొగడటం చేతకాదు. అలాంటప్పుడు అరుదుగా దొరికే ఇలాంటి అవకాశాన్ని నేను జారవిడుచుకోదలచుకోలేదు.
నిజానికి
నేను పెద్ద ఆర్భాటంగా ఏమీ తయారవలేదు కూడా.ఆ మాటకొస్తే నేను పెళ్ళిళ్ళకు, పేరంటాలకు వెళ్ళినా నగలేమీ వేసుకోను.నేను అసలు నగలే కొనుక్కోను కూడా.తాళిబొట్టు , నల్లపూసలు అంతే.
మా వారితో అన్నాను.
ఏమండీ! నా వల్ల మీకసలు పైసా ఖర్చు లేదు.
మేకప్ వేసుకోకపోయినా, ఒంటినిండా నగలు అలంకరించుకోకపోయినా,పట్టుచీర కట్టుకోకపోయినా
బొట్టు, కాటుక పెట్టుకుని, కాటన్ చీర కట్టుకుంటేనే కళకళలాడిపోయే భార్య దొరికింది. నిజంగా మీరు చాలా లక్కీ అన్నాను నవ్వుతూ.
మరి ఏం చేద్దాం! ఆయనకు పెళ్ళాన్ని పొగడటం రాకపోతే, మనసెరిగిన ఇల్లాలుగా ఆయన మాటల అంతరార్థాన్ని గ్రహించి ఇలా నన్ను నేనైనా పొగుడుకోవద్దూ!
ఆయన హృదయానికి నేను అనువాదాన్ని.ఆ మాత్రం అర్థం చేసుకోలేనూ!
అయినా మనలో మన మాట. నిజం చెప్పండి.
ఆ మాటల భావం అదేగా!
ఘరేంటి!ఎంత గడుసుదనం అన్నట్టు అలా చూస్తారు!
అర్థం చేసుకోరూ.....!
హహహహహహ....
మా రాజశేఖరుడి హృదయం జ్యోతిర్మయం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.8.2020
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
18.అనింద్య గణపతి
అనింద్యా!ఆగు,ఆగు.
నన్ను ఎక్కించుకోకుండా ,ఏమిటా పరుగు?
అయ్యో!మీకు తెలియనిది ఏమున్నది స్వామీ!మనం వెళ్తున్నది భూలోకం కదా! అక్కడ ఈ మధ్య మనమెన్నడూ కనీవినీ ఎరుగని రోగమొకటి మొదలయ్యింది కదా!
అక్కడ భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.అందుకని స్వామీ!
పైగా మీరు ఈ తొమ్మిది రోజులు భూలోకంలో ఇల్లిల్లూ,వీధి వీధి తిరుగుతారాయే!
ఆ కరోనా మీకు గానీ సోకితే నా గతి ఏంకాను?
అది సోకకుండా ఉండాలంటే వ్యాయామం చేయడం ఉత్తమం అని వైద్యులు చెపుతున్నారు.కనుక నాలుగు అడుగులు నడిస్తే మీకు కూడా వ్యాయామం చేసినట్లు అవుతుందిలే స్వామీ!
నిన్నమొన్నటి దాకా మీ నాన్నగారు శ్రీశైలం లో,మీ అమ్మ గారు విజయవాడ లో,మీ మామయ్య తిరుమల లోనూ టెంపుల్ క్వారంటైన్ లోనే ఉండిపోయారు తెలుసా!
నిజమే సుమా అనింద్యా! కాణిపాకం నుండి ఎటూ కదలద్దని అమ్మ నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడాను.
చూశారా మరి! మీరు కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు,పానకం మీద ఆశతో తొందరపడుతున్నారు.
అదొక్కటే కాదులే అనింద్యా! ఏడాదంతా గుడిలో బందీగా ఉంటానా!నా పుట్టినరోజు పేరు చెప్పుకొని ఈ తొమ్మిది రోజులైనా, వీధుల్లో , పిల్లలతో, సందడిగా గడపవచ్చని నా ఆశ.
వద్దులే స్వామీ!ఈ ఒక్క ఏడాదికి వీధుల్లోకి వెళ్ళకుండా ఇళ్ళల్లోనే పూజలందుకోండి.
ఇదుగో!ఈ మాస్క్ తగిలించుకోండి.ఎవరైనా మిమ్మల్ని తాకితే గనుక ఈ శానిటైజర్ రాసుకుంటూ ఉండండి.మీకేదన్నా అయితే అమ్మగారు నన్ను కోప్పడతారు.నీకెలాగూ ఒకచోట కాలు నిలవదు.మా అబ్బాయిని కూడా నీతో పాటు తిప్పుతున్నావా అంటూ !
అంతగా కావాలంటే ఈ ఏడాదికి మన చిలకమర్తి వారి గణపతి ని పంపుదాం.
పాపం భూలోకంలో ఉన్నంతకాలం కావలసినన్ని కుడుములు ,ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం దొరకక చాలా నిరాశపడ్డాడు.ఈ దెబ్బ తో అతడి కోరిక తీరిపోతుంది.
అన్యాయం అనింద్యా!అతనికేమన్నా అయితే!
అయ్యో స్వామీ!ఏం మాట్లాడుతున్నారు మీరు? గణపతి సంగతి మీకు తెలీదూ! అతనివైపు కన్నెత్తి చూడటానికి ,అతని జోలికి వెళ్ళడానికి ఎవ్వరైనా భయపడతారు.ఇక, ఈ వైరస్ అనగా ఎంత? మీకు ఆ భయమే అక్కర్లేదు.
అది కాదులే అనింద్యా! ఇన్నేళ్ళూ అందరూ నన్ను భక్తితో పూజించారు.ఇవాళ వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే అది మానవత్వమే కాదు.అలాంటప్పుడు ఇక నాది దైవత్వం ఎలా అవుతుంది? సందడి,సంబరం లేకపోయినా కనీసం పలకరించైనా వస్తాను.పాపం, నా రాకతో విఘ్నాలన్నీ తొలగిపోయి, ఈ కరోనా కష్టం నుండి గట్టెక్కగలమని గంపెడాశతో ఉన్నారు.వాళ్ళకు ఊరటనివ్వడం నా విధి.
మొన్నటి దాకా మేము దర్శనం ఇవ్వకుండా ఉండిపోయింది కూడా వాళ్ళ మేలు కోసమే. భక్తితో అలా గుంపులుగా వచ్చి, మరింత కష్టాల్లో ఇరుక్కుని, మరింతమంది కరోనాబారిన పడరాదనే.
లోకానికి ఒక మహా విపత్తు సంభవించినప్పుడు చెడ్డవారితో పాటూ, కొంతమంది అమాయకులు కూడా బలికావటం ప్రకృతి సహజం. విధికి దైవాలు సైతం బద్ధులే.
అది గ్రహించక మేము కూడా భయపడి దాక్కున్నామని ఏదేదో అన్నారు.
పోనీలే !పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదుగదా!
వాళ్ళు నాకోసం రాలేకపోతే నేనే వాళ్ళకోసం ఇంటింటికీ వెళ్తాను.
*తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం*
అంటూ బాలూ చిరంజీవి కోసం పాడారు కూడానూ.
అన్నట్టు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడానూ!
ఆయనకు శుభాకాంక్షలు చెప్పి,తీయగా చల్లగా పాడే బాలూని దీర్ఘాయురస్తు అని దీవించి వద్దాం.
అలాగే స్వామీ! మీ అభీష్టం.కానీ భౌతిక దూరం, మాస్క్,శానిటైజేషన్ మాత్రం మరచిపోకండేం?
అవి మీ కోసం కాదు.నాయకుడు అనేవాడు అందరికీ ఆదర్శం గా ఉండాలి కదా!పైగా మీరు వినాయకుడు.
సరేలేవయ్యా! ఇప్పటికే ఆలస్యం అయింది.భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు .పద, పద పోదాం త్వరత్వరగా.
అలాగే స్వామీ! మీ గురించి ఇంత రాసిన ఈ జ్యోతిర్మయి మనవరాలికి ఇది మొదటి వినాయక చవితి . చిన్నారికి తొలి ఆశీస్సులు అందించండి.బయలుదేరుదాం.
తప్పకుండానూ! ఎంత ముద్దుగా ఉన్నావే నా తల్లీ!
ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో చిరంజీవి వై వర్థిల్లు చిట్టి తల్లీ!
సర్వే జనా సుఖినోభవంతు
లోకాస్సమస్తాం సుఖినోభవంతు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.8.2020
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
19. ఏది బెటర్?
జనవరి పదవ తేదీ సాయంత్రం అనుకున్నాను.
ఆహా!రేపటి నుండి పది రోజులు సెలవలు. ఉరుకులు పరుగులు ఉండవు.హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.ప్రశాంతంగా గడపచ్చు అని ఆ సాయంత్రం,రాత్రి అంతా ఆనందంలో తేలిపోయాను.
తెల్లారింది.
పండుగ పనులు ప్రారంభం.
ఇల్లంతా దులుపుకుని,కడుక్కుని ,సామానంతా సర్దుకోవటంలో రెండురోజులు అయిపోయాయి.
పిల్లలకి పాపం పంటికిందకి నాలుగు అరిసెముక్కలు ,జంతికలు అంటూ పిండివంటలకు మరో రెండు రోజులు పట్టింది.
పండుగ షాపింగ్ కి ఒకరోజు సరిపోయింది.
ఇంతలో తమ్ముడు వాళ్ళ ఫోను.అక్కా!ఎప్పుడూ తీరదంటావు. సెలవలే కదా!రెండు రోజులు వచ్చిపోకూడదా!అని.పిల్లలు కూడా సరదాపడ్డారు.ఆ ప్రయాణం మరో రెండు రోజులు.
ఇన్ని సందడులు ,హడావిడుల మధ్య పిల్లల హాఫ్ ఇయర్లీ పేపర్లు గుర్తు కు వస్తున్నాయి.
అమ్మో!సెలవలు అయిపోవస్తున్నాయి.ఇంకా పేపర్ల మొహమే చూడలేదు.వంద మార్కుల పేపరు.ఆ విక్రమార్కుల రాతలు చదివి పేపర్లన్నీ ఎప్పుడు దిద్దాలి?పోనీ రాత్రిపూట రోజూ ఒక గంట కూర్చుని దిద్దుదామంటే సంక్రాంతి పండుగాయె.ముగ్గులు వేయటం లో మన ప్రతిభ అంతా ప్రదర్శించి అందరి చేత ఆహా,ఓహో అనిపించుకునే అవకాశం మళ్ళీ ఏడాది దాకా రాదుకదా!
దేవుడా!చక్కగా స్కూల్ కి వెళ్ళినప్పుడే బాగుంది.పనులన్నీ టైం టేబుల్ ప్రకారం చక చకా జరిగిపోయేవి.
సెలవల వల్ల అదనపు చాకిరీ ,ఒళ్ళు హూనం కావటం తప్ప ఆనందమేమీ మిగలలేదు అని అర్థమయ్యేసరికి బడులు తెరిచే వేళ రానే వచ్చేసింది.
హోమ్ మేకర్‌కంటే ఉద్యోగస్తురాలే బెటరేమో కదూ!మరి మీరేమంటారు?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
20.అసలు
ఈ పరీక్ష పాసవుతానా!
ఈయన నాకు
కంఠతా వచ్చు
అని అనుకుంటుంటాను.
కానీ, అదేమిటో!
ప్రతిసారీ
ఏదో ఒక చోట
నేను నేర్చుకున్నది తప్పయి
పరీక్ష తప్పుతుంటాను.
అయినా,
ఈ మంచి పుస్తకం అంటే
నాకెప్పుడూ విసుగురాదు.
చాలా అపురూపం.
ఏనాటికైనా
ఫస్ట్ రాంక్
సాధించగలను
అని
నా ఆశ
ఆశయం
నమ్మకం.
ఇంతకూ
ఈ పుస్తకం పేరు
చెప్పనే లేదు కదూ!
రాజశేఖర చరిత్ర.
ఈ పుస్తకం పై
అన్ని హక్కులూ నావే.
హహహహహహహహహ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.3.2021
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
21.చిన్న తమ్ముడి ముచ్చట్లు
చిన్న తమ్ముడి గురించి
కొన్ని ముచ్చట్లు
నా చిన్న తమ్ముడు
సింహాద్రి కిరణ్ కుమార్
నా తరువాత
తొమ్మిదేళ్ళకు పుట్టాడు.
1975 అక్టోబర్ 4.
ఆ రోజు సాయంత్రం నాకింకా గుర్తుంది.
నాన్నగారు ఇంటికి వచ్చి అమ్మలూ! మీకో చిన్న తమ్ముడు పుట్టాడు అని నన్ను, మా పెద్ద తమ్ముడి ని గుంటూరు లోని ప్రజా వైద్య శాలకు తీసుకెళ్ళారు.
ఉయ్యాల లో
ముద్దుగా, బొద్దుగా
అచ్చం ఇప్పటి నా చిన్న మేనకోడలు లాగా
ముద్దులు మూటకట్టే
వాడి చిన్నప్పటి మొహం ఇంకా
నా కళ్ళల్లోనే
ఉన్నట్లుంటుంది.
కన్నది మా అమ్మే అయినా,
వాడికి సకల సపర్యలూ చేసి
పెంచింది మాత్రం నేనే.
మా నాన్నమ్మ వాడికి కొనిచ్చిన మట్టుగిన్నెలో అన్నం కలిపి తినిపిస్తూ
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార.. అంటూ వాడికి పోతన పద్యం నేర్పటం, వాడు నేర్చుకుని ముద్దు ముద్దుగా చెప్పడం ఇంకా గుర్తుంది నాకు.
ఇద్దరం పెరట్లో మంచం వేసుకుని పడుకుని ఆకాశంలో సగం చంద్రుణ్ణి చూస్తూ వాడితో నేను
*చుక్కల్లో పెద్ద చుక్క
సగం విరిగిన ఇడ్లీ ముక్క*
అని చెప్పిన నా తొలి తవిక కూడా గుర్తుంది.
అమ్మా, నాన్నగారు సినిమాకి వెళితే, వాడు అమ్మ కోసం ఏడిస్తే అమ్మ ఎన్ టి ఆర్ డాక్టర్ దగ్గరికో,ఏ ఎన్ ఆర్ డాక్టర్ దగ్గరికో వెళ్ళిందిలే, వచ్చేస్తుంది అని వాణ్ణి ఎత్తుకు తిప్పుతూ సముదాయించటం కూడా గుర్తుంది.
పేరేచర్ల సెంటర్ కి నాన్నగారి వేలు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎదురుగా లారీలు,బస్సులు వస్తూంటే నాన్నగారూ! రోడ్డు దిగండి.పక్కకి రండి చచ్చి పోతాం అనేవాడు.అదే పిరికితనం నా కొడుక్కి కూడా వచ్చింది . చాలా విషయాల్లో వాడికి మేనమామ పోలికలు ఉన్నాయి.
పెళ్లి కి ముందు మా ఆయన్ని చూపించి
కిరణ్! ఈ అబ్బాయి నన్ను పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడు .చేసుకోనా! అని అనగానే వద్దక్కా! నాన్నగారు తిడతారు . అని భయపడి ఏడ్చేయటం గుర్తుంది.ఇప్పుడు మాత్రం ఆ బావంటే వాడికి ప్రాణం. *బావ దేవుడు*అని అంటుంటాడు.
వాడి పెళ్ళప్పుడు నాకు కూడా నా సొత్తును ఎవరికో దానం ఇచ్చేసిన ఫీలింగ్ కలిగింది.నాకు నా కొడుకు మీద కంటే కూడా ఒకపాలు వీడిమీదే ఎక్కువ ప్రేమ ఉందేమో అని అనిపిస్తుంటుంది .
ముందు చూపు , డబ్బు విషయంలో జాగ్రత్త ఉన్న వాడిని మేము బడ్జెట్ పద్మనాభం అని ఎగతాళి చేసినా అవసరం తెలుసుకుని తిరిగి ఇస్తారు,ఇవ్వరు అని ఆలోచించకుండా సహాయం చేసే బంగారు మనసు వాడికుంది.వాడు
అమెరికా వెళ్ళిన కొత్తల్లో అమ్మ అనుకోకుండా చనిపోయింది.చివరి చూపుకు కూడా నోచుకోలేక పోయాడు పాపం.ఆ దిగులు కొంతైనా తీరేలా నాన్నగారికి అనారోగ్యం అని, చివరి దశలో ఉన్నారని తెలిసి, వచ్చి, నెలరోజుల పాటు అనుక్షణం కంటికి రెప్పలా నాన్నగారికి సేవలు చేసి, తండ్రి ఋణం తీర్చుకున్నాడు.
మంచి మనసు, సంస్కారం,
నొప్పించకుండా మృదువుగా మాట్లాడే స్వభావం,
వినయవిధేయతలు,
అన్నయ్యను, అక్కను మరచిపోని ప్రేమ
అన్నిటా వాడు ఉన్నతమైన వాడే.
వాడు పని ఒత్తిడిలో ఫోన్ చేయక వారం రోజులు దాటిపోతే దిగులేస్తుంది.
వాడు అమెరికా నుండి వచ్చి వెళ్ళిపోతుంటే ఏడుపొస్తుంది.వాడికి కూడా ఈ అక్క అంటే చాలా ఇష్టం.అమ్మా! నాకు నీకంటే అక్కంటేనే ఎక్కువ ఇష్టం అని మా అమ్మతో అనేవాడు.
నేటికి
44 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని 45 వ ఏట అడుగుపెడుతున్న నా చిన్న తమ్ముడు
సింహాద్రి కిరణ్ కుమార్
భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో
చిరకాలం ఆనందంగా , ఆదర్శవంతంగా జీవించాలని మనసారా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు అందజేస్తూ
ప్రేమతో
అక్క
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.10.2019.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
22.శాడిస్టు అత్తగారు
కోడలి ఏడుపు చూసి సంతోషించిన అత్తగారు...
అసలు సంగతి తెలిస్తే షాకవుతారు
ఇంతకూ కోడలిని ఏడిపించి,ఆనందించిన ఆ శాడిస్ట్ అత్త ఎవరా!
అని అనుకుంటున్నారా!
ఇంకెవరు?
నేనేనండీ బాబూ!
మా అబ్బాయి పెళ్ళయి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది.ప్రస్తుతం వాళ్ళకు ఆరు నెలల పాప కూడా ఉంది.
పెళ్ళయిన దగ్గరనుండి మేం వెళ్ళి ఓ వారం ఉండి రావటమో, వాళ్ళు వచ్చి ఓ వారం ఉండి వెళ్ళటమో జరిగింది తప్ప ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం కలగనేలేదు.పైగా ఇద్దరిదీ మనసులో ఏమున్నా పైకి ఠక్కున చెప్పేసే స్వభావమే.
అలాంటి మామధ్య అనుబంధం ఏర్పడటానికి ,ఒకరినొకరం అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం ఈ మధ్యనే కలిగింది.
బాబుకి ముంబయి ట్రాన్స్ఫర్ అవడంతో కాన్పుకని పుట్టింటికి వచ్చిన కోడలు ప్రసవం అయ్యాక మూడవనెలలో మా మనవరాలిని ఎత్తుకుని మా ఇంటికి వచ్చింది. నేనే వెళ్ళి కోడల్ని,మనవరాలిని తెచ్చుకున్నాను.(అది మా అత్తగారింటి పద్ధతి)
కనీసం రెండు నెలలైనా మా దగ్గర ఉండాలని నా షరతు.నిజం చెప్పొద్దూ!మా కోడలు మనసులో భయపడింది అన్ని రోజులు ఎలా ఉండాలో అని దిగులు పడింది.(ఆ మాట తర్వాత తనే చెప్పింది.) నేను మాత్రం భయపడలేదు.ఎందుకంటే అధికారంతో కూడిన నా ప్రేమని, అభిమానాన్ని అర్థం చేసుకోవడం మొదట్లో కొంత కష్టం(ఇది మా నాన్నగారి నుండి నాకు వారసత్వం గా వచ్చింది) కానీ, ఒకసారి నాతో స్నేహం చేసినవారు నన్ను కాదనుకోవడం దాదాపుగా జరగలేదనే సంగతి నాకు తెలుసు కదా! మరి,నా స్వభావం నాకు తెలుస్తుంది కానీ తనకు తెలియదు కదా! సరే రెండు నెలలు అనుకున్నది ఇంకో పదిహేను రోజులు కూడా అయింది.
కానీ కోడలు భయాలన్నీ మరచిపోయి నాతో, వాళ్ళ మామయ్య తో చక్కగా కలిసిపోయింది.
బాబు మధ్యలో ఒకసారి వచ్చాడంతే.
ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే బాబు వచ్చిన దగ్గరనుంచీ అత్తయ్యా! నాకు వెళ్ళాలంటే దిగులుగా ఉంది అని అప్పుడప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
ముంబయి వెళ్ళే ముందు రోజు మాత్రం భోరున ఏడ్చేసింది. అత్తయ్యా!నేను తనతో వెళ్ళను. ఇక్కడే మీదగ్గరే ఉండిపోతాను. మీకు తెలుసా!మా మమ్మీ దగ్గర్నుంచి వచ్చేటప్పుడు కూడా నాకింత దిగులు అనిపించలేదు అని.
నేను తప్పమ్మా!బిడ్డని ఎత్తుకుని నీ ఇంటికి నువ్వు వెళుతున్నావు.అలా ఏడవటం మంచిదికాదు అని నచ్చజెప్పి ఊరుకోబెట్టాను.నాకు నవ్వు, సంతోషం రెండూ కలిగాయి.
మరి కోడలి మనసు ఆకట్టుకోవడం అంటే మాటలు కాదు కదా!
మరి,మీరేమంటారు?
నాకైతే ఈ సందర్భంలో
ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నించిన ప్రేమ నిలుచును
అన్న మహాకవి
గురజాడ మాటలు గుర్తుకొచ్చాయి.
ఈ తరం వాళ్ళకయితే
ప్రేమిద్దాం బ్రదర్
మహా అయితే తిరిగి ప్రేమిస్తారు
అన్న మిర్చి సినిమా లోని డైలాగ్ గుర్తుకొస్తుందేమో కదూ!
చివరగా ఒక మాట.
కోడల్ని ప్రేమించి,మనసారా ఆదరించటం అనే లక్షణం నేను మా అమ్మ దగ్గర,మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నదే.
పాతికేళ్ళ మా సాహచర్యంలో మా అత్తమ్మ నా మనసు నొచ్చుకునేలా ఒక్కనాడైనా ,ఒక్క చిన్నమాటయినా అని ఎరుగదు (మా అత్తమ్మ రోశమ్మకు ఆరుగురూ కొడుకులే.
కూతుళ్ళు లేరు.అందర్నీ ప్రేమ గానే చూసుకుంది.నాకు కోడళ్ళయినా,కూతుళ్ళయినా వాళ్ళే అనేది.)
మరి ఆ అత్తకు తగ్గ కోడలిలా ఉండద్దూ!
ఇదండీ!
కోడలి ఏడుపు చూసి ఆనందించిన ఈ అత్తగారి కథ.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.5.2021
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
23.సంధ్య (యే) దీపం
సింహాద్రి సంధ్యాదేవి.
ఏ ప్రత్యేకతలూ లేని సామాన్యమైన ఒక మామూలు మధ్యతరగతి
ఇల్లాలే అయినా మాకు మాత్రం తను చాలా చాలా ప్రత్యేకం.
సంధ్య
మా పెద్ద మరదలు.
అమ్మ మాటను
అక్షరాలా పాటించే మా పెద్ద తమ్ముడు
శ్రీ రామ (చంద్ర) మూర్తిని
కట్టుకుంది.
అతి కొద్ది కాలంలోనే
మా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంది.
తను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతి కాకపోవచ్చు.
కానీ ఇరుసంధ్యలా
ఇంటిని వెలిగించి
కాంతిని,శాంతిని ఇంట వెల్లివిరియ జేసిన
మా పుట్టినింటి దీపం.
పెళ్ళి చూపుల్లోనే తనతో
మా తమ్ముడు ఒక మాట చెప్పాడు.
మా అమ్మానాన్నలు
వారున్నంతకాలం
నాతోనే ఉంటారు.ఈ షరతుకు నీకు ఇష్టమైతే మన పెళ్ళి కి నాకు అభ్యంతరం లేదు అని.
తల ఊపింది.
పెళ్ళి జరిగింది.అప్పటినుండి వారు గతించేవరకూ
అత్తామామలు
తనకు తప్పని భారమే అనుకుందో,
మోయవలసిన
బాధ్యతే అనుకుందో,
నా తల్లిదండ్రులే అనుకుందో
తెలియదు కానీ, మా అమ్మానాన్నలను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంది.
వాళ్ళ మధ్య ఎప్పుడూ పొరపొచ్చాలు లేనేలేవు.
దీనిని నిరూపించే రెండు కారణాలు.
ఒకటి:
సహజంగా తల్లి తనకు కోడలివల్ల కష్టం కలిగితే కూతురితోనే కదా చెప్పుకునేది.కానీ
మా అమ్మ కూతురినైన నా దగ్గర కూడా ఎప్పుడూ కోడలి గురించి ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదు.
రెండు:
అమ్మ చనిపోయాక నాన్నగారు 12 ఏళ్ళు ఉన్నారు.నాన్నగారిది పసిపిల్లాడి మనస్తత్వం.ఆయన అలకలు భరించి , టైమ్ ప్రకారం కాఫీలు , టిఫిన్లు, అన్నీ అమర్చి,ఆయన చెప్పే ఫ్లాష్ బ్యాక్ కథలన్నీ ఓపిగ్గా విని, ఆయన ఏదైనా ఊరెళ్ళి సీరియల్స్ మిస్సయితే వాటిని రికార్డ్ చేసిపెట్టి 🤣,(అప్పటికి ఇంకా వాట్సాప్ ,యూ ట్యూబ్ అందుబాటులోకి రాలేదు) ఆయనను
పసిపిల్లాడిలాగే చూసుకుంది. ఇంటి ముందు సాయంత్రం పూట చావిట్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునే ఆ మామాకోడళ్ళను చూసి తెలియని వాళ్ళు వాళ్ళిద్దరినీ తండ్రీ కూతుళ్ళే అనుకునేవారు. ఆయన నా దగ్గర,మా చిన్న తమ్ముడి దగ్గర కంటే మా పెద్ద తమ్ముడి దగ్గరే ఉండటానికి ఇష్టపడేవారు,ఉన్నారు కూడా.దానికి కారణం ఖచ్చితంగా మా సంధ్యే.
పైగా మాకు బంధుగణం ఎక్కువ.మా అమ్మానాన్నలకు బంధుప్రీతి ఎక్కువ. ఎంతమంది వచ్చినా , ఎన్ని రోజులు ఉన్నా,మా తమ్ముడు వారికి ఏ రకమైన సహాయం చేసినా ఖర్చుకు గానీ,చాకిరీకి గానీ తను ఎప్పుడూ విసుక్కోవడం నేను చూడలేదు.
మనసులో అసంతృప్తి, అసహనం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది కదా!
ఇక
అమెరికాలో ఉండే మా చిన్న తమ్ముడికి
బావ (మా ఆయనే లెండి 😍) దేవుడు.
వదిన అంటే సాక్షాత్తూ దేవతే.
బావ ఏది చేసినా బావను ఏమీ అనకూడదు అంటాడు.
తోడికోడళ్ళు సినిమా లో ఎస్వీఆర్ లాగా
వదిన ఏది చెప్తే అదే కరెక్ట్ అంటాడు.
అలాగని మొహమాటానికి పోవటం,ఇచ్చకాలు మాట్లాడటం కూడా మా సంధ్యకు అలవాటు లేదండోయ్. అందుకని మేమే కాస్త జాగ్రత్తగా ఉంటుంటాం.🤣🤣
మా ఆయనకు అక్కాచెల్లెళ్ళు లేరు.
అందుకని
మా ఇంటి ప్రతి శుభకార్యం మా సంధ్య చల్లని చేతులమీదుగానే జరిగింది.
తనకంటూ తానేమీ పెద్దగా ఇష్టాలు వ్యక్తం చేయకపోయినా,
బంగారం అంటే ఇష్టం తనకి.
కానీ దానికోసం మా తమ్ముడిని మాత్రం వేధించదు.
ఎంతైనా గట్టి(వాళ్ళ ఇంటి పేరు) వాళ్ళ పిల్ల కదా!
డబ్బు ఖర్చు విషయంలో పొదుపుగానే ఉంటుంది.
నాలాగా దుబారా ఖర్చులు చేయదు.
నిజానికి మా పుట్టింట్లో మొదటినుంచీ నేనొక్కదాన్నే కాస్త అనవసరపు ఖర్చు,అతిగా ఖర్చు చేస్తుంటాను.
ఈ విషయం లో మా ఆయన తప్ప, మా సంధ్యతో సహా అందరూ నన్ను మందలిస్తూనే ఉంటారు.కొన్నిసార్లు తిడుతుంటారు కూడానూ. పనులు చకచకా కానిస్తుంది.
వంట కూడా రుచిగా చేస్తుంది.
అది మా అమ్మ ట్రైనింగ్. కానీ నాకు మాత్రం ఆ స్పీడు రానేలేదు.
ఇక మా సంజుగారు చేసిన ప్రసాదాన్ని సాక్షాత్తూ ఆ దైవమే , అంబ తో కలిసి ఏదో ఒక రూపంలో వచ్చి ఆరగించి అమృతతుల్యం అంటాడని మా విశ్వాసం.మనసు పెట్టి శ్రద్ధతో చేస్తుందేమో! అందుకే
అంత బాగుంటుంది.
