6. నా (రీ) అనుభూతులు
చిన్నారులకు వినాయక చవితి శుభాకాంక్షలతో
.......1.వినాయకుని ఆత్మకథ.......
విన్నావా! చిన్ని నేస్తమా!
వినాయకుణ్ణి నేనే సుమా!
నలుగు ముద్దతో నన్ను
నా తల్లి పార్వతి
ప్రేమతో చేసింది
ప్రాణాలు పోసింది
మట్టిముద్దతో మీరు
మలిచి పూజిస్తె చాలు
సిద్ధిబుద్ధుల నిచ్చి
దీవింతు మిముమెచ్చి
నాలుగాకులు తెచ్చి
నన్ను మనసార కొలిచి
పెట్టు నమస్కారాలు
ఉన్నంతలో ఇవ్వు
ఉండ్రాళ్ళు కుడుములు
ఆలకించి నా కథను
అక్షతలు చల్లుకో
నీలాపనిందలవి
చేరవిక నీ దరికి
జీవితాన్ని ప్రకృతితో ముడివెయ్యి
బ్రతుకును పండుగలా గడిపెయ్యి
నిరాశలను నిమజ్జనం చేసెయ్యి
నేను
అమ్మ చెప్పినమాట
బుద్ధిగా విన్నాను
అన్ని విద్యలకు నేను
అధిపతిని అయ్యాను
నాన్న దండించినా
నొచ్చుకోనందున
అందరికీ నేను
ఆది పూజితుడనయ్యాను
అవమానాలను సహించాను
నా కథను లోకంలో
ఆరాధనీయం చేసుకోగలిగాను
నా అవస్థను చూసి నవ్వినవాళ్ళు
అమ్మ ఆగ్రహానికి గురయ్యారు
శాపగ్రస్తులయ్యారు
ఏకాగ్రతతో చదివాను
ఏకసంధాగ్రాహినయ్యాను
వ్యాసుని భారతానికి
వ్రాయసకాడినయ్యాను
చంచలమైన మనస్సనే ఎలుకను నేను
బుద్ధితో స్వారీ చేస్తూ
అదుపులో పెట్టుకుంటాను
తల్లిదండ్రుల పాదసేవయే
తరించే మార్గమని గ్రహించాను
విష్ణు నామ జపం చేస్తూ
విమల భక్తితో సేవించాను
విఘ్నాధిపత్యం సాధించాను
పిల్లలూ!
ఇదే నా ఆత్మకథ
నచ్చితే నన్ను అనుసరించండి
మీ అమ్మానాన్నల అభినందనలు
మా అమ్మానాన్నల ఆశీస్సులు
మీరు కూడా అందుకోండి.
శుభం భూయాత్
సింహాద్రి జ్యోతిర్మయి
13.9.2018.
2.*సత్య...భామా (క) లాపం*
నేను సత్యభామను
నేనే సత్యభామను
నామీద ఎన్నెన్ని ఆరోపణలు!
భామనే సత్యభామనే
అని వగలుపోతుంటానని గుసగుసలు
మీరజాల గలడా నా యానతి
అంటూ మొగుణ్ణి కొంగున కట్టేసుకున్నానని నిందలు
ఒక చిన్న పువ్వు కోసం అలిగి
నానా అల్లరీ చేసి
అతణ్ణి
కాళ్ళబేరానికి రప్పించుకున్నానని వ్యాఖ్యలు
నేను కాలితో తన్నినా గానీ
ఈయనగారు ఎంతో సహనంగా
అయ్యో! పాపం నీ కాలు నొప్పెట్టిందా!
అనేటంతగా
వశపరిచేసుకున్నానని వదంతులు
అమరావతికే ప్రయాణం కట్టించి
కల్పవృక్షాన్నే పెరటి చెట్టుగా నాటించేసుకుని
పంతం నెగ్గించుకున్నానన్న విసుర్లు
పుణ్యకవ్రతం చేసి
పతిని దానమిచ్చి
పరాభవం చవిచూశానన్న అవహేళనలు
అబ్బో!ఒకటా!రెండా!
నా ప్రేమను అడ్డం పెట్టుకొని
నన్ను అమాయకురాలిని చేసి
జగన్నాటక సూత్రధారి
అని పేరుపడ్డ
ఈయన ఆడిన నాటకాలు ఇన్నీ!అన్నీ కావు సుమండీ!
అయినా అవన్నీ పక్కనపెట్టి
జీవన గమనంలో
ఆయనకు
సమస్యల సమరం ఎదురైనప్పుడు
వెన్నంటి ఉండి
అలిసిపోయి పోరాడలేక నిశ్చేష్టులైనప్పుడు
ఆత్మవిశ్వాసం, యుద్ధ కౌశలం
అనే ధనుర్బాణాలతో
అపజయమనే నరకుణ్ణి
అంతమొందించటంలో
నేను చేసిన సహాయాన్ని కూడా
ఆయన నాకిచ్చిన
మహదవకాశంగా
మార్చేసుకున్న
మహా గడుసువారు సుమండీ! మా శ్రీవారు
ఏదేమైనా
దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి
ఈ ఆశ్వయుజ అమావాస్యకు
లోక కల్యాణమనే దీపావళి తెచ్చిన
ఈ సత్యాపతి
నా ప్రణయకలహాల
అమావాస్యను
తన అనునయాలనే దీపావళితో పారద్రోలి
సంతోషమనే బాణాసంచా
నిత్యం నాకంట వెలిగించే
ప్రేమదీపం
ఆ శ్రీకృష్ణ స్వరూపం
ఇదీ ఈ భామాకలాపం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.10.2024
బుధవారం
3*ప్రేమంటే ఇదేనా!*
చిరు చీకట్లు కమ్ముకునే వేళ
నా మనసునిండా
నీ ఆలోచనలే
ముసురుకుంటాయి
నీ కోసమనే
తలుపులన్నీ మూసేస్తాను
అగరుధూపాలతో
నా ఇంటిని నింపేస్తాను
నువ్వు నా చుట్టూనే
తిరుగుతుంటావు
చెవిలో గుసగుసగా
సవ్వడి చేస్తుంటావు
రాత్రంతా నాకు
నిద్రలేకుండా చేస్తావు
మాటిమాటికీ నా మీద
వాలుతుంటావు
నీకు భయపడే నేను
చుట్టాలెవ్వరూ
రాత్రివేళ
మా ఇంటికి రాకూడదని
కోరుకుంటాను
ఉదయం లేవగానే వాళ్ళ మొహం చూడటానికి కూడా
ఇబ్బంది పడిపోతుంటాను
అబ్బా!
మీ ఇంటికి ఇంకెప్పుడూ రాము తల్లీ!
అని అనేస్తారేమోనని..
ఇలా అయితే ఎలా చెప్పు!
ఓ దోమా!
నామీద
నీ కెందుకంత ప్రేమ!
రాత్రి మా తమ్ముడు వాళ్ళు వస్తే మా ఏరియాలో ఉన్న
దోమలతో పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అన్న ఆలోచనతో వచ్చిన కవిత😜😜
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.1.2024
4*కుక్కే 🐕 కదా!కాదా!🤔*
మా ఆయన
ఎంతో ఇష్టపడి
ఒక కుక్కపిల్లని తెచ్చుకున్నాడు
తనంటే అతనికి
చాలా ప్రేమ అని
అది అనుకుంటూ ఉంటుంది
దాని కళ్ళముందే అతని జీవితంలో ఎన్నో మార్పులు
మంచిచెడ్డలు జరిగాయి
అతను కొడుక్కి బండికొన్నాడు
తను కారుకొనుక్కున్నాడు
ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు
ఎన్నో అప్పులు తెచ్చాడు
కష్టాలు పడ్డాడు
దానధర్మాలు చేశాడు
మోసకారులను నమ్మాడు
అవమానాలు పడ్డాడు
అన్నిటికీ అది మౌనసాక్షి మాత్రమే
కానీ ఇవేవీ ఆయన
దానితో పంచుకోలేదు
బహుశా
అది నోరులేని మూగజీవి కదా
దానికేం అర్థం ఔతుందిలే అనుకుంటాడు కాబోలు
పసిగట్టినప్పుడో
పరిస్థితి ప్రమాదాన్ని సూచించినప్పుడో
అది ఒకటిరెండు సార్లు
భౌభౌ మంటుంది
ఆయన దాన్ని ఒక్క కసురు కసిరి షటప్ అంటాడు
అంతే అది
కుయ్ కుయ్ మంటూ
తోకముడుచుకుంటుంది
మళ్ళీ తోక ఊపుకుంటూ
కాళ్ళదగ్గరే పడిఉంటుంది ఎప్పటిలాగే
రెండు కుక్కబిస్కెట్లు ముందు పడేసి
ఒక గొలుసు మెడలో వేసి ఇంట్లో కట్టేశాడుగా
అది చాలు దానికి
నా యజమాని ఇతడు
అనే విశ్వాసం తో...
జీవితం గడిపేయడానికి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.11.2023
5.ఇక్కడింతే (ఇల్లాలే దేవత)
నేనొక ఇల్లాలిని
శివుడు గరళాన్ని మింగినట్లు
నేను దుఃఖాన్ని మింగి
గొంతులోనే అదిమి పెడతాను
శ్రీ కృష్ణుడు గోవర్థనాన్ని ఎత్తినట్లు
చిరునవ్వుతో బాధల కొండను
నా తలపైకెత్తుకుని
నా సంసారాన్ని కాపుకాస్తాను
సంఘం కోసం
శిలువకు వ్రేలాడిన
క్రీస్తులా
ప్రేమరాహిత్యపు శిలువకు
వ్రేలాడుతూ
నిరంతరం చచ్చే
నా మనసుకు
పునరుత్థానం నేర్పుతుంటాను
ఇక్కడింతే
వైవాహిక జీవితంలో నేను
ఆ దేవుళ్ళకున్న
సహనం,చాతుర్యం, క్షమాగుణం చూపుతుంటాను
అందుకే గదా!
ఇల్లాలే దేవత అంటూ నాకు
పూజ్యత (?)
ఆపాదిస్తుంటారు
ఈ ఇచ్చకానికి పొంగిపోయి నాలాగే
మా ఆయన బంగారం
అంటూ మభ్యపెట్టని
ఇల్లాళ్ళు ఎవరుంటారు?
ఎందరుంటారు?
ఎక్కడుంటారు ?
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.4.2023
6.*నా(తి) హృదయాకాశం*
నాకు హృదయం లేదు
అది ఆయనకు ఇచ్చేశాను
ప్రతిగా నాకు లభించని
ఆ హృదయస్థానంలో
మిగిలిన శూన్యానికి
సవ్వడి మాత్రమే మిగిలింది
వెలుగులు నింపే
సూర్యచంద్రులవంటి
పిల్లలు
మెరిపించే నక్షత్రాల వంటి మనుమలు
ఆశల హరివిల్లులు
అన్నీ ఈ శూన్యంలోనే ఉన్నాయని భ్రమింపజేస్తుంటాను
నా ఉనికిని
అందరూ గుర్తిస్తారు
నాకు ఉనికే లేదనే
సత్యాన్ని మాత్రం విస్మరిస్తుంటారు
మరి శూన్యమంటే అర్థం
ఉన్నట్లు కనిపించే
లేని ఆకాశమే కదా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.10.2021.
7.*నేనున్నానననీ నీకేం కాదనీ*
నాకందరూ ఉన్నారన్న నమ్మకం
పాదులు చేసి తడుపునిచ్చిన నీటిలా
చిన్ని మొక్కను కూడా
చిగురింపజేసి
బ్రతికిస్తుంది
నాకెవ్వరూ లేరన్న నిస్పృహ
మొదలంటా నరికిన గొడ్డలిలా
మానును సైతం
కూల్చేస్తుంది
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.11.2022
.8. వ్యాసాయ నమోన్నమః .
వశిష్ఠుని ముని మనుమడు
శక్తికి మనుమడు
పరాశరుని తనయుడు
శుకునికి జనకుడు
వేదరాశిని వేరుపరచిన విజ్ఞాన ఖని
అష్టాదశ పురాణాలను
అందించిన మేధావి
పంచమవేదాన్ని
ప్రపంచానికొసగిన ఋషీశ్వరుడు
భాగవతామృతాన్ని
చవి చూపిన పౌరాణికుడు
జగద్గురువు శ్రీ కృష్ణుని గీతాబోధను
భీష్ముడు ప్రవచించిన
విష్ణు సహస్ర నామాలను
విరచించిన విద్యాపూర్ణుడు
సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా
స్వయంగా తరలివచ్చి
సలహాలనిచ్చి,సాయపడి
కురుపాండవ కథను
నడిపించిన నిర్దేశకుడు
వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం
అవును
ఈ మాట అక్షరసత్యం
సాక్షాత్తూ
విష్ణుస్వరూపుడైన
ఆ వేదవ్యాసుని జన్మతిథే సుమా!
