10.అనుభవాల సా(గ) రం
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
1.వాడికేం తెలీదు
2.మా (పేరు) కోసం
3.పెళ్ళిసందడి (ఊచా వారి)
4.బందీలు
5.(అ)ధర్మసభ
6.ఘాటు (లో) ప్రయాణం
7.ప్రేమ( సం )సారం
8.ఛస్తూ బ్రతుకుదాం
9.ఒంటరి ప్రయాణం
10.కా(ని) కులం
11.అ(పమృత్యు) గమ్యం
12.కేరళ విలవిల
13.కెలోడోస్కోప్ 2018
14.గత జ్ఞాపకం (ఇండియన్ బ్లోజమ్స్)
15.మౌనముద్ర
16.OPS(ఒక పంతులమ్మ సామ్రాజ్యం )లో
17.చివరి చిరునామా
18.అంబరం-అర్ణవం
19.సత్యం బాబోయ్
20.పేరు(పొ)0దండి
21.నేను మనిషిని కాను
22.క....రో....నా....
23.అమరత్వం
24.బాల గంధర్వుడు
25.మా (మంచి) అమ్మ మనసు
26.Mai OPS
27.సరిజోడు
28.ఎట్టకేలకు
29.అ(తి)వమానం
30.వీరపత్ని
31.తెలిసొచ్చింది
32.నవ (రత్న) దీపాలు
33.నోటు మాట
34.తెలు(గు) గోడు
35.పసి(డి) కలలు
36.శశి (తప్పిన) కళ
37.స్మృత్యంజలి(వెయ్యి నోటుకి)
38.గుండె చెఱువు (రంగారాయుడి చెరువు దుర్ఘటన)
39.ఆనంది(ని)ద్దామా!
40.దాంపత్య వసంతం
41.అమ్మ జ్ఞాపకం
42.ఆశా (డే)రా(0)లు
43.మేనత్త మనసు
44.హరి(బాబు)చందనం
45.వనితావాణి
46.మృత్యుంజయం
47.లేడికూనలా ఇంకెన్నాళ్ళు?
48.ఆ గది
49.తనదాకా వస్తే
50.దెబ్బతిన్న పావురం
51.పెత్తమ్ముడు
52.నేరస్తురాలిని
53.ప్రేమకానుక
54.రిటైర్డ్ హర్ట్
55.ప్రేమ( సాలె) గూడు
56.చీర నా జీవితం
57.తాకట్టు
58.స్నేహ (కవితా) లత
59.గ్రహణాలు
60.నిష్టుర సత్యం
61.ఎండమావి
62.వాడిని చూసి....
63.మాకిది మామూలే
64.చిన్నారి శ్రీజా!
65.కవులే స్ఫూర్తిగా
66.భాషా బ్రహ్మోత్సవాలు
67.నేను చూశాను నిజంగా
68.ఊగిసలాడకె మనసా
69.వాచాలత్వ(0)మేలా!
70.ఇది ఒకటో నెంబర్ బస్సు
71.అడుగున అడుగై
72.రేపు నువ్వుండవని తెలిసి
73.నువ్వు పోయినప్పుడు
74.వెలుగురేఖలు నీ పుట్టినరోజులు
75.గుర్తుకొస్తున్నారూ
76.తెలుగుచెట్టు కొమ్మ నీడలో
77.ఆ రోజులు బాగున్నాయి
78.అంతిమ (ఆత్మ) యాత్ర
79.బా బో (లే) బాబా
80.ఏ (కాంత) ముంది
81.ఆ నలుగురూ ఏరీ!
82.మేలు (తెలుసు) కో
83.అక్కా!ఎందుకిలా వెళ్ళిపోయావ్?
84.రంగే(యా)లా
85.సత్య(సం)భాషణం
86.ఓటేశాను
87.సాగరతీరంలో ఈ సాయంకాలం
88.ఏ(డా)ది?
89.మూడు ముళ్ళతో ముప్పై మూడేళ్ళ నడక
90.కలలదీపం
91.రాఖీ (కట్టని) రక్ష
92.నాన్నతో నా బంధం
1.వాడికేం తెలీదు
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
1.మా చిన్న తమ్ముడు
వాడికేం తెలీదు
వాడికి ఏం తెలీదో
ఒక అక్కగా
నేను చెప్తాను వినండి
ఎవరి గురించీ
చెడుగా మాట్లాడటం
వాడికి తెలీదు
మనసును
నొప్పించే విధంగా
ప్రవర్తించటం
వాడికి తెలీదు
మాతృదేశాన్ని
వదిలేశాను కదా!
మాతృభాష ఇంకెందుకు అని
అనుకోవడం
వాడికి తెలీదు
పెంచిన అక్కని
ప్రేమించే అన్నని
నచ్చిన బావను
మెచ్చిన వదినను
మరచిపోవడం
నిర్లక్ష్యం చేయడం
వాడికి తెలీదు
చదువుల సరస్వతి
అయిన భార్యను
ప్రోత్సహించి
ఉన్నత స్థాయికి
చేరుకోవడానికి
చేయూతనివ్వడమే తప్ప
మేల్ ఇగో
చూపించటం
వాడికి తెలీదు
పిల్లలకు మంచిచెడు
మంచి మాటలతో
నేర్పడమే తప్ప
కాఠిన్యం
ప్రదర్శించటం
వాడికి తెలీదు
ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే
ఆదుకోవడమే తప్ప
నాకెందుకులే అని
తప్పుకుపోవడం
వాడికి తెలీదు
పెద్దలపట్ల
అవినయం
చూపటం
వాడికి తెలీదు
ఆడవారి పట్ల
అమర్యాదగా
ప్రవర్తించటం
వాడికి తెలీదు
నైతికత ను
సామాజిక బాధ్యతను
విస్మరించి ప్రవర్తించటం
వాడికి తెలీదు
అన్నీ ఉన్నా గానీ
అహంకరించటం
వాడికి తెలీదు
అనవసరమైన
డాబులకు పోవడం
అపాత్రదానం చేయటం
వాడికి తెలీదు
మాతృభాషకు
ప్రేమికుడై
సేవకుడై
సైనికుడై
నలభై ఐదు వసంతాలు
పూర్తి చేసుకుంటున్న
నా తమ్ముడు
ఇంకా
నా కంటికి
చిన్నప్పుడు
నేను ఎత్తుకుని ఆడించిన
చొట్టబుగ్గల నవ్వుల
చిన్న పిల్లాడిలానే
అనిపిస్తూ
కనిపిస్తూ
ఎందుకు
మద్దొస్తూ ఉంటాడో
నాకు తెలీదు.
అలాంటి నా చిన్నతమ్ముడు
సింహాద్రి కిరణ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ వాడు నూరేళ్ళు సుఖసంతోషాలతో
సకల శుభాలతో
వర్ధిల్లాలని కోరుకుంటూ
శుభాశీస్సులు తెలియజేస్తూ...
ప్రేమతో
అక్క
సింహాద్రి జ్యోతిర్మయి
4.10.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
మేం అడగాలా!
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
పుస్తక ఆవిష్కరణ సభ
2.*మా (పేరు) కోసం*
నేల *తల్లి*
దేశ *మాత*
నదీమ *తల్లి*
పైరు *లక్ష్మి*
రాజ్య *రమ*
అన్నిటా
ఆది *శక్తి* యైన
స్త్రీ మూర్తి
అభివృద్ధి పథంలో
ఆకాశమార్గాన
దూసుకుపోతున్నవేళ
ఒకటిరెండు జిల్లాలకైనా
మాపేరు పెట్టమని
మేము నోరు తెరిచి అడగాలా!
అడగందే అమ్మ అయినా పెట్టదు అంటారేమో!
అందుకే నోరు తెరిచి అడుగుతున్నాం
మహిళామణులం
అయినా...
అమ్మగా ఆప్యాయతను
ఆలిగా అనురాగాన్ని
అక్కచెల్లెళ్ళు గా ఆదరణను
కన్నకూతురిగా అంతులేని ప్రేమను
మీరడిగితేనే మేము పంచుతున్నామా!
ఆలోచించండి
ఆదరించండి
ఆచరించండి
ఎందరో ఆదర్శమహిళలు
ఇందరిలో మన తెలుగు జిల్లాలకు
అందరిలో కనీసం
ఒక పేరెంచండి
మా పేరుంచండి
🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఒంగోలు
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
3.ఊచా వారి పెళ్ళిసందడి
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
ఏమిటీ!
*పండ్రాజు* వారింటి అబ్బాయా!
*ఊ!చా* లిక
ఏమీ ఆలోచించకండి
అది *రాజా* లాంటి సంబంధం
ఇంతకంటే మంచి సంబంధాలు *రావు* సుమా!
అని అందరూ అన్నారని
సంతోషంగా
సంబంధం కలిపేసుకున్నాం
ఇలా అన్నామని
మా అమ్మాయి ఏమీ తక్కువ కాదండోయ్!
*రాజ్యలక్ష్మి* కళ
మొహంలోనూ
*గౌతమ* ఈశ్వర కాంతి
చిరునవ్వులోనూ
ఉట్టిపడే
*నాంచారమ్మ* (భక్తురాలు)
మా చిట్టితల్లి
కేవలం
*శాంత* స్వభావురాలు మాత్రమే కాదు,
సుగుణాల *రత్న* మై
మీ అబ్బాయి జీవితంలో *ప్రభ* లు వెలిగించి
*సత్యవతి* యై
మీ వంశాన్ని ఉద్ధరిస్తుంది
ఆ *వేంకటేశ్వరుడు*
*గణేశుడు*
ప్రత్యక్షంగా ఈ వేడుకలో కనపడకపోతేనేం?
*హరి* చేతిలోని
*అమృత* భాండమై
సమ్మోహనమై
*సుశాంత* మై
*సుప్రీత* మైన
ఈ కాపురం
*పదహారు* కళలతో ప్రవర్ధమానమవుతుందని
మనసారా దీవించి
ఏడాదికల్లా
తమ అంశతో
పండంటి పాపడై
చిన్ని *కృష్ణ* మ్మయై
నట్టింట *నవీన*
కాంతులు వెదజల్లుతూ
పారాడగలరు.
శుభమ్ భూయాత్
అక్క నాగ అమృత 16 రోజుల పండుగ వేడుకకు(8/5/2022) తమ్ముళ్ళు
ఊచా సుశాంత్,సుప్రీత్ లు తమ తెలుగు టీచర్
(సింహాద్రి జ్యోతిర్మయి
కవయిత్రి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న ర సం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు)తో రాయించి ఇస్తున్న కానుక.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఖైదీల మధ్య జరుపుకుంటే బాగుంటుందన్న మా న ర సం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ గారి సమున్నతమైన ఆలోచనతో నలుగురం కలసి మా నగరంలోని మహిళా కారాగారాన్ని సందర్శించిన సందర్భంలో నా మనసు ఇలా స్పందించింది.
4.బందీలు
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
పుట్టుకతోనే ఎవ్వరూ
నేరస్థులు కాబోరు
సాధారణంగా
కసాయితనం కన్నా
క్షణికావేశం
నేరప్రవృత్తి కన్నా
ప్రేరేపించిన పరిస్థితులు
ఏదో పొందాలన్న తపనలో
ఎన్నో పోగొట్టుకొని
నలుగురితో
నేరస్థులనిపించుకుని
నాలుగుగోడలమధ్య ఖైదీలై ఉన్న
వారిని చూసిన క్షణం
ఏదో తెలియని కలవరం
నాలుగు మంచి మాటలు
నాలుగు సరదా పాటలు
వినిపించిన
మా సమక్షం
కోల్పోయిన
ఏ సంతోషాలను
తలపుకు తెచ్చిందో
పొందలేని
ఏ మమతలను
తట్టిలేపిందో గానీ
సన్నని కన్నీటి పొర
కమ్ముకున్న కళ్ళు
సున్నితత్వం
మాలోనూ ఉన్నదని
చెప్పకనే చెబుతుంటే
మమ్మల్నీ గుర్తించేవాళ్ళున్నారని
తెలిసిన కృతజ్ఞతలో
గొంతులో చిక్కుకున్న గుండె
వెక్కి వెక్కి దుఃఖమైతే
ఆత్మీయతలకు
దూరమై
అలమటిస్తున్న మనసు
మేమందించిన
పళ్ళూ స్వీట్లలో నున్న
ఆదరాన్ని గ్రహించలేక
సానుభూతిగా భావించి
చేయి చాచలేక
అలవాటు లేని
అవమానభారంతో
అభిమానపడుతుంటే
నిస్సహాయతతో
నిట్టూర్చడం
వెన్ను నిమిరి
ధైర్యం చెప్పడం తప్ప
చేయగలిగిన దేముంది
పొందిన అదృష్టం విలువ
పోగొట్టుకుంటేనే గానీ
తెలీదని
బాధల పంజరాన
బందీ అయితేనే గానీ
రెక్కవిప్పుకున్న
స్వేచ్ఛవిలువ
అర్థకాదని
అవగాహన చేసుకుంటూ
వెళ్ళినప్పుడు ఉన్న
తెలియని ఉద్విగ్నత
వచ్చేటప్పుడు
తెలియని వేదనగా
మారగా
మౌనంగా
వీడ్కోలు పలికి
మరలివచ్చేశాము.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.3.2019
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
రామ మందిరం కోసం సంకల్ప యాత్ర పేరుతో మళ్ళీ మరో వివాదానికి తెరలేపుతూ
కయ్యానికి కాలుదువ్వుతూ
పిలుపునిచ్చిన వి.హెచ్.పి.,బి.జె.పి.ల
వైఖరికి నిరసనగా
గేయ రామాయణం రచించిన నా చేతులు జోడించి అనవసర వివాదాలు వద్దని వారిస్తూ
నా కవిత
.....5.(అ) ధర్మ సభ....
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
అడవులలో తిరిగాడు
బోయతో స్నేహం చేశాడు
కోతిని సోదరభావంతో ఆదరించాడు
మరొక కోతి హృదయంలో
స్వయంగా కొలువుతీరాడు
శబర వృద్ధురాలింట
ఇష్టం గా ఆరగించాడు
పక్షికి అంత్యక్రియలు చేశాడు
శత్రువు తమ్మునికీ
శరణమిచ్చాడు
చివరకు
ఇల్లాలి నెత్తుకుపోయిన
రాక్షసాధముడు నేలరాలితే
"మరణాంతాని వైరాని"
అంటూ
ఈ వీరుడిపుడు నాకు
సోదర సమానుడే అని పలికి
అంత్య క్రియలకు
ఆనతిచ్చాడు
యుద్ధంలో తనకోసం
మరణించిన
వానరులను
బ్రతికించమని
వారుండే గిరికానలు
నిత్యఫలవంతం చేయమని
ఇంద్రుని అర్థించాడు
వనవాసం పంపిన
కైకమ్మను సైతం
ద్వేషించనివాడు
మూర్తీభవించిన ధర్మమే రాముడని
రాక్షసుని చేతే ప్రస్తుతింపబడిన వాడు
అయిన ఆ రామచంద్రుడు
ఎప్పుడో అవతారం
చాలించిన తనకోసం,
ఎన్నడో దుండగులు
కూల్చివేసిన
తన ఆలయం కోసం,
ఎన్నో అల్లర్లకు కారణమై
మత విద్వేషంతో
మారణహోమానికి
దారితీసిన
బాబ్రీ వివాదం కోసం,
మరొకసారి
కాషాయం కప్పుకుని
తన ఆదర్శాన్ని విస్మరించి
కత్తులు నూరుతూ
కదం తొక్కుతూ
తన పేరును
వాడుకుంటూ
ధర్మ సభ అంటూ
దండు వెడలుతున్న
మతోన్మాద శక్తులను,
తానీషాకు కలలో
కనపడి
తనవాడిగా చేసుకున్న
ఆ శ్రీరాముడు
హర్షిస్తాడా!
దీనిని భక్తి అందామా!
ఉన్మాదమందామా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.12.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
6.ఘాటు ( లో ) ప్రయాణం
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
అనంత జీవనయానంలో
అప్పుడప్పుడూ
ఒంటరిగా.......
అంతలోనే
ఆత్మీయ స్నేహం అండగా
అడవి ప్రయాణం కూడా
ఆనందంగా....
ఆ తరువాత
మిత్రులను పెంచుకుంటూ
మైత్రిని పంచుకుంటూ
ఆతిథ్యం అందుకుంటూ...
గమ్యాన్ని వెతుక్కుంటూ....
ఆవరించిన లోయలో
ఆనందపు శిఖరాలు
కమ్ముకున్న కానలో
తొంగిచూస్తున్న అరుణరేఖలు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.12.2018
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
....7. ప్రేమ ( సం ) సారం...
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
కమనీయమైన
మా కాపురం
ఇరవైతొమ్మిది
ఇంపైన వసంతాలను చూసి
ముచ్చటైన ముప్పయ్యవ పడిలోకి
పయనం సాగించటానికి
పాదం సారించుకుంటున్న
అపురూప తరుణమిది
అధిగమించి వచ్చిన
ఆ అడుగుల నొక సారి
సింహావలోకనం చేసుకుంటే
ఆనందాతిశయంలో ముంచినవి
దుర్భర మనిపించినవి
అనుభవైక వేద్యమైనవి
ఎన్నెన్ని భావోద్వేగాలు
ఎదను తడుముతున్నాయో!
అన్నిటా విజాతిధృవాలమైన మేము
అన్యోన్యమైన జంటగా
అందరి మన్నన లందుకుంటూ
ఆనందంగా జీవించడమన్నది
అమ్మానాన్నలు
అత్తామామల
ఆశీస్సుల పుణ్యఫలం
కలిమి వసంతాలను
లేమి గ్రీష్మాలను
అపజయాల వర్షాలను
విజయ హర్షాల కార్తీకాలను
చిలిపి సరదాల హేమంతాలను
ఆశలు రాల్చిన శిశిరాలను
అనుభవిస్తూ
అధిగమిస్తూ
అనుసరిస్తూ
చింతల చీకట్లు అలమినప్పుడు
చిరునవ్వు దివ్వెలు వెలిగించుకుంటూ
కోపతాపాల ముళ్ళు గుచ్చుకున్నప్పుడు
మధురమైన గులాబీలు కూడా
మనవేనని గుర్తుచేసుకుంటూ
కష్టాల నల్లమబ్బులు ముసిరినప్పుడు
ఆశా వీచికలతో చెదరగొట్టుకుంటూ
అపార్థాల అంతరాల గాయాలను
నమ్మకపు మైపూతలతో నయం చేసుకుంటూ
లోపాలను ,లోటుపాట్లను
సహనంతో క్షమించుకుంటూ
అనుబంధపు ముడి సడలకుండా
ప్రేమానురాగాలు పేనుకుంటూ
ఇంటి పంటలైన
ఇద్దరు ముద్దుబిడ్డలతో
ఫలవంతమైన జీవితాన్ని
పండంటి సంసారాన్ని
పరిపూర్ణం చేయమని
పరమాత్ముని వేడుకుంటూ
ప్రారంభించబోతున్న
మరో వత్సరం
మీ శుభాకాంక్షలతో
కాగలదు ఉత్సవం
సింహాద్రి జ్యోతిర్మయి న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.12.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
8.చస్తూ బ్రతుకుదాం
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
జగద్ధాత్రీ!
ఏమిటీ పిచ్చి పని?
అరవై నిండినా నీకింకా
చస్తూ బ్రతకటం
అలవాటు కాలేదా!
కొత్తగా చచ్చిపోయావెందుకు?
ఆ మాటకొస్తే
మనమంతా బ్రతికే ఉన్నామంటావా!
ప్రాయం వచ్చిన
దగ్గరనుండీ
ఆబగా,ఆశగా,ఆకలిగా చూసే
వెకిలి చూపుల తూపులకు
ఒళ్ళంతా చచ్చి పోయినా
మేమంతా
బ్రతుకుతూనే ఉన్నామే!
ప్రేమించటం పాపమంటూ
పరువు తక్కువంటూ
కన్నవాళ్ళు
భవితను కాలరాసి
మరెవరికో భార్యను చేసి
మెడలు వంచి తాళి కట్టిస్తే
మనసు చచ్చిపోయినా
మగనితో బ్రతికేస్తూ ఉన్నామే!
భార్యంటే
డైనింగ్ టేబుల్ పై
సిద్ధంగా ఉన్న భోజనమని,
తనకు ఆకలేసినప్పుడల్లా
వడ్డించుకుని తినవచ్చుననుకునే భర్తతో
స్పందనలు చచ్చిపోయినా సహకరిస్తూ
బ్రతికేస్తూ ఉన్నామే!
తను పక్కనే ఉన్నా
తనకూ ఓ కూతురున్నా
కనపడ్డ ఆడదానికల్లా కన్నుగీటుతూ
మానసిక వ్యభిచారం చేసే భర్తను భరిస్తూ
మాటలోని
సత్యం చచ్చిపోయినా
మా ఆయన బంగారమనే మంత్రాన్ని
పదిమందిలో జపిస్తూ
బ్రతుకుతూనే ఉన్నామే!
పురుషాధిక్య సమాజంలో
ఎనభై శాతం మంది మహిళలకు
ఏ హక్కులూ
లేకపోయినా సరే
ఇంట్లో పెత్తనమంతా
ఆయనదే అయినా సరే
నిర్ణయాధికారం
నీకు లేకపోయినా సరే
ఆడవారి ఆధిపత్యం పై
ఎన్నో జోకులు వేస్తుంటే
ఆత్మాభిమానం చచ్చిపోయినా
మన వ్యక్తిత్వాన్ని మనమే చిన్నబుచ్చుకుంటూ
నవ్వుకుంటూ
బ్రతికేస్తున్నామే!
మూడేళ్ళ చిన్నారిపై
అత్యాచారానికి
ఉరిశిక్ష వేసి
సత్వర న్యాయం చేశారని
సంతోషించే లోపే
మరోచోట
మరో పసికూనపై
మళ్లీ అత్యాచారం
మానవత్వం పై
నమ్మకం చచ్చిపోయినా
బ్రతుకుతూనే ఉన్నామే!
మరి మళ్ళీ ఇదేమిటి?
ఆత్మలనెప్పుడో చంపుకుని
బ్రతుకుతున్న జీవచ్ఛవాలం కదా! మనం!
మనకి ఆత్మ హత్యలెందుకు?
జగద్ధాత్రి గారి ఆత్మహత్యా ఉదంతం విన్న నా హృదయస్పందన.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.8.2019.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
9.ఒంటరి ప్రయాణం
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
జీవితం లో
అప్పుడప్పుడూ
ఒంటరి ప్రయాణం
తప్పనిసరి అవుతుంది
అని అనుకుంటూ
ప్రారంభించా నా పయనాన్ని.
ఇంటినుండి స్టేషన్ కి
పదినిమిషాలు పట్టని
దూరానికి
ముప్పావుగంట ముందే
బయల్దేరదీసింది
నా యాంగ్జయిటీ
అరగంట ముందే
చేరుకున్నా స్టేషన్ కి
హల్దియా సూపర్ ఫాస్ట్
ఆలస్యమేం లేదు
బోగీ నెంబర్ బోర్డు
చూసుకున్నా
పరుగులెత్తాల్సిన
పనిలేకుండా
నిలుచున్న చోటే
ఆగింది బోగీ
ఎక్కేసి హమ్మయ్య
అని ఊపిరిపీల్చుకున్నా.
నా సీటు నెంబరు
చూసుకుని కూర్చున్నా
కిటికీ పక్కన సీటుని
చూడగానే
పెద్దరికాన్ని,వయసుని
అవతలకు నెట్టేసి
చిన్నతనపు
సంబరం
తన్నుకు
వచ్చేసింది
లోపలి నుండి
అది కొద్దిసేపే
అంతలో కంగారు
తెల్లవారు ఝామున
నాలుగు గంటలకి దిగగలనా!
మెలకువ వస్తుందా!అని.
అక్కా!
దీన్నే యాంగ్జయిటీ అంటారు
దీనికి నువ్వు మందులు వాడాలి అంటాడు
మా చిన్న తమ్ముడు.
ఫరవాలేదు వెళ్ళి
ఆ రాష్ట్రం చూసేసిరా
అంటాడు మా అబ్బాయి
వాడు దేనికీ తొణకడు
అమ్మా!నువ్వు జాగ్రత్త అని
ఆరిందాలా చెబుతుంది
నా కూతురు
నా రైలు ప్రయాణాన్ని
తన ఫోనులోనే
మానిటర్ చేస్తుంటాడు
మా పెద్ద తమ్ముడు
ఎప్పుడూ ఫోన్ కే దొరకని మా వారు
ఇప్పుడు మాత్రం
పదిసార్లు ఫోన్ చేసి
నా క్షేమం కనుక్కుంటారు
ఈయనకు నా మీద
ఇంత శ్రద్ధ ఉందా!
అని ఆశ్చర్యపరుస్తారు
ఏం ఫరవాలేదు
దిగగానే ఫోన్ చెయ్యి
అని ఓ సలహా పారేస్తారు
నా కంగారు తెలిసిన
నా స్నేహితులంతా
సెండాఫ్ ఇవ్వడానికి
స్టేషన్ కి వస్తామన్నారు
నా ప్రయాణమే
ఒంటరిది గానీ
నేను ఒంటరిని కానని
నమ్మకమిచ్చిన
ఆత్మీయుల
అనుబంధాలను
తలచుకొని నవ్వుకుంటూ
మనసులోని
ఆలోచనలకిలా
అక్షరరూపాన్నిస్తూ,
చేరుకోబోయే గమ్యాన్ని
దగ్గర చేసుకుంటూ
చేస్తున్నా
నా
రైలు ప్రయాణం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.11.2018
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
................కా ( ని ) కులం..........
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
కూతురి కన్నా ఎక్కువగా నేను
నా కులాన్ని ప్రేమిస్తాను
చెదిరిన నా కూతురి
నుదిటి బొట్టు సాక్షిగా
తెగిపడిన నా కూతురి
తాళిబొట్టు సాక్షిగా
మట్టిలో కలసిపోయిన
నా కూతురి
మనుగడ సాక్షిగా
శూన్యమైన నా కూతురి
సంతోషం సాక్షిగా
నాన్నను కోల్పోయిన
నా కూతురికడుపులోని
నలుసు సాక్షిగా
బండలైన నా కూతురి
బ్రతుకు సాక్షిగా
కాలువలైన నా కూతురి
కన్నీటి సాక్షిగా
ఎందుకంటే
అందరూ అన్నం తింటే
నేను కులమనే
అశుద్ధాన్ని తింటాను కనుక
అందరి రక్తం
ఎర్రగా ఉంటే
నా కులం రక్తం
కుళ్ళు కాలువలా
నల్లగా ఉంటుంది కనుక
అందరి హృదయం
ఆత్మీయతలకు స్పందిస్తే
నా గుండె మాత్రం
కులమనే మాటకే స్పందిస్తుంది కనుక
నేనూ తండ్రి నే
కన్న ప్రేమ అనే
సంకుచితమైన భావం నుండి బయటపడి
నా కులం పరువు అనే
విశాల దృక్పథంతో
ఆలోచించి
కూతురి సుఖాన్నే బలిపెట్టిన
నా మనసును
అర్థం చేసుకోరెందుకు?
నాలాగా మీరంతా
స్థిరంగా ,శిలా సదృశంగా
ఉండలేకపోతున్నారెందుకు?
ఎవ్వరేమనుకున్నా నాకు
రవ్వంతయినా చింతలేదు
నా కులాభిమానం కోసం
కూతురి జీవితాన్ని
బలిపెట్టి
నేను పుట్టిన ఆ కులం రుణం
తీర్చుకున్నానన్న
ఆత్మ సంతృప్తి నాకు చాలు.
నాలాగే మరో నలుగురు
నా బాటలో నడిస్తే చాలు
నా జన్మ ధన్యమయిందని
సంతోషిస్తాను.
ఇట్లు
కులం కాకుల్లో ఒక కాకి.
సింహాద్రి జ్యోతిర్మయి
18.9.2018
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀1
11.అపమృత్యు గమ్యం
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
ప్రమాదంలో
నీ వాహన వేగం
నూటయాభై ని అందుకుంటే
నీ ఇల్లాలి హృదయస్పందన
నూట తొంభైకి చేరుకుంటుంది.
కారులో సీటుబెల్టును
మోటారు సైకిల్ పై హెల్మెట్టును
పెట్టుకోని నీ చిన్న అజాగ్రత్తకు
మాంగల్యబంధం తెగిపడుతుంది
ఒక్క క్షణపు నీ ఏమరపాటు
సాఫీగా సాగే జీవనయానాన్ని
ఒడిదుడుకుల బాటలోకి నెట్టేస్తుంది
అదుపుతప్పి గాల్లోకి లేచిన
నీ వాహనంతో పాటుగా
నీ బిడ్డల భవిష్యత్తు
కుప్పకూలిపోతుంది
వాహనంలో నుండి
విసిరి వేయబడ్డ నీ దేహంలా
ఆత్మీయుల గుండెలు చెదరిపోతాయి
నడిరోడ్డుపై కాలువకట్టిన
నీ రక్తం లా
నిన్ను ప్రేమించేవారి
కన్నీరు వరదలవుతుంది
కొన ఊపిరితో
కొట్టుమిట్టాడే నీ ప్రాణంలా
బంధువుల ఆందోళన
ఆశనిరాశల మధ్య
ఊగిసలాడుతుంది.
తీవ్ర ప్రమాదంలో
గాయపడ్డ నీవు
నీవు మంచానికే పరిమితమైతే
నీ ఇల్లాలు జీవచ్ఛవమౌతుంది
ఆరిపోయిన నీ ప్రాణదీపం
ఆశల దీపాలను ఆర్పేసి
ఆలుబిడ్డల జీవితాలను
చీకటిమయం చేస్తుంది
కట్టెల్లో కాలిపోయే
నీ దేహంతో పాటుగా
నీ ఇల్లాలి సౌభాగ్యం
కాలిబూడిదవుతుంది
ఒక కలలా
జరిగిపోయిన ఆ దుర్ఘటన
చేదు జ్ఞాపకమై
ఆత్మీయులను
జీవితాంతం వెంటాడుతూ
కలవరపెడుతుంది
మిత్రమా!
నీ ప్రాణం
నీ ఒక్కడిదే కాదని గ్రహించు
నీ జీవితం
ఆత్మీయతా లతల
అనుబంధాల సమాహారమని గుర్తించు
అతివేగం
ఆత్మహత్యా సదృశం
నీ అకాల మరణం
ఆప్తులకు అశనిపాతం.
నందమూరి హరికృష్ణ గారి అకాల మరణానికి చింతిస్తూ
వాహన చోదకులందరూ
తమ ఆత్మీయుల చిరునవ్వు ముఖాలను
మనసులో ఒక్కసారి గుర్తుచేసుకుని
పరిమిత వేగంతో సురక్షితంగా గమ్యాలను చేరుకోమని అభర్థిస్తూ....
