11/12.రోజుకో చరిత్ర (డిసెంబర్)




డిసెంబర్ 01
World AIDS day



నేను నర్సరావుపేటలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉద్యోగం చేసే రోజుల్లో కాలేజ్ లో నేను ఎన్.ఎస్.ఎస్.బాలికా విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ని‌ కూడా.
అప్పట్లో కళాశాల విద్యార్థులలో కూడా హెచ్.ఐ.వి.పాజిటివ్ కేసులు వెలుగు చూసి ఆందోళనకు గురిచేస్తున్న కాలమది.పందొమ్మిది నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు వాళ్ళల్లో కూడా నలభై శాతం ఈ వైరస్ విస్తరిస్తోందని గుర్తించిన  ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని ‌కళాశాల విద్యార్థులను అప్రమత్తం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి,ఆ భారాన్ని లెక్చరర్ ల భుజాలపై ఉంచింది.
ముందుగా వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి వారిద్వారా విద్యార్థులను మేల్కొలపాలని నిర్ణయించింది.
అందుకోసం ప్రతి కాలేజ్ నుండి ఒక లేడీ మరియు జంట్ లెక్చరర్ ను పంపమని కళాశాలలను ఆదేశించింది.కానీ ఈ వ్యాధి పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే ఆ రోజుల్లో ఆ ట్రైనింగ్ కి వెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
అప్పుడు ఎన్.ఎస్.ఎస్.ఆఫీసర్లు గా మా సామాజిక బాధ్యతను గుర్తించిన నేను,నా తోటి లెక్చెరర్ శ్రీ గురుకిషన్ ఆ ట్రైనింగ్ కి వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాము.
ఆ ట్రైనింగ్ మాలోని ఎన్నో అపోహలను తొలగించింది.
మాకు చెప్పకుండానే హెచ్.ఐ.వి.పాజిటివ్స్ తో కరచాలనం,భోజనం వంటి పనులు చేయించి అది ఆ రకంగా ‌వ్యాపించదనే వాస్తవాన్ని తెలియజెప్పారు.
నిజం‌ చెప్పొద్దూ!డాక్టర్ లే భయపడి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిన ఆ రోజుల్లో ఆ భయం మమ్మల్ని కొద్ది సేపు వెంటాడింది.
కానీ క్లాసులు పూర్తిగా విన్న తరువాత ధైర్యం వచ్చింది.
*కాలేజ్ టాక్ ఎయిడ్స్ *
పేరుతో నిర్వహించిన‌ ఈ కార్యక్రమం విద్యార్థులను దిద్దవలసిన మా  బాధ్యత వైపు నడిపించింది.
యుక్త వయసులో పిల్లల్లో వచ్చే శారీరక ,మానసిక మార్పులపై అవగాహన,
అపోహలు,వాస్తవాలు,పర్సనల్ హైజీన్,పిల్లలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు మరియు లెక్చరర్ల బాధ్యత ,పీర్ గ్రూప్ ప్రభావాలు వంటి అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.
కళాశాలకు తిరిగి వచ్చాక మా పట్టణంలోని కొన్ని కళాశాలలకు వెళ్ళి , విద్యార్థులకు కౌన్సిలింగ్ క్లాసులు తీసుకున్నాము.దీనికి కారణం ఏంటంటే తమ లెక్చరర్ లయితే విద్యార్థులు వినడానికి, సందేహాలు అడగడానికి ఇబ్బంది పడతారని భావించి ,ఒక కాలేజ్ లెక్చరర్లను మరొక కాలేజీకి పంపే ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత చాలా కాలం మమ్మల్ని ఎయిడ్స్ సార్,ఎయిడ్స్ మేడమ్ అని సరదాగా అనుకునేవాళ్ళు.
అలాగే డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీకి కూడా‌భారీగా బయల్దేరినా ఆ ర్యాలీ లో‌నడవడానికి కూడా మొహమాటపడి నాలుగడుగులు మాతో వేసినట్టే వేసి మాయమయ్యేవాళ్ళు.
చివరకు చాలా‌కొద్దిమంది విద్యార్థులు ,మేం ముగ్గురం ఎన్ ఎస్ ఎస్‌ ఆఫీసర్లం మిగిలేవాళ్ళం.
ఆ తర్వాత కాలేజ్ లో ఈ విషయం పై ఏర్పాటు చేసిన బాలికల గ్రీవెన్స్ వింగ్‌ ని కూడా నేనే నిర్వహించాను.