ఈ గురుపూర్ణిమ
ఆ గురుపరంపరలో
శిష్య వాత్సల్యంతో
ధర్మ మార్గంలో
జాతిని నడిపించిన
ప్రతి సద్గురువుకీ
ప్రణమిల్లుతున్నాను
శిరసా సమర్పిస్తున్న
నా కవితా పుష్పాన్ని స్వీకరించండి
మనసా మీ ఆశీరక్షతలు అందించండి.
అంకితం
ముఖ పరిచయం లేకపోయినా
ముఖ పుస్తక పరిచయం తోనే
నన్ను జ్యోతమ్మతల్లీ అని
వాత్సల్యంతో సంబోధిస్తూ
నేనేం రాసినా అద్భుతమని అభినందించి
ఆశీర్వదిస్తూ
నన్ను ప్రోత్సహిస్తున్న పూజ్య గురువులు
శ్రీ
అంబాళం పార్థ సారథి గారికి
సభక్తికంగా
నా ఈ చిరు కవితను సమర్పిస్తున్నాను.
ఓం శ్రీ గురుభ్యోన్నమః
సింహాద్రి జ్యోతిర్మయి
27.7.2018
.........9...పాప (౦)..........
పసిపిల్లనని నన్నందరూ
పిలిచి ముద్దుచేస్తారని
అమ్మ మురిపెంగా చెప్తోందికానీ
నాకెందుకో ఆ మాట
నమ్మబుద్ధికావటం లేదు
తడిమి తడిమి ముద్దులాడే
పక్కింటి తాతగారి స్పర్శ
ఎదురింటి మామయ్య
నా మీద చేతులేస్తూ
చెవిలో చెప్పేమాటలు
ఆంటీ కంటపడకుండా
నన్ను హత్తుకునే
మేడమీది అంకుల్ నోటినుండి
వచ్చే ఘాటైన వాసన
సినిమా చూపిస్తా రమ్మని
తన రూముకి తీసుకెళ్ళి
ఏదేదో చేస్తున్న
వెనకింటి అన్నయ్య
వెర్రి చూపులు
నాకెందుకు బాగోలేవు!
అమ్మకెలా చెప్పాలో నాకు
అర్థం కావడంలేదుగానీ
ఇల్లు దాటి బయటకు అడుగుపెడితే
అడవిలో క్రూరమృగాల మధ్య
చిక్కుకున్న లేడికూనలా
అయిపోతున్నాను
చిదిమి దీపం పెట్టుకునేలా
ఉన్నానని ఆంటీ అంటే
అంకుల్ నన్ను నిజంగానే
చిదిమేస్తున్నారాంటీ
అని ఎందుకు చెప్పలేకపోతున్నాను?
వీళ్ళ స్పర్శ
నాన్న స్పర్శలా
లేదమ్మా
అంటే అమ్మ
నేను బిడియపడుతున్నానని
అనుకుంటుందే గానీ
భయపడుతున్నాననే
భావాన్ని
నా కళ్ళలో
ఎందుకు చదవలేకపోతోంది?
అర్థం చేసుకునేవాళ్ళులేని
పంచుకోలేని
ఈ బాధను
భరించలేని
నా మనసుకు మాత్రం
బలంగా అనిపిస్తోంది
పంచేంద్రియాలూ
మొద్దుబారి
పనిచేయడం మానేస్తే బాగుండునని
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.1.2019
10.*రణరంగం*
రష్యా
ఉక్రెయిన్ యుద్ధం
మనమంతా టీవీల్లో
చూస్తున్నాం
పేపర్లలో చదువుతున్నాం
కానీ మా దాంపత్యంలో
నేను నిత్యమూ
ఆ పోరాటం లోనే
తలమునకలై ఉంటాను
రష్యాలాగా
ఆయన నాకంటే అధికుడే
అన్నిటిలోనూ
అంతటి ఆయుధసంపత్తి(???)
నాకు లేదు
అది మా ఆంతరంగిక వ్యవహారమని
ఇతరులు కల్పించుకోకపోనూవచ్చు
నేను
గెలవలేననీ తెలుసు
అయినా
ఆ ఆధిపత్యం మీద
ఆ అహంకారం మీద
నా
పోరాటం మాత్రం
ఆపను.
అది నిరంతరం సాగుతూనే ఉంటుంది
ఎందుకంటే
అవమానాలు
అపజయాలు
తప్పకపోయినా
సర్వసాధారణమే అయినా
ఆత్మాభిమానం
కాపాడుకునే ప్రయత్నమైతే
చేయాలి కదా!
శ్రీ శ్రీ మాటల్లో
చెప్పాలంటే
*రణరంగం కానిచోటు
భూస్థలమంతా
వెదికిన దొరకదు*
దానికి మా ఇల్లేమీ
మినహాయింపూ కాదు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.8.2022
****11*రంగవల్లిక******
మంచుతెరలు
చీకటిపొరలు
విడిపోయే
వేకువఝామున
వీధిగుమ్మం
తెరచుకుంటుంది
అరచేతిలో నన్ను
అపురూపంగా నిలిపి
చీరచెంగులు చుట్టి
కుచ్చిళ్ళను ఎత్తిపట్టి
మెత్తని పాదాలతో తాను
మెల్లగా నడిచివస్తుంది
పచ్చని వాకిలినొకసారి
పరికించి చూస్తుంది
నేలకు వాలిన హరివిల్లులా ఒంగి
తన మేనిలోని ఒంపులన్నీ
నా అణువణువునా నింపి
అందాలవాకిట్లో నన్ను
అద్భుతంగా ఆవిష్కరిస్తుంది
ఆమె చేతివేళ్ళు నన్ను
అలవోకగా సృష్టిస్తాయి
రంగులతో హంగులనద్ది
పువ్వులతో సొగసులు దిద్ది
గొబ్బెమ్మలతో ముద్దులొలికించి
పసుపు కుంకాలతో నన్ను
పవిత్రం చేస్తుంది.
ముచ్చటగా తీర్చిన నన్ను
మురిపెంగా చూసుకుంటుంది
నన్నందరూ మెచ్చుకుంటుంటే
తాను మురిసిపోతుంటుంది
ఊహించారా నేనెవర్నో
రమణి ఊహలకు
రమ్యమైన రూపాన్నై
ముంగిట్లో పరచుకునే
ముచ్చటైన ముగ్గును నేను.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.1.2019
ఈ కవిత చాలా కాలం క్రితం ఆంధ్ర జ్యోతి దినపత్రిక జిల్లా ఎడిషన్ లో వచ్చింది.
ఆంద్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభల్లో
అరుణ గారు అధ్యక్షత వహించిన
6 వ సదస్సులో
స్త్రీ లపై జరుగుతున్న హింస
అనే అంశంపై జరిగిన
పత్రాంశాలకు స్పందించి నేను రాసిన కవిత
12.శల్య పరీక్ష
గడపదాటి
వీధిలోకి
అడుగుపెట్టిన నన్ను
మగవాడి
చూపులు
గండు చీమల బారుల్లా,
చేతులు
తేళ్ళు జర్రులు పాకినట్లుగా,
సైగలు
నా అభిమానపు
వస్త్రాల పొరలు తొలగిస్తున్నట్లుగా,
వినపడీ వినపడకుండా
చేసే వ్యాఖ్యలు
నా గుండెలపై
హింసాబాణాలు గుప్పిస్తున్నట్లుగా
భావిస్తూ,
బాధపడుతూ,
భయపడుతూ
ఉబికే ఉప్పు కడలిని
కనురెప్పల వెనుకకు పంపి
బడబానలంగా
కడుపులో భరించి
నెత్తురోడుతున్న
మనసుతో
ఇంటికి చేరుకుని
కాసింత ఓదార్పు ఆశిస్తే
నన్ను తన పరువుగా భావించే
నా తండ్రి
నా సోదరుడు
నా భర్త
అతడెవరైతేనేం
నాదే తప్పన్నట్లు
ప్రశ్నల
శల్యపరీక్షలతో
నా అణువణువు
సిగ్గుతో చితికిపోయేటట్లు చేసి
నాకు బోధలు
మొదలుపెట్జి
నా తప్పు లేదని గ్రహించి
నన్ను క్షమించి
జాగ్రత్తగా ఉండమని
శాసనం లాంటి
సలహా నా మొహాన పారేసే
ఆ క్షణం
కన్నీరు
కనురెప్పల చెలియలికట్ట
తెంచుకుంటుంది
గాయపడ్డ గుండె గువ్వ
అనుబంధపు చెట్టునుండి జారిపడి
రెక్కలు తెగి
గిలగిలలాడుతుంది.
నా చుట్టూ
ఎన్ని ఆత్మీయతలు
అనుబంధాలు
ఉన్నా
అవన్నీ
ఆంక్షల పంజరాలే గానీ
వెచ్చగా కాచుకునే
గూళ్ళు కాబోవని
అర్థం చేసుకునే
ఈ ఆడపిల్ల
నిస్సహాయపు నిట్టూర్పులు
నా కవితాక్షరాలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.1.2019
2019 జనవరి 6,7 తేదీలలో విజయవాడ లో
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న
ఆంధ్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభల్లో
కవయిత్రుల సమ్మేళనాలలో
ఒక ఆవృత్తంలో నేను పాల్గొని కవితాగానం చేస్తున్న సందర్భంలో
నా కవిత
13.నా (అ)సహనం
ప్రతిరోజూ
సూర్యుడికంటే ముందే నేను
నిశ్శబ్దపు చీకటితోనే
నిద్రలేస్తుంటాను
వాకిట్లో అందంగా తీర్చిన ముగ్గునై
వంటింట్లో నిశ్శబ్దంగా
తిరిగే మిక్సీనై
మావారి చేతిలో
కాఫీ కప్పునై
మా పిల్లల నోట్సులో
హోమ్ వర్కునై
దేవునిగూట్లో దీపాన్నై
ఆయన ఇస్త్రీ చొక్కాన్నై
ఇంటికి దీపం ఇల్లాలనే
ఇచ్చకానికే పొంగిపోయి
ఆదర్శగృహిణి పట్టాకోసం
అష్టావధానం చేస్తుంటాను.
ఇంటికి తాళం వేసి
ఆఫీసుకి బయలుదేరినా
వంటింటి ఆలోచన
నావెంటే నడుస్తుంటుంది
ఆఫీసులో అరగంట
ఆలస్యమైతే
ఆయన ఏమంటారోనని మనసు
హడలిపోతుంటుంది
మధ్యరాత్రి వచ్చిన ఆయన
మందుకొట్టినా
నన్నుకొట్టినా
మా ఆయన బంగారమంటూ
నా మాట
నలుగుర్నీ నమ్మిస్తుంటుంది
అనుమానంతో ఆయన
అవమానిస్తూనే ఉన్నా
అదంతా ప్రేమేనని
నా మంచి కోసమేనని
ఆత్మాభిమానం చంపుకుని మనసు
ఆత్మవంచన చేసుకుంటుంది
పనిగట్టుకు వేధించే
పక్కసీటు పెద్దాయన
వెకిలిచేష్టలు వెల్లడైతే
పరువుపోతుందన్న
నా పిరికి ఆలోచన
అసహనాన్ని పళ్ళబిగువున
అణచివేస్తుంటుంది
మొగుడిననే ఆధిపత్యం
మగవాడిననే
అతడి అహంకారం
అన్నివేళలా నాపై
అజమాయిషీ చేస్తుంటుంది
నా సహనాన్ని
సొమ్ము చేసుకునే
మీ తెలివికి జోహారు
నేనంటూ తిరగబడితే
మీరంతా ఏమవుతారు?
ఇది చాలాకాలం క్రితం సాహిత్య ప్రస్థానం అనే సాహితీ మాసపత్రికలో ప్రచురింపబడిన నా కవిత
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.1.2019
🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀
14. పంచభూతాల దాడి
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
కన్నీటికుండలు
ఎన్ని కుమ్మరించినా
మనసు అగాథం లోని
బాధల బడబాగ్ని
చల్లారటం లేదు.
అపార్థాల భూకంపాలు
ప్రేమ పునాదుల్ని కదిల్చి
అనుబంధాల మేడల్ని
కుప్పకూలుస్తున్నాయి
కనురెప్పల వాకిళ్ళు
ఎంత గట్టిగా బిగించినా
తోసుకొచ్చే సుడిగాలిలా
అలజడి దొంగ
అంతరంగంలో జొరబడి
నిద్రను కాజేస్తున్నాడు
అనంతమనుకున్న
ప్రేమకాశం
శూన్యమని
నెత్తిన పిడుగుపడ్డాకే అర్థమయ్యింది
గుండెను మండిస్తున్న
నిజమనే నిప్పు
ఆత్మశాంతి వనాలను
దావానలంలా దహిస్తోంది.
