11/9.రోజుకో చరిత్ర (సెప్టెంబర్)
*మమ (అ) కారం*
మనవల సాన్నిహిత్యం
ఒకప్పుడు
వృద్ధాప్యానికి *నిత్యమై* ఆనందాన్నిచ్చింది
ఆ తర్వాతి కాలంలో
కొంతమందికి అందిన అదృష్టమై
మరికొందరికి దొరకని భాగ్యమై
అది *వైకల్పికం* గా మారింది .
బిడ్డలకు తల్లిదండ్రులు బరువై
వారి ఆదరణ కరువైన
సందర్భాలలో
ఆ బంధం *నిషేధ* మయ్యింది
ఇక పిల్లలు దూరదేశాలలో స్థిరపడిపోయిన ఈ రోజులలో
అది స్కైపులో ముద్దుముద్దు పలకరింపై *అన్యవిధ* మయ్యింది
మొత్తానికి
ఇంతకాలానికి
ఈవేళ
తెలుగు ఉపాధ్యాయురాలిగా
పదవీ విరమణ కూడా
చేసిన తర్వాత
అమ్మమ్మ ను, నాయనమ్మను కూడా
అయిపోయాక
నాకు
సంపూర్ణంగా
సోదాహరణంగా
అర్థమయ్యింది
*అకారసంధి*
🤣
సెప్టెంబర్ మొదటి ఆదివారం 8.9.2024
గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా నా కవిత
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.9.2024
September 13
గ్రాండ్ పేరెంట్స్ డే
మనవలు
వంశవృక్షపు
చిటారు కొమ్మలు
ఊతమిచ్చి
ఆ చెట్టును
నిలబెట్టే
మానులు, వేళ్ళు
తాతలు బామ్మలు
మురిపెంతో పెంచుకున్న
మూలాలను మరువకండి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.9.2020
ఆశా దీపం
రాత్రిళ్ళు కంటిమీద
కునుకు లేదు
అయినా దిగులు లేదు
పగలు క్షణం తీరిక లేదు
అయినా అలసట లేదు
గుక్కపెట్టిన దుఃఖం
గుండెల్లో వీణానాదమై
వీనులవిందు చేస్తోంది
*ఆర్తనాదములు
శ్రవణానందకరముగా నున్నవి*
అన్న మాయాబజార్ లోని ఘటోత్కచుని డైలాగులా
ఆ రోదనాధ్వనులు విన్న
ఇరుగు పొరుగు మా ఇంటివైపు నవ్వుతూ చూస్తారు
అది చూసి
నా కళ్ళు గర్వంతో
మెరుస్తాయి
భారతంలో తనను చూసి భయంతో
వణికిపోతున్న ద్రౌపది హావభావాలు
తనపై వలపు చేష్టలుగా భావించి
భ్రమలోపడ్డ
కీచకుని లా
చూపు నిలపని
నన్ను గుర్తుపట్టని
ఆ కళ్ళు
నాతో ఏవేవో ఊసులు చెప్పినట్లు
ఆ ముఖంలోని భావాలకు
నాకు తోచిన భాష్యం చెప్పుకుని
సంబరపడిపోతాను
ప్రపంచం కరోనా జ్వరంతో
భయకంపితమవుతున్న నేడు
కుచ్ కరో
రోనా మత్ అని
ఆత్మవిశ్వాసాన్ని నింపే ధైర్యవచనంలా
రేపటిపై
నమ్మకాన్ని నింపే ఆశలా
నా ఇంట పుట్టింది
నా మనవరాలు
కామ్య చైత్రిక 😍😍
మా ఇంట వెల్లివిరియబోయే
మరిన్ని బోసినవ్వులకు
ఆరంభంలా....
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.4.2020
*శ్రీ ఫలం*
నేను మీ ఇంటింటి నేస్తాన్ని
అందనంత ఎత్తులో కనిపిస్తాను
కఠినాత్మురాలిలా
అనిపిస్తాను
నన్ను పగలగొడితే
అహం ముక్కలయినట్లే
అని వ్యాఖ్యానం
నా మధురిమలు
ఆస్వాదించటం
అంత సులభసాధ్యం
కాకపోయినా
అందని మ్రాని ఫలాన్ని మాత్రం కాను సుమా!
పంటికి కాస్త పరిశ్రమనే అయినా
తీయదనానికి
లోటు లేదు
అందుకనే
ఆస్వాదించి,అర్థం చేసుకోలేని
కావ్య శైలికి నేనే ఉపమానమయ్యాను
నేను లేని శుభకార్యం లేదు
నాలోని పదోవంతుని
ఎవరు ఎవరి చేతికందించినా
నొచ్చుకోకుండా
భక్తితో పుచ్చుకుంటారు
ఆలయంలో స్వామి అనుగ్రహఫలంగా
అర్థభాగమై చేతిలో అమరిపోతాను
నాలోని అణువణువూ
మీకు అక్కరకు వచ్చేదే
ఆహారమూ నేనే
పానీయమూ నేనే
ఆరోగ్యానికీ నేనే
అలంకరణకూ నేనే
శుభ్రం చేయడానికీ నేనే
పందిరి వేయడానికీ నేనే
కోతి చేత నేనొక
కొంటె సామెతని
పసితనాన్ని నా మూపుపై
ఊరేగించిన వాహనాన్ని
వెన్నెలరాత్రులు
ఆరుబయట పడుకుని
చిరుగాలికి కదలాడే
నాచేతివేళ్ళ
సందుల మాటున
దోబూచులాడే
అందాల
చందమామను
చూడటం
అనుభవైక వేద్యమే గానీ
ఇప్పటి తరానికి అర్థంకాని అనుభూతి
పైన ఆకుపచ్చదనం
లోన గోధుమ వన్నె
ఆలోన స్వచ్ఛమైన తెలుపు
నన్ను కదిపిచూస్తే
గలగల సవ్వడి
ఎండిపోయినా కూడా
ఎంతగానో ఉపయోగపడతాను
ఇంతకూ నా ఊరూ పేరూ
చెప్పనేలేదు కదూ!
నా పేరు శ్రీ ఫలం
కోనసీమ నా విలాసమైనా
ఏ ఇంటి పెరటిలో
కాస్తంత చోటిచ్చినా
ఠీవిగా,గర్వంగా నిలిచే
సిరుల పట్టుని
కొబ్బరి చెట్టుని
September 2
World coconut day
సందర్భంగా...
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2.9.2024
సోమవారం
*నేను చూశాను నిజంగా*
ఆవైపు
తల పైకెత్తాను
అంతస్తులుగా ఎదిగిన
ఐశ్వర్యాన్ని చూశాను
ఔరా!
అని అబ్బురపడ్డాను
ఈవైపు
తలదించగానే
దుర్భర దారిద్య్రం తో
బ్రతుకీడుస్తున్న
ధారావిలోని
దయనీయమైన
జీవితాలు చూశాను
అయ్యో!అని
ఆవేదన పడ్డాను
బొమ్మాబొరుసూ
చెరోవైపూ ధరించి
ధనం విలువకు
తొలి అంకెగా నిలిచి
చెలామణీ అవుతున్న
రూపాయి నాణేంలా
అనిపించింది
దేశ ఆర్థిక రాజధాని
ముంబయి మహానగరం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.10.2021
పరిమళించే
పసివనాలకు
దూరంగా జరిగిన
విశ్రాంత ఉపాధ్యాయురాలిని
నేను
ఇప్పుడిక
నాచెయ్యి పట్టుకుని ఊపేస్తూ
*హ్యాపీ టీచర్స్ డే*
అని నాకు ఎవరు చెప్తారు?
