11/7.రోజుకో చరిత్ర (జూలై)



July 6th
World kiss 😘 day
,...........World kiss day......సందర్భం గా

నా కవిత 

..................ముద్దు ముచ్చట్లు...................

రైతన్న చెమటచుక్క
నేలతల్లిని ముద్దాడి
పంట చేనై పరవశిస్తుంది

వీర జవాను నెత్తుటి చుక్క
మాతృభూమిని ముద్దాడి
ఋణం తీర్చుకున్నానని
ఋజువు చూపిస్తుంది

నిండుగా పూచిన పుష్పం
పరమాత్ముని పాదాలు ముద్దాడి
క్షణికమైన బ్రతుకును
పునీతం చేసుకుంటుంది

తొలకరి తొలి వానచినుకు
బీడు నేలను ముద్దాడి
చెమ్మగిల్లి పరిమళిస్తుంది

మూడుముళ్ళ బంధంతో
దాంపత్యం ముద్దాడి
షష్టిపూర్తి గా జీవితాన్ని
సార్థకం చేసుకుంటుంది

మాతృత్వం మైమరచి
పురిటికందును ముద్దాడి
జన్మ ధన్యమయ్యిందని
పులకరించిపోతుంది

కాపురానికి వెళ్ళేపిల్లను
కడుపుతీపి ముద్దాడి
నుదిటిపైన వాత్సల్యపు
ఆశీస్సులు వర్షిస్తుంది

సృష్టి లోన తీయనిదై
చెలిమి ఎదను ముద్దాడి
అంతరాలు లేని బంధమై
అదృష్టం తో అభిషేకిస్తుంది

హృదయపు భావోద్వేగం
కనులలో ఉప్పొంగి
పెదవిపైన పరచుకునే
పారవశ్యం పేరే ..........ముద్దు.

సింహాద్రి జ్యోతిర్మయి
6.7.2018

..............World chocolate day...............
July 7 th

అందాల ఓ నేస్తమా!
అందరి ప్రియ నేస్తమా!

పసి కళ్ళన్నీ నిన్ను చూడగానే
పరమ సంతోషం తో మెరిసిపోతాయి
కలిగినింటి ముద్దు పాపల చేతులు
నిన్ను జేబులనిండా నింపుకుంటాయి
పేదరికపు చిట్టి పెదవులు
ఆశతో లొట్టలు వేసుకుంటాయి
ఉల్లాసం కోరే పెద్దవారు కూడా
అప్పుడప్పుడూ నిన్ను 
చప్పరించేస్తుంటారు
మాయరోగం మధుమేహం 
పీడిస్తున్న వారు మాత్రం
నిన్ను స్వీకరించలేక 
నిట్టూరుస్తుంటారు
పుట్టిన రోజు నాడు
నిన్ను పంచుకోవడమే
చిన్నారులకు అసలైన పండుగ
పళ్ళూడిన ముసలివాళ్ళ
బోసినోటికి నీవే తీయని వేడుక
నీవు శుభానికి,సంతోషానికి
సంకేతంగా మారిపోయావు
నేటి ఆధునిక‌ జీవితంలో
భాగంగా చేరిపోయావు
చిల్లర తన దగ్గర లేదంటూ
షాపువాడు 
మా అనుమతి లేకుండానే
నిన్ను మా చేతుల్లో పెట్టేస్తాడు
కాదనలేని కానుక సుమా!
అన్నట్టు చూస్తాడు
ముదురు వన్నెలోని నిన్ను
ముద్దొచ్చే బుజ్జి పాపలు
మూతినిండా పూసుకుని
నవ్వుతుంటే చూసి
మురిసిపోని హృదయముంటుందా!
రంగురంగు కాగితపు వస్త్రాలు ధరించి
రకరకాల తీపి రుచులు నించి
చిన్నా పెద్దల మనసులు దోచే
 ఓ చిన్నారి చాక్లెట్ నేస్తమా!
ఈ ప్రపంచ చాక్లెట్ దినోత్సవ
శుభాకాంక్షలు అందుకోమ్మా

సింహాద్రి జ్యోతిర్మయి
7.7.2020





World population day
July 11

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
నా కవిత
...................ప్రతీకారం.................

