1/2.శ్రీ విష్ణు కందం (బ్రహ్మోత్సవాలు)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ముఖపుస్తక మిత్రులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.
నేటినుండి తిరుమల బ్రహ్మోత్సవాల గురించి నేను వ్రాసిన శ్రీ విష్ణు కందంలోని పద్యాలను పోస్ట్ చేస్తాను.నా ప్రయత్నాన్ని
స్వామి అనుగ్రహించు గాక.
ఓం నమో వేంకటేశాయ
1.శ్రీయుతుడౌ తిరునాథుని
శ్రేయము లొనగూర్పుమనుచు చేరి కొలువగన్
చేయుచు బ్రహ్మోత్సవములు
మోయుదమిదె రండు భువిని మోసెడు స్వామిన్.
2.కం.
బ్రహ్మోత్సవముల వేళల
బహ్మాండమ్ముల విభుడిటు భక్తుల మదికిన్
బ్రహ్మానందము గూర్చుచు
బ్రహ్మాండమ్ముగ తిరుమల వాడల వెడలున్.
3.కం.
శారద నవరాత్రులలో
నారాయణి కొలువుదీరు నవదుర్గలుగా
ఊరెరిగింపగ వెడలును
నారాయణమూర్తియు తిరునగరము నందున్
అంకురార్పణం.
4.కం.
నవరాత్రుల నాశ్వయుజపు
శ్రవణానక్షత్రమందు శాస్త్రోక్తముగా
నవపాలికలందు తొలుత
నవధాన్యపు యంకురముల నాంది జరిగెడున్.
విష్వక్సేన ఆరాధన
5.అదిగో విష్వక్సేనుడు
కదిలెను బ్రహ్మోత్సవముల కనుపండువగా
మొదలిడి జరిపించి భువికి
ముదమును కలిగించు వేడ్క ముందు నడచుచున్.
బంగారు తిరుచ్చి ఉత్సవం
6.శృంగారము లొలికి విభుడు
బంగారు తిరుచ్చి యుత్సవమ్మును గొనగాన్
సింగారపు దేవేరులు
చెంగట నిలువంగ వచ్చె చెలువము గనరే!
7.కం.
తిరుమల శ్రీవారికిదే
పరమోత్సవమును విధాత ప్రారంభించున్
సురలారా! రారండని
గరుడుడు యాహ్వానమొసగ గగనము కెగయున్.
8.కం.
ధ్వజము నెగురవేయగనే
నిజవాసము వీడి భువికి నిర్జరులదిగో!
అజుని యనుసరించి రహో!
ప్రజ కలి వైకుంఠమునకు పరుగులు దీసెన్.
ధ్వజారోహణం
9.కం.
పదహారు కళల వెలుగుచు
పదహారుపచార విధుల భక్తికి వశుడై
ముదమునొసగు హరి యదిగో
పదహారగు వాహనముల వచ్చుట గనరే!
10.కం.
చెలువొప్పగ కలిదైవము
మలయప్పడు దర్శనమిడు మనకెల్లరకున్
తిలకింతము ,పులకింతము
ఫలియింపగ మనుజ జన్మ పావనమవగాన్
11.కం.
శేషాచలమున కొలువై
శేషవలువ లిడుచు నిత్య సేవలనందే
శేష శయను డదిగో పెద
శేషుడనే వాహనమున చెలగుచు వచ్చెన్
ఓం నమో వేంకటేశాయ.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.09.2020
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల
చిన శేషవాహనం
12.కం.
పరమశివుని గళమాలగ
వరలెడు వాసుకి హరికదె వాహనమవగా
నిరువురు దేవేరులతో
తిరుమాడపు వీధి స్వామి తిరుగాడ జనున్.
స్నపన తిరుమంజనం
13.కం.
మలయప్పని వేదవిదులు
పలురకముల గంధపుష్ప ఫలముల తో తా
మలరించుచు శోభనముల
నలువుగ స్నపన తిరుమంజనమ్ము సలిపెడున్
హంస వాహనం
14.కం.
సంసారపు మోహమ్మును
ధ్వంసము గావించి మనల దరి జేర్చుటకై
కంసారియె వచ్చెనదే
హంసయె తన వాహనముగ నార్తిని మాపన్.