అమాయకమైన ముఖాలతో
నా చుట్టూ మూగి
నాకు చిన్ని చిన్ని
గ్రీటింగ్ కార్డులు ఎవరిస్తారు?
ముద్దుగారే ముఖాలతో
ఈ తెలుగు మిస్
వేషం వేసుకుని
చీరకట్టుకుని
జారే కళ్ళజోడు లోనుంచి
కిందికి చూస్తూ
నన్ను చూడగానే
సిగ్గుపడుతూ
నన్ను మురిపిస్తూ
నన్ను ఎవరు అనుకరిస్తారు?
వాళ్ళ తరగతి గదిని
ముచ్చటగా అలంకరించి
క్లాస్ టీచర్ నైన
నన్ను ప్రేమతో ఆహ్వానించి
నాచేత
కేక్ ఎవరు కోయిస్తారు?
ఉత్సాహం ఉరకలేయగా
నాచేత
ఆటలు ఆడించి
పాటలు పాడించి
నా బాల్యంలోకి
నన్నెవరు నడిపిస్తారు?
అందమైన పసిముఖాలతో
అలరించే
ఆ పూదోటను
వీడి వచ్చిన బాటసారిని నేను
I miss all the fun
I miss all the joy
I miss you
*(Jyothir)mai* dear Children
I miss you all
నా విద్యార్థులందరికీ శుభాశీస్సులతో
వారి తరపున
నాకు నేనే చెప్పుకుంటూ
టీచర్లందరికీ చెప్తున్నాను
*Happy teachers day*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.9.2024
నేడు డిసెంబర్ 7వ తేదీ
నేషనల్ లెటర్ రైటింగ్ డే సందర్భంగా నా కవిత
ఉత్తరానికో ఉత్తరం
ఒంగోలు,
7.12.2018.
ఓ ఉత్తరమా!
నా ప్రియనేస్తమా!
ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి
ఎక్కడున్నావు?
ఎలా ఉన్నావు?అసలేమయిపోయావు?
ఒకప్పుడు రాణిలా
ఓ వెలుగు వెలిగినదానివి
అనుబంధాల సామ్రాజ్యాన్ని
ఏకఛత్రాధిపత్యంగా
ఏలినదానివి
సమాచార వ్యవస్థనే
శాసించినదానివి
తపాలా రంగానికే
తలమానికమైనదానివి
ఇప్పుడేం చేస్తున్నావు?
సేవలు చేసీ చేసీ అలసిపోయి
పదవీ విరమణ చేసిన ఉద్యోగిలా
పోస్టాఫీసు పొదరింట్లో
సేదదీరుతున్నావా!
ఇప్పుడు నువ్వు
చెట్టుకి ఆనుకుని
గమ్యం చేరడానికి
వేచిఉండే ఆ ఎర్ర గది,
ఎక్కి తిరిగే ఆ ఎర్రవ్యాను,
నిన్ను చంకనేసుకుని తిరిగే
ఆ ఖాకీ మేన్
ఎక్కడా ఆచూకీయే లేరు
చల్లనివార్తో,
చావుకబురో
చప్పున చేర్చే తంతివై,
ముఖ్యాంశాలను
మూడు ముక్కల్లో తేల్చేసే
పోస్టు కార్డువై,
సాధక బాధకాలన్నీ
సవివరంగా వెళ్ళబోసుకునే
ఇన్లాండ్ లెటర్ వై,
భావోద్వేగాలతో
హృదయాలను కదిలించే
ఎన్నెన్నో ఊసుల
ఎన్వలప్ వై
పలకరించ వచ్చే నీకోసం
ఎంతగా మాకళ్ళు
ఎదురుచూసేవో
నీకు గుర్తుందా!
ఈ రోజు కాకపోతే రేపు
రేపు రాకపోతే
ఎల్లుండైనా వస్తావనే
నమ్మకాన్నిచ్చి
ఆశతో బ్రతకటం మాకు
అలవాటు చేసిన
ఆత్మబంధువు నువ్వేకదా!
కొత్తనీరొచ్చి పాతనీరుని
కొట్టేసినట్లుగా
లేండ్ ఫోనొచ్చి నీ
ప్రాధాన్యాన్ని తగ్గించింది
సెల్ ఫోన్ వచ్చినిన్ను చెల్లని నోటుగా మార్చేసింది
స్మార్ట్ ఫోన్ వచ్చి
నీ ఉనికినే ఊడ్చేసింది
వేలికొసలు క్షణాల్లో
విషయాలను
చేరవేసేస్తుంటే
భావాలను కరిగించి
పెన్నులో నింపి
ఊసులకు అందమైన
ఊహలనద్ది
సంస్కారపు అక్షరాలు ధరించి
చిరునామా దుస్తులు వేసుకుని
స్టాంపుల ఆభరణాలను
అలంకరించుకుని వచ్చే నిన్ను అందుకోవటానికి,
ఆ ఆభరణాలను ఒలుచుకుని
హాబీగా దాచుకోవటానికి
వేచి చూడటంలోనే
మధురానుభూతి
ఉందనుకునే
మా తరం వాళ్ళను
వెర్రి వాళ్ళుగా
జమకట్టేస్తున్నారు
అయినా నీకు
చింత వలదులే మిత్రమా!
నిన్నటి నిజానివైన నిన్ను
రేపటి తరానికి
పరిచయం చేయటానికి
ఉపాధ్యాయులమైన మేము
పిల్లలకు
ఉత్తరాలు రాయటం
నేర్పిస్తుంటాము
ఊరడిల్లి ఉండు నేస్తమా!
మరొక లేఖతో నిన్ను
మళ్ళీ పలకరిస్తాను.
అంతవరకూ సెలవు.
ఇక ఉంటాను.
ఇట్లు
నీ చిన్ననాటి
స్నేహితురాలు
అంకితం
అందరికీ ఆత్మీయంగా ఉత్తరాలు రాసి,అందరి క్షేమసమాచారాలు విచారించే చక్కని వ్యక్తిత్వం కలిగిన మా నాన్నగారు స్వర్గీయ సింహాద్రి వీరభద్రాచారి గారికి ప్రేమతో అంకితం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
7.12.2021
September 5th
Teachers day
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
అమృతహస్తం
ఆ చెయ్యి
అక్షరాలు దిద్దిస్తుంది
అవసరమైతే దండిస్తుంది
అమ్మలా లాలిస్తుంది
నాన్నలా నడిపిస్తుంది
అందరినీ దీవిస్తుంది
అందలాలనెక్కిస్తుంది
చిన్ని దివ్వెలను వెలిగిస్తుంది
చీకటి ఛాయలు తొలగిస్తుంది
భవిత బరువును మోస్తుంది
జాతి పరువును కాస్తుంది
ధరణి నంతటిని శాసిస్తుంది
దండమొక్కటే ఆశిస్తుంది
వేల మనసులను గెలుస్తుంది
వేలుపు తానై నిలుస్తుంది
ఆ చేయి
మమతకు రూపం మాష్టారిది
ఆ చేతికి నా వందనమిది
సింహాద్రి జ్యోతిర్మయి
5.9.2018
September 6th
National
Read a book day
September 8th
International literacy day
The Theme for International Literacy Day 2022 - *Transforming Literacy Learning Spaces*
నేడు సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నా కవిత
*************
అక్షరాయుధం
*************
బానిసత్వం
వెనుకబాటు తనం
అసత్యాన్ని నమ్మడం
అమ్ముడుపోవడం
ఆత్మన్యూనత
హింసకు గురి కావడం
కులవివక్ష
జాత్యహంకారం
మూఢవిశ్వాసం
ఆడవారిపై ఆధిపత్యం
ఎదిరించలేకపోవడం
అనే ఫలాలను
విరగకాస్తున్న
*పేదరికం* అనే
పెను వృక్షానికి
తల్లి వేరు ఒకటుంది
దాని పేరే
*నిరక్షరాస్యత*
దీనిని కూకటి వేళ్లతో
కూల్చేందుకు
అక్షరమనే గొడ్డలిని
అందరూ ధరించాలి
అప్పుడే అంబేద్కర్
ఆశయం
సాకారమవుతుంది
శ్రీ శ్రీ మహా ప్రస్థానం
చేరువౌతుంది
నీ అక్షరం
నీ ఆయుధం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.9.2022
September 10th
World suiside prevention day
ఒక్క క్షణం.....