ఈ సృష్టి లోని
ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో
అన్ని ప్రాణులనూ
తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ
ఏ ప్రాణికీ ఉపయోగపడని
ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే
అని అన్ని ప్రాణులూ 
తెలుసుకున్నాయి
అత్యవసరంగా
జంతువులన్నీ సమావేశమయ్యాయి
చర్చలు సాగించాయి
కొన్ని‌ జంతువులు
 పోనీలే 
వాళ్ళ పాపాన వాళ్ళే
పోతారన్నాయి
కొన్ని ఆ మాటను ఖండించాయి
మానవజాతిని
నాశనం చేస్తామంటూ
ప్రతినచేసి బయలుదేరాయి

ఆఫ్రికన్ గొరిల్లా ఎయిడ్స్ తో
పంది మెదడువాపు వ్యాధి తో
కోడి బర్డ్ ఫ్లూ తో
దోమ డెంగ్యూతో
కుక్క రాబీస్ తో
ఈగ కలరాతో
గబ్బిలాలు నిపాతో
 పగ తీర్చుకోవడానికి
ప్రయత్నం సాగించాయి
అసాధారణ మేధ ఉన్న 
మానవుడు
ఈ సాధారణ ప్రాణులు
నన్నేం చేస్తాయిలే అని
ధీమాగా ఉన్నాడు
అదరని
బెదరని
అతగాణ్ణి చూసి
ఇలా లాభం లేదని తలచి
ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే అనుకుంటా
  ఈ కరోనా
కోట్లాదిగా జబ్బు పడుతూ
లక్షలాదిగా మరణిస్తూ
సాటి మనిషిని చూసి బెదిరిపోతూ
కోవిదుణ్ణని విర్రవీగిన వాడు
కోవిద్ ని చూసి ఒణికిపోతూ
నలుగురితో కలవలేక
నాలుగు గోడల మధ్య
తనను తాను బంధించుకుంటూ
ప్రాణభయంతో
విలవిలలాడుతున్న
వైనం చూసి
అన్ని ప్రాణులూ ఇప్పుడు
అయ్యో పాపం అంటున్నాయి
ఔను !అవి మనలా
దయమాలినవి కావు గదా!
కాస్త తేరుకోగానే
శాంతించిన ప్రకృతి
సందేశమిస్తోందిలా!
మానవుడా!
ఇప్పటికైనా మేలుకో
ఆత్మవత్ సర్వ భూతాని
అన్న ఆర్యోక్తిని గుర్తు చేసుకో
భూతదయను అలవరచుకో
నీ జాతిని రక్షించుకో

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.7.2020


July 16
World snake day
పా(ప)మా!

పాము మీద కవితా!
అమ్మో!పాము మీదే!
తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది
ఎంత *నాగ* భైరవ
సాహిత్య పీఠం అయితే మాత్రం!
మరీ ఇలా పాము మీద కవితలా!
అయినా పెద్దాయన కదా!చెప్పింది
రాయకుండా ఉండడానికి
మనసెలా ఒప్పుతుంది?
తెలిసిన పాముకథలన్నీ
తెలివిగా కవితలా అల్లేస్తే పోలా! అనిపించింది
పురాణాల పుటల్లోకి దృష్టి సారించగానే
మెదడు వల్మీకంలోనుండి
జ్ఞాపకాల పాములు బిలబిలా బుస్సుమంటూ పైకొచ్చాయి
అందులో కొన్నింటిని పట్టుకున్నా ఇలా...

పాలకడలిపై
ఆదినారాయణునికి
తల్పమైన ఆదిశేషుడు
తలపులోకి వచ్చాడు
అతడు ఆ శ్రీహరినే కాదు
సహస్రముఖంబుల
గాలిగ్రోలి
మహాభరమైన ధరిత్రిని కూడా
అనిశము మోస్తాడన్న
భాస్కర శతకం 
భావనలోకి వచ్చింది
శివుని కంఠహారమైన వాసుకి
మంధర పర్వతానికి కవ్వమై
పాలకడలిని చిలికి
ఫలమందించిన
కథ కూడా గుర్తుకొచ్చింది

చంద్రుని దృష్టి దోషంతో
చెక్కలైన వినాయకుని బొజ్జకు
సర్పఉదరబంధమే
శస్త్రచికిత్స అయింది

పరీక్షిత్తుని పరిమార్చగా వచ్చిన
తక్షకుని కథ తటాలున తట్టింది

తల్లి కద్రువ కోపమే శాపమై
జనమేజయుని
సర్పయాగం లో సమిధలవుతున్న
పాపజాతిని రక్షించిన
ఆస్తీకుని 
 వృత్తాంతం 
అంతరంగం లో మెదిలింది 

అహంకార పూరితుడైన నహుషుడు
అగస్త్యుని శాపానికి గురియై
అజగరమై అవనిపై పడిన
ఆ కథకూడా గుర్తుకువచ్చింది

