11/1.*రోజుకో చరిత్ర* (జనవరి)

 ‌‌‌
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲


*ప్రతిరోజూ పండగే*
(జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల పై కవితలు)

ఆధునిక సాంకేతిక విప్లవం తో ప్రపంచం 
నేడొక కుగ్రామం అయిపోయింది.వివిధ దేశాల సంస్కృతులు ఆచారాలు, వ్యవహారాలు,సంప్రదాయాలు సార్వజనీనమైపోయాయి.ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించడం అనేది ఒక చక్కని మార్పు.
సృష్టిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి,బంధాలను బలపరచడానికి,ప్రతీ వస్తువు,ప్రాణి,పర్యావరణం,
సందర్భం అన్నిటినీ ఒక ఉత్సవంగా గుర్తించి,దానికొక రోజును కేటాయించి,పాటించటం,ఆయా దినోత్సవాల వల్ల ఆయా విషయాల పట్ల అవగాహన పెంచడం,సంరక్షించే ప్రయత్నం చేయడం నిజానికి ఒక శుభ పరిణామం.
ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ మన సంస్కృతి కాదు, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ మనం వీటిని మన నిత్యజీవితంలో భాగం చేసుకున్నాక,ఈ పాశ్చాత్య పోకడలు మనకెందుకు అని పెదవి విరుస్తుంటారు చాలామంది.
ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను.తల్లిదండ్రులను మనం నిజంగా అంతగా గౌరవిస్తుంటే వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి?అంటే మనం నేర్చుకున్న ఏ నీతినీ కూడా చిత్తశుద్ధితో పాటించట్లేదు అనే కదా దాని అర్థం.
కనుక మంచి ఎక్కడ ఉన్నా స్వీకరిద్దాం. పాశ్చాత్యమైనంత మాత్రాన అక్కడి పద్ధతులన్నీ తిరస్కరించవలసిన పనిలేదు.
ఉదాహరణకు జూన్ 2 వ‌తేదీ అంతర్జాతీయ సెక్స్  వర్కర్స్ డే గా పాటిస్తారు.దానర్థం అందర్నీ చెడిపోమని కాదు.సమాజంలో అతి హేయంగా‌ చూడబడుతున్న వారి పట్ల సానుభూతి చూపమని,వారి సమస్యలను తొలగించి సమాజంలో వారికి గౌరవంగా బ్రతికే హక్కును,అవకాశాన్ని కల్పించాలనే అవగాహన ప్రపంచానికి కలిగించడం కోసమే దీనిని పాటిస్తున్నారు.
నిజానికి మన రాజుల కాలంలో వీరికి సముచితమైన మర్యాద,స్థానమే ఉండేదని మన చరిత్ర చెబుతోంది.
ఇలా ఎన్నో దినోత్సవాల గురించి తెలుసుకున్నప్పుడు నా మనసు పొందిన స్పందన కవితలుగా మారింది.
దాదాపు ప్రముఖమైన అన్ని దినోత్సవాల మీద నేను కవితలు రాశాను.
వాటిని ఫేస్ బుక్,వాట్సాప్ లలో పెడుతుంటాను.
నిజానికి ఇది ఒక వినూత్నమైన ప్రయత్నమే.
ఇంతవరకూ ఇన్ని విషయాలపై ఎవరూ కవితలు రాయడం చేసి ఉండరు.నేను అలా రాసుకుంటూ పోయాను.
వాటర్ డే, ఎర్త్ డే,ఓషన్స్ డే, సైన్స్ డే ఇలా‌ దాదాపుగా ప్రతీ అంశంపైనా రాశాను.
వాటిని *ప్రతిరోజూ పండగే* అనే పేరుతో నా బ్లాగు లో (జ్యోతిర్మయం)పెట్టాను.మరి వాటికి పుస్తకరూపం ఎప్పుడు వస్తుందో!వేచి చూడాలి.

నా బ్లాగు

https://simhadrijyothirmai.blogspot.com



రోజుకో చరిత్ర *( జనవరి)

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

జనవరి 1
Global family day 
&
April 15 th
International family day

 2.January 3
National lady Teachers day

3.January 5
National Bird 🐦 day

4.January 9
NRI day

5.January 10
World Hindi day

6.January 11
Human trafficking awareness day

7.January 12
National youth day

8.January 15
Indian army day


9.January 11 th to 17 th
National road safety week

January 19 th
International flower day 

10.January 21
National hug day

11.January 23
Desh Premi diwas

12.January 24
National girl child day
&
13.International day of education 

January 25
14.National tourism day
&
15.National voters day

January 30
16.National Martyrs day

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋


జనవరి 1
Global family day 
సందర్భంగా
రిలేషన్స్ తో కూడిన సినిమా పేర్లతో సరదాగా 
నా కథాత్మక కథనం

*బాంధవ్యాల కథ*

మాది *బంధాలు-అనుబంధాలు* పెనవేసుకున్న
*ఆదర్శ కుటుంబం*
మాది ఎప్పుడూ *ఉమ్మడి కుటుంబం*
లాగే ఉండాలన్నది మా *తాతమ్మ కల*
ఆ కలను మా కుటుంబం తరతరాలుగా నెరవేరుస్తూనే వస్తున్నదని మా *అమ్మ చెప్పింది*
నేటి తరానికి మాదొక
*విచిత్ర కుటుంబం* కావచ్చు.
కానీ *మంచి కుటుంబం* గా మాత్రం పేరు గడించింది.
మా *తల్లిదండ్రులు* *పుణ్య దంపతులు* వారు సాక్షాత్తూ *ఆది దంపతులు* అని *ఇరుగుపొరుగు* అంతా అనేవారు.
మా *నాన్నగారు*  *అమ్మ కొడుకు*  లా పెరిగిన *బంగారు కొడుకు*
ఆయనకు మా *బామ్మ మాట బంగారు బాట* *కన్నకొడుకు* తన మాటకు అంత విలువ ఇచ్చినా 
 మా బామ్మ మా అమ్మ మీద
ఎప్పుడూ *అత్తగారి పెత్తనం* చెలాయించలేదు. మా అమ్మ  *ఆడబడుచు* అంటే మా మేనత్త అన్నమాట.తన పేరు  చంద్రకళ. చాలా నెమ్మదస్తురాలు.అందువల్ల మా అమ్మ ఆడబడుచు ఆరళ్ళూ ఎరుగదు.
*అన్నదమ్ములు*,*తోడికోడళ్ళు* అంతా కలిసి ఎంతో ఆనందంగా జీవించే *బంగారు కుటుంబం* మాది.
మా అమ్మకు మేం ఐదుగురం *సంతానం* *ముగ్గురు అమ్మాయిలు*, *ఇద్దరు కొడుకులు* 
అంటే నాకు నలుగురు *తోబుట్టువులు* అన్నమాట.అక్క,*అన్నయ్య*, *తమ్ముడు*,చెల్లి.నేను మధ్యలో దాన్ని.
మా *పెద్దక్కయ్య* పేరు కృష్ణ కుమారి.
మా *పెద్దన్నయ్య* పేరు బాలకృష్ణ.
(నా తరువాత పుట్టిన తమ్ముడు,చెల్లి వాళ్ళని పెద్దక్కయ్య, పెద్దన్నయ్య అని పిలవడంతో నాకు కూడా అదే అలవాటయిపోయిందిలెండి.)
 *నా తమ్ముడు*  శోభన్ బాబు. మా తమ్ముడిని చూసినవాళ్ళంతా *తాతా మనవడు* ఒకే పోలిక అంటుండేవాళ్ళు.దానితో మా తాత వాడిని తెగ ముద్దు చేసేవారు.
మా బామ్మకు మాత్రం ఆడపిల్లలంటేనే ముద్దు. 
ఇంటికి ఆడపిల్లలే కళ.ఈసారి నువ్వు *కంటే కూతుర్నే కను* అని మా బామ్మ అమ్మకు హుకూం జారీ చేసిందట అక్కడికి అదేదో అంతా మా అమ్మ చేతుల్లోనే ఉన్నట్లు.ఆమె సంకల్పబలం ఏమిటో గానీ నిజంగా ఆడపిల్లే పుట్టింది.అదే మా *చిట్టి చెల్లెలు* వాణిశ్రీ. 

 *ఇల్లు ఇల్లాలు పిల్లలు* ఇదే లోకంగా బ్రతికే మా *నాన్న* మమ్మల్ని చక్కగా చదివించి పెంచి పెద్ద చేశారు. మా అన్నయ్య,అక్క 
*పెళ్ళీడు పిల్లలు* అయ్యారు. ఒకరోజు 
మా *పిన్ని* విజయనిర్మల  మా అక్కకు ఒక మంచి *పెళ్ళి సంబంధం* తెచ్చింది.వస్తూనే మా అమ్మతో అక్కా!మా ఎదురింటి 
*మంగమ్మగారి మనవడు*  *చంటబ్బాయ్* లేడూ!అది అతని ముద్దు పేరులేవే.అసలు పేరు చిరంజీవి.
వాడు మన పిల్లకు చక్కని *ఈడూ జోడూ* ఔతాడు. 
పనిలో పనిగా  మా *పక్కింటి అమ్మాయి*  *సీతారామయ్యగారి మనవరాలు* మీనా లేదూ!అది కాస్త *అల్లరిపిల్ల* అనుకో. అయినా చూడచక్కనిది.  మన పెద్దాడికి చేసుకుంటే బాగుంటుంది. *పెళ్ళాం చెబితే వినాలి* అనే మనస్తత్వం ఉన్న ఆ ఇంటికి  మనవాడు *ఘరానా అల్లుడు* అవుతాడు. 
వాళ్ళిద్దరూ *మొండి మొగుడు పెంకి పెళ్ళాం* లాగా  ఒకరికొకరు చక్కగా సరిపోతారు. ఏమంటావు? అని మా అమ్మను అడిగింది.ఇంతలో నాన్నగారు బజారు నుండి రావటంతో పిన్ని లేచి *బావగారూ!బాగున్నారా!* అంటూ పలకరించి మాటల మధ్యలో తను తెచ్చిన సంబంధాల సంగతి చెప్పింది.మీ *ఆలుమగలు* ఇద్దరూ మాట్లాడుకుని నాకు ఏ  విషయం చెప్పండి అంది. మీ *అక్కా చెల్లెలు* అనుబంధం,ప్రేమ నాకు తెలియదా విజయా!మంచి సంబంధం అయితేనే గానీ నువ్వు చెప్పవు కదా!
 నా భార్యాబిడ్డలు నిన్ను,*మంచి బాబాయ్* అంటూ మీ ఆయన్ని నమ్ముతారు.
మీ *భార్యాభర్తలు*  మా మేలు కోరే వాళ్ళు.నాకు మీ
మీద పూర్తి నమ్మకం ఉంది.నువ్వు వాళ్ళను ఒకసారి కదిలించి చూడు.వాళ్ళు సుముఖంగా ఉంటే వెళ్ళి మాట్లాడి నిశ్చయం చేసుకుందాం అన్నారు నాన్నగారు. *బావ మరదళ్ళు* మీరిద్దరూ సరేనంటే ఇక నాదేముంది ,మీ ఇష్టం అనేసింది అమ్మ.
అయితే నేను మాట్లాడటం బాగుండదు. మా *మామగారు*  నారాయణరావు గారిని పంపిస్తాను. ఆయన మాట్లాడతారు. ఏ సంగతీ మీకు ఫోన్ చేస్తాను అంటూ మా పిన్ని భోంచేసి వెళ్ళిపోయింది.ఇదంతా వింటున్న మా పనిమనిషి చిలకమ్మ అయితే త్వరలో మన *అబ్బాయిగారు అమ్మాయిగారు* *పెళ్ళి పీటలు* ఎక్కుతారన్నమాట.అమ్మగారూ!నాకు మీరు పట్టుచీర కొనాల్సిందే అంది .అలాగే లేవే!ముందు సంబంధాలు కుదరనీ.పట్టుచీరకేం భాగ్యం అన్నది అమ్మ.
అనుకున్నట్లుగానే
పిన్ని వాళ్ళ మామగారు వెళ్ళి మాట్లాడారు.*రావుగారి కుటుంబం* తో సంబంధమా!ఇంక‌ ఆలోచించేదేముంది అన్నారు రెండు కుటుంబాల వాళ్ళు.అక్కకి పిన్ని వాళ్ళ ఇంట్లోనే *పెళ్ళిచూపులు* ఏర్పాటు చేశారు.
అక్కా! నాకు *బావ నచ్చాడు* అని నేను అక్క చెవిలో గుసగుసలాడాను.
నాన్నగారు అక్క మొహంలో సంతోషం, సంశయం గమనించి  లోపలికి పిలిచి అమ్మా! ఆ అబ్బాయి  నీకు  నచ్చాడా! నిర్భయంగా చెప్పు.బలవంతం ఏమీ లేదు అన్నారు.నచ్చారు నాన్నా!కానీ....అంటూ అక్క గుమ్మం వైపు చూసి ఆగిపోయింది.అక్కడ పెళ్ళికొడుకు  ఉన్నాడు.తను నచ్చాడని తెలియగానే  అతని మొహం వెలిగిపోయింది.మీ సందేహం ఏమిటో చెప్పండి అన్నాడు మృదువుగా.ఏం లేదు.నేను నా చదువు పూర్తి చేయాలి.ఐ ఏ‌ యస్ కావాలన్నది నా ఆశయం.దీనికి మీరు ఒప్పుకుంటే..అంటూ అతని వైపు తలెత్తి చూసింది.  ఓ! దానికేం భాగ్యం! నిరభ్యంతరంగా చదువుకోండి.రేపు పొద్దున్న మీరు కలెక్టర్ అయితే నన్ను ఎవరైనా ఆవిడ ఎవరండీ!అని అడిగారనుకోండి,*ఆవిడా!మా ఆవిడే*
 *మా ఆవిడ కలెక్టర్* తెలుసా!అని అందరితోనూ గర్వంగా చెప్పుకుంటాను అన్నాడు చిలిపిగా నవ్వుతూ.
ఏమ్మా!ఇక నేను అబ్బాయిని *అల్లుడుగారు* అని పిలవచ్చా!అన్నారు నాన్నగారు పరిహాసంగా.పొండి నాన్నా అంటూ అక్క సిగ్గుపడిపోయింది.
ఇదంతా విన్న  పెళ్ళి కొడుకు తల్లి *అమ్మ నా కోడలా!* ఎంత *గడుసు అమ్మాయి* వే!  ఇంకా పెళ్ళి కాకుండానే  మా అబ్బాయిని కొంగున కట్టేసుకున్నావే!అంది మురిపెంగా కాబోయే కోడల్ని చూసుకుంటూ.అక్క వాళ్ళ మాటలకు సిగ్గు పడిపోయి తలవంచేసుకుంది.సంబంధం నిశ్చయం చేసుకున్నారు.కొద్దిరోజుల్లోనే మా అన్నయ్య కు కూడా పిన్ని చెప్పిన సంబంధమే కుదిరింది.
ఇరువైపులా అందరూ సంస్కారవంతులే కావడంతో *వియ్యాలవారి కయ్యాలు* తలెత్తకుండానే రెండు పెళ్ళిళ్ళు నిర్విఘ్నంగా,అంగరంగ వైభవంగా జరిగిపోయాయి.పెళ్ళిలో తమ్ముడు బావను ఆటపట్టిస్తుంటే,బావగారి చుట్టాలంతా  అక్కయ్యను *భలే తమ్ముడు* అమ్మాయ్ మీ వాడు. *బావ-బావమరిది* సరసాలు బాగున్నాయి అంటూ  ముచ్చటపడ్డారు. పెళ్ళి వేడుకలు ముగిశాయి.
*అక్క(తన)  మొగుడు* బావతో *అత్తారింటికి దారేది* అంటూ వెళ్ళిపోయింది.*కోడలుపిల్ల*  *గృహప్రవేశం* చేసి *కొడుకు కోడలు*  నట్టింట కళకళలాడుతూ తిరుగుతుంటే మా  అమ్మ మనసు సంతోషంతో నిండిపోయింది.
  శుభమ్ 

ఇంతకూ ఇంత కథ చెప్పిన నా పేరు చెప్పనేలేదు కదూ!
నా పేరు మిస్సమ్మ.
అదేంటి?అనుకుంటున్నారా!
అసలైతే నా పేరు సావిత్రి.కానీ మిస్సమ్మ సినిమాలో సావిత్రిలా కస్సుబుస్సులాడుతూ ఉంటానని, సావిత్రి గారి అభిమానినని నన్నందరూ మిస్సమ్మ అని అంటుంటారు.నాకు నచ్చుతుంది కూడానూ.మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేసుకోండి.😊

సింహాద్రి జ్యోతిర్మయి
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋




జనవరి 3 వ తేదీ 
National lady teachers day
మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నేను రాసిన కవిత

ఉత్త (మ) ఉపాధ్యాయురాలిని

మాతృదేవోభవ అన్నారని
ఎదిగిన పిల్లలను ఏదో సరిదిద్దబోయాను
నీకు తెలీదులే అమ్మా!
నువ్వూరుకో అనేశారు

ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారని
బడ్జెట్ లెక్కలేవో వేసి
బాధ్యతతో సలహా ఇవ్వబోయాను
నీ పాఠాలన్నీ
బడిలో మీ పిల్లలకు చెప్పుకో
అనేశారు ఆయన

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారని
నయానా నా తెలివిని వెలిగించబోయాను
కొంచెమైనా
మెప్పులేదు సరికదా!
కొంపలంటుకుంటాయి 
నీ మాటవింటే అని
నిష్టూరాలాడారు
అత్తమామలు

స్త్రీ లను గౌరవించడం
మన సంప్రదాయం
అని చాటుతున్నారు కదా అని
మర్యాద కోసం
మహా ఎదురుచూశాను
అయితే దొంగచూపు,వెకిలితనం
లేకుంటే
చిన్నచూపు, వేళాకోళం తో
గాయపరుస్తున్నది
 (అ) సభ్య సమాజం
ఆత్మన్యూనత తో
తల ఎత్తనివ్వని,
ఎటువంటి గుర్తింపుని ఇవ్వని
ఇన్ని బంధాలను
సమర్ధించుకుంటూ
అక్కడకు వెళ్ళి
ఆత్మవిశ్వాసంతో
తల ఎత్తుకొని
ఠీవిగా 
వారి ముందు నిలుచుంటాను
నేను తిడితే చిన్నబోయి
పొగిడితే పొంగిపోయి
నాకు తెలియనిదే లేదని
నేను చెప్పిందే వేదమని
వారి పుట్టిన రోజైతే చాక్లెట్స్ ఇచ్చి
మా టీచర్స్ డే కి కానుకలిచ్చి
వారి కష్టం ఇచ్చిన ప్రతి ఫలాన్ని
మా కృషి ఫలితమని భావించి
ఎదిగి వారు తెచ్చుకునే గుర్తింపుని
మేమిచ్చిన గుర్తింపని చాటించి
అంజలించి
ఆరాధించే
విద్యార్థులు ఉన్నంతకాలం
నేను ఎప్పటికీ
ఉత్త ఉపాధ్యాయురాలిని కాను
ఆ చిన్నారుల హృదయాలయాలలో
నేను 
కలకాలమూ
మిగిలిపోయే
ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలిని.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.1.2022
********************************************************


జాతీయ ఉపాధ్యాయినుల దినోత్సవం సందర్భంగా నా కవిత

అక్షరాలా పంతులమ్మ

అ..క్షరమాలలో
ఆ..ది అక్షరమై ఆది గురువై
ఇ..లవేల్పుగా మారి
ఈ..డు వచ్చు వరకు
ఉ..త్సంగమే బడిగ
ఊ..సులన్నీ నేర్పి
ఋ..జువు చేసి 
మాతృదేవోభవ అను సూక్తి
ౠ..( భయము) వలదు నేనుంటినని
ఎ..డబాయకుండ నిను
ఏ..మరక కాచుకొని
ఐ..వులన్నియు సైచి
ఒ..రవడులు దిద్దించి
ఓ..టమి గెలుపులన్
ఔ..దల ధరియించు ధైర్యమ్ము 
అం..కురింప జేయు పంతులమ్మయే
అః..(బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు)
ముమ్మూర్తులౌ అమ్మ.