********
ఆత్మహత్య చేసుకుని చచ్చి పోదాం అనే ఆలోచన జీవితకాలం లో తమ మనసులో ఒక్క క్షణమైనా రాని వాళ్ళు దాదాపుగా ఉండరేమో!
కానీ ఆ భావం క్షణికమే.
ఆత్మబలమో
ఆత్మీయుల బంధమో
మొండి దైర్యమో
ప్రాణం పై తీపో
ఏదో ఒకటి ఒక్క క్షణం
మనలో
మదిలో
మెదిలితే చాలు
నిర్ణయం మారి తీరుతుంది.
నిశ్చయంగా జీవితం నిలబడుతుంది.
మనసులోని సున్నితత్వమో
ప్రేమాధిక్యమో
ప్రేమ రాహిత్యమో
అవమానాన్ని తట్టుకోలేని ఆత్మాభిమానమో
నిరాశానిస్పృహలకు గురిచేసి
లోకానికి ఇక ముఖం
చూపించలేననే భావన బలమై
ఆత్మహత్య వైపు అడుగులు వేయిస్తుంది.
కానీ ఒక చేతికి పదివేళ్ళున్నా దేని ముద్ర దానిదే అన్నట్లుగా,
లోకంలో కోటానుకోట్ల జనమున్నా
ఒకరి వేలి ముద్రలు ఒకరితో కలవనట్లుగా ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే.
భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని,
తల్లిదండ్రులు ఇచ్చిన జన్మను
అర్థాంతరంగా
అంతం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు.
కడుపు నిండే మార్గం లేక
అప్పులపాలైన
అక్షరజ్ఞానం లేని
అన్నదాతలే కాదు
విద్యావంతులు
విద్యార్థులు
వ్యాపారవేత్తలు సైతం
ఆత్మహత్య లకు పాల్పడటం విచారకరమయితే
ఈ మధ్య కాలంలో జీవితమంటే తెలియని పసి వారు కూడా
అర్థాంతరంగా తనువు చాలించాలని అనుకోవడం ఆందోళనకరం.
అందుకే
చిటికెడు ప్రేమతో
పిడికెడు గుండెను పలకరిద్దాం
ఎదుటివారి తప్పులను
ఎద్దేవ చేయకుండా
సరిదిద్దుకునే
సమయాన్నిద్దాం
నీ వ్యధ తెలిసీ
నీడగ నిలిచే
తోడు ఉంటుందన్న
నమ్మకాన్నిద్దాం.
నీ జీవితం
నీది కానప్పుడు
జాతిసేవకు
వినియోగించమనే సందేశాన్నిద్దాం.
ఆత్మహత్యలను
అడ్డుకునే,నివారించే ప్రయత్నం చేద్దాం.
చెప్పలేనంత
నైరాశ్యం కమ్మినప్పుడు
బ్రతకలేను
అనే భావన బలమైనప్పుడు
కొద్దిసేపు
ఒక పసిపాప
బోసి నవ్వులు
కేరింతలు చూడండి
ఒక ఆత్మీయుని
ముఖం గుర్తు చేసుకోండి.
మంచి సంగీతం వినండి
హాస్యభరితమైన
ఒక సినిమా చూడండి
మీ జీవితం లోని
అతి మధురమైన క్షణాలను గుర్తుచేసుకోండి
కనీసం
మీరు లేని వేళ
మీ ఆప్తుల జీవితాలు ఏమౌతాయో ఊహించుకోండి.
ఏదైతే అది అవనీ అని భగవంతునిపై భారం వేయండి
వీటిలో ఏదో ఒకటి మిమ్మల్ని ఆ భావన నుండి బయటపడేసి
తప్పకుండా మళ్ళీ మనలో
బ్రతుకుపై ఆశల్ని చిగురింప చేయగలదు.
మన ప్రాణం పై హక్కు కేవలం మన ఒక్కరిదే కాదని గుర్తించాలి.
ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రుల ఆత్మహత్యా నిర్ణయానికి సమిధగా మారిపోయి, నిండా పదేళ్ళు నిండకుండానే మరణించిన అతి చురుకైన ,తెలివైన, భవిష్యత్తు పై ఎన్నో ఆశలను ఏకరువు పెట్టిన మా విద్యార్థి జ్ఞాపకం, ఆ చిన్నారి ముద్దుమొహం, సైంటిస్ట్ ని అవుతాను అని చెప్పిన ఆ ఆత్మవిశ్వాసం ఇంకా నా మనసు పొరల్లో మెదులుతూనే ఉంది.
పెద్దలారా!
మీ పొరపాట్లకు
తొందరపాటు నిర్ణయాలకు
జాతి ఆశా దీపాలను
ఆర్పేయకండి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.9.2020
సెప్టెంబర్ 11 వ తేదీని
*దిగ్విజయ్ దివస్*
మరియు
*వరల్డ్ బ్రదర్ హుడ్ డే*
గా పాటిస్తారు.
ఈరోజునే అంటే
11.9.1893 న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతదేశం తరపున స్వామి వివేకానందుల వారు పాల్గొని స్ఫూర్తి దాయకమైన ప్రసంగం చేశారు.ఆ ప్రసంగానికి
నా గేయానువాదం (స్వేచ్ఛానువాదం)
*Sisters and Brothers of America,*
వందనము అభివందనము
వందనము అభివందనము
అమెరిక దేశపు సోదరులారా!
అందరికీ అభివందనము
నా ప్రియ అమెరిక
సహోదరీమణు
లందరికీ అభివందనము ||
మీరిచ్చిన ఘన స్వాగతానికి
వందనము అభివందనము
ప్రపంచ మతముల సమ్మేళనమ్మున
వక్తలందరికి వందనము
అతి ప్రాచీనపు
యతి సంప్రదాయము
తరపున మీకిదె వందనము
సర్వ మతమ్ముల సర్వ ధర్మముల
తల్లి సనాతన ధర్మం నాది
నానా జాతుల సంప్రదాయముల
గౌరవించెడి దేశం నాది
సహనం నేర్పిన జాతియె నాది
సత్యం చాటిన ధరణియె నాది
గర్వంగా నా ఘనమౌ దేశం
తరపున మీకిదె వందనము
పరపీడితులై శరణాగతులై
వచ్చిన వారిని
అక్కునజేర్చి
ఆశ్రయమిచ్చి ఆదరముంచి
కలుపుకుపోయిన ధర్మం నాది
పుట్టిన పారిన ప్రతి నది తాను
సాగరగమనం చేయును కాదా
సర్వధర్మముల ప్రతి ఆరాధన
సర్వేశ్వరునికి చేరును కాదా
మతమౌఢ్యాలు దురభిమానములు
మూర్ఖత్వములు సుందర జగతిని
చిరకాలముగా ఆక్రమించినవి
రక్తపుటేరులు పారించినవి
పురోభివృద్ధిని ఆటంకపరిచే
దౌర్జన్యశక్తుల నంతం చేసే
ఆ శుభ తరుణం ఆసన్నమైనది
ఈ మహాసభే దానికి నాంది
తన మతమంటే దురభిమానము
పరమతమంటే కూడని ద్వేషము
కలమో ఖడ్గమొ చేత ధరించి
ఈ భావాలకు ముగింపు పలుకగ
ఈ సభ వినిచెను గంటానాదం
హింసకు స్వస్తిని పలకాలంటూ
శాంతి పాఠములు చదవాలంటూ
మనసారానే నాశిస్తున్నా!
