18.అంబాళం..ఆంతర్యం
హరి ఓమ్ 🙏
శుభోదయం.
183. శ్లో|| అంభసా భిద్యతే సేతుస్తథా మంత్రోప్యరక్షితః
పైశున్యాద్భిద్యతే స్నేహో వాచా భిద్యేత కాతరః
--సంస్కృత సూక్తి రత్న కోశః.
ఆనకట్ట నీటికి కొట్టుకొనిపోతుంది. రక్షించకపోతే ఆలోచన బయటపడిపోతుంది. చాడీల వల్ల స్నేహం చెడిపోతుంది. పిరికివాడు మాటలకే బెదిరిపోతాడు.
మనం బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో, నీరు కూడా అంతే అవసరం. నీరు లేనిది మనమెవ్వరం మనుగడ సాగించలేము. పంటలు పండడానికి నీరు కావాలి. పంటలు పండితేనే మనకు భుక్తి, శక్తి. వర్షం ద్వారా పడిన నీరు సముద్రంలో కలిసిపోకుండా, భూగర్భంలోకి ఇంకిపోయేటట్లు చూసుకోవాలి. సిమెంట్ రోడ్ల వల్ల, చెట్లు లేమి కారణంగా, గృహ ప్రాంగణాలు సైతం సిమెంట్ మయం కావడం వల్ల, నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి తగ్గింది. ఆఘమేఘాలతో ఈ పరిస్థితి నుండి మనం బయట పడాలి. ముందుగా పర్యావరణాన్ని రక్షించుకోవాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టాలి, భూగర్భంలో జలమట్టం పెంచాలి. నీటికి కొట్టుకొనిపోని విధంగా బలిష్ఠమైన ఆనకట్టలను నదులపై కట్టి, నీటిని రక్షించుకోవాలి.
మంచి ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచితే, చెడు ఆలోచనలు కష్టాలపాలు చేస్తాయి. అందుకే, మంచి ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టాలి. వాటిని అమలు పఱుచకుండా, ఇతరుల వల్ల కష్టము కలిగిందని, అనవసరంగా వారిని నిందించడం తగదు. మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. మన మనస్సే ప్రపంచం. మనసును బట్టి, ప్రపంచం కనిపిస్తుంది. 'సృష్టిలో భేదం లేదు, అంతా మన దృష్టిలోనే ఉందని' ఆది శంకరులు అంటారు. మంచి ఆలోచనలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యతిరేక భావనల వలన జీవితం నాశనం అవుతుంది.
అందువలన, మానవుడు చెడు ఆలోచనలను వదిలిపెట్టి, మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టి, జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. మన ప్రియతమ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఎప్పుడూ ఒక మాట అనేవారు. 'కలలు కనండి, వాటిని సాఫల్యం చేసుకోండని'. వారన్నది అక్షరసత్యాలు. మంచి ఆలోచనలు, ఆకాంక్షలు, అత్యుత్తమ భావనలు ఎప్పుడూ ఆలోచిస్తుంటే, అవి మంచి ఉత్తేజాన్ని కలుగజేస్తాయి. అయితే రాష్ట్ర, దేశ ప్రభుత్వాల మంత్రాంగాన్ని (రహస్య ఆలోచన) శతృవుల బారినుండి తప్పక రక్షించుకోవాలి. అది వ్యూహ ప్రతి వ్యూహాలకు, దేశ భద్రతకు, దేశ రక్షణకు సంబంధించినది.
ఏమీ చేతగాని అసూయాపరులు చాడీలు చెబుతుంటారు. జీవితంలో ఎదుటి వారిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు, వారి జీవితంలో ఉన్నవి లేనివి చెప్పి సాధించడాన్ని చాడీలు అంటారు. చాడీలు చెప్పడం వల్ల, వారికి మానసిక ఆనందం ఉంటుందేమో గానీ, వాటివలన కొందరి జీవితాలు అల్లకల్లోలం అవుతాయని అనుకోరు. రామాయణంలో మంథర, భారతంలో శకుని చాడీలకు ప్రసిద్ధి. మంథర చాడీల దెబ్బకు రామాయణమే ఒక మలపు తిరిగింది. సీతారామలక్ష్మణులు పధ్నాలుగు సంవత్సరాలు అడవులకు వెళ్లారు. పుత్ర వియోగంతో దశరథుడు పరలోకానికి పయనమయ్యాడు.
భారతీయ సాహిత్యంలో చాడీకోరులందరికి, శకుని అధ్యక్షుడు. దుష్టచతుష్టయంలో పెద్ద తలకాయ. చిన్నతనంలోనే అక్క గాంధారి పంచన చేరి, మేనల్లుళ్ల బుర్రలు పాడుచేశాడు. అహంకారికి మంచి మాటలు తలకెక్కవు. వారికి చాడీల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కారణ జన్ములైన విదుర, భీష్మాదుల హిత వచనాలకంటే, మామ చెప్పే మాయ మాటలు మహత్తరంగా అనిపించి, మహాభారత యుద్ధానికి కారణమయ్యారు. ఈ కాలంలో చాడీల మాయలు కోకొల్లలు. తలిదండ్రులు పిల్లల నడుమ మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విడాకులు, అధికారులు నమ్మితే ఉద్యోగుల ఉద్యోగాలు పోవడం, ఇవన్నీ చాడీల వల్ల తఱచుగా సాధ్యమయ్యే సంఘటనలు.
చాడీలు చెప్పేవాళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని మార్చడం కష్టం. వినేవాళ్లే వివేకం ప్రదర్శించి, వీటి వల్ల జరిగే అనర్థాలను నివారించుకోవాలి. అది, అంత కష్టమేమీ కాదు. దీనికి "వినదగునెవ్వరు చెప్పిన" అన్న సుమతీ పద్య మంత్రం ప్రయోగించాలి. ఇక, కేవలం మాటలకే భయపడిపోయే పిరికివారికి ధైర్యం మందు నూరి పోస్తే సరిపోతుంది. వారిని హాయిగా కాపాడుకోవచ్చు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
01-6-2017, గురువారం,
PBEL City, Hyderabad.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. గురువుగారికి నమస్సులు.
సీసం.
వాననీరు ప్రజకు వనరుగా నిల్వగా
........ఆనకట్టలు కట్టి ఆపవలెను
దేశ భద్రత గుట్టు లేశమున్ పొక్కక
......,..నేర్పుగా మంత్రమ్ము నెరుపవలెను
చెప్పుడు మాటకున్ చెవియొగ్గు ఫలితమున్
.....,....పూర్వగాథల చేత నేర్వవలెను
పిరికివాని మదిని బింకమేపాటిదో
......,.....తెలిసి ధైర్యము చెప్పి మలుపవలెను
తే.గీ.
నీటి యుధృతికి వారధి నేల కూలు
రక్షసేయక మంత్రమ్ము రట్టుపడును
మైత్రి చాడీలచేతనే మాయమగును
పిరికివాడు పలుకులకే బెదరిపోవు.
హరి ఓమ్🙏
శుభోదయం.
182. శ్రో|| అభిజాత్యం హి తే మన్యే యథా మాతుస్తథైవ చ
న హి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః
--రామాయణం, అయోధ్య. 35-17.
"జన్మతః వచ్చిన నీ స్వభావం, నీ తల్లి స్వభావం వంటిదేయని తెలిసిపోయింది. 'వేప చెట్టు నుండి తేనె కారుతుందా'? అన్న ప్రసిద్ధమైన సామెత నీపట్ల సరిపోతుందని" మంత్రి సుమంత్రుడు కైకేయితో అంటాడు.
వనవాసానికి బయలుదేరే ముందు తండ్రి అనుమతి కోసం వచ్చి నిలబడ్డ రాముడిని చూసి, "రామా, ఎవ్వరూ చేయని సాహసం చేస్తున్నావు. ఇహ, పర లోకాల్లో నీకెప్పుడూ మేలే జరుగుతుంది. నీ మనస్సును ధర్మం మీద స్థిరంగా ఉంచావు. నీ నిర్ణయం మార్చడం, నా వల్ల కావడం లేదు. నువ్వు మూర్తీభవించిన సత్యానివి. అయితే, నేను చెప్పే ఒక మాట విను. ఈ ఒక్క రోజు నాతో, నీ తల్లితో గడిపి, సమస్త భోగాలు అనుభవించు. రేపు వనవాసానికి వెళ్లు" అని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ, రాముడిని వనవాసం వెళ్లడానికి అనుమతించాడు దశరథుడు.
దానికి, "తండ్రీ, ఈ భోగాలన్నీ ఒకరోజు అనుభవిస్తే, తృప్తి కలిగి, ఇక చాలు అనిపించేవి కావు. మళ్లీ మరునాడు కావాలనిపిస్తాయి. ఈ భోగాల మీద నాకు ఆసక్తి లేదు. భరతుడికి వదిలేస్తున్నాను."ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే", 'సత్యం మీద, పుణ్యం మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను'. రాజ్య భోగాల మీద ఏమాత్రం కోరిక లేదు. మీరు మాత్రం సత్యవ్రతుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మాటకిక తిరుగులేదు. పద్నాలుగు సంవత్సరాలు గడచిన తర్వాతనే మళ్లీ వస్తానని" అంటాడు రాముడు.
అక్కడే నుల్చున్న మంత్రి సుమంత్రుడు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. పళ్లు పటపట కొరుకుతూ, కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, ఎర్రబడిన కళ్లతో కైక దగ్గరకెళ్లి, లోకంలోనే అజేయుడైన దశరథ మహారాజు, నిన్నెంతగానో ప్రేమించాడు. అలాంటి భర్తను మోసం చేశావు. మామూలుగా 'తండ్రి పోలిక కొడుక్కి, తల్లి పోలిక కూతురికి వస్తుందంటారు'. నీ తల్లి పట్టుదల ఏంటో మాకు తెలుసు. ఆమె పరమ మూర్ఖురాలని అందరూ చెప్పుకుంటారు. ఆమె పోలిక నీకొచ్చింది. నీ తండ్రి ఒక దివ్యపురుషుడిని సేవించి, అన్ని ప్రాణులు మాట్లాడే భాషల్ని అర్థం చేసుకునే వరం పొందాడు.
ఒకరోజు పడకగదిలో మంచం దగ్గర ఒక చీమ మాట్లాడిన మాట విని, నీ తండ్రి నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ నవ్వుకు కారణం చెప్పమని నీ తల్లి పట్టుపట్టింది. ఆ కారణం చెప్తే తాను మరణిస్తానని, అడగవద్దని నీ తండ్రి చెప్పాడు. దానికి, "శంస మే జీవ వా మా వా న మామపహాష్యసి" నువ్వు జీవించినా మరణించినా సరే, ముందు నీ నవ్వుకు కారణం చెప్పమని పట్టుపట్టింది నీ తల్లి. వరమిచ్చిన మహాపురుషుడి ఆజ్ఙ ప్రకారం, నీ తల్లికి ఏమీ చెప్పకుండా, ఆమెను తిరస్కరించాడు. తర్వాత, కుబేరుడి వలె సుఖంగా జీవించాడు. ఇప్పుడు, నువ్వు కూడా నీ తల్లిలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు.
