15.సుశ్లోకవేది(సంస్కృత శ్లోకాలకు పద్యానువాదం)
96.
అతనొక పుంభావ సరస్వతి. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విశేషమైన కృషిచేసి, దాదాపుగా 12 నాటకాలు, ఇతర గ్రంథాలు వ్రాసిన ధీశాలి. ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ శివానందమూర్తి సంపూర్ణ ఆశీస్సులకు అర్హులైన శ్రీ పొదిల సీతారామాంజనేయులు, నాకు అత్యంత ఆప్తమిత్రుడుగా ఉండడమే కాకుండా, పోలీసు కార్యాలయములో ఇద్దరం కలసి పనిచేయడం, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాను.
మొదటి నుంచి అనేక విషయాలపై నా రచనలను ప్రోత్సహిస్తూ, నా భుజం తట్టి ఉత్తేజపఱుస్తుంటారు. సప్తతి దాటిన సత్వగుణ సంపన్న మిత్రుడు, ప్రస్తుతం బెంగళూరులో కూతురు దగ్గర విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈరోజు ఉదయం జీవితానికి సంబంధించిన ఒక ఆంగ్ల మెసేజ్ ను నాకు పంపించి, 'దీనిని చక్కగా అనువదించి, మన తెలుగు పాఠకులకు అందించగలరనే నమ్మకంతో పంపిస్తున్నానని, ఒక బాధ్యత నాపై పెట్టారు. అందుచేత, నా శక్తి మేరకు అనువదించి, నా మిత్రుడి మన్ననలు పొందడానికి ప్రయత్నిస్తాను.
దాదాపుగా 2000 సంవత్సరాలకు పూర్వం కేశవశర్మ అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడికి నలుగురు భార్యలు, నలుగురు కొడుకులు వరుసగా వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి ఉండేవారని విన్నాము.
అయితే, మా నాన్న గారు ఎప్పుడూ చెబుతుండే హితోపదేశంలోని శ్లోకం తెలియని ఒక ప్రబుద్ధుడు కూడా నలుగురుని చేసుకుని, చివరి దాకా తనతో ఉండి, తను పోయేటప్పుడు కూడా, వారందరూ అనుసరిస్తారని భ్రమించేవాడట.
శ్లో!ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా
పశువులు, భార్యా, పుత్రులు, ఇళ్లు, వాకిళ్లు, ఇవన్నీ ఋణానుబంధంతోనే మనకు ముడిపడి ఉంటాయని, ఋణము తీరగానే మళ్ళీ మనల్ని వదలి పోతాయని అర్థం.
ఇప్పుడు కథలోకి వద్దాం. మామూలుగా నాల్గవ భార్య అందరికంటే చిన్నదవడం మూలాన, ఆమెనే ఎక్కువగా ప్రేమిస్తూ, తన దగ్గర ఉన్నదంతా సమర్పిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు చాలామంది. మన ప్రబుద్ధుడు కూడా అదే పని చేశాడు. జీవితంలో ఆమెకే ఎక్కవ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు.
మూడవ భార్యా అందమైనదే. అందువల్ల ఆమెను కూడా అతిగా ప్రేమించేవాడు. ఆమె అందాన్ని తన బంధుమిత్రాదులు మెచ్చుకుంటుంటే, ఇంత అందమైనది తనతో ఉండదని, ఏదో ఒక రోజు తనని వదలి వెళ్లిపోతుందని ఎప్పుడూ భయపడేవాడు.
ఇక రెండవ భార్యను కూడా అమితంగా ప్రేమించేవాడు. కారణం, తనకు ఏలాంటి కష్టమెదురైనా, ఆమె దగ్గరకు వెళ్లి చెప్పుకునేవాడు. ఆమె లాలనలో తృప్తి చెందడమే కాకుండా, ఎదురైన కష్టాలకు తగిన తరణోపాయం సూచించి సమాధానపఱిచేది.
అయితే, ఎంత ఆశ్చర్యమో చూడండి, మొదటి భార్యను ఏమాత్రం ప్రేమించేవాడు కాదు. కానీ, ఆమె మాత్రం అతడే లోకంగా ఉండేది. ఏది ఏమైనా, అసలు భార్య కావడం వల్ల, స్వార్థ రహితంగా, తన్ను మాలిన ధర్మంగా, భర్తనే సర్వస్వమనుకునే గుణవంతురాలిగా ఉండేది. సాధారణంగా ఇది లోక రివాజు కూడా.