ఈ విధంగా 
నేను సైతం...అంటూ శ్రీ శ్రీ స్ఫూర్తి తో ఒక లెక్చరర్ గా నా బాధ్యతను నేను మనస్ఫూర్తిగా నిర్వహించగలిగినందుకు
నిశ్శబ్దాన్ని ఛేదించండి
ఎయిడ్స్ గురించి మాట్లాడండి 
అంటూ ప్రముఖ వైద్యులు
డాక్టర్ సమరం గారితో ఉపన్యాసాలు ఏర్పాటు చేయించటం వంటి కార్యక్రమాలలో నేను పాల్గొన్నందుకు ఇప్పటికీ గర్వంతో కూడిన సంతృప్తిని పొందుతుంటాను.
నాతో పాటు మా కాలేజ్ ఎన్.ఎస్.ఎస్. ఆఫీసర్లు శ్రీ J. ప్రభాకర్ , శ్రీ k.గురుకిషన్ ల గారిని కూడా ఈ సందర్భంగా ప్రశంసించటం నా విధి.
ఎందుకంటే గాంధీజయంతి కి మేము ప్రతీ సంవత్సరం ముగ్గురం కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవాళ్ళం.
బ్లడ్ రిపోర్ట్ లు పరిశీలించి నప్పుడు అక్కడక్కడా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చినప్పుడు మా బాధ వర్ణనాతీతం.ఆ పసివయసులో తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుతో జీవితాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసుకున్నారని జాలి కలిగేది. ఆ విషయం అత్యంత గోప్యంగా ఉంచి, వారిని రహస్యం గా పిలిపించి ,హెచ్చరించి, ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పేవాళ్ళం.
ఇదండీ కాలేజ్ టాక్ ఎయిడ్స్ తో నా జ్ఞాపకాలు.

ఈ సందర్భంగా అప్పటి‌ నా కవిత
మన (సు) కర్తవ్యం

తప్పటడుగుల పసిప్రాయంలో
వేలుపట్టి 
నడిపించినట్లే
తప్పుటడుగుల
యవ్వన దశలో
మంచి భవితకు
మార్గం చూపే
మనసెరిగిన‌ స్నేహితుడు
కావాలి తండ్రి

ఒద్దికగా పైట
సర్దుకోవటం నేర్పినట్లే
తెలివిగా బ్రతుకు దిద్దుకోవటం నేర్పి
అమ్మాయి వెన్నంటి
అన్ని వేళలా మసలి
ఆది గురువు తానుగా
మారాలి తల్లి

మన ముంగిట
పెంచుకుంటున్న
మరుమల్లె‌తోట
మన యువత
మానవత్వంతో వారు
పరిమళించేలా
తోటమాలి తానై
తీర్చిదిద్దాలి గురువు

అమాయకపు పసితనం
అంటురోగాన్ని కావలించుకుంటోంది
చేసిన తప్పును
చెప్పుకోలేక
పశ్చాత్తాపంతో
పరితపించి
హీనంగా చూడబడుతూ
తల ఎత్తుకు తిరగలేక
మంచానికి అంటుకుపోయి
మరణానికి చేరువవుతోంది

తప్పొప్పులను తరచి చెప్పి
తరుణోపాయం చూపాల్సిన
తరుణం
 ఆసన్నమయింది

మందులేని ఈ మహమ్మారికి
నివారణ మార్గమొక్కటే
అది నిశ్శబ్దాన్ని ఛేదించటమే.
నేడు మనం సిగ్గుపడితే
రేపు జాతి యావత్తూ
సిగ్గుతో తలదించుకోవలసిన
దుర్గతి దాపురిస్తుంది
అందుకే 
మౌనాన్ని వీడుదాం
మాట్లాడుదాం

మాతృ‌ దేవోభవ
పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ
అంటూ
అత్యున్నత గౌరవాన్ని
అందుకునే మనమంతా
మన యువతను

సుందర భవితకు
మళ్ళించుకుంటూ
చైతన్యవంతమైన
సమాజాన్ని సృష్టించుకుందాం

జాతి పరువు బరువు
మన భుజాలకెత్తుకుని
సాటి దేశాలముందు
సగర్వంగా నిలబెడదాం

జైహింద్

ఈ కవిత నేను కాలేజ్ టాక్‌ ఎయిడ్స్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు
ఒక పూట సభను నా ఆధ్వర్యంలో నడిపి, అక్కడ వినిపించి సన్మానం అందుకున్న ‌కవిత.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
********************************************************