ౠ ,అః తో మొదలయ్యే పదాలు తెలుగులో ఉండవు.
కనుక ఏకాక్షర నిఘంటువు నుండి అర్థాలు గ్రహించాను.

ఉత్సంగం అంటే ఒడి అని అర్థం.
ఈడు అంటే వయసు అని అర్థం కదా!
ఇక్కడ ఊహ తెలిసే వయసు అని నా భావం.
ఔదల‌ అంటే తల అని అర్థం.

ఐవు‌ అంటే తప్పు,దోషము అని అర్థం.

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

3.1.2019.
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..5
National Bird day


*పిట్ట మనసు*

మానవా!
నేనెవరో గుర్తుపట్టావా!
నేను నీ చిన్నారి నేస్తాన్ని
నీ చిన్ననాటి నేస్తాన్ని
ప్రాణసంకటంలో పడ్డావంటే
పలకరించి పోదామని
తగిన శాస్తి జరిగిందని
శపిస్తున్న నా వారిని వారించి
 ఈ కష్టకాలంలో నీకు
సహానుభూతి చూపి
నాలుగు మంచిమాటలు 
చెప్పి పోదామని
ఎగురుకుంటూ ఇలా వచ్చాను
సెల్ ఫోన్ టవర్
రేడియేషన్
అనే బ్రహ్మాస్త్రాన్ని 
నాపై ప్రయోగించి
నా జాతిని 
నామావశిష్టం చేశావు
తాడిని తన్నేవాడి
తలదన్నేవాడు 
ఉంటాడు అన్న
పెద్దలమాట
నీకు అనుభవంలోకి
వచ్చింది కదూ!
ఇప్పుడు కరోనా వైరస్ తో 
నీ కొచ్చిన కష్టం చూస్తుంటే 
మనుగడ కోసం
నా జాతి పడ్డ 
మూగవేదన
గుర్తుకొస్తోంది
అయినా నేను 
నిన్ను శపించను
నువ్వు ఈ విపత్తు నుండి
త్వరగా, క్షేమంగా
బయటపడాలనే
కోరుకుంటాను
ఎందుకంటే
ఉనికిని కాపాడుకోవడం లో
ఉన్న కష్టాన్ని
నేనూ అనుభవించాను కనుక.
ఓ!మనిషీ!
నాకివ్వు
గుప్పెడు గింజలు
గుక్కెడు నీళ్లు
నీవు
వర్ధిల్లాలని కోరుకుంటాం
వందేళ్ళు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋








ఈ రోజు జనవరి 9. 
NRI day

వ‌ తేదీ
ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా
ప్రవాస భారతీయులందరికీ
శుభాకాంక్షలతో
 నేను అమెరికాలో ఉంటున్న మా చిన్న తమ్ముడు‌ చిరంజీవి
సింహాద్రి కిరణ్ కోరికపై ఎప్పుడో రాసిన కవిత

మాతృ (సం) దేశం

మాతృదేశం మీద
మమకారమే లేక
ఎగిరివెళ్ళిపోయావని
ఎగతాళి చేస్తున్నారని
తప్పు చేసినట్లుగా నీవు
తలదించుకోకు
తల్లడిల్లిపోకు
ఆలకించరా కన్నా!
అమ్మ మనసు చెబుతున్నా

అమ్మపాలు తాగేబిడ్డ
అన్ని రుచులూ తెలిశాక
ఆ పాలు వద్దంటాడని తల్లి
అన్నప్రాశన మానేస్తుందా!

నడక నేర్చుకుంటున్న బిడ్డ
ఒడికి దూరమై పోతాడని
అడుగులు వేయనివ్వకుండా 
అమ్మ‌ అడ్డుపడుతుందా!

క్షణమైనా చూడకపోతే
ప్రాణమాగదని బెంగపడి
బడికి వెళ్ళనివ్వకుండా
బాల్యాన్ని చిదిమేస్తుందా!

ప్రేమిస్తే,పెళ్ళి చేసుకుంటే
పరాయి సొత్తు అయిపోతావని అసూయపడి అమ్మ‌ప్రేమ
బిడ్డ సుఖాన్ని
బలిపెడుతుందా!

అవకాశాల రెక్కలతో ఎగిరి
అమెరికాకు చేరుకొని
పేగు తెంచుకున్న బిడ్డ
పేరు తెచ్చుకుంటుంటే
అమ్మ మనసు నిండుగా
ఆశీర్వదించగలదే గానీ
అసహ్యించుకోగలదా!
 నీ అభివృద్ధికి తాను
ఆటంకం‌ అవగలదా!

విద్వాన్ సర్వత్ర పూజ్యతే
అన్న‌ సూక్తిని నిజం చేస్తూ
అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
అన్న గురజాడ మాటకు
సగర్వ‌ సాక్ష్యమవుతూ
విదేశాలలో విఖ్యాతులవుతున్న
బిడ్డలను చూసి తల్లి
మురిసిపోకుంటుందా!

నీ పాద స్పర్శ 
ఈ తల్లికి ఆనందమే గానీ
నీ పురోగతికి ఆటంకం
కాబోదు‌ ఎన్నడూ

అమ్మ ఒడిలో
 నేర్చుకున్న సంస్కారం
అమెరికాలో సైతం
మరచిపోకు
ఏ గడ్డపై జీవించినా
ఈ అమ్మ బిడ్డనని
మరువకు

అదే నాకు సంతోషం
అందుకో ఈ 
మాతృ సందేశం.

ఈ సందర్భంగా ఇటీవలనే
కృష్ణా జిల్లా కూచిపూడిలో
సిలికానాంధ్ర హాస్పిటల్ ని ప్రతిష్టాత్మకంగా సదాశయంతో ప్రారంభించిన ప్రవాసాంధ్రులందరికీ
హృదయపూర్వక అభినందనలు.
అందులో మా తమ్ముడు సింహాద్రి కిరణ్,
మా పెద్ద మేనకోడలు
సింహాద్రి స్నిగ్ధ కూడా
నిధుల సేకరణలో 
భాగస్వామ్యులు కావడం,
మేనకోడలు అత్యధికంగా నిధులు సేకరించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారాన్ని‌ పొందటం,
మా మరదలు
సింహాద్రి భార్గవి నర్సింగ్ లో స్టాఫ్ కి తర్ఫీదు నివ్వటం
నాకు సంతోషం

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.1.2019
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..10
World Hindi day



🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..11th to 17 th
national road safty week
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..11
Human trafficking awareness day
జనవరి 11
National human trafficking awareness day సందర్భంగా నా కవిత


*మోస(పోకు)మా!*


ఈ మురికికూపంలో
ఈ ఇరుకు గదిలో
మరకలుపడ్డ ఈ పరుపుని 
మంచి దుప్పటి కప్పి దాచినట్లు
తూట్లుపడ్డ నా మనసుని
తుంచిన గులాబీలాంటి దేహంలో దాచి
అతడెవరో తెలియని విటుడికోసం
అయిష్టంగానే
అభావంగానే
అనాసక్తితోనే
 ఎదురుచూస్తూ
వాల్చిన నా తలను
తనలోనికి అదుముకునే
తలగడకు మాత్రమే తెలుసు 
నేనెన్ని కన్నీటి బొట్లు
తనలోకి ఇంకించానో!
పరిమళాలు వెదజల్లే విరజాజి సుగంధాన్ని
ఆఘ్రాణించిన నాసిక
వాడి నలిగినపప్పుడు
వెలువరించే దుర్గంధాన్ని భరించలేనట్లుగా
నా ఉనికిని నేనే
భరించలేక పోతున్నాను
నా తప్పిదాలను నేనే సహించలేక పోతున్నాను
భారంగా కాలాన్ని తిప్పే
గోడమీది గడియారం,
మసకగా వెలుగుతున్న జీరో బల్బు,
రంగువెలసిన ఈ బొమ్మను
రంభలా చూపించే మేకప్ కిట్టు,
ఓరగా వేసిన తలుపు,
కర్టెను తెర మూసిన కిటికీ,
దండెంపై వేలాడే
నాలుగు ఉల్లిపొర చీరలు
ఇదేగా నా ప్రపంచం
ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది?
ఇప్పుడు ఎవరిని దీనికి బాధ్యులన్నా ఒరిగేదేముంది?
కులాసా పురుషుడైన తండ్రి
కుమిలిపోయే తల్లి
కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేసే కాపురాన్ని చూస్తూ
ఎదిగిన నేను
ఆ నరకం నుండి 
తప్పించే ఆస్తి
నా అందమే అని భ్రమపడటమే తప్పేమో!
ప్రేమికుడినంటూ చేరిన వాడి కళ్ళల్లో కప్పిన
కామం పొరలను గమనించనీయని
ప్రేమ మైకం కమ్మేసిన
నా
మనసుదే తప్పేమో!
ముద్దులు హద్దులుదాటుతున్నా
వివేకం హెచ్చరిస్తున్నా
అతనితోపాటూ
కెమేరా కన్ను కూడా నన్ను బంధిస్తోందని
గ్రహించలేకపోయిన 
నా వయసు మోహం తప్పేమో!
అసభ్యతను అందరిలో ప్రదర్శించి
అల్లరిపెడతానంటూ
అసహాయురాల్ని చేసి
అత్యాచారం చేస్తున్నా
పరువుపోతుందేమోనని భయపడి
జీవితాన్నే పోగొట్టుకున్న 
నా నిస్సహాయత తప్పేమో!
మోజు తీరిపోగానే
నోరులేని పశువును కబేళాకు తోలినట్లు
నా అందానికి,వయసుకి వెలకట్టి పుచ్చుకొని
నా ప్రమేయం లేకుండానే
ప్రాణం లేని
ఒక వస్తువులా
నన్ను అమ్మేసిన
ఆ కసాయి వాణ్ణి నమ్మటం
ఈ వెర్రి గొఱ్ఱె తప్పేమో!
స్వర్గానికి నిచ్చెనవేసి
ఉట్టికి కూడా ఎగరలేకపోయినా
చివరికిలా
ఊబిలో దిగబడిపోవడం
నా అత్యాశ తప్పేమో!
నా జీవితం 
నా చేతుల్లోంచి జారి
పదిమంది చేతుల్లో పడి
పతనం కావటం వెనుక
కారణాలేమైనా కానీ
ఆడదాన్ని
ఆటబొమ్మగా ఆడుకుని
అంగడిబొమ్మగా వాడుకొని
విసిరేసే వాళ్ళను
శిక్షార్హులుగా నిర్ణయించలేరా!
అసలు సాటి మనిషిని
అమ్మేసే హక్కు
కొనుక్కునే అధికారం
వీళ్ళకు ఎలా వచ్చింది?
ఎవరిచ్చారు?
సమాధానం లేని,రాని ఈ ప్రశ్నను 
నాకు నేను ఎన్నిసార్లు వేసుకున్నానో!
మా కడుపులైనా నింపని
ఈ పడుపు వృత్తి
మేమెవరికోసం చేయాలి?
మేము స్వైరిణులం అని లోకమంతా ఈసడించే
ఈ పంజరపు బ్రతుకులలో 
బలవంతంగా
మమ్మల్ని పట్టి, బంధించి ,హింసించి
మా రక్తమాంసాలతో ఈ వ్యాపారమేమిటి?
మా శరీరాలను
డబ్బుకోసం 
అమ్మేసే వారికి లేని శిక్ష
మా శరీరాలను మా
ఆకలికోసం అమ్ముకునే
మాకెందుకు?
న్యాయం ఎవరు చెప్తారు?
మాకు న్యాయం ఎవరు చేస్తారు?

దగాపడిన అభాగ్యులకు ఆర్తితో
అంకితం చేస్తూ...

సింహాద్రి జ్యోతిర్మయి


🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..12 
National youth day
వివేకానంద జయంతి


🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

జనవరి..15
Indian army day

అమరత్వం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఎన్నో మరణాల గురించి వింటుంటాను
ఆప్తులు
అనారోగ్య పీడితులు
అకృత్యాలకు గురిఅయినవారు
ఆత్మహత్యలకు పాల్పడిన వారు
ప్రమాదాల బారిన
 పడినవారు
ఉద్యమాలలో ఊపిరి విడిచిన వారు
ఏ మరణమైనా
అంతులేని దుఃఖాన్నిస్తుంది
అయ్యో పాపం
అనిపిస్తుంది
ఎంత ఘోరమని
బాధేస్తుంది
కానీ 
నీ మరణవార్త విన్న 
నా హృదయం లో
చెలరేగిన 
ఈ భావ పరంపర
అది ఉప్పొంగిన గర్వమా!
తెలియని ఉద్వేగమా!
కన్నుల్లో నీటి చెమ్మా!
గొంతుకు అడ్డం పడ్డ దుఃఖమా!
చెప్పలేను గానీ వీరుడా!
చేతులెత్తి మొక్కగలను
ఎవరి రక్షణ
వారు చూసుకుని
ఎవరి బాధ్యత
వారు నిర్వర్తించి
కరోనాను కట్టడి
చేయలేకపోతున్న
మాకోసం
దేశ రక్షణ ధ్యేయంగా
మా అందరి బాధ్యత
నీ భుజాలకెత్తుకుని
సరిహద్దుల్లో
సమరం సంభవించిన వేళ
వీరమరణం పొందిన
నీ కళ్ళల్లో
చివరిసారిగా
అమ్మ
ఆలుబిడ్డలు
ఆస్తులు
ఇవేవీ మెదిలిఉండవు
మాతృభూమి రుణం
తీర్చుకున్నాను
అన్న సంతృప్తి తప్ప
పోయిరా!అమరుడా!
దేశమాత పాదాలపై
పూజాపుష్పానివై
జారిపడ్డ 
నీ త్యాగ పరిమళం
ఈ మట్టిని అంటిపెట్టుకుని
గుబాళిస్తూనే ఉంటుంది
జాతి గుండెల్లో
చిరకాలం
గుర్తుండిపోతుంది

వీర జవానులారా!
మీకిదే మా 
కన్నీటి నివాళి...

జై జవాన్
జై భారత్

చైనా భారత్ సరిహద్దుల్లో
వీరమరణం పొందిన
అమరజవాన్లకు
అంకితం
ఈ అక్షరాంజలి.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

15.1.2022
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋


జనవరి ..11th to 17 th
National road safety week

రహదారు(ణా)లు.

నల్లని తారురోడ్డు
నరకానికి తెరచిన వాకిలి
సజావుగా సాగుతున్న
ప్రయాణంలో
బ్రతుకునావను కబళించే
మృత్యుకెరటం..ప్రమాదం
ఒక నిర్లక్ష్యం
ఒక ఏమరపాటు
ఒక కునికిపాటు
ఒక తొందరపాటు
ఒక బాధ్యతారాహిత్యం
కారణమేదైనా కానీ
అది 
సామూహిక మరణాల
శ్మశానవాటిక.
అక్కడ
రెప్పపాటులో
తలరాతలు
తారుమారవుతాయి
విధి విసిరిన
ఇనుప పంజాలో ఇరుక్కుని
ఆర్తనాదాలు
అంతిమ శ్వాసలు విడుస్తాయి

ఛిద్రమైన దేహాలు
రక్త,మాంస ఖండాల
భీతావహ దృశ్యాలు
అయినవారికి ఆచూకీ దొరకని
అనాథ ప్రేతాలు
జీవితం క్షణికమన్న సత్యాన్ని
నిరూపించే నిదర్శనాలు
అది మరుభూమికి మరో రూపం
ఆ శవాల సాక్షిగా
మాంగల్యాలు తెగిపడతాయి
ఆశల దీపాలు ఆరిపోతాయి
బాల్యాలు అనాథలవుతాయి
వృద్ధాప్యాలు జీవచ్ఛవాలవుతాయి.
అక్కడ 
ఏ వేదనా స్వరంవిన్నా
కలచివేసే కన్నీటి గాథలు
ఇన్ని గుండె కోతలనూ‌
తనలో ఇముడ్చుకున్న
ఈ రహదారి
సాగిపోయే వాహనాల పాదాలకు
మిగిలిన రక్తపు మరకలంటించి
మలినాన్ని కడిగేసుకుని
నల్లబడ్డ మొహంతో
మౌన సాక్ష్యంలా నిలుస్తుంది.

ఆప్తులను
జ్ఞాపకాల‌ అంపశయ్యపై
నిర్దాక్షిణ్యంగా విడిచి
మరణశాసనాలు రాసే
ఈ మధ్యంతర ముగింపులో
నేరమెవరిది?
శిక్షలెవరికి?

2012 ఆగష్టు లో కళామిత్ర ఒంగోలు వారు 



*కదంబ మాలిక*

ఆమె 
కనులెత్తి చూసింది 
కలువలు తోచాయి
చిరునవ్వు నవ్వింది 
మల్లెలు జారిపడ్డాయి 
 సిగ్గుపడింది 
మందారాలు పూచాయి
పెదవి కదిపింది
గులాబీలు  పలకరించాయి
చేసైగ చేసింది
చేమంతి రేకులు ఊగాయి
కదలి వచ్చింది
కనకాంబరం‌‌ మెదిలింది
 నిలబడింది
సన్నజాజి వయ్యారాలు పోయింది
అడుగులేసింది 
పద్మాలు పరచుకున్నాయి
మేనిఛాయ మెరిసింది
ముద్దబంతి మురిసింది
నడిచి వెళ్ళింది
పారిజాతం పరిమళించింది 
వెనక్కి తిరిగింది 
సంపంగి పలకరించింది
 వెళ్ళిపోయింది 
పూలవనం కనుమరుగయ్యింది




🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
 జనవరి.. 21
National hug day 




ఈ సందర్భంగా కౌగిలి అనే పదానికున్న(నాకు తెలిసిన) పర్యాయ పదాలతో
 నా కవిత

(కౌ) గిలిగింతలు

అమ్మ *ఆలింగనం* లో
అమృతత్వాన్ని 
ఆస్వాదించాను
నాన్న *పరిష్వంగం* లో
నిర్భయత్వాన్ని
అనుభూతి చెందాను
తోబుట్టువులను 
*హత్తు*కున్నప్పుడు
అనుబంధం లోని
ఆత్మీయతను
అనుభవించాను
ప్రాణవిభుని *పరిరంభణ* లో
వలపు పూతీవెనై
పరిమళించాను
పొత్తిళ్ళలో బిడ్డను
*పొదువుకున్న*వేళ
మాతృత్వపు మాధుర్యం లో
తలమునకలయ్యాను
ముద్దు మనుమల
*సంశ్లేష* సంరంభంలో
తనివితీరి
తన్మయమయ్యాను
ఆప్తమిత్రుల,
ఆత్మీయుల
*అభిషంగం* లో
పండి సంపూర్ణమైన 
ఈ జీవితం
ఇక పొందవలసిన 
ఆఖరి *ఆశ్లేషము* ఒక్కటే
అది మృత్యు దేవత *కౌగిలింత*
ఉర్విమాత *ఉపగుహనము*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.1.2021
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..23
Desh Premi Diwas

నేతాజీ జయంతి
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*ముద్దుబిడ్డలు*

ఆయుధాలు లేకుండా
పోరాటం సాధ్యమా!
అని ప్రశ్నిస్తే అవునంటుంది
బాపూజీ బోసినవ్వు

ఒక్కడి పేరే ప్రభుత్వాన్ని
ఒణికించుట శక్యమా!
అని ప్రశ్నిస్తే నిజమంటుంది
నేతాజీ కంటి ఎరుపు

స్వాతంత్ర్యం జన్మహక్కని
చాటేందుకు సిద్ధమా!
అని ప్రశ్నిస్తే గర్జిస్తుంది
లోకమాన్య తిలక్ గొంతు

ఆయుధాని కెదురుగా
నిలిచేందుకు ధైర్యమా!
అని ప్రశ్నిస్తే సై అంటుంది
ఆంద్రకేసరి తెగింపు

మన్నెంలో మహోద్యమం
సాధించుట సత్యమా!
అని ప్రశ్నిస్తే అడవంటుంది
అల్లూరిని ఎరగవా! అని

బానిస గుండెల కింతటి బలమా!
మమ్ము తరిమివేయగ తరమా!
అని ప్రశ్నిస్తూ అర్థరాత్రిలో
పరారయ్యింది పరాయిరాజ్యం

వీరుల త్యాగం ఏమిచ్చింది?
ప్రతి ఫలమంటూ ఏమొచ్చింది?
అని ప్రశ్నిస్తే ఇదిగోనంటూ
తెగిపడ్డ సంకెళ్ళు చూపుతూ
తెల్లవారింది ఆగష్టు పదిహేను

నిశిరాతిరి స్వాతంత్ర్యం
నిజమేనా !ఈ చిత్రం
అని ప్రశ్నిస్తే అవునవునంటూ
నింగికెగిరి నవ్వింది
మువ్వన్నెల భరతపతాకం

వీళ్ళంతా ఎవరని లోకం
విస్తుపోయి చూస్తూ ఉంటే
నా బిడ్డలు నమ్మండంటూ
గర్వంతో మురిసిందప్పుడు
భరతమాత చల్లని హృదయం

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
జనవరి..24
National girl child day
&
International day of education



............పాప (౦)..........