ఇలా కాలం ఆనందంగా గడుస్తుండగా, అనుకోకుండా ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ఆరోగ్యం ఏమాత్రం బాగుపడక పోగా, తాను మరణించే కాలం ఆసన్నమయినట్లుగా గమనించాడు. తనకున్న నలుగురు భార్యల్లో ఎవరో ఒకరిని, మరణించేటప్పుడు తనతో తీసుకెళదామని ఉబలాటపడ్డాడు.
ఇక ఆలస్యం చేయకుండా, తాను అమితంగా ప్రేమించే నాల్గవ (చిన్న) భార్యను పిలిపించాడు. తన అభీష్టం చెప్పి నెరవేర్చమన్నాడు. 'నేనెలా రాగలను! ఇది నావల్ల కాని పని' అని మారు మాట్లాడకుండా అతణ్ణి వదిలేసి వెళ్లిపోయింది. 'అయ్యయ్యో, ఎంత బాగా చూసుకున్నా లాభం లేకపోయిందే, వృథా అయిందే' అని వాపోయాడు.
చేసేదేమీలేక, మూడవ భార్యను పిలిచి, 'ఇదీ సంగతి, నాతో పాటు వస్తావా?' అని అడిగాడు. 'అదేంటండీ, ఇక్కడ నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఈ లోకంలోని ఆనందాలను ఎలా వదులుకోగలను? మీరు పోతే మళ్లీ పెళ్లిచేసుకుంటానని' అక్కడ నుండి వెళ్లిపోయింది. ఛఛా, ఎంత పొరపాటు చేశాననుకొని బాధపడుతూ,
రెండవ భార్యను పిలిచి 'నువ్వేమంటావు? నాతో పాటు పైలోకాలకు వస్తావా?' అని అడిగాడు. దానికి ఆమె 'క్షమించండి, ఈ విషయంలో నేనేమీ సహాయం చేయలేను. అయితే, మీరు మరణించినప్పుడు, మీతో పాటు స్మశానం దాకా రాగలను, వచ్చి బాధతో సాగనంపగలనని', చావు కబురు చల్లగా చెప్పింది.
ఈ లోపల అతని శరీరం మెలమెల్లగా చల్లబడడం ప్రారంభించింది. గుండె లయ తప్పుతోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రాణ వాయువులు అనంత వాయువుల్లో లీనం కావడానికి ఘడియలు సమీపిస్తున్నాయనిపించింది. అంతలో 'ఏమండీ, మీరు ఎక్కడికి వెళ్లినా, మీతో పాటే ఉంటానండీ, మీ వెంటనే వస్తాను,మిమ్మల్ని ఒక్క క్షణం కూడా విడిచి వుండలేను. నేనూ వస్తానండీ' అన్న గొంతుక లీలగా వినిపించింది.
మెల్లగా కొంచెం తల పైకెత్తి చూశాడు, మొదటి భార్య దీనాతిదీనంగా నిలబడి వుంది. ఆమె శరీరం చిక్కి శల్యమైంది. ఎన్నో రోజులుగా ఆహారం లేక అలమటిస్తున్న అభాగ్యురాలిగా ఉంది. అతను మాట్లాడే స్థితిలో లేడు. మౌనంగా రోదిస్తూ, 'ఎంత దురదృష్టవంతుడిని, ఇలాంటి అర్ధాంగిని, ఎంతో బాగా చూసుకోవాల్సిన భార్యను నిర్లక్ష్యం చేసి, తప్పు చేశానని, నాకు పుట్టగతులుండవని' పశ్చాత్తాప పడసాగాడు.
అతను ఎందుకలా ప్రవర్తించాడని ఆలోచిస్తున్నారా! అదే విధి వైచిత్ర్యము. కథలోని వ్యక్తికే కాదు, మనందరికి కూడా నలుగురు భార్యలున్నారు. ఆశ్చర్యపోవద్దండి! ఇది నిజం. మన నాల్గవ భార్య మన శరీరం. మనం దాన్ని ఎంత బాగా చూసుకున్నా, ఎన్ని షోకులు చేసినా ఏదో ఒక రోజు మనల్ని వదలి వెళ్లిపోతుంది. నిజం కాదా?