ప్రయత్నిస్తున్నాను
నా అంతరంగంలో,
ఆలోచనలలో
అప్పుడప్పుడూ 
ఆచరణలోనూ
ఉన్న కాలుష్యాన్ని
మెల్లమెల్లగా
తొలగించుకుంటూ
ప్రేమ విత్తునాటి
కరుణ తడుపు పెట్టి
 నమ్మకపు దోహదమిచ్చి
ఆశల చిగురై
స్నేహపు సుమమై
మానవత్వపు పరీమళమై 
అలముకోవాలని
చవులూరే ఫలాన్నై
రేపటి నోటికి అందాలని
పచ్చదనాన్ని వరంగా 
జగతికి కానుకివ్వాలని
ప్రయత్నిస్తున్నాను
ప్రయత్నిస్తూనే ఉంటాను

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
02.12.2022


ఈ రోజు డిసెంబర్ 3 వ తేదీ
 దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా

నేను కూడా....

పరుల కోసం.....
పాటుపడని బ్రతుకు
స్పందించని హృదయం
ఆలోచించని మెదడు
స్వార్థం వీడని బుద్ధి
సాయం చేయని చేతులు
కన్నీరు పెట్టలేని కళ్ళు
మాట సాయమైనా చేయని నోరు
గోడు వినని చెవులు
అడుగు కదపని కాళ్ళు
ఉన్న నన్ను చూసి
నాలో ఎక్కడో
ఒక మూల
మినుకు మినుకు
మంటున్న 
మానవత్వం అంటోంది
ఒక్క అవయవలోపం
ఉన్నవారిని
దివ్యాంగులు అంటే
అన్ని అవయవాలూ
దివ్యంగా ఉన్నా
దేనికీ సహకరించని
ఎవ్వరికీ ఉపకరించని
నిన్ను ఏమనాలి ?
అంటూ...
ఏమిటీ!
ఏదో సమాధానం
చెప్పాలనుకుంటున్నట్టున్నారు కదూ!
అవసరం లేదు లెండి
నేను దాని నోరు
మూయించేశాను
మీరింక నా గురించి
నోరు తెరవకండి.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.3.2020



నేడు డిసెంబర్ 5 వ తేదీ
వరల్డ్ సాయిల్ డే సందర్భంగా నా కవిత

......మట్టి మనసు.....

నాలుగు
వాన చుక్కలు ‌తాకితే
పరిమళించిపోతాను
గుప్పెడు విత్తనాలు చల్లితే
పంటచేనై పరవశించిపోతాను
కడుపును తవ్వి
కాసిన్ని ఇటుకలు పేరిస్తే
పునాదినై నీ అంతస్తుల్ని మోస్తాను
గుండె చీల్చి
చిన్న‌మొక్కను నాటితే చాలు
వేళ్ళు తన్నిపెట్టినా
 మహా వృక్షాన్ని చేస్తాను
ఆప్తులెవ్వరూ భరించలేని
ఊపిరి వదిలేసిన నీ దేహాన్ని
దుప్పటినై దాస్తాను
నీకు ఆధారమై
అన్నీ నేనై
అమ్మలా సాకుతున్న
నా గొంతు లో
రసాయనాల విషం నింపుతున్నావు
ప్లాస్టిక్కు వ్యర్థాల ముల్లు దింపుతున్నావు
గుప్పెడు మెతుకులు పడేస్తే
కుక్కకైనా విశ్వాసం ఉంటుందే!
బంగారంగా మారి నీకు బ్రతుకునిస్తున్నా
మరి భావితరాలకు నన్ను
బహుమతిగా ఇచ్చేందుకు
నువ్వేం చేస్తావు?
ఈ మట్టి గోడు ఆలకించు
కర్తవ్యం ఆలోచించు
కాలుష్యం నివారించు
నేటి నీ నిర్ణయమే
రేపటి తరానికి మనుగడ

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.12.2018.
నేడు డిసెంబర్ 7వ తేదీ 
నేషనల్ లెటర్ రైటింగ్  డే సందర్భంగా నా కవిత

ఉత్తరానికో ఉత్తరం

                 ఒంగోలు,
             7.12.2018.

ఓ ఉత్తరమా!
నా ప్రియనేస్తమా!

ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి
ఎక్కడున్నావు?
ఎలా ఉన్నావు?అసలేమయిపోయావు?
ఒకప్పుడు రాణిలా 
ఓ వెలుగు వెలిగినదానివి
అనుబంధాల సామ్రాజ్యాన్ని
ఏకఛత్రాధిపత్యంగా
ఏలినదానివి
సమాచార వ్యవస్థనే
శాసించినదానివి
తపాలా రంగానికే
తలమానికమైనదానివి
ఇప్పుడేం చేస్తున్నావు?
సేవలు చేసీ చేసీ అలసిపోయి
పదవీ విరమణ చేసిన ఉద్యోగిలా
పోస్టాఫీసు పొదరింట్లో
సేదదీరుతున్నావా!

ఇప్పుడు నువ్వు 
చెట్టుకి ఆనుకుని
గమ్యం చేరడానికి
వేచి‌ఉండే ఆ ఎర్ర గది,
ఎక్కి తిరిగే ఆ ఎర్రవ్యాను,
నిన్ను చంకనేసుకుని తిరిగే
ఆ ఖాకీ మేన్
ఎక్కడా‌ ఆచూకీయే లేరు

చల్లనివార్తో,
చావుకబురో
చప్పున చేర్చే తంతివై,
ముఖ్యాంశాలను
మూడు ముక్కల్లో తేల్చేసే
పోస్టు కార్డువై,
సాధక బాధకాలన్నీ
సవివరంగా వెళ్ళబోసుకునే
ఇన్లాండ్ లెటర్ వై,
భావోద్వేగాలతో
హృదయాలను కదిలించే
ఎన్నెన్నో ఊసుల
 ఎన్వలప్ వై
పలకరించ వచ్చే నీకోసం
ఎంతగా మాకళ్ళు
ఎదురుచూసేవో
నీకు గుర్తుందా!

ఈ రోజు కాకపోతే రేపు
రేపు రాకపోతే
ఎల్లుండైనా వస్తావనే
నమ్మకాన్నిచ్చి
ఆశతో బ్రతకటం మాకు
అలవాటు చేసిన
ఆత్మబంధువు నువ్వేకదా!

కొత్తనీరొచ్చి పాతనీరుని
కొట్టేసినట్లుగా
లేండ్ ఫోనొచ్చి నీ
ప్రాధాన్యాన్ని తగ్గించింది
సెల్ ఫోన్ వచ్చినిన్ను చెల్లని నోటుగా మార్చేసింది
స్మార్ట్ ఫోన్ వచ్చి
నీ ఉనికినే ఊడ్చేసింది

వేలికొసలు క్షణాల్లో
విషయాలను
చేరవేసేస్తుంటే
భావాలను కరిగించి
పెన్నులో నింపి
ఊసులకు అందమైన
ఊహలనద్ది
సంస్కారపు అక్షరాలు ధరించి
చిరునామా దుస్తులు వేసుకుని
స్టాంపుల ఆభరణాలను
అలంకరించుకుని వచ్చే నిన్ను అందుకోవటానికి,
ఆ ఆభరణాలను ఒలుచుకుని 
హాబీగా దాచుకోవటానికి
వేచి చూడటంలోనే
మధురానుభూతి
ఉందనుకునే
మా తరం వాళ్ళను
వెర్రి వాళ్ళుగా 
జమకట్టేస్తున్నారు
అయినా నీకు
చింత వలదులే మిత్రమా!
నిన్నటి నిజానివైన నిన్ను
రేపటి తరానికి
పరిచయం చేయటానికి
ఉపాధ్యాయులమైన మేము
పిల్లలకు
ఉత్తరాలు రాయటం
నేర్పిస్తుంటాము
ఊరడిల్లి ఉండు నేస్తమా!
మరొక లేఖతో నిన్ను
మళ్ళీ పలకరిస్తాను.
అంతవరకూ సెలవు.
ఇక ఉంటాను.

             ఇట్లు
         నీ చిన్ననాటి        
        స్నేహితురాలు

అంకితం

అందరికీ  ఆత్మీయంగా ఉత్తరాలు రాసి,అందరి క్షేమసమాచారాలు విచారించే  చక్కని వ్యక్తిత్వం కలిగిన మా నాన్నగారు స్వర్గీయ సింహాద్రి వీరభద్రాచారి గారికి ప్రేమతో అంకితం.

