11/8.రోజుకో చరిత్ర (ఆగస్టు)





ఆగష్టు 1 నుండి 7వరకు
అమ్మపాల వారోత్సవాల సందర్భంగా
నా కవిత

.......................మాతృ స్తన్యం............................

అమ్మనవబోతున్నానన్న
అపురూపమైన భావం
నరనరాన్ని ఉత్తేజితం చేయగా
సంతరించుకున్న స్త్రీత్వం
అమ్మనయ్యానన్న
అంతులేని ఆనందం
ఎదను ఉప్పొంగించగా
వెల్లువైన క్షీర సాగరం
ఊపిరి పోసుకున్న
లేత పెదవికి
తొలిసారిగా అందిన
అమృతభాండం
జాషువా మాటల్లో అది
వినూత్న అతిథి
ఈ లోకంలోకి వస్తూ వస్తూ
వెంట తెచ్చుకున్న ఆహారం
త్రిమూర్తులలో
స్థితి కారకమై
శిశువును పోషించే
విష్ణు స్వరూపం
మమకారాన్ని,మాతృభాషను
సత్తువను,సంస్కారాన్ని
రంగరించి పోసే దివ్యౌషధం
అమ్మ పాలకు
లేనేలేదు ప్రత్యామ్నాయం
భయశోక భావాలను
తొలగించి సేదదీర్చే
ఆత్మీయ సామ్రాజ్యం
అనివార్య కారణాలతో
పాపడికి పాలివ్వలేని
పడతి వేదన వర్ణనాతీతం
బిగువు సడలిపోతుందని
బిడ్డ కడుపు ఎండగడితే
అమ్మ పదవికే నీవు అనర్హం
రొమ్ము కేన్సర్
దాని పర్యవసానం
బిడ్డకు స్తన్యమివ్వడం
 తల్లికి
సహజ గర్భ నిరోధక సాధనం
అంటున్నది వైద్య శాస్త్రం
ఆడదాని స్తన్యం
అది మాతృత్వానికి సంకేతం
సంస్కారవంతులకు
ఏ వికారమూ కలిగించని
మహోన్నత కలశం
అది 
చేతులెత్తి మొక్కదగిన
ఆలయ శిఖరం

సింహాద్రి జ్యోతిర్మయి
1.8.2018


ఆగష్టు 6 & 9 తేదీలు
హిరోషిమా, నాగసాకి లపై అమెరికా అణుబాంబులు ప్రయోగించిన దుర్దినాలను గుర్తుచేసుకుంటూ

