11/2*రోజుకో చరిత్ర* (ఫిబ్రవరి)



ఫిబ్రవరి..4
World cancer day


The first Friday in February (February 7) is National Wear Red Day. On this day, which is considered American Heart Month, everyone across the country dons the color red in order to raise and spread awareness in hopes to help eradicate heart disease and stroke in millions of women all over the nation. So put on your reddest red — whether it be a lipstick, a pair of pants, or your favorite hat — and paint the city red.



ఈ రోజు  (ఫిబ్రవరి మొదటి శుక్రవారం) స్త్రీల హృదయ సంబంధ వ్యాధులపై అవగాహన, ఆలోచన
కోసం 
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 
Wear red day ని 
పాటిస్తున్న సందర్భంగా

 మన(హృదయం) కోసం మనం

హృదయంతో
 ప్రేమించడమే కాదు
హృదయాన్ని కూడా ప్రేమిద్దాం
హృదయంతో
ఆలోచించడమే కాదు
హృదయం గురించి కూడా ఆలోచిద్దాం
హృదయంతో
స్పందించడమే కాదు
హృదయ స్పందనలను కూడా 
గమనిద్దాం.
మహిళ హృదయపు రజస్సే (ఎరుపు)
మానవజాతికి శ్రేయస్సు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.2.2021


,...........World kiss day......సందర్భం గా

నా కవిత 

..................ముద్దు ముచ్చట్లు...................

రైతన్న చెమటచుక్క
నేలతల్లిని ముద్దాడి
పంట చేనై పరవశిస్తుంది

వీర జవాను నెత్తుటి చుక్క
మాతృభూమిని ముద్దాడి
ఋణం తీర్చుకున్నానని
ఋజువు చూపిస్తుంది

నిండుగా పూచిన పుష్పం
పరమాత్ముని పాదాలు ముద్దాడి
క్షణికమైన బ్రతుకును
పునీతం చేసుకుంటుంది

తొలకరి తొలి వానచినుకు
బీడు నేలను ముద్దాడి
చెమ్మగిల్లి పరిమళిస్తుంది

మూడుముళ్ళ బంధంతో
దాంపత్యం ముద్దాడి
షష్టిపూర్తి గా జీవితాన్ని
సార్థకం చేసుకుంటుంది

మాతృత్వం మైమరచి
పురిటికందును ముద్దాడి
జన్మ ధన్యమయ్యిందని
పులకరించిపోతుంది

కాపురానికి వెళ్ళేపిల్లను
కడుపుతీపి ముద్దాడి
నుదిటిపైన వాత్సల్యపు
ఆశీస్సులు వర్షిస్తుంది

ముదిమి గూటికి చేరిన వయసు
మనుమలనెత్తి‌ ముద్దాడి
బ్రతుకు పరిపూర్ణ మయ్యిందని
భావించి మురుస్తుంది


సృష్టి లోన తీయనిదై
చెలిమి ఎదను ముద్దాడి
అంతరాలు లేని బంధమై
అదృష్టం తో అభిషేకిస్తుంది

హృదయపు భావోద్వేగం
కనులలో ఉప్పొంగి
పెదవిపైన పరచుకునే
పారవశ్యం పేరే  ..........ముద్దు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
6.7.2018




..............World chocolate day...............
తీయని నేస్తం 

అందాల ఓ నేస్తమా!
అందరి ప్రియ నేస్తమా!

పసి కళ్ళన్నీ నిన్ను చూడగానే
పరమ సంతోషం తో మెరిసిపోతాయి
కలిగినింటి ముద్దు పాపల చేతులు
నిన్ను జేబులనిండా నింపుకుంటాయి
పేదరికపు చిట్టి పెదవులు
ఆశతో లొట్టలు వేసుకుంటాయి
ఉల్లాసం కోరే పెద్దవారు కూడా
అప్పుడప్పుడూ నిన్ను 
చప్పరించేస్తుంటారు
మాయరోగం మధుమేహం 
పీడిస్తున్న వారు మాత్రం
నిన్ను స్వీకరించలేక 
నిట్టూరుస్తుంటారు
పుట్టిన రోజు నాడు
నిన్ను పంచుకోవడమే
చిన్నారులకు అసలైన పండుగ
పళ్ళూడిన ముసలివాళ్ళ
బోసినోటికి నీవే తీయని వేడుక
నీవు శుభానికి,సంతోషానికి
సంకేతంగా మారిపోయావు
నేటి ఆధునిక‌ జీవితంలో
భాగంగా చేరిపోయావు
చిల్లర తన దగ్గర లేదంటూ
షాపువాడు 
మా అనుమతి లేకుండానే
నిన్ను మా చేతుల్లో పెట్టేస్తాడు
కాదనలేని కానుక సుమా!
అన్నట్టు చూస్తాడు
ముదురు వన్నెలోని నిన్ను
ముద్దొచ్చే బుజ్జి పాపలు
మూతినిండా పూసుకుని
నవ్వుతుంటే చూసి
మురిసిపోని హృదయముంటుందా!
రంగురంగు కాగితపు వస్త్రాలు ధరించి
రకరకాల తీపి రుచులు నించి
చిన్నా పెద్దల మనసులు దోచే
 ఓ చిన్నారి చాక్లెట్ నేస్తమా!
ఈ ప్రపంచ చాక్లెట్ దినోత్సవ
శుభాకాంక్షలు అందుకోమ్మా