పసిపిల్లనని నన్నందరూ
పిలిచి ముద్దుచేస్తారని
అమ్మ మురిపెంగా చెప్తోందికానీ
నాకెందుకో ఆ మాట
నమ్మబుద్ధికావటం లేదు

తడిమి తడిమి ముద్దులాడే
పక్కింటి తాతగారి స్పర్శ

ఎదురింటి మామయ్య
నా మీద చేతులేస్తూ
చెవిలో చెప్పేమాటలు

ఆంటీ కంటపడకుండా
నన్ను హత్తుకునే
మేడమీది అంకుల్ నోటినుండి
వచ్చే ఘాటైన వాసన

సినిమా చూపిస్తా రమ్మని
తన రూముకి తీసుకెళ్ళి
ఏదేదో చేస్తున్న 
వెనకింటి అన్నయ్య
 వెర్రి చూపులు
నాకెందుకు బాగోలేవు!

అమ్మకెలా చెప్పాలో నాకు
అర్థం కావడంలేదుగానీ
ఇల్లు దాటి బయటకు అడుగుపెడితే
అడవిలో క్రూరమృగాల మధ్య
చిక్కుకున్న లేడికూనలా
అయిపోతున్నాను

చిదిమి దీపం పెట్టుకునేలా 
ఉన్నానని ఆంటీ అంటే
అంకుల్ నన్ను నిజంగానే 
చిదిమేస్తున్నారాంటీ
అని ఎందుకు చెప్పలేకపోతున్నాను?

వీళ్ళ స్పర్శ 
నాన్న స్పర్శలా
లేదమ్మా 
అంటే అమ్మ
నేను బిడియపడుతున్నానని
అనుకుంటుందే గానీ
భయపడుతున్నాననే
భావాన్ని 
నా కళ్ళలో
ఎందుకు చదవలేకపోతోంది?

అర్థం చేసుకునేవాళ్ళులేని
పంచుకోలేని
ఈ బాధను
భరించలేని
 నా మనసుకు మాత్రం
బలంగా అనిపిస్తోంది

పంచేంద్రియాలూ
మొద్దుబారి
పనిచేయడం మానేస్తే బాగుండునని

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.1.2019
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
January 24th
International day of education 


ఈ బాల్యం మాకొద్దు

బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న
బుజ్జి బుజ్జి పాదాలను
బూట్లు సాక్సులతో బంధించి
మోయలేని బరువును భుజాలకెత్తి
క్రిక్కిరిసిన ఆటోలో
ఉక్కిరిబిక్కిరి చేస్తూ
క్లాసురూములోనే 
ఖైదీలుగా మార్చేసి
గంటకొక్క టీచరొచ్చి
గంటకొట్టినట్లుగా
అర్థంకాని భాషలో
అనర్గళంగా 
చెప్పేసిపోతుంటే
చెయ్యలేనంత హోం వర్కుతో
వసివాడిపోతున్న
పసితనం మాకొద్దు

అమ్మ గోరుముద్దలకోసం
ఆరాటపడే ఆకలి
ఆయమ్మ సాయంతో
ఎంగిలిపడటం నేర్చుకుంటోంది
క్లాసులో టీచరు కన్నెర్రజేస్తే
కావలించుకుని ఓదార్చే 
అమ్మ దగ్గరలేక
బిక్కచచ్చిన మనసు
వెక్కిళ్ళుపడుతూ
కన్నీళ్ళు మింగింది

మాతృభాష మహానేరమైన
పాఠశాల పంజరంలో
ఆంగ్లభాష చిలకపలుకు
భావ ప్రకటన స్వేచ్ఛను 
బాల్యంనుండి హరించింది

ఆడుకోవటం అల్లరి చేయటం
కబుర్లు చెప్పటం కథలు వినటం
కాన్వెంట్   కల్చరు క్రమశిక్షణ మాటున
కల్లలుగా మారి
కలగా మిగిలింది
ఆటస్థలాలు లేని 
అంతస్థుల బడిలో
బాల్యాన్ని మూల్యంగా చెల్లించి
పొందబోయే భవిష్యత్తు
బంగారమైనా గానీ
అది మాకొద్దు
ఈ బాల్యం మాకొద్దు.

సింహాద్రి జ్యోతిర్మయి
నరసం ఉపాధ్యక్షురాలు.

జనవరి.25
National tourism day

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
 జనవరి 25
National voters day

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నా కవిత

........ఎన్నిక (ల) లు......

వస్త్రాలు ఎన్ను కొనేటప్పుడు
మన్నిక చూస్తాం

చదువును ఎన్నుకొనేటప్పుడు
ఎదుగుదలను చూస్తాం

వృత్తిని ఎన్నుకొనేటప్పుడు
ఆదాయం చూస్తాం

ఆహ్లాదాన్నిచ్చే
కళలను ఎన్నుకొనేటప్పుడు
అభిరుచిని చూస్తాం

ఆహారాన్ని ఎన్నుకొనేటప్పుడు
నోటి హితవు చూస్తాం

స్నేహితుల్ని ఎన్నుకొనేటప్పుడు
భావాల కలయిక చూస్తాం

జీవిత భాగస్వామిని
ఎన్నుకొనేటప్పుడు
మనసుల కలయిక చూస్తాం

మరి మన భవితను
శాసించి
దేశానికి గౌరవాన్ని ఆపాదించి
జాతిని ప్రగతిపథంలో
నడపవలసిన
నాయకుల్ని
ఎన్నుకొనేటప్పుడు మాత్రం

ఎందుకు నోటును చూస్తున్నాం?
ఎందుకు కులాన్ని చూస్తున్నాం?
ఎందుకు వారసత్వాన్ని చూస్తున్నాం?
ఎందుకు స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తున్నాం?
ఎందుకు ఉదాసీనత వహిస్తున్నాం?

నేతను ఎన్నుకోవడం
అనే హక్కు వెనుక
జాతికి చేయూతనిచ్చి
ప్రగతి బాటలో
నడపడమనే
 మహాబాధ్యత
నీ చూపుడువేలు చివర
ఉన్నదని విస్మరించకు

వేలెత్తి అవినీతి పరిపాలనను
ప్రశ్నించే ముందు
వేలు వంచి
నిజాయితీ పరులను
ఎన్నుకోవడమనే
 బాధ్యతను నిర్వర్తించు

బాలకృష్ణుని 
చిటికెన వేలు
గోవర్థనాన్నెత్తి
గోకులాన్ని రక్షించింది
అంబేద్కర్ చూపుడువేలు
జాతికి దిశానిర్దేశం చేసింది
భారతపౌరుడా!
నీ చూపుడువేలు
ప్రజాస్వామ్యాన్ని
నిలబెడుతుంది
ఒక్క క్షణం
దేశం నీ ఇల్లనుకో
నీవు ఇంటిపెద్దవనుకో
నీ బాధ్యత గుర్తొస్తుంది
దేశమాత గర్విస్తుంది

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.1.2021
********************


*(చ)ది(వి)న పత్రిక*

నువ్వు నా చిన్నప్పటి
 అద్భుతానివి 
నేను చూసిన
ప్రపంచానివి
ఉదయం నేను నిద్ర మేల్కొనే వేళకి
ఇంట్లో అమ్మ సుప్రభాతం 
రేడియోలో భక్తిగీతాలు
వాకిట్లో పేపర్ బోయ్ సైకిల్ బెల్లు నా
చెవులకు,కనులకు 
అలవాటైన అంశాలు

పెదవులు కాఫీ రుచిని ఆస్వాదిస్తుండగా 
కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తుండగా
వరండాలో కూర్చుని 
నిన్ను ఆసక్తితో
ఆసాంతం చదివే 
నాన్నగారి రూపం
ఇప్పటికీ మనసులోంచి చెరిగిపోనే లేదు 
అదేమిటో!
అంతలా అందులో ఏముందో !
అంతగా అర్థం కాకపోయినా 
స్వాతంత్ర్య పోరాట కాలంలో 
నీ ఉనికి చైతన్యం నింపిన వైనం
నాన్నగారి మాటల్లో విన్నాక 
నీమీద ఆరాధనా భావం కలిగింది 
సాహిత్య విద్యార్థినిని
అయ్యాక
వ్యవహారిక భాషకు
ఊతమిచ్చిన నీ పట్ల 
అభిమానం పెరిగింది 

నా జీవితంలో 
పదవ తరగతి పరీక్షా ఫలితాల రోజున 
తొలిసారిగా నీ విలువ నాకు తెలిసొచ్చింది 
నాలో సన్నని వణుకు
నాన్నగారి లోని కంగారు
అమ్మ మొహం లోని ఆతృత
అన్నిటికీ జవాబుగా
ప్రథమ శ్రేణిలో 
నా నెంబర్ని చూపించి
సంబరాన్ని తెచ్చిన నువ్వు 
సాక్షాత్తూ
వరమివ్వడానికి
వాకిట్లోకి వచ్చిన
 భగవత్స్వరూపమే అనిపించావు ఆనాడు
అంతగా అర్థంకాని 
ఇంగ్లీషు క్రికెట్ కామెంట్రీ రేడియోలో
వినడం కన్నా 
ఆఖరు పేజీలోని  క్రీడావార్తలను ఆసక్తిగా చదవటం 
విద్యార్థి దశలో నాకు
ఆనందాన్ని‌పంచిన అనుభవమే 
విజయవాడలో ఉన్నప్పుడు 
ఊళ్ళో 
ఏ థియేటర్ లో 
ఏ సినిమా ఆడుతుందోనని 
వెతుక్కుని వెళ్ళటం
నువ్విచ్చిన వెసులుబాటే 
వెధవ సినిమా వార్తలు కాదు
సంపాదకీయం చదవండి 
బాగుపడతారు 
అని మందలించే నాన్నగారి దృష్టిని తప్పించి 
సినిమా వార్తలు చదవడం అదో దొంగచాటు సరదాయే 

టీవీ అన్నదే తెలియని
మా కాలానికి 
దివిసీమ ఉప్పెన
భీతావహ దృశ్యాలు
ఇందిరాగాంధీ హత్యోదంతం వంటి
 వార్తలు
మనసును కలచివేసి 
కన్నీరు పెట్టించగా
కపిల్ సేన గెలుచుకున్న 
ప్రపంచకప్పు
ఎన్ టి ఆర్ చారిత్రక విజయం వంటి  విషయాలు 
అపురూపమై 
ఆనందబాష్పాలు నింపి 
సుఖదుఃఖాల మేలుకలయికే జీవితమన్న సత్యానికి
నిదర్శనాలయ్యాయి 

అప్పట్లో నీ ఖరీదు
పావలా,అర్థరూపాయే అయినా 
నీ విలువ మాత్రం 
ఇంతింతని చెప్పలేనిదైనా
 మరునాటికి మాత్రం
నీ మొహం చూసే వారే
లేక
జీవితం క్షణికమన్న 
వాస్తవానికి ప్రతీకలా 
అనిపించే దానివి
తదనంతరం
 అప్పుడప్పుడూ నువ్వు 
అమ్మకు
వంటింటి గూళ్ళల్లో వేసుకునేందుకు
బడులు తెరిచి కొత్త పుస్తకాలు కొన్నప్పుడు 
అట్టలు వేసుకోవడానికి 
ఏడాది మధ్యలో 
చిరుగుముఖం పట్టిన 
పుస్తకాలకు కొత్తకళ తేవడానికి 
వెచ్చాల కొట్లో సరుకుల పొట్లం కట్టటానికి 
బహు రూపాలను 
సంతరించుకునే నిన్ను
ఆర్నెల్లకో ఏడాదికో
అమ్మ పాత పేపర్ల వాడికి అమ్మేసేటప్పుడు 
ఎన్నో వార్తలను అందించిన నీ విలువ 
ఇప్పుడింతేనా!
ఇదేనా అనిపించేది
అప్పుడు కూడా నువ్వు 
ఏదో జీవిత సత్యాన్ని
సందేశంగా అందిస్తున్నావనే
భావం కలిగేది

నిష్పాక్షికత లోపించి
పార్టీకొక పత్రికగా 
నేడు నువ్వు మారిపోయినా 
అసత్యాలు
ఆరోపణలు
అకృత్యాలు 
ప్రమాదాలు
అభూత కల్పనలే
పతాక శీర్షికలుగా మార్చుకున్నా
అనేక మాధ్యమాల్లో
నువ్వు కూడా ఒకటిగా 
అయిపోయినా
నిన్నటి మా తరంలో మాత్రం 
నువ్వు 
పారదర్శకతకు
ప్రతిరూపానివి
నమ్మదగిన వార్తవి 
ఇంటింటి
నేస్తానివి

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.1.2025

జాతీయ వార్తాపత్రికా దినోత్సవం సందర్భంగా



🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

నేడు జనవరి 30 వ తేదీ


 గాంధీజీ వర్ధంతి ని

జాతీయ అమరవీరుల దినోత్సవం
 గా పాటిస్తున్న సందర్భంగా నా కవిత

పూజా పుష్పం

అతడు జన్మించిన రోజు
అంతర్జాతీయ
 అహింసా దినం

అతడు జాతి జాగృతికి
అడుగు కదిపిన రోజు
అది దండి సత్యాగ్రహం

అతడు
 జలియన్ వాలాబాగ్
దురంతానికి చలిస్తే
అది సహాయనిరాకరణం

చరఖా పట్టమని
చేనేత ధరించమని
అతడు సందేశమిస్తే
అది విదేశీ వస్తు బహిష్కరణ

ఉద్యమిద్దాం 
లేదా 
మరణిద్దాం 
అని అతడు పిలుపునిస్తే
అది క్విట్ ఇండియా మహోద్యమం

అతడు శాంతి అహింసల 
కవచాలు ధరించి
కదనానికి నడుం కడితే
అది స్వాతంత్ర్య సంగ్రామం

*హేరామ్* అంటూ అతడు
తూటాలకు 
నేలకొరిగిన రోజు 
జాతీయ అమరవీరుల
సంస్మరణ దినం

జాతినొక్కతాటిపై
నడిపిన నేత
అతడు జాతిపిత
భరత జాతి స్ఫూర్తికి ఆత్మ
అతడు మహాత్మ
మాతృదేశం కోసం
మహోన్నత త్యాగాలు చేసి
రాలిన ప్రతి ప్రాణాన్ని
భరతమాత పాదాలను 
అర్చించే
పూజాపుష్పంగా సంభావించే
ఈ పవిత్ర దినాన
అమరవీరులను 
సంస్మరిద్దాం
బోసినవ్వుల బాపూజీకి
నివాళులర్పిద్దాం

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.1.2021.

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲


   


🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
డిసెంబర్ 23 వ తేదీ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ..

కర్షక వీరుడు

మేం తినే
మెతుకు మెతుకులోనూ
నీ సంతకం
  నోటికి
 చేయి అందిన
ప్రతిసారీ
నీకు వందనం
దేశం నీకు
ఋణపడి ఉండటం పోయి
నిన్నే ఋణగ్రస్తుడిని
చేయటం దారుణం
మాటలతో కోటలు కట్టి
రాజువంటూ
ముళ్ళ కిరీటం నీ నెత్తిన పెట్టినా
మా వెన్నెముక వంటూ
పొగడ్తలతో ముంచెత్తి
నీ వెన్నెముక విరిచినా
కష్టాన్ని కడుపులోనే దాచుకుని
కాపాడే నాన్నలా
కొసరి కొసరి
గోరుముద్దలు తినిపించే అమ్మలా
మాకు పట్టెడన్నం
పెడుతున్న
ఓ రైతన్నా!
నీ మేలు మరువలేం
కర్షక వీరుడివంటూ
 మహాకవి  శ్రీ శ్రీ గారు
నీవు భారత క్ష్మాతలాత్మ పవిత్ర మూర్తివి
శూరమణివి
అంటూ కవికోకిల
 దువ్వూరి వారు
అక్షరబద్ధం చేసిన
నీ పోరాటమటిమ
అభినందనీయం
జవాను  అర్పించిన రక్తం 
 కిసాను చిందించిన స్వేదం
ఈ రెండే
మా బ్రతుకు
మా మెతుకు 
జై జవాన్
జై కిసాన్

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.12.2020












ఈ రోజు డిసెంబర్ నెల 15 వ తేదీ
ఇంటర్నేషనల్ టీ డే

సందర్భంగా నా కవిత

  ......తేనీరు.....

నిదుర‌పక్క మీదినుండి
లేస్తూనే నేను
నీకోసం ఎదురుచూస్తాను
ఉల్లాసపు ఉదయవేళ
నా పెదవిని తాకే
తొలి వేడి ముద్దువు నీవే

ఆఫీసుకి వెళ్ళబోయే ముందు
మళ్ళీ మరొక్కసారి
పొగల వగలు పోతూ
నా చేతికి అందుతావు
ఒదిలిపెట్టగలనా!
అందించిన మా ఆవిడను
ఆరాధనగా చూస్తూ
ఆస్వాదిస్తాను నిన్ను

 మనసెరిగి మసలుకునే
నా శ్రీమతి లా
అవసరానికి తగ్గట్లు
అల్లం,మిరియం,యాలుక
ఏదో ఒకటి కలుపుకుని
అలసట తీర్చటానికో ఉల్లాసపరచటానికో
ఎదుట ప్రత్యక్షమౌతావు

నిన్ను ఏ పేరుతో
ఇంటికి తెచ్చుకోవాలో
కొన్నిసార్లు నేను
తేల్చుకోలేను
చీరల షాపులో
ఏ చీర కొనుక్కోవాలో
ఎంచుకోలేక సతమతమయ్యే
నా శ్రీమతి లా

టీవీలో
రకరకాల ప్రకటనలు చూసి
ఏది బాగుంటుందో
తేల్చుకోలేక నేను
తబ్బిబ్బు పడుతుంటాను

ఆనందమయ సందర్భాలను
అతి తక్కువ ఖర్చుతో
అందరితో పంచుకుని
అభినందనలు
అందుకోవాలని ఆశించే
ఈ బడ్జెట్ బడుగు జీవికి
నీకన్నా నిజమైన
ఆపద్బాంధవి లేదు

నీ రూప వర్ణ చిత్రాలనేకం
ఒక్కోసారి
నా ఇల్లాలి అందాన్ని
ఇనుమడింపజేస్తూ
ఆమె ఒంటిపై మెరిసిపోయే
ఆభరణంలా
బంగారువన్నెతో
మెరిసిపోతూ

మరొక్కసారి
మా ఆవిడ 
ఏకరువు పెట్టే
కోర్కెల చిట్టాలా
మింగుడుపడని చేదవుతూ

ఇంకోసారి
ఒంటిలో పేరుకున్న
వ్యర్థాలను తొలగించ
అరస్పూను తేనెను
అరచెక్క నిమ్మరసాన్ని
జోడించుకుని
ప్రేమనిండిన
పెద్దల మందలింపులా
ఆరోగ్యానికి ఔషధమౌతూ
నన్ను చేరుతుంటావు

మెగాస్టార్ ని
గాయకుణ్ణి చేసిన
 నీ చరిత్ర
నిన్ను జీవనాధారంగా
చేసుకున్నవాణ్ణి
ప్రధాని సింహాసనమెక్కించిన
నీ ఘనత
మరెవ్వరికి దక్కుతుంది?