నలమహారాజును
కాటువేసి కథనడిపిన 
కర్కోటకుని సహాయం గురుతుకొచ్చింది
మసకపు పాముకాటు గతి
మచ్చరమన్విసమగ్గలించగా
వ్రేటువడ్డ ఉరగాంగనయైన సత్యభామ గుర్తుకొచ్చింది

తన మతిలాగే గతితప్పిన 
కర్ణుని నాగాస్త్రం కనపడింది

అర్జునుని చూచి
వలచి తలయూచిన
నాగకన్య ఉలూచి 
గుర్తుకొచ్చింది

శుండాలంబు కరంబుసాప నా పూజ భర్గుండీవేళ
ననుగ్రహించెనని ముక్కుంగోళలనెక్కి
మోక్షం పొందిన
శ్రీకాళహస్తిలోని
కాళము గుర్తుకు వచ్చింది
మొత్తానికి మన్నుదిన్న పాములా
పడి ఉండకుండా
మెదడు
ఇన్ని విషయాలను
గుర్తుకు తెచ్చినందుకు సెభాసులంటూ
దానికొక మెప్పును పడేసి
నా కవితను
మీ ముందు పరిచాను

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.4.2022













ఈ రోజు నేషనల్ మూన్ డే అట.

ఈ సందర్భంగా నేను 1982-84 మధ్య ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, భావకవితా ప్రభావంలో పడిన యవ్వన ప్రాయంలో చంద్రునిపై రాసిన రెండు చిన్న కవితలు

*నా తొలి ఊహలు* లో నుండి

రసజ్ఞత

రసమెండిన రాగుండెకు
(రాతి గుండెకు అని నా భావం)
జాబిలిలో ఏముందని
అనిపించేను
మాయనట్టి మచ్చయే
కనిపించేను
రసముండిన ప్రతిగుండెకు
నెలరాజున వెన్నెలలే
అగుపించేను
మచ్చయేగ ముచ్చట
అనిపించేను

*********

జాబిలి స (వి)రసం

సరసజేరిన తారతోడ
విరసమేలర చందురూడ
అంతదవ్వుల కలువతోడ
వింతగాదే 
సరసమాడ
తళుకులొలికెను తార విన్నుల
చూడనొల్లక దాని చెన్నుల
కలువకోరెదు
కౌముది కన్నుల
తగునె నీకిది
రేరాజ!తప్పుగాదా!
నీదు వెలుగులతోడను
మిలమిల లాడెను
నీ చలువ కన్నేయ
నా కలువ కన్నియ
తనదు వెలుగులుండియు
వెలవెల బోయెను
నీవు కాదన చుక్క పక్కన
పాడియగునే ! నీకిది
నెలరేడ! పలుకవేల?

*********

వీటితో పాటు మీకు
ఇంకోటి కూడా తెలియాలండోయ్
అసలు నా మొదటి *తవిక* కూడా 
చంద్రుని మీదే.
మా చిన్న తమ్ముడికి నా పది పన్నెండు ఏళ్ళ వయసులో చెప్పానండోయ్.

చుక్కల్లో పెద్ద చుక్క
(ఇది అప్పట్లో ఒక సినిమా పాట పల్లవి)
సగం విరిగిన ఇడ్లీ ముక్క(హహహహ)
అని పెరట్లో పడుకుని
 దాదాపుగా దశమి నాటి చంద్రుణ్ణి చూస్తూ 
చెప్పడం బాగా గుర్తు.

ఎలా ఉన్నాయండీ?
నా తొలి తొలి ఊహలు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.07.2020





National Parents' Day honors all parents on the fourth Sunday in July. No matter where our parents may be, this day serves to celebrate their important role in our lives.


JULY నాలుగవ ఆదివారం world parents day.

సందర్భంగా నా కవిత

..‌....‌‌.....‌‌..........మేమిద్దరమే............‌‌..‌......

ఒకప్పుడు మేమిద్దరం ఒక్కటయ్యాం
వాళ్ళిద్దరూ మా ప్రేమకు ప్రతిరూపాలయ్యారు
జీవితంలోని పదహారు వసంతాలు
మా ప్రేమ సామ్రాజ్యాన్ని 
ఆక్రమించి యేలుకున్నారు
సామంతులమై సంతోషించాము

నేడు ఆ అనుబంధపు పుస్తకం లో
అనుభవాలపుటలు
జ్ఞాపకాల గాలికి కదలగానే
ఎన్నెన్ని అనుభూతులో
సుమధుర పరిమళాలై
ఎదను చుట్టేసుకున్నాయి

మీరు పుట్టిన రోజు
బారసాల రోజు
గుర్తుపట్టిన రోజు
ఊసు చెప్పిన రోజు
బోర్ల పడ్డ రోజు
దోగాడిన రోజు
పన్ను వచ్చిన రోజు
అన్నప్రాశన రోజు
పట్టుకుని నిలబడ్డ రోజు
పలుకు నేర్చిన రోజు
అడుగులేసిన రోజు
పరుగులెత్తిన రోజు
ఆట నేర్చిన రోజు
ప్రశ్నలేసిన రోజు
బడికి పోయిన రోజు
గెలిచి నిలిచిన రోజు
అంటూ ఎన్నెన్ని వేడుకలో!