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
7.12.2021


సరిలేరు మీకెవ్వరు

నీ శక్తి
మా విజయకేతనంగా
నీ ధైర్యం
మా రక్షణ కవచంగా
నీ సాహసం
ఈ జాతికి ఖ్యాతిగా
నీ త్యాగం
ఈ దేశ గౌరవంగా
తలకెత్తుకున్న ఓ వీరుడా!
మట్టిలో కలిసిన
నీ దేహం
మా ఉనికికి ఆధారం
గాలిలో కలిసిన
నీ ఊపిరి
మేము పీల్చే
స్వేచ్ఛా వాయు పరిమళం
ఓ కీర్తి చంద్రమా!
దేశభక్తి సంద్రమా!
నీకు మేమిచ్చే
బిరుదులు
పతకాలు
నివాళులు
చంద్రునికో నూలుపోగు
సాగరంలో వానచినుకు

జై జవాన్.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.12.2020





నేడు డిసెంబర్ 10 వ ‌తేదీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నా కవిత

 ......*హక్కు (లెక్క) లు*....

నేడు డిసెంబర్ 10 వ ‌తేదీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నా కవిత

 ......హక్కు (లెక్క) లు....

అమ్మానాన్నల
ప్రేమను హక్కుగా 
అనుభవించే పసివారు
ఎన్నో పొందుతూ,ఎదిగి
 వృద్ధాప్యంలో వారికి
బాసటగా ఉండాలన్న బాధ్యతను విస్మరిస్తున్నారు

విద్యార్థి దశలో
బాల్యాన్ని హక్కుగా
భావించే చిన్నారులు
క్రమశిక్షణ తమకు కర్తవ్యమనే
బాధ్యతను మరచిపోతున్నారు

యవ్వనంలో
ప్రేమించటం తమ
‌ హక్కుగా భావించే యువతీయువకులు
కనిపెంచిన వారి 
అంగీకారం పొందటం
గౌరవం కాపాడటం
తమ బాధ్యత అనే
ఇంగితాన్ని కోల్పోతున్నారు

భర్త సంపాదన
తన హక్కు అని భావించే
ఆధునిక యువతులు
అత్తమామలను
ఆదరించాలనే
 బాధ్యత బరువనుకుంటున్నారు

భార్య జీవితంపై
హక్కును సాధించామనుకునే
మగమహారాజులు
ఆమె అభిరుచులను
మన్నించాలనే
బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు

నాయకులను విమర్శించడం
హక్కుగా భావించే పౌరులు
 స్వచ్ఛందంగా 
ఓటు వేయడం
 తమ బాధ్యత అనే
ఉన్నత విలువలను ఉపేక్షిస్తున్నారు

ప్రభుత్వ ఆస్తులు
తమ హక్కుగా భావించే ప్రజలు
వాటి రక్షణ తమ బాధ్యత
అనే పౌరధర్మాన్ని
పట్టించుకోవడం లేదు

పరమాత్మ ఆరాధన
హక్కుగా భావించే భక్తులు
పరమత సహనం
తమ బాధ్యత అనే
సంస్కారాన్ని గంగలో కలుపుతున్నారు

ప్రకృతి సంపదను
వాడుకోవటం తన హక్కుగా భావించే మానవులు 
దానిని రేపటి‌ కోసం కాపాడటం
తన బాధ్యత అనే
ఆలోచనను విస్మరిస్తున్నారు 


బాధ్యతలు 
తలకెత్తుకోవడానికి
సిద్ధంగా లేనివారికి
హక్కులను అనుభవించే
అర్హత లేదు

      పొందడానికి ముందు
ఇవ్వడానికి సిద్ధపడదాం

గౌరవాన్ని పొందటం
నీ హక్కు
గౌరవాన్ని ఇవ్వటం
నీ బాధ్యత

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు








ఈ రోజు డిసెంబర్ ‌11 వ‌ తేదీ 
వరల్డ్ మౌంటెయిన్స్ 
డే 
సందర్భంగా నా కవిత

.....ఘన గిరులు....

పరమ శివుని కోరి
పార్వతి అపర్ణయై,
పాశుపతము కోరి
పార్థుడు మౌనియై
తపమొనర్చిన ఆ హిమాచలమ్ము

దేవదానవులెల్ల
పాలకడలిని చిలుక
తాడైన వాసుకికి
తాను ఆధారమై
కవ్వముగా‌ కదలిన
మంధరమ్ము

అగస్త్యమౌనీంద్రు
ఆనతిని తలదాల్చి
వినయాన వంగిన
వింధ్యనగము

తన సుఖము త్యజియించి
తమ్ముని కోసమై
రాముడు సతితోడి
సౌమిత్రితో గూడి
మసలిన సుందర
చిత్రకూటమ్ము