నా సందేశం వినిపిస్తున్నా
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.9.2024
*చాక్లెట్ లా*
మన జీవితం కూడా
ఈ చాక్లెట్ లాంటిదే కదూ!
చాక్లెట్ వంటి
ఈ బ్రతుకు తీపిని
మనం ఆస్వాదించి
పదిమందికీ పంచి
జీవితాన్ని సార్థకం చేసుకుని
చివరకు
ఆకర్షణీయమైన
రేపర్ లాంటి ఈ శరీరాన్ని
ఆ పరమార్థం
పూర్తికాగనే
నిర్మోహంగా
విడిచిపెట్టేయమనే
సందేశాన్ని ఇస్తున్నది కదూ!
అందరికీ ఇంటర్నేషనల్ చాక్లెట్ డే శుభాకాంక్షలు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.9.2024
శుక్రవారం
September second Sunday grand parents
day in India
September 14th
Hindi Diwas
తెలుగు నా మాతృభాష
హిందీ నా ప్రియభాష
ఈ సందర్భంగా నేను చిన్నప్పుడు చదువుకున్న
ఫూలోంకీ చాహ్
గుర్తుకొస్తోంది.
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల మృతదేహాలపై నిలవటమే తమ కోరిక అని,అదే తమ జన్మకు సార్థకత అని అంటాయి పువ్వులు.
ఎందుకో ఆ పాఠం నా మనసులో చెరగని గుర్తు గా మిగిలిపోయింది.నా
చిన్నప్పుడు మేము ఢల్లాలో ఉన్నప్పుడు నేను అక్కడి సర్దార్జీలతో హిందీ గడగడా మాట్లాడేదాన్నని నాన్నగారు చెప్పేవారు.అయ్యో! ఇప్పుడు సరిగా రాదే అని విచారపడుతుంటాను.
కానీ గుంటూరు లో నేను 6వ తరగతిలో చేరినప్పుడు మొదటి క్లాసులోనే హిందీ అక్షరాలు, గుణింతాలు మొత్తం రాసి చూపించి,టీచరుగారితో సెభాష్ అనిపించుకున్న ఏకైక విద్యార్థిని నేనే అని తలచుకున్నప్పుడు మాత్రం ఇప్పటికీ గర్వంగా ఉంటుంది.
అలాగే 10 వ తరగతి లో కూడా నాకు హైయెస్ట్ మార్కులు(80) వచ్చింది హిందీలోనే.అవే నన్ను 1st class లో పాసయ్యేలా చేశాయి కూడానూ.
మా వారికి హిందీ అసలు రాదు.నాకు వచ్చిన ఆ నాలుగు ముక్కలు విని ఆయన నేనేదో హిందీలో పండితురాల్ని అనుకుంటూ ఉంటారు.జ్యోతి హిందీ బాగా మాట్లాడుతుంది అని ఆయన ఫ్రెండ్స్ తో చెప్పటం విని నేను నవ్వుకుంటూ ఉంటాను.ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం కదా!
హిందీ సినిమా పాటలు ఇష్టంగా వింటాను. చిన్నతనంలో రేడియో లో రాత్రి పూట వచ్చే హవామహల్, DD లో వచ్చే రంగోలీ, అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోర్ పతి,హిందీ ఆరాధన,బాగ్ బన్ సినిమాలు హిందీలో నాకు ఇష్టమైనవి.
అదండీ నా హిందీ కథ.
అందరికీ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.9.2020.
*అతని (అంతర్) అర్థం*
మా ఆయన నన్ను తరచుగా
నువ్వు నా చందమామ*వే*అని అంటుంటే
ఆ..వేలోని చులకనని
మెదడుకి ఎక్కించుకోకుండా
ఇంతకాలమూ
అది పొగడ్త అని భావించి నేను పొంగిపోయేదాన్ని
అయితే ఈరోజు *నాసా* వారు
*అబ్జర్వ్ ది మూన్ నైట్*
అన్నారని
నా గురించి నేను
ఆయన దృక్కోణంలో తరచి
ఆలోచించడం ప్రారంభించగానే
మా వారి పొగడ్త లోని
లోతులు
ఆయన అంతరార్థం
మెల్లమెల్లగా అర్థమై
కళ్ళు తెరచుకోవడం
మొదలయ్యింది
భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం లాగా
నేను,నా ఆలోచనలు ఎప్పుడూ ఆయన చుట్టూనే తిరుగుతుంటాయి అనే గర్వం ఆయనది
అని ,
నా ప్రకాశం,ప్రభ కూడా
ఆయన చలవే అని
ఆయన ఫీలవుతుంటారని,
నాకెంత ప్రతిభ, వ్యక్తిత్వం
ఉన్నా
ఆయన పురుషాహంకారమనే వెలుగుముందు అవి
పగలంతా
దివిటీలా వెలవెలబోతుంటాయని
రాత్రి మాత్రమే
నా కళలు,
స్నేహం లోని చలువలు ఆయనకు ఆనందదాయకమని,
సంసారమనే సాగరంలోని ఆటుపోట్లకు
పౌర్ణమి, అమావాస్య ల లాంటి
నా చాంచల్యాలే కారణమని ఆయన
ప్రగాఢంగా నమ్ముతారని
ఆయన నేను అనే మా బంధం మధ్యలో ఎవరు అడ్డుగా వచ్చినా
ఆ ప్రభావం వల్ల
నిండు పౌర్ణమి లాంటి
నా జీవితానికే గ్రహణం ఏర్పడుతుంది కానీ
తనకేమీ ముప్పు ఉండదని
ఇంతెందుకు?
పెళ్ళికి ముందు వరకూ
అందరాని చందమామలా
నాలోని లోపాలను కూడా
అందమైన కుందేలు పిల్లలా భావించి
పరవశించి ప్రేమించిన
ఆయన
పెళ్ళి అనే బంధంతో నేను
ఆయన చేతికందగానే
పైకి విజయగర్వమనే జెండా పాతినా
లోలోన మాత్రం
నాలోని లోపాలే యెంచుతూ
ఉదాసీనం చూపుతుంటారని
ఆలస్యంగా
తెలుసుకున్నాను
చూశారా!
ఇల్లాలు అనే
ఈ చందమామ వెనక ఉన్న మా ఆయన ఆంతర్యం
నాకిప్పటికి సంపూర్ణంగా అవగతమయ్యింది
మరి మీలో నాలాంటి చందమామలెందరో
ఒక్కసారి ఆలోచించుకోండి
2024 సెప్టెంబర్ 14
అందరికీ నాసా వారి
*అబ్జర్వ్ ది మూన్ లైట్ డే*
శుభాకాంక్షలతో
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.9.2024
శనివారం
September 18
World bamboo day
World respect day
September 3rd Sunday
Wife appreciation day😍😍
ఈ సందర్భంగా నా కవిత
అబద్ధాలు చాలు
నీ రాకతో
నా జీవితం లోకి
వసంతమే నడిచొచ్చింది
నువ్వు లేకపోతే
నాకు క్షణం గడవదు
నీ చేతివంట అమృతమే
నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది
నీ చిన్న నవ్వు చాలు
చింతలన్నీ మర్చిపోతాను
సన్నగా తీగలా
ఉండటం కంటే
నీలా బొద్దుగా
ఉంటేనే నాకిష్టం
నా విజయం వెనుక
ఉన్నది నువ్వే
నగలు అందంగా లేని
ఆడవాళ్ళకు గానీ
నీకెందుకు?
