20/4*సుప్రభాత కాంతులు* కందంలో *మంగళా శాసనమ్* (14 శ్లోకాలు)

********************************************************

*సుప్రభాత కందం*
*స్వేచ్ఛానువాదం*

*శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనమ్*(14 శ్లోకాలు)
*శ్లోకం..57*
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే‌ర్థినామ్ |
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్|| 
*కందం..57*
మంగళమో లక్ష్మీశా!
మంగళమో భక్తసులభ! మహనీయగుణా!
మంగళమో శ్రీ నిలయా!
మంగళమో తిరుమలేశ!మంగళమయ్యా!


 తాత్పర్యం..
 ఓ లక్ష్మీపతీ!ఓ భక్తసులభా!ఓ మహనీయగుణాకరా!ఓ శ్రీ నిలయా!ఓ తిరుమలేశా!నీకు మంగళమగుగాక!

*****************************

*శ్లోకం..58*
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ||

*కందం..58*
అచ్చెరువున శ్రీదేవిని
విచ్చిన కనుదోయి మెరయ వింటిబొమలతో
ముచ్చట మీరగ గాంచెడు
పచ్చవిలుతుతండ్రి!నీకు భద్రమగు నయా!

2. తాత్పర్యం..
ఓ మన్మధజనకా!చక్కనైన కనుబొమలతో అలరారి మెరుస్తూ  విచ్చిన కన్నులతో ముచ్చటమీరగా నీ సతియైన లక్ష్మీదేవిని చూసే ఓ స్వామీ!నీకు మంగళమగుగాక.


 ****************************

*శ్లోకం..59*

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే|
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్||

*కందం..59*
వేంకటవరగిరిశిఖరి,శు
భాంకితమైనట్టి దివ్యపాదయుగళితో
యంకిలి దీర్చుచు శుభమిడు
శంకరవినుతా!తమకిదె శ్వశ్రేయమయా!

తాత్పర్యం:59
 ఘనమైన వేంకటాద్రిశిఖరంపై వెలిసి,నీ దివ్య చరణదర్శనంతో భక్తుల కలతలు తొలగించి కాపాడే ఓ శ్రీనివాసా!శంకరమిత్రా! నీకు మంగళమగుగాక.

****************************
*శ్లోకం..60*

సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్| 
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ||

*కందం...60*
తను‌ వణువణువున చెలువము
కనువిందులు చేయ నిలచి కమలాకాంతా!
కనుగొన వచ్చెడు భక్తుల
మనములు మురిపించు స్వామి !మంగళమయ్యా!


తాత్పర్యం: 60
అణువణువునా సౌందర్యం ఉట్టిపడే రూపంతో నిన్ను చూడవచ్చిన భక్తుల హృదయాలను మురిపించే ఓ కమలాకాంతా! నీకు మంగళమగుగాక.
****************************

*శ్లోకం..61*

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే|
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌||

*కందం..61*

నిత్యుండవు నిర్మలుడవు
సత్యమ్మగు యాత్మయందు సతము రమించే
దైత్యారీ!సర్వాత్మక!
ప్రత్యహమును పల్కెద‌ మిదె భద్రము నీకున్.

తాత్పర్యం:  61
ఓ రాక్షసాంతకా!నిత్యమై,సత్యమై, నిర్మలమైన ఆత్మయందు సతతమూ రమించే ఓ సర్వాత్మకా! ప్రతినిత్యమూ నీకు మంగళమగు గాక.
****************************
*శ్లోకం..62*

స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే |
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్||

కందం...62
సర్వము నెరిగినవాడవు
సర్వగుణాఢ్యుడవు సర్వశక్తియుతుడవే
సర్వజగతి కాద్యుండవు
సర్వాత్మా! సర్వవరద! శ్వశ్రేయమయా!

తాత్పర్యం:62
ఓ సర్వాత్మకా!సర్వవరదా!నీవు సర్వగుణసంపన్నుడవు.సర్వశక్తియుతుడవు.సర్వజగతికీ ఆద్యుడవు.మూలశక్తివి.అట్టి నీకు మంగళమగుగాక.
*****************************

*శ్లోకం..63*
పరస్మైబ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుంజేపరతత్వాయ వేంకటేశాయ మంగళమ్||

*కందం..63*
నీవేలే పరమాత్మవు
నీవేలే బ్రహ్మమనగ నీవే స్వామీ!
నీవేలే పరతత్వము
నీవే కోర్కెల యవధివి నీకు శుభమగున్.


తాత్పర్యం:63
స్వామీ!నీవే పరమాత్మవు.పరబ్రహ్మవు.పరతత్వానివి.కోర్కెలన్నీ తీర్చి మోక్షం ఇచ్చేవాడివి.అట్టి నీకు మంగళమగుగాక.

****************************
*శ్లోకం..64*

ఆకాలతత్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్|
 అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్||

*కందం..64*
ఎంత తడవు చూచిన నిసు
మంతయు తనియదు కద! మది యా శుభ రూప
మ్మెంత సుధామయ మా శ్రీ
కాంతుకు జయ మంగళమని కదిసి పొగడరే!

.తాత్పర్యం:64
స్వామీ! అమృతతుల్యమైన  నీ దివ్యమంగళరూపాన్ని ఎంతసేపు చూసినా  తనివితీరదు.అట్టి శ్రీకాంతుడవైన నీకు మంగళమగుగాక.
*****************************
*శ్లోకం..65*
ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ||

*కందం..65*
పురుషోత్తమ! నరజాతికి
పరమదయను వరదహస్తపావనముద్రన్
తరియగ నా పాద మిదియె
శరణని జూపెడు తమకిదె శ్వశ్రేయమయా!