పంచభూతాలు
పంచప్రాణాలపై పగబట్టి
తమలో ఐక్యం చేసుకోవాలని
ఆరాటపడుతున్నాయి.
మరి
ఈ పోరాటంలో
విజయం
ప్రకృతికో!
ప్రాణాలకో!!
సింహాద్రి జ్యోతిర్మయి.
*****************************
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾****************************
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో
🎵🌻🎵🌻🎵🌻🎵🌻🎵🌻
15. నవమి వేడుక.
🌻🎵🌻🎵🌻🎵🌻🎵🌻🎵
నవమినాడు భద్రగిరి
తెలుగునేల మిథిలాపురి
భక్తరామదాసు
భాగ్యమెంతటిదొగాని
ఆదర్శ దాంపత్యానికి
ఆనందాల కళ్యాణం
జరిపించి ధన్యుడాయె
ఆ వేడుకే వాడుకాయె
పతివ్రతను పరిత్యజించి
పరాభవించానన్న
పశ్చాత్తాపాన్ని
ప్రకటిస్తున్నాడేమో అన్నట్లుగా
ప్రతియేడూ శ్రీ రాముడు
కడుతున్నాడు
సీత మెడలో మాంగల్యం
పురుషోత్తమునితో పదే పదే
పుస్తె కట్టించుకునే భాగ్యం
పొందినందుకు పొంగిపోతున్న
సీతమ్మ మదిలా
పారుతున్నది గోదావరి గలగలా
మండు వేసంగి లాంటి
మగని కస్టంలో
మల్లెల సౌఖ్యం
ఇల్లాలి స్నేహం
ఎదను దహించే
ఎడబాటు గాడుపుల్లో
చలువపందిరి
మగని కూరిమి
చాటుతున్నది ఈ సత్యం
సీతారాములదాంపత్యం
యుగాలెన్ని గడిచినా
అన్యోన్యతకు ఈనాటికీ
ఈ జంటే ఆదర్శం ముమ్మాటికీ
అందుకే ఈ వసంతాల వాకిట
ఆనందంగా జరుపుకుందాం
నవమి వేడుక.
సింహాద్రి
5.4.2017
*****************************
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
👾👾👾👾👾👾👾👾👾👾
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
*****************************
🥀☘️🥀☘️🥀☘️🥀☘️🥀☘️
16. మగ(వా)ని మాటలు
☘️🥀☘️🥀☘️🥀☘️🥀☘️🥀
అప్పుడెప్పుడో
పట్టుచీర కొంటానన్నారు
పరవశించిపోయాను
కాసుల పేరిదిగో
కానుక నీకు అన్నారు
అందరికీ చాటింపు వేసుకుని
ఆశగా ఎదురుచూశాను
నగలెందుకోయ్
నీ నగుమోము చాలన్నారు
నమ్మేసి నవ్వుకున్నాను
మాయ మాటలు చెప్పి
మనసునూ ప్రేమనూ
దోచుకుంటూనే
ఆడవారి మాటలకు
అర్థాలు వేరంటారు
మరి నేను మీ మగవారి మాటలకు
అర్థాలే లేవంటాను
మరి మీరేమంటారు????
సింహాద్రి జ్యోతిర్మయి
న.ర.సం. ఉపాధ్యక్షురాలు
ఒంగోలు
1.4.2018.
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
మీ గీత కు నా రాత
☘️🎵☘️🎵☘️🎵☘️🎵☘️🎵
17. గాజుల సవ్వడులు
🎵☘️🎵☘️🎵☘️🎵☘️🎵☘️
చిట్టి పాపాయిగా నాపై దిష్టి కళ్ళు పడుతున్నప్పుడు
ఆడపిల్లగా నా పరువాన్ని గుర్తించినప్పుడు
అతని వధువుగా చిటికెన వేలు పట్టినప్పుడు
ప్రేమతో ఆ అనుబంధాన్ని పెనవేసుకున్నప్పుడు
సీమంతపు శోభలతో ఆశీస్సులందుకున్నప్పుడు
ఒడిలోని చంటిపాపను జోకొట్టి లాలిస్తున్నప్పుడు
దేవుడి గూటిలో దీపం పెడుతున్నప్పుడు
దీవెనలందగా పతిపాదాలు తాకినప్పుడు
ఇంటి పనులతో సతమతమై పోతున్నప్పుడు
వేడుకలలో హడావిడిగా పనులు పురమాయిస్తున్నప్పుడు
సందెవేళ సిగలో మల్లెలు తురుముకుంటున్నప్పుడు
సమయం చూడకుండా శ్రీ వారు చేయిపట్టి లాగినప్పుడు
ఎదిగే పిల్లల తప్పులను దండిస్తున్నప్పుడు
ఒకింటి వారైన పిల్లలను దీవిస్తున్నప్పుడు
నా స్త్రీత్వాన్ని
పరిపూర్ణం చేస్తూ
నన్నంటిపెట్టుకున్న గాజులు
అపురూపమైన నా అనుభవాల రుజువులు.
సింహాద్రి జ్యోతిర్మయి
20.4.2018
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
🌲🌺🌲🌺🌲🌺🌲🌺🌲🌺
18. శత్రుశిబిరంలో
🌺🌲🌺🌲🌺🌲🌺🌲🌺🌲
ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఔనేమో అనుకున్నాను
ఆడదానికి అందమే శత్రువు
అంటే కాబోలు అనుకున్నాను
కానీ మరీ ఇలా
నాలుగు నెలల పసిగుడ్డును
నాలుగేళ్ల చిరుమొగ్గను
వయసుడిగిన ముదివగ్గును
కూడా వదలడం లేదంటే
అసలు నా ఆడజన్మే
శత్రువేమో అనిపిస్తోంది
ఎన్ని సంఘటనలు
ఈ చెవులతో వినాలి?
ఎన్నిసార్లు ఈ గుండె చెరువవ్వాలి?
చిదిమివేయబడ్డ
ఎన్ని పసిమొగ్గల్ని
ఈ కళ్ళతో చూడాలి?
ఓ!ఏడుకొండల వాడా!
నీలా నన్ను కూడా శిలగా మార్చేసేయి
ఓ శివయ్యా!
నీ గొంతులోని గరళాన్ని
నా తనువంతా నింపేసేయి
ఓ బ్రహ్మయ్యా!
నువ్వు రావణుడికిచ్చిన శాపాన్ని
పురుషజాతి కంతా వర్తింపజేయి.
లేకుంటే నాకు మనుగడలేదు.
సింహాద్రి జ్యోతిర్మయి
3.5.2018
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
🌾🎶🌾🎶🌾🎶🌾🎶🌾🎶
19. మగబుద్ధి
🎶🌾🎶🌾🎶🌾🎶🌾🎶🌾
ఒక పక్కన
పెరుగుతున్న కరోనా
కలిగిస్తున్నది ఆందోళన
మరో పక్క చైనా
కయ్యానికి కాలు దువ్వుతూ
కవ్వింపు చర్యలకు
పాల్పడుతున్నా
మానవాళి మనుగడే
ప్రశ్నార్థకమౌతున్నా
అవన్నీ
డాక్టర్లు,ప్రభుత్వాలు,
సైనికుల సమస్యలని
భావిస్తూ
నా దేశంలో
సగటు మగవాడు మాత్రం
తన పని తాను చేసుకు పోతున్నాడు
ఒకడేమో
స్త్రీ నగ్నత్వాన్ని
చిత్రించి చూపి,చూసి
ఆనందిస్తున్నాడు
మరొకడు
కుక్కకు ఉన్నంత
కనికరమైనా లేకుండా
నువ్వంటే పడిఛస్తున్నా
అన్న భార్యను
అయితే చావు అన్నట్లు
వేధించి చంపుతున్నాడు
ఒకడేమో
తన సహోద్యోగి మీదకు
మృగంలా ఉరికి
జుట్టు పట్టి ఈడ్చి
సభాపర్వం సాగిస్తున్నాడు
మరొకచోట
పసితనాన్ని నిర్బంధించి
పశుబలంతో అనుభవించి
అసహాయతను
అడ్డం పెట్టుకొని
కసాయితనాన్ని
కప్పెట్టుకుంటున్నాడు
ప్రాణభయంతో
ప్రపంచం
ఒణికిపోతున్న
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా
ఆడవారిపై ఆగని
అత్యాచారాలనుగని
నేడు గానీ
మహాకవి శ్రీశ్రీ
ఉండి ఉంటే
కాదేదీ కవిత కనర్హం
అనే
తన కవితా
పంక్తులను మార్చుకుని
ఆడవారిపై అకృత్యాలకు
పాల్పడటానికి
కాదే సమయమూ అనర్హం
ఔనౌనోయ్ ఇది
ఆటవిక న్యాయం
అనేవాడేమో కదూ!
మగవాడా!
అడ్డులేక రెచ్చిపో!
దేశ గౌరవమా!
సిగ్గుతోటి చచ్చిపో!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.7.2020
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
🍁🌲🍁🌲🍁🌲🍁🌲🍁🌲
20. ప్రేమ సాగరం
🌲🍁🌲🍁🌲🍁🌲🍁🌲🍁
సముద్రం
ఉప్పును తనలోనే దాచుకొని
మంచినీటి మబ్బుగా మారి
నేలపై వర్షించినట్లుగా
తల్లిదండ్రులు
పిల్లలు చేసిన గాయాలతో
జాలువారే
కన్నీటి ఉప్పదనాన్ని దిగమింగి
ప్రేమనే వర్షించడానికి
ప్రయత్నిస్తుంటారు
కడలి
కన్నప్రేమ
రెండూ అనంతం కదూ!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.6.2020
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
🏵️🍀🏵️🍀🏵️🍀🏵️🍀🏵️🍀
21. బడి గంటలు
🍀🏵️🍀🏵️🍀🏵️🍀🏵️🍀🏵️
జీవితమనే
పాఠశాలలో
పరిస్థితులు అనే
పంతులమ్మలు
ఒకదాని తర్వాత ఒకటి
కొత్త కొత్త పాఠాలతో
వస్తూనే ఉన్నాయి.
కొన్ని మాతృభాష లా
ఆహ్లాదాన్ని కలిగిస్తాయి
కొన్ని ఆంగ్ల భాష లా
తప్పనిసరి అవుతుంటాయి.
కొన్ని జాతీయ భాషలా
అర్థం చేసుకుని
శిరసావహించవలసినవి
కొన్ని గణితంలా
బుర్ర బద్దలు కొట్టుకున్నా
పరిష్కరించలేనవి
కొన్ని చరిత్ర పాఠం లా
మార్చలేనివి
కొన్ని
భౌగోళిక శాస్త్రం లా
చిత్రవిచిత్రమైనవి
కొన్ని శాస్త్రవిజ్ఞానం లా
వినూత్న అనుభవాలను ఇచ్చేవి
కొన్ని
సాంకేతిక విద్య లా
ఆసక్తి కరంగా ఉండేవి
కొన్ని
ఆటలు పీరియడ్ లా
సరదాలు నింపేవి
ఊపిరి సలపకుండా
ఇన్ని నేర్చుకుంటున్నా
జాలి లేకుండా
భగవంతుడు కూడా
అప్పుడప్పుడూ
హెడ్మాస్టర్ లా వచ్చి
ఊహకందని
సమస్యలనే
బెత్తాన్ని ఝళిపించి
భయపెట్టి
పాఠాలు నేర్పుతుంటాడు.
అయినా నాకు
బడంటే భయంలేదు
ఆత్మవిశ్వాసంతో
ఆకళింపు చేసుకునే
ప్రయత్నం చేస్తూనే ఉంటాను.....
చివరిగంట కొట్టేవరకు
బడిని విడిచిపెట్టేవరకు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.5.2019.
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా కవిత
(పాతదే)
🌹🎵🌹🎵🌹🎵🌹🎵🌹🎵
22.అబద్ధాలు చాలు
🎵🌹🎵🌹🎵🌹🎵🌹🎵🌹
నీ రాకతో
నా జీవితం లోకి
వసంతమే నడిచొచ్చింది
నువ్వు లేకపోతే
నాకు క్షణం గడవదు
నీ చేతివంట అమృతమే
నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది
నీ చిన్న నవ్వు చాలు
చింతలన్నీ మర్చిపోతాను
సన్నగా తీగలా
ఉండటం కంటే
నీలా బొద్దుగా
ఉంటేనే నాకిష్టం
నా విజయం వెనుక
ఉన్నది నువ్వే
నగలు అందంగా లేని
ఆడవాళ్ళకు గానీ
నీకెందుకు?