నీలో తెలియని
కళ ఏదో ఉంటుందోయ్
అందమైన ఏ ఆడవాళ్ళని చూసినా
నువ్వే గుర్తుకొస్తావు
వయసు పెరుగుతున్నా
నీలో చలాకీతనం
తగ్గలేదు సుమీ!
ఈ మాత్రం
అబద్ధాలు కూడా
ఆడలేరా!
నన్ను సంతోషపెట్టడానికి
మా ఆయన
బంగారమని
పొంగిపోవటానికి
ఏమిటో!🤔😔
మా ఆయనకి
అబద్ధాలాడటం కూడా రాదు.
🤣🤣🤣
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
India celebrates *National Engineer's Day on 15 September* to tribute the greatest Indian Engineer *Bharat Ratna Mokshagundam Vishveshvarya*
To honour and acknowledge his outstanding contributions as well as inspiring and acquainting future generations with his exceptional body of work and achievements, his birth anniversary has been celebrated as Engineer's Day in India since 1968. Thus, Engineer's Day is a celebration of role and significance engineers play in nation building and their persistent endeavours towards making this world a better and comfortable place.
భగవంతుడు
గొప్ప ఇంజనీరు
అయితే
అతడి ఇంజనీరింగ్
నిర్మాణపు
అద్భుతం
ఈ శరీరం
ఈ ప్రకృతి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.9.2019
*ఓ(జోను) తెర పట్టండి*
రక్షణ వ్యవస్థలా ఉండాల్సిన
తెల్ల రక్తకణాలు
కాన్సర్ లా మారి
శరీరాన్ని కబళించినట్లు
ప్రాణవాయువు చలనాలకు
ప్రాకారమవ్వాల్సిన
ఊపిరితిత్తులు
పొగచూరి తూట్లుపడి
ఉసురుదీయటానికి
ఉద్యమించినట్లు
ఎండకన్ను పడనీయకుండా
యువరాణి సౌకుమార్యాన్ని కాపాడే
మేలి ముసుగులా
అతినీలలోహిత కిరణాలకు అవనికి మధ్య తెరపట్టిన
ఓజోన్ పొర
కాస్త కాస్తగా కరిగిపోతుండగా
ఆనాటికానాటికీ
జ్వరపడిపోతున్న నేలతల్లికి
కాలుష్యపు అనారోగ్యం నుంచి
కోలుకునే వైద్యమందించాలి
పచ్చదనపు దుప్పటి కప్పాలి
గర్భస్థ పిండాన్ని కాపాడే ఉమ్మనీటి చెమ్మలా
ప్రతివ్యక్తీ ఒక తల్లిగామరి
చెట్టును ప్రసవించాలి
నాన్నలా ఆ చెట్టును
పోషించి రక్షించాలి
గురువులా క్రమశిక్షణ నేర్పి
చేసిన తప్పుల్ని సవరించుకునే
ప్రయత్నం ప్రారంభించాలి
ఈ భూమిపైకి
కాందిశీకులుగా
వలసవచ్చిన
మనమంతా
ఆనందంగా ఆరోగ్యంగా ఈ యాత్రను ముగించాలంటే
ఏకైక దిక్కు
ఒక చిన్న మొక్క
*September 16* is observed as the *International Day for the Preservation of Ozone Layer* by the *UN* General Assembly.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
16.9.2024
సోమవారం
సెప్టెంబర్ 18
World bamboo day
&
International respect day
లను పురస్కరించుకుని
*వంశీమోహనం*
తనువంతా తూట్లు పడగా
ఆదుకునే వారికోసం
ఆర్తిగా ఎదురుచూస్తున్న
అడవిలోని
ఆ *వెదురు* పుల్లను
చేత ధరించి
ఆ శ్యామసుందరుడు
*మురళీ* ధరు డయ్యాడు
పెదవులపై చేర్చుకుని
*వేణు* మాధవుడయ్యాడు
గాలివాటుకు ఏదో అలా
ఈల వేసుకుంటూ తిరిగే
ఆ జీవితానికి
గాంధర్వాన్ని నేర్పి
సుతారంగా మీటి
వేణుగానలోలుడై
సుస్వరాలు పలికించి
ఆ బాలగోపాలుడు
ఆబాలగోపాలాన్ని
ఆకర్షించి అలరించి
ఆ *గౌరవాన్ని*
వెదురుకు దక్కించిన
ఆ *వంశీ* మోహనుని
ఆహార్యంలో భాగమై
అలరే భాగ్యం అబ్బినందుకు
వెదురుముక్క
*పిల్లనగ్రోవి* పేరుతో
హరికాంభోజి రాగమై
తరించిపోతున్నది
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
18.9.2024
September 21
International peace day సందర్భంగా నా కవిత
*కల (వా)!*
ఎక్కడికెళ్ళావు?
ఎక్కడున్నావు?
ఎప్పుడొస్తావు?
నేను పుట్టకముందే
అప్పుడెప్పుడో
బహుశా 1950లో
అనుకుంటాను
తిలక్ తన *అమృతం కురిసిన రాత్రి* లో
ఒక *ప్రకటన* చేశాడు
నువ్వు కనబడటం లేదని
ఇప్పటికి
డెబ్భె ఏళ్ళు దాటిపోయింది
అయినా నీ జాడ లేదు
అప్పుడైతే
కేబుల్ గ్రాములు కాబట్టి
త్వరగా చేరేవికాదేమో!
కానీ, ఇప్పడెంతసేపు?
వాట్సాప్ లోనో
ఫేస్ బుక్ లోనో
ట్విట్టర్ లోనో
నేను ఫలానా చోట ఉన్నాను
క్షేమంగా ఉన్నాను
అని మెసేజ్ చేస్తే చాలు కదా!
క్షణాల్లో ఆ వార్త
విశ్వవ్యాప్తమైపోతుంది కదా!
మేము కూడా
మా దగ్గర లేకపోయినా
ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నావని
సంతృప్తి పడేవాళ్ళం
అయినా మనసాగక
నేనూ ఈ మధ్య వాకబు చేస్తూనే ఉన్నాను
నువ్వు
ఎక్కడ ఉండే అవకాశం ఉందా!అని
భారత్ చైనా సరిహద్దుల్లో ఉండవు
కాశ్మీర్ లో కనిపించే ప్రశ్నే లేదు
రష్యా ఉక్రెయిన్
దరిదాపుల్లోకే వెళ్ళుండవు
రాజకీయపార్టీల
నోటి దురుసుకు జడిసి
ఆ వైపుకే పోయుండవు
మొగుడూ పెళ్ళాల మధ్యకు మొదలే పోవు
ఇక అత్తాకోడళ్ళ మధ్య
అసలు ఉండే సమస్యే లేదు
మారణహోమానికి
కారణమౌతున్న
మతమౌఢ్యం
చుట్టుపక్కల కనిపించవు
మరి ఏమైపోయావో!