ఆటమ్
విభజించ వీలులేని
అతి సూక్ష్మ కణం
అణుబాంబు
నివారించ‌వీలులేని
వినాశ కారకం
తొలుత సూర్యుడుదయించే దేశమని
తలచి గర్వాన తుళ్ళిపడే జపాను
పెరల్ హార్బర్ దురాగతంతో
నరమేధం సృష్టించి
చారిత్రక తప్పిదంతో
చేతులు కాల్చుకున్నాక
అగ్రరాజ్యం చూపిన
ఉగ్రత ఫలితమది
1945
ఆగష్టు నెల 
ఆ సమయం
అదో జ్ఞాపకాల విషవలయం
ఎప్పటిలాగే ఆరోజు కూడా
అందరిలాగే వారికీ తెల్లారింది
అనంతరం కొద్దిసేపటికే
ఆ నగరాల బ్రతుకూ తెల్లారిపోయింది
కనులు మిరుమిట్లు గొలిపే
మెరుపుకాంతి
సూర్యుడు ఉదయించటం కాదు
సూర్యుడొచ్చి మీద పడిపోతున్నాడేమో
అన్నంత వేడి
చెవులు చిల్లులు పడిపోయేటట్లుగా
పెను విస్ఫోటనం
అలముకున్న పొగల సెగలు
ఆవరించిన అణుధూళి మేఘాలు
క్షణకాలపు హాహాకారాలు
అసలేం జరుగుతోందో
అర్థమయ్యేలోపే
వేలాదిగా పోగుపడిన శవాలగుట్టలు
ఎక్కడో ఒక మూలుగు
అక్కడొక ఆక్రందన
ఇక్కడొక కదలిక
ఇవి తప్ప నగరమంతా శ్మశానమే
అది అంతం కాదు
ఆరంభం మాత్రమే
అని అర్థమయ్యేలోపే
మృతుల సంఖ్య
వేలల్లోంచి లక్షల్లోకి చేరుకుంది
అది ప్రకృతి విలయతాండవం కాదు
పరమశివుని ఫాలనేత్ర జ్వాల కాదు
ఆధిపత్యం చాటుకోవాలనో
పరమాణు‌శక్తిని పరీక్షించాలనో
శత్రు దేశాలను భయభ్రాంతం చెయ్యాలనో
కారణమేదైతే నేం
యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న ప్రపంచ యుద్ధంలో
అగ్రరాజ్యం విసిరిన
అణుబాంబు సృష్టించిన విధ్వంసం
క్రూరమైన ఆలోచనలోనుంచి
ప్రభవించిన మారణహోమం
అమానుషత్వం పాదాలకింద
కర్కశంగా నలిగిపోయిన మానవత్వం
శత్రువుకు సమాధానం చెప్పటం నేరం కాదు
వీరత్వాన్ని ప్రదర్శించటం
విడ్ఢూరమూ కాదు
కానీ,
విధ్వంసం తీవ్రత తెలిసి తెలిసీ
నిరపరాధులపైన
నిప్పులవాన కురిపించటం
ముమ్మాటికీ తప్పే సుమా!
ఉగ్రవాదం నీ WTC భవనాలను
కూల్చేసిన నాటి సెప్టెంబర్ 11
పేరుచెప్తే నేటికీ ఒణికిపోతున్న నీవు
అందమైన రెండు నగరాలను
అమాయకమైన ప్రజలను
వందల సంవత్సరాలు
శాపగ్రస్తం చేసిన
నీ దురాగతాన్ని 
ఎందుకు గుర్తుచేసుకోవు?
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
అని శ్రీ శ్రీ అన్నది
నీ గురించేనేమో!
ప్రపంచం నీ రాజ్యాన్ని
భూతల స్వర్గం అంటోంది గానీ
నీ మనసు మాత్రం మరుభూమి.
నీ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు
చరిత్ర నీ చరిత్ర ను 
ఎప్పటికీ క్షమించలేదు.

కాలానికి కత్తులవంతెన  వేసే ఇటువంటి దుర్ఘటనలు ఇకపై ఎన్నడూ ఎక్కడా జరగరాదని కోరుకుంటూ....
డబ్భై ఐదేళ్ళ
 క్రిందటి రక్తచరిత్రకు
నా కవితా మైపూత

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.8.2020


*వదల(లే)క*

తన నుంచి నేను
విడిపోవాలని
ఎన్నోసార్లు అనుకుంటాను
కానీ నా బలహీనతో
తన బలమో
లేక నా బలహీనతే తన బలమో చెప్పలేను కానీ 
తను నన్ను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది 
అది హాల్లో సోఫానా 
బెడ్రూంలో మెత్తటి పరుపా అని
ఆలోచించకుండా 
ఆ‌ గాఢ పరిష్వంగంలో 
నేనలా గంటలు గంటలు 
కాలాన్ని కరగదీస్తుంటాను
చెయ్యి ,నోరు,కన్ను,తిండి, మొబైల్ లే ప్రపంచంగా
నన్ను మభ్యపుచ్చుతుంటుంది
కొంతసేపు టీవీకి కళ్ళు అతికించి
ఎంతో సేపు 
వేళ్ళను మొబైల్ కి అప్పగించి 
చిరుతిళ్ళతో నోటిని 
సంతృప్తిపరుస్తూ 
గడిపేస్తుంటాను 
అది ధృతరాష్ట్రుడి కౌగిలి అని,
అది దుర్యోధనుడి వ్యామోహమని 
కుంభకర్ణుడి వారసత్వమని
వదిలించుకోమని 
బుద్ధి హెచ్చరిస్తున్నా 
దాని మాట రేపటినుంచి విందువులే 
ఈ ఒక్కరోజు ఈ సుఖంలో ఓలలాడు 
అని  బుజ్జగించి 
 మనసు
నన్ను తన వశంలో 
ఉంచుకుంటుంది 
ఆ రేపు అన్నది
ఎప్పటికీ రానీయకుండా 
నా జీవితాన్ని 
వ్యర్థపుచ్చుతూ
నన్ను హత్తుకుపోయిన 
ఆ శత్రువు పేరే
*బద్ధకం*