మీకు
జ్వరం వచ్చిన రోజు
జలుబు చేసినరోజు
దిష్టి తగిలిన రోజు
కింక‌పెట్టిన రోజు
సూది వేసిన రోజు
నిదుర కాచిన రోజు
దెబ్బ తగిలిన రోజు
దెబ్బలేసిన రోజు
భయపడ్డ రోజు
బాధపడ్డరోజు
బడికి పంపిన రోజు
రాక ఆలస్యమయిన రోజు
ఓడి వచ్చినరోజు
దగాపడ్డ రోజు
ఎన్నెన్ని వేదనలో!

పదహారు వసంతాలు
పండుగలా జరిగాక
పెద్ద చదువులంటూ
ప్రేమను అణుచుకున్నాము
మంచి ఉద్యోగాలంటూ
మమకారాన్ని చంపుకున్నాము
పెళ్ళి పేరంటమంటూ
బాధ్యతల్ని తీర్చుకున్నాము

ఇప్పుడు
మీ ప్రపంచం మారింది
ప్రాధాన్యతలు మారాయి
మీకు మాపై ప్రేమ ఉంది
అది ఫోనులో పలకరింపయ్యింది
వాట్సప్ లో సందేశమయ్యింది
ఫేస్ బుక్ లో సంబరమయ్యింది
ఇంస్టాగ్రామ్ లో చిత్రమయ్యింది
స్కైప్ లో కంటికి తనివి అయ్యింది
పేగుబంధం ఈనాటికి
పండుగనాటి చుట్టమయ్యింది
విశ్రాంత జీవితాన్ని ఒంటరి తనం
ఆవరించింది
ఇది తప్పని ఎడబాటని మనసు గ్రహిస్తోంది
మా అమ్మానాన్నల కంటి చెమ్మ గురుతుకొస్తోంది

ఇంతకాలం
మేమిద్దరం మాకిద్దరు అనుకున్నాము
ఇప్పుడిక
మేమిద్దరం మిగిలాము
మేమిద్దరమే మిగిలాము.

సింహాద్రి జ్యోతిర్మయి
22.7.2018.


.నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నా కవితా నీరాజనం

........కార్గిల్ విజయోత్సవం........

సంవత్సరం 1999
సుందర కాశ్మీరమది
అటు వణికించే మంచుకొండలు
ఇటు దేశభక్తి నింపుకున్న గుండెలు
అవి సరిహద్దు భద్రతా దళాలు
అక్కడ మోగుతుంటాయి రణన్నినాదాలు
అనుక్షణం వారిలో అప్రమత్తత
వారిని వెన్నంటే ఉంటుంది మృత్యుదేవత
ఆహారనిద్రామైథునాలు
వీటికోసమే మన తాపత్రయాలు
మాతృభూమి పావన శ్రీ చరణాలు
వాటి సేవ మాత్రమే వారి లక్ష్యాలు

నిత్యం రగిలే రావణకాష్ఠం
కల్లోలిత కాశ్మీరం
దానిపైనే పాక్ ఆశ
దాని రక్షణే మన శ్వాస
హఠాత్తుగా ఒక్కనాడు
శత్రుమూకలు దురాక్రమణకు తెగబడ్డాయి
తక్షణమే కార్గిల్ సైన్యాలు తిరగబడ్డాయి
ఆపరేషన్ విజయ్ ఆరంభమయ్యింది
ఎత్తయిన పర్వతాలపై మాటు వేసిన
శత్రువును ఎదుర్కోవటం 
పెను సవాలయ్యింది
అయినా 
అడ్డంకులను లక్ష్యపెట్టకుండా
రాలిపోతున్న స్నేహితులను
చూసి చలించకుండా
వెనుకడుగే లేని ఆ నిబ్బరంలో
అన్యాయపు దాడిని సైన్యం తిప్పికొట్టగలిగింది
ద్రాస్ సెక్టార్ భారత్ ఆధీనమయ్యింది
ప్రపంచ దేశాలకు మన సత్తాచాటిన
మూడు నెలల వీరోచిత పోరాటం
ఉగ్రవాదం ముసుగులో
దాడికి తెగబడ్డ 
దాయాది దేశానికి గుణపాఠం
అపురూపమైన కాశ్మీర ఫలాన్ని
అమ్మకు నైవేద్యంగా సమర్పించటానికి
ఐదువందలమంది వీరజవాన్లు
అసువులొడ్డి అమరులయ్యారు
వారిలో దేశభక్తి పరిమళించింది
వారిని చూసి దేశం పరవశించింది
సంతోష దుఃఖ బాష్పాలు
ముప్పిరిగొన్న
భరత మాత నయనాలు
వీరుల మృతదేహాలను
అభిషేకించాయి
ఆశీర్వదించాయి
కార్గిల్ లో ఎగిరిన భారతపతాకం
నింగినంటి చేసింది విజయదరహాసం
అది అమర సైనికుల సాహస చిహ్నం
ఆ అసమాన త్యాగాలకు దేశమంది దాసోహం