నీలో తెలియని
కళ ఏదో ఉంటుంది
అందమైన ఏ ఆడవాళ్ళని చూసినా
నువ్వే గుర్తుకొస్తావు
వయసు పెరుగుతున్నా
నీలో చలాకీతనం
తగ్గలేదు సుమా!
ఈ మాత్రం
అబద్ధాలు కూడా
ఆడలేరా!
నన్ను సంతోషపెట్టడానికి,
మా ఆయన
బంగారమని
పొంగిపోవటానికి
ఏమిటో!
మా ఆయనకి
అబద్ధాలాడటం కూడా రాదు.
🤣🤣🤣
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.3.2020
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
*****************************
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
23. అమ్మ వీ(వే)డుకోలు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
నా జన్మకు సాఫల్యమని
మురిసి నిన్ను కన్నాను
మా ప్రేమకు
రూపం నీవని
అపురూపంగా పెంచాను
కలలగూటిలో నీకు రెక్కల్ని పొదిగి
కమ్మని మమకారంతో కాచుకుని సాకి
త్యాగాల మెట్లపై అందలాలెక్కించి
ఆనంద పడ్డాను
ఆ శ్రమను మరిచాను
మా ఆశల ఆకాశంలో
చిన్నారి గువ్వలా
ఎగురుతూ,ఎదుగుతూ
కనువిందు చేస్తావని
కళ్ళారా చూస్తానని
ఎదురుచూసే ఈ అమ్మ మదికి
ఎడబాటే ఎదిరయ్యింది.
అవకాశాల విమానమెక్కి
అమెరికాలో బ్రతకాలని
వలసపక్షులై మీరు
వదలి వెళ్ళిపోతే
కన్నబిడ్డ కంటికి దూరమై
కన్నప్రేమ కన్నీటి ధారలై
ఎంత కాలమిలా?
మీరు లేని మా బ్రతుకెలా?
వృద్ధాప్యానికి ఊతమవుతావనుకుంటే
నిర్దాక్షిణ్యంగా నీదారి వెతుక్కున్నావు.
తపించగలనే గానీ
శపించలేని అమ్మను.
ఎలా ఉన్నారంటూ ఫోనులో
అప్పుడప్పుడూ పలకరించే మీరు
ఎప్పుడొస్తారోనంటూ ఊరిలో
ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూ మేము
నిరాశలతో
నిట్టూర్పులతో
అలసిపోయిన గుండె ఆగిపోయింది
నిన్ను కనలేని నా కన్ను
మూతపడిపోయింది.
నిన్ను కన్న నా దేహం మాత్రం
మంచుపెట్టెలో నిర్జీవంగా
కన్నా!ఇదిగో
కాచుకుని ఉంది
నీ కడసారి చూపుకోసం
నీ కన్నీటి చుక్కకోసం.
సింహాద్రి
14.5.2017.
**********************
24*వర్ణ సంశోభిత వనిత*
ఆమె
నుదుటి బొట్టులో *ఎరుపు* వన్నె
సోగకన్నుల్లో *నలుపు* వన్నె
విచ్చుకున్న పెదవుల్లో *గులాబీ* వన్నె
పల్వరుసలో *తెలుపు* వన్నె
లేలేత పాదాలు *పసుపు* వన్నె
చేతి గాజుల్లో *ఆకుపచ్చ* వన్నె
చుట్టుకున్న చీరలో *నీలి* వన్నె
కురులలోని విరులు *కనకాంబరం* వన్నె
ఆభరణాలలో అందాలు *బంగారు* వన్నె
రోజుకొక్క ఆహార్యంలో మెరిసి మురిపించే
ఆమె మీతో ఉందంటే
మీ జీవితం
నిత్యమూ *హోలీ పండుగే*
మరి మీరు
ఔనంటారా!
కాదంటారా!
మిత్రులందరికీ *హోలీ పండుగ* శుభాకాంక్షలు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.3.2023
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
25🌺 నేను -- 1 🌺
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇంటిని వెలిగించి
పిల్లలను తీర్చిదిద్దే వేళ -
నేను దివ్వెను
మగని మనసు మురిపించి
మనుగడ సుగంధాల నింపు వేళ - నేను పువ్వును
కన్న ప్రేమను కలిపి
గోరుముద్దలు చేసి
బుజ్జి బొజ్జ నింపువేళ
--నేను బువ్వను
ఆకాశమే హద్దుగా
అవకాశాలను అందిపుచ్చుకునే వేళ - నేను గువ్వను
అన్యాయాలను ఎదిరించి
అస్తిత్వం కాపాడుకునే వేళ - నేను రవ్వను
చైతన్యమే స్వభావంగా
నా చేవ చూపు వేళ - నేను మువ్వను
నేను ఆకాశంలో సగాన్ని
నేను అతనిలోనూ సగాన్నే
నేనీ సృష్టికి ఆధారాన్ని
నేనీ జగతికి ఆరాధ్య దైవాన్ని
నేనే అమ్మను
నేనే అతివను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.3.2020
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
26.నూతన సంవత్సరం
జనవరి 2017
కాలం చెల్లిపోయిన
కరెన్సీ నోటులా
బిక్కమొహం వేసుకుని
వెళ్ళిపోతోంది పాత సంవత్సరం
కొత్త రంగులద్దుకుని
పెళపెళ మంటూ
కళకళ లాడుతున్న
రెండువేల నోటులా
కోటి ఆశల్ని మోసుకొస్తోంది
కొత్త సంవత్సరం
సంతోషం గా స్వాగతిద్దాం
మంచి చేస్తుందని
విశ్వసిద్దాం.
27.జెండా వందనం
మూడు మతాలకు
తాను ప్రతీక
మువ్వన్నెల మన పతాక
అది ఆకాశపు అంచులు మీటు
మన స్వాతంత్ర్యపు అవధులు చాటు
ఎందరెందరో దేశభక్తుల
త్యాగాలకు ఇది ప్రతిరూపం
ఎగురుతున్న మన జెండా
మనకెంతో అపురూపం
మన ఐక్యత దూరం చేసే
మారణాయుధం మతవిద్వేషం
మన జెండా పరువును తీసే
మహమ్మారి ఈ మహా విషం
కయ్యానికి కాలునుదువ్వే
దాయాదుల మదమణిగించే
సాహస వీరుల శౌర్యపు తేజం
దిశలను చాటే విజయ కేతనం
మనమంతా ఒక్కటి అంటూ
అనుకుంటే అది సహవాసం
మన జెండా కాంతులు అంటే
భరతమాత చిరు దరహాసం
సంతోషంతో సగర్వంగా
ఈ పండుగ వేళ అందరం
మనసారా మన జెండా కు
చేద్దామిదె కలసి వందనం.
జై హింద్
మా విద్యార్థుల కోసం ఎప్పుడో రాసిన కవిత
సింహాద్రి
26.1.2017.
28. ప్రణయం----ప్రళయం
ప్రేమ
పంచ భూతాత్మికం
జీవితాన్ని వర్ణమయం చేస్తే...ఆకాశం
మాడ్చి మసిచేస్తే.....పిడుగుపాటు
అంటిపెట్టుకుని ఉండి హాయినిస్తే..మలయ మారుతం
అగాథాలకు విసిరేస్తే......పెను దుమారం
బ్రతుకును వెలిగిస్తే....కాంతి కిరణం
కార్పణ్యంతో కాల్చేస్తే.....కార్చిచ్చు
మైత్రి దాహాన్ని తీరిస్తే.....జీవనాధారం
ముంచేసి ఉసురుతీస్తే......సునామీ
మనుగడకు ఆధారమైతే...విశ్వంభర
నిరాధారంగా నిలబెడితే....భూకంపం
ప్రేమ.....
పంచ భూతాత్మకమైతే.....ప్రణయం
పంచ ప్రాణాలనూ హరిస్తే...ప్రళయం.
పిల్లల్లారా!విజ్ఞత ప్రదర్శించండి
విలువలతో జీవించండి.
శుభాశీస్సులతో
సింహాద్రి
14.2.2017.
29.వైఫై
ప్రేమ లేకపోతే
ప్రపంచం శూన్యం
అనిపించేది
ఒకప్పుడు
ఇప్పుడేవిటో?
ఆ స్థానాన్ని
వై. ఫై
ఆక్రమించినట్లు
అనిపిస్తోంది.
కం.
వైఫుని తూచగ తనతో
వైఫైయే మొగ్గు చూపి,వనితను మించున్
సేఫే మాత్రము కాదిది
ఆఫున నుండుము కనీస మపుడపుడైనన్.
30. రహదారు(ణా)లు.
నల్లని తారురోడ్డు
నరకానికి తెరచిన వాకిలి
సజావుగా సాగుతున్న
ప్రయాణంలో
బ్రతుకునావను కబళించే
మృత్యుకెరటం..ప్రమాదం
ఒక నిర్లక్ష్యం
ఒక ఏమరపాటు
ఒక కునికిపాటు
ఒక తొందరపాటు
ఒక బాధ్యతారాహిత్యం
కారణమేదైనా కానీ
అది
సామూహిక మరణాల
శ్మశానవాటిక.
అక్కడ
రెప్పపాటులో
తలరాతలు
తారుమారవుతాయి
విధి విసిరిన
ఇనుప పంజాలో ఇరుక్కుని
ఆర్తనాదాలు
అంతిమ శ్వాసలు విడుస్తాయి
ఛిద్రమైన దేహాలు
రక్త,మాంస ఖండాల
భీతావహ దృశ్యాలు
అయినవారికి ఆచూకీ దొరకని
అనాథ ప్రేతాలు
జీవితం క్షణికమన్న సత్యాన్ని
నిరూపించే నిదర్శనాలు
అది మరుభూమికి మరో రూపం
ఆ శవాల సాక్షిగా
మాంగల్యాలు తెగిపడతాయి
ఆశల దీపాలు ఆరిపోతాయి
బాల్యాలు అనాథలవుతాయి
వృద్ధాప్యాలు జీవచ్ఛవాలవుతాయి.
అక్కడ
ఏ వేదనా స్వరంవిన్నా
కలచివేసే కన్నీటి గాథలు
ఇన్ని గుండె కోతలనూ
తనలో ఇముడ్చుకున్న
ఈ రహదారి
సాగిపోయే వాహనాల పాదాలకు
మిగిలిన రక్తపు మరకలంటించి
మలినాన్ని కడిగేసుకుని
నల్లబడ్డ మొహంతో
మౌన సాక్ష్యంలా నిలుస్తుంది.
ఆప్తులను
జ్ఞాపకాల అంపశయ్యపై
నిర్దాక్షిణ్యంగా విడిచి
మరణశాసనాలు రాసే
ఈ మధ్యంతర ముగింపులో
నేరమెవరిది?
శిక్షలెవరికి?
2012 ఆగష్టు లో కళామిత్ర ఒంగోలు వారు నిర్వహించిన కవితల పోటీల్లో బహుమతి పొందిన కవిత.
నిన్న రాత్రి జరిగిన బస్సు ప్రమాదం చూసి ఈ కవితను పోస్ట్ చేస్తున్నాను.
సింహాద్రి
28.2.2017.
31.శూన్యం
ఆకాశంలో సగం
ఆడవాళ్ళు అంటున్నారు
పొంగిపోయేరు సుమా!
ఆలోచించండి
అర్థమవుతుంది
అకాశం అంటే
శూ ............ న్యం.
సింహాద్రి
8.3.2017.
32.జడతో నా బంధం.
నాకు ఊహ తెలిసినప్పటినుండీ
నా వాలుజడ
నాకో ప్రత్యేక గుర్తింపు
నల్లగా నిగనిగ లాడుతూ
నాగుపాములా నాట్యం చేస్తూ
నా అడుగులకు అందాన్నిస్తూ
బారెడు పొడవున్న నా జడను
మెచ్చుకోలుగా చూసే కళ్ళు
ఆశ్చర్యం తో చూసే కళ్ళు
అసూయతో చూసే కళ్ళు
ఆరాధనగా చూసే కళ్ళు
నా వీపుకి గుచ్చుకోవడం
నాకుతెలుస్తూనే ఉండేది
గర్వం చిరునవ్వుగా మారి
నా పెదవులపై చిందులాడేది
పూలజడకు నాకు
సవరం అక్కరలేదని
ఇరుగూ పొరుగూ పొగుడుతుంటే
పిల్లకెంత దిష్టంటూ
కల్లు ఉప్పుతో దిగదుడిచే
బామ్మను చూసి నవ్వుకోవడం
బాగా గుర్తుంది నాకు
నన్ను నేను సత్యభామలా
భావించుకునేలా చేసిన నా జడ
పెళ్ళి చూపుల్లోనే మా వారిని
నన్ను కట్టుకునేలా
కట్టి పడేసింది.