లక్ష్మణుని రక్షింప
రయమున హనుమయ్య
అరచేత ధరియించి
ఆకాశమార్గాన 
తెచ్చిన సంజీవనీ పర్వతమ్ము

ఇనుమడించినట్టి
ఇంద్రుని గర్వమ్ము
తొలగింపగా బూని
ఎత్తి ఏడునాళ్ళు
చిటికెన వేలుపై
చిన్ని కృష్ణుడు మోసిన 
గోవర్ధనమ్ము

తమ్ముడర్జునుని
జెండాపై కపిరాజుకాగ
అన్న వాయు సుతుని
అనుగ్రహము భీముడు
పొందిన గంధమాదనమ్ము

అన్నకు భయపడి
ఆర్తుడై దాగున్న
సుగ్రీవునకు రాముని
మైత్రి బలము కూర్చిన
ఋష్యమూకమ్ము

అప్సర కాంతలను
ఆకర్షించి భువికి
బంగారు గుహలతో
పరిఢవిల్లినదని
పేరు గన్న 
మేరుపర్వతమ్ము

ఓషధులకు నిలయమై
ప్రకృతి వైవిధ్యమై

రాముడు వెలసిన భద్రగిరి
శ్రీనివాసుడెక్కిన తిరునగరి
మల్లికార్జునుని శ్రీశైలం
దుర్గమ్మ నెలవైన
ఇంద్రకీలాద్రి
పర్వత రాజములన్నియు
పరమపుణ్యుల పదము
సోకి పరవశించి
చాటి చెప్పుచుండె
భరత భూమి ఘనత

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

11.12.2018

నేడు డిసెంబర్ నెల14 వ తేదీ 
National energy conservation day సందర్భంగా నా కవిత

వెలలేని దీపాలు

చల్లదనం కావాలా!
ఏ.సీ.ఎందుకు
అమ్మ ఒడి చాలదా!

వెచ్చదనం కావాలా!
ఎయిర్ కండిషనర్ ఎందుకు?
భార్య కౌగిలి చాలదా!

వెలుతురు కావాలా!
విద్యుద్దీపాలెందుకు?
నిన్ను చూడగానే
నీ చిన్నారి కూతురి కన్నుల్లో 
మెరిసిపోయే కాంతి‌ చాలాదా!

వినోదం కావాలా!
పొద్దస్తమానం టీవీ ఎందుకు?
వస పిట్టలా వాగే
నీ మనవరాలి ఊసు చాలదా!

వంటకు రుచి రావాలా!
గీ అంటూ చెవులు 
చిల్లులు పెట్టె
మిక్సీ గ్రైండర్ లెందుకు?
సన్నని గాజుల సవ్వడితో
అతివ కమ్మగా నూరి వడ్డించే
పచ్చడి మెతుకులు చాలవా!

కాస్త దూరానికి కూడా బద్దకించి
వాహనం వాడటమెందుకు?
దేవుడిచ్చిన కాళ్ళకు
 పని చెప్పి
నాలుగడుగులలా
నడిచి వెళితే చాలదా!

వెలలేని ఈ ఆనందాలను
అనుభవించి చూడు
విలువైన విద్యుచ్చక్తి
రేపటి తరానికి మిగిలి తీరు

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
14.12.2020




డిసెంబర్ 15
ఇంటర్నేషనల్ టీ డే

Every year on December 15th, tea-producing countries celebrate International Tea Day. The day seeks to draw the attention of governments and citizens around the world to the impact that tea trade has on workers and growers.

International Tea Day was created at the World Social Forum in 2004. In 2005, the first International Tea Day was celebrated in New Delhi. Sri Lanka began organizing celebrations in 2006. Trade union movements have been responsible for organizing International Tea Day celebrations, as well as Global Tea Conferences. In 2015, the Indian government made a proposal to the UN Food and Agriculture Organization (FAO). The proposal was to expand the observance to countries around the world. In June of 2019, the UN considered combining special tea days in different countries into one day.

The Intergovernmental Group on Tea proposed to celebrate International Tea Day on May 21st. The proposal was approved at a recent FAO conference and is awaiting approval by the UN General Assembly.



ఈ రోజు డిసెంబర్ నెల 15 వ తేదీ
ఇంటర్నేషనల్ టీ డే

సందర్భంగా నా కవిత

  ......తేనీరు.....