మొత్తానికి మా సంధ్య మాకు అన్ని విధాలా అపురూపమే, ప్రత్యేకమే.
నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపం సంతరించుకున్నట్లు
మా అమ్మ నిర్మొహమాటత్వాన్ని,
మా నాన్నగారి చాదస్తాన్ని,
మా తమ్ముడి విసుగు,చిరాకులను( ఇప్పుడు వాడు శాంతమూర్తి అయిపోయాడు లెండి.)
ఏ పనిలోనూ సాయం చేయని
నా బద్దకాన్ని ఇలా ఎవరి స్వభావానికి తగినట్లుగా వారితో సర్దుకుపోతూ(ప్రేమతోనే సుమా!)
అన్నింటినీ సహనంతో భరిస్తూ,
మా అందరి మనస్తత్వాలు చదివి, కంఠతా పట్టేసి
మేము పెట్టిన ఈ పరీక్షలన్నీ పూర్తిచేసి,
మా అందరి మనసులనూ
గెలిచేసుకున్న
మా సంజుగారికి (నేను,మా తమ్ముడు అలాగే పిలుస్తాం)
నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తూ
వచ్చే ఏడాదికి కొడుకు పెళ్ళి చేసేసి అత్తగారు అయిపోయి, కోడలి దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసి
నూరేళ్ళు చల్లగా సుఖసంతోషాలతో
ఐశ్వర్య సౌభాగ్యాలతో
ఆనందంగా జీవించాలని మనసారా దీవిస్తూ...
తనలాగే కళకళలాడే
సంధ్య దీపం వెలిగిస్తున్న
మా సంధ్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ....
ప్రేమతో
వదిన
సింహాద్రి జ్యోతిర్మయి.
23.1.2021.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
24.నాన్నగారితో నా ప్రయాణం
ఈ రోజు జనవరి 30
నాన్నగారి జయంతి సందర్భంగా నాన్నగారితో నా ప్రయాణంలోని కొన్ని విశేషాలను మీతో పంచుకోవాలని అనిపించింది.
రండి ,అలా నడుస్తూ మాట్లాడుకుందాం.
నాన్నగారంటే....
దేశానికి రాష్ట్రపతి,రాష్ట్రానికి గవర్నర్ ఎలాగ ప్రథమ పౌరులో
అలాగే నా జీవితానికి తొలి ప్రాధాన్యం నాన్నగారు.
నా జీవితంలో నేను అమితంగా ప్రేమించిన తొలి వ్యక్తి నాన్నగారు.
నాకు ఊహ తెలియని వయసులోనే నాన్నగారంటే నాకెంత ఇష్టమో,ఆ తర్వాత మా అమ్మ మాటల్లో తెలుసుకున్నాను.
నాకు రెండేళ్ళ వయసులో అమ్మావాళ్ళు కాశీకి వెళ్ళారట. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. మంచినీళ్ళ కోసం వెళ్ళిన నాన్నగారు ఇంకా రాలేదు. నేను ఫ్లాట్ ఫారం మీదే కూర్చుండిపోయి,రైలు ఎక్కనని ఏడ్చి గోల చేశానని, అమ్మ తను నన్ను లాక్కెళ్ళి రైలు ఎక్కించానని చెప్తూ
"చిన్నప్పటి నుండి నీకు మీ నాన్న మీదే ప్రేమ.అందులో కాస్తయినా నా మీద లేదు" అని మా అమ్మ ఈ సంఘటన చెప్పి నిష్టూరాలాడుతూ ఉండేది.అలా అమ్మ అన్నప్పుడల్లా నాన్నగారి మీద నా ప్రేమ మరింతగా పొంగి పొర్లేది.
చిన్నతనంలో నాన్నగారు నన్ను ఎప్పుడూ కొట్టిన గుర్తు లేదు.
ఒక్కసారి మాత్రం బహుశా నాల్గవ తరగతి లో అనుకుంటాను, మిమ్మల్ని చదివిస్తూ
భారతదేశపు ఎల్లలు చెప్పమని నన్ను అడిగారు.నేను
చెప్పలేకపోతే కొట్టినట్లు గుర్తు.అప్పుడు అమ్మే అడ్డుపడింది లెండి.
నాన్నగారికి నాకంటే...
ఇష్టమైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని నా నమ్మకం.
ఎందుకంటే
చిన్నతనంలో మేము గుంటూరు దగ్గర పేరేచర్లలో ఉండేవాళ్ళం.
నాన్నగారు గుంటూరు వెళ్ళినప్పుడు
నాజ్ సెంటర్ దగ్గర హిమనీ స్వీట్స్ షాప్ లో జీడిపప్పు పకోడీ తెచ్చేవారు.రాత్రి పొద్దుపోయినా గానీ, నన్ను ఒక్కదాన్నే నిద్ర లేపి తన పక్కన కూర్చోబెట్టుకుని అన్నం ముద్దలు కలిపి ,పకోడీతో పాటు తినిపించే వారు.
అసలు నాన్నగారు భోజనం చేసే విధానం చూస్తేనే ఎవరికైనా రెండు ముద్దలు అడిగి పెట్టించుకుని తినాలి అని అనిపిస్తుంది.అంత ముచ్చటగా భోంచేస్తారు.
భోజనం చేయటం కూడా ఒక కళే అనిపిస్తుంది ఆయనను చూస్తే.
మళ్ళీ ఆ వైనం మా చిన్నతమ్ముడికి,అందులో కొంత మా అబ్బాయికి ,కాస్త నా చిన్న మేనకోడలికి కూడా వచ్చాయి.
పెద్దయ్యాక హాస్టల్ నుంచి నేను వచ్చే రోజు ఆఫీస్ నించి ఇంటికి రాగానే అమ్మలేది?అమ్మలేది?అని వెతుక్కుంటూ నేను కనపడగానే మా అక్క,మా అక్క (నాన్నగారి కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం) అంటూ మురిసిపోయే ఆయన కళ్ళలో కనపడే ఆనందం, వెలుగు నాకిప్పటికీ జ్ఞాపకమే.
నాన్నగారి మాటంటే..........
మాకు శాసనమే.
రాజమండ్రి మిషనరీ స్కూల్ లో చదివి,ఆచారి బ్రదర్స్ (నాన్నగారు, మా చిన్నాన్న రాజేశ్వరరావు)అంటే క్రమశిక్షణ కు మారుపేరు అని పేరు తెచ్చుకున్న నాన్నగారు కొన్ని విషయాలలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు.
చిన్నప్పటి నుంచి ఆయన మాకు నేర్పిన పద్ధతులను వింటే బహుశా అవి నేడు అభూత కల్పనల్లాగా అనిపిస్తాయేమో కానీ అవి అక్షరసత్యాలు, ఇప్పటికీ మేము గర్వపడే అనుభవాలు. వాటిలో కొన్ని...
పరీక్షలలో ఎవరినీ ఆన్సర్లు అడగకూడదు.ఎవరికీ ఆన్సర్లు చెప్పకూడదు.
కాపీ కొట్టకూడదు.
స్కూల్ మానేయవలసివస్తే తప్పకుండా లీవ్ లెటర్ రాసి స్కూల్ లో ఇచ్చి,టీచర్ పర్మిషన్ తీసుకోవాలి.
ఆ లెటర్ రాసే పేపర్ కూడా ఎడం చేతి వైపు ముందుకి, కుడి చేతి వైపు వెనక్కి మడిచి మార్జిన్ వదలాలి.
గైడ్ లు చదవకూడదు.
ట్యూషన్ కి వెళ్ళకూడదు.ఇంట్లోనే చదువుకోవాలి.
గోళీలు ,బొంగరాలు ఆడకూడదు.
చెడ్డ మాటలు మాట్లాడకూడదు.(ఆయన తరచూ వాడే తిట్లు దొంగ మొహమా! మరీ కోపం వస్తే పళ్ళు పిండుకుంటూ దొంగ గాడిద కొడకా అనేవారు. 🤣)
ప్రతి ఆదివారం తప్పనిసరిగా గోళ్ళు తీసుకోవాలి.
అబ్బో! ఇలాంటివి చాలా ఉండేవి.
నాన్నగారు వద్దంటే........
ఆ పని మేము చేసేవాళ్ళం కాదు.
నేను డిగ్రీ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్ లో అర్జెంటుగా టైప్ నేర్చేసుకోవాలి , డిగ్రీ అవగానే ఏదో ఒక ఉద్యోగం సంపాదించేయాలి అని అనుకుని ,మా క్లోజ్ ఫ్రెండ్ ప్రోద్బలంతో ఉమెన్స్ కాలేజీ ఫ్రెండ్స్ నలుగురం కలిసి రోజూ సాయంత్రం 4.30 కి కాలేజీ అయిపోగానే ఒక గంట టైప్ నేర్చుకుందామని డిసైడ్ అయిపోయి నాజ్ సెంటర్ లో ఉన్న ఒక టైప్ ఇనిస్టిట్యూట్ లో చేరాము.అది శీతాకాలం కావటంతో 6గంటల కే చీకటిపడిపోయేది.ఇంటికి చేరేటప్పటికి 6.30 అయ్యేది.నాలుగురోజులు చూసి ఏం చేస్తున్నావు?ఎందుకు ఆలస్యం అవుతోంది ?అని నాన్నగారు గద్దించి అడిగేసరికి భయపడిపోయి, బ్యాగ్ లో నుండి టైప్ చేసిన నాలుగు కాగితాలు తీసి చూపించి (వాటిలో ASDF ; LKJ ఉన్నాయి) భోరుమని ఏడ్చేశాను.
దానితో నాన్నగారు కరిగిపోయారు.నాకు నీమీద నమ్మకం ఉంది.కానీ ముందే నాతో చెప్పాల్సింది కదా అన్నారు.ఆ మాటతో మనసు తేలిక పడింది.
కానీ తరువాత అది మానేశాను.ఎందుకంటే టైప్ చేయాలంటే గోళ్ళు తీసేసి రమ్మన్నారు.నాకేమో గోళ్ళు పెంచుకుని, నెయిల్ పాలిష్ వేసుకోవడం చాలా ఇష్టం.(ఇప్పటికీ ఇష్టమే)
నా పెళ్ళయ్యాక మా పెద్ద తమ్ముడు నాకు పంపిన తొలి గిఫ్ట్ ఏంటో తెలుసా!లాక్మే నెయిల్ పాలిష్ బాటిల్ .దాన్ని చక్కగా దూదిలో చుట్టి ప్యాక్ చేసి పోస్ట్ లో పంపించాడు.
అదీ నా టైప్ కథ.
నాన్నగారి మాట నేను వినకపోయి ఉంటే.....
జీవితంలో ఎంతో నష్టపోయి ఉండేదాన్ని.
డిగ్రీ లో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేది.చాలా తెలివైనది.కాలేజీలో స్టూడెంట్ లీడర్ కూడా. నేను తను ఏం చెప్తే అదే గుడ్డిగా ఫాలో అయ్యేదాన్ని. కానీ తను చాలా సెల్ఫిష్. నన్ను తన వెంట బాగా తిప్పుకునేది.తనకో బోయ్ ఫ్రెండ్ ఉండేవాడు.అతనితో సినిమాలకి, ఎక్కడికీ వెళ్ళాలన్నా నన్ను కూడా వెంట తీసుకెళ్ళేది, వాళ్ళపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని అలా చేసేదని నాకప్పుడు అర్థం కాలేదు..నాకప్పుడు అన్ని తెలివితేటలు కూడా లేవు.
డిగ్రీ అయ్యాక తను నాగార్జున యూనివర్సిటీ లో చేరుతానంది.నన్ను కూడా అక్కడే చేరమంది.
నాన్నగారేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయించారు.(అప్పట్లో పి.జి.కి ఎంట్రన్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అదే) అందులో నాకు 7 వ ర్యాంక్ వచ్చింది.(ఒక్క ర్యాంక్ తో స్కాలర్షిప్ మిస్సయ్యాను.
6 ర్యాంకు ల వరకు స్కాలర్షిప్ ఉంది.)మంచి యూనివర్సిటీ అని, అక్కడ చేరమని నాన్నగారు చాలా నచ్చచెప్పారు.కాదు తనతో పాటు ఇక్కడే ఉండి చదువుతానని నేను భీష్మించాను.చివరికి అయిష్టంగానే హైదరాబాద్ వెళ్ళాను.ఆ కోపంతో
చాలా రోజులు నాన్నగారితో నేను సరిగా మాట్లాడనేలేదు. ఆ విషయం ఇప్పుడు తలచుకున్నా నా ప్రవర్తనకు నేను సిగ్గు పడుతుంటాను.
ఇంతకూ .మనుషుల్ని అంచనా వేయటం కూడా సరిగా రాని నేను,
నాన్నగారి మాట విని ,ఆ రోజు కానీ అలా సెంట్రల్ యూనివర్సిటీ లో చేరకపోయిఉంటే ఇంతమాత్రపు ఈ జ్ఞానం, ఈ ఆలోచన, ఈ ఆనందకరమైన జీవితం, ప్రాణం లా చూసుకునే భర్త, కాస్తోకూస్తో ,ఈ పేరు ఏవీ ఉండేవి కావు.
అలా నాన్నగారి మాట నా జీవితానికి బంగారు బాట వేసింది.
నాన్నగారు నా మాట వినకపోయి ఉంటే....
ఈ జీవితమే ఉండేది కాదు.
యూనివర్సిటీ లో మా రాజశేఖరుణ్ణి ప్రేమించటం, పెళ్ళి చేసుకుంటానని ఇంట్లో చెప్పటం,మా మేనమామ (యూనివర్సిటీ లో మా తెలుగు డిపార్ట్మెంట్ లోనే ఆఫీస్ సెక్షన్ హెడ్ గా పనిచేసేవారు) అబ్బాయి మంచివాడేనని సర్టిఫికెట్ ఇవ్వడం, అమ్మ నాన్నగారిని ఒప్పించటం, శేఖర్ వచ్చి నాన్నగారి తో మాట్లాడటం , వాళ్ళ వాళ్ళు కూడా అంగీకరించటం, నిశ్చితార్థం అన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పుడు
నాన్నగారు నాతో చాలా ముభావంగా ఉండేవారు.ఆయనను మాట్లాడించాలంటేనే భయం వేసేది. ఆ మౌనం నేను భరించలేక పోయేదాన్ని.ధైర్యం చేసి ఒకరోజు రాత్రి వేళ నాన్నగారి దగ్గరకు వెళ్ళి మీద చెయ్యి వేసి,తల ఆనించి
నాన్నగారండీ! నా మీద కోపం వచ్చిందా! నాతో మాట్లాడరా! అని ఏడుస్తూ అడిగాను.
దాంతో ఆయన బింకం సడలిపోయింది.లేదమ్మా!కోపం లేదు.కానీ
నీకు ఎప్పుడూ పరిచయం లేని వాతావరణం లోకి కోరి వెళుతున్నావు.అక్కడ నువ్వు ఎలా ఎడ్జెస్ట్ అవుతావో! ఏం ఇబ్బంది పడతావో!అని మనసు పరిపరివిధాల పోతోంది.కన్నవాళ్ళ బాధ మీకెలా తెలుస్తుంది అన్నారు.అప్పటి నాన్నగారి గొంతులోని దుఃఖపుజీర మళ్ళీ నా కూతురి పెళ్ళి లో మా ఆయన గొంతులో వినపడింది.ఆ వేళ నాన్నగారు గుర్తుకువచ్చి కళ్ళు తడిసిపోయాయి.కానీ ఆ తరువాత చాలా కొద్ది కాలంలోనే నా నిర్ణయం సరియైనదేనని మా శేఖర్ తన ప్రవర్తన తో నిరూపించి నా తల్లిదండ్రుల అభిమానాన్ని,ప్రేమను పొందగలిగాడు.
ఎంతయినా రాజశేఖర్ కదా!😍😍
నాన్నగారి మీద నా ప్రేమంటే....
ఆయన విసుక్కుంటున్నా నాకు తోచినట్లు చేయడమే.
నాకు ఉద్యోగం వచ్చి,మా ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైన దగ్గర నుంచి
నాన్నగారికి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి బట్టలు కొనివ్వటం నాకు అలవాటు.
ఒకేసారి తెల్ల లుంగీలు, టాన్ టెక్స్ చేతుల బనియన్లు ,కుట్టించిన డ్రాయర్ లు, పెద్ద చేతి రుమాళ్ళు,తువ్వాళ్ళు అన్నీ తలా ఒక అరడజను చొప్పున, రెండు జతలు విమల్ ఫ్యాంట్లు, షర్ట్ లు కొనిస్తుండేదాన్ని. ఎందుకలా
డబ్బు దుబారా చేస్తావు? రెండు చొప్పున కొంటే చాలుకదా!చెప్తే వినవు. నీ ఇష్టం నీదే అన్నీ దండుగ ఖర్చులు పెడతావు అని విసుక్కునేవారు.కానీ పుట్టిన రోజు, ఉగాది, దసరా, దీపావళి, జంధ్యాల పౌర్ణమి, సంక్రాంతి ఇలా ప్రతి పండుగకు కొత్తవి వేసుకుని,అమ్మలూ! ఈ రోజు నువ్వు కొనిచ్చిన వాటిలో నుండి కొత్తవి తీసి వేసుకున్నాను అని ఫోన్ చేసి చెప్పేవారు. నేను నవ్వుకునే దాన్ని.ప్రస్తుతం
ఆ సంతోషం నాకు లేకుండా చేసి నాన్నగారు వెళ్ళిపోయారు .అయినా నాన్నగారు అనగానే ఆ ఆత్మీయమైన నవ్వు,రూపం, ఆప్యాయత, అనురాగం అన్నీ ఆయన రూపాన్ని, గుణాన్ని,చాదస్తాన్ని,అలకలను కూడా పుణికి పుచ్చుకున్న నాలో అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి నేటికీ.
అందుకే మా పెద్ద మరదలు సంధ్య "మామయ్య గారు లేరన్న దిగులు లేదు.వదిన ఉందిగా ఆయన బదులు" అంటుంటుంది మురిపెంగా.
ఇప్పుడు నాన్నగారు గనుక ఉండి ఉంటే.........
ఇది 79 వ పుట్టినరోజు అయి ఉండేది.
1943 జనవరి 30 న పుట్టిన నాన్నగారి కి ఈ రోజుతో 78 ఏళ్ళు నిండి ఉండేవి.
ఏం చేస్తాం!
2014 లో ఆయన అడుగులు మిమ్మల్ని వీడి,అమ్మ వెళ్ళిన దిక్కుగా సాగిపోయాయి.
ఏమైనా నాన్నగారు తనకు ఉన్నంతలో నన్ను యువరాణిలా చూసుకున్నారు.
తను ఉన్నంతవరకూ
నేను పడిపోతాననో
తడబడిపోతాననో
వెనుకబడిపోతాననో
అనుక్షణం
నా వెనకాలే ఉండి
నన్ను ముందుకి నడిపించారు.
అలాంటి నాన్నగారితో నా ప్రయాణం ఒక్కనాటిదా!
అది నలభై ఎనిమిదేళ్ల నడక.
ఇప్పటికే మిమ్మల్ని నా జ్ఞాపకాల దారిలో చాలా దూరం నడిపించాను కదూ!
మరికొన్ని విశేషాలు మరొకసారి, మరొక సందర్భంలో పంచుకుంటాను.
ఇలా నాన్నగారి శత జయంతి వరకూ ఆ జ్ఞాపకాలు పంచుకోవాలని నా కోరిక.
చూద్దాం.దీనిని నేనో లేక మా చిన్నతమ్ముడో తప్పక కొనసాగించగలమనే నా నమ్మకం.
స్వర్గంలో ఉన్న నాన్నగారు మా శుభాకాంక్షలు అందుకుని,తన శుభాశీస్సులు మాపై వర్షిస్తారని ఆశిస్తూ.......
ఆచారి గారి పిల్లలు
జ్యోతిర్మయి
శ్రీరామమూర్తి
కిరణ్ కుమార్
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.1.2021.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
25. ఏమయ్యాడో!
ఈ ప్రశ్న దాదాపుగా ఈ ఐదు నెలలనుండీ ప్రతిరోజూ ఉదయం నా మనసులో మెదులుతోంది.
అతనికి ఏం కాకూడదు, క్షేమంగా ఉండాలని రోజూ కోరుకుంటూ ఉంటాను.
జీవితం చాలా చిత్రమైనది.మనకెన్నో
,అనుబంధాలుంటాయి.ఎంతోమందితో పరిచయాలు ఉంటాయి. అలాంటి ఒక పరిచయమే ఆ తాత.మా వీధికి రోజూ ఆకుకూరలు అమ్మడానికి ఉదయాన్నే వస్తుంటాడు.దాదాపుగా నాలుగేళ్ళుగా ఆ కేక నాకు అలవాటయ్యింది.
డెబ్బై ఏళ్ళు ఉంటాయనుకుంటా.తాజా ఆకుకూరలు తెస్తాడు.నేను రెండు రోజుల కొకసారి కొంటుంటాను.నాలుగు బజార్ల అవతలనుండే అతని గొంతు వినిపిస్తుంటుంది. నేను బయటకు రాకపోతే ఒక నిమిషం మా ఇంటి ముందు సైకిల్ ఆపి ఆ ఆకుకూరలమ్మా అని పైకి చూస్తూ కేక వేస్తాడు. నాలుగైదు రకాలు ఒకేసారి తీసుకుంటే పాపం లెక్క తడబడిపోతాడు.నేనే వివరం చెప్పి, సరిగ్గా లెక్క చూసి ఇస్తుంటాను. ఆ అభిమానమో ఏమో తెలీదు కానీ
ఒకోసారి నేను అడిగిన ఆకుకూర బాగోకపోతే అది బాగలేదులే అమ్మా!వేరేది తీసుకో, రేపు మంచిది తెచ్చిస్తాలే అంటాడు గానీ ఏదో ఒకటి అంటగడదామని అసలు అనుకోడు.
ఒకసారి నేను అడిగాను ఏం తాతా!ఎందుకు ఈ వయసులో నీకు ఈ కష్టం?పిల్లలు లేరా! వాళ్ళు చూడరా! అని.
కొడుకు ప్రయోజకుడు కాడని,సంపాదించలేడని చెప్పాడు.అయ్యో!పాపం అనుకున్నాను.ఈ
మార్చి నెల నుండి అతను రావడం లేదు.పెద్ద వయసు కదా!ఏమయిందో!ఎందుకు రావటం లేదో అని చిన్న ఆందోళన.ఏమీ కాకూడదు అని బలమైన కోరిక.ఈ రోజు వస్తాడేమో,వస్తే బాగుండు అని ఆశ.పాపం, ఎప్పుడూ తాతా అని పిలవడమే గానీ పేరైనా అడగలేదే అని అనిపిస్తుంటుంది.తన గురించి ఏమీ తెలియని,ఏ సంబంధమూ లేని ఒక వ్యక్తి గురించి ఇలా ఆలోచించడం, ప్రతిరోజూ ఒకసారి గుర్తు చేసుకోవడం వింతగానే అనిపిస్తుంటుంది.
ఆ తాత క్షేమంగా ఉండాలని,త్వరలోనే ఆకుకూరలు, ఆకుకూరలు అనే ఆ కేక వినపడాలని, ఆ తాత కనపడాలని మనసారా కోరుకుంటున్నాను.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.07.2020
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
26.అవసరమా!
*****************
ఈ మధ్య సినిమా ప్రముఖుల ఆంతరంగిక విషయాలపై పలు ఛానెల్స్, సీనియర్ జర్నలిస్టులతో చేస్తున్న ఇంటర్వ్యూలు, చర్చలు ప్రాముఖ్యత ను సంతరించుకుంటున్నాయి.నాకు తెలిసి ఒక ప్రముఖ సినీ గేయ రచయిత గారి భార్య తో మొదలైన ఈ రకపు ఇంటర్వ్యూలు ఈ మధ్య వరుస కథనాలు గా మరి కొందరితో జరుగుతున్నాయి.
బ్రతికి ఉన్నవాళ్ల చనిపోయిన వాళ్ళ ప్రైవేటు లైఫ్ అంతా బట్టబయలు చేస్తున్నారు.దానివల్ల ఎవరికి ప్రయోజనం?
పైగా ఇందులో చాలావరకు వారి బలహీనతలను బహిర్గతం చేయటమే ప్రధాన విషయం గా ఉంటోంది.
ఏమిటీ లోకం?
ఎదుటి వారితో మనకు సన్నిహిత పరిచయం ఉంటే మాత్రం, ఒకవేళ అవి నిజమైతే మాత్రం లోకానికి చాటింపు వేయాల్సిన అవసరం ఉందా!
ఆ మధ్య ఒకావిడ శోభన్ బాబు గారి భార్య గౌడుగేదెలా ఉంటుంది అని నోరు పారేసుకుంది.
ఒక స్త్రీ అయి ఉండి, మరొక స్త్రీని ఆమె అందం గురించి ఈ విధంగా మాట్లాడి కించపరచడం తప్పు కదా!
సత్వరజస్తమో గుణాల్లో ఇలాంటి వార్తలపై ఆసక్తి చూపటం తమోగుణం గా చెప్తారు.
చదివే వాళ్ళు, చెప్పేవాళ్ళు , అడిగేవాళ్ళు, ప్రసారం చేసేవాళ్ళు అందరూ ఇందులో బాధ్యులే.
ఇది మనకొద్దు.
మన జీవితాల్లోని లోటుపాట్లు మనం సరిచేసుకుందాం.
ఉన్నత విలువలతో, వ్యక్తిత్వం తో సామాజిక బాధ్యత తో జీవిద్దాం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.7.2019.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
27.ఆటోవాలా
నేనెప్పుడూ ఆటోవాళ్ళ పట్ల కొంచెం ఉదారంగా ఉంటాను, అడిగిన చోట,అడిగిన వెంటనే ఆపితే ఓ పది రూపాయలు ఎక్కువ ఇస్తుంటాను ,నాది చాలా మంచి మనసు అని నన్ను నేనే శెభాష్ అనుకుంటూ ఉంటాను.
మా ఇంటికి, స్కూల్ కి నడిచే దూరమే.అయినా ఉదయం హడావిడి గా ఉంటుందని, సాయంత్రం అలసిపోయి ఉన్నానని ఆటో ఎక్కుతుంటాను.
ఈ రోజు కూడా అలాగే ఆటో ఎక్కాను.
దిగేటప్పుడు పర్స్ లో ఒక పది నోటే కనపడింది.ఇంకో పది రూపాయల కోసం వెతుకుతున్నాను.
అప్పుడు ఆ ఆటో కుర్రాడు ఫర్వాలేదమ్మా!ఈసారి ఎక్కినప్పుడు ఇద్దువుగానివిలే అన్నాడు.అతన్ని ఎప్పుడూ చూసినగుర్తు కూడా లేదు నాకు.
వెతికి ఇచ్చేశానను కోండి.
కానీ అతని ఆదాయానికి,అతని కష్టానికి ఆ పది రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడటమే అతని సహృదయతను తెలియజేస్తోంది.
ఇలాగే మూడునెలల క్రితం ఒక ఆటో అతనికి ఆటో దిగి ఇరవై రూపాయలు ఇచ్చాను.(అది మా ఒంగోలు లో మినిమమ్ ఆటో చార్జి)
.దగ్గరే కదమ్మా!పది రూపాయలు చాలులెండి అని పది వెనక్కి ఇచ్చేశాడు.
ఫర్వేలేదులే బాబూ !తీసుకో అని అన్నా తీసుకోలేదు.
ఈ రెండు సంఘటనలు నేనెంతో ఉదార స్వభావం కలదాన్నని మనసులోనే పొంగిపోయే నా అహంకారానికి ఒక పాఠమే కదూ!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.2.2022
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
28.మూడుముళ్ళ బంధం
ముప్పై మూడేళ్ళ దిశగా పయనం
*మాది చాలా అన్యోన్యమైన జంట*
*మేమెప్పుడూ పోట్లాడుకుని ఎరగం*
*మా ఇద్దరిదీ ఒకే మాట ఒకే బాట *😜
లాంటి పచ్చి అబద్ధాలు
ఒట్టేసి కొన్ని
ఒట్టేయకుండా కొన్ని
చెప్పనే చెప్పను
మా ఇద్దరివీ
రెండు
వేర్వేరు ప్రపంచాలు
ఆయనకు రాజకీయాలు ఆసక్తి
నాకు కవితా వ్యాసంగంపై అనురక్తి
ఆయనకు విసుగు ఎక్కువ
నాకు అసహనం ఎక్కువ
భవిష్యత్తుపై ఆయనకు భరోసా
ముందు జాగ్రత్త
ఉండాలని నా ఆశ
నవ్వటం ఆయనకు పెద్దగా అలవాటు లేదు
నవ్వకుండా ఉండడం
నాకు పెద్దగా అలవాటు లేదు
మా ఆయనంటే
నాకు ప్రాణమని
నేను ప్రపంచానికంతా
చాటింపు వేస్తుంటాను😍
నేనంటే తనకిష్టమని
ఆయన నాతో కూడా చెప్పరు😭
చిన్న చిన్న విషయాలైనా నాతో చెప్పాలని నేను అనుకుంటాను
పెద్ద పెద్ద విషయాలు కూడా ఆయన నాతో చెప్పరని ఫీలవుతుంటాను
మేము విజాతి ధృవాలం
అందుకేనేమో
ఒకరినొకరం సదా
ఆకర్షించుకుంటున్నాం
ఏదేమైనా
వేడుకైనా
వేదనైనా
ఎన్ని వైరుధ్యాలున్నా
ఆయనది మాటల్లో చెప్పలేని ప్రేమ
నాది మాటల్లో చెప్పలేనంత ప్రేమ
అందుకే మా బంధం నాకు అపురూపం
నిన్న..నేడు..రేపు...కూడా
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.12.2021
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
29.ఒక చేదు జ్ఞాపకం
పెను విషాదం
1977 నవంబర్ 19 శనివారం దివిసీమ ఉప్పెన
నాకు ఇంకా బాగా గుర్తుంది ఆ రోజు.