పెళ్ళయిన కొత్తల్లో
నా ప్రేమ బంధంలో
చిక్కుకునేలా చేసింది.
ఏళ్ళు గడిచాయి
ఎన్నో మార్పులొచ్చాయి
సంసారం,సంతానం
బరువులు,బాధ్యతలు
అశ్రద్ధ,ఆందోళన
తమ ప్రభావాన్ని ముందుగా
నా జడపైనే చూపించాయి.
తలస్నానం చేసినప్పుడల్లా
తలలో దువ్వెన పెట్టినప్పుడల్లా
కుచ్చులు కుచ్చులుగా
ఊడిపోతున్న
కురులను చూస్తున్న కొద్దీ
కలవరం కంటి నిద్ర కాజేసింది
పలచబడుతున్న జుట్టుకి తోడుగా
తొంగిచూస్తున్న తెల్లవెంట్రుకలు
గోరుచుట్టుపై రోకటి పోటులా
నా దిగులును ద్విగుణం చేశాయి.
రంగువేసి వయసును దాచటానికి
రకరకాల నూనెలు,షాంపూలతో
ఊడే జుట్టును కాపాడడానికి
నేను విన్న చిట్కా వైద్యాలన్నీ
పాటించి చేసిన ప్రయత్నాలన్నీ
బూడిదలోపోసిన పన్నీరయ్యాయి
పీలగా,పిలకలా మారిపోయిన
నా జడను చూసి
ఇప్పుడెవ్వరి కళ్ళల్లోనూ
ఆరాధనాభావం లేదు.
మా ఆయన కళ్ళల్లోనూ
తగ్గిందేమోనని
మనసులో చిన్నఅనుమానం
ఇప్పుడు నా గర్వం కూడా మాయమయ్యింది
అయినా, నా మనసు
ఓటమిని ఒప్పుకోదు.
అందుకే,ఇప్పుడెక్కడైనా
అందమైన వాలుజడ
కనపడగానే
అసూయతో నా కళ్ళు మండకుండా
నాకునేనే చెప్పుకుంటుంటాను
బుద్ధిమంతురాలి జుట్టు
భుజాలు దాటదని.....
సింహాద్రి
9.3.2017.
33.అనంతాకాశం.
ఆకాశపు
సంతోషం... హరివిల్లు
అరనవ్వు....చిరు జల్లు
విచారం....నల్లమబ్బు
కన్నీరు.... వాన ముసురు
ఆక్రోశం....ఉరుము
ఆవేశం....పిడుగు
చాంచల్యం....మెరుపు
అద్భుతం....పాలపుంత
వేడుక.....పున్నమి
వేదన.....అమావాస్య
ఇంటిదీపం....నక్షత్రం
కంటిమంట.....సూర్యబింబం
శరీరం.......తైలవర్ణ చిత్రం
తత్వం... ఉన్నదనిపించే శూన్యం.
సీంహాద్రి
14.3.2017.
34.చిరునామా
నీరు
నేడు తన చిరునామా మార్చుకుంది.
భూగర్భం లో ఇంకి
రైతు కంటి నుండి ఉబికి.....
సింహాద్రి
22.3.2017.
ముఖపుస్తక మిత్రులందరికీ శుభోదయం.
35.భారత (రత్నానికి) వందనం.
అతడు
భరించరాని అవమానాల అడవిలో
రగిలి పెరిగిన కార్చిచ్చు
తొక్కివేయబడ్డ జాతి
ఎర్రబడ్డ కళ్ళల్లోనుండి
తోసుకువచ్చిన తొలిఉషస్సు
జ్ఞానం ఒకరిసొత్తు కాదన్న సత్యాన్ని
ఎదిగి తాము చాటగలమని
నిరూపించిన మానవ మేథస్సు
తరతరాలుగా పాతుకున్న
తారతమ్యాల కుదుళ్ళను
రాజ్యాంగపు ఖడ్గంతో
ఖండించిన కలం పోటు
బడుగుజాతి బలపడాలని
భరతజాతి ఎదగాలని
అవకాశాల ఆకాశగంగను
అందరికీ పంచిన అపర భగీరథుడు
గుణకర్మల తీరునుబట్టే
కులవిభజన చేశానన్న
గీతాచార్యుని మాటను మరచి
గిరిగీసుకున్న కులతత్వాన్ని
జాతికి దిశానిర్దేశం చేసిన
రాజ్యాంగనిర్మాత చూపుడువేలు
నిలదీస్తోంది.
అసమానతలకు అంతం ఎప్పుడని
ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది.
పంచములంటూ పెంచుకున్న అసహ్యాన్ని
గుండె పొరలనుంచి తొలగించేదెప్పుడని
గుండెకు హత్తుకున్న
పుస్తకం పుటలు
నిశ్శబ్దంగా నిలదీస్తున్నట్లుంది
ప్రగతిమార్గాన్ని నిర్దేశించి
భవిష్యద్దర్శనం చేసిన
బాబాసాహెబ్ అంబేద్కర్ ని
దళితనేతగా మాత్రమే చూసే
దౌర్భాగ్యం వద్దు మనకి
మహా నాయకుణ్ణి మన్నించండమంటే
జయంతి రోజున
నాలుగు పూలదండలు
వర్థంతి రోజున
సమర్పించే నివాళులు కాదు
అసమానతలు లేని
అవనీతలంగా
భారతదేశాన్ని తీర్చిదిద్దడమే
భారతరత్నకు
నిజమైన నివాళి.
సింహాద్రి
14.4.2017.
36.ఈస్టర్
శిలువ వేయబడ్డ కరుణ
మరణాన్ని జయించి
మరల లేచిన శుభదినం
తనను దండించిన
పాపుల్ని కూడా
దయజూడమంటూ
సహనం తో క్షమించిన
క్రీస్తు పునరుత్థానం
మానవాళికి మహోదయం
అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు.
37.మంటల్లో మానవుడు
శివుడికి
తపోభంగం చేయ
ప్రయత్నించాడు మన్మథుడు.
భవుడు ఉగ్రుడై
అగ్నినేత్రం తెరిచాడు.
ప్రకృతి సమతౌల్యం
దెబ్బతీస్తున్నాడు మానవుడు.
సూర్యుడు కన్నెర్ర జేసి
నిప్పులు కురిపిస్తున్నాడు.
ఆ మన్మథ దహనం
లోక కల్యాణ కారకమయ్యింది
ఈ భాను ప్రతాపం
మానవజాతిని మసిచేస్తోంది.
ప్రకృతిమాత
సహనం మీద
మానవుడు కొట్టిన దెబ్బకు
పర్యవసానం
ఈ వడదెబ్బ.
ఇకనైనా మేలుకొందాం.
ఇకపై మేలు కందాం.
సింహాద్రి జ్యోతిర్మయి
22.5.2017.
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
38.అమృతహస్తం
ఆ చెయ్యి
అక్షరాలు దిద్దిస్తుంది
అవసరమైతే దండిస్తుంది
అమ్మలా లాలిస్తుంది
నాన్నలా నడిపిస్తుంది
అందరినీ దీవిస్తుంది
అందలాలనెక్కిస్తుంది
చిన్ని దివ్వెలను వెలిగిస్తుంది
చీకటి ఛాయలు తొలగిస్తుంది
భవిత బరువును మోస్తుంది
జాతి పరువును కాస్తుంది
ధరణి నంతటిని శాసిస్తుంది
దండమొక్కటే ఆశిస్తుంది
వేల మనసులను గెలుస్తుంది
వేలుపు తానై నిలుస్తుంది
ఆ చేయి
మమతకు రూపం మాష్టారిది
ఆ చేతికి నా వందనమిది
సింహాద్రి జ్యోతిర్మయి
తనువుపై గాయాలేమీ లేవు
అయినా కన్ను చెమరిస్తోంది
మనసు గాయపడిందో ఏమిటో!
సింహాద్రి జ్యోతిర్మయి
😌😌😌
39.
నానిజాలు
పెదవి తోట లో
విరబూసిన వసంతం
చిరునవ్వు
*************
కనురెప్పల వాకిలి
మూయగానే
తెరుచుకునే
అందాల ప్రపంచం.......కల.
*************
****************
సింహాద్రి జ్యోతిర్మయి
40.భామా వి (శ్వాస ) జయం.
నన్ను చూడగానే
అతడి కళ్ళు
మతాబుల్లా వెలిగేవి
సంతోషాల కాకరపువ్వొత్తులు
ముసి ముసి నవ్వులై
నా పెదవులపై విరిసేవి
అతడు భూచక్రంలా
నా చుట్టే తిరిగేవాడు
పెన్సిళ్ళ కవిత్వం వెలిగించాడు
పొగడ్తల తాళ్ళతో అలరించాడు
వినోదమంతా విష్ణుచక్రంలా
నా అరచేతుల్లోనే
ఇమిడిందనుకున్నాను
సీమటపాకాయల్లా
అతడు పేల్చే జోకులకి
చిచ్చుబుడ్డిలా పరవశించి
నవ్వుల రవ్వలు
కురిపించాను
ఆశ్వయుజ పున్నమి వయసు
ఆదమరచి అమావాశ్యవైపు
అడుగులేస్తున్నా
అతడి సహచర్యం
దీపావళి అవుతుందని ఆశించాను
తనతో నా భవిష్యత్తు
సప్తవర్ణ సంశోభితమై
సంబరాల అంబరంలో
తారాజువ్వలా దూసుకుపోతుందని
కలలు కన్నాను
అగ్గిపుల్లలా అరక్షణపు
ఆనందాన్ని వెలిగించి
పాముబిళ్ళలా నన్ను మసిచేశాడు
పొగచూరి నల్లబారిన తర్వాతే
మేను మరచిన వివేకం మేల్కొంది
అప్పటికే నా బ్రతుకు బాణాసంచా
చప్పున చల్లారి చెల్లా చెదరయ్యింది
తన పెళ్ళి శుభలేఖ
నా చేతుల్లో పెడుతూ
మన పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని
అతడు పేల్చిన లక్ష్మీ ఔటు
హైడ్రోజన్ బాంబులా
నా గుండెల్లో పేలి
జీవిత ప్రమిదలో
నేను వెలిగించుకున్న
కలల దీపాల్ని
గుప్పున ఆర్పేసింది
పెద్దవారి హెచ్చరికలు
పెడచెవిన పెట్టి
అమావాస్య లాంటి ప్రేమను నమ్మి
ఆవరింప జేసుకున్న చీకట్లలో
పశ్చాత్తాపం కన్నీటి చారిక కట్టింది.
నేను చేతులు కాల్చుకుంటానేమోనని
జాగ్రత్తలు తీసుకునే అమ్మా నాన్నలు
బ్రతుకునే బుగ్గిచేసుకున్నానని
తెలిస్తే బావురుమంటారని
మనోనిబ్బరంతో
బాధను మాటుచేసి
ముందడుగు వేస్తున్నా
ఆత్మవశ్వాసమనే అమ్ముతో
వలపు జ్ఞాపకమనే నరకుణ్ణి
సత్యభామ లా జయించి
చదువనే కార్తీక దీపంతో
చక్క జేసుకుంటానే గానీ
బేలనై బ్రతుకును అంతం చేసుకోను
ఇది భామా విజయం
ఆధునిక యువతికి
అనుసరణీయం.
సింహాద్రి జ్యోతిర్మయి
18.10.2017.
ఒంగోలు నగరపాలక సంస్థ
మరియు
జిల్లా సాంస్కృతిక శాఖ
ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో
నేను చదివిన దీపావళి కవిత
41.ఈ బాల్యం మాకొద్దు
బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న
బుజ్జి బుజ్జి పాదాలను
బూట్లు సాక్సులతో బంధించి
మోయలేని బరువును భుజాలకెత్తి
క్రిక్కిరిసిన ఆటోలో
ఉక్కిరిబిక్కిరి చేస్తూ
క్లాసురూములోనే
ఖైదీలుగా మార్చేసి
గంటకొక్క టీచరొచ్చి
గంటకొట్టినట్లుగా
అర్థంకాని భాషలో
అనర్గళంగా
చెప్పేసిపోతుంటే
చెయ్యలేనంత హోం వర్కుతో
వసివాడిపోతున్న
పసితనం మాకొద్దు
అమ్మ గోరుముద్దలకోసం
ఆరాటపడే ఆకలి
ఆయమ్మ సాయంతో
ఎంగిలిపడటం నేర్చుకుంటోంది
క్లాసులో టీచరు కన్నెర్రజేస్తే
కావలించుకుని ఓదార్చే
అమ్మ దగ్గరలేక
బిక్కచచ్చిన మనసు
వెక్కిళ్ళుపడుతూ
కన్నీళ్ళు మింగింది
మాతృభాష మహానేరమైన
పాఠశాల పంజరంలో
ఆంగ్లభాష చిలకపలుకు
భావ ప్రకటన స్వేచ్ఛను
బాల్యంనుండి హరించింది
ఆడుకోవటం అల్లరి చేయటం
కబుర్లు చెప్పటం కథలు వినటం
కాన్వెంట్ కల్చరు క్రమశిక్షణ మాటున
కల్లలుగా మారి
కలగా మిగిలింది
ఆటస్థలాలు లేని
అంతస్థుల బడిలో
బాల్యాన్ని మూల్యంగా చెల్లించి
పొందబోయే భవిష్యత్తు
బంగారమైనా గానీ
అది మాకొద్దు
ఈ బాల్యం మాకొద్దు.
