7.తొలి తొలి ఊహలు


ఈ రోజు నేషనల్ మూన్ డే అట.

ఈ సందర్భంగా నేను 1982-84 మధ్య ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, భావకవితా ప్రభావంలో పడిన యవ్వన ప్రాయంలో చంద్రునిపై రాసిన రెండు చిన్న కవితలు

*నా తొలి ఊహలు* లో నుండి

రసజ్ఞత

రసమెండిన రాగుండెకు
(రాతి గుండెకు అని నా భావం)
జాబిలిలో ఏముందని
అనిపించేను
మాయనట్టి మచ్చయే
కనిపించేను
రసముండిన ప్రతిగుండెకు
నెలరాజున వెన్నెలలే
అగుపించేను
మచ్చయేగ ముచ్చట
అనిపించేను

*********

జాబిలి స (వి)రసం

సరసజేరిన తారతోడ
విరసమేలర చందురూడ
అంతదవ్వుల కలువతోడ
వింతగాదే 
సరసమాడ
తళుకులొలికెను తార విన్నుల
చూడనొల్లక దాని చెన్నుల
కలువకోరెదు
కౌముది కన్నుల
తగునె నీకిది
రేరాజ!తప్పుగాదా!
నీదు వెలుగులతోడను
మిలమిల లాడెను
నీ చలువ కన్నేయ
నా కలువ కన్నియ
తనదు వెలుగులుండియు
వెలవెల బోయెను
నీవు కాదన చుక్క పక్కన
పాడియగునే ! నీకిది
నెలరేడ! పలుకవేల?

*********

వీటితో పాటు మీకు
ఇంకోటి కూడా తెలియాలండోయ్
అసలు నా మొదటి *తవిక* కూడా 
చంద్రుని మీదే.
మా చిన్న తమ్ముడికి నా పది పన్నెండు ఏళ్ళ వయసులో చెప్పానండోయ్.

చుక్కల్లో పెద్ద చుక్క
(ఇది అప్పట్లో ఒక సినిమా పాట పల్లవి)
సగం విరిగిన ఇడ్లీ ముక్క(హహహహ)
అని పెరట్లో పడుకుని
 దాదాపుగా దశమి నాటి చంద్రుణ్ణి చూస్తూ 
చెప్పడం బాగా గుర్తు.

ఎలా ఉన్నాయండీ?
నా తొలి తొలి ఊహలు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.07.2020

Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