అప్పుడు నా వయసు 11 సంవత్సరాలు.
6వ తరగతి చదువుతున్నాను.మేము గుంటూరు దగ్గర ఉన్న పేరేచర్లలో ఉండేవాళ్ళం.ముందురోజు శుక్రవారం మా స్కూల్ తరపున కొండవీడు కి ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళారు.
ఆ రోజు మధ్యాహ్నం నుండే వర్షం మొదలయ్యింది. గాలి విసిరేస్తోంది.టీచర్లు ఈ పిల్లలను ఇళ్ళకెలా చేర్చగలమా భగవంతుడా అని భయపడటం లీలగా గుర్తుంది. మాకు సరదాయే తప్ప ముంచుకొస్తున్న ముప్పు తెలియదు. ఎలాగో ఫిరంగిపురం రైల్వేస్టేషన్ కి చేరుకున్నాం. అక్కడ ఐస్ క్రీం బండివాడు పెందలాడే ఇల్లు చేరాలని 5పైసలకు ఐదు ఐసులు అమ్మటం, నేను మా పెద్ద తమ్ముడు కొనుక్కొని తినడం గుర్తుంది.
మెల్లగా క్షేమంగా ఇల్లు చేరుకున్నాం. మా నాన్నగారు JCOP అనే ఆయిల్ మిల్లులో ఉద్యోగం చేసేవారు.ఆ కంపెనీ క్వార్టర్స్ మూడు వరుసలుగా ఉండేవి.ఒక్కొక్కటి పొడవైన ఒకే దూలంపై కట్టిన 18 పూరిళ్ళు, ఆ రాత్రి గాలికి పైకప్పు ఇంతెత్తున ఎగిరి పడుతూ భయం పుట్టించింది.మా చిన్న తమ్ముడు రెండేళ్ల వాడు.వాడిని, మమ్మల్ని దగ్గర పెట్టుకొని, పక్కింటి వాళ్ళతో ఇంట్లోనుండే బిగ్గరగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఆ కాళరాత్రి గడిపారు మా అమ్మానాన్నలు.
మాకు ఒకవైపు సర్వేశ్వరరావు తాతగారని వృద్ధ దంపతులు ఉండేవారు.ఆయన ఇల్లు కూలిపోతుంది,చచ్చిపోతాం. వెంటనే ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోదాం పద అంటారు.మామ్మగారు ఆవిడ పేరు పద్మావతి.అందరూ పిల్లాజెల్లతో ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు మన ముసలి ప్రాణాలకోసం అందర్నీ వదిలేసి పోదామా! నలుగురితో పాటే మనమూ అంటూ, నేను రానని మొండికేశారు.
ఆ శుక్రవారం సాయంత్రం ఎదురింటి కి పాలు తేవటానికి వెళ్లి న నేను గాలివాటుకి కొట్టుకుపోతూ ఎలాగో ఇంటికి చేరగలిగాను.అప్పుడే మా కాలనీలో కనీసం డజను పాముల్ని చంపటం కూడా గుర్తుంది.బిలబిలలాడుతూ ఎన్ని వచ్చాయో!మూడురోజుల తర్వాత వార్తల్లో, పేపర్లో ఎన్ని విషాదవార్తలో!
ఒరిస్సా భువనేశ్వర్ లో ఉండే మా పెద్ద మావయ్య మేమెలా ఉన్నామో చూసి రమ్మని హైదరాబాద్ లో ఉంటున్న మా కృష్ణ మామయ్య ను పంపించాడు.వారం రోజుల తర్వాత మా మామయ్య మా ఊరికి వచ్చాడు.మా క్షేమం తెలుసుకుని,మా పెద్ద మామయ్య కు టెలిగ్రామ్ ఇచ్చాడట.
ఏమీ దొరకని ఆ రోజుల్లో వ్యాపారస్తులు అందరూ ఇదే సమయమని రేట్లు పెంచేశారు.కానీ సత్యం గారి కొట్టులో మాత్రం పాత ధరలకే అన్ని వస్తువులు అమ్మి తన నిజాయితీ ని,మానవతను ఆయన చాటుకున్నారు. ఈ దివిసీమ ఉప్పెనను ఆ తర్వాత ఊరికి మొనగాడు సినిమాలో కృష్ణ గారు ఎంతో బాగా చూపించి ఆ విషాదకర ఘట్టాన్ని దృశ్యమానం చేశారు.ఇవండీ! 1977 తుఫాను గురించి కొన్ని జ్ఞాపకాలు.
దివిసీమ ఉప్పెన కు 44 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆనాటి సంగతులు నా అనుభవం లో నాకు గుర్తున్నంతవరకు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.11.2021.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
30.నేనూ ..నా కాఫీ ముచ్చట్లు
కాఫీ అలవాటు నాకు పెళ్ళికిముందు లేదు.
అసలు చిన్నపిల్లలు కాఫీ తాగకూడదు అని మాకొక రూలు.మా పిల్లలిద్దరికీ ఇప్పటికీ కాఫీ అలవాటు లేదు.మంచి పిల్లలు కదా!
కానీ,మా చిన్న తమ్ముడు మాత్రం చిన్నప్పటి నుండే కాఫీ తాగేవాడు.వాడికెలా అలవాటైందోగానీ,మా ఇంట్లో నా పేరు వేసిన చిన్న గ్లాసు ఒకటి ఉండేది.దాని నిండా ఇవ్వాలి వాడికి.ఏ కాస్త వెలితి ఉన్నా అలిగేవాడు. మా అమ్మా వాళ్ళ ఇంట్లో ఉదయం మూడుసార్లు కాఫీ తాగడం అలవాటు అమ్మానాన్నలకు.
లేవగానే ఒకసారి, (పళ్ళు తోముకున్నతర్వాతే సుమండీ!) స్నానం చేశాక ఒకసారి, టిఫిన్ చేశాక మూడోసారి.
మా పెద్ద తమ్ముడు పెద్దవాడయ్యాక మా అమ్మ ఆరోగ్యం కోసం కాఫీ తాగటం మానేయమ్మా అని బ్రతిమలాడి చెప్పేవాడు.ఆమె వినలేదు.పైగా అలవాటు మానుకోవడం అంత తేలిక కాదు,ఏదీ, నువ్వు మానేయ్ చూస్తాను అనేది.మా అమ్మ చేత కాఫీ అలవాటు మానిపించడానికి వాడు కాఫీ తాగటం మానేశాడు.అప్పటినుండీ ఇప్పటివరకూ వాడు మళ్ళీ కాఫీ తాగనేలేదు.అందుకే వాడికి శ్రీరామమూర్తి అనే పేరు అచ్చంగా సరిపోతుంది అని నేను అంటుంటాను.అఫ్కోర్స్ మా అమ్మ మాత్రం మానలేదు,అది వేరే విషయం.
ఇక నాకు చిన్నప్పుడు కాఫీ అలవాటు లేదని చెప్పాను కదూ!
అది మా వారితోనే మొదలైంది.అయినా కాఫీ తాగకపోతే ఉండలేనన్నంత ఇష్టమూ,అలవాటూ కూడా లేదు నాకు ఇప్పటికీ.అయినా
ఆయనతో కలిసి ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తో రోజు మొదలవ్వాలని నా ఆశ,నా సరదా.ఆయనేమో ఉదయాన్నే లేవరు.నాకేమో ఫస్ట్ కాఫీ ఆయనతో కలిసి తాగాలి అని మనసులో ఒక నియమం .ఈ 31 సంవత్సరాలుగా ఈ నియమాన్ని పాటించని సందర్భాలు బహు తక్కువ.
ఆయన గానీ,నేను గానీ ఏదైనా ఊరికి వెళితే తప్ప.అప్పుడు కూడా ఫోన్ చేసి మీరు కాఫీ తాగారా!అని అడిగి
(విసిగించి ) అప్పుడు తాగుతాను.నాకదో తుత్తి.నాతోనే ఫస్ట్ కాఫీ
అనే నియమం లాంటిది ఆయనకేమీ లేదు లెండి.
ఏమండీ! కాఫీ తాగుదాం .లేవండీ!అని నేను ఆయనను నిద్రలేపటానికి ప్రయత్నిస్తాను.ఆయనేమో ప్లీజ్ జ్యోతీ!ఈ రోజుకి నువ్వు తాగేసేయ్.నాకు కొంచెం బాలేదు.కొద్దిసేపు పడుకుంటాను అంటుంటారు.ఇది తరచూ జరిగేదే.మా అమ్మ ఉన్నప్పుడయితే ఎందుకే!అలా విసిగిస్తావు? నీకు అదేం ఆనందం?అని కోప్పడేది.మొత్తానికి నేను విజయం సాధిస్తాననుకోండి.
అసలు 2002 లో అమ్మ చనిపోయే వరకూ మేము ఫిల్టర్ కాఫీ యే తాగేవాళ్ళం.కానీ అమ్మ చనిపోయాక ఉదయాన్నే ఫిల్టర్ వేసినప్పుడు అమ్మ గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చేసేది.అందుకని అప్పటినుండి BRU కాఫీయే తాగటం మొదలుపెట్టాను. అదైతే మరీ అంత స్ట్రాంగ్ గా ఉండదు.నాకు మరీ స్ట్రాంగ్ ఉంటే కూడా నచ్చదు.
మళ్ళీ మా అమ్మాయి పెళ్ళి సందర్భంలోనే మా ఇంట్లో ఫిల్టర్ వేయడం చేశాను.ఏం చేయను ! అమ్మ తరపు బంధువులందరూ కాఫీ ప్రియులే మరి. వాళ్ళ కాఫీల కోసం ప్రత్యేకంగా ఒక స్టవ్ ఇచ్చేశాను అప్పుడు.
మా అమ్మ వాళ్ళ ఇంట్లో టీ అలవాటు లేదు.మా వారు కూడా ఇంట్లో టీ తాగరు. ఎప్పుడైనా బయట తాగవలసి వస్తేనే టీ తాగుతాం.
(అసలు చాలాకాలం నా మనసులో
కాఫీ క్లాస్
టీ మాస్
అనే అభిప్రాయం కూడా ఉండేది.అలా అనుకోవడం సరికాదు కానీ ఎందుకో మరి,నా మనసుకు అలా అనిపించేదంతే.)
ఇంత హంగామా చేసి కాఫీ చివరి సిప్ వరకూ తాగుతానా! అంటే అదీలేదు.కనీసం ఒకవంతు కాఫీ వదిలేస్తాను. (అది నేను కలుపుకున్నా,ఇతరులు ఇచ్చినదైనా అంతే.)మా వారు మాత్రం ఆఖరిచుక్క వరకూ తాగేసి, నేను కాఫీ బాగా పెడతాను అనే నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంటారు పాపం.
మా అమ్మ స్ట్రాంగ్ గా ,మరదలు లైట్ గా ఈ విషయం లో నన్ను తిడుతూనే ఉంటారు.
నిజం చెప్పాలంటే నాకు కాఫీ టేస్ట్ కంటే ఫ్లేవరే ఇష్టం.
పొగలు,నురగలు కక్కుతూ, ఘుమఘుమలాడుతూ ఉన్న కాఫీ ఓహ్!సూపర్.
కాఫీ తాగాలంటే నాకొక కంపెనీ కూడా అవసరం.అందుకే ఈయన ఊరు వెళ్ళినప్పుడు పనమ్మాయి వచ్చేదాకా వెయిట్ చేసి తనతో కలిసి తాగుతాను.
అలాంటి కాఫీని తాగడమే కాదు,ఇతరులకు కలిపి ఇవ్వడం కూడా నాకు చాలా ఇష్టం.అందుకే అప్పుడప్పుడూ మా స్కూల్ లో నా మిత్రులకోసం తీసుకెళుతుంటాను.
ఇవండీ!నా కాఫీ ముచ్చట్లు.
బాగున్నాయా మరి!
ఏమిటీ!రాసేవారికి చదివేవారు లోకువ అనుకుంటున్నారు కదూ!
మీ ఇష్టం మరి.మీ భావ ప్రకటన స్వేచ్ఛను హరించే నిరంకుశురాలిని మాత్రం కానులెండి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.5.2021
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
31.నా(పుస్తక)ప్రపంచం
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా నా సొంత గ్రంథాలయంలో నేను
నాకున్న రకరకాల అభిరుచుల్లో పుస్తకాలు కొనుక్కోవడం కూడా ఒకటి.నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి పుస్తకాలు ఇష్టం గా కొనుక్కోవడం మొదలుపెట్టాను.నేను ఇంటర్ లో ఉండగా నాన్నగారు నా పుట్టినరోజు కి ఒక వంద రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుక్కోమన్నారు.అప్పుడు నేను గుంటూరు అరండల్ పేట దగ్గర గల న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ లో విద్యార్థి కల్ప తరువు అనే నిఘంటువు కొనుక్కున్నాను.అది 80 రూపాయలు అని గుర్తు.నాన్నగారు చాలా మెచ్చుకున్నారు.ఇక అప్పటినుండి పుస్తకాలు కొంటూనే ఉన్నాను.
పుస్తకం హస్త భూషణం అనే మంచి మాట నేడు పెడర్థంలో వాడుతున్నారు గానీ ఒక జీవితకాలం చాలదు కదా ఇవి చదవాలంటే.
ఇందులో అన్నీ నేను చదివేశాను అని అతిశయోక్తులు చెప్పను.
ఒకసారి చదివినవి
ఇష్టపడి పదే పదే చదివినవి
అవసరాన్ని బట్టి కొంత భాగం చదువుకున్నవి
అస్సలు తెరిచి చూడనివి ఇలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి ఈ బీరువాలో.
నేను నా జీవితకాలంలో సంపాదించిన విలువైన ఆస్తి ఈ పుస్తకాలే.
నా తదనంతరం నా పుస్తకాలను ఒంగోలు జిల్లా గ్రంథాలయానికి ఇచ్చేయమని మా పిల్లలకు, మా వారికి చెప్పాను. ఇది నా వీలునామా అన్నమాట.
పుస్తకానికి సంబంధించి నాకున్న మరొక అభిరుచి పుస్తకాలు కొనివ్వడం.నాకు ఉద్యోగం వచ్చిన దగ్గరనుండి అంటే 1993 నుండి ఇప్పటివరకు ప్రతీ సంవత్సరం నా పుట్టినరోజు నాడు ఎవరో ఒకరికి పుస్తకం బహుమతి గా కొనిస్తుంటాను.అది నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంటుంది.
ఇదండీ! ఈ ప్రపంచం పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం తో నా అనుబంధం.
మరి మీ పుస్తకాల జ్ఞాపకాల పుటల్ని కూడా ఒకసారి నాతో పంచుకుంటారు కదూ!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.4.2020.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
32. అ (తడు) ఆ (మె)
(అ)సమానం
ఏమండీ! నా ATM కార్డ్ ఒకసారి ఇస్తారా!
బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాను.
ఏమిటీ! నా ATM అంటున్నావు.అనవసరంగా ఖర్చు చేస్తావని నా దగ్గర పెట్టుకున్నాను.నీకేం కావాలో చెప్పు.తెచ్చి పడేస్తాను.
*******************
ఏమండీ!ఈ రోజు మీరు పాతికవేలు డ్రా చేసినట్లు నా మొబైల్ కి మెసేజ్ వచ్చింది.ఇప్పుడు అంత అవసరం ఏం వచ్చింది?
ప్రతీది నీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు .ప్రతి చిన్న విషయానికి వివరాలు అడక్కు.నాకు చిరాకు.
*******************
ఏమండీ! నిన్న ఎవరో అమ్మాయితో సినిమా హాల్లో కనిపించారట.ఎవరా అమ్మాయి?
సరదాగా ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తే తప్పేంటి?
వెధవ ఆరాలూ నువ్వూనూ! అస్సలు బ్రాడ్ మైండ్ లేదు కదా!
ఏమిటీ! నిన్న ఆఫీసులో ఫైల్ అందిస్తూ వాడెవడితోటో ఇకఇకలు. కాస్త చుట్టు పక్కల గమనించుకో.
.............................
ఏమండీ! నాకు ఆఫీసులో కాస్త పని ఉంది ఈ రోజు.మీరు ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొస్తారా!
నాకు పార్టీ ఉంది. కుదరదు. పని ఉంటే రేపు చూసుకో.ఇలాంటి పనులన్నీ నాకు చెప్పకు.నువ్వే వెళ్ళు.
******************
ఏమిటండీ!ఈ రోజు ఇంత పొద్దుపోయింది.రాత్రి 11 దాటింది. ఘాటుగా ఆ వాసన ఏమిటి?
మగవాడికి బయట సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి.అన్నీ నీకు చెప్పాలా! గుమ్మంలోనే నిలదీసేస్తావు.వెధవగోల.మనశ్శాంతి లేదు.
ఏమిటీ! ఆఫీసు నుండి రావటం గంట లేటయింది?
అంత ముంచుకుపోయే పనులేమిటి? ముందుగా చెప్పాల్సిన బాధ్యత లేదా!
ఉద్యోగం చేస్తున్నానని పొగరు . నీకు మొగుడంటే లక్ష్యం లేదు.
............................
ఏమండీ! ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏముంది?ఎవరి దగ్గర తెచ్చారు? వడ్డీ ఎంత?
ఎంతయితే నీకెందుకు? మీ బాబు దగ్గరినుండి తెమ్మనలేదు సంతోషించు.
.............................
ఏంటండీ! అలా నీరసంగా ఉన్నారు? అయ్యయ్యో!జ్వరమా! ఉండండి.నేను ఆఫీసుకి సెలవు పెడతాను. డాక్టర్ దగ్గరకు వెళ్దాం. తగ్గిపోతుంది.కంగారు పడకండి.
ఏమిటీ!జ్వరమా! ఎప్పుడూ ఏదో ఒక రోగం నీకు.సర్లే.మీ అమ్మకు ఫోన్ చేసి నాలుగు రోజులు వచ్చి ఉండమను.సాయంత్రం వచ్చేటప్పుడు టాబ్లెట్ లు తెస్తాలే.వేసుకుంటే అదే తగ్గిపోతుంది.
.............................
ఏమండీ!ఈ రోజు ఆదివారం కదా! సరదాగా పిల్లలతో బయటకెళ్ళి హోటల్లో భోజనం చేసి వద్దామా!
మనమేం లక్షాధికారులమా!ఇలా వారం వారం డబ్బు తగలెయ్యటానికి.వంట చేయాలంటే బద్ధకం అని చెప్పు.
*******************
ఏమిటి? ఈ స్నేహితులు, కిట్టీ పార్టీలు.ఫ్రెండ్స్ ని చేరేసి కొంప గుల్ల చేస్తున్నావు
ఇదిగో! ఈ ఆదివారం మా స్నేహితులు నలుగుర్ని లంచ్ కి రమ్మన్నాను.కాస్త స్వీటు,హాటు , నాలుగైదు రకాల కూరలు వండిపెట్టు.
*******************
ఆవేశం , అసహనం, అవమానం, ఆత్మాభిమానం అన్నీ దిగమింగుకుని అసమానతను మౌనంగా భరించే ఆ ఇల్లాలు మాట్లాడితే?
ఆ మూగకు మాటొస్తే?
ఈ సమస్యలు అన్నీ, ప్రతి ఇంట్లో, ప్రతివారూ, ప్రతిరోజూ ఎదుర్కొంటున్నారు అని కాదు నా భావం.కానీ,వీటిలో ఏదో ఒక సమస్యను ఎప్పుడో ఒకప్పుడు దాదాపుగా ప్రతి స్త్రీ ఎదుర్కొని ఉంటుందన్నది వాస్తవం,నా అనుభవం కూడా. ఇవి గృహహింస కిందికి వచ్చేటంత పెద్ద విషయాలు కాకపోవచ్చు.కానీ వ్యక్తిత్వాన్ని చిన్న బుచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేసి,మనసును గాయపరచే సున్నిత మైన అంశాలు.
మన సమాజంలో 80 శాతం ఇల్లాళ్ళ పరిస్థితి ఇదే.
భర్త తనను ఏమే! అంటే తాను భర్తను ఏరా!అనే స్వాతంత్ర్యం స్త్రీ కోరటం లేదు. ఒసేయ్,ఏమే ,ఇదిగో,నిన్నే అని కాకుండా కనీసం తనను పేరు పెట్టి పిలవాలని మాత్రమే కోరుకుంటున్న స్త్రీ సమానత్వపు కాంక్ష అత్యాశ కాదని భావిస్తూ, అడియాశ కాకూడదని ఆశిస్తూ...
అందరికీ మహిళా సమానత్వ దినోత్సవ శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.8.2020.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
33.మీకు అర్థమౌతోందా!
మన సినిమాల్లో
నాకు అస్సలు అర్థం కాని విషయాలు
1. ప్రయాణానికి
సూట్ కేస్ లో బట్టలు చక్కగా మడతలు వేయకుండా, ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా కుక్కేయడం
2.నో,అలా జరగడానికి వీల్లేదు అనే డైలాగు
3.తాళి బొట్టు కట్టే చివరి క్షణం లోనో,ఉరి మెడకు బిగుసుకునే చివరి క్షణంలోనో ఎవరో ఒకరు వచ్చి ఆపండి అని గట్టిగా అరవడం
4.హీరో హీరోయిన్లు పాట పాడుకుంటుంటే ఒకే రకం డ్రస్సులు వేసుకున్న వారు వచ్చి డాన్స్ చేయడం
5.అన్ని రకాల కూరగాయలూ చక్రాల్లా తరిగేసి ఒకేసారి మూకుట్లో పడేయడం
6.మనం తేలికగా గుర్తుపట్టే
హీరో మారువేషాన్ని విలన్ గుర్తుపట్టలేకపోవడం
7.అప్పటివరకూ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని హీరో ని అరేయ్ ఒరేయ్ అని పిలుస్తూ,జుట్టు విరబోసుకుని తిరిగే అమ్మాయి ఒకేసారి చీర కట్టేసుకుని తెగబారెడు జడ,జడనిండా పూలు,చేతినిండా గాజులు వేసుకుని ఏమండీ అని పిలిచే టంత వినయం గా మారిపోవడం
8.అసలేం జరిగిందంటే అని మొదలుపెడితే చెప్పనివ్వకుండా కథను సాగదీయటం,వింటాను అన్నప్పుడేమో ఎవరికో వేసిన ఒట్టు గుర్తుకొచ్చి చెప్పలేకపోవడం
9.చివరి సీనులో అందరూ గ్రూప్ ఫోటో లోకి రావడం
10.తన తప్పు క్షమించమని తప్పు చేసినవాళ్ళు,చెయ్యని వాళ్ళు కూడా అందరూ ఒకరినొకరు అడగటం
11.జనాలే లేని చెట్లతోపుల్లోంచి అమ్మాయి ఒంటరిగావెళ్ళటం, ఆమెపై అత్యాచార ప్రయత్నం,ఎవరో చెప్పినట్లుగా హీరో ఆ క్షణం లోనే అక్కడికివచ్చి రక్షించటం
12.ఆత్మహత్యా యత్నానికి తలపడి వేసుకున్న తలుపుల్ని రెండుమూడుసార్లు హీరో తన్నగానే అంత లావు తలుపులూ మొత్తంగా విరిగిపోవడం
13.చీర కానుకగా ఇచ్చి కట్టుకురమ్మనగానే మాచింగ్ జాకెట్,ఫాల్ తో కట్టుకు వచ్చేయడం
14.గోడచాటునించి విన్న మాటలతోనే అపార్థాలు కలగటం,తొలగిపోవడం
15.హీరో ఇంట్లో కూడా ఫ్యాంటు, షర్టు కొన్నిసార్లు షూ తోటే తిరగటం,పడుకోవడం కూడా.
16.ఆవేశంతో ఊగిపోతున్న వారిని లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టి కంట్రోల్ చేయడం
17.హాస్పటల్ లో ఆపరేషన్ థియేటర్ ముందు రెడ్ బల్బ్ వెలగడం
18.పేషంట్ ని హాస్పిటల్ కి తెచ్చినప్పుడు డాక్టర్ కూడా ఆ స్ట్రెచర్ ని తోసుకెళ్ళడం
19.హీరో, విలన్ ఇద్దరూ కిందా,మీద పడి తన్నుకున్నా విలన్ బట్టలు మాత్రమే మురికి కావడం
20.గుంపులు గుంపులుగా జనాలున్న పార్టీ లో ఒక్కరి చుట్టూ నే తిరుగుతూ పాట పాడటం (ఇది ఎక్కువగా హిందీ సినిమా ల్లో కనపడుతుంది)
21.ఆత్మహత్య చేసుకోవాలంటే గబగబా వెళ్ళిపోయి కొండలెక్కటం.ఇంట్లో అందరూ వెతుక్కుంటూ అక్కడికే రావటం
22.హీరోనే విలన్ గ్యాంగ్ ని చితక్కొట్టేస్తుంటే పోలీసులు నించుని చూడడం,ఎవరో ఒకరు ఇన్స్పెక్టర్ గారూ! అరెస్టు చేయండి అన్న తరువాతే ఆయన యూ ఆర్ అండర్ అరెస్ట్ అనే డైలాగ్ చెప్పి అరెస్ట్ చేయడం
23.చిన్నప్పుడెప్పుడో విడిపోయిన కుటుంబం ఒక పాటతో అందరూ మళ్ళీ కలుసుకోవడం
హీరోయిన్ ఏడుస్తూ బెడ్ రూమ్ లోకి వెళ్ళి మంచానికి అడ్డంగా బోర్లాపడిపోయి ఏడవడం
ఇలాంటి విషయాలు చాలా చాలా నాకు మన సినిమాల్లో ఎంత ఆలోచించినా అర్థం కావు ఎందుకో???
మరి మీకు కూడా ఇలాంటి సందేహాలు వస్తుంటాయా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.10 2020
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
34.*వినాయకుడు అమాయకుడు*
*పార్వతీదేవి:*
అనింద్యా!అనింద్యా!
ఏమిటా హడావిడి?ఎక్కడికా పరుగు?
మా గణపతి ఏడీ?
ఈరోజు తన పుట్టినరోజని ఉదయాన్నే చక్కగా ముస్తాబు చేశాను. దిష్టి తీద్దాం అనుకునేలోపే ఇప్పుడే వస్తానుండమ్మా!అంటూ ఎటో వెళ్ళిపోయాడు.
ఏమిటో వీడి వరస.
క్షణం కూడా కుదురులేదు కదా!
నీతో చేరి ఇలా అయిపోయాడు మా వాడు.
*అనింద్యుడు:*
అయ్యో!అంతమాట అనకండమ్మా!మీ అబ్బాయి అంటే నాకెంత ప్రేమో మీకు తెలియదా!
ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి కదా! భూలోకంలో ఊరూరా,వాడవాడా
స్వామి వారికి పెద్ద ఎత్తున పందిళ్ళు వేసి,విగ్రహాలు పెట్టి,ఉత్సవాలు చేస్తున్నారు.అందుకని వారు అక్కడికి బయలుదేరారు.ఇదిగో!నేను కూడా ఇలా వారివెంట పరుగెత్తే లోపే మీరు పిలిచారు.
ఏమాటకామాటే!భూలోకంలో ఆ ఉత్సవాల తీరు,భక్తుల ఉత్సాహం చూసి తీరాల్సిందేనమ్మా!మీరు కూడా శివయ్యతో కలిసి రాకూడదూ!మీ అబ్బాయి పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూసి ఆనందించవచ్చు.
*పార్వతీదేవి:*
ఏం ఆనందంలే అనింద్యా! వీడికి ఈ ఉత్సవాల సరదా ఏమిటో!
నిన్న మొన్న శ్రావణ బహుళ అష్టమి నాడు వాళ్ళ మావయ్య పుట్టినరోజు చేసుకోలేదూ!ఏదో ఉట్టికొట్టడం,చిన్నారులంతా కృష్ణ,గోపికల వేషాలు వేసుకొని మురిపించటం చూశాను.
వచ్చేనెల ఆశ్వయుజ మాసం లో నాకు కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు ప్రజలు.పూజలు,ఉపవాసాలు,బొమ్మలకొలువులతో భక్తిగా చేస్తారు.
కానీ ఇదేమిటయ్యా!
ఈ పందిళ్ళేమిటి?రకరకాల వేషాలతో మా అబ్బాయివి ఈ విగ్రహాలేమిటి?దానికోసం అంతంత చందాలేమిటి?చెవులు హోరెత్తిపోయేలా మైకుల్లో ఆ పిచ్చిపాటలేమిటి? పందిళ్ళలో ఆ వెర్రి మొర్రి డాన్సులేమిటి?
ఇక నిమజ్జనం సంగతి చెప్పనే అక్కర్లేదు.తాగి ఊగిపోతూ ఆ ఊరేగింపు లేమిటి?పైగా ఈ ఉత్సవాల పేరుతో ఎంత పర్యావరణ కాలుష్యం జరుగుతోందో మీకు అర్థం కావటం లేదు.