సింహాద్రి జ్యోతిర్మయి
7.7.2018
******************************
**************************

World Marriage Day – February 9, 2025. World Marriage Day is celebrated every year on the second Sunday in February, 

February 10 th
World umbrella ☂️ day
నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో *గొడుగు*
☔☂️ అనే శీర్షికన జరిగిన కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత

*గొడుగు*

గొడుగంటే నాకో అందమైన ఊహ
బామ్మ చిన్నప్పుడు చెప్పిన కథలో
దేశాన్నంతా 
ఏకఛత్రాధిపత్యంగా ఏలిన 
   ఏ బాహుబలిలాంటి
రాజకుమారుడో
నన్ను వలచి వచ్చి వరిస్తాడని 

గొడుగంటే నాకు కోపం
వర్షం సినిమాలో త్రిష లాగా ఫీలయిపోతూ గంతులేసుకుంటూ తడుస్తుంటే
అమ్మ చేతిలో నల్లగొడుగై వచ్చి
నా సంబరాన్ని పాడుచేస్తుందని

గొడుగంటే నాకు గౌరవం
హైస్కూలు లో చదివేటప్పుడు
హెడ్మాస్టరు గారి చేతికి
హుందాతనాన్ని ఇస్తూ
నాకెదురుగా ఠీవిగా
నడచివస్తుందని

గొడుగంటే నాకు అభిమానం

గురువు యశస్సుకు ఛత్రమై
ఛాత్రులనే పిలుపుకు
నాకు కూడా అర్హతనిచ్చిందని

గొడుగంటే నాకు ఆనందం
అక్క పెళ్ళిలో
గొడుగేసుకుని కాశీయాత్రకు వెళ్ళిపోయే బ్రహ్మచారిని పట్టుకొచ్చి
అమాంతంగా బావను చేసేసిందని

గొడుగంటే నాకు భక్తి
వినాయకచవితికి
ఇంట్లో ప్రతిష్టించిన బుజ్జి బొజ్జగణపయ్య కు
అలంకారమై అలరిస్తుందని

గొడుగంటే నాకు ఆశ్చర్యం

స్టూడియోలో కెమేరాకు
అలా ఇరు వైపులా ఉండే ఆ రెండు తెల్లగొడుగులు
ఫోటోలు తీసే సమయంలో  
ఏ మ్యాజిక్ చేస్తాయా!అని

గొడుగంటే నాకు అసూయ
ఔట్ డోర్ షూటింగులో
అప్సరస లాంటి హీరోయిన్ సుతారాన్ని
అంటిపెట్టుకుని కాపాడుతుందని


గొడుగంటే నాకు భయం
అలవైకుంఠపురంలో
విలన్ అప్పలనాయుడు చేతిలోని ఆయుధంలా
 గుండెల్లో దిగిపోతుందేమోనని

గొడుగంటే నాకు తన్మయం
బ్రహ్మోత్సవాలలో
తిరుమాడ వీధుల్లో
విహరించే స్వామికి
పూలగొడుగై మనసును
పులకరింపజేస్తుందని

గొడుగంటే నాకు దుఃఖం

సాగరసంగమం సినిమాలో 
ఆఖరిఘట్టంలో
బాలకృష్ణ భాగవతార్
పార్థివదేహాన్ని 
వర్షంలో తడవనీయకుండా కళకు కాపుకాసి
వేదనాభరితమైన ముగింపునిస్తుందని