తాత్పర్యం:65
ఓ పురుషోత్తమా! "భక్తులారా! సంసార సాగరాన్ని దాటడానికి ఇదిగో నా పాదాలను ఆశ్రయించండి" అని మానవులకు దయతో నీ వరదహస్తపావనముద్రను పట్టి చూపే నీకు మంగళమగుగాక.
*****************************
*శ్లోకం..66*
దయామృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః|
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళం ||

*కందం..66*
కరుణామృతఝరి కన్నుల
కురిపించుచు జగము లేలు కొండలరాయా!
శరణిడి చల్లగ గాచెడు
వరదా!ఓ శ్రీనివాస!భద్రము నీకున్.

తాత్పర్యం:66
ఓ ఏడుకొండల వాడా!కరుణామృతవాహినిని కన్నులలో కురిపించి వరదుడవై లోకాలకు శరణమిచ్చి చల్లగా కాపాడే ఓ శ్రీనివాసా! నీకు మంగళమగుగాక.
 
*****************************
*శ్లోకం..67*
స్రగ్భూషాంబర హేతీనాం సుషమా‌వహమూర్తయే |
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ||

*కందం..67*
విరిమాలలు వరచేలము
ధరియించియు భూషణములు,దరహాస రుచిన్
హరియింతువుగా పాపము
సిరినాథా!భద్రమనుచు చేరి భజింతున్.

తాత్పర్యం:67
ఓ శ్రీనాథా!పూమాలలు,ఆభరణములు,పట్టుపీతాంబరము ధరించి నీ దరహాస కాంతులతో మా పాపములను హరించే ఓ స్వామీ!నీకు
  మంగళమగుగాక.
***************************

శ్లోకం..68
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే|
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ||

కందం..68
అల వైకుంఠ పురిని విడి
చెలి శ్రీ మహలక్ష్మి గూడి స్థిరముగ నీవీ
యిల తిరుపుష్కరిణీతటి
వెలసిన తిరునాథ !శుభము వేకువ వేళన్.

తాత్పర్యం:68
ఓ తిరుమలేశా! వైకుంఠమునకు వీడి, శ్రీమహాలక్ష్మితో కూడి కలియుగవైకుంఠమైన ఈ తిరుమలలోని పుష్కరిణీతీరంలో వెలసిన నీకు మంగళమగుగాక.
****************************
శ్లోకం..69
శ్రీమత్సుందర జామాతృముని మానసవాసినే |
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

కందం...69
జామాతృ మునీంద్రు మదిని
స్వామీ!నిలిచితివి సతము సదయుడవగుచున్
భూమాతకు,లోకములకు
క్షేమమొసగి యేలువాడ! సేమము నీకున్.

తాత్పర్యం.. 69
ఓ శ్రీనివాసా!జామాతృ మునీంద్రుని మదిలో కొలువై, నిత్యమూ భూమాతకు,సకల లోకములకు క్షేమము కలుగునట్లు పాలించే నీకు మంగళమగుగాక.
**************************
శ్లోకం..70
మంగళా శాసనపరైర్మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ||

కందం..70
సేవించెడు యాచార్యులు
కావించెడు స్తోత్రములను కడు రమ్యముగా
భావనలో గొని జగముల
దీవించెడు నీకు శుభము తిరుమలవాసా!

తాత్పర్యం:70
ఓ తిరుమలవాసా! సుప్రభాత స్తోత్రపాఠాలను కమనీయంగా ఆలపిస్తూ, నిన్ను కొలిచే ఆచార్యుల  సేవలను సంతోషంతో స్వీకరించి దీవెన లొసగే ఓ స్వామీ! నీకు మంగళమగుగాక.


***************************
ముగింపు కందాలు
కందం..70A
 మంగళమన బ్రహ్మాదులు
మంగళమన విబుధులు తిరుమల గిరినిలయా!
మంగళమన మునిగణములు
మంగళమన భక్తకోటి మహి నేలుమయా!

తాత్పర్యం:70B
ఓ తిరుమల వాసా!బ్రహ్మాది దేవతలు,మునిగణములు,భక్తజనుల మంగళస్తోత్రములను అందుకుంటూ లోకాలను చల్లగా పరిపాలించే శ్రీనివాసా! నీకు మంగళమగుగాక.

కందం..70B
మంగళమో మత్స్యాకృత
మంగళమో కమఠ కోల మరియు నృసింహా!
మంగళమో చిన్ని వడుగ!
మంగళమో పరశురామ! మంగళమయ్యా!

తాత్పర్యం:70 B
మత్స్య,కూర్మ,వరాహ, నారసింహ,వామన,పరశురామాది అవతారములను ధరించి లోకాలనేలిన ఓ శ్రీహరీ! నీకు మంగళమగుగాక.

కందం..70 C
మంగళమో దాశరథీ!
మంగళమో రౌహిణేయ! మాధవదేవా!
మంగళమగు కల్కికికను
మంగళమో వేంకటేశ! మంగళమయ్యా!

తాత్పర్యం:70 C
శ్రీరామ,బలరామ, శ్రీకృష్ణ అవతారములు ధరించి, భవిష్యత్తులో కల్కి అవతారము ధరింపబోయే ఓవేంకటేశా! నీకు మంగళమగుగాక.
***************************
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళా శాసనాలు సంపూర్ణం.
మొత్తం శ్లోకాలు..70
మొత్తం కందం.. 78

సింహాద్రి జ్యోతిర్మయి 
కవయిత్రి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం
(న ర సం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


https://drive.google.com/file/d/1yw6DmB0QqX_vxUjGRykHYXMnGP4bN0PO/view?usp=drivesdk

సుప్రభాత కందం PDF 

****************************
****************************

Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