"ఆమ్రం ఛిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః, యశ్చ ఏనమ్ పయసా సించేత్ నైవాస్య మధురో భవేత్",
ఎవడైనా మామిడిచెట్టును గొడ్డలితో నరికేసి, ప్రక్కనున్న వేపచెట్టుకు పాలు పోసి పెంచినా, అది చేదునే ఇస్తుంది కానీ, తీపిని ఇవ్వదు. దశరథుడు నీకోసం కౌసల్యాదులను కాదన్నాడు. నిన్ను ఎంతో ప్రేమగా చూశాడు. దానికి ప్రతిఫలంగా మహారాజుకు హాని తలపెట్టావు."న హి నింబాత్ స్రవేత్ క్షౌద్రమ్", వేపచెట్టు నుండి తేనె కారదని చెప్పడానికి ఇంతకంటే దృష్టాంతం వేరే కావాలా"? అని సుమంత్రుడు కైకేయిని మందలిస్తాడు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
31-5-2017, బుధవారం,
PBEL City, Hyderabad.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభసాయంత్రం.
గురువుగారికి నమస్సులు.
సీసం.
కైకమ్మ నీవెంత కఠినాత్మురాలవో!
...........అంపుచుంటివి రాము నడవులకును
తెల్లమాయెను నేడు తల్లి పోలిక నీది
..........,..విభుని నీ మాటచే వివశుజేసి
ఎనలేని దుఃఖాబ్ధి నెల్లవారల ముంచి
...........దాసి మాటల నెంచి దయను వీడి
చేయు పాపము నీకు సేమమివ్వదు సుమ్ము
............అనుభవింపక తప్పదా ఫలమ్ము
ఆ.వె.
వేప చెట్టు నుండి వెడలునే తేనెలన్
సామెత నిను పోల్చ జాలు నంచు
పట్టరాని కినుక పలికె సుమంత్రుండు
కుమిలి దశరథుండు కూలబడియె.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభోదయం. గురువుగారికి నమస్సులు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
159. శ్లో|| అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
--భగవద్గీత 2-33.
అర్జునా, యుద్ధం చేయడం నీ ధర్మం. ఒకవేళ యుద్ధం చేయకుంటే, స్వధర్మాన్ని వదిలేసి పారిపోయిన వాడవుతావు. దానితో ఇప్పటి దాకా నువు సంపాదించిన కీర్తి అంతా పోయి, అపకీర్తి వస్తుంది, పాపం వస్తుంది.
శ్రీమహావిష్ణువు అంశ శ్రీకృష్ణుడు. అందువలన, ఆయనకు మానవుల గుఱించి, వారి మనస్తత్వము, బుద్ధి గుఱించి కూడా బాగా తెలుసు. అందుకని, అర్జునుడిని కొంచెం మానసికంగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్థాడు. "అర్జునా, యుద్ధ ధర్మాన్ని నువ్వే ఆచరించకుండా, ధర్మాన్ని రక్షించకపోతే, సుఖాలకు దూరమై, దుఃఖపడతావని" భయపెడ్తాడు. అర్జునుడు అంతగా పట్టించుకోడు.
ఇంకా కొంత ముందుకెళ్లి, "స్వధర్మాన్ని వదలేయడం వల్ల, పాపం చేసినవాడవౌతావు, నరకానికి పోతావు. నరకంలో సుఖముండదు సరికదా! జీవితమంతా దుర్భరమైన దుఃఖాన్నే అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటి దాకా సంపాదించుకున్న కీర్తి అంతా పోతుంది. విజయుడు అత్యుత్తమ ధనుర్ధారి అన్న పేరు పోయి, అర్జునుడు మహా పరికివాడు అని లోకం కోడై కూస్తుంది. అనవసరంగా అపకీర్తి మూటకట్టుకోవద్దని", కొంచెం గంభీరంగా చెప్తాడు కృష్ణుడు.
"అర్జునా, నీలాంటి యోధుడు యుద్ధభూమిలో నిలబడి అహింస జరుగుతుందని భయపడితే, నీ కర్తవ్యాన్ని కావాలని ఉపేక్షించినట్లు అవుతుంది, అలా ఉపేక్షించడం, పాపం అంటుంది ధర్మ శాస్త్రం. నువ్వనుకుంటున్నట్లు, యుద్ధంలో జరిగేది హింస కాదు. క్షత్రియుడి ధర్మం. నువ్వు పాటించి తీరాలి" అని ధర్మాన్ని బోధిస్తాడు కృష్ణుడు.
నిజంగానే పరాశర స్మృతిలో, "క్షత్రియో హి ప్రజా రక్షాన్ క్షత్రపాణిః ప్రదండవాన్, నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేన పాల్యతే" (1.61.33), "అన్యాయం, హింస ఇలాంటి వాటి నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతి భద్రతల నిర్వహణ కోసం అనేక సందర్భాల్లో హింస అవసరమౌతుంది. అందుకే, క్షత్రియుడు, శత్రు రాజుల సైన్యాన్ని ఓడించి, రాజ్యాన్ని ధర్మ బద్దంగా పరిపాలించాలని" ఉంటుంది.
అదీగాక, శాస్త్రం రెండు రకాల దోషాలను చెబుతుంది. చెయ్యవలసిన పనిని చేయక పోయినా దోషమే. చేయకూడని పనిని చేసినా కూడా దోషమే. (ఈ విషయం ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే వారు చెబుతుంటారు. ఒక అధికారిపై దోషాన్ని ఆపాదించాలని అనుకుంటే ఎలాగైనా చేయవచ్చట. కార్యాలయానికి,నిర్ణీతసమయం కంటే ముందు వెళ్లినా దోషమే. అలాగే, నిర్ణీత సమయం తర్వాత కార్యాలయంలో కూర్చున్నా దోషమేయట, అతడి పైన చర్య తీసుకొనవచ్చట).
అందుకని, మనం కూడా, ధర్మశాస్త్రం మనకు నిర్దేశించిన ధర్మాలను వదిలించుకోకూడదు. అవి ఎంత కష్టమైనా, ఇష్టంగా నిర్వర్తించాలి. బ్రహ్మచారులూ, గృహస్థులు, సన్న్యాసులు, వీళ్లందరూ యుగ ధర్మాలను సక్రమంగా పాటిస్తూ, సమ సమాజ నిర్మాణానికి యథాశక్తి తోడ్పడాలి.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
08-5-2017, సోమవారం,
PBEL City, Hyderabad.తే.గీ.
క్షాత్ర ధర్మము యుద్ధమ్ము గనుక పార్థ!
చేయకున్న స్వధర్మమ్ము చెడుటె గాక
పాప వర్తన గానది పరిణమించి
కీర్తి నశియించి నీ కపకీర్తి గలుగు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
157. శ్లో|| అప్రాప్తకాలవచనం బృహస్పతి రపి బ్రువన్
ప్రాప్నుయాత్ బుద్ద్యవజ్ఙానం అపమానంచ శాశ్వతమ్
--హితోపదేశం 2-63.
సమయ సందర్భాలు లేకుండా మాట్లాడితే, బృహస్పతి లాంటి వాడైనా నిరాదరణకు లోనై, శాశ్వతమైన అవమానాన్ని పొందుతాడు.
'ఛీత్కార కారి గర్దభకథా" (ఓండ్ర పెట్టిన గాడిద కథ), 'హితోపదేశం'లోనిది. ఇందులో ఉంటుంది పై శ్లోకం. ఈ కథను కరటకుడు, దమనకుడికి చెబుతాడు. అందరికి ఈ కథ తెలిసే ఉంటుంది. అందువలన, నారాయణ కవి చెప్పిన కథను ప్రక్కకు పెట్టి, పై శ్లోక భావాన్ని ఈ కాలానికి అనుగుణంగా, ఉపయోగపడే విధంగా చెప్పుకుందాం.
ఒక వ్యక్తి యొక్క స్థాయి ఏమిటో? ఎటువంటివాడో! అతడు మాట్లాడే విధానాన్ని బట్టి అంచనా వేయవచ్చు. అంతెందుకు? ఎవరైనా అదేపనిగా ఆగకుండా మాట్లాడితే వదరుబోతని, అసలు మాట్లాడకుండా గమ్మున ఉంటే, వాడు ఒట్టి ముంగి లేదా ముసంగి అంటుంటాము. బుద్ధిమంతులు తక్కువ మాట్లాడుతారని, మూర్ఖులు అధిక ప్రసంగులని, మీ యొక్క అనుభవంలో గమనించే ఉంటారు. ముఖ్యంగా, మనం మాట్లాడే మాటల వల్ల ఇతరులకైన, మనకైనా ఉపయోగం కలిగే విధంగా ఉండాలి.
మన అనునయ మాటల వల్ల, ఎదుటి వారిలో బాధ తగ్గాలి. పిచ్చి పిచ్చిగా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే, బాధ పడుతారు. అందుకని, చక్కటి ఉత్సాహం కలిగించే మాటలతో ఎదుటి వారిలో శక్తిని పెంచాలి. మాటలు మనుష్యుల్ని ఎలా మార్చి వేస్తాయో! రామాయణ, భారతాలు చదివిన అందరికీ తెలుస్తుంది. శ్రీకృష్ణుడు తన మాటలతో అర్జునుడిని విషాదంలోంచి ఉత్సాహంలోకి దింపి, యుద్ధోన్ముఖుణ్ణి చేస్తాడు. తన సారథ్యంతో, క్రుంగదీసే మాటలతో, కర్ణుడి ఉత్సాహాన్ని నీరుగార్చి, అతడి చావుకు కారణమౌతాడు శల్యుడు.
తాత్కాలిక ఉద్రేకంతో అనరాని మాటలంటే, పర్యవసానం ఏమౌతుందో, 'మాయ- బంగారు జింక' కథ తెలుపుతుంది. 'హా సీతా, హా లక్ష్మణా' అని, సీత గొంతుకతో మారీచుడు అరుస్తాడు. అది రాక్షస మాయని తెలిసిన లక్ష్మణుడు కదలకుండా, అన్న ఆజ్ఞ మేరకు సీతమ్మకు కాపలా ఉంటాడు. దానికి ఆమె, "నీలో ఏదో దురుద్దేశం ఉంది, నన్ను లొందీసుకోవాలనేది నీ ఉద్దేశం!" అని, నానా నిష్ఠూరాలు మోపుతుంది. చివరకు లక్ష్మణుడు వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సీతమ్మ మాటలు ఆమెను లంకలో పడవేశాయి.
అందుకని, సంయమనంతో మాట్లాడి ఎవరి స్థాయి వారు నెలబెట్టుకోవాలి. ఎవరితో, ఎక్కడ, సందర్భమేమిటి, ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చక్కగా మాట్లాడాలి. ఎదుటివారిని అనవసరంగా కించపరిచేటట్టు మాట్లాడకూడదు. ఇది తెలిసిన వారు ఎంత అవసరమో అంతవఱకే మాట్లాడుతారు. అనవసరంగా మాట్లాడి, ఒకరిని బాధపెట్టి, తాము అవమానం చెందరు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
06-05-2017, శనివారం,
PBEL City, Hyderabad.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభోదయం. గురువుగారికి నమస్సులు.
సీసం.
రణము చేయగజాల రాజ్యమ్ము వలదన్న
అర్జున నిర్వేద మడచ గీత
సవ్యసాచిని గెల్వ సాధ్యమే నీకన్న
శల్యుహేళన కర్ణు శక్తి తుడిచె
కలతతో మఱదిని కష్టపెట్టిన సీత
పరుషవాక్కు దనుజు పురము జేర్చె
చెలగి చక్రిని దిట్టు శిశుపాలు వక్త్రమ్ము
తొలగి రాజసభను తుళ్ళి పడియె
తే.గీ.
అదను చూడక సందర్భమదియు లేక
పలుక దేవగురునికైన కలుగు జగతి
శాశ్వత నిరాదరణ మరి సమయు ఖ్యాతి
అందువలన మాట యదుపు అవసరమ్ము.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
154. శ్లో|| అన్యోన్యస్యావ్యభిచారో భవేదామరణింతికః
ఏష ధర్మ స్సమాసేన, జ్ఙేయః స్త్రీపుంసయోః పరః
--మనుస్మృతి 9-101.