నిదుర‌పక్క మీదినుండి
లేస్తూనే నేను
నీకోసం ఎదురుచూస్తాను
ఉల్లాసపు ఉదయవేళ
నా పెదవిని తాకే
తొలి వేడి ముద్దువు నీవే

ఆఫీసుకి వెళ్ళబోయే ముందు
మళ్ళీ మరొక్కసారి
పొగల వగలు పోతూ
నా చేతికి అందుతావు
ఒదిలిపెట్టగలనా!
అందించిన మా ఆవిడను
ఆరాధనగా చూస్తూ
ఆస్వాదిస్తాను నిన్ను

 మనసెరిగి మసలుకునే
నా శ్రీమతిలా
అవసరానికి తగ్గట్లు
అల్లం,మిరియం,యాలుక
ఏదో ఒకటి కలుపుకుని
అలసట తీర్చటానికో ఉల్లాసపరచటానికో
ఎదుట ప్రత్యక్షమౌతావు

నిన్ను ఏ పేరుతో
ఇంటికి తెచ్చుకోవాలో
కొన్నిసార్లు నేను
తేల్చుకోలేను
అచ్చంగా 
చీరల షాపులో
ఏ చీర కొనుక్కోవాలో
ఎంచుకోలేక సతమతమయ్యే
నా శ్రీమతిలా

టీవీలో
రకరకాల ప్రకటనలు చూసి
ఏది బాగుంటుందో
 ఎటూ తేల్చుకోలేక నేను
తబ్బిబ్బు పడిపోతుంటాను

ఆనందమయ సందర్భాలను
అతి తక్కువ ఖర్చుతో
అందరితో పంచుకుని
అభినందనలు
అందుకోవాలని ఆశించే
ఈ బడ్జెట్ బడుగు జీవికి
నీకన్నా నిజమైన
ఆత్మబంధువు 
ఆపద్బాంధవి లేదు

నీ రూప వర్ణ చిత్రాలనేకం
ఒక్కోసారి
నా ఇల్లాలి అందాన్ని
ఇనుమడింపజేస్తూ
ఆమె ఒంటిపై మెరిసిపోయే
ఆభరణంలా
బంగారువన్నెతో
మెరిసిపోతూ...

మరొక్కసారి
మా ఆవిడ 
ఏకరువు పెట్టే
కోర్కెల చిట్టాలా
మింగుడుపడని చేదవుతూ...

ఇంకోసారి
ఒంటిలో పేరుకున్న
వ్యర్థాలను తొలగించగా
అరస్పూను తేనెను
అరచెక్క నిమ్మరసాన్ని
జోడించుకుని
ప్రేమనిండిన
పెద్దల మందలింపులా
ఆరోగ్యానికి ఔషధమౌతూ
నన్ను చేరుతుంటావు

మెగాస్టార్ ని
గాయకుణ్ణి చేసిన
 నీ చరిత్ర,
నిన్ను జీవనాధారంగా
చేసుకున్నవాణ్ణి
ప్రధాని సింహాసనమెక్కించిన
నీ ఘనత
మరెవ్వరికి దక్కుతుంది?

నేటి నా కవితా వస్తువువైన
ఓ తేనీరూ!
నీ కిదే నా జోహారు

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.12.2020



ఈ రోజు డిసెంబర్ నెల 16 వ తేదీ 

భారత్ విజయ్ దివస్ 

సందర్భంగా నా కవిత

విజయ్ దివస్

1971
డిసెంబరు పదహారు
ఇండో పాక్ యుద్ధం ముగిసి
చారిత్రక విజయం
సొంతమైన రోజు
సహనమనే కవచం మాటున
సాహసమనే అగ్ని కలిగిన
శూరులు భారత వీరులని
తెగబడ్డ శత్రుదేశాలకు
తెలిసొచ్చిన రోజు

మువ్వన్నెల భరత కేతనం
మన జనని మందహాసమై
వినువీధుల దేశ కీర్తిని
విశదం చేసిన రోజు

అబల పాలించే దేశమని
పరిహసించిన ప్రపంచానికి
ఆమె అబల కాదు
ప్రబల శక్తిఅని
చాటిచెప్పిన రోజు