15.కం.
తీరుగ పాలను నీటిని
వేరుగ తొలగించు హంస విజ్ఞత చేతన్
శారద వాహనమైనది
సారము జ్ఞానమె ఫలమగు స్వామిని గొలువన్.
ఓం నమో వేంకటేశాయ.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.9.2020
చిన శేష వాహనం
తిరుమల బ్రహ్మోత్సవాలు
సింహ వాహనం
16.కం.
భగవద్గీతాచార్యుడు
మృగరాజును తానెయనియె మృగములయందున్
తగచాటగ తన శౌర్యము
భగవానుండెక్కి సింహ వాహనమేగున్.
17.కం.
మదమన్నది పశుభావ
మ్మదుపున నుంచుట మనుజుల కావశ్యకమౌ
నిది చాటగ వేంచేసిన
మదసింహపు వాహనునకు మంగళమనరే!
ముత్యపు పందిరి వాహనం
18.కం.
ముత్యమువలె మనసుండిన
సత్యము ,ముక్తి సుగమమని చాటుట కొరకై
ముత్యపు పందిరి సేవల
నత్యద్భుత శోభ తోడ నచ్యుతు డందున్.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.9.2020
ఓం నమో వేంకటేశాయ
సింహ వాహనం
ముత్యపు పందిరి వాహనం
తిరుమల బ్రహ్మోత్సవాలు
కల్పవృక్ష వాహనం
19.కం.
కోరకనే వరములొసగు
శ్రీరమణుడు కల్పవృక్ష సేవను గొని తా
నూరెరిగింపగ వచ్చెను
రారండిటు వేడ,శిష్ట రక్షకు డితడే!
సర్వభూపాల వాహనం
20.కం.
భూపాలురకెల్ల జగతి
భూపాలుడు వేంకటపతి బ్రోవగవచ్చెన్
పాపాలను మాపి ,సకల
భూపాలపు వాహనమున భువినేలుకొనన్.
21. కం.
ఎనిమిది దిక్కుల నేలెడు
ఘన దిక్పతులెల్ల గూడి కడువేడ్క నదే!
కనుమా!స్వామిని భుజముల
వినయమ్మున మోయుట తిరు వీధులవెంటన్.
ఓం నమో వేంకటేశాయ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.9.2020
కల్పవృక్ష వాహనం
సర్వభూపాల వాహనం
తిరుమల బ్రహ్మోత్సవాలు
మోహినీ అవతారం
22.కం.
కాయమ్మిది కల్గు వరకు
మాయని మోహము గెలువగ మార్గము నరుడా!
పాయని నా ధ్యాన మదియె
చేయుమనగ మోహినిగను శ్రీహరి వచ్చున్.
23.కం.
మోహించెను పరమశివుడు
మోహించిరి సురలసురులు మోహనమూర్తిన్
వాహన సేవను త్రిజగ
న్మోహినియై స్వామి మనల ముగ్ధులజేయున్.
24.కం.
చెంతనదే కనుగొనుమా
దంతపు పల్లకి నెలకొనె దనుజాంతకుడే
కాంత యశోదకు శిశువై
వింతల మురిపించినట్టి వెన్నుడతండే.
25.కం.
ఆతడదే శ్రీ కృష్ణుడు
చేతనదే వెన్నముద్ద చెలువములొలికెన్
చూతమిదే రారండిటు
చేతము పులకింప మ్రొక్కి జేజేలనుచున్.
గరుడ వాహనం
26.కం.
తులసీ దళముల మాలల
నల హేమ సహస్ర నామ హారావళితో
మలయప్పడు ప్రియభక్తుని
యలరింపగ గరుడసేవ నాస్వాదించున్.
27.కం.
జ్ఞానము వైరాగ్యములవి
మానవులిరు రెక్కలనగ మదిని ధరింపన్
తానొసగెద సన్నిధినన
శ్రీ నిలయుడు
వైనతేయ సేవలనందున్
ఓం నమో వేంకటేశాయ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.9.2020
మోహినీ అవతారం
గరుడ వాహనం
తిరుమల బ్రహ్మోత్సవాలు
హనుమంత వాహన సేవ
28. కం.