సింహాద్రి జ్యోతిర్మయి
30.8.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
12.కేరళ విలవిల
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
ఈ జల ప్రళయం
ఏ పాప ఫలం
ఈ పెను విలయం
ఇది ఏ తప్పిద మూల్యం
నిగ్రహాన్ని కోల్పోయిన ప్రకృతి
ఆగ్రహాన ఇటు విరుచుకు పడినది
నిన్నమొన్న ఆ విశాఖతీరం
మరువనెలేదా కడలి దుమారం
ఇపుడీ సుందర కేరళ రాష్ట్రం
పై పగబూనెను వరద ప్రమాదం
పిచ్చుక గూళ్ళై కూలినవిళ్ళు
పిట్టల తీరున రాలిరి ప్రజలు
ఆదుకోమని అసహాయంగా
ఎదురుచూసిరి భయంభయంగా
అక్కడ ప్రతి నయనం
కురిసే కన్నీట మయం
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం
పశ్చిమ కనుమలు
పదులగు నదులు
వాగులు వంకలు
కొబ్బరితోటలు
పచ్చదనాన్నే చీరగకట్టి
పరవశమందే కేరళ కుట్టి
జడివానలలో పెరియార్ ఒడిలో
శోభను కోల్పోయి అలమటించెను
శోకదేవతై విలవిల లాడెను
ఆపన్న హస్తం అందించేందుకు
సాయంచేయగ పదండి ముందుకు
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం
ఇంటిపైన గల మమకారంతో
అంటిపెట్టుకుని అసువులు బాసిరి
ఊహకు అందని ఉత్పాతంలో
వరదనీటిలో కొట్టుకుపోయిరి
పెళ్ళగించుకొని పోయెను చెట్లు
మృత్యువాతపడె మూగ ప్రాణులు
కుండపోతలో వణికెను కేరళ
గుండెకోతతో దేశం విలవిల
జనజీవనమే అతలాకుతలం
మరుభూమికదే తను మరురూపం
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం
అంతరించిన అడవికడుపులో
దాగిన దుఃఖం పొంగినదేమో
వేదనతో వేడెక్కిన భూమి
వదలిన గాఢపు నిట్టూర్పేమో
నను రక్షించని మానవ జాతికి
మున్నీరేనను హెచ్చరికేమో
నది పాయలుగా
గిరిచరియలుగా
ఉప్పెన తీరున ఊడ్చిపెట్టినది
కుప్పగ కూలుచు కోతపెట్టినవి
తగు గుణపాఠం ఇక నేర్వాలి
మన భవితవ్యం కాపాడాలి
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం
సింహాద్రి జ్యోతిర్మయి
19.8.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
13.KALEDIOSCOPS 2018
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
17.2.2018. శనివారం
ఆ సాయంత్రం
మా OPS ప్రాంగణం
క్రాంతిమయమై
కవితాత్మకమై
కదిరేశనాశయమై
శ్రీనివాస దర్శనమై
నిజమీ మాటల మంత్రముగ్ధమై
చిన్నారితారల
హర్షాతిరేకాల
అద్భుత విన్యాసాలను
ఆహూతులకు
కెలోడోస్కోప్ లో
ఆవిష్కరింపజేసింది
శంకరాభరణం లో చక్కగా స్నానం చేసిన పిల్లలు
జయజయ శుభకర వినాయక అంటూ తొలిపూజలిచ్చి
ఎందరో మహానుభావులంటూ
అందరికీ వందనాలు చేశారు
రామ రామ రామ అంటూ
రామదండులా ఒక్కటయ్యారు
నాట్యమాడే చిన్నారి సీతాకోకచిలుక లై కొందరు
బెటర్ వెన్ ఐ యామ్ డాన్సింగ్ అంటూ కొందరు
కాలా చష్మాలు పెట్టుకుని
వూవా వూవా అంటూ కొందరు
కోయిలారే అంటూ కోయవారై కొందరు
మేము డిస్కో దీవానేలమంటూ కొందరు
కార్టూన్ పికాచూలై కొందరు
ఉడీ ఉడీ జాయే అనిగర్భా నృత్యం చేస్తూ కొందరు
జిమ్కీ కమల్ అంటూ ఉత్సాహంగా చిందులేస్తూ కొందరు
బ్లేక్ షెల్టెన్ కౌబాయ్ లై కొందరు
అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు
ఈ ఆజ్ కీ పార్టీ కి
శ్రీకృష్ణ స్వామి గోపబాలకులతో
గోపికలతో విచ్చేశారు
శంభో శివశంభో అని పిలవగానే
బోళా శంకరుడు వచ్చేశాడు
పరమానందయ్య శిష్యులు మళ్ళీ పుట్టి వచ్చారు బాహుబలి బృందం వచ్చి సాహోరే అన్నారు
కేరళ సముద్రతీర వాసులు
పడవలపై వచ్చారు
సరిహద్దు సైనికులు వచ్చి సెల్యూట్ చేశారు
భిన్నత్వం లో ఏకత్వాన్ని చాటుతూ
అన్ని మతాల వాళ్ళూ వచ్చి
పండుగ వాతావరణం సృష్టించారు
అమ్మ తన అమూల్యమైన ప్రేమ అనే నెక్లెస్ ధరించి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించింది
అన్నదాతలు వచ్చి
ఆనందాల వర్షంలో సేదదీరారు
పాండురంగడు వచ్చి పలకరించాడు
పరీక్షల హడావిడి లో
తలమునకలై ఉన్న
పదవతరగతి పిల్లలు
మెరుపులా మెరిసి ఆడిఫాడి
మధుర జ్ఞాపకాలను
పదిలం చేసుకున్నారు
అర్థరాత్రి దాటిపోతున్నా
లాలి లాలి అని రాగం పాడుతున్నా
ఎవరూ నిద్రపోరేంటి?
వేణుగానం అంత చేదా!
అని నిద్ర
విసుక్కుంటూ వెళ్ళిపోయింది
గౌతమ బుద్ధుడు
సైకత శిల్పమై సాక్షాత్కరించి
ఈ వేడుకల్ని
అర్థ నిమీలిత నేత్రాలతో తిలకించి ఆశీర్వదించాడు
ఒక అపురూపమైన అనుభూతినిచ్చిన
ఈ సాయంత్రం
మరువలేనిది
మరపురానిది.
సింహాద్రి జ్యోతిర్మయి
18.2.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
14.ఇండియన్ బ్లోజమ్స్
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
ఇది ఇండియన్ బ్లోజమ్స్
ఇంటర్నేషనల్ స్కూలు
ఈ విద్యావనం చూడాలంటే
చాలవు సుమా!రెండు కళ్ళు
మా సంస్థను
వెన్నంటి నడిపించు విజయరాఘవులు
మచ్చటగా తీర్చినారు మురళీ, మోహనులు
ఇక్కడంతా శాస్త్రీయం
ఈ అందం
అరవిరిసిన అరవిందం
మా ప్రిన్సిపాలు గారు
కదిరేశన్ సారు
ఆయన అజాతశత్రువేమో అనిపిస్తారు
అందరినీ ఆత్మీయంగా పలకరించే
అతనొక నిండుకుండ
అతని మెడలో ఒక జాజులదండ
మా అందాలబొమ్మ కవితాలత
ముమ్మాటికీ అతనికి చక్కనిజత
అబ్ధుల్ ఖాదర్ మరియు అవినాషులు
పిల్లల్ని అలరిస్తాయట వారి క్లాసులు
గడగడా ఇంగ్లీషుమాట్లాడే నాన్సీ
చకచకా స్కూలంతా తిరిగే కల్వరి
ఎప్పుడూ నోట్సులు దిద్దుకోవటంలో కళ్యాణి బిజీ
పాఠం చెప్పటం మనోహరకు మహా ఈజీ
ప్రసాదు గారెంతో ప్రతిభాశాలి
హిందీ సుజల అతనికి జోడీ
చీటికిమాటికి అలిగే సంధ్య
చిరుచిరునవ్వుల డేవిడ్ భార్య
మా రవి రవివర్మ కాకపోవచ్చు
అయితేనేం!
అలవోకగా బొమ్మలు గీయటం
అతనికి చాలాబాగా వచ్చు
పద్మా మేడమ్ పడిలేచే కెరటం
పిల్లలంటే తనకెంతో ప్రాణం
కాస్త ఎక్కువే సుమా ఆవేశం
ఉషారాణి మా సోషల్ మేడమ్
ముక్కుకు సూటి ఆమెస్వభావం
మాట వినరట మాట పడరట
అనుకరించటం హాబీ తనకట
అల్లరి కొంత హడావిడి కొంత
పద్మజ్యోతికి ప్రతిదీ వింత
కాస్త అమాయకత్వం
కావలసినంత గడుసుదనం
శ్రీదేవిలో ఉన్నాయని నమ్మాలి మనం
ఈలలు వేసే పీ వీ ఆరు
సైలెన్స్ అంటూ శ్యామలగారు
సరితాదేవికి మాటలు కరువు
రాజేంద్రుడిది పాటలకొలువు
అనురాధ లున్నారు
అదిగో వారిద్దరు
ఒకరేమో ముద్దుగుమ్మ
ఇంకొక్కరు సోషలమ్మ
శ్రీనివాసు మా పి యి.టి
క్రమశిక్షణ అతని డ్యూటీ
కంప్యూటర్ శ్రీనివాసరావు
ముందునుండీ తెలుసు మనకి
తలలో నాలుక తానందరికీ
మొత్తానికి మా నందనవనం
మెరిసే వెలుగుల జ్యోతిర్మయం
ముచ్చటగొలిపే ఈ ముద్దులతోటకు
మేమంతా తోటమాలులం
విద్యాగంధమద్ది
ఈ విరిబాలలను
తీరుగ పెంచి తీర్చి దిద్దితాం
సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్
*తరువాత చేర్చిన కొన్ని పేర్లు
తెల్లని నవ్వుల
నల్లని జాబిలి సంగీత
సైన్స్ ని ఆటగ
బోధించడమే తన ఘనత
చిన్నారులలో చిన్నారగును
టీచరు జాస్మిను
పాటలు పాడును పద్ధతి నేర్పును
అందరి మనసుల నాకట్టుకొనును
మర్యాదా పురుషోత్తముడు
రాముడని రామాయణం చెప్తోంది
మర్యాదలు చేయటంలో
ప్రభావతి ని ఎవరూ మించలేరని
మా కవిత చెప్పింది
మొక్కు తీర్చుకున్న తల గుండు అయినా
చక్కని చిరునవ్వు మాత్రం
బొండుమల్లే సుమా!
ఈ అమ్మాయి చెప్పేది
హిందీ సబ్జెక్టు
పని విషయంలో తను
చాలా పరఫెక్టు
😀😀😀😀
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
15.మౌన ముద్ర
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
అక్షరం ముక్క రానివాళ్ళు...
అత్యున్నత విద్యావంతులు...
సామాన్యులు..
సెలబ్రిటీలు..
కూటికి నోచనివాళ్ళు..
కోట్లకు పడగలెత్తినవాళ్ళు..
మేధావులు..
మేలిపదవుల్లో ఉన్నవారు
అందరూ
ఓటు వేసేశారు
అభిప్రాయం
చెప్పేశారు
పార్టీల గుండెల్లో
రైళ్ళు పరిగెత్తిస్తూ...
ఊహాగానాలకు
ఊపిరిపోస్తూ...
ప్రజా తీర్పు
బ్యాలెట్ బాక్స్ లో
నిక్షిప్తమై ఉంది
మాతృగర్భంలో
ప్రసవానికి సిద్ధంగా ఉన్న పాపాయిలా..
తపోదీక్షలో ఉన్న
మునిపుంగవునిలా..
ప్యూపాదశలోని
సీతాకోకచిలుకలా..
నిశ్చితార్థమై
కళ్యాణ ఘడియ కోసం
ఎదురుచూసే కన్యామణిలా..
ఆషాఢంలో
పుట్టింటకి చేరిన
నూతన వధువులా..
తుఫాను ముందరి
ప్రశాంతతలా....
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.5.2024
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
16.*O P S* లో
( *ఒక పంతులమ్మ సామ్రాజ్యం* ) లో
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
నాకింకా జ్ఞాపకం
నీవీ ప్రాంగణంలో
అడుగుపెట్టిన
ఆ మొదటిరోజు..
మీ అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని
భయంభయంగా చూస్తూ
బుడిబుడి అడుగులు వేస్తూ
నీ చిట్టి చిట్టి పాదాలు
నావైపు నడిచి రావడం,
నీ చేతిని నా చేతిలో పెట్టేసి
వెళ్ళిపోతున్న మీ నాన్నను చూసి
వెక్కిళ్ళుపెట్టి ఏడవడం,
అమ్మ సాయంత్రం వస్తుందిలే రామ్మా!
అని అనునయిస్తున్న నన్ను నువ్వు
అపనమ్మకంగా చూడటం
నాకింకా జ్ఞాపకమే
అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తుందా!అని ఎదురు చూసే నీకు
నిమిషాలు గంటలుగా గడిచేవేమో కానీ,
నిన్ను సముదాయించడానికి మాత్రం
నా గంటలు నిమిషాల్లా దొర్లిపోయేవి
అన్నం తిననని మారాం చేసే నీకు నేను
ఆయమ్మనైన సందర్భాలెన్నో!
మెల్ల మెల్లగా
నీకు నాతో చేరిక ఏర్పడింది
ఇక అక్కడినుండీ
మన అనుబంధం బలపడింది
నువ్వు
నాకు టాటా చెప్పి
వెళ్ళిపోయిన సాయంత్రం నుండీ
గుడ్ మార్నింగ్ అంటూ
మెరిసే కళ్ళతో
మరునాడు ఉదయం
నన్ను కలిసేవరకూ
పోగేసుకొచ్చిన ఊసులన్నీ
గుక్కతిప్పుకోకుండా నువ్వు
ఏకరువు పెడుతుంటే
నిజం చెప్పొద్దూ!
హరివిల్లు లోని అన్నివర్ణాలూ
నీ మోములోనే అగపడేవి నాకు
నీ ముద్దుముద్దు పెదవులనుండి
రాలిపడిన
ఆ ముత్యాలన్నీ
దండలుగా కూర్చి
మెడలో అలంకరించుకుని
మురిసిపోయే
నాకంటే
భాగ్యశాలి ఎవరూ
ఉండరనిపిస్తుంది
ఈ పుష్కరకాలంలో
నువ్వు
నా గుండెలోగిలిలో
విరజిమ్మిన ఆ
జ్ఞాపకాల చిట్టా నెమరువేయాలంటే
అబ్బో!అది సాధ్యమా!
అవి
నువ్వు పారేసుకున్న పెన్సిల్ ముక్కల్లా
నువ్వు చింపి పోగులేసిన
నోటు బుక్కు లోని పేజీల్లా
నీ తరగతి గది
శుభ్రం చేసేటప్పుడు
దొరికే ఎరైజర్లు,షార్పనర్లలా
నువ్వు కిందా మీదా పడి ఒంటికి
తగిలించుకున్న దెబ్బల్లా
నువ్వు చేసిన అల్లరి చేష్టల్లా
పాఠం వినకుండా
స్నేహితులతో
నువ్వాడిన గుసగుసల్లా
నువ్వు నాతో
చటుక్కున
చెప్పిన అబద్ధాల్లా
నువ్వు రాసే
తెలుగు నోట్సులోని
అక్షరదోషాల్లా
ఎన్నో! ఎన్నెన్నో!
బహుశా అవి మన లెక్కలటీచర్లు కూడా
లెక్కచెప్పలేనన్ని ఉంటాయి కదూ!
అన్నీ నేర్చుకుంటూ
ఆడుతూ,పాడుతూ
ఇక్కడే నువ్వు
నా కళ్ళముందే
ఎంత ఎదిగావు?
*ఇంతింతై వటుడింతయై* అన్న
పోతన పద్యంలా
నున్నని పాల బుగ్గలవయసు నుండి
నూనూగు మీసాల నూత్న యవ్వనం వరకూ
బుట్ట గౌను తొడిగిన పసితనంనుండి
బుట్ట బొమ్మలా
సొగసు నిన్ను
చుట్టుకునేవరకూ
దినదినప్రవర్ధమానమైన
నీకళలన్నీ
నాకు నయనానందకరమే
తెలివితేటలు, ప్రపంచ జ్ఞానం పెంచుకుంటూ
తరగతులమెట్లు నువ్వు ఎక్కేవేళ
ఇంగ్లీషు,సోషల్
రెండేసి పేపర్లుగా
సైన్సు మూడు పేపర్లుగా విడిపోయినట్లుగా
నీ వ్యక్తిత్వం కూడా
బహుముఖంగా
రూపాంతరం చెందటం నేను
చూస్తూనే ఉన్నాను
ఈ క్రమంలో
నేను పెట్టిన పరీక్షలు
నువ్వు రాయటమే కాదు
నువ్వే నాకు,నా సహనానికీ కూడా పరీక్షగా మారిన
సందర్భాలూ లేకపోలేదు
వయసుకు వసంతం వచ్చిందని
మురిసిపోయే నీ మనసుకు
వివేకపు నీరు పెట్టకపోతే
నా చేతుల్లో పెరిగిన
ఈ చిన్నిమొక్క
గ్రీష్మ తాపంతో
వడదెబ్బ తగిలి
బ్రతుకే సొమ్మసిల్లి పోయే ప్రమాదం ఏర్పడుతుందని
ఎంతగా బెంగపడిపోయానో!
పైకి నేను
కఠినంగా కనిపించే టీచర్నే అయినా
లోలోపల అమ్మనే కదా!
అందుకనే నేను
నీ జీవితపు తోటను
కాపుకాసే తోటమాలినయ్యాను
నా శ్రమ వృధాకాదు
నేడు నా చేతుల్లో మొగ్గవైన
నీ భవిష్యత్తు
రేపు
విరబూసినప్పుడు
ఆ పరిమళంలో
నేను తప్పక ఉంటాననే
నమ్మకం నాకుంది.
అదిగో!
ఆ తరగతి గదిలో
నేను కూర్చునే కుర్చీ,
నువ్వు కూర్చునే బల్లా
రేపు
మరొకరికి ఆశ్రయం కావచ్చు
కానీ
ఆ నల్లబల్లమీద
నేను రాసిన తెల్లని అక్షరాలు
నీ మెదడులో విజ్ఞాన కాంతుల్నినింపి
నీ భవితను
*జ్యోతిర్మయం* చేస్తాయని
రేపు నీవు సాధించబోయే
స్వచ్ఛమైన
కీర్తిని చాటే
శిలాక్షరాలు అవుతాయని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
చిరంజీవ!
*శుభం భూయాత్*
ప్రేమతో
మీ *తెలుగు మిస్*
సింహాద్రి జ్యోతిర్మయి
6.4.2022
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
17.*చివరి చిరునామా*
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
ఆమె
కొందరి జీవితాల్లోకి
ఆకస్మిక అతిథి
కొందరికైతే
చడీచప్పుడూ లేకుండా
విస్తరించే
చాపకింద నీరు
కొందరికామె
వస్తున్నానని
హెచ్చరికలు జారీ చేసే
ప్రమాద ఘంటిక
కొందరు
తమంతట తామే
తనను కోరి వరించేలా
చేసుకోగలిగిన నెరజాణ
కొందరు
నీ ఒడిలో చేర్చుకుని
సుఖనిద్రనిమ్మని
బ్రతిమాలాడుకున్నా
కనికరించని కఠినాత్మురాలు
ఎవరికి వారినే
ఒంటరిగా రమ్మని
పిలుచుకుపోయే ప్రియురాలు
మరికొందరికి
ఇంటి గుమ్మం దాకా వచ్చి కూడా
మళ్ళీ వద్దాం లే అని
మనసు మార్చుకుని
మరలిపోయే చపలచిత్త
జీవరాశులన్నీ
తనవేనని
విధాత చేత
రాయించేసుకున్న
వీలునామా
ఏదేమైనా చివరకు
ఇల్లు ఖాళీ చేయవలసి
వచ్చినప్పుడు
తలదాచుకోవడానికి
కాసింత చోటు చూపించి
కరుణించే చల్లని తల్లి
సకల ప్రాణికోటికి
చివరి మజిలీ
శాశ్వత చిరునామా
మృత్యుదేవత.
నిన్న మా పిన్ని (అమ్మ చెల్లెలు) భారతి మరణంతో ,మరణం గురించిన అంతర్మధనంలో
ప్రసరించిన భావవీచిక.
మా పిన్ని పూర్తి పేరు
స్వతంత్ర భారతి.1947 ఆగస్టు 15 వ తేదీన పుట్టిందని మా తాతగారు తనకు ఆ పేరు పెట్టారట.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
31.1.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
18.అంబరం - అర్ణవం
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
సూర్యకాంతులు
చంద్రశోభలు
తారల తళుకులు
గ్రహ చలనాలు
మేఘమాలికల సొగసులు
మెరుపు తీగల మాలికలు
హరివింటి సోయగాలు
చిత్రవర్ణ దీధితులు
అన్నీ తనలోనే
ఉన్నాయని
భ్రమింపజేసే
అద్భుతం
ఆకాశం
అనంతమనుకున్న తాను
ఆరాతీస్తే
తీరా చూస్తే
అక్కడంతా శూన్యమట
అచ్చం నా మనసులాగే...
ఆణిముత్యాలు
అగాథాలు
ఆధారపడ్డ జీవులు
కలుపుకునే బంధాలు
ఎగసిపడే కెరటాలు
దరితెలియని పయనాలు
అలజడినంతా
అంతరంగంలోనే దాచి
పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది సాగరం
అచ్చం నా హృదయం లాగే....
సంసార సాగరం లోని
ఆటుపోట్లను
తట్టుకుంటూ
హృదయాకాశం
చేస్తున్న సవ్వడిని వింటూ
ఆశలు మోసుకుంటూ
నవ్వును పులుముకుంటూ
అప్పుడప్పుడూ ఇలా
ఒంటరిగా.....
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.2.21
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
19.సత్యం బాబోయ్
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
అపనింద
అవమానం
ఆక్రోశం
అరణ్యరోదన
ఎనిమిదేళ్ళ నిర్బంధం
వెళ్ళిపోయిన వయసు వసంతం
మిగిలిన అనారోగ్యం
ఇన్నిటికీ లక్ష మూల్యం చెల్లిస్తే
చాలు
చట్టానికి కళ్ళే కాదు
సర్వేంద్రియాలూ బంధించబడ్డాయేమో!
సింహాద్రి
3.4.2017.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺
🌺🦋
20. పేరు (పొ )0దండి.
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺
మన పాఠశాల ముప్పై నాలుగు వసంతాలు చూసింది.
ప్రస్తుతం మనకు
దేవతల వయసు నడుస్తోంది
ప్రతి ప్రసవం
గండమని తెలిసినా
సంతోషం గా బిడ్డల్ని కనే
మాతృమూర్తిలా
పదవ తరగతి పూర్తి చేసి
వెళ్ళిపోయే ప్రతి బ్యాచ్ ని చూసి
మనసు బాధతో
మూగబోతున్నా
మీ పురోగతి కోసం
ఆనందంగా
మీ చెయ్యి విడిచి పెడతాము
మీ జ్ఞాపకాలు
మా మనో ' హారిక ' లై
గుర్తుకొచ్చినప్పుడల్లా
తీయని ' భావన ' ల
దరహాస ' కుసుమమణి '
మా పెదవులపై విరిసి మెరుస్తుంది.
మీ భావి ప్రణాళికా ' రచన '
చేసే మేము
మీలో ' నమ్రత ' లోపించినప్పుడు
మందలించి ,దండించినా
ఆ కోపం
తపింపజేసే ' రోహిత ' కిరణం కాదని,
చల్లని ' జ్యోత్స్న నీహారిక ' లు
కురిపించే
మాతృ వాత్సల్య ' ప్రియాంక ' మని
మేము కోరేది మీ ' శ్రేయ 'స్సేనని
ఒకనాటికి మీరు తప్పక గ్రహిస్తారు.
' తుల్య 'మైన ,' సౌమ్య ' మైన
ప్రవృత్తి తో ఒడిదుడుకులను
మనోబలంతో ఎదుర్కోవడం నేర్చుకోండి
అప్పుడు , 'నిఖిల ' 'జయశ్రీ 'లు
మీ సొంతమై
విజయమనే ' రాజ్యలక్ష్మి '
మీకు దాసోహమంటుంది.
'ఇందు భార్గవి 'చల్లని దీవెన
'సాయి (వైష్ణవి )' కృప మీకు తోడై
ఆ ' శ్రీ వైష్ణవీ దేవి ' ' కృష్ణ శ్రీ 'కళలను
'నవ్య ఉదయ ' రేఖలను
' రమ్య ' కాంతులుగా మీపై
ప్రసరింపజేస్తుంది.
మీ జీవితం ' అలీ ఫ 'న్నీ ఈవెంట్ లా
సరదాలతో సాగిపోతుంది.
'సంతోష ' తరంగితుడై
' రవితేజ ' మొప్ప 'ఫణీంద్ర 'మున సు 'ఖలీల 'శయనించు
' మనోజ ' జనకుడైన
ఆ 'వెంకట రమణ 'మూర్తి
మిమ్మల్ని దీవిస్తాడు
'ఆకాష ' ' కార్తిక చంద్ర' దీపాన్ని
బాల 'చందు ' రునిగా ధరించిన
ఆ 'గంగాధర 'స్వామి కరుణిస్తాడు
రామ నామ ' కీర్తన 'మున
పరవశించే ' రామాంజనేయుడు '
సకల కార్య 'సిద్ధు 'లను అనుగ్రహిస్తాడు
మీ ఉజ్వల భవిష్యదాగ్నికి
శ్రమా ' హవిహేష 'మును జోడించి
ఇండియన్ ఐడల్ 'రేవంత్ ' లా
గుర్తింపు తెచ్చుకుని
మిస్టర్ డిపెండబుల్ ' రాహుల్ 'లా రికార్డులు సృష్టించి
తన చివరి సిక్సర్ తో
విదహాస్ ట్రోఫీ ని మన సొంతం చేసిన
దినేష్ ' కార్తిక్ ' లా ప్రతిభ చూపి
వెలిగే ' రోహిత్ ' లై
'యశ్వంత 'మైన జీవితాన్ని
'వెన్ '(when ) లియో 'లై
పొందుతారా!అని
మేము ఎదురుచూస్తుంటాము.
అల్లాహ్ అక్బర్ అంటూ 'మహమ్మద్ 'ని
పాహి 'హరికృష్ణ 'అంటూ
ఆ ఏడుకొండల ' వెంకటేశ్వర్లు ' తో సహా సర్వ దేవతల్ని మీ కోసం వేడుకునే
మీ ప్రియ 'భార్గవ్ ' ల
శుభాశీస్సులు
'లక్ష్మీ' కరస్పర్శయై తాకి
మీ భవిష్యత్తును ' జ్యోతిర్మయం ' చేసి
మిమ్మల్ని ' క్రాంతి 'పథంలో
నడిపించాలని
మనసారా దీవిస్తూ
ఈ ' కవితాలతా 'పుష్పాలతో
వీడ్కోలిస్తున్నాము.
"శుభం భూయాత్"
టీచర్లందరి తరపున
ప్రేమతో
మీ తెలుగు మిస్
సింహాద్రి జ్యోతిర్మయి
27.3.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
21.నేను మనిషిని కాను
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
నాకు మెదడేతప్ప
హృదయం లేదు
మతమౌఢ్యమే తప్ప
మానవత్వం లేదు
కామమే తప్ప
కనికరం లేదు
పశుత్వమే తప్ప
పాపచింతన లేదు
నేను మతమనే
మేకతోలు కప్పుకున్న పులిని
అడవి నశించి పోవడంతో
నగరంలో జొరబడ్డ మృగాన్ని
విలువల వలువలు
విప్పేసిన విశృంఖలత్వాన్ని
నాకు కొమ్ముకాసే
నాయకులున్నంతవరకు
దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టుకుని
పసిమొగ్గల్ని పాశవికంగా
నలిపి పారేయగలను
దేవుడే మౌనంగా చూస్తుంటే
మీరెందుకిలా నోరుపారేసుకుంటారు?
అమానుషం అన్నమాట
నాకు వాడకండి
ఎందుకంటే నేను
మనిషిని కానుగదా!
చిన్నారి ఆసీఫా ఆత్మశాంతికై
రెండు కన్నీటిబొట్లు
నాలుగు అక్షరాలు నివాళిగా సమర్పిస్తూ...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఒంగోలు
14.4.2018
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
22. * క...రో....నా*
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
క..నపడని శత్రువై క లకలం సృష్టిస్తూ
రో..గమై అంటుకుని విస్తరిస్తూ
నా...నా దురవస్థల పాలుచేస్తూ
క..ట్టుకున్న వారైనా చేరలేని ఏకాంతంలో
రో..జులు వెళ్ళదీస్తూ
నా..నాటికీ కృశిస్తూ
క..ర్మం చాలక కన్ను మూస్తే, గుండెలవిసేలా
రో..దించటమే తప్ప
నా...అన్న వాళ్ళ
క...డసారి చూపుకైనా నోచుకోక
రో...డ్డు పక్కనెక్కడో
నా..గరికత నవ్వులపాలు కాగా
క...డపటి ప్రయాణం ముగిసిపోతుండగా చూసి
రో..సిన నా హృదయవేదనే
నా..లుగు కవితా పంక్తులుగా...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.7.202
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
23. అమరత్వం
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
ఎన్నో మరణాల గురించి వింటుంటాను
ఆప్తులు
అనారోగ్య పీడితులు
అకృత్యాలకు గురిఅయినవారు
ఆత్మహత్యలకు పాల్పడిన వారు
ప్రమాదాల బారిన
పడినవారు
ఉద్యమాలలో ఊపిరి విడిచిన వారు
ఏ మరణమైనా
అంతులేని దుఃఖాన్నిస్తుంది
అయ్యో పాపం
అనిపిస్తుంది
ఎంత ఘోరమని
బాధేస్తుంది
కానీ
నీ మరణవార్త విన్న
నా హృదయం లో
చెలరేగిన
ఈ భావ పరంపర
అది ఉప్పొంగిన గర్వమా!
తెలియని ఉద్వేగమా!
కన్నుల్లో నీటి చెమ్మా!
గొంతుకు అడ్డం పడ్డ దుఃఖమా!
చెప్పలేను గానీ వీరుడా!
చేతులెత్తి మొక్కగలను
ఎవరి రక్షణ
వారు చూసుకుని
ఎవరి బాధ్యత
వారు నిర్వర్తించి
కరోనాను కట్టడి
చేయలేకపోతున్న
మాకోసం
దేశ రక్షణ ధ్యేయంగా
మా అందరి బాధ్యత
నీ భుజాలకెత్తుకుని
సరిహద్దుల్లో
సమరం సంభవించిన వేళ
వీరమరణం పొందిన
నీ కళ్ళల్లో
చివరిసారిగా
అమ్మ
ఆలుబిడ్డలు
ఆస్తులు
ఇవేవీ మెదిలిఉండవు
మాతృభూమి రుణం
తీర్చుకున్నాను
అన్న సంతృప్తి తప్ప
పోయిరా!అమరుడా!
దేశమాత పాదాలపై
పూజాపుష్పానివై
జారిపడ్డ
నీ త్యాగ పరిమళం
ఈ మట్టిని అంటిపెట్టుకుని
గుబాళిస్తూనే ఉంటుంది
జాతి గుండెల్లో
చిరకాలం
గుర్తుండిపోతుంది
వీర జవానులారా!
మీకిదే మా
కన్నీటి నివాళి...
జై జవాన్
జై భారత్
చైనా భారత్ సరిహద్దుల్లో
వీరమరణం పొందిన
అమరజవాన్లకు
అంకితం
ఈ అక్షరాంజలి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.6.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
24. బాల గంధర్వుడు
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
అతడు
లలిత కళారాధనలో
వెలిగే స్వరదీపం
మధురభారతి పదసన్నిధిలో
శ్రీపతుల తోట పుష్పం
ఈ బాలగంధర్వ పండితారాధ్యుడు
పామరులకే కాదు
పండితులకు కూడా ఆరాధ్యుడు
అతని ముద్దుపేరు బాలుడు
సినీ వినీలాకాశంలో నెలబాలుడు
భగవద్గీత ను పాడిన ఘంటసాల ను
నారదుడని భ్రమించి
వైకుంఠం చేర్చుకున్న విష్ణుమూర్తి
నాలుక కరచుకుని వెంటనే
ఈ తుంబురుణ్ణి మన భువికి
పంపించి ఉంటాడు
కాకుంటే ఆ రెండు గొంతుల్లోని
భక్తిరసం
నవరసాలనూ అధిగమించగలిగేదా!
నవరసాలనూ,సప్తస్వరాలనూ
నమిలి మింగేశాడేమో ఇతగాడు
కాబట్టే
నా పాట పంచామృతం అనగలిగాడు
అతడు ఆరేసుకున్న ప్రతి పాటకీ
అభిమానులు
మనసు పారేసుకుంటారు
ఈ సుబ్రహ్మణ్యం చిలకకొట్టుడికి
పాటలన్నీ పలకమారి
ప్రజల నాల్కలపై
చవులూరాయి
పాటలేనేమో అతని పొట్టకి ఫుడ్డు
నిర్మాతలకతను బంగారు బాతుగుడ్డు
మాటేరాని చిన్నదానికోసం
ఊపిరి బిగబడితే
మాటేరాక అభిమాని
మ్రాన్పడిపోయాడు
బంగారానికి తావి అబ్బినట్లుగా
సంగీతానికి సంస్కారాన్ని జోడించే
అతని పాటే మంగళ వాద్యము
మాటే మంత్రము
తనదరికి రాలేని
అభిమాన వనాలకోసం
ఈ పాటల వసంతమే
ఇటు తరలి వచ్చేసింది
మనం
నిలువెత్తు ధనం పోసినా
దొరకునా......
ఇటువంటి భాగ్యం
సన్మాన శుభవేళ
తిలకించి పులకించి తరియించు పుణ్యం
దీర్ఘాయురస్తు బాలూ!