ఎక్కడ తలదాచుకున్నావో నని
ఆందోళన పడిపోతున్నాం
ఒక్కసారి
నీ ఆచూకీ ఎక్కడో
కబురు చెయ్యి
వచ్చివాలిపోతాం
అప్పటివరకూ
పసిపాపల నవ్వుల్లో
పరిమళించే పువ్వుల్లో
నిన్ను చూసి ,
నీ సముఖాన్ని ఆఘ్రాణించి
ఆనందిస్తుంటాం
నువ్వు త్వరలో వచ్చేస్తావు కదూ!
నువ్వు కలవని
కలవు కావని
నిరూపిస్తావని
ఆశతో ఎదురుచూస్తుంటాం
ఓ శాంతి కపోతమా!
వచ్చి మాతో ఉండిపోమ్మా!
సింహాద్రి జ్యోతిర్మయి
21.9.2022
సెప్టెంబర్ 4 వ ఆదివారం
ప్రపంచ నదుల దినోత్సవం
సందర్భం గా నా కవిత
*(మ)నది కదా!*
నేను తల్లిని
నదీమతల్లిని
సింధు,యమున,పెన్న, కృష్ణవేణి, గోదావరి అంటూ
నా పేర్లు అనేకమైనా
ముద్దు పేరు మాత్రం గంగ
హరి పాదాన పుట్టిన నన్ను
ఆ శివుడు నెత్తిన పెట్టుకున్నాడు
నా బిడ్డ భగీరథుడు
నన్ను సాదరంగా
ఆహ్వానిస్తే
బిడ్డల నీడలో
జీవితం వెళ్ళిపోవటం కంటే సార్థకత
ఏముంటుందని తలపోసి
అతని
వెంట
ఉరుకులు పరుగులు పెడుతూ
వచ్చేశాను
నిర్మలమైన నా ప్రేమను
పంచిపెడుతూ సాగిపోయాను
అందరి పాపాలనూ
కడుపులో దాచుకుంటూ
వాత్సల్యాన్ని వర్షించాను
పాయలుగా ప్రవహించాను
అందరూ నా బిడ్డలేనని ఆదరించాను
పవిత్రతకు మారుపేరుగా
గంగా భాగీరథి సమానురాలంటూ
నా పేరుతోనే సంభావిస్తుంటారు
పతిని కోల్పోయిన పడతిని
నా తోబుట్టువులు
వేనకు వేలున్నారు
అందరమూ
జీవ చైతన్యం నింపుకుని
జాతులకు
జవసత్వాలనిచ్చాము
మా ఒడిలోనే మీరు
పుట్టి పెరిగారు
మా పేరు మీదుగానే మీరు
నాగరీకులయ్యారు
గలగలా గోదారి కదలి
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడి
బంగారు పంటలు పండిస్తున్నాయని
తెలుగుంటి విరిబోణి
కృష్ణవేణి అంటూ
మామీద మీరు
పాటలు కట్టి పాడితే
పరవశించాము
పోనీలే బిడ్డలకు
జీవాధారమయ్యాము కదా అని
సంతోషించాము
కానీ ఇదేమిటర్రా!
తరాలు మారుతున్న కొద్దీ
మా తలరాతలే మార్చేస్తున్నారు
మీ నిర్లక్ష్యం
మా ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తోంది
మమ్మల్ని కొల్లగొట్టేస్తోంది
విద్వాన్ విశ్వం
పెన్నేటి కన్నీటి పాట
మా దుస్థితిని కళ్ళకు కట్టి
మా ఆందోళనను
అధికం చేస్తోంది
విఘ్నాలు తొలగించే వినాయకుణ్ణే
నిమజ్జనం పేరుతో
నాలోకి తోసేసి మీరెళ్ళిపోతే
పాపం! నాలో పేరుకున్న కుళ్ళుని చూడలేక
దుర్గంధాన్ని భరించలేక
ఉక్కిరిబిక్కిరై
వేలముక్కలుగా పగిలి
తేలాడుతున్నాడు బిడ్డ
మిమ్మల్ని
కడుపులో పెట్టుకొని
కాపాడిన
మా కడుపులోనే ఇంత
కాలుష్యపు విషాన్ని నింపేస్తుంటే
నా నీడన హాయిగా
బ్రతుకుతున్నారనుకుంటే
నా కడుపునే కోతకోసి
నేను పారే దారంతా
ఆవాసాలు చేసుకుని
ఆక్రమించేసుకుంటుంటే
నిలువనీడలేని నా దుఃఖం వరదలై వెల్లువలై
మిమ్మల్నే ముంచెత్తేస్తుంటే
మీ దుర్గతికి మీరే కారణమని తెలిసినా
ఏమీ చేయలేని
నిస్సహాయులమైపోతున్నాము
పాపాలను పోగొడతానని పేరుపడ్డ నన్నే మీరు
మురికికూపంగా
మార్చేస్తుంటే
ఇక ఏది దారి?
నేడు నా స్వచ్ఛత సందేహాస్పదమేనా!
రేపటి నా మనుగడ
ప్రశ్నార్థకమేనా!
పుడిసెడో!దోసెడో!
కడవడో!
ఎంతో కొంతయినా కాస్త
కాపాడుకునే ప్రయత్నం చేయండి
ఎందుకంటే నాకు
రేపు మీరు
తిలోదకాలు ఇవ్వాలన్నా
మీకు కావల్సింది
ఈ ఉదకమే కదా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.9.2024
World Rose Day 2024: World Rose Day is observed on 22nd September of every year. Giving Someone hope for their life is the greatest thing of our life. Fighting against disease requires lots and lots of bravery. So this World Rose Day is dedicated to Cancer patients all over the world to appreciate and encourage their bravery. This day gives hope to cancer patients and their caregivers. The Treatment for cancer not only affects patient's physical health but also his/her mental health. They can undergo a lot of mental trauma during the treatment period so it is important to keep the patients cheerful. World Rose Day is observed to bring happiness to cancer patients and make awareness to cancer patients that with strong willpower they can face this deadly disease
కేన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారిలో మానసికమైన స్థైర్యాన్ని నింపడానికి ఉద్దేశించిన ఈ రోజు సెప్టెంబర్ 22
రోజ్ డే అట.
ఈ సందర్భంగా నా కవిత
మ*రణం* పై *రణం*
చావు అందరికీ అనివార్యమే.
మరణం అనే ముల్లు గుచ్చుకునే లోపు
ఆత్మస్థైర్యం అనే గులాబీని
నవ్వుగా పెదవులపై
పరచి
ఆశగా కన్నులలో వెలిగించి
ఊపిరిగా హృదయాన్ని నడిపించి
నమ్మకంగా రేపటిపై నిలిపి
అస్త్రంగా వ్యాధిపై ప్రయోగించి
విజయంగా జీవితాన్ని మలచుకునే క్రమంలో
నీవు ఒంటరివి కావు సుమా!
కుటుంబం
స్నేహితులు
వైద్యులు
ఆశలు
అన్నీ నీకు
అడుగడుగునా తోడై
మురిపిస్తాయి మిత్రమా!
ఆనందపు తీరానికి
నడిపిస్తాయి మిత్రమా!
నిరాశ నుంచి మేలుకో
వ్యాధి నుంచి కోలుకో
ఈ సందర్భంగా
ఈ వ్యాధితో
పోరాడుతున్నవారు
కోలుకున్న వారు
కోలుకుంటున్న వారు
నా కంటే పెద్దవారైతే
శుభాకాంక్షలు
నాకంటే చిన్న వారైతే
శుభాశీస్సులు .