ప్రజల భక్తి గోరంత
ఆర్భాటం కొండంత
వీడిని ఆ వైపు పోవద్దురా అంటే నా మాట వినడాయె.
పోనీ వాళ్ళ నాన్నతో చెప్పి కాస్త భయం చెప్పిద్దామంటే తండ్రీకొడుకులు ఇద్దరూ ఇద్దరే.
వీడేమో మొండి ఘటం.ఆయనేమో రుద్రుడు.ఇదివరకు చూశావుగా
ఆయనకు ఆవేశం వస్తే ఎంత పని చేస్తారో!
ముద్దులు మూటకట్టే ముఖంతో ఉండే నా బిడ్డ కాస్తా ఇదిగో ఇలా
గజాననుడు అయిపోయాడు.
*అనింద్యుడు.*.
అయ్యో!బాధపడకండమ్మా!మీరు జగన్మాత.మీకు తెలియని ధర్మసూక్ష్మాలు ఏముంటాయి?
శివయ్య మన అబ్బాయిని గజాననుడిగా చేశారంటే గజాసురునికి ఇచ్చిన వరంవల్లనే కదమ్మా!భక్తుని ముఖానికి పూజార్హత కల్పించటం కోసం తన బిడ్డ ముఖాన్నే ఖండించి కుమారునికి అతని శిరస్సును అతికించి నీ బిడ్డను లోకారాధ్యుని ,ప్రథమారాధ్యుని, గణాధిపతిని కూడా చేశారు కదమ్మా!
బోళాశంకరుని వైఖరి మీకు తెలుసు కదా!
ఇక నీ బిడ్డ సంగతి చెప్పేదేముంది?
ముమ్మారు తల్లిదండ్రులైన మీకు ప్రదక్షిణలు చేసి,లోక ప్రదక్షిణ ఫలాన్ని సాధించిన భక్తితత్పరుడు.
నాలుగు రకాల ఆకులతో పూజించి, నాలుగు గుంజీలు తీసి,నాలుగు నైవేద్యాలు సమర్పించి చెంపలు వేసుకుంటే చాలు.చేసిన పాపాలన్నీ ఇట్టే చేత్తో తీసేసి అనుగ్రహిస్తాడు.
ఇటువంటి బిడ్డ, అటువంటి భర్త ఉన్న మీకు ఈ దిగులెందుకమ్మా!
అయినా ఈ గణపతి ఉత్సవాలు ఈ రోజు ఇలా శ్రుతిమించి వెర్రితలలు వేస్తున్నాయి కానీ ఇవి
లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశభక్తి తో ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ప్రారంభించిన వేదికలు.దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి దోహదం చేసిన ఉత్సవాలు.ఇందుకు మీరు చాలా గర్వపడాలి.
ఒక్కోసారి బుజ్జి బొజ్జ తో రకరకాల వేషాలలో స్వామి వారు ఎంత ముద్దొస్తుంటారో చెప్పలేను.
*పార్వతీదేవి:*
నిజమేననుకో.ఒక్కోసారి బుజ్జిబొజ్జతో ,ఆ వేషాలలో నాకు కూడా ముద్దుగానే అనిపిస్తుంటాడు.అదిగో అలా ముద్దుగా ఉన్న నా బిడ్డడికి చంద్రుడి దిష్టి తగిలి ఎంత ఆపద వచ్చిందో నీకు తెలుసు కదా అనింద్యా!
ఒక్కడి దిష్టి కే అలా జరిగితే,ఇంతమంది దృష్టిలో పడే నా చిట్టితండ్రికి ఇంకెంత దిష్టి తగులుతుందో అనే నా ఆందోళన.
అసలే నా బిడ్డ అమాయకుడు.పైగా అన్నీ ఆ తండ్రి బోళాశంకరుడి గుణాలనే పుణికి పుచ్చుకున్నాడు.
*అనింద్యుడు:*
మీరు భలేవారమ్మా!దిష్టిపెట్టిన చంద్రుడు మీ శాపవాక్కుకు గురయ్యాడని అందరికీ తెలుసు కదమ్మా!అలాంటి సాహసం ఇక ఎవరు చేస్తారు?
అందరూ భక్తితో పూజించి, శ్రద్ధగా కథవిని, భయంగా పూజాక్షతలు శిరస్సున ధరించి జాగ్రత్తగా మసలుకుంటారు.
పైగా ఈ మధ్య పర్యావరణం పట్ల కూడా నలుసంత అవగాహన పెరిగింది మానవుల్లో.అందుకే చాలాచోట్ల మట్టి వినాయకుడినే ప్రతిష్టించి పూజిస్తున్నారు.ఇకస్వామి వారికి వాడే పత్రిగురించి మీకు తెలియనిదేముంది?
అది ఈ వర్షాకాలంలో పారే నీటిని పరిశుభ్రం చేయడానికి పనికొస్తుంది కదమ్మా!
కనుక మీరు నిశ్చింతగా మీ అబ్బాయిని భూలోకానికి పంపండి.నవరాత్రులు పూజలందుకొని,అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య శుభాలను అనుగ్రహించి, ఆశీస్సులు అందించి క్షేమంగా తిరిగి వచ్చేస్తారు.అలా తీసుకొచ్చే పూచీ నాది.
*పార్వతీదేవి:*
సరే అనింద్యా! వెళ్ళిరండి.భూలోక జనులకు నా ఆశీస్సులు కూడా అందించానని చెప్పండి.త్వరలో శారద
నవరాత్రులలో నవ దుర్గలుగా వచ్చి నేను కూడా వారిని అనుగ్రహిస్తాను.అన్నట్టు మా అన్నయ్య కూడా ఆశ్వయుజ మాసంలోనే తిరుమల లో బ్రహ్మోత్సవాలతో భక్తులకు కనువిందు చేసి కనికరిస్తాడు.సరేలే ఇక.
అబ్బాయి ఈ లోపు చాలా దూరం వెళ్ళిపోయాడో !ఏమిటో!ఇక పరుగెత్తు.*శుభం భూయాత్.*
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో
*సింహాద్రి జ్యోతిర్మయి*
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.8.2022
2024 వినాయక చవితి కి మరికొంత మార్పులు చేసిన
*వినాయకుడు అమాయకుడు*
*పార్వతీదేవి:*
అనింద్యా!అనింద్యా!
ఏమిటా హడావిడి?ఎక్కడికా పరుగు?
మా గణపతి ఏడీ?
ఈరోజు తన పుట్టినరోజని ఉదయాన్నే చక్కగా ముస్తాబు చేశాను. దిష్టి తీద్దాం అనుకునేలోపే ఇప్పుడే వస్తానుండమ్మా!అంటూ ఎటో వెళ్ళిపోయాడు.
ఏమిటో వీడి వరస.
క్షణం కూడా కుదురులేదు కదా!
నీతో చేరి ఇలా అయిపోయాడు మా వాడు.
*అనింద్యుడు:*
అయ్యో!అంతమాట అనకండమ్మా!మీ అబ్బాయి అంటే నాకెంత ప్రేమో మీకు తెలియదా!
ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి కదా! భూలోకంలో ఊరూరా,వాడవాడా
స్వామి వారికి పెద్ద ఎత్తున పందిళ్ళు వేసి,విగ్రహాలు పెట్టి,ఉత్సవాలు చేస్తున్నారు.అందుకని వారు అక్కడికి బయలుదేరారు.ఇదిగో!నేను కూడా ఇలా వారివెంట పరుగెత్తే లోపే మీరు పిలిచారు.
ఏమాటకామాటే!భూలోకంలో ఆ ఉత్సవాల తీరు,భక్తుల ఉత్సాహం చూసి తీరాల్సిందేనమ్మా!మీరు కూడా శివయ్యతో కలిసి రాకూడదూ!మీ అబ్బాయి పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూసి ఆనందించవచ్చు.
*పార్వతీదేవి:*
ఏం ఆనందంలే అనింద్యా! వీడికి ఈ ఉత్సవాల సరదా ఏమిటో!
నిన్న మొన్న శ్రావణ బహుళ అష్టమి నాడు వాళ్ళ మావయ్య పుట్టినరోజు చేసుకోలేదూ!ఏదో ఉట్టికొట్టడం,చిన్నారులంతా కృష్ణ,గోపికల వేషాలు వేసుకొని మురిపించటం చూశాను.
వచ్చేనెల ఆశ్వయుజ మాసం లో నాకు కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు ప్రజలు.పూజలు,ఉపవాసాలు,బొమ్మలకొలువులతో భక్తిగా చేస్తారు.
కానీ ఇదేమిటయ్యా!
ఈ పందిళ్ళేమిటి?రకరకాల వేషాలతో మా అబ్బాయివి ఈ విగ్రహాలేమిటి?దానికోసం అంతంత చందాలేమిటి?చెవులు హోరెత్తిపోయేలా మైకుల్లో ఆ పిచ్చిపాటలేమిటి? పందిళ్ళలో ఆ వెర్రి మొర్రి డాన్సులేమిటి?
ఇక నిమజ్జనం సంగతి చెప్పనే అక్కర్లేదు.తాగి ఊగిపోతూ ఆ ఊరేగింపు లేమిటి?పైగా ఈ ఉత్సవాల పేరుతో ఎంత పర్యావరణ కాలుష్యం జరుగుతోందో మీకు అర్థం కావటం లేదు.
ప్రజల భక్తి గోరంత
ఆర్భాటం కొండంత
వీడిని ఆ వైపు పోవద్దురా అంటే నా మాట వినడాయె.
పోనీ వాళ్ళ నాన్నతో చెప్పి కాస్త భయం చెప్పిద్దామంటే తండ్రీకొడుకులు ఇద్దరూ ఇద్దరే.
వీడేమో మొండి ఘటం.ఆయనేమో రుద్రుడు.ఇదివరకు చూశావుగా
ఆయనకు ఆవేశం వస్తే ఎంత పని చేస్తారో!
ముద్దులు మూటకట్టే ముఖంతో ఉండే నా బిడ్డ కాస్తా ఇదిగో ఇలా
గజాననుడు అయిపోయాడు.
*అనింద్యుడు.*.
అయ్యో!బాధపడకండమ్మా!మీరు జగన్మాత.మీకు తెలియని ధర్మసూక్ష్మాలు ఏముంటాయి?
శివయ్య మన అబ్బాయిని గజాననుడిగా చేశారంటే గజాసురునికి ఇచ్చిన వరంవల్లనే కదమ్మా!భక్తుని ముఖానికి పూజార్హత కల్పించటం కోసం తన బిడ్డ ముఖాన్నే ఖండించి కుమారునికి అతని శిరస్సును అతికించి నీ బిడ్డను లోకారాధ్యుని ,ప్రథమారాధ్యుని, గణాధిపతిని కూడా చేశారు కదమ్మా!
బోళాశంకరుని వైఖరి మీకు తెలుసు కదా!
ఇక నీ బిడ్డ సంగతి చెప్పేదేముంది?
ముమ్మారు తల్లిదండ్రులైన మీకు ప్రదక్షిణలు చేసి,లోక ప్రదక్షిణ ఫలాన్ని సాధించిన భక్తితత్పరుడు.
నాలుగు రకాల ఆకులతో పూజించి, నాలుగు గుంజీలు తీసి,నాలుగు నైవేద్యాలు సమర్పించి చెంపలు వేసుకుంటే చాలు.చేసిన పాపాలన్నీ ఇట్టే చేత్తో తీసేసి అనుగ్రహిస్తాడు.
ఇటువంటి బిడ్డ, అటువంటి భర్త ఉన్న మీకు ఈ దిగులెందుకమ్మా!
అయినా ఈ గణపతి ఉత్సవాలు ఈ రోజు ఇలా శ్రుతిమించి వెర్రితలలు వేస్తున్నాయి కానీ ఇవి
లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశభక్తి తో ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ప్రారంభించిన వేదికలు.దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి దోహదం చేసిన ఉత్సవాలు.ఇందుకు మీరు చాలా గర్వపడాలి.
ఒక్కోసారి బుజ్జి బొజ్జ తో రకరకాల వేషాలలో స్వామి వారు ఎంత ముద్దొస్తుంటారో చెప్పలేను.
*పార్వతీదేవి:*
నిజమేననుకో.ఒక్కోసారి బుజ్జిబొజ్జతో ,ఆ వేషాలలో నాకు కూడా ముద్దుగానే అనిపిస్తుంటాడు.అదిగో అలా ముద్దుగా ఉన్న నా బిడ్డడికి చంద్రుడి దిష్టి తగిలి ఎంత ఆపద వచ్చిందో నీకు తెలుసు కదా అనింద్యా!
ఒక్కడి దిష్టి కే అలా జరిగితే,ఇంతమంది దృష్టిలో పడే నా చిట్టితండ్రికి ఇంకెంత దిష్టి తగులుతుందో అనే నా ఆందోళన.
అసలే నా బిడ్డ అమాయకుడు.పైగా అన్నీ ఆ తండ్రి బోళాశంకరుడి గుణాలనే పుణికి పుచ్చుకున్నాడు.
*అనింద్యుడు:*
మీరు భలేవారమ్మా!దిష్టిపెట్టిన చంద్రుడు మీ శాపవాక్కుకు గురయ్యాడని అందరికీ తెలుసు కదమ్మా!అలాంటి సాహసం ఇక ఎవరు చేస్తారు?
అందరూ భక్తితో పూజించి, శ్రద్ధగా కథవిని, భయంగా పూజాక్షతలు శిరస్సున ధరించి జాగ్రత్తగా మసలుకుంటారు.
పైగా ఈ మధ్య పర్యావరణం పట్ల కూడా నలుసంత అవగాహన పెరిగింది మానవుల్లో.అందుకే చాలాచోట్ల మట్టి వినాయకుడినే ప్రతిష్టించి పూజిస్తున్నారు.ఇకస్వామి వారికి వాడే పత్రిగురించి మీకు తెలియనిదేముంది?
స్వామి వారికి వాడే ఆ ఏకవింశతి పత్రాలూ ఔషధకారకాలే కదా!నిమజ్జనం పేరుతో వాటిని నీటిలో కలపడం వల్ల
ఈ వర్షాకాలంలో
పారే నీటిని పరిశుభ్రం చేయడానికి పనికొస్తుంది కదమ్మా!
కనుక మీరు నిశ్చింతగా మీ అబ్బాయిని భూలోకానికి పంపండి.నవరాత్రులు పూజలందుకొని,అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య శుభాలను అనుగ్రహించి, ఆశీస్సులు అందించి క్షేమంగా తిరిగి వచ్చేస్తారు.అలా తీసుకొచ్చే పూచీ నాది.
సరేనా!
*పార్వతీదేవి:*
సరే అనింద్యా! వెళ్ళిరండి.
భూలోకంలో అంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు,వరదలు ముంచెత్తుతున్నాయి.
అందులోనూ నేను కొలువైన ఇంద్రకీలాద్రి ఉన్న విజయవాడ కే కనీవినీ ఎరుగని ముప్పు వాటిల్లింది.ఈ విపత్తులు,విలయాలు కూడా ప్రకృతి లో భాగమే కదా!
*అవశ్య మనుభోక్తవ్యమ్ కృతం కర్మ శుభాశుభమ్* అని మా అన్నయ్య కృష్ణయ్య గీతలో చెప్పాడు కదా!
ప్రజలు త్వరలోనే ఈ కష్టం నుంచి తేరుకుని,సుందరమైన అమరావతిని నిర్మించుకుని స్వర్గ సౌఖ్యాలు పొందుతారులే అనింద్యా!
భూలోక జనులకు అలాంటి శుభాలు కలగాలని నా ఆశీస్సులు కూడా అందించానని చెప్పండి.త్వరలో శారద
నవరాత్రులలో నవ దుర్గలుగా వచ్చి నేను కూడా వారిని అనుగ్రహిస్తాను.అన్నట్టు మా అన్నయ్య కూడా ఆశ్వయుజ మాసంలోనే తిరుమలలో బ్రహ్మోత్సవాలతో భక్తులకు కనువిందు చేసి కనికరిస్తాడు.సరేలే ఇక.
అబ్బాయి ఈ లోపు చాలా దూరం వెళ్ళిపోయాడో !ఏమిటో!ఇక పరుగెత్తు.
ఇంకో విషయం
మా గణపతి, నువ్వు ఇల్లిల్లూ, వీధి వీధి తిరుగుతారు కదా!
ఇది రకరకాల అంటువ్యాధులు ప్రబలే సమయం.
కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా!
*అనింద్యుడు:*
అయ్యో!లోకమాతా!
మీరింతగా చెప్పాలా!మేము జాగ్రత్తగానే ఉంటాము.అయినా ఆయనే విఘ్నేశ్వరుడు కదా! తనకూ నాకే కాదు, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటాడులేమ్మా! కన్నతల్లి మమకారంతో మాట్లాడుతున్నారు గానీ మీకు తెలియనివి ఏముంటాయమ్మా!
మీరు దిగులు పడకండి.నిశ్చింతగా ఉండండి.
పార్వతీ దేవి
సరే అనింద్యా!వేడుకలు,నిమజ్జనం అన్నీ పూర్తి చేసుకుని పదవ నాటికి తిరిగి వచ్చేయాలి సరేనా!నేను ఎదురు చూస్తుంటాను.ఇక త్వరగా కదులు.
సంతోషంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి.
భూలోక వాసువందరికీ నా శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేయండి.
లోకాస్సమస్తాః సుఖినోభవంతు.
*శుభం భూయాత్.*
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో
*సింహాద్రి జ్యోతిర్మయి*
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
35.మన (వరాల) తెలుగు
ఏ విషయమైనా కొంచెం శ్రద్ధ పెడితే చాలా తేలికగా,నేర్చుకుని గుర్తుపెట్టుకోవచ్చు.
మరి నా విద్యార్థులకు నేను రామాయణం లోని కాండలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇలా చెప్పాను.
శ్రీమహావిష్ణువు బాలరాముడై పుట్టిన కాండ
1.బాలకాండ
బాలరాముడు ఎక్కడ పుట్టాడు?.. అయోధ్యలో
కనుక
2.అయోధ్యకాండ
అయోధ్య నుండి రాముడు ఎక్కడికి వెళ్ళాడు?
అరణ్యానికి
కనుక
3.అరణ్యకాండ
అరణ్యంలో రామునికి ఎవరితో స్నేహం కలిసింది?
కోతులతో.
కోతుల రాజ్యం ఏది?
కిష్కింధ
కనుక
4.కిష్కింధకాండ
వానరవీరుడు,శ్రీరామబంటు అయిన హనుమ సీతను ఎక్కడ చూశాడు?
సుందరమైన అశోకవనంలో
కనుక
5.సుందర కాండ
సీత జాడ తెలిశాక రాముడు ఏం చేశాడు?
లంకేశునితో యుద్ధం చేశాడు
కనుక
6.యుద్ధ కాండ
యుద్ధం తరువాత రామ పట్టాభిషేకం తరువాత జరిగిన కథ ఏమిటి?
తరువాత అంటే ఉత్తర అని అర్థం
కనుక
ఉత్తర కాండ
ఇవీ రామాయణ కాండలు.
ఎలా ఉంది?
మీకు నచ్చిందా!
అయితే మీ పిల్లలకో,మనవలకో నేర్పండి మరి.
సింహాద్రి జ్యోతిర్మయి
13.3.2022
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
36.ఎందుకంటే...ప్రేమంట
ప్రేమించుకోవడం అంటే మంచి నిద్దురలో కనే అందమైన కలలాంటిది
పెళ్ళి చేసుకోవడం అంటే నచ్చిన కారును ముచ్చటపడి కొనుక్కోవడం లాంటిది.
కానీ అందులో ప్రయాణం అంటే మాత్రం
కేవలం ఆ ఇద్దరే
ముందు సీట్లో కూర్చుని హైవే మీద
మేఘాలలో తేలి పొమ్మన్నది
తూఫానులా రేగి పొమ్మన్నది చిలిపి మది అని హుషారుగా పాడుకుంటూ
రయ్ రయ్ మని దూసుకు వెళ్ళిపోవడం కాదు.
కొన్నిసార్లు
వెనకసీట్లో బంధువుల్నో,స్నేహితుల్నో ఎక్కించుకుని సర్దుకోవల్సివస్తుంది.
ఇంకొన్ని సార్లు పరిచయస్తులకు లిఫ్ట్ ఇవ్వవలసి వస్తుంది.
అపార్థాలనే గతుకులు అప్పుడప్పుడూ చిరాకుపెడతాయి.
కొన్నిసార్లు ఆవేశమనే వేగానికి
విచక్షణ అనే స్పీడ్ బ్రేకర్ వేసుకుంటూ వేగం తగ్గించుకోవాల్సి ఉంటుంది.
కొన్నిచోట్ల ఇచ్చిపుచ్చుకోవడాలు,పెట్టుపోతలనే టోల్ గేట్లు వస్తుంటాయి.
ఒక్కోసారి
ఆపదలో పడ్డప్పుడు ఆ టోల్ గేట్లే నిన్ను ఆదుకోగలవు కూడా. కనుక అక్కడ చెల్లింపులు తప్పనిసరి.
ఇన్ని రకాలుగా జాగ్రత్తపడుతున్నా కొన్నిసార్లు డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వల్లనో, పక్కనే కూర్చున్న జీవిత భాగస్వామి నీ ఏకాగ్రత ను దెబ్బతీయటం వల్లనో,మీరు సరిగ్గానే పోతున్నా,ఎదుటి వ్యక్తుల నిర్లక్ష్యం వల్లకూడా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం పొంచిఉంటుంది సుమా! అప్పుడు పెద్దరికం అనే బెలూన్స్ ఓపెన్ అయి జీవితాన్ని కాపాడతాయి.కనుక పెద్దల ఆత్మీయత, ఆశీస్సులు అనే సీట్ బెల్ట్ ధరించడం ఎప్పుడూ విస్మరించ వద్దు.
ఇన్ని రకాలుగా జాగ్రత్తపడుతూ, ప్రేమ పెట్రోల్ చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు నింపుకుంటూ, ఆనందంగా గమ్యం చేరుకోవాలని,
ఆ దారిలో ముందే ప్రయాణం చేసి వచ్చిన ఒక అనుభవజ్ఞురాలైన ప్రయాణీకురాలిగా
నిన్న మొన్న పెళ్ళయి హైవేపై స్పీడ్ గా వెళుతున్న నా కూతురు,అల్లుడు, కొడుకు,కోడలు జంటలకు, కొత్తగా పెళ్ళి అనే కారు ఎక్కబోతున్న నా పెద్ద మేనల్లుడు,దివ్యలకు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.
ఇంత వివరంగా ,ఇంత సుదీర్ఘంగా చెప్పడం
*ఎందుకంటే....(నాకు మీరంటే). ...ప్రేమంట*😍😍😍
* కొత్త బంగారులోకం
మీకు కావాలి సొంతం* అని మనసారా దీవిస్తూ
చిన్నోడూ, శ్రావణీ!
మీకిద్దరికీ ద్వితీయ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.12.2021
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
37.నా ముగ్గు ముచ్చట్లు
ఓపిక లేకపోయినా
అందరి వాకిళ్ళు
కళకళ లాడుతుంటే
మనవాకిలి బోసిపోతుందే అని
ఓపిక తెచ్చుకుని
వేసిన ముగ్గు.
చిన్నతనంలో
మేము పేరేచర్ల లో ఉన్నప్పుడు
మా ఇంటి పక్కన ఉండే
సర్వేశ్వరరావు తాతగారి వాకిట్లోనూ,
మా వాకిట్లోనూ కూడా
నేనే ముగ్గు వేసేదాన్ని.
ఆయన
జ్యోతీ!మనింటిముందు మంచి ముగ్గు వెయ్యి.
నీకు మంచి మొగుడు వస్తాడు అనేవారు.
ఆయన దీవెన ఫలించినందుకు
ఆయనను గుర్తు చేసుకుంటూ
మోకాళ్ళు నొప్పులుగా ఉన్నా
కనీసం
ఇలా జనవరి ఒకటో తేదీ, సంక్రాంతి మూడు రోజులు తప్పకుండా ముగ్గు వేస్తుంటాను.
పొగడటం పెద్దగా అలవాటు లేని మా ఆయన నా ముగ్గు ని మాత్రం చాలా మెచ్చుకుంటారు.ఫోటో కూడా తీసుకుంటారండోయ్.
నా ఫోనులో 2017 నుండి వరుసగా ఉన్న ముగ్గులు ఈ రోజు ఫేస్ బుక్ జ్ఞాపకం చేసింది.
మరి ఈ సంవత్సరం ముగ్గు ఇదిగో!
ఇక,ఒక నాలుగు రోజులపాటు కాళ్ళు,నడుము పట్టుకుపోయే ఇష్టమైన నా కష్టం ఎలా ఉందో చెప్పాలి మరి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
31.12.2021.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
38. ఇంత మాత్రమైనా చేయలేమా!
ఈ రోజు సాయంత్రం ఏదో పనిమీద గుంటూరు వెళ్ళాము.
ప్రస్తుతం
వచ్చే దారిలో ఉన్నాము.గుంటూరు పక్కనే ఉన్న పేరేచర్ల నుండి మేదరమెట్ల వచ్చేలోపు అదేమిటో ఈ రోజే నాలుగు అంబులెన్స్ లు ఎదురుపడ్డాయి.రెండు 108 లు, రెండు వేరే హాస్పిటల్స్ కి చెందినవి.
అప్పుడప్పుడూ ఇది మామూలే కదా! కానీ ఒకే రోజు రెండు గంటల ప్రయాణం లో నే నాలుగు కనపడటం తో అయ్యో! ఎవరికి ఏమైందో అనే చిన్నపాటి ఆదుర్దా.అంతకంటే
బాధాకరమైన విషయం ఏమిటంటే ఏ ఒక్కచోటైనా ఏ ఒక్కరైనా గానీ కాస్త వేగం తగ్గించుకోవడమో,పక్కకు కట్ చేసుకుని అంబులెన్స్ కి దారిఇవ్వటమో చెయ్యనే లేదు. లారీలు,కార్లు,టూవీలర్స్ ఏవీ కూడా.
సైరన్ మోగించుకుంటూ వస్తున్న వాహనంలో ఉన్న రోగులకు క్షణక్షణమూ విలువైనది కదా!ఆ నిమిషం ఆలస్యమైతే,ఆ వ్యక్తి గుండె ఆగిపోతే ఆ కుటుంబం పరిస్థితి తలక్రిందులు అయిపోతుంది కదా!
ఒక్క నిమిషం మనం ఆగి ఆ వాహనానికి దారి ఇస్తే ఆపదలో, అత్యవసరంలో ఉన్న ఒక ప్రాణాన్ని రక్షించినట్లే కదా అనే ఆలోచన ఎందుకు రాదు?
ఆ నిమిషంలోపే ఆ వాహనానికి అడ్డం వెళిపోయి, దాన్ని కూడా ఓవర్ టేక్ చేసేసి,హారన్ మోగించుకుంటూ మధ్యలో జొరబడి పోయి ఏం సాధిస్తారు?
కనీసం మానవత్వం ఉండద్దా!అది మన సామాజిక బాధ్యత కాదా!
సాటి మనిషి ప్రాణానికి, జీవితానికి విలువలేదా!
మన పనులు అంతకంటే ముఖ్యమైనవా!
ఆ నిమిషం ఆగితేనే మన పనులు, ప్రపంచం తలక్రిందులు అయిపోతాయా!
తలుచుకుంటే చాలా ఆవేశం,ఆవేదన,ఆందోళన కలుగుతున్నాయి.
మిత్రులారా!
ఈ విషయంలో సమాజం లో సరియైన అవగాహన కలిగించే ప్రయత్నం అందరూ చేయాలి.
అందరిలోనూ ఆ చైతన్యం రావాలి.
నేను సైతం
సాటి మనిషికి
తోచినంత సేవచేయాలి అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి.
అప్పుడే మనం మానవులం అని చెప్పుకోవడానికి అర్హత సంపాదించుకుంటాం.
ఇంతకూ మరి మేం ఏం చేశాము అని అనుకుంటున్నారా!
రోడ్డుకు ఒక పక్కకు వచ్చి దారి ఇచ్చాము.
అలా చేయకపోయి ఉంటే ఈ నాలుగు మాటలు చెప్పే అర్హత నేను పోగొట్టుకొని ఉండేదాన్ని.
ఇంత మాత్రం చేయటం మన గొప్ప కాదు.మన కనీసపు బాధ్యత, ధర్మం కదా!
మరి అందరూ ఆలోచిస్తారు కదూ!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.9.2020.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
నేడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి
153 వ జయంతి సందర్భంగా నా స్పందన నాలుగు ముక్కలు
39. నివురు గప్పిన నిప్పు
చిలకమర్తి వారి గణపతి
అందరూ చిలకమర్తి వారి *గణపతి* ని గొప్ప హాస్య నవలగా భావిస్తారు. ప్రహసనాలలో ఆయన అందె వేసిన చెయ్యి కావచ్చు.గణపతి నవల పైకి హాస్య రసాన్ని ఒలికించనూవచ్చు.కానీ ఈ నవల ఆనాటి సమాజంలోని దురన్యాయాలకు, దుర్భర పరిస్థితులకు,
దురభ్యాసాలకు, స్త్రీలపై జరుగుతున్న అనేకరకాల హింసకు దర్పణంగా నిలబడుతుంది.