ధన్యాత్ములు ఈ ఒంగోలు ప్రజలు
SP బాలు గారు 2011లో మా ఒంగోలు వచ్చినప్పుడు
నేను రాసి ,ఆయనకు ఫ్రేమ్ కట్టించి అందజేసిన కవిత ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో పంచుకోవటం ఆనందం అని భావిస్తూ
సింహాద్రి జ్యోతిర్మయి
4.6.2018
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
మా (మంచి) అమ్మ మనసు
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
ఈ రోజు మా అమ్మ స్వర్గీయ సింహాద్రి విశాలాక్షి గారి పుట్టిన రోజు (జయంతి అనాలంటే మనసు రాదు.ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉన్న ఫీలింగ్.ఎప్పుడైనా కల వచ్చినా అమ్మ నన్ను తిడుతున్నట్లో,నేను అమ్మ తో గొడవపడుతున్నట్లో ఆ కలలు ఉంటాయి.)మీరిద్దరూ తల్లీకూతుళ్ళా లేక అత్తాకోడళ్ళా అని నాన్నగారు ఎప్పుడూ అనేవారు.బహుశా అమ్మది బాధ్యత మసుగును కప్పుకున్న ప్రేమ కాబోలు.లేకుంటే నాన్నగారిని ఒప్పించి, సమాజాన్ని లెక్కచేయకుండా నా వర్ణాంతర ప్రేమ వివాహం జరిపించగలిగి ఉండేదా!
ఎంతైనా అమ్మ అమ్మే అని, అమ్మ సాధింపు వెనుక కూతురిపై అంతులేని ప్రేమ ఉంటుందని ఒక ఆడపిల్ల కు తల్లై, నేను మళ్ళీ నా కూతురిని సాధించటం మొదలుపెట్టాకే నాకు అర్థమైంది.
అలాంటి మా అమ్మ అనే అందమైన జ్ఞాపకానికి పుట్టినరోజున ఈ చిన్న కవిత *అమ్మ మనసు*
అంకితం చేస్తూ...
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
25.అమ్మ మనసు
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
స్నేహితులతో సినిమాకెళ్తే తప్పేంటి?
ఎందుకు నన్ను పంపించవు అని అమ్మను
ఎదిరించిన ఆ నేనే
నా కూతురు స్నేహితులతో
సినిమాకెళ్తానంటే వద్దంటున్నాను
అరగంట నేను రావటం
ఆలస్యమయితే
అంత కంగారెందుకు నీకు?
అని అమ్మపై చిరాకుపడ్డ ఆ నేనే
నా కూతురి ఆలస్యానికి
ఆదుర్దా పడిపోతున్నాను
మగ పిల్లలతో మాట్లాడితే
కొంపలు మునిగిపోతాయా అని
అమ్మపై విరుచుకుపడ్డ ఆ నేనే
మగపిల్లలతో నా కూతురి స్నేహాలపై
ఆరాటంతో ఆరాతీస్తున్నాను
ఎక్కడికి వెళ్తానన్నా
నా వెంట తమ్ముణ్ణి పంపిస్తావు
నా మీద అంత అనుమానమా అని
అమ్మతో దెబ్బలాడిన ఆ నేనే
అన్నయ్యను వెంట తీసుకెళ్ళమ్మా
అని నా కూతుర్ని బ్రతిమలాడుతున్నాను
నచ్చిన వాడిని చూపించి
పెళ్ళి చెయ్యమని ఒప్పించి
అమ్మ భయాలను అర్థం లేనివిగా
కొట్టిపారేసిన ఆ నేనే
నా కూతురు
ఎప్పుడెవరు నచ్చారంటుందో
వాడు ఎలాంటి వాడో ఏమో
అసలే ఈ పిల్ల అమాయకురాలు
అని హడలిపోతున్నాను
నిజమే మరి!
అప్పుడేమో నాది
అందమైన కలలు కనే
బాధ్యతల బరువు తెలియని
పదహారేళ్ళ పడుచువయసు
ఇప్పుడు మాత్రం నాది
అచ్చంగా
ఆనాటి మా అమ్మ మనసు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.5.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
International family day 💙 సందర్భంగా
మా OPS ఫ్యామిలీ తో నేను.
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
26. Mai OPS
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
మా పాఠశాల లోని
మా అనుబంధాన్ని
అక్షరరూపం లోకి
అనువదిస్తే
అది అందమైన *కవిత* అవుతుంది.
విద్యార్థులనే విరిబాలల
పెదవులపై
మెరిసే
*నీహారికా* కణమౌతుంది
ముచ్చటైన రంగవల్లులపై
ముద్దుగా కొలువుదీరిన
గొబ్బెమ్మలతో
సందళ్ళునింపే
సం *క్రాంతి* ఔతుంది
కలియుగ
*శ్రీనివాస*మైన
తిరుమలలా
తల్లిదండ్రులు కోరి
తమ పిల్లలను పంపించే
విద్యల ఆలయమౌతుంది
శ్రీ *వాణి*
కొలువు దీరిన
మా ప్రాంగణం
ఎప్పటికప్పుడు
ఆధునికతను
సంతరించుకుంటూ
*ఆదిలక్ష్మి* కళలతో
*మనోహర*మై
తల్లిదండ్రుల ఆశలను
పల్లవింప జేసి
ప్ర *జ మీ(రు) మా* పిల్లల భవితను
*జ్యోతిర్మయం* చేస్తారన్న నమ్మకానికి
ఆలంబనమౌతున్న
మా ఓపీయస్
(ఒంగోలు పబ్లిక్ స్కూల్) ఫ్యామిలీ కి
ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే శుభాకాంక్షలు.
Proud to be associated with OPS
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టీచర్@OPS
15.5.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
27. సరిజోడు
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
సరిగ్గా 24 ఏళ్ళు క్రితం
మా తమ్ముడు శ్రీరామమూర్తి పెళ్ళి తో
ఈ సంధ్యా దీపం
మా ఇంట పాదం మోపింది
లక్ష్మీ కళ తనవెంట తెచ్చింది
అత్తామామల మనసు దోచింది
నా తమ్ముడి
అడుగులో అడుగైంది
పని అంటే బద్ధకించటం లేదు
ఎంతమంది బంధువులొచ్చినా విసుగుపడదు
చిరునవ్వే ఆభరణంగా
*ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి*
పాటకు అచ్చంగా అతుకుతుంది.
ఈ వదిన ఇంటి
ప్రతి శుభకార్యం
తన చేతులమీదుగానే జరిగింది
ఒక్క మాటలో చెప్పాలంటే
అమ్మ లేని పుట్టింట
ఆదరణ ఏముంటుంది?
అని నాకు ఎప్పుడూ అనిపించలేదంటే
అది మా సంజుగారి
(మా తమ్ముడు,నేను మా సంధ్య ను అలాగే పిలుస్తాము) సౌశీల్యమే,సహనమే, సుగుణమే.
ఇక మా తమ్ముడంటే వాడు పేరుకు తగ్గవా డే. మా తమ్ముడు,మరదలు ఇలాంటి పెళ్ళి రోజు లు మరెన్నో జరుపుకోవాలని,
ఆయురారోగ్యాలతో
సుఖశాంతులతో
ఐశ్వర్య ఆనందాలతో
నిండు నూరేళ్ళు జీవించాలని
తల్లి దండ్రుల, గురువులు,పెద్దల ఆశీస్సులు ఫలించాలని
మనసారా దీవిస్తూ
మా సంధ్యకి, మూర్తికి 25 వ పెళ్ళి రోజు శుభాకాంక్షలు .
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.5.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
28 ఎట్టకేలకు...
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
ఏడేళ్ల ఎదురుచూపు
ఏడేళ్ల న్యాయ పోరాటం
ఏడేళ్ల మాతృవేదన
ఎట్టకేలకు ఫలించింది
అమానుషంగా
అత్యంతకౄరంగా
అర్ధరాత్రి వేళ
అసహాయురాలైన
ఆడపిల్ల
మనశ్శరీరాలను
ఛిద్రం చేసినందుకు కాదు,
మానభంగానికి
సహకరించకుండా
ఎదురుతిరిగినందుకే
అంతగా హింసించామని
నేరస్తులు చెప్పిన నాడే
వాళ్ళు బ్రతికే హక్కు ను కోల్పోయారు.
ఉరిశిక్ష పడిన నాటినుండి
ఉరితీయబోయే
ఆఖరి క్షణాలవరకూ
చట్టంలో ఉన్న
అన్ని లొసుగులను
చట్టమిచ్చిన
అన్ని అవకాశాలను
ఉపయోగించుకుంటూ
శిక్ష తప్పించుకోవటానికి
చేసిన ప్రయత్నాలలో ఎప్పుడైనా
ఏ ఒక్క క్షణమైనా
ఏ ఒక్కరి మనసులో నైనా
తప్పు చేసిన మనమే
ఇంత తపిస్తుంటే
ఏ పాపమూ ఎరుగని
ఏ నేరమూ చేయని
ఒక ఆడపిల్ల
మన చేతుల్లో
ఎంత నరకయాతన
అనుభవించి
చనిపోయిందోకదా!
అనే పశ్చాత్తాపం
కలిగిఉంటే
అదే వాళ్ళు
ఈ జన్మలో
మనిషిని అని అనుకోవడానికి
పనికివచ్చే క్షణాలు.
నిర్భయా!
నీ ఆత్మకు
ఈనాటికి
శాంతి
చేకూరి ఉంటుందని
నమ్ముతూ..
ఒక స్త్రీ గా
ఒక ఆడపిల్లను కన్నతల్లి గా
నేడు నీకు నివాళులు అర్పిస్తున్నాను.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.03.20
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
నిర్భయకు నివాళి
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
29. అ(తి)వమానం.
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
మానవ మృగాలు ఆమెను
మదమెక్కి ఆక్రమించిన వేళ
ఆచ్ఛాదనం
ఆమె మనసు లా ముక్కలయింది.
ఆడతనం
అవమానంతో చచ్చిపోయింది
ఆవేశం
శక్తి కొద్దీ పోరాడింది
ఆక్రోశం
అరణ్య రోదనగా మిగిలింది.
అసహాయత
కన్నీరుగా రూపాంతరం చెందింది.
అసహ్యం
కనురెప్పల వాకిళ్ళు మూసేసుకుంది.
దానవత్వం
విలువల వలువల్ని ఊడ్చేసింది
మానవత్వం
నడిరోడ్డు మీదకు నగ్నంగా విసిరివేయబడింది.
అభిమానం
శరీరంలా పచ్చి పుండయింది
అవమానం
న్యాయం కోసం పోరాడింది.
బ్రతుకుతీపి
మృత్యువు చేతిలో ఓడిపోయింది.
స్పందించిన సమాజం
కెరటంలా ఎగసి,విరిగి పడింది.
చిట్టితల్లీ!
దారుణ హింసకు ప్రత్యక్ష సాక్షిగా
ఛిద్రమైన నీ శరీరాన్ని చూసికూడా
సత్వర న్యాయం చేయలేకపోయిన
ఈ ధృతరాష్ట్రుల పాలనలో
ఆడదానిగా పుట్టినందుకు
ఆడపిల్లను కన్నందుకు
సిగ్గుతో చితికిపోతున్నాను.
కనీసం
నీ ఆత్మకైనా
శాంతి చేకూర్చలేక పోతున్న
మమ్మల్ని క్షమించకమ్మా!
కసిదీరా శపించమ్మా!
నిర్భయ మరణం తరువాత రాసిన ఈ కవిత
ఆ దారుణం జరిగి నాలుగేళ్ళు పూర్తయిన
తరువాత ఆమెకు అంకితమిచ్చాను.
సింహాద్రి
16.12.2016.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
30. వీరపత్ని
🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋🌺🦋
నిన్ను చూసి నేను
గర్వపడుతున్నా
కానీ నువ్వు నాకు
చేసిన బాస
అసత్యమని
ఆలస్యంగా
తెలుసుకున్నా
నా కన్నా ఎక్కువ గా
నీవు ఈ నేలతల్లి నే
ప్రేమించావని తెలిసి
అసూయ పడుతున్నా
అయినా అది నాకు
గర్వం గానే ఉంది
నిన్ను ఎంతగానో
ప్రేమించే మాకంటే
నీవెన్నడూ
చూసి ఎరుగని వారికోసం
నీ జీవితాన్ని
త్యాగం చేసిన
నిన్ను చూసి నేను
గర్వపడుతున్నా
నిన్ను నా భర్తగా
పొందినందుకు
గర్వపడుతున్నా
నా భర్త
పార్థివ దేహాన్ని
చూసి
ఎవ్వరూ
కంటతడి పెట్టకండి
అది ఎవ్వరికీ
అందనంత ఎత్తులో ఉన్న నా భర్త
ఔన్నత్యాన్ని
త్యాగాన్ని
కించపరుస్తుంది
ఒక వీర సైనికుడి
భార్య గా
తలఎత్తుకు జీవించే
ధన్యతను నాకు
మిగిల్చి
తరలిపోతున్న
నా ప్రాణమా!
నీకిదే నా వందనం
కడసారి గా
సగర్వంగా.....
నా మనసుని
కదిలించిన
ఆ వీరపత్ని హృదయాన్ని నాకు
చేతనైన భాషలో,
భావంతో
అనువదించడానికి
ప్రయత్నించా.
🙏🙏🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర
ఉపాధ్యక్షురాలు
23.2.2019
She is wife of late Major Dhondiyal, who was killed yesterday while fighting the terrorists.
I am forwarding this short 90 seconds vedeo clip, with a SPECIAL REQUEST to all of you to kindly listen to Each and Every LAST few words being said by this brave lady DIRECTLY to her martyred husband, before his last rites !!
Just to make it easier for all, She starts by telling her departed hero --
"" I feel very proud, You just lied to me that you love me , but I feel jealous of You that you love the nation more, and that you sacrificed your life for the people whom you don't even know... I am proud to have you as my husband...I request all not to sympathize ...You hold a position much higher than all of us here... I Salute you...
Her last sentence will take your breath away.
Let us admire and SALUTE all such outstanding young ladies of India, who are brave enough not only to marry an Armyman, but also themselves reflect & display the same Fighting Spirit that the Army life teaches them !!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ఫేస్ బుక్ జ్ఞాపకం చేసిన గత ఏడాది మన ప్రియాతిప్రియమైన డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాస్టారికి జరిగిన ఆత్మీయ సత్కారం
నిన్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం రోజున,
సాహిత్య అకాడమీ సభ్యులు గా పదవీ బాధ్యతలు స్వీకరించిన
డాక్టర్ నాగభైరవ ఆది నారాయణ గారి కి
ఎన్టీఆర్ కళాక్షేత్రం లో
జరిగిన ఆత్మీయ
సన్మానం పై
నా స్పందన
🍀🦋🍀🦋🍀🦋🍀🦋🍀🦋
31. తెలిసొచ్చింది
🦋🍀🦋🍀🦋🍀🦋🍀🦋🍀
అభినందనల వెల్లువ
ముంచెత్తుతుంటే
స్థితప్రజ్ఞతను
ఆధారం చేసుకొని
నిలదొక్కుకోవాలని
చాటుతున్న మీ వినయాన్ని
అర్హతను
అదృష్టం గా భావించి
కృషిని సింహావలోకనం
చేసుకుంటూ
ఆత్మను సభలో
ఆవిష్కరించిన
మీ ఆత్మ విశ్వాసాన్ని
ప్రశంసల పూల జల్లుల్లో
తడిసి ముద్దవటంలోని
హాయిని
ఆస్వాదిస్తున్నట్లున్న
మీ చిరునవ్వుని
అంతర్వాహిని లా
సాగిన
అనంతమైన
మీ సారస్వత సేవను
ప్రకాశానికి
పరిచయం చేసిన
మీ సత్కార సంబరాన్ని
భార్య అంటే
భర్త సుఖాలలోనే కాదు
కష్టాల్లో నూ
తోడుంటుందని
నిరూపిస్తూ
మీ గజపుష్పమాల
భారాన్ని సగం తాను
మోసిన మీ అర్థాంగ లక్ష్మి ని
పదవి వరించడమంటే
ఆనందం మాత్రమే కాదు
అదనపు భారాన్ని
భుజాలకెత్తుకోవడమే నని,
అవధులు లేని
అభిమానాన్ని
భరించడం
ధరించడం కూడా
కష్టమేనని
నిరూపించిన
గజ పుష్ప మాల
ధారణని
ఆడంబరం
అహంకార హేతువు
దానిని దరిజేరనీయనని
గంగి గోవు పాలలా
కమ్మని భోజనం
కడుపునే కాదు
మనసునూ నింపుతుందని
మీ సన్మానం చూశాకనే నాకు
తెలిసొచ్చింది
మాష్టారూ!
మరి మీరేమంటారు?
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర
ఉపాధ్యక్షురాలు
22.2.2019.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️
32. నవ(రత్న) దీపాలు
🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️🕯️
కరోనా బారినపడి
మరణించిన వారి
ఆత్మశాంతికై
సంతాప దీపాలు
అవసరంలో ఉన్నవారికి
ఆపన్నహస్తం
అందిస్తున్న వారికోసం
కృతజ్ఞతా దీపాలు
వ్యాధి బారినపడ్డ వారు
కోలుకోవాలని కోరుకుంటూ
ఆరోగ్య దీపాలు
వ్యాధిని జయించి
మృత్యుముఖం నుండి
బయటపడ్డ వారికోసం
ఆనంద దీపాలు
నిర్విరామంగా
నిరంతరాయంగా
సేవలందిస్తున్న
ప్రతి ఒక్కరికీ
పేరుపేరునా
వందన దీపాలు
మానవాళి తప్పక
మహమ్మారిని
గెలిచితీరుతుందన్న
నమ్మకాన్ని కలిగించే
ఆశాదీపాలు
మీకు మేమున్నామంటూ
ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ
అండగా నిలుస్తూ
ప్రధాని , ముఖ్యమంత్రులు
వెలిగిస్తున్న ధైర్య దీపాలు
మేము సైతం అంటూ
తమవంతు బాధ్యతగా
సామాజిక దూరాన్ని
పాటిస్తున్న
ప్రజా సమూహాల
సహకార దీపాలు
దేశం ఆపదలో ఉన్నప్పుడు మేము
స్వంత లాభం కొంత
మానుకుంటామని చాటుతూ
కోట్లాది ప్రజలు
వెలిగించిన
సమైక్యతా దీపాలు
ఇది నా దేశం
ఐ లవ్ మై ఇండియా
మేరా భారత్ మహాన్
జైహింద్
కరోనా
We
Will
Washout you @ India. com
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.04.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
*****************************🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾👾👾👾👾👾👾👾👾👾👾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾*****************************
ఐదు వందల నోట్ల ముసుగులో దాక్కున్న
అవినీతి భూతాన్ని
వెయ్యి నోట్ల పొదల్లో పొంచిన
నల్లధనం నాగుల్ని
ఒక్క వేటుతో వేసేసిన మోదీ
ఇది నవ శకానికి నాంది
జయహో!!స్వఛ్చ భారత్.
మేరా భారత్ మహాన్.
సింహాద్రి.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
33.నోటు మాట
ఇప్పటి వరకూ నన్ను
బల్లకింద సంపాదనకు
ఎంచుకున్నారు
ఓట్లు కొనుక్కోవడానికి
పంచుకున్నారు
నల్లధనం గుట్టలుగా
పెంచుకున్నారు
అపురూపంగా బీరువాల్లో
ఉంచుకున్నారు
రాత్రికి రాత్రి
ఏం జరిగింది?
చిత్తు కాగితంలా
వదిలించుకోవాలని
అనుకుంటున్నారు
నన్ను మించిన మాయాజాలం
నరేంద్ర మోదీకి తెలిసిందా!
ఇప్పటివరకూ
నా చుట్టూ తిరిగిన ప్రపంచం
హఠాత్తుగా వదిలేసింది వ్యామోహం
రేపటి సూర్యోదయం
నాకు అస్తమయం
అయినా నాకు సంతోషమే.
ఎందుకంటే
ఇది నా జాతికి
కాగలదు మహోదయం
అందుకే
వెళ్ళి పోతూ చేస్తున్నా
వెయ్యి వందనాలు.
నాలుగేళ్ళ క్రితం...
నరేంద్రుని మోడీ..
నోటు మాట
ఇప్పటి వరకూ నన్ను
బల్లకింద సంపాదనకు
ఎంచుకున్నారు
ఓట్లు కొనుక్కోవడానికి
పంచుకున్నారు
నల్లధనం గుట్టలుగా
పెంచుకున్నారు
అపురూపంగా బీరువాల్లో
ఉంచుకున్నారు
రాత్రికి రాత్రి
ఏం జరిగింది?
చిత్తు కాగితంలా
వదిలించుకోవాలని
అనుకుంటున్నారు
నన్ను మించిన మాయాజాలం
నరేంద్ర మోదీకి తెలిసిందా!
ఇప్పటివరకూ
నా చుట్టూ తిరిగిన ప్రపంచం
హఠాత్తుగా వదిలేసింది వ్యామోహం
రేపటి సూర్యోదయం
నాకు అస్తమయం
అయినా నాకు సంతోషమే.
ఎందుకంటే
ఇది నా జాతికి
మహోదయం
కాగలదని నమ్ముతున్నాను
అందుకే
వెళ్ళి పోతూ చేస్తున్నా
వెయ్యి వందనాలు.
ఐదు వందల నోట్ల ముసుగులో దాక్కున్న
అవినీతి భూతాన్ని
వెయ్యి నోట్ల పొదల్లో పొంచిన
నల్లధనం నాగుల్ని
ఒక్క వేటుతో వేసేద్దామని చూస్తున్న మోదీ నిర్ణయం
నవ శకానికి నాంది
అయితే కనుక
అభినందనీయమే.
జయహో!!స్వఛ్చ భారత్.
మేరా భారత్ మహాన్.
500,1000 రూపాయల నోట్లు రద్దయి 4 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా నాటి నా కవిత మరొక్కసారి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.11.2020
సింహాద్రి.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
34.తెలు(గు)గోడు
కార్పొరేట్ విద్యాసంస్థలు
కాదు పొమ్మంటుంటే
ప్రభుత్వ పాఠశాలల
పంచన తలదాచుకుంటున్నా
మీరు కూడా ఛీ పొమ్మంటే
మిగలగలనా!
పసిబిడ్డలకు తల్లిని దూరం చేయటం
పాపం కాదా!
నందనవనం కోసమని
తులసి కోటను తుంచేస్తారా!
తెలుగు లెస్స అంటారనుకుంటే
తెలుగు లెస్ అని తేల్చేస్తారా!
మాతృ ఘోషను వినండి
మాతృభాష ను మననీయండి.
సింహాద్రి
4.1.2017.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
35.పసి (డి) కలలు
నల్లని తారురోడ్డు మీద
పసి(డి) కలల్ని మోసుకుంటూ
పరుగుతీస్తున్న
పసుపురంగు స్కూలు బస్సు
ఎర్రటి నెత్తురు చిందించింది.
ఆలస్యమైపోతోందని
చివరిముద్దను
అమ్మచేతిలోనే వదిలేసి
హడావిడిగా బస్సెక్కిన
ఒక బాల్యం
చక్రాల కింద చితికిపోయింది.
బడికిపోనని మారాంచేసి
అమ్మ ఇస్తానన్న
చాక్లెట్ కి ఆశపడి
చావుమెట్లెక్కిన
ఒక ఇంటిదీపం
ఇనుపముక్కల మధ్య
ఇరుక్కుపోయింది
సాయంత్రం వచ్చేసరికి
పాయసం చేసి ఉంచమని
అమ్మకి టాటా చెప్పి
అల్లరిగా నవ్వుకుంటూ
బయలుదేరిన ఒక కంటి వెలుగు
కాలువలో కనుమరుగయ్యింది.
ఆదివారం సినిమాకు తీసుకెళ్తానని
నాన్నచేత ప్రామిస్ చేయించుకుని
స్నేహితులకావార్త చెప్పాలని
పరుగులు తీసిన
ఒక పసి ప్రాయం
తిరిగిరాని లోకాలకు తరలిపోయింది
రేపు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో
తన జట్టే గెలవాలని
ఒక చిన్న మనసులో ఎన్ని ఆశలో!
ఎల్లుండి చేసుకోబోయే పుట్టినరోజు గురించి
ఒక చిన్ని గుండెలో
ఎన్ని ఊహలో!
వచ్చేవారం జరగబోయే
వార్షిక పరీక్షల గురించి
ఒక చిన్ని మోములో
ఎన్ని భయాలో!
పెద్దవాళ్ళమవ్వాలని,
పేరు తెచ్చుకోవాలని
ప్రతి కంటి వెనుక
ఎన్నెన్ని కలలో!
ఎవరి బాధ్యతారాహిత్యం
ఆశలమొగ్గల్ని చిదిమి యీ
అన్యాయం చేసిందో!
కన్నవారికి తీరని
కడుపుకోత విధించిందో!
పసి జ్ఞాపకాల పాడెపై బ్రతకమని
మమ్మీ డాడీలకు
మరణ శాసనాన్ని రాసిందో!
అందమైన ఆశల పందిళ్ళన
నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన
నిర్లక్ష్య పు ప్రమాదంలో
నేరమెవరిది?
శిక్షలెవరికి?
సింహాద్రి
20.1.2017.
2012 మార్చ్ లో మన రాష్ట్రం లో జరిగిన స్కూల్ బస్ ప్రమాదానికి స్పందించి రాసిన కవిత,నిన్న జరిగిన U.P.బస్ ప్రమాదానికి గుర్తుకొచ్చి పోస్ట్ చేస్తున్నాను.
20.1.2017
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
36.శశి (తప్పిన)కళ
నా ఆరోగ్యం బాగోలేదు
నాలుగు వారాల గడువివ్వండి
అంటే నిరాకరించారు
కనీస సౌకర్యాలైన
ఏ .సీ.రూమ్
హాట్ వాటర్
మినరల్ వాటర్
టీవీ, న్యూస్ పేపర్
ఇంటి భోజనం
మంచం
మంచిచెడ్డలు చూసుకునే
ఒక సొంత మనిషిని
అడిగితే కాదన్నారు.
ఒక కోటీశ్వరురాలు
కనికరించి
మీ జైలులో
కొద్దికాలం గడపడానికి
వస్తుంటే
ఈ మాత్రం చిన్న కోరికలైనా తీర్చకపోతే
వెనుక జైలుకి రావడానికి
క్యూ కట్టిన వాళ్ళకి
ఇక ఆసక్తి ఏముంటుంది చెప్పండి?
అర్థం చేసుకోరూరూరూరూ!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
37.స్మృత్యంజలి.............
నువ్వు నాకు
దూరమవుతావన్న ఊహనే భరించలేకపోయాను
వార్తవిని చిగురాకులా వణికిపోయాను
మన అనుబంధం అంతమవబోతోందని తెలిసి
కంటినిద్రకు దూరమయ్యాను
కన్నీటి వరదలో మునిగిపోయాను
నీవు లేని నా భవిష్యత్తు ఇక శూన్యం అనిపించింది
పేర్చుకున్న దొంతరలన్నీ
పేకమేడల్లా కూలిపోయాయి
సిరి మహాలక్ష్మి వని దాచుకుంటే
చిత్తుకాగితమయ్యావు
సామాన్యుడినైతే
సర్దుకుపోయేవాడినేమో
కోట్లకు పడగలెత్తిన నేను
కోలుకోగలనా!
ఆశల దీపాలు ఆర్పేసి నీవు
హఠాత్తుగా మాయమైపోయి నేటికి ఒక ఏడాది అయిన సందర్భంగా నీకు
స్మృత్యంజలి.
సింహాద్రి జ్యోతిర్మయి
9.11.2017
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
38.రంగారాయుడి
చెరువు గుండె చెరువు
వారంతా వాకర్స్ క్లబ్ సభ్యులు
నడక ఒక హాబీగానో
మంచి అలవాటుగానో
ఆరోగ్యం కోసమనో
అనారోగ్యం తగ్గించుకుందామనో
వణికించే చలిని సైతం లెక్కచేయక
వాకింగ్ చేస్తుంటారు
కలిసి అడుగులు వేస్తూనే
కబుర్లాడుకున్నారు
కష్టసుఖాలు కలబోసుకున్నారు
అనుబంధాలు పెనవేసుకున్నారు
ఆత్మీయులయ్యారు
వారాంతపు వేడుక చేసుకుందామని
వారంతా ఉత్సాహపడ్డారు
కార్తిక వనభోజనాల కోసం
కలసి కట్టుగా కదలివెళ్ళారు
పొంచిఉన్న మృత్యువు
వేటాడగా వెంటాడింది.
కాలానికి కన్ను కుట్టిందిి
భవాని దయతప్పింది
పంచభూతాలలో నీరు పగబట్టింది
నదీ సంగమం నవ్వుల్ని మింగింది
దురదృష్టమో నిర్లక్ష్యమో
దూరం చేసి బంధువుల్ని
దుఃఖాన్ని మిగిల్చింది
వినోద యాత్ర విషాదాంతమయ్యింది
రంగారాయుడి చెరువు
గుండె చెరువయ్యింది
చేదు వార్త ని జీర్ణించుకోలేని
ఒంగోలు పట్టణ హృదయం
కలతతో కన్నీరయ్యింది
మిత్రులారా!
మీ అకాల మరణానికిదే
నా అశ్రుతాంజలి
అక్షరాంజలి.
సింహాద్రి జ్యోతిర్మయి
కవయిత్రి
నరసం ఉపాధ్యక్షురాలు
13.11.2017.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
39.ఆ నంది (ని) ద్దామా!
నందీశ్వరా!
నీ స్వామి సరే
ఉత్త బోళా శంకరుడై
అడిగిందే తడవుగా వరాలిచ్చి
చిక్కుల్లో పడుతుంటాడని
ఎన్నో కథలు విన్నాము
పాపం,నేటికి నువ్వుకూడా
ఉత్త (మ ) చిత్రాలను వరించి
శంక (రు ) కి బంటువనిపించావు.
హరహరా!
ఈ వివాదాన్ని హరి (ంచ ) రావా!
సింహాద్రి జ్యోతిర్మయి
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ఇరవై ఎనిమిది వసంతాల
40.దాంపత్య వసంతం
మా పరిచయం వయసు ముప్పై
మా పరిణయం వయసు ఇరవై ఎనిమిది
మా దాంపత్యాకాశంలో
పండు వెన్నెల కురిపించింది
నిశాంత చంద్రోదయం
మా జీవన బృందావనం లో
ఆహ్లాదాన్ని మోసుకొచ్చింది
ప్రత్యూష పవనం
ఎందులోనూ ఏకాభిప్రాయం లేని మమ్మల్ని
అందరు మెచ్చే ఆదర్శజంటగా
నిలబెట్టింది నిండైన అనురాగం
పెద్దల ఆశీర్వాద బలం
శ్రీనివాసుని కరుణా కటాక్షం
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
41.అందమైన ( అమ్మ ) జ్ఞాపకం
పదినెలలు మోసింది
పదిలంగా పెంచింది
పసితనాన నేను
తప్పటడుగు లేస్తుంటే
పరుగెత్తుకొచ్చింది
పడిపోకుండా ఆపింది
యుక్తవయసు లోన నాకు
యుక్తాయుక్త విచక్షణ నేర్పింది
ఒద్దికగా పైట సర్దుకోవడం నేర్పింది
పొందికగా బ్రతుకు దిద్దుకోవడం నేర్పింది
నగలూ నాణ్యాలు
ఇవ్వలేకపోయినా
చదువు సంస్కారాల
సంపదల నిచ్చింది
కులం గోత్రమంటూ
కుంటిసాకులు చూపకుండా
కోరుకున్న వాడితో
కొంగుముడి వేయించి
అక్షింతలేసింది
ఆశీర్వదించింది
లక్షల కట్నాలూ లాంఛనాలు
జరపలేకపోయినా
భర్తతోపాటుగా
అత్తగారినీ
ప్రేమించడం నేర్పింది
మొన్న నావేలుపట్టి
నడిపించింది
నిన్న నా వెనక
నీడలా నిలిచింది
నేడు ఎలా ఆమె ఋణం
తీర్చుకోవాలా అని
ఆలోచిస్తుండగానే
కన్నుమూసింది
నన్ను విడిచింది
తిరిగి రావని తెలిసీ
ఎన్నిసార్లు పిలిచానో!
గుండె బరువు తీరక
ఎంతకాలమేడ్చానో?