మన దగ్గర ఉన్న సంపద, ధన ధాన్యాలు, వ్యక్తిత్వం, హోదా, ఇళ్లు, పొలాలు ఇవన్నీ మన మూడవ భార్య. మనం పోతూనే, అవన్నీ వేరే వాళ్లకు చెందిపోతాయి.
మనకు అత్యంత దగ్గర అనుకున్న, భార్య లేక భర్త, బంధు మిత్రాదులు, పుత్రాదులు, పరివారం మన రెండవ భార్య. జీవితాంతం మనతోనే వున్నా, మన మరణం తర్వాత స్మశానం వఱకే రాగలరు. అంతకు మించి ముందుకు రాలేరనేది నగ్నసత్యం.
అమాయకంగా ఉంటూ ఎప్పుడూ మనల్నే అంటిపెట్టుకుని వుండే మన మొదటి భార్య మన 'ఆత్మ'. ఈ శరీరం ఎక్కడికి వెళ్లినా, ఎప్పుడూ వెంట ఉండేది అదొక్కటే. కానీ, పూర్తిగా ప్రాపంచిక విషయాలలో ముణిగిపోయిన మనం, ఆత్మను పట్టించుకోకుండా, జీవించినంత కాలం, దాని విలువ తెలుసుకోకుండా, నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం.
ఎవరి జీవితాలకు వారు, ఇలా అన్వయించుకున్నప్పుడు, పరమాత్మ సమానమైన ఆత్మ స్వరూపాన్ని ఎలా చూడాలో, ఎలా కాపాడుకోవాలో, దాని విలువ కాపాడుకుంటూ, ఆత్మజ్ఙానాన్ని ఎలా సంపాదించుకోవాలో అర్థమౌతుంది.
చదివినందులకు ధన్యవాదములు 🙏
అంబాళం పార్థసారథి,
19-09-2016,
సోమవారం.
గురువుగారికి నమస్సులు
సీసం
చక్కదనము జూసి చాల పోషణ జేసి
.....మురిసేవు తనువేమి ముసలిదవదె?
ఘనమైన సిరి జూచి గర్వించి తుళ్ళేవు
....కడపటి నీ పాన్పు కట్టెలందె
బంధు హితుల గాంచి,బలగముందని యెంచి
....కులికేవు వారు నీ కూడ రారె
పట్టించు కొనవు నీ ప్రాణమందలి యాత్మ
.....కడవరకది నిన్ను కాచి కొనదె
తే.గీ.
తనువుతోనె నీ యందము తరలి పోవు
సిరియు నింకేరి చెంతకో చేరిపోవు
కలసివత్తురు మిత్రులు కాటి వరకె
చెలిమి జూపుచు ఆత్మను చేరదీయి.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
73. శ్లో|| అరావప్యుచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే
ఛేత్తుః పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః
--హితోపదేశం.
చల్లని నీడనిచ్చే చెట్టు, తనను నరకటానికి వచ్చిన వాడికి కూడా కాదనకుండా నీడనిస్తుంది. అదేవిధంగా, మన ఇంటికి అతిథిగా శత్రువచ్చినా సరే, ఆనందంగా ఆతిథ్యం ఇవ్వాలి.
కృష్ణ యజుర్వేదం, తైత్తిరీయ ఆరణ్యకానికి చెందినదే, తైత్తిరీయ ఉపనిషత్తు. ఇందులోనే, 'మాతృదేవో భవ', 'పితృదేవో భవ', 'ఆచార్య దేవో భవ', 'అతిథి దేవోభవ' అని ఉంటుంది. అనగా, తల్లి, తండ్రి, గురువు, అతిథి, ఈ నలుగురు దైవంతో సమానం అని అర్థం. చూశారా! భోజనం చేయడానికి వచ్చిన అతిథిని కూడా దైవమే అంటుంది ఉపనిషత్తు. ఇది మన ఆర్ష సనాతన సాంప్రదాయం.
