20/1 సుప్రభాతం
20/1 సుప్రభాతం
********************************************************
సుప్రభాతం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
(కంద పద్యాలలో స్వేచ్ఛానువాదం)
*శ్లోకం 1.*
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||
కందం.1
కౌసల్యా సుత రామా!
నీ సారసలోచనముల నిద్దుర విడగాన్
మా సామీ! మేల్కొనుమిక
నీ సంధ్యను దైవకార్య మీడేర్పవలెన్.
తాత్పర్యం..
కౌసల్యా సుతుడవైన ఓ శ్రీ రామా! తూర్పు తెల్లవారుతున్నది.దేవపూజాది దినకృత్యములు నెరవేర్చే వేళైనది. ఓ పురుషోత్తమా! కమలములు వంటి నీ కన్నులు విచ్చి చూసి ఇక నిద్ర నుండి మేల్కొనుము.
*శ్లోకం 2*
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥
కందం...2
మేలుకొనుము నరసింహమ!
మేలుకొనుము గరుడగమన!మేలుకొనుమయా!
మేలుకొనుము గోవిందా!
మేలొనరింపగ సిరిపతి! మేదినికెల్లన్.
తాత్పర్యం..ఓ నరసింహమా! నిద్ర నుండి మేల్కొనుము.ఓ గరుడగమనా!వేగముగా లెమ్ము.ఓ గోవిందా!వేగమే మేల్కొని ముల్లోకములకు శుభమును చేకూర్చుము.
*****************************
*సుప్రభాత కందం*
స్వేచ్ఛానువాదం
శ్లోకం 3
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే|
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్||
కందం..3.
అఖిల జగన్మాతా!నీ
వఖిలాత్ముని హృదయనిలయ వాశ్రితకోటిన్
సుఖసంపద లిడి బ్రోవగ
నిఖిల సిరుల సొగసుల గని నిద్దుర లెమ్మా!
తాత్పర్యం.. ఎల్లలోకములకు కన్న తల్లివైన ఓ లక్ష్మీదేవీ! నీవుసదా విష్ణు వక్షస్థలమున నుండుదానవు. మనోహరమగు సుందరాకారముగలదానవు. ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెలు ఒసగుదానవును అయిన ఓ ఈశ్వరీ! శ్రీ వేంకటేశదయితా! లక్ష్మీదేవీ! నిదుర నుండి మేల్కొనుము..
****************************
శ్లోకం 4.
తవ సుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖ
చంద్రమండలే |
విధి శంకరేంద్ర వనితాభి రర్చితే
వృష శైల నాథదయితే! దయానిధే!||
కందం -4
కమలాక్షీ!కరుణాలయ!
హిమబింబానన! ప్రసన్న!హే శ్రీదేవీ!
సుమముల నిను సేవింపగ
ఉమయు శచియు వాణి వేచి యున్నారమ్మా!
తాత్పర్యం : 4
ఓ శ్రీదేవీ! నీవు తామర పువ్వులవంటి కన్నులు గల దానవు.కరుణామయివి. చంద్రబింబమువలే ప్రసన్నమగు నెమ్మోము గలదానవు. బ్రహ్మ, మహేశ్వర, దేవేంద్రుల భార్యలగు సరస్వతీ, పార్వతీ శచీదేవి నిన్ను పుష్పాలతో పూజించుటకై వేచియున్నారు. ఓ తల్లీ ! నీకు సుప్రభాత మగుగాక.
***************************
*శ్లోకం 5*
అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యామ్
ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥
*కందం -5*
సురగంగను వికసించిన
విరులను చేదాల్చి కొలువ వేంచేసి రదే
అరుసముతో సప్తర్షులు
పరమాత్మా! లెమ్ము భువిని పరిపాలింపన్.
తాత్పర్యం : 5
అత్రి మొదలగు సప్తర్షులు వేకువనే ఆకాశగంగ యందలి మేటి తామరలను గొని నీ పాదయుగళమును పూజింపవచ్చియున్నారు. ఓ శేషాచలపతీ ! లోకాలనేలుకొనగా నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం - 6*
పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి ।
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ||
*కందం - 6*
నిను సేవింపగ వేచిరి
కనుమా!హరుడును విధాత స్కందాదు లదే
వినయముతో వజ్రి నిలిచె
దినవారము చదువజొచ్చె దేవగురుండున్.
తాత్పర్యం : 6
బ్రహ్మ, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలగు దేవతలు నిన్ను సేవించగా వేచి ఉన్నారు. బృహస్పతి పంచాంగము చదువుచున్నాడు. ఓ శేషాచలపతీ ! నీకు సుప్రభాత మగుగాక.
*************************
*శ్లోకం -7*
ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ ।
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ||
*కందం -7*
అరవిందము లరవిరిసెను
విరివిగ మరి నారికేళవిరులును పోకల్
పరిమళముల నిన్ను గొలిచె
పరమాత్మా!నిదురలెమ్ము ప్రత్యూష మయెన్.
తాత్పర్యం : 7
పరమాత్మా!
తామరపువ్వులు కొద్దిగా విచ్చుకుంటున్నాయి. కొబ్బరి,పోక, మొదలగు చెట్ల పూవులయొక్క, దివ్య పరిమళముతో గూడి, గాలి మెల్లగా వీచుచున్నది. ఓ శేషాచలపతీ ! సుప్రభాత వేళ అయినది.నిదుర నుండి మేల్కొనుము.
****************************
శ్లోకం - 8
ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావశిష్ట కదళీ ఫల పాయసాని|
భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ ||
కందం -8
అదిగదిగో రామచిలుక
లుదయమ్మే పంజరముల నున్న ఫలాదుల్
ముదమున భుజించి హాయిగ
మృదురవముల చేయుచుండె మేల్కొను స్వామీ!
తాత్పర్యం : 8
ఓ వేంకటేశ్వర స్వామీ ! మేలైన పంజరములందున్న పెంపుడు చిలుకలు కన్నులు తెరిచి, గిన్నెలలో రాత్రి మిగిలిన పండ్లను ఆరగించి, విలాసముగా పాడుచున్నవి. ఇక నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం 9*
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।
భాషా సమగ్ర మసకృత్కర చారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥
*కందం - 9*
తమ భక్తుడు నారదు డదె
సుమధురగతి మహతి మీటి సుస్వరములచే
కమనీయపు నీ గాథల
రమణీయత నాలపించు రాగము వినుమా!
తాత్పర్యం : 9
నారదమహాముని తన మహతి మీటుతూ సుమధుర నాదము తో నీ యనంత చరితమును పలుమారు రమ్యముగా గానము చేయుచున్నాడు. ఓ శేషాచలపతీ ! ఆ సుస్వరములు వినగా ఇక నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం 10*
భృంగావళీచ మకరంద రసానువిద్ధ
ఝంకారగీత నినదైః సహ సేవనాయ|
నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్||
*కందం -10*
కమ్మని తేనెలు గ్రోలెడు
తుమ్మెద గుంపులు రమేశ!తొలి వేకువలో
ఝుమ్మని నాదము సేయుచు
మిమ్ముల సేవింపవచ్చె మేల్కొనుమయ్యా!
తాత్పర్యం : 10
తుమ్మెద గుంపులు మకరందరస
పానముచేసి విజృంభించిన ఝంకార గీతముల ధ్వనులతో మిమ్ము సేవించుటకు వచ్చియున్నవి. ఓ శేషాచలపతీ ! నీవు నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం 11*
యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్||
కందం -11
గొల్లల పడుచులు గృహముల
చల్లలు చిలికేటి సడులు సరియన తోచున్
వెల్లున కడవలు,కవ్వము
పెల్లుగ కలహించు రీతి, విని మేల్కొనుమా!
తాత్పర్యం : 11
గొల్లయిండ్లలో గొల్లభామలు పెరుగు చిలుకుతున్నారు. ఆ చిలికిన ధ్వనులు పెరుగు మరియు కడవలు రోషంతో తగవులాడుచున్నవా యనునట్లు ఘోషించుచున్నది. ఓ వేంకటాచలపతీ ! ఆ సవ్వడులను విని నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం -12*
పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యాః|
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్||
*కందం -12*
నల్లని కల్వల కాంతుల
నల్లన గెలువంగ దలచి యళికుల మనికై
నల్లవొ!భేరీ మ్రోసెను
మెల్లగ కనువిచ్చి నిదుర మేల్కొను మింకన్.
తాత్పర్యం : 12.
ఔరా! తుమ్మెదలు తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని హరించుటకై భేరి వాయించున్నవా! అన్నట్లుగా తీవ్రనాదము చేయుచున్నవి. ఓ వేంకటాచలపతీ ! ఆ సవ్వడులు వినగా మెల్లగా కన్నులు విచ్చి నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం -13*
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో |
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||
*కందం -13*
సిరినెద దాల్చిన స్వామీ!
వరదా!ఓ లోకబంధు!వలదొరరూపా!
కరుణాసాగర!శ్రీశా!
అరుణోదయమయ్యె లెమ్మ!ఆర్తుల నేలన్.
తాత్పర్యం : 13
శ్రీ మహాలక్ష్మిని న ఎదపై నిలుపుకున్న ఓ వేంకటాచలపతీ ! కోరిన వరముల నెల్ల నొసగేవాడా!
ఓ నవమన్మథాకారా! ఓ దయానిధీ! ఓ శ్రీనివాసా! అరుణోదయమవుతున్నది.ఆర్తజనులను ఏలుకొనగా మేలుకొనుము.
*****************************
*శ్లోకం 14*
శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః |
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
*కందం -14*
తనువులు నిర్మలమవగా
సనకసనందాది మునులు, శర్వుడు, నజుడున్
మునిగియు నీ పుష్కరిణిని
ఘన వేత్రము శిరసులంట గడపనొదిగిరే!
తాత్పర్యం : 14
బ్రహ్మ, మహేశ్వరుడు,సనక సనందాది మహర్షులు తమ తమ శ్రేయస్సు కోరుతూ నీ పుష్కరిణి యందు మునిగి నిర్మలదేహులై వచ్చి తలలపై బెత్తపు దెబ్బలను తినుచు, వాకిట వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం -15*
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్|
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
*కందం -15*
గరుడాద్రియు శేషాద్రియు
వరగిరి యగు వేంకటాద్రివాసుడవనుచున్
మరిమరి నీసప్తగిరుల
పరిపరి కీర్తించుట విను పన్నగశయనా!
తాత్పర్యం : 15
ఓ వేంకటాచలపతీ ! ఈ తిరుమల సప్తగిరులపై వెలసిన నిన్ను శేషాద్రి, గరుడాద్రి,
వేంకటాద్రి, నారాయణాద్రి , వృషభాద్రి, వృషాద్రివాసుడవని పరిపరి విధాలుగా నీ భక్తులు కీర్తిస్తున్నారు.ఆ స్తోత్రములను కోరి వినగా స్వామీ! నిదుర నుండిమేల్కొనుము.
****************************
*శ్లోకం - 16*
సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః |
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
కందం -16
కింకరులై నీ వాకిట
శంకరు డాదిగ సమస్తజగదాధిపతుల్
వేంకటపతి! వేచి రదే
యింకను యీ జాల మేల?యిల నేలు కొనన్.
తాత్పర్యం 16.
ఈశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని,యముడు,నిరృతి, వరుణుడు, వాయువు,కుబేరుడునగు నెనిమిది మంది దిక్పాలకులును నీ సేవకై కేల్మోడ్చి నీ వాకిట వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! ఈ భువిని ఏలుకొనుటకు ఇంకా ఈ ఆలస్యమేల ? స్వామీ! నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం -17*.
ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ|
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతమ్||
కందం -17
మృగరాజును,హయరాజును,
ఖగరాజును,భుజగరాజు,గజరాజాదుల్
నగధర!తమ యధికారము
లొగివేడుచు వినయమొప్ప నున్నారదిగో!
తాత్పర్యం 17
ఓ వేంకటాచలపతీ ! మృగేంద్రుడు,తురగేంద్రుడు, గరుడుడు, ఆదిశేషుడు, గజేంద్రుడు వారి వారి యధికారమహిమాధికమును విడనాడి నీ వాకిట నిన్ను వేడుటకై వేచియున్నారు.. ఓ స్వామీ! నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం -18*
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిషత్పరిషత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||
*కందం -18*
రవిచంద్రులు బుధు డాదిగ
నవగ్రహములు తిరునాథ!నాకపు వాసుల్
దివినుండదె వచ్చిరిగా!
యవనికి నీ దాసులగుచు నాశ్రయ మిడవే!
తాత్పర్యం ..
ఓ స్వామీ! సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు ,కేతువు అను దేవసభా ప్రధానులగు నవగ్రహములును ,స్వర్గలోకపు వాసులును నీ చరణదాసులమంటూ వచ్చి నీవాకిట నిలిచియున్నారు. . ఓ వేంకటాచలపతీ ! వారికి ఆశ్రయమివ్వగా నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం 19*
త్వత్పాదధూళి భరితస్ఫురితో త్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః |
కల్పాగమా కలనయా కులతాంలభంతే
శ్రీవేంకటా చలపతే తవసుప్రభాతమ్ ||
*కందం..19*
మరియొక కల్పమునందున
తరమా!నిను గొల్వగనను త్వరతో విబుధుల్
వరియింపము ముక్తిననుచు
శిరమున నీ పదములంట చేరిరి లెమ్మా!
తాత్పర్యం ..
వేంకటాచలపతీ ! ఈ కల్పం దాటిపోతే,మరియొక కల్పంలో నిను సేవించే భాగ్యం లభిస్తుందో!లేదో!అనే ఆతృతతో దేవతలు "మాకు ముక్తి వద్దు. నీ పాద ధూళిని శిరమున ధరింపగల్గితే చాలు" అంటూ , స్వర్గమోక్షములను గూడ కాదని నీ వాకిట నిలిచియున్నారు. ఓ వేంకటాచలపతీ ! నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం -20*
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః !
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
కందం -20
పరమపదము,సురలోకము
కరిగెడు పుణ్యులు పథమున హరి! నీగుడి గో
పురశిఖరమ్ములు కన్గొని
తరియగ స్వర్గము వలదని తరలి రిచటికే.
తాత్పర్యం ..
ఓ శ్రీహరీ! పరమపదమును, స్వర్గమును చేరటానికి వెళుతున్న పుణ్యాత్ములు తాము వెళ్ళే దారిలో ఈ వేంకటాచల గోపుర శిఖరాలను చూసి,
"మాకు ముక్తి వద్దు. నీ పాద ధూళిని శిరమున ధరింపగల్గితే చాలు" అంటూ , స్వర్గమోక్షములను గూడ కాదని నీ వాకిట నిలిచియున్నారు. ఓ వేంకటాచలపతీ ! నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం -21*
శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే|
శ్రీ మన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్||
*కందం -21*
శ్రీ , భూనాయక! వరగుణ
శోభిత! దేవాదిదేవ! సుప్రభ లవిగో!
నీ భక్తుల గన నీరజ
నాభా!మేల్కొను సుపర్ణనమసితచరణా!
తాత్పర్యం ..
ఓ దేవదేవా ! శ్రీదేవి భూదేవుల ప్రాణనాథా! దయాది శ్రేష్టమైన గుణములచేత శోభించేవాడా! గరుత్మంతునిచే అర్చింపబడే పాదపద్మములు గల ఓ స్వామీ! నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం 22*
శ్రీ పద్మనాభ !పురుషోత్తమ !వాసుదేవ !
వైకుంఠ ! మాధవ !జనార్దన !చక్రపాణే !|
శ్రీ వత్స చిహ్న !శరణాగత పారిజాత !
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
కందం -22 A
పురుషోత్తమ!ఓ మాధవ!
శరణాగత పారిజాత!చక్రధరుండా!
హరి! వైకుంఠనిలయ! శ్రీ
తిరునాథా! లెమ్ము స్వామి!తెలవారె నదే!
కందం -22 B
శ్రీవత్సాంకితుడవు,వసు
దేవాత్మజుడవు, వృషాద్రితిరునాథుడవే!
నీవే శరణు జనార్దన!
కావుము ఘననిర్మలాత్మ ,కళ్యాణగుణా!
తాత్పర్యం..
స్వామీ! నీవు పద్మనాభుడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠమున నివసించువాడవు. లక్ష్మీపతివి. జనార్దనుడవు. చక్రధారివి. శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలవాడవు. నిన్ను శరణు కోరిన వారికి కల్పవృక్షము వంటివాడవు. శ్రీ వేంకటాచలపతీ! ఓ జనార్దనా!!నీవే మాకు శరణు.నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం -23*
కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
కందం -23
కంతుని గర్వము నణచెడు
నంతటి సౌందర్యమూర్తి వచ్యుత!నీ శ్రీ
కాంతను గను,కడకన్నుల
కాంతులు ప్రసరించి మమ్ము కరుణింపు మయా!
తాత్పర్యం ..
మన్మథుని గర్వమును అణచివేయగల సుందరరూపము నీది.! ఓ అచ్యుతా! ఆ శ్రీదేవిని ప్రేమతో వీక్షించే నీ కడగంటి చూపుల కాంతులు లేశమైనా మాపై ప్రసరించి మమ్ము అనుగ్రహించగా ఓ వేంకటాచలపతీ ! నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం- 24*
మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర |
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
*కందం -24*
నీవే మీనువు,కమఠవు
నీవే కోలవు,నృసింహునివి,వామనుడై
నావే!యా రామత్రయ
మీవే! శ్రీకృష్ణు కల్కి వీవే శ్రీశా!
తాత్పర్యం ..
ఓ స్వామీ! మత్స్యము ( చేప ) ,కూర్మము ( తాబేలు ) ,వరాహము ( పంది ) ,నరసింహము, వామనుడు, పరుశురాముడు, శ్రీ రాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్కియను పదియవతారములను లోకోద్ధరణమునకై దాల్చిన శ్రీ వేంకటాచలపతీ ! నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం -25*
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం |
ధృత్వా2ద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్||
కందం - 25
ప్రోది సుగంధ వియద్గం
గోదకము కనకఘటముల నూని యుదయమే
మోదముతో శ్రీరమణా!
వేదవిదులు నిన్ను గొలువ వేచిరి లెమ్మా!
తాత్పర్యం ..
వైదికోత్తములు ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరములతో సువాసితమైన ఆకాశగంగ నీటిని బంగారు కడవల నిండుగ తెచ్చి మీ యారాధనకై సంతోషముతో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ ! నిదుర నుండి మేల్కొనుము.
*****************************
*శ్లోకం -26*
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్
కందం -26
కమలాప్తుండుదయించెను
కమలమ్ములు విరిసె లెమ్ము ,ఖగములు దిశలన్
సుమధురధ్వనులను నింపెను
రమాధవా!సుభగతూర్యరవములు వినుమా!
తాత్పర్యం ..
ఓ వేంకటాచలపతీ ! సూర్యుడు ఉదయించుచున్నాడు. తామరలు వికసించుచున్నవి. పక్షులు కలకలశబ్దములచే నల్దిక్కులు నింపుచున్నవి. శ్రీ వైష్ణవులు మీ సన్నిధిలో వినిపిస్తున్న మంగళతూర్య రవములు విని స్వామీ! నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం..27*
బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః |
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
కందం..27
వేచిరి సనకాది మునులు
వేచిరి బ్రహ్మాదిదేవవిబుధ వరులు,పూ
జోచిత వస్తువులను గొని
వేచిరి వాకిట ముదమున వేంకటనాథా!
తాత్పర్యం ..
ఓ వేంకటేశ ! బ్రహ్మ మొదలగు దేవతలందరు ను,ఋషీశ్వరులను,సనందనుడు మొదలగు యోగీశ్వరులును ,మంగళకరమైన వస్తువులను చేతబూని నీ సన్నిధిలో నిన్ను కొలువగా వేచియున్నారు. స్వామీ ! నిదుర నుండి మేల్కొనుము.
******************************
*శ్లోకం..28*
లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో|
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతమ్||
*కందం..28*
సాగరకన్యాపతి! గుణ
సాగర !వేదాంతవేద్య!సంసారతమో
సాగర తరణార్థులగుచు
నీ గడపను భక్తకోటి నిలిచిరి లెమ్మా!
తాత్పర్యం ..
ఓ శ్రీనివాసా ! పాలకడలిలో ప్రభవించిన లక్ష్మీదేవికి విభుడవు.
గుణసాగరుడవు. ఉపనిషత్తులచే తెలిసికొనదగిన వైభవము గలవాడవు.ఈ సంసార సాగరమును దాటగోరి భక్తులు నీ వాకిట వేచియున్నారు.ఓ వేంకటాచలపతీ ! నిదుర నుండి మేల్కొనుము.
****************************
*శ్లోకం 29*
ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే||
*కందం..29*
ఏ మానవు లిల నిత్యము
స్వామిని యీ సుప్రభాతసన్నుతి చేతన్
తాము కొలుతురో వారికి
క్షేమము,శుభములు హరి దయచేయును సుమ్మా!
తాత్పర్యం ..
సుప్రభాత వేళ ఈ సుప్రభాత స్తోత్రమును ఏ మానవులు ప్రతిదినమును భక్తితో పఠించి, స్వామిని సేవిస్తారో వారికి ఆ శ్రీహరి క్షేమమును,శుభములను కలుగజేయునుగాక!
****************************
శ్రీవారికి మేలుకొలుపు
పావనమగు సుప్రభాతపఠనము భక్తిన్
భావించుచు తన్మయమున
సేవించుచు పాడినంత చేకురు శుభముల్.
పవిత్రమైన ఈ సుప్రభాతమును భక్తిభావంతో, తన్మయముతో స్వామిని భావనలో నిలిపి, పఠనము చేసి ఎవరైతే స్వామి వారిని మేలుకొలుపుతారో వారికి సకల శుభములు చేకూరుతాయి.
*********************************************************
.
Comments
Post a Comment