పాపయ్య అరవై ఏళ్ల వయసులో పన్నెండేళ్ళ పిల్లను, గంగాధరం నలభయ్యవ పడిలో రెండేళ్ల పిల్లను వివాహం చేసుకున్న వైనం, ఆ ఆడపిల్లల తండ్రులు కన్యాశుల్కానికి ఆశపడి కూతుళ్ళను అమ్ముకున్న విధానం,బాల్యవివాహాల ఫలితంగా వారు బాల వితంతువులుగా మారటం, అన్నంభొట్ల అన్నప్ప డబ్బు ఆశతో విధవరాలైన కూతురి ఆస్తిని కాజేసి ,చంటి బిడ్డ తో ఆ పిల్లను నిరాధారంగా, నిర్దయగా వదిలి వెళ్లి పోవటం,
సుఖసంతోషాలకు నోచుకోక ఒంటరి జీవితాన్ని గడిపే
బాల వితంతువులు నల్లమందు లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం ,
తల్లిని కూడా పిల్లలు ముండా మొదలైన పదజాలంతో అసభ్యంగా దూషించటం,
వేశ్యా వృత్తి యధేచ్ఛగా సాగటం,
విద్యా శూన్యత చేత చిన్నతనంలోనే పిల్లలు
అనేక దురభ్యాసాలకు అలవాటు పడటం,
వర్ణ వ్యవస్థ లో కనపడే ఆధిపత్య ధోరణులు,
ఉపాధ్యాయ వృత్తి లో లోపాలు, శిష్యులకు విధించే శిక్షలు ,
ఒకటనేమిటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటి సమాజంలో
చాపకింద నీరులా చేరి
పాతుకుపోయిన అనేకానేక దురాచారాలపై సంధించిన వ్యంగ్యాస్త్రం గణపతి నవల.
ఒకచోట విధవరాలిని గురించి చెప్తూ *అది తలవెంట్రుకల వెధవ*
అంటారు.మరో చోట బుర్ర గొరిగించుకోవడానికి కూడా డబ్బులేని ముండవు అంటూ సోదరిని దూషిస్తాడు ఒక అన్న.
అంటే పసితనం లోనే విధవారాలైన బాలికను శిరో ముండనం చేసి, తెల్లచీర,చప్పిడి కూడుతో వంటగదిగే పరిమితం చేస్తారు.అప్పటినుండీ ఇక ఆ తలపై జుట్టు మొలవనివ్వరు. ఆ బాల్యం నుండి నిండు నూరేళ్ళు ఆ స్త్రీ జీవితం ఏ సంతోషానికి,సరదాలకు,రుచులకు నోచుకోక అలా మగ్గిపోవలసిందే.ఎంతటి దయనీయమైన స్థితి.ఆ కాలంతో పోల్చుకుంటే నూరేళ్ళ లో స్త్రీలు ఎంతోకొంత ఎదిగారనే అనిపిస్తోంది కదూ!
ఈ నవలను గత మూడేళ్ళ నుండి ICSE విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టడం 150 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన జయంతికి సరియైన,ఘనమైన నివాళిగా నేను భావిస్తున్నాను.
ఈ సందర్భంగా చిలకమర్తి అనగానే మనకు గుర్తుకు వచ్చేది
వారి పౌరాణిక నాటకం
గయోపాఖ్యానం.
వారి ప్రసిద్ధ పద్యం
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.
ఇది ఆనాటి భారతీయుల దుస్థితి ని కళ్ళకు కడుతుంది.
తెలుగువారి ఘనకీర్తి
చిలకమర్తి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.9.2021.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
40.ఈ పయనం ఎటువైపు?
సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రశ్నించే హక్కు ఒక సామాన్యురాలినైన నాకు లేదేమో!
కానీ ఒక ఇల్లాలిగా,పిల్లలకు నైతికత నేర్పవలసిన తల్లిగా,భావి పౌరుల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యతగల ఒక ఉపాధ్యాయురాలిగా,నా మెదడు నిండా ఎన్నో ప్రశ్నలు.
ఆస్తి కోసం అతడిని పెళ్ళాడాను.నాకు నచ్చిన వాడితో నేనువివాహేతర సంబంధం పెట్టుకుంటాను అని ఒక భార్య భర్తతో అన్నప్పుడు,ఇదే మాట భర్త భార్యతో అన్నప్పుడు, ఇద్దరూ పంతాలకు పోయి
ఎవరికి నచ్చినట్లు వారు విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు వివాహబంధానికి,కట్టుబాట్లకు అర్థమేమిటి?
ఈయన మా నాన్న. ఆయన మా అమ్మ బోయ్ ఫ్రెండ్
ఆవిడ మా అమ్మ.ఆవిడ మా నాన్న లవర్ అని బిడ్డలు తమ తల్లిదండ్రుల గురించి పరిచయం చేయాల్సివచ్చినప్పుడు ఆ బిడ్డల మానసిక స్థితి,వారి ప్రవర్తనపై ఆ పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
వేధించి రాచి రంపాన పెట్టే భర్తతో సర్దుకుపోయే అగత్యం నేడు పెద్దగా లేదు.విడాకులు తీసుకుని,స్వతంత్రంగా బ్రతకగలిగే స్థితికి స్త్రీ, సమాజం రెండూ ఈనాడు ఎదిగాయి.
మరి ఈ తీర్పువల్ల స్త్రీ కి ప్రత్యేకంగా కలిగే ప్రయోజనం ఏమిటో నా మట్టిబుర్రకు అర్థం కావటం లేదు.
భర్తకు ఆస్తి గా పరిగణించడం అంటే ఆమె హక్కుని కాలరాయడం అవుతుంది. నిజమే.అంతవరకు బాగానే ఉంది.వివాహేతర సంబంధాలవల్ల ఆ భావం మారిపోతుందా!
స్త్రీతో శారీరక సంబంధం ఏర్పరచుకున్న ఏ మగవాడైనా ఆమెను తన ఆస్తిగానే,హక్కుగానే భావిస్తాడు.స్త్రీ కూడా ఇందుకు ఎంతమాత్రమూ మినహాయింపుకాదు.అందుకేగా ప్రేమ విషయంలోనైనా , వివాహేతర సంబంధాల విషయంలోనైనా దాడులు హత్యలు జరుగుతున్నాయి?
మరి దీనివల్ల ఒనగూడుతున్న ప్రయోజనమేమిటి?
అంతంతమాత్రంగా ఉన్న వివాహబంధాలు,
అంతరించిపోతున్న నైతిక విలువలు
మరింతగా దిగజారడం తప్ప దీనివల్ల స్త్రీల పరిస్థితి మెరుగుపడుతుందని,ఆమె నెత్తిన కిరీటాలు పెడతారని నేను అనుకోలేను.
ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
ఈ సందర్భంగా నాకు ఇద్దరు కవుల మాటలు గుర్తుకు వస్తున్నాయి
*ఏ వెలుగుల కీ ప్రస్థానం?*
*ఎక్కడికెళ్తోంది?దేశం ఏమైపోతోంది?
హిమశైల శిఖరం పైకా!
పాతాళకుహరం లోకా!*
దేశమా!ఉలికిపడు.
ఈ సందర్భంగా ఇక్కడే నేను భారతం లోని మరొక విషయాన్ని కూడా ఉదాహరిస్తున్నాను.
భారతంలో పాండురాజు తన భార్యయైన కుంతిని సత్పురుషులను ఆశ్రయించి సంతానభాగ్యం పొందమని అర్థించిన విషయమూ గమనించవచ్చు.
పంచమ వేదమైన భారతం చెప్పిన అంశం కూడా నేటి తీర్పుకు అనుగుణమైనదిగానే భావించవచ్చునేమో!
భారతంలో లేనిది ప్రపంచం లో ఎక్కడా ఉండదని స్వయంగా వ్యాసుడే చెప్పాడు.
కనుక ఇందులోని పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించి,
కోర్టు తీర్పును సవ్యంగా అర్థం చేసుకుని స్త్రీ ల హక్కులను కాపాడేదిశగా అడుగులు వేద్దాం.
స్వేచ్ఛ.....మన హక్కు
నైతిక విలువలు...... మన బాధ్యత
వాక్ స్వాతంత్ర్యం...... మన హక్కు
న్యాయస్థానాలను గౌరవించడం....మన బాధ్యత
సింహాద్రి జ్యోతిర్మయి
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
41. మౌనమే నా భాష.
నాకు చిన్నతనం నుండి తెలుగు పద్యం అంటే ఇష్టం.ఆ ఇష్టం కలిగించిన వారు మా తెలుగు మాస్టారు .ఆ ఆసక్తి తోనే బి.ఏ.లోనూ,ఎమ్.ఏ.లోనూ కూడా స్పెషల్ తెలుగు చదివాను.
దానివల్ల తెలుగు లెక్చరర్ గా, తెలుగు టీచర్ గా పనిచేశాను.చేస్తున్నాను.జన్యుపరమైన సాహితీ గంధం కొంత అంటుకున్నందువల్ల కవిత్వం కాస్త రాయగలుగుతున్నాను.రాసినది నలుగురికి నచ్చి చదవటం వల్ల సాహితీ సభలు, సమావేశాలు, సన్మానాలు, సత్కారాలు అందుకుంటున్నాను.
ఈ మూడు నాలుగు రోజుల నుంచి నాలో జరిగిన అంతర్మధనం లో తెలుగు భాష నుండి నేను ప్రయోజనం పొందానే తప్ప మాతృభాష కు నేను చేసిందంటూ ఏమీ లేదన్న చేదు నిజాన్ని గుర్తించగలిగాను.
మా పిల్లలిద్దరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనే చదివారు.
చిన్న తనంలో మా తమ్ముడి కైతే పద్యాలు నేర్పాను గానీ , నా (కన్న) పిల్లలకు మాతృభాష పై మమకారం పెంచే ప్రయత్నాలేవీ చేసిన గుర్తు నాకు లేదు.
మా పిల్లలు వాళ్ళ నాన్న ను డాడీ అనే అంటారు.
మా పాప నన్ను అమ్మా, మా, మమీ అని దాని మూడ్ ని బట్టి మూడు భాషల్లోను పిలుస్తుంటుంది.కానీ చాలా వరకు అమ్మ అనే అంటుంటుంది.
మా బాబు మాత్రం నన్ను మమ్మీ అనే అంటాడు.వాడు మా అమ్మ ని అమ్మా అని పిలిచేవాడు.దాంతో నన్ను మమ్మీ అనడం అలవాటయింది.భాష నాకు గుర్తింపు నిస్తోంది అనే కృతజ్ఞతా భావం తలెత్తాక , మమ్మీ అని పిలిపించుకోవడం పట్ల అపరాధ భావం మొదలై అమ్మా అని అనమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అలవాటు కాలేదు.ఏ భాషలో పిలిచినా ఫీలింగ్ ఒకటే కదా అన్నది వాడి వాదన.
ప్రస్తుతం నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను.పిల్లలను తెలుగు క్లాస్ లో తప్ప తక్కిన వేళల్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడమని సజెస్ట్ చేసే ఇంగ్లీష్ మీడియం తెలుగు టీచర్ని.
మరి నా భాషాభిమానాన్ని చాటుకునే తీవ్ర ప్రయత్నాలు (ప్రస్తుతం నా విద్యార్థులకు మాతృభాష పట్ల ఆసక్తిని కలిగించే ఏవో చిరు ప్రయత్నాలు తప్ప)ఏవీ చేయకుండానే భాషకు ద్రోహం జరుగుతోంది అని ఎలుగెత్తి చాటడానికి అంతరాత్మ
అడ్డు పడుతోంది.
కానీ భాషతోనే ప్రయోజనం, పేరు సంపాదించుకున్న కవయిత్రి గా, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న ర సం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఈ మాట అనకుండా ఉండలేను.
కనీసం ఐదవ తరగతి వరకైనా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు అన్నిట్లోనూ ఐచ్ఛికంగా తెలుగు మీడియం ఉంటే బాగుంటుందని.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.11.2019
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
42.ఎలా పెంచుతున్నాం పిల్లల్ని?
ప్రియాంక మరణం ఏదో తప్పు చేసిన భావాన్ని మనసులో కలిగిస్తోంది.
ఒక ఉన్నత విద్యావంతురాలైన యువతి,
ఉద్యోగస్తురాలు,
రానున్న అపాయాన్ని ముందే ఊహించి ,
రక్షించే దారిని చూపే అత్యంత శక్తివంతమైన ఆయుధం సెల్ఫోన్ విత్ వైఫై చేతిలో ఉండి,
తనను తాను కాపాడుకునేంత విలువైన ఐదారునిమిషాల సమయం ఉండి కూడా
కేవలం భయపడగలిగిందేగానీ, తనను తాను రక్షించుకోగలిగే ఆలోచన చేయలేకపోయింది అంటే
పిల్లల్ని మనం ఎంత పిరికిగా పెంచుతున్నాం?
పిల్లల్ని ఎంత సేపటికీ మన రెక్కలమాటున దాచుకుని రక్షణ నివ్వాలని చూస్తున్నామేగానీ, మానవ మృగాలు,వేటగాళ్ళు సంచరించే జనారణ్యంలో లేడికూనలా భయపడుతూ బ్రతకటమే నేర్పుతున్నారు గానీ,
కనీసం, స్వయంగా ఆలోచించటం, పరుగెత్తి పారిపోయే ప్రయత్నమైనా చేయలేక నిస్సహాయంగా, బెదురుకళ్ళతో నిలబడిపోయే దయనీయ పరిస్థితిని తలుచుకుంటేనే మన పెంపకం మీద, మన విద్యావిధానం మీద కోపంతో మనసు రగిలిపోతోంది.
అదే సమయంలో తమ ఇంటి మగపిల్లల పెంపకం పట్ల ఉన్న పురుషాధిక్య ధోరణి ఆందోళన కలిగిస్తోంది. ప్రతి తల్లీ తండ్రీ కూడా పిల్లల పెంపకం విషయం లో జాగ్రత్తలు తీసుకుని, విలువలు నేర్పటం, వింత పోకడలు గమనించి మందలించటం, ప్రవర్తన గమనించి కఠినంగా వ్యవహరించటం వంటి చర్యలు తీసుకోవాలి.
అరణ్యం లో లేడికూనలా ఆడపిల్లల్ని,
అభయారణ్యంలో సంచరించే పులుల్లాగ మగపిల్లల్ని పెంచుతున్న మన పద్ధతిని మార్చుకోవాలి.
వీధుల్లో షాపింగ్ మాల్స్ కి భారీ హోర్డింగులు పెట్టినట్టు అపాయంలో ఉపాయాలు అంటూ
షి టీమ్ నెంబర్లను , ఎమర్జెన్సీ నెంబర్లను గుర్తుండిపోయేలా అడ్వర్టైజ్ చేయటం ఏదో ఒకటి తక్షణ చర్యలుగా చేపట్టాలి.మీరు కూడా *మేము సైతం* అంటూ మీవంతు ప్రయత్నం మీరు చేయండి.
మీరు ఆడపిల్ల తల్లిదండ్రులయితే అమ్మాయిని ధైర్యవంతురాలిగా పెంచండి.
మగపిల్లడి తల్లిదండ్రులయితే
అబ్బాయిని సంస్కారవంతునిగా తీర్చిదిద్దండి.
ఉపాధ్యాయులైతే విద్యార్థుల చదువు,మార్కులు, ర్యాంకులే గాదు ప్రవర్తన పట్ల కూడా దృష్టి సారించండి.
మానవత్వం కలిగిన మనుషులైతే
మీ చుట్టుపక్కల ఇటువంటి అనుమానాస్పద వాతావరణం కనిపిస్తే నా కెందుకులే అనే నిర్లిప్తత వీడి ఆదుకునే ప్రయత్నం, తక్షణ సహాయం అందించే మార్గం చూడండి.
మన పిల్లల్ని మనం రక్షించుకోవడానికి మీకు తోచిన మంచి సలహాలుంటే ఇక్కడ పోస్ట్ చేయండి.
పిల్లలు గులాబీలు.
సమాజం వాళ్ళని
గుచ్చి బాధించే ముళ్ళు
కాకూడదు.
రక్షించే ముళ్ళు కావాలి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టీచర్@OPS
30.11.2019.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ వరల్డ్ ఎయిడ్స్ (ఎవేర్ నెస్) డే సందర్భంగా
43.నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.......
నా అనుభవం
నేను నర్సరావుపేటలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉద్యోగం చేసే రోజుల్లో కాలేజ్ లో నేను ఎన్.ఎస్.ఎస్.బాలికా విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ని కూడా.
అప్పట్లో కళాశాల విద్యార్థులలో కూడా హెచ్.ఐ.వి.పాజిటివ్ కేసులు వెలుగు చూసి ఆందోళనకు గురిచేస్తున్న కాలమది.పందొమ్మిది నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు వాళ్ళల్లో కూడా నలభై శాతం ఈ వైరస్ విస్తరిస్తోందని గుర్తించిన ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని కళాశాల విద్యార్థులను అప్రమత్తం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి,ఆ భారాన్ని లెక్చరర్ ల భుజాలపై ఉంచింది.
ముందుగా వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి వారిద్వారా విద్యార్థులను మేల్కొలపాలని నిర్ణయించింది.
అందుకోసం ప్రతి కాలేజ్ నుండి ఒక లేడీ మరియు జంట్ లెక్చరర్ ను పంపమని కళాశాలలను ఆదేశించింది.కానీ ఈ వ్యాధి పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే ఆ రోజుల్లో ఆ ట్రైనింగ్ కి వెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
అప్పుడు ఎన్.ఎస్.ఎస్.ఆఫీసర్లు గా మా సామాజిక బాధ్యతను గుర్తించిన నేను,నా తోటి లెక్చెరర్ శ్రీ గురుకిషన్ ఆ ట్రైనింగ్ కి వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాము.
ఆ ట్రైనింగ్ మాలోని ఎన్నో అపోహలను తొలగించింది.
మాకు చెప్పకుండానే హెచ్.ఐ.వి.పాజిటివ్స్ తో కరచాలనం,భోజనం వంటి పనులు చేయించి అది ఆ రకంగా వ్యాపించదనే వాస్తవాన్ని తెలియజెప్పారు.
నిజం చెప్పొద్దూ!డాక్టర్ లే భయపడి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిన ఆ రోజుల్లో ఆ భయం మమ్మల్ని కొద్ది సేపు వెంటాడింది.
కానీ క్లాసులు పూర్తిగా విన్న తరువాత ధైర్యం వచ్చింది.
*కాలేజ్ టాక్ ఎయిడ్స్ *
పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను దిద్దవలసిన మా బాధ్యత వైపు నడిపించింది.
యుక్త వయసులో పిల్లల్లో వచ్చే శారీరక ,మానసిక మార్పులపై అవగాహన, అపోహలు,వాస్తవాలు,పర్సనల్ హైజీన్,పిల్లలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు మరియు లెక్చరర్ల బాధ్యత ,పీర్ గ్రూప్ ప్రభావాలు వంటి అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.
కళాశాలకు తిరిగి వచ్చాక మా పట్టణంలోని కొన్ని కళాశాలలకు వెళ్ళి , విద్యార్థులకు కౌన్సిలింగ్ క్లాసులు తీసుకున్నాము.దీనికి కారణం ఏంటంటే తమ లెక్చరర్ లయితే విద్యార్థులు వినడానికి, సందేహాలు అడగడానికి ఇబ్బంది పడతారని భావించి ,ఒక కాలేజ్ లెక్చరర్లను మరొక కాలేజీకి పంపే ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత చాలా కాలం మమ్మల్ని ఎయిడ్స్ సార్,ఎయిడ్స్ మేడమ్ అని సరదాగా అనుకునేవాళ్ళు.
అలాగే డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీకి కూడాభారీగా బయల్దేరినా ఆ ర్యాలీ లోనడవడానికి కూడా మొహమాటపడి నాలుగడుగులు మాతో వేసినట్టే వేసి మాయమయ్యేవాళ్ళు.
చివరకు చాలాకొద్దిమంది విద్యార్థులు ,మేం ముగ్గురం ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్లం మిగిలేవాళ్ళం.
ఆ తర్వాత కాలేజ్ లో ఈ విషయం పై ఏర్పాటు చేసిన బాలికల గ్రీవెన్స్ వింగ్ ని కూడా నేనే నిర్వహించాను.
ఈ విధంగా
నేను సైతం...అంటూ శ్రీ శ్రీ స్ఫూర్తి తో ఒక లెక్చరర్ గా నా బాధ్యతను నేను మనస్ఫూర్తిగా నిర్వహించగలిగినందుకు
నిశ్శబ్దాన్ని ఛేదించండి
ఎయిడ్స్ గురించి మాట్లాడండి
అంటూ ప్రముఖ వైద్యులు
డాక్టర్ సమరం గారితో ఉపన్యాసాలు ఏర్పాటు చేయించటం వంటి కార్యక్రమాలలో నేను పాల్గొన్నందుకు ఇప్పటికీ గర్వంతో కూడిన సంతృప్తిని పొందుతుంటాను.
నాతో పాటు మా కాలేజ్ ఎన్.ఎస్.ఎస్. ఆఫీసర్లు శ్రీ J. ప్రభాకర్ , శ్రీ k.గురుకిషన్ ల గారిని కూడా ఈ సందర్భంగా ప్రశంసించటం నా విధి.
ఎందుకంటే గాంధీజయంతి కి మేము ప్రతీ సంవత్సరం ముగ్గురం కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవాళ్ళం.
బ్లడ్ రిపోర్ట్ లు పరిశీలించి నప్పుడు అక్కడక్కడా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చినప్పుడు మా బాధ వర్ణనాతీతం.ఆ పసివయసులో తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుతో జీవితాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసుకున్నారని జాలి కలిగేది. ఆ విషయం అత్యంత గోప్యంగా ఉంచి, వారిని రహస్యం గా పిలిపించి ,హెచ్చరించి, ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పేవాళ్ళం.
ఇదండీ కాలేజ్ టాక్ ఎయిడ్స్ తో నా జ్ఞాపకాలు.
ఈ సందర్భంగా అప్పటి నా కవిత
మన (సు) కర్తవ్యం
తప్పటడుగుల పసిప్రాయంలో
వేలుపట్టి
నడిపించినట్లే
తప్పుటడుగుల
యవ్వన దశలో
మంచి భవితకు
మార్గం చూపే
మనసెరిగిన స్నేహితుడు
కావాలి తండ్రి
ఒద్దికగా పైట
సర్దుకోవటం నేర్పినట్లే
తెలివిగా బ్రతుకు దిద్దుకోవటం నేర్పి
అమ్మాయి వెన్నంటి
అన్ని వేళలా మసలి
ఆది గురువు తానుగా
మారాలి తల్లి
మన ముంగిట
పెంచుకుంటున్న
మరుమల్లెతోట
మన యువత
మానవత్వంతో వారు
పరిమళించేలా
తోటమాలి తానై
తీర్చిదిద్దాలి గురువు
అమాయకపు పసితనం
అంటురోగాన్ని కావలించుకుంటోంది
చేసిన తప్పును
చెప్పుకోలేక
పశ్చాత్తాపంతో
పరితపించి
హీనంగా చూడబడుతూ
తల ఎత్తుకు తిరగలేక
మంచానికి అంటుకుపోయి
మరణానికి చేరువవుతోంది
తప్పొప్పులను తరచి చెప్పి
తరుణోపాయం చూపాల్సిన
తరుణం
ఆసన్నమయింది
మందులేని ఈ మహమ్మారికి
నివారణ మార్గమొక్కటే
అది నిశ్శబ్దాన్ని ఛేదించటమే.
నేడు మనం సిగ్గుపడితే
రేపు జాతి యావత్తూ
సిగ్గుతో తలదించుకోవలసిన
దుర్గతి దాపురిస్తుంది
అందుకే
మౌనాన్ని వీడుదాం
మాట్లాడుదాం
మాతృ దేవోభవ
పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ
అంటూ
అత్యున్నత గౌరవాన్ని
అందుకునే మనమంతా
మన యువతను
సుందర భవితకు
మళ్ళించుకుంటూ
చైతన్యవంతమైన
సమాజాన్ని సృష్టించుకుందాం
జాతి పరువు బరువు
మన భుజాలకెత్తుకుని
సాటి దేశాలముందు
సగర్వంగా నిలబెడదాం
జైహింద్
ఈ కవిత నేను కాలేజ్ టాక్ ఎయిడ్స్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు
ఒక పూట సభను నా ఆధ్వర్యంలో నడిపి, అక్కడ వినిపించి సన్మానం అందుకున్న కవిత.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
44.*అమ్మానాన్నలు నాకిచ్చిపోయిన ఆస్తి..నా తమ్ముళ్ళు*
పెత్తమ్ముడూ!
ఈ మధ్య కాలంలో
నీ ఫోన్ లేదు.జీవితంలో ఏదో లోటు.దాదాపుగా 30 ఏళ్ళ నుంచీ ప్రతిరోజూ మాట్లాడుకుంటూనే ఉన్నాం.నీతో మాట్లాడిన ఆ పావుగంటో,అరగంటో ఒక మంచి పుస్తకం చదివి,విలువైన విషయాలు తెలుసుకున్న భావన.అది చాగంటి ప్రవచనం గురించి కావచ్చు,బంధుత్వాల గురించి కావచ్చు,నా కష్టసుఖాల గురించి కావచ్చు.అవటానికి నీకంటే పెద్దదాన్నే అయినా ఎప్పుడూ నేను నీకు సలహాలను ఇచ్చింది, పరిష్కారాలను చెప్పింది గుర్తే లేదు.
నువ్వు చేస్తున్నది ఇది తప్పు అని నన్ను అనగలిగిన వాళ్ళూ లేరు.నువ్వు,కిరణ్ తప్ప.వాడైతే పాపం అక్క ఎక్కడ నొచ్చుకుంటుందో అని వీలైనంత మృదువుగా చెప్తాడు.పైగా వాడికి యాభై ఏళ్ళు రాబోతున్నా నాకంటికి ఇంకా చిన్నపిల్లాడిలానే కనపడతాడు.
కానీ నీ మాట అమ్మమాట లాగా కొట్టినట్టే.అయినా అందులో తొంభై తొమ్మిది శాతం మింగుడుపడని వాస్తవాలే ఉంటాయి.
ఇక ఇప్పుడు నువ్వు స్పిరిట్యువల్ టెర్రరిస్టు గా మారిపోయాక
ఎప్పుడు మాట్లాడినా,ఎంతసేపు మాట్లాడినా గురువుగారు తప్ప మరో టాపిక్ లేదు.నాకు లేని అదృష్టాన్ని, అవకాశాన్ని నీ తోడబుట్టినందుకు నాక్కూడా పంచుతూ,ఒకసారి కాకపోతే మరొకసారి , కాస్తోకూస్తో నన్ను నేను విమర్శ చేసుకుని, లోటుపాట్లు గమనించుకుని,సరిదిద్దుకునే ప్రయత్నం ఒక శాతమైనా(ఒక శాతం అనుకోవడానికీ సందేహమే.ఎందుకంటే నువ్వే ఇంకా నీలో ఒక శాతం మార్పుకూడా రాలేదంటుంటే ఇక నా మాట చెప్పేదేముంది?) చేసుకుంటూ ఉన్నా నీ ఫోన్ రాకపోతే లేదా నేను నీకు ఫోన్ చేయకపోతే ఏదో వెలితి.బంధువులు, స్నేహితులు ,చివరకు పిల్లలపై కూడా మోహాన్ని తగ్గించుకుంటూ
నువ్వు
ఎదిగే క్రమంలో నా అనుబంధం కూడా నీకు అడ్డంకే కావచ్చు.మోహంలోకి నెట్టేసే కర్మబంధాలే కావచ్చు.
కానీ మనసుకు అది జీర్ణం కావటంలేదు.బహుశా జీవితం ఆనందంగా గడుస్తుంటే ఇంత వెలితి ఫీలయ్యేదాన్ని కాదేమో!
కానీ ఏడాదికాలంగా ఎదుర్కొంటున్న ఆటుపోట్లు,ఆర్థిక ఇబ్బందులు మానసికంగా నీపై, ఆర్థికంగా కిరణ్ పై నేను ఆధారపడేలా,ఆ సపోర్ట్ లేకపోతే బ్రతకలేని అశక్తురాలిగా చేసేశాయి. ఈరోజు తోబుట్టువుల రోజట.ఏదో చెప్దామని మొదలుపెడితే ఇదిగో ఇంత అయ్యింది.
అయినా ఏదో అసంపూర్తి భావన.సరే ఇక ఉంటాను.నీకూ, కిరణ్ కి
ఇద్దరికీ తోబుట్టువుల రోజు శుభాశీస్సులతో
అక్క
10.4.2023
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
45. స్వాగతం చెబుదామా!
ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పాలా !వద్దా అనే అంశం మీద సోషల్ మీడియాలో అనేక అభిప్రాయాలు ,ముఖ్యంగా చేసుకోకూడదు అనే విషయం మీద రాతలు ,వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
నా అభిప్రాయంలో పండుగలు, వేడుకలు ఏవైనా తల్లిలాంటివి.మనం మన కన్నతల్లినే కాదు,ఎవరినైనా అమ్మా అని పిలిచి గౌరవించడం లో ఎలాంటి దోషం ఉండదు.అలాగే ఈ వేడుకలు కూడా.
ఇక వెర్రితలలు వేస్తున్న సంస్కృతి అంటారా!తాగి పడిపోమని,అల్లరి చేయమని అమ్మ చెప్పదు కదా!ఆ మాటకొస్తే వినాయక నిమజ్జనంలో జరుగుతున్నదేమిటి?శివరాత్రి రోజున జరుగుతున్న అసభ్య నృత్యాల మాటేమిటి?పవిత్రమైన పండుగలను భ్రష్టుపట్టిస్తున్నారు కదా!