.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.9.2020
September 23
*International day of
Sign languages*
ను పురస్కరించుకుని
నా కవిత
*అర్థమే (కా)లేదు*
నేనూ మా వారూ
ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం
*మాటే రాని చిన్నదాని
కళ్ళు పలికే ఊసులు*
అంటూ బాలూ లాగా
గుక్కతిప్పుకోకుండా పాడితే
అబ్బో!నా కళ్ళు అంతబాగా
మాట్లాడతాయి కాబోలు అని మురిసిపోయి మనసిచ్చేశాను
*నను దయతో ఏలుకొనుము
కనుసన్నల మెలిగెదనే*
అంటూ ఏ.ఎమ్. రాజా
లెవెల్లో ప్రాధేయపడితే
పొంగిపోయి
మూడు మూళ్ళూ
వేయించేసుకున్నాను
పెళ్ళయిన కొత్తల్లో నేను
పెదవి బిగిస్తే ప్రణయకలహమని
సిగ్గుతో కళ్ళు వాలిస్తే
పారవశ్యమని
మూడు వేళ్ళు పైకెత్తి చూపితే
తల్లిని కాబోతున్నాననే శుభవార్త చెబుతున్నానని
కాళ్ళకు దండం పెడితే
ఆరాధిస్తున్నానని
అర్థం చేసుకునే ఆయన్ను చూసి
అదృష్టవంతురాలిననుకున్నాను
కాపురం కాస్త పాతబడ్డాక కూడా ...
నేను అలిగి అటుతిరిగి పడుకుంటే
ఆడబడుచుకి
పెట్టుపోతలు జరపటం
నాకు నచ్చలేదని
వంటగదిలో గిన్నెలు
విసిరిసిరి కొడుతుంటే
మామగారి అప్పుతీర్చడం
మనకేం అవసరం అని
యుద్ధం ప్రకటిస్తున్నానని
హఠాత్తుగా పనమ్మాయి రావటం మానేస్తే
అత్తగారికి ఆ పదవి
అప్పగించటం కోసమేనని
అడగాపెట్టకుండా
హారం చేయించేసుకుని
బిల్లు ఆయన చేతిలో పెడితే
మరిది చదువుకి సాయం చేయడం
మనకిక కుదరదని
సూచిస్తున్నానని
ఆయన అర్థం చేసుకుంటూనే ఉన్నారు
నేనే
ఆయన పెదవులపై
నవ్వు తగ్గిందని
చూపుల్లో
అనురాగం తగ్గిందని
సాన్నిహిత్యం పట్ల
అనురక్తి తగ్గిందని
సంసారంలో
యాంత్రికత పెరిగిందని
అణచిపెట్టుకున్న
ఆవేశాలతో
అనారోగ్యం పెరిగిందని
అయినవాళ్ళను
అమ్మానాన్నలను
ఆదుకోలేకపోయాననే
అపరాధభావం పెరిగిందని
ఆ ఒత్తిడితోనే
ఆ గుండె ఆగిందని
అర్థం చేసుకున్నాను
ఆ...ల...స్యం..గా....
ఆయన వెళ్ళిపోయాక😔
అప్పుడు ఆయన మనసు
నాకు అర్థమే కాలేదు
ఇప్పుడు
నా జీవితానికిక
అర్థమే లేదు
ప్రేమించి వివాహం చేసుకుని
ఒకరి మనసు నొకరు
అర్థం చేసుకోకుండా
ఒకరి భావాల నొకరు
గౌరవించుకోకుండా
ఒకరి కోసం ఒకరు l
సర్దుకుపోకుండా
జీవితాలను
దుర్భరం చేసుకుంటూన్న
నేటి తరం యువతీయువకులకు
నా కవిత అంకితం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.9.2022
The National Daughters Day in India is celebrated on the 4th Sunday of September every year but other countries all across the world follow various dates.
సెప్టెంబర్ 23 నాల్గవ ఆదివారం నేషనల్ డాటర్స్ డే సందర్భంగా నా కవిత
.....................అమ్మ మనసు................
స్నేహితులతో సినిమాకెళ్తే తప్పేంటి?
ఎందుకు నన్ను పంపించవు అని అమ్మను
ఎదిరించిన ఆ నేనే
నా కూతురు స్నేహితులతో
సినిమాకెళ్తానంటే వద్దంటున్నాను
అరగంట నేను రావటం
ఆలస్యమయితే
అంత కంగారెందుకు నీకు?
అని అమ్మపై చిరాకుపడ్డ ఆ నేనే
నా కూతురి ఆలస్యానికి
ఆదుర్దా పడిపోతున్నాను
మగ పిల్లలతో మాట్లాడితే
కొంపలు మునిగిపోతాయా అని
అమ్మపై విరుచుకుపడ్డ ఆ నేనే
మగపిల్లలతో నా కూతురి స్నేహాలపై
ఆరాటంతో ఆరాతీస్తున్నాను
ఎక్కడికి వెళ్తానన్నా
నా వెంట తమ్ముణ్ణి పంపిస్తావు
నా మీద అంత అనుమానమా అని
అమ్మతో దెబ్బలాడిన ఆ నేనే
అన్నయ్యను వెంట తీసుకెళ్ళమ్మా
అని నా కూతుర్ని బ్రతిమలాడుతున్నాను
నచ్చిన వాడిని చూపించి
పెళ్ళి చెయ్యమని ఒప్పించి
అమ్మ భయాలను అర్థం లేనివిగా
కొట్టిపారేసిన ఆ నేనే
నా కూతురు
ఎప్పుడెవరు నచ్చారంటుందో
వాడు ఎలాంటి వాడో ఏమో
అసలే ఈ పిల్ల అమాయకురాలు
అని హడలిపోతున్నాను
నిజమే మరి!
అప్పుడేమో నాది
అందమైన కలలు కనే
బాధ్యతల బరువు తెలియని
పదహారేళ్ళ పడుచువయసు
ఇప్పుడు మాత్రం నాది
అచ్చంగా
ఆనాటి మా అమ్మ మనసు.