కన్నబిడ్డను కళ్ళ చూడకుండానే
కట్టుకున్నవాడు మరణించినా
నా బిడ్డను కూడా సైనికుడినే చేస్తా
నా భర్త ఆశయం కొనసాగిస్తా
అన్న అమరజవాను లేత ఇల్లాలిని చూసి
చెమరించకుండా ఉన్న కన్నేది?
స్వార్థం నిండిన సమాజమా!
నిస్వార్థమైన ఆ త్యాగాలను
నిరుపయోగం చేయవద్దు
అదే వారికి మనమిచ్చే
నిజమైన నివాళి
వీర సైనికులారా!మీకు జోహారు
మన త్రివర్ణ కేతనంలో
కాషాయం మీరై
కలకాలం నిలిచి ఉంటారు.

జై జవాన్

సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్ @OPS
ఒంగోలు.
26.7.2018.


నేడు అంతర్జాతీయ పులుల పరిరక్షణా‌దినం సందర్భంగా నా కవిత

.....................పులి (పై) నా కవిత....................

ప్రకృతిలోని వైవిధ్యాలలో
నువ్వొక అద్భుతానివి
నీ అడుగుల్లో రాచఠీవి
మృగరాజుకు నువ్వు దీటైన ప్రాణివి
నలుపు‌తెలుపులు కలగలిసిన
బంగారు వర్ణం నీ మేనిఛాయ
వెన్ను జలదరింప జేస్తుంది నీ గాండ్రింపు
మాటువేసి వేటాడటం చూస్తే
అర్థమవుతుంది నీ తెలివి తెగింపు
క్రౌర్యానికి నువ్వు‌
చిహ్నమంటారుగానీ
ఆవు -పులి కథలో నీ ఔదార్యం
మురిపిస్తుంది పాపలని
అయ్యప్ప స్వామి నీతో ఆడుకున్నాడు
శార్దూల వాహనిగా అమ్మవారు
నిన్నధిరోహించి అనుగ్రహిస్తారు
ఇక మా సినిమాహీరోలు
నీ పేరుని వాడేసుకుంటున్నారు
పులి వేషం
అరుదైన మా జానపద కళారూపం
 మా కవులకు ఆవేశాన్నిచ్చే
అందమైన ఛందస్సు శార్దూలం
నవరత్నాలుగా కనువిందు చేసిన నీ జాతిలో
నేడు మూడు‌తెగలు
 కనుమరుగు కావడం
అత్యంత బాధాకరమైన వాస్తవం
హద్దులు లేకుండా పెరిగిన జనం
ఆవాసాల కోసం
అడవుల్ని నరికివేయగా
ఆశ్రయం లేక
అంతరిస్తున్నావు
ఒకప్పుడు నీ చర్మాలను
పవిత్ర ఆసనాలుగా
నీ వేట రాజసానికి‌‌ గుర్తింపు గా
నీ గోళ్ళు హారంలో పతకాలుగా
వాడుకున్నారు
నేడు‌ 
నాటు వైద్యాలకోసం
అక్రమ రవాణాకోసం
నిన్ను అంతమొందిస్తున్నారు
అడవి నీతి తప్ప
అన్యమెరుగని నిన్ను
* పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా *
అంటూ మేము తెచ్చుకున్న రోగాన్ని
నోరులేని నీకు అంటించిన
దుర్మార్గం మాది
నీ సంతానాన్ని నువ్వే చంపుకుంటావని చెప్పే
*ఈనిన పులి * నానుడిగా మారింది
అంధత్వం ఆకలే అందుకు కారణాలని
అవగతమయ్యింది
అయినా వేడుక కోసం
మేము చంపేసిన
లెక్కలతో పోల్చుకుంటే
ప్రకృతి సిద్ధమైన ఏర్పాటుతో
నువ్వు పొట్టన పెట్టుకున్నవి
ముమ్మాటికీ తక్కువే సుమా!
ఎన్ని పొరపాట్లు చేసినా
మా జాతీయ జంతువుగా
నిన్ను సగర్వంగా చాటుతున్నాం
ముప్పును ‌తప్పించడానికి
అభయారణ్యాలతో నిన్ను
ఆదుకునే ప్రయత్నమూ చేస్తున్నాం
నేడు నీ జాతి పురోగతి ఆశాజనకం
అందుకోసమే నేడు
పాటిస్తున్నాం
అంతర్జాతీయ పులులదినం