కనుక అతి వదిలేసి,ఆచరిస్తే ఏ పండుగ అయినా ఆనందాన్ని పంచేదేకదా! సర్వ మతాలను,సర్వ ధర్మాలను గౌరవించే మన నేలమీద వివాదాలెందుకు?
ఈ ముఖ పుస్తక మిత్రులందరికీ నేను ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు నేను వేసిన ఈ ముగ్గు ద్వారా అందజేస్తున్నాను.
సీంహాద్రి జ్యోతిర్మయి
31.12.2017.
46.కల నిజమాయెగా
నేను
పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను (రెండు పళ్ళు పుచ్చిపోతే రూట్ కెనాల్ చేయించుకుని,కేప్స్ వేయించుకోవడానికి)
ఆ డాక్టర్ నాకు బాగా నచ్చాడు....
ఎందుకంటే...
ఆయన నన్ను నోరు తెరవమన్నాడు.
పళ్ళు కొరకమన్నాడు.
పళ్ళు నూరమన్నాడు.
ఇంట్లో ఎంత కోపం వచ్చినా మా ఆయన ముందు ఇవేవీ నేను చేయలేకపోతున్నాను.
కాబట్టి ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తో ఉన్నవారు ఆడైనా,మగైనా ఎవరైనా సరే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
మనసులోని అసహనం తొలగిపోయి రిలాక్స్ అయిపోతారు.
నేను అలాగే చేశాను.మీరూ అలాగే చేయండి.😜😜🤣🤣
సింహాద్రి జ్యోతిర్మయి
ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం
సందర్భంగా
జిల్లాతో నా అనుబంధం.
47.ఈ జిల్లా నాకేమిచ్చింది?
ఈ జిల్లాలో
నా మెట్టినూరు ఉంది
నేను టీచర్ గా
ఉద్యోగం
ప్రారంభించిన
ఒంగోలు ఉంది
ఎన్నో పురస్కారాలను
అందించింది
కవయిత్రిగా
మంచి గుర్తింపు నిచ్చింది
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా
పదవిని ఇచ్చింది
మనసెరిగిన మిత్రులను ఇచ్చింది
విశ్వశాంతి సేవా సమితి వారి
సహస్ర వసంతాల పద్య పురస్కారం,
ఎర్రన పుట్టిన గడ్డమీద
జానపద కళాపీఠం వారి
ప్రతిభామూర్తి పురస్కారం దక్కితే
కందుకూరులో
రుద్రకవి పురస్కారం
కృష్ణ దేవరాయ సాహిత్య సంస్థ వారి
ఉగాది పురస్కారం
కళామిత్రవారి
గిడుగు సాహితీ పురస్కారం
నన్ను ధన్యురాలిని చేస్తే,
ప్రభుత్వోద్యోగి అయిన
మా వారికి
జిల్లా స్థాయి
రాష్ట్ర స్థాయి
పురస్కారాల
గౌరవం దక్కించింది
మాకో సొంత గూడును ఏర్పరచుకునే
కాసింత భూమిని ఇచ్చి
ఈ జిల్లా లో
జీవించే భాగ్యం
కల్పించిన
ఈ నేలతల్లికి
వందనాలర్పిస్తున్నాను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.2.2019
48*నిన్నటికి, నేటికి ఎంత మార్పు?*
మొన్న నేను , మావారు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది మనవడి బారసాల కోసం.నిన్న తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ ఫ్లాట్ ఫాం లో రైలు కోసం ఎదురుచూస్తున్న నా మనసు 50 ఏళ్ళ నా ప్రయాణాలను ఒకసారి సింహావలోకనం చేసుకుంది.
నాకెప్పుడూ అనిపిస్తుంటుంది మా తరం చాలా ప్రత్యేకం అని.
నాకిప్పుడు 56 సంవత్సరాలు.
నేను అప్పటి పైసా, రెండు,మూడు,ఐదు,ఇరవై పైసలు ,పావలా,అర్ధరూపాయి చేతిలో ఉంటే ఆనందపడ్డ ఆ రోజుల్నీ చూశాను.(మావారైతే కాణీలు,అణాలు కూడా చూశారట.)
నేడు డబ్బులతో అవసరం లేకుండానే ఫోన్ పే, గూగుల్ పే లతో రూపాయి చేతిలో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిరాగలిగే అద్భుతాలనూ చూస్తున్నాను.
ఒకప్పుడు 5,6 గంటల రైలు ప్రయాణం చేస్తే ఆ బొగ్గు ఇంజను వదిలే పొగలకి కిటికీ కి అతుక్కుపోయిన మా పిల్లల ముఖాలు,పెద్దల ముఖాలు కూడా మసిబారినట్టే జిడ్డుకారుకుంటూ ఉండేవి.ఇప్పుడన్నీ ఎలక్ట్రిక్ ఇంజనులేగా!ఆ బాధ లేదు.
అలాగే
రైలు,బస్సు, సినిమా టికెట్టు కొనుక్కోవడం కోసమో, అడ్వాన్స్ బుకింగ్ కోసమో క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పనిలేదు.
అన్నీ ఫోన్ లోనే.
బస్సో,రైలో ఎక్కడిదాకా వచ్చింది?ఎప్పటికి వస్తుంది?అని ఎవరినీ అడగాల్సిన పనిలేదు.ట్రాక్ చూసుకోవచ్చు.రైల్వే స్టేషన్ లో లగేజీ మోయలేక మోస్తూ ఆపసోపాలు పడవలసిన పనిలేదు.లిఫ్ట్,ఎస్కులేటర్లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లాట్ ఫాం మీద మన రిజర్వ్ బోగీ ఎక్కడకు వస్తుందో అని టెన్షన్ తో అటూఇటూ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.ఏ బోగీ నెంబర్ ఎక్కడ ఆగుతుందో డిస్ ప్లే బోర్డులు చూసి తెలుసుకుని, అక్కడ నించుని రైలు రాగానే దర్జాగా, చటుక్కున ఎక్కేయవచ్చు.
అసలు మనకు కాస్త సామాజిక శుభ్రత, సామాజిక బాధ్యత ఉంటే మన రైలు,బస్ స్టేషన్లు మరింత అందంగా,ఆహ్లాదజనకంగా, పరిశుభ్రంగా ఉండేవి.కానీ మనకి మన ఇల్లు,మన ఇంట్లో టాయిలెట్ లు శుభ్రంగా ఉంటే చాలు.పదిమందీ వాడేవి ఎలా ఉంటే మనకేం అనే బాధ్యతారాహిత్యం.సరే,ఆ సంగతి వదిలేద్దాం.
ప్రస్తుతానికి వస్తే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ లు మన జీవనగమనాన్నే మార్చేశాయి.
అసలు ఎటియం కార్డులు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో నాకు అదొక అద్భుతమే అనిపించేది.షాపింగ్ చేసి, డబ్బులు చేతికి ఇవ్వకుండా అలా కార్డ్ స్వైప్ చేయడం అదో వింత.చాలా సరదాగా ఉండేది.
బ్యాంకు కి వెళ్ళక ఎంతకాలం అయిందో!
కరెంట్ బిల్లులు,రకరకాల ఆర్థిక లావాదేవీలు అన్నీ ఫోన్ ద్వారానే సులువుగా చేసేసుకుంటుంటే బ్యాంకు కో, కరెంట్ ఆఫీసుకో వెళ్ళే పనేముంది?.అసలు మా పెద్ద తమ్ముడిని చూస్తే స్మార్ట్ ఫోన్ తో ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయా!అని నేను ముచ్చటపడిపోయి నోరెళ్ళబెట్టేస్తుంటాను స్మార్ట్ ఫోన్ వాడకం లో వాడి స్మార్ట్ నెస్ ని చూసి.
ఇదంతా మధ్యతరగతి వారి సౌకర్యాలు మాత్రమే సుమండీ.అబ్బో!ఇక డబ్బున్న వాళ్ళ లగ్జరీస్ చెప్పేదేముంది? వాటి సంగతి మనకెందుకు లెండి? వాళ్ళు చూసుకుంటారు.వాళ్ళే రాసుకుంటారు.
ఏదేమైనా నిన్నటి ఒక ప్రయాణం నన్ను ఆనందానికి,ఆశ్చర్యానికి గురిచేసి నా మనసుపొందిన ఆ అనుభూతి కి అక్షరరూపం ఇచ్చేలా చేసింది.మరి
మన జీవితాన్ని ఇంత సరళతరం,సుఖవంతం చేసిన ఈ సౌకర్యాలను అందిస్తున్న ప్రతివారికీ
అభినందనలు,అభివందనలు, ధన్యవాదాలు అర్పిద్దామా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.2.2023
49.*ఈ(ఒకే ఒక్క) రోజు మీదే*😍😍
ఎప్పుడూ విమర్శించినా,తిట్టినా,దుయ్యబట్టినా కనీసం ఈ పురుషుల దినోత్సం నాడైనా మిమ్మల్ని తిట్టకుండా ఉండలేమా!ఏమిటి?
మాకు ఆ మాత్రం మనసు లేదనుకోకండి.తిట్లన్నీ రేపటికి వాయిదా వేసుకోమని మా నారీలోకానికి విజ్ఞప్తి.
అలాగే మగవారు కూడా ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ,కాస్త చెప్పినమాట విని,రుచిగా వండిపెట్టి,కాస్త పొగిడి,బహుమతులిచ్చి భార్యల మనసు గెలిచి మంచి భర్తలనిపించుకోమని సలహా ఇస్తూ..పురుషులందరికీ
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.🤣🤣🤣
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.11.2021
50.*ఇది ప్రేమంటారా!*
జ్యోతీ!
నీకిష్టమని పెసరట్టు తీసుకొచ్చానమ్మాయ్!రా తిందాం అంటూ బయటినుంచి వస్తూనే మా ఆయన నన్ను పిలుస్తారు.
ఆహా! వాళ్ళాయనకు ఆవిడంటే ఎంత ప్రేమ అని తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి.నా గోడు కూడా కాస్త ఆలకించండి.
మా పరిచయమై 35 ఏళ్ళు.మా పెళ్ళయి 33 ఏళ్ళు.చిన్నప్పటినుండీ
నాకిష్టమైన టిఫిన్ పూరీ అని ఇప్పటికీ మా ఆయన గుర్తించరు.
అలాగని నేనేదో సినిమా హీరోహీరోయిన్లులాగా చెట్టాపట్టాలు వేసుకుని తిరగాలని,ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకుని తాగాలని కోరుకునే టైపు కాదు.
కానీ మంచీ చెడూ,కష్టం సుఖం కలబోసుకోవాలని ,మాటా మనసూ తెలుసుకోవాలనీ కోరుకోవటం అత్యాశ కాదనుకుంటాను .ఔనా!
కానీ అదే నా తీరని కోరిక.
నేను వసపిట్టలా వాగుతూనే ఉంటాను.ఆయన పట్టుమని పది మాటలు కూడా మాట్లాడరు.
ఏవిషయంలోనూ నా సలహా తీసుకోరు.
నేను చెప్పే ఏ మాటనూ చెవికి ఎక్కించుకోరు.
నువ్వంటే నాకిష్టం అని గానీ,ఐ లవ్ యూ అని గానీ ఇంతవరకూ ఎప్పుడూ చెప్పిందీ లేదు.(ఈ మాట నోటితో నేను కూడా చెప్పలేదనుకోండి.)
సరదాగా ఆ ఊరూ,ఈ ఊరూ తిరగాలనీ,తిప్పాలనీ అనుకోరు.
సర్ప్రెజింగ్ గిఫ్ట్ లు ఒక్కసారి కూడా ఇవ్వలేదు.నేను మాత్రం చాలా సార్లు ఇచ్చాను.అయినా సర్ప్రైజ్ అయిన ఫీలింగ్ ఆ ఫేస్ లో కనపడదు.😔😭
అయినా నేను ఆయనను ఇప్పటికీ పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటాను.
చాలాసార్లు తనమీద కోపం వచ్చింది గానీ ,మా బంధం పట్ల విముఖత ఏ క్షణంలోనూ రాలేదు.
నా కవిత్వాన్ని ఇష్టపడతారు.అందరికీ నేను బాగా రాస్తానని చెబుతుంటారు కూడా.ఆ చెప్పటంలో కొంచెం గర్వం కూడా కనిపిస్తుంటుంది అని నాకు అనిపిస్తుంటుంది.
మతం మా మధ్య ఎప్పుడూ అభిప్రాయభేదాల్ని తేలేదు.నేనెప్పుడూ ఇంట్లో పూజలూపునస్కారాలూ చేయను.కానీ నేను వెంకన్న భక్తురాలిని.పాటలూ, పద్యాలూ బోలెడు రాసుకుంటుంటాను.వద్దని తాను ఏనాడూ అభ్యంతర పెట్టలేదు.
నేను సభలూ,సమావేశాలూ అంటూ తిరిగినా అభ్యంతరం చెప్పరు.ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా విసుగు పడరు.
నా స్నేహాల గురించి ఆరాతీయరు.అనుమాన పడరు.
తనకు చాలా విసుగు.అయినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నామీద చెయ్యెత్తలేదు.(అఫ్కోర్స్..నేను కూడా అంతవరకూ గొడవని సాగదీయను.నేనే తగ్గిపోతాను.)
పిల్లల పెంపకం పట్ల చాలా సంతృప్తి తో ఉంటారు.
నా పద్ధతులన్నీ నచ్చుతాయి.కానీ ఎప్పుడూ నోరు విప్పి చెప్పరు .మరి నీకెలా తెలిసింది అంటారేమో!
నాకన్నీ అలా తెలిసిపోతుంటాయంతే 😍.
ఆయనకు ఏదన్నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ,బేలగా మారిపోయినప్పుడు, నిస్సహాయంగా అయిపోయినప్పుడు ఆ కళ్ళల్లో తెలుస్తుంటుంది.నా ఆధారం లేకపోతే తాను ఉండలేరని.
ఇప్పుడు చెప్పండి.
మాది ప్రేమేనంటారా!
అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.2.2023
ఎవరున్నారు పాపా!
మీకెవరున్నారు?
ఒకప్పుడు
అమ్మమ్మ మురిపెం
ఐదారునెలలే
ఆ పైన ముచ్చట్లన్నీ
నాయనమ్మవే
అనుకునేవారు.
ఇప్పుడు
నాయనమ్మ ముచ్చట కూడా
నాలుగురోజుల భాగ్యమే.
అమ్మమ్మకూ
నాయనమ్మకూ
కూడా
ఆ ఆనందం
దక్కటం లేదు.
తల్లి ఉద్యోగస్తురాలు
కాకపోతే కొంత నయంగానీ,
భార్యాభర్తలు ఇద్దరూ
ఉద్యోగస్తులైతే మాత్రం
అపురూపమైన
ఆ బాల్యమంతా
ఆయమ్మలపాలే కదూ!
కానీ మా మేనమామ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసేవారు.మా అత్త క్యాంపస్ క్వార్టర్ లోనే బేబీ కేర్ సెంటర్ పెట్టుకుంది.
సాధారణంగా ఇలాంటి చోట పిల్లల్ని ఆయాలమీద వదిలేస్తారు.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉంటారు.పిల్లల్ని వాళ్ళు ప్రేమగా లాలించటం ఉండదు.కానీ మా అత్త అలా కాదు.తను
ఆయమ్మలని పెట్టుకోలేదు.
కనీసం ఆరుగురు చంటి పిల్లలు ఉండేవారు ఎప్పుడూ.అయినా ఇంటిపని, పిల్లల పని ఒక్కతే ఓపిగ్గా చేసుకునేది.
పిల్లల్ని చాలా ప్రేమగా సాకేది.
ఎంతో శ్రద్ధగా, సంతోషంగా వారికి సేవలు చేసేది.తమ పిల్లల విషయంలో ఎవరికీ, ఎప్పుడూ ఏ ఇబ్బందీ కలగలేదు.
విచిత్రం ఏమిటంటే మాటలు వచ్చాక పిల్లలు మా అత్తామామల్నే మమ్మీ, డాడీ అని పిలిచేవారు.
అది చూసి ఒకావిడ బెంగపడి తన పాపని పంపటం మానుకుంది కూడానూ.
మా అత్త ఓపికకు మేమందరం ఎంతో మెచ్చుకునేవాళ్ళం.
అప్పటికి మా అత్త వయసు నలభైల్లోనే.క్యాంపస్ లో చంటిపిల్లల తల్లులు మనకు అమ్మ,అత్తా అందుబాటులో లేకున్నా లక్ష్మి గారు ఉన్నారు అని భరోసాగా ఉండేవారు.
అలాంటి మనసున్న మహిళలందరికీ నమస్సులు.
మా అత్తకు ఇప్పుడు మళ్ళీ మరొకసారి అభినందనలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.2.21
52.*నేనే కూతురు నేనే తల్లి*
ఏమిటీ ద్విపాత్రాభినయం అనుకుంటున్నారా! నన్నలా కాలానుగుణంగా రెండు పాత్రలలోనూ పరకాయ ప్రవేశం చేయించిన నవల
యద్దనపూడి సులోచనారాణి గారి *మీనా*
మక్కువతో...
చిరకాలం తరువాత చిక్కిన ఈ తీరికలో
చిన్నప్పటి నుండి
నాకిష్టమైన
యద్దనపూడి సులోచనారాణి గారి
*మీనా*
నవలను చదువుతూ..
సాధారణంగా నేను పద్య కవిత్వం, కవిత్వం తప్ప నవలలు అంత ఇష్టం గా, ఆసక్తి తో చదవను.కానీ నాకు బాగా నచ్చి నేను చదివిన నవలల్లో మీనా,సెక్రటరీ రెండూ ఉంటాయి
నా టీనేజ్ లో ఈ నవల
చదివినప్పుడు
మీనా పాత్రలో నేను ,
కృష్ణవేణి
పాత్రలో
మా అమ్మ
కనపడే వాళ్ళం.
నా కూతురి టీనేజ్ లో
చదివినప్పుడు
మీనా పాత్రలో
నా కూతురు,
కృష్ణవేణి పాత్రలో
నేను కనపడ్డాం.
అమ్మ మనసు అర్థం చేసుకోవాలి అని
నా కూతురి చేత నేను బలవంతంగా చదివించిన నవల ఇది.
పాత్రలు తారుమారు అయినా
రెండు వయసుల్లోనూ
తల్లీకూతుళ్ళ పాత్రల్లో
నాకు నేను అతికినట్టు సరిపోయాను అనిపిస్తుంది అదేమిటో?
మీనా ,
అఆ
సినిమాలు చూసినా
ఈ నవల చదివినప్పుడు కలిగినంత ఆనందం
నాకు కలగలేదుసుమీ!
ఇప్పుడు మళ్ళీ
ఒకసారి
చదివి చూద్దామని
చదివి ఆనందిద్దామని
అందుకున్నాను
అపురూపంగా.. మీనాని*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.03.2020.
అమ్మా నాన్నలు ఇచ్చిపోయిన 53.అపురూపమైన బంధం
నా తమ్ముళ్ళు
చిరంజీవి సింహాద్రి శ్రీరామమూర్తి
చిరంజీవి సింహాద్రి కిరణ్ కుమార్
ఈ బంధం వయసు
యాభై ఏళ్ళ పైమాటే .
ఆస్తులు,
అహంకారాలు,
పెట్టుపోతలు,
జీవిత భాగస్వాములు,
కడుపున పుట్టిన పిల్లలు,
వయసు,
కాలం
ఏవీ మా బంధాన్ని పలచన చేయలేదు.
చిన్ననాటి
ఆ ప్రేమ మాధుర్యం
మా మధ్య నేటికీ
అలాగే నిలిచిఉందని
సగర్వంగా చెప్పుకుంటూ,
అంతటి సంస్కారాన్ని మాలో నింపిన అమ్మానాన్న లకు
ఈ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటున్నాను.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.03.2021
54.కరోనాలో పనిమనుషులు
మా ఇంట్లో కొత్తగా
ఇద్దరు పనిమనుషులు
పనిలో చేరారు
అది నేను, నా కోడలు
మిత్రులారా!
మీకే మాత్రం అవకాశం ఉన్నా ఈ మూడు వారాలు మీ ఇంట్లో ని పనమ్మాయి కి వేతనంతో కూడిన సెలవు ఇవ్వండి.
సెలవు ఇచ్చేటప్పుడు ఆమెకు వివరంగా, సున్నితంగా, ప్రేమగా సమస్య యొక్క తీవ్రత ను చెప్పండి.
మీరు ఆమెను రావద్దని చెప్పేటప్పుడు ఆమె వల్ల మీకు ప్రమాదమని మాత్రమే అనుకోకండి.మీ వల్ల ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా అంతే ప్రమాదమని గుర్తిస్తే మనలో ఏ మూలో మానవత్వం మిగిలే ఉందని ఆనందించవచ్చు.
కేవలం కబుర్లు చెపుతున్నానని అనుకోకండి.
మా పనమ్మాయిలు
సుబ్బులు, నిర్మల
ఇద్దరికీ నేను
ఒకరికి రెండువేలు(పెద్దావిడ కి)
నిర్మలకు వెయ్యి ఇచ్చాను.
అది జీతానికి అదనం.
అవసరమైతే వెంటనే వచ్చి మళ్ళీ అడిగి పట్టుకెళ్ళమని చెప్పి
చెరొక డెట్టాల్ సోపు,శానిటైజర్ ఇచ్చాను.
గురజాడ ను ఒకసారి అందరం గుర్తుచేసుకుందాం.
సొంత లాభం కొంతమానుకు
పొరుగు వారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.03.2020
సహ (న) జీవనం
55.సహ(న)జీవనం...
ఒకప్పుడు మనకు పరిచయం లేని మాట.
నిన్నమొన్నటి దాకా సినిమా ప్రపంచంలోని వారికే పరిమితమైన మాట.నేడు ఆధునికుల్లో, విద్యావంతుల్లో, సమాజంలో ఉన్నత స్థాయి లో ఉన్న వాళ్ళలో కూడా ఈ పదం, ఈ బంధం తరచూ వినపడుతోంది.కనపడుతోంది.
భార్యాభర్తలనే బంధంలో ఉంటూ ఒకరిని మోసపుచ్చి మరొకరు చాటుమాటు వ్యవహారాలు నడపడం కంటే ఆ బంధాన్ని తెగతెంపులు చేసుకుని నచ్చిన వారితో సహజీవనం మంచిది కదా! అనే వాదన ఒకటి ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
కానీ, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమేనా!ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే కావచ్చు.కానీ బాధ్యత, జవాబుదారీతనం అవసరం లేదా! పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన పవిత్రమైన వృత్తి లో ఉన్నవారు, సమాజ హితాన్ని కోరే సాహిత్యాన్ని సృజించే రచయితలు, కవులు సమాజానికి ఆదర్శంగా ఉండవద్దా!
వ్యక్తులుగా తమ పిల్లల మానసిక స్థితి గురించి ఆలోచించవద్దా!
పిల్లల సమస్త సద్గుణాలకు, దుర్గుణాలకు కూడా ఇల్లే పునాది అన్నది మానసిక,. సామాజిక శాస్త్రవేత్తల నిశ్చితాభిప్రాయం.
ఇప్పుడిప్పుడే
భర్త మరణించిన స్త్రీలు, విడాకులు పొందిన మహిళలు పునర్వివాహం చేసుకుంటే ఆమోదించి వారిని గౌరవించే స్థితి కి కొంత వరకు (పూర్తి గా కాదు సుమా) మన సమాజం ఎదిగింది.కానీ సహజీవనం చేసే వారు పెరుగుతున్నా ,ఆ బంధాలను ఆమోదించే స్థాయికి ఇప్పట్లో సమాజం ఎదగటం కష్టమే.
అసలు వివాహ బంధం లోనే ఇమడలేనివారు సహజీవనం లో సర్దుకుపోగలరా! ఈ బంధంలో ఒకరిపై ఒకరి ఆధిపత్యం ఉండదు అంటారు.
పెత్తనం ఉండదు అనుకోవడం ఉత్తమాటే.ఏ బంధమైనా గానీ ప్రేమతోనే ఒక అధికారం ఒకరిమీద ఒకరికి సహజం గానే ఏర్పడుతుంది. అలాంటప్పుడు నచ్చిన వారితో వివాహబంధం ఏర్పరచుకుని కలిసి జీవించవచ్చుకదా!
చట్టం, సమాజం ఆమోదించలేని , ఆరోగ్యకరంకాని(ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.చదువరులు నాతో ఏకీభవించాల్సిన అవసరం లేదు)సహజీవన మెందుకు?
నిజంగానే నా ఇష్టం నాది అని సహజీవనం అనే బంధంలో ప్రవేశించినప్పుడు అంతే ధైర్యంగా సమాజం , అయినవాళ్ళ యొక్క తిరస్కారాన్ని భరించడానికి కూడా సిద్ధమవ్వాలి.నన్ను ఎవ్వరూ గౌరవించటం లేదని ఆత్మన్యూనతా భావం తో ఆత్మహత్య లకు పాల్పడటం మరింత అవివేకం.
కనుక ఆలోచించి, ఆచితూచి అడుగులు వేయాలి.
మానవ సంబంధాలలో వ్యక్తి గత ఆనందమే కాదు, సామాజిక బాధ్యత ను కూడా గుర్తెరిగి ప్రవర్తించాలి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.8.2019.
56.సిగ్గుపడుతున్నాను
నేనొక రిటైర్డ్ టీచర్ని.ఎన్నో టీచర్స్ డే లు విద్యార్థులతో ఎంజాయ్ చేశాను.ఎంతోమంది టీచర్స్ తో కలిసి పనిచేశాను.నిబద్ధత కలిగి తమ విజ్ఞానాన్ని గోరుముద్దలుగా విద్యార్థులకు పంచిపెట్టి తమ వృత్తిని అరుదైన అవకాశంగా,తమ అదృష్టంగా భావించి పిల్లలకు చదువునేర్పే టీచర్స్ ని చూశాను.అలాంటి వారు నా కొలీగ్స్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
మరికొందరు ఏ మాత్రం కష్టపడకుండా, పవిత్రమైన తమ వృత్తిని సంపాదనా మార్గంగా మాత్రమే చూస్తూ తమ జ్ఞానాన్ని ఏమాత్రం పెంచుకోకుండా, గైడ్స్ సహాయంతోనో,మరో సులభమైన మార్గం లోనో మ్యాగీ నూడుల్స్ కలిపేసినట్టు ఇన్స్టంట్ గా చెప్పేసి మమ అనిపిస్తారు.కానీ
నూడుల్స్ పిల్లలకు ఎలాంటి పోషకాలను, బలాన్ని ఇవ్వలేవు.ఆ సంగతి వారికి తెలియదు.పసితనం.ఏదో ఆకర్షణీయం గా తిన్నాం అంతే చాలు అనుకుంటారు.కానీ అమ్మ గోరుముద్దలు ప్రేమను,ఆరోగ్యాన్ని, ఆయుష్షును, భవిష్యత్తును కూడా అందిస్తాయి.అది ఆ వయసులో అర్థం కాదు గా.
టీచింగ్ కూడా నా దృష్టిలో అలాంటిదే.
నా సబ్జెక్టే తీసుకుంటే నా ముప్పై ఏళ్ళ సర్వీసులో ఎంతోమంది తెలుగు టీచర్లను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను.దురదృష్టం ఏమిటంటే వారిలో చాలా మంది కి పట్టుమని పది పద్యాలు పాడటం రాదు.దీర్ఘ సమాసాలు పలకటం రాదు.పద విభజన తెలీదు.తెలుగు, సంస్కృత సంధులకు తేడా తెలియదు.
ఒక కవి గురించి పదినిమిషాలు మాట్లాడలేరు.
రామాయణ,భారత,భాగవతాల గురించిన అవగాహన లేదు.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లేదులు ఎన్నో ఉన్నాయి.
అయినా పాఠశాలల యాజమాన్యానికి ఇవేవీ పట్టవు.ఎవరు దొరికితే వారే చాలు.సిలబస్ పూర్తయిందా!పిల్లలకు మార్కులు వచ్చాయా లేదా అంతే వారి లెక్క.టీచర్ కి డిగ్రీ ఉంటే చాలు.నాలెడ్జ్ అవసరం లేదు.
ఈ పరిస్థితి చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను.
విద్యార్థికి సబ్జెక్టు పట్ల పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేని టీచర్లను చూసి జాలిపడుతున్నాను.
ఇక ఒక ఉపాధ్యాయురాలిగా నా జీవితం నాకు సంతృప్తికరం.
నా పిల్లలు నేను తరగతి గదిలో అడుగుపెట్టేవేళకు ముక్తకంఠంతో పద్యాలు వల్లె వేస్తుంటారు.అది నా క్లాస్ అని స్కూల్ మొత్తానికి చెప్పకుండానే తెలిసిపోతుంది.వాళ్ళు భారతంలోని పద్దెనిమిది పర్వాల పేర్లు తడుముకోకుండా చెప్పగలరు.రామాయణంలోని కాండలు వరుసగా చెప్పగలరు. జ్ఞానపీఠ గ్రహీతల పేర్లు, అష్టదిగ్గజాలు వారి కావ్యాల పేర్లు చెప్పగలరు.శ్రీశ్రీ,దాశరథి గేయాలు పాడగలరు.ఆముక్తమాల్యద లోని *అందుండుం ద్వయసద్మపద్మవదనుం డద్వంద్వుడు* లాంటి కఠినమైన పద్యాలను కంఠోపాఠంగా తడుముకోకుండా అప్పజెప్పగలరు.60 సంవత్సరాల పేర్లు చెప్పగలరు.క్విజ్ లు,పద ప్రహేళికలలో ఉత్సాహంగా పాల్గొనగలరు.బుర్రకథ అయినా,హరికథ అయినా చక్కగా అభినయించగలరు.అవధానం,భువనవిజయం కూడా రక్తికట్టించగలరు.
ఇదంతా పిల్లలకు ఒక టీచర్ ఇచ్చే ఫీడింగే.టీచర్లోని ఉత్సాహం,తపన, విషయ పరిజ్ఞానం ఒక చెట్టులోని సారం పుష్పాలు,ఫలాల రూపంలో పుష్పించి ఫలించినట్లుగా టీచర్ నైపుణ్యం విద్యార్థి టాలెంట్ గా బహిర్గతం మవుతుంది.
పిల్లలకు మన మాతృభాషను ఇలా నేర్పాలి అన్న తపన ఉన్న టీచర్లకు, అలాంటి టీచర్లను ప్రోత్సహించే యాజమాన్యాలకు నమస్సులు.
నా ఉద్యోగ జీవితం లో నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన మరొక విషయం ఏమిటంటే
కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులు జరిగినప్పుడు పిల్లల పేరెంట్స్ కూడా నా క్లాస్ కోసం ఎదురుచూశారని తెలియడం.మీ క్లాస్ పీరియడ్ వచ్చినప్పుడు మాకు చెప్పమని వాళ్ళ బామ్మో,తాతో,నాన్నో,అమ్మో అడుగుతారని ,మీ క్లాస్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తో వింటారు మిస్ అనో, అయ్యో! తెలుగు మిస్ క్లాస్ అయిపోయిందా!మేము ఈరోజు వినలేదే అని అన్నారు అనటం అది ఎన్నో అవార్డుల కన్నా గొప్ప విషయం.
కరోనా నాకు పిల్లల తల్లిదండ్రుల మెప్పు పొందే అవకాశం కూడా ఇచ్చింది.ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది?
నేను ఉద్యోగం మానేశాక హైదరాబాద్ లోని ఒక పాఠశాల వారు ఫోన్ చేసి మీ గురించి చాలా గొప్పగా విన్నాం,
45 వేలు జీతం ఇస్తాము రమ్మని నన్ను అప్రోచ్ అవడం,మా ఊరిలో కూడా రెండు పాఠశాలలు నన్ను ఆహ్వానించటం(పేమెంట్ చెప్పలేదు గానీ కోరినంత ఇస్తామని అన్నారు) నా
కెంతో సంతోషాన్ని కలిగించిన విషయం.
ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను నేనొక రిటైర్డ్ టీచర్ ని అని.
ఐ లవ్ మై ప్రొఫెషన్.
అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.
57.*మా నవ (రాత్రి) ఉత్సవాలు*
నా పేరు వినాయకుడు
భక్తుల
విన్నపాలు విందామని
విఘ్నాలు తీరుద్దామని
నలుగురి మధ్యా
నా పుట్టినరోజు జరుపుకుందామని
భూలోకానికి బయలుదేరాను
త్రోవంతా పరిశీలిస్తూ
వచ్చాను
ఊరంతా కోలాహలం
ఉవ్వెత్తున జనసంద్రం
ఈ సందడంతా నాకోసమే కదా అని
తెగ సంబరపడ్డాను
తీరా చూద్దును కదా!
వీధి కూడళ్ళను ఆక్రమించేస్తూ
అపార్ట్మెంట్ ల
స్టేటస్ సింబల్ నవుతూ
అన్ని పందిళ్ళలోనూ నేనే
కానీ అదేం చిత్రమో!
ఏ రెండు పందిళ్ళలోనూ
నేను ఒకేలా లేను
నన్ను నేను గుర్తించడానికే
చాలా శ్రమపడ్డాను
భక్తులు తమ క్రియేటివిటీ అంతా
నన్ను మలచటంలోనే ప్రదర్శించేశారు
ఎక్కడో ఒకచోట తప్పిస్తే
మట్టి సుగంధం
ముక్కుకి ఆనటం లేదు
రసాయనాల మేకప్ అద్ది
నన్ను మెరిపించేస్తున్నారు
మైకులు హోరెత్తిపోతున్నాయి
వాతాపి గణ పతిం భజే అంటూ ఘంటసాల గారి గళం విందామని ఆశపడ్డాను
ఏదో రెండు పూటలా కాస్త పూజ అయ్యిందనిపించేస్తున్నారు
పది పందిళ్ళ బేరం కుదుర్చుకున్న
అయ్యవార్లు
ఇలా వచ్చి అలా పూజ పూర్తిచేసి
వెళ్ళిపోతున్నారు
వ్యాసుని నోటవింటూ
ఎత్తిన గంటం దించకుండా
భారతాన్ని రాసిన నేను
కొన్నిచోట్ల
అపశబ్దాల ఆరాధననూ
స్వీకరించక తప్పలేదు
ఈ గంట గడిచింది చాలు అనుకునేలోపే
ఊ అంటావా!మావా!
ఊహూ అంటావా!అంటూ
విచిత్ర పాటల హింస
ప్రారంభమయ్యింది
అమాయకంగా చిన్నారులు
మెలికలు తిరుగుతూ కుర్రకారూ
మైమరచి ఆ పాటలకు
అభినయించేస్తుంటే
ఆ వెర్రి గెంతులకు
పెద్దలు ఆనందంతో
మురిసి ముక్కలయిపోతుంటే
కళ్ళప్పగించి చూస్తుండిపోయాను
లాంఛనంగా ప్రసాదాలు నోట్లోవేసుకుని ఇక
భోజనాలమీద పడ్డారు
నిజం చెప్పొద్దూ!
నేనెంత భోజన ప్రియుణ్ణి అయినా
పండుగ వేళ
వారు ప్రత్యేకంగా
వారి అభిరుచులకు
అనుగుణంగా
ఆర్డరిచ్చి వండించి వడ్డించిన
ఆ మెనూ నాకు నోరు తిరగదు సుమండీ!
తిండి కోసం మొహం వాచినట్లు
నా పేరు చెప్పుకుని
నానా గడ్డీ
నా పందిట్లోనే లాగించేస్తున్నారు
అది వాళ్ళ వాళ్ళ ప్రిస్టేజీ ఇష్యూ అయి కూర్చుంది
విజయవాడ వరదలా
వచ్చి పడిన
విరాళాలకు
ఆమాత్రం ఆర్భాటం
తప్పదు కదా మరి!
ఎంత నేను భగవంతుణ్ణి అయినా
ఈ నవ రాత్రులు
ఎలా గడుస్తాయిరా బాబూ!అని
బెంగపెట్టేసుకున్నానంటే నమ్మండి
ఆ రోజు రానే వచ్చింది
ఉదయాన్నే పూజ ముగించారు
ఫలహారాలు పూర్తయ్యాయి
ఇంకో కొత్త పోకడ
నా లడ్డూ వేలం వేశారు
భక్తి కొద్దీ ప్రయత్నించారు
ధనం కొద్దీ పాడుకున్నారు
హమ్మయ్య!
అయిపోవచ్చిందిలే
అని ఆనందపడ్డాను
తలకేవో చమ్కీ గుడ్డలు కట్టుకున్నారు
గులాములు జల్లుకున్నారు
బాజాలు మ్రోగించారు
నన్ను భారీ వాహనమెక్కించారు
గణపతి బప్పా మోరియా అంటూ
గొంతు అరిగేలా అరిచారు
కల్లు తాగిన కోతుల్లా
నా ముందర చిందులేశారు
రోడ్లన్నీ క్రిక్కిరిసిపోయాయి
పోలీసులు రంగంలోకి దిగారు
ట్రాఫిక్ ని మళ్ళించారు
అసహనాలు పెచ్చుమీరకుండా
అనవసరపు కలహాలు
తలెత్తకుండా
అప్రమత్తం చేశారు
భక్తజన ప్రవాహం
ట్యాంక్ బండో
సముద్రపు ఒడ్డో
చేరుకున్నారు
నన్ను ముంచేశారు
నిమజ్జనం పూర్తయింది
వెర్రతలలు వేసిన
వేడుకలు ముగిశాయి
అప్పటికి పూనకాలు తగ్గాయి
బ్రహ్మాండంగా
ఉత్సవాలు చేశామని
సంతృప్తి పడుతూ సాగిపోయారు
వరదమిగిల్చిన బురదలా
మురికిగా మారిన నీళ్ళు
తుఫాను తరువాత
రూపుమాసిన నగరంలా
మునిగితేలుతున్న
నా విగ్రహాలు మిగిలాయి
పోనీలే
ఇంకో ఏడాది వరకూ
ప్రశాంతంగా
ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటూ నేను
మా అమ్మ దగ్గరకు బయలుదేరాను.
ఎంతయినా
బోళాశంకరుడి పుత్రుణ్ణి కదా!
ఆరాధనలను అంగీకరించడం
అజ్ఞానాన్ని అయ్యో పాపమని క్షమించటం
నా విద్యుక్త ధర్మం కదా!
ఏమంటారు?
*అంతా ఇంతే కాకపోయినా అధికభాగం ఇంతే* అన్నది నేటి వాస్తవం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.9.2024
58.*ఆశ్రమం తో నా అనుబంధం*
పంచవటి యోగాశ్రమం-
అమ్మ కడుపులో రూపుదిద్దుకున్న శిశువు ప్రాణం పోసుకుని మాతృగర్భం చీల్చుకుని ఈ భూమి మీదకు వచ్చి ఊపిరి పీల్చుకున్నట్లుగా,
మన గురువుగారి మదిలో రూపుదిద్దుకుని,వారి సదాశయం సాకారమై ఈ పంచవటి ఆశ్రమం ఏడాది క్రితం ప్రాణప్రతిష్ట చేసుకుంది.
కాళీమాత అనుగ్రహం, శ్రీరామకృష్ణుల ఆశీర్వచనం,శారదామాత చల్లని చూపు వెనుబలమై ఉండగా ప్రారంభమైన ఈ ఆశ్రమం అతి నిరాడంబరంగా,అత్యున్నత లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
జన్మించిన శిశువు మొదటి ఏడాదిలోనే ఎన్నో కొత్త విద్యలు నేర్చుకుని కన్నవారికి ఆశ్చర్యానందాలు కలుగజేస్తూ ఎదిగినట్లుగా మా ఆశ్రమం కూడా ఏడాదిలోనే మాకు ఎంతో నేర్పింది.
సాధ్యమయ్యేదే సాధన,
మాటే మంత్రము
దృష్టిని బట్టే సృష్టి వంటి మహనీయుల వాక్కులే ఆదర్శంగా గురువుగారు శిష్యులకు అత్యంత వాత్సల్యంతో నిత్యజీవిత సాధనా మార్గాలను సులువైన విధానంలో బోధిస్తారు.
మూడు నెలల కొకసారి మూడు రోజులపాటు జరిగే రిట్రీట్ లలో సరళమ్మ ఆదరణ ఒక చల్లని ఊరట అందరికీ.అందరినీ పేరుపేరునా పలకరిస్తూ కన్నతల్లిలా అందరి యోగక్షేమాలు విచారిస్తూ ఎంతో ప్రేమను కురిపిస్తుంది.మూర్తి,సంధ్యలు పంచవటి సభ్యులందరికీ అన్నావదినలే.అఖిల,లలిత పంచవటికి ప్రియమైన చెల్లెళ్ళు.
ఇక్కడ ఎవ్వరిలోనూ భేదభావాలు లేవు.ఎక్కువతక్కువలూ లేవు.
పేరుపేరునా అందరి గురించి చెప్పలేను గానీ మా పంచవటి ఒక ఉన్నత విలువలు గల ఉమ్మడి కుటుంబమే.
అరవై దాటిన వారికే ఆధ్యాత్మికత అనే ఒక అపప్రధను తొలగిస్తూ ఇక్కడ ఎక్కువ శాతం నలభై ఏళ్ళ వయసు లోపు వారే కావటం మరొక ప్రత్యేకత.
.ఆ పిల్లల వినయవిధేయతలు,శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుంది.
గురువు గారు బోధించే అంశాలైన
అష్టపాశాలను సడలించుకునే ప్రయత్నం చిత్తశుద్ధితో ఎలా చేయాలో, ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా సాధించాలో,మనశ్శరీరప్రాణశక్తులను
అనుసంధానం చేసుకుంటూ ఆ ముక్కాలి పీటపై స్థిరంగా ఎలా కూర్చోవాలో,నేటి ఉరుకుల పరుగుల జీవితం యాంత్రికమైపోతున్నవేళ
నిత్యజీవిత సాధనతో
ఎలా ముందుకు సాగాలో,నిజమైన ప్రార్థన అంటే ఏమిటో ,ఎలా చేయాలో అన్నీ ఇక్కడ అనుభవైకవేద్యమే గానీ ఉత్తమాటలు కావు.
ఇక శరీరం రోగగ్రస్తం కాకుండా మితంగా హితమైన ఆహారాన్ని స్వీకరించడం,
యోగా తో ఆరోగ్యాన్ని సాధించటం,హోమియోపతితో అనారోగ్యాన్ని జయించటం ఎలాగో నేర్పిస్తారు.
గురువుగారికి అద్భుతాలు చేయటం మీద ఆసక్తిలేదు.
తన శిష్యుల జీవితాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దటంపైనే ఆయన ఆసక్తి అంతా.ఆయన ఆలోచన,ఆచరణ, ఆహార్యం అన్నీ ఆదర్శప్రాయమే.
ఆయన ఒక తోటమాలిలా మారి తన శిష్యులనే పూల మొక్కలను శ్రద్ధగా తీర్చిదిద్ది పరిమళ భరితమైన సంస్కార పుష్పాలను సమాజానికి, దైవానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు.మరి ఏ తోటమాలి,భక్తుడు కూడా గుడ్డిపూలను దైవపూజకు సమర్పించరు కదా!
అందుకే విడిచిన చెప్పులు ఒక క్రమంలో పెట్టుకోవడం దగ్గరనుంచి ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా పరిశీలించి,నేర్చుకోవటం అలవాటు చేస్తుంటారు.
మాకు గురువంటే అందని మ్రానిపండు కాదు.ఆయన మాకందరికీ కరతలామలకం.
ఎన్నో వందల ప్రసంగాలు చేసినా, ప్రస్తుతం
రాస్తున్న వాటితో కలిపి దాదాపుగా వంద పుస్తకాల దాకా వ్రాసినా, ఉపనిషత్తుల సారమంతా ఔపోసన పట్టినా ఇతర ఆధ్యాత్మిక గురువుల్లా అందనంత ఎత్తులో ఉండక , అందరికీ అందుబాటులో ఉంటారు.అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తారు.ఇదొక పరిమిత సభ్యులతో కూడిన మంచి కుటుంబం.
ఆ కుటుంబం లోకి అక్కయ్య అంటూ ఎంతో ప్రేమతో నన్ను చేర్చుకున్న గురువుగారికి
పాదాభివందనాలు.🙏🙏🙏
*రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె* అన్న వేమన వచనంలా
ఇంత చక్కని మార్గంలో నేను నడిచే అవకాశం కల్పించిన నా పెద్ద తమ్ముడు చిరంజీవి సింహాద్రి శ్రీరామమూర్తి కి నా శుభాశీస్సులు.🙌🙌🙌
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
24.11.2024
ఆదివారం
59.*గ్లాసెడంత చరిత్ర*
పైన వీడియోలో చూపించిన గ్లాసు కి ఒక చరిత్ర ఉంది.
అవి మొత్తం మూడు గ్లాసుల సెట్.
దీనికంటే పెద్ద సైజు గ్లాసు మీద *ఆచారి* అని నాన్నగారి పేరు ఉండేది.ఈ గ్లాసు మీద *విశాల* అని అమ్మ పేరు ఉంది.
దీనికంటే చిన్నసైజు గ్లాసు మీద *జ్యోతి* అని నా పేరు ఉండేది.
అవి మూర్తి కూడా పుట్టకముందు కొన్నవి.
అంటే దాదాపుగా ఒక 58 ఏళ్ళ చరిత్ర ఉందనమాట.మా కిరణ్ పుట్టాక
నా పేరు ఉన్న గ్లాసుతో వాడు రోజూ కాఫీ తాగేవాడు.
మా పెద్ద తమ్ముడికి, నాకు చిన్నప్పుడు కాఫీ అలవాటు లేదు.కానీ మా కిరణ్ కి దాదాపు 5 ఏళ్ళ వయసు నుండే కాఫీ అనే బ్యాడ్ హాబిట్ అయ్యింది.
వాడికి ఇంట్లో కాస్త గారాబం ఎక్కువ లెండి.
ఇంతకూ వాడికి
కాఫీ ఆ గ్లాసు లో నిండుగా అంచుల వరకూ ఉండాలి.
కొంచెం తగ్గినా మూతి ముడుచుకుని అవతలకి జరిగిపోయేవాడు.కొన్నిసార్లు కాఫీ ఒలికిపోకుండా జాగ్రత్తగా దానిని అవతలకు నెట్టేసేవాడు.అది చూసి మేం ముచ్చటపడి నవ్వుకునే వాళ్ళం.
అప్పట్లో వాడేం చేసినా మాకు మురిపెమే.
ఇంతకూ ఆ చొట్టల సంగతి చెప్పలేదు కదూ! ఆగండాగండి
అక్కడికే వస్తున్నా.
భోజనాల సమయంలో ఆ గ్లాసులతో నీళ్ళు పెట్టుకోవడం,అడుగు గుండ్రంగా ఉండటం వల్ల ఒక్కోసారి పడిపోయి నీళ్ళు ఒలికిపోవడం, అవి కారిపోయి మా నాన్నగారు భోజనానికి కూర్చోవడానికి వేసుకునే గోనెపట్ట తడిసిపోవడం,మా అమ్మ తిట్లు ఇవన్నీ తరచూ జరిగేవి.
అందుకే మా నాన్నగారు ఉపాయం ఆలోచించి ఆ మూడు గ్లాసులను బోర్లించి,సుత్తితో కొట్టి చొట్టలు పెట్టేశారు.
దాంతో అవి చక్కగా సెట్ అయిపోయాయి.
శుభ్రమైన గ్లాసులు చొట్టలు పెట్టేశారంటూ మా అమ్మ తిట్లు కామనే.ఇదండీ
మా మూడు గ్లాసుల కథ.
ఇవాళ నేను అందులో హార్లిక్స్ కలుసుకుందామని తీసినప్పుడు ఈ స్టోరీలన్నీ రీళ్ళలా కళ్ళముందు మెదిలాయి.
మిగిలిన రెండు గ్లాసులు ఏమయ్యాయో!
బహుశా మా సంధ్య మాయంచేసేసిందేమో మా కుటుంబ ఆస్తిని.
ఏం చేద్దాం! తను *గట్టి* (వాళ్ళ) పిల్ల కదా!
ఏం చేయలేం.😔🤣
ఇంతకూ నా స్టోరీ ఎలా ఉంది?😍😍
సింహాద్రి జ్యోతిర్మయి
29.11.2024
శుక్రవారం
60.*కృతజ్ఞతాంజలి*
*3.12.2024*
ఈరోజుతో మా వైవాహిక బంధం 35 ఏళ్ళు పూర్తిచేసుకుని 36 వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది.
నడచివచ్చిన ఆ దారిని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే జీవితమంటే కేవలం మా ఇద్దరితోటే గడవదుకదా!మరి మా జీవనయానం సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతివారినీ ఈ సందర్భంగా ఈరోజు ఒకసారి తలచుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది
అందుకే ఇదిగో ఇలా...
సమర్పిస్తున్నా
నా
*కృతజ్ఞతాంజలి*
ఒక బంధం
ఏర్పడాలన్నా
నిలబడాలన్నా
బలపడాలన్నా
ఎన్నో అనుబంధాల
ఆలంబన అవసరం
ఆ క్రమంలో ....
మా శేఖర్ మంచివాడే
అని చెప్పి
నమ్మకం కలిగించి
మా పెళ్ళికి
మా అమ్మానాన్నల్ని ఒప్పించిన
మా కుట్టమామకి
మా ప్రేమను
అంగీకరించి
మూడుముళ్ళ బంధంతో మమ్మల్ని ముడివేసిన
మా తల్లిదండ్రులకు
మా పెళ్ళిని
వారింటి వేడుకలా
వైభవంగా జరిపించిన
మా పెద్ద మేనమామకి మా రత్నమాల అత్తయ్యకు
తెల్లవారుజాము
ముహూర్తానికి
మాకోసమే మేలుకొని
నిండుమనసుతో
మమ్మల్ని
ఆశీర్వదించిన బంధువులకు,పెద్దలకు
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ మా జంటను
అభినందించిన
స్నేహితులకు
పూల పొదరిల్లులాంటి మా బంధాన్ని
పరిమళింపజేసి
పరిపూర్ణం చేసిన
మా పిల్లలకు
భర్తలోని లోపాలను
సహించి
ఉన్నంతలోనే సర్దుకుని
సంసారాన్ని చక్కదిద్దుకునే
సంస్కారం నేర్పిన మా అమ్మకు
కన్నతల్లిలా ఆదరించిన
మా అత్తగారి సౌజన్యానికి
నా జీవితంలోని
ప్రతి సందర్భంలోనూ
ప్రతి అవసరంలోనూ
నీకు మేమున్నామని
భరోసా ఇచ్చి
నన్ను కనిపెట్టుకుని ఉంటున్న నా తమ్ముళ్ళకు
ఆడబడుచుని
తమ సొంత అక్కలా
ఆదరిస్తున్న నా మరదళ్ళకు
ప్రేమను పంచటంలో ,
నాపై అభిమానం కురిపించటంలో
తమ్ముళ్ళ వారసత్వాన్ని
పుణికిపుచ్చుకున్న
నా మేనల్లుళ్ళకు
మేనకోడళ్ళకు
ఆప్యాయతను పంచిన తోడికోడళ్ళకు
నన్ను వారి కన్నబిడ్డలా ఆదరించిన మా బావగార్లకు
తల్లిలా మన్నించే మరిదికి ,
తోడికోడళ్ళ సంతానానికి
మా చింతలలో
చిరుదీపమైన
అమ్మలు తరుణికి
తమ పిల్లలను మా పిల్లలకిచ్చి
మాతో సంబంధం కలుపుకున్న
వియ్యాలవారికి
"నేనూ మీ అబ్బాయి లాంటివాడినే !
మామయ్య, మీరు
మా దగ్గరికి వచ్చి ఉండండత్తయ్యా"
అని ప్రేమతో పిలిచే మా అల్లుడికి
"మామయ్య,మీరు
వండర్ ఫుల్ కపుల్
అత్తయ్యా" అని పొగడ్తలతో ముంచెత్తేసే మా కోడలికి
సంసారపు తొలి సంధ్యలో
సంతోషాలు నింపిన
సంతానంకంటే
మలి సంధ్యలో
మరింతగా సంబరాన్నిచ్చి
ముదిమికి ముద్దుముచ్చటలు నేర్పుతున్న
నా మనవలకి
స్నేహామృతాన్ని
ఆస్వాదించే
అవకాశమిచ్చి
మానసికంగా ధైర్యాన్నిచ్చి,
ఆర్థికంగా ఆదుకున్న
అనేకానేకమంది ప్రియమైన
మిత్రులకు
మా పిల్లల పెళ్ళిళ్ళలో
తమ సహాయ సహకారాలు అందించిన ఆప్తులకు
నా కష్టంలో నన్ను
కడుపులో దాచుకుని
కాపాడిన ప్రియనెచ్చెలి
అరుణ గారికి
మమ్మల్ని ద్వేషించి,
అపకారం చేసి,
నమ్మించి మోసం చేసి
ఆ అనుభవాలతో
మేము
జీవితపాఠాలు నేర్చుకుని
జాగ్రత్తపడి
ఎదిగే
అవకాశం ఇచ్చిన
వారికి
నన్ను,నా సాహిత్యాన్ని
అభిమానించే
సాహితీ మిత్రులకు
నేను మంచి టీచర్ని అనే ఆత్మవిశ్వాసం నాలో నింపిన
నా విద్యార్థులకు
సంపాదించుకుని
మా సంసారాన్ని పోషించుకునే
ఆర్థికబలాన్ని, గుర్తింపుని ఇచ్చిన
మేము ఉద్యోగం చేసిన సంస్థల అధిపతులకు,అధికారులకు
సహకరించిన సాటి ఉద్యోగులకు
ఈ 35 ఏళ్ళుగా
మేము కాపురముండటానికి
తమ ఇళ్ళు అద్దెకు ఇచ్చి
మాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన
ఇంటి యజమానులకు
నాకు ఇంటి పనిపాటల్లో ఇంతకాలం నుంచీ సేవలందించి సహాయపడిన
పనమ్మాయిలందరికీ
ఎన్నో అనారోగ్య సమస్యలనుండి కాపాడిన డాక్టర్లు,నర్సుల దగ్గరనుంచి
ఎంతో జాగ్రత్తగా
ఎన్నోసార్లు నన్ను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన డ్రైవర్లవరకూ
అవ్యాజమైన
అనుగ్రహ వర్షంతో మా జీవితాన్నే మార్చేసిన మా గురువుగారికి
అక్కయ్య అంటూ
అభిమానంగా పిలిచే
పంచవటి సభ్యులకు
35 ఏళ్ళ మా వైవాహిక జీవితానికి
అభినందన పూర్వకంగా
మా 36 వ పెళ్ళిరోజుని ఇలా ఒక *మధుర* అనుభూతిలా
అద్భుతమైన *తాజ్మహల్* సందర్శనంలా
మార్చేసిన
మా ప్రియాతిప్రియ మిత్రుడు
చిన్న బుజ్జికి (చిత్తూరు ఎమ్ పి)
అన్నిటికంటే ముఖ్యంగా
వరించిన నేరానికి
నన్నింతకాలంగా భరిస్తూ,
ఈయనను పెళ్ళిచేసుకుని నేను ఒక తప్పటడుగు వేశాను అనే భావన
ఇప్పటివరకూ
ఒక్కసారి కూడా నా మనసులోకి రానివ్వనంతగా
నన్ను అపురూపంగా చూసుకుంటున్న
విసుగువీరుడు😜 ( ఆ విసుగుని భరిస్తునే ఇంతకాలం నెట్టుకొచ్చాను మరి🤣)
మా ఆయనకి
సంతృప్తికరమైన
జీవితాన్ని వరంగా ప్రసాదించి
ఇన్నిటికీ మూలమైన
ఆ తిరుమలేశునికి
ఇంకా నా మనసు
విస్మరించిన వారెవరైనా
ఉంటే వారికి
ఇలా
మీ అందరితో
ముడిపడే
మా జీవితం ఇంత
అందంగా, ఆనందంగా
సాగింది కనుక
మీ అందరికీ
మా ఇద్దరి తరపునా
పేరుపేరునా
పెద్దలు,గురువులకు
నమస్సులు
బంధుమిత్రులకు
ధన్యవాదాలు
పిల్లలకు
శుభాశీస్సులు
తెలుపుతూ సమర్పిస్తున్న
నా కృతజ్ఞతాంజలి
విహితమని భావించినా
వింతగా అనిపించినా
వినూత్నంగా కనిపించినా
నాకు మాత్రం
సంతృప్తి నిచ్చి
మరో ఏడాదికి
అవసరమైన
మనోబలాన్ని ఇస్తోంది
*జ్యోతిర్మయి & రాజశేఖర్ @35*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.12.2024
మంగళవారం
*సంసారం ఓ సంగీతం*
3 ముళ్ళు
4 అక్షింతలు వేయించుకుని
34 ఏళ్ళు పూర్తిచేసుకుని
35 వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ వేళ
నా మనసు పాడుతోంది ....
ఏ పాటలో తెలుసా!
*నగుమోము గనలేని నా జాలి తెలిసి*....అని
ఎందుకంటారా!
మా ఆయనకు నవ్వటమే రాదు
ఆయన మనసారా నవ్వగా చూసిన సందర్భాలు బహుకొద్ది
మరి...అందుకని నవ్వు జోలికే పోని ఆయన నగుమోము గనలేని నా జాలికి నేనే దిగులుపడి పాడుకుంటుంటాను.
అప్పుడు అనిపిస్తుంది
*నవ్వవయ్య బాబూ!
నీ సొమ్మేం పోతుంది?
నీ సోకేం పోతుంది?*
అనే పాట పాడాలని
అలాగే
*పలుకే బంగారమాయెనా!*
అనే పాట కూడా పాడుకుంటూ ఉంటాను
ఎందుకంటే నేనేమో మాటల పుట్ట.
ఆయనేమో టెలిగ్రాఫిక్ కోడ్ లో క్లుప్తంగా మాట్లాడతారు
పైగా
*చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు* అన్నట్లు( అబ్బే!ఏదో మాటవరసకు సామెత చెప్పాను గానీ నేనేమీ చెయ్యి చేసుకోను సుమండీ!) ఒకటికి రెండు మాటలు మాట్లాడితే విసుగు.దానికంటే *మౌనమె నీ భాష ఓ మూగ మనసా!*
అని పాడుకుంటే పోదా అని సరిపెట్టేసుకుంటుంటాను.
ఎందుకంటే
*ఊరుకున్నంత ఉత్తమం,బోడి గుండంత సుఖం లేదు* అని అంటారు కదా!
ఇక గొడవలు పడ్డ ప్రతిసారీ
*నాతో తగవులు పడుటే
అతనికి ముచ్చట లేవోయ్
ఈ విధి కాపుర మెటులో
నీవొక కంటను గనుమా!*
అని సావిత్రి లెవెల్లో మూతి ముడుచుకుని
పాడుకుంటూనే 35 ఏళ్ళు నెట్టుకొచ్చాను .
అప్పుడప్పుడూ విసుగొచ్చేసినప్పుడు మాత్రం ఉక్రోషంతో
*రాదే చెలీ!నమ్మరాదే చెలీ!
మగనాలి మనసమ్మ రాదే చెలీ*
అని నిట్టూరుస్తూ ఉంటాను.ఏం చేద్దాం!
అంతకుమించి ఇంకేమీ చేయలేను కదా!
చివరకు నేను కవయిత్రిని కాబట్టి
*కనులు మాటలాడునని
మనసు పాట పాడునని
కవితలల్లితిని ఇన్నాళ్ళు
అది కనుగొన్నాను ఈనాడు*
అని నాకు నేనే ఆయన వ్యక్తం చేయని భావాలు ఊహించుకుని సంబరపడిపోతుంటాను.
ఒకరకంగా అది నిజం కూడానేమో
ప్రేమ గుడ్డిది
అంటారు గానీ
పాపం మా ఆయన ప్రేమ మూగది.
ఈ జన్మకింతే ఇక.
ఏ మాట కామాట చెప్పుకోవాలి
రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని
రెండు చెవులూ ఒకే శబ్దాన్ని వింటున్నట్లుగా
మేమిద్దరం ఒకే జీవితాన్ని చూసి సఫల ప్రేమికులుగా
*మన ఆనందమయమైన సంసారమూ*
అన్నట్లుగా గడిపేశాం.
బాధ్యతలన్నీ తీరిపోయాక ఇక ఇప్పుడు
నా మనసు పాడుతున్న పాట ఒకటే
*మీ నగుమోము (??😜😜
నా కనులారా
కడదాకా కననిండు
అని.
ఇదండీ! ఈ మిథునం కథ.
నచ్చిందా!
*నిను సేవింపగ నాపదల్ పొడమనీ,నిత్యోత్సవం బబ్బనీ*
అని జీవితం లోని కష్టసుఖాలు, వెలుగు నీడలన్నీ ఆ స్వామి సంకల్పం గానే స్వీకరిస్తూ...ఇలా 35 వ పెళ్ళిరోజు కి చేరుకున్నాం.😍😍
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.12.2023
కవిగా నాకు తొలి గుర్తింపు నిచ్చిన
శ్రీ శ్రీ
అవి నేను డిగ్రీ చదువుతున్న రోజులు.
భావ కవిత్వ ప్రభావంతో కవిత్వం రాస్తున్న తొలి రోజులు.
ఒకసారి మా గుంటూరు ఉమెన్స్ కాలేజీలో
గేయరచన , కథా రచన పోటీలు పెట్టారు.
అందులో
పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం పోదాం
పైపైకి
అనే శ్రీ శ్రీ గేయ పంక్తులు పల్లవిగా ఇచ్చి
గేయాన్ని,
అలాగే భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంశంతో కథను
ఒక గంట సమయం ఇచ్చి రాయమన్నారు.
నేను రెండింటి లోనూ పాల్గన్నాను.కథకు నాకేమీ బహుమతి రాలేదు కానీ గేయానికి మాత్రం నాకే ప్రథమ బహుమతి వచ్చింది.
రావటమే కాదు మా లెక్చరర్లు శ్రీమతి N.విజయలక్ష్మి, శారదాంబ,అన్నమ్మ అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు కూడా.
నేను రాసిన గేయం పూర్తిగా గుర్తులేదుగానీ
అందులో కొంత భాగం గుర్తుండిపోయింది.
పదండి ముందుకు పదండి తోసుకు
పోదాం పోదాం పైపైకి
పేదల సాదల కన్నీరు సిరా చేసుకుని
బీదల ఆకటి చిచ్చున భావం రాసుకుని
ప్రపంచపు బాధే తనది చేసుకుని
నవకవనానికి నాందీ పలికిన
శ్రీ శ్రీ మాటలొ శ్రీ శ్రీ బాటలొ
వినపడలేదా విప్లవ గీతం
కనపడలేదా మరో ప్రపంచం
అంటూ సాగిన ఆ గేయానికి
నాకు ప్రథమ బహుమతి వచ్చింది.
దాశరథి గారి ' జ్వాలాలేఖిని '
బహుమతిగా లభించింది.
అడుగు జాడ గురజాడది
అది భావికి బాట
అని శ్రీ శ్రీ గారు అన్నట్లుగా
శ్రీ శ్రీ గారి గేయం పల్లవిగా
కవిగా నాకు తొలి గుర్తింపు వచ్చిన
ఆ సందర్భం నాకు అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఈ సందర్భంగా ఆ మహాకవిని కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను.
సింహాద్రి జ్యోతిర్మయి
15.6.2020
*నా(న్న)గోరింట*
చాలా ఏళ్ళ తరువాత ఈరోజు గోరింటాకు పెట్టుకున్నాను.ఆషాఢమాసం సాధారణంగా ఆడవాళ్ళు అందరూ గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు.
నాకు గోరింటాకు అంటే ఇష్టమే గానీ,అందరిలా చక్కగా ముదురుఎరుపు రంగులో పండదు నాకు.గోల్డ్ స్పాట్ కలర్ కి,లేత ఎరుపు రంగు కి మధ్యస్థంగా పండుతుంది.
అలా నాకిష్టం ఉండదు.
అందరిలా ముదురు ఎరుపు రంగులో పండాలని నా ఆశ.
నాకేమో అలా పండదు.పైగా నాకు అందంగా పెట్టుకోవడం కూడా చేతకాదు.
అందుకని ఎక్కువగా పెట్టుకోను.
కానీ నిన్న మా సంధ్య ఒదినా!
గోరింటాకు పంపిస్తాను పెట్టుకుంటావా!అనేసరికి నాకూ పెట్టుకోవాలనిపించి పంపమన్నాను.
పంపింది.సరే ఎలాగో తంటాలుపడి చేతి వేళ్ళకి టోపీలు,అరచేతిలో చందమామ,చుక్కలు పెట్టుకుని,మిగిలినదంతా పాదాలకు పులిమేసుకున్నాను.😜
కష్టపడి రెండు గంటలు కూర్చున్నాక కడిగేసుకున్నాను.
గోరింటాకు పెట్టుకున్న కుడిచేతిని చూసుకుంటే చిన్నప్పుడు రోట్లో గోరింటాకు మెత్తగా కాటుకలా రుబ్బడం అందులో కాస్త నిమ్మరసం, చింతపండు రసం కలిపి పెట్టుకోవడం గుర్తుకొచ్చింది.
నాలాగే మా అమ్మ కూడా చేతనయ్యీ కాకుండా నా చేతికి గోరింటాకు పెట్టడం గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది.మా అమ్మకీ నాకూ ఎందులోనూ,ఏ పనిలోనూ పోలికలు కలవకపోయినా ఇందులో మాత్రం కలిశాయి.🤣
గోరింటాకు కడిగేసుకున్నాక అరచెయ్యి చూసుకుంటే ఇన్నేళ్ళ తరువాత కూడా మళ్ళీ అదేరంగులో పండింది.
కానీ ఆ చెయ్యి మాత్రం మా నాన్నగారిని గుర్తుచేసింది.పండిన చెయ్యి నాన్నగారికి చూపించగానే ఎంత బాగా పండిందో అమ్మలూ!ఏదీ చెయ్యి ఇలా ఇవ్వు అని ఆ చేతిని తన తలపై రుద్దుకునేవారు.
(ఆ తలమీద జుట్టే ఉండదు సుమండీ! నాకు తెలిసినప్పటినుండీ ఆయనది బట్టతలే. కానీ మా అమ్మ ఆ మాటంటే మాత్రం ఆయన ఒప్పుకునేవారు కాదు.చిన్నప్పుడు నాది దేవానంద్ క్రాఫోయ్!అనేవారు.ఆయన మాట అబద్ధం కాదు.సాక్ష్యంగా ఒక ఫోటో కూడా ఉంది ❤️)
ఆ తలపై నూనె నా చేతులకు అంటి చెయ్యి మెరుస్తూ ఉండేది.ఆ చేతిని అపురూపంగా చూసి చెంపలకు రాసుకుని ముద్దుపెట్టుకునేవారు.మరి నేనంటే మా నాన్నగారికి అంత ప్రాణం అన్నమాట.
అలా నాన్నగారిని గుర్తుచేసుకుంటూ పండిన నా అరచేతికి రెండు బొట్లు కొబ్బరినూనె రాసుకున్నాను.
ఆ మెరుపులో
నాన్నగారి అందమైన జ్ఞాపకం ప్రతిఫలించి మనసు కూడా రాగరంజితమైపోయింది.😍
ఐ మిస్ యూ నాన్నగారూ!😔
సింహాద్రి జ్యోతిర్మయి
17.7.2025
గురువారం
*అద్దె ఇంటి కష్టాలు*
*నీటి వైరాలు*
నీటి సమస్య
దేశాల మధ్య,రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించటం, కలహాలకు కారణం కావడం మనకు తెలిసిన విషయమే.
అయితే నా జీవితంలో కూడా నీళ్ళవల్ల నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
పనిలోపనిగా నా అద్దె ఇళ్ళ ప్రహసనం కూడా కలుపుకుంటే గానీ ఇది సంపూర్ణం కాదు.
నా చిన్నతనంలో మేము గుంటూరు దగ్గర పేరేచర్లలో ఉండేవాళ్ళం.మిగతారోజుల్లో
నీళ్ళకి ఎలాంటి కొరత లేకపోయినా వేసవి కాలంలో కాస్త ఇబ్బంది కలిగేది.అయినా మావి మా నాన్నగారు పనిచేసే కంపెనీ క్వార్టర్స్ కావటం వల్ల ట్యాంకర్స్ తో నీళ్ళు తోలించేవాళ్ళు.వీధిచివర ఆగిన ట్యాంకర్ నుండి నేనే బిందెలతో నీళ్ళు ఇంట్లోకి మోసుకొచ్చి పోసేదాన్ని.మా అమ్మ గిన్నె,చెంబు అన్నిటికీ నీళ్ళు పట్టించేది.అదిగో అలా నీళ్ళకి సంబంధించిన తెలీని ఒక టెన్షన్ నా మనసులో చిన్నప్పుడే చోటు చేసుకుంది.
*వేటపాలెం*(1)
ఆ విషయం అలా పక్కన పెడితే,1989 డిసెంబర్ లో నా పెళ్ళి అయితే 1990 జూన్ లో వేటపాలెం లో నా తొలి కాపురం మొదలయ్యింది.
ఇంటద్దె 260 రూపాయలు.ఇంట్లో బావి ఉండేది.
నాకేమో తోడుకోవడం చేతకాదు.మా ఆయన ఇంట్లో లేనప్పుడు
పాపం ఇంటిగలావిడ,వాళ్ళ పిల్లలే నాకు కావలసిన నీళ్ళు తోడిపెట్టేవారు.చాలా అభిమానంగా ఉండేవారు.మా బాబు కూడా మేం అక్కడ ఉన్నప్పుడే పుట్టాడు.రాజీవ్ గాంధీ హత్య వార్తలన్నీ వాళ్ళ టీవీలోనే చూశాం.అప్పటికి మాకింకా టీవీ లేదు.గ్యాస్ స్టౌ కూడా లేదు.కుక్కర్ కూడా కిరోసిన్ స్టౌ మీదే పెట్టుకునే దాన్ని.ఇంటిగలవాళ్ళ అమ్మాయి జ్యోతి మా అబ్బాయి ని చక్కగా ఆడించేది.ఎత్తుకు తిప్పేది.
ఇప్పటికీ మేము మా రావూరు వెళ్ళేటప్పుడు వీలున్నప్పుడల్లా వాళ్ళని చూసి వెళుతుంటాం.
అయితే అక్కడ ఉప్పు నీళ్ళు కావడం వల్ల మంచినీళ్ళు పోయించుకునేవాళ్ళం.రోజుకి ఒక బిందె చొప్పున నెలకి 15 రూపాయలు.మా బాబు పుట్టాక ఉప్పునీళ్ళకి పిల్లాడు నల్లబడిపోతాడని మా ఆయన మంచినీళ్ళు కొని వాటితో స్నానం చేయించమనేవారు.అలా 45 రూపాయలు పెట్టి నెలకి మూడు బిందెల నీళ్ళు కొని,రోజూ రెండు పూటలా వాడికి స్నానం చేయించేదాన్ని.మా ఆయన భ్రమే
కానీ వాడేమీ రంగైతే రాలేదులెండి.
*చీరాల*(1)
ఆ తరువాత మా వారికి చీరాల దగ్గరలోకి ట్రాన్స్ఫర్ వస్తుందని చీరాలకు మారిపోయాం.రెండు గదుల ఇల్లు.అద్దె 200. కరెంట్ బిల్ 15 రూపాయలు.మళ్ళీ అందులోనే డబ్బులు మిగిలి సంవత్సరం చివరలో ఎడ్జెస్ట్ అయ్యేవి.
ఇక్కడా ఉప్పు నీళ్ళే.బోరింగ్ నీళ్ళు.అందుకని ఇక్కడ కూడా మంచినీళ్ళు కొనుక్కునే వాళ్ళం.
*నర్సరావుపేట*(7)
1893 లో నాకు నర్సరావుపేట డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా ఉద్యోగం రావడంతో 1893 ఆగస్టు 15 వ తేదీన మా కాపురం నర్సరావుపేట కు మారింది.రామిరెడ్డిపేటలో ఉండేవాళ్ళం.ఇంటద్దె 450.ఆ ఇంటిగలవాళ్ళు కూడా చాలా ప్రేమగా ఉండేవారు.కడుపుతో ఉన్నానని ఎవో ఒకటి వండి పంపిస్తూ ఉండేవాళ్ళు.కానీ డెలివరీ అయ్యాక కాలేజీ కి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే బాగుంటుందని కాలేజీ వెనకే ఉన్న ఎన్ జీ వో కాలనీకి మారాం.ఇంటిగలవాళ్ళు లేరు.పక్కన ఉండేవాళ్ళు కూడా అద్దెకున్నవాళ్ళే.అక్కడ కూడా బావి,బోరింగు ఉండేవి.కానీ వాళ్ళసలు జనాలతో కలిసే వాళ్ళు కారు.ఇరుగు,పొరుగు అందరితోనూ గొడవలే.రెండు నెలలు కూడా ఆ ఇంట్లో ఉండలేక పోయాం.
ఈలోపు నేను డెలివరీ కి,మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం వచ్చేలోపు మా వారు ఎదురింట్లోకి మారిపోవటం జరిగింది.అక్కడ కూడా పక్కన అద్దెకున్నవాళ్ళే.మంచివాళ్ళే.బాగానే ఉండేవారు.వాళ్ళకు ముగ్గురు పిల్లలు.వాళ్ళ అబ్బాయి అబ్నార్మల్ హైట్ తో పొట్టిగా ఉండేవాడు.హైదరాబాద్ లో కోచింగ్ తీసుకునేవాడు.ఇక్కడ ఎక్కువగా ఉండేవాడు కాదు.
మా ఇంట్లో మా బావగారి అమ్మాయి ఉండేది.ఇంటర్మీడియట్ మా కాలేజీలోనే చదివేది.ఆ అబ్బాయి ఊరినుంచి వచ్చినప్పుడు మా పిల్లను ఫాలో చేసేవాడు.మా పిల్ల అసలే భయస్తురాలు.దాంతో పిన్నీ!నేను కాలేజీకి పోను అంటూ ఏడుపు.బుజ్జగించి అడిగితే విషయం చెప్పింది.దాంతో నీకేం భయంలేదు,వాడి సంగతి నేను చూస్తాను అని చెప్పడంతో స్థిమితపడింది.
అదీగాక
మేం లేడీస్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు డాబా ఎక్కి తొంగిచూసే ప్రయత్నం చేయడం చేసేవాడు.మాకు బాత్రూమ్ పెరట్లో ఉండేది.ఇది తెలిసి నేను ఒకరోజు మా పిల్లను బాత్రూమ్ కి స్నానానికి వెళ్ళమని గట్టిగా అరిచి చెప్పి 5 నిమిషాలు ఆగి చప్పుడు చెయ్యకుండా పైకి వెళ్ళాను.(అక్కడేం కనపడదు.పైగా నేను కర్టెన్ కూడా వేశాను సేఫ్ సైడ్ గా.అయినా వాడికదొక మాయరోగం.)రెడ్ హ్యాండెడ్ గా వాడిని పట్టుకుని ఎవ్వరూ చూడకుండా బాది పారేశాను.వాడు నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు.వాళ్ళ అమ్మానాన్న మర్యాదస్తులు.వాళ్ళ మొహం చూసి వార్నింగ్ ఇచ్చి వాడిని వదిలేశాను.
ఆ తరువాత మావారికి ఈ సంగతి తెలిసి అర్జెంటుగా ఇల్లు మారిపోవాలని ఎస్ ఎస్ ఎన్ కాలేజీ వెనక ఇల్లు చూశారు.అది సెంటున్నర స్థలంలో మూడు వైపులా మురికి కాలువల మీద కట్టిన ఇల్లులా ఉంటుంది.అస్సలు బాలేదు.పక్కనే మా ఆయన కు అక్క వరుస అయ్యేవారు ఉండేవారు.అందుకని అక్కడికే వెళదామని పట్టుబట్టారు.తీరా వెళ్ళాక గానీ మా వారికి ప్రాక్టికల్ గా ప్రోబ్లం అర్థంకాలేదు.దాంతో రెండు నెలల్లోనే మళ్ళీ ఎన్ జి ఓ కాలనీకే వెళ్ళిపోయాం.
అక్కడ ఒక క్రిస్టియన్స్ ఇంట్లో మూడేళ్ళు ఉన్నాం.బాగానే ఉండేది.
కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదరటంతో మేం వేరే ఇల్లు వెతుక్కోవలసి వచ్చింది.
ఆ ఇంటికి దగ్గరలోనే నాలుగు ఇళ్ళ అవతల వేరే ఇంటికి మారిపోయాం.
సెపరేట్ గా బెడ్ రూం ఉన్న ఇంటిలో ఉండటం అదే మొదటిసారి.నాలుగువేల రూపాయలకు ఆ ఇంట్లో చేరినట్టు గుర్తు.మేం అక్కడ ఉండగానే నర్సరావుపేట కు మేముండే కాలనీకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ రావడం జరిగింది.దాంతో నీళ్ళ కష్టాలు నాకు తాత్కాలికంగా (నర్సరావుపేటలో) తీరిపోయాయి.ఇంటిగలవాళ్ళకు నలుగురు పిల్లలు.అందులో చివరివాళ్ళిద్దరూ మా పిల్లల ఈడువాళ్ళే.వాళ్ళూ మేము
బాగానే కలిసిపోయాం.మా ఆయన ఎప్పుడైనా ఊరు వెళ్ళినా,వాళ్ళాయన ఊళ్ళో లేకపోయినా మా రెండిళ్ళ మధ్య ఉన్న తలుపు తీసుకుని పిల్లలతో తోడుగా పడుకునే వాళ్ళం.అలా
ఆ ఇంట్లో తొమ్మిది సంవత్సరాల పాటు ఉన్నాం.ఇంతలో వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి కుదరటంతో మేం ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది.మేము,వాళ్ళు కూడా చాలా బాధపడ్డాం.(ఇప్పటికీ మేం నర్సరావుపేట వెళ్ళినప్పుడు, వాళ్ళింటికి వెళితే ఆవిడ ముందు వెళ్ళి మీ ఇల్లు ఒకసారి చూసుకునిరండి అంటుంది.)
నాతోపాటు ఆవిడ కూడా ఇద్దరం కలిసి తిరిగి ఇల్లు వెతుక్కున్నాం.రెండు లైన్ల అవతల ఇల్లు దొరికింది
పెద్ద ఇల్లు.దానిని అద్దాల మేడ అనేవారు.ముస్లిమ్స్ ఇల్లు.వాళ్ళు దుబాయ్ లో ఉండేవారు.వాళ్ళు చెప్పిన వాళ్ళకి అద్దె ఇవ్వటం తప్పిస్తే ఇంటిగలవాళ్ళ వివరాలు మాకేమీ తెలియదు.
కానీ ఆ ఇంట్లో ఒక్క ఏడాది మాత్రమే ఉన్నాం.ఇంతలో మా వారికి అద్దంకి ట్రాన్స్ఫర్ అయింది
దాంతో నేను దానికి దగ్గరలో ఉన్న ఒంగోలు లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ఇంటర్వ్యూ కి హాజరవడం, సెలెక్ట్ కావడంతో మా మకాం ఒంగోలు కి మారింది.
*ఒంగోలు*(6)
ఒంగోలు కి 2009 మే 16 వ తేదీన వచ్చాం. కర్నూలు రోడ్డులో అద్దెకు ఇల్లు తీసుకున్నాం.ఆ ఇంటి ఓనర్స్ భార్యాభర్తలు ఇద్దరూ గవర్నమెంట్ టీచర్స్.మేం పై పోర్షన్ లో ఉండేవాళ్ళం.ఇల్లు పెద్ద ఇల్లు.ఇంటిగలవాళ్ళు మాతో బాగనే ఉండేవారు.ఇద్దరికీ ఖాళీ సమయం తక్కువ కావడంతో ఎప్పుడైనా ఒకసారి కలిసి మాట్లాడుకునే వాళ్ళం.వాళ్ళ అమ్మాయి కి మా ఇల్లు చాలా నచ్చేది.ఆంటీ చూడమ్మా ఇల్లు ఎంత నీట్ గా సర్దుకుంటారో!మనిల్లు కూడా అలా సర్దు అని వాళ్ళమ్మని విసిగిస్తూ ఉండేది.ఆవిడ కూడా మా ఇంటికి వచ్చినప్పుడు పై పోర్షన్ అద్దెకే గదా అని తక్కువ ఖరీదు ఫ్లోరింగ్ వేయించాం.అయినా మీ బండలు మెరుస్తూ ఉంటాయి అనేది.మీరు ఇల్లు కొనుక్కుని మా ఇంటినుంచి వెళ్ళాలి అంటూ ఉండేది.(ఈ ఇంట్లో నీటి ప్రోబ్లం ఏంటంటే వీళ్ళు ఉప్పునీళ్ళు తవ్వించుకున్నారు గానీ మంచినీళ్ళు సరిపోతాయిలే అని ఉప్పునీళ్ళకి మోటర్ బిగించుకోలేదు.పైగా సంప్ లేదు.దాంతో ఎప్పుడైనా మున్సిపల్ వాటర్ రాకపోతే కాస్త ఇబ్బంది పడేవాళ్ళం.ట్యాంకర్ పోయించుకునే వాళ్ళం.అంతే.)
ఆవిడ నోటి పుణ్యాన ఆ వెనక లైన్ లోనే అపార్ట్మెంట్స్ కడుతున్నారంటే, కొడుకు డాడీ!మనం కూడా ఇల్లు కొనుక్కుందాం అన్నాడని పూర్వాపరాలు పూర్తిగా విచారించకుండా, నాకు ఏ వివరమూ చెప్పకుండానే మా ఆయన అడ్వాన్స్ ఇచ్చేసి ఫ్లాట్ బుక్ చేసేశారు.
పోనీలే ఏదో అయిపోయింది,సొంతిల్లు ఏర్పడుతోంది అని సంతోషించాను.2013 లో సొంతింటి గృహప్రవేశం చేసుకున్నాం.ఎంతో ముచ్చటగా దగ్గరుండి ఇంటీరియర్స్ చేయించుకుని,చిన్న ఇల్లయినా ముచ్చటగా,పొందిగ్గా కట్టించుకున్నాం.అట్టహాసంగా గృహప్రవేశం చేసుకున్నాం.మా అబ్బాయికి SBI P.O.గా ఉద్యోగం వచ్చింది కూడా అక్కడ ఉండగానే.అదంతా బాగానే ఉంది కానీ,
అయితే దిగితే గానీ లోతు తెలీదని ఆ ఇంటికి వచ్చాక గానీ మాకు అందులోని లోటుపాట్లు ఇబ్బందులు అర్థం కాలేదు.
బిల్డర్ కి తన పార్టనర్స్ తో విభేదాలతో కన్స్ట్రక్షన్ పై సరియైన అజమాయిషీ లేక నాసిరకంగా పూర్తిచేశారు.ఇక బోరునీళ్ళు కటిక ఉప్పులు.దానికోసం RO system పెట్టిస్తామన్నారు కానీ అది వర్కవుట్ కాలేదు.మూడు రోజుల కొకసారి ఒక గంట వదిలేనీళ్ళు ఎవ్వరికీ సరిపోయేవి కావు.పైగా మాది 5th ఫ్లోర్ కావడం వల్ల,అందరూ ఒకేసారి ట్యాప్స్ తిప్పడం వల్ల అరడ్రమ్ము నిండేసరికే ఆగిపోయేవి.ఇంట్లో అన్ని అవసరాలకి బబుల్ వాటర్ మీదే ఆధారపడేవాళ్ళం.ఇంటద్దె మిగిలిందిలే అనుకుంటే ఆ డబ్బు ఇలా నీళ్ళకి ఖర్చయిపోయేది.డబ్బు మంచినీళ్ళలా ఖర్చవటం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.ఎలా రా దేవుడా!ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని సతమతమవుతుండగా మా వారికి గిద్దలూరు ట్రాన్స్ఫర్ అయింది.అంతా మన మంచికే అనుకుంటూ ఇతర ఇబ్బందులు కూడా కొన్ని ఉండటంతో, రిటైర్మెంట్ సమయం కూడా దగ్గర పడటంతో ఇక ఒంగోలు మళ్ళీ తిరిగి వచ్చే అవసరం కనపడక ఇల్లు అమ్మేసి, నేను ఉద్యోగం కూడా మానేసి గిద్దలూరు వెళ్ళిపోయాము.
*గిద్దలూరు*(1)
గిద్దలూరు లో నీటికి మహా ఎద్దడి.ఎప్పుడూ నీళ్ళ ట్రాక్టర్ లు ఊరంతా తిరుగుతూనే ఉండేవి.కానీ మేమున్న ఇంటికి మాత్రం నీళ్ళ ఇబ్బంది లేదు.పైగా అప్పటికే చాలా ఏళ్ళనుంచీ వాటర్ ప్యూరిఫయర్ వాడుతూఉన్నాం కాబట్టి మంచినీళ్ళకు కూడా ఇబ్బంది కాలేదు.ఇంటిగలవాళ్ళు చాలా మంచివాళ్ళు.ఒక్క విషయం లో కూడా పాపం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.మా ఇంట్లోని వస్తువులకు తగ్గట్లుగా అడిగిన మార్పులన్నీ చేయించి, పైగా అంతకు ముందు వాళ్ళకు ఇచ్చిన దానికంటే తక్కువ అద్దెకే మాకు ఇల్లు ఇచ్చారు.వాళ్ళ సహృదయతకు వాళ్ళను ఎప్పటికీ మరచిపోలేను.
అయితే మనకు ఏ ప్రాంతపు గాలి,నీరు,మెతుకుతో ఎంతకాలం ఋణం ఉందో తెలుసుకునే అవకాశం మనకులేదుకదా!
పదవీవిరమణ వయసు 58 నుంచి 60 కి పెంచటం తో మా వారికి రెండేళ్ళ అదనపు సర్వీస్ జతకలిసింది.పైగా DPO గా ఒంగోలు కి ఛార్జ్ ఇవ్వటంతో మేం మళ్ళీ ఒంగోలు రాక తప్పలేదు.
*ఒంగోలు*
ఈసారి వి ఐ పి రోడ్డులో ఇల్లు చూసుకున్నాం.ఇల్లు పెద్దదే.నీళ్ళకి ఎలాంటి ఇబ్బందీ లేదు.ఇంటద్దె 10500.సరే అనుకుంటే ఇంటికి కాస్త బయట పనులు అవీ చేయించి, ఏకంగా ఒకేసారి ఇంటద్దె 15 వేలు చేస్తామన్నారు.ఎంత అడిగినా,వాదించినా కుదరలేదు.అంత అద్దె కట్టుకోవటం మనవల్ల కాదులే అని మళ్ళీ ఇళ్ళవేటలో పడ్డాను.
ఈసారి మా స్కూల్ కి దగ్గరలో ముంగమూరు డొంకలోనే ఇల్లు వెతుక్కున్నాం.అద్దె పదివేలు.రెండేళ్ళకోసారి రెండు వేలు పెంచుతామన్నారు.పై పోర్షన్.కింద ఇంటిగలవాళ్ళు.వాళ్ళు రిటైరైన వాళ్ళు , వయసులో మాకన్నా పదేళ్ళ పైనే పెద్దవాళ్ళయిన భార్యాభర్తలు.
ఈ ఇంట్లో కష్టాలు మరియు సుఖాలు రెండింటిలోనూ పైస్థాయినే అనుభవించాం.పిల్లలిద్దరి పెళ్ళిళ్ళూ శుభప్రదం గా జరిపించటం,మా వారు రిటైర్ అవటం జీవితంలోని మంచి విషయాలైతే, ఒక చిన్న పొరపాటు జీవితంలో మనశ్శాంతిని దూరం చేసి,అవమానాల పాలు చేయటం చేదు అనుభవం.
ఇక ఇంటిగలాయన ఫరవాలేదు కానీ ఆవిడ మాత్రం మహాకఠినం . పనివాళ్ళు చెప్పులు వేసుకుని గేటు లోపలికి రాకూడదు,
Comments
Post a Comment