చివరకు ఆగర్భ శత్రువు ఇంటికి అతిథిగా వచ్చినా సరే సాదరంగా గౌరవించాలంటుంది మహాభారతం. వచ్చిన అతిథుల వల్ల మనకేమన్నా లాభముందా? మనతో అన్ని విధాలా సరితూగుతారా? ఇంతకుముందు మనం వారి దగ్గరకి వెళ్లినపుడు, మనల్ని ఎలా ఆదరించారు? అని, ఏమాత్రం ఆలోచించకుండా, వచ్చిన వాళ్లను ప్రేమతో, ఆప్యాయతతో ఆదరించి, మంచినీళ్లు ఇచ్చినా చాలు, మహదానందభరితులౌతారు.
వంట వండి, వడ్డించే వారు ఆప్తులయితే, వారు ప్రేమతో పెట్టిన ఆహారం అమృతమయం అవుతుంది. అలా తిన్న వారిలో, అమృతత్వం పెరిగి, ఆయురారోగ్య ఆనందాలు వృద్ధి చెందుతాయి. తద్వారా, తిన్నవారి రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల బారిన పడకుండా ఉంటారని మన రుషులు చెప్పారు. అందుకే, పాండవుల రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు దుర్యోధునుడి ఆతిథ్యాన్ని కాదని, అమృత హృదయుడు, విదురుడి ఆతిథ్యం స్వీకరిస్తాడు.
దుర్యోధనుడు, కృష్ణ పరమాత్మను భోజనానికి పిలుస్తాడు. దానికి కృష్ణ పరమాత్మ, "దుర్యోధనా, భోజనం చేయమని అడుగుతున్నావు కానీ, ఆదరించడం నీకు తెలియదు. జీర్ణమైన తర్వాత తిన్నదేమీ ఉండదు. కానీ, ఆదరణ అనేది శాశ్వతంగా గుర్తుంటుంది. ఆదరణ లేనిచోట నేను భోజనం చేయను" అన్న చిన్మయ మూర్తి మాటలు చిరస్మరణీయం.
మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇవ్వడం వల్ల, మన మనసు సంతృప్తి పడుతుంది. ఎదుటివారి సంపదపై దృష్టి ఉండకూడదు. ఈర్ష్య, అసూయలతో ఇతరులను ఇబ్బంది పెట్టి, తానూ ఇబ్బంది పడకూడదు. దుర్యోధనుడిలా అతిథుల ఆదరణపై కాకుండా, అహంకార, ఆడంబర, అసహనంతో కూడిన అలజడికి లోనైతే, ఆతిథ్య ఆనందాన్ని అసలు పొందలేము. అలా, మన జీవన విధానాన్ని తెలుసుకోవాలంటే ఒక్క మహాభారతం చదివితే చాలు. ప్రతి విషయం అవగతమవుతుంది.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
11-2-2017,
PBEL City, Hyderabad.
తే. గీ.
నరకవచ్చి చెంతనిలుచు నరునికైన
సేద దీర్చి నీడనొసగు చెట్టు భంగి
గడప తొక్కు శత్రువు నైన కనికరించి
సాదరమున ఆతిథ్యమ్ము సలుపవలెను.
సింహాద్రి
11.2…2017.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
76. శ్లో||అభ్యంగం కారయే న్నిత్యం సర్వేష్వంగేషు పుష్టిదం
శిరః శ్రవణ పాదేషు తం విశేషేణ శీలయేత్
--చరకసంహిత.
ప్రతి రోజూ నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. ఈ స్నానం వలన అన్ని అవయవాలకు పుష్టి లభిస్తుంది. తల, చెవులు, పాదాలపై కూడా, నూనెతో బాగా మర్దన చేయాలి. విశేషమైన ఫలితాలు ఉంటాయి.
శరీరం, నఖశిఖ పర్యంతం నూనెతో మర్దన చేసి, ఒక గంట బాగా నాని, స్నానం చేస్తే ఎన్నో ఉపయోగాలున్నాయని చరకుడు అంటాడు. అలా, ప్రతి రోజూ చేస్తుండాలి. లేదా కనీసం, ప్రతి పండుగ నాడు తైలాభ్యంగన స్నానాన్ని చేయాలి. ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి, శనగపిండితో నలుగు పెట్టించి, స్నానం చేయాలి. దీని వల్ల ఒంటి మీద ఉన్న స్వేద రంధ్రాలన్నీ శుభ్రపడి, తెఱుచుకుంటాయి.