ఆపరేషన్ సెర్చ్ లైట్
అనే పేరు పెట్టి
తూర్పు బంగాళంలో
సైనిక చర్యకు నడుం కట్టి
నరుకుతూ లక్షలమందిని
నరమేధం చేస్తున్నప్పుడు
ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని
తలదాచుకోగా శరణార్థులై
 వలస వచ్చిన జనకోటిని చూసి
మనసు చలించిన
మన ఇందిరమ్మ
మానవత్వంతో
ఆపన్నహస్తం
అందించినందుకు అలిగి
అమెరికా ఆదేశాలనందుకొని
అన్ని దేశాలూ ఏకమై
నలువైపులా చుట్టుముట్టి
ఒంటరిని చేసినా
ఒణికి పోకుండా
ధైర్యాన్ని చిక్కబట్టి
బుద్ధి బలం చూపెట్టి
రష్యా బ్రహ్మాస్త్రాన్ని
అమ్ముల పొదిలో
అమర్చుకుని
దాయాది దేశానికి
దడపుట్టించి
సందు చూసుకుని
విజృంభించాలనుకున్న
శత్రువులకు
చెమటలు పట్టించి
దాడికి తెగబడ్డవారిచే
దాసోహం అనిపించుకున్న రోజు


కావరంతో మనపై
కయ్యానికి కాలుదువ్విన
శత్రు‌దేశాలకు
కన్నెర్ర జేస్తే భారతదేశం
వెన్ను చూపటం తప్ప
వేరే మార్గం లేదని
ఋజువు చేసిన
మన సైనిక శక్తికి
మనసారా మనమందరం
సమర్పిద్దాం వందనం

జయహో భారత్

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం
 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

16.12.2020












*******************************************************
డిసెంబర్ 23
జాతీయ రైతు దినోత్సవం

డిసెంబర్ 23 వ తేదీ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ..

కర్షక వీరుడు

మేం తినే
మెతుకు మెతుకులోనూ
నీ సంతకం
  నోటికి
 చేయి అందిన
ప్రతిసారీ
నీకు వందనం
దేశం నీకు
ఋణపడి ఉండటం పోయి
నిన్నే ఋణగ్రస్తుడిని
చేయటం దారుణం
మాటలతో కోటలు కట్టి
రాజువంటూ
ముళ్ళ కిరీటం నీ నెత్తిన పెట్టినా
మా వెన్నెముక వంటూ
పొగడ్తలతో ముంచెత్తి
నీ వెన్నెముక విరిచినా
కష్టాన్ని కడుపులోనే దాచుకుని
కాపాడే నాన్నలా
కొసరి కొసరి
గోరుముద్దలు తినిపించే అమ్మలా
మాకు పట్టెడన్నం
పెడుతున్న
ఓ రైతన్నా!
నీ మేలు మరువలేం
కర్షక వీరుడివంటూ
 మహాకవి శ్రీ శ్రీ గారు
నీవు భారత క్ష్మాతలాత్మ పవిత్ర మూర్తివి
శూరమణివి
అంటూ కవికోకిల
 దువ్వూరి వారు
అక్షరబద్ధం చేసిన
నీ పోరాటమటిమ
అభినందనీయం
జవాను అర్పించిన రక్తం 
 కిసాను చిందించిన స్వేదం
ఈ రెండే
మా బ్రతుకు
మా మెతుకు 
జై జవాన్
జై కిసాన్

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.12.2020



ఈ రోజు డిసెంబర్ నెల 22 వ తేదీ 
National maths day

సందర్భంగా నా కవిత

పూర్ణమా! శూన్యమా!

పుట్టినింటి మమకారాన్ని తీసివేసి
మెట్టినింటి బంధాన్ని
కూడుకుని
తల్లిగా మారి
వంశాంకురాన్నిచ్చి
అత్తింటి ఆనందాన్ని 
హెచ్చవేసి
కష్ట నష్టాలను
సుఖాలతో
భాగాహరించి
ఆనందాన్ని శేషంగా
మిగుల్చుకుని
అనుకోని సమస్యలు
ఆల్జీబ్రాలా కంగారు
పెట్టినప్పుడు
నేర్పు నిబ్బరాలనే
ఎక్స్‌ వై లను 
తోడుతెచ్చుకుని
పరిష్కారాన్ని సాధించి
కాపురంలోని
లోటుపాట్లను
హృదయమనే
కుండలీకరణంలో దాచి
కుటుంబపు సంతోషాలకు
వర్గమూలమై
జీవితానికి
పూర్ణత్వాన్నిచ్చే 
ఇల్లాలిని

శూన్యమనుకుని
పట్టించుకోక పక్కనపెట్టేసినా
సమాంతర రేఖయై
సంసారం నడిపే
భార్య అనే
సున్నా విలువను
గుర్తించే
 శ్రీనివాస‌‌ రామానుజన్
ప్రతి మగడూ కావాలి

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.12.2018



Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