5.పాటల్లో పాఠాలు



బాలల దినోత్సవ శుభాకాంక్షలు

.......బంగారు బొమ్మ.........

తెల్లని పళ్ళు ముత్యాలంట
ఎర్రని పెదవులు పగడాలంట
బంగరుబొమ్మను నేనంటూ
బామ్మే ముద్దులాడేను

కలువల కన్నులు నావంట
చిలకల పలుకులు నావంట
తల్లికి దిష్టి తగిలేనంటూ
తాతయ్యెప్పుడు తలచేను

అమ్మకు నేను చందమామ
నాన్నకు నాపై ఎంతో ప్రేమ
అందరికీ నేనంటే ఇష్టం
ఆటలు పాటలు నాకిష్టం

అత్తా మామ ‌పిన్ని బాబాయ్
ముద్దాడేరు అంతా నన్ను
ఇందరి ప్రేమను ఇచ్చినందుకు
దండం పెడతా దేవునికెపుడూ

సింహాద్రి జ్యోతిర్మయి
14.11.2017.
నేను రాసిన పాటల్లో పాఠాలు అనే‌ గేయసంపుటి నుండి.



*సప్త చిరంజీవులు*

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః|
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః||

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ యథాష్టమమ్|
జీవేద్వర్షశ్శతమ్ సోపి సర్వవ్యాధి వివర్జిత||
 
అశ్వత్థామా బలియును వ్యాసుడు
ఆంజనేయుడూ విభీషణుండు
కృపాచార్యుడు పరశురాముడు
వీరేడుగురు చిరంజీవులు

పరమశివుని వరమువలన
పసివాడైన మార్కండేయుడు
ఇలలో అష్టమ చిరంజీవియై
మృతిని జయించి శాశ్వతుడాయెను


నక్షత్రాల పాటు

అశ్విని భరణి కృత్తిక రోహిణి
మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి
ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త
చిత్త స్వాతి విశాఖ యనగా

అనూరాధ జ్యేష్ఠ మూల ఆపై
పూర్వాషాఢ ఉత్తరాషాఢ
శ్రవణం ధనిష్ఠ శతభిషము
పూర్వాభాద్ర  ఉత్తరాభాద్ర
రేవతి చేర్చి ఇప్పుడు చూడు
నక్షత్రాలు ఇరవయ్యేడు
వరుసగ చెప్పు అనునిత్యం
వచ్చేస్తాయి కంఠస్థం 

నాలుగు దిక్కులు

మనకున్నవి నలుదిక్కులు
మా మంచి పిల్లలు
తెలుగు లోన వాటిపేర్లు
తెలుసుకోండి ఇప్పుడు

ఉదయించే సూర్యునకు
ఎదురుగ నువ్వు నిలబడితే
అదే తూర్పు తెలుసుకో
వందనమిడి కొలుచుకో

నీ వెనుకకు చూడరా 
ఆ దిక్కే పడమర
ఆ వైపున ఎప్పుడూ
అస్తమించు సూర్యుడు

తూర్పు కెదురు నిలువ ఎడమ
ఉన్న దిక్కు ఉత్తరం
కుడి వైపుకు తలతిప్పితె
కనపడేది దక్షిణం


దిక్కులు మూలలు 

నలుదిక్కుల నడుమ మనకు
నాల్గు మూలలున్నవి
తెలుగు లోన వాటిపేర్లు
తెలుసుకోండి పిల్లలు

తూర్పు మరియు దక్షిణం
ఆ మధ్యన ఆగ్నేయం
దక్షిణం పడమర
నడుమ వచ్చు‌ నైరుతి

పడమర ఉత్తరం
వాటిమధ్య వాయువ్యం
ఉత్తరం తూర్పు మధ్య
ఉంది చూడు ఈశాన్యం 


ఎల్లలు

నిలుచున్న భరతమాత
వంటిది మన దేశపటం
ఆ‌ తల్లిని చుట్టి ఉన్న 
అవధులేవొ అవి చూద్దాం

తూర్పు దిక్కు సరిహద్దుగ
బంగాళాఖాతముంది
పడమర ఓ పాపలార
అరేబియా సంద్రముంది 

ఉత్తరాన ఉన్న హద్దు
ఉన్నతమౌ హిమాలయం
దక్షిణాన దరి మనకు
హిందుమహా సముద్రం

మూడు దిశల సాగరం
ఒక దిక్కున భూభాగం
అమరి ఉన్న మనదేశం
ద్వీపకల్ప భారతం

ఈ నాలుగు దిక్కులందు
మనకు సహజ ఎల్లలివి
హిందుస్తాన్ ఇండియా
భరతావని మన పేర్లివి


అరిషడ్వర్గాలు

కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు

కామము రావణు నంతముజేసె
క్రోధము హిరణ్యకశిపుని ద్రుంచె
లోభము  రారాజును కూల్చె  
మోహము ధృతరాష్ట్రుని ముంచె

మదమున సగరుని సంతు నశించె
మాత్సర్యము  శిశుపాలుని చంపె
మానవజన్మకు శత్రువులారు
అదుపున ఉంచే వారే ఘనులు


