20/2 స్తోత్రం
**********************************************************
శ్రీ వేంకటేశ స్తోత్రం
శ్లోకం..30
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణితాతులనీలతనో ।
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥
కందం -30
కలుములసతి తన తనువున
నలదిన కుంకుమ పరాగ మంటిన యెదతో
విలసిల్లెడు నల్లనయా!
కలుగునుగా నీకు జయము గరుడాద్రి విభో!
తాత్పర్యం :
ఓ గరుడాద్రివాసా! శ్రీలక్ష్మీదేవి తన తనువుపై అలదుకొన్న
కుంకుమపరాగము అంటుకున్న వక్షస్థలంతో విలసిల్లే ఓ నీలమేఘశ్యామా!నీకు జయమగుగాక.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..31*
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే|
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయమాం వృషశైలపతే||
కందం..31
చాలరుగా నీ కీర్తికి
ఫాలాక్షుం డతని సుతుడు,పరమేష్ఠ్యాదుల్
వ్రాలిన నీ వత్సలతను
పాలింపుము జగము లెల్ల పన్నగశయనా!
తాత్పర్యం :
ఓ పన్నగశయనా! ఆ త్రినేత్రుడు, కుమారస్వామి,విధాత కూడా నీ కీర్తికి సములు కారు.అట్టి ఘనదైవమైన నీవు అతిశయించిన నీ దయతో లోకాలను పాలింపుము.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
శ్లోకం - 32
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః !
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే !!
*కందం - 32*
దోసమనక నియతిని విడి
చేసితి నపరాధశతము శ్రీశా! దయతో
దాసుని మన్నించి మదిని
వేసట తొలగించి యేలు వృషశైలపతీ!
తాత్పర్యం : 3.
ఓ వృషశైలపతీ! నీతినియమాలు పాటించక శతాధికముగా చేసిన నా అపరాధములను మన్నించుము. మిక్కిలి దయతో నా మదిలోని వేదన తొలగించి నన్ను కాపాడుము.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..33*
అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధికదానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే
*కందం..33*
పరదేవతవగు వేంకట
గిరివాసా!భక్తజనుల కృపగను స్వామీ!
సిరిదేవికి ప్రాణవిభూ!
పరదైవము గొల్వ, నీదు పదములు విడువన్.
తాత్పర్యం : ఓ వేంకటేశ్వరా!నీవే పరదేవతవు.భక్తజనులను దయతో కాపాడే స్వామివి.శ్రీమహాలక్ష్మికి ప్రాణనాథుడవు.నేను వేరే దైవమును కొలువలేను.నీ పాదపద్మములను విడువను.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..34*
కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతా త్స్మరకోటి సమాత్|
ప్రతిపల్ల వికాభిమతా త్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే||
*కందం..34*
పరవశమున వ్రజకాంతలు
మురళీముఖరరవమునకు మోహన లగుచున్
స్మరసమ రూపుడవగు నీ
దరిజేరెడు యా నిజపదదాసుడనగుదున్
తాత్పర్యం : .
ఓ గోవిందా! మనోహరమగు మరళీరవమునకు పరవశలై గోపకాంతలు మన్మథాకారుడ వైన నీదరి చేరుచున్నారు.అట్టి నీ పాదపద్మములకు నేనును దాసుడనగుచున్నాను.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..35*
అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే|
రఘునాయక రామ రమేశ విభో
వరదోభవ దేవ దయాజలధే||
*కందం..35*
రామా!దశరథ నందన
రామా! సుగుణాలవాల! రఘువంశవిభూ!
రామా!సీతారమణా!
రామా!కోదండపాణి!రక్షింపుమయా!
తాత్పర్యం :
ఓ శ్రీ రామా!ఓ దశరథనందనా!ఓ సుగుణాభిరామా!ఓ రఘువంశతిలకా! ఓ సీతారమణా!ఓ కోదండపాణీ!నన్ను రక్షించుము.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..36*
అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ |
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామమయే||
*కందం..36*
వదనము చందురు చందము
కదనములో రావణునకు కాలుడవేగా
సుదతీమణి వైదేహికి
మది కోర్కెలు తీర్చు స్వామి మము బ్రోవుమయా!