సింహాద్రి జ్యోతిర్మయి
23.9.2018
*ఒంటరి పోరాటం*
అది ఇంటింటి సామ్రాజ్యం
ఆమె వంటింటి సామ్రాజ్యం
ఆ రాజ్యానికి ఆమెకు
పట్టాభిషేకం జరిపిస్తారు
ఆ సామ్రాజ్యాన్ని అంతకు మునుపు
ఎందరో మహారాణులు ఏలారు
అసలు చిన్నతనంలోనే
దోగాడుతూ వచ్చి
తన చిట్టి చేతులతో
తనకు సాయం చేయబోయే కూతుర్ని చూసి
నా చిట్టి తల్లి ఎంత పనిమంతురాలో!అంటూ మురిసిపోతూ
వంటింటి వారసత్వం
వంటపట్టించేస్తుంది
వంశపారంపర్యంగా
ఆ సామ్రాజ్యపు ఏలుబడిని
కూతురికి అలవాటు చేసి
తనకంటూ ప్రత్యేక
రాజ్యాన్ని ఏర్పరచి
పట్టాభిషేకం చేసి
కుటుంబ రంజకంగా
పాలించుకోమని
పంపించేస్తుంది
తను కోడలిని తెచ్చుకుని
సామ్రాజ్య బాధ్యతలు అప్పగించి
రాజమాత హోదాలో
మంత్రిత్వం మాత్రం చేస్తూ
కాస్త ఊపిరి పీల్చుకునే
ప్రయత్నం చేస్తుంది
కానీ అలవాటైన ఆ ఏలుబడి ఆమెను విడిచిపెట్టదు
ఆ సామ్రాజ్యం
అణువణువునా
ఆమె చేతిముద్రలు
అడుగడుగునా
అనేక సందర్భాల జ్ఞాపకాలు
ఇంగువ వాసనలా
మనసును
అంటిపెట్టుకుని
అవతలకు పోనీయవు
నిల్వపచ్చళ్ళ జాడీలు
ఆమె శ్రమకు సానుభూతి
చూపిస్తున్నట్లుగా
సంవత్సరమంతా
సాయం చేయడానికి
సిద్ధమంటూ కొలువుతీరతాయి
గిన్నెలు,గరిటెలు,డబ్బాలు ,సరుకులు
అనే పద్మవ్యూహంలో
వీరోచితంగా
ఆమె ఒంటరిపోరాటం
కొనసాగుతుంటుంది
ఆ సమరంలో
కత్తిపీట పెట్టిన గాట్లను
రుబ్బురోట నలిగిన
వేలి కొసలను
వేడి పొయ్యి కాల్చిన
గాయాలను
పాచి,పగిలిన పాదాలను
ఆమె అసలు లెక్కచేయదు
నువ్వు
అన్నపూర్ణవు అని
నువ్వు లేకపోతే
నాకు తిండే సహించదు
అనే ఇచ్చకాల
జయజయ ధ్వానాలు
తన పాలనకు కీర్తి కిరీటాలు
అనుకుంటూనే
తరతరాలుగా ఆమె
మనుగడ సాగించింది
అప్పడాలు,వడియాలు
కందిగుండలు, కారప్పొడులు
పిల్లల ఇష్టాలు,పిండివంటలు
అనే చట్రంలో
గానుగెద్దులా
తిరుగుతున్న ఆమెకు
ఆధునిక పరికరాలు
ఆత్మబంధువులై
కాసింత వెసులుబాటు నిచ్చినా
ఆ సామ్రాజ్యం
అచ్చంగా ఆమెదేనన్న
అభిప్రాయంలో
మాత్రం
ఏ మార్పూ రాలేదు
ఇంతకాలమూ
ఆమె ఆ సంగతిని
గ్రహించనూ లేదు
కానీ
ఇప్పుడిప్పుడే
ఆమెలో
ఆలోచనలు తలెత్తుతున్నాయి
తాను సామ్రాజ్యాధినేతననే
భ్రాంతిని వదిలించుకుని
వంటింటి కుందేలు ననే
వాస్తవాన్ని
గ్రహిస్తోంది
అమ్మ చేతి వంట
అమృతమని
భోజ్యేషు మాత అని
ఉబ్బేసి
ఇంటిలో పబ్బం గడుపుకుంటారు గానీ
తనకేమీ ప్రత్యేక గుర్తింపు లేదని
అక్కడ కూడా
మగవారి
ఆధిపత్యమే
కొనసాగుతోందని
నలభీమపాకమనే
వాడుకని గుర్తుచేసుకుని
వాపోతోంది
ఉన్నత చదువులు, ఉద్యోగం
ఇద్దరికీ సమానమైనప్పుడు
వంటిల్లు తనది మాత్రమే
ఎందుకవుతోందని
తర్కించుకుంటోంది
ఆమె వంటింటిని
త్రోసిరాజనటం లేదు
తోడ్పాటును మాత్రమే కోరుతోంది
నీ హృదయ సామ్రాజ్యం లోకి ఆహ్వానించగానే
తను వచ్చింది కదా!
మరి తన వంటింటి సామ్రాజ్యం లోకి
నువ్వు రాలేవా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.10.2024
ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నా కవిత
.......గుండె గోడు విందామా!.......
నా హృదయమా!
నా తల్లి కడుపులో నేను
నాలుగు వారాల నలుసుగా
ఉన్నప్పుడే నీవు నాలో
ఊపిరి పోసుకున్నావు
నాటి నుండే ఆరంభమైంది
నాతో నీ పయనం
లయబద్ధమైన నీ స్పందనలతోనే
సాగుతోంది నా జీవనయానం
నిండు నూరేళ్ళు నన్ను
బ్రతికించటానికి
నిరంతరం నీవు
అవిశ్రాంత పోరాటం
చేస్తూనే ఉంటావు
నీ ఉనికిని మాత్రం నేను
నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాను
నా తనువు బరువు పెంచుకుని
నీపై అదనపు భారం మోపుతుంటాను
నా కోసం రోజుకు
లక్షసార్లు కొట్టుకులాడే నీకోసం
అరగంటైనా నడుద్దామనే
ఆలోచన సైతం నాకు రాదు
దురలవాట్లతో పొగచూరిస్తున్నా
కొవ్వును నీ నాళాల దారుల్లో
కొంత కొంతగా పేరుస్తూ పోతున్నా
ఉద్వేగాలకు గురిచేస్తూ
చిగురుటాకులా ఒణికిస్తున్నా
రక్తపోటు,మధుమేహాలను
అంటించుకుని ముప్పు తెస్తున్నా
ఆదమరుపులేక నన్ను
ఆదుకుని కాపాడుతూనే ఉంటావు
మెదడు చచ్చిపోయినా
మేను చచ్చుబడిపోయినా
నా తనువును నిలబెట్టాలని
తాపత్రయపడుతూనే ఉంటావు
బహుశా
ఆ క్షణాలలో
లబ్ డబ్ అనే నీ భాషను
అక్షరాల్లోకి అనువదిస్తే
వృథాగా పోయే ఈ ప్రాణాన్ని
ఉదారంగా ఇంకెవరికైనా
దానం చేసి బ్రతికించమని
ఆగిపోయే నీ ప్రయాణాన్ని
ఆరిపోయే ఏ జీవనజ్యోతినో
వెలిగించి కొనసాగించమని
అంటుందేమోఅని అనిపిస్తోంది
హృదయమా!
నీ బరువు పావుకిలోనే కావచ్చు
పోరాడే నీ శక్తి మాత్రం అనంతం
నీ పరిమాణం గుప్పెడంతే కావచ్చు
నీ ఆశయం మాత్రం అజరామరం.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.9.2020
ఈ సందర్భంగా ఈ రోజు
హృదయం అనే పదం ఉన్న తెలుగు సినిమా పాటల్ని గుర్తు చేసుకుందామా!
మొదటి పాట
హృదయమా!
ఓ బేల హృదయమా!
ఒకేసారిగా నీకింత
సంతోషమా!
ఇక మీ వంతు
ప్రారంభించండి.
రెడీ
వన్
టూ
త్రీ
గో....
September 30
International translation day సందర్భంగా నా కవిత
*అర్ధాంగి అంటే ??*
ఆమధ్య నాకు
అసలు అర్ధాంగి అంటే
అర్థమేమిటా!అని
సందేహం వచ్చింది
చాలా ఆలోచించాను
అలా ఆలోచించగా
చించగా
నాకు చటుక్కున
స్ఫురించింది
ఏంటంటే....
ఆయన
హృదయాన్ని
నేను
ఆసాంతం చదివి
అర్థం చేసుకుని
అనువదించాను
కానీ నేను
మాత్రం
ఆయన
పూర్తిగా చదవని
అర్థం చేసుకోని
అనువదించని
పుస్తకం గానే మిగిలిపోయాను
అవును
అందుకే నేను
అర్ధాంగిని
నిజమే కదూ!
కాదా!
International translation day సందర్భంగా
అర్థంకాని భర్తలకు,
అర్థం చేసుకోని భర్తలకు
అర్థం చేసుకోలేని భర్తలకు
అంకితం😜😜
నా అభిప్రాయం నచ్చని మగవారు
దీనిని రివర్స్ చేసుకుని
మీ జీవితం లోకి
అనువదించుకుని
ఆనందించవచ్చు🤣🤣
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.9.2022
Comments
Post a Comment