సింహాద్రి జ్యోతిర్మయి

29.7.2018
JULY నాలుగవ ఆదివారం world parents day.

సందర్భంగా నా కవిత

..‌‌‌‌....‌‌.....‌‌‌‌‌..........మేమిద్దరమే............‌‌..‌.‌‌‌.....

ఒకప్పుడు మేమిద్దరం ఒక్కటయ్యాం
వాళ్ళిద్దరూ మా ప్రేమకు ప్రతిరూపాలయ్యారు
జీవితంలోని పదహారు వసంతాలు
మా ప్రేమ సామ్రాజ్యాన్ని 
ఆక్రమించి యేలుకున్నారు
సామంతులమై సంతోషించాము

నేడు ఆ అనుబంధపు పుస్తకం లో
అనుభవాలపుటలు
జ్ఞాపకాల గాలికి కదలగానే
ఎన్నెన్ని అనుభూతులో
సుమధుర పరిమళాలై
ఎదను చుట్టేసుకున్నాయి

మీరు పుట్టిన రోజు
బారసాల రోజు
గుర్తుపట్టిన రోజు
ఊసు చెప్పిన రోజు
బోర్ల పడ్డ రోజు
దోగాడిన రోజు
పన్ను వచ్చిన రోజు
అన్నప్రాశన రోజు
పట్టుకుని నిలబడ్డ రోజు
పలుకు నేర్చిన రోజు
అడుగులేసిన రోజు
పరుగులెత్తిన రోజు
ఆట నేర్చిన రోజు
ప్రశ్నలేసిన రోజు
బడికి పోయిన రోజు
గెలిచి నిలిచిన రోజు
అంటూ ఎన్నెన్ని వేడుకలో!

మీకు
జ్వరం వచ్చిన రోజు
జలుబు చేసినరోజు
దిష్టి తగిలిన రోజు
కింక‌పెట్టిన రోజు
సూది వేసిన రోజు
నిదుర కాచిన రోజు
దెబ్బ తగిలిన రోజు
దెబ్బలేసిన రోజు
భయపడ్డ రోజు
బాధపడ్డరోజు
బడికి పంపిన రోజు
రాక ఆలస్యమయిన రోజు
ఓడి వచ్చినరోజు
దగాపడ్డ రోజు
ఎన్నెన్ని వేదనలో!

పదహారు వసంతాలు
పండుగలా జరిగాక
పెద్ద చదువులంటూ
ప్రేమను అణుచుకున్నాము
మంచి ఉద్యోగాలంటూ
మమకారాన్ని చంపుకున్నాము
పెళ్ళి పేరంటమంటూ
బాధ్యతల్ని తీర్చుకున్నాము

ఇప్పుడు
మీ ప్రపంచం మారింది
ప్రాధాన్యతలు మారాయి
మీకు మాపై ప్రేమ ఉంది
అది ఫోనులో పలకరింపయ్యింది
వాట్సప్ లో సందేశమయ్యింది
ఫేస్ బుక్ లో సంబరమయ్యింది
ఇంస్టాగ్రామ్ లో చిత్రమయ్యింది
స్కైప్ లో కంటికి తనివి అయ్యింది
పేగుబంధం  ఈనాటికి
పండుగనాటి చుట్టమయ్యింది
విశ్రాంత జీవితాన్ని ఒంటరి తనం
ఆవరించింది
ఇది తప్పని ఎడబాటని మనసు గ్రహిస్తోంది
మా అమ్మానాన్నల కంటి చెమ్మ గురుతుకొస్తోంది

ఇంతకాలం
మేమిద్దరం  మాకిద్దరు అనుకున్నాము
ఇప్పుడిక
మేమిద్దరం మిగిలాము
మేమిద్దరమే మిగిలాము.

సింహాద్రి జ్యోతిర్మయి
22.7.2018.