గొడుగు మన నిత్యజీవితంలో భాగం
గొడుగు నేడు
నా కవితకు ఇచ్చింది 
ఒక చక్కని రూపం

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.9.2022




నేడు ఫిబ్రవరి 11 వ తేదీ
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 
సందర్భంగా వివిధ రంగాలలో శాస్త్రవేత్తలుగా పేరు గడించిన కొంతమంది భారతీయ మహిళలపై నా సీసపద్యం

మహిళా వేత్తలు

చంద్రయానము నందు చరితను సృష్టించె
....ఖుష్బు యను ముదిత గొప్పగాను
రూపించె ప్రతిభతో సాపేక్ష సిద్ధాంత
.....మతివ శాంతి ఖగోళ మందు వేత్త
ఆర్థిక శాస్త్రాన అలరి విభాగుప్త
....సేవజేసెను గ్రామ సీమలందు
గణితశాస్త్రము నందు గణుతికెక్కిన. రా
....మదొరై సుజాతయన్ సుదతి తాను

తే.గీ.

వ్యోమగామి మన సునీత యోషయేగ
కల్పనా చావ్ల నాసాకు ఘనత గూర్చె
భరత వనిత లందిరిటుల స్థిరయశమ్ము
బాలికల దిక కాలమ్ము భావియందు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు





11.2.2019
నేడు ఫిబ్రవరి 13
వరల్డ్ రేడియో డే
సందర్భంగా నా కవిత

....ఆ (రే) డియో...

అదో చిన్న పెట్టె
మనిషి కనపడకుండా
మాటలెలా
వస్తున్నాయబ్బా!అని
పసితనంలో నన్ను
విస్మయపరచిన అద్భుతం
ఊహ పెరిగినకొద్దీ
నా అవగాహనా 
పరిధిని పెంచుతూ
అలరించిన
ఆత్మీయ నేస్తం
మాట్లాడబోయే ముందుగా
గళం సిద్ధం చేసుకుంటూ
ఆలపించిన 
కమ్మని రాగం

నిదుర కనులు తెరిచేవేళ
సుప్రభాత 
భక్తి సుధలు

కేయూరాణి న భూషయంతి పురుషం అంటూ
శ్రావ్యంగా సాగిన
సంస్కృత పాఠం

ముప్పొద్దులా
 వార్తలను వినిపించి
సమాచారమందించిన
విజయవాడ కేంద్రం 
తెలిపే
హోటల్ మమతా వారి సమయం

రెండుపూటలా 
వివిధ భారతిలో విన్న
మధురమైన పాటలు

రాత్రివేళ పాత హిందీ చిత్ర గీతాలతో
ఊయలలూపిన
హవామహల్

రాయబారంలోని
పద్యాలను వింటూ
రాసుకుని నేర్చుకున్న వైనం

రాత్రి సరిగ్గా 
భోజనానికి కూర్చున్న
సమయంలో
వ్యవసాయ వార్తలు
ధరవరలలో
సీమపంది వారు అంటూ
వినపడగానే
అబ్బబ్బ!
ఆ రేడియో కట్టేయండి అంటూ
నాన్నమీద అమ్మ
 చిరుబురులు
ఉండవోయ్ 
వార్తలు వస్తాయంటూ
నాన్నగారి అనునయింపు

మధ్యాహ్న వేళ
ఏకాంబరం చిన్నక్కల
పిచ్చాపాటీ

ఆదివారపు బాలానందం
మూడు గంటలకు వచ్చే రేడియో నాటిక

వేదవతీ ప్రభాకర్
లలిత సంగీతం
ఘంటసాల ప్రైవేటు ఆల్బమ్ గీతాలు

ఉషశ్రీ పురాణ కాలక్షేపం
గమ్మత్తయిన స్వరంతో
ఆయన పలికే స్వస్తి వాక్యం

ఉత్కంఠతో కేరింతలు కొడుతూ
రేడియోకి చెవిని ఆనించేసి విన్న
క్రికెట్ కామెంట్రీ

సంతాప దినాలలో
వార్తలు తప్ప
మాటలు మాని
వినిపించిన
విషాద సంగీతం

అప్పుడప్పుడు విన్న సిలోన్ పాటలు

నేడు మరొక్కసారి
అలలుగా కదలగా
మనసులో మెదలగా
జ్ఞాపకాలను 

అక్షరాలుగా మార్చుకుని
కవితగా కూర్చుకుని
నెమరువేసుకుంటున్నా
నేస్తాలతో‌ పంచుకుంటున్నా.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.2.2019.