భక్తికి వశుడగు స్వామికి
భక్తుడగుచు హనుమ దాస్యభక్తిని చాటన్
భక్తికి తిరునాథుడలరి
భక్తుని మురిపింప హనుమ వాహనుడయ్యెన్
29. కం.
తన జానకి జాడ తెలిపి
తన తమ్ముని రక్ష సేసి తనకాప్తుండౌ
ఘన భక్తుని సేవలుగొన
హనుమంతపు వాహనమున హరి యదె వచ్చెన్.
స్వర్ణ రథోత్సవం
30.కం.
స్వర్ణాభరణమ్ములతో
స్వర్ణ రథమునెక్కి స్వామి వచ్చుచునుండన్
స్వర్ణ మయము తిరువీధులు
వర్ణింపగ తరమె శోభ వాక్కులు గలవే?
31.కం.
ఉత్సవమగు నర జన్మం
బుత్సవమగు స్వామి సేవ యుత్సాహమునన్
సత్సంగమ్మని స్వర్ణ ర
థోత్సవ శోభల గనుగొను డొప్పిద మొప్పన్
గజవాహన సేవ
32.కం.
భజియింతును గతి నీవను
గజరాజును సరగున జని కాచి వరదుడై
నిజభక్తికి పలుకుదునని
గజ వాహన సేవను హరి ఘనముగ చాటున్.
33. కం.
మకరము యీ సంసారము
సకలాత్మా! పట్టువడితి చాలను గెలువన్
సుకరముగా విడిపింపుము
సుకృతమ్మిభ వాహనమున చూచు ఫలమనన్.
ఓం నమో వేంకటేశాయ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.9.2020
హనమంత వాహనం
స్వర్ణ రథోత్సవం
గజ వాహనం
తిరుమల బ్రహ్మోత్సవాలు
సూర్యప్రభ వాహనం
34..కం.
సప్తగిరీశుడు వేడ్కను
సప్తమదిన మరుణపుష్ప సరములతోడన్
సప్తాశ్వుడు సారథిగా
సుప్తజగతి వెలగజేయు సూర్యప్రభలన్.
35.
తూరుపు దిక్కున సూర్యుడు
నారాయణ మూర్తి యనగ నభమున వెలుగున్
శ్రీ రమణుని వహియించెడు
కోరికతో నాతడదిగొ కొలువగవచ్చెన్.
చంద్రప్రభ వాహనం
36. కం.
చల్లని యుల్లము నాదని
యెల్లరకును చాటిచెప్పి యేలుకొనంగన్
తెల్లని వలువల దాలిచి
చల్లగ తిరునాథుడొచ్చె చంద్రప్రభలన్.
37.కం
చలువపు కాంతుల నగవుల
చెలువము గని పులకరించు చిత్తములెల్లన్
చెలగెడు తారకలనగా
కలువలవిభుపై నదె సిరికాంతుని గనరే!
38.కం.
వెలుగులెగయు సూర్య ఛటలు
చలువగురియు చంద్రకళలు స్వామి కనులలో
తెలితెలి దీప్తులు రువ్వుచు
మలయప్పని యంశలనగ మహిని నడిపెడిన్.
ఓం నమో వేంకటేశాయ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.9.2020
సూర్య ప్రభ వాహనం
చంద్రప్రభ వాహనం
No
*తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు*
*రథోత్సవం*
39.కం.
రథముల వంటివి తనువులు
రథికునిగా తనను లోన రాజిలజేయన్
పథమై ముక్తికి విజయుని
రథసారథి యరుగుదెంచు రాజసమొప్పన్.
*అశ్వవాహనం*
40.కం.
తురగములగు యింద్రియముల
పరుగును మది కళ్ళెమునను బంధించుటకై
అరదమ్మగు నీ తనువున
తిరుమల వాసుని నిలుపుము స్థిరమగు బుద్ధిన్.
41.కం.
నశ్వర మగునెడ ధర్మము
విశ్వము కాపాడ కల్కి పేరున హరియే
ఆశ్వాసింపగ వచ్చును
అశ్వపు వాహనపు సేవ ఆంతర్యమదే.
42.సారథివై అర్జునునకు
భారత యుద్ధాన విజయ వారధి వైతే!