నేటి నా కవితా వస్తువువైన
ఓ తేనీరూ!
నీ కిదే నా జోహారు

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.12.2019


జాతీయ ఉపాధ్యాయినుల దినోత్సవం సందర్భంగా నా పాత కవిత

పంతులమ్మ ప్రపంచం

అదొక ఆలయం
అక్కడ గంటలు మోగుతుంటాయి
కాలాన్ని,కర్తవ్యాన్ని
గుర్తుచేస్తూ....
ఉదయాన్నే
ఉరుకులు పరుగులతో
అందులోకి అడుగుపెడతాను

నేను నడిచివెళ్ళే
ఆ దారంతా
నానాజాతి పువ్వుల
నవనవల కదంబవనం

నవ్వుతూ
 నమస్కారం పెట్టేవాళ్ళు,
నా ఉనికినే
గుర్తించని వాళ్ళు,
కుదురులేని కోతులు,
బెదురుచూపుల జింకలు,
ముద్దుపలుకుల చిలకలు,
గుక్కపట్టిన గువ్వలు
అడుగడుగునా
ఆ ప్రాంగణం
యూనిఫాం వేసుకున్న
అమాయక ప్రాణుల
అభయారణ్యం

బడిగంట వినగానే
బారులు తీరి
ముచ్చటగా చేరి
ప్రార్థన ముగిస్తారు

క్రమశిక్షణ తో కదిలే
చీమలదండులా
క్లాసురూములకు 
కదులుతారు కూడా

ఇక నా తరగతి గదిలోని
పిల్లలు
తలా ఒకరకం

అన్నీ నేర్చుకోవాలనే
ఆసక్తి ఉన్నవాళ్ళు,
ఏదీ బుర్రలోకి
ఎక్కించుకోనివాళ్ళు,
వినయంతో శ్రద్ధగా వినేవాళ్ళు,
భయం,భక్తి లేని బద్ధకస్తులు
ఇందరికీ నేను
ఇష్టంగానే  
పాఠం చెబుతాను

ఒకరి తెలివి
జలజల జారే జలపాతం
అంచున నిలబడి
ఆనందంతో
తడిసి ముద్దవుతుంటాను

ఒకరి మెదడు
జుట్టేలేని బట్టతల
అందులో నేను
అక్షరాల మొలకలు
అసలు మొలిపించనే లేను

ఒకరి చేతిరాత
గుచ్చి కూర్చిన
ముత్యాల సరాలు
మురిసిపోయి
ముచ్చటపడుతుంటాను

ఒకరి అక్షరాలు
పంటపొలంలో
నిర్లక్ష్యం గా
విసిరేసిన విత్తనాలు
సరిచేయలేక
సతమతమవుతుంటాను

ఆ పదవర్ణ దోషాల
పద్మవ్యూహం లో
చిక్కుకున్న
అభిమన్యుడి లాంటి నన్ను,
వినయంగా
చేతులు కట్టుకుని,
ఒదిగి పక్కనే నిలబడి
చూస్తుంటారు
చిద్విలాసంగా
సైంధవుల్లా...

వారు తమ
అక్షరదోషాలతో
నా ఉచ్చారణ
చాలా స్పష్టమని 
విర్రవీగే
నా గర్వం సర్వం
 ఖర్వం చేసేస్తుంటారు

వాళ్ళు అల్లరి ఆకాశంలో
నవ్వుల నక్షత్రాలు
హాయి గాలిలో ఎగిరే
స్వేచ్ఛా విహంగాలు
స్వచ్ఛమైన సంతోషాల
సప్తవర్ణాల హరివిల్లులు
వెళ్ళిపోయిన నా బాల్యాన్ని
జ్ఞాపకాల మబ్బులుగా
కళ్ళల్లో నింపి
ఆనంద బాష్పాలుగా
మార్చే వాన చినుకులు

నా ఆశ ,ధ్యాస,శ్వాస
అన్నీ వారి చుట్టూనే
తిరుగుతుంటాయి

వారి ఆట,మాట,పాట
అల్లరి,అతి తెలివి
అబద్ధాలు,అద్భుతాలు
గొడవలు,గొప్పలు
విజయాలు,వింత చేష్టలు
సాహసాలు, సమయస్ఫూర్తి
సరదాలు,సంబరాలు
అన్నీ మమ్మల్ని
అలరించే వార్తలై
స్టాఫ్ రూములో
సందడి నింపి
సరదాల పందిరి అల్లుతాయి

వారి 
చదువుగురించి ఆలోచిస్తూ,
మార్కుల గురించి 
మధనపడుతూ,
ప్రవర్తన గురించి
పరితపిస్తూ,
భవిష్యత్తు గురించి
భావన చేస్తూ
తల్లిదండ్రుల బాధ్యతను కూడా
తలకెత్తుకునే నేను,
ప్రపంచ పుస్తకాన్ని
పాఠాలుగా 
పరిచయం చేసి,
బ్రతుకు పరీక్షను గెలిచే
భరోసానిచ్చి,
పంపించిన నా శ్రమ
ఫలించిన వేళ,
ఎదిగిన ఆ చిన్నారులు
ఎక్కి వెళ్ళిన నిచ్చెన
నేనేనని గర్వంగా
పరవశించి పోయే
పంతులమ్మని.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
 టీచర్ @OPS

3.1.2020


*******************************************************                    .  





*****************************



*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
నా కవిత

🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
🎶.                                    🎶
🎶     🌺ప్రతీకారం🌺          🎶
🎶                                      🎶
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

ఈ సృష్టి లోని
ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో
అన్ని ప్రాణులనూ
తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ
ఏ ప్రాణికీ ఉపయోగపడని
ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే
అని అన్ని ప్రాణులూ 
తెలుసుకున్నాయి
అత్యవసరంగా
జంతువులన్నీ సమావేశమయ్యాయి
చర్చలు సాగించాయి
కొన్ని‌ జంతువులు
 పోనీలే 
వాళ్ళ పాపాన వాళ్ళే
పోతారన్నాయి
కొన్ని ఆ మాటను ఖండించాయి
మానవజాతిని
నాశనం చేస్తామంటూ
ప్రతినచేసి బయలుదేరాయి

ఆఫ్రికన్ గొరిల్లా ఎయిడ్స్ తో
పంది మెదడువాపు వ్యాధి తో
కోడి బర్డ్ ఫ్లూ తో
దోమ డెంగ్యూతో
కుక్క రాబీస్ తో
ఈగ కలరాతో
గబ్బిలాలు నిపాతో
 పగ తీర్చుకోవడానికి
ప్రయత్నం సాగించాయి
అసాధారణ మేధ ఉన్న 
మానవుడు
ఈ సాధారణ ప్రాణులు
నన్నేం చేస్తాయిలే అని
ధీమాగా ఉన్నాడు
అదరని
బెదరని
అతగాణ్ణి చూసి
ఇలా లాభం లేదని తలచి
ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే అనుకుంటా
  ఈ కరోనా
కోట్లాదిగా జబ్బు పడుతూ
లక్షలాదిగా మరణిస్తూ
సాటి మనిషిని చూసి బెదిరిపోతూ
కోవిదుణ్ణని విర్రవీగిన వాడు
కోవిద్ ని చూసి ఒణికిపోతూ
నలుగురితో కలవలేక
నాలుగు గోడల మధ్య
తనను తాను బంధించుకుంటూ
ప్రాణభయంతో
విలవిలలాడుతున్న
వైనం చూసి
అన్ని ప్రాణులూ ఇప్పుడు
అయ్యో పాపం అంటున్నాయి
ఔను !అవి మనలా
దయమాలినవి కావు గదా!
కాస్త తేరుకోగానే
శాంతించిన ప్రకృతి
సందేశమిస్తోందిలా!
మానవుడా!
ఇప్పటికైనా మేలుకో
ఆత్మవత్ సర్వ భూతాని
అన్న ఆర్యోక్తిని గుర్తు చేసుకో
భూతదయను అలవరచుకో
నీ జాతిని రక్షించుకో

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.7.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

..............World chocolate day...............

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

   ‌    ‌‌   🎶తీపి కబురు🎶

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

అందాల ఓ నేస్తమా!
అందరి ప్రియ నేస్తమా!

పసి కళ్ళన్నీ నిన్ను చూడగానే
పరమ సంతోషం తో మెరిసిపోతాయి
కలిగినింటి ముద్దు పాపల చేతులు
నిన్ను జేబులనిండా నింపుకుంటాయి
పేదరికపు చిట్టి పెదవులు
ఆశతో లొట్టలు వేసుకుంటాయి
ఉల్లాసం కోరే పెద్దవారు కూడా
అప్పుడప్పుడూ నిన్ను 
చప్పరించేస్తుంటారు
మాయరోగం మధుమేహం 
పీడిస్తున్న వారు మాత్రం
నిన్ను స్వీకరించలేక 
నిట్టూరుస్తుంటారు
పుట్టిన రోజు నాడు
నిన్ను పంచుకోవడమే
చిన్నారులకు అసలైన పండుగ
పళ్ళూడిన ముసలివాళ్ళ
బోసినోటికి నీవే తీయని వేడుక
నీవు శుభానికి,సంతోషానికి
సంకేతంగా మారిపోయావు
నేటి ఆధునిక‌ జీవితంలో
భాగంగా చేరిపోయావు
చిల్లర తన దగ్గర లేదంటూ
షాపువాడు 
మా అనుమతి లేకుండానే
నిన్ను మా చేతుల్లో పెట్టేస్తాడు
కాదనలేని కానుక సుమా!
అన్నట్టు చూస్తాడు
ముదురు వన్నెలోని నిన్ను
ముద్దొచ్చే బుజ్జి పాపలు
మూతినిండా పూసుకుని
నవ్వుతుంటే చూసి
మురిసిపోని హృదయముంటుందా!
రంగురంగు కాగితపు వస్త్రాలు ధరించి
రకరకాల తీపి రుచులు నించి
చిన్నా పెద్దల మనసులు దోచే
 ఓ చిన్నారి చాక్లెట్ నేస్తమా!
ఈ ప్రపంచ చాక్లెట్ దినోత్సవ
శుభాకాంక్షలు అందుకోమ్మా

సింహాద్రి జ్యోతిర్మయి
7.7.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

....................183 +183. = 366........................
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

     ‌ 🦋🦋చెరిసగం 🦋 🦋

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

పగలు రేలుగా సృష్టి ని
చెరిసగము పాలించ
నింగి వెలుగు సూర్యుని
అరుణ కాంతులు
ఆవలి మోములు
అవని యందు సగము

వచ్చీపోయే
కలిమిలేములు ,కష్టసుఖాల్లా
పెరిగి తరిగే చంద్ర కళల్లో
కృష్ణ శుక్ల పక్షాల రేలు సగము

ఆలుమగలలోన ఆధిక్యమెవరికీ
ఉండరాదు సుమ్ము
వారిరువురూ సమము
అని చాటగా కలసి
అర్థనారీశ్వరులై వెలసి
అలరు ఆది దంపతుల మేను సగము

ఆడపిల్ల పెళ్ళిలోన
అప్పగింతల సమయాన
కన్నీటి ధారలు
ఆనందబాష్పాలు
కలగలసి ఉప్పొంగు
కన్నవారి హృదయమందు
సంతోష దుఃఖాల పొంగు సగము

షష్టి పూర్తి సంబరాన
నిండైన దంపతుల
అనుభవాలతో పండిన
తలలోని కురులకు
పెద్దరికము తెచ్చిపెట్టు
నలుపు తెలుపు సగము

ప్రతి రెండు సగాలూ
కలిస్తేనే పూర్ణత్వం
రెండు నూట ఎనభై మూడులు కలిస్తేనే
ఒక పూర్తి సంవత్సరం

సింహాద్రి జ్యోతిర్మయి
3.7.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

 🌾  🎶🎶కంటి చలవ🎶  🌾

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

చలువ కళ్ళద్దాలు
ఎండలో చల్లదనాన్ని ఇచ్చి
ముఖానికి
అందాన్ని
ఆధునికతను
అద్దడమే కాదు

మనసు మండి
కోపంతో
కళ్ళు ఎర్రబడినా
మనసు కరిగి
దుఃఖంతో
కళ్ళల్లో
కన్నీటి పొర కప్పినా
పెదవులపై
నవ్వు పూత పూసి
మనం
సహనంతోనే ఉన్నట్లు
సంతోషంగానే ఉన్నట్లు
లోకాన్ని
మభ్యపెట్టి
అంతరంగపు అలజడికి
నల్లని తెర వేసే
నేస్తం కదూ!

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.6.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

      🌺నాన్న లేడు నాకు🌺

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
అదేంటి?
నాన్న లేకుండా నేనెలా పుట్టాను
అని అడగకండి
నీకు నాన్న లేడుగా!
నువ్వు ఫాదర్స్ డే విషెస్ ఎవరికి చెప్తావు?
అని స్నేహితులు
నా వైపు జాలిగా చూశారు
ఆ మాటే అమ్మనడిగితే
నన్ను కౌగలించుకొని
కళ్ళనీళ్ళు పెట్టుకుంది
నన్ను అమ్మ కడుపులో పడేసి
అమ్మను మోసం చేసి
నన్ను ఒక తండ్రి పేరు తెలియని వాడిగా 
సమాజంలో నిలబెట్టిన
 ఆ నాన్న
ఇంకెక్కడో
ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందుకుంటూ...
ఇంకెవరికో
నాన్న ప్రేమను 
నిండుగా పంచిపెడుతూ...
నాన్న నా హీరో
అని నమ్మే
ఏ అమాయకపు బాల్యాన్నో మోసం చేస్తూ...
నాలాంటి పిల్లల్ని కనిపారేసిన
అలాంటి నాన్నలారా!
ఫాదర్స్ డే శుభాకాంక్షలు
అందుకుంటూ
ఒక్కసారి మీ భుజాలు తడుముకోండి

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.6.2020


*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

‌       నాన్నతో నా బంధం

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


ఏమని చెప్పను? నాన్నతో నా బంధం.
అది జ్ఞాపకాల అలలుగా ఎగసిపడే సాగరం

కోరినవన్నీ ఇచ్చే అమ్మానాన్నలు
చాలామందికి ఉంటారు
కోరుకున్నవాడిని 
ఆనందంగా ఇచ్చే
నాన్నలు ఎంతమందికి ఉంటారు?
కులం పట్టింపు లేకుండా
పరువుతక్కువ అని భావించకుండా
లోకాన్ని లెక్కచేయకుండా
అంగరంగవైభవంగా
నా వివాహం జరిపించి
ఆనందకరమైన జీవితాన్ని
వెలలేని కానుకగా నాకిచ్చిన
నాన్న సంస్కారం ఏమనిచెప్పను?

ఆడపిల్లలకు
అంతంతచదువులెందుకు?
అని అందరూ అంటున్న
ఆ రోజుల్లోనే
నాకు ఉన్నతవిద్యను
నేర్పించిన నాన్న వ్యక్తిత్వం ఏమని చెప్పను?

వీళ్ళు మంచివాళ్ళు కాదు
అని ఏనాడూ ఎవరిగురించీ
ఒక్క మాటైనా చెప్పని
నాన్న సహృదయం గురించి
 ఏమని చెప్పను?

అమ్మను క్షణం విడిచి ఉండని నాన్న
అమ్మ చనిపోయి మేము తల్లడిల్లుతుంటే
మీకు నేనున్నానమ్మా!అంటూ 
మా కోసం జీవిస్తూ
మీ అమ్మ చనిపోయి
ఇవాల్టికి ఇన్ని రోజులయింది
అంటూ రోజులు లెక్కబెట్టుకుంటూ
కాలం వెళ్ళదీసిన నాన్న ప్రేమను
ఏమని చెప్పను?

కడుపుతో ఉన్న కోడలికి
కన్న కూతురికిలాగా సేవలు చేసిన
ఆయన అభిమానాన్ని ఏమని చెప్పను?

నా చిన్నతనంలో
 మేము డల్లాలో ఉన్నప్పుడు
నేను అన్నం తినకపోతే
సర్దార్జీలకు ఇచ్చేస్తానని 
అమ్మ నన్ను భయపెడుతుంటే
అక్కున చేర్చుకుని
అభయమిచ్చిన నాన్న
కేన్సర్ వ్యాధి తో
కొద్ది రోజుల్లోనే 
దూరమవబోతున్నారన్న
వార్త తెలిసి
బాధను భరించలేని
ఆయన కష్టం చూసి
దేవుడా!నాన్నను  త్వరగా తీసుకుపో
అని నిస్సహాయంగా
దేవుడికి మొరపెట్టుకున్న
మా మనోవ్యధను ఏమని చెప్పను?

పెద్దతమ్ముడు గోదానం చేయగా
అమెరికా నుండి వచ్చిన చిన్నతమ్ముడు
అనుక్షణం సేవలు చేస్తూ
నాన్నగారండీ! ఈ ఇంజక్షన్ చేస్తాను 
నొప్పితగ్గిపోతుంది ,బజ్జోండేం
అంటూ లాలిస్తుండగా

ఏ రూపంబున వ్యాధి గెల్తు....
ఎవ్వరడ్డమిక ఇవ్వ్యాధి ప్రసారోద్ధతిన్ 
వారింపదగు వారలెవ్వరంటూ
నేను గజేంద్రమోక్షం వినిపిస్తుండగా
పెద్దతమ్ముడి ఒళ్ళోనే
తుదిశ్వాస విడిచిన
నాన్న నిష్క్రమణం గురించి
ఏమని చెప్పను?

నాన్న నా హీరో
అన్నది
మాటవరసకు చెప్పే మాటకాదు
నేను మనస్ఫూర్తిగా అంటున్న మాట.
నాన్నగారూ!
మీ బిడ్డలమైనందుకు గర్విస్తూ
సమర్పిస్తున్న
నా జ్ఞాపకాల నివాళిని
ఈ ఫాదర్స్ డే నాడు 
అందుకుని
మమ్మల్ని ఆశీర్వదించండి.

సింహాద్రి వీరభద్రాచారిగారి అమ్మాయి

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.6.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

.నేడు జూన్ 14
రక్తదాతల దినోత్సవం సందర్భంగా
రక్తదానం పై
నా అనుభవాలు
నా భావాలు మీతో పంచుకోవాలని....