ఈ రోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా 
నా కవిత

***ప్రేమంటే ***

జన్మనిచ్చి స్తన్యమిచ్చి
అనురాగం కురిపించే
ఆప్యాయత అనుభవించి
అనుకున్నాను
ప్రేమంటే... అమ్మ అని

కళ్ళల్లో దాచుకుని
గుండెలపై పెంచుకుని
వేలు పట్టి నడిపించే
అమృత హస్తాన్ని చూసి
అనుకున్నాను
ప్రేమంటే ...నాన్న. అని

ఒకే పేగు తెంచుకుని
గోరుముద్దలు పంచుకుని
నాతో కలిసి పెరిగిన
రక్తబంధాన్ని చూసి
అనుకున్నాను
ప్రేమంటే... అన్న అని

వాత్సల్యం వర్షించి
విజ్ఞానపు ధనమిచ్చి
ప్రతి ఫలమే ఆశించని
కరుణను చూసి
అనుకున్నాను
ప్రేమంటే... గురువని

అభిమానం పెనవేసి
అభిరుచులను కలబోసి
అరమరికలు ఎరగనట్టి
ఆత్మీయత చూసి
అనుకున్నాను
ప్రేమంటే.. స్నేహమని

ఊసులెన్నో గుప్పించి
మనసు నెంతొ మెప్పించి
జీవితమే నేనంటూ
నేనే తన ప్రాణమంటు
బాస చేసిన అతగాడి ని చూసి
అనుకున్నాను
ప్రేమంటే...స్వర్గమని

నా మనసును 
గాయపరచి
నా నెత్తురు కళ్ళజూసి
ప్రాణాలను హరిస్తున్న
ఈ పశుత్వాన్ని చూస్తూ
ఉలికిపడుతూ
ఊపిరి వదిలేస్తూ
ఈ ఆఖరి క్షణాలలో
అనుకుంటున్నాను
ప్రేమంటే... మృత్యువని.

తొందరపడి ప్రేమించి
అందరినీ ఎదిరించి
బంధాన్ని వేసుకుని
తొందరగా తెంచుకుని
బ్రతుకును
చిందరవందర
చేసుకుంటున్న
యువతరమా!
ప్రేమంటే
 బ్రతుకును బలిపెట్టే
స్వార్థం కాదు
బ్రతుకును పండించే
త్యాగం 

అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు 



సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.2.2019



*చెంపపెట్టు*
 
ఈ రోజు slap day అట.
ఇదీ మంచిదే
జీవితం లోని 
ప్రతి తీయని అనుభవమూ
మోహంలో ముంచేస్తుంటే
చేదు అనుభవం
చెంపపెట్టుగా మారి
పాఠం నేర్చుకోమని,
పద్ధతి మార్చుకోమని,
ఒక్క క్షణం ఓర్చుకోమని,
శాంతం కూర్చుకోమని
సందేశమిచ్చి
సత్యాన్వేషణ చేయించే గురువై 
ఉన్నతికి నడిపించి
ఉద్ధరిస్తుంది.
సర్ఫ్ ఎక్సెల్ ఎడ్వర్టైజ్ మెంట్ లో *మరక మంచిదే*
అన్నట్టు చెంపదెబ్బ కూడా మంచిదే.

So
Happy Slap day to all. 

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.2.2022




మాతృ భా (ఘో )ష

మీరు మరచిపోతున్న
మాతృభాష ను నేను
ఆదరణ కరువవుతున్న
అమృత భాషను నేను

నన్నయ్య ఇచ్చాడు నాకు కావ్య గౌరవం
చిన్నయ్య కూర్చాడు నాకు బాల వ్యాకరణం
తిక్కన్న నాలోని సొగసుల్ని చూశాడు
పోతన్న నాలోని తీయదనం చూపాడు

అన్నమయ్య కీర్తనలో భక్తిరసం నేనేను
కృష్ణ శాస్త్రి పాటలోని ఆర్తియన్న నాదేను

గురజాడకు అందించా అభ్యుదయపు వాడి నేను
శ్రీ శ్రీ లో చూపించా కవిత్వంపు పదును

అన్ని భాషలలోన మిన్న నేనేనన్న
ఖ్యాతినే పొందాను
కనుకనే పొంగాను

తెలుగు తేటయన్న
మాటదక్కిందన్న
భావనతో మైమరిచా
ధన్యనంటు నే తలచా

శతకాలతో జాతికి నీతుల్ని నేర్పాను
ప్రబంధాలతో శృంగార లోతుల్ని చూపాను
అవధానపు ప్రక్రియలో ప్రత్యేకత చాటాను
ఆధ్యాత్మ భావాల అంచులే తాకాను