ఉగాది నుంచి చేసే అభ్యంగన స్నానం, వేసవిలో వచ్చే చర్మరోగాలను రాకుండా చేస్తుంది. స్వేద రంధ్రాలు తెఱుచుకోవడం వల్ల చెమట పొక్కులు, మొటిమలు వంటి సమస్యలు రావు. నువ్వుల నూనెలో సాంద్రత ఎక్కువగా ఉండి, ఉష్ణాన్ని కలిగించే గుణం కలిగి ఉంటుంది. శరీరానికి తగిన ఉష్ణోగ్రత ఉండాలి. అంతేకాదు, నువ్వుల నూనెలో విటమిన్ 'ఇ', 'కె' లు చాలా అధికంగా ఉంటాయి.
నువ్వుల నూనెలో దాదాపు 13% విటమిన్ 'కె' ఉంటుందని శాస్త్రజ్ఙులు తేల్చేశారు. విటమిన్ 'కె' ఎముకల గట్టితనానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల నూనె శరీరానికి పట్టించడం వల్ల, చర్మం నిగనిగలాడుతూ, కేశపోషణ కలుగుతుంది. వాత, కఫ, దోషాలను హరిస్తుంది. "తైల గండూషాభ్యాసో దంతబలరుచికరాణాం" అన్న చరక సూత్రం ప్రకారం, నువ్వుల నూనెను పుక్కిలిస్తే, దంతాలు అతి బలిష్ఠంగా తయారవుతాయి. అన్నం రుచి కూడా పెరుగుతుంది.
అందుకే, ప్రతి రోజూ తైలాభ్యంగన స్నానం చేయాలని పెద్దలు చెప్పారు. ఎలాగూ ప్రతి రోజూ ఆచరించం కాబట్టి, కనీసం పండుగ రోజుల్లో అయినా, ఈ ఆచారాన్ని కొనసాగించమన్నారు. పండుగనాడు పాటించని కొంత మంది, సంవత్సరానికి రెండు సార్లు ఉగాది, నరక చతుర్దశి నాడు, మొక్కుబడిగా అభ్యంగన స్నానం చేస్తున్నారు. ఉగాది అంటే తెలుగువాడి సంవత్సరాది, తొలి రోజు.
సంవత్సర ప్రారంభం రోజున, ఈ ఆచారాన్ని పాటిస్తే శుభారంభంగా ఉంటుందని, మున్ముందు రోజుల్లో కూడా అలాగే చేయాలని పెద్దలంటారు. అందుకోసమే, ఉగాది రోజు అభ్యంగనం చేయనివాడు నరకానికి పోతాడని భయపెట్టారు. అనారోగ్యంగా, అపరిశుభ్రతగా, ఉంటే, ఆ జీవితం నరకంతో సమానమే కదా! రోగాలు, రొచ్చులకు మించిన నరకం ఇంకొకటి ఏముంటుంది? అందరూ పెద్దల మాట వినండి.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
14-2-2017,
PBEL City, Hyderabad.
తే.గీ.
తైల మర్దన మొనరించి తనువదెల్ల
అటుపైన అభ్యంగన మాచరింప
మంచి కాంతితో ఆపాద మస్తకమ్ము
వెలిగి పుష్టియు,ఆయువు వృద్ధి యగును.
సింహాద్రి
16.2.2017.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
68. శ్లో| అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ
వంచనం చావమానంచ మతిమాన్న ప్రకాశయేత్
--హితోపదేశం.
ధననష్టం, మనస్తాపం, లోగుట్టు, వంచన, అవమానం, వీటిని బుద్ధిమంతుడైన వాడు ఎలాంటి సమయాలలో కూడా బయట పెట్టకూడదు, చెప్పకూడదు.
ఒకవేళ ధననష్టము జరిగితే, ఆ విషయాన్ని ఇతరులకు చెప్పినంత మాత్రం చేత ఉపయోగం కాని, దానివల్ల ఒరిగేది కాని ఏమీ ఉండదు. విన్న వాళ్లు ఎలాగూ తెచ్చి ఇవ్వరు. ఇంకా సానుభూతి నెపంతో, వారి తెలివితక్కువ తనాన్ని ఎద్దేవా చేస్తారు. అటువంటప్పుడు చెప్పి అవమానపడడమే తప్ప ఉపయోగం మాత్రం శూన్యం.