తాత్పర్యం : 36
ఓ శ్రీరామా! చంద్రునికాంతులు వెదజల్లే మోమునీది.యుద్ధరంగలో రావణునికి సాక్షాత్తూ యమధర్మరాజువే.ఆ సీతాదేవి కోరిన కోర్కెలు తీర్చే ఓ స్వామీ! మమ్ములను రక్షించు.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..37*
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్|
అపహాయ రఘూద్వహ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే||
కందం.37
మోమున, తనువున,మనసున
రామా!యొక చక్కదనము రాజిలు స్వామీ!
ఏమా!బాణంపు గురియు
ప్రేమాస్పదులగు యనుజుల ప్రియ సోదరుడా!
తాత్పర్యం: 37
ముఖమునందు,తనువునందు, మనసునందు ఒక చక్కదనము తొణికిసలాడే ఓ శ్రీరామా!. నీ బాణం తిరుగులేనిది.నీ సోదరప్రేమ ఎంతో ఘనమైనది.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం.. 38*
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి|
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ||
*కందం..38*
నిత్యము నిను సేవింతును
సత్యము, నే కొలువబోను స్వామీ! పరులన్
భృత్యుడ నను పాలింపుము
ప్రత్యూషపువేళ సలుపు ప్రార్థన గొనుమా!
తాత్పర్యం: 38
స్వామీ!నేను నిత్యమూ నిన్నే సేవిస్తాను.వేరే ఏ దైవమునూ కొలువను.ఈ ఉదయవేళ నేను చేసే ఈ ప్రార్థన విని,నీ సేవకుడనైన నన్ను కరుణించి ఏలుకో.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..39*
అహందూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి|
సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ ||
*కందం..39*
అడిగెద నిన్నొక్క వరము
కడు పావన పాదయుగళి కైంకర్యము,నే
నెడబాయక చేసిన ఫల
మిడుమా!చేరంగజాల నిట కనుదినమున్.
తాత్పర్యం : 39
ఓ వేంకటేశ్వరా!నేను నిత్యమూ నీ కొండకు రాలేను.
నీ పాదపద్మములను ఒక్దకసారి ధర్శించి చేసిన ఈ సేవకే ప్రతిదినమూ నిన్ను దర్శించిన ఫలము కలుగునట్లుగా వరము నిచ్చి నన్ను అనుగ్రహించుము.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*శ్లోకం..40*
అజ్ఞానినా మయా దోషా
న శేషాన్విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే ॥
కందం..40
శేషాచలవాసా! కడు
దూషితచరితుని,దురాత్ము, తుంటరి ననుచున్
రోషింపకు యజ్ఞానిని
దోషము లన్నియు క్షమించి దొసగు లుడుపుమా!
తాత్పర్యం :
ఓ శేషాచలవాసా! మూఢుడనని అనేకములైన నేరములను చేశానని, తుంటరినని నాపై కోపగించకు. ఓ శ్రీహరీ!. వాని నన్నిటినీ క్షమించి నా ఆపదలను తొలగించి నన్ను కాపాడుము.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
కందం..
స్తోత్రము జేసితి నిన్నిదె
పాత్రత లేదనక నాదు పద్యనివాళిన్
గోత్రము నెత్తిన నందుని
పుత్రా!నా జన్మ తరియ ముదమున గొనుమా!
తాత్పర్యం..
ఓ నందగోపాలా! గోవర్ధనగిరిధారీ! కందపద్యాలలో నేను నిన్ను ప్రస్తుతిస్తున్నాను.నాకు అర్హత లేదు అని అనకుండా సంతుష్ట హృదయుడవై నా పద్యహారతిని స్వీకరిస్తే చాలు.నా జన్మ తరించిపోతుంది.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
Comments
Post a Comment