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
19.10.2024
శుక్రవారం













ఆగష్టు పదిహేను

ఆయుధాలు లేకుండా
పోరాటం సాధ్యమా!
అని ప్రశ్నిస్తే అవునంటుంది
బాపూజీ బోసినవ్వు

ఒక్కడి పేరే ప్రభుత్వాన్ని
ఒణికించుట శక్యమా!
అని ప్రశ్నిస్తే నిజమంటుంది
నేతాజీ కంటి ఎరుపు

స్వాతంత్ర్యం జన్మహక్కని
చాటేందుకు సిద్ధమా!
అని ప్రశ్నిస్తే గర్జిస్తుంది
లోకమాన్య తిలక్ గొంతు

ఆయుధాని కెదురుగా
నిలిచేందుకు ధైర్యమా!
అని ప్రశ్నిస్తే సై అంటుంది
ఆంద్రకేసరి తెగింపు

మన్నెంలో మహోద్యమం
సాధించుట సత్యమా!
అని ప్రశ్నిస్తే అడవంటుంది
అల్లూరిని ఎరగవా! అని

బానిస గుండెల కింతటి బలమా!
మమ్ము తరిమివేయగ తరమా!
అని ప్రశ్నిస్తూ అర్థరాత్రిలో
పరారయ్యింది పరాయిరాజ్యం

వీరుల త్యాగం ఏమిచ్చింది?
ప్రతి ఫలమంటూ ఏమొచ్చింది?
అని ప్రశ్నిస్తే ఇదిగోనంటూ
తెగిపడ్డ సంకెళ్ళు చూపుతూ
తెల్లవారింది ఆగష్టు పదిహేను

నిశిరాతిరి స్వాతంత్ర్యం
నిజమేనా !ఈ చిత్రం
అని ప్రశ్నిస్తే అవునవునంటూ
నింగికెగిరి నవ్వింది
మువ్వన్నెల భరతపతాకం

వీళ్ళంతా ఎవరని లోకం
విస్తుపోయి చూస్తూ ఉంటే
నా బిడ్డలు నమ్మండంటూ
గర్వంతో మురిసిందప్పుడు
భరతమాత చల్లని హృదయం

సింహాద్రి జ్యోతిర్మయి





****మన (సు ) రక్షా బంధనం****

ఆది మహాలక్ష్మి
అన్నగా భావించి బలిని
కట్టి రక్షాబంధనం
కాంతుని విడిపించుకుందని
కథగా చెప్పింది పురాణం

పతులు నిస్సహాయులైన వేళ
పదిమందిలో
పరువునిలపగ రమ్మని
వేడుకున్న సోదరికి రక్షయై
అక్షయంగా చీరలిచ్చిన
అన్న ప్రేమకు
భక్తిని జోడించింది భారతం

రాజ్య రక్షణ కోరి
రాణి కర్ణావతి
చక్రవర్తి హుమయూన్ ను
తనకు సాయపడమని కోరుతూ
పంపిన ‌సందేశ సూత్రమని
చాటుతున్నది చారిత్రక సత్యం

అపహరించుకు వచ్చిన
అసురుణ్ణి అన్నాయని పిలిచి
మనసు మార్చ యత్నించిన
మగువ సీత ఆదర్శంగా
వెంటాడి వేధిస్తున్న కుర్రాళ్ళను
అష్ట దిగ్బంధనం చేసే ఆయుధంగా
ఆధునిక యువతికి దొరికిన
ఆత్మ రక్షణ సాధనం

అన్నయ్య ఉన్నతిని కోరుకుంటూ
తమ్ముడికి నేనున్నానని భరోసానిస్తూ
తోడబుట్టిన వాళ్ళమధ్య
వాడని మమతల లతయై
తల్లి తీగ ఆధారాన్ని
తామెన్నడూ మరచిపోమని
చిన్ననాటి చెలిమిని
నేటి ఆప్యాయతలను
రేపటి అనురాగాన్ని
తియ్యగా పంచుకుని
చల్లగా పరచుకుని
శాశ్వతంగా నిలుపుకునే
శ్రావణ పూర్ణిమ పండుగ
రక్షాబంధన వేడుక.