సింహాద్రి జ్యోతిర్మయి
నరసం ఉపాధ్యక్షురాలు.
42.గ్రంథాలయం
అక్షరాలు నేర్చినట్టి
అందర్నీ పిలుస్తుంది
అక్షయ సారస్వతాన్ని
తన కడుపులోన దాస్తుంది
జ్ఞాన నేత్రం తెరిపిస్తుంది
జ్ఞానదాహం తీరుస్తుంది
మొన్నటి మన
సాహిత్య వారసత్వం
నిన్నటి
చారిత్రక సత్యాల నేపథ్యం
నేటి శాస్త్రీయ దృక్పథం
అన్నింటికీ ఉంటాయి
తనలోన తార్కాణాలు
మానవ మేథస్సుకవి
కవి మౌన సాక్ష్యాలు
కంప్యూటర్లు ల్యాపుటాపులు
కాలాన్ని శాసిస్తుంటే
ఇంటర్నెట్ లు ఇంటింటి
నేస్తాలయిపోతే
పుస్తకాల స్నేహితుల్ని
పలకరించేదెవరు?
గుట్టలుగా పడిఉన్న
పుస్తకాల గుండె తలుపు తట్టేదెవరు?
చిన్నితెరలు సీరియళ్ళు
చిద్విలాసం చూపిస్తుంటే
నవలలను నాలుగు పేజీలు
తిరగవేసే తీరికెవరికి?
రెండు ప్లస్ రెండు ని కూడా
కాలిక్యులేటర్లే లెక్కిస్తుంటే
చందమామ కథలు
శతకాల నీతులు
ముందు తరాలకు మోసేదెవరు?
చిన్ని మెదళ్ళను
పుస్తకాలతో
చెలిమిచేసి ఎదగనివ్వండి
చిన్నారి పాదాలను
గ్రంథాలయాలవైపుగా సాగనివ్వండి
పాఠ్య పుస్తకం కాకుండా
మరొక్క మంచి పుస్తకాన్ని
అప్పుడప్పుడైనా తిప్పనివ్వండి.
సాటిలేని స్నేహితుణ్ణి
భావి తరాలకు పరిచయం చేయండి
పుస్తకం కలిగిస్తుంది
మానసిక వికాసం
గ్రంథాలయం కలిగిఉంటుంది
విజ్ఞాన అమృతభాండం.
సింహాద్రి జ్యోతిర్మయి
నరసం ఉపాధ్యక్షురాలు.
43.క్రిస్మస్
ఆత్మవత్ సర్వ భూతాని
అంటుంది హైందవం
నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించు
అంటుంది క్రైస్తవం
పశుపాలకుల ఇంట పెరిగిన కృష్ణుడైనా
పసులపాకలో పుట్టిన క్రీస్తు అయినా
గరళం ధరించిన శివుడైనా
శిలువను భరించిన యేసుప్రభువైనా
అందరూ ఆశించింది
లోక కళ్యాణమే కదా!
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
25.12.2017.
44.క్షమాగుణం
శిలువను భరించడమంటే
ద్వేషాన్ని సహించడం
అసూయని సహించడం
పాపాన్ని క్షమించడం
క్షమాగుణాన్ని ప్రేమించడం
మరణాన్ని జయించడమంటే
అహాన్ని జయించడం
స్వార్థాన్ని జయించడం
అరిషడ్వర్గాలను జయించడం
జాతిని ఉద్ధరించడనికి
జన్మను త్యాగం చేసిన
పరిశుద్ధుడే పరమాత్ముడు అవుతాడు.
అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
1.4.2018.
45.చిరునవ్వు భాష
కళ్ళల్లో వెలిగే మెరుపుతీగ
పెదవిపై పూసే సిరిమల్లె
బుగ్గల్లో విరిసే మందారం
మనసు మాట్లాడే ఆనందాల భాష
దానిపేరే .....చిరునవ్వు
అందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.
46.పూడికతీత
గుండె నాళాలు
కొవ్వుతో పూడుకుపోతే
బైపాస్ చేసి బ్రతికిస్తున్నారు..
మెదడు తంత్రులు
అవినీతితో నిండిపోయాయి.
బాగుచేసి మానవత్వాన్ని
బ్రతికించే వైద్యుడెవరో! ...సింహాద్రి
.........47.నా ( రీ ) ఆయుధాలు.......
.
....... చీపురు --చెప్పు.....
నేను లేకపోతే
ఇంటికి లేదు శుభ్రత
అయినా నా చోటు
తలుపుమూలనే
అని చిన్నబుచ్చుకోకు
నేను లేకపోతే
కాలికి లేదు భద్రత
అయినా నా చోటు
గుమ్మం అవతలే
అని లోన నొచ్చుకోకు
అసహనం
హద్దు దాటిన వేళ
నిన్నే ఆవేశంతో తిరగేస్తాము
నిన్నే చేతుల్లోకి తీసుకుంటాము
మీరు
మా అవసరాలకు ఉపయోగపడే
ఆప్తులు మాత్రమే కాదు
ఆడవారి అవమానంలో ఆదుకుని
బుద్ధి చెప్పే శక్తినిచ్చే
ఆయుధాలు కూడా
సింహాద్రి జ్యోతిర్మయి
27.6.2018
ఈ కవిత ప్రస్థానం అనే పత్రికలో చాలా కాలం క్రితం అచ్చయింది.
...........48...మగ ( వా ) డు..........
ఆయనదీ నాది
ఒకే గూటి కాపురం
అందరూ మాది
అన్యోన్య దాంపత్యమనే
అంటుంటారు
నేనాయన్ని ఏమండీ అని పిలుస్తాను
ఆయన నన్ను ఏమే అంటారు
నా ఎటియమ్ కార్డు ఆయన చేతికిస్తాను
ఆయన బాంక్ బాలన్స్ నేనెరగను
నా అరగంట ఆలస్యానికి
నేను సంజాయిషీ ఇస్తాను
ఆయన అర్థరాత్రి రాకకు
కారణం అడగలేను
నా ఆలోచన ఆయనకు
నచ్చితేనే నిర్ణయం
ఆయనకి ఉంది
నాకు నచ్చనిది చేసే స్వాతంత్ర్యం
నా అసహనాన్ని నేను
వంటింటి పాత్రలపై చూపిస్తాను
ఆయన తన కోపాన్ని
నా ఒంటిపై ప్రదర్శిస్తారు
నా అనారోగ్యానికి ఎంతో బాధపడి
నన్ను పుట్టింటికి పంపిస్తుంది
ఆయన సానుభూతి
ఆయన చిన్న నలతకు కూడా
కలతపడిపోయి
పక్కనే ఉండి
సేవలు చేస్తుంది ఈ శ్రీమతి
ఈ విజాతి ధృవాల
అన్యోన్యతలోని
ఆంతర్యాన్ని అంతరాన్ని
అర్థం చేసుకుని
సర్దుకుపోతూ సంసారం చేసుకుంటూ
తరచి చూసి
నేను తెలుసుకున్న సత్యం
కాలానుగుణంగా
నేను మారాను
ఆయన మా ర లే దు (డు).
సింహాద్రి జ్యోతిర్మయి
29.6.2018.
49.స్నేహబంధం
స్నేహానికి
కుల భేదం లేదు
అని చాటుతుంది
శ్రీ రామ గుహుల స్నేహబంధం
జాతి భేదం లేదు
అని చాటుతుంది
శ్రీరామ సుగ్రీవులస్నేహబంధం
పేద గొప్ప భేదం లేదు
అని చాటుతుంది
శ్రీ కృష్ణ కుచేలుల మైత్రీ బంధం
చెడ్డవారికైనా
స్నేహబంధం మాత్రం అపురూపమే
అని చాటుతుంది
కర్ణ దుర్యోధనుల మైత్రీబంధం
ఆ స్నేహామృతాన్ని
ఆస్వాదించే అదృష్టవంతులు
అందరూ అమరులే
అందరికీ
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
5.8.2018
మీ గీతకు నా రాత
50.తలవంపులు
నేను తలయెత్తితే
మీకు తలవంపులని
అనాదిగా నన్ను
మెడలు వంచి ఉంచే
ప్రయత్నమే చేశారు
అదే అణకువ అని
ఆడపిల్ల లక్షణమని
నాకు నూరిపోశారు
ఇప్పుడు నాకు
చదువు ,సంస్కారం
అందం,ఆస్తి
అన్నీ ఉన్నాయి.
అయినా నేను
అహంకరించను
వినయమనే ఆభరణాన్ని
విడిచిపెట్టను.
అది సమాజానికి భయపడి కాదు అని గ్రహించు
అది స్త్రీ జాతి ఔన్నత్యం అని గుర్తించు.
సింహాద్రి జ్యోతిర్మయి
10.8.2018
51.ఇది విన్నారా!
మా ఆయన
వింటూండగానే
చూస్తూండగానే
ఏ మాత్రం
నదురూబెదురూ
లేకుండా
నాకోసం
వాళ్ళిద్దరూ
ప్రతిరోజూ విజిల్
వేస్తున్నా
మా వారికి కోపం రాదు
సరికదా!
అదుగో!
నీ కోసం విజిల్ వేస్తున్నారు వెళ్ళు
అని
చాలా మామూలుగా
చెప్తుంటారు
వాళ్ళని చూసి.
వాళ్ళల్లో
ఒకరు
వంటింట్లో కుక్కర్
మరొకరు
వాకిట్లో చెత్తబండి.
మరి మీవారూ అంతేనా!
మా ఆయన లాంటి
విశాలహృదయం
మీ వారికీ ఉందా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.11.2019
52.బలహీనత
మనిషి కేవలం
తన స్వార్థం కోసమే కాదు
తన బిడ్డల సంతోషం కోసం కూడా
ఎంతకైనా
దిగజారిపోతాడు.
ప్రేమ మనిషి కి బలమైతే
బిడ్డల పై ప్రేమ మాత్రం
తల్లిదండ్రుల బలహీనత.
పరువు మర్యాదలు
మానాభిమానాలు
అన్నీ
కన్న మమకారం ముందు
కాలరాసుకుని
నలుగురిలో నవ్వుతూ తిరగవలసిందే.😔😔
53.గోకులాష్టమి
కృష్ణా!
శ్రీహరి*దశా*వతారాలలోనూ
*నవమ* అవతారమై
వాసుదేవుడవైనావు
మహానందాంగనా
డింభకుడివై
*అష్టమి* నాడు
ప్రభవించావు
ఇంద్రకల్పిత
బీభత్సాలనుండి
ప్రపంచమనే గోకులాన్ని
*ఏడు* రోజులు
అంటే ఎల్లకాలము
కొండంత అండవై
రక్షింపజూస్తావు
అమాయకమైన భక్తితో
బంధాన్ని నీతో
అల్లుకుంటే చాలు
*ఆరు* ఋతువులు వసంతమయ్యేటట్లు
జీవన బృందావనాన్ని
పరిమళింపజేస్తావు
పరిస్థితులు దాయాదులై పగబట్టిన వేళ
*పంచ* పాండవుల వలే
అయినవారెవ్వరూ
ఆదుకోలేక నిస్సహాయులైన వేళ
అన్నవై
ఆత్మబంధువు వై
గౌరవాన్ని దక్కిస్తావు
నిన్ను నమ్మితే చాలు
*నాలుగు* పురుషార్థాలలోనూ
నీడవై వెన్నంటి నడిపిస్తావని నిరూపించావు
మూడు మూర్తుల లోను
స్థితి కారకత్వాన్ని వహించి
శిష్ట రక్షణ బాధ్యత
చేపట్టి కాపాడి
చెలికాడవైనావు
నరనారాయణులు మీరు
*ఇద్దరు*
నడయాడిన చోటనే
విజయ ఐశ్వర్యాలు
విలసిల్లగలవనే
పరమ సత్యాన్ని
ప్రకటింపజేశావు
అన్ని ధర్మాలను
ఆవలపెట్టి
నన్ను *ఒక్కడి* నే
శరణు వేడు
అదే మోక్షమార్గమని
గీతాచార్యుడివై
ఉద్బోధించావు
ఓ నల్లనయ్యా!