ఒక్కోసారి, జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న సంఘటనలు కూడా రెండు మూడు రోజుల వఱకు మనస్తాపం కలిగిస్తుంటాయి. భగవంతుడిచ్చిన అతి సున్నితమైన, కనబడని సాధనమే మనస్సు. మనస్సంటే, కోరికల కేంద్రం. దానికి సరియైన శిక్షణ చాలా అవసరం. లేకుంటే, బద్ధ శత్రువుగా మారి కష్టం కలిగిస్తుంది. అందువల్ల, మనసులోని బాధను బయట పెడితే, సమాజంలో చులకనై పోతారు.
కుటుంబం లోని కొందరి నడత చెడుగా ఉన్నట్లయితే, ఆ విషయాన్ని నాలుగు గోడలు దాటనీయకూడదు. గుంభనంగా ఉంచాలి. పొరపాటున బయట పొక్కిందంటే అంతే. ఇంటిరట్టు, అందరిలో తల ఎత్తనీయకుండా చేస్తుంది. పైగా అవమానాల పాల చేసి, ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. అందుకని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మోసం చేయడం, మోసానికి గురి కావడాన్ని వంచన అంటాం. కొందరు తమ మాయ మాటలతో, నేర్పరితనంతో, కొంత మందిని మెప్పించో, బురిడీ కొట్టించో, ఎదుటి వారి సంపదను తస్కరించడం లేదా లోబఱుచుకోవడం లాంటిది చేస్తుంటారు. మూర్ఖత్వం వల్లనో, అమాయకత్వం వల్లనో నష్టపోతారు. ఈ విషయం బయటపడితే అందరూ కథలు కథలుగా చెప్పుకుంటూ, జీవితాంతం అపహాస్యం చేస్తూనే ఉంటారు.
అలాగే, జీవితంలో జరిగే అవమానాలను ఇతరులకు ఎంత మాత్రం చెప్పకూడదు. ముందే అవమానభారంతో దుఃఖ పడుతున్నవారిని, ఇతరులు పుండు మీద కారం చల్లినట్లు, సూటి పోటి మాటలతో అవమానం చేసి బాధకు గురి చేస్తారు.
శ్లోకంలో చెప్పిన విషయాలు ఇతరులకు చెబితే అనవసరంగా ఆట పట్టిస్తారు. దాని వల్ల నష్టమే ఎక్కువ. అందువల్ల, వాటిని గోప్యంగా ఉంచుకోవాలి. స్వంత విషయాలు వీలైనంత వఱకు వెల్లడి చేయకుండా ఎంతగా దాచుకొంటే అంత మంచిది.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
06-2-2017,
PBEL City, Hyderabad.
మిత్రులందరికీ హాయ్
ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉండి ఈ రసవంతమైన వేదికకు దూరంగా ఉన్నాను.అందుకని నా పద్య స్పందన ఇప్పుడు తెలియజేస్తున్నాను.
తే.గీ.
సొమ్ము నష్టపడుట,మది క్షోభ పడుట
లోని గుట్టు,పొందిన అవమానమున్ను,
మోసపోవుటయు ఎదను మూసి పెట్టు
వెల్లడైనచో పరువుకు వెలితి యగును.
సింహాద్రి
6.2.2017.
హరిః ఓమ్🙏
శుభోదయం.
320. శ్లో|| అథాబ్రవీత్సుతాం రక్షః కైకసీం నామ నామతః
పుత్రి ప్రదానకాలోయం యౌవనం వ్యతివర్తతే
--రామాయణం, 7-9-6.
తరువాత ఆ రాక్షసుడు (సుమాలి) తన కుమార్తె కైకసితో , 'పుత్రీ! నీ యౌవనం దాటిపోవుచున్నది. నీకు వివాహం చేయవలసిన కాలం వచ్చిందని' అన్నాడు.