సింహాద్రి జ్యోతిర్మయి
26.8.2018


శ్రావణ పూర్ణిమ
సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా
నా సీసపద్యం

ఇనకులతిలకుల నింపైన రీతిలో
.... రఘువంశ కావ్యాన ప్రస్తుతించి
మారహరు కథ కుమారసంభవమున
....రమణీయ రీతులన్ రచనజేసి
దక్షత చాటుచున్ యక్షుని విరహమ్ము
....మేఘదూతము చేత మింట వినిచి
పంచకావ్యములందు మించి మూటిని గల్గి
....కవికుల గురువాయె కాళిదాసు

ఆ.వె.
వ్రాసె భారవియు కిరాతార్జునీయము
నర్థగౌరవమున కాద్యుడగుచు
చిరము కీర్తి నిలువ శిశుపాలవధ జేసె
మాఘుడతని కవిత మాఘమయ్యె

తే.గీ.
వ్యాసవాల్మీకు లాదిగా భక్తి గొలువ
రాజభాషగ పేరొంది తేజరిల్లి
సకల శాస్త్రంపు పూర్ణయై శారదాంబ
వెలిగె గీర్వాణ మనుపేర విశ్వమందు

వందే వాల్మీకి కోకిలమ్
వాశిష్ఠాయ నమో నమః
వందే సంస్కృత మాతరమ్

అలాంటి అమృతతుల్యమైన భాషను నాకు నేర్పిన మా లెక్చరర్ శారదాంబ గారికి,
మా ప్రొఫెసర్ శ్రీ కె కె రంగనాథాచార్యులుగారికి
ఆన్లైన్ కోచింగ్ ఇచ్చి నన్ను సంస్కృత కోవిద గా తీర్చిదిద్దిన భద్రాచలం ఆస్థాన గురువులు శ్రీ మన్నారాయణా చార్యులవారికి
సంస్కృతం పట్ల నాకు ఆసక్తి కలిగించి వందల శ్లోకాలను పద్యాలుగా అనువదించే అదృష్టం కలిగించిన అంబాళం పార్థ సారథి గారికి నా మనఃపూర్వక నమస్సులు, ధన్యవాదాలు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.8.2020

వరలక్ష్మీ నమోస్తుతే

తన నగలన్నీ వేసి
బిడ్డనలంకరించినట్లు 
ప్రేమతో తల్లి నలంకరించి, 
బిడ్డలకు నచ్చినవి వండిపెట్టి గోరుముద్దలు తినిపించి మురిసిపోయినట్లు,
ఆ తల్లికి ఇష్టమైన పదార్ధాలు
 నైవేద్యంగా సమర్పించి,
తన ఆడపిల్లను అందరూ చూసి 
ఎంత ముద్దుగా ఉంది, 
ఎంత ముచ్చటగా ఉంది
అంటూ
అందరూ మెచ్చుకోవాలని 
ఆరాటపడే తల్లి హృదయంతో, 
తను చేసిన అలంకారంతో కళకళలాడుతూన్న 
తన ఇంటి వరలక్ష్మీ దేవిని 
అందరకూ చూపించాలనే ముచ్చటతో
 ముత్తయిదువులను 
పేరంటానికి పిలిచి , 
తాంబూలమిచ్చి 
సంబరపడి 
జగజ్జనని మనసు దోచుకునే
 తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

వరలక్ష్మితో మా ఇంటి మహాలక్ష్మి మా పెద్ద మరదలు సంధ్యాదేవి

సింహాద్రి జ్యోతిర్మయి
9.8.2019

నేడు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా
అమరవీరులకు నా కవితా నివాళి