కన్నీటి మేఘాలు మెల్లగా
కళ్ళకు వీడ్కోలు పలికాయి
కాలం గడిచింది
గాయం మానింది
నేడు అమ్మ లేదు గానీ
ఆ అందమైన జ్ఞాపకం
మిగిలింది
మరలిరావు నీవు
మరువలేము మేము
నీకేమీ ఇవ్వలేకపోయిన నేను
ఈ ఆక్షర నీరాజనాలైనా
ఇద్దామనుకున్నాను
అందుకోవమ్మా!
ఈ అక్షర సుమాలు
ఆ లోకం నుండి
నీవందించే
ఆశీస్సులు మాకు చాలు.
మా అమ్మ మరణించి నేటికి పదిహేను సంవత్సరాలయ్యింది.
అప్పట్లో నేను రాసిన ఈ కవిత
నేడు అందరితో పంచుకోవాలనిపించింది.
సింహాద్రి జ్యోతిర్మయి
21.12.2017.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
42.ఆశా (డే ) రా (0) లు
వేసుకునే వస్త్రాన్ని సైతం
రోసినవాడు స్వామీజీ
అవుతాడేమో గానీ
వేలకోట్ల ఆస్తుల్ని
వెనకేసిన వాడు
బాబా ఎలా అవుతాడు?
మోసపోవడానికి మనం
సిద్ధంగా ఉన్నంతకాలం
అత్యాచారాలు చేసే ఆశారాం లు
మన మూఢనమ్మకాలనే
డేరాల్లో పాగా వేసి
పదిలంగా ఉండగలరు
దేవుడా!రక్షించు నా దేశాన్ని
అన్నాడు గానీ తిలక్
దేవుడా!మేల్కొలుపు నా జాతిని
అని అని ఉంటే బాగుండేదేమో!
కాషాయంతో భారతఖ్యాతిని
విదేశాలలో విస్తరించిన
వివేకానందుడు పుట్టిన నేలపై
వికృత చేష్టలతో
వెర్రి తలలు వేస్తూ
భారతీయ ఋషి గౌరవాన్ని
మట్టిపాలు చేస్తూ
విస్తరిస్తున్న ఈ బాబాల సంస్కృతికి
నేటి కోర్టు తీర్పు
ఒక కనువిప్పు కాగలదని ఆశిద్దాం
సింహాద్రి జ్యోతిర్మయి
న.ర.సం.రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.4.2018.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
43.మేనత్త మనసు.
ఈ రోజు ఫ్యామిలీ డే సందర్భంగా అప్పుడెప్పుడో 2004 వ సంవత్సరం లో నాకు మేనకోడలు పుట్టడం,అది అమెరికాలో ఉండటం వల్ల దాన్ని ఆర్నెల్లవరకు చూడలేకపోవటం వల్ల కలిగిన బాధను గుర్తుచేసుకుంటూ అప్పటి నా కవితను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
డాలర్ల వేటలో దూరమైపోయిన
నా చిన్ని తమ్ముడింటి
చిన్నారి తల్లీ!
అప్పుడే నువు పుట్టి
ఆరునెలలైపోయె
నేచూడనే లేదింక
నీ ముద్దుమోమును
అమెరికా ఎక్కడ ఉంది?
అత్త ఎక్కడ ఉంది?
అంతులేని ఈ దూరం
మన అనుబంధాన్ని శాసిస్తోంది
నా తల్లి నీరాక ఎప్పుడోనంటూ
తల్లడిల్లుతున్నది
నీ తాత మనసు
చిన్నారి తల్లి
నీ చిరునవ్వు జల్లులో
పులకించ వేచె
నీ పెదనాన్న ఇల్లు
కన్నతండ్రి నిన్ను కారులో తిప్పినా
కాలుకందక నిన్ను
కన్నతల్లి పెంచినా
అత్త తీయని ప్రేమకు
అవి సాటి రావు
అత్త కుట్టించిన
పట్టు పరికిణి కట్టి
చిట్టి పాదాలకు
మువ్వల పట్టీలు పెట్టి
నా ఇంటి ముంగిట నీవు
నడయాడు టెన్నడో!
నా కంటి చెమరింపు
నవ్వగుట ఎన్నడో!
నాన్న చెప్పకపోయినా
అమ్మ ఒప్పక పోయినా
ఇక్కడే ఉందమ్మ
నీ రక్తబంధం
ఎదురు చూస్తున్నది
నీ రాక కోసం
సింహాద్రి జ్యోతిర్మయి
15.5.2018
.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
44.అభినందన హరి (బాబు) చందనం
మీ అంతరంగం *నిర్మలం*
ప్రధానోపాధ్యాయునిగా
పాఠశాల స్వర్గంలో
మీ స్థానం
*సురేంద్ర* సమం
ముందుచూపు,
ముక్కు సూటి మనస్తత్వంతో సాగిపోయే మీ గమనం
*క్రాంతి* పథం
విద్యార్థులను లాలించటంలో
అగుపిస్తుంది
మీ *సౌజన్యం*
చిన్నారులపై మీరు కురిపించే ప్రేమామృతం
అది చల్లని *నీహారికా* కణం
స్వచ్ఛత లో మీ
మనసే *మో నీ* లాకాశం
సభ్యతలో మీ
పలుకంటే
అ *హ! నీ* తి చంద్రికా కిరణం
వేలాది విద్యార్థులకు
విద్యా
*లక్ష్మీ* ప్రసన్నతను
అందించగలిగానన్న
సంతృప్తి
ఉద్యోగ విరమణ శుభ వేళ
మీ పెదవులపై
*సుహా* సమై
వెలుగులీనాలని
నల్లూరి వారి కీర్తి
వెన్నెల్లూరి వెలగాలని
మనసారా అభిలషిస్తూ
మేమందిస్తున్న
ఈ కవితా
సుమాక్షర రూపమైన
అభినందన మందారాలను
అందుకోమని
మా వినతి
ఒంగోలు పబ్లిక్ స్కూల్
స్టాఫ్ తరపున
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
తెలుగు టీచర్@ OPS
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
....45...వనితా వాణి.....
కృష్ణా జిల్లా రచయితల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా
ప్రారంభించిన
ప్రథమాంధ్ర రచయిత్రుల
మహాసభలకై
అందించిన
ఆహ్వానమందుకొని
ఉత్సాహం ఉరకలేయగా
నడుం వంగిన వాళ్ళు
నడవలేనివాళ్ళు
అంగవైకల్యాన్ని
ఆత్మవిశ్వాసంతో
అధిగమించిన వాళ్ళు
ప్రఖ్యాత రచయిత్రులు
ప్రవర్థమాన కవయిత్రులు
జంటలతో వచ్చిన వాళ్ళు
ఇంట ప్రోత్సాహం పొందినవాళ్ళు
పోట్లాడి ఒప్పించి
పయనమైన వాళ్ళు
ఒప్పుకోకున్నా
వెళ్ళక తప్పదని భీష్మించి
తెగువ చేసినవాళ్ళు
ఒక్కరోజుకైనా
దక్కింది భాగ్యమని
తనివినందిన వాళ్ళు
రెండు రోజులూ పూర్తిగా
ఉండలేకపోతున్నామే అని
విచారించిన వాళ్ళు
స్ఫూర్తి నింపిన వాళ్ళు
స్ఫూర్తి పొందిన వాళ్ళు
రాష్ట్రాల హద్దులు
చెరిపిన వాళ్ళు
పదవులు ,హోదాలు
మరచిన వాళ్ళు
నలుదిక్కుల నుండీ
నారీమణులంతా
నవ్యపథం చేరగా
కృష్ణవేణమ్మ
కనకదుర్గమ్మ
కొలువుదీరిన వాడలో
సిద్ధార్థుని చల్లని ఒడిలో
సేదదీరిన రాజహంసలై
పత్రసమర్పణ లో
ప్రతిభను చూపించి
సభా నిర్వహణలో
సామర్థ్యం నిరూపించి
ప్రదర్శనల్లో తమ
పాటవం ప్రకటించి
పురస్కారాలు గ్రహించి
పులకరించి
సన్మానాలనంది సంతసించి
అవకాశం లభించినందుకు
ఆనందించి
కవితాగానాలతో మురిపించి
ఆత్మీయపు విందును
ఆస్వాదించి
నూత్న పరిచయాల
ఉత్తేజం నింపుకొని
వేదిక మొత్తం తామై
వెలిగిన పండుగ
ఆకాశంలో తాము
సగమే అయినా
అరుణ ప్రకాశం తమదని
చాటిని వేడుక
మా విజయం వెనుక
మగువలుంటే
మీ ప్రగతి రథ గమనంలో
సారథులై మేముంటామని
ప్రసాదగుణ సుందరులై
పూర్ణచంద్రులై
విజయభాస్కరులై
సహృదయంతో
చాటిచెప్పిన
పురుష పుంగవులకు
వెనుక వరుసలో తాముండి
వెల్లివిరిసిన
వనితా చైతన్యాన్ని
మనసారా మెచ్చిన
మగ మహారాజులకు
మా కవయిత్రులందరి
తరపున
శిరసా నా అభినందన
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.1.2019.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
46.మృత్యుంజయం
మెదడుకీ మనసుకీ మధ్య
సంబంధం తెంచేసుకుంటున్న
ఆధునిక సమాజం లో
మెదడుకీ శరీరానికి మధ్య
తెగిపోయిన సంబంధాన్ని
మట్టిపాలు కానీయకుండా
ఆఘమేఘాలమీద ప్రయాణించి
చిరునామా మార్చుకుంటూ
మరోచోట ఊపిరి పోసుకుని
మానవత్వమై మొలకెత్తాలని
తపించే త్యాగశీలతకు
నిజమైన నివాళి ఏముంటుంది
కన్నీటి ముత్యాల
కృతజ్ఞతాంజలి తప్ప
శాస్త్ర విహిత దానాలు
పుణ్యాన్నిస్తాయేమో
శ్వాస పోస్తున్న మీ దానాలు
మరణాన్ని జయించిన వారి మెడలో
మణి కంఠ హారాలవుతున్నాయి.
ఇది మహా మృత్యుంజయ యాగం
సమర్పిద్దాం రండి
మన భాగం.
అవయవ దానంతో తరిస్తున్న వారందరికీ అంకితం.
సింహాద్రి.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
47.*లేడికూనలా ఇంకెన్నాళ్ళు ?*
ఆ బెదురు బెదురు
చూపులెందుకు?
ఆ అమాయకత్వం ఎందుకు?
ఒంటిమీద
ఈగవాలితే తోలడంలేదా!
దోమవాలితే
చంపడం లేదా!
చీమ పాకితే
నలిపేయడం లేదా!
ముల్లు గుచ్చుకుంటే
విరిచి విసిరేయడం లేదా!
మరి నీ బాల్యాన్ని చిదిమేస్తుంటే
ఈ బేలతనం ఎందుకు?
నీవు నిందితురాలివి కావు
బాధితురాలివని
ఎందుకు గ్రహించవు?
కన్నుల్లో నిప్పులు రాల్చేటంత కోపం ప్రదర్శించటం
నీ పసిమనసుకు
తెలియకపోవచ్చు
కనీసం నీ
కన్నీరైనా అమ్మ కంట
పడనిచ్చి ఉంటే
గోమాతలానైనా
ఆ గోముఖవ్యాఘ్రాన్ని కుమ్మి నిన్ను
కాపాడుకునేది కదమ్మా!
ఇప్పుడేమయ్యింది?
నీ పాటికి నువ్వెళ్ళిపోయావు
మేమంతా
నాలుగు రోజులపాటు
అయ్యో అంటాము
ఆవేశపడతాము
ఆందోళన చేస్తాము
ఆనక మరచిపోతాము
కానీ,చిట్టి తల్లీ!
బతకని బిడ్డ బారెడు
అన్న చందంగా
బంగారు తల్లి వైన
నిన్ను తలచుకొని
ఆ తల్లి
ఈ దుఃఖ సముద్రాన్ని
కడదాకా ఈదాలి కదమ్మా!
నెత్తుటి మడుగులో నిన్ను చూసిన జ్ఞాపకాన్ని
ఆ తండ్రి
గుండెల్లో
మోసుకుంటూ బ్రతకాలి కదమ్మా!
నీ భయానక మరణం
చావంటే ఏమిటో తెలియని తమ్ముడి
పెదవిపై నవ్వుల్ని
మాయం చేస్తుంది కదమ్మా!
ఎంత తొందరపాటు
నిర్ణయం తల్లీ!
అమ్మల్లారా!
ఆడపిల్లల్ని
పరువు ముసుగులో
దాచకండి
భయం గుప్పిట్లో
బంధించకండి
ఛాందస భావాల
పంజరంలో పెంచకండి
ప్రపంచమంతా నిన్ను
పరిహసించినా
నీకు నేనున్నాననే
నమ్మకం,
భరోసా అనే రెక్కలిచ్చి
విశాలవిశ్వంలో
ఎగరనివ్వండి
ఎదగనివ్వండి.
మా నవ్యాంధ్ర రాష్ట్ర
రచయిత్రుల సంఘం
తరపున భారమైన మనసుతో చిన్నారికి నివాళి సమర్పిస్తూ...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.2.2022
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
48.ఆ గది....
నా చదువుకు
సార్థకత నిచ్చింది
ఆ
నలభై నిమిషాల
కాల వ్యవధి
సమయం విలువను నేర్పింది
నా మాటలకు
ఎంతో విలువ ఉందన్న
నమ్మకాన్ని ఇచ్చింది
చెవిని వేసిన మాట
ఎప్పటికైనా
పనికిరాకపోతుందా!
పని చెయ్యి
ఫలితం తప్పక ఉంటుంది అన్న
తత్వాన్ని నేర్పింది
అక్షర శూన్యమైన
అడవిని
పూలతోటలా
దిద్దడం నేర్పింది
ఆ పూల సుగంధం
ఎప్పుడు నన్ను తాకినా
నా శ్రమనంతా మరిపించే
చిరునవ్వై
హృదయాన్ని మురిపించింది
రామచిలుకల
పలుకుల్ని వింటూ
కోతి చేష్టలను భరించే
సహనాన్ని మప్పింది
ఎదుటివారి విజయం
నాదేనని సంతోషించే
సుహృద్భావాన్ని నేర్పింది
నవ సమాజ నిర్మాణంలో
నేనూ ఒక భాగమయ్యానన్న
సంతృప్తిని ఇచ్చింది
*నువ్వు చాలా ప్రత్యేకం సుమా!*
అని
ఆ గది
అనుక్షణం నాకు గుర్తుచేయడమే కాదు
నేను
గర్వపడేలానూ చేస్తుంటుంది
అది నా తరగతి గది
నన్ను మహారాణిని చేసి
విజయ సింహాసనంపై
కూర్చోబెట్టిన
నాకున్న పెన్నిధి
నా పూర్వజన్మ సుకృతి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.4.2021
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
49.తనదాకా వస్తే?
ఈ రాత్రివేళ
మృత్యుభయం ఎందుకో నన్ను వెంటాడుతోంది
ఒక మిత్రుని ఇంట
జరిగిన విషాదం
కలవరపెడుతోంది
ఇద్దరు ఆడపిల్లలు
వాళ్ళకి ఏ ముద్దూముచ్చటా
ఇంకా జరిపించకుండానే
వెళ్ళిపోవలసి వస్తోందని
ఆఖరి ఘడియల్లో
ఒక తండ్రి పడ్డ ఆవేదన తెలిసి
మనసు మూగబోతోంది
ఎంతసేపు?
నేను నేనన్న
ఈ అహంకారం
నాది నాదన్న
ఆ మమకారం
తెంచుకుని పోవడం
బ్రతుకు తెల్లారి పోవడం
ఎంతసేపు?
బాధ్యతల బరువు
దించుకున్నాను కదా!
ఈ క్షణం ఒకవేళ
మృత్యుదేవత
ముంగిట్లోకి వస్తే
సాదరంగా ఆహ్వానించే
సాహసం ఉందా అని
నన్ను నేను
ప్రశ్నించుకుంటున్నాను.
54 ఏళ్ళకే
ఋణాలు
ఋణానుబంధాలు
తెంచుకుని వెళ్ళిపోవాలా!
దానికింకా చాలా సమయం ఉంది
అని నాకెవరో
వ్యారెంటీ పీరియడ్ ఇచ్చినట్లు
సమాధానపడుతున్నాను
ఎవ్వరికోసం
ఏదీ ఆగదని తెలిసినా
నేనంటూ లేకపోతే
అయ్యో!
మా వారు
నా మనవలు
నా విద్యార్థులు
నా సాహిత్యం
ఏమవుతాయి?
అంటూ
అన్నీ తెలిసినా
అజ్ఞానంలో
కొట్టుకుపోతున్నాను
మానవాళికి
మహోపకారాలు చేసిన
మహానుభావులే
నిన్నటి నిజాలుగా
మారిపోగా లేనిది
నా కుటుంబమనే
బావిలోకప్పనైన
నేను
పోతే పోయేదేముంది?
ఓ మృత్యుదేవతా!
నీవు వచ్చినవేళ
నిన్ను మన్నించలేకపోవటం
జ్ఞానలేమిగా
గ్రహించి మన్నిస్తావు కదూ!
అన్ని బంధాలనూ విడిపించి
సరికొత్త పాశం వెంట నడిపించి
జీవన్ముక్తిని కలిగించే నీవు
సంసారమనే సాగరంలో
కొట్టుకుపోతున్న నావను
దరిజేర్చే చుక్కానివి
పుట్టుక అనే వాస్తవానికి
లిఖించబడ్డ
తిరుగులేని
మరణశాసనానివి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.11.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
50.దెబ్బతిన్న పావురం
****************
అప్పుడప్పుడూ
వ్యక్తిత్వం
కించపరచబడినప్పుడు
ఆత్మాభిమానం
దెబ్బతిన్నప్పుడు
విలవిలలాడే
మనోవిహంగం
శరీరమనే గూటిలో
ముడుచుకుపోయి కూర్చుంటుంది
ఫరవాలేదు
ఎంతటి గాయాన్నయినా
మరుపు అనే మందుపూసి
నయం చేసే శక్తి
కాలానికుంది
బిక్కు బిక్కు మంటున్న
మనసుపిట్ట మళ్ళీ
విశాల భావ వీధిలో
రెక్కవిప్పుకునే రోజు
త్వరలోనే వస్తుంది సుమా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.07.2020
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
51.పెత్తమ్ముడు
ఫిబ్రవరి 28
మా పెద్ద తమ్ముడి
50 వ పుట్టిన రోజు సందర్భంగా
శుభాకాంక్షలతో
ఒక జ్ఞాపకాల సరిత
నా కవిత
51* పెత్తమ్ముడు **
వాడికీ నాకూ
నేటికి సరిగ్గా
50 ఏళ్ల
అనుబంధం
వాడి పేరు శ్రీరామమూర్తి
పేరుకు తగ్గట్టే వాడు
అమ్మ మాట జవదాటని
అతి మంచి కొడుకు
నాన్నను
ప్రత్యక్ష దైవం లా
ఆరాధించి
ఆయన
ఆఖరి క్షణాలు
సంతృప్తిగా
పెద్ద కొడుకైన
తన ఒడిలో
చాలించే
భాగ్యం పొందిన
అదృష్టవంతుడు
అనారోగ్యంతో
ఉన్న
అమ్మ చేత
కాఫీ అలవాటు
మాన్పించడానికి
తాను కూడా
కాఫీ తాగడం
మానేయడమే
అమ్మపై
వాడికున్న
ప్రేమను
చాటుతుంది
ఇప్పటికీ నాకు
చిన్నతనంలో సన్నగా పీలగా
నోట్లో వేలు వేసుకుని
తిరిగే
వాడి గురించి ఎన్నెన్ని జ్ఞాపకాలో!
అమ్మ ఇచ్చిన తాయిలాన్ని
ఇద్దరం
ఒకరినొకరం
ఊరించుకుంటూ తింటూ ....,
ఇద్దరం కలిసి
చిన్న తమ్ముడిని ఏడిపిస్తూ.... ,
అన్నిటికీ తోకలా అమ్మ నా వెంట
పంపించే వాడిని తిట్టుకుంటూ....,
నాన్నగారండీ! తమ్ముడు
గోళీలు ఆడుతున్నాడండీ
అంటూ చాడీలు చెప్పి
నాన్నగారి తో
తిట్టిస్తూ....,
పేరేచర్లలో
సత్యం గారి కొట్లో
వాళ్ళు పిల్లలకు
ఫ్రీ గా పెట్టే
పప్పు బెల్లం కోసం
ఇద్దరం నిల్చుని పెట్టేదాకా
ఎదురు చూస్తూ....
అమ్మ డబ్బులిస్తే లెక్క చెప్పకుండా
చిల్లర నొక్కేసే
నాలా కాకుండా
నయా పైసలతో సహా
వాడు లెక్కలు చెప్పేస్తూ ....
సాగిన
మా బాల్యమంతా
బంగారమే
కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళిపోయిన
బాల్యాన్ని దాటి
నాకు పెళ్లయి
వెళ్లి పోయే దాకా
తెలియదు
వాడికి నేనంటే
అంత
ప్రాణమని
నా పుట్టిన రోజు కి
నాకిష్టమైన
నెయిల్ పాలిష్
అది వేసుకోవడం వాడికి నచ్చకపోయినా
దూది తో చుట్టి భద్రం గా
పోస్ట్ లో పంపుతూ,
దానితోపాటు
నాపై
ఒక కవిత
ఎగ్జిబిషన్ లో
బియ్యపు గింజ పై
నా పేరు రాయించిన
గ్రీటింగ్ కార్డు పంపడం
నాకు వేవిళ్ళంటే వచ్చి
వద్దంటున్నా
వాకిలి ఊడవడం
దగ్గర నుండి
అన్ని పనులు
వాడే చేసేయడం
పురిటికి వచ్చిన నేను
ఎప్పుడైనా
ముభావంగా ఉంటే
అక్క ఎందుకలా ఉంది
నువ్వు ఏమైనా అన్నావా అని
మా అమ్మను
పదే పదే అడగటం
అక్క మీద
పొంగిపొర్లే
వాడి ప్రేమకు
కొన్ని తార్కాణాలు
మాత్రమే
కాపురం పెట్టిన కొత్తల్లో
మా ఇంటికి వచ్చి
గుమ్మంలో నించున్న
వాడిని చూసి నేను
భోరుమని
ఏడ్చే దాకా తెలియదు
నాకూ వాడంటే
అంతులేని ప్రేమని
మరదలు వచ్చినా
మా మధ్య అరమరికలు రాలేదు
మా అనుబంధం చూసి
తనకు కూడా మురిపెమే
అందరిని ఆకట్టుకునే
వాక్చాతుర్యం
ఎదుటివారి కష్టానికి
స్పందించే మంచితనం
బిచ్చగాళ్లను కూడా
ఈశ్వరులు అంటూ
పండగ పూట గుమ్మం లో కూర్చోబెట్టి
కొసరి వడ్డించే
మానవత్వం ఉన్న
వాడికి
నోటి దురుసుతనం
కూడా కాస్త ఎక్కువే
కోపం వస్తే గబగబా తిట్టేస్తాడు
నాకు రోషం
కూడా ఎక్కువే
ఠపీమని ఫోన్
కట్ చేసేస్తాను
కానీ అక్క తో
మాట్లాడకుండా
ఎక్కువ సేపు ఉండలేడు
అరగంటకే మళ్లీ
ఫోన్ చేస్తాడు
నీకు ఎంతైనా
ఆ కింటిగాడు
అంటేనే
ఎక్కువ ఇష్టం అని
మా చిన్న
తమ్ముడిని
చూసి ఉడుక్కునే
వాడిని చూస్తే
నాకూ ముచ్చటే
ఫోనులో మాట్లాడినా
నా గుండెలోని బాధ
వాడు గుర్తిస్తాడు
నా కష్టం తీర్చడానికి
వాడికి చేతనైన
ప్రయత్నమూ
చేస్తాడు
అక్కా తమ్ముడూ
అంతంత సేపు
ఏం మాట్లాడుకుంటారు
అని
మా సంధ్య ముద్దుగా విసుక్కున్నా
చాగంటి వారి ప్రసంగం నుండి
సమాజం తీరుతెన్నుల వరకు
అన్నీ కలబోసుకొని
అరగంటయినా మాట్లాడుకోకపోతే
ఏదో వెలితిగానే అనిపిస్తుంటుంది ఇద్దరికీ
శంఖంలో పోస్తేనే
తీర్థం అయినట్లు
నీకు ఏదైనా
మూర్తి మామ చెప్తేనే
ప్రమాణం అని
మా పిల్లలు
నిష్టూరమాడినా
అబ్బో ! తమ్ముడంటే
చాలు
మొహం వెలిగిపోతోంది అని
మా ఆయన
ఎగతాళి చేసినా
మా తమ్ముళ్లిద్దరూ
మంచి ముత్యాలని
నేను గర్వంతో
పొంగి పోతుంటాను
తిరుపతిలో పుట్టిన
మా ఇద్దరి జీవితంలో
తిరుమల వెంకన్న తో
ఉన్న బంధాన్ని
చెప్పకపోతే
మా అనుబంధం
అసంపూర్ణమే
ఏడాదిలో కనీసం
ఆరు సార్లయినా
ఆ స్వామిని
దర్శనం చేసుకుని
ధన్యత చెందే వాడు
అప్పుడప్పుడూ
ఆన్లైన్లో
నాకోసం కూడా
సుప్రభాత సేవ లాంటి
సేవా టికెట్లు
సంపాదించి
తన అదృష్టం లో
నాక్కూడా
భాగం కల్పిస్తుంటాడు
ఇక చాగంటి వారి
ప్రవచనాలతో
స్ఫూర్తి పొంది
ఇంటిలో వాడు
ఇలవేలుపు ను
కొలిచే తీరు
ఎంత చెప్పినా నాకు
తనివే తీరదు
ప్రస్తుతం
సాకారం నుండి
నిరాకార సాధనవైపు
అడుగులేసే
ప్రయత్నం చేస్తూ
జీవితం లోని
ప్రతి మలుపులోనూ
మంచి వైపే ప్రయాణిస్తున్న
మా పెద్ద తమ్ముడు
నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో
వర్ధిల్లాలని
ఈ పుట్టిన రోజు పూట
వాడిని
మనసారా దీవిస్తూ
ప్రేమతో
అక్క
సింహాద్రి జ్యోతిర్మయి
28.2.2019
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
52.నేరస్తురాలిని
ఆత్మహత్య
మహా నేరమని
తెలిసినా
మనసుని,
ఆత్మాభిమానాన్ని
ఎన్నిసార్లు
చంపుకుంటుంటానో!..
వెర్రి నవ్వుని పెదవిపై
వేళ్ళాడదీసుకుంటూ..
ఔను మరి
నాకు నొచ్చుకోవటమే తెలుసు
నొప్పించడం తెలీదు
ఇది ఒక అసమర్థుని జీవయాత్ర
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.11.2020
53.ప్రేమ కానుక
***********
నోచిన నోముల ఫలమై
అందిన అపురూప వరమై
స్వప్నించిన నా ఆశలకు సాకారమై
నిలిచిపోయిన నిత్య వసంతమై
నా జీవిత గగనాన్ని
జ్యోతిర్మయం చేసిన
రాజశేఖరుడివై
వెలుగుతున్న నా ప్రాణమా!
నేను నీకు ఇవ్వగలిగిన
వెలలేని కానుక
ఇంకేముంటుంది?
నీ ప్రతిరూపం తప్ప!
నీ జీవన సహచరి
జ్యోతిర్మయి
30.6.2019.
54 రిటైర్డ్ హర్ట్
పరిమళించే
పసివనాలకు
దూరంగా జరిగిన
విశ్రాంత ఉపాధ్యాయురాలిని
నేను
ఇప్పుడిక
నాచెయ్యి పట్టుకుని ఊపేస్తూ
*హ్యాపీ టీచర్స్ డే*
అని నాకు ఎవరు చెప్తారు?
అమాయకమైన ముఖాలతో
నా చుట్టూ మూగి
నాకు చిన్ని చిన్ని
గ్రీటింగ్ కార్డులు ఎవరిస్తారు?
ముద్దుగారే ముఖాలతో
ఈ తెలుగు మిస్
వేషం వేసుకుని
చీరకట్టుకుని
జారే కళ్ళజోడు లోనుంచి
కిందికి చూస్తూ
నన్ను చూడగానే
సిగ్గుపడుతూ
నన్ను మురిపిస్తూ
నన్ను ఎవరు అనుకరిస్తారు?
వాళ్ళ తరగతి గదిని
ముచ్చటగా అలంకరించి
క్లాస్ టీచర్ నైన
నన్ను ప్రేమతో ఆహ్వానించి
నాచేత
కేక్ ఎవరు కోయిస్తారు?
ఉత్సాహం ఉరకలేయగా
నాచేత
ఆటలు ఆడించి
పాటలు పాడించి
నా బాల్యంలోకి
నన్నెవరు నడిపిస్తారు?
అందమైన పసిముఖాలతో
అలరించే
ఆ పూదోటను
వీడి వచ్చిన బాటసారిని నేను
I miss all the fun
I miss all the joy
I miss you
*(Jyothir)my* dear Children
I miss you all
నా విద్యార్థులందరికీ శుభాశీస్సులతో నాకు నేనే చెప్పుకుంటున్నాను
*Happy teachers day*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.9.2022
55. ప్రేమ (సాలె)గూడు
బ్రతుకు గోడను
ఆలంబన చేసుకుని
ప్రేమ అనే సాలీడు
అల్లిన
అనుబంధాలు అనే వలలో
చిక్కి
ఈగలా కొట్టుకుంటోంది
నా హృదయం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.6.2019.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
56 చీర నా జీవితం
🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁
అప్పుడెప్పుడో ఆరేళ్ళ వయసులో
అమ్మ చేతి వేళ్ళ లో
అలవోకగా ఒదిగి
ఆమె ఒంటిని చుట్టుకునే
అందమైన చీరను
ఇంత కళ్ళు చేసుకుని
ఇష్టంగా చూడటం
నిన్నటి నా అపురూప జ్ఞాపకం
నాన్న మొదటిసారి నా కోసం తెచ్చిన చీర
ముచ్చటగా కట్టుకుని మురిసే వేళ
అమ్మా నాన్నల కన్నుల్లో వెలుగులు
సర్దుకోవటం సరిగారాని సరిగంచు చెరగులు
నా జ్ఞాపకాల అరల్లో నేటికీ పదిలమే.
కంచిపట్టు చీరలో కలలు నిజం చేసుకుంటూ
కొంగుముడితో కొత్త జీవితం లోకి
తొలి అడుగులేసే పారాణి పాదాలను
అల్లుకుని జీరాడిన అందమైన కుచ్చిళ్ళు
నా ఊహల్లో నిత్యమూ ఉల్లాసం నింపుతాయి
తొలి వలపులు పండించి మగని మనసు రంజించి
పంచుకున్న అనుభూతులు పరవశాల మైమరపులు
తెల్లచీర మడతల్లోంచి తరచూ తొంగి చూస్తుంటాయి
అమ్మగా నేను మారిన అపురూప క్షణాల్లో
పురిటి కందును హత్తుకుంటూ
పొందిన తొలి పులకరింత
మెత్తని పాతచీర పొత్తిళ్ళలో
ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది
అమ్మ మనసుపడ్డ ఆకుపచ్చ చీర
సంక్రాంతి కి కొనిపెట్టిన సంబరం తీరక మునుపే
ఆమె ఆఖరి ప్రయాణానికి
ఆ చీరే ఆచ్ఛాదనమై
గుర్తుకొచ్చినపుడల్లా గుండెను కోస్తూనే ఉంది.
నా చీరను చుట్టుకుని నన్ను చూసి సిగ్గుపడి
పారిపోయే చిట్టితల్లి పాదాలకు అడ్డుపడి
జారిపోయే జరీచీర
నేను జాగ్రత్తగా దాచుకున్న
ముద్దులొలికే మధుర జ్ఞాపకం
నా ప్రతి అనుభవానికీ అద్దంపడుతూ
ఆశ నిరాశల కలనేతగా
నాచుట్టూ అల్లుకున్న
నాకెంతో ఇష్టమైన
చీర......నా జీవితం.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
57.తాకట్టు నగలు.................