"సుమాలినం సమాసాద్య రాక్షసం రఘుసత్తమ, స్థితాః ప్రఖ్యాతవీర్యాస్తే వంశే సాలకటంకటే", రామా! సాలకటంకట వంశమందు పరాక్రమంగల రాక్షసులు సుమాలి పాలనలో ఉన్నారు. (సాలకటంకట, మాల్యవంతుడు మొదలైన సోదరుల పితామహి, విద్యుత్కేశుడి భార్య. వీరి పుత్రుడే సుకేశుడు). రామా! నువ్వు చంపిన రాక్షసులు పులస్త్య వంశానికి చెందినవారే. సుమాలి, మాల్యవంతుడు, మాలి నువ్వు చంపిన వారి పూర్వీకులు, చాలా గొప్పవాళ్లు, రావణాసురుడి కంటే కూడా అధిక బలసంపన్నులు. అంతటి అధిక బలసంపన్నులను, దేవతలకు బాధ కలిగించు రాక్షసులను చంపగలవాడు ఒక్క నారాయణుడు మాత్రమే.
"భవన్నారాయణో దేవః చతుర్బాహుః సనాతనః, రాక్షసాన్ హంతుముత్పన్నో హ్యజయ్యః ప్రభురవ్యయః", రామా! నాలుగు బాహువులు గల, దేవదేవుడైన సాక్షాత్తు నారాయణుడవు నువ్వే. నిన్ను ఎవరూ జయించలేరు. నువ్వు అత్యంత సర్వసమర్థుడవు, వినాశరహితుడవైన నువ్వు రాక్షసులను చంపడానికే పుట్టావు. దుష్టులను వధించడానికి, ఆయా కాలాలలో శ్రీమహావిష్ణువే ఇలా, నీలా జన్మిస్తుంటాడు. రామా! ఇక నీకు రావణుడు, అతని పుత్రుల జన్మ వృత్తాంతాన్ని చెబుతానని' మొదలుపెట్టాడు అగస్త్య మహర్షి.
సుమాలి విష్ణువుకు భయపడి, రాక్షసులతో సహా చాలా కాలం రసాతలంలో ఉండిపోయాడని చెప్పుకున్నాం కదా! ఆ తర్వాత తండ్రి అనుమతితో కుబేరుడు (వైశ్రవణుడు) లంకలో నివసించిన విషయం కూడా చెప్పుకున్నాము. "కస్యచిత్త్వథ కాలస్య సుమాలీ నామ రాక్షసః, రసాతలాన్మర్త్యలోకం సర్వం వై విచచార హ", కొన్నేళ్ళ తర్వాత సుమాలి భూలోకానికి వచ్చి, అనుకోకుండా, అంగరంగ వైభవోపేతంగా, పుష్పక విమానంలో తన తండ్రిని చూడడానికై వెళుతున్న పులస్త్యుని కుమారుడు కుబేరుడు అలా వెళ్లడం చూసి రసాతలానికి తిరిగి వచ్చాడు.
రసాతలానికి వచ్చిన సుమాలి, "కిం కృత్వా శ్రేయ ఇత్యేవం వర్ధేమహి కథం వయమ్", 'మనం ఏలాంటి మంచి పనులు చేస్తే కుబేరుడిలా వృద్ధిపొందగలమని' తన వాళ్లతో బాగా ఆలోచించాడు. తర్వాత తన కూతురు దగ్గరకు వచ్చి, 'పుత్రీ! నీకు వివాహం చేయవలసిన సమయం వచ్చింది. యౌవనం దాటిపోయే లోపల, "త్వత్కృతే చ వయం సర్వే యంత్రితా ధర్మబుద్ధయః", ధర్మమందు ఆసక్తి కల మేమందరమూ నీ కోసమే చాలా ప్రయాస పడుతున్నామని, తన కుమార్తె కైకసితో అన్నాడు సుమాలి.
పుత్రీ! సమస్త సద్గుణములతో నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి వలె ఉన్నావు. ఆత్మాభిమానం కలవారికి, కన్యకు తలిదండ్రులై ఉండుట దుఃఖకారణమే కదా! ఎటువంటి వాడు వచ్చి నిన్ను వరించునో తెలియదు. అందుకని, "సా త్వం మునివరం శ్రేష్ఠం ప్రజాపతి కులోద్భవమ్, భజ విశ్రవసం పుత్రి పౌలస్త్యం వరయ స్వయమ్", మునులలో గొప్పవాడు, శ్రేష్ఠుడు, ప్రజాపతి వంశంలో పుట్టిన విశ్రవసుడిని సేవించి, స్వయంగా ఆ పులస్త్య కుమారుడినే వరించు. ఆయన తేజస్సు చేత సూర్యుడిలా వెలిగిపోతున్న కుబేరుడిలాంటి పుత్రులు పుట్టగలరని కూతురు కైకసికి బోధించాడు సుమాలి. మరి కైకసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం.