నేను నర్సరావుపేట లోని PNC &KR డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు మా కాలేజీలో NSS జాతీయ సేవా పథకం బాలికల విభాగానికి నేను ప్రోగ్రాం ఆఫీసర్ ని.మాది మూడవ యూనిట్.తక్కిన రెండు బాలుర విభాగాలకి నా కొలీగ్స్ ప్రభాకర్,గురుకిషన్ ఆఫీసర్లు.మేము ఎంతో ఉత్సాహంగా విద్యార్థులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం.ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి,రక్తదాన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించి,
వారిచేత రక్తదానం రక్తదానం చేయించేవాళ్ళం.
నేను కూడా PG విద్యార్థి గా ఉన్నప్పటినుండి రక్తదానం చేశాను.కొన్నిసార్లు మా సిటీ కేబుల్ లో రోగికి రక్తం కావాలన్న అభ్యర్థన చూసి, నేను స్వయంగా ఆసుపత్రి కి వెళ్ళి రక్తదానం చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఈ బీపీ, షుగర్ వంటి వ్యాధులతో రక్తదానం చేసే అవకాశం లేక చాలా బాధగా ఉంటుంది.ఏదేమైనా నేను సైతం ఈ మహత్తరమైన సేవలో కొంత భాగస్వామిని
ఐనందుకు సంతోషిస్తూ...

నేను ఎప్పుడో రక్తదానం మీద రాసిన
నా కవిత

🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

    ‌.     రక్తసంబంధం

🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

తల్లి
తన రక్తాన్ని పంచి
నీకు జన్మనిచ్చింది

తన రక్తాన్ని పాలుగా మార్చి
నీకు స్తన్యమిచ్చింది

తండ్రి
తన రక్తం ధారపోసి
నిన్ను పెంచి పెద్దజేశాడు

రైతు
తన రక్తాన్ని 
చెమటచుక్కలుగా మార్చి
నీకు అన్నం పెడుతున్నాడు

దేశభక్తులు
తమ రక్తాన్ని చిందించి
నీకు స్వాతంత్ర్య ఫలాన్ని అందించారు

వీర సైనికులు
తమ చివరి రక్తపు బొట్టువరకు
దేశమాతను రక్షించడానికి పోరాడుతున్నారు

ఇందరి రక్తబంధం
నిన్ను కాపాడుతుండగా
ఎదుటి వాడి రక్తాన్ని కళ్ళ జూడాలనే
కాఠిన్యం నీకెందుకు?

రక్తపుటేరులు పారించిన అశోకుడే
బాధాతప్త హృదయుడై
బౌద్ధాన్ని స్వీకరించలేదా!

రక్తమంటే
స్వార్థ త్యాగం
రక్తమంటే
రక్షించే బంధం

రక్తపు విలువను గుర్తించు
రక్తదానంచేసి గర్వించు

సింహాద్రి జ్యోతిర్మయి
14.6.2018

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

        పర్యావ (మ)రణం

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

ప్ర.....కృతి పరమాత్ముడిచ్చిన వరం
పం.....చ భూతాలు ప్రాణికోటికి జీవాధారం
చ.......రాచరాలు సృష్టి వైవిధ్యానికి నిదర్శనం

ప....... చ్చని చెట్టుకు మానవుడు పగవాడై, ప
ర్యా....వరణాన్ని పాడుచేస్తూ...
వ.....నాలను నిర్మూలిస్తూ...
ర....క్షించ వలసిన మూగ జీవులకు మర
ణ....శాసనాలు రాస్తుంటే ,
             సముద్రాలు సునామీలై

ది......నకరుడు అగ్ని గుండమై,గగ
నో.....పరితల ఓజోను ఛిద్రమై ,వా
త్స.....ల్యంతో వహించే భూమి 
            ‌  కాలుష్యపు కాసారమై, జీ
వం.....నింపే గాలి విషతుల్యమై
            ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది

ఓ మానవుడా!
ఇప్పటికైనా మేలుకో
ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో
చిన్న మొక్కను నాటి పెంచు
మూగజీవాలకు గుక్కెడు నీళ్ళివ్వు
అన్ని ప్రాణులనూ బ్రతకనివ్వు
వాటికోసం కాదు
నీ మేలు కోసమే
ధర్మో రక్షతి రక్షితః   
ఎలాగూ విస్మరించావు
కనీసం
వృక్షో రక్షతి రక్షితః
అన్న ఆధునిక నినాదాన్నైనా పాటించు
ప్రపంచాన్ని కాపాడు
నీవు అశాశ్వతమైనా
నీ చేత శాశ్వతం 
నీ కుటుంబం
పదితరాలు బాగుండాలని కోరుకుని 
కూడబెట్టుకునే నువ్వు
ఈ భూగోళం
ప్రాణికోటికి 
తరతరాలకు
ఆధారమని 
గుర్తించు ,రక్షించు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.6.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************
June 2 international whores day (or)
International sex workers day సందర్భంగా చాలా కాలానికి నేను రాసిన కొత్త కవిత

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

        గాయాల చెట్టు

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

ఏ పూల పొదరింటి దీపమో
ఏ తల్లి తెలియక చేసిన  పాపమో
ఏ తొలి ప్రేమ చేసిన మోసమో
ఏ మూఢ విశ్వాసాల దోసమో
నేను కళ్ళు తెరిచేసరికి
ఈ వాడలో మంకెనపువ్వై విచ్చుకున్నాను
నా ఆశల చిగుళ్ళు గిల్లి
నా నవ్వుల పువ్వులు నలిపి
నా సున్నితత్వపు పిందెల్ని కొరికి
నా కలల కొమ్మలు నరికి
నా భావ వసంతాలు మండించి
వెలలేని నా మనసుని చూడక
వెలకట్టి నా తనువును చూసి
వెలయాలుగా నన్ను మార్చి
వాడుకుంటున్న ఈ వాడలో
పచ్చనోట్లు పండించిన ఈ 
అందమైన శవానికి
చిల్లర మాత్రమే చిక్కుతుంటుంది
 తన 
చెల్లి, తల్లి,భార్య, ప్రియురాలు
ఇన్ని బంధాలను
కాపలా కుక్కలా కాపాడే ఆ మగాడు
నా జీవితపు విస్తరిని
చింపే కుక్కల్లో
తానూ ఒకడవడం
నాకెప్పుడూ ఆశ్చర్యమే
పాదచారుల నుండి
పడవంత కారుల దాకా
నిత్యమూ వస్తూ పోతూ ఉండే
నా శరీరమనే
తారురోడ్డుపై
ఎన్నెన్ని అకృత్యాల యాక్సిడెంట్ల 
మరకలు అంటుతుంటాయో లెక్కేలేదు
ఆ రక్త స్రావాల గుర్తుల్ని కడిగేసుకుని
మళ్ళీ మరొక దాష్టీకానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటుంటాను
ఉప్పెనలా ఉరికే
ఉప్పు నీటి సముద్రాలలో
వేసుకున్న వేషం
వెలిసిపోతుందేమోనని
ఎగసిపడే
అసహనపు అలల్ని
లోలోపలే ముడుచుకుని
కనురెప్పల చెలియలికట్టను మూసి ఉంచుతుంటాను

చెరకు రసం మరలో
చెరకుగడలా
నాలోని రసమంతా పిండి పిప్పి చేశాక
ఆ బండికిందకి నన్ను విసిరేస్తే
రోగాల ఈగలు ముసురుకుంటున్న నన్ను
మున్సిపాలిటీ చెత్తబండి మోసుకుపోతుంది
క్షుద్ర పూజలో
బలవంతంగా
బలిపశువునైన 
నాపై ఒక కన్నీటిబొట్టయినా రాల్చే కళ్ళుండవు
గంధపు చెట్టులా
విలువకట్టి 
కావలసినంత నరుక్కుంటూ
సమూలంగా కూల్చి వేయబడి
ఆడుకోవడానికే తప్ప
ఆదుకోవడానికి నోచుకోని
ఈ గాయాల చెట్టుకు
ప్రాణం ఉంటుందని
గుర్తించే 
జగదీశ్ చంద్రబోస్ వంటి
శాస్త్ర వేత్త 
ఎప్పటికి పుడతాడో!

కమలహాసన్ మహానది సినిమా చూసి వారం రోజుల పాటు కలతనిద్రతో కలవరపడిన నాటి నా హృదయాన్ని నేటికి ఆవిష్కరించే సందర్భంగా భావించి
దగాపడి వేశ్యావాటికల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్న 
ఆడపిల్లలకు అంకితం చేస్తూ

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.6.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

కరోనా కష్టకాలంలో మరణశయ్యపై ఉన్న మానవాళిని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తోన్న వైద్య నారాయణులకు నమస్సులతో ఈ కవితను అంకితం చేస్తున్నాను.

వైద్య నారాయణులకు నమస్సులతో

డాక్టర్స్ డే సందర్భంగా నేను రాసిన కవిత,దానికి ఆంగ్ల అనువాదంతో వారి పురస్కాలకు సన్మానపత్రాల జ్ఞాపికలు తయారుచేయించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గొప్ప పనిలో నన్ను కూడా భాగస్వామిని చేసిన చిరంజీవి బొగ్గవరపు మాల్యాద్రికి కృతజ్ఞతలు మరియు శుభాశీస్సులు. నా కవితను అనువాదం చేసిన పెద్దలు 93  ఏళ్ళ వృద్ధులు శ్రీ రాచకొండ నరసింహశర్మ గారికి శిరసా వినయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🍀.                                  ‌‌  🍀
        వైద్య నారాయణులు
🍀.                              ‌.      🍀
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

వారంతా  
ఆసుపత్రి కొలనుల్లో
ఠీవిగా విహరించే
తెల్లని రాజహంసలు

అపమృత్యు భయాన్ని
జయించే భరోసానిచ్చే
నారాయణ స్వరూపులు

వ్యాధి,బాధ ,శోకమనే
కలుపును పెకలించి
జీవితమనే పంటను
కాపాడే కర్షకులు

సమయ నిబంధనలను
స్వసుఖాల ప్రాధాన్యతలను
సడలించుకుని
ఆర్తులను రక్షించడానికి
అన్నివేళలా సమాయత్తమయ్యే
అపర హరి అవతారాలు

మనిషి ప్రాణాలకి
యమదూతలకి మధ్య సాగే
నిత్య పోరాటంలో
వైద్యమనే శస్త్రాన్ని
అభిమంత్రించి విడిచి
మృత్యు దేవతను గెలిచి
ఆయువును పోసే
అమృతపాణులు

పన్నగహారుడైన
అర్థనారీశ్వరుని‌ అండనున్న
మార్కండేయుని ప్రాణాలను
హరించలేకపోయిన యమపాశం
స్టెతస్కోపు హారధారులై
రోగ నిర్థారణ, శస్త్రచికిత్స లనే
అర్థనారీశ్వరతత్వం గలిగిన
మీ అండనున్న రోగుల ప్రాణాలను‍
హరించటం కూడా అసాధ్యమే సుమా!

సావిత్రి సాహసం
యమ ధర్మరాజు పట్టుకుపోతున్న
పతి ప్రాణాలను తిరిగి సాధించినట్లుగా
మీ వృత్తి నైపుణ్యం
మృత్యుముఖంలో నున్న రోగికి
పునర్జన్మ ను ప్రసాదించగలదు

ఓ ధన్వంతరి వారసులారా!
బుద్ధదేవుని దయను
భూదేవి సహనాన్ని
కులమతాలకు,
ధనిక ,పేద తారతమ్యాలకు
అతీతమైన సేవాభావాన్ని
స్వభావంగా కలిగిన
మీ పవిత్ర కర్త్వవ్య దీక్షకు

చంద్రునికో నూలుపోగులా
ఈ చిరు సత్కారాలే
మా కృతజ్ఞతా సూచికలు
స్వీకరించమని వినతులు
మీకివే మా ప్రణతులు

సింహాద్రి జ్యోతిర్మయి
1.7..2018

🙏🙏🙏🙏🙏🙏🙏
*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************
ముఖ పుస్తక మిత్రులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో 
నా కవిత
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁.                                    🍁
          నా (పని ) మనిషి
🍁.                                   🍁
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఉరుకుల పరుగుల ఉదయవేళలో
సమయం సరిగ్గా ఆరయింది
నా మనసులో
ఆందోళన మొదలయింది
తను ఇంకా రాలేదేమిటి?
కొంపదీసి ఈ రోజు రాదాఏమిటి?
రోజూ ఈ పాటికి కాలింగ్ బెల్ మోగేది
కడియాల చప్పుడు కమనీయంగా వినపడేది
వీధి వాకిలి,విడిచిన బట్టలు
పాచి ఇల్లు,పెరట్లో అంట్లు
సర్దాల్సిన సామాన్లు
నా బీపీని క్షణ క్షణం పెంచుతున్నాయి
గడియారం లో ముళ్ళు
గబగబా పరుగెడుతున్నాయి
కలుపుకున్న కాఫీరుచిని
కాస్తయినా ఆస్వాదించనీయని
కంగారులో ఆమె నామస్మరణ
శత్రుత్వంలోనూ
హరినామం జపించే
హిరణ్యకశిపాది అసురకోటిలా
కళ్ళూ ,మనసూ,చెవులూ
సర్వేంద్రియాలనూ
ఆమె పైనే కేంద్రీకరించి
అరకొరగా పనులు చక్కబెట్టుకుంటూనే
ఆఫీసుకి ఆలస్యమవుతోందని
ఆందోళన పడుతున్న వేళ
అమ్మగారూ !అన్న ఆ పిలుపు
ఆ క్షణంలో నాకిచ్చిన ఆనందం
పండిట్ రవిశంకర్ సితార నాదం
పట్టుచీర తెచ్చానోయ్ అన్న మా వారి అనురాగం
కూడా ఇవ్వలేవేమో!
అది నా ఇంటి పనిమనిషి స్వరం
నా శ్రమలో ఆమె నా కుడిభుజం

ఎగసి పడుతున్న ఆనందాన్ని
ఎదలోనే అణచిపెట్టి
ఇలా అయితే నిన్ను మానిపించేస్తా
అని బెదిరించే నాకు తెలుసు
ఒక నటీశిరోమణి
నాలోనూ దాగుందని

ఇది నాకు అలవాటే అన్నట్లుగా
ఒక చిరునవ్వుతో
ఆమె నా గర్వాన్ని దెబ్బతీసి
యంత్రంలా పనిచేసుకుపోతుంది
అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని
అరగంటలో అద్దంలా దిద్దేసే
ఆమె నేర్పును 
మెచ్చుకోకుండా ఉండలేను
మనసులోనే సుమా!

నేను వెళ్ళకపోతే 
అమ్మగారు ఇబ్బంది పడతారని
ఆలోచించే ఆమె సానుభూతికి
మంగమ్మా!పని బాగా చేశావని
మాటవరసకైనా మెచ్చుకోని
నా అమ్మగారి అహంకారానికి
హస్తి మశకాంతరం ఉంటుంది

నెత్తిమీద పెద్ద భారం
దించేసినట్లుగా
ఆమె రాకతో నాలో కలిగే ఆనందాన్ని
నేనిచ్చిన పాతచీరతోనే
ఆమె కళ్ళల్లో వెలిగే సంతోషాన్ని
నేనెప్పుడూ బేరీజు వేసుకోను.
వేసుకుంటే నేనామెకు
తప్పక ఋణపడతాను
అమ్మను,అత్తను దూరం చేసుకున్న 
ఈ ఆధునిక మహిళకు ఆధారం
ఆ శ్రమైక జీవన సౌందర్యం.

ఇళ్ళల్లో పాచిపనులు చేసుకునే ప్రతి మహిళకూ అంకితం

సింహాద్రి జ్యోతిర్మయి
 టీచర్
న.ర.సం.రాష్ట ఉపాధ్యక్షురాలు
1.5.2020



*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

స్త్రీ లపై జరుగుతున్న   హింసను వ్యతిరేకిస్తూ
నేడు నవంబర్ 25 న 
International day for
 elimination of violence against women గా  ఈ రోజును ప్రకటించిన సందర్భంగా నా కవిత

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
🏵️.                                    🏵️
          అభినవ ద్రౌపది
🏵️.                   ‌‌.          ‌.     🏵️
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

నేను అభినవ ద్రౌపది ని
ఆధునిక వైద్యశాస్త్రపు
శస్త్రచికిత్సాలయమనే
యజ్ఞ గుండంలో
అయోనిజగా జన్మించాను

నచ్చిన వరుడికోసం
నాన్న ప్రకటించిన
తెలుగు మాట్రిమొనీల
స్వయంవరంలో
నా మనసు మత్స్యయంత్రాన్ని
అందం,చదువు, ఆస్తి
ఉద్యోగం,హోదా అనే
ఐదు బాణాలతో‌ పడగొట్టిన
మన్మథుణ్ణి పెళ్ళాడాను

తీరా మూడుముళ్ళు పడ్డాక తెలిసింది
అనుమానం,అహంకారం
ధన దాహం,దుర్వ్యసనం
స్త్రీ వ్యమోహమనే
పంచేంద్రులూ
అతనిలోనే దాగున్నారని

ఈ పంచ పాండవుల్లో
అతను ఎప్పుడు
ఏ రూపాన్ని బయటపెట్టినా
కాదనకుండా కాపురం చేస్తుంటాను

సౌఖ్యం రాజధానిగా
అతనిలోని అర్థభాగాన్ని
ఏలుకోమని ఆశీర్వదిస్తూనే
ధనాంధులైన 
అత్తమామల సమక్షంలోనే
తాళి కట్టిన వాడు
తనకేం పట్టనట్లు
తలవంచుకు కూర్చుంటే
పెట్టుపోతలు ,లాంఛనాల
లెక్కలు తేలని
పెద్దల బేరసారాల
సభాపర్వంలో
నాకు తెలియకుండానే
నేనొక సమిధనవుతాను

అత్తింటివారి
సూటిపోటి మాటలు
నా ఆత్మాభిమనే వస్త్రాలను
నట్టింట్లో ఊడ్చేస్తుంటే
సహనమనే ఆపద్బాంధవుడిని
సాయమడిగి
పదిమందిలో నా పరువును
కాపాడుకుంటాను

మగమృగాలు
విచ్చలవిడిగా సంచరించే
అరణ్యవాసంలో
వావివరుసలెరుగని
సైంధవులను

ఉద్యోగపర్వపు సమస్యల
అజ్ఞాత వాసంలో
అల్లరిపాలు చేయాలనుకునే కీచకులను
దక్కలేదన్న అక్కసుతో
పుకార్లతో
నా మర్యాదను
మంటగలపాలనుకునే
ఉపకీచకులను
లౌక్యమనే భీమబలంతో
ఎదుర్కొంటూ
గుట్టుచప్పుడు కాకుండా
జీవితాన్ని 
నెట్టుకొస్తుంటాను

నా మనసులో
జుట్టు విరబోసుకొని
భోరుమని ఏడుస్తోన్న
అసహనం

ఆవేశం ,ఆలోచనల మధ్య
నిత్య కురుక్షేత్రం
ఈ సంఘర్షణ లో
నాలో నిద్రావస్థలో ఉన్న
ఆశయం,ఆనందం
ఆత్మవిశ్వాసం
కలలు,కళలు అనే
బిడ్డల్ని పోగొట్టుకుంటాను

నన్ను నేను కోల్పోయి
సమస్తం శూన్యమైపోయిన
ఈ జీవన సంధ్యాసమయంలో
దక్కిన ఆస్తుల సింహాసనం
నాకు ఏ సంతోషాలను
పంచగలదు?

బాధలు బాధ్యతల
బరువును
అవమానాల పరంపరలను
బ్రతుకంతా మోసి మోసి
అలసిన నా
మనశ్శరీరాలకు
మనశ్శాంతినిచ్చే విశ్రాంతి
మహాప్రస్థానమేనా!

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.11.2018.

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

JULY నాలుగవ ఆదివారం world parents day.