నా ఒంటిమీది బంగారాన్ని
నా బిడ్డలాగే
ఎంతో అపురూపంగా
చూసుకున్నాను
కూతురికి పెళ్ళీడు రాగా
పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించినట్లుగా
అవసరాలు తరుముకురాగా
బిడ్డలాంటి బంగారాన్ని కూడా
తాకట్టుకు తరలించాను
అమ్మాయి వెళ్ళిపోయి
ఇల్లంతా బోసిపోయినట్లుగా
అపరంజి వెళ్ళిపోయి
నా మెడ కూడా బోసిపోయింది
అమ్మాయి పెళ్ళితో
అందమైనబాధ్యత
నెరవేర్చానన్న ఆనందం
కనకం కుదువతో
కుటుంబానికి ఆసరా
అయ్యానన్న తృప్తి
కానీ ఒక్కటే దిగులు
మక్కువతో చూసుకున్న రెండూ
నా కంటికి ,పుట్టింటికి
,ఇక చుట్టపు చూపేనా!!!
సింహాద్రి జ్యోతిర్మయి
28.6.2018
58. స్నేహ (కవితా)లత
****************
కవితా లత
నన్ను
తొలిచూపులోనే ఆకట్టుకున్న వనిత
పదేళ్ళ మా పరిచయం
స్నేహ సుమగంధమై పరిమళించింది
విజ్ఞానం
వివేకం
విశ్లేషణా శక్తి
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపగల
వాక్చాతుర్యం
అన్నీ కలిగి
అంచెలంచెలుగా ఎదిగి
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా
ప్రభావవంతమైన
ప్రధానోపాధ్యాయురాలిగా
ప్రతిభాశాలిగా
గుర్తింపును
గౌరవాన్ని
పురస్కారాన్ని
పొందిన
మా కోడలికి (అందరూ మా ఇద్దరినీ అత్తాకోడళ్ళు అంటుంటారు)
కన్నెర్ర చేసి
పనిచేయించుకోవటమే కాదు
కష్టాన్ని తెలుసుకుని
కన్నీరు తుడిచి
ధైర్యాన్ని నింపి
అండగా నిలవటం
ఆదుకోవడం కూడా
తెలుసు
మనసు సుతి మెత్తనే గానీ
అప్పుడప్పుడూ
మాట మాత్రం
కాస్త కటువే సుమా!
అయినా గానీ
ఆ ఆప్యాయత రుచి చూసిన వారు
ఆ కాఠిన్యం వెనుక
కారణాన్ని గ్రహించి
దిద్దుకుంటారే గానీ
తిట్టుకుని దూరం కారు
క్రమశిక్షణ
కాస్త చొరవ
నిబద్ధత
నిత్యనూతన ఉత్తేజం
నిరంతరం
తాను కలిగివుండి
తక్కిన వారినుండి
ఆశించే
మా మంచి ప్రిన్సిపాల్
మహ స్ట్రిక్టు ప్రిన్సిపాల్
మాకు నచ్చిన
మేము మెచ్చిన
మా కవిత
మా యశోదా కృష్ణునితో (కవితా కదిరేశన్)
ఆద్య సంతోషాలతో
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
చిరకాలం
చింతలులేని జీవితం గడపాలని
ఈ పుట్టినరోజు శుభవేళ
మనసారా ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
మా
ఓపీయస్ ఫ్యామిలీ
తరపున
పుట్టినరోజు శుభాకాంక్షలు
అందజేస్తూ
ప్రేమతో
తెలుగు మిస్.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టీచర్@OPS
9.9.2019.
59. గ్రహణాలు
రాహువు కేతువు
రాక్షసులే
దేవతలుగా నటించారు
అమృతం సంపాదించారు
సూర్యుడు, చంద్రుడు
దేవతలే
తప్పుని సరిదిద్దే
ప్రయత్నం చేశారు
గ్రహణాల బారినపడ్డారు
నిజం నిలకడ మీద
తెలుస్తుందేమో కానీ
అజాగ్రత్తకు
పొరపాటుకు మాత్రం
మనశ్శాంతిని
మూల్యంగా చెల్లించక తప్పటం లేదు
60. నిష్ఠుర సత్యం
చెట్టు
ఒక
తీయని పండు కాసింది
ఎవరో కోసుకుని తింటున్నారు
ఆ పండు
నాది,నాదే
అని చెట్టు
పదే పదే
పరితపించడం వల్ల
ప్రయోజనం
ఏముంది?
కోసేసిన పండు
ఇక ఎప్పటికీ
తనది కాదనే
సత్యాన్ని గ్రహించి,
ఆ పండు
మరొకరికి
ఆనందాన్ని
పంచగలుగుతుందని
ఆనందించడమే
మింగుడు పడటం కష్టమైనా
ఇదే సత్యం🙂
సింహాద్రి జ్యోతిర్మయి
25.2.2022
61.ఎండమావి
ఎండమావుల వెంట
పరిగెడుతున్నా
పరిగెడుతున్నా
దాహార్తితో....
తీరా చూస్తే
అది ఎండమావి కాదు
దాహం తీర్చలేని
ఉప్పునీటి కడలి
దాహం తీర్చకపోగా
ముంచేయడానికి సిద్ధంగా ఉంది
కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాను
అంతలో
మళ్ళీ మొలకెత్తింది
చచ్చేదాకా వదలని
చావని ఆశ....
కష్టాల వేడికి
కన్నీటి మేఘాలు
ఉప్పును గ్రహించి
దప్పిక తీర్చే
మంచినీరుగా
మారతాయని
మళ్ళీ ఎదురుచూపు
మళ్ళీ ఎదురీత
ఈ ఎదురీతకు అంతం
ఆశల జల్లులా!
ఆఖరి శ్వాసా!
ఈ కర్మఫలం ఎంతకాలమో
కాలమే చెప్పాలి
నాకో!
నా తర్వాత లోకానికో!😔😔
62.వాడిని చూసి.....
53 ఏళ్ళుగా
వాడిని చూసి....
అప్పుడప్పుడూ నేను....
అసూయపడుతుంటాను
ఏ విషయమైనా క్షణాల్లో
నేర్చేసుకోగలిగే వాడి తెలివితేటలు చూసి
ఆశ్చర్యపోతుంటాను
వాడికున్న జ్ఞాపకశక్తిని చూసి
మురిసిపోతుంటాను
వాడి భక్తిప్రపత్తులు,గురువుపైన గురిని చూసి
ముగ్ధురాలినైపోతుంటాను
మెప్పించే వాడి వాక్చాతుర్యం చూసి
ఆనందపడిపోతుంటాను
ఆక్కపై వాడికున్న అభిమానాన్ని చూసి
పశ్చాత్తాపపడుతుంటాను
నాకన్నా చిన్నవాడైనా
వాడికున్న సంయమనం
నాకు లేకపోవడం చూసి
మెచ్చుకుంటుంటాను
తనను తాను దిద్దుకుంటూ
మెట్టు మెట్టుగా
ఉన్నతంగా
ఎదగడం చూసి
ఔరా!అని అబ్బురపడుతుంటాను
వాడి పక్కా ప్లానింగ్ ని చూసి
ధైర్యం తెచ్చుకుంటాను
అక్కా! నీకు నేనున్నాను అని
వాడిచ్చే భరోసాను చూసి
గర్వపడుతుంటాను
వాడి సంస్కారం చూసి
ఇంత మంచి
తమ్ముడిని ఇచ్చిన
స్వర్గస్తులైన నా
తల్లిదండ్రులకు కృతజ్ఞతలు
తెలుపుకుంటూ...
వాడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని,
సకలశుభాలు పొందాలని
మనసారా దీవిస్తూ...
నా ప్రియాతిప్రియమైన
తమ్ముడు
సింహాద్రి శ్రీరామమూర్తి కి
53వ
పుట్టిన రోజు శుభాకాంక్షలతో
అక్క
సింహాద్రి జ్యోతిర్మయి
28.2.2022
63.మాకిది మామూలే
సంప్రదాయం పేరుతో
వివాహాలకి
సరదా పేరుతో
దీపావళికి
నిర్లక్ష్యం పేరుతో
పసి ప్రాణాలను
బలితీసుకునే
బోరు బావులకు
సమాంతరంగా
బావిని తవ్వడానికి
వేలు, లక్షలు
కుమ్మరించటం
మాకు మామూలే.
అయినా
ఆర్భాటమే తప్ప
వివాహ బంధానికి
విలువ నివ్వటంలేదు.
శబ్దకాలుష్యమే తప్ప
పర్యావరణ ముప్పు
పట్టడం లేదు
అధికార యంత్రాంగపు
ఆరాటమే తప్ప
నూటికి తొంభై పైగా
ఘటనల్లో
కన్నవారికి
కడుపుకోత తప్పడంలేదు.
సంసారంలో
కొంత
సర్దుబాటు
ప్రకృతిని పరిరక్షించుకోవాలనే
చైతన్యం
చిన్నారులను
మింగేయటానికి
తెరుచుకున్న
బోర్ల నోర్లను
మూయిద్దామనే
బాధ్యతాయుతమైన
చిన్న ఆలోచన
ఇకనైనా
కావాలి
రావాలి
చేయాలి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.10.2019
64.చిన్నారి శ్రీజా!
నీ చిన్ని చిన్ని పాదాలు
తకిట తథిమి తకిట తథిమి తందానా
అంటూ
నాట్యవేదాన్ని
దృశ్యమానం చేస్తుంటాయి
ఇది నా ప్రియనర్తన వేళ
అని నీవు నర్తిస్తుంటే
అందెల రవమిది పదములదా!అంటూ
వీక్షిస్తున్న ప్రేక్షకసమూహాలు
అంబరమంటిన
హృదయాలతో
ఆశీస్సులను వర్షిస్తుంటాయి
ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ
నువ్వు మెరుపల్లే తుళ్ళితే
ఝల్లు ఝల్లు ఝల్లు మంటూ
మా తనువులు
ఉప్పొంగుతుంటాయి
భరతవేదముగ
నిరతనాట్యముగ
కదిలిన నీపదములు
శివనివేదన చేస్తుంటే
ఆ లాస్యం
నమకచమక సహజమై
నటప్రకృతీ పాదజమై
నర్తనమే శివ కవచమై
నటరాజ పాద సుమరజమై
నీ అభినయాలు
అలరిస్తుంటాయి
నీ
నాట్యవిలాసం
పరమసుఖమై,పరమై
అభినయ వేదము
సభకనువాదము
సలుపుతుంటే
సిరిసిరిమువ్వలు
పులకిస్తుంటాయి
నీ
బ్రతుకు నిత్యనృత్యమై
నీవు
మరిన్ని ఉన్నత శిఖరాలకు
చేరుకోవాలని
మనసారా
ఆశీర్వదిస్తూ
మా
కళామిత్రమండలి
అందిస్తోంది నీకు
ఈ చిరు పురస్కారం 🙌🙌
.6.11.2022
65.కవులే స్ఫూర్తిగా
కవిత్వమే ఊపిరిగా...
తేటైన మాటలు కూర్చుకొని
ముత్యాల సరములు గుచ్చిన గురజాడకు
ఆకులో ఆకై పువ్వులో పువ్వై
మనసున మల్లెల మాలలూపిన కృష్ణశాస్త్రికి
భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోసిన శ్రీ శ్రీ కి
గాయపడిన కవిగుండెల్లో
రాయబడని కావ్యాలల్లిన దాశరథికి
వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలే తన అక్షరాలన్న
తిలక్ కి
పరులకోసం
పాటు పడని
నరుని బ్రతుకు దేనికంటూ ప్రశ్నించిన సినారెకి
తాను విశ్వనరుడనని
ధీమాగా చాటిన జాషువాకి
వంటిళ్ళను ధ్వంసం చేద్దాం రమ్మంటూ
పిలుపునిచ్చిన విమలకు
పితృస్వామ్యపు అదృశ్యహస్తాల్ని తొలగించమన్న నిర్మలకు
స్త్రీ జీవితం
చెప్పు కింద మల్లెపువ్వు కారాదని గళమెత్తిన
ఓల్గాకి
జగమంత కుటుంబం నాదన్న సిరివెన్నెల కి
వారసులుగా నిలుస్తూ
సుకవివై
ప్రజల నాలుకల యందు
నిలిచిపోయే
కవితలల్లే
ఓ కవివర్యా!
మా కళామిత్రమండలి
తెలుగు లోగిలిలో
జరుగుతున్న ఈ సత్కారాన్ని
ప్రదానం చేస్తున్న ఈ పురస్కారాన్ని
అందుకోండి
ఆనందింపజేయండి
9.11.2022
66.భాషా బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారికి
జరుగుతాయి వార్షిక బ్రహ్మోత్సవాలు
తెలుగు వాగ్దేవికి ఒంగోలు లో జరిగాయి
భాషా బ్రహ్మోత్సవాలు
అవి కన్నుల పండువలు
ఇవి వీనులకు విందులు
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో
సృజనాత్మక సమితి సారధ్యంలో
న ర సం గౌరవాధ్యక్షురాలు
తేళ్ళఅరుణ గారి నిర్వహణ లో
ప్రకాశం జిల్లా నడిబొడ్డులో
ఎన్ టీ ఆర్ కళాక్షేత్రం ప్రాంగణంలో
ఆదివారం ఉదయం
ఆరంభమైన ఆ సంరంభానికి
సూర్యచంద్రుల్లా
విజయభాస్కరుడు
పూర్ణచంద్రుడు
పక్కపక్కనే ఉదయించి
పరమానందం కలిగించారు
ప్రకాశం సాహితీవేత్తలందరూ
పరమోత్సాహంతో విచ్చేశారు
అన్ని సాహితీ సంస్థల అధ్యక్షులు
అరమరికలు లేకుండా హాజరయ్యారు
గ్రంథాలయం నుండి ప్రారంభమైన
భాషా పరిరక్షణా పాదయాత్రలో
ముందుగా త్యాగయ్యకు
త్రోవలో
ఎర్రనార్యునకు
చివరగా జాషువాకు
పూలమాలలు వేసి
నివాళులర్పించాము.
పసిపాదాలు మమ్మల్ని
అనుసరించాయి
పసి చేతులు పిడికిళ్ళు బిగించి
తమ ఆస్తి అన్నట్లుగా
నినాదాల అట్టముక్కలను పట్టుకున్నాయి
అందమైన భాష అమ్మభాష
మధురమైన భాష మాతృభాష
అని పసిగొంతులు నినదించాయి
చందూ నాట్య మండలివారి
చిట్టితల్లుల నృత్యాలు అలరించాయి
అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ
అమాత్యులు శిద్ధా రాఘవరావుగారు
శాసన మండలి సభ్యులు
కరణం బలరామ కృష్ణమూర్తి గారు
అరుదెంచటం మహద్భాగ్యం
భాషాభివృద్ధికి సహకరిస్తామని
హామీ ఇవ్వటం ముదావహం
ఇంతలో గ్రంథావిష్కరణలు
గ్రంథ రచయితలకు సన్మానాలు
అమ్మ ఒడిలో ఒదిగి
చదువుల బాల్యమై ఎదిగి
సాహితీ ప్రకాశినిగా రూపుదిద్దుకున్న
ముచ్చటైన మూడు కావ్యాలు
అచ్చమైన ఆణిముత్యాలు
అనంతరం జరిగింది
సాహితీసేవలో తరించిన
మహనీయులకు సత్కారం
కళామిత్ర మండలి అధ్యక్షులు
డాక్టర్ నూనె అంకమ్మరావుగారిదే
ఆ కార్యభారం
ఆపైన
తెలుగుదనాన్నే పంచెగా కట్టుకునే
ప్ర ర సం అధ్యక్షులు
బి.హనుమారెడ్డి గారి అధ్యక్షతన
జరిగింది మొదటి సదస్సు
సాంకేతికతను అందిపుచ్చుకోమని
ఎర్రన పద వైచిత్రిని ఆనందించమని
బడిభాషను బ్రతికించమని
పాలనాభాషను పరికించమని
మాండలికాలను మరవద్దని
వక్తలంతా ఉద్బోధ చేశారు
ఉత్సాహం నింపారు
అంతలో దాటింది ఒంటిగంట
భోజన విరామం ఒకగంట
కొన్ని పాటలు ఈ లోపు
అందరికీ ఆటవిడుపు
భుక్తాయాసంతో
కునికిపాట్లతో
స్తబ్దుగా ఉన్న సభను
ఉత్తేజపరచిందొక
ఎగరేసిన బావుటా
అది అరుణగారి పాట
తదనంతరం
డాక్టర్ నూకతోటి రవికుమార్ గారు
రెండవ సదస్సును నిర్వహించారు
శాసనాలను చర్చించి
న్యాయపాలన సమీక్షించి
జిల్లా చరిత్రను స్పృశించి
పత్రికలను పలకరించి
ఇంటిభాషనొక కంట చూసి
వక్తలంతా మాట్లాడారు
సభికులంతా సంతోషించారు
ఆ పిదప మొదలయ్యింది
కవి సమ్మేళనం
తొలిగా తరుణీమణుల ఆవృత్తం
సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని
మేము కాలంతో పోటీపడ్డాము
కడు వేగంగా ముగించేశాము
అటుపైన మగవారు
తమ కవితలు చదివారు
అందరం కలసి మేమొక యాభైమందిమి
కానీ మా కవితా వైవిధ్యం మాత్రం అంతులేనిది
అందరి కవితలూ అలరించాయి
రస వాహినిలో ఓలలాడించాయి
ప్రశంసల చిరుజల్లులు
జ్ఞాపికల చిరుకానుకలు
దుప్పట్లు ,చప్పట్లు
ఇంతకంటే ఏమి కావాలి కవులకు?
మా ఆనందానికి హద్దే లేదు
వందన సమర్పణతో
జనగణమనతో
సభను ముగించాము
సాయంత్రం పకోడీల ఉపాహారం,
వేడి వేడి తేనీరు
రాత్రికి అల్పాహారంతో వీడ్కోలు
ఇలా జరిగాయండీ
మా ఒంగోలు భాషా బ్రహ్మోత్సవాలు
ఇందులో భాగస్వాములైన
ప్రతి ఒక్కరికీ
పేరుపేరునా నా నమోవాకాలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుఒంగోలు
67.నేను చూశాను నిజంగా*
ఆవైపు
తల పైకెత్తాను
అంతస్తులుగా ఎదిగిన
ఐశ్వర్యాన్ని చూశాను
ఔరా!
అని అబ్బురపడ్డాను
ఈవైపు
తలదించగానే
దుర్భర దారిద్య్రం తో
బ్రతుకీడుస్తున్న
ధారావిలోని
దయనీయమైన
జీవితాలు చూశాను
అయ్యో!అని
ఆవేదన పడ్డాను
బొమ్మాబొరుసూ
చెరోవైపూ ధరించి
ధనం విలువకు
తొలి అంకెగా నిలిచి
చెలామణీ అవుతున్న
రూపాయి నాణేంలా
అనిపించింది
దేశ ఆర్థిక రాజధాని
ముంబయి మహానగరం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.10.2021
68.ఊగిసలాడకె మనసా!
ఓ వర్షం కురిసిన ఉదయం
పొద్దున్నే వచ్చిన వర్షం
పొద్దు పోయి వచ్చిన చుట్టం
ఒక పట్టాన వదలవని
పెద్దలంటారు
ఈ రోజు ఉదయాన్నే
ముసురేసింది
వాతావరణం
చల్లగా బాగుంది
అని సంతోషమేసింది
సన్నగా మొదలైన
జల్లును చూసి
సరదావేసింది
అంతకంతకూ
పెరుగుతూ
ఆగని వర్షాన్ని చూసి
అబ్బా! ఈ వానలో
బడికేం వెళ్తాం అని
బద్ధకమేసింది
వర్షం కారణంగా
స్కూల్ కి సెలవు అని
మెసేజ్ రాగానే
హమ్మయ్య!
హడావిడిగా
పనులు ముగించి
పరిగెత్తనక్కరలేదు
అని సంబరమేసింది
అనుకోకుండా వచ్చిన
హాలీడే ని
ఎంజాయ్ చేద్దాం అనే
ఆలోచన
పట్టుమని
పదినిమిషాలైనా నిలవలేదు
ఒకరోజు సెలవంటే
ఐదారు క్లాసులు మిస్సింగ్
అమ్మో!మరి సిలబస్సో!
అని భయమేసింది
జల్లు కాస్త తగ్గినట్లు
అనిపించగానే
అయ్యో!
బడి ఉంటే బాగుండేది
అని దిగులేసింది
అంతలో
మళ్ళీ పెరిగిన వాన
పోనీలే!
సెలవు వృధా కాలేదు
పిల్లలు సంతోషిస్తారు
అని సంతృప్తి కలిగింది
ఒకే ఆకాశం
ఎన్నో నక్షత్రాలు
ఒకే మనసు
ఎన్నెన్నో భావాలు
ఊహలు మారుతుంటాయి
క్షణక్షణానికి
ఊగిసలాట మాత్రం హృదయానికి
ఈ జడి
నాలో కలిగించిన అలజడి
కవితగా ఊపిరి పోసుకుంది.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టీచర్@ OPS
16.10.2019
69.*వాచాలత్వ(0)మేలా!*
నాకు విద్వత్తు ఉంది
వాక్చాతుర్యం ఉంది
విని మెచ్చుకునే వారూ ఉన్నారు అని
హాస్యం పండిస్తున్నాను అనుకొని
నోటి తొందరపాటుతో
అనుచితవ్యాఖ్యలు చేస్తే
అపహాస్యం పాలు
అవకతప్పదు
ఆడదంటే అగ్నికణం
ఆనాటి సీతా ద్రౌపదులు మాత్రమే కాదు
ఆధునిక మహిళలు కూడానూ
వారి ఆత్మాభిమానాన్ని
కించపరిస్తే
మూల్యం చెల్లించక తప్పదు
ఎంతవారలైనా....
ఇక తమరనగానే..పాటి?
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.11.2022
70.ఇది ఒకటో నెంబరు బస్సు
నిన్న మొన్న
నువ్వు కారు కొనుక్కొనే దాకా
కన్నతండ్రి
భుజాలమీద
ఎక్కించుకుని తిప్పినట్టు
నిన్ను కోరిన చోటికి
భద్రంగా తీసుకెళ్లి దింపినదాన్ని నేనే కదా!
నీకు
వాహనయోగం పట్టగానే
నా మొహం చూడ్డమే మానేశావే!
నేనంత చులకనయ్యానా!
అవునులే
ముందొచ్చిన
చెవులకంటే
వెనకొచ్చిన కొమ్ములు వాడి.
మిడిమేలపు సిరిని చూసుకొని
మిడిసి పడటం
మీ మానవజాతికి మామూలేలే
అని ఆర్టీసీ బస్సు
నిష్టూరాలాడినట్లు,
నన్ను తిట్టినట్లు,
తాను చిన్నబుచ్చుకున్నట్లు
అనిపించింది
ఎంతో కాలం తర్వాత
ఈ ఆర్టీసీ బస్సు
ఎక్కుతున్నప్పుడు.
టికెట్ తో సారీ చెప్పి
చిన్నప్పటి బస్సు ప్రయాణాలను
గుర్తు చేసుకుంటూ
బయల్దేరాను
విజయవాడకి
రెండవ నాటి
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.12.2019
71*అడుగున అడుగై*
ఆ మౌనం
నన్ను కంగారు పెట్టేస్తుంది
ఆ భరోసా
నన్ను విస్తుపోయేలా చేస్తుంది
ఆ నిబ్బరం
నన్ను నిశ్చేష్టురాలిని చేస్తుంది
నేను కటికచీకటిలో లేను
పండు వెన్నెల్లో ఉన్నానని
భ్రమింపజేసే
ఆ నమ్మకం వెంట
నేను అడుగులో అడుగేస్తూ నడుస్తుంటాను
చాలాసార్లు అవి
తప్పటడుగులే
అని నాకు తెలుస్తూనే ఉంటుంది
అయినా తప్పదు
ఎందుకంటే
నా ప్రేమ
గుడ్డిది మాత్రమే కాదు
మూగది
చెవిటిది కూడా
ఔను
ఇది ఒక దివ్యాంగురాలి ప్రేమ కథ
సింహాద్రి జ్యోతిర్మయి
26.1.2023
72.*రేపు నువ్వుండవని తెలిసి*....
నేను విన్నది నిజమేనా!
నా రేపటిలో నువ్వుండవని
తెలిసిన క్షణం నుండి
మొద్దుబారిన మెదడు
బరువెక్కుతున్న హృదయం
నీ కంట పడకూడదని
కనురెప్పల వెనుక దాచిన నా కన్నీరు
నమ్మలేని ఈ నిజం
నా ప్రతికదలికనూ
యాంత్రికంగా మార్చేశాయి
నలభై యేళ్ళ మన బంధాన్ని
ఆత్మీయంగా అల్లుకున్న అనుబంధాన్ని
అది ఎలా తెంచేసి
నిన్ను నానుండి
వేరుచేసి పట్టుకుపోగలదు?
మరణం తప్పని మజిలీయే అయినా
ఇలా అర్థాంతరంగా
నా ఖర్మకు నన్ను వదిలేసి
నువ్వొక్కడివే
ప్రయాణసన్నాహాలలో పడుతుంటే
నీకు వీడ్కోలు ఎలా ఇచ్చేది?
నిన్ను
పలకరించటానికి వచ్చిన
ప్రతివారి కన్నూ
నీ వైపు బాధగా
నా వైపు సానుభూతిగా సారిస్తుంటే
నాకేమైంది అన్న ప్రశ్నను సంధిస్తూ
బేలగా చూస్తున్న
నీ కళ్ళకు
దుఃఖోద్వేగంతో వణుకుతున్న
నా పెదవులతో
నేనేమని
బదులిచ్చేది?
నేనే నీధైర్యమని చెప్పే నువ్వు
కలతపడిన నా మొహాన్ని చూస్తే
కలవరపడిపోతావని
రాని చిరునవ్వును
తెచ్చుకుంటూ
నీ ఎదురుగా నిలబడే నటన
నేనెంతకాలం చేయగలను?
నువ్వు నాకిచ్చినవన్నీ
నానుంచి విడివడిపోయినా
నాలో సగమైన నువ్వే
నా జీవితానికి పరిపూర్ణత అనుకున్నాను
కానీ
నువ్విలా తెంచుకుపోతే
వడలిపోయిన వయసులో
ఉడిగిపోయిన ఓపికతో
నువ్వు లేని
ఈ బతుకుబండిని
ఒక్కదాన్నే
ఎలా
ఈడ్చగలను?
ఇంతకాలం
ఎంతో ప్రేమ చూపించిన నువ్వింత
నిర్దయుడవౌతావని
నేను ఊహించనేలేదు
ఇప్పుడు నేనేం చేయగలను?
చేజారబోతున్న
నా అదృష్టాన్ని
కాపాడమని
కనపడని దైవాన్ని
కన్నీటితో వేడుకోవడం తప్ప
ఇప్పుడు నేనింకేం చేయగలను?
కొడిగట్టబోతున్న
నా జీవనదీపాన్ని
ఆశ అనే చమురును పోసి
వీలైనంతకాలం వెలిగించే వెర్రి ప్రయత్నం తప్ప
ఇప్పుడు నేనింకేం చేయగలను?
సుడిగాలిలాంటి మరణానికి
నా సౌభాగ్య దీపం
రెపరెపలాడకుండా
అరచేతులు అడ్డుపెట్టి
కాపాడుకునే ప్రయత్నాన్ని
కడదాకా చేయటం తప్ప
ఇప్పుడు నేనింకేం చేయగలను?
ఏం చేయగలను?
***********
నన్నెంతో ప్రేమించే,నేనెంతో ప్రేమించే మా శాంతక్కకు వచ్చిన కష్టాన్ని,ఆమె కన్నీటినీ చూసి వికలమైన మనసుతో రాసిన కవిత
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.1.2023
73.*నువ్వు పోయినప్పుడు*
*(కవిత మీద కవిత)*
ఇందిరా!
వింటున్నావా!
కవి సమ్మేళనం పెట్టమన్నావుగా!
ఎవ్వరూ కలిసిరాలేదు
అందుకని కుదరలేదు
ఏం అనుకోకేం!
నిజం చెప్పొద్దూ!
నీ కవిత చదివి నేను
ఒక్కసారిగా
ఉలిక్కిపడ్డాను సుమీ!
ఎందుకంటావేమో!
ఎందుకేమిటి నా మొహం?
చావు ఊహకే నేను
చిగురుటాకులా వణికిపోతుంటాను
ప్రముఖులు చనిపోతే
అంత్యక్రియల దాకా ఆసాంతం టీవీకి అతుక్కుపోయి చూసేస్తుంటాను
ఇదికూడా ఒక పైశాచిక ఆనందమేమో అని
ఇప్పుడనిపిస్తోంది
చనిపోయిన వాళ్ళ గురించి
చదివిన వాళ్ళ గుండెలు కరిగిపోయేలా
కవిత్వమూ రాసేస్తుంటాను
నలుగురూ ఏడ్చి
ఎంతబాగా రాశావు?
ఏడ్పించేశావు అంటే
ఏదో ఘనకార్యం చేసినట్లు
పొంగిపోతుంటాను కూడానూ!
లేదూ అంటే వైరాగ్యం వల్లిస్తుంటాను
కానీ మరణాన్ని ఇంత సహజంగా ఇంత తేలికగా
తీసుకోవచ్చని
అందులోనూ
మానవత్వాన్ని
ప్రకృతిపై ప్రేమని
సామాజిక బాధ్యతని
సరదాని కూడా
మిళితం చేయవచ్చని
నీ వల్లనే నాకు తెలిసింది
నీ పరిచయభాగ్యం కలగకున్నా
నీ కవిత చదవగలిగినందుకే ఆనందిస్తున్నా!
ఫోన్ కూడా తీసుకెళ్తున్నావుగా!
నా కవితను నీకు
వాట్సాప్ లో పంపిస్తాను
ఫేస్బుక్ లో నిన్ను ట్యాగ్ చేస్తాను
కాస్త నీ కవితతో పాటూ నా కవితను కూడా
ఆ లోకంలో వైరల్ చేద్దూ!
నేను కూడా అక్కడకు వచ్చినప్పుడు
గుర్తుపెట్టుకుని మరీ
తప్పకుండా
నిన్ను పరిచయం చేసుకుంటాను
కృతజ్ఞతలు కూడా చెప్తాను
సరేనా!ఉండనా మరి!
****
మరణాన్ని గురించి ఇంత వినూత్నంగా రాసిన
*బైరి ఇందిర* గారికి నివాళితో ఈ కవిత *అంకితం*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.2.2023
On your birthday, I thought of giving you the cutest gift in the world. But then I realized that is not possible because you yourself are the cutest gift in the world
74.వెలుగు రేఖలు నీ పుట్టిన రోజులు
మా జీవితాల్లోకి
అద్భుతాలను
ఆనందాలను
సంబరాలను
సందడులను
తెచ్చిన
తొలి ప్రేమ పేరు
నిశాంత్ చంద్ర
నువ్వు తండ్రి గా మారినా
మాకు మాత్రం
అప్పటి మా చిట్టి తండ్రి వే.
పుట్టినరోజు శుభాశీస్సులు చిన్నోడూ!
భార్యాపిల్లలతో
సుఖ శుభసంతోషాలతో
నువ్వు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి.
11.3.2021
చిన్నోడూ!
పోయిన ఏడాది పుట్టినరోజుకి బ్రహ్మచారివి
ఈ ఏడాది పుట్టినరోజు కి భర్తవయ్యావు
వచ్చే ఏడాది పుట్టినరోజుకి
తండ్రివవ్వాలని
మమ్మల్ని
నాయనమ్మాతాతలనుచెయ్యాలని
ఆశిస్తూ
నిండు నూరేళ్ళు
సుఖసంతోషాలతో
సిరిసంపదలతో
ఆయురారోగ్యాలతో
పిల్లాపాపలతో
చల్లగా వర్ధిల్లాలని
మనసారా దీవిస్తూ
అమ్మ
(మమ్లీ హమ్లీ డమ్లీ)
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.3.2020
చిన్నోడూ!
నీ పుట్టిన రోజంటే
అమ్మగా నేను
పుట్టిన రోజు
నాన్న కలల ప్రపంచం
ఒకటి పుట్టిన రోజు
చెల్లికోసం ఒక
ఆత్మీయబంధం
పుట్టిన రోజు
మాటలో కూడా
కఠినత్వం ఎరుగని
ఒక సున్నిత హృదయం
పుట్టిన రోజు
తొందరపాటు
తొణికిసలాట లేని
నిబ్బరం
నిశ్చలత్వం
పుట్టిన రోజు
మూర్తీభవించిన
సంస్కారాన్ని
సమాజానికి
అందించగలిగానన్న
సంతృప్తి
ఈ అమ్మ గుండెల్లో
పుట్టిన రోజు
ప్రేమతో
అమ్మ
సింహాద్రి జ్యోతిర్మయి
11.3.2019
నాడు
కన్నులైనా తెరవని
చిన్ని పాపడివై ఒదిగి
నిన్న
నీ ఆటపాటలతో
ముద్దు మురిపాల తో
అలరించి
నేడు
కన్నవారి కలలు
తెలుసుకుని ఎదిగి
చుక్కలు వేయెందుకు
ఒక్క చంద్రుడే చాలు
అనిపించి మురిపిస్తున్న
నా చిట్టి తండ్రీ!