క్విట్ ఇండియా

బానిసత్వాన్ని భరించి భరించి
విసుగెత్తిన భారతీయులు పూరించిన
 శంఖారావం
విజయమో,వీరమరణమో
తేల్చుకునేందుకు తెగించిన
తుది సమర నినాదం
ఆకలంటూ వచ్చావు
వ్యాపారంతో ఎదిగావు
ఆయుధాలను ఆశ చూపావు
వైషమ్యాలను రాజేశావు
సామంతులను మభ్యపెట్టావు
విభజించి పాలించటంలో
విజయాన్ని సాధించావు
సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నావు
బానిసత్వాన్ని బహుమతిగా‌ ఇచ్చావు
అసమర్థులమై 
అమ్మ దాస్యశృంఖలాలను చూస్తూ
అలా వందల ఏళ్లు
ఎలా భరించామో తెలియదు
నేడు మేలుకొన్నాము
భరతమాత దాస్యాన్ని
తొలగించాలని మేము
బద్ధకంకణులమయ్యాము
నేడు భరత ఖండం భగ్గుమంటోంది
బానిసత్వం సిగ్గు అంటోంది
స్వదేశీ ఉద్యమాలు
సైమన్ గో బ్యాక్ లు
సహాయ నిరాకరణాలు
ఉప్పు సత్యాగ్రహాలు
విదేశీ వస్తు బహిష్కరణలు
అన్నిటికీ కాలం చెల్లింది
అతివాదం,మితవాదం
అంతా ఏకమయ్యింది
కరో యా మరో
డూ ఆర్ డై
చావో రేవో
అంటోంది భారతం
తెల్లదొరలారా!
వినరండయా!
మీకేమాత్రం పౌరషమున్నా
క్విట్ ఇండియా

క్విట్ ఇండియా ఉద్యమం లో ప్రాణాలు కోల్పోయి,స్వాతంత్ర్య సంగ్రామం సాగించి
స్వాతంత్ర్య ఫలాన్ని సాధించి
స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అదృష్టాన్ని మనకందజేసిన ఆనాటి దేశభక్తులందరికీ
పాదాభివందనాలు అర్పిస్తూ

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.8.2019


20.8.1944 birth anniversary of Rajeev Gandhi 



*ప్రేమంటే ఇదేనా!*

చిరు చీకట్లు కమ్ముకునే వేళ
నా మనసునిండా
నీ ఆలోచనలే
ముసురుకుంటాయి
నీ కోసమనే
తలుపులన్నీ మూసేస్తాను 
అగరుధూపాలతో 
నా ఇంటిని నింపేస్తాను
నువ్వు నా చుట్టూనే
తిరుగుతుంటావు
చెవిలో గుసగుసగా
సవ్వడి చేస్తుంటావు
రాత్రంతా నాకు
నిద్రలేకుండా చేస్తావు
మాటిమాటికీ నా మీద
వాలుతుంటావు
నీకు భయపడే‌ నేను
చుట్టాలెవ్వరూ
రాత్రివేళ
మా ఇంటికి రాకూడదని
కోరుకుంటాను
ఉదయం లేవగానే వాళ్ళ మొహం చూడటానికి కూడా
ఇబ్బంది పడిపోతుంటాను
అబ్బా!
మీ ఇంటికి ఇంకెప్పుడూ రాము తల్లీ!
అని అనేస్తారేమోనని..
ఇలా అయితే ఎలా చెప్పు!
 ఓ దోమా!
నామీద
 నీ కెందుకంత ప్రేమ!

రాత్రి మా తమ్ముడు వాళ్ళు వస్తే మా ఏరియాలో ఉన్న
దోమలతో పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అన్న ఆలోచనతో వచ్చిన కవిత😜😜

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.1.2024



గోకులాష్టమి

శ్రీహరి 
*దశ* అవతారాలలోనూ
*నవమ*
అవతారమై 
వాసుదేవుడవైనావు

మహానందాంగనా
డింభకుడివై
*అష్టమి* నాడు
ప్రభవించావు

ఇంద్రకల్పిత
బీభత్సాలనుండి
ప్రపంచమనే గోకులాన్ని
*ఏడు* రోజులు 
అంటే ఎల్లకాలము
కొండంత అండవై
రక్షింపజూస్తావు

అమాయకమైన భక్తితో
బంధాన్ని నీతో
అల్లుకుంటే చాలు
*ఆరు*  ఋతువులు వసంతమయ్యేటట్లు
జీవన బృందావనాన్ని
పరిమళింపజేస్తావు

పరిస్థితులు ‌దాయాదులై పగబట్టిన వేళ
*పంచ* పాండవుల వలే
అయినవారెవ్వరూ
ఆదుకోలేక నిస్సహాయులైన వేళ
అన్నవై 
ఆత్మబంధువు వై
గౌరవాన్ని దక్కిస్తావు

నిన్ను నమ్మితే చాలు
*నాలుగు* పురుషార్థాలలోనూ
నీడవై వెన్నంటి నడిపిస్తావని నిరూపించావు