అందరం సంస్కృతం నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి,
16-10-2017, సోమవారం,
PBEL City, Hyderabad.
సుశ్లోక వేది మిత్రులకు శుభసాయంత్రం
గురువుగారికి నమస్సులు.
సీసం
నాల్గు భుజములున్న నారాయణుడవీవె
.....రఘువంశ తిలకుడౌ రాముడీవె
రావణాంతకుడవు రవికుల మణి వీవె
.....దశరథునకు ప్రియ తనయుడీవె
అజునికి జనకుడౌ హరియనంగ నీవె
......కౌసల్య గన్నట్టి కాన్పువీవె
అపజయమ్మెరుగని అచ్యుతుడవు నీవె
.......జానకీ పతి రామచంద్రు డీవె
ఆ.వె.
అసురకోట్ల దునుమ అవతరించుదు వీవె
సురల నరుల బ్రోచుచుందు వీవె
విష్ణు వీవె అమర వినుతు డీవె
రక్షకుడవు నీవె రామ మూర్తి.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభోదయం.గురువుగారికి మనసా నమస్సులు.
సీసము.
చల్లని కాంతుల చంద్రుడు గమనించు
........వేవేడి కిరణాల విభుడు గాంచు
అగ్ని మనల నిత్య మరయుచు నుండును
.....వాయువు గను మన వర్తనమ్ము
అంతరాత్మ యెఱుగు నాపస్సు లెఱుగు
......తెలియునాకాశమ్ము తెలియు పుడమి
ఎఱుగును నింగియు నిఱు సంధ్యలెఱుగు
......ధర్మ దేవత గాంచు తడయకెపుడు
తే.గీ.
కాన సద్వర్తన నరులు కలిగియున్న
చేకురు శుభములు క్షేమ మగును
ఎఱుగరెవ్వరు నన్నంచు యెదను తలచి
పథము వీడి చరించుట పాడి కాదు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
19. శ్లో! అజ్ఙః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఙః
జ్ఙానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి
--భర్తృహరి.
"తెలియని వాడికి హాయిగా, సుఖంగా నచ్చచెప్పి ఒప్పించవచ్చు. బాగా తెలిసిన వాడికి, ఇంకా తెలికగా నచ్చచెప్పవచ్చు. అరకొర జ్ఙానంతో మిడిసిపడే అల్ప జ్ఙానిని, మనల్ని సృష్టించిన, ఆ బ్రహ్మ దేవుడు కూడా సంతోష పఱచలేడు".
ఇది, భర్తృహరి సుభాషితంలోని ప్రసిద్ధమైన శ్లోకం.18వ శతాబ్దికి చెందిన, శ్రీ ఏనుగు లక్ష్మణకవి గారు, భర్తృహరి రచించిన 'సుభాషిత త్రిశతిని', 'సుభాషిరత్నావళి' పేరుతో నీతి, శృంగార, వైరాగ్య శతకములను తెలుగులోకి అనువాదము చేశారు. అతి మనోహరంగా, యథామూలంగా, ప్రౌఢంగా, సందర్భోచిత శైలిలో రచించాడని పెద్దల అభిప్రాయము.
పై శ్లోకానికి సరియైన, సుపరిచితమైన, పామరులకు కూడా అర్థమయ్యే శ్రీ ఏనుగు లక్ష్మణకవి గారి, తెలుగు కంద పద్యం మీకోసం.
కం. తెలియని మనుజుని సుఖముగ
తెలుపందగు, సుఖతరముగ తెలుపగ వచ్చున్
తెలిసిన వానిన్, తెలిసియు
తెలియని నరు తెల్ప బ్రహ్మ దేవుడి వశమే
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
19-12-2016,
PBEL City, Hyderabad.
తే.గీ.
తెలియని యొక పామరునకు తెలుపగలము
తెలియు జ్ఞానికి తెలుపుట సులభతరము
వినని,తెలియని మూర్ఖుని వెడగు మాన్ప
తరమె బ్రహ్మ కు నైనను తఱచి చూడ.
సింహాద్రి
19.12.2016.
వెడగు.....అవివేకము
Comments
Post a Comment