వచ్చే ఏడాది కి
ఓ ఇంటివాడివి కావాలని దీవిస్తూ
చిన్నోడూ!
ఈ నాడే
నీ పుట్టిన రోజు
మా జీవితాలకే
కొత్త వెలుగు
వచ్చిన రోజు
Happy birthday
To you
Nisanth Chandra
11.3.2018
నేను.. నా చిట్టితండ్రి
నా అందాల కూతురు
ఈ రోజు మా ఇద్దరి పుట్టిన రోజు
తొలిసారి అమ్మగా నేను....
తొలి బిడ్డగా వాడు.....
తను పుట్టినప్పటినుండి
నేటివరకు
ఈ అమ్మకి
సంతోషమే తప్ప
కష్టం కలిగించని
నా చిట్టితండ్రికి
పుట్టిన రోజు
శుభాశీస్సులు
శతమానం భవతి.
11.3.2017
75.*గుర్తుకొస్తున్నారూ*
మీరు నా దగ్గర లేరు
ఇద్దరం దాదాపుగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం
అయినా మీ ఆత్మీయతా స్పర్శ నన్ను అనుక్షణం
చుట్టుకునే ఉంటోంది
నా సాహితీ బంగారం
అంటూ మీరు చేసే గారాబం
నా మాటలకు గలగలా నవ్వే మీ సంతోషం
కలిసి భోజనం చేస్తూ
కబుర్లు చెప్పుకునే మధ్యాహ్నాలు
మనిద్దరం ఏదన్నా మర్చిపోతే
నేను లేకపోతే
మీరిద్దరూ ఎలా బ్రతుకుతారో ఏంటో అంటూ
అరుణ మురిపెంగా మనల్ని విసుక్కునే సందర్భాలలో మన నవ్వులు
మొహమాటస్తుడైన
శ్రీనివాస్ గారితోనో,
అన్నిటికీ అలిగి ఉడుక్కునే అంకమ్మరావు గారితోనో కాసేపు కబుర్లు
సూర్యకుమారి గారి తో
అంత్యాక్షరి పాటలు
పెద్ద మేలం నాది అంటూ సన్నీగాడు చెప్పే ముద్దు ముద్దు ఊసులు
సాయంత్రం నాలుగున్నర కి మీరు యాలకులు,చెక్క వేసి
కాచి స్వయం గా తెచ్చి అందించే స్పెషల్ టీ
అప్పుడప్పుడూ నరసమ్మ గారితో కలిసి మనం చేసే ఈవెనింగ్ వాక్
ఇంటికి రాగానే
శ్రీదేవి ఇచ్చే కర్బూజా జ్యూస్
రాత్రికి లైట్ గా ఉగ్గాణి
నిజం చెప్పొద్దూ!
మా ఆయనతో కంటే మీతోనే ఎక్కువ సమయం సరదాగా గడుపుతున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి
ఎక్కడికి వెళ్ళాలన్నా
జ్యోతీ! నేను కారు పంపిస్తాను అంటూ
నరేష్ ని పంపించే మీ అభిమానం
కారు దిగేటప్పుడు కూడా నేను వద్దంటున్నా వినకుండా
మీరు కార్ డోర్ పట్టుకుంటే
ఎంతోమందికి ఆత్మీయురాలైన ఈ తల్లికి నేనంటే ఎందుకింత ప్రేమ అనుకుంటూ మూగదయ్యే నా మనసు
మీరు వారం ఊరెళితేనే
నన్ను వదిలేసి వెళ్లిపోయారు
త్వరగా వచ్చేయండి అంటూ ఫోన్ చేసి సతాయించే నేను
ఇప్పుడు
తల్లిగా నా బాధ్యత కోసం ఇన్నిరోజులు దూరమైనా
నన్ను మిస్సవుతున్నా
అర్థం చేసుకుని ఊరడింపు మాటలతో మీ ఫోన్ లు
అన్నీ
గుర్తుకొస్తూనే ఉన్నాయి అరుణగారూ!
ఐ మిస్ యూ 😔
మీ జ్యోతి😍😍
76.తెలుగు చెట్టు కొమ్మ నీడలో...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
మన తెలుగు డిపార్ట్మెంట్ లో
1987-89
మధ్యకాలంలో
మన తరగతి గదిలో
ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం గారు
ఆద్యంతం రమణీయంగా బోధించిన
ఆదికవి నన్నయ్య గారి శిశుపాలవధ
కెకె రంగనాథాచార్యులు గారు
వల్లె వేయించిన శబ్దమంజరి
కళ్ళకు కట్టించిన
మేఘసందేశం
కమనీయంగా వర్ణించిన
ఇందుమతీ స్వయంవరం
నలుపు నారాయణ స్వరూపం కాగా
తెల్లని చిరునవ్వు
తనలోని స్వచ్ఛతను చాటగా
రవ్వా శ్రీహరి గారు
రామారావు పంతులు గారిలోని
నాలుగు గారెలు మనకు రుచి చూపించిన వైనం
పచ్చళ్ళు రెండు రకాలు
కుండపచ్చడి,బండపచ్చడి
ఏం విద్యాధరి గారూ!
మీది నెల్లూరు కదా!
మీకు తెలిసే ఉంటుంది అంటూ
కర్మంబున ద్వితీయ యగు అనే వ్యాకరణ సూత్రాన్ని
ఖర్మంబున ద్వితీయ (భార్య) యగు అంటూ
ఛలోక్తులు వేస్తూ
అతి బోరింగ్ లింగ్విస్టిక్స్ ని
అత్యంత ఆసక్తి కరంగా బోధించే
రామనరసింహం గారు
క్లాసులో మాట్లాడే నన్ను శుచిముఖీ అంటూ ప్రియంగా మందలిస్తూనే
ప్రణయం చిగురించే వయసులో
లావణ్య సరస్వతి గారు
అందంగా అలరించే రీతిలో
హృదయాలలో ఆవిష్కరింపజేసిన
ప్రభావతీ ప్రద్యుమ్నం
ఎన్ ఎస్ రాజుగారు
ఎంతో శ్రమపడి
నేర్పించిన
గణముల ప్రస్తారం
ప్రఖ్యాత నవలా మణి
ఆనందారామంగారు
చెప్పిన నవలలు (అది నా స్పెషలైజేషన్ కాదు కాబట్టి నాకు పెద్దగా అవగాహన లేదు)
సూర్యరాయాంధ్ర నిఘంటువులన్నీ
ఈయనే నమిలి మింగేశారేమో అని ఆశ్చర్యపరచే
విజిటింగ్ ప్రొఫెసర్
బూదరాజు రాధాకృష్ణ గారు
ఎందరో మహా గురువులు
అందరికీ వందనాలు 🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.4.2023
*ఇండియన్ బ్లోజమ్స్* లోని
77.*ఆ రోజులు బాగున్నాయి*
ఔను
ఆ రోజులు బాగున్నాయి
లెక్చరర్ నుంచి
టీచర్ గా మారి
IBIS లో చేరి
పాఠం చెప్పేసి
నోట్సులు ఇవ్వకుండా
తీరిగ్గా పాటలు పాడుకుంటూ
గడిపేసే నన్ను మీరు,
అస్తమానం హడావిడిగా
నోట్సులు దిద్దుకునే మిమ్మల్ని నేను
ఆశ్చర్యం గా చూసిన
ఆ రోజులు బాగున్నాయి
స్టాఫ్ రూమ్ లో కూర్చుని
భజగోవింద శ్లోకాలు పాడుకుంటుంటే
రౌండ్స్ కి వచ్చిన కదిరేశన్ సర్
వద్దని వారిస్తుంటే
లీజర్ పీరియడే కదా
పాడుకుంటే తప్పేంటి
అంటూ నేను వాదించి విసిగించిన
ఆ రోజులు బాగున్నాయి
గేమ్స్ పీరియడ్ లో
మోహనరావు గారి
కంటపడకుండా
నక్కి కూర్చుని అందరం కబుర్లాడుకుంటుంటే
పసిగట్టి చురకలేసినా
నవ్వుకుంటూ తిట్టుకుంటూ
ప్లేసుమార్చి గుసగుసలాడిన
ఆ రోజులు బాగున్నాయి
ప్రభావతీ కవితల స్నేహం చూసి
వాళ్ళు ముందునుంచే ఫ్రెండ్స్ అని తెలియక
నిన్న మొన్న వచ్చిన ప్రభావతి
ముందునుంచీ ఉన్న
నాకంటే ఎక్కువా కవితకు
అని ఈర్ష్య పడిన
ఆ రోజులు బాగున్నాయి
లంచ్ పూర్తవగానే
స్నాక్స్ ఓపెన్ చేస్తుంటే
చెయ్యి కొంచెం ఆరనివ్వండి మిస్
అని కవిత వేళాకోళం చేసిన
ఆ రోజులు బాగున్నాయి
లంచ్ తర్వాత నేను క్లాస్ కి వెళ్ళను అని బుంగమూతి పెడుతూ బజ్జోవాలి అంటూ
కొంగు తలకింద పెట్టుకుని
బల్లమీద వాలిపోయే
అగ్రిగోల్డ్ కవర్ కవితను
ప్రభావతి ఏడిపించిన
ఆ రోజులు బాగున్నాయి
పేరెంట్స్ మీటింగ్ ఉందంటే
ఏవీ సిద్ధంగా ఉంచుకోని క్లాసు టీచర్ నైన నన్ను
ఒక పక్క ఆటపట్టిస్తూనే
అందరూ తలా ఒక చెయ్యి వేసి
నా అటెండెన్స్ రిజిస్టర్ లు
ప్రోగ్రెస్ కార్డులు
అన్నీ చెక్ చేసి
సెట్ చేసి
రెడీ చేసిపెట్టిన
ఆ రోజులు బాగున్నాయి
గోలగోలగా ఉన్న
క్లాస్ రూమ్ ముందు నించుని
ఏమిటీ అల్లరి?ఎవరిదీ క్లాసు
అని కవిత పిల్లల్ని తిడుతుంటే
వాళ్ళందరూ ముక్తకంఠంతో
మీదే మిస్ అనగానే
గొల్లుమని మేమంతా
కవితను చూసి నవ్విన
ఆ రోజులు బాగున్నాయి
కాస్తో కూస్తో తెచ్చుకున్న
స్పెషల్ ఐటమ్స్
అందరికీ సరిపోవని
మొహమాట పడుతూ
బల్ల ఆ చివరనున్న
శిరీష, అనురాధ మిస్ వాళ్ళు
రహస్యం గా పంచుతుంటే
ఏంటదీ! నాకు పెట్టకుండా తినేస్తున్నారు అని
బల్ల ఈ చివరనుంచి
అందరూ వినేలా అరిచి ఆరాతీసే నన్ను
మీకు పుణ్యం ఉంటుంది
గోల చెయ్యకండి అని
అనూరాధా మిస్
గారంగా విసుక్కుంటూ
పక్కకి పిలిచి పెట్టిన
ఆ రోజులు బాగున్నాయి
మీరు పాటలు అద్భుతంగా రాస్తారు
రాయండి చాలు
ఇలా బాణీలు కట్టి పాడకండి ప్లీజ్
అని భయం భయంగా
బ్రతిమలాడుకుంటూ
మిత్రులే శత్రువులై
ఇండస్ట్రీలో నన్ను పైకి రానీయకుండా తొక్కేసిన
ఆ రోజులు బాగున్నాయి
ప్రభావతి పతిభక్తి మీద
జోకులేసుకుంటూ
మేమూ పతివ్రతలమే అని
నేను,కవిత అంటుంటే
చాలు ఊరుకోండి
ఎవరన్నా వింటే
అపార్థం చేసుకుంటారు అని
ప్రభావతి మాకు దండం పెట్టిన
ఆ రోజులు బాగున్నాయి
నన్నూ కదిరేశన్ సర్ ని
యశోదా కృష్ణులంటూ
ఆ వేషాలలో మిమ్మల్ని
ఊహించుకుంటూ
పగలబడి నవ్వుకుంటూ
అందరూ
అల్లరి చేసిన
ఆ రోజులు బాగున్నాయి
పాట్ లక్ లంచ్ లో
తుంచితే సాగిన పద్మజ్యోతి పూరీలు
చిన్న అనూరాధ రైస్ కుక్కర్
నాన్సీ అప్పడాలు
లక్ష్మి దద్దోజనం
పెద్ద అనూరాధా మిస్
బిస్ బేళా బాత్
పంచుకుని తిన్న
ఆ రోజులు బాగున్నాయి
ప్రభావతి చేసిన పూర్ణాలను తిని
పద్మావాళ్ళ ఆయన
అదేనండీ మన కంప్యూటర్ సార్
మేడమ్!ఇందులో స్టఫింగ్ కంటే సెక్యూరిటీ ఎక్కవైంది
అంటూ వేళాకోళం చేసిన
ఆ రోజులు బాగున్నాయి
వాళ్ళ అమ్మ ఊరెళ్ళిన రోజున
తెల్లవారుజామున
5 గంటలకే లేచి
కవిత చేసిన సాంబారు సంగతులు
టిఫిన్ కి బ్రెడ్డూ జామూ
వండటం వల్ల
స్కూల్ కి లేటయ్యింది అని చెప్పిన శ్యామల
పాకశాస్త్ర ప్రావీణ్యం
సంగీత నోములు వ్రతాలు
పర్మిషన్లు, ప్రసాదాలు
మనోహర పులుసు పిండి
రాధామాధవి రోటి పచ్చళ్ళు
లక్ష్మి చేసే కొబ్బరి కూరలు
శిరీష అప్పాలు
ప్రభావతి పక్కన నా ప్లేసు
సెటైర్లు అర్థం కాని రాధామాధవి
లక్ష్మి శాస్త్రి బామ్ కి
పూర్తి న్యాయం చేసే మీనా
మీనా సెల్ ఫోన్ పరిజ్ఞానాన్ని
పూర్తిగా ఉపయోగించుకునే నేను
అందరి జోకులకీ
పెదవులు విడీవిడకుండా
మౌనంగా నవ్వుకునే జమీమా మిస్
పసివాడినని చెప్పుకుంటూ
అందరూ ఆటపట్టిస్తున్నా
తనను ఏడిపిస్తున్నారు అని అర్థం చేసుకోని,
నొచ్చుకోని రవివర్మ అమాయకత్వం
ఎన్నని చెప్పను?
చెప్పేకొద్దీ
ఇంకా ఏవో
గుర్తుకు వస్తూనే ఉన్న
ఎన్నో ఎన్నెన్నో
తీపి జ్ఞాపకాలు మిగిల్చిన
ఆ రోజులు బాగున్నాయి
ఔను ఆ రోజులే బాగున్నాయి
సింహాద్రి జ్యోతిర్మయి
78.*అంతిమ (ఆత్మ) యాత్ర*
ఏమిటిది?
ఎందుకిలా నా శరీరం
అచేతనమయ్యింది?
ఎందుకు వీరంతా
నా చుట్టూ చేరారు?
ఎందుకిలా అందరూ ఏడుస్తున్నారు?
ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు?
నేనింక లేనని
మాట్లాడుకుంటున్నారు?
నేనిక్కడే ఉన్నాను కదా!
నన్ను వీళ్ళంతా
చూస్తూనే ఉన్నారు కదా!
మరి నేను లేనని
ఎందుకనుకుంటున్నారు?
ఈ అద్దాలగదిలో నా శరీరాన్ని బంధించి
పూలతో కప్పేస్తున్నారు
శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు
నేను నిజంగా అంత గొప్పవాడినా! అని
పొంగిపోయేలా పొగిడేస్తున్నారు
పూలరథంలో ఊరేగిస్తున్నారు
పూల వర్షంలో ముంచెత్తుతున్నారు
చందనపు చెక్కల
పాన్పుపై
పడుకోబెడుతున్నారు
నేనంటే వీళ్ళకి ఎంత ప్రేమ!
ఇంతమంది అభిమానాన్ని
సంపాదించానా నేను!
ఎంత ధన్యుణ్ణి!
అరే !ఇదేమిటి?
నామీద కట్టెలు పరిచేస్తున్నారు?
నాకెవ్వరూ కనపడటం లేదే!
నేతిధారలు నామీద కుమ్మరించేస్తున్నారు
నిప్పుల్లో కాల్చేస్తున్నారు
అరెరే!అదేమిటి?
ఇంతసేపూ నా చుట్టూ గుమిగూడిన
అభిమానులు,
ఆప్తులు,స్నేహితులు ఏరీ!
నిమిషాల్లో నన్ను చుట్టు ముట్టిన ఈ మంటల్లో
ఒంటరిగా
విడిచిపెట్టి అలా
వెళ్ళిపోతున్నారేమిటి?
వెనుదిరిగైనా చూడటం లేదే!
మాటల సవ్వడి
అడుగుల చప్పుడు
అన్నీ క్రమ క్రమంగా
దూరమై పోతున్నాయేమిటి?
నా శరీరం కూడా
దహించుకుపోతోంది?
ఇదేమిటి?
నాలో నుంచి ఏదో ఎగిరి వెళ్ళిపోతోంది?
నాతో పాటూ
కాలదా!
నా వెంట రాదా!
ఏమిటో!ఏదో ఆఖరి సందేశం అందిస్తున్నట్టుందే!
చివరి సందేహం
తీరుస్తున్నట్టుందే!
అర్థమౌతోంది
నీ మంచిచెడులు
పాపపుణ్యాలు లెక్క కట్టి
మరో జన్మలో
మరో శరీరంతో
నిన్ను చేరుకుంటాను
అంతవరకూ సెలవిక
అంటూ నా ఆత్మఘోషకు
నా చివరి ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా
సుదూరంగా
ఘంటసాల గారి గొంతు వినపడుతోంది...
“ నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః || ”
ఇది వింటూ
అవగతం చేసుకుంటూ
చివరి సత్యాన్ని వింటూ
చివరి వీడ్కోలు తీసుకుంటూ
వెళ్ళివస్తాను
ఇక సెలవు.
ఈనాడు
రామోజీరావు గారి
అంత్యక్రియలు ఆద్యంతం వీక్షించిన నా మనోభావాలు
అక్షర రూపంలో...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.6.2024
ఆదివారం
79.*బాబో(లే)!బాబా!*
ఫిబ్రవరి 2 బోలే బాబా ప్రసంగసభలో జరిగిన త్రొక్కిసలాట నేపథ్యంలో మరణించిన వారి మృతికి సంతాపసూచకంగా వ్రాసిన కవిత
122 మంది మృతి
ఎక్కడ?ఎప్పుడు?ఎలా?
ఈ దుర్ఘటనకు కారణం ఏమిటి?
ఉగ్రవాదుల దుశ్చర్యా! కాదు
ప్రకృతి వైపరీత్యమా! కాదు
కులాల కుమ్ములాటా! కాదు
సరిహద్దుల్లో శత్రుసైనికుల చేతిలో
హతమారిన వార్తా !కాదు
రైలు దుర్ఘటనా!కాదు
విమాన ప్రమాదమా! కాదు
రహదారిపై వాహనాలు ఢీకొన్న సంఘటనా! అంతకన్నా కాదు
ఇంతకన్నా మించిన ముప్పు
మరింకేమై ఉంటుందబ్బా !
అని అనుకుంటున్నారా!
ఇది వీటన్నిటికీ
అతీతమైనది
దేశాన్ని పట్టిపీడిస్తున్న
పెద్ద సమస్య
ప్రధాన సమస్య
మానవాళి ఎదుర్కొంటున్న
పెను సవాలు
అదే మతమౌఢ్యం
భగవంతుణ్ణి వదిలేసి
బాబాలను, స్వామీజీలను, పాస్టర్ లను,పకీరులను
ఆశ్రయిస్తున్న
భక్తుల వేలంవెర్రికి
చెల్లించుకుంటున్న మూల్యం
తామే సాక్షాత్తూ
భగవత్ స్వరూపులమని
నమ్మబలుకుతున్న
ఇలాంటివారి మాయలో పడటమనే
మానసిక దౌర్బల్యం
తన ప్రవచనామృతంతో
తరింపజేసి
వెళ్ళిపోతున్న
ఒక బాబా పాదధూళిని
కళ్ళకద్దుకోవటానికి
జరిగిన త్రొక్కిసలాట ఫలితం
ప్రస్తుతం మనది
బాబాల రాజ్యం
ఈనాడు బాబా అంటే
గోచీ పెట్టుకుని
మూల కూర్చుని
ముక్కు మూసుకుని
మౌనాన్ని ఆశ్రయించి
తన లోకంలో తానుండే రమణ మహర్షివంటి
యోగులు కారు
కోట్ల కొలదీ ఆస్తులు
లక్షల్లో భక్తులు
వేలాదిగా ఆశ్రితులు
వందలాదిగా శిష్యులు
పదుల్లో ఆశ్రమాలు
ఇవన్నీ ఉన్నవారే
ఈనాటి బాబాలు
గజనీ గోరీ చంగిజ్ ఖాన్ తామర్లేను
ఎవడైతేనేం
ఒక్కొక్కడూ మహా హంతకుడు అని శ్రీశ్రీ చెప్పినట్లుగా
ప్రజల అజ్ఞానాన్ని
సొమ్ము చేసుకునే
ఇలాంటి దొంగబాబాలంతా
తమ పాదధూళి రేపిన
దుమ్ము మాటున
ఇలా కాలానికి కత్తుల వంతెన పరుస్తూనే పోతుంటారు
కనీసం స్త్రీలు శీశువుల
ఆర్తనాదాలకు కూడా చలించని ఒక
తాదాత్మ్య స్థితిలో
భగవంతునితో మమేకమై ఉన్న
వారి తప్పు,ప్రమేయము ఏమీ లేదని పోలీసులు,కోర్టులు తేల్చేసేదాకా
ఇదంతా మృతుల కర్మఫలమని సామాన్యులు
సమాధానపడేదాకా
నాలుగు రోజుల పాటు
ఎక్కడో అజ్ఞాతంలో
సమాధి స్థితిలో ఉంటే పోదా!
మళ్ళీ త్వరలో మంచిరోజు రాదా!
బాబాల అండ, ఆశీస్సులు లేకపోతే
బ్రతకలేని మనం
అంతవరకూ మరుగున ఉన్న
మరొక బాబాను భగవంతుణ్ణి
చేయడానికి సిద్ధమవుదాం
అయినా మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నంత కాలం
ఈ దేశంలో
బాబాలకేం కొదవ?
అంతేగా! అంతేగా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.6.2024
గురువారం
80.*ఏ(కాంత)ముంది?*
నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు
అని ఎందుకలా ఏడుస్తావు?
నన్ను
నువ్వెప్పుడైనా పట్టించుకున్నావా!
అని నిలదీసింది ఆరోగ్యం
నా మీద ఎవరికీ ప్రేమ లేదు
అని ఎందుకలా వాపోతావు?
ప్రేమ పరిధిని విస్తరించి చూడు
అన్నది సేవా ధర్మం
నా భావోద్వేగాలను ఎవ్వరూ చదవడం లేదు అని
ఎందుకలా మథనపడతావు?
నన్ను చదవటం ప్రారంభించు అన్నది పుస్తకం
నన్నెవ్వరూ గుర్తించటం లేదు అని
ఎందుకలా బాధపడతావు?
నీలో ఉన్న సృజనాత్మకతను గుర్తించు అన్నది సాహిత్యం
నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అని
ఎందుకలా బుర్రపాడుచేసుకుంటావు ?
నన్ను అర్థం చేసుకుని
ఆస్వాదించు
అన్నది ఏకాంతం
నా మనసుకు శాంతిని ఇచ్చేవారే లేరు అని
ఎందుకలా కన్నీరు పెడతావు
నీడలా నిన్ను నేను
వెన్నంటి ఉంటున్నాను
గుర్తించే ప్రయత్నం చెయ్యి
అన్నది దైవం
వరాన్ని శాపంగా భావిస్తున్న నా
ఆలోచనలను అదుపులో పెట్టుకుంటూ
జీవితం విలువ తెలుసుకుంటూ
బ్రతుకులోని పరమార్థాన్ని అవగతం చేసుకుంటూ
నడవడం ప్రారంభించాను
......
*నా ఏకాంతం లోకి*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
12.7.2024
శుక్రవారం
81.ఆ నలుగురూ ఏరీ!
ప్రభూ!
అన్ని బంధాలు
తెంచుకుపోయే
ఆ ఆఖరి క్షణాలలో
కడసారి చూపుకు నోచుకోని
కన్నీటి నివాళి ఇవ్వలేని
కాటివరకైనా తోడు నడిచి సాగనంపే నలుగురు ఆత్మీయులు లేని
ఈ దుర్భర మరణాలు
ఇంకచాలు స్వామీ
మరణం ఒంటరిదే
కానీ మనిషి ఒంటరి కాడుగా
ఎందరో ఆత్మీయులుండీ
ఎవ్వరూ లేని
అనాథ ప్రేతాలుగా
తరలిపోతున్న
వైనాన్ని చూసి
కడుపు తరుక్కుపోతున్నది
గుండె చెరువై పోతున్నది
మాలో కాస్తోకూస్తో
మిగిలిఉన్న
ఆ పాటి
మానవత్వమైనా
నిలుపుకునే
అవకాశాన్ని
మాకు దూరం చేయకు
కనికరించు
కరోనా విముక్తి కలిగించు
కరోనా నుండి కోలుకుంటున్నానని నిన్నమొన్ననే చెప్పిన సాహితీ మిత్రులు PV కృష్ణ గారు అంతలోనే అపమృత్యు పాలయ్యాడని విని వారికి మనసులోనే నివాళులు అర్పిస్తూ.. ఆవేదనతో...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.07.2020.
82.*మేలు(తెలుసు)కో*
పంచభూతాలు
కన్నెర్ర చేయనంతవరకే
ప్రపంచంపై
మానవుడి ఆధిపత్యం
నన్ను ఆక్రమించేపాటి వాడివా నువ్వు అంటూ ప్రకృతి
వికటాట్టహాసం చేస్తూ
విరుచుకు పడిందా!
బిక్కమొహం వేసుకుని
దిక్కులుచూస్తూ
దాక్కునే తావు వెతుక్కోవలసిందే !
మానవ ప్రయత్నం ఉంటేనే కదా!
దైవం అనుకూలించేది
కానీ ప్రకృతి
ఎన్ని హెచ్చరికలు జారీచేసినా
ఎన్ని ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నా
అజ్ఞానం వీడని మనిషిని
ఆ పరమాత్ముడైనా
ఎలా కాపాడగలడు?
చక్కెరవ్యాధి
శరీరాన్ని తినేసినట్లుగా
మన నిర్లక్ష్యానికి మూల్యం
ఇదిగో
అప్పుడప్పుడూ
ఇలా చెల్లించుకుంటుంటాం
విజయవాడ వరద నేపథ్యంలో రాసినది
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.9.2024
83.*అక్కా!ఎందుకిలా వెళ్ళిపోయావ్!*
అక్కా!
అప్పుడే నువ్వెళ్ళి
నాలుగురోజులు అయిపోయింది
నువ్వెళ్ళిపోయావన్న వార్త మాత్రం
ఇంకా నమ్మశక్యం
కాకుండానే ఉంది
మావారి
స్నేహితుడి భార్యగా పరిచయమయ్యావ్
అభిమానం చూపించి ఆకట్టుకున్నావ్
ఆత్మీయత కురిపించి అక్కవయ్యావ్
ముప్పై అయిదేళ్ళ మన అనుబంధం
అరమరికలు లేని
మన స్నేహం
అన్నీ వదిలేసి
హఠాత్తుగా
అర్థాంతరంగా
ఇలా ఎలా వెళ్ళిపోగలిగావు?
ఇక
మంచంలో ఉన్న మీ మామగారిని
చంటిపాపలా
సాకేదెవరు?
భర్తను కోల్పోయిన
నీ కూతురి
కష్టాన్ని మరపించి
కాపాడుకునేదెవరు?
ఈ మనిషికి
ఏం తెలియదు జ్యోతీ!
అంటూ వెనక ఉండి నువ్వు నడిపించిన
నీ మనిషినిక చూసుకునేదెవరు?
కడుపేదరికాన్ని దాటి
కష్టాలన్నీ అధిగమించి
కలల గూడు ఏర్పరచుకున్నావు
కన్నకొడుకుల ఆదరణలో
కమ్మగా సాగిపోతున్న జీవితాన్ని
అర్థాంతరంగా ముగించి
అలా ఎలా వెళ్ళిపోయావ్?
చదువుకోని నీకు
ఉన్నత చదువులు చదివి
ఉద్యోగస్తురాలినైన నాకు
ఈ స్నేహం కుదరటం
ఇంతలా అల్లుకుపోవటం
పల్లెలోని వాళ్ళకే కాదు
మనలో మనకి కూడా
ఆశ్చర్యమే
నీ మంచి తనమే అంటూ నువ్వు
నీ సహృదయతే అంటూ నేను
ఒకరికకరం చెప్పేసుకుని
సరదాగా నవ్వుకుని
సంబరపడిపోయేవాళ్ళం
ఊరికి రాగానే
ఉన్నపాటున
నీ దగ్గరకు వచ్చేసేదాన్ని
అల్లంత దూరాన
నన్ను చూడగానే
ఆనందంతో వెలిగిపోయే నీ ముఖం
ఇంకా నా కళ్ళల్లో
మెదులుతూనే ఉంది
ఇద్దరమూ కలిసి
ఎన్ని సంతోషాలు పంచుకున్నామో!
ఎన్ని కష్టాలు
కలబోసుకున్నామో!
ఒకరినొకరం
ఓదార్చుకుని
ఎన్ని బాధల బరువులు దించుకున్నామో!
మీ ఇంటికి రాగానే
అరిసెలు కజ్జికాయలు
కారప్పూస
కాఫీ టీ కూల్ డ్రింక్
అంటూ
అవి తిను
ఇది తాగు అంటూ
ఉన్న ప్రేమనంతా కురిపించి
ఉక్కిరిబిక్కిరి చేసే
ఆ అభిమానం
నాకు
ఇంకెక్కడ దొరుకుతుంది?
రోడ్డుకి ఆవైపు
ఒక బజారు అవతల ఉండే మా ఇంటికి
ఒక్కదాన్నే ఒక్కసారైనా పోనిచ్చావా!
ఉండమ్మాయ్ !
ఆడదాకా నేను కూడా వస్తా అంటూ
వెంట వచ్చి దింపే నిన్ను మరిచిపోగలనా!
వెళ్తూ వెళ్తూ
త్రోవలో
మీ చిల్లర కొట్టులో
వేరుశనగ ముద్దలు
ఉప్పు శెనగలు
ఏవేవో పొట్లం కట్టి
చిన్నపిల్లలకు ఇచ్చినట్లు ఇచ్చిపంపే
నీ ముచ్చట
నేను మరువగలనా!
నా వెనకే నీడలా నడిచిన
ఆ అడుగులేవీ!
ఇక మీ బజారుకి ఏమని రాను?
ఎవరికోసం రావాలి?
కనీసం ఊహకు కూడా అందని
అనుకోని ఈ ప్రయాణం ఏమిటి?
అసలెందుకు వెళ్ళిపోయావ్ అక్కా!
రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తానంటూ
పనికని బయల్దేరి
ఇలా వెళ్ళిన నువ్వు
గంటలోనే
అలా అచేతనంగా
ఇంటికి చేరుకోవటం
మేమింకా జీర్ణించుకోలేక పోతున్నాం
దైవాన్ని నమ్మిన దానివి
ఎంతో దయామయివి
ఎవ్వరినీ నొప్పించని దానివి అని
ఇంతకాలం అనుకున్నాను గానీ
నువ్వింత కఠినాత్మురాలివని
కలలో కూడా ఊహించనేలేదు సుమా!
ఏమంత వయసైపోయిందని
ఏమంత ముంచుకు పోతోందని
ఇంత తొందరగా
ఇలా వెళ్ళిపోయావ్?
ఇకపై
నీ జ్ఞాపకాలలోనే బ్రతకమని శాసిస్తున్నావా!
నీ కూతురి దుఃఖం చూసి
మాకే కడుపు తరుక్కుపోయింది
నీ కన్నపేగు కదలలేదా అక్కా!