అష్టాదశ పర్వాలు


ఆంధ్ర మహా భారతం
అందించిరి కవిత్రయం
ఇల పంచమ వేదమై
వెలసినదీ ఇతిహాసం 



అష్టాదశ పర్వమ్ముల
 అలరు భారతమ్మును 
నేర్పుమీర తెలియగా
నేర్చుకోండి ఈ పాట

ఆదిసభారణ్యాలు
విరాటము ఉద్యోగం
ఇవే ఇవే తొలి ఐదు
ఇదే ఆది పంచకం

భీష్మ ద్రోణ కర్ణ శల్య
సౌప్తికము మలి ఐదు
భగవద్గీతను కల్గిన
ఇదే యుద్ధపంచకం

స్త్రీ శాంతి పర్వాలు
ఆపై అనుశాసనికం 
భీష్ము మహిత సందేశం
కలిగినదీ శాంతి త్రయం 

అశ్వమేధ పర్వము
ఆశ్రమవాసం మౌసలం
మహాప్రస్థానికము
స్వర్గారోహణ పర్వం

ఇదే అంత్య పంచకం
పర్వాలిక సంపూర్ణం
అందమైన ఈ కావ్యం
ఆద్యంతం అద్భుతం


చెడును ఆశ్రయించిన
పుణ్య చరితులైననూ
అనుభవించి ఆ ఫలితం
నశియించుట తథ్యము

ధర్మాన్ని ఆచరించి
దైవాన్ని నమ్మినచో
కష్టాలను అధిగమించి
పొందగలరు సౌఖ్యము

చాటిచెప్పు నీ సత్యం
చదివిచూడు భారతం
నేర్చి నాటి గుణపాఠం
దిద్దుకొనుము జీవితం 

 



*శిరసు హృదయము ఇరుపాదాలు*
చక్కగ నేలకు తాకించాలి

*మదిలో* రూపం భావించాలి
*కన్నులు* మూసి ధ్యానించాలి

*చేతులు* తలపై ముకుళించాలి
*పెదవులు* మంత్రం జపియించాలి

కుడిఎడమలుగా
తలను తిప్పుతూ
 నేలకు *చెవులను*
ఆనించాలి 

పెద్దలపైనా గురువులపైనా పరమాత్మునిపై 
భక్తిని చాటగ
పురుషులు మొక్కే
చక్కనిమార్గం
చేయుము తప్పక 
సాష్టాంగ మిదే

చిట్టి చిట్టి పాపలు
చిన్నారి బాంబులు
ముద్దు ముద్దు మాటలతో
పాడండి పాటలు

మల్లెరంగు తెల్లన
మందారం ఎర్రన
చేమంతులు పచ్చన
చిట్టితల్లి తెలుసునా

కోకిలేమొ నల్లన
కూత ఎంతో తీయన
చిలకరంగు పచ్చన
పలుకు నీ తీరున

నీట ఈదు‌ చేపలు
నింగినెగురు పక్షులు
నేలపాకు పాములు
వింత వింత జీవులు

మీ కన్నులు మెరిసిపోవ

మా మనసులు మురిసిపోవ

అతిథి దేవోభవ
స్వాగతం శుభ స్వాగతం
మీ రాకతొ నేడు మా గృహం
అయినదయ్యా కడు పావనం

అతిథిపూజ మా భాగ్యము
స్వాగతమిదె ఆవాహనం
అలసి వచ్చినారేమో
అందుకొనుడు ఆసనం
పరమపావనమ్మగు మీ
పదయుగళికి పాద్యము
ఆశీస్సులనొసగు మీదు
హస్తములకు అర్ఘ్యము

అతిథి దేవోభవ
స్వాగతం శుభ స్వాగతం

దప్పిగొని ఉంటిరేమో
చేయుము ఆచమనీయం
మార్గాయాసము తొలగి 
శుచివగుటకు స్నానము
కలిగినంతలోన మీకు
వలువపూజ వస్త్రము
సకలశాస్త్ర సారనిధికి 
యజ్ఞోపవీతము

అతిథి దేవోభవ
స్వాగతం శుభ స్వాగతం

తనువుపైన అలదుకొనుము
చలువచేయు గంధము
పూజనీయులైన మీదు
పవిత్రతకు పుష్పము
సొలసిన మీ హృదయానికి
హాయి నొసగు ధూపము
ఆకొన్న అతిథిదేవ!
చేకొను నైవేద్యము

అతిథి దేవోభవ
స్వాగతం శుభ స్వాగతం

కడుపారా భోంచేసిన
తనివికి తాంబూలము
కలిగించగ ఉల్లాసము
గీతము వాయిద్యము
సేవలోని లోపాలకు
మన్నింపు నమస్కారము
షోడశోపచారములివి
భారతీయ సంస్కారము

అతిథి దేవోభవ
స్వాగతం శుభ స్వాగతం
మీ రాకతొ నేడు మా గృహం
అయినదయ్యా కడు పావనం

సింహాద్రి జ్యోతిర్మయి



Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