జీవితమున్నంత వఱకు భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యంగా కలసిమెలసి ఉండాలి. దంపతులు ఇలా ఉండడం కంటే గొప్ప ధర్మం ఇంకొకటి ఉండదు.
భారతదేశంలోని ప్రతి హిందువు వివాహ సమయంలో "ధర్మేత్వయా, అర్థేత్వయా, కామేత్వయా, నాతి చరితవ్య" అని కన్యాదాత అంటే, "నాతిచరామి" అని అగ్ని సాక్షిగా వరుడు ప్రమాణం చేస్తాడు. ఇది పెళ్లినాటి ప్రమాణాలలో అతి ముఖ్యమైన మంత్రం. అనగా, ధర్మం, సంపాదన, సంసారం, ఇలా అన్నింటిలో తాను తన భార్యకు తోడు, నీడగా ఉంటానని, ఈమెను అతిక్రమించి నడవనని, ఈమెతోనే కలసి నడుస్తానని, ఎల్లప్పుడూ అన్ని విధాలా సహకరిస్తానని అర్థం. ఇది అవగాహన చేసుకుంటే ఎప్పుడూ, ఏలాంటి అనర్థాలు జరగవు.
అయితే, అన్ని మంత్రాల మాదిరే, పైన చెప్పిన మంత్రార్థం కూడా ఒక తంతు మాత్రంగా, పురోహితుడు చెబితే, ప్రతి వరుడు 'మమ' అని మొక్కుబడిగా చెప్పేసి ప్రక్కన పడేస్తున్నాడు. అయితే, నిజ జీవితంలో, పెళ్లిలో చెప్పిన మంత్రానికి కట్టుబడి కాపురం చేయగలిగిన వాడే నిజమైన భర్త అవుతాడు. అప్పుడే మన వివాహ వ్యవస్థకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల వాళ్లు, మన దేశ వివాహ వ్యవస్థను, సంసారపు కట్టుబాట్లను వేనోళ్ల పొగడుతున్నారు.
పెళ్ళిలో వేసే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యభర్తల మధ్య అన్యోన్యత కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పరం అభిప్రాయాలను, అభిరుచులను గౌరవిస్తూ, పంచుకుంటూ ఉండాలని అందరూ ఆకాంక్షిస్తారు. ఉభయులూ అన్యోన్యతగా, ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉంటారని విశ్వసిస్తారు. పెళ్లైన కొత్తలో మాత్రమే ఇవన్నీ ఉంటాయని, పోనుపోను ఈ ముచ్చట్లన్నీ, కనుమరుగవుతుంటాయని కూడా కొందరు వాపోతుంటారు.
పిల్లలు, చదువులు, పెళ్లిళ్ల బాధ్యతలు, కావలసిన అవసరాలు ఇలా సంసారం పెరిగే కొద్దీ భార్యభర్తల మధ్య అన్యోన్యతలో కాస్త దూరం పెరిగే మాట మాత్రం వాస్తవం. ఈ కాలంలో రకరకాల పనుల ఒత్తిడి కారణంగా, భార్యాభర్తలు ఒంటరిగా గడపడానికి సమయం దొరకక, ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఏర్పడుతున్నాయి. అందువలన, ఎటువంటి అవసరాలు వచ్చినా, ఎన్ని పనులతో సతమవుతున్నా, ఆలుమగల మధ్య ప్రేమానురాగాలకు కొరత రాకుండా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
కుటుంబం బాగుండాలంటే, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకోవాలి. వారి మధ్య దృఢమైన బంధానికి తోడ్పడేది కేవలం నమ్మకం, ప్రేమ, స్నేహం. వారిద్దరి అనుబంధం బాగుండాలంటే, ప్రతి విషయాన్ని ప్రేమతో చర్చించుకోవాలి. పెద్దవారు, శ్రేయోభిలాషుల నుండి కావల్సిన సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆచరణలో పెడుతూ ఉండాలి. అప్పుడు, ఎంతటి భయంకర సమస్యలు ఎదురైనా, దంపతుల మధ్య ప్రేమ తగ్గిపోకుండా శాశ్వతమవుతుంది, ధర్మాన్ని కాపాడిన వాళ్లవుతారు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
03-05-2017,
PBEL City, Hyderabad.
సుశ్లోక వేదికి శుభ మధ్యాహ్నం. గురువుగారికి నమస్సులు.
సీసం.
కూతునిత్తును నీకు కూడి నడువుమయ్య
.....ధర్మార్థకామాల దాటిపోక
అనుచు కన్యాదాత అడిగినంత వరుడు
.......నాతి చరామి యన్ నీతి కేను
కట్టుబడుదునంచు నొట్టుపెట్టి పలుకు
.......మాట నిలుపుకున్న మమత పెరిగి
నమ్మకమును ప్రేమ వమ్ముకాని చెలిమి
......వెలిగి సుఖము శాంతి వెల్లి విరియు
తే.గీ.
నిత్య మన్యోన్య దాంపత్య నియతులగుచు
కడవరకు నాలు మగలట్లు కలసి యున్న
అదియె గొప్ప ధర్మమ్మిల నార్యులార!
దీని మించిన ధర్మమ్ము లేనె లేదు.
సింహాద్రి జ్యోతిర్మయి
25.9.2017.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
149. శ్లో|| అక్షౌహిణీభిః ద్వాదశభిః సమేతాః సర్వతోదిశమ్
రురుధుః బాణనగరం సమంతాత్సాత్వతర్షభాః
--భాగవతం 10-63-4.
యాదవశ్రేష్టులైన బలరామకృష్ణుల నాయకత్వంలో సాత్యకి, సాంబుడు మొదలైన యాదవ వీరులతో కూడిన పన్నెండు అక్షౌహిణీల సైన్యం, బాణుడి రాజధానిని అన్ని దిక్కులా లోపల, బయట ముట్టడించారు.
చిత్రలేఖ గీసిన చిత్రాన్ని చూసి, అలా సిగ్గుతో తలదించుకున్న ఉషను తమాషాగా ఏడిపించి, ఆ తర్వాత ధైర్యం చెప్పి, మహిమలు తెలిసిన చిత్రలేఖ, ఆకాశమార్గంలో ద్వారకా నగరానికి వెళ్లి, గాఢ నిద్రలో ఉన్న శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడిని గుర్తించి, ఉష మందిరానికి తీసుకవచ్చింది. మగవాళ్లకు ప్రవేశం లేని అంతఃపురంలో, అమూల్యమైన బహుమతులతో, పిండివంటలతో, సరసోక్తులతో, ఉష అనిరుద్ధుడిని సేవించి, ఆనందించింది. అలా వర్షాకాలం నాలుగు నెలలు హాయిగా గడిచిపోయాయి.
అంతఃపరంలో పని చేసే చెలికత్తెల ద్వారా, రహస్యం భటులకు చేరింది. విషయాన్ని రూఢి చేసుకొని, ఉషాదేవి శరీరంలో వచ్చిన మార్పుల సంగతి, తమ ఏలిక బాణాసురుడికి విన్నవించారు. అంత కట్టుదిట్టంలో కూడా తన కూతురికి చెడునడత ఎలా సాధ్యమయిందో అర్థం కాని బాణుడు, ఆలస్యం చేయకుండా హుటాహుటిగ అంతఃపురానికి వెళ్లి, నింపాదిగా పట్టు పుట్టములతో కూర్చొని, తన కూతురితో పాచికలాడుతున్న మన్మథుడి పుత్రుడైన అనిరుద్ధుడిని చూసి ఆశ్చర్యపోయాడు.
బాణుడి కను సైగతో అనిరుద్ధుడిని చుట్టు ముట్టారు సైనికులు. చుట్టూ ఆయుధాలు పట్టుకొని నిల్చున్న సైనికులను చూసి, ప్రక్కనే ఉన్న ఇనుప పరిఘతో విజృంభించగా, తలలు పగలి, చేతులు విరగగా అంతఃపురం నుండి బయటకు పరుగెత్తింది సైన్యం. ఆలస్యం చేయకుండా, బలశాలియైన బాణాసురుడు నాగ పాశాలతో అనిరుద్ధుణ్ణి బంధించాడు. ఇదిలా ఉండగా, ద్వారకలో నాలుగు నెలల నుండి అనిరుద్ధుడు కనిపించక, ఏమయ్యాడో తెలియక బంధువులంతా బాదల్లో ఉన్న తరుణంలో....
ఒక రోజు నారదుడు వచ్చి అనిరుద్ధుడిని, బాణాసురుడు బంధించిన విషయాన్ని తెలియజేస్తాడు. వెంటనే యాదవశ్రేష్టులు, యాదవ వీరులను వెంట తీసుకొని అందరూ శోణితపురాన్ని అన్ని దిక్కులా ముట్టడించి, కోట గోడలను కూల్చివేసి, లోపలి ఉద్యాన వనాలు, కోట బురుజులు, ఎత్తైన కట్టడాలను కూల్చివేస్తుండగా, నగర సంరక్షకుడు శివుడు, ప్రమథ గణాలతో యుద్ధ రంగంలోకి ప్రవేశించి, బాణుడికి బాసటగా నిలుస్తాడు. మూడవ భాగంలో ఏమి జరుగుతుందో రేపు చూద్దాం.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
28-4-2017,
PBEL City, Hyderabad.
సీసం.
చిత్తరువును గాంచి సిగ్గుతో ఉషయుండ
మనసు తెలిసి తన మహిమతోడ
చిత్రలేఖ గగనసీమ యానము జేసి
ద్వారకాపురి జేరి వాని గాంచి
నిదురించు యనిరుద్ధు నిమిషాన గొనివచ్చి
అప్పగించె చెలికి అబ్బురముగ
వనిత వలపునెంచి ఘన సేవలకు పొంగి
అనిరుద్ధుడచటనే మనగజొచ్చె.
తే.గీ.
వార్షుకమ్ము నాల్గు నెలలు వచ్చిపోయె
పురములోన రహస్యమ్ము పొక్కిపోయె
తెలియవచ్చిన బాణుడు తెల్లబోయె
తనయ మందిరమున కప్డు తానుబోయె.
సీసం.
పట్టు పుట్టముకట్టి పాచికలాడుతూ
బాల చెంతనె యున్న వానిజూచి
పట్టరాని కినుకన్ పట్టుడీతనియని
భటుల కాజ్ఞ నొసగ,పరిఘ గొనుచున్
అనిరుద్ధు డెదిరించి అతని సైన్యమ్ములన్
చెలగి యుద్ధముజేసి చెండి వేయ
నవయు బలముగాంచి నాగపాశములతో
బంధించె ననిరుద్ధు బాణుడపుడు
తే.గీ.
ద్వారక ననిరుద్ధు కొరకు వగచు వేళ
నారదుండొచ్చి వివరించె నతనిజాడ
కృష్ణబలరాము డాదిగా వృష్ణులపుడు
ముట్టడించిరి బాణుని పట్టణమును.
సశేషం.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభోదయం. గురువుగారికి నమస్సులు.
ఉషా పరిణయ గాథను గురువుగారి వ్యాఖ్యానం ఆధారంగా నాకు చేతనైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
సీసం.
శోణిత పురమేలు బాణాసురు డతడు
బలి చక్రవర్తికిన్ ప్రథమ సుతుడు
పరమభక్తు డగుచు పరమేశు మెప్పింప
వేయి చేతులతోడ వేడ్క మీర
భవు తాండవమునకున్ వాద్యాలు మోగించి
పురము రక్షకునిగా హరునిబడసె
సరిలేరు నాతోటి సమరాన నిలువంగ
పోరు నీ సమునితో కోరెదనన
తే.గీ.
ఆ అతిశయమ్మునకు శివుడాగ్రహించి
మూఢ!ఏనాడు నీ ధ్వజమ్మూడి పడునొ
నాడె యెదిరించు నా వంటి వాడు నిన్ను
అంతరించును నీగర్వ మప్పుడనెను.
సీసం.
బాణుని సుత ఉష బహుచక్కని యువతి
కలనుగాంచి వలచె కంతు సముని
చెలి చిత్రలేఖకున్ చెప్పి తన మనసు
వర్ణించి తెలిపింది వరుని రూపు
మదికి నచ్చినవాని నెదుట నిల్పెదనంటు
చిత్రలేఖ చెలికి చేసె బాస
సిద్ధ సాధ్యాదుల చిత్రాలు గీయగా
కానరాడందులో కలికి సఖుడు
హరి ఓమ్ 🙏
శుభోదయం.
148. శ్లో|| అనిరుద్ధం విలిఖితం వీక్ష్యోషావాజ్ఞ్ముఖీ హ్రియా
సోసావసావితి ప్రాహ స్మయమానా మహీపతే
--భాగవతం 10-62-21.
అనిరుద్ధుని చిత్రపటమును చూచిన ఉష, సిగ్గుతో తల దించుకొని, చిరునవ్వుతో, "అతడు, ఇతడే, ఇతడే అని చెప్పింది.
గత రెండు, మూడు రోజుల నుండి వేదాంత బోధలతో నిమగ్నమైన మన 'సుశ్లోక వేదిక' పాఠకులకు, ఈరోజు భాగవతంలోని ఒక కథను, చాలా మందికి తెలిసిన కథయైనా, తెలియని కొంత మందికి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు. విరోచనుడి కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి పెద్ద కొడుకు బాణాసురుడు. "బాణః శివభక్తిరతః సదా" ఎప్పుడూ శివ భక్తిలో లీనమై, శివుడినే ధ్యానిస్తూ ఉంటాడు బాణాసురుడు.
శివుడు తాండవం చేస్తుంటే, వేయి చేతులతో ఆగకుండా లయబద్ధంగా వాద్యాలు వాయించి, శివుడిని మెప్పించగా, ప్రీతి చెందిన శివుడు, "ఏదైనా వరం కోరుకో" అన్నాడు. తన శోణితపురానికి రక్షకుడిగా ఉండమని కోరాడు బాణుడు. దానికి శివుడు అంగీకరించాడు. కొంత కాలం తర్వాత బాణాసురుడు శివుని దర్శనానికి వెళ్లి, అత్యంత భక్తితో, తన కిరీటం శివుడి పాదాలకు తగిలేలా సాష్టాంగ నమస్కారం చేస్తూ...
"శంకరా, నువు సకల లోకాలకు తండ్రివి, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షానివి. నువ్వు, నాకిచ్చిన వేయి చేతులు, అలంకారప్రారంగా మాత్రమే ఉన్నాయి, కేవలం, బరువును మోస్తున్నట్టుగా ఉంది. ముల్లోకాలలో నాతో సమానమైన యుద్ధ వీరుడు, నిన్ను మినహాయిస్తే, ఎవ్వరూ లేరు. యుద్ధం చేయాలనే దురదతో, ఈ చేతులతో కొండలను పిండి చేశాను. పర్వతాలను చూర్ణం చేశాను. అష్టదిగ్గజాలను యుద్ధానికి పిలిస్తే, అవి నన్ను చూసి పారిపోయాయి" అని కించిత్ గర్వాన్ని ఒలికించాడు.
బాణాసురుడి తలబిరుసు మాటలు విన్న శివుడు కోపంతో, "మూర్ఖుడా! ఏనాడైతే నీ జెండా విరిగి పడుతుందో, ఆనాడు నాతో సమానమైన వాడితో యుద్ధం చేస్తావు. దాంతో, నీ గర్వం పూర్తిగా అణిగిపోతుంది" అన్నాడు. శివుడి మాటలు తలకెక్కలేదు కానీ, శివుడితో సమానమైన వీరుడితో, యుద్ధం ఎప్పుడు చేస్తానా అని ఉబలాట పడ్డాడు. బాణాసురుడి కూతురు ఉష. ఆమె, తనకు కలలో కనిపించిన ప్రియుడికై పరితపిస్తుంది. మంత్రి కూతురు చిత్రలేఖకు తన కలల రాకుమారుడిని వర్ణించింది.
"నీ మనసును దోచినవాడు ముల్లోకాల్లో ఎక్కడున్నా, నా మహిమతో తీసుకవచ్చి నీతో కలుపుతాను" అంది ఇష్టసఖి చిత్రలేఖ. ఆలస్యం చేయకుండా, వెంటనే తనకు తెలిసిన అందమైన యువకుల చిత్రాలను గీసి చూపించింది. అయితే, ఆమె గీసిన గంధర్వ, సిద్ధ, సాధ్య, చారణ, పన్నగ, దైత్య యక్షుల చిత్రాలలో ఉష కలల వీరుడు కనిపించలేదు. అప్పుడు, చిత్రలేఖ అందమైన మానవ యువకుల చిత్రాలు గీస్తూ, యాదవకుల భూషణుడు, శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి చిత్రం గీసింది.
ఆత్రంగా చూస్తున్న ఉష, "సోసావసావితి ప్రాహ స్మయమానా, అంటే తల దించుకొని సిగ్గుపడుతూ మందహాసంతో, అవును ఇతడే, అతను ఇతడే" అని తెగ మురిసి పోయింది. తరువాతి కథా భాగము కొఱకు దయచేసి రేపటి వఱకు వేచియుండమని మన సుశ్లోక వేదిక పాఠకులను వేడుకుంటున్నాను.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
27-4-2017,
PBEL City, Hyderabad.
ఆ.వె.అపుడు గీసెనామె అనిరుద్ధు చిత్రమ్ము
కృష్ణు మనుమడతడు కీర్తిరతుడు
కనినయంత కాంత యనెను సంభ్రమాన
ఇతడితండె నాదు ఇష్ట సఖుడు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
146. శ్లో|| అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
వినాశమవ్యయస్యాస్య న కశ్చత్కర్తుమర్హతి.
--భగవద్గీత 2-17.
ఈ సకల లోకాలు నిండి ఉండడానికి కారణం ఎవరో (పరమాత్మ), అతడు నాశనము లేనివాడు. అలాగే, ఎప్పుడూ చైతన్య రూపంలో ఉండే ఆత్మకు కూడా వినాశనం లేదు.
మనం చూస్తున్న ప్రతిదీ ఏనాటికైనా నాశనం కావలసిందే. అయితే, మన శరీరం లాగా, కొన్ని మార్పులు చెందుతూ ఉంటాయి. అలా నాశనం చెందే అన్నింటినీ కలిపి, 'అసత్' అంటారు. ఎప్పటికీ నాశనం కానిది, 'సత్' పదార్థం. ఆ 'సత్' పదార్థమే పరమాత్మ, ఆత్మ. ఉదాహరణకు, మట్టితో చేసిన ప్రతి వస్తువు 'అసత్', మట్టి 'సత్'. అలాగే, అగ్నితో చేసిన పదార్థం 'అసత్', అగ్ని 'సత్'.
ఇప్పుడు, శ్లోక వివరణలోకి వెళదాం. ఇంకా బాగా అర్థమవుతుంది. 'సత్' పదార్థం, ఈ అనంత విశ్వాన్ని, చైతన్య రూపంలో వ్యాపించి ఉంది. దానినే విశ్వ చైతన్యం లేక విష్ణుః అంటాము. 'వ్యాప్తతీతి విష్ణుః' అంతా వ్యాపించిన వాడు అని అర్థం. విష్ణు సహస్రనామ స్తోత్రం లోని ప్రతి పదాన్ని ఇలా చక్కగా అర్థం చేసుకుంటూ పోవాలి.
అలా, విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ చైతన్యం, పరిమితమై, ఆత్మ రూపంలో ప్రతి జీవిలో ఉంటుంది. జీవి మరణించినప్పుడు, 'అసత్' అయిన శరీరాన్ని విడిచిపెట్టి, 'సత్' అయిన పరమాత్మలో కలిసిపోతుంది. అంటే, ఎందులోంచి, ఆత్మ వచ్చిందో! అందులోనే కలిసిపోతుంది. అంటే ఆత్మ, పరమాత్మలో లీనమవుతుంది. దీనినే మోక్షము అంటాం. అంతటా వ్యాపించిన చైతన్యాన్ని ఎవరూ నాశనం చేయలేరు.
మనం కుండను పగలగొట్టవచ్చు. కానీ, దానిని తయారుచేసిన మట్టిని పగలగొట్టలేము. అలాగే, శరీరం నాశనం అవుతుంది కానీ, శరీరం లోని చైతన్యం, నాశనం కాదు, అదే ఆత్మ. ఇది తెలుసుకోవడమే జ్ఙానం. పరమాత్మ అంటే, అఖండ చైతన్యం. దీనికి ఆకారం లేదు, నిరాకారం. పరిమితి లేదు అపరిమితం. దీనినే వ్యాస భగవానుడు 'అవినాశి తు తత్ విద్ది' అంటే, నాశనము లేనిది ఏదో, దానిని తెలుసుకొమ్మని అంటారు.
దానిని, ఇంకా బాగా, లోతుగా, ప్రమాణ సహితంగా తెలుసుకోవాలంటే, మంచి గురువు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి, వేదాంతంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థ చేసుకుని, చక్కగా విశదపఱిచే గురువు కోసం అన్వేషిద్ధాం. ఇది కొంచెం లోతైన విషయం. నేను విన్నంత వఱకు, నాకు తెలిసినంత వఱకు చెప్పడానికి ప్రయత్నించాను. తప్పులుంటే, విజ్ఙులు సరిదిద్దగలరు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
25-4-2016,
PBEL City, Hyderabad.
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. గురువుగారికి నమస్సులు.
కొంత పని ఒత్తిడిలో ఉండి నాల్గు రోజులుగా ఇటు దృష్టి పెట్టలేకపోయాను.
ఇదిగో ఇది గురువుగారి శ్లోకానికి నా పద్యానువాదం.
సీసం.
రూపు మారినగాని రూపు మాయదు కదా!
మూల పదార్థమ్ము కాలమందు
తనువు వీడినగాని తాను నిల్చునుకదా!
చావులేకయె యాత్మ జీవులందు
విశ్వమే విష్ణువు విమల సత్యమిదియె
చైతన్య మాతడే జగతియందు
పరమాత్మలో యాత్మ పార్థ!చేరుటదియె
పరగ మోక్షమ్మగు ప్రాణులందు
తే.గీ.
సకల భువనాలు నిండిన స్వామి యెవరొ
అతడె నాశము నెరుగని అచ్యుతుండు
అటులె చైతన్య రూపమై అలరుచుండు
ఆత్మ సైతము నాశనమ్మవదు సుమ్ము.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
145. శ్లో|| అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యమ్
పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః
--ఆదిశంకరుల భజగోవిందం.
ధనమెప్పుడూ అనర్థాన్ని కలిగిస్తుందని ఎప్పుడూ భావిస్తూ ఉండు. ధనంలో సుఖం కొంచెం కూడా లేదన్నది నిజం. ధనవంతుడికి, కన్న కొడుకు నుండి కూడా భయం కలుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి లోకమంతా ఒకే విధంగా ఉంటుంది.
"ఆహార నిద్రా భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం" ఇది అందరికీ తెలుసిన శ్లోకం. భగవంతుని సృష్టిలో మనతో పాటు పశు పక్ష్యాదులు కూడా జీవిస్తున్నాయి. జంతువుల ఆహార నిద్రాదులు, ఒక క్రమశిక్షణ, నియమంతో కూడి ఉంటాయి. ఆకలేస్తే తింటాయి, తర్వాత ప్రశాంతంగా ఉంటాయి. అలా జంతువులు వీలైనంత వఱకు ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తాయి.
బుద్ధిగల మానవుడే అన్నిటికీ వ్యతిరేకంగా కనిపిస్తాడు. ఇతనికి సంతృప్తి అనేదే లేదు. ఎప్పుడూ అరిషడ్వర్గాలకు దాసుడై ఉంటాడు. కోపం, స్వార్థం వల్ల జంతువు కన్నా హీనంగా, క్రూరంగా ప్రవర్తిస్తాడు. మోసంతో, కపటంతో ఎన్నో అడ్డదారులు త్రొక్కి సంపాదించిన సంపదనే, చివరికి కష్టాలు తెచ్చిపెడుతుంది. బంధుమిత్రుల వల్ల చివరకు సొంత బిడ్డల వల్ల కూడా అపాయం జరిగే అవకాశముంది.
ఈ ప్రపంచంలో మానవుడి జీవిత కాలమే స్వల్పం. తిని, ఉండడానికి తగినంత ధనం సంపాదించి తృప్తి పడక, తన తర్వాత తరాల వాళ్లు కూడా నిశ్చింతగా జీవించడానికి సంపాదించి పోస్తున్నాడు. సంపాదించిన దానిని దాచుకొనేందుకు, అలా దాచుకున్న డబ్బు వల్ల, ప్రాణ, మానాలను కాపాడుకోడానికి, నానా అవస్థలు పడుతున్నారు. డబ్బు ఎక్కువగా ఉన్నందువల్ల కలిగే పర్యవసానాన్ని గుర్తించలేకపోతున్నారు. మితి మీరిన ధనం అశాంతిని కలుగజేస్తుంది. సక్రమ మార్గాల్లో వందల కోట్లు సంపాదించడం కష్టం. అదంతా అక్రమార్జనే. ఈ అక్రమార్జన వల్ల ముప్పు తప్పదు.
సుఖ జీవనానికి ధనం అవసరమే. అయితే, ధనంలో సుఖం కంటే దుఃఖమే అధికం. అందుకనే, 'నాస్తితతః సుఖలేశః సత్యం' ధనంలో కొంచెం కూడా సుఖం లేదంటారు ఆది శంకరులు. అంత ధనాన్ని సంపాదించి, ఎవరికీ ఇవ్వక, దాచుకుంటాడు. దానిని లోకం విడిచి పోయేటప్పుడు, వెంట ఏమైనా తీసుకొని పోగలడా?. నా బిడ్డలు, నా వాళ్ళంటూ పరితపిస్తాడు. ధనాన్ని, నీ వాళ్లకు పెట్టే వఱకే నీకు మర్యాద. పెట్టక పోతే ఎవ్వరూ పట్టించుకోరు, నలుగురిలో అపహాస్యం పాలౌతావు.
కాబట్టి, మితిమీరిన ధన సంపాదన చింతన మాని, ఉన్న సమయాన్ని దైవ చింతనకై ఉపయోగించి, జీవితాన్ని సఫలం చేసుకుందాం. ప్రపంచంలో మనకు తెలియని అనేక విషయాలలో అతి ముఖ్యమైనది ఆధ్యాత్మిక జ్ఙానం. ఈ జ్ఙానం కోసం, సద్గురువును ఆశ్రయించి, భక్తితో సేవించి, వారి కృపతో అజ్ఞానం పోగొట్టుకొని, మనస్సుపై జయం సంపాదించి, ఈ జన్మలోనైనా, ఆత్మసాక్షాత్కారం పొందడానికి ప్రయత్నిద్ధాం.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
24-4-2017,
PBEL City, Hyderabad.
సీసం.
కూడు గూడు వలువ కూడిన చాలదా!
కోట్ల సంపద ఎన్నొ పాట్లు తెచ్చు
ధర్మకార్యములకు ధనమివ్వరాదొకో!
అది పుణ్యముగ మారి యశము తెచ్చు
ఆకలి గొనువారి కాతిథ్య మిడరాదొ!
తిన్నవారి తనివి నిన్ను మెచ్చు
తరతరమ్ముల కివ్వ తపన నీకేలనో!
దాచు ముల్లెను దొంగ దోచవచ్చు
తే.గీ.
పాతరేయు ధన మనర్థ హేతువనుచు
లేశమైనను సుఖమందు లేదననుచు
తనయులైన శత్రులగుట తప్పదనుచు
ఊహజేసి వీడుము ధన మోహమింక.
89.
శ్రీ వేములవాడ భీమకవి అనే పేరు తెలియని వారుండరు. భీమకవి చాటుపద్యాలకు పెట్టింది పేరు. ఈ రోజు ఆయన వ్రాసిన ఒక చాటు పద్యం గుఱించి తెలుసుకుందాం. భీమకవి 11వ శతాబ్దికి సంబంధించిన వాడని, నన్నయ సమకాలికుడని ప్రచారంలో వుంది. ఆయన ఎప్పటి వాడైనా, తిట్టు కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
చెవులకింపుగా, బాధలన్నీ మరపించేలా, అద్భుతమైన కవిత్వం చెబుతానని, మంచిని, మంచిగా, చెడును దునిమాడేలా, కలతలన్నీ దూరం అయ్యేలా, తిమ్మిని బమ్మిని చేసేలా కవిత్వం చెప్పగల శక్తి కలదని చెప్పుకున్నాడు భీమకవి.
వాగ్బాణాలతో, వాక్చాతుర్యంతో, తన అమోఘమైన వాక్కులతో ఆశ్రితులకు, ఆశీర్వచనాలను ఇచ్చి, ఆయనను ఎవరైనా, ఏమైనా అంటే నయానో భయానో నచ్చచెప్పక, తిట్ల దండకాలతో ఎదురు తిరిగి, ఎలుగెత్తి ఎగిరిపడే యువ కవిగా, శాపానుగ్రహ సమర్థుడిగా పేరు గడించాడు. తాను "నానా కావ్య ధురంధరుడను" అని చెప్పుకున్నా, భీమకవి రచనలు ఏవీ లభించడంలేదు.
ఆయన చోడగంగుడు అనే రాజుగారిని పొగడవలసి వచ్చింది. అయితే, గతంలో ఏ రాజును పొగడని విధంగా పొగిడి, ఆ రాజు మన్ననల్ని పొందాలని, దానికోసం తోమ్మిది మంది మహామహుల అవలక్షణాలను బయట పెట్టి, మనల్నందరిని నమ్మించిన మహాకవి. చూడండి, ఆయన ఎత్తిచూపిన తప్పుల చిట్టా.
ఉ.భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వపూ
రాజు కళంకు, దైవత ధరాజము డొంకు, పయోధి ఇంకునా
భోజభవుండు పంకు, ఫణిభూషణ దేవుడు సంకు, పద్మినీ
రాజ హితుండు గ్రుంకు, సరిరారు గుణంబుల నీకు ధారుణిన్
మంకు, బొంకు, రంకు, కళంకు, డొంకు, యింకు, పంకు, సంకు, గ్రుంకు అనే రకరకాల అర్థాలను ఇచ్చే పద ప్రాసలను వాడి, ఒకే పద్యంలో తోమ్మిది మంది ఐతిహాసికుల చరిత్రలను స్ఫురింపజేసే పద్యాన్ని చెప్పిన ఘనత వేములవాడ భీమకవికే చెందింది.
పరాక్రమవంతుడైన భోజరాజు మొండి, పట్టుదల కలవాడు. నీకు పట్టు, విడుపులు వున్నాయి. కాబట్టి, ఆయన్ని నీతో పోల్చలేము. ఇక ధర్మరాజు, కురుక్షేత్ర సంగ్రామంలో “అశ్వత్థామ హతః కుంజరః” అని అసత్యమాడి, ధర్మాన్ని తప్పాడు కాబట్టి, ధర్మరాజును కూడా నీతో పోల్చలేం. శచీపతి ఇంద్రుడు, మహాసాధ్వియైన అహల్యకు అన్యాయం చేసిన జారుడు. నీకు సరితూగడు.
కలువల రాజు చంద్రుడిలో కళంకము (మచ్చ) వుంది కాబట్టి, అందంలో నీకు సాటిరాడు. కారణం, నీలో ఎటువంటి మచ్చా లేదు. కల్పవృక్షమంతా ఒక డొంక. అక్కడికి వెళ్లడమే కష్టం. సముద్రపు నీటికి ఇంకిపోయే గుణం వుంది. దానివల్ల, గంభీరత కోల్పోయింది. కాబట్టి సముద్రుడి కంటే నువ్వే గొప్ప.
బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చొని వుంటాడు. అది నీటిలో వుండడం వల్ల, నీరు కదులుతున్నప్పుడంతా దాని తూడూ కదులుతూ వుంటుంది. దానివల్ల ఆయన ఎప్పుడూ వణుకుతూ వుంటాడు. నీకా బాధ లేదు. నువ్వే మేలు. శంకరుడు పాలిపోయినట్లు తెల్లగా వుంటాడు. నువ్వే అందంగా వున్నావు.
అస్తమించునపుడు సూర్యుని తేజము తగ్గిపోతుంది. కాబట్టి, తేజము నందు పోల్చడానికి సూర్యుడు కూడా నీకు సరిరాడు. అలా అన్ని గుణాలలో ఈ భువిపై గాని, దివిపై గాని, ఆకాశంలో గానీ ఎవ్వరూ నీకు సరిరారు. ఏ లోపమూ లేని వాడివి నువ్వొక్కడివే అని చెప్పి, రాజును పొగిడి సంతోషపెట్టాడు.
ఈనాటి విద్యార్థిలోకం, ఇలాంటి పద్యాలు నేర్చుకొని, ఎన్నో రామాయణ, భారత, భాగవత గ్రంథాలలోని విశేషాలను తెలుసుకోవచ్చు. పైగా అందరిలో చెప్పి శభాష్ అనిపించుకోవచ్చు.
చదివినందులకు ధనూయవృదములు 🙏
అంబాళం పార్థసారథి,
12-09-2016.
గురువుగారూ!నా ప్రయత్నం ఎలా ఉందో చెప్పండి.
తే.గీ.
భోజుడొక మంకు,బొంకెను ధర్మజుండు
రంకుజేసె సురపతి,కళంకుడయ్యె
కలువరేడు,డొంకున నుండె కల్ప వృక్ష
మింకు నంబుధి ,ధాతయు పంకు చుండు.
తే.గీ.
సంకు నాగాభరణు డయో!గ్రుంకు రవియు
వంకలు కనరాని ఘనుడ వింక నీవె
శంకయే లేదు నా మాట బొంకు కాదు
చోడగంగ మహారాజ!శుభము నీకు.
సింహాద్రి జ్యోతిర్మయి
12.9.2017
[26/10/2016, 8:24 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం
శ్రీ రామా యనుచును ము
మ్మారా మాధుర్య మొప్పు మహి మాన్ వితమౌ
శ్రీ రమణికి ప్రియ నామము
నోరారా మనన జేయ నూరుపదులగున్.
అంతస్థముల..ర..రెండగు
చెంత ప వర్గపు 'మ ' వచ్చి చేరి నిలువగన్
అంతట రెండైదులు పది
ఇంతను ముమ్మారటు గుణియించిన చాలున్.
ఇంతటి ఆ నామ మహిమ
ఎంతయు ప్రియమున తన సతి కీశుడు తెలిపెన్
చింతన చేయుము సీతా
కాంతుడు కరుణించి బ్రోచి కష్టము తీర్చున్.
[26/10/2016, 8:25 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం..2.
దెయ్యము పట్టిన మాదిరి
కయ్యములాడుచు సతతము కాంతుల యెడలన్
నెయ్యము చూపని సతులకు
గయ్యాళిగ పేరుగల్గు గౌరవముడుగున్.
అలిగిన జీవిత సహచరి
తొలగును సౌఖ్యము మనుగడ దుర్భరమౌగా
తలపక పతులీ సత్యము
కలకంఠిని కష్టపెట్ట కలహము రాదే?
నువ్వెంతన నువ్వెంతని
రువ్వుచు మాటలు ఇరువురు రుసరుస లాడన్
నవ్వుల పాలగు బంధము
చివ్వలు మనసుల కలచును చిన్నారులకున్.
అన్నియు నచ్చుటసాధ్యము
కొన్నిటి భరియించవలెను కూడదు తగవుల్
మన్నించుట గొప్ప గుణము
ఎన్నుడు ఈ మంచిమాట ఇద్దరు ఒకటై.
చివ్వలు...,కలహాలు.
[27/10/2016, 11:28 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం..2.
తేట గీతులు.
రెండాకు లెక్కువ.
1.పూర్వము ఒక గురుకులాన పుణ్యుడైన
గురువు ఒకడు శిష్యుల కును కూర్మి మీర
విద్యలు గరపుచు వసించు విమలమతిని
అతని భార్య గయ్యాళి యై అతని వేచు.
2.కోపమునను తిట్టి పతిని కుండలెత్తి
తలనుమోదు కుడుచు వేళ ,తల్లడిల్లి
శిష్యుడదిగని పెళ్ళిని చీత్కరించె.
3.వినక పెద్దలతని పెళ్లి విధిగ జరుప
అతని భాగ్యము ఆమెయు అపర కాళి
చేయునది ఏమి కలదని చింత పడుతు
సర్దుకొని పోయి దినములు సాగదీసె.
4.అంతలో వినవచ్చెను అతని కడకు
గురువు వచ్చునను వార్త గుబులు రేగ
వెళ్ళి భార్యను ఈ రీతి వేడుకొనెను
పరువు కాపాడవే నాతి గురువు చెంత.
5.కాతునని తప్పు లొక నూరు కాంత పలుక
ఆహ !నా భాగ్యమేమని అతడు తలచి
గురువు అచ్చెరువొందగా
మురిసిపోయి
రెచ్చిపోయెను శిష్యుడు లెక్క మరచి.
6.చింత గింజలు లెక్కించి ఇంతియపుడు
భోజనము వేళకానూరు పూర్తికాగ
ఎత్తి బోర్లించి కుండను నెత్తి మీద
కొత్తదొకటి కొనగ డబ్బు కోరినంత
7.విన్నగురువు తనదుపత్ని ఎన్నడిట్లు
కుండ కొరకు ధనము నన్ను కోరలేదు
పోల్చి చూడను పనిలేదు పుణ్యవతిని
ఎంత మంచిది అనిలోన సంతసించె.
[27/10/2016, 11:32 am] Jyothirmai Simhadri: 2 వ పద్యం నాల్గవ పాదం
మర్చిపోయాను.
మనువు నాకొద్దు గాకంచు మతిని బూనె.
[29/10/2016, 9:40 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం......3
కం. వేదము ,శాస్త్రము, విద్యలు
ఆదిగ ప్రభవించినట్టి అవనీ తలమున్
నాదని కొనియాడక మది
పేదది అని ఈసడించు విముఖత తగునా!
కం. అనెను గదా శ్రీ రాముడు
జననియు నా జన్మభూమి స్వర్గముకన్నన్
ఘనమని ఆ సంస్కారము
మనసున స్మరియించి మొక్కు మన భారతికిన్.
కం. అందము,సంపద,సంస్కృతి
ఉందని పొరుగింటి లోని ఉత్తమ కాంతన్
అందువె మా అమ్మ యనుచు
వందనమిడవచ్చు ఆమెకొద్దిక తోడన్
కం. ఆదరమున విద్యలొసగి
నీదేశము నీకు యెంతొ నేర్పుగరపగా
ఆ దేశము పోయి యెదిగి
వేదజనని భరత మాత పేరు మరతువే!
కం. మనతల్లిని మన ఊరిని
మన భాషను వేషములను మన్నించుటయే
ఘన సంస్కారము అగునని
అనియెను జంఘాల శాస్త్రి అతనిని వినవే.
అంబాళం ఆంతర్యం......3 దేశ భక్తి ప్రబోధమైన వ్యాసానికి అదనంగా ఇంకా కొన్ని తేట గీతులు:---
1. తే.గీ. మాన్యులైన ఒకానొక మంత్రిగారు
గుండె నొప్పితో ప్రజ సొమ్ము అండ దండ
పయనమైరి అమెరికా వైద్యమునకు
మంత్రి కేమి కొదువ తాను మనసు పడిన
2. తే.గీ. విజయవంతమయ్యె చికిత్స వేగముగను
కోలుకొనిరి అమాత్యులు చాల బాగ
వైద్యుడొచ్చి పలకరించ వక్ర బుద్ధి
పొగడుచు అతణ్ణి ,మనవార్ని తెగడ సాగె
3. తే.గీ. అతని ధోరణి గనియెంతొ వెతను పొంది
సైపక విదేశి వైద్యుడు ఆపమనియె
అన్ని వసతులు పొందిన ఆర్య! మీకు
సొంత గడ్డపై లేదేల ? సుంత ప్రేమ
4. తే.గీ. నాదు సుకృతము చేతనే నాకు మీదు
భరత దేశాన చదివెడు భాగ్యమబ్బె
తగిన గుర్తింపు లేదని తరలుచున్న
వలస మేధావి వర్గాన్ని నిలుపుకొనుడు
5. తే.గీ. కుటిల రాజకీయము చిమ్ము కుళ్ళు కడిగి
కులము ఉపకార వేతన కొలత అనక
ప్రతిభనే చేయ అర్హత ప్రాతిపదిక
యువత మెచ్చును దేశపు భవిత వెలుగు
6. తే.గీ. అనుచు వైద్యుడు ఆవేశ మాపలేక
వేగ కోలుకొమ్మని పల్కి సాగి పోయె
బాగు మనసుకా! తనువుకా!భావమేమి?
తెలియగా లేక మన మంత్రి తెల్లబోయె
రచన:--
శ్రీమతి జంగం జ్యోతిర్మయి.
[29/10/2016, 10:02 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం...4.
1. తే.గీ. గంట గంటకు దినచర్య అంటు నేను
రక్తి నలుబదేళ్ళ మునుపు రాసుకున్న
ఒక్క పేజీని వినిపింతు ఒట్టి మాట
కాదు పాటించి చెప్పితి నాదు ఇంట.
2.తే.గీ.దైవమిచ్చిన విలువైన జీవితమును
చేతులార రోగము పాలు చేయనేల?
నిద్ర ఆహార వ్యాయామ నియతి తోటి
రోగ మెరుగక గడుపుము రోజు లెల్ల.
3.తే.గీ. కన్నవారిని సేవించు గౌరవించు
బాధ్యతెరుగు పౌరుడగుచు బ్రతుకుగడుపు
చేయబోకున్న ఒక మేలు చింతలేదు
కీడు చేయకు ఎవరికీ పాడు బుద్ధి.
4.తే.గీ. డబ్బు వ్యర్థము చేయకు డాబు తగదు
కూడదు పిసినారితనము కూడబెట్టి
అనుభవించుము తగినంత ఆశదీర
అప్పు చేయని వాడెగా ఆస్తి పరుడు.
5. తే.గీ. సొంతమగు ఇల్లు వాకిట సుమ వనంబు
అందలి విరులతో స్వామికర్చనంబు
మనసు తెలిసిన ఇల్లాలు మంచి పిల్ల
లింత సుఖమిచ్చెనా చాలు ఈశ్వరుండు.
6.తే.గీ. వైర భావన మనసున దూరనీకు
ఇతరుల సిరి పోల్చుకు చూసి ఈర్ష్య పడకు
చెడుగ మనగూర్చి పదుగురు చెప్పుకొనగ
ఇవ్వరాదయ్య అవకాశ మెపుడు మనము.
7.తే.గీ. మంచి గ్రంథాలు చదువుకో యెంచు కొనుచు
వినుము పాడుము పాటలు వీనులలర
తెలిసెనా మంచి ఒరులకు తెలియజెప్పు
పిల్లల సరదాల గడుపు చల్లగాను.
8.తే.గీ. ఉభయ సంధ్యల ధ్యానము ఉంచు నిన్ను
మంచి విశ్రాంత మతిని నా మాట నమ్ము
పక్క చేరెడు ముందుగా ఒక్కసారి
నేటి రేపటి పనులెల్ల నీవు యెంచు
9.తే.గీ. మిత్ర దోషాలు యెంచకు మైత్రి నిలుచు
అవును నీతిపరుడనన్న ఆత్మ తృప్తి
వెళ్ళి పోయెడు నాడు నీ వెంట ఉన్న
సఫల మయ్యె జీవితమని సంతసించు.
10.తే.గీ. నేను నమ్మిన సూత్రాలు నిత్యమండి
అతిశయోక్తులు ఇందులో అసలు లేవు
మీరు సైతము పాటించ మేలు జరుగు
అన్యు లెవరికి నచ్చినా ధన్యుడగుదు.
🙏🙏🙏
[29/10/2016, 10:03 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం...5.
1.తే.గీ. బ్రతక నేర్చిన లౌక్యుడౌ బ్రాహ్మణుండు
ఒకడు కలడు పూర్వము ఒక ఊరిలోన
గొప్ప పండితుడతడని చెప్పలేము
మంచి చతురత గలిగిన మాటకారి.
2.తే.గీ. ఎదిగె కూతురు పెళ్ళికి ఏది దారి
అనుచు వాపోవ ఇల్లాలు అతని తోటి
దేశ మేలెడి రాజును ఆశ దీర
ఆశ్రయింపగ తలచుచు అల్లె కవిత.
3.తే.గీ. కాని అనవేమ మహరాజు కాస్త లోభి
ఇవ్వబోడేమొ తగినంత ఎటుల యనుచు
యుక్తి నమ్ముకు సభజేరి భక్తి తోటి
మొక్కి పఠియించె శ్లోకము ఒక్కటిట్లు.
శ్లో. అనవేమ మహీపాల
స్వస్త్యస్తు తవ బాహవే
ఆహవే రిపు దోర్దండ
భానుమండల బాహవే.
శ్లోకానికి స్వేచ్ఛానువాదం.
4.తే.గీ. ఓయి!అనవేమ భూపాల చేయుచుంటి
సన్నుతి వినవే!భుజబల శక్తి నీవు
[29/10/2016, 10:04 am] Jyothirmai Simhadri: శాత్రవుల మింగు రాహువే సమరమందు
శౌర్య శాలివే శుభమస్తు జయము జయము.
5.తే.గీ. మెచ్చి రాజుగారొక వేయి ఇచ్చినంత
నాల్గు వేలిస్తిగా నేను న్యాయ మిదియె
అనగ డివ్వగా ఐదు వేలు
ఏను ఆరువేల నియోగి నెంచుడనియె.
6.తే.గీ. ఏడు వరహాలు ప్రభువు
తానివ్వబోగ
మంచి సంఖ్య కాదిదియని మరల పలికె
వేలు ఎనిమిదిడుచు పదివేలు గాను
తలపమని రాజు బాపని పలికినంత.
7.తే.గీ. మీదు నోటిమాట విలువ మీరబోను
చాలుడదియె నాకు వరము మేలు మేలు
అనుచు పదివేల వరహాలు అందుకొనియె
మాట నేర్పున కానిది మహిని గలదే!
8.తే.గీ..మధురమైనది పిల్లలూ మాతృభాష
నేర్చుకోవాలి మీరెల్ల నేర్పుమీర
ఆంగ్ల భాష నందన వనమైనగాని
తెలుగు భాష పెరటి లోని తులసి కోట.
9.తే.గీ. ఆర్య!మీ కథ తెనిగిస్తి అందులోని
భావమెల్లను వచ్చెనో ,భావ్య మగునొ
తెలియకున్నను పూనిన తెగువ నాది
స్వీకరింపుడు దీవించి శిష్యురాల్ని.
[29/10/2016, 10:04 am] Jyothirmai Simhadri: 5 వ పద్యం లో మూడవ పాదం
అనగ భూపాలుడివ్వగా ఐదు వేలు
...అని ఉండాలి.
[2/11/2016, 8:42 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం..._7.
01.11.2016.
1.కం. నే ముంబయి లో నొకపరి
కామాక్షీ ఆలయమున గతమున వింటిన్
భూమాత్మానందులు మన
క్షేమమ్మును కోరి నుడువు శ్రీ భాషణముల్.
2.తే.గీ. సత్వము రజస్సు తమముల తత్వములను
కృష్ణ పరమాత్మ బోధించె గీత లోన
వాటిని జయించు విధమును చాటి చెప్పె
రాముడు మునుపె పాటించి నీమముగను.
3.తే.గీ. రక్కసియగు తాటక చంపి రాముడిలకు
తామసమ్ము నడచమంచు తాను తెలిపె
సంస్కరించి అహల్యను స్వామి చూపె
కాయమున రజస్సు నదుపు చేయు విధము.
4.తే.గీ. జానకిని పరిణయమాడి ఆనతిచ్చె
విడువకుండ సాత్వికమున నడచు గతిని
త్రిగుణ రాహిత్యమే మోక్ష రీతి గనుక
కడకు సీతమ్మనూ తాను విడిచిపెట్టె.
5.తే.గీ. సత్వము రజస్తమములు సంఘటించు
వరుస సుఖ దుఃఖ మ జ్ఞాన వావితోటి
కొనుచు దిద్దుచు విడుచుచు మనుచునుండ
క్రమముగను మోక్ష మార్గము కానవచ్చు.
6. తే.గీ. అంటివేని సత్వ గుణము అద్ద మనుచు
బల్లపై పెట్టి గమనించు బాగుగాను
రజము గప్పి మసకబారు రాత్రి గడవ
పూని సత్యము మనసుతో పోల్చి చూడు.
7.తే.గీ. బాగు చేయక పది దినమ్ము లాగి చూడు
దాని యందిక మన మోము కానరాదు
అదియె తమము తెలియుడయ్య ఆర్యులార!
దిద్ది తీర్చుడద్దము మది దినము దినము.
8.తే.గీ. సాగు ఆధ్యాత్మ విద్యల సాధనమున
గురువొక నిమిత్తుడేనని గుర్తు పట్టి
సాగి నీవె సాధించుటే యోగ మగును
కౌశికుని మించి రాముడా ఘనత చాటె.
9.తే.గీ. అంతులేని సాగరమును అధిగమించి
రామకార్య సాధనమున రామ బంటు
సత్వ రాజస తమముల సంజ్ఞ లైన
హేల మైనాక సురస సింహికల గెల్చె
10.తే.గీ. తామస గుణమే కామము తలను ఒగ్గి
రాజసమున వశిష్ఠుని తేజ మణచ
స్వర్గ మొకటి సృష్టించగ సాహసించి
త్రిగుణములకు కౌశికు డోడి తెలియ గలిగె
11.తే.గీ. ఆత్మ జ్ఞానమది యెంతొ అద్భుతమని
కనుక జనులార గురువాక్కు గతిని చూపు
తెలిసి నడవండి ఆ దారి తెంపవచ్చు
పాములై చుట్టు కోర్కెల పాశములను.
12.తే.గీ. ప్రోత్సహించుచు నన్నెంతొ పుణ్యమతిని
పార్థ సారధి వలె నాకు పథము చూపు
పార్థ సారథి గారికి పరమ ఖ్యాతి
పార్థ సారథి ఇడుగాక భవ్య గతిని.
🙏🙏🙏
[2/11/2016, 8:43 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం.....6
తేదీ...31.10.2016.
1.కం. భూమాత్మానందులనెడు
స్వామీజీ పలుకగ ఒక సత్సంగమునన్
ఈ మాటలు నే వింటిని
మీ ముందుకు తెచ్చుచుంటి మేలని వినరే.
2.తే.గీ. ఘోర భారత రణమందు నూరుమంది
సుతుల కోల్పోయి మగ్నుడై శోక జలధి
తనను చూడవచ్చిన నంద తనయు తోటి
అంధ ధృతరాష్ట్ర నరపతి అనియెనిట్లు.
3.తే.గీ. కృష్ణ! నీకిది ధర్మమా!కృపయె లేక
నాదు తనయుల చంపించినా వదేల?
ఏమి నా పాప మెందులకింత శిక్ష?
తెలుపమనగ చక్రి ఇటుల తెలియ జెప్పె.
4.తే.గీ. మామ!కర్మ ఫలములిల మానవులకు
అనుభవింపక తప్పదు అనుట వినవె?
వేటగానిగా జన్మల వెనుక యెపుడొ
నీవు చేసిన పాపమే నిన్ను తరిమె.
5.తే.గీ. కరుణయే లేక నీవెంతొ కఠిన మతిని
గుడ్లు పొదిగెడు పెంటిని గూటిలోనె
నాడు చంపిన కతమున గోడుమన్న
మగని పక్షి కడుపుకోత తగిలె నీకు.
6.తే.గీ. నూరు కూనల మృతికీవె కారణమ్ము
గడిచె యాబది జన్మల గడువు నీకు
పుణ్య ఫలమున నూర్వుర పొందినావు
కోలుపోతివి పాపము కూడి రాగ.
7.కం. కర్మను ఎరుగుట కష్టము
కర్మఫలము లిచ్చువాడు కమలాక్షుండే!
కర్మానుభవ మెపుడు?ఆ
మర్మము తెలియ నసాధ్యము మహినెవ్వరికిన్.
8.కం. ఆవుల మందలొ దూడను
గోవెటు గుర్తించు నట్లు కూడిన వేళన్
నీవొనరించిన కర్మకు
తావొచ్చును పాపపుణ్య తద్గుణ ఫలముల్.
9.తే.గీ. జరిగి పెను ప్రమాద మొకడు చచ్చిపోవ
పలుకు పామరుడైనను పాపమనుచు
వింత మన కర్మ సిద్ధాంత మెంతఘనము!
సద్గురువు నాశ్రయింపుడు సత్యమెరుగ.
10.తే.గీ. నాడు మీ సహోదరులును నేడు జ్ఞాన
గురువులగు సరస్వతి స్వామి గుణ్య వాక్కు
భక్తి తోటి పద్యమున నా శక్తి కొలది
అనువదించితి మెచ్చరే అవధరించి.
[2/11/2016, 8:45 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం...5.
1.తే.గీ. బ్రతక నేర్చిన లౌక్యుడౌ బ్రాహ్మణుండు
ఒకడు కలడు పూర్వము ఒక ఊరిలోన
గొప్ప పండితుడతడని చెప్పలేము
మంచి చతురత గలిగిన మాటకారి.
2.తే.గీ. ఎదిగె కూతురు పెళ్ళికి ఏది దారి
అనుచు వాపోవ ఇల్లాలు అతని తోటి
దేశ మేలెడి రాజును ఆశ దీర
ఆశ్రయింపగ తలచుచు అల్లె కవిత.
3.తే.గీ. కాని అనవేమ మహరాజు కాస్త లోభి
ఇవ్వబోడేమొ తగినంత ఎటుల యనుచు
యుక్తి నమ్ముకు సభజేరి భక్తి తోటి
మొక్కి పఠియించె శ్లోకము ఒక్కటిట్లు.
శ్లో. అనవేమ మహీపాల
స్వస్త్యస్తు తవ బాహవే
ఆహవే రిపు దోర్దండ
భానుమండల బాహవే.
శ్లోకానికి స్వేచ్ఛానువాదం.
4.తే.గీ. ఓయి!అనవేమ భూపాల చేయుచుంటి
సన్నుతి వినవే!భుజబల శక్తి నీవు
[2/11/2016, 8:46 am] Jyothirmai Simhadri: శాత్రవుల మింగు రాహువే సమరమందు
శౌర్య శాలివే శుభమస్తు జయము జయము.
5.తే.గీ. మెచ్చి రాజుగారొక వేయి ఇచ్చినంత
నాల్గు వేలిస్తిగా నేను న్యాయ మిదియె
అనగ డివ్వగా ఐదు వేలు
ఏను ఆరువేల నియోగి నెంచుడనియె.
6.తే.గీ. ఏడు వరహాలు ప్రభువు
తానివ్వబోగ
మంచి సంఖ్య కాదిదియని మరల పలికె
వేలు ఎనిమిదిడుచు పదివేలు గాను
తలపమని రాజు బాపని పలికినంత.
7.తే.గీ. మీదు నోటిమాట విలువ మీరబోను
చాలుడదియె నాకు వరము మేలు మేలు
అనుచు పదివేల వరహాలు అందుకొనియె
మాట నేర్పున కానిది మహిని గలదే!
8.తే.గీ..మధురమైనది పిల్లలూ మాతృభాష
నేర్చుకోవాలి మీరెల్ల నేర్పుమీర
ఆంగ్ల భాష నందన వనమైనగాని
తెలుగు భాష పెరటి లోని తులసి కోట.
9.తే.గీ. ఆర్య!మీ కథ తెనిగిస్తి అందులోని
భావమెల్లను వచ్చెనో ,భావ్య మగునొ
తెలియకున్నను పూనిన తెగువ నాది
స్వీకరింపుడు దీవించి శిష్యురాల్ని.
[3/11/2016, 4:57 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం....8.
02.11.2016.
1.తే.గీ. ఇలను ఇరువది ముప్పది ఏళ్ళ లోనె
ఊహకందని మార్పులు ఉరికి వచ్చె
స్వాగతించితి గాని నే సాదరమున
గతము మరువరాదను అభిమతము నాది.
2.తే.గీ. ఆధునిక శాస్త్ర విజ్ఞాన మంతులేని
ఎన్ని వసతుల నిచ్చెనో ఎంచలేము
వచ్చి పడినట్టి సుఖముల పిచ్చిలోన
పాతవెల్ల రోతయనుట పాడియగునె?
3.తే. గీ. టీవి నట్టంట కొలువయ్యె ఠీవి తోటి
వాస్తవమ్మును తలపక వార్తలెల్ల
కనుల నప్పగించుచు చూచి ,వినుటె గాని
మంచి పుస్తకమ్ము చదువ మరచె జగతి.
4.తే.గీ. ఫ్రిజ్జు వంటింట వెలయగ ప్రీతి తోటి
కూలు వాటరు మోజులో కుండ నీరు
సద్ది కూరల తిను ఖర్మ సుద్ది వంట
దూరమై పోయి రోగాలు దారి కాచె.
5.తే.గీ. కారు వచ్చింది మరిచాము కాలి నడక
వంద అడుగుల కైననూ వాహనమ్మె
ఉనికి మరిపించ సెల్ ఫోను ఉత్తరాన్ని
రమ్య భావాల వెలిబుచ్చు రాత లేదు.
6.తే. గీ. వచ్చి పడగ కంప్యూటరు వ్యక్తులందు
సన్నగిల్లెను ధారణా శక్తులన్ని
చిన్న పాటి లెక్కలకైన చిట్టి మిషను
వాడుచు ,మెదడు వాడుట వీడినారు.
7.తే.గీ. మూసి తలుపులన్నియు ఇంట ఏ.సి. వేసి
చెట్ల చిరుగాలి లోనికి చేరనీక
పుడమి కాపాడు ఓజోను పొరలు కరగ
వదులుచున్నాము విషపూర వాయువులను.
8.తే.గీ. నగర జీవన మనివార్య మగుట చేత
పైరగాలి పరిమళాల పలకరింపు
ఉదయభానుని కిరణాల ఉచిత వైద్య
మందుకోలేని దుర్గతి పొందినాము.
9.తే.గీ. వేప పుల్లను వెలివేసి వెధవ బ్రష్షు
పంటి రోగాల నోటిని పాడు చేసె
మిక్సి గ్రైండరు కష్టము మింగి వేయ
రోటి పచ్చళ్ళు కరువాయె నోటి చవికి.
10.తే. గీ. డెబిటు క్రెడిటు కార్డులువాడు డేసు వచ్చి
డబ్బు ఖర్చు హద్దులు దాటె డాబు పెరిగి
వాడి మరిచారు అత్తర్లు నేడు జనులు
మరులు గొలిపెడు సహజమౌ విరుల తావి.
11.తే. గీ. ఫాస్టు ఫుడ్డుల కల్చరే ఫ్యాషనవగ
ఇంటి రుచి పోయి ,ఒబెసిటీ ఒంటి కొచ్చె
పడుతు వాట్సప్పు ,వైఫైల పాడు మాయ
పక్కనున్న వారితొ గూడ పలుకరాయె.
12.తే.గీ. సుఖమె ఆనందమని జుర్ర చూడ కండి
నడుమ భేదమ్ము తెలియండి నయము మీర
సుఖము ఒంటిని మురిపించు సులువు నేర్పు
ఆత్మకే దక్కు ఆనంద అనుభవమ్ము.
13.తే. గీ. కొత్త పాతల కలయికే గొప్పదన్న
మన మహాకవి గురజాడ మాట వినరె
ఇదియె పార్థుల మాటగా మదిని తోచె
వారి ఆంతర్యమునకిదే వందనమ్ము.
[4/11/2016, 8:38 am] Jyothirmai Simhadri: అంబాళం ఆంతర్యం.......9.
03.11.2016
1.తే. గీ. నేను చెప్పెడు సత్యమ్ము నేడు మీరు
మదిని యోచన చేయుడో మాన్యులార!
కల్పితమగు పాత్రల కథయె గాని
నివురు గప్పెను ఇందులో నీతి యొకటి.
2.తే.గీ. అలకలెప్పుడూ పోవని ఆలుమగలు
కలరు అనిచెప్ప ఆ మాట కల్ల గాదె!
కలహమన్నదే ఎరుగని కాపురమును
పోపు పెట్టని చారుతో పోల్చ వలదె!
3.తే. గీ. మూతి ముడుపులు మరునాడె ముగియ వలయు
మాట పట్టింపు లసలొద్దు మాన వలయు
ఒకరికొక్కరు ప్రాణమై ఒదగ వలయు
నచ్చిఆ జంట నలుగురూ మెచ్చ వలయు.
4.తే. గీ. కడకు ఉపదేశ మిచ్చుటే కావ్య ఫలము
భక్తి నడిపించ వలె గదా ముక్తి పథము
సర్దుకొని దిద్దుకొనుటె సంసార మగును
విన్నవింతు నా మాట ఈ చిన్ని కథను.
5.తే.గీ. లక్షణమగు జంట ప్రసాదు లతలు ,పెళ్లి
జరిగి పది యేళ్ళు సుఖముగా సాగిపోయె
ఉంది సహృదయమూ ప్రేమ ఉంది గాని
అహము చేత ఏర్పడెనొక అంతరమ్ము.
6.తే. గీ. పెరుగుచుండగ గొడవలు పెళ్ళి రోజు
వచ్చెనంతలో తెరిపించ వారి కళ్ళు
గుర్తు కలదో లేదోనని గుండెలోన
తలచుచుండె లత,అపుడె తలుపు మోగె.
7.తే. గీ. వానకు తడిసి ముద్దయి వచ్చె భర్త
అందమగు ఒక పూగుత్తి అతని చేత
మగని స్థితి చూసి కరిగింది మగువ మనసు
చేతికిచ్చె నొక టవలు చెలిమి పొంగ.
8.తే. గీ. చిన్ని చర్యతో ఇద్దరి చింత దీరె
మాట కలవగా అహమెటో మాయమయ్యె
పాత రోజులు తలచుకు పతియు సతియు
ముచ్చటాడుచు మదినెంతొ మురిసినారు.
9.తే. గీ. అంతలో మోగె సెల్ ఫోను ఆమె తీసె
రైలు ఎక్కుతూ మీ భర్త కాలుజారి
ప్రాణమొదిలె మీరు గురుతు పట్టవలెను
అనెడు మాటకు కంపించె అతివ తనువు.
10.తే. గీ. గదిని ఊసులాడిన భర్త కానరాక
పొగిలి పొగిలి అతని కొరకు పొలతి యేడ్చె
ప్రేమ తీరక నాపైన ప్రీతి తోటి
ఆత్మ అయ్యెనా నా భర్త అనుచు కుమిలె.
11.తే. గీ. కల్మషము లేని పతిమది కష్టపెట్టి
ఎంత పొరపాటు చేసితి నిన్ని నాళ్ళు
మాప నిష్కృతి లేదు నా పాపమునకు
అనుచు శపియించు కొనసాగె తనను తానె.
12.తే. గీ. అంత స్నానాల గదినుండి ఆతడొచ్చి
చెప్ప మరిచాను ఇందాక చెలియ నీకు
దోచుకున్నారు నా పర్సు దొంగ లెవరొ
అనెడు పతిమాట పూర్తిగా వినక మునుపె
13.తే. గీ. చూసి సంభ్రమాన పతిని చుట్టి వేసె
భామ సంతోషమును చెప్ప భాష లేదు
తెల్లబోయి అర్థమవక తెప్పరిల్లి
అనునయించెడు పతిగని అతివ మురిసె.
14.తే. గీ. వింటిరా !నా చిరు కథ ఓ విజ్గ్నులార!
దూరమగు బంధమది యెంత దుఃఖ తరమొ
వెళ్ళి పోయెనా కాలమ్ము మళ్ళిరాదు
నిలుపుకొనవలె బంధాలు విలువ తెలిసి.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
142. శ్లో|| అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే
తేపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః
--భగవద్గీత 13-26.
చాలా మందికి కర్మ, జ్ఙాన, ధ్యాన మార్గాలంటే ఏమిటో తెలియవు. అసలు వీటి జ్ఙానం ఉండదు. అయితే, వేదాంత ఉపన్యాసాలు ఎక్కడ చెప్పినా శ్రద్ధగా వింటారు. అలా శ్రద్ధగా విని, చెప్పినట్లు ఆచరించే వారు కూడా మరణాన్ని దాటి ముక్తిని పొందుతారు.
పరమాత్మ, తన భక్తుల కోసం అతి సులభమైన పద్ధతిని తెలియజేస్తున్నాడు. కేవలం కొంతమంది మాత్రమే కర్మ యోగ, జ్ఙాన, ధ్యాన యోగాల ద్వారా సాధన చేసి, తమ లోని ఆత్మను దర్శించగలుగుతారు. చాలా మందికి సంస్కృతం రాదు, వేద, శాస్త్ర, పురాణాది పుస్తకాలు చదవడం అసలుకే రాదు. అటువంటి వారు, ఏమాత్రం చింతించనవసరం లేదు. ఎక్కడైనా ప్రవచనాలు చెబుతుంటే శ్రద్ధగా విని, విన్న విషయాన్ని ఇంటికి వచ్చి మననం చేసుకొని, ఆచరిస్తే చాలు, తరిస్తారు. వారు ముక్తికి అర్హత పొందినట్లే.
అలాంటి వారి కోసం, ప్రవచనాలు చెప్పే పండితులు, పటాటోప ప్రదర్శన లేకుండా, అర్థంకాని, భయపెట్టే పదాలు ప్రయోగించకుండా, గ్రాంథిక భాషలో కాకుండా, వేదాంత ప్రవచనాలు చెప్పాలి. లేకుంటే, అర్థం కాక, భయపడిపోయి, మరుసటి రోజు నుంచి వినడానికి రాకపోగా, వేదాంతం అంటే భయం ఏర్పఱుచుకుంటారు. అందువలన, వినే వారికి అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పదాలతో, పిట్ట కథలతో వారి మనసుకు హత్తుకునే లాగా చెప్పి, అసలు వేదాంతసారాన్ని అందివ్వాలి.
బజారులో మనకు అన్ని పుస్తకాలు దొరుకుతాయి. డాక్టరో, ఇంజనీరో కావాలంటే, అవి చదువుకుంటే సరిపోతుంది కదా! ఎందుకని, లక్షలు పోసి కాలేజీకి వెళతారు. కారణం, అలాంటి పుస్తకాలను వ్రాసే విజ్ఙులు అక్కడుంటారు కాబట్టి. అతి సులభంగా పుస్తకాల సారాన్ని అందజేస్తారు కాబట్టి. మనం కష్టపడి చదివి, అర్థంకాక, తలలు పట్టుకొనే పని ఉండదు కాబట్టి. అందుకని, మామూలు విద్యకైనా, వేదాంత విద్యకైనా గురు, శిష్య సంబంధం వల్ల సందేహ నివృత్తియై, అసలు జ్ఙానం ఏర్పడే అవకాశముంటుంది.
మనం సరియైన గురువు నుండి వింటే, అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. అంతేకాక, గురువు యొక్క విశ్వాసం, నమ్మకం శిష్యుడిలో కూడా ఏర్పడుతాయి. దేవుళ్లను మార్చినట్లు, అనవసరంగా గురువులను మార్చకూడదు. ఆధ్యాత్మిక కార్యాల పట్ల గురువు యొక్క ఉత్సాహం శిష్యుడికి కూడా వస్తుంది. దాంతో విషయం పట్ల అవగాహన పెరిగి, క్రొత్త శక్తులు వస్తాయి. ఉత్సాహం, విశ్వాసం, ఈ రెండూ భక్తి అనే అందమైన ఇంటికి పునాదులు లాంటివి.
అలా గురువులు చెప్పినది శ్రద్ధగా విని, ఏకాంతంగా కూర్చొని మనసులో చర్చించుకొని, ఆచరించాలి. ఆచరిస్తున్న దాని వల్ల, జ్ఙానం మనలో గట్టిపడుతుంది. శ్లోకంలో 'అతితరంతి ఏవ మృత్యుం' అంటాడు వ్యాసుడు. అంటే, మృత్యువును దాటగలరని అర్థం. దాటగలరు అంటే మరణించకుండా ఉంటారని కాదు. ఆత్మజ్ఙానం సంపాదించడం వలన, మరణమంటే భయం పోతుందని. అలాగే, ఏలాంటి గ్రంథాలు చదవకపోయినా విజ్ఙులు చెప్పింది విని, ఆచరిస్తే చాలు, ఎవరైనా ముక్తిని పొందగలరు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
21-4-2017,
PBEL City, Hyderabad.
ఆ.వె.
కర్మ ,జ్ఞాన,ధ్యాన మర్మమెరుగకున్న
చింతలేదు గురువు చేయు బోధ
పరమ శ్రద్ధతోటి పాటించ యత్నించు
ముక