ఎందుకిలా చేశావ్?
ఎందుకిలా వెళ్ళిపోయావ్?
మే 1 వ తేదీన ఈ లోకాన్ని విడిచి
వెళ్ళిపోయిన
స్నేహితురాలు *కనపర్తి సువార్త* కు
కడసారి
కన్నీటి నివాళులు అర్పిస్తూ
స్నేహితురాలు
*జ్యోతి*
4-5-2024
శనివారం
84.*రంగే(యా)లా!*
నా
బాల్యాన్ని ఆనందించాను
యవ్వనాన్ని
ఆస్వాదించాను
మధ్యవయసు దాటి
ముదిమి వైపు
అడుగులేస్తున్న ఈ వయసుని మాత్రం
హుందాగా
ఆహ్వానించలేకపోతున్నాను
వయసు
మీద పడుతోందని
పండుతోన్న తల
ప్రకటిస్తున్న వాస్తవాన్ని
అంగీకరించగలగడం
అది ఒక
సాహసోపేతమైన నిర్ణయంగా
అనిపిస్తోంది
పెరిగిన ఒంటిని
తరిగిన ఓపికని
తరుముతున్న అనారోగ్యాలను
చక్కదిద్దుకోవాలనే
శ్రద్ధను పక్కకు నెట్టి
కేవలం
నల్లని రంగుపులిమి
చెల్లిన వయసును
మళ్ళించేయగలననే
భ్రమను మాత్రమే
బ్రతికించుకుంటున్న
నా అవివేకాన్ని
నేనే సమర్థించుకోలేక
ద్వైదీభావంతో
సతమతమైపోతున్నాను
భగవంతుడిచ్చిన
నా జ్ఞానమనే విభూతిని ప్రదర్శించాలనుకునే నాకు
అరవై ఏళ్ళ వరకూ
ఆయనే ఇచ్చిన
అపురూపమైన
ఆయువుకు ఆనవాలైన
ఈ ఫలిత కేశాలను మాత్రం
కప్పిపుచ్చేయాలనే
అజ్ఞానం ఎందుకు?
అనే ఆలోచనల
పర్యవసానంగా
బాహ్యసౌందర్యమనే
నల్లనిభ్రాంతిని
కడిగేసి
అంతస్సౌందర్యమనే
స్వచ్ఛమైన తెలుపును
అలవాటు చేసుకోమంటూ
అంకురిస్తున్న
ఈ ఆత్మ ప్రబోధాన్ని
అమలుచేసే
నా ప్రయత్నంలో
జుట్టుకు రంగువేసుకున్న
మా ఆయన పక్కన
నేను పెద్దదానిలా కనిపిస్తానేమో!
పదిమందిలోకి వెళ్ళినప్పుడు
నా వయసు తెలిసిపోతుందేమో!
అనే
ప్రలోభాలకు
లోనుకాకుండా
*Aging gracefully*
అనే
ఆత్మవిశ్వాసం
ఇప్పుడు
నాకు అత్యవసరం.😍
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.10.2024
ఆదివారం
తలకు రంగు వేయడం
ఇక మానేద్దామన్న నా ఆలోచన లోనుంచి పుట్టిన కవిత ఇది.
85.*సత్య (సం) భాషణం*
వాత్సల్య పూరితమైన
వారి పలకరింపు
మా నాన్నగారు ఇంకా నాతోనే ఉన్నారనే సంతోషాన్నిస్తుంది
ఆప్యాయతతో నిండిన వారి ఆదరణ
నా బాగోగులు
చూసుకోవడానికి
మూడవ అన్నదమ్ముడిని
ఆ స్వామి
అచ్చంగా నా కోసమే
పంపించాడనిపిస్తుంది
సరదాగా నవ్వుతూ
వారు మాట్లాడుతున్నంత సేపూ
బాల్యమిత్రుడు మళ్ళీ
స్నేహ పరిమళాలు
పంచడానికి
వచ్చాడనిపిస్తుంది
ప్రాణాలే పోతాయనుకున్న
నా కష్టాన్ని
కనుచూపుమేరలో
కనపడకుండా
తరిమేసినప్పుడు
మనసారా నమ్మడం తప్ప
ఏ సాధనలు చేశానని
ఇంతటి అభిమానం చూపిస్తున్నారు అనిపిస్తుంది
తెలిసీ తెలియక చేసే
ప్రతి తప్పునీ చక్కదిద్దాలనే బాధ్యతను తనపై వేసుకునే
అవ్యాజమైన ఆ శిష్యవాత్సల్యాన్ని చూసి
ఎప్పటికైనా పరీక్ష
పాసై
గురువుని మెప్పించగలనా
అని దిగులువేస్తుంటుంది
ప్రేమంతా కళ్ళతోనే
కుమ్మరిస్తూ
సమ్మోహనమైన చిరునవ్వుతో నావైపు చూస్తూ
నాతో మాట్లాడుతున్నప్పుడు
సాక్షాత్తూ ఆ తిరుమల శ్రీనివాసుడే
నన్ను అనుగ్రహించడానికి
నా కోసం
నా ఇంటికి వచ్చేశాడు
అని అనిపించి
మనసు ఆనందంతో గంతులువేస్తుంది
ఇది మౌన భాషణం
మనసులో భాషణం
ఇదంతా *సత్య*మే
సింహాద్రి జ్యోతిర్మయి
23.10.2024
బుధవారం
86.*ఓటేశాను*
చిన్నప్పటినుండీ
అమ్మకు నచ్చిన బట్టలు
నాన్నకు
నచ్చిన చదువులు
అన్నదమ్ములు అంగీకరించిన స్నేహాలు
భర్తకు నచ్చిన నిర్ణయాలు
నాకు నచ్చినా నచ్చకున్నా
అన్నిటికీ తల ఒగ్గుతూ
అన్నిటికీ రాజీపడుతూ
నాకంటూ ఒక అభిప్రాయం
,ఇష్టానిష్టాలు లేవా!
అని మనసులోనే మథనపడే
నా జీవితంలో
నీకు స్వేచ్ఛను ,గుర్తింపును
నేనిస్తాను అంటూ
ఐదేళ్ళకోసారి
వస్తాయి ఎన్నికలు
ఇందులో కూడా
ఎన్నో ప్రలోభాలుంటాయి
ఊగిసలాటలుంటాయి
మొహమాటాలుంటాయి
అయినా ఆ గదిలోకి వెళ్ళగానే నాకు నా వ్యక్తిత్వం గుర్తుకొస్తుంది
నా బాధ్యత వెన్నుతడుతుంది
నా స్వేచ్ఛకు రెక్కలొస్తాయి
వేలిమీద పడ్డ సిరా చుక్క
దేశమాతకు మచ్చ పడనీయద్దు
దేశ భవితకు ముప్పు రానీయద్దు
అని హెచ్చరించినట్లు అనిపిస్తుంది
అంతే
నా మనసుకు నచ్చినట్లుగా
నా వివేకం చెప్పినట్లుగా
నడుచుకుంటాను
స్వేచ్ఛగా నా ఓటుహక్కును
వినియోగించుకుని
విజయగర్వంతో
ఆత్మవిశ్వాసంతో
ఆ గదినుండి
బయటకు వస్తాను
ఓటు నా హక్కు
ఓటు నా ఆత్మగౌరవం
ఓటు నా త్రివర్ణపతాకానికి
నేను సమర్పించే పూజా పుష్పం
*జై భారత్*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.5.2024
87.*సాగరతీరంలో ఈ సాయంకాలం*
విశాఖపట్నం
రామకృష్ణా బీచ్
ఎప్పుడో ఏడేళ్ళ వయసులో కాబోలు
తనతో ఆడుకున్నాను
మళ్ళీ ఇప్పుడు
తననోసారి చూసివద్దామని వెళ్ళాను
ఇన్నేళ్ళు గడిచిపోయినా
తను నన్ను మరచిపోనేలేదు
50 ఏళ్ళ తర్వాత
కనిపించిన నన్ను
అల్లంత దూరం లో
చూడగానే
కెరటాల
చేతులు చాచి
ఆహ్వానించింది
నురగలుగా పాదాలను
తాకి పలకరించింది
నా సంతోషాల
శుభవార్తలు చెప్పగా విని
ఉప్పొంగింది
నా కష్టాలు అడిగి తెలుసుకుని
నా ఉప్పదనం కంటే
నీ కన్నీటి ఉప్పదనం
తక్కువేలే అని
ఓదార్చింది
నా ఘోష కంటే
నీ గుండెఘోష
అల్పమేలే
అని నచ్చచెప్పింది
ఎగసిపడే నా అలలకంటే
నీ అనుభవాల చేదు
ఏమంత ఎక్కువ కాదులే
అని సర్దిచెప్పింది
విరిగిపడే నా
కెరటాల కంటే
నీ అవమానాలు
క్షణికమేలే
అని నవ్వేసింది
అలా ఎంతసేపు
తన ఎదుట కూర్చుని
ఊసులాడానో!
కాలమే తెలీలేదు
చిరు చీకట్లు
అలముకుంటున్నాయని
వెనుదిరిగి వచ్చేస్తుంటే
పాదాలను చుట్టుకునే పసిపాపలా నన్ను
విడలేక విడలేక
వీడ్కోలు పలికింది
వెళ్ళిపోతూ
ప్రాణమాగక
ఒక్కసారి
వెనుదిరిగి చూశాను
ఇంకోసారి మళ్ళీ
నాకోసం
వస్తావు కదూ! అని
అడుగుతున్నట్లు
అనిపించింది
నాకెంతో మనశ్శాంతిని
ఇచ్చి
అందమైన నా సాయంత్రాన్ని
అలరించిన
ఎంతసేపు చూసినా
తనివితీరని
విసుగనిపించని
అద్భుతం
*సముద్రం నా నెచ్చెలి*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.2.2024
*ఏ (డా) ది ?*
అమ్మా!
అప్పుడే నువ్వు వెళ్ళిపోయి ఏడాది
తిరిగి వచ్చింది
అయినా నీ జ్ఞాపకాల
చెమ్మ మా కంటిని తడుపుతూనే ఉంది
డైనింగ్ టేబుల్ దగ్గర
నలుగురం కూర్చుని
నాలుగు ముద్దలు తినేవేళ
నీ ఊసుల మాధుర్యాన్ని కూడా మా నాలుక
చవిచూస్తూనే ఉంది
బాల్కనీలో
మక్కువతో నీవు పెంచుకున్న పూల మొక్కలు
ప్రతిరోజూ పుష్పించి
నీ చూపుల పలకరింపు కరువై
సాయంత్రానికి దిగులుతో వాడిపోతున్నాయి
నాన్న దూరమైన చింతను
తమ్ముడి అకాల మరణాన్ని
తట్టుకుని
మాకోసం ధైర్యం కూడగట్టుకుని
నిలుచున్న నువ్వు
ఎదలోపల ఒంటరితనంతో ఎంత పోరాటం చేశావో
బాధల బరువును ఎలా మోశావో
ఆటుపోట్లను తట్టుకుని
మాకోసం స్థిరంగా ఎలా నిలిచావో
పసివారుగా ఆనాడు
మేమెరగకపోయినా
ఈనాడు తలచుకుని
అబ్బరంగా మమ్మల్ని పెంచిన నీ నిబ్బరానికి
ఇప్పుడు అబ్బురపడుతున్నాము
కడుపారా కనటమే కాదు
కళ్ళల్లో పెట్టుకుని సాకి
నాన్న ప్రేమను కూడా నువ్వే పంచి
మా జీవితాలను
తీరుగా తీర్చిదిద్దిన
నీ అమ్మతనానికి
ఏమిచ్చి ఋణం
తీర్చుకోగలం?
మా జీవితాలలో బిజీ అయిపోయి
మా పిల్లల వ్యామోహంలో పడి పోయి
నువ్వు మమ్మల్ని ఒకసారి రమ్మని పిలిచినప్పుడు
అశ్రద్ధతో
ఎన్నోసార్లు
అటు వెళ్ళిపోయామే
అన్న వేదన
ఈనాడు మనసుని కాల్చేస్తోంది
అది
అమ్మకేమవుతుంది?
అమ్మ బాగానే ఉంటుంది
మామయ్య నిన్ను
ఎంతో బాగా చూసుకుంటున్నాడు కదా
అన్న భరోసానే తప్ప
నీ మీద ప్రేమ లేక కాదమ్మా!
బహుశా
నీ బేలతనాన్ని ఏనాడూ మా ముందు ప్రదర్శించని నీ గుండె దిటవు
మాకు నీపై ఆ నమ్మకాన్ని పెంచి
తానెంత బాగానే ఉన్నా
అమ్మకు పిల్లల్ని చూసుకోవాలనే ఆరాటం ఉంటుందన్న
వాస్తవాన్ని విస్మరించేలా చేసింది
మమ్మల్ని
క్షమిస్తావు కదూ!
నీ రక్తాన్ని పంచుకున్న మాకు
నీ హుందాతనాన్ని
నీవు లేవన్న నిజాన్ని
భరించి
నీ జ్ఞాపకాలు మా కంటిలో కన్నీటిబిందువులు కాకుండా
చిరునవ్వుల పువ్వులు గా ధరించే
శక్తిని
మాకివ్వమ్మా!
మా జీవితం
నువ్వు నిర్మించి ఇచ్చిన పూల పొదరిల్లు
*మా అమ్మ
ఒక అందమైన జ్ఞాపకం*
మనవలను మనవరాళ్ళను
మునిమనుమలను కూడా చూసి
అందరి మన్ననలు,
అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళ అభిమానాన్ని కూడా పొంది
పరిపూర్ణమైన
సంతృప్తికరమైన జీవితాన్ని గడిపి *దేవ* దేవుని సన్నిధిలో సేదదీరుతున్న *మణి* వి నీవు
నీ ఆశీస్సుల వర్షం
అనునిత్యం మమ్మల్ని
అభిషేకిస్తూనే ఉందమ్మా!
నిన్ను మరువలేని
నీ పిల్లలు
*సుజాత*
*వసుంధర*
*మంజు*
ఈ రోజు పెద్దక్క సంస్మరణ సభలో భావోద్వేగ పూరితమైన మంజూ మాటలు నాలో కలిగించిన స్పందనకు అక్షరరూపం
అక్కతో నాకు కూడా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ...
సింహాద్రి జ్యోతిర్మయి
27.12.2024
శుక్రవారం
89.మూడు ముళ్ళతో
ముప్పై మూడేళ్ళ నడక
వైవాహిక జీవితం
ముప్పై ఏళ్ళ పాటు
నల్లేరు మీద నడకలా సాగాక
ఈ మూడేళ్ళ నుండీ
దాదాపుగా
ప్రతీ అనుభవం
పల్లేరు కాయల మీద
పాదం మోపినట్లే
కష్టాల ముళ్ళు
కస్సున మనసులో దిగిపోతున్నాయి
అడుగు తీసి అడుగు వేయాలంటేనే
భరించలేని బాధ
కన్నీరు పెట్టిస్తోంది
గతంలో చేసిన పొరపాట్లకు మూల్యమో
తొందరపాటు నిర్ణయాల ఫలితమో
అధికమైన
భరోసాకు
ఆఖరి పర్యవసానమో
కారణమేదైనా కానీ
అనుమానం
అవమానం
తిరస్కారం
అవహేళన
నమ్మకద్రోహం
నమ్మని నైజం
షడ్రుచుల జీవితంలో చేదు
నేడు మోతాదు మించింది
కని పెంచుకున్న మా
ప్రేమ పావురం
రెక్కలొచ్చి గూడును వీడి
ప్రేమను వ్యక్తం చేయలేని
నిస్సహాయతలో
చిక్కుకున్నాక
కొన్ని అపురూపమైన బంధాలు
నామమాత్రమయ్యాయి
అసలు కన్నా కొసరు
అపురూపమై
చిటికెడు చిన్నారి మమత కోసం
గుప్పెడంత తాత గుండె
తహతహలాడిపోతోంది
వృద్ధాప్యానికి
ఊతమెవరౌతారన్న ప్రశ్న
రాత్రింబగళ్ళు వెంటాడుతోంది
వినా దైన్యంగా గడవని బ్రతుకులో
వ్యాధుల అంపశయ్య పై
వార్ధక్యం ఒరగకుండా
కనీసం
అనాయాస మరణమైనా ఇమ్మని
ఆశ
పరమేశ్వరుని ప్రాధేయపడుతోంది
జతగా సాగే
ప్రయాణంలో
ఎవరి అడుగు ఎప్పుడు ఆగిపోతుందో
అన్న ఆలోచన నన్ను
బేలను చేస్తోంది
ఆస్తులు
బిడ్డల తలకెత్తకపోయినా
అప్పుల బరువు
తప్పిస్తే చాలనే
ఆరాటం అధికమైంది
సొంత గూడు లేని
జీవితంలో
ఆఖరి ప్రయాణానికి
ఆశ్రయమిచ్చే
ఆప్తుల వాకిలి
ఎవరిదవుతుందో అనే
దిగులు
కారుమేఘమై
కమ్ముకుంటోంది
అంతస్తుల అపోహలు తొలగి
అమరిన ఆస్తులు కరిగి
హంగుల ఆర్భాటాలు
అంతరించాక
నక్కవినయాల బంధుత్వాల
లెక్కలు తెలిసొచ్చాయి
అయ్యో పాపం అన్నవాళ్ళ సానుభూతి ఊరటనిచ్చింది
అదరిపాటు అణగిందని
అనుకున్నవాళ్ళ
నోటి నవ్వులు
నొసటి వెక్కిరింతల
అంతరార్థం అవగతమవుతోంది
మా కన్నీటికి కదిలిపోయి
దిక్కుతోచని దశలో దిక్కయి
అండగా నిలిచిన
బంధుహితుల
ఆత్మీయత
బంధాల విలువను
తెలియజెప్పింది
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
ఆశల పల్లకీ ఎక్కించి
ఊహల తీరాలకు ఊరేగించే
మా ఆయన తోడు
రేపటిపై ఆశలనింకా
సజీవంగా ఉంచుతోంది
గురువుగారి దయా దృష్టి
గోవిందుని వరాలవృష్టి
మా జంటను
అంటిపెట్టుకుని
ఇంతకాలం ఉన్నట్లే
ఇకపై కూడా
ఉండాలని ఆశిస్తూ
ఉంటాయని నమ్ముతూ
మరో
వసంతంలోకి
అడుగు కదుపుతూ...
ఇంకో పెళ్ళిరోజును
జతగా చూసే
అదృష్టం, అవకాశం
కలగాలని కోరుకుంటూ...
సింహాద్రి జ్యోతిర్మయి
3.12.2022
90.కలలదీపం
దేవుడు పంపిన వరాలన్నీ
మూసిన గుప్పెట్లో దాచిపెట్టి
సంతోషాల వెల్లువలా
నీవు మా జీవితాల్లోకి
అడుగుపెట్టి నేటికి
అయ్యిందొక ఏడాది
ఉంగా ఉంగా అని ఊ కొడుతూ నువ్వు
ఊసులు మొదలెట్టగానే
వసంతాల కోకిల వాకిట్లోకొచ్చింది
బుజ్జితల్లీ నువ్వు బోరగిలపడగానే
తబ్బిబ్బు పడిమేము తలకిందులయ్యాము
గుర్తుపడుతూ నువ్వు కేరింతలాడితే
గుండె గూటికి వెలుగుల పండగొచ్చింది
బోసినోటిలో నీకు పన్నొకటి రాగానే
నీ నవ్వు వెలుగులో వెన్నెలొచ్చింది
నా తల్లి నట్టింట దోగాడి తిరిగితే
సిరిమహాలక్ష్మియే చిందులేసింది
పడుతు లేస్తూ నువ్వు
పట్టుకొని నిలబడితే
పట్టులంగా సొగసు ఫక్కుమని నవ్వింది
వింతలెన్నో చూపి ఎంత ఎదిగావో
ఇంతలో ఏడాది తిరిగి వచ్చింది
ప్రతిరోజు వేడుకై గడిచిపోయింది
అందాల తల్లికి ఏడాది నిండింది
నీకు
దిగులు చింతాలేని దీర్ఘాయువిమ్మని
వేవేల దేవుళ్ళ వేడుకుంటాను.
శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు
కన్నతల్లీ నీకు కళ్యాణమస్తు
అందాలపాపకు అందరి ఆశీస్సు.
సింహాద్రి
19.5.1995.
రాఖీ (కట్టని) రక్ష
రక్షాబంధనం
చేతికి కట్టుకునే రంగురంగుల రాఖీ కాదు
కన్నవారు ఇచ్చిన రక్తబంధాన్ని
కలకాలం కడదాకా
నిలుపుకునే ఆత్మీయతాబంధనం
నాకు అరవై రాబోతున్నా
ప్రేమించే
భర్త, కొడుకు కోడలు, కూతురు అల్లుడు
మనవలు,మనవరాళ్ళు
అందరూ ఉన్నా
నా కష్టం చెప్పుకోవాలన్నా
సంతోషం పంచుకోవాలన్నా
నాకు ముందుగా
నా తమ్ముళ్ళిద్దరే గుర్తుకొస్తారు
మేమెప్పుడూ
రాఖీలు కట్టుకోలేదు
రాఖీ పండుగ
శుభాకాంక్షలూ చెప్పుకోలేదు
అయినా
నా పుట్టింటి తోడు
నా తమ్ముళ్ళే
నాకు కష్టం వచ్చిందంటే
దాన్ని ఎలా తీర్చి అక్కను ఆ ఆపదనుండి బయటపడేయాలా అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తారు
తోచిన తోడ్ఫాటు అందిస్తారు
నా కనురెప్ప వెనక కన్నీరు వాళ్ళు క్షణంలో కనిపెట్టేయగలరు
నా గొంతులోని దుఃఖపుజీర
వాళ్ళు నా కంఠం వినగానే గుర్తుపట్టేయగలరు
నా మాటల్లోని నిరాసక్తతను,నిర్లిప్తతను వాళ్ళు అర్థం చేసుకోగలరు
నా ప్రతి సంతోషాన్ని వాళ్ళు మనసారా ఆనందించగలరు
నా ఆందోళనల గురించి చెప్పుకోగానే
ఓపికతో విని
నన్ను స్తిమితపరచి
మనోబలాన్ని పెంచే మాటలతో అనునయించే
పెద్ద తమ్ముడు ,
నాకు ఆరోగ్యం బాగాలేదని వినగానే ఆందోళన పడిపోయి
మరదలితో పాటుగా
అమెరికా నుంచి
రెక్కలు కట్టుకువాలిపోయిన నా చిన్న తమ్ముడు
అమ్మానాన్నలు గతించారన్న
అభద్రతను రానివ్వకుండా
చూసుకుంటున్నారు
ఆసుపత్రిలో
అన్ని వైద్యపరీక్షలు చేయించి
నాకేం కాలేదని
సంతృప్తితో నిట్టూర్చిన
వారి ప్రేమే నాకు శ్రీరామ రక్ష
మాది సినిమాలలో చూపించే
అతి ప్రేమ కాదు
అతి మామూలు ప్రేమ
నా జీవితంలో
వాళ్ళిద్దరూ లేని
ఏ సందర్భమూ కూడా
సంపూర్ణం కాదు
కాలంతోపాటు
వచ్చిచేరిన
ఏ బంధాలు కూడా
మా అనుబంధాన్ని
దూరం చేయలేదు
అవటానికి వాళ్ళకంటే
నేనే పెద్దదాన్ని అయినా
నాకెంతో తెలుసని
నేను చాలా తెలివైన దాన్నని
లౌక్యం తెలిసిన దాన్నని
అనుకునే
నన్ను
వాళ్ళ ప్రేమ మాత్రం
వాళ్ళకంటే చిన్నదానిగా
అమాయకురాలిగా
భావించేలా చేస్తుంటుంది
అయినా అది నాకు మురిపెమే
నేను ఒప్పుకోలేని నిజాల్ని
వాళ్ళు నిష్కర్షగా అయినా
అర్థమయ్యేలా
చెప్తూనే
నా పొరపాటు దిద్దుకునేలా చేయగలరు
నా విజయాలను వారు
వారి వాక్చాతుర్యాన్ని నేను
మనసులోనే అభినందించుకుంటాం
చాలా అరుదుగా అప్పుడప్పుడూ
చిన్నబుచ్చుకుంటాం
అయినా మళ్ళీ
సర్దేసుకుంటాం
ఎదుటివారే దిగిరావాలని
ఎప్పుడూ అనుకోం
అందుకే మా అనుబంధం
నిరంతరాయంగా నిత్యమూ
కొనసాగుతూనే ఉంది
నా తల్లిదండ్రులు
నాకిచ్చిపోయిన వెలలేని ఆస్తి నా తమ్ముళ్ళే
వాళ్ళు వాళ్ళ బావమీద
నేను నా మరదళ్ళమీద
ఎన్ని ఛలోక్తులు వేసుకున్నా
పాపం ఏ మాత్రం ఫీలవకుండా
మా అనుబంధాన్ని చూసి అసూయ పడకుండా
మాతో సర్దుకుపోతున్న
మా జీవిత భాగస్వాములకు కూడా కొంత క్రెడిట్ ఇచ్చేస్తూ
నా తమ్ముళ్ళిద్దరూ
నిండు నూరేళ్ళు
పిల్లాపాపలతో
సుఖసంతోషాలతో
ఉండాలని
ఈ రాఖీ పూర్ణిమ శుభవేళ
మనసారా
ఆశీర్వదిస్తున్నాను.
అక్క
సింహాద్రి జ్యోతిర్మయి
19.8.2024
ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నతో నా జ్ఞాపకాల నిధి
.........92.నాన్నతో నా బంధం......................
ఏమని చెప్పను? నాన్నతో నా బంధం.
అది జ్ఞాపకాల అలలుగా ఎగసిపడే సాగరం
కోరినవన్నీ ఇచ్చే నాన్నలు
చాలామందికి ఉంటారు
కోరుకున్నవాడిని
ఆనందంగా ఇచ్చే
నాన్నలు ఎంతమంది ఉంటారు?
కులం పట్టింపు లేకుండా
పరువుతక్కువ అని భావించకుండా
లోకాన్ని లెక్కచేయకుండా
అంగరంగవైభవంగా
నా వివాహం జరిపించి
ఆనందకరమైన జీవితాన్ని
వెలలేని కానుకగా నాకిచ్చిన
నాన్న సంస్కారం ఏమనిచెప్పను?
ఆడపిల్లలకు
అంతంతచదువులెందుకు?
అని అందరూ అంటున్న
ఆ రోజుల్లో
నాకు ఉన్నతవిద్యను
నేర్పించిన నాన్న వ్యక్తిత్వం ఏమని చెప్పను?
వీళ్ళు మంచివాళ్ళు కాదు
అని ఏనాడూ ఎవరిగురించీ
ఒక్క మాటైనా చెప్పని
నాన్న సహృదయం ఏమని చెప్పను?
అమ్మను క్షణం విడిచి ఉండని నాన్న
అమ్మ చనిపోయి మేము తల్లడిల్లుతుంటే
మీకు నేనున్నానమ్మా!అంటూ
మా కోసం జీవిస్తూ,
మీ అమ్మ చనిపోయి ఇన్ని రోజులయింది
అంటూ రోజులు లెక్కబెట్టుకుంటూ
కాలం వెళ్ళదీసిన నాన్న ప్రేమను
ఏమని చెప్పను?
కడుపుతో ఉన్న కోడలికి
కన్న కూతురిలాగా సేవలు చేసిన
ఆయన అభిమానాన్ని ఏమని చెప్పను?
నా చిన్నతనంలో
మేము డల్లాలో ఉన్నప్పుడు
నేను అన్నం తినకపోతే
సర్దార్జీలకు ఇచ్చేస్తానని
అమ్మ భయపెడుతుంటే,
అక్కున చేర్చుకుని
అభయమిచ్చిన నాన్న
కేన్సర్ వ్యాధి తో
కొద్ది రోజుల్లోనే
దూరమవబోతున్నారన్న
వార్త తెలిసి
బాధను భరించలేని
ఆయన కష్టం చూసి
దేవుడా!నాన్నను త్వరగా తీసుకుపో
అని నిస్సహాయంగా
దేవుడికి మొరపెట్టుకున్న
మా మనోవ్యధను ఏమని చెప్పను?
పెద్దతమ్ముడు గోదానం చేయగా,
అమెరికా నుండి వచ్చిన చిన్నతమ్ముడు
అనుక్షణం సేవలు చేస్తూ
నాన్నగారండీ! ఈ ఇంజక్షన్ చేస్తాను
నొప్పితగ్గిపోతుంది ,
బజ్జోండేం
అంటూ లాలిస్తుండగా
ఏ రూపంబున వ్యాధి గెల్తు....
ఎవ్వరడ్డమిక ఇవ్వ్యాధి ప్రసారోద్ధతిన్
వారింపదగు వారలెవ్వరంటూ
నేను గజేంద్రమోక్షం వినిపిస్తుండగా
పెద్దతమ్ముడి ఒళ్ళోనే
తుదిశ్వాస విడిచిన
నాన్న నిష్క్రమణం గురించి
ఏమని చెప్పను?
నాన్న నా హీరో
అన్నది
మాటవరసకు చెప్పే మాటకాదు
నేను మనస్ఫూర్తిగా అంటున్న మాట.
నాన్నగారూ!
మీ బిడ్డలమైనందుకు గర్విస్తూ
సమర్పిస్తున్న
నా జ్ఞాపకాల నివాళిని
ఈ ఫాదర్స్ డే నాడు
అందుకుని
మమ్మల్ని ఆశీర్వదించండి.
సింహాద్రి వీరభద్రాచారిగారి అమ్మాయి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
వెళ్ళిపోయిన మా నాన్నగారిని గుర్తుచేసుకుంటూ
అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
93.అడుగడుగున గుడి ఉంది
మాలాంటి మధ్యతరగతి వారికి
నెల రోజుల వ్యవధిలోనే
అమ్మాయి కి
సంబంధం మాట్లాడటం
నిశ్చితార్థం చేసుకోవటం
వైభవంగా వివాహం జరిపించటం
అన్నీ సవ్యంగా
సంబరంగా
జరిగిపోవటం
కలవరం తీరి
కల వరం గా మారటం
సాధ్యమయిందంటే
అదంతా
గ్రహ పీడలను సైతం
తొలగించి కాపాడగల
తిరుమల శ్రీనివాసుని
ఆశీర్వాద బలం
అపార కరుణావృష్టిని
కురిపించి
గురువుగారు నిర్ణయించిన
ముహూర్తబలం
అన్ని పనులు
భుజాన వేసుకుని
అండగా నిలిచి
సహాయపడిన
ఆత్మీయుల స్నేహబలం
రాత్రంతా నిద్ర మేల్కొని
సాక్షాత్తూ శ్రీ గౌరి యై
సుమూహూర్తాన్ని
జరిపించిన
అమ్మ అనుగ్రహ బలం
ఏ విషయం లోనూ
మమ్మల్ని
ఏ మాత్రం
ఇబ్బంది పెట్టని
వియ్యాలవారి
సంస్కారబలం
పిలవగానే విచ్చేసి
వేడుక కు
నిండుదనం తెచ్చి
బంధుమిత్రులందించిన
శుభాకాంక్షల బలం
మా కోసం
ఇంతమంది ఉన్నారు
అన్న సంతోషం
ఇచ్చిన ఆత్మబలం
మా కలల చిన్నారి
కళ్యాణాన్ని
జయప్రదం గా
శుభప్రదంగా
జరిపించినందుకు
ఈ వివాహ వేడుకలో
పాలుపంచుకున్న
ప్రతి ఒక్కరికీ
మనసా
శిరసా
నమస్సులందజేస్తూ
సింహాద్రి జ్యోతిర్మయి
జంగం రాజశేఖర రావు
2.5.2019
94.విషం కురిసిన రాత్రి
ఈ పూట ఎందుకో
తిలక్ గుర్తుకొచ్చాడు
కవిత్వం అంతరాంతరాలలో ఉన్న జ్యోతిస్సీమల్ని
బహిర్గతం చేయాలన్నాడు కదా!