సందర్భంగా నా కవిత

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹.                                    🌹
           మేమిద్దరమే
🌹.                          ‌ ‌.         🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఒకప్పుడు మేమిద్దరం ఒక్కటయ్యాం
వాళ్ళిద్దరూ మా ప్రేమకు ప్రతిరూపాలయ్యారు
జీవితంలోని పదహారు వసంతాలు
మా ప్రేమ సామ్రాజ్యాన్ని 
ఆక్రమించి యేలుకున్నారు
సామంతులమై సంతోషించాము

నేడు ఆ అనుబంధపు పుస్తకం లో
అనుభవాలపుటలు
జ్ఞాపకాల గాలికి కదలగానే
ఎన్నెన్ని అనుభూతులో
సుమధుర పరిమళాలై
ఎదను చుట్టేసుకున్నాయి

మీరు పుట్టిన రోజు
బారసాల రోజు
గుర్తుపట్టిన రోజు
ఊసు చెప్పిన రోజు
బోర్ల పడ్డ రోజు
దోగాడిన రోజు
పన్ను వచ్చిన రోజు
అన్నప్రాశన రోజు
పట్టుకుని నిలబడ్డ రోజు
పలుకు నేర్చిన రోజు
అడుగులేసిన రోజు
పరుగులెత్తిన రోజు
ఆట నేర్చిన రోజు
ప్రశ్నలేసిన రోజు
బడికి పోయిన రోజు
గెలిచి నిలిచిన రోజు
అంటూ ఎన్నెన్ని వేడుకలో!

మీకు
జ్వరం వచ్చిన రోజు
జలుబు చేసినరోజు
దిష్టి తగిలిన రోజు
కింక‌పెట్టిన రోజు
సూది వేసిన రోజు
నిదుర కాచిన రోజు
దెబ్బ తగిలిన రోజు
దెబ్బలేసిన రోజు
భయపడ్డ రోజు
బాధపడ్డరోజు
బడికి పంపిన రోజు
రాక ఆలస్యమయిన రోజు
ఓడి వచ్చినరోజు
దగాపడ్డ రోజు
ఎన్నెన్ని వేదనలో!

పదహారు వసంతాలు
పండుగలా జరిగాక
పెద్ద చదువులంటూ
ప్రేమను అణుచుకున్నాము
మంచి ఉద్యోగాలంటూ
మమకారాన్ని చంపుకున్నాము
పెళ్ళి పేరంటమంటూ
బాధ్యతల్ని తీర్చుకున్నాము

ఇప్పుడు
మీ ప్రపంచం మారింది
ప్రాధాన్యతలు మారాయి
మీకు మాపై ప్రేమ ఉంది
అది ఫోనులో పలకరింపయ్యింది
వాట్సప్ లో సందేశమయ్యింది
ఫేస్ బుక్ లో సంబరమయ్యింది
ఇంస్టాగ్రామ్ లో చిత్రమయ్యింది
స్కైప్ లో కంటికి తనివి అయ్యింది
పేగుబంధం  ఈనాటికి
పండుగనాటి చుట్టమయ్యింది
విశ్రాంత జీవితాన్ని ఒంటరి తనం
ఆవరించింది
ఇది తప్పని ఎడబాటని మనసు గ్రహిస్తోంది
మా అమ్మానాన్నల కంటి చెమ్మ గురుతుకొస్తోంది

ఇంతకాలం
మేమిద్దరం  మాకిద్దరు అనుకున్నాము
ఇప్పుడిక
మేమిద్దరం మిగిలాము
మేమిద్దరమే మిగిలాము.

సింహాద్రి జ్యోతిర్మయి
22.7.2018.

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

వరల్డ్ స్పారో డే

🍁🌾🍁🌾🍁🌾🍁🌾🍁🌾

           సహానుభూతి

🌾🌷🌾🌷🌾🌷🌾🌷🌾🌷

మానవా!
నేనెవరో గుర్తుపట్టావా!
నేను నీ చిన్నారి నేస్తాన్ని
నీ చిన్ననాటి నేస్తాన్ని
ప్రాణసంకటంలో పడ్డావంటే
పలకరించి పోదామని
తగిన శాస్తి జరిగిందని
శపిస్తున్న నా వారిని వారించి
 ఈ కష్టకాలంలో నీకు
సహానుభూతి చూపి
నాలుగు మంచిమాటలు 
చెప్పి పోదామని
ఎగురుకుంటూ ఇలా వచ్చాను
సెల్ ఫోన్ టవర్
రేడియేషన్
అనే బ్రహ్మాస్త్రాన్ని 
నాపై ప్రయోగించి
నా జాతిని 
నామావశిష్టం చేశావు
తాడిని తన్నేవాడి
తలదన్నేవాడు 
ఉంటాడు అన్న
పెద్దలమాట
నీకు అనుభవంలోకి
వచ్చింది కదూ!
ఇప్పుడు కరోనా వైరస్ తో 
నీ కొచ్చిన కష్టం చూస్తుంటే 
మనుగడ కోసం
నా జాతి పడ్డ 
మూగవేదన
గుర్తుకొస్తోంది
అయినా నేను 
నిన్ను శపించను
నువ్వు ఈ విపత్తు నుండి
త్వరగా, క్షేమంగా
బయటపడాలనే
కోరుకుంటాను
ఎందుకంటే
ఉనికిని కాపాడుకోవడం లో
ఉన్న కష్టాన్ని
నేనూ అనుభవించాను కనుక.
ఓ!మనిషీ!
నాకివ్వు
గుప్పెడు గింజలు
గుక్కెడు నీళ్లు
నీవు
వర్ధిల్లాలని కోరుకుంటాం
వందేళ్ళు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.03.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

World sparrow day సందర్భంగా నేను ఎప్పుడో పిచ్చుక మీద రాసిన కవిత
🍁🎶🍁🎶🍁🎶🍁🎶🍁🎶

         గుర్తుకొస్తున్నావు

🎶🍁🎶🍁🎶🍁🎶🍁🎶🍁

ఒకప్పుడు
రివ్వున ఎగురుకుంటూ నువ్వు
మా ఇంట్లోకి దూసుకురాగానే
పాపం బుజ్జి ప్రాణం
ఫ్యాను రెక్కల్లో
పడిపోతుందేమోనని
హడావిడిగా దాన్ని ఆపేసేదాన్ని

టిక్కు టిక్కుమంటూ నువ్వు
అద్దాన్ని తెగ పొడుస్తుంటే
అద్దాన్ని పాడుచేస్తున్న
నీ  అజ్ఞానానికి 
ముద్దుగా విసుక్కుని
నిన్ను తరిమేసేదాన్ని

కిచకిచలాడుతూ ఉదయాన్నే నువ్వు
కిటికీ రెక్కలపై వాలి నీ స్నేహితులతో
ఊసులాడుతుంటే 
నిద్దర పోనివ్వవు గదా అని ప్రస్తుతం
తిట్టుకుంటూ ఉండేదాన్ని

ఉరుకుల పరుగుల 
నా జీవితంలో
నీ ఉనికినే ఇన్నాళ్ళూ
పూర్తిగా విస్మరించాను

ఇప్పుడెంతో ఎదిగాను
ఆనందంగా ఉన్నాను
సిగ్నల్ కోసం డాబాపై తిరుగుతూ
సెల్ ఫోను మాట్లాడుతున్న నాకు
హఠాత్తుగా ఈరోజు
నువ్వు గుర్తుకొచ్చావు

సుఖ జీవనం కోసం
నేను సృష్టించుకున్న
సెల్ టవర్ రేడియేషన్
బ్రహ్మాస్త్రమై
నీ జాతిని నిర్వీర్యం చేసిందన్న
చేదునిజం తెలిసి వచ్చి
నిశ్చేష్టురాలినయ్యాను

చిరునామాయే దొరకని
ఓ ఊరపిచ్చుకా!
 ఇప్పుడు    నీ వెక్కడమ్మా!
ఒక్కసారి కనిపించు
ఒక్కదానివైనా కనిపించు
నా బాల్య స్మృతులను 
గుర్తుచేసుకుంటాను
నిన్ను తప్పక 
బ్రతికించుకుంటాను

గుక్కెడు నీళ్ళు పోసి
గుప్పెడు గింజలు వేసి
నా గుండెల్లో గూడు ఇచ్చి.

సింహాద్రి జ్యోతిర్మయి
27.4.2018

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************







*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

.నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నా కవితా నీరాజనం

🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

 ‌‌      కార్గిల్ విజయోత్సవం

🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

సంవత్సరం 1999
సుందర కాశ్మీరమది
అటు వణికించే మంచుకొండలు
ఇటు దేశభక్తి నింపుకున్న గుండెలు
అవి సరిహద్దు భద్రతా దళాలు
అక్కడ మోగుతుంటాయి రణన్నినాదాలు
అనుక్షణం వారిలో అప్రమత్తత
వారిని వెన్నంటే ఉంటుంది మృత్యుదేవత
ఆహారనిద్రామైథునాలు
వీటికోసమే మన తాపత్రయాలు
మాతృభూమి పావన శ్రీ చరణాలు
వాటి సేవ మాత్రమే వారి లక్ష్యాలు

నిత్యం రగిలే రావణకాష్ఠం
కల్లోలిత కాశ్మీరం
దానిపైనే పాక్ ఆశ
దాని రక్షణే మన శ్వాస
హఠాత్తుగా ఒక్కనాడు
శత్రుమూకలు దురాక్రమణకు తెగబడ్డాయి
తక్షణమే కార్గిల్ సైన్యాలు తిరగబడ్డాయి
ఆపరేషన్ విజయ్ ఆరంభమయ్యింది
ఎత్తయిన పర్వతాలపై మాటు వేసిన
శత్రువును ఎదుర్కోవటం 
పెను సవాలయ్యింది
అయినా 
అడ్డంకులను లక్ష్యపెట్టకుండా
రాలిపోతున్న స్నేహితులను
చూసి చలించకుండా
వెనుకడుగే లేని ఆ నిబ్బరంలో
అన్యాయపు దాడిని సైన్యం తిప్పికొట్టగలిగింది
ద్రాస్ సెక్టార్ భారత్ ఆధీనమయ్యింది
ప్రపంచ దేశాలకు మన సత్తాచాటిన
మూడు నెలల వీరోచిత పోరాటం
ఉగ్రవాదం ముసుగులో
దాడికి తెగబడ్డ 
దాయాది దేశానికి గుణపాఠం
అపురూపమైన కాశ్మీర ఫలాన్ని
అమ్మకు నైవేద్యంగా సమర్పించటానికి
ఐదువందలమంది వీరజవాన్లు
అసువులొడ్డి అమరులయ్యారు
వారిలో దేశభక్తి పరిమళించింది
వారిని చూసి దేశం పరవశించింది
సంతోష దుఃఖ బాష్పాలు
ముప్పిరిగొన్న
భరత మాత నయనాలు
వీరుల మృతదేహాలను
అభిషేకించాయి
ఆశీర్వదించాయి
కార్గిల్ లో ఎగిరిన భారతపతాకం
నింగినంటి చేసింది విజయదరహాసం
అది అమర సైనికుల సాహస చిహ్నం
ఆ అసమాన త్యాగాలకు దేశమంది దాసోహం

కన్నబిడ్డను కళ్ళ చూడకుండానే
కట్టుకున్నవాడు మరణించినా
నా బిడ్డను కూడా సైనికుడినే చేస్తా
నా భర్త ఆశయం కొనసాగిస్తా
అన్న అమరజవాను లేత ఇల్లాలిని చూసి
చెమరించకుండా ఉన్న కన్నేది?
స్వార్థం నిండిన సమాజమా!
నిస్వార్థమైన ఆ త్యాగాలను
నిరుపయోగం చేయవద్దు
అదే వారికి మనమిచ్చే
నిజమైన నివాళి
వీర సైనికులారా!మీకు జోహారు
మన త్రివర్ణ కేతనంలో
కాషాయం మీరై
కలకాలం నిలిచి ఉంటారు.

జై జవాన్

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఒంగోలు.
26.7.2018.

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
            చెలిమి కలిమి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


ఏ తలపు
చింతలలో ఓదార్పుగా
అనుభూతుల పరిమళంగా
అనుభవాల   కలబోతగా
పెదవులపై చిరునవ్వుగా
కలకాలం శాశ్వతంగా
నిలిచి మురిపిస్తుందో

ఆ అందమైన బంధానికి
అపురూపమైన స్నేహానికీ
నన్ను కూడా అర్హురాలిని చేసిన
ఆప్త మిత్రులందరికీ 
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.💐💐💐

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
          ఆగష్టు పదిహేను
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆయుధాలు లేకుండా
పోరాటం సాధ్యమా!
అని ప్రశ్నిస్తే అవునంటుంది
బాపూజీ బోసినవ్వు

ఒక్కడి పేరే ప్రభుత్వాన్ని
ఒణికించుట శక్యమా!
అని ప్రశ్నిస్తే నిజమంటుంది
నేతాజీ కంటి ఎరుపు

స్వాతంత్ర్యం జన్మహక్కని
చాటేందుకు సిద్ధమా!
అని ప్రశ్నిస్తే గర్జిస్తుంది
లోకమాన్య తిలక్ గొంతు

ఆయుధాని కెదురుగా
నిలిచేందుకు ధైర్యమా!
అని ప్రశ్నిస్తే సై అంటుంది
ఆంద్రకేసరి తెగింపు

మన్నెంలో మహోద్యమం
సాధించుట సత్యమా!
అని ప్రశ్నిస్తే అడవంటుంది
అల్లూరిని ఎరగవా! అని

బానిస గుండెల కింతటి బలమా!
మమ్ము తరిమివేయగ తరమా!
అని ప్రశ్నిస్తూ అర్థరాత్రిలో
పరారయ్యింది పరాయిరాజ్యం

వీరుల త్యాగం ఏమిచ్చింది?
ప్రతి ఫలమంటూ ఏమొచ్చింది?
అని ప్రశ్నిస్తే ఇదిగోనంటూ
తెగిపడ్డ సంకెళ్ళు చూపుతూ
తెల్లవారింది ఆగష్టు పదిహేను

నిశిరాతిరి స్వాతంత్ర్యం
నిజమేనా !ఈ చిత్రం
అని ప్రశ్నిస్తే అవునవునంటూ
నింగికెగిరి నవ్వింది
మువ్వన్నెల భరతపతాకం

వీళ్ళంతా ఎవరని లోకం
విస్తుపోయి చూస్తూ ఉంటే
నా బిడ్డలు నమ్మండంటూ
గర్వంతో మురిసిందప్పుడు
భరతమాత చల్లని హృదయం

సింహాద్రి జ్యోతిర్మయి

****************************"👾👾👾👾👾👾👾👾👾👾*****************************

  ‌‌         🍁భాషామతల్లి🍁

అమ్మను ప్రేమించమంటే
ఆలిని ద్వేషించమనికాదు
ఆలిని ప్రేమించమంటే
అమ్మను నిర్లక్ష్యం చేయమనీ కాదు
అమ్మ పెరటిలోని తులసి మొక్క
ఆరాధించు
ఆలి జీవన బృందావని
ఆస్వాదించు

అమ్మ.....మాతృభాష
ఆలి.....ఆంగ్లభాష.

అందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

సింహాద్రి జ్యోతిర్మయి

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

ఆడపిల్లలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు.

ఆడపిల్లలు
సౌకుమార్యంలో పువ్వులు
.........వికసించనివ్వండి
ఆత్మీయపు నవ్వులు
........చిలికించనివ్వండి
ఇంటింటికీ దివ్వెలు
.........వెలుగు చిందనివ్వండి
చదువులలో రవ్వలు
..........ప్రకాశించనివ్వండి
సంతోషాల గువ్వలు
............రెక్కవిప్పనివ్వండి
చైతన్యపు మువ్వలు
.............మోగనివ్వండి

ఆడపిల్ల
రేపటి అమ్మ
జాతిని సృష్టించే బ్రహ్మ.

ఆడపిల్లను
చిదిమేయకండి
చదివి ఎదగనివ్వండి

సింహాద్రి జ్యోతిర్మయి
11.10.2017.
*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

ఈ రోజు నవంబర్ 19
International men's day సందర్భంగా నా కవిత

అతడే నా సైన్యం

అమ్మ తన కడుపులో  నన్ను
మోసిన తొమ్మిదినెలలు
అతడు తన ఊహల్లో
నన్ను మోశాడు
ఈ లోకంలో
పాదం మోపానో లేదో
అపురూపంగా నన్ను
చేతుల్లో పొదువుకున్నాడు
గుండెలపై ఆడించాడు
వేలుపట్టి నడిపించాడు
కంటిపాపలా కాపాడాడు
కాలుకందకుండా పెంచాడు
తన శ్రమఫలాన్ని ధారపోసి
నా కలలను పండించాడు
ఆక్షేపించే లోకాన్ని లెక్కచేయక
ఆశపడ్డ జీవితాన్ని అందించాడు
అతడి జీవిత సామ్రాజ్యం లో
నేనొక అందాల యువరాణి
ఆయన నా తండ్రి
నా ఆరాధ్య దైవం
ఆచారిగారి అమ్మాయినని
చెప్పుకోవడం
అది నాకెంతో గర్వకారణం

తొలకరిలా నా జీవితం లోకి
ప్రవేశించాడు
తొలివలపు నాకు
చవిచూపించాడు
వేలుపట్టి తన 
బ్రతుకులోకి ఆహ్వానించాడు
మనుగడ మాంగల్యబంధంతో 
ముడివేశాడు
జీతాన్నీ జీవితాన్నీ కూడా
నా చేతుల్లో పెట్టేశాడు
నా కళల ప్రపంచంలో
ఎగిరే స్వేచ్ఛనిచ్చాడు
నా ఆశయానికి
ఆలంబనయై 
నన్ను ఎదగనిచ్చాడు
అతడి హృదయ సింహాసనంపై
నేనొక మహారాణిని
ఆ రాజశేఖరుడే నా సర్వస్వం
అతడి సాహచర్యం
నాకు లభించిన
జీవన సాఫల్య పురస్కారం

నా తరువాత పుట్టాడు
నాతో ఆడుతూ పాడుతూ పెరిగాడు
అమ్మ పాలతో పాటుగా
అన్నీ నాతో పంచుకున్నాడు
అందమైన అనుబంధాన్ని
నాతో పెంచుకున్నాడు
పసితనంలో మేము
పంచుకోని
ఆప్యాయత లేదు
అత్తారింటికి వెళ్ళిపోయిన 
అక్కను మరచిపోనూలేదు
తీయని బాల్యానికి
బంధువయ్యాడు
తీరని పుట్టింటి
బంధమయ్యాడు
పండుగంటే పిలిచి
పసుపు కుంకుమ లిచ్చి
కష్టమంటే  వచ్చి
కన్నీళ్ళు తుడిచి
ఆత్మీయతలను పంచిన
వాడు నా తమ్ముడు
మూర్తీభవించిన సంస్కార కిరణం

పచ్చని మా కాపురానికి
ప్రతిరూపం
తొలిసారి నేను రుచి చూసిన
మాతృత్వపు మాధుర్యం
దెబ్బలాటలు ఇంటిపైకి తెచ్చిందిలేదు
నా చేత దెబ్బలు తిన్న
సందర్భమూ గుర్తులేదు
అమ్మ మనసునెప్పుడూ
నొప్పించని సౌజన్యం
పలుకులోన కాస్తయినా
కానరాదు కాఠిన్యం
వాడు నా కన్న కొడుకు
నా జీవితాకాశాన్ని
వెలిగించిన
నిశాంత చంద్రుడు

జీవన పయనంలో
ఒక మలుపులో కలిశాడు
మర్యాద మన్ననలతో
నమ్మకాన్ని గెలిచాడు
ఆపద వచ్చిందంటూ
అసహాయంగా 
తన గుమ్మంలో
అడుగిడిన వేళ
అన్నం‌కంచం ముందునుంచి
అదాటున లేచివచ్చి
వెంకట రమణ మూర్తిలా
ఆదుకున్న వేలుపతడు
రామయ్య అన్న పేరుకతడు
అచ్చంగా అతుకుతాడు
అతడు
నా ప్రాణమిత్రుడు
బ్రతుకు పూలతోటను
పరిమళింప జేసిన
స్నేహ సుమ సౌరభం

పంచభూతాలు
ఈ ప్రకృతికి ప్రాణాలు
ఈ పంచ బంధాలు
ఈ పడతి మనుగడకు
 ఆధారాలు
  
నా జీవితాన్ని 
పరిపూర్ణం చేసిన
మీ  కందరికీ
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

19.11.2019.