విన్నారా!
ఇది అంతా గతకాలపు వైభవం.
చూశారా !
నేడు నాది శోచనీయ అనుభవం

నేను రానంటారు
నన్ను వద్దంటారు
అభివృద్ధి పథాన నా ఉనికి
ఆటంకం అంటుంటారు

అమ్మపాలతో పాటుగా అలవడేటి నన్ను
అమ్మ జోల పాట లోని హాయినయిన నన్ను

నేడు
అవహేళన చేస్తున్నారు
అల్పంగా చూస్తున్నారు

మనసారా నన్ను తాము
నేర్వలేని నిర్భాగ్యులు

నోరారా మాతృభాష
పలుకలేని పాపాత్ములు

నన్ను జీవచ్ఛవాన్ని చేస్తున్నారు
అన్యభాషా పదాల అతుకులేస్తున్నారు

అన్ని భాషలలోనున్న కొన్ని వేల పదాలను
అచ్చులతో చేయూతనిచ్చి
అక్కున చేర్చుకున్న నాకు
ఆ ఔదార్యగుణమే నేటికి
ఆత్మహత్యా సదృశమయ్యింది

నా భవితవ్యపు ఆశలిప్పుడు
భాషాభిమానుల‌ చేతుల్లో నిలిచి ఉంది

బడుగుభాషను కాను
మీ జీవనాడిని

కానిండు
 మననిచ్చి
నన్ను చిరంజీవి ని.

సింహాద్రి జ్యోతిర్మయి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం 
( న ర సం ) ఉపాధ్యక్షురాలు
21.2.2019


నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న 
ఈ రోజు ఫిబ్రవరి 28 వ తేదీ
నేషనల్ సైన్స్ డే గా పాటిస్తున్న 
సందర్భంగా నా కవిత

  ముప్పు తప్పదు

ఆదిమానవుడు
ఆధునిక మానవుడిగా 
ఎదిగేవరకూ
ఆకులు చుట్టుకునే దశనుండి
అతి ఖరీదైన వస్త్రాలవరకూ
నట్టడవి నుండి
నగరాలుగా విస్తరించేవరకూ
ఆటవిక జీవనం నుండి
అంతరిక్ష విజయాలవరకూ
పచ్చి మాంసాలనుండి
పంచభక్ష్య పరమాన్నాలవరకూ
పావురాల సందేశాల నుండి
శాటిలైట్ సమాచారం వరకూ
అక్షర జ్ఞాన శూన్యత నుండి
అరచేతిలో ఆండ్రాయిడ్ వరకు
విస్తరించిన
మానవ పురోగమనాన్ని
అడుగులు వేయించింది
పరుగులు తీయించింది
శాసించింది
శ్వాసించింది
అంతా సైన్సే
కానీ పెరుగుట విరుగుట కొరకే
అన్న సూక్తిని నిజంచేస్తూ
అణు విజ్ఞాన శాస్త్రాన్ని
మానవాళిని మసిచేసే
అణ్వాయుధాలుగా
గుండెమార్పిడి
శస్త్రచికిత్స లు కూడా
అవలీలగా చేయగలిగే
ఆధునిక వైద్యశాస్త్రాన్ని
లింగవివక్షకు
కొమ్ముకాసే
భ్రూణ హత్యలుగా
పారిశ్రామిక విప్లవ
ఫలాలు
ప్లాస్టిక్కుల విష వలయాలు గా
కాలుష్యపు కాసారాలుగా
అధిక దిగుబడుల ఆరాటాలు
శరీరాలను
రసాయనిక ఎరువుల అవశేషాలుగా
హరితాన్ని హరించిన
కాంక్రీటు కీకారణ్యాలు
ఓజోను విచ్ఛేదకాలుగా
మారిపోవడం
శాస్త్ర పురోగతి లో
సైడ్ ఎఫెక్ట్స్ అనేది
కాదనలేని సత్యం
రెండంచుల కత్తిలాంటి
శాస్త్రీయ విజ్ఞానం
హస్తవాసి గల
వైద్యుని చేతిలోని
ఆయుధం లా
మానవాళి ని
బ్రతికించాలే గానీ
ఉన్మాది మనసులోని
ఉగ్రవాదంలా
ఆత్మాహుతి దళమై
నరజాతిని నాశనం
చేయరాదని
గ్రహించి నడచుకుందాం.
సమాజాన్ని
సంరక్షించుకుందాం.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం.రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.2.2019.

Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