అబ్బా!ఎంత గొప్పగా చెప్పాడు
మన కవుల గురించి
అనుకున్నాను
కానీ అంతలోనే
తమలోని
ఆ జ్యోతిస్సీమల్ని
ప్రపంచానికి పంచేస్తున్నామని
తమ కవిత్వంతో
చీకట్లను చెదరగొట్టేస్తున్నామని
స్వోత్కర్షలు చెప్పుకునే
కవులను చూసి
సరేలే
కవిత్వం బ్రహ్మాండం
ఆ మాత్రం అతిశయం సహజమేలే
అనుకుని సరిపెట్టుకుంటూ ఉండగానే
మాటలు చిమ్మిన
అహంకారపు విషాన్ని చూసి నివ్వెరపోయి
ఏహ్యపడుతున్నప్పుడు
అప్పుడు
హఠాత్తుగా తిలక్ గుర్తుకొచ్చాడు
అగ్ని జల్లటం గురించి
అమృతం కురిపించటం గురించి
చెప్పిన తిలక్
దీపం కింద కదలాడే
నలనల్లని క్రీనీడల జాడల గురించి
మాట కోరల్తో కక్కే విషాన్ని గురించి
అది ఎదుటివారి కన్నుల్లో నింపే
అవమానపు అనుభూతిని గురించి
చిన్న హెచ్చరికైనా
చేయలేదేమిటి చెప్మా!
అని అనిపించినప్పుడు
అప్పుడు
ఆ నాటి రాత్రివేళ
అవమానభారంతో చెమ్మగిల్లిన కళ్ళని
చిన్నబోయిన మోముల్ని చూసినప్పుడు
అప్పుడు
తిలక్ గుర్తుకొచ్చాడు
అగ్ని రాజుకుంటున్న
నా మనసును
అమృతపు కవిత్వంతో
అద్దుకోమని
సలహా ఇస్తున్నట్లుగా
అనిపించి
ఇదిగో ఇలా
గుప్పెడు అక్షరాలుగా
పేర్చుకున్నాను
రవీంద్ర భారతిలో సన్మానం అంటే దూరాభారాల నుంచి వచ్చిన కవయిత్రులకు జరిగిన అవమానం,తిరస్కారం కళ్ళారా చూసి,వారి కనుకొలకుల్లో కనబడిన కన్నీటి పొరను గమనించిన నా స్పందన
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.3.2024
95.*తరులతలారా! తప్పు సైరించండి*
భూమిలోకి
వేళ్ళుగా విస్తరించి
భూగర్భ జలాలు కాపాడతారు
కాలుష్యాన్ని కడుగుతూ
ఆకాశపు ఓజోను పొరను
ఛిద్రం కానీకుండా
ఆపుతుంటారు
నిప్పులు చెరిగే ఎండలకు
నీడపట్టులవుతారు
మీరు వదిలిన ఊపిరిని
ప్రాణవాయువుగా ప్రసరించి
మమ్మల్ని బ్రతికిస్తారు
పంచభూతాలను మాకు అనుకూలం చేసి
ఫలించి ఆహారమై
పుష్పించి ఆహ్లాదమై
ఎండిపోయి ఆశ్రయమై
పచ్చదనమంటే
త్యాగమని ఋజువుచేస్తూ
ఏపుగా
ఎదుగుతున్న
మిమ్మల్ని
ఒక్క క్షణపు
ఏమరపాటుతో
నిమిషాలలో
నిలువెల్లా
ఎండింపజూసిన
మా అపరాధాన్ని మన్నించండి
మా కన్నీటి ధారలతో
ఈ విషాన్ని కడిగే ప్రయత్నం చేస్తున్నాము
కనికరించి
మరలా చిగురించండి
మళ్ళీ వికసించండి
మా అపరాధభావాన్ని
మీ నవనవలతో తొలగించండి
మనసారా మన్నించండి
మనసారా మన్నించండి
క్షమస్వ త్వం
క్షమస్వ త్వం 🙏🙏
😔😔
సింహాద్రి జ్యోతిర్మయి
25.3.2025
96.*చెట్టుకి చేటు*
నా కన్నీరు
నీకు కనపడకపోవచ్చు
నా రోదన
నీకు వినపడకపోవచ్చు
నా గ్రీష్మతాపం
నీకు అర్థం కాకపోవచ్చు
కానీ ఒక్కసారి
మనసుపెట్టి తదేకంగా
నన్నుచూడు
నువ్వు సృష్టిస్తున్న
కాలుష్యం కారణంగానే
నువ్వు విస్తరింపజేస్తున్న
విషం కారణంగానే
చైత్రానికి చిగురించవలసిన నేను
ఇలా పండి,ఎండి,
ముడుచుకుని
ఆకురాల్చుకుని
అలమటిస్తున్నాను
నోరుతెరిచి
గుక్కెడు నీళ్ళు పోయమని
అడగలేకపోవడమే
నా అపరాధమా!
నోరులేని
సాటిప్రాణినన్న
సానుభూతి చూపలేవా!
నువ్వు సాకుతున్న
నీ ఇంటి చంటి బిడ్డలో
నన్ను చూడు
నేనెందుకు కృశించి పోతున్నానో గమనించు
నాకేం కావాలో
నీకే అర్థమవుతుంది
నీ సేవను నేనేం మరచిపోను
నీ ఋణం నేనేమీ ఉంచుకోను
దోసెడు పువ్వులిచ్చి
గంపెడు కాయలిచ్చి
నా జీవితాంతం నీకు
కృతజ్ఞతలు
చెల్లిస్తూనే ఉంటాను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.3.2025.
97.*చేజారిన జీవితం*
ఆమె ఒక అగ్నిశిఖ అని
అనుకుంటారు అందరూ
కానీ తాను
అగ్నిగుండంలోకి
బలవంతంగా
నెట్టబడిన సీతనని
ఆమెకు మాత్రమే తెలుసు
ప్రేమించి పెళ్ళి చేసుకున్న
భర్తతో
పిల్లలు సంసారమనే
బంధాలతో
అల్లుకున్న
సుకుమారమైన
ఆ పూలతీగను
భర్త అనే మాను
అందమైన తోటనుండి వేరుచేసి
జనారణ్యంలోకి పాకించాడు
అక్కడ ఇమడలేక ఆమె సతమతమయ్యింది
పిల్లలకు సమయం కేటాయించలేక
తల్లడిల్లింది
చదువుకు తగ్గ ఉద్యోగం
చేజార్చుకుంది
అయినా తన జీవితం
సమాజం కోసమేనంటూ
సమాధానపడింది
ఉద్యమాలకు ఊపిరయ్యింది
అండలేని అబలలకు
ఆలంబన అయ్యింది
తోడేళ్ళకు లొంగలేదు
నిందలకు జంకలేదు
అందరికీ అక్క అయింది
ఎందరికో స్ఫూర్తి అయింది
పదపదమంటూ అప్పుడు
పంపించిన మగడు
తనను
పట్టించుకోవటం లేదంటూ
నిష్ఠూరాలాడితే
మౌనంగా సహించింది
మరణశయ్యమీద ఉన్న భర్తను
కన్నతల్లిలా సాకింది
అతని నిష్క్రమణ
ఆమెకొక అశనిపాతమయింది
అయినా మేరునగమై
నిశ్చలంగా నిలిచింది
ఈ జీవితం జనం కోసమే అంకితం అనుకుంది
రాజకీయాలలో
ఎంత నిస్వార్థంగా పనిచేసినా
నిజం నిస్సంకోచంగా
నిర్భయంగా
చెప్పగలిగే ఆమె నైజం
మెప్పును మాత్రమే
పొందగలిగింది కానీ
మేలి పదవులకు
అవరోధమయ్యింది
అయినా ఆమెకు చింతలేదు
పువ్వులాంటి ఆర్ద్రత ఉన్న ఆ హృదయాన్ని
ఎవరెంతగా ముక్కలుచేసినా
ప్రతి ముక్కలోనూ
పరిమళమే వెదజల్లింది
అవమానాల ముళ్ళబాధను
పంటిబిగువున భరిస్తూ
సహజ ప్రేమ సౌరభాన్ని
వెదజల్లటం మాత్రం
ఆ మనసు
మానుకోలేదు
అందుకే
తల్లిని తూలనాడిన కొడుకుని
క్షమించగలిగింది
తల్లి కష్టం కనిపెట్టలేని కొడుకుని కూడా
అక్కున చేర్చుకుంది
స్నేహితులను
సన్నిహితులనే కాదు
సాయం కోరి తన గుమ్మంలోకి వచ్చిన
వారినెవరినైనా
లోటుపాటులెంచకుండా
కన్నీళ్ళు తుడిచి
కష్టాన్ని తీర్చింది
జనజీవనంలో
నిత్యం
అలసిపోయే ఆమె మనసు
సాహితీవనంలో సేదదీరింది
తన గుండెల్లోని
ఆర్తిని
అక్షరాలలో
ఆవిష్కరించింది
అభిమానమే తప్ప
ఆస్తులు సంపాదించుకోవాలనే ధ్యాసలేని
ఆ పిచ్చితల్లికి నేడు
చిరునవ్వు ఆభరణమే తప్ప
చిన్నమెత్తు బంగారం కూడా లేదు
ఎప్పుడూ
అధైర్యపడక
ఎంతో ఆత్మవిశ్వాసంతో
బ్రతుకును కొనసాగించిన ఆమె
ఇంతకాలానికి
ఈవేళ ఒక్కసారి
వెనక్కి తిరిగి చూసుకుంటే
ఆమెకు చేజారిన తన జీవితం మొత్తం
కమ్మిన కన్నీటిపొరల మధ్య
అస్పష్టంగా అగుపించింది
రేపటి దారి
అగమ్యగోచరం అనిపించింది
నాకెవరున్నారన్న
నిస్పృహ ఆవరించింది
అది క్షణకాలమే
అంతలోనే తేరుకుంది
తన జీవితం
నిత్యపోరాటమన్న
నిజాన్ని గుర్తించింది
అందరికీ ఆమె ఉంది
ఆమెకు మాత్రం
తన రెక్కల చాటున పొదిగి పొదువుకున్న
చిన్ని కోడిపిల్ల తప్ప
ఇంకేమీ లేదు
సమాజానికి ఆమె ధారపోసిన జీవితం
ఆరోగ్యాన్ని హరించింది
అనారోగ్యం ప్రతిబంధకమై
అడుగులకు తడబాటు తెస్తోంది
అయినా
తెచ్చిపెట్టుకున్న ఓపికతో
మనో నిబ్బరంతో
నడక సాగిస్తున్న ఆమె మనసుకు నేడున్న కోరిక ఒక్కటే
ఋణం తీర్చుకునేంత వరకు
ఆయుష్షును పొడిగించమని అవకాశాన్ని ఇవ్వమని
ఆ భగవంతుణ్ణి
మౌనంగా వేడుకోవడమే
స్వామీ!
ఆ ప్రేమరాశి
ఈ కోరికలోనూ ఇతరుల మేలే దాగి ఉంది కదా!
కనికరించు
దరిజేరే
దారిచూపించు
ఆ అరుణారుణ కాంతిని
ఆఖరి చమురు బొట్టు వరకూ
దేదీప్యమానంగా ప్రకాశింపజేయి
సింహాద్రి జ్యోతిర్మయి
26.3.2025
98.*ఆశయే (ఇం) ధనంగా*
అనంతమైన కాలం
అది అరచేతుల్లోని మంచు ముక్కలా
కళ్ళముందే
కరిగిపోతోంది
వేళ్ళ సందుల్లోని ఇసుక రేణువుల్లా
వేగంగా జారిపోతోంది
ఆంగ్ల నూతన సంవత్సరంలా
క్యాలెండర్లుగా మారిపోతోంది
తెలుగు వారి ఉగాదుల్లా
కొత్తపేర్లతో వచ్చివెళ్ళిపోతోంది
నేను మాత్రం
అత్యాశల మునగచెట్టు మీద
అలాగే కూర్చుని ఉన్నాను
ఎంత జాగ్రత్తగా పట్టుకుని కూర్చున్నాననుకున్నా
పెళుసుదనానికి
పేరుపొందిన
ఆ కొమ్మ
పడిపోకుండా
నన్నెంతకాలం
కాపాడగలదో! నాకు అనుమానమే
అయినా
వెర్రి ఆశతో
వేళ్ళాడక
తప్పదు
అంతకంటే నాకు
మరొక ఆధారమూ లేదు
అవకాశమూ లేదు
పేగుమెడకు చుట్టేసుకున్న
గర్భస్థ పిండంలా
నాకు నేనుగా
తగిలించుకు వచ్చిన
బలమైన కర్మబంధాలను
ఎలా తెంచి నన్ను గట్టెంకించాలో తెలియక
పాపం ఆ భగవంతుడు కూడా
ఒక్క అవకాశం కోసం
నిస్సహాయంగా చూస్తూ
అల్లంతదూరాన
నిలబడిపోయినట్టున్నాడు
అయినా ఎక్కడో
ఏదో తెలియని
ఆశాభావం
నిస్తేజమౌతున్న కళ్ళల్లో
మినుకు మినుకు మంటూ
ఆ స్వామి పాదాలవైపే చూస్తోంది
ఏదో ఒక అద్భుతం జరుగకపోతుందా!అని
ఏదో ఒక్క మలుపు
నన్ను కాపాడలేకపోతుందా!అని
ఆశలన్నీ రాల్చుకున్న ఈ బ్రతుకు శిశిరంలో కూడా
మళ్ళీ మొలకెత్తగలననే
చైత్రపు చిగురాశను
ఇంకా నాలో పోనివ్వకుండా
నిలుపుతున్నందుకు
స్వామీ!
నీకెలా కృతజ్ఞతలు తెలుపగలను?
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.4.2025
శుక్రవారం
99.*లడ్డూ వివాదం*
వకుళమ్మా!
విన్నావా ఈ వార్త!
మాడవీధుల్లో
పోటుప్రక్కగా వెళుతుంటే
ప్రసాదాల పరిమళం
గుప్పుమన్నట్లుగా
ఈనాడు
ఈ వార్త కూడా
గప్పుమంటోంది
ప్రకంపనలు సృష్టిస్తోంది
అదేనమ్మా!
నాలడ్డూ లో కల్తీ జరిగిందన్న వార్త
ఈ సృష్టిలో వైపరీత్యాలు
ఎన్నో చూసిన నాకు
ఇది వింతేమీ కాకపోయినా
నా లడ్డూకి అపచారమని విని
నా
భక్తులు మాత్రం పాపం
తట్టుకోలేకపోతున్నారు
తల్లడిల్లిపోతున్నారు
ఆవేశపడిపోతున్నారు
నిజానికి
సకల చరాచర ప్రాణికోటి తన
సృష్టే అన్నాడుగా!
మరి అందులో నుంచే వచ్చిన
జంతుజాల అవశేషాల్నే
తిరిగి కాస్త సమర్పిస్తుంటే
వీళ్ళెందుకిలా
గుండెలు బాదేసుకోవాలని
నీ గీతాసారానికి
వక్రభాష్యం చెబుతున్న
అక్రమార్కులను
నీవు శిక్షించలేవా స్వామీ!
అంటూ
కళ్ళనీళ్ళపర్యంతమవుతున్నారు
అయినా
ఆయనకు సమర్పించిన
నైవేద్యం ప్రసాదమని
భావించకుండా
అపవిత్రమయిందని
ఆందోళన పడిపోతూ
ఇంత రగడ సృష్టించడం ఎందుకని
వాళ్ళ
మిడిమిడి జ్ఞానాన్ని
వెలగబెడుతున్న
దుర్మార్గాన్ని
అడ్డుకోలేవా స్వామీ
అని అడుగుతున్నారు
వైరభక్తితోనే
నా సాయుజ్యం సాధ్యమన్న
జయవిజయుల కథ
బహుశా
కల్తీరాయుళ్ళకు
ఇలా
అర్థమైనట్లుందమ్మా!
తాము చేసిన పనికి
పశ్చాత్తాప పడకపోగా
వరద బురద కడుక్కోవడానికే
ఈ వివాదాన్ని లేవనెత్తారన్న
ఆరోపణలు చేస్తున్నారమ్మా!
సామాన్య భక్తులు
మాత్రం
పిలిచిన పలికేవు స్వామీ!
శిలగా నిలిచే వేమీ!
అని ఆదుర్దా పడిపోతున్నారు
ఏం చేయనమ్మా!
ఒక ప్రక్క
పాపపుణ్యాలను
కాసుల రూపంలో
జల్లెడ పట్టిస్తున్నానా!
కింద గోవిందరాజులు అన్నయ్య
లెక్కలు కడుతున్నాడా!
నువ్వు పోటు ప్రక్కనే
ఉండి
నిరంతరం పర్యవేక్షిస్తున్నావా!
దేనికైనా సమయం రావాలి కదమ్మా!
శిశుపాలుడిపై
చక్ర ప్రయోగం
చేయటానికి
నూరు తప్పుల దాకా
భరించవలసి వచ్చింది
గజేంద్రుడిని
కాపాడటానికి
వేయి సంవత్సరాలు
వేచి ఉండవలసి వచ్చింది
పాపం పరిపక్వమయ్యే వరకూ
నేనైనా మౌనంగా
ఎదురుచూడవలసిందే కదా!
కర్మ సిద్ధాంతాన్ని
వంటబట్టించుకున్న
నా భక్తులకు
నేను వేరుగా
చెప్పవలసిందేముంది?
వారి పాప ఫలితాలను
ఎన్నికల ఫలితాలుగా
ఇప్పటికే కొంత అనుభవింపజేశాను
ఇప్పుడిప్పుడే
పాపాల పుట్ట పగులుతోంది
ఒక్కో పాము బయటపడుతోంది
ఆడించే
నా లీలావిన్యాసాలను
నా భక్తులు
త్వరలోనే వీక్షించగలరు
అన్యాయాన్ని సహించాను
అక్రమాలను భరించాను
దౌర్జన్యాలను కూడా ఉపేక్షించాను
కానీ నా భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నాన్ని మాత్రం చూస్తూ ఊరుకోలేను
సర్వం తెలిసినవాడివి
మరి ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నావు స్వామీ!
అన్న నా భక్తుల సందేహానికి
నా సమాధానం ఒక్కటే
ద్రౌపది వేడుకుంటేనే చీరలిచ్చాను
ప్రహ్లాదుడు నమ్మినందుకే రక్షించాను
గజేంద్రుడు శరణంటేనే
విడిపించాను
నేడు భక్తులు మేలుకున్నారు
మొర పెట్టుకుంటున్నారు
ఇక నా విశ్వరూపం చూపి
దుష్టశిక్షణ శిష్టరక్షణ కార్యానికి
మరొకసారి ఉద్యుక్తుడినవుతాను
అదుగో అమ్మా!
వెండి వాకిలి వద్ద
గోవింద ఘోష వినపడుతోంది
సుప్రభాత సేవకు
వేళయింది
వెళ్ళొస్తానమ్మా!
నమస్సులతో
నీ బిడ్డడు
శ్రీనివాసుడు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.9.2024
100.*శ్రీవారి లడ్డూ ప్రసాదం*
కలిలో ఏకైక దైవమైన
తిరుమల వాసునిలా
ప్రసాదం అనగానే
మదిలో మెదిలే ఏకైక నామం
తిరుమల లడ్డూ
స్వామి కట్టిన
పట్టుపీతాంబరంలా
పచ్చని రంగు
స్వామిని ఆపాదమస్తకం కప్పేసిన పూలమాలల్లా
నిండైన బూందీ పలుకులు
మిలమిలా మెరిసిపోయే
ఆభరణాల సొగసులా
అడుగడుగునా తగిలే
జీడిపప్పు కిస్మిస్ యాలుకల పలుకులు
అర్ధనిమీలితమై
మరి మరి చూడాలనిపించే స్వామి వారి కనుదోయిలా
ఆకర్షించే ఆ రూపం
మధువులూరే
స్వామి మందహాసం లా
మనసును పరవశింప జేసే మాధుర్యం
స్వామి చుబుకంపై అద్దిన
పచ్చకర్పూరపు సౌరభాలను తలపిస్తూ
ఘుమఘుమలాడే కమ్మదనం
చంటి పిల్లాడిని చంకనేసుకుని జాగ్రత్తగా తెచ్చి ఉయ్యాలలో ఉంచినట్లు
తెచ్చుకున్న ప్రసాదాన్ని
పూజామందిరంలో
పదిలపరచుకోవడం
ఇరుగు పొరుగు
దర్శనం బాగా జరిగిందా
అనగానే
ఆ అనుభవాన్ని
స్వామి అనుగ్రహాన్ని కూడా
సంతోషంతో వారికి కూడా
పంచిపెట్టడుతున్నట్లుగా
అందించే ఆ ప్రసాదంలో భాగం
భక్తిగా అందుకుంటున్న వారిలో
ఆనందనిలయం గడపవద్ద నిలుచున్న పవిత్రానుభూతి
కనులకద్దుకున్నప్పుడు
స్వామి వారి పాదాలను తాకినంత తాదాత్మ్యం
వెరసి
అతృప్త్య అమృత రూపాయ
వేంకటేశాయ
అన్న మంగళాశాసనం
స్వామి వారికే కాదు
వారి
లడ్డూకి కూడా చెప్పాల్సిందే కదూ!
*ఓం నమో వేంకటేశాయ*🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.9.2024
101.సం *పూర్ణ* మైన సభలు
*ఆ* శయం ఒక్కటే అందరిదీ
*ర* క్షించాలి మాతృభాషను
*వ* రమై దొరికిన అమృత భాషను
*ప్ర* మాదమొకటి పొంచి ఉన్నది
*పం* కిలం అంటుకున్నది
*చ* వులూరే భాషకొక్క
*తె* గులువచ్చి తగులుకున్నది
*లు* ప్తమైతే మన జాగృతి
*గు* రుతు మాసేను సంస్కృతి
*ర* మ్యతరం ఆకారం
*చ* క్కనైన నుడికారం
*యి* సుమంతయు అస్పష్టత
*త* నలోపల కానరాని
*ల* క్షణమది అద్భుతం
*మ* నసారా మన భాషకు
*హా* రతులెత్తంగ మనము
*స* దా కృషిని చేయాలి
*భ* విత తెలుగుకివ్వ మన
*లు* క్కును దిద్దుకోవాలి
లుక్కు..లోపం
ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలు దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.12.2024
ఆదివారం
22.4.2025
శ్రీనగర్ లో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి
27 మంది యాత్రికులు మృతి
102.*విషాద విహారం*
ఆ సమయంలో
సుందర కాశ్మీరంలో
చలి మాత్రమే కాదు
భయం కూడా వెన్నులోంచి ఒణుకు పుట్టించింది
అక్కడ
ఎముకలు కొరికేసింది
ఒక్క చలి మాత్రమే కాదు
దూసుకొచ్చిన బులెట్లు కూడా
అక్కడ తెల్లని మంచుముక్కలకు
ఎర్రదనాన్ని పులుముతూ
రక్తప్రవాహాలు గడ్డకట్టాయి
అక్కడ
సూదుల్లా గుచ్చుతూ
కురిసే మంచుతో పోటీపడుతూ
తుపాకీ తూటాలు కూడా
నిలువెల్లా తూట్లు పొడిచాయి
ఆనందాల కేరింతలు
అసహాయపు ఆక్రందనలుగా
అరక్షణంలో
మారిపోయాయి
కాళ్ళ పారాణి తడి ఇంకా ఆరని
నూత్న వధువు మాంగల్యం
నిర్జీవమై తెగిపడగా
అప్పటివరకూ ఆమె
చెంపల్లో పూచిన
కాశ్మీరపు కుంకుమపువ్వు కెంపు
ఏడ్చి ఏడ్చి ఎర్రబారిన
కళ్ళల్లో నిండిపోయింది
గోముఖ వ్యాఘ్రాలుగా
దాపురించిన ముష్కరమూకలు
తమ కళ్ళముందే
తమ మగవారిని
చంపుతుంటే
ప్రాణాలు దక్కిన ప్రాప్తం
అదృష్టమనుకోలేక
విలవిలలాడుతున్న
ఆడవాళ్ళకు
ఉగ్రమూకలు
తమపై చూపించినది
దాక్షిణ్యమనిపిస్తుందా!
దారుణమైన చిత్రహింస తప్ప
అమ్మా !భరతమాతా!
నీ ఒడిలో సేదదీరాలని వచ్చారు
రక్తపు మడుగులతో కొందరు
కన్నీటి కాల్వలతో కొందరు
వీడ్కోలు చెబుతూ
వెళ్ళిపోయారు
కానీ అమ్మా!
కన్నీరుపెట్టకు
ఎన్ని శిరస్సులు తెగిపడినా
నీ శిరస్సును
కాపాడుకుంటాం
నువ్వు శిరసెత్తుకు
నిలిచి గర్వపడేలా
చేస్తామని చేస్తున్నాం
మరిగే మా రక్తంతో
మాతా! నీకు వాగ్దానం
ఏప్రిల్ 22 వ తేదీ
పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో
మరణించిన వారికి నివాళులర్పిస్తూ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.4.2025
103.అడుగడుగున గుడి ఉంది
మాలాంటి మధ్యతరగతి వారికి
నెల రోజుల వ్యవధిలోనే
అమ్మాయి కి
సంబంధం మాట్లాడటం
నిశ్చితార్థం చేసుకోవటం
వైభవంగా వివాహం జరిపించటం
అన్నీ సవ్యంగా
సంబరంగా
జరిగిపోవటం
కలవరం తీరి
కల వరం గా మారటం
సాధ్యమయిందంటే
అదంతా
గ్రహ పీడలను సైతం
తొలగించి కాపాడగల
తిరుమల శ్రీనివాసుని
ఆశీర్వాద బలం
అపార కరుణావృష్టిని
కురిపించి
గురువుగారు నిర్ణయించిన
ముహూర్తబలం
అన్ని పనులు
భుజాన వేసుకుని
అండగా నిలిచి
సహాయపడిన
ఆత్మీయుల స్నేహబలం
రాత్రంతా నిద్ర మేల్కొని
సాక్షాత్తూ శ్రీ గౌరి యై
సుమూహూర్తాన్ని
జరిపించిన
అమ్మ అనుగ్రహ బలం
ఏ విషయం లోనూ
మమ్మల్ని
ఏ మాత్రం
ఇబ్బంది పెట్టని
వియ్యాలవారి
సంస్కారబలం
పిలవగానే విచ్చేసి
వేడుక కు
నిండుదనం తెచ్చి
బంధుమిత్రులందించిన
శుభాకాంక్షల బలం
మా కోసం
ఇంతమంది ఉన్నారు
అన్న సంతోషం
ఇచ్చిన ఆత్మబలం
మా కలల చిన్నారి
కళ్యాణాన్ని
జయప్రదం గా
శుభప్రదంగా
జరిపించినందుకు
ఈ వివాహ వేడుకలో
పాలుపంచుకున్న
ప్రతి ఒక్కరికీ
మనసా
శిరసా
నమస్సులందజేస్తూ
సింహాద్రి జ్యోతిర్మయి
జంగం రాజశేఖర రావు
2.5.2019
104.*ఆపరేషన్ సిందూర్*
సిందూరం
రక్తచందనం
బంధూకం
సంధ్యారాగం
వెదజల్లే ఎర్రనికాంతులు
ప్రతి భారతీయుడి కళ్ళల్లో అలముకోగా
ఉగ్రవాద పులి చంపిన
అమాయకపు లేడినెత్తురు
భారతీయుల
హృదయాలను
భగ్గున మండించింది
ప్రతీకారం తప్పదంటూ
రుద్రాలిక నయన జ్వాలికయై
కలకత్తా కాళిక నాలికయై
దేశం
ఎర్రని జెండా ఎగరేసింది
సరిహద్దులలో
ఉగ్రస్థావరాలపై
విరుచుకుపడిన
సైన్యపు
వీరోచిత పోరాటంలో
గంధక ధూమం ఘాటెక్కింది
దేశభక్తి సముద్రాలు పోటెత్తాయి
విద్యుత్తేజం వికసించింది
భరతవీరుల హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషమై
ఝంఝానిల షడ్జధ్వానమై
రాబందుల రెక్కల చప్పుడుకు
చరమగీతం పాడనుంది
అహో! శ్రీ శ్రీ !
నీ నవకవిత
ఇంతటి ఉత్తేజాన్ని
నింపగలదని
ఈనాడే అనుభవంలోకి వచ్చింది
జయహో శ్రీ శ్రీ
జయహో భారత్.
జైహింద్
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.5.2025
బుధవారం
105.*వెళ్ళిరండి*
యుద్ధానికి సన్నద్ధమై పోతున్న
వీరసైనికుడి
ఆ తల్లికి తెలుసు
నేలతల్లి కోసం
వెళుతున్న
తన బిడ్డకు
నేలరాలే అవకాశం కూడా ఉంటుందని
ఆ అమ్మమ్మకు, బామ్మ కు తెలుసు
వీరుడై వెళుతున్న మనవడు
విగతజీవుడై
వచ్చే రోజు
రావచ్చునని
ఆ భార్యకు తెలుసు
సిందూర పోరాటంలో
తన నుదుటి సిందూరం
చెరిగిపోయే ప్రమాదమూ ఉందని
ఆ బిడ్డలకు తెలుసు
జెండా కోసం వెళుతున్న నాన్న
జెండాను ఒంటిమీద కప్పుకుని
వెనుతిరిగి వచ్చే వేళ రాగలదని
అయినా
కన్నీళ్ళు దిగమింగి
విజయాశీస్సులందిస్తూ
వీరతిలకం దిద్ది
దేశమాత రక్షణ కోసం
తమ వారిని పంపుతున్న
వీరమాతలకు
వీరపత్నులకు
ఏమిచ్చినా
తీర్చగలమా!
వారి ఋణం
అందుకే మనసారా
వారికి
చేయాలి వందనం
ఆ వీర సైనికులు
క్షేమంగా వెళ్ళి
విజయులై రావాలని
ఆశిద్దాం
ఆశీర్వదిద్దాం
జై జవాన్
జై భారత్
జైహింద్
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.5.2025
శనివారం
నిన్న తమ బిడ్డలను కన్నీళ్ళతో కౌగిలించుకుని,ఆశీర్వదించి వీడ్కోలు పలుకుతూ
యుద్ధానికి పంపుతున్న మహిళల దృశ్యాలను టీవీలో చూసిన తర్వాత కలిగిన భావోద్వేగం😔
106.*ఎందాక?ఎందాక? ఎందాక?*
ఎంత అవమానమైనా
భరించక తప్పదు
ఎన్ని శాపనార్థాలనైనా
సహించక తప్పదు
ఎన్ని కష్టాలనైనా
అనుభవించక తప్పదు
ఎంత బాధనైనా
ఓర్చుకోక తప్పదు
ఎంత దుఃఖమైనా
ఉపశమించక తప్పదు
ఎన్ని కన్నీళ్ళయినా
ఆగిపోక తప్పదు
ఈ హృదయానికి
తట్టుకునే శక్తి
ఉన్నంతకాలం
ఈ గుండెకు
కొట్టుకునే లక్షణం
ఉన్నంతకాలం
సింహాద్రి జ్యోతిర్మయి
13.5.2025
107.*ఖాళీ గ్లాసు*
అతను
అందమైన గాజు గ్లాసులో
మధుర పానీయం
తనివితీరా
ఆస్వాదించాడు
అతని తృష్ణను తీర్చి తీర్చి
ఆ గ్లాసు ఖాళీ అయింది
దీంతో నాకు ఇంకేం పని ?
అనుకున్నాడేమో!
కసిగా దాన్ని నేలకు విసిరికొట్టాడు
అంతవరకూ తాను
అతని అరచేతుల్లో
భద్రంగా ఉన్నానని భ్రమించి
ఆదమరచిన ఆ గ్లాసు
ఆ విసురుకు విస్తుపోతూ
ఒక్క క్షణంలో
నేలజారి
భళ్ళున బద్దలయింది
అన్ని ముక్కలైన
దాని పరిస్థితిని
ఏమాత్రం గమనించకుండా
అందులో
ఒక్క ముక్క వచ్చి
కాలిలో గుచ్చుకుని
తనకు
గాయమైందని
అతను దానిపై మండిపడ్డాడు
ఆ గాయం అతనికి
కొద్దిరోజుల్లోనే
మానిపోయింది
కానీ
గాజు గ్లాసుని
ముక్కలు చేశానన్న
పశ్చాత్తాపం మాత్రం
అతనిలో
మచ్చుకైనా కనపడలేదు
ఎందుకుంటుంది?
ఎందుకుండాలి?
మరి అది కేవలం
ఒక వస్తువే గానీ
అతనిలా
మనసున్న మారాజు
కాదు కదా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.5.2025
శుక్రవారం
108.సాలీడు
బ్రతుకు గోడను
ఆలంబన చేసుకుని
ప్రేమ అనే సాలీడు
అల్లిన
అనుబంధాల వలలో
చిక్కి
ఈగలా కొట్టుకుంటోంది
నా హృదయం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.6.2019.
Comments
Post a Comment