దుర్ఘటనకు రెండేళ్లు 

నాటి నా స్పందన

రంగారాయుడి
చెరువు గుండె చెరువు

వారంతా వాకర్స్ క్లబ్ సభ్యులు
నడక ఒక హాబీగానో
మంచి అలవాటుగానో
ఆరోగ్యం కోసమనో
అనారోగ్యం తగ్గించుకుందామనో
వ‌ణికించే చలిని సైతం లెక్కచేయక
 వాకింగ్ చేస్తుంటారు
కలిసి అడుగులు వేస్తూనే
కబుర్లాడుకున్నారు
కష్టసుఖాలు కలబోసుకున్నారు
అనుబంధాలు పెనవేసుకున్నారు
ఆత్మీయులయ్యారు
వారాంతపు వేడుక చేసుకుందామని
వారంతా ఉత్సాహపడ్డారు
కార్తిక వనభోజనాల కోసం
కలసి కట్టుగా కదలివెళ్ళారు
పొంచిఉన్న మృత్యువు
వేటాడగా వెంటాడింది.
కాలానికి కన్ను కుట్టిందిి
భవాని దయతప్పింది
పంచభూతాలలో నీరు పగబట్టింది
నదీ సంగమం నవ్వుల్ని మింగింది
దురదృష్టమో నిర్లక్ష్యమో
దూరం చేసి బంధువుల్ని
దుఃఖాన్ని మిగిల్చింది

వినోద యాత్ర విషాదాంతమయ్యింది
రంగారాయుడి చెరువు
గుండె చెరువయ్యింది
చేదు వార్త ని జీర్ణించుకోలేని
ఒంగోలు పట్టణ హృదయం
కలతతో కన్నీరయ్యింది
మిత్రులారా!
మీ అకాల మరణానికిదే
నా కన్నీటి నివాళి
మీ ఆత్మకు 
శాంతి చేకూరాలి

సింహాద్రి జ్యోతిర్మయి
కవయిత్రి
నరసం ఉపాధ్యక్షురాలు
12.11.2019.

ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు విజయవాడ పడవ ప్రమాదం లో  మరణించి సరిగ్గా నేటికి రెండేళ్ళు అయిన సందర్భంగా మరొక్కసారి వారి మృతికి నా కన్నీటి నివాళి

మాతృ భా (ఘో )ష

మీరు మరచిపోతున్న
మాతృభాష ను నేను
ఆదరణ కరువవుతున్న
అమృత భాషను నేను

నన్నయ్య ఇచ్చాడు నాకు కావ్యగొరవం
చిన్నయ్య కూర్చాడు నాకు వ్యాకరణం
తిక్కన్న నాలోని సొగసుల్ని చూశాడు
పోతన్న నాలోని తీయదనం చూపాడు

అన్నమయ్య కీర్తనలో భక్తిరసం నేనేను
కృష్ణ శాస్త్రి పాటలోని ఆర్తియన్న నాదేను
గురజాడకు అందించా అభ్యుదయపు వాడి నేను
శ్రీ శ్రీ లో చూపించా కవిత్వంపు పదును

అన్ని భాషలలోన మిన్న నేనేనన్న
ఖ్యాతినే పొందాను
కనుకనే పొంగాను
తెలుగు తేటయన్న
మాటదక్కిందన్న
భావనతో మైమరిచా
ధన్యనంటు నే తలచా

శతకాలతో జాతికి నీతుల్ని నేర్పాను
ప్రబంధాలతో శృంగార లోతుల్ని చూపాను
అవధానపు ప్రక్రియలో ప్రత్యేకత చాటాను
ఆధ్యాత్మ భావాల అంచులే తాకాను

విన్నారా!
ఇది అంతా గతకాలపు వైభవం
చూశారా !
నేడు నాది శోచనీయ అనుభవం

నేను రానంటారు
నన్ను వద్దంటారు
అభివృద్ధి పథాన నా ఉనికి
ఆటంకం అంటుంటారు
అమ్మపాలతో పాటుగా అలవడేటి నన్ను
అమ్మ జోల పాట లోని హాయినయిన నన్ను
నేడు
అవహేళన చేస్తున్నారు
అల్పంగా చూస్తున్నారు

మనసారా నన్ను తాము
నేర్వలేని నిర్భాగ్యులు
నోరారా మాతృభాష
పలుకలేని పాపాత్ములు
నన్ను జీవచ్ఛవాన్ని చేస్తున్నారు
అన్యభాషా పదాల అతుకులేస్తున్నారు

అన్ని భాషలలోనున్న కొన్ని వేల పదాలను
అచ్చులతో చేయూతనిచ్చి
అక్కున చేర్చుకున్న నాకు
ఆ ఔదార్యగుణమే నేటికి
ఆత్మహత్యా సదృశమయ్యింది

నా భవితవ్యపు ఆశలిప్పుడు
భాషాభిమానుల‌ చేతుల్లో విడిచాను

బడుగుభాషను కాను
మీ జీవనాడిని
కానివ్వండి మననిచ్చి
నన్ను చిరంజీవి ని.

సింహాద్రి జ్యోతిర్మయి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం 
( న ర సం ) ఉపాధ్యక్షురాలు
21.2.2018.

ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సులు.
నిన్న ప్రపంచ అటవీ దినోత్సవమట.
ఈ రోజు జల దినోత్సవమట.
రెంటినీ జతచేసి నేను రాసిన కవిత.

మొక్క( కంట ) నీరు

నేను 
పంచభూతాలను,ప్రకృతిని
పదిలంగా కాపాడే
పచ్చని చెట్టుని
నా ఉఛ్వాసంతో విషాన్ని గ్రహించి
నిశ్వాసంతో ప్రాణవాయువునిచ్చే
చల్లని నేస్తాన్ని
కానీ నరుడా!
నువ్వు నాశనం చేస్తున్న వనాలకి
నాటుతున్న మొక్కలకి
సమతౌల్యం ఏదీ!
నా మూలాలు నరికేసి
నాగరికత పేరుతో
నగరాలుగా ఎదిగావు
నీటిచెమ్మను నిల్వచేసే
నన్ను విస్మరించడంతో
పుడమి గర్భం ఆర్చుకుపోయి
వట్టిపోతోంది.
మట్టి తల్లి కష్టానికి 
సూర్యుడు మండిపడుతున్నాడు
గాలి వేడి నిట్టూర్పులు విడుస్తూంటే
నీటి మబ్బులు ఇంకుతున్నాయి
ఆకాశం చిల్లులు పడుతోంది.
నదుల శోకం వరదలై
పల్లాలను ముంచెత్తుతోంది
కడలి గుండె కదలిపోయి
సునామీలుగా విరుచుకుపడుతోంది
పాపభారాన్ని మోయలేనంటూ
ధరణి అసహనంగా‌ కదులుతోంది.

హిమానీ నదాలు కరిగి
మంచు‌పెళ్ళలు విరిగి
వన్య ప్రాణులు తరిగి
కరువు కాటకాలు పెరిగి
పర్యావరణం ప్రశ్నిస్తోంది
ఇచ్చి‌పుచ్చుకోవటమనే
మర్యాదను మరచిన మానవుడా!
ప్రకృతిని
ఉపయోగించు కోవటమే కాదు
ఉపయోగపడటం కూడా నేర్చుకో
నేడు దోచుకోవటం మాని
రేపటికి దాచుకోవటం నేర్చుకో
వనాలను జలవనరులను కాపాడుకో.
నీటిచుక్క ప్రాణాధారం
చిన్నమొక్క రేపటి కాధారం.

సింహాద్రి‌ జ్యోతిర్మయి
కవయిత్రి
న.ర.సం.ఉపాధ్యక్షురాలు.
.................. నేనో కడలి....................

అప్పుడప్పుడు
నా హృదయంలో 
 ఆనందాల సూర్యోదయాలు
నా కన్నుల్లో 
 ఉప్పనైన నీరు
నా చెవుల్లో 
సముద్రపు హోరు
నా గర్భంలో
 బాధల బడబానలం

నా సుఖదుఃఖాలు
వచ్చీపోయే అలలు
నా ఆవేశాలు
బంధాల్ని తుడిచిపెట్టే సునామీలు
నా అనుభవాలు
జ్ఞాపకాలుగా ఘనీభవించిన ఆణిముత్యాలు
నా బంధుత్వాలు
నా ప్రపంచాన్ని వర్ణమయం చేసే
జలచరాలు
నా కష్టాలు
ఎంతటి తుఫానులుగా మారతాయో
తెలియని అల్పపీడనాలు
నా సంతోషాలు
నా పాదాలచెంత ఆడుకునే పసివారి కేరింతలు

మొత్తానికి నాలో ఒక సముద్రం
నేనే ఒక సముద్రం

సింహాద్రి జ్యోతిర్మయి
8.6.2018

World ఓషన్ ocean day

....‌.............జీవన ( సం ) గీతం......‌........

కమ్మనైన అమ్మ జోలపాట
శ్రీకారం వంటి చెవులకు
ఓంకారమై సోకిన తొలి సంగీతం

ఒప్పులకుప్ప‌ ఒయారి భామ
సుబ్బీగొబ్బెమ్మ సుబ్బణ్ణియ్యవే
అంటూ ఆటను పాటను
మిళితం చేసుకుంది నా బాల్యం

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే
ఎన్నాళ్ళకొస్తాడే అంటూ
సినిమా పాటలు పాడుకుంటూ
కలలు కన్నది నా యవ్వనం

పందిట్లో మంగళ వాద్యాలు
వేదమంత్రాల ఘోషలు
సీతారాముల కళ్యాణం చూతము రారండీ
అంటూ కళ్యాణరాగాల సందడిలో
ముడిపడింది నా వివాహబంధం

పండిట్ రవిశంకర్ సితార నాదంలా
బిస్మిల్లా ఖాన్ షహనాయి సంగీతంలా
జాకిర్ హుస్సేన్ తబలా వాయిద్యంలా
హిందీ తెలుగు పాత సినిమా పాట ల్లా
మధురాతి మధురంగా
సాగింది నా సంసార జీవితం

నీవు లేక వీణ పలుకలేనన్నది
అంటూ ఆషాఢ మాసపు ఎడబాటులో
వీణపాటలా 
నిట్టూర్చింది నా విరహం

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
అంటూ అన్నమయ్య కీర్తనలా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ
అంటూ వేదవతీ ప్రభాకర్ లలితగీతంలా
మురిసిపోయింది నా మాతృత్వం

కౌసల్యా సుప్రజా‌రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే
అంటూ భక్తిభావాన్ని మనసులోనింపి
తాదాత్మ్యం చెందించింది 
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యం

పాడుదమా స్వేచ్ఛాగీతం
ఎగరేయుదమా జాతిపతాకం
అంటూ   ఉత్తేజం నింపింది
 దేశభక్తి గీతం

ఏ దేశ చరిత్ర చూసినా 
ఏమున్నది గర్వకారణం
అంటూ ఆవేశపడుతూ
ఎక్కడికెళ్తోంది దేశం ఏమైపోతోంది
అంటూ  అన్యాయాన్ని సహించలేక
  విప్లవ గీతమై నినదించి
ఆక్రోశించింది నా ఆవేశం

బాధతో దుఃఖంతో
మనసు తల్లడిల్లిన వేళలో
ఘంటసాల భగవద్గీత
చేకూర్చింది సాంత్వనం

నా జీవితంలోని ప్రతి సందర్భం
సంగీతంతో పెనవేసుకున్న 
అందమైన బంధం
ఇది నా జీవన ( సం ) గీతం

సింహాద్రి జ్యోతిర్మయి
21.6.2018

World' music day

నేడు ప్రపంచ వితంతు హక్కుల దినోత్సవం సందర్భంగా

....‌..........వి (చిత్ర) తంతు వొద్దు......‌‌‌‌......‌

పతిని కోల్పోయి ఆమె
పుట్టెడు దుఃఖం లో ఉంది
ఆకురాలిన శిశిరంలా
ఆశలన్నీ రాల్చుకుని మోడయ్యింది
ఆనందాలన్నీ ఆవిరికాగా
అలమటించి పోతోంది
సంసారమెలా సాగించాలా అని
సతమతమై పోతోంది
చంటిబిడ్డల్నెలా
సాకాలో తెలియక
ఒంటరి జీవితాన్ని తలచి
ఒణికిపోతోంది
ఆదాయమెలా వచ్చేదో తెలియదు
అప్పులిచ్చాడో,తెచ్చాడో తెలియదు
అమాయకంగా ,ఆకుచాటు పిందెలా
అతని అడుగులో అడుగేసిన ఆ పయనం
ఆయన అడుగుజాడ మాయం కాగా
నడక చేతకాక తడబడిపోతోంది
బ్రతుకులోన భరోసా
భర్తేనన్న నమ్మకం
అతని కట్టెతో పాటుగా
కాలి బూడిదైపోగా
నిద్రాహారాలు మానింది
అందం,అలంకారం పై ఆసక్తి  కోల్పోయింది
శోకదేవతలా
అశోకవనంలో సీతలా
జీవచ్ఛవంలా బ్రతుకుతోంది

ఆమె‌ దురదృష్టానికి నిట్టూర్చేవాళ్ళు కొందరైతే
నష్టజాతకురాలని నిష్ఠూరమాడేవాళ్ళు ఇంకెందరో!
ఈ విపత్కర వేళలో
మన చేయి తుడవాల్సింది
ఆమె కన్నీటినే గానీ
పసుపుకుంకాల్ని కాదు
ఆమెకు ఇవ్వాల్సింది
చల్లని ఓదార్పునే గానీ
తెల్లని చీరను కాదు

తాళి తెంపుకు పోయిన భర్త
తల రాత రాసిన విధాత
చేసిన అన్యాయానికి
కుమిలిపోయే వితంతువును
ఆదుకోవటానికి
కందుకూరి కున్నంత
సంస్కరణాభిలాష అవసరం లేదు
కాసింత సహృదయం,సంస్కారం చాలు
నిస్వార్థంగా
ఆమె మేలుకోరి సాయం చేద్దాం
కోలుకునే ధైర్యాన్నిద్దాం.

సింహాద్రి జ్యోతిర్మయి
న.ర.సం.రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
టీచర్ @ OPS , ఒంగోలు

23.6.2018

,...........World kiss day......సందర్భం గా

నా కవిత 

..................ముద్దు ముచ్చట్లు...................

రైతన్న చెమటచుక్క
నేలతల్లిని ముద్దాడి
పంట చేనై పరవశిస్తుంది

వీర జవాను నెత్తుటి చుక్క
మాతృభూమిని ముద్దాడి
ఋణం తీర్చుకున్నానని
ఋజువు చూపిస్తుంది

నిండుగా పూచిన పుష్పం
పరమాత్ముని పాదాలు ముద్దాడి
క్షణికమైన బ్రతుకును
పునీతం చేసుకుంటుంది

తొలకరి తొలి వానచినుకు
బీడు నేలను ముద్దాడి
చెమ్మగిల్లి పరిమళిస్తుంది

మూడుముళ్ళ బంధంతో
దాంపత్యం ముద్దాడి
షష్టిపూర్తి గా జీవితాన్ని
సార్థకం చేసుకుంటుంది

మాతృత్వం మైమరచి
పురిటికందును ముద్దాడి
జన్మ ధన్యమయ్యిందని
పులకరించిపోతుంది

కాపురానికి వెళ్ళేపిల్లను
కడుపుతీపి ముద్దాడి
నుదిటిపైన వాత్సల్యపు
ఆశీస్సులు వర్షిస్తుంది

సృష్టి లోన తీయనిదై
చెలిమి ఎదను ముద్దాడి
అంతరాలు లేని బంధమై
అదృష్టం తో అభిషేకిస్తుంది

హృదయపు భావోద్వేగం
కనులలో ఉప్పొంగి
పెదవిపైన పరచుకునే
పారవశ్యం పేరే  ..........ముద్దు.

సింహాద్రి జ్యోతిర్మయి
6.7.2018
..................‌‌.............నేడు......................................

కవి కోకిల,నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా వర్థంతి  

విశ్వనరుడను నేనన్న ఆత్మవిశ్వాసం
నను వరించిన శారద వీడిపోదన్న ధీమా
తొణికసలాడుతున్న ఆ ఠీవి

అవమానాగ్నిలో దహించుకుపోతున్న
హృదయాలను ఆవిష్కరించిన గబ్బిలం
ప్రపంచ వింతయైన ప్రేమ సామ్రాజ్యాన్ని
అద్భుతంగా నిర్మించిన ముంతాజమహలు
నమ్మకద్రోహానికి తల్లడిల్లిపోయిన
కవి హృదయవేదనా రవం ఫిరదౌసిలతో పాటుగా

ఖండకావ్యాల నాలపించిన కవికోకిల
కాందిశీకుడై స్వప్నకథలు‌ వినిపించిన
 కవితా విశారదుడు
తనను కన్నతల్లి గర్భాన్ని ధన్యం చేసిన
నవయుగ కవి చక్రవర్తి
శ్రీ జాషువా గారి వర్థంతి సందర్భంగా
నా నివాళి
............... వ్యాసాయ నమోన్నమః  ...........‌‌

వశిష్ఠుని ముని మనుమడు
శక్తికి మనుమడు
పరాశరుని తనయుడు
శుకునికి జనకుడు
వేదరాశిని వేరుపరచిన విజ్ఞాన ఖని
అష్టాదశ పురాణాలను
అందించిన మేధావి
పంచమవేదాన్ని
ప్రపంచానికొసగిన ఋషీశ్వరుడు
భాగవతామృతాన్ని
చవి చూపిన పౌరాణికుడు
జగద్గురువు శ్రీ కృష్ణుని గీతాబోధను
భీష్ముడు ప్రవచించిన
విష్ణు సహస్ర నామాలను
విరచించిన విద్యాపూర్ణుడు
సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా
స్వయంగా తరలివచ్చి
సలహాలనిచ్చి,సాయపడి
కురుపాండవ కథను
నడిపించిన నిర్దేశకుడు
వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం
అవును 
ఈ మాట అక్షరసత్యం
సాక్షాత్తూ
విష్ణుస్వరూపుడైన
ఆ వేదవ్యాసుని జన్మతిథే సుమా!
ఈ గురుపూర్ణిమ
ఆ గురుపరంపరలో
శిష్య వాత్సల్యంతో
ధర్మ మార్గంలో
జాతిని నడిపించిన
ప్రతి సద్గురువుకీ
ప్రణమిల్లుతున్నాను
శిరసా సమర్పిస్తున్న
నా కవితా పుష్పాన్ని స్వీకరించండి
మనసా మీ ఆశీరక్షతలు అందించండి.

అంకితం
ముఖ పరిచయం లేకపోయినా
ముఖ పుస్తక పరిచయం తోనే
నన్ను జ్యోతమ్మతల్లీ అని గా
వాత్సల్యంతో సంబోధిస్తూ
నేనేం రాసినా అద్భుతమని అభినందించి
ఆశీర్వదిస్తూ
నన్ను ప్రోత్సహిస్తున్న పూజ్య గురువులు
శ్రీ

అంబాళం పార్థ సారథి గారికి
సభక్తికంగా 
నా ఈ చిరు కవితను సమర్పిస్తున్నాను.