*మూడు*  మూర్తుల లోను
స్థితి కారకత్వాన్ని వహించి
శిష్ట రక్షణ బాధ్యత
చేపట్టి కాపాడి
చెలికాడవైనావు

నరనారాయణులు మీరు
*ఇద్దరు*
నడయాడిన చోటనే
విజయ ఐశ్వర్యాలు
విలసిల్లగలవనే
పరమ సత్యాన్ని
ప్రకటింపజేశావు

అన్ని ధర్మాలను
ఆవలపెట్టి
నన్ను *ఒక్కడి* నే
శరణు వేడు
అదే మోక్షమార్గమని
గీతాచార్యుడివై
ఉద్బోధించావు

ఓ నల్లనయ్యా!
ఓ యశోదాతనయా!
నీకు జన్మాష్టమి శుభాకాంక్షలు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.8.2019



ఈ రోజు సీనియర్ సిటిజన్స్ డే 

పండుటాకులు

తల పండి
తనువు పండి
తలపులు పండి
మనవలతో ఒడి నిండి
ఎదలో సంతృప్తి నిండి
ఆ పరమాత్ముని నుండి
పిలుపు కోసం ఎదురుచూస్తూ....

అందరూ ఉండి
ఆకలికి మండి
ఆదరణకు ఎండి
రోగాలతో పరుండి
ఏం సాధిస్తారు ఇంకా ఉండి?
అనే చీదరింపుకు కనులు నిండి
మృత్యు దేవత కరచాలనం కోసం పరితపిస్తూ....

వృద్ధాప్యం
కొందరికి పూలపానుపైనా
ఎందరికో 
అది అంపశయ్య

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.8.2020


*సీ (నియర్) సిటిజన్స్* 

ఒక తల్లి ఎంతటి నెత్తుటి చెలమ పారిస్తే 
బిడ్డలు భూమ్మీద ఊపిరి పోసుకుంటారు ?
ఒక తండ్రి 
ఎన్ని చెమట బిందువులు చిందిస్తే
బిడ్డలు వ్యక్తులుగా ఎదుగుతారు ?
తల్లిదండ్రులు 
ఎన్ని కన్నీటి సంద్రాలు 
రెప్పవెనుక దాచుకుంటే 
బిడ్డలు సంఘంలో మంచివాళ్ళుగా పేరుపొందుతారు?
కన్నవాళ్ళు ఎన్ని
ఆశాభంగాల్ని 
కడుపులో అణిచేసుకుంటే
పిల్లలు సంతోషపు 
సామ్రాజ్యాలు ఏలుతారు? 
ఆశలుపెంచుకుని 
అపురూపంగా పెంచుకున్న పిల్లలు 
పెద్దవారై 
ప్రయోజకులై 
అమ్మ ఇష్టం
నాన్న కష్టం విస్మరించి 
గుండెలపై 
ఎన్ని తాపులు తన్నితే 
దంపతులు 
వృద్ధాశ్రమాల వైపు
అడుగు సారిస్తారు ?

అనుభవాలు నేర్పిన పాఠం జీవితమైతే 
జీవితం నేర్పిన గుణపాఠం పిల్లలు

*ఆగస్టు 21 సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా*...

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.8.2024







మాతృభాషా దినోత్సవం సందర్భంగా 
భాషాభిమానులందరికీ శుభాకాంక్షలతో

 భాషా ప్రతిజ్ఞ

మధురమైన తెలుగు నా మాతృభాష.
మిగిలిన భాషలన్నీ నా తెలుగుకు సోదరభాషలు.
నేను నా మాతృభాష ను ప్రేమిస్తున్నాను.
అతి సుందరమైన,బహు ప్రాచీనమైన నా భాషా వారసత్వ సంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను.
నా భాషా సాహిత్యాన్ని,భాషా ప్రేమికులను, సాహితీ వేత్తలనందర్నీ గౌరవిస్తాను.
ఇతర భాషలనూ ప్రీతితో నేర్చుకుంటాను.
అన్యభాషా సహిష్ణుత కలిగి ఉంటాను.
నా మాతృభాష పట్ల, నా సంస్కృతి సంప్రదాయాల పట్ల
సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
సర్వ భాషల శ్రేయోభివృద్ధులే నా దేశ ప్రగతికి మూలం.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు





Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