జాషువా వర్ధంతి 

జాషువా వర్ధంతి సందర్భంగా నా పద్య నివాళి

సీసం
ముగ్ధమోహనముగ ముంతాజు మహలులో
        చెలువ చెలువమెల్ల చెక్కినావు
విఫల మనోరథున్ ఫిరదౌసి లో చూపి
       కవి చింత కనులకు కట్టినావు
గబ్బిలమ్మును పంపి గరళకంఠుని కీవు
వెలిజాతి వేదనల్ వినిచినావు
కండచక్కెర బోలు ఖండకావ్యములందు
       మాననీయుల కథల్ మలచినావు

ఆ.వె.
విశ్వనరుడనంచు విశ్వాసమున చాటి
నిన్ను గన్నతల్లి వన్నెకెక్క
కూర్చి కవితల కవి కోకిల వైనావు
జగతి సుకవి వీవు జాషువావు

సింహాద్రి జ్యోతిర్మయి
24.7.2019

.నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నా కవితా నీరాజనం

........కార్గిల్ విజయోత్సవం........

సంవత్సరం 1999
సుందర కాశ్మీరమది
అటు వణికించే మంచుకొండలు
ఇటు దేశభక్తి నింపుకున్న గుండెలు
అవి సరిహద్దు భద్రతా దళాలు
అక్కడ మోగుతుంటాయి రణన్నినాదాలు
అనుక్షణం వారిలో అప్రమత్తత
వారిని వెన్నంటే ఉంటుంది మృత్యుదేవత
ఆహారనిద్రామైథునాలు
వీటికోసమే మన తాపత్రయాలు
మాతృభూమి పావన శ్రీ చరణాలు
వాటి సేవ మాత్రమే వారి లక్ష్యాలు

నిత్యం రగిలే రావణకాష్ఠం
కల్లోలిత కాశ్మీరం
దానిపైనే పాక్ ఆశ
దాని రక్షణే మన శ్వాస
హఠాత్తుగా ఒక్కనాడు
శత్రుమూకలు దురాక్రమణకు తెగబడ్డాయి
తక్షణమే కార్గిల్ సైన్యాలు తిరగబడ్డాయి
ఆపరేషన్ విజయ్ ఆరంభమయ్యింది
ఎత్తయిన పర్వతాలపై మాటు వేసిన
శత్రువును ఎదుర్కోవటం 
పెను సవాలయ్యింది
అయినా 
అడ్డంకులను లక్ష్యపెట్టకుండా
రాలిపోతున్న స్నేహితులను
చూసి చలించకుండా
వెనుకడుగే లేని ఆ నిబ్బరంలో
అన్యాయపు దాడిని సైన్యం తిప్పికొట్టగలిగింది
ద్రాస్ సెక్టార్ భారత్ ఆధీనమయ్యింది
ప్రపంచ దేశాలకు మన సత్తాచాటిన
మూడు నెలల వీరోచిత పోరాటం
ఉగ్రవాదం ముసుగులో
దాడికి తెగబడ్డ 
దాయాది దేశానికి గుణపాఠం
అపురూపమైన కాశ్మీర ఫలాన్ని
అమ్మకు నైవేద్యంగా సమర్పించటానికి
ఐదువందలమంది వీరజవాన్లు
అసువులొడ్డి అమరులయ్యారు
వారిలో దేశభక్తి పరిమళించింది
వారిని చూసి దేశం పరవశించింది
సంతోష దుఃఖ బాష్పాలు
ముప్పిరిగొన్న
భరత మాత నయనాలు
వీరుల మృతదేహాలను
అభిషేకించాయి
ఆశీర్వదించాయి
కార్గిల్ లో ఎగిరిన భారతపతాకం
నింగినంటి చేసింది విజయదరహాసం
అది అమర సైనికుల సాహస చిహ్నం
ఆ అసమాన త్యాగాలకు దేశమంది దాసోహం

కన్నబిడ్డను కళ్ళ చూడకుండానే
కట్టుకున్నవాడు మరణించినా
నా బిడ్డను కూడా సైనికుడినే చేస్తా
నా భర్త ఆశయం కొనసాగిస్తా
అన్న అమరజవాను లేత ఇల్లాలిని చూసి
చెమరించకుండా ఉన్న కన్నేది?
స్వార్థం నిండిన సమాజమా!
నిస్వార్థమైన ఆ త్యాగాలను
నిరుపయోగం చేయవద్దు
అదే వారికి మనమిచ్చే
నిజమైన నివాళి
వీర సైనికులారా!మీకు జోహారు
మన త్రివర్ణ కేతనంలో
కాషాయం మీరై
కలకాలం నిలిచి ఉంటారు.

జై జవాన్

సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్ @OPS
ఒంగోలు.
26.7.2018.