ఓ యశోదాతనయా!
నీకు జన్మాష్టమి శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.8.2019
నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో నేడు జరిగిన సాహితీ సదస్సు లో సరస్వతీ పుత్ర
భూసురపల్లి వారి ప్రవాహశిల్పం అనే కావ్యం గురించి శ్రీ
రాఘవరెడ్డి గారి కవితాత్మకమైన *అవలోకనం*( ఇది శ్రీ నాగభైరవ ఆదినారాయణ గారి స్పందన) అనంతరం *తొలకరి* అనే అంశంపై జరిగిన కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత
54.తొలకరి
*******
నదులన్నీ
సముద్రంలో సంగమించినట్లు
వర్ణాలన్నీ తెలుపులోనే విలీనమైనట్లు
కాలాలన్నీ ఎండాకాలం గానే
పరిణమించగా,
సూర్యుడు
ఇంట్లో కాల్చుకుతినే మొగుడి లాగా,
ఆఫీసులో
ఎదుట నిలబెట్టి
ఎడాపెడా వాయించే
కోపిష్టి బాసులాగా
మండిపడుతున్న వేళలో
ఉండు ఉండు
నేను వచ్చి
నిన్ను ఊరడిస్తాను
అని ఊరిస్తూ
అలమిన
ఆశల మబ్బులు
అంతలోనే చెదరిపోగా
ఉరుములు , మెరుపులు
రాజకీయ నాయకుల
వాగ్దానాలవలే
వ్యర్థమవగా
చినుకు కోసం తపించి
నిరాశలో హృదయం
నిట్టూర్చేవేళ
తలవని తలంపుగా
భారతిని ఓదార్చి
పోతన కలం
ఒలికించిన
భాగవతామృత వర్షంలా
హర్ష ఝరిలో
తడిపి ముంచెత్తడానికి
తాను వస్తుంది తొలకరి
చల్లని గాలితో తనువును స్పృశిస్తూ
కమ్మని వాసనతో
తినేయాలనిపించేటంత
కోరికను నాలుకకు మప్పుతూ
ఏటవాలు వయ్యారాలతో
కనులకు పండగవుతూ
సుగంధంతోనే
మనసు ఆకలిని తీరుస్తూ
నాసికకు ఆహ్లాదాన్ని అందిస్తూ
సన్నని వేణునాదంలా
వీనులకు విందు చేస్తూ
పంచేంద్రియాలనూ
పరవశింపజేస్తూ...
వస్తుంది
రైతు నేస్తం
తొలకరి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.7.2019
55.నేను చచ్చిపోతున్నాను
ఔను
నేను చచ్చిపోతున్నాను
నీకు నాపై
అతి ప్రేమ ఉంది
అయినా
నేను చచ్చిపోతున్నాను
చాలా మందిని
పెళ్ళి చూపుల్లో చూసి
నచ్చిన అమ్మాయిని యెంచుకున్నట్లు
ఎంతగానో ప్రేమించి
కలలుగని
సొంతం చేసుకున్నట్లు
నీ భార్యలాగే
నన్ను కూడా
అపురూపంగా
ఇంటికి తెచ్చుకుంటావు
విష్ణువు తన కాంతను
గుండెల్లో పెట్టుకున్నట్టు
నన్ను నీ ఎదపైనే ఉంచుకుంటావు
శివుడు గంగను
నెత్తిన పెట్టుకున్నట్లు
రాత్రి పూట కూడా
తలగడ పక్కనే
పెట్టుకుంటావు
బ్రహ్మ నాలుకపై
కొలువుతీర్చిన
సరస్వతి లా
నీ ఊసులు,ఊహలు అన్నీ
నాతోనే పంచుకుంటావు
సంతానంపై
మక్కువ పెంచుకున్నట్లు
నన్ను విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నంత
అనుబంధం
నాతో పెంచుకుంటావు
ఇంత ప్రేమ నాపై నువ్వు కురిపిస్తున్నా
నేను చచ్చిపోతున్నాను
చెప్పా పెట్టకుండా
స్నేహితుల్ని
ఇంటికి ఆహ్వానించేసి
ఆతిథ్యం ఇవ్వమని
ఇల్లాలిని ఇబ్బంది పెట్టినట్లు
నీకు నచ్చినవాటితో
నన్ను నింపేసి
ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటావు
నడుములు పడిపోతున్నా
నోరెత్తకుండా
ఇంటెడు చాకిరీ చేసే
నీ ఇల్లాలి లాగే
నేను కూడా
నీవు నాపై వేస్తున్న
భారాన్నంతా
భరిస్తూ వస్తున్నాను
నీ మునివేళ్ళు
నన్ను తాకగానే
స్పందించి నీకు
ఆనందాన్నిచ్చి
నీ అవసరాన్ని తీర్చే
నా శక్తిని కోల్పోతున్నా
మోజు తీరిపోయిందనో
మనసు
కొత్తదనం కోరుతోందనో
అవసరం తీర్చట్లేదనో
పెళ్ళాన్ని నిర్లక్ష్యం చేసినట్లు
నన్ను కూడా ఉపేక్షించి
పక్కన పడేస్తావని భయపడి
నా సర్వశక్తులు
కూడదీసుకుని
నీకు సహకరించే ప్రయత్నం చేస్తూ
ఆ ప్రయత్నంలో
కొన ఊపిరితో
కొట్టుమిట్టాడుతూ
నేను చచ్చిపోతున్నాను
మానవా!
ఇప్పటికైనా నా బాధను గమనించు
నీ అరచేతుల్లో
అందంగా ఇమిడిపోయి
అర నిముషం లో
అనంత ప్రపంచాన్ని
అందుబాటులోకి
తెచ్చిపెడుతున్న
నీ చిన్నారి సహచరిని నేను
నీ స్మార్ట్ ఫోన్ ని నేను
నీ సౌఖ్యం గురించే
సదా పాటుపడే
నా మనుగడపై
కాస్త మనసు పెట్టు
అప్పుడప్పుడూ అయినా నాకు విశ్రాంతి నివ్వు
చిరకాలం నన్ను
నీ చేతుల్లో ఉండనివ్వు
నన్ను
నన్ను బ్రతకనివ్వు
స్మార్ట్ ఫోన్ మీద కవిత రాయమని కోరిన నా ప్రియ మిత్రురాలు
చిరంజీవి సౌభాగ్యవతి
లక్ష్మి కి
ప్రేమతో అంకితం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.07.2020
56.జై జవాన్
అమ్మాయిల్ని
ప్రేమ పేరుతో వేధించి
చంపుతాను లేదా చస్తాను
అనే ఓ యువకుల్లారా!
దేశ మాతను ప్రేమించి
ఆమెను శత్రువులనుండి
రక్షించడానికి
చంపుతాను లేదా చస్తాను
అంటూ నేలకొరిగిన
అమరవీరులను
స్ఫూర్తి గా తీసుకోండి
మీ తల్లి,నేల తల్లి
గర్వపడేలా జీవించండి.
జై జవాన్.
57*ఆశయాలు...ఆకాంక్షలు*
నిన్న రవి నాకు ఫోన్ చేశారు
కాఫీ విత్ పొయట్రీ కార్యక్రమం ఉందన్నారు
నూతన సంవత్సరం లోకి
అడుగుపెడుతున్నాం
మీ ఆశయాలు,ఆకాంక్షలు
మాతో పంచుకోండి అన్నారు
సరేనన్నాను
ఆలోచనలో పడ్డాను
ఏ చీకూ చింతా లేని జీవితాన్ని అనుభవించాను
యాభయ్యవపడి రెండో సగంలో పడ్డాను
పిల్లలూ చదువులూ
పెళ్ళిళ్ళు మనవలూ
అంతా సజావుగా సాగిపోయింది
ఇప్పుడేం చెప్పాలబ్బా
గతకాలపు ఆకాంక్షలా!
రేపటి ఆశయాలా!
అని తర్జనభర్జన పడ్డాను
ఎంతోకాలం నన్ను ఊరించి
నేడు మరుగున పడిపోయి
మనసులో ఓ మూలగా
పడిఉన్న
మూడు తీరనికోరికలు
గుర్తుకొచ్చాయి
సరే నేనింతకాలం
ఎక్కడా,ఎవరితోనూ చెప్పుకోని
నిన్నటి నా కోరికల చిట్టా
ఇప్పుడు విప్పాలని పించింది
మీతో చెప్పాలనిపించింది
నవ్వకుండా వినాలిమరి
పదహారేళ్ళ లేలేత ప్రాయం లో
పాత సినిమాల ప్రభావంతో
నన్ను నేను కథా నాయికలా ఊహించేసుకుని
అందమైన భంగిమలో కూర్చుని
అలవోకగా వీణ పట్టుకుని
అద్భుతంగా వాయించేయాలని
ఎంతో ఆశ పడ్డాను
అవకాశం లేకపోయింది
ఆ కోరిక అలాగే మిగిలిపోయింది
పాతికేళ్ళ నిండు యవ్వనంలో
ఆధునికత కాస్త అంటుకున్నాక
అల్లరి బావ సినిమాలో
అందాలనాయిక జయప్రదలా
మెత్తని కాశ్మీర్ సిల్క్
చీరకట్టుకుని
చలువ కళ్ళద్దాలు పెట్టుకుని
పడవంతకారుని
స్వయంగా నడుపుకుంటూ
సరదాగా తిరిగేయాలని
చాలా ఆరాటపడ్డాను
అప్పుడేమో కారులేదు
కారు కొనుక్కున్నాకేమో కుదరలేదు
అదుగో, ఆ కోరిక కూడా
అలా కొండెక్కిపోయింది
ఇక ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక
ఇద్దరం సంపాదిస్తున్నా
నెల జీతాలు చాలక
నెట్టుకు రావడం కష్టంగా మారి
శుభలగ్నంలో ఆమనిలా
మంచిమొగుడిలా
భ్రమింపజేసే
జగపతిబాబు లాంటి మా ఆయన్ని అమ్మేసి
కోటి రూపాయలు సంపాదించేసి
మంచి డ్యూప్లెక్స్ హౌస్
కట్టించేసుకోవాలని ముచ్చటపడ్డాను
కానీ కొనుక్కునే రోజాయే
దొరకలేదు
అలా ఆ కోరికా నీరుగారిపోయింది
అయినా అనుకుంటాంగానీ
అన్నీ జరుగుతాయా ఏంటి?
అని సర్దిచెప్పేసుకుని
రెండు కోరికల్ని
పాత సంవత్సరంలా గతంలోకి
పంపించేసి
మా ఆయన్ని మాత్రం కొంగుకు కట్టేసుకుని
ఇదిగో ఇలా
సంతోషంగా గడిపేస్తున్నా
రేపటి కొత్త సంవత్సరానికి
స్వాగతం చెబుతున్నా
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
31.12.2022
58*కవిత్వంతో కాసేపు*
నేను 2022 ని
కాలం ఇంటిలో
ఇంతకాలం కాపురమున్నాను
ఈరోజుతో మన అగ్రిమెంట్ ముగిసింది
వేరే వాళ్ళు వస్తున్నారని
నన్ను ఖాళీ చేసేయమంది
తప్పదుగా
తల ఊపాను
సర్దుకుని వెళిపోయే ప్రయత్నంలో
సామాను తీసుకుని
బయటకు వచ్చాను
చూద్దును గదా
బయటంతా
ఒకటే కోలాహలం
ఏడాదిగా వీళ్ళతో
కలిసి ఉన్నాను
వీరి కష్టసుఖాలలో
నేనూ పాలుపంచుకున్నాను
అయినా మరి ఇదేమిటి?
ఖాళీ చేసి వెళిపోతుంటే
కాస్తయినా ఎవరికీ బాధలేదేమిటి?
ఆడవారు ముగ్గులతోనూ
మగవారు పెగ్గులతోనూ
కుర్రకారు కేరింతలతోనూ
ముక్కూ మొహం తెలియని
రాబోయే 2023 గురించి సంబరాలలో
మునిగితేలుతున్నారు కానీ
కాస్త మొహమాటానికైనా
నన్ను పట్టించుకోరే!
వీడ్కోలు విషాదం కలిగిస్తుంది కదా!
మరి వీళ్ళేమిటి
ఇంత సంతోషంగా
పండుగ చేసుకుంటున్నారు?
నేనేమైనా నరకాసురుడినా!
వెళ్ళిపోయానని వేడుక చేసుకోవడానికి
పోనీ నేనేమైనా వీళ్ళని
అన్ని బాధలు పెట్టానా!