సారథివై ఇంద్రియముల
జోరును నీవదుపు జేయి జోతలు గొనుచున్
*ఓం నమో వేంకటేశాయ*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.10.2021
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
43.కం.
చల్లని నవ్వుల రువ్వుచు
మెల్లని గమనమ్ము తోడ మించు సొబగులన్
కొల్లగొనుచు భక్తుల మది
పల్లకి సేవల ప్రభుడదె వచ్చుచునుండెన్
44.కం.
కన్నులు చాలవు కనుగొన
చెన్నుగ పల్యంకికమున శ్రీనాథా!నీ
వన్నెల వర్ణింపగ నే
నన్నమయను కాను భక్తి నంజలి చేతున్
45. కం.
తొమ్మిది దినములు జరుగును
పమ్మిన సొబగుల తిరుమల బ్రహ్మోత్సవముల్
రమ్మా!దసరా వేళల
నమ్మి కొలువుమా! తరింప నారాయణునిన్.
46.కం.
కలియుగ వైకుంఠము తిరు
మల బ్రహ్మోత్సవముల గని మది మురియంగా
నిలకొచ్చిన వేలుపులకు
పలికెడు వీడ్కోలు గూడ పరమోత్సవమే!
47. కం.
త్రిభువన పాలకు డలసెడు
నుభయపు సంధ్యల ప్రియమున నూరువెడలగా
నభిషేకమునంది మరల
శుభచక్రపు స్నానవిధుల శోభలు గురియున్.
48.కం.
సక్రమముగ సంబరముగ
చక్రికి బ్రహ్మోత్సవముల జరిపిన మీదన్
చక్రత్తాళ్వారులకున్
చక్రస్నానము ఘనముగ సలుపుట గనరే!
49.కం.
నవరాత్రులు వైభవముగ
భవసాగర తారకునికి బ్రహ్మోత్సవముల్
భువి తరియగ జరిపి ధ్వజము
నవరోహణ జేయ మ్రొక్కి యానతడగరే!
50.కం.
నిత్యోత్సవముల స్వామికి
ప్రత్యబ్దము జరుగు బ్రహ్మ పరమోత్సవముల్
ప్రత్యక్షముగా జూచెడి
యత్యున్నత భాగ్యమబ్బె డార్యులనెంతున్.
51.కం.
మంగళమో !కలిదైవమ!
మంగళమో భక్తవరద!మాధవదేవా!
మంగళమో భూ రమణా!
మంగళమో గరుడగమన! మమ్మేలవయా!
ఓం నమో వేంకటేశాయ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సంపూర్ణం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.9.2020
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
.
.
86. మన్నులు వెన్నల మాదిరి
కన్నయ్యా!తింటివనుచు కవితల
యా పో
తన్న
వెన్నుడవై తింటివనుచు వినిచిన ఆ పో
తన్న కవిత లెంత సుధలు
విన్నను కన్నయ్య కథలు వీనుల విందౌ.
103. కోవెల కొచ్చితి కొలువగ
పూవుగ అర్పించి మదిని పూజించెద నన్
గావుము కరుణను జూడుము
దీవెన లిడుమా తరింతు దీనత తొలగన్.
107. కం. ఎరుగను శాస్త్రము లేవియు
ఎరుగను మంత్రము లెరుగను ఏ దైవము నే
నెరిగితి హరి నీ నామము
చెరగని భక్తిని మనమున చేకొనియుంటిన్.
108. కం. ఎంతయు ప్రతిభావంతులు
సంతత భక్తిని సతతము సన్నుతి జేయన్
సుంతయు జ్ఞానము చాలని
కాంతను చెప్పితి కవితను కరుణను గొనుమా.
ఆర్యులారా!
నేటితో ఈ శ్రీ విష్ణు కందాన్ని ఆపబోతున్నాను.రేపటి నుండి స్వామివారి మరొక సన్నితితో కలుస్తాను.ఆదరించి నందుకు అందరికీ ధన్యవాదాలు.తప్పులు నా అజ్ఞానంగా,మీ మెప్పులు స్వామి అనుగ్రహం గా భావిస్తాను. సెలవు.
సింహాద్రి.
Comments
Post a Comment