Nature conservation day

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 


నేడు అంతర్జాతీయ పులుల పరిరక్షణా‌దినం సందర్భంగా నా కవిత

.....................పులి (పై) నా కవిత....................

ప్రకృతిలోని వైవిధ్యాలలో
నువ్వొక అద్భుతానివి
నీ అడుగుల్లో రాచఠీవి
మృగరాజుకు నువ్వు దీటైన ప్రాణివి
నలుపు‌తెలుపులు కలగలిసిన
బంగారు వర్ణం నీ మేనిఛాయ
వెన్ను జలదరింప జేస్తుంది నీ గాండ్రింపు
మాటువేసి వేటాడటం చూస్తే
అర్థమవుతుంది నీ తెలివి తెగింపు
క్రౌర్యానికి నువ్వు‌
చిహ్నమంటారుగానీ
ఆవు -పులి కథలో నీ ఔదార్యం
మురిపిస్తుంది పాపలని
అయ్యప్ప స్వామి నీతో ఆడుకున్నాడు
శార్దూల వాహనిగా అమ్మవారు
నిన్నధిరోహించి అనుగ్రహిస్తారు
ఇక మా సినిమాహీరోలు
నీ పేరుని వాడేసుకుంటున్నారు
పులి వేషం
అరుదైన మా జానపద కళారూపం
 మా కవులకు ఆవేశాన్నిచ్చే
అందమైన ఛందస్సు శార్దూలం
నవరత్నాలుగా కనువిందు చేసిన నీ జాతిలో
నేడు మూడు‌తెగలు
 కనుమరుగు కావడం
అత్యంత బాధాకరమైన వాస్తవం
హద్దులు లేకుండా పెరిగిన జనం
ఆవాసాల కోసం
అడవుల్ని నరికివేయగా
ఆశ్రయం లేక
అంతరిస్తున్నావు
ఒకప్పుడు నీ చర్మాలను
పవిత్ర ఆసనాలుగా
నీ వేట రాజసానికి‌‌ గుర్తింపు గా
నీ గోళ్ళు హారంలో పతకాలుగా
వాడుకున్నారు
నేడు‌ 
నాటు వైద్యాలకోసం
అక్రమ రవాణాకోసం
నిన్ను అంతమొందిస్తున్నారు
అడవి నీతి తప్ప
అన్యమెరుగని నిన్ను
* పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా *
అంటూ మేము తెచ్చుకున్న రోగాన్ని
నోరులేని నీకు అంటించిన
దుర్మార్గం మాది
నీ సంతానాన్ని నువ్వే చంపుకుంటావని చెప్పే
*ఈనిన పులి * నానుడిగా మారింది
అంధత్వం ఆకలే అందుకు కారణాలని
అవగతమయ్యింది
అయినా వేడుక కోసం
మేము చంపేసిన
లెక్కలతో పోల్చుకుంటే
ప్రకృతి సిద్ధమైన ఏర్పాటుతో
నువ్వు పొట్టన పెట్టుకున్నవి
ముమ్మాటికీ తక్కువే సుమా!
ఎన్ని పొరపాట్లు చేసినా
మా జాతీయ జంతువుగా
నిన్ను సగర్వంగా చాటుతున్నాం
తపాలా బిళ్ళపై ముద్రించి
నీకు గౌరవాన్ని ఇస్తున్నాం
ముప్పును ‌తప్పించడానికి
అభయారణ్యాలతో నిన్ను
ఆదుకునే ప్రయత్నమూ చేస్తున్నాం
నేడు నీ జాతి పురోగతి ఆశాజనకం
అందుకోసమే నేడు
పాటిస్తున్నాం
అంతర్జాతీయ పులులదినం

సింహాద్రి జ్యోతిర్మయి

29.7.2018

స్నేహానికి
కుల భేదం లేదు
అని చాటుతుంది
శ్రీ రామ గుహుల స్నేహబంధం
జాతి భేదం లేదు 
అని చాటుతుంది
శ్రీరామ సుగ్రీవుల‌స్నేహబంధం
పేద గొప్ప భేదం లేదు
అని చాటుతుంది
శ్రీ కృష్ణ ‌కుచేలుల మైత్రీ బంధం
చెడ్డవారికైనా
స్నేహబంధం మాత్రం అపురూపమే‌
అని చాటుతుంది
కర్ణ దుర్యోధనుల మైత్రీబంధం
 ఆ స్నేహామృతాన్ని
ఆస్వాదించే అదృష్టవంతులు
అందరూ అమరులే
అందరికీ
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

సింహాద్రి జ్యోతిర్మయి
5.8.2018


Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