కరోనా కష్టంనుంచి
కాస్త గట్టెక్కించి
హమ్మయ్య అని హాయిగా
ఊపిరి తీసుకునే
అదృష్టం కలిగించాను కదా!
రష్యా ఉక్రెయిన్ యుద్ధం
నేనే తెచ్చాననుకుంటున్నారా!
ఇది బాగానే ఉందే!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు
మీరూ మీరూ కొట్టుకుఛస్తూ
నెపం నా మీదికి
నెట్టేస్తే ఎలా!
లేకపోతే
*కృష్ణంరాజు*, *కృష్ణ* వంటి
ప్రముఖుల్ని పొట్టనపెట్టుకున్నానని
కినుక వహించారా ఏమిటి చెప్మా!
ఇది మరీ బాగుంది
చావు పుట్టుకలు
నేనా నిర్ణయించేది?
ఆ యమధర్మరాజు కదా!
అదే మాట ఆయన డూప్
*కైకాల సత్యనారాయణ* గారితో చెప్పిద్దామంటే
నా ఖర్మకాలి
నిన్నమొన్ననే
ఆయన కూడా అతని దగ్గరికే వెళ్ళిపోయారాయే!
ఇప్పుడేం చేయాలి?
పోనీ మళ్ళీ అరవై ఏళ్ళకయినా
తిరిగి వస్తానులే
ఈ లోకాన్ని మరోసారి కళ్ళారా చూస్తానులే
అనుకోవడానికి నేనేమైనా
తెలుగు సంవత్సరాదినా!
ఒక్కసారి వెళ్ళిపోతే
మళ్ళీ వెనక్కి తిరిగి
రాలేను కదా!
అర్థం చేసుకోరేమిటి?
పోనీ కవులు సున్నిత మనస్కులు కదా
పైగా *ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు*
నా హయాంలోనే జరిగాయి కదా!
వీళ్ళయినా నన్ను గుర్తిస్తారేమో అని ఆశపడ్డాను
కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా
మేమేం తక్కువ తినలేదు
మేము కూడా ఆ తానులో ముక్కలమే అన్నట్లుగా
వీళ్ళు కూడా
*కాఫీ విత్ పొయట్రీ* అంటూ నన్ను సాగనంపి
*కవిత్వంతో కాసేపు* అంటూ
కొత్త సంవత్సరానికి
స్వాగతం చెప్పే పనిలో ఉన్నారు
ఏమిటో ఈ లోకం అంటూ నిట్టూరుస్తుంటే
ఇంతలో ఎక్కడినుండో
ఘంటసాల గొంతు వినిపించింది
*ఇంతేనయా
తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా* అంటూ
నిజమేననుకున్నాను
అబ్బా! నాకెంత
ఘన స్వాగతం పలుకుతున్నారు
అని ఉబ్బితబ్బిబ్బు పడుతున్న
*2023* ని చూసి
నవ్వుకున్నాను
ఏడాది గడిస్తేనే గానీ
వీళ్ళ మనస్తత్వం నీకు అర్థంకాదులే అనుకుంటూ
నిట్టూర్చి నిష్క్రమించాను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.1.2023
59.సంక్రాంతి
తొలివేకువలో వేసిన
భోగిమంటలా
పాతచింతలు
వదిలించుకుని
కొత్త కాంతులు
మీ కాపురాలలో
కొలువుదీరాలి
శిశువు తలపై
కుమ్మరించిన భోగిపళ్ళలా
సిరులు మీ ఇంట
కొల్లలై కురవాలి
చుక్కల దారుల విహరించే
గాలిపటంలా
మీ పేరుప్రఖ్యాతులు
నింగికెగయాలి
గుమ్మానికి కట్టిన
పచ్చతోరణం లా
నిత్య కళ్యాణం
మీ గడపలో జరగాలి
ఇంటి ముంగిట
తీర్చిదిద్దిన రంగవల్లికలా
మీ జీవితం
వర్ణమయం కావాలి
బండ్లకెత్తి రాశి పోసిన
పైరు లక్ష్మిలా
సుఖసంతోషాలు
మీ లోగిలిలో మెండుగా నిండాలి
అపార్ట్‌మెంట్లకు తాళాలు వేసి
పల్లెబాట పట్టిన
పట్టణం లా
విందువినోదాలు
మీ నట్టింట సాగాలి
కన్నె ముత్తయిదువలు
తీర్చిన
బొమ్మకొలువులా
కూతుర్లు కోడళ్ళు
కొడుకులు అల్లుళ్ళు
పిల్లపాపలతో వచ్చి
ఉల్లాసమివ్వాలి
సంబరాలు తెచ్చి
సందళ్ళుహెచ్చి
అందరూ మెచ్చి
జరుపుకునే
మూడు రోజుల
ముచ్చటైన పండుగ
మకర సంక్రాంతి
నాలుగేళ్ళ క్రితం మా తమ్ముడి ఇంటిముందు కనుమ నాడు నేను వేసిన రథం ముగ్గు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.1.2021
60.జీవన్మరణాలు
జీవితంలో
మనం పుట్టేది ఒక్కసారే
ఆ తర్వాత
ఆశ పుట్టేది ఎన్నిసార్లో!
మనం చచ్చిపోయేది
ఒక్కసారే
ఈ లోపల
మనసు
చచ్చిపోయేది
ఎన్నిసార్లో!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.2.2020
61.అంతా భ్రాంతియేనా!
నీలాల నా కంటి కలలన్నీ
శూన్యమయ్యాయి ఆకాశంలా
ఆశలన్నీ ఆవిరికాగా
కన్నీరు ఉప్పొంగింది సాగరంలా
పచ్చదనం దూరమైన బ్రతుకులో
విచారాల నల్లమబ్బులు
ఆనందాల చంద్రుణ్ణి మాటేయగా
సుదూరాన ఏకమైనట్లనిపించే
అంబరమూ అర్ణవంలా
బ్రతుకు మిగిలిపోయిందొక భ్రాంతి లా...
62*తిల (కా) లొదిలారు*
ఒకప్పుడు
రూపాయి కాసంత
పరిమాణం నాది
కనుబొమల మధ్య
కాంతులీనుతూ
తేరి చూడగానే
హుందాతనం ఉట్టిపడుతూ
కళలొలికే మోముపై
చూపును కట్టిపడేస్తూ
అతివ సౌందర్యానికే
ఆభరణమై
విరాజిల్లినదాన్ని
అందం కోసం
దిద్దుకునే తిలకాన్నై
భక్తితో అద్దుకునే
పవిత్రమైన కుంకుమనై
సౌభాగ్య చిహ్నంగా
పాపట సింధూరాన్నై
భారతీయ మహిళ
ప్రత్యేకతను
ప్రపంచానికి చాటినదాన్ని
పేరంటం పిలుపులకు
నాదే పెద్దపీట
అమ్మవారి అర్చనకు
నా అరుణిమ అంకితం
అటువంటి నేను నేడు
ఆధునికత పేరుతో
కుంకుమ భరిణను వదిలి
తిలకం సీసాను వీడి
బొట్టుబిళ్ళగా
రూపాంతరం చెందాను
రూపాయి కాసంత
నా రూపం కాస్తా
మొదట్లో
నయాపైసాగా
ఆ తరువాత కందిగింజంతగా
ఇక ఇప్పుడు ఆవగింజంతగా
అయిపోయింది
పెళ్ళయిన కూతుర్ని
నుదుట బొట్టేదమ్మా
అని మందలించే తల్లుల్ని
నీదంతా
చాదస్తమంటూ విసుక్కునే కూతుళ్ళను చూస్తున్నాను
బొట్టుపెట్టుకోమ్మా అని
కోడలికి చెప్పే అధికారాన్నే కోల్పోయిన
అత్తలను సానుభూతి తో చూస్తున్నాను
మనవరాలి ముఖాన
అకేషనల్ గా అలంకరించే
నలుసంత నన్ను
కళ్ళు చిట్లించి వెతుక్కునే బామ్మలను
జాలిగా చూస్తున్నాను
మహిళల హక్కులు
స్వేచ్ఛ అనే పోరాటాలకు
నేనేం అడ్డమయ్యానని
నన్ను తుడిచేస్తున్నారో
నన్ను సంకుచితం చేస్తున్నారో
అర్థమవక చస్తున్నాను
భర్తపోయినా నన్ను
ధరించవచ్చునని
ఎదురుతిరిగిన నాడు
అది అతివల ఆత్మగౌరవమని
ఆనందించానేగానీ
నిలువనని నిరాకరించలేదే!
ఎందుకు నాపై
వీళ్ళకింత చిన్నచూపు?
ఉన్నంతకాలం నన్ను
నిర్లక్ష్యం చేస్తూ
వద్దనగానే హఠాత్తుగా
నాపై అంత మక్కువ ఏమిటో!
ఆధునికత అనే ప్రవాహవేగంలో
కొట్టుకుపోతున్న వేళ
నేటికిక
నా ఉనికే
ప్రశ్నార్థకమైపోగా
ఇప్పుడు ఎక్కడో
ఏ పెద్ద ముత్తయిదువ
నుదుటిమీదో
కళ్ళనిండుగా కనిపిస్తున్న
నన్ను నేను
తనివితీరా చూసుకుంటూ
*తిలోదకాలు*
వదులుకున్న నా ఆశలు
మళ్ళీ చిగురిస్తుండగా
ఇంకొంత కాలం
కొన ఊపిరితో నైనా
ఉండగలననే
నమ్మకంతో
జీవిస్తున్న
కుంకుమ రేఖను నేను.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.5.2024
సోమవారం
63.విషాదం
ఆయువు చమురు నిండుకున్నాక
ఆశల ఒత్తిని
అలాగే వదిలేసి
వెలుగును చూసి
మురిసిన మమతలు
మసిబారిపోగా
అనుబంధాల కళ్ళల్లో
అంధకారాన్ని నింపి
జీవితమనే
ప్రమిదలోని
ప్రాణదీపం
కొడిగట్టి
కొండెక్కిపోవడం
తప్పనిదే అయినా
తరగని విషాదం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.10.2020
ప్రత్యేక హోదా
హోదా మాకేదంటూ
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ
కదం తొక్కె మా పదం
మేము కళాకారులం
తమిళులన్న అపప్రథను
తొలగించగ నినదించిన
అన్న నందమూరి స్వరం
చాటె ఆత్మగౌరవం
ఆంధ్రులకది తారకం
అదే మాకు ఆదర్శం
కదంతొక్కె మా పదం
మేము కళాకారులం
స్వేచ్ఛ ఉంది ఎగిరేందుకు
హద్దులేదు ఎదిగేందుకు
చేయూతగ మేముంటాం
భవిత తీర్చి దిద్దుతాం
అన్నమాట వట్టిదాయె
హక్కు లెక్కలీయరాయె
తెలుగునేల మేలుకొనియె
ప్రజాగ్రహం వెల్లువాయె
పన్నుపోటు తగ్గదాయె
వెన్నుపోటు పొడిచిరాయె
కత్తిపోటు కన్న వాడి
కలం పోటు తెలుసుకోండి
ఓటుపోటు పొడిచామా
పదవిపోటు తప్పదండి
కదం తొక్కె మా పదం
అమరజీవి ఆశయం
అల్లూరి పోరాటం
కందుకూరి సంస్కారం
టంగుటూరి సాహసం
మహాకవుల అడుగుజాడ
స్ఫూర్తి మాకు గురజాడ
అందిపుచ్చుకుంటాము
హక్కు కొరకు పోరుతాము
అర్థరాజ్యమంటు నాడు
అడవిపంచె ధృతరాష్ట్రుడు
మోసగించి దాన్ని కూడ
అపహరించె అతని సుతుడు
మీరువారి వారసులై
చూపినారు మొండిచెయ్యి
వట్టి మాట కట్టిపెట్టి
వాగ్దానం నిజం చెయ్యి
సింహాద్రి జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
రేపటి వసంతాలపై నమ్మకంతో
నేటి మీ పచ్చదనాన్నంతా
బిడ్డలపై రాల్చుకుని
ఎండిన మోడుల్లా
మిగిలే తల్లిదండ్రులారా!
కన్నీటిధారలను
ఆనందబాష్పాలుగా
నమ్మిస్తూ
బ్రతకడమే పరువు
దానికొక అందమైన పేరుంటుంది
అదే
పెద్దరికం
కర్నూలులో
80 ఎకరాల పొలం ఉన్న ఆసామి ఆస్తినంతా ఇద్దరు మగ బిడ్డల పేరున రాసి, రెండు నెలల తర్వాత వారు ఇంటినుంచి గెంటివేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్న సంఘటన విని బాధతో....
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.8.2020
Comments
Post a Comment