ఓం శ్రీ గురుభ్యోన్నమః

సింహాద్రి జ్యోతిర్మయి
27.7.2018

ఆగష్టు 1 నుండి 7/వరకు
అమ్మపాల వారోత్సవాల సందర్భంగా
నా కవిత

.......................మాతృ స్తన్యం............................

అమ్మనవబోతున్నానన్న
అపురూపమైన భావం
నరనరాన్ని ఉత్తేజితం చేయగా
సంతరించుకున్న స్త్రీత్వం
అమ్మనయ్యానన్న
అంతులేని ఆనందం
ఎదను ఉప్పొంగించగా
వెల్లువైన క్షీర సాగరం
ఊపిరి పోసుకున్న
లేత పెదవికి
తొలిసారిగా అందిన
అమృతభాండం
జాషువా మాటల్లో అది
వినూత్న అతిథి
ఈ లోకంలోకి వస్తూ వస్తూ
వెంట తెచ్చుకున్న ఆహారం
త్రిమూర్తులలో
స్థితి కారకమై
శిశువును పోషించే
విష్ణు స్వరూపం
మమకారాన్ని,మాతృభాషను
సత్తువను,సంస్కారాన్ని
రంగరించి పోసే దివ్యౌషధం
అమ్మ పాలకు
లేనేలేదు ప్రత్యామ్నాయం
భయశోక భావాలను
తొలగించి సేదదీర్చే
ఆత్మీయ సామ్రాజ్యం
అనివార్య కారణాలతో
పాపడికి పాలివ్వలేని
పడతి వేదన వర్ణనాతీతం
బిగువు సడలిపోతుందని
బిడ్డ కడుపు ఎండగడితే
అమ్మ పదవికే నీవు అనర్హం
రొమ్ము కేన్సర్
దాని పర్యవసానం
బిడ్డకు స్తన్యమివ్వడం
 తల్లికి
సహజ గర్భ నిరోధక సాధనం
అంటున్నది వైద్య శాస్త్రం
ఆడదాని స్తనం
అది మాతృత్వానికి సంకేతం
సంస్కారవంతులకు
ఏ వికారమూ కలిగించని
మహోన్నత కలశం
అది 
చేతులెత్తి మొక్కదగిన
ఆలయ శిఖరం

సింహాద్రి జ్యోతిర్మయి
1.8.2018

ఆగష్టు 6 & 9 తేదీలు
హిరోషిమా, నాగసాకి లపై అమెరికా అణుబాంబులు ప్రయోగించిన దుర్దినాలను గుర్తుచేసుకుంటూ

ఆటమ్
విభజించ వీలులేని
అతి సూక్ష్మ కణం
అణుబాంబు
నివారించ‌వీలులేని
వినాశ కారకం
1945
ఆగష్టు నెల ఆ సమయం
అదో జ్ఞాపకాల విషవలయం
ఎప్పటిలాగే ఆరోజు కూడా
అందరిలాగే వారికీ తెల్లారింది
అనంతరం కొద్దిసేపటికే
ఆ నగరాల బ్రతుకూ తెల్లారిపోయింది
కనులు మిరుమిట్లు గొలిపే
మెరుపుకాంతి
సూర్యుడొచ్చి మీద పడిపోతున్నాడేమో
అన్నంత వేడి
చెవులు చిల్లులు పడిపోయేటట్లుగా
పెను విస్ఫోటనం
అలముకున్న పొగల సెగలు
ఆవరించిన అణుధూళి మేఘాలు
క్షణకాలపు హాహాకారాలు
అసలేం జరుగుతోందో
అర్థమయ్యేలోపే
వేలాదిగా పోగుపడిన శవాలగుట్టలు
ఎక్కడో ఒక మూలుగు
అక్కడొక ఆక్రందన
ఇక్కడొక కదలిక
ఇవి తప్ప నగరమంతా శ్మశానమే
అది అంతం కాదు
ఆరంభం మాత్రమే
అని అర్థమయ్యేలోపే
మృతుల సంఖ్య
వేలల్లోంచి లక్షల్లోకి చేరుకుంది
అది ప్రకృతి విలయతాండవం కాదు
పరమశివుని ఫాలనేత్ర జ్వాల కాదు
ఆధిపత్యం చాటుకోవాలనో
పరమాణు‌శక్తిని పరీక్షించాలనో
శత్రు దేశాలను భయభ్రాంతం చెయ్యాలనో
కారణమేదైతే నేం
యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న
అగ్రరాజ్యం విసిరిన
అణుబాంబు సృష్టించిన విధ్వంసం
క్రూరమైన ఆలోచనలోనుంచి
ప్రభవించిన మారణహోమం
అమానుషత్వం పాదాలకింద
కర్కశంగా నలిగిపోయిన మానవత్వం
ఉగ్రవాదం నీ WTC భవనాలను
కూల్చేసిన నాటి సెప్టెంబర్ 11
పేరుచెప్తే నేటికీ ఒణికిపోతున్న నీవు
అందమైన రెండు నగరాలను
అమాయకమైన ప్రజలను
వందల సంవత్సరాలు
శాపగ్రస్తం చేసిన
నీ దురాగతాన్ని 
ఎందుకు గుర్తుచేసుకోవు?

ప్రపంచం నీ రాజ్యాన్ని
భూతల స్వర్గం అంటోంది గానీ
నీ మనసు మాత్రం మరుభూమి.
నీ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు
చరిత్ర నీ చరిత్ర ను 
ఎప్పటికీ క్షమించలేదు.
నేడు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా నా కవిత

క్విట్ ఇండియా

బానిసత్వాన్ని భరించి భరించి
విసుగెత్తిన భారతీయులు పూరించిన
విప్లవ శంఖారావం
విజయమో,వీరమరణమో
తేల్చుకునేందుకు తెగించిన
తుది సమర నినాదం
ఆకలంటూ వచ్చావు
వ్యాపారంతో ఎదిగావు
ఆయుధాలను ఆశ చూపావు
వైషమ్యాలను రాజేశావు
సామంతులను మభ్యపెట్టావు
విభజించి పాలించటంలో
విజయాన్ని సాధించావు
సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నావు
బానిసత్వాన్ని బహుమతిగా‌ ఇచ్చావు
అసమర్థులమై 
అమ్మ దాస్యశృంఖలాలను చూస్తూ
వందల ఏళ్లు
ఎలా భరించామో తెలియదు
నేడు భరతమాత దాస్యాన్ని
తొలగించాలని మేము
బద్ధకంకణులమయ్యాము
నేడు భరత ఖండం భగ్గుమంటోంది
బానిసత్వం సిగ్గు అంటోంది
సైమన్ గో బ్యాక్ లు
సహాయ నిరాకరణాలు
ఉప్పు సత్యాగ్రహాలు
విదేశీ వస్తు బహిష్కరణలు
అన్నిటికీ కాలం చెల్లింది
అతివాదం,మితవాదం
అంతా ఏకమయ్యింది
కరో యా మరో
డూ ఆర్ డై
చావో రేవో
అంటోంది భారతం
తెల్లదొరలారా!
వినరండయా!
మీకేమాత్రం పౌరషమున్నా
క్విట్ ఇండియా

క్విట్ ఇండియా ఉద్యమం లో ప్రాణాలు కోల్పోయి,స్వాతంత్ర్య సంగ్రామం సాగించి
స్వాతంత్ర్య ఫలాన్ని సాధించి
స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అదృష్టాన్ని మనకందజేసిన ఆనాటి దేశభక్తులందరికీ
పాదాభివందనాలు అర్పిస్తూ

సింహాద్రి జ్యోతిర్మయి
9.8.2018
డబ్భై మూడేళ్ళ క్రితపు రక్తచరిత్ర కు
నా కవితా మైపూత

సింహాద్రి జ్యోతిర్మయి
6.8.2018

ఈ రోజు లెఫ్ట్ హేండర్స్ డే అట.
ఈ సందర్భంగా నా కవిత

ఇది విన్నారా మీరు
ఈ రోజు లెఫ్ట్ హేండర్స్ డే అట
యధాలాపంగా ఎందుకోసమో
గూగులమ్మను పలకరిస్తే
చల్లగా ఈ వార్తను
కళ్ళల్లో పడేసింది
ఎడంచేతి వాటానికి కూడా
ఇలా ఒకరోజు కేటాయిస్తారని
ఎన్నడూ అనుకోనేలేదు సుమీ!
ఏం రాస్తే బాగుంటుందా!అని
ఒక్కసారి ఆలోచించాను
పురచేతి వాటం అని మనం
వేళాకోళం చేస్తుంటాం గానీ

తమ ప్రతిభా విశేషాలతో
ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకుని
ఔరా!ఆనిపించిన
పౌర ప్రముఖులెందరో
వరుసగా గురుతుకొచ్చారు
కవితగా కుదురుకున్నారు

చేతికి ఎముక లేకుండా
దానధర్మాలు చేసిన
మహానటి సావిత్రి
ఎడమ చేత్తో సంతకం చేస్తున్న
ఎప్పటిదో ఒక చిత్రం
ఎదలో మెదిలింది

తెరవెనుక కడు సౌమ్యురాలైనా
తెరమీద మాత్రం
గయ్యాళి నోటికి
ఎడమచేతి విసురుకి
పేరుపడ్డ సూర్యకాంతమ్మ
కళ్ళముందు కదిలింది

కౌన్ బనేగా కరోర్ పతి
అని సవాలు చేసినా
శౌచాలయ్ నిర్మించుకోమని
సలహానిచ్చినా
ఏడు పదుల వయసులోనూ
ఏమాత్రం క్రేజ్ తగ్గని
ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్
బిగ్ బి అమితాబ్
ఎడమ చేత్తో చేసే
నాట్యభంగిమలు 
ఎన్నో గుర్తుకొచ్చాయి

రికార్డులు సృష్టించండంలోనే
రికార్డు సృష్టించిన
మాస్టర్ బ్లాస్టర్
 క్రికెట్ దేవుని
ఎడమ చేతి బ్యాటింగ్
ఎద మైదానంలో
ఒక బౌండరీని దొర్లించి
సిక్సర్ బంతిలా దూసుకుపోయింది

మచ్చలేని నాయకుడు
అచ్చమైన బ్రహ్మచారి
అటల్ బిహారీ వాజ్ పాయ్
హృదయ కమలంలో ఒకసారి
మెరిసి మాయమయ్యారు

అర్థరాత్రి నోటరద్దుతో
అందర్నీ హడలెత్తించి
అబ్బో అనిపించి
అయ్యో అనిపించి
అమ్మో అనిపించి
స్వచ్ఛ భారత్ కల ఇక
సాకారం చేస్తారేమో
అనిపించిన చాయ్ వాలా
ఆత్మ విశ్వాసం గుర్తుకొచ్చింది

ఎదకు దగ్గరగా ఉండే
ఎడం చేతిని వాడటం వల్ల కాబోలు
వీరంతా
ఎంతో సహృదయులుగా
ఎన్నో రంగాలలో నిష్ణాతులు గా
కళాకారులుగా  కలిమి కలవారుగా
వెలుగొందుతున్నారేమో
అనిపించింది
ఈ లెఫ్ట్ హేండర్స్ డే రోజున
వారందరికీ
అభినందనలు అందజేస్తూ

ఈ కవితను
లెఫ్ట్ హేండర్ అయిన 
నా చిన్నారి మేనకోడలు
చిరంజీవి ప్రఖ్య కు
అంకితం చేస్తున్నాను.

సింహాద్రి జ్యోతిర్మయి
13.8.2018.

World photography day 
సందర్భంగా.

................... జ్ఞాపక చిహ్నాలు....................

నా చిన్నతనాన్ని
భద్రంగా దాచి ఉంచుతుంది
నా స్నేహబంధాలను
తీపి గుర్తులుగా పదిలపరుస్తుంది
నా విజయ చిహ్నాలను
కళ్ళకు కట్టించి మురిపిస్తుంది
జీవితంలోని మధుర ఘట్టాలను
తలచినప్పుడల్లా చూపిస్తుంది
చేజారిన ఆత్మీయులను
జ్ఞాపకాలుగా పటం కడుతుంది
రేపు నేను వెళ్ళిపోయినా
నా స్మృతులను
నా వాళ్ళకు మిగులుస్తుంది
సుందర దృశ్యాలను బంధిస్తుంది
చరిత్రకు సాక్ష్యమై నిలుస్తుంది
హృదయాన్ని
మురిపించి
మైమరపించి
ఉన్నారనిపించి
ఉపశాంతిని పంచి
అలరించే అద్భుతం
అదే సుమా చిత్రపటం

సింహాద్రి జ్యోతిర్మయి
19.8.2018














గురజాడ జయంతి సందర్భంగా

సీసం.
ముచ్చటొప్పగ గుచ్చి ముత్యాల సరములన్
......ఆధునికత భాష కమరజేసె
మట్టి కాదుర దేశమన్న మనుషులంచు
......శక్తి నింపెడు దేశ భక్తి చాటె
దిద్దుబాటొనరించి తెలుగు కథానికన్
......తొలి యడుగుల జాడ త్రోవజూపె
ఆధునిక కవిత్వమందున యుగకర్త
.....యై మహాకవియను యశము పొందె

తే.గీ.
నాటి పుత్తడి బొమ్మ కన్నీటి కథను
కనుల నిప్పులు గురిసిన కన్యకలను
నాకు సంస్కరణ పతాక తోకచుక్క
అనుచు  చూపిన గురజాడ కంజలింతు.

సీసం.
పడుపు వృత్తిని చేయు పడతి మధురవాణి
.......సౌజన్య మేమిటో చాటినాడు
కన్నకూతురి నైన కనికరించని తండ్రి
.....,అగ్నిహోత్రుల యాశ కవధి లేదు
బ్రతుకు భారమవగ బాల విధవలైన
.......మీనాక్షి బుచ్చెమ్మ దీనగతులు
నమ్మించి యెల్లరిన్ నయవంచనలు జేయు
.....,ఆ గిరీశము సల్పు ఆగడాలు

తే.గీ.
వింత లుబ్దావధానుల పెళ్ళి తంతు
డాబు రామప్పపంతుల డాంబికములు
కథను అడ్డము తిప్పినా కాలమందు
మాయబోదు కన్యాశుల్క మహిత ఖ్యాతి.

సింహాద్రి జ్యోతిర్మయి
21.9.2017.

...............గురజాడ కావ్య కన్యకలు.........

కాసుకులోనై తల్లిదండ్రులు
ముక్కుపచ్చలారని తనను
ముదుసలికి కట్టబెట్టినా
కన్నీరు పెట్టటమే గానీ
కన్నవారిని నిందించటం తెలియని 
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ

పట్టపగలే నట్టవీధిని
జారచోరుడై పట్టబోయిన
ప్రభువును ధిక్కరించి
చేవ వుంటే‌ పట్టమని
సవాలు విసిరే
తెగువ చూపిన కన్యక

కలసి మెసగిన యంతమాత్రనె
కలుగబోదీ ఐకమత్యము
మాల మాదిగ కన్నె నెవతనో
మరులు కొనరాదో అని
విసవిసలాడుతూనే
వినూత్న ఆలోచనలు రేకెత్తించిన
గడప దాటని గడుసు ఇల్లాలు

పసి తనం లోనే 
విధవరాలై
తోడుకోసం తపించే వయసులో
అమాయకంగా
రామప్పపంతులు వలలో
పడ్డ మీనాక్షి

విధవలు పెళ్ళాడటం తప్పుకాదూ!
అని ఆశ నిండిన కళ్ళతో
గిరీశం మాయమాటలు
ఆశ్చర్యం గా విని
చెల్లికోసం సాహసం చేసిన
బాల వితంతువు బుచ్చమ్మ

నల్లని తుమ్మెద రెక్కల్లాంటి
నాలుగు వెంట్రుకలు
తన తలపై మొలిపిస్టాడన్న ఆశతో
గిరీశాన్ని నమ్మిన పూటకూళ్ళమ్మ

సాని పడుచై ఉండి కూడా
సాటి ఆడదాని కష్టానికి
సానుభూతి చూపి
సాయం చేసిన మధురవాణి

బిగించిన తమ పైటకొంగులను దులిపి
సంఘ సంస్కరణ
ప్రయాణ పతాకలుగా ఎగురవేసిన
మహాకవి కావ్యనాయికలు

అతని ముత్యాల సరాలలోని
పేటలు
జీవితాలనే శుల్కంగా 
బలిపెట్టిన కన్యామణులు

గురజాడ కావ్యాల బాటలోని
అడుగుజాడలు

సింహాద్రి జ్యోతిర్మయి
30.11.2018.

గురజాడ
  ఇతడి చిరునామా
విప్లవ భావాల వాడ
ఆధునిక  కవులు
తలదాచుకోవడానికి
నిర్మించి ఇచ్చాడు ముత్యాల మేడ
సంస్కరణ ల సాహితీ వనం లో
బలంగా నాటుకున్న మర్రి ఊడ
అభ్యుదయ సాహితీ గమనానికి
లంగరెత్తిన ఓడ
ఒక యుగాన్ని శాసించిన మహాకవికి
స్ఫూర్తి నిచ్చిన అడుగు జాడ
దురాచారాల  దురహంకారంపై
సమరానికెత్తిన జెండా 
నీకు శిరసా వందనమంటున్నది
మా కవి లోకపు గుండె.
        సింహాద్రి

ఈ రోజు డిసెంబర్ ‌11 వ‌ తేదీ 
వరల్డ్ మౌంటెయిన్స్ 
డే 
సందర్భంగా నా కవిత

.....ఘన గిరులు....

పరమ శివుని కోరి
పార్వతి అపర్ణయై,
పాశుపతము కోరి
పార్థుడు మౌనియై
తపమొనర్చిన ఆ హిమాచలమ్ము

దేవదానవులెల్ల
పాలకడలిని చిలుక
తాడైన వాసుకికి
తాను ఆధారమై
కవ్వముగా‌ కదలిన
మంధరమ్ము

అగస్త్యమౌనీంద్రు
ఆనతిని తలదాల్చి
వినయాన వంగిన
వింధ్యనగము

తన సుఖము త్యజియించి
తమ్ముని కోసమై
రాముడు సతితోడి
సౌమిత్రితో గూడి
మసలిన సుందర
చిత్రకూటమ్ము

లక్ష్మణుని రక్షింప
రయమున హనుమయ్య
అరచేత ధరియించి
ఆకాశమార్గాన 
తెచ్చిన సంజీవనీ పర్వతమ్ము

ఇనుమడించినట్టి
ఇంద్రుని గర్వమ్ము
తొలగింపగా బూని
ఎత్తి ఏడునాళ్ళు
చిటికెన వ్రేలిపై
చిన్ని కృష్ణుడు మోసిన 
గోవర్ధనమ్ము

తమ్ముడర్జునుని
జెండాపై కపిరాజుకాగ
అన్న వాయు సుతుని
అనుగ్రహము భీముడు
పొందినట్టి ఆ గంధమాదనమ్ము

అన్నకు భయపడి
ఆర్తుడై దాగున్న
సుగ్రీవునకు రాముని
మైత్రి బలము కూర్చిన
ఋష్యమూకమ్ము

అప్సర కాంతలను
ఆకర్షించి భువికి
బంగారు గుహలతో
పరిఢవిల్లినదని
పేరు గన్న 
మేరుపర్వతమ్ము

ఓషధులకు నిలయమై
ప్రకృతి వైవిధ్యమై

రాముడు వెలసిన భద్రగిరి
శ్రీనివాసుడెక్కిన తిరునగరి
మల్లికార్జునుని శ్రీశైలం
దుర్గమ్మ నెలవైన
ఇంద్రకీలాద్రి
పర్వత రాజములన్నియు
పరమపుణ్యుల
 పద రాజీవములు
సోకి 
పరవశించి
చాటి చెప్పుచుండె
భరత భూమి ఘనత

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

11.12.2020


 


Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