17/3*గేయారాధన* తిరుప్పావై పాశురాలు*
తిరుప్పావై పాశురాలు
తిరుప్పావై పాశురాలు
పూర్వభాగం (1-15)
తిరుప్పావై పాశురం 1
గోవిందు సేవకు వేళయిదే
గోపికలారా రారమ్మా!
లోకం మురియగ,తరింపగా
శ్రీ కృష్ణ నామం జపింతుమా!
మార్గ శీర్షమున శుక్ల పక్షమిది
పూర్ణ చంద్రుడుదయించు రోజులివి
సిరులు పొంగు వ్రేపల్లె వాడలో
సింగారించిన బాలికలారా!
తెలవారకనే నిద్దురలేచి
నదికి పోయి సుస్నానము జేసి
మార్గ శీర్షపు వ్రతమాచరింపగ
తరుణుల్లారా!తరలండీ
నందగోపుడే వేలాయుధుడై
కృష్ణ స్వామిని కాచుచుండును
విశాలనయన ఆ యశోద చెంత
బాల సింహమై గోపాలుడాడును
నల్ల మేఘమే తన మేనిఛాయ
ఎర్ర తామరలు స్వామి కన్నులు
సూర్యుని తేజం,చంద్రుని చలువ
తొణికిసలాడే వదనము గనుమా!
నంద నందనుడు నారాయణుడే
వేరొకరిని మరి వేడగనేలా!
పర అను వాద్యం వరముగనిమ్మని
అడిగిన మాధవు డనుగ్రహించులే.
సింహాద్రి
16.12.2016.
తిరుప్పావై పాశురం 2
శ్రీరంగని మంది భావించి
గోదాదేవి రచించిన
రెండవ పాశురమీవేళ
నిండు మనసుతో పాడుదమా!
దుఃఖమయమ్మగు ఈ లోకాన
శ్రీ కృష్ణుని సమకాలికులైన
మీరే మీరే అదృష్టవంతులు
మీదే మీదే ఆనందం
నెమ్మదితో అల పాలకడలిలో
శయనించిన ఆ పరమపురుషుని
శ్రీపాదాలకు శిరసా మ్రొక్కుచు
శుభ మంగళమును పాడుదమా!
భోగ వస్తువులు నెయ్యీ,పాలు
ఆరగించుటది అపచారం
సూర్యోదయమును చూడక మునుపే
అభ్యంగనమే ఆచరణీయం
స్వామి అనుగ్రహ మందేవరకు
విరులూ కాటుక ధరింపవలదు
పరులనెన్నడూ దూషింపరాదు
అసత్యమ్ములను ఆడకూడదు
పెద్దలబాటను అనుసరించుమా
జ్ఞానమూర్తులను గౌరవింపుమా
బ్రహ్మచారులకు,సన్యాసులకు
భిక్ష నొసంగి ఆదరించుమా
తెలియుము ఇవియే వ్రత నియమాలు
పెద్దల మాటను వినుటే మేలు
ధనుర్మాసమున శ్రీ రంగనాథుని
దయను పొందగా భక్తియె చాలు.
సింహాద్రి
18.12.2016.
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 3
వ్రతఫలితాలను విశదముగా
గోదాదేవి వివరించిన
మూడవ పాశురమీవేళ
మోదము మీరగ పాడుదమా!
బలిచే దానము గొని వామనుడు
ఇంతింతై మరి ఆకసమంతై
మూడడుగులతో ముల్లోకాలను
నిండి వెలుగు ఆ అద్భుత ఘట్టం
గానము చేయుచు తరింతుమా
అవభృద స్నానం ఆచరింతుమా!
లౌకిక అపేక్ష లడగకున్ననూ
ఫలవాంఛితములు కోరకున్ననూ
వ్యక్తులు దేశము వసుధ సమస్తము
చల్లగ గాచే మాధవ దేవుని
గోపికలారా!తనివారా!
ఆరాధింతుము మనసారా
ప్రభుధర్మానికి ఫలితమొక్కటి
శుచికీ శాంతికి సూచనొక్కటీ
పాతివ్రత్యమును పాటించు మగువల
మన్నన జేయుచు మరి ఇంకొక్కటి
నెల మూడు వానలు కురిపించే
కృష్ణ స్వామిని కొలిచెదమా
ఏపుగ పెరిగిన చేలల్లో
ఎగిరిపడేటి చేప పిల్లలా
విచ్చిన కలువల పుప్పొడి పాన్పుల
విశ్రమించెడి తుమ్మెదగుంపుల
సస్యశ్యామలమగు దేశం
స్వామి అనుగ్రహ సంకేతం
గోవిందు కృపచే గోవుల పొదుగులు
తాకినంతనే తనిసి చేపగా
పాడీపంటతొ ప్రతి ఇల్లూ
వ్రేపల్లెగ ఇల విలసిల్లు
వ్రతఫలితాలివె స్వామి వరం
ఈతి బాధలిక బహుదూరం
సింహాద్రి జ్యోతిర్మయి
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 4
నాల్గవ పాశురమిది వినుమా
నందకిశోరుని మది గనుమా
వ్రత స్నానానికి జలములిమ్మని
వరుణదేవునిదె వేడుదమా
అరవిందాక్షుని పద్మనాభుని
అనన్యభక్తిని ఆశ్రయించుచో
వాసుదేవుని వశవర్తులైన
సర్వదేవతలు సంతసింతురు
పరుగున రావయ్య పర్జన్యా
కురిపించుమయా ఒక వాన
గంభీరుడవగు వరుణదైవమా
కురిసిపోవగా సంశయమా!
కడలిమధ్యకు వడిగా చేరి
మేను నిండుగా తోయము దాల్చీ
నీరదశ్యాముని అందముతో
అంబరవీధిని అగపడుమా!
స్వామి చక్రమై మెరవాలి
స్వామి శంఖమై ఉరమాలి
స్వామి ధనుస్సున వెల్వడు శరములు
కావాలయ్యా నీ వాన చినుకులు
అదిగని లోకం పరవశమై
వ్రతస్నానాలను చేయుగదా!
హరి నీ కరుణే అమృత వర్షం
భక్తుల భాగ్యమె మార్గశీర్షం
ముకుంద!మాధవ!! గోవిందా
మురళీలోలా!యదుబాలా!
హరి హరి హరి శ్రీకృష్ణహరే
పాహి మురారీ పాహి హరే!
సింహాద్రి జ్యోతిర్మయి
19.12.2016
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 5
ఐదవపాశుర మతిమధురం
దామోదరుని శుభనామం
నందుని ఇంటను ఈ చిరుదీపం
యశోద కంటికి అపురూపం
అబ్బురపరిచే లీలలు చూపిన
ఉత్తరమధురను పరిపాలించిన
పావన జలముల అలరే యమునా
తీరవిహారము ప్రీతిగ సలిపిన
గోపాలబాలుని బాంధవ్యం
గోపకులానికి ఆభరణం
తల్లి యశోద ను తరింపజేయ
రోటికి తాటను బందీ ఆయెను
యోగులకైనా దొరకని శ్రీహరి
ఆనందముగా అమ్మకు చిక్కెను
దామోదరుడను నామమ్మే
కృష్ణ స్వామికి అతి ప్రియమే
స్నానించి శుచిగా స్వామిని చేరి
పావన సుమముల పూజించి
చేతులారగా నమస్కరించి
నోరారంగా కీర్తనజేసి
నిండుమనసుతో ధ్యానించ
నందకిశోరుడు దయగనులే
స్థిరమౌ భక్తిని శ్రీహరిని
నమ్మి సతతమూ సేవింప
జన్మజన్మలుగ పోగైన
సంచిత ఆగామి పాపచయం
అగ్నిశిఖలలో దూదివలే
భస్మీపటలము చెందునులే
మానవ జన్మకు కర్మ బంధనం
మోక్షప్రాప్తికౌ ప్రతిబంధకమే
భగవద్ధ్యానం భగవత్సేవ
సంకీర్తనమే తరించు మార్గం
భజగోవిందం గోవిందం
గోవిందం భజ గోవిందం
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 6
ముగ్ధను ఆండాళ్ మేల్కొలిపే
ఆరవపాశుర మిదియేలే
రంగని సేవకు అందరమూ
కలిసి కోవెలకు పోవుదము
వేగుచుక్క ఇదె చూడమ్మా
వేగమె నిద్దురలేవమ్మా
పక్షులు గూళ్ళను వీడి మేతకై
పయనమైనవదె గనవమ్మా
గరుడాళ్వారును అధిరోహించి
వినువీధులలో విహరించే
విష్ణుదేవునదె గనవమ్మా
వడివడి నిద్దుర మేల్కొనుమా
తనను చూడగా తరలిరమ్మని
స్వామి పిలిచెనని సూచిస్తూ
తన కోవెలలో తెల్లని శంఖం
నినదించెనుగా వినలేదా
నిద్దురమత్తును విడవాలి
రంగనికొలువుకు నడవాలి
విషపూతన చనుబాలను త్రాగి
శకటాసుర సంహారము జేసి
పాలకడలిలో శేషతల్పమున
లోకరక్షణకు యోగనిద్రలో
ఉండెడు స్వామిని కొలువంగా
ఉల్లాసముగా కోవెలకూ
వడివడి పోవలె రావమ్మా
విడివడ కన్నులు లేవమ్మా
జగత్కారకుని సర్వేశ్వరుని
హృదయాలయాల నిల్పి యోగులు
హరి హరి హరి యని పిలిచే ధ్వనులవి
మా గుండెలను తట్టిలేపెగద!
కొలువుకు సమయము మించెనుగా
నీకేలా మరి ఈ నిదుర
వడివడి పోవలె కోవెలకూ
విడివడ కన్నులు లేవమ్మా
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 7
రెండవ గోపిక ఇలుజేరి
నిద్దురలేపుచు ఆండాళ్ళు
పాడెడు సుమధుర గానమ్మే
ఏడవ పాశురమగునిదియే
పగటి వేళలో మేతకు పోయి
తిరుగొచ్చిన భరద్వాజ పక్షులు
వేకువ జామున కువకువలాడే
ఆ ధ్వనులైనా వినబడలేదా
ఏలా!గోపిక ఈ మగత
స్వామిని కనగా మనసవదా!
కవ్వము వేసి కమ్మని పెరుగును
గోపెమ్మలిదే చిలుకంగా
మగువలు దాల్చిన మంగళసూత్రము
గాజులు,నగలూ గలగలలాడే
సవ్వడులవిగో వినబడవా
చాలించి నిద్దుర మేల్కొనవా
భువనములన్నీ నిండిన స్వామి
మనవాడగుచూ మనవాడ పుట్టి
దుష్టుల దునిమిన గాథలు భక్తులు
మధురగానముల కీర్తింప
చెవిబడలేదా ఓ మగువా
చేరగరావా హరి గొలువ
నిదుర నటించుట వలదింక
తెలవారుచుండెను ఒక వంక
తేజము నిండిన నీ మోము
చూడగ వాకిట వేచాము
రంగని పూజకు వేళాయే
రమణీ!పోదము రావేమే
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 8
అలసత చాలును అలివేణీ
వీడుము నిద్దుర విరిబోణీ
తూరుపు దిక్కున తెలతెలవారెను
వేలుపు సేవకు వేళమించెను
పచ్చికమేయగ పశుగణము
సాగినదదిగో అటు గనుము
వ్రతముకుపోగా మేమందరము
నీ వాకిటిలో నిలుచున్నాము
కృష్ణుని గుణములు కీర్తిస్తూ
మంగళవాద్యము మ్రోగిస్తూ
రంగనిసేవకు పోవలె త్వరగా
రమ్మా నీవిక వడివడిగా
అశ్వాసురునే అంతముజేసిన
చాణూరముష్టిక యోధుల జంపిన
దేవికి తనయుని దేవాదిదేవుని
సన్నిధిజేరి సేవింపవలెనిక
అరెరే అబలలు నా కొరకై
అపుడే వచ్చిరి వ్రతమునకై
అని పరమాత్ముడు దయతోడ
పర అను వాద్యము మనకిడుగా
ఆండాళ్ మూడవ గోపికను
ఈవిధి నిద్దుర లేపుటయే
అష్టమ పాశుర మనబడును
అష్టాక్షరియే తరింప జేయును
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 9
మణిమాణిక్యపు భవనమున
అతి సుతిమెత్తని పానుపున
హాయినొసంగే అగరుధూపమున
ఆదమరుపుతో నిదురిస్తున్న
మరదలు పిల్లా మామకూతురా
మేమొచ్చామిదె మేల్కొనవా!
సుఖసంపదలవి శాశ్వతమా
కనుగొన ఇహమే మాయసుమా!
నిత్యానందము పరమునొసంగే
యదుకులస్వామిని చేరుదమా
ఆ హరి నామం కడుమధురం
పుణ్యప్రదము ఈ మార్గశిరం
అత్తా! ఉలకదు పలకదుగా
నీ సుత మూగది కాదుగదా!
చెవిటిదైనదా!అలసి ఉన్నదా!
బద్ధకమా!మీ కట్టుదిట్టమా!
మందుపెట్టిరా ఏదైనా
మంత్రమేసిరా ఎవరైనా
రంగని నామము కీర్తనచేసిన
మంత్రశక్తియే నశించు క్షణమున
వైకుంఠ వాసుని కీర్తనము
చేయ వదిలె మా బద్ధకము
కావున నీ ప్రియపుత్రిని లేపు
మాతో పాటు వ్రతముకు పంపు
అంటూ అత్తను వేడుకొను
నవమ పాశురం ఇదియేను
ఆండాళ్ నాల్గవ గోపికను
ఈవిధి నిద్దుర లేపేను
శ్రీహరి నామం అతిమధురం
పుణ్యప్రదము ఈ మార్గశిరం
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 10
నగలూ నగవులు మెరయంగా
సుఖముగ నిదురించు ఓ చెలియా!
మా మాటలకు బదులీయవేమది?
నీ వైఖరి కడు వింతగనున్నది
తీయవేలనే గది తలుపు
బంగారమ్మా నీ పలుకు
తీయకున్ననూ గది తలుపు
తీయగ పలుకుము ఓ పలుకు
నీవ్రతమపుడే ముగిసినదా
వ్రతఫలితము నీ కందినదా
కిరీటమ్మున తులసిమాలలను
దాల్చిన కృష్ణుని దర్శనమైనద పలుకవేలనే ఓ భామా!
స్వామిని గనిన పారవశ్యమా
తీయకున్ననూ గది తలుపు
తీయగ పలుకుము ఓ పలుకు
రాముడు కూల్చిన కుంభకర్ణుని
నిదురే నిన్నిటు ఆవహించెనా
అజ్ఞానపు తెర తొలగించు
హరిని భక్తితో ఆరాధించు
మాతో కలిసి మాధవ దేవుని
సేవించేందుకు వచ్చెదనేనని
తీయకున్ననూ గది తలుపు
తీయగ పలుకుము ఓ పలుకు
అలసత వీడి వ్రతమాచరింప
కృష్ణుడు మదిలో దయగనులే
శ్రద్ధతొ స్వామిని పూజించినచో
పరమపదమ్మే ఒసగునులే
త్వరగా లేవమ్మ గోపెమ్మ
శుచివై బయటకు రావమ్మా
అనుచూ ఐదవ గోపికనూ
ఆండాళ్ వ్రతముకు పిలిచేను
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
తిరుప్పావై పాశురం 11
కాంతులీనెడు బంగరుతీగ
సింగారీ శ్రీమంతురాలా
పావనమగు ఈ మార్గశిరాన
కొలిచే భక్తుల ననుగ్రహించే
లక్ష్మీ నాథుని వ్రతమును మాని
అలక్ష్యము తగునా నిద్దుర తగునా
కుండలవంటి నిండుపొదుగుల
సహస్ర గోవుల పాలనైననూ
క్షణముల పితికే సామర్థ్యముగల
గోపాలకులే నీ సోదరులు
దోషరహితులౌ యోధుల సోదరి
నియమము దప్పుట నీకు పాడియే
లక్ష్మీ నాథుని వ్రతమును మాని
అలక్ష్యము తగునా నిద్దుర తగునా
నెమలిపింఛమే నీ కేశపాశము
పాము పడగయే పిరుదు ప్రదేశము
సొగసుగత్తెనని సిరులున్నవనీ
మిడిసిపడేవో!మము గమనింపవు
చుట్టాలిదిగో వచ్చిచేరిరి
సఖులంతా నీ వాకిట నిలిచిరి
లక్ష్మీనాథుని వ్రతమును మాని
అలక్ష్యము తగునా నిద్దుర తగునా
స్థిరమౌ నిధియన శ్రీహరి నామమె
తీరగు సంపద శ్రీసతి కరుణే
హరి తొలగినచో సిరియును తొలగును
సత్యమునెరిగి స్వామిని కొలువుము
ఉలకవు పలకవు మరియాదా
వ్రతముకు పోదము రారాదా
అనుచును ఆరవ గోపికను
గోదా నిద్దుర లేపేను
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
*తిరుప్పావై పాశురం 12*
సిరిగల వారింటి చిన్నదానివి
శ్రీకృష్ణుని ప్రియమిత్రుని చెల్లివి
ధనుర్మాసమిది తెలియనె లేదా
తెలవారవచ్చెను మెలకువ రాదా
కనరాదా మము గనరాదా
నిద్దుర విడదా మెలకువ రాదా
పొదుగులు బరువై చేపుకువచ్చి
క్షీరధారలు వర్షించ గోవులు
లోగిలి మున్నీటి
వెల్లువ కాగా
చలివేకువలో మంచు కురవగా
వాకిట నిలువగ జాలక మేము
దూలము పట్టుకు వేలాడేము
కనరాదా మము గనరాదా
నిద్దుర విడదా మెలకువ రాదా
కృష్ణ ప్రేమలో సర్వము మరచే
శ్రీదాముడు మీ అన్నగారు
అంతటి సంపద కలిగిన ఆతని
ముద్దుల చెల్లీ!ఓ గోపెమ్మా
మాధవ దేవుని మదిలో తలచి
మైమరపున ఇటు నిదురించేవా
కనరాదా మము గనరాదా
నిద్దుర విడదా మెలకువ రాదా
సీతాపహరణం చేసిన దుష్టుని
దక్షిణదిక్కున లంకానాథుని
కినుక వహించి రణమున గూల్చిన
రమ్యతరమ్మౌ రాముని నామం
సుమధుర వాక్కుల సుస్వరమ్ముల
తన్మయమ్ముతో పాడేమమ్మా
వినరాదా మము గనరాదా
నిద్దుర విడదా మెలకువ రాదా!
శ్రీరామ రామ రామేతీయను
నామము వింటూ ఊరూవాడా
చోద్యము చూడగ వాకిట మూగిరి
అబలా నిను గని అచ్చెరువొందిరి
మగతను వీడి మాతో గూడి
వ్రతమును చేయగ రావే త్వరపడి
అంటూ ఏడవ గోపికను
నిద్ర లేపినది ఆండాళ్ళు
సింహాద్రి జ్యోతిర్మయి
27.12.2022
🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻
*తిరుప్పావై పాశురం 13*
తామరపువ్వున తుమ్మెద వాలిన
తీరున మెరిసే కన్నులదానా
చలించు దృక్కుల లేడికూనలా
బెదురు చూపులను చూసేదానా
నీవిటు నిద్రా పరవశవై
స్వామిని చూడవు తగునా భామా!
గురు నక్షత్రము అస్తమించెను
శుక్రతారయే నభమున వెలిగెను
తెలవారెనని కిలకలరవముల
పక్షులు మేతకు పయనమాయెను
అయినా నిద్రా పరవశవై
ఉండుట తగునా పానుపుపై
కృష్ణుని కాంచగ తహతహలాడి
తనువులు తాపమునొందుచున్నవి
శ్రీవ్రతమునకై నోముసీమకై
చేరే సమయము మించుతున్నది
త్వరగా నిద్దుర మేల్కొనవమ్మా
చన్నీట జలకములాడగదమ్మా
ఇంకా నిద్రా పరవశవై
ఉండుట తగునా పానుపుపై
తెల్లని రెక్కల పర్వతమంటి
బకుని చీల్చిన కృష్ణుని కొందరు
చిగురుల మాదిరి ఆ దశకంఠుని
శిరముల ద్రుంచిన రాముని కొందరు
పరిపరి విధముల ప్రస్తుతి జేయుచు
సాగిరి స్వామిని సేవించుటకై
నీకై నేనిట వేచి యుంటిని
నీ వాకిట నే కాచుకొంటిని
ఇంకా నిద్రా పరవశవై
ఉండుట తగునా పానుపుపై
అంటూ అష్టమ గోపికను
ఆండాళ్ నిద్దుర లేపుచుండెను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.12.2022
తిరుప్పావై పాశురం 14
మగువా! తీయని మాటలు నేర్చి
మమ్మందరినీ నీ వేమార్చి
పడకటింటిలో వెచ్చగ దూరి
నిదురించేవా!నీకు తగదిది
రంగని సేవకు రావమ్మా
జన్మ తరించును నిజమమ్మా
చెలియల్లారా రేపటి రోజున
నేనే ముందుగ నిద్దుర లేచెద
మీ ఇళ్ళకు వచ్చెద మిము మేల్కొలిపెద
నంటూ రాతిరి మాటిచ్చావే
పరిపూర్ణ మతీ!మతి మరిచావా
సిగ్గును వీడి చరియించేవా!
వేకువలో నీ పెరటి తోటలో
చెలి చూడుమదే దిగుడు బావిలో
కలకల విరిసెను ఎర్ర తామరలు
ముడుచుకుపోయెను నల్లకలువలు
కావిరంగుగల వలువలు దాల్చి
కుంచెకోలను చేత ధరించి
రంగని ఆలయద్వారము తెరువగ
అరుగుచునున్న అర్చకులదిగో
పల్వరుసలవే తెల్లగ మెరియగ
పాడుచునుండిరి హరికీర్తనము
దీర్ఘబాహువుల తెల్లని శంఖము
చక్రము దాల్చిన సర్వేశ్వరుని
పద్మనేత్రుని కృష్ణ స్వామిని
సేవించుటకై కీర్తించుటకై
పోదమురావే గోపెమ్మా
నీకీ నిద్దుర తగదమ్మా
అంటూ ఆండాళ్ ఈ రీతి
నవమ గోపికను మేల్కొలిపే
తిరుప్పావై పాశురం 15
లేతచిలుకవలె మృదుమధురముగా
ముద్దుగ పలికే చెలియా!సఖియా!
ఇంకా నిద్దుర లేవవిదేమి?
మా మాటలకు బదులీయవేమి?
పూర్ణులు మీరు గోపికలారా!
చీకాకుపెట్టెద రేలా! మేలా!
మీ మాటలకు జిల్లుమంటిని
ఇదిగో ఇపుడే వచ్చుచుంటిని
ఔరా!ఎంతటి జాణవె చిలుకా!
ఈ మాత్రానికె అంతటి ఉలుకా!
నీ మాటల నేర్పులు,కాఠిన్యములు
మాకు తెలియవా!మేమెరుగనివా!
చాలు చాలునో సఖియల్లారా!
మీతో వాదనలిక నాకేలా!
మీ నేర్పులను మెచ్చితి నేను
పోనిండు నేనే కఠినురాలను
ఏమే చెలియా!నీ ప్రత్యేకత
ఏకాంతముగా ఉండెదవేలా!
బయటకు రావే ఆ గది వదిలి
నోముకు రావే మాతో కలిసి
సరిసరి ఈ మాట చెబుతారా!
గోపికలంతా వచ్చారా!
వచ్చామమ్మా మేమందరము
బయటకు వచ్చి లెక్కించుకొనుము
కువలయపీడనం అను ఏనుగుని
మట్టుబెట్టిన మాధవ దేవుని
శత్రు దర్పమును అణచేవానిని
మనసులు దోచే ప్రియ మాయావిని
మన శ్రీకృష్ణుని మనమెల్లరము
కలిసి కీర్తనము చేయుదము
రమ్మని గోదా పిలువగ వచ్చెను
పదియవ గోపిక పరవశయై
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.12.2022
*తిరుప్పావై ఉత్తర భాగం*
(16-30)
పాశురం -16
నందగోపుని మందిరద్వారము
కావలి కాచే పాలకులారా!
కృష్ణస్వామిని సేవించుటకై
గోపకాంతలము మేమొచ్చాము
దర్శనభాగ్యం కలిగించండి
కన్నార స్వామిని కననీయండి
మంగళకరమౌ పచ్చనితోరము
రెపరెపలాడెడు గరుడధ్వజము
కలిగిన వాకిలి బంధించి ఉంచిన
మణిమాణిక్యపు గడియను తీసి
కన్నార స్వామిని కననీయండి
దర్శనభాగ్యం కలిగించండి
నీలపు మణివలె నిగనిగలాడే
మేనున్నవాని మోహనరూపుని
మాయలు నేర్చిన మానసచోరుని
నందనందనుని కన్నార గాంచే
భాగ్యము మాకు కలిగించండి
దయతో లోనికి పోనివ్వండి
పర అను వాద్యము నిచ్చెద రమ్మని
నిన్నటి మాపున మాటిచ్చెనని
తెలతెలవారక మునుపే లేచి
శుచిగా స్నానము మేమాచరించి
పసిప్రాయముగల గోపకాంతలము
కృష్ణుని దర్శన భాగ్యం కోరి
వచ్చామయ్యా వాకిలి తీసి
లోనికేగనీ మము దయజూసి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.12.2022
తిరుప్పావై పాశురం 17
ద్వారపాలకులు దయతో పంపగ
గోదా మరియు గోపికలంతా
ముదమున నందుని శయనమందిరం
చేరి పాడిరి మేల్కొలుపులను
అన్నము నీరు వస్త్రాదులను
అడిగినవారికి లేదనకుండా
ధర్మబుద్ధి తో దానముజేసే
నందగోప!నీ నందనుడైన
కృష్ణుని జూపి నయనానందము
కలిగించవయా కరుణించవయా
నందవ్రజమ్మును ఏలే నాయక
నయనము విచ్చి మేల్కొనుమింక
ఇంతి యశోదా!ఇతరుల బాధను
సుంతయు సైపని సున్నితమతివే
చిగురుబోడివి మహిళాలోకపు
మణిదీపానివి మా స్వామినివి
పుణ్యముపండి పురుషోత్తముని
కన్న ధన్యవు కన్నయ్య జననీ
నందగోపుని పట్టపుదేవీ!
నయనము విచ్చి మేల్కొనవేమీ
అనుజుడవగుచు స్వామిని కొలిచి
అగ్రజుండవై లాలనజేసి
వరగుణశోభితు వామనమూర్తిని
పాయక నిలిచిన భాగ్యశాలివి
కెంపుల బంగరు అందెను దాల్చిన
మా బలరామా!మేల్కొనవయ్యా!
నిద్దుర తగదని ముద్దుల తమ్ముని
సుద్దులు గరపి లేపగదయ్యా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
01.01.2023
*తిరుప్పావై పాశురం 18*
మదపుటేనుగుల గుంపులనైనా
తన భుజబలమున లొంగదీయగల
నందగోపుని కోడలివైన
నీళాదేవీ!మేల్కొనరాదా!
సప్తవృషభముల అదుపుకు తెచ్చిన
స్వయంవరములో నిను చేపట్టిన
కృష్ణుని ప్రియసతి వమ్మానీవు
కన్నార స్వామిని మము గననివ్వు
విరుల పరిమళం వెదజల్లేటి
నిడుద కురులు గల ఓ నీలవేణీ!
నిదురిస్తున్న నీ అరచేత
అందగించిన పూబంతినిగని
నిన్నటి రాతిరి వేడుక మీరగ
కృష్ణస్వామి తో కందుకక్రీడలు
సలిపితివా యని సందియమాయెను
నీ భాగ్యముగని ఆనందమాయెను
దేవీ!మేల్కొని మము గనరాదా
హరి దర్శనమును చేయింపరాదా
అదిగో!వినుమా!ఆ కోడికూత
తెలవారెనని తెలియగలేదా
ఇదిగో కోయిల మాధవిలతపై
కుహు కుహు మన్నది వినబడలేదా
ఎర్రతామరల పోలిన చేతుల
గలగలలాడే గాజుల మ్రోతల
గుండ్రనివైన మెత్తని వ్రేళుల
గడియను తీసి నీళాదేవీ!
స్వామిని దర్శించి సేవించు భాగ్యం
మాకిడరాదా!దయగనరాదా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.1.2023
*తిరుప్పావై పాశురం 19*
నీళాదేవీ!తెలవారెననీ
ఇంతటి నిద్దుర తగదు నీకని
పరిపరివిధముల ప్రాధేయపడి
లేపేమమ్మా! నిద్దుర లెమ్మా
స్వామి దర్శనం చేయించమ్మా
నయనాందం కలిగించమ్మా
దీపపు సెమ్మెల చిరు చిరు దివ్వెల
ప్రసరించేటి
మంద్రపు కాంతుల
స్వామిని కూడిన తన్మయమ్మున
అర్థ నిమీలితమైన కన్నుల
విశ్రమించిన విశాలనయనీ
దర్శనభాగ్యం మాకు కల్గనీ
స్వామిని లేపి మమ్ముల జూపి
మముబ్రోవమనీ చెప్పగదమ్మా
ఏనుగు దంతపు కోళ్ళు కలిగిన
ఎంతో చక్కని మంచము పైన
తావి గలిగిన అతి సొగసైన
తెల్లని మెత్తని చల్లని దైన
పంచశయనమౌ పానుపు పై నీ
ఎద తలగడపై నిదురిస్తున్న
స్వామిని లేపి మమ్ముల జూపి
మము బ్రోవమని చెప్పగదమ్మా!
కడు సొగసరివి సౌజన్యమూర్తివి
స్నేహశీలివి ప్రేమరాశివి
స్వామిని పొంది విరులూ కాటుక
ధరింపజాలిన భాగ్యశాలివి
కనుసన్నలలో జగతిని నడిపే
స్వామిని కన్నుల నిలిపిన దానివి
కన్నారగని మమ్మేలుకొని
మము బ్రోవమని
చెప్పగదమ్మా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.1.2023
తిరుప్పావై పాశురం 20
నందనందనా నీళారమణా!
నిదుర మేలుకో దీనశరణ్యా
ఋజువర్తనుడా!నిర్మలమూర్తీ
దుష్టశిక్షకా!
ఆశ్రిత రక్షక
గోపీజనప్రియ
మా మొర వినవా!
మేలుకోవా!మమ్మేలుకోవా!
ముప్పది మూడు కోట్ల దేవతల
ముందే బ్రోతువు
ముప్పు గ్రహించి
నిరతము నిన్నే కొలిచేము కదా
అబలలమనియా!మా మొర వినవు
సకలము మరచీ
సర్వము నీవని
రాగముతో నిను చేరితిమయ్యా
అభయమొసంగి ఆశ్రయమిచ్చి
మమ్మేలవయా మా కన్నయ్యా
నందకిశోరుడు నవనీతచోరుడు
నిద్దురలేవడు నీళాదేవీ
మామొర వినమని మమ్మేలమని
నిద్దుర లెమ్మని నీ ప్రాణేశుని
మురిపెము మీరగ ముద్దుగ చెప్పి
మేలుకొలపవే పరిపూర్ణ మతీ!
మాతృత్వముతో తొణికిసలాడే
స్తనమండలము సన్నని నడుము
చిరునవ్వొలికే బింబాధరము
నీ సౌందర్యము సిరితో సమము
మామొర వినమని మమ్మేలమని
నిద్దుర లెమ్మని నీ ప్రాణేశుని
మా నోమునకు ఫలమాతడని
తెలిపి లేపవే పరిపూర్ణ మతీ!
సౌభాగ్యవతీ! స్వామికి చెప్పి
ముకురము మరియు వింజామరము
మాకిప్పించిన తరియించెదము
జ్ఞానాంబుధిలో స్నానించెదము
స్వామి కరుణతో వ్రతము ముగించి
దేవదేవుని సన్నిధిచేరే
మార్గముచూపవె మాధవ దేవుని
హృదయనివాసిని సుమధుర హాసిని
తిరుప్పావై పాశురం 21
గోదాబృందపు విన్నపాలకు
మెలకువ వచ్చిన నీళాదేవి
అభయమునివ్వ అనునయమ్ముతో
ఎల్లరుకూడి స్వామిని చేరి
మేలుకొలుపులను పాడిరదే
కనివిని ఎరుగని భాగ్యమదే
ఇలలో పుట్టిన కామధేనువై
మందల మందల నీ గోసంపద
కుండల కుండల నిండుధారల
కురిపించేను పాలవెల్లువ
ఆ మందల రేడౌ నందుని పుత్రా!
నిద్దుర నుండి మేల్కొనవయ్యా!
వేదవిదిత!ఓ వేద స్వరూపా!
పరంజ్యోతివే ఓ పరమాత్మా!
ఇహమూపరమూ నీవే మాకని
అహము వీడి నీ అండనుకోరి
ఆశ్రయిస్తిమీ!నందనందనా!
నిద్దుర మేల్కొని దయగనరాదా!
ఆశ్రిత రక్షణ కొరకే నీవు
కృష్ణా! భువిపై జన్మించావు
దివ్యమైన నీ మంగళమూర్తిని
తనివారా మా కనులా కనుగొని
చదివి మంగళాశాసనములని
కళ్యాణ గుణములు కీర్తించాలని
వచ్చామయ్యా!దయతో చూడు
నిద్దురలేచి మము కాపాడు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.1.2023
*తిరుప్పావై పాశురం 22*
చాలును కృష్ణా!నిద్దుర చాలును
విచ్చి మేలుకో నీ కన్నులను
బ్రహ్మాండమ్ముల నేలే స్వామీ
పుండరీకాక్షా!కను మమ్ములను
రమ్యమైన ఈ భూమండలమును
రాజసమ్ముతో ఏలిన ప్రభువులు
ఆధిపత్యమును ఆధిక్యమును
అహంకారమును ఆవలనెట్టి
నీ పర్యంకము చుట్టూ చేరి
వేచి యుండగా దయజూచెదవే
గోపీజనప్రియ బిరుదాంకితుడవు
మా కన్నయ్యా మమ్మేల గనవు
గలగల గలగల సవ్వడిచేసే
సిరిసిరిమువ్వల చిరు చిరు గంటలు
రవికిరణమ్ములు సోకినంతనే
మెల్లగవిచ్చే తామరరేకులు
పోలిన కన్నులు అరమోడ్పులవ
పుండరీకాక్షా!మము కనుగొనవా
గోపీజన ప్రియ బిరుదాంకితుడవు
మా కన్నయ్యా మమ్మేల గనవు
ఏకకాలమున సూర్యుడు చంద్రుడు
వెలగగ చీకటి చెదరే రీతి
నీదు కటాక్షము మాపై వ్రాలిన
మా గత జన్మల పాపములన్నీ
నశియించునుగా తరియింతుముగా
వేచిన మేము నీవారమెగా
గోపీజన ప్రియ బిరుదాంకితుడవు
మా కన్నయ్యా మమ్మేల గనవు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.1.2023
తిరుప్పావై పాశురం 23
కమలలోచనా!ఓ శ్రీ కృష్ణా
నందనందనా మా గోవిందా
మా మొరవినగా మము పాలింపగ
నిద్దుర లేచి ఇటు రావయ్యా
అతసీపుష్పపు నీలపుకాంతులు
అలమి అలరునీ సుందరదేహము
కనుగొనినంతనె కలుగును స్వామీ
మా కనుదోయికి పరమానందము
గుహను వెలువడే సింగమువోలే
శయనమందిరం విడి రారాదా
మా మొర వినగా మము పాలింపగ
నిద్దుర లేచి ఇటు రావయ్యా
వానకారులో వనిలో గుహలో
నిద్దురలేచిన మృగరాజనగా
వింత పరిమళం వెదజల్లే తన
జూలు విదిల్చి తనువు కదిల్చి
సాగి నిలబడి గర్జన చేయుచు
గుహను వెలువడే సింగమువోలే
సింహాసనమును అధిరోహించ
శయన మందిరం విడి రారాదా
వృషభరాజమున ఒలికే ఠీవిని
కరిగమనములో గాంభీర్యమును
వ్యాఘ్రపు నడకల చురుకుదనాన్ని
కంఠీరవేంద్రావలగ్నా!కృష్ణా!
నీ అడుగుల లో చూపుచువచ్చి
సింహాసనమును అధిరోహించి
గుహను వెలువడే సింగమువోలే
శయన మందిరం విడి రారాదా
నీ ఎడబాటును మేమోర్వలేము
నీ అనుగ్రహమే మా వాంఛితము
హరి నీ అడుగుల కేసరి విభవము
ఉట్టిపడేలా చేరగరమ్ము
దర్శన భాగ్యం అందేవరకూ
ఓపికతో నీ వాకిట నిలుతుము
గుహను వెలువడే సింగమువోలే
శయన మందిరం విడి రారాదా
సింహాద్రి జ్యోతిర్మయి
7.1.2023
తిరుప్పావై పాశురం 24
ఏమి భాగ్యమే చెలియల్లారా
ఎంత శుభదినం సఖియల్లారా
పున్నెముపండి నోములు పండి
మన కన్నులలో పున్నమి నింపగ
జగదానంద కారకుడదిగో
మనలను చూడగ వచ్చాడిదిగో
అయ్యో స్వామీ మా అపచారం
మన్నించవయా మా కన్నయ్యా
మా కోరికలను తీర్చగ నీవు
వ్రాలిన దయతో వచ్చినవేళ
కోమల సుందర నీ పదద్వంద్వము
ఎంత నొచ్చెనో ఏమో స్వామీ
మూడడుగులతో జగతిని కొలిచిన
బ్రహ్మ కడిగిన నీ పదములకు
సీతను కావగ లంకను గెలిచి
రావణు కూల్చిన నీ భుజశక్తికి
తగలకుండ ఏ దృష్టి దోషము
పాడేమయ్యా మంగళము
శకటాసురునే కాలితాపుతో
సంహరించిన శాశ్వత కీర్తికి
అసురద్వయమును అంతము జేయగ
పరాక్రమించిన పదభంగిమకు
తగలకుండ ఏ దృష్టి దోషము
పాడేమయ్యా మంగళము
అచ్చరగణమే అచ్చెరువొందగ
ఏకధాటిగా ఏడు దినములు
గోవర్ధనమును గోటిని నిలిపి
గోకులానికే గొడుగుగ పట్టి
కాచిన నీదు కళ్యాణగుణములు
కీర్తనజేసి హారతులిచ్చి
తగలకుండ ఏ దృష్టి దోషము
పాడేమయ్యా మంగళము
వేణుమాధవా మంగళము
వేలాయుధముకు మంగళము
వ్రతముకు ఫలముగ
పర వాయిద్యము
అనుగ్రహించి ఆదరించమని
పరమభక్తితో మేమందరము
పాడేమయ్యా మంగళము
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
తిరుప్పావై పాశురం 25
అష్టమి పుట్టి దుష్టుల దునిమి
శిష్టుల బ్రోచిన మా శ్రీకృష్ణా!
పరిపరి విధముల నీ లీలలను
మరిమరి తలచి కీర్తించెదము
చతుర్భుజములు శంఖము చక్రము
వెలయగ చెరలో వెలసిన రాత్రే
కనుతెరవకనే కన్న దేవకికి
ఎడమై యశోద ఒడి చేరితివే
దేవదేవునే సుతుగా పొందిన
దేవకి భాగ్యము నెన్నగ తరమా
స్తన్యమునిచ్చి కొట్టగ కట్టగ
నోచిన యశోద పుణ్యము ఘనమా
దాగి పెరుగుతూ మామ పంపిన
రక్కసి మూకల నుక్కడగించి
భయపడు కంసుని కడుపున చిచ్చయి
అతనిని జేరి అంతము జేసి
మాయలు జేసి మహిమలు చూపి
మనసులు దోచిన మా కృష్ణయ్యా
పరిపరి విధముల నీ లీలలను
మరి మరి తలచి కీర్తించెదము
లోకములన్నీ సిరినే కోరగ
సిరి నిను కోరే శ్రీమంతుడవే
ఆశ్రిత మోహము నీ శుభ గుణము
ఆశ్రిత కోటికి అదియే వరము
నిను సేవించే భాగ్యము నిమ్ము
పర వాయిద్యము వరముగ నిమ్ము
దేవకినందన! యశోదతనయా !
వసుదేవాత్మజ!నందకుమారా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
తిరుప్పావై పాశురం 26
యదుకుల దీపా మోహన రూపా
దయగనవచ్చిన ప్రేమ స్వరూపా
నిను గని తనిసెను మా కనుదోయి
వందనమోయి వటపత్రశాయి
ఇంద్రనీలమణి కాంతులు చిందే
సుందరదేహా ఆశ్రిత మోహా
లీలామానుష రూపమునీది
నిను గని మురిసే భాగ్యము మాది
పూజ్యులైన మా పెద్దలు పూర్వము
చేసి తరించిన శుభకరమైన
మార్గశీర్షవ్రత స్నానాచరణకు
వలసినవేమో విన్నవింతుము
భూనభోంతరం దద్దరిల్లగా
లోకాలన్నీ వడవడవణకగ
నినదించే నీ పాంచజన్యమును
పోలిన శంఖులు కావాలయ్యా
భూనభోంతరం కాంతులు చిమ్మి
లోకాలన్నీ వెలుగులు నింపే
మిలమిల మెరిసే సుదర్శనమ్మును
పోలిన దీపం కావాలయ్యా
వ్రజకాంతలదే వ్రతమును చేయగ
అచ్చట కూడిరి అదిగదిగదిగో
అని చాటించగ గరుడధ్వజమును
పోలిన పతాక కావాలయ్యా
చిన్ని శిశువు గా యమునను దాటే
సందర్భములో స్వామీ నీపై
గొడుగును పట్టిన ఆదిశేషుని
పోలిన చాందిని కావాలయ్యా
మంగళకరమౌ నీ శుభ గాథలు
మేలుగ పలికే పండితమండలి
పర వాయిద్యము పోలిన మంగళ
వాయిద్యమ్ములు కావాలయ్యా
ఇన్ని వరములు అడిగెదరేలా
ఈయగలేనని అనెదవదేలా
గుట్టగ పదునాల్గు భువనాలన్నీ
కృష్ణా గుట్టుగ బొజ్జను దాచి
మర్రియాకుపై పవళించావే
మా చిరు కోర్కెలు తీర్చగలేవా
ఘటనాఘటనల నేరుపు నీది
నీకిక సాధ్యము కానిది ఏది
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.1.2023
తిరుప్పావై పాశురం 27
భజగోవిందం గోవిందం
గోవిందనామం అతి మధురం
కూడని వారిని కూడా గెలిచి
వశపరచుకునే మోహన మంత్రం
ద్వేషము బూని దూషించువారిని
ఉదాసీనులై ఉండేవారిని
మా మొర వినమని మమ్మేలవేమని
ముగ్ధ భక్తితో అలిగేవారిని
ఒక్క తీరుగా అక్కునజేర్చే
అష్టాక్షరముల శుభ మంత్రం
నీ గుణసంపద కీర్తించి
పరవాయిద్యము సాధించి
మంగళకరమౌ వ్రతము ముగించి
నీ అనుగ్రహమును సంపాదించి
ఆనందించే శుభవేళ
ఆశించేము నీ సమ్మానం
ప్రియముగ నీకు మ్రొక్కే చేతులు
ద్వయమంత్రముతో తనిసే వీనులు
ప్రదక్షిణమ్ములు చేసే పదములు
నీ సన్నిధికి చేరే తనువులు
అతిశయించిన అందముతో
అలరే సంపద మాకివ్వు
చేతికి గాజులు మాకివ్వు
దండ కడియము మాకివ్వు
చెవులకు దుద్దులు మాకివ్వు
కర్ణపుష్పములు మాకివ్వు
వేళ్ళకు మెట్టెలు కాలికి అందెలు
పట్టుచీరలను మాకివ్వు
నీ అనుగ్రహమే అలంకారముగ
మురిసే భాగ్యం మాకివ్వు
ఆవుపాలతో ఆవు నేతితో
ఘుమఘుమలాడే పరమాన్నం
దోసిట పట్టగ నేతిధారలు
ముంజేతులపై జారుతుండగా
ఆనందంగా నీతో కలిసి
ఆరగించెడి అదృష్టం
మా కన్నయ్యా మాకివ్వు
అదియే ఘనమౌ సన్మానం
11.1.2023
తిరుప్పావై పాశురం 28
సుందర యమునా తీరవిహారా
సుమధుర మురళీ గానవిలోలా
అడిగినవిచ్చెద అర్హతలేమో
సెలవీయమనీ మమ్మడిగేవా
గోవిందా అని నోరారా
పిలిచేము కదా మనసారా
ఆశగ వచ్చిన చెలులమయా
అన్నెము పున్నెము ఎరుగమయా
చదువూ సంధ్యలు లేనివాళ్ళము
జపమూ తపమూ చేయని వాళ్ళం
పుణ్య తీర్థములు చూడనివాళ్ళం
అవివేకులము అజ్ఞానులము
పొద్దునలేచి చద్దిమూటతో
ఆలనుమేపగ అడవుల వెంట
తిరిగే వాళ్ళం తీరులెరుగము
గోవులగాచే గోపెమ్మలము
చేదుకొనుటకు చేసిన పుణ్యం
మీకేముందని అంటావేమో!
నీవు జనించిన గోపకులంలో
పుట్టడమే మా అదృష్టం
తెంచగలేనిది ఈ బంధం
ధన్యము కాదా మా జన్మం
ఇంతకుమించిన పుణ్య బలం
ఉండదు ఉండదు ఇది సత్యం
సహస్ర నామము లున్నవనీ
కళ్యాణగుణముల రాశివనీ
ఎరుగక మేము మా వాడవనీ
కన్నా కృష్ణా గోవిందా అని
చనువును చూపి పిలిచినందుకు
స్వామీ మాపై ఆగ్రహించకు
నీ దయరాగా లోటేమీ
అనుగ్రహించుము మా స్వామీ
పరవాయిద్యము ఇప్పించు
వ్రతఫలితం మాకందించు
ఆశగ వచ్చిన చెలులమయా
అన్నెము పున్నెము ఎరుగమయా
11.1.2023
తిరుప్పావై పాశురం 29
మధురం మధురం మధురం మధురం
గోపాల గోవింద నామం మధురం
మధురం మధురం మధురం మధురం
మన శ్రీకృష్ణుని సన్నిధి మధురం
మంచుతెరలలో మార్గశిరం లో
తెలతెలవారక మునుపే లేచి
అందమైన నీ పద కమలాలను
ఆరాధించగ వచ్చామయ్యా
నీకు మంగళాశాసన విధులను
చేయగ వచ్చిన మా వేడుకను
మన్నించనని నీవనదగదు
మా కైంకర్యము వలదనవలదు
పశువుల గాచే యాదవకులమే
యదుకుల స్వామీ నీదీ మాదీ
ఎల్లకాలమూ ఏడేడు జన్మలు
విడిపోనిదయా మన సంబంధము
పర అను వాద్యం ఒక మిషగా
దరిజేరిన మా వాంఛితార్థము (వాంఛితము)
నీళారమణా నీవెరుగనిదా
నీ పద సేవే మోక్షముకాదా
పరమే నీవని భావించాము
పరమాత్ముడవని సేవించేము
ఈతిబాధలూ ఐహిక వాంఛలు
మాలో తొలగగ మము దీవించు
నీ కైంకర్యము చేసిన చాలు
మా జన్మమ్ములు తరించిపోవా
పురుషోత్తముడా!ప్రియ బాంధవుడా
మమ్మేలవయా మాధవ దేవా
12.1.2023
తిరుప్పావై పాశురం 30
మాసములందున మార్గశీర్షము
నేనని చాటిన గీతాచార్యుడు
ఆముక్తమాల్యద లందినవాడు
ఆండాళ్ పాణిని పట్టినవాడు
తనను వరించిన గోదాదేవికి
పరమ ప్రీతితో
పల్లకి పంపి
శ్రీరంగములో తనకోవెలలో
వరించి సన్నిధి నొసగినవాడు
కేశవ మాధవ నామాంకితుడు
శివ బ్రహ్మలకూ మూలమాతడు
ద్వాపర యుగమున వ్రేపల్లియలో
చంద్రవదనలౌ గోపకాంతలు
స్వామిని చేరి స్తుతులను పాడి
పర సాధించి తరియించారో
అటులే కలిలో ధన్వి పురములో
వెలసిన శ్రీ రంగనాథుని వలచి
తామరపూసల మాలలు ధరించు
భట్టనాథుని ప్రియపుత్రికయౌ
గోదాదేవి ద్రవిడభాషలో
కూర్చిన ముప్పది పాశురమాలిక
మధురభక్తిలో ప్రవహించెనది
భక్తిసారమై ప్రవహించినది
క్రమము తప్పక మార్గశిరంలో
పాడిన విన్న అదృష్టవంతులు
నాటి గోపికలు గోదాదేవి
పొందిన ఫలమును తామందెదరు
ఓడలు కలిగిన పాలకడలిని
చిలికే అమరుల కండగనిలిచి
అమృతభాండము అవ్వారికొసగి
ఆదిలక్ష్మి ని చేపట్టిన హరి
భవ సాగరమును దాటగలేక
నిస్సహాయులై మ్రొక్కేవారిని
అష్టాక్షరియై తరింపజేయును
అష్టైశ్వర్యము లనుగ్రహించును
నగసమ నాలుగు భుజముల వాని
అరుణిమ కలిగిన కన్నులవాని
ఎదపై లక్ష్మిని నిలిపిన వానిని
దయసాధించి ధన్యులగుదురు
ఫలశ్రుతి నిచ్చే చివరి పాశురం
పరమభక్తితో పాడి తరిద్దాం
ఆలయాలలో గోదారంగల
కళ్యాణాన్ని కాంచి తరిద్దాం
కళ్యాణం వైభోగం
కమనీయం రమణీయం
రంగని నామం అతిమధురం
గోదా చరితం అతి మధురం
తిరుప్పావై గేయానువాదం స్వేచ్ఛానువాదం
సంపూర్ణం
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
12.1.2023
సింహాద్రి జ్యోతిర్మయి
(నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం)
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఒంగోలు
9866014619
Comments
Post a Comment