21.జాతిరత్న దీప్తులు
********************************************************
1.సర్వేపల్లి(పద్యకవిత)
2.నట(నాయక)రత్న
3.బాలమరళీకృష్ణ
4.అభినందన్
5.వీరపత్ని
6.గాంధీ వర్ధంతి
7.జై చిరంజీవ
8.టి.కృష్ణ వర్ధంతి
9.YSR మరణం
10.అటల్ బిహారీ వాజపేయి
11.బాల గంధర్వుడు
12.గురజాడ కావ్య కన్యకలు
13.సినారె
14.శ్రీశ్రీ
15.కందుకూరి
16.సిరివెన్నెల
17.మహానటి సావిత్రి
18.దాసరి నారాయణరావు
19.శ్రీదేవి
20.నట(లోక) సామ్రాట్
21.కృష్ణశాస్త్రి
22.మలాలా
23.భారతరత్న అంబేద్కర్
24.జాషువా జయంతి
25.జాషువా వర్ధంతి
26.డాక్టర్ అబ్దుల్ కలామ్
27.హేండ్సమ్ విలన్ సోనూ సూద్
28.కవి సమ్రాట్
29.ఈ బాలుడు గానలోలుడు
30.నెంబర్ వన్
31.అందాలే (లే) జమున
32.గద్దర్ కు నివాళి
33.కళాతపస్వి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి
ఉపాధ్యాయ దినోత్సవం
1.*గురుపూజ*
తే.గీ.
తెలుగువారి బిడ్డగ పుట్టి తేజరిల్లి
తత్వశాస్త్రము చదివి సద్వర్తనమున
అంది ఆదర్శవిద్యార్థి అను యశమును
రాణకెక్కె సర్వేపల్లి రాధకృష్ణ
తే.గీ.
చూడచక్కని తలపాగ సొంపుమీరు
దాల్చు మీ కోటు మోకాళ్ళు దాటియుండు
కళ్ళజోడు వెనుక జ్ఞానకాంతి సుధలు
చిందు నీ రూపు మొక్కులనందె గాద.
తే.గీ.
గురువుపై అభిమానంపు గురుతు చాట
శిష్య గణము మైసూరున చేతులార
మీదు గుర్రపు బగ్గీని మోదమలర
వీధులన్ మోయ మీ ఖ్యాతి విదితమయ్యె.
తే.గీ.
రత్న మనదగ్గ గురువులై రమ్య కీర్తి
అలర భారతరత్నమ్ము నందినారు
మేటివై రాష్ట్రపతి యను మేలి పదవి
అధివసిస్తిరి గురులెల్ల ఆత్మ మురియ.
తే.గీ.
మీరు పేర్గన్న వృత్తిలో మేముకూడ
భాగమగుటచే గౌరవ భాగ్యమబ్బి
వృత్తి కంకితమగు స్ఫూర్తి వెల్లివిరియ
అందుదుము గురుపూజోత్స వాదరమును.
సింహాద్రి జ్యోతిర్మయి
5.9.2017.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
2.నట (నాయక) రత్న.
నరుడా!ఏమి నీ కోరిక?
అంటూ
ఏ దేవత తెలుగువారిని
దీవించి అతడిని
మనకోసం
పంపిందో గానీ
అందాల ఆ తోటరాముడు
ఆంధ్రుల ఆరాధ్య రాముడయ్యాడు.
అన్నికోణాల కెమేరా కంటికీ
ఇంపుగా కనిపించే రూపమతడిది.
అందం,ఆవేశం,గాంభీర్యం
అభినయం,అంకితభావం
క్రమశిక్షణ,కఠోరశ్రమ
చొచ్చుకుపోయే చొరవ
పట్టును వీడని తెగువ
ఇన్నింటికీ ఒక్కటే పేరు.
ఎవరు తెలుగునాట
ఈ నందమూరిని
ఎరుగని వారు?
రాముడి సౌమ్యం
కృష్ణుడి చాతుర్యం
రావణ దర్పం
రారాజు గర్వం
అతడిలో పలకని భావమేది?
అతడులేని
తెలుగు సినిమా
ఊహకందనిది.
నిండు యవ్వనాన
పండుముసలి భీష్ముడీ బడిపంతులు
ఏడు పదుల వయసులోనూ
వాడితగ్గని నట చంద్రకాంతుడు
ఆ నటనా కౌశలంలో
ప్రతినాయకుడైనా నాయకుడే.
జగదేకవీరుడై అలరించినా,
జగన్నాటక సూత్రధారి అనిపించినా
ఆ నటరత్నం
తెలుగు హృదయాలు
కొల్లగొన్న బందిపోటు
విశ్వ విఖ్యాత నటనను
అభిమానుల కెరవేసిన వేటగాడు.
పౌరాణిక పాత్రకతడు ఏకవీరుడు
యమగోల చేయగల సింహబలుడు
బృందావనంలో అందరి గోవిందుడు తాను,
మెప్పించగలిగాడు బృహన్నలగానూ.
అతడి రక్త సంబంధం
తెప్పిస్తుంది కంటిచెమ్మ
*అన్న* అన్నమాటకతడు
ఆంధ్రుల ఇంటి చిరునామా.
వందల సినిమాల
విలక్షణ నటన తీరు
మరపురాదు ఎన్నటికీ
అతని మాయాబజారు.
ఆత్మగౌరవ నినాదం తెలుగువారికి
అందించిన ఘనత మన నందమూరిది.
ఓ! నట సార్వ భౌముడా!
నువ్వు తెలుగువాడివి కావటం
తెలుగు జాతి పుణ్యఫలం
భారతీయ సినిమాకి ఆత్మవి నువ్వు
*భారత (మాత మెడలోని)రత్న* హార మీవు.
సింహాద్రి
జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.1.2019
అన్నగారు దివంగతులైనప్పుడు రాసిన కవిత ఇది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3.స్వర శిఖరం
స్వర శిఖరానికి కందాంజలి.
1.కం.
లాలిత గానామృత ఝరి
బాలమురళి నారదాది భాగవతులకున్
వేలును విడిచిన బంధువొ
ఏలగ స్వర జగతి దిగిన ఏ తుంబురుడో!
2.కం.
పలుకే బంగారమనుచు
చిలికెను ఆ స్వరము సుధలు క్షితి నలుగడలన్
సలలిత రాగపు వైద్యుడు
అలరెను గుప్పెడు మనసుల అజరామరుడై.
3.కం.
సరిగమలందున బ్రహ్మ గ
సరికొత్తగ సృష్టి జేసె శ్రావ్యపు స్వరముల్
బిరుదావళి వరియించగ
గిరి శిఖరము వంటి కీర్తి గెలిచె స్థిరముగన్.
4.కం.
ఎంగిలి నీకెటులిత్తును?
లింగా! నేనేమి చేతు? లెంకను అనుచున్
సంగీతమ్మున మొరలిడ
చెంగట పాడించుకొనగ చేర్చుకొనితివో!
5.కం.
స్వర రారాజా!అంజలి
మురళీకృష్ణా! నివాళి ముత్యాశ్రులతో
చిరకాలము కొలువుందువు
స్థిరముగ రసహృదయులందు చేరుము పరమున్.
సింహాద్రి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
4.* తప్పే(ది)కాదు*
పది రోజుల క్రితం
పాక్ ఉగ్రవాద దాడిలో
సంభవించిన
సైనికుల మరణాలకు
దిగ్భ్రాంతి
ఛిద్రమైన
వారి మృతదేహాలను
చూసి
సలసలా
మరిగిన రక్తం
దాయాది దేశపు
దుశ్చర్యలకు
దీటైన సమాధానం చెప్పాలని
ఉరకలేసిన ఉద్రేకం
పగవాడికి
మన సత్తా
చూపించి తీరాలని
ఆక్రోశించిన ఆవేశం
అమరులైన
సైనికుల కు
ఆత్మ శాంతి
కలిగించాలని
ముక్త కంఠం తో
నినదించిన దేశభక్తి
జాతి చేవ చాటడానికి
నేతలు నిర్ణయించారని తెలిసి
ఉప్పొంగిన సమరోత్సాహం
ప్రతీకార చర్యల్లో
పైచేయి సాధించామన్న ఆనందం
అంతలోనే
అయ్యో పాపం
అంతమంది మరణించారే అని
ఆది నుండీ
వంటపట్టించుకున్న
అహింసా భావం తో
విలవిలలాడిన
హృదయ శాంతి కపోతం
అయితే
ఉగ్రవాదులు
పట్టుబడితేనే మనం
పెళ్లి కొడుకుల్లా
మర్యాదలు చేస్తుంటే
యుద్ధ ఖైదీని
దండించరాదన్న
నియమాన్ని విస్మరించి
అభినందన్ ని
అంతలా హింసించి
వీడియోలు
విడుదల చేస్తుంటే
మనసులో
ఏ మూలనో ఉన్న
సాటి మానవులన్న
సానుభూతి
సమూలంగా
తుడిచిపెట్టుకు పోయింది
అభినందన్ ను
ఆలస్యం లేకుండా
విడిపించుకుని
ప్రపంచ దేశాల
అభినందనలు
అందుకోవడమే
నేడు మనముందున్న లక్ష్యం
అదే
జాతి జనులకు శాంతి
దేశమాత
పరువుకు ఖ్యాతి.
సింహాద్రి జ్యోతిర్మయి
27.2.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
5* వీరపత్ని *
నిన్ను చూసి నేను
గర్వపడుతున్నా
కానీ నువ్వు నాకు
చేసిన బాస
అసత్యమని
ఆలస్యంగా
తెలుసుకున్నా
నా కన్నా ఎక్కువ గా
నీవు ఈ నేలతల్లి నే
ప్రేమించావని తెలిసి
అసూయ పడుతున్నా
అయినా అది నాకు
గర్వం గానే ఉంది
నిన్ను ఎంతగానో
ప్రేమించే మాకంటే
నీవెన్నడూ
చూసి ఎరుగని వారికోసం
నీ జీవితాన్ని
త్యాగం చేసిన
నిన్ను చూసి నేను
గర్వపడుతున్నా
నిన్ను నా భర్తగా
పొందినందుకు
గర్వపడుతున్నా
నా భర్త
పార్థివ దేహాన్ని
చూసి
ఎవ్వరూ
కంటతడి పెట్టకండి
అది ఎవ్వరికీ
అందనంత ఎత్తులో ఉన్న నా భర్త
ఔన్నత్యాన్ని
త్యాగాన్ని
కించపరుస్తుంది
ఒక వీర సైనికుడి
భార్య గా
తలఎత్తుకు జీవించే
ధన్యతను నాకు
మిగిల్చి
తరలిపోతున్న
నా ప్రాణమా!
నీకిదే నా వందనం
కడసారి గా
సగర్వంగా.....
నా మనసుని
కదిలించిన
ఆ వీరపత్ని హృదయాన్ని నాకు
చేతనైన భాషలో,
భావంతో
అనువదించడానికి
ప్రయత్నించా.
🙏🙏🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర
ఉపాధ్యక్షురాలు
23.2.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
నేడు జనవరి 30 వ తేదీ
గాంధీజీ వర్థంతి ని
జాతీయ అమరవీరుల దినోత్సవం
గా పాటిస్తున్న సందర్భంగా నా కవిత
6.పూజా పుష్పం
అతడు జన్మించిన రోజు
అంతర్జాతీయ
అహింసా దినం
అతడు జాతి జాగృతికి
అడుగు కదిపిన రోజు
అది దండి సత్యాగ్రహం
అతడు
జలియన్ వాలాబాగ్
దురంతానికి చలిస్తే
అది సహాయనిరాకరణం
చరఖా పట్టమని
చేనేత ధరించమని
అతడు సందేశమిస్తే
అది విదేశీ వస్తు బహిష్కరణ
ఉద్యమిద్దాం
లేదా
మరణిద్దాం
అని అతడు పిలుపునిస్తే
అది క్విట్ ఇండియా మహోద్యమం
అతడు శాంతి అహింసల
కవచాలు ధరించి
కదనానికి నడుం కడితే
అది స్వాతంత్ర్య సంగ్రామం
హేరామ్ అంటూ అతడు
తూటాలకు
నేలకొరిగిన రోజు
జాతీయ అమరవీరుల
సంస్మరణ దినం
జాతినొక్కతాటిపై
నడిపిన నేత
అతడు జాతిపిత
భరత జాతి స్ఫూర్తికి ఆత్మ
అతడు మహాత్మ
మాతృదేశం కోసం
మహోన్నత త్యాగాలు చేసి
రాలిన ప్రతి ప్రాణాన్ని
భరతమాత పాదాలను
అర్చించే
పూజాపుష్పంగా సంభావించే
ఈ పవిత్ర దినాన
అమరవీరులను
సంస్మరిద్దాం
బోసినవ్వుల బాపూజీకి
నివాళులర్పిద్దాం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.1.2019.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాటిలో 138 సినిమా పేర్లతో
సురేఖా పరిణయ కథ.
7.*జై చిరంజీవ*
ఈ కథ ఇప్పటిది కాదు.
ఇది చాలా ఏళ్ళ క్రితం మాట .
సురేఖ గారి *డాడీ* అదేనండీ! మన అల్లు రామలింగయ్య గారు,ఆమె *అన్నయ్య* అరవింద్ గారు వాళ్ళ అమ్మాయికి *హీరో* లాంటి *మొగుడు కావాలి* అనుకున్నారు.
అమ్మాయికి పెళ్ళి చేసి *చూడాలని ఉంది* అని అల్లు గారూ, *బావగారూ! బాగున్నారా* అని పిలవాలని అరవింద్ గారు పెళ్ళి కొడుకు ల *వేట* లో పడ్డారు.మంచి సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పండి అని అల్లు గారు *స్నేహం కోసం* ప్రాణం ఇచ్చే తన *ఇద్దరు మిత్రులు* అయిన *తాయారమ్మ బంగారయ్య* లను అడిగారు.
వాళ్ళు దానికేం భాగ్యం! అలాగే చూస్తాం .కానీ నువ్వొక *మొండి ఘటం*.
మొన్నటికి మొన్న *కొండవీటి రాజా* సంబంధం తెస్తే , వాడు *కొండవీటి దొంగ* లా ఉన్నాడు వద్దు పొమ్మన్నావు. ఆహా సరేలే అని ఆ *శంకర్ దాదా MBBS* సంబంధం తెచ్చాం. *శంకర్ దాదా జిందాబాద్* అంటావనుకుంటే ,దాదానా! అదేం పేరు? *రుస్తుం*, *బ్రూస్ లీ* *స్టేట్ రౌడీ* , *గ్యాంగ్ లీడర్* ఇవా పేర్లు? .ఆ పేరు నాకు నచ్చలేదు వద్దు అనేశావు. ఈసారి నీకు తప్పక నచ్చుతుందని *SP పరశురాం* సంబంధం తెచ్చాం.నాకు ఈ ఎస్పీలు, *గూఢచారి నెంబర్ వన్* లు నచ్చరన్నావు.
అవునోయ్.అన్నాను. అన్నావు అంటే అననూ మరి! నా తిప్పలు మీకేం తెలుసు? నా కూతురు నా ప్రాణం .*ప్రాణం ఖరీదు* కట్టగలమా! మొన్నామధ్య పెళ్ళిళ్ళ పేరయ్య కనబడితే అమ్మాయి కి సంబంధాలుంటే చెప్పమని అడిగాను.ఏవరో *మెకానిక్ అల్లుడు* అట.పేరు *నాగు* అని,అని ఫోటో చూపించాడు.వాళ్ళ మేనమామ కార్ షెడ్ చూసుకుంటూ ఉంటాడని,అతని తరువాత ఆ షెడ్ కి ఇతనే బిగ్ బాస్ అని చెప్పాడు. నాగు ఏమిటి? *పున్నమి నాగు* లాగా. వాడు బిగ్ బాస్ లా లేడు . సినిమాలలో *కిరాయి రౌడీలు* చుట్టూ చేరే
*కొత్తపేట రౌడీ* ఉంటాడు చూడు.అలా ఉన్నాడు. పేరయ్య తమ్ముడు వీరయ్య పంతులు ఇంకో ఫోటో చూపించాడు.వీడు *పల్లెటూరి మొనగాడు* బహు *రోషగాడు* .పేరు *రుద్రనేత్ర* అన్నాడు.తీరా చూద్దును కదా!చింత నిప్పుల్లాంటి కళ్ళతో వాడు
*యమ కింకరుడు* లాగా ఉన్నాడు.చూడబోతే ఆ పెళ్ళిళ్ళ పేరయ్య,అతని తమ్ముడు *తోడు దొంగలు* లా ఉన్నారు.లేకపోతే పెళ్ళికి *పునాది రాళ్ళు* వేయవలసిన వీళ్ళు ఇలాంటి *టింగురంగడు* సంబంధాలు చూపిస్తే ఒళ్ళు మండదూ!
అర్థం అయింది.
నువ్వు
మనసులో నాకిలాంటి అల్లుడే కావాలి అని *చాణక్య శపథం* ఏదో చేసి ఉంటావు.అందుకనే ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక సాకు చెప్పి వద్దంటున్నావు.నీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటో చెప్తే దానిని బట్టి తగిన సంబంధం చూద్దాం అన్నారు.
దానికి అల్లు గారు ఆ! అబ్బే! పెద్దగా ఏముంటాయి? నాకేమీ *మంత్రిగారి వియ్యంకుడు* అయిపోవాలనే *అభిలాష* లేదు.కానీ రోజులు చూస్తే బాగోలేవు. *అల్లుళ్ళు వస్తున్నారు* అంటేనే భయపడే రోజులు వచ్చాయి.
అమ్మాయిల వెంటపడి *ఐ లవ్ యూ* అంటూ *ప్రేమ నాటకం* ఆడే *ప్రేమ పిచ్చోళ్ళు* తయారయ్యారు ఎక్కడ చూసినా!
అంతెందుకు? నెల్లూరు లో నా స్నేహితుడు మూర్తి లేడూ!వాళ్ళమ్మాయికి ఏరికోరి కుర్రాడు *సింహపురి సింహం* లాంటి వాడు అని మధ్యవర్తులు చెప్పిన మాటలు నమ్మి పెళ్ళి చేశాడు.తీరా చూస్తే వాడు మహా మాయగాడు.ఒకపక్క పెళ్ళాన్ని ప్రియా! మీరు పురాణాలను వీడి *పట్నం వచ్చిన పతివ్రతలు.* *ఆడవాళ్ళూ! మీకు జోహార్లు* అని ఒక పక్క మాయమాటలు చెప్పి భార్యను *మంచు పల్లకి* లో ఊరేగిస్తున్నట్లు నమ్మిస్తూనే , మరోపక్క బయట *రాధా మై డార్లింగ్* అంటూ ఇంకెవరినో వెంటేసుకుని తిరుగుతున్నాడట.
అలాంటి *నకిలీ మనిషి*, *మోసగాడు*, *కోతల రాయుడు*, *మహానగరంలో మాయగాడు* వస్తే వాడు *అత్తకు యముడు అమ్మాయికి మొగుడు* అయి కూర్చుంటాడు.
*ఇది కథ కాదు* కదా! నిండు నూరేళ్ళ జీవితం.
తెలిసీ తెలియకుండా పెళ్ళి చేస్తే ,వాడు మా కర్మ కాలి *గూండా*, *దొంగ* (వాడు *జేబు దొంగ* *మంచి దొంగ* ఎవరైనా కావచ్చు ) అయితే, మా అమ్మాయి భర్త *దొంగ మొగుడు* అని చెప్పుకోలేం కదా! ఏ పోలీస్ ఆఫీసరో వాడి ని *హేండ్సప్* అంటూ *ఖైదీ* గా పట్టుకుని ,*స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్* కు పట్టుకుపోయి *ఖైదీ నెంబర్ 786* అనో, *ఖైదీ నెంబర్ 150* అనో ముద్ర వేస్తే మా పరువేం కావాలి? అసలే *చట్టానికి కళ్ళు లేవు*. *న్యాయం కావాలి* అంటూ *చట్టంతో పోరాటం* చేసి అల్లుణ్ణి విడిపించుకోవటం మా వల్ల అవుతుందా!
ఇక చూస్తూ చూస్తూ *ముఠా మేస్త్రి* *రిక్షావాడు* లాంటి సంబంధాలు చేయలేం కదా!
అలాగని *రాజా విక్రమార్క* నో *చక్రవర్తి* నో మా అమ్మాయి కి *ఘరానా మొగుడు* గా తెమ్మనేంత అత్యాశ లేదు నాకు.
*ఠాగూర్* లాంటి దేశభక్తుడు కాకపోయినా, *ఇంద్ర* వైభవం లేకపోయినా మరీ *హిట్లర్* , *స్టాలిన్* లాంటి *దేవాంతకుడు , *రౌడీ అల్లుడు* మాత్రం వద్దు.
అలాంటి *కిరాతకుడు* , *రాక్షసుడు* మొగుడైతే అమ్మాయి కాపురం *సంఘర్షణ* లో పడిపోతుంది. పిల్ల కాపురం *ఆరని మంటలు* *జ్వాల* లు చెలరేగే *అగ్ని గుండం* అవుతుంది.జీవితం *యుద్ధభూమి* అయి ,కూతురి బ్రతుకులో *మరణమృదంగం* మోగటం ఏ కన్నతండ్రి అయినా భరించగలడా!
*ఇంటి గుట్టు* రచ్చకెక్కుతుంది.
నా కూతురు ,నా *రక్తబంధం* దాని నుదుట నేను *రక్త సింధూరం* దిద్దగలనా! అది *అడవిదొంగ* లు సంచరించే కారడివిలో క్రురమృగాలైన *పులి* ,*మృగరాజు,* *కొదమ సింహం* చేత వేటాడ బడుతున్న జింక పిల్లలా కన్నీళ్ళతో బేలగా నా వైపు చూసి నాన్నా! *ఇది పెళ్ళంటారా!* అని నన్ను నిలదీసే రోజు ఎప్పటికీ రాకూడదు. అంటూ ఒక్క క్షణం ఆగి మిత్రుల వైపు చూశారు అల్లు.
సీతమ్మ కష్టాలు చూసి తల్లడిల్లిన *శ్రీ రామ బంటు* లాంటి తండ్రి మనసును చూసి ఒకపక్క అయ్యో అనిపిస్తున్నా,మరొక పక్క ఆ సుదీర్ఘ మైన సుత్తికి
వాళ్ళ సహనం చచ్చిపోతోంది.ఇంతలో *ఆపద్బాంధవుడు* లాగా వంటవాడు వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళాడు.అది తాగి తేరుకున్న తరువాత
అయ్యా! నీ కూతురికి సంబంధం ఆ *త్రినేత్రుడు* కూడా తేలేడు.మమ్మల్ని చంపక ఎలాంటి అల్లుడు కావాలో చెప్పు.అదుగో ఒకసారి ఆ *చంటబ్బాయి* వైపు చూడు , పాపం బిత్తర పోయిన ఆ *పసివాడి ప్రాణం* ఎలా విలవిల లాడిపోతోందో చూడు అని అక్కడ పక్కనే బిక్కమొహంతో ఆడుకోవడం మరచిపోయి నించున్న పిల్లాడిని చూపించి విసుక్కుంటూ ఉంటే,
వస్తున్నా,వస్తున్నా అక్కడికే వస్తున్నా!
నాకు కాబోయే అల్లుడు *ధైర్యవంతుడు* అయి ఉండాలి.
*బంధాలు అనుబంధాలు* తెలిసిన వాడై ఉండాలి. *స్వయంకృషి* తో పైకి వచ్చి *విజేత* గా నిలిచిన *తిరుగులేని మనిషి* అయి ఉండాలి. *ఆలయ శిఖరం* అంత ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. నా కూతురు, అల్లుడు జంట *జగదేక వీరుడు అతిలోక సుందరి* లా లేకపోయినా, *పార్వతీ పరమేశ్వరులు* లా ఉండాలి. *ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య* లా వేషాలేయకుండా, మా అమ్మాయిని *ఆరాధన* తో గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి.అలాంటి వాడు, *అందరివాడు* స్కూల్ *మాస్టర్* అయినా ఫరవాలేదు.
అనగానే మిత్రులు ఇంకేం చెప్పకు సంబంధం సిద్ధంగా ఉంది.ఒరేయ్ *శివుడు శివుడు శివుడు* కాస్త చక్కెర పట్టుకురా! మీ అయ్యగారి నోరు తీపి చేద్దాం.మంచి అల్లుడు దొరికేశాడు అంటూ పనివాణ్ణి కేకేశారు.
రామలింగయ్యా! మీ అమ్మాయి అదృష్టవంతురాలోయ్!
నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న కుర్రాడు ఉన్నాడు.
అబ్బాయి చాలా మంచివాడు.
పేరు *అంజి* అంటూ పాతకాలం పేరు అనుకున్నావేమో.! కాదు *చిరంజీవి*.ఎవర్ గ్రీన్ నేమ్. అబ్బాయి *మగధీరుడు* లా *మగమహారాజు* లా చాలా *స్టైల్* గా ఉంటాడు . బుద్ధిమంతుడు.
*లంకేశ్వరుడు* భక్తితో *రుద్రవీణ* ను పలికిస్తే కరుణించ వచ్చిన ఆ *శ్రీ మంజునాథ* స్వామి భక్తుడు కూడానూ. ఎలిజిబుల్ బ్యాచిలర్ అని *ఛాలెంజ్* చేసి చెప్పగలం.కావాలంటే వాళ్ళ ఊరి పెద్ద *సైరా నరసింహా రెడ్డి* ని ఒకసారి వాకబు చేసి చూడు అంటూ, ఇంకేం మాట్లాడనివ్వకుండా
ఆ సంబంధానికి ఒప్పించి , *శుభలేఖ* లు వేయించారు.పెళ్ళి కోసం *ఆచార్య* ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.
*ప్రేమ తరంగాలు* పేరుతో మేరేజ్ బ్యూరో నడుపుతూ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే *బిల్లా రంగా* *కాళి* అనే *ముగ్గురు మొనగాళ్లు* వచ్చి పెళ్ళి పనులన్నీ చకచకా కానిచ్చారు. *47 రోజులు* లోపే అంగరంగ వైభవంగా పెళ్ళి చేయించి *శ్రీరస్తు శుభమస్తు* అని దీవించారు.పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళి కొడుకుని *ది జెంటిల్ మేన్* అంటూ అల్లూగారి *అల్లుడా! మజాకా!* అని చెప్పుకున్నారు. ఇక బ్యూటీషియన్ *రాణీ కాసుల రంగమ్మ,*, సురేఖ స్నేహితురాళ్ళు *ప్రియ* ,*చండీప్రియ* పెళ్ళి కూతుర్ని
ఎంతో ముచ్చటగా అలంకరించారు! అమ్మాయి అచ్చు *సీతాదేవి* లా ఉంది సుమా అని అందరూ మెచ్చుకోవడం చూసి హమ్మయ్య! అల్లూగారికి మంచి అల్లుణ్ణి తేగలిగాం అని సంతోషంతో సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తరువాత అల్లు గారు *కొత్త అల్లుడు* సిగ్గుపడతాడేమో అని వారిని ఎటైనా ఓ పదిరోజులు తిరిగి రమ్మని అన్నారు. వెంటనే వధూవరులిద్దరూ *లవ్ ఇన్ సింగపూర్* అంటూ హనీమూన్ కి చెక్కేయటంతో
సురేఖా పరిణయం సుఖాంతం అయ్యింది.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.8.2020
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు స్వర్గీయ టి.కృష్ణ గారి వర్థంతి సభలో ఆయన కుమారుడు హీరో గోపీచంద్ కి వారి తండ్రిగారి కి నివాళిగా రాసిన కవితను అందిస్తూ
8. (సం) చలన చిత్ర దర్శకుడు
(సం) చలన చిత్ర దర్శకునికి
చిత్రావళి తో నివాళి
అభ్యుదయ చిత్రాలకతడు *రారాజు*
ప్రకాశాన్ని వెలిగించిన ప్రకాశమతడు
మనం గర్వించదగ్గ మన *ఆంధ్రుడు*
నల్లూరన్నలాంటి
పెద్దల ప్రోత్సాహమే
అతడి కళాహృదయానికి
*ఆక్సిజన్* అయ్యింది
ఆశయమెప్పుడూ *ఒంటరి* కాదని
తన ఆదర్శాన్ని అందిపుచ్చుకున్నవాడు
*ఒక్కడున్నాడు* అనే సంతృప్తిని
అరుణతారకు అందిస్తూ
మాదాల మార్గాన
అతడి పయనం సాగింది
అతడు తీసిన చిత్రాలు
అతి కొన్నే ఉన్నాయి
అవి రాశి కన్నా మిన్న
వాసి అని చెబుతాయి
అసమానతలు లేని సమసమాజం కోసం
*ఈ తరం* నెలకొల్పినవాడు
సామాజిక ప్రయోజనమే అతని సినిమాల *లక్ష్యం*
ఉత్తమ చిత్రాల దర్శకత్వమే
అతడు చేసిన *యజ్ఞం*
బలవంతులు దుర్బలజాతిని
బానిసలను కావిస్తున్న
*నేటి భారతం* లో
*ఈ దేశంలో దొంగలు పడ్డారు*
అని చాటగా
*శంఖం* పూరించి
*రణం* ప్రకటించింది
అతడి *శౌర్యం*
అరాచకానికి గొడ్డలిపెట్టు గా మారిన అతని
*ప్రతిఘటన* ఒక గొప్ప *సాహసం*
అవినీతిని అంతం చేసి
సమాజాన్ని *దేవాలయం*
చేయలేమా!అన్నదే అతడి *పంతం*
లౌక్యం తెలియని అమాయక బాలలైన
*రేపటి పౌరులు*
*సౌఖ్యం* తో బ్రతకాలని
*వందేమాతరం*
వట్టి మాట కారాదని
తపించిన
ఆ కళా హృదయానికిదే
నా కవితా నివాళి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టీచర్ @OPS
ఒంగోలు
21.10.2018
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
......9.కన్నీటి నివాళి........
నిరుపేదల సేవకోసం
నింగికెగిరావు
మదిమదినీ మభ్యపెట్టి
మాయమయ్యావు
ఎక్కడో ఉన్నావని
ఎప్పటికైనా వస్తావని
ఆశలన్నీ చిక్కబట్టి వేచాము
దేశమంతా ఏకమై వెతికాము
అన్నం నీళ్ళూ మాని
కోట్లాదిమంది
ఆతృతగా చూస్తుంటే నీ కోసం
అనుకోని ఆపదరూపంలో
ఆత్మీయుడా! నిన్ను
మింగేసిందా ఆకాశం!
కొండంత ప్రజాభిమానం నీకున్నా
కొండల్లో దిక్కులేని శవమయ్యావన్న
గుండెల్నిపిండేసే చేదునిజం
వినగానే విలవిలలాడింది
మా ప్రాణం
చెక్కు చెదరని చిరునవ్వు ముఖాన్ని
ముక్కలైన దేహాల్లో
వెతుక్కునే దౌర్భాగ్యాన్ని
దేవుడా! మాకెందుకిచ్చావు?
నీవింత నిర్దయుడివెందుకయ్యావు?
అని ఎలుగెత్తి ప్రశ్నించాము?
ఎంతగానో రోదించాము.
నిన్ను గెలిపించ వచ్చాడనుకున్న వరుణుడు
నీ ప్రజలకు బంధువై
నీ ప్రాణాలకు రాబందువై
నిన్ను తన వెంట పట్టుకుపోయాడు
ఆంధ్ర ప్రజానీకాన్ని
అనాథల్ని చేశాడు
నీ కోసం ప్రాణమిచ్చిన
ధన్యాత్ములు నలుగురు
అశ్రునయనాలతో నీవారు
పలికేరు నీకు
కడసారి వీడ్కోలు
ఆపద్బాంధవుడా!
ఇక నీకు సెలవు
ఆంధ్రుల గుండెల్లో
నీవెప్పటికీ నిలిచే ఉంటావు.
సింహాద్రి జ్యోతిర్మయి
5.9.2009
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
10.బాష్పాంజలి
జనన మరణాల
అవిశ్రాంత భ్రమణం
ఎడారి సంచారంలో
ఒక మజిలీ ఈ జీవితం
అంటూ కవితలల్లి
జననమరణాల మధ్యనగల
జీవితాన్ని ప్రతిక్షణం
జాతిసేవకే అంకితం చేసి
కపటత్వపు రాజకీయ బురదలో
విలువలే నాళంగా
కమలమై విరిసి
కవితా సుగంధాలు కురిసి
భారతరత్నమై మెరిసి
దాయాది దేశానికి
దడ పుట్టించిన
మేరునగ ధీరుడవు
శౌర్యం స్నేహం
సూర్యచంద్రుల వలే
మా రెండు నేత్రాలని
అణుశక్తే మా అగ్నినేత్రమని
ప్రపంచానికి చాటిన
తెగువకు నీవు
శాశ్వత చిరునామావు
వాగ్భూషణమే భూషణంగా ధరించి
చిరునవ్వుతో శత్రుత్వాన్ని జయించి
అజాతశత్రువు నీవై
అందరికీ ఆత్మీయుడవై
రాజిల్లిన మహాశయా!
రాజకీయ భీష్మాచార్యా!
అనారోగ్యపు అంపశయ్యపై
ఆఖరి క్షణాలు గడిపి
మరొక్క స్వాతంత్ర్య దినోత్సవాన్ని
మనోనేత్రంతోనే
వీక్షించి మురిసి
మరలిరాని లోకాలకు
తరలిపోయిన నీకు
ఓ అటల్ బిహారీ వాజ్ పేయీనా అక్షరనివాళి
అందుకోవోయీ!
సింహాద్రి జ్యోతిర్మయి
17.8.2018
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
.............11.బాల గంధర్వుడు...............
అతడు
లలిత కళారాధనలో
వెలిగే స్వరదీపం
మధురభారతి పదసన్నిధిలో
శ్రీపతుల తోట పుష్పం
ఈ బాలగంధర్వ పండితారాధ్యుడు
పామరులకే కాదు
పండితులకు కూడా ఆరాధ్యుడు
అతని ముద్దుపేరు బాలుడు
సినీ వినీలాకాశంలో నెలబాలుడు
భగవద్గీత ను పాడిన ఘంటసాల ను
నారదుడని భ్రమించి
వైకుంఠం చేర్చుకున్న విష్ణుమూర్తి
నాలుక కరచుకుని వెంటనే
ఈ తుంబురుణ్ణి మన భువికి
పంపించి ఉంటాడు
కాకుంటే ఆ రెండు గొంతుల్లోని
భక్తిరసం
నవరసాలనూ అధిగమించగలిగేదా!
నవరసాలనూ,సప్తస్వరాలనూ
నమిలి మింగేశాడేమో ఇతగాడు
కాబట్టే
నా పాట పంచామృతం అనగలిగాడు
అతడు ఆరేసుకున్న ప్రతి పాటకీ
అభిమానులు
మనసు పారేసుకుంటారు
ఈ సుబ్రహ్మణ్యం చిలకకొట్టుడికి
పాటలన్నీ పలకమారి
ప్రజల నాల్కలపై
చవులూరాయి
పాటలేనేమో అతని పొట్టకి ఫుడ్డు
నిర్మాతలకతను బంగారు బాతుగుడ్డు
మాటేరాని చిన్నదానికోసం
ఊపిరి బిగబడితే
మాటేరాక అభిమాని
మ్రాన్పడిపోయాడు
బంగారానికి తావి అబ్బినట్లుగా
సంగీతానికి సంస్కారాన్ని జోడించే
అతని పాటే మంగళ వాద్యము
మాటే మంత్రము
తనదరికి రాలేని
అభిమాన వనాలకోసం
ఈ పాటల వసంతమే
ఇటు తరలి వచ్చేసింది
మనం
నిలువెత్తు ధనం పోసినా
దొరకునా......
ఇటువంటి భాగ్యం
సన్మాన శుభవేళ
తిలకించి పులకించి తరియించు పుణ్యం
దీర్ఘాయురస్తు బాలూ!
ధన్యాత్ములు ఈ ఒంగోలు ప్రజలు
SP బాలు గారు 2011లో మా ఒంగోలు వచ్చినప్పుడు
నేను రాసి ,ఆయనకు ఫ్రేమ్ కట్టించి అందజేసిన కవిత ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో పంచుకోవటం ఆనందం అని భావిస్తూ
సింహాద్రి జ్యోతిర్మయి
4.6.2018
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
12.గురజాడ కావ్య కన్యకలు
కాసుకులోనై తల్లిదండ్రులు
ముక్కుపచ్చలారని తనను
ముదుసలికి కట్టబెట్టినా
కన్నీరు పెట్టటమే గానీ
కన్నవారిని నిందించటం తెలియని
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
పట్టపగలే నట్టవీధిని
జారచోరుడై పట్టబోయిన
ప్రభువును ధిక్కరించి
చేవ వుంటే పట్టమని
సవాలు విసిరే
తెగువ చూపిన కన్యక
కలసి మెసగిన యంతమాత్రనె
కలుగబోదీ ఐకమత్యము
మాల మాదిగ కన్నె నెవతనో
మరులు కొనరాదో అని
విసవిసలాడుతూనే
వినూత్న ఆలోచనలు రేకెత్తించిన
ముత్యాల సరాలు
దాల్చిన
గడప దాటని
గడుసు ఇల్లాలు
పసి తనం లోనే
విధవరాలై
తోడుకోసం తపించే వయసులో
అమాయకంగా
రామప్పపంతులు వలలో
పడ్డ మీనాక్షి
విధవలు పెళ్ళాడటం తప్పుకాదూ!
అని ఆశ నిండిన కళ్ళతో
గిరీశం మాయమాటలు
ఆశ్చర్యం గా విని
చెల్లికోసం సాహసం చేసిన
బాల వితంతువు బుచ్చమ్మ
నల్లని తుమ్మెద రెక్కల్లాంటి
నాలుగు వెంట్రుకలు
తన తలపై మొలిపిస్తాడన్న ఆశతో
గిరీశాన్ని నమ్మిన పూటకూళ్ళమ్మ
సాని పడుచై ఉండి కూడా
సాటి ఆడదాని కష్టానికి
సానుభూతి చూపి
సాయం చేసిన మధురవాణి
బిగించిన తమ పైటకొంగులను దులిపి
సంఘ సంస్కరణ
ప్రయాణ పతాకలుగా ఎగురవేసిన
మహాకవి కావ్యనాయికలు
అతని ముత్యాల సరాలలోని
పేటలు
జీవితాలనే శుల్కంగా
బలిపెట్టిన కన్యామణులు
గురజాడ కావ్యాల బాటలోని
అడుగుజాడలు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.9.2021
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
13.మధుర జ్ఞాపకం
మధుర జ్ఞాపకం
సినారె జయంతి సందర్భంగా
సినారె గారి చేతుల మీదుగా ప్రతిభామూర్తి పురస్కారం అందుకుంటూ,ఆయనకు నేను సమర్పించిన కానుక.ఆయన రాసిన పాటల్లో తొలి విఖ్యాతిగాంచిన నన్ను దోచుకొందువటే పాటకు పేరడీ.
మమ్ము దోచుకొంటిరయా
మహాకవి సినారె
జ్ఞానపీఠమెక్కినట్టి
మీ ప్రతిభకు భళారే
మీ ప్రతిభకు భళారే
సినీగేయకవిగ మీరు
చిరకీర్తిని పొందినారు
ఉరుదు గజల్ ప్రక్రియలో
ఉన్న రుచిని చూపినారు
విశ్వంభర మీ హృదయం
ఇంటిపేరు చైతన్యం
కవిత నా చిరునామా
అని చాటిన వ్యక్తిత్వం
అక్షరాల గవాక్షం
ఆధునిక కవిత్వాన
సంప్రదాయ ప్రయోగములు
పరిశోధన చేసిమీరు
ప్రమాణముగ నిలిపినారు
తెలుగుజాతి మనదంటూ
ఎలుగెత్తిన గళం మీది
ప్రతి పాటలొ కొత్తదనం
చూపించే కలం మీది
నాగార్జున సాగరాన
ఓలలాడె మా మనసులు
మీ నాగార్జున సాగరాన
ఓలలాడె మా మనసులు
లకుమ పాద మంజీరపు
రవళి వినెను మా వీనులు
అక్షయమగు మీ ప్రతిభకు
అక్షరాల వందనమిది
చాలదనక గ్రహించండి
ఆశీస్సులు చాలునండి.
సింహాద్రి జ్యోతిర్మయి
29.7.2018
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
14.శ్రీ శ్రీ జయంతి (ఏప్రిల్ 30)
శ్రీ శ్రీ జయంతి సందర్భంగా
అతని మహాప్రస్థానం లోని మొత్తం 41 కవితల పేర్లతో నేను రాసిన కవిత
*మహా క ( ళా ర ) వి శ్రీ శ్రీ *
శ్రీ శ్రీ
కష్టజీవికి ఇరువైపులా తానే *ఐ*
కాపుగా నిలబడిన *కళారవి*
*దేశచరిత్రలు* చదివిన వాడు
*సంధ్యాసమస్యలు* ఎరిగినవాడు
*ఆకాశదీపం* వెలిగించిన వాడు
*జయభేరి* మోగించినవాడు
*జ్వాలాతోరణం* కట్టినవాడు
ఈ *చేదుపాట* *దేనికొరకు*
అని నిగ్గదీసినవాడు
*నీడలు*చూసి భయపడేవాడు
*ఉన్మాది*యై *కేక* పెట్టేవాడు
*మిథ్యావాది*యై మిగిలేవాడు
*వాడు* *నిజంగానే * *మానవుడా!*
అని విస్తుపోయినవాడు
అతని *మహాప్రస్థానం* లో మనకు
*బాటసారి* *భిక్షు వర్షీయసి*
*పేదలు* *పరాజితులు*
మాత్రమే కాదు,
*ఒక రాత్రి*లోనే
ఇక్షుసముద్రాన్ని ఈది
*అవతలి గట్టు* చేరుకుని
*ఆః * అనిపించిన * సాహసి*కులు,
*ఆశాదూతలు* కూడా
తారసపడతారు.
*స్విన్ బర్న్ కవి *కి
* అద్వైతం* వంటబడుతుందా!
*గంటలు * గంటలు *ఋక్కులు*
వల్లెవేసే పండితుడు
*ఒక క్షణం *లో మారిపోయి
*గర్జించు రష్యా*అనగలడా!
*శైశవగీతి* తో ఆనందించేవాడు
*జగన్నాథ రథ చక్రాలు*
కదిలించగలడా!
* కవితా!ఓ కవితా!*
అని పలవరించి
తన బాధనంతా ప్రపంచానికి పంచే భావ కవిత్వం,
*నవ కవితలు * వినిపించి
ప్రపంచపు బాధంతా తనదని భావించిన
* అభ్యుదయం*
వీటిమధ్యగల *వ్యత్యాసం*
మహాకవి *ప్రతిజ్ఞ*లో
ఆవిష్కృతం
*అవతారం *ధరించిన
ఈ అద్భుత మహాప్రస్థానం
విశ్వ శ్రేయస్సుకి *అంకితం*
సింహాద్రి జ్యోతిర్మయి
30.4.2018
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
15.కందుకూరి జయంతి(ఏప్రిల్ 16)
కం..చె గానున్న వైధవ్యపు సంకెళ్ళు తెంచి
దు..మారమే సృష్టించి విధవల పెళ్ళి జేసి
కూ..రుకు మేల్కొలుపు వేకువ విద్య యంచు
రి..వాజు తప్పించి స్త్రీ విద్య ప్రోత్సహించి
వీ..డ్కొలుప బాల్య వివాహములను
రే..బవలు శ్రమించి నవయుగ వైతాళికుడవై
శ..తాధిక గ్రంథ రచనల గద్యతిక్కనవై
లిం..గ వివక్షలను ఆనాడె ఎండగట్టి
గం..పకెత్తి దురాచారాల కసవు పారబోసి
పం..డుగ తెచ్చినావు పడతుల బ్రతుకులందు
తు..హిన కిరణమై తాకిన నీ చేతి చలువ చేత
లు..లితమైన స్త్రీ జాతి మొక్కుచుండె
గా..రవించి దైవమంచు నెంచి మదిని
రు..ద్ధ కంఠాన మీకు జోహారులనుచు.
లులితము...చలించినది
సింహాద్రి జ్యోతిర్మయి
16.4.2018.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
సిరివెన్నెల అస్తమించిన వేళ
(నవంబర్ 30)
16.పది (కాలాల పాట) నంది వర్ధనాలు
ఓ సీతారామ శాస్త్రీ!
జగమంత కుటుంబం నాది అని నమ్మబలికావు
విధాత తలపున ప్రభవించిన
అనాది జీవన వేదాన్ని
విరించినై విరచిస్తున్నానన్నావు
నీ పదములలో నిండిన
ఆ అందెల రవళి
మా ఎద కనుమలలో
ప్రతిధ్వనిస్తూనే ఉండగానే
అప్పుడే,
అంతలోనే !
ఓ పాటల చిలకా!
ఏ తోడు లేక
ఎటేపు ?
ఈ ఒంటరి నడక?
ఎంతవరకు?
ఎందుకొరకు?
ఇంకా అరవై ఆరే కదా!
కలసిరాని కాలం కాటేసి
అనారోగ్యంతో వేధిస్తే
తెలవారదేమో స్వామీ!
అని నిట్టూర్చి
పాడుకుంటున్నావేమో
అని అనుకున్నామేగానీ
ఎవ్వరి కోసం
ఎవరు ఎవరితో
సాగించే సమరమిది
అని నిరాశ చెందుతావని,
ఏకాకి జీవితం నాది అంటూ
తనువునే మోడు చేసుకుంటూ
మందు ఇమ్మని
ఏకంగా
మరణాన్నే అడుగుతావని
ఊహించనేలేకపోయాము
పాటల అమృతమే చిందించి
ఆ చలువలో
ఓ పది నందివర్ధనాలు
సినీ.. మా తోటలో
పూయించి
తరలిపోయావా!
ఓ విరించి,విపంచి గానమా!
ఇక మా పెదవులలో
పలికే
అమృతగానంలో
నీ ఎదసడి వినమన్నావా!
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నువ్వు కోలుకుంటావని
మేము
ఆశపడ్డాము
కానీ, నువ్వు మాత్రం
స్వర్గం ఒకటుంటుందని
అంతా అనుకుంటే విని
ఆదిభిక్షువు విభూతిని ధరించాలనే
ఆశతో
స్వామి పిలుపునందుకుని
నమశ్శివాయ అంటూ
అంబరమంటిన
హృదయంతో
ఇలా అర్థాంతరంగా
అంతర్థానమైపోతే
అభిమానుల మనసుల్లో
అమావాస్య ఆవరించదా!
అని
నిగ్గదీసి
అడుగుతోంది
అదుగో!
ఎగిరే భరత పతాకం.
పాటల పారిజాతాలు పూసే ఈ నందనవనంతో
మా కొలది జానపదుల కవితలు సాటివస్తాయా!
అందుకనే,
నందివర్ధనాలు పూయించిన
మీ
నందనవనంలోనుండే
పది పాటల సుమదళాలు దూసి మీకు
నివాళిగా,
వేదనాభరిత హృదయంతో
కడసారి
కన్నీటి వీడ్కోలు
పలుకుతూ
మీ పాటల అభిమాని
*సింహాద్రి జ్యోతిర్మయి*
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.11.2021
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
. 17.మహానటి సావిత్రి
వెండితెరపై వెలసిన *భాగ్యదేవత*
ప్రేక్షకుల *అభిమానం* సంపాదించిన
*విమల* కీర్తి
ఆనాటి *చదువుకున్న అమ్మాయిలు*
*ఆరాధన* తో కొలిచిన *దేవత*
ఎన్నో *మూగ మనసులు *
దోచుకున్న *మిస్సమ్మ*
*రక్త సంబంధం* లేకున్నా
*మంచి మనసులు* గల అందరికీ
*ఆత్మ బంధువు* అయ్యింది.
*కన్యాశుల్కం* ఇచ్చయినా సరే
ఆమెను పెళ్ళాడాలని ఆరాటపడ్డ
అభిమానులెందరో!
ఈ ప్రపంచమనే *నర్తనశాల* లో
సినీ *మాయాబజారు* లో
*మనుషులు మమతలు*
నిజమని నమ్మింది
అమాయకత్వంతో ఒక *దొంగరాముడు*
మంచివాడని భ్రమసి అతనికి *అర్థాంగి* గా మారింది.
తమ జంట *నిండు దంపతులు* గా
పేరు తెచ్చుకోవాలని
కాపురం *నవరాత్రి* శోభలతో సాగాలని
ఏవేవో కలలు కంటూ
*సంసారం* లో ప్రవేశించింది
*సంతానం* మీది మక్కువతో
*మాతృదేవత* గా మారి
*చిన్నారి పాపలు* ఇద్దరికి జన్మనిచ్చి
*నాదీ ఆడజన్మే* అని మురిసిపోయింది.
*మాంగల్యబలం* బలహీన పడుతున్నా
*కుటుంబ గౌరవం* కోసం
కలుపుకున్న బంధంతో
*కలసి ఉంటే కలదు సుఖం*
అని ఓపికతో ఒడిదుడుకులు సహించింది.
*తోడి కోడళ్ళు* లేని
ఆ *వింత సంసారం* లో
సవతులతోనే సర్దుకుపోయే ప్రయత్నంలో
ఆమె కాపురం *విచిత్ర కుటుంబం* అయి
చేదు అనుభవం గా మారింది
*పూజాఫలం* అని భావించుకున్న జీవితం
*అగ్నిపరీక్ష* పెట్టింది.
తనను ప్రేమించడానికే
*దేవదాసు మళ్ళీ పుట్టాడు* అని మురిసిపోయిన ఆమె ఎదురైన
ప్రేమ రాహిత్యాన్ని
తట్టుకోలేక
అలనాటి ఆ *దేవదాసు* పార్వతి
తానే *దేవదాసు* గా మారి
అదే తన *పాప పరిహారం* అనుకుని
మత్తులో మునిగిపోయింది.
అదను చూసి *నమ్మిన బంటు* లే
అందినంత హరించారు
ఆ క్రమంలోనే
*సిరిసంపదలు* పోగొట్టుకుంది
*ప్రాణమిత్రులు* అనుకున్న వారంతా
ముఖం చాటేయగా
*గుండమ్మ కథ* లో కాంతమ్మలా
ఒంటరి దయ్యింది.
జీవితం లోని *వెలుగు నీడలు*
ప్రత్యక్షంగా చూసినా
*అప్పుచేసి పప్పుకూడు* తినాలని
ఎన్నడూ భావించని ఆ పిచ్చితల్లి
*కన్నతల్లి*గా బిడ్డల భవిష్యత్తు గురించి
బెంగపడుతూనే
ఈ లోకంతో సంబంధం లేని
*మరో ప్రపంచం* లోకి వెళ్ళిపోయింది.
ఏ *డాక్టర్ చక్రవర్తి* ఆమెను
బ్రతికించలేడని అర్థమయిన
ప్రేక్షకలోకం మూగగా రోదించింది.
కస్సుబుస్సుల *మిస్సమ్మ* గా
ఆకట్టుకున్న అందాల చందమామ
అహ నా పెళ్ళియంట
అని తుళ్ళుతూ గంతులేసిన
ఆ బంగారుబొమ్మ
చిక్కి శల్యమై
*సుమంగళి* గానే
తుదిశ్వాస విడిచి
తారల్లో తారగా నిలిచిపోయింది.
చలన చిత్ర జగత్తు ఉన్నంతవరకూ
ఆ నటీ శిరోమణి
చిరంజీవి గా నిలిచిపోతుంది.
మహానటి సావిత్రి కోసం మిస్సమ్మ సినిమాను కనీసం ఒక యాభై సార్లు చూసిన అభిమానిగా మహానటి సినిమా గురించి విని రాసిన ఈ కవిత ఆ మహానటికి అంకితం.
గోరింటాకు లాంటి ఆమె సినిమా పేర్లు ఇందులో
చేర్చలేదు.ఎందుకంటే సావిత్రిని ఆవిధంగా నేనసలు చూడలేకపోయాను కాబట్టి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
18.అతడే (దా) సరి
రంగుల సినీ ప్రపంచం
అదొక *అద్దాలమేడ*
కొందరినది *ఏడంతస్తుల మేడ** లు ఎక్కిస్తుంది
మరికొందరికదే *బలిపీఠం*
*పాలు నీళ్ళు* ఏకమైనట్లుగా
*స్వర్గం నరకం* ఇక్కడ కలిసే ఉంటాయి
* మనుషులంతా ఒక్కటే* అని
పైకి అంటుంటారు
వీరు మాత్రం *ఎవరికి వారే యమునా తీరే* అన్నట్లు ఉంటారు.
*మామగారు* *నాన్నగారు * అని వరసలు కలుపుకుని అందరిలో ఉన్నప్పుడు ఆప్యాయతలు ఒలకబోస్తూ మాట్లాడుకుంటారు
మనసుల్లో మాత్రం *తూర్పు పడమర * లు గా భావిస్తారు
*ఇదెక్కడి న్యాయం* అని మనం
ఇక్కడ ఎవ్వరినీ అడగలేం
ఆ *దేవుడే దిగివస్తే*
ఈ వింత ప్రపంచాన్ని చూసి
విస్తుపోక తప్పదు.
అలాంటి మన సినీ జగత్తుకి
*ఆత్మబంధువు* అయ్యాడతడు.
ఉత్త *బోళాశంకరుడు*
అతడీ సినీ *భారతంలో ఒక అమ్మాయి* అయిన *రాధమ్మ పెళ్ళి* ని *బుచ్చిబాబు* తో
జరిపించి ఆమెకొక * నీడ * కల్పించాలనుకున్నాడు
సినీ ప్రపంచం మొత్తాన్ని
ఒకే వేదికపై చూడాలన్న
తన చిరకాల వాంఛను
ఈ వంకతో తీర్చుకోవాలనుకున్నాడు
చక్కని *ప్రేమ మందిరం*నిర్మించాడు
తను జరిపించే *ప్రేమాభిషేకం* చూసేందుకు
తప్పక
రావలసినదని
*ఆది దంపతులు* అనదగ్గ
*సీతారాముల* కు
*మేఘ సందేశం* పంపించాడు
పొరపాటున సీతకోసం
*లంకేశ్వరుడు * వస్తాడేమోనని
*రంగూన్ రౌడీ* ని కాపలా పెట్టాడు. *బ్రహ్మ ముడి* వేసుకుని *ఏడడుగుల బంధం* తో ఏకమవుతున్న జంటను
*కళ్యాణ ప్రాప్తిరస్తు * అని దీవించమని పేరు పేరునా అందర్నీ ఆహ్వానించాడు.
అతనికి *చిన్నిల్లు పెద్దిల్లు * అని తేడాలు లేవు
*సూరిగాడు* , * మేస్త్రీ*
మనం చిన్నచూపు చూసి పిలిచే
*ఒరేయ్ రిక్షా* ,*ఒసేయ్ రాములమ్మ* అందరూ అతనికి ఆత్మీయులే.
*స్వప్న* సంతోషం గా వచ్చి అందరికీ *గోరింటాకు* దిద్దింది
*శివరంజని* వచ్చి వధువును
*శ్రీవారి ముచ్చట్లు* అడిగింది
*అమ్మ రాజీనామా * పత్రం చింపేసి మరీ వచ్చి
*దీపారాధన* చేసింది
ఒకే పేరు కలిగిన *తాతా మనవడు* మాట్లాడుకుని
*బొబ్బిలి పులి * లాంటి తాత
*సర్దార్ పాపారాయుడు* తన మనవడిని ఆ కళ్యాణానికి పంపించాడు.
ఆ వేడుక చూడాలనే కుతూహలం తో
*దేవదాసు మళ్ళీ పుట్టాడు*
ఆ దర్శక రత్న సారధ్యంలో
ఏకమైన
చలన చిత్ర పరిశ్రమ
*బంగారు కుటుంబం* లా భాసించి ప్రేక్షకులను అలరించింది.
ఓ దర్శక రత్న దాసరీ!
నీకెవ్వరూ లేరు సరి.
దాసరి జయంతి సందర్భంగా
నా కవితా నివాళి
.
సింహాద్రి జ్యోతిర్మయి
4.5.2018.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
19.అతిలోకసుందరి
శ్రీదేవి
పూలరెక్కలు
కొన్ని తేనె చుక్కలు
రంగరించి
బ్రహ్మ దేవుడు సృష్టించిన
భూలోకం చూడని సిరి* శ్రీదేవి*
అందమనే అంగుళీయకాన్ని
అవనీతలంపై పారేసుకుందేమో
వెతుక్కోవడం కోసమై
*కార్తీకదీపం*లా కదలివచ్చింది
*భక్తతుకారాం *కి కూతురై
*బడిపంతులు*కి మనవరాలై మురిపించింది
*సోగ్గాడి*కి *బంగారు చెల్లెలు* అయ్యింది
*ప్రేమ నక్షత్ర*మై మెరిసింది
*ప్రేమాభిషేకం* జరిపించుకుంది
*ఇల్లాలు *గా మారింది
*అనురాగ దేవత*యై
*పచ్చని కాపురం *చేసింది
ఆమె కంటి మెరుపు* కంచుకాగడా*
ఈ *రాణీ కాసుల రంగమ్మ*
అందమనే* త్రిశూలం*
అభినయమనే *వజ్రాయుధం*
ప్రేక్షకుల హృదయాలపైకి గురిపెట్టింది
వారి అభిమానాన్ని కొల్లగొట్టి
గుండెల్లో గుడికట్టి
*దేవత*లా కొలువయ్యింది
ఈ సిరిమల్లె పువ్వు అందం
*పదహారేళ్ళ వయసు *వద్దే నిలిచిపోయింది
ఆకర్షణ మాత్రం
*క్షణక్షణం *పెరుగుతూనే పోయింది
చివరకు కక్ష గట్టిన
మృత్యువనే* వేటగాడు*
వేసిన బాణం తగిలి
తన జ్ఞాపకాలనే* ప్రేమ కానుక*లు
మనకు మిగిల్చి
నింగి దారుల్లో అనంత లోకాలకు
తరలిపోయింది
ఈ *వసంత కోకిల.*
శ్రీ దేవి హఠాన్మరణానికి చింతిస్తూ నేను సమర్పిస్తున్న కవితానివాళి
సింహాద్రి జ్యోతిర్మయి
25.2.2018.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
20.నట(లోక) సామ్రాట్
అతడేమీ చదువు కోలేదు.కానీ
నమ్ముకున్నాడు తన నటనని
నాటకాలలో వేశాడు ఆడ వేషాలని
ఆకట్టుకున్నాడు బలరామయ్యని
అంచెలంచెలుగా ఎదిగి చూపాడు
తన నట విశ్వ రూపాన్ని
దైవమనుకున్నాడు వృత్తి ని
సాధించాడు సాటిలేని కీర్తి ని
అతడే నాగేశ్వరరావు అక్కినేని
అతడు
భక్తిరసాన్ని ఒలికించిన నాస్తికుడు
భగ్న హృదయాలను పలికించిన ప్రేమికుడు
మహిళా లోకం మెచ్చిన నవలా నాయకుడు
మూగ మనసుల్ని తన్మయత్వపు తీరాలకు
నడిపించిన నావికుడు
కళామతల్లికొక కన్ను అతడు
స్వీయ లోపాల నెరిగిన బుద్దిమంతుడు
అన్నగారి కతడు దీటైన జోడీ
అవార్డుల తోట లో విహరించిన బాటసారి
మాయాబజారు లాంటి సినీ పద్మవ్యూహం లో
మిస్సమ్మ లకు చిక్కని అభిమన్యుడు
మద్రాసు ఇల్లరికం చేస్తున్న
తెలుగు చిత్రసీమను
ప్రేమ (భాగ్య)నగర్ కు రప్పించి
సినీ లోక కళ్యాణాన్ని సాధించిన
భూకైలాస నారదుడు
వయసుకు తగ్గ పాత్ర ల్లో ఒదిగిన వాల్మీకి
ఈ సీతారామ య్య
వృద్ధాప్యాన్ని జయించి న అమర జీవి
అనారోగ్యపు సుడిగుండాలు
ఆత్మబలం తో అధిగమించి న అందాల రాముడు
జీవితం లోని వెలుగునీడలు
సమానంగా స్వీకరించి న దసరాబుల్లోడు
మన్మధుణ్ని కన్న చక్రధారీ!
ఓ బహుదూరపు బాటసారీ!
నీ చిరకాలపు మిత్రుణ్ని
వెతుక్కుంటూ వెళ్లిపోయావనుకుంటా
అన్నగార్ని మేము కూడా
అడిగామని చెప్పు
కళామతల్లికి
మీరిద్దరూ రెండుకళ్ళు
సినీ వినీలాకాశంలో
మీరిద్దరూ ధృవ తారలు
ప్రేక్షక లోకం మనసుల్లో
మీరిద్దరూ చిరంజీవులు.
...........అక్కినేని వారి అస్తమయం వేళ
అభిమానిగా స్పందించి రాసిన కవిత
.,............
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.9.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
నేడు 24.2.2019
కృష్ణ శాస్త్రి వర్థంతి సందర్భంగా
ఆయన సినిమా పాటల పల్లవులతో
అల్లిన నా కవి
21.ఈ గీతం శాస్త్రీయం
కృష్ణ శాస్త్రి
పరవశమై పాడిన
సినిమా పాట
మనసున ఊగిన మల్లెల మాల
మావిచిగురు తిని
పలికిన కోవిల
కొమ్మ లేకుండా
పూచిన గోరింట
భావకవిత్వంలో
దాగిపోయిన
నునులేత రెమ్మ
ఆరని కార్తీక దీపం
బ్రతుకంతా పాటగా
సాగిన వసంతరాత్రి
అలవికాని అనురాగాన్ని
దాచిన ఎద
మనసు నిలుపుకోలేక
మరీ మరీ
అడిగిన కుశలం
చీకటి వెలుగుల
కౌగిటిలో
చిందిన కుంకుమ వన్నె
బడలి పవ్వళించిన
ఒడిలోని రాజుని
చాలులే నిదురపో
జాబిలికూనా అంటూ
సడిసేయక లాలించే
పైరగాలి
అందమైన
ఆ పాటలో పూదోట కు
ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ భ్రమపడి
రానిక నీ కోసం
అంటూ
తొందరపడి ముందే వెళ్ళిపోయిన
ఇల్లాలు
దూరాన తారాదీపమై
భారమైన గుండెలో
ఆరని తాపమై
మిగిలిపోతే
మనసువీణని
సరిగమపదని అని
పలికేవారు,
హృదయము తెలిసేవారు
లేని లోకంలో
నా పేరు బికారి
నా దారి ఎడారి అంటూ
మూగబోయిన గొంతుతో
పరమాత్మను ధ్యానిస్తూ
మందమతిని ప్రభూ!
నీరాక ముందు తెలిసెనా!
ఈ మందిరం ఇటులుంచేనా
అంటూ
ఆ
ఘనా ఘన సుందరుని ,
కొలువైన రంగసాయిని
వేయి కన్నులతో
చూడాలని, కొలవాలని
హరి పూజకు పూలిమ్మని
కొమ్మను తొందరపెట్టి
ఆకాశవీధిలో
హాయిగా ఎగిరిపోయిన
పాటల పావురం
ఆంధ్రాషెల్లీ
మన కృష్ణ శాస్త్రి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.2.2019.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
నేడు మలాలా డే సందర్భంగా నా స్పందన
22.ఆ(డ)పిల్ల ఒక అద్భుతం
అది పాకిస్తాన్ దేశం
స్వాత్ లోయ ప్రాంతం
జూలై పన్నెండవ తేదీ
ప్రపంచాన్ని అబ్బురపరచిన
ఒక ఉద్యమం
ఊపిరి పోసుకున్న రోజది
ఆడపిల్లలకు అక్కడ
అక్షరం నిషిద్ధం
చదువుకుంటామంటే చంపేస్తారు
బడికి పోతే బాంబులతో పేల్చేస్తారు
హక్కులను కాలరాసే
ఆటవికత రాజ్యం చేసే
ఆ కోనలో మల్లెలా
విరబూసింది మలాలా
ఆ చిన్నారి బాధాసర్పద్రష్ట
చదువుగురించే ఆమె చింత
ఆ హక్కు కోసం పోరాటం చేసింది
తాలిబన్లకు శత్రువయ్యింది
పాఠశాల వైపుగా
పదం కదపడమే నేరంగా
ఉగ్రవాద తూటాలు
ఉసురుదీయ చూశాయి
ధృడ సంకల్పానికి
దైవమైనా సహకరిస్తుంది
ఆ పోరాట పటిమకు
మృత్యుదేవత తలవంచింది
ఆ చిన్నారి అయామ్ మలాలా అంది
ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపింది
ప్రపంచం ఆమెవైపు
ఆరాధనగా చూసింది
ఆమె అనుభవం జొన్నపువ్వు (గుల్ మకాయ్ )
ఆమె చైతన్యం
ఉగ్రవాదులకొక సవాలు
అది ఆమె ఆత్మకథ అయ్యింది
బీబీసీ ప్రసారం చేసింది
మా హక్కును లాక్కోవడానికి
తాలిబన్లు ఎవరని
ఆ చిన్ని గొంతు ప్రశ్నించింది
ఉగ్రమూకలకు తాను శత్రువయ్యింది
అతి చిన్న వయసులోనే
అవార్డులెన్నో సాధించింది
పరమ సాహసానికి
పదిహేనేళ్ళకే
నోబెల్ శాంతి బహుమతి వరించింది
తాలిబన్లు సైతం తలవంచారు
దాడి చేయబోమని ప్రకటించారు
సాటి మనిషిని ప్రేమించడం
నేనెరిగిన సంస్కారం
మహాత్ముడు ,మదర్ థెరిస్సా
నాకు ఆదర్శం
తాలిబన్లను క్షమిస్తా
చదువుకోమని సలహా ఇస్తా
అన్నది ఆ చిన్నారి స్వరం
అది ఎంతటి ఔదార్యం!
ఆమె స్ఫూర్తితో ప్రపంచ దేశాలు
బాలికా విద్యదిశగా
అడుగులు వేస్తున్నాయి
ప్రతి బాలికా
కావాలి ఒక మలాలా
హక్కుని సాధించాలి
స్వేచ్ఛగా ఎదగాలి
అందరం ఆమెను
ఆశీర్వదిద్దాం
ఆమె ఆశయం నిజమయ్యేందుకు
ఆడపిల్లకు చేయూతనిద్దాం
సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్@ OPS
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
12.7.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ముఖపుస్తక మిత్రులందరికీ శుభోదయం.
అంబేద్కర్ జయంతి
23.భారత (రత్నానికి) వందనం.
అతడు
భరించరాని అవమానాల అడవిలో
రగిలి పెరిగిన కార్చిచ్చు
తొక్కివేయబడ్డ జాతి
ఎర్రబడ్డ కళ్ళల్లోనుండి
తోసుకువచ్చిన తొలిఉషస్సు
జ్ఞానం ఒకరిసొత్తు కాదన్న సత్యాన్ని
ఎదిగి తాము చాటగలమని
నిరూపించిన మానవ మేథస్సు
తరతరాలుగా పాతుకున్న
తారతమ్యాల కుదుళ్ళను
రాజ్యాంగపు ఖడ్గంతో
ఖండించిన కలం పోటు
బడుగుజాతి బలపడాలని
భరతజాతి ఎదగాలని
అవకాశాల ఆకాశగంగను
అందరికీ పంచిన అపర భగీరథుడు
గుణకర్మల తీరునుబట్టే
కులవిభజన చేశానన్న
గీతాచార్యుని మాటను మరచి
గిరిగీసుకున్న కులతత్వాన్ని
జాతికి దిశానిర్దేశం చేసిన
రాజ్యాంగనిర్మాత చూపుడువేలు
నిలదీస్తోంది.
అసమానతలకు అంతం ఎప్పుడని
ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది.
పంచములంటూ పెంచుకున్న అసహ్యాన్ని
గుండె పొరలనుంచి తొలగించేదెప్పుడని
గుండెకు హత్తుకున్న
పుస్తకం పుటలు
నిశ్శబ్దంగా నిలదీస్తున్నట్లుంది
ప్రగతిమార్గాన్ని నిర్దేశించి
భవిష్యద్దర్శనం చేసిన
బాబాసాహెబ్ అంబేద్కర్ ని
దళితనేతగా మాత్రమే చూసే
దౌర్భాగ్యం వద్దు మనకి
మహా నాయకుణ్ణి మన్నించండమంటే
జయంతి రోజున
నాలుగు పూలదండలు
వర్థంతి రోజున
సమర్పించే నివాళులు కాదు
అసమానతలు లేని
అవనీతలంగా
భారతదేశాన్ని తీర్చిదిద్దడమే
భారతరత్నకు
నిజమైన నివాళి.
సింహాద్రి జ్యోతిర్మయి
14.4.2017.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
...............................నేడు......................................
సెప్టెంబర్ 28
కవి కోకిల,నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా జయంతి
24.విశ్వనరుడు
విశ్వనరుడను నేనన్న ఆత్మవిశ్వాసం
నను వరించిన శారద వీడిపోదన్న ధీమా
తొణికసలాడుతున్న ఆ ఠీవి
అవమానాగ్నిలో దహించుకుపోతున్న
హృదయాలను ఆవిష్కరించిన గబ్బిలం
ప్రపంచ వింతయైన ప్రేమ సామ్రాజ్యాన్ని
అద్భుతంగా నిర్మించిన ముంతాజమహలు
నమ్మకద్రోహానికి తల్లడిల్లిపోయిన
కవి హృదయవేదనా రవం ఫిరదౌసిలతో పాటుగా
ఖండకావ్యాల నాలపించిన కవికోకిల
కాందిశీకుడై స్వప్నకథలు వినిపించిన
కవితా విశారదుడు
తనను కన్నతల్లి గర్భాన్ని ధన్యం చేసిన
నవయుగ కవి చక్రవర్తి
శ్రీ జాషువా గారి జయంతి సందర్భంగా
నా నివాళి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
జాషువా వర్ధంతి సందర్భంగా నా పద్య నివాళి
25.కవి చక్రవర్తి
సీసం
ముగ్ధమోహనముగ ముంతాజు మహలులో
చెలువ చెలువమెల్ల చెక్కినావు
విఫల మనోరథున్ ఫిరదౌసి లో చూపి
కవి చింత కనులకు కట్టినావు
గబ్బిలమ్మును పంపి గరళకంఠుని కీవు
వెలిజాతి వేదనల్ వినిచినావు
కండచక్కెర బోలు ఖండకావ్యములందు
మాననీయుల కథల్ మలచినావు
ఆ.వె.
విశ్వనరుడనంచు విశ్వాసమున చాటి
నిన్ను గన్నతల్లి వన్నెకెక్క
కూర్చి కవితల కవి కోకిల వైనావు
జగతి సుకవి వీవు జాషువావు
సింహాద్రి జ్యోతిర్మయి
24.7.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
26.కలామ్ కి సలామ్
సామాన్యుడిగా పుట్టిన
అసామాన్యుడు
మచ్చలేని భారతీయుడు ఎవరనగానే
ప్రపంచం పెదవులు
పలికే ఏకైక నామం
భగవద్గీతను గౌరవించే మహమ్మదీయం
మతం పంకం అంటుకోని
మానవతా కమలం
దేశ భవితను
నిర్దేశించిన భారతరత్నం
తనువెల్లా నిండిన తేజం
తలపండిన శాస్త్రం
గురిపెట్టిన శస్త్రం
మన దేశపు
విజయకేతనం
తన మనుగడ జాతికంకితం
ఆ పేరే
ఎ.పి.జె.అబ్దుల్ కలాం
కలాం గారికి నివాళులతో
సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్@OPS
27.7.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
హేండ్సమ్ విలన్ గా సోనూసూద్ నటించిన తెలుగు చిత్రాల టైటిల్స్ తో అతనిపై నా అభినందన పూర్వక కవిత
27.సూపర్ (మేన్) సోనూ*
*అతడు*
*సీత* లాంటి హీరోయిన్ ని
ఆరడిపెట్టే రాక్షసుడనుకున్నాను
*చంద్రముఖి* లాంటి
నాయికను వేధించే
*కందిరీగ* అనుకున్నాను
పక్కా *జులాయి* లా
కనిపించే అతణ్ణి
హీరో చితక్కొడుతుంటే
*సూపర్*
*తీన్ మార్*
మార్ డాలో అనే
కసి కేరింతలు థియేటర్లలో విని
మనసులోనే ఆనందించాను
సినిమా *అభినేత్రి*
నీడలో జీవిస్తున్న
*అమ్మాయిలు అబ్బాయిలు*
అనేకానేక మందిలో
అతడూ ఒకడనుకున్నాను గానీ
వేసుకున్న వేషం తీసివేసిన తరువాత
ప్రాణాపాయం లో ఉన్న లక్ష్మణుని కోసం
సంజీవని తెచ్చిన
*ఆంజనేయులు* ని
కళింగ యుద్ధంలో
రక్తపుటేరులు చూసి చలించిపోయిన
*అశోక్* చక్రవర్తిని
అతనిలో చూసి
ఆశ్చర్యపోతున్నాను
ప్రార్థించే పెదవులకన్నా
సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ థెరిస్సా స్ఫూర్తితో
సందేశాలతో సరిపెడుతూ
అరకొర సాయాలతో చేతులు దులుపుకున్న
తారలతో వెలిగిపోయే సినీ వినీలాకాశంలో
అతడు నిజంగానే
*ఏక్ నిరంజన్*
లోకకళ్యాణం
దర్శింపజేస్తున్న
పవిత్ర *అరుంధతి*
ఇంతటితో ఇతడు *ఆగడు*
ఆ *దూకుడు* చూస్తుంటే
*నేనే ముఖ్యమంత్రి నైతే*
అని ఆలోచిస్తున్నాడేమో అనుకుని సందేహించేవారికి
విలన్ పాత్రలను సినిమాలలోనే ధరిస్తాను
నిజజీవితంలో మానవతాహారాన్ని ధరిస్తాను
అని తన చేతలతో నిరూపిస్తున్న
ఈ *మిస్టర్ మేధావి*
సోనూసూద్ ని చూసి
మరి మీరు
*ఊ కొడతారా! ఉలిక్కి పడతారా*
చిరంజీవి సోనూసూద్ కి ఆ భగవంతుడు
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య ఆనందాలు నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ , దీవెనలతో
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
01.08.2020
,🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కవిసామ్రాట్ విశ్వనాథ వారి జయంతి
28.తెలుగుల కల్పవృక్షం
తే.గీ.
ఆంధ్రులకు జ్ఞానపీఠమ్ము నమరజేసి
వేయి పడగల తన కీర్తి విస్తరించి
విశ్వనాదమై యెలుగెత్తు విశ్వనాథ
సుకవిసామ్రాట్టుల జయంతి శుభదినమిది.
తేటగీతి.
ఏల మరల రామకథ యం చెవ్వరేని
ప్రశ్న వేయుచో బదులిట్లు పల్కెదనని
కల్పవృక్షాన చాటిరి కామితమ్ము
పఠితలెల్లరు మురియగా పరవశమున.
తేటగీతి.
తిన్న అన్నమే మరిమరి తినుట ఏల?
చేయు సంసారమే నీవు చేయనేల?
ఎవరి అనుభూతి వారిదే ఇలను చూడ
నాదు అభివ్యక్తి నాదంచు నమ్ముచుంటి.
తేటగీతి.
వమ్ము కాలేదు కవిరాట్టు నమ్మకమ్ము
కల్పవృక్షమ్ము జాతికి ఖ్యాతిదెచ్చి
తెలుగు నేలను సుజ్ఞాన ఫలముగాసె
కొసరి రుచిచూడ నెల్లరు కోర్కె మీర.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.9.2019 .
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
29.ఈ బాలుడు
గానలోలుడు
దాదాపు 50 రోజులపాటు
మకరంతో కరిరాజు
పోరాడినట్లు
వ్యాధితో పోరాడి పోరాడి
అంతర్యామీ !
అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే జొచ్చితినీ అంటూ
వేడుకున్నావేమో!
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
చూపించమని కోరుకున్నావేమో!
అందుకే ఆ స్వామి
ఓ బాలూ!లాలీ!
జన్మకే లాలీ!
పాటకే లాలీ!
చేరుమా!
అని తన చెంతకు
చేర్చుకున్నాడేమో!
నీ ఊపిరి
పాటలుగా
మాటలుగా పరీమళించగా
వేల పాటల
పంచామృతంతో
సినిమా పాటకు
స్వరాభిషేకం చేసి
దేశానికే ఆరాధ్యుడవై
శ్రీపతి సన్నిధికి చేరిన
పండితారాధ్యా!
పద్మభూషణా!
ఈ గాలి
ఈ నేల
ఈ దేశం
సినీ సంగీతం
ఉన్నంతవరకు
నీ పాట ఉంటుంది
పాడుతా తీయగా అంటుంది
జయంతి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాఃl
నాస్తి తేషాం యశః కాయే
జరామరణజం భయమ్ll
అన్న సుభాషితాన్ని
మరణమనేది ఖాయమని
మిగులును కీర్తి కాయమని
పలికి వెళ్ళిపోయిన
శ్రీ తుంబుర నారద
నాదామృతమా!
పదహారు కళలతో
విలసిల్లే
బాలూ చంద్రుడివై
పదహారు భాషలను
గళంలో పలికించావు
నలభై వేల పాటలతో
ఆ నలుగురిని కాదు
నలుదిక్కులా అభిమానుల్ని సంపాదించావు
సంతృప్తితో ఇక
పోయిరా! రాగమా!
పోయిరా! గానమా!
మా కన్నీటి చేవ్రాలే
నీకు కడసారి వీడ్కోలు
మా నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం తరపున
సినిమా పాటకే
భూషణమైన
ఈ పద్మభూషణునికి
ఘన నివాళి సమర్పిస్తూ...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.9.2020
30.*దేవుడు చేసిన మనుషులు* లో*
నెంబర్ వన్
*నేనొక ప్రేమ పిపాసిని*
*నా దాహం తీరనిది*
అంటూ సినిమాను ప్రేమించి,
సినిమా *ఊరికి మొనగాడు* గా జీవించి
ప్రేక్షక హృదయ *సింహాసనం*
5 దశాబ్దాల పాటు పాలించి
తన నట
*వారసుడు* గా ఎదిగిన తన
*యువరాజు* ను
చూసి సంతోషించి
విశ్రాంత జీవితాన్ని
ఆశ్రమ వాసిగా ప్రశాంతంగా
గడుపుతున్న వేళ ఏర్పడిన
భార్యావియోగం భరించరానిదై
*వస్తాడు నా రాజు ఈరోజు*
కార్తీకమాసపు వేళలోన
అని ఆ లోకంలో
ఎదురుచూసే
*తేనెమనసులు* న్న
ఇల్లాళ్ళ
పిలుపు అందిందేమో!
ఈ *కృష్ణావతారం* చాలించి
అభిమానులను
కన్నీటి కెరటాలపైన తేలించి
*సాహసమే నా ఊపిరి* అంటూ సాధించిన
తన విజయాలకు
*పద్మభూషణ* మే *సాక్షి* గా మనకు వదిలి
*నవ్వుతూ బ్రతకాలిరా*
అనే జీవిత సత్యాన్ని పాటించి
కీర్తి శరీరాన్ని లోకంలో విడిచి
తిరిగిరాని లోకాలకు
సాగిపోయిన
ఓ నటశేఖరా!
*ఎందరేడ్చినా తిరిగిరావురా*
*బ్రతికిరావురా* అంటూ నీవు నేర్పిన నీతినే
మననం చేసుకుంటూ
గుండె దిటవు చేసుకుంటూ
*ఆకాశంలో ఒక తార* గా
చేరుకున్న
నీకిదే మా
కన్నీటి నివాళి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.11.2022
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
31.అందాలే(లే) జమున
స్వర్గీయ జమున గారి
అందాన్ని వర్ణించే అలనాటి సూపర్ హిట్ సాంగ్స్ లోని కొన్ని చరణాలతో నా *కవితా నివాళి*
ఆమె మోము
*పగలే వెన్నెల* కురిపించింది
ఆమె అభినయానికి
*జగమే ఊయల* ఊగింది
వెండితెర
*పగడాల జాబిలి చూడు*
అంటూ ఆ అందాన్ని పరిచయం చేసింది
ముద్దులొలికే ఆ వదనాన్ని
తిలకించి పులకించిన ప్రేక్షకలోకం
*ఎవరన్నారివి కన్నులని?*
*అరెరే !మధువొలికే గిన్నెలవి*
*ఎవరన్నారివి బుగ్గలని?*
*హోయ్ !ఎర్రని రోజా మొగ్గలవి*
అంటూ మరిసిపోతే
ఆనాటి కుర్రకారు మాత్రం
*బులిబులి ఎర్రని బుగ్గలదానా!*
*చెంపకు చారెడు కన్నులదానా!*
అని కలవరిస్తూ
*నన్ను దోచుకొందువటే!వన్నెల దొరసాని*
*ఈ మహిమ నీదేనులే*
అంటూ
ఎవరికి వారే కలల్లో తేలిపోయి
*మురిపించే అందాలే*
*అవి నన్నే చెందాలే*
అంటూ పలవరిస్తూ
*గౌరమ్మా!నీ మొగుడెవరమ్మా!*
అని ప్రశ్నిస్తూ
తమను వరిస్తుందేమో
ఆ
*వయ్యారమొలికే చిన్నది*
అన్న ఆశతో
*అందాల ఓ చిలకా*
*అందుకో ఈ లేఖ* అని ప్రేమలేఖలు
పంపించారే గానీ
*ఎవరికి తెలియదులే యువకుల సంగతి*
అంటూ ముసిముసిగా నవ్వుకున్న
ఆ *పిట్ట మనసులో ఏముంది*
అన్న సంగతి మాత్రం కనిపెట్టలేకపోయారు
పన్ను మీద పన్ను కనపడేలా సమ్మోహనంగా ఆమె ఓ నవ్వు విసిరితే
*మధువులు చిందే మందహాసం* చూసి
*నవ్వులా!అవి కావు నవపారిజాతాలు*
*రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు*
అని మైమరచిపోయిన వారెందరో!
తెరపై సత్యభామ గా ఆమెను చూసి
*మెరిసే మేఘమాలిక*
*ఉరుములు చాలు చాలిక*
అంటూ ముద్దుగా విసుక్కుంటూనే
*ముక్కు మీద కోపం*
*నీ ముఖానికే అందం* అని ముచ్చటపడ్డ వారెందరో!
ఆమె అందాన్ని మాత్రమే ఆరాధించి
ఆమె ఆభిజాత్యాన్ని అహంకారంగా భావించి
*అందాల రాణివే*
*నీవెంత జాణవే!*
అని కొందరు విస్తుపోతే
*తీయతీయగా సొగసుంది*
*సొగసుని మించిన మంచుంది*
అంటూ ఆమె వ్యక్తిత్వాన్ని ఆరాధించిన వారెందరో!
ఈనాటికి ఆమె వార్ధక్యపు బాధల్ని చూడలేక మృత్యుదేవత
*చల్లని వెన్నెలలో నా ఒడిలో నిదురపో*
అంటూ ఆహ్వానించి ఉంటుంది
*దేవుని నీడలో వేదన మరచిపో*
అంటూ మనం కూడా
కన్నీటితోనే అయినా వీడ్కోలు ఇచ్చి సాగనంపుదాము
ఎందుకంటే
*కొనుమిదే కుసుమాంజలి*
*అమరుల ప్రణయాంజలి*
అంటూ అప్సరసలంతా
అసూయ పడకుండా
ఆ సౌందర్యాధిదేవతకు
స్వాగత సన్నాహాలు
చేసుకుంటూ ఉండి ఉంటారు
మరి మనం కూడా
*జ* నం మదిలోని
*ము* రిపాల సత్యభామకు
*న* మస్సులతో నివాళి అర్పిద్దామా!
సింహాద్రి జ్యోతిర్మయి
*న ర సం* రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
*కళామిత్ర మండలి*
ప్రధాన కార్యదర్శి
28.1.2023
32.అంతిమ వీడ్కోలు
సూర్యమండలం లో
ప్రభవించిన
సంతోష కిరణం
తమలో ఐక్యమవడానికి
సన్నద్ధమైన
క్షణాలలో
ఆకాశం
వీరుడా!అమర్ రహే
అంటూ ప్రతిధ్వనించింది
గాలి
విడిచిన
అతని ఊపిరి పరిమళాన్ని
అలముకున్నది
అగ్ని
అతని దేహాన్ని
అల్లుకుని
తన పవిత్రతను
చాటుకోవాలని
తహతహలాడుతున్నది
నీరు
దేశం కంటివెంట
జీవనదులై పారి
ఆఖరి నివాళి
అందిస్తున్నది
నేలతల్లి
తన పాదాలపై
వాలిన తనయుని
ఒడిలోకి చేర్చుకుని
జోలపాడి మురిసిపోవడానికి
సన్నద్ధమౌతున్నది.
అమ్మ కడకొంగు
ఆ త్రివర్ణ పతాకాన్ని
కప్పుకునే
భాగ్యాన్ని పొందిన
భరతమాత ముద్దుబిడ్డడా!
పంచభూతాల
సాదర స్వాగతం ,
ఈ దేశప్రజలు
అందిస్తున్న
అంతిమ వీడ్కోలు
అందుకుంటూ
వీరుడా! వెళ్ళిరా!
వీరుడా! వెళ్ళిరా!
వీరుడా! వెళ్ళిరా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.6.2020
32.*గద్దర్ కు నివాళి*
అస్తమించిన అరుణకిరణమా
మా గద్దరన్న
వాలిన పొద్దున రాలిన తేజమా
మా గద్దరన్న
మా పాటవై వచ్చీనావయ్యో
మా గద్దరన్న
నీ పాదాలకు వందనాలయ్యో
మా గద్దరన్న
లాల్ సలామ్ లాల్ సలామయా మా గద్దరన్న
పల్లెబ్రతుకు చూసీనావు
కంటా నీరు బెట్టీనావు
ఉజ్జోగం యిడిసీనావు
పోరూ బాట పట్టీనావు
గొంతూ విచ్చి పాడీనావు
గజ్జె కట్టీ ఆడీనావు
యుద్ధనౌకవై బతికినావయ్యో
మా గద్దరన్న
తూటామోసి తిరిగి నావయ్యో
మా గద్దరన్న
ఆకాశం పిలుస్తోందని
బయలెల్లీనావొ
నేలమ్మకు వీడుకోలిదే
అని పలికీనావో
అస్తమించిన అరుణకిరణమా
మా గద్దరన్న
వాలిన పొద్దున రాలిన తేజమా
మా గద్దరన్న
మా పాటవై వచ్చీనావయ్యో
మా గద్దరన్న
నీ పాదాలకు వందనాలయ్యో
మా గద్దరన్న
బండెనక బండికట్టి అని పాడితె సై యంటిమి
పొడుస్తున్న పొద్దుమీద
పాటకడితె జై కొడితిమి
కొడుకో కొమరన్న జర భద్రమంటె ఊకొడితిమి
అలుపెరుగని పోరాటాలతో
మా గద్దరన్న
గుండె ఆగుతాను అనబట్టేనో
మా గద్దరన్న
మా పాటవై పోతుంటివో పైలోకాలకు
ఎర్రజెండవై ఎగురుతావులే
మా బాగుకొరకు
అస్తమించిన అరుణకిరణమా
మా గద్దరన్న
వాలిన పొద్దున రాలిన తేజమా
మా గద్దరన్న
మా పాటవై వచ్చీనావయ్యో
మా గద్దరన్న
నీ పాదాలకు వందనాలయ్యో
మా గద్దరన్న
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.8.2023
నా కవితను నా స్వహస్తాలతో విశ్వనాథ్ గారికి అందించాలన్న నా కల నెరవేరిన క్షణాలు
7.8.2017
33.*కళాతపస్వి.*
ఆ కాశీ విశ్వనాథుడు
ప్రళయాంతంలో
వారణాసిని
తన త్రిశూలాన నిలబెట్టే
మహా తపస్వి
ఈ కాశీనాథుని విశ్వనాథుడు
పాశ్చాత్య సంస్కృతీ పెనుతుఫానుకు
రెపరెపలాడుతున్న
సంప్రదాయాన్ని
తన మెగాఫోన్ తో నిలబెడుతున్న
కళాతపస్వి
అందుకే నందీశ్వరుడు మెచ్చి
స్వర్ణనందులుగా
అతనింట కొలువయ్యాడు.
*ఆత్మగౌరవం* *స్వయంకృషి*
అతని *చిన్ననాటి స్నేహితులు*
ఓ *శుభోదయం* వేళ
*శుభసంకల్పం* కలిగి
తన చెల్లెలు *సీతామాలక్ష్మి* కి
*ఆపద్బాంధవుడి* తో
వివాహం జరిపించ నిశ్చయించి
*శుభలేఖ* వేయించాడు
ఆ ప్రేమబంధం
*సిరివెన్నెల* లో ముడిపడింది.
*సప్తపది* వేసింది.
ఆ పెళ్ళికి ఊరిపెద్ద
*ప్రెసిడెంటు పేరమ్మ* ముఖ్య బంధువై
ముత్తయిదువల నందరినీ
*ఉండమ్మా!బొట్టు పెడతా* నంటూ
గొరవించింది.
ఇది *ఓ సీత కథ*
*స్వాతిముత్యం* లా స్వచ్ఛమై
*సాగర సంగమం* లా పవిత్రమై
*స్వాతికిరణం* లా వెలిగే
తన *చెల్లెలి కాపురం*
చూసిరమ్మని
*శారదను*,
*జీవనజ్యోతి* ని
పంపించాడు.
ఆ కాపురం
*సిరిసిరి మువ్వల* సవ్వడిలా
*శృతిలయల* నాదంలా
*శుభప్రదం* గా ఉందని తెలిసి
సంతోషించాడు.
తన అభ్యున్నతికి
*సూత్రధారులు* అయిన
*జననీ జన్మభూమి* ఋణాన్ని తీర్చగా
*స్వర్ణకమలం* అందుకుని
తన జాతికి
కీర్తి సుగంధమద్దాడు.
ఎంతఎదిగినా
నేనింకా ఆ కళామతల్లి ఒడిలో
*చిన్నబ్బాయి* నే
అని సవినయంగా పలికే
కళాతపస్వి
కె.విశ్వనాథ్
చిత్రపరిశ్రమ గళసీమలో
అలరే *శంకరాభరణం.*
నాకు తెలిసిన విశ్వనాథుని సినిమా పేర్లన్నీ చేర్చాను.మరచిపోతే అభిమానులు మన్నింతురుగాక.
సింహాద్రి జ్యోతిర్మయి.
25.4.2017.
..అభినందన్ కి అభినందనం.
శత్రువులకు చిక్కిన
ఆర్మీ ఆఫీసర్
తప్పించుకుని
తిరిగి రావడం
శత్రుదేశం లో
అడుగుపెట్టిన
అమాయకుడు
అందరి మనసులు
గెలిచి
క్షేమంగా
మాతృ భూమికి
చేరుకోవడం
ఉగ్రవాదుల చెరనుంచి
ప్రయాణీకులను
కాపాడడానికి
ఒక
సైనికాధికారి
చేసిన సాహసం
కన్నతల్లి మరణించినా
యుద్ధరంగాన్ని
వీడిపోని
ఒక మిలటరీ అధికారి
గుండెనిబ్బరం
చిత్రహింసలు పెట్టినా
దేశ రహస్యాలు
వెల్లడించని
సైనికాధికారి
వీరమరణం
ఇవన్నీ
సినిమాలలో చూశాము
చలించిపోయాము
హీరోల దేశభక్తి చూసి
ఉప్పొంగిపోయాము
ఊగిపోయాము
వారికి బ్రహ్మ రథం పట్టాము
సూపర్ హిట్లిచ్చాము
కానీ
ఏమిటిది?
ఈనాటి ఉద్వేగం
కొత్తగా ఉంది
నరనరాన
ఉత్తేజం
ఉరకలేస్తోంది
నిజమైన
హీరోయిజాన్ని
కళ్ళారా చూస్తూ...
మొక్కవోని ధైర్యాన్ని
అతని కళ్ళలో
వీక్షిస్తూ...
నిర్భయంగా
శత్రువుల ఎదుట నిలిచిన
ఆ సాహసానికి
అబ్బుర పడుతూ...
తొణికిసలాడే
ఆత్మవిశ్వాసాన్ని
ఆ మాటల్లో వింటూ..
ఆ వీరవరుడు
త్రివిక్రముడై
పెరిగినట్లు..
దిక్కులు పిక్కటిల్లే
ఆ అభినందనలన్నీ
నేనే
అందుకుంటున్నట్లు..
ఎప్పుడెప్పుడు
ఆ మహావీరుని
పాదస్పర్శ
నన్ను పునీతం
చేస్తుందా అని
ఎదురుచూసే
భరతమాత ను
నేనే అయినట్లు..
యావద్భారత దేశంచేత
జయహో
అనిపించుకుంటున్న
ఆ భరతమాత
ముద్దు బిడ్డడికి
కన్నతల్లిని
నేనే అయినట్లు...
పులకరింతలో
పునీతమవుతూ..
మనసారా దీవిస్తున్నా
వీరుడా!
విజయోస్తు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.3.2019
*రామకృష్ణ పరమహంస జయంతి*
సీ.
*రా* జిల్లు కాళికా తేజమ్ము కన్నార
*మ* హనీయుడై గాంచె మనసు దీర
*కృ* పను శిష్యులనెల్ల కెలవున బ్రోచె తృ
*ష్ణ* రహితుడై కల్ప తరువు గాను
*ప* రమార్థ మెఱుగంగ ప్రతి మత సాధన
*ర* హితోడ సాగించి రట్టు దెలిసి
*మ* ణి వివేకానందు మనకిచ్చి వసుధలో
*హం* సకీర్తిని భరతాంబ కొసగి
తే.గీ
*స* న్నగిల్లిన హైందవ సంస్కృతికిని
*జ* వము జీవముల తిరిగి సంతరించి
*యం* త్రణము జేసిన పరమహంస!మిమ్ము
*తి* రముగా నమ్మి మ్రొక్కులు తెలుపుకొనెద.🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
1.3.2025
శనివారం
కెలవు..ప్రేమ
రహి..ఆనందం
యంత్రణము..రక్షణ
8.6.2024
*అంతిమ (ఆత్మ) యాత్ర*
ఏమిటిది?
ఎందుకిలా నా శరీరం
అచేతనమయ్యింది?
ఎందుకు వీరంతా
నా చుట్టూ చేరారు?
ఎందుకిలా అందరూ ఏడుస్తున్నారు?
ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు?
నేనింక లేనని
మాట్లాడుకుంటున్నారు?
నేనిక్కడే ఉన్నాను కదా!
నన్ను వీళ్ళంతా
చూస్తూనే ఉన్నారు కదా!
మరి నేను లేనని
ఎందుకనుకుంటున్నారు?
ఈ అద్దాలగదిలో నా శరీరాన్ని బంధించి
పూలతో కప్పేస్తున్నారు
శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు
నేను నిజంగా అంత గొప్పవాడినా! అని
పొంగిపోయేలా పొగిడేస్తున్నారు
పూలరథంలో ఊరేగిస్తున్నారు
పూల వర్షంలో ముంచెత్తుతున్నారు
చందనపు చెక్కల
పాన్పుపై
పడుకోబెడుతున్నారు
నేనంటే వీళ్ళకి ఎంత ప్రేమ!
ఇంతమంది అభిమానాన్ని
సంపాదించానా నేను!
ఎంత ధన్యుణ్ణి!
అరే !ఇదేమిటి?
నామీద కట్టెలు పరిచేస్తున్నారు?
నాకెవ్వరూ కనపడటం లేదే!
నేతిధారలు నామీద కుమ్మరించేస్తున్నారు
నిప్పుల్లో కాల్చేస్తున్నారు
అరెరే!అదేమిటి?
ఇంతసేపూ నా చుట్టూ గుమిగూడిన
అభిమానులు,
ఆప్తులు,స్నేహితులు ఏరీ!
నిమిషాల్లో నన్ను చుట్టు ముట్టిన ఈ మంటల్లో
ఒంటరిగా
విడిచిపెట్టి అలా
వెళ్ళిపోతున్నారేమిటి?
వెనుదిరిగైనా చూడటం లేదే!
మాటల సవ్వడి
అడుగుల చప్పుడు
అన్నీ క్రమ క్రమంగా
దూరమై పోతున్నాయేమిటి?
నా శరీరం కూడా
దహించుకుపోతోంది?
ఇదేమిటి?
నాలో నుంచి ఏదో ఎగిరి వెళ్ళిపోతోంది?
నాతో పాటూ
కాలదా!
నా వెంట రాదా!
ఏమిటో!ఏదో ఆఖరి సందేశం అందిస్తున్నట్టుందే!
చివరి సందేహం
తీరుస్తున్నట్టుందే!
అర్థమౌతోంది
నీ మంచిచెడులు
పాపపుణ్యాలు లెక్క కట్టి
మరో జన్మలో
మరో శరీరంతో
నిన్ను చేరుకుంటాను
అంతవరకూ సెలవిక
అంటూ నా ఆత్మఘోషకు
నా చివరి ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా
సుదూరంగా
ఘంటసాల గారి గొంతు వినపడుతోంది...
“ నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః || ”
ఇది వింటూ
అవగతం చేసుకుంటూ
చివరి సత్యాన్ని తెలుసుకుంటూ
చివరి వీడ్కోలు తీసుకుంటూ
వెళ్ళివస్తాను
ఇక సెలవు.
ఈనాడు
రామోజీరావు గారి
అంత్యక్రియలు ఆద్యంతం వీక్షించిన నా మనోభావాలు
అక్షర రూపంలో...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.6.2024
ఆదివారం
Comments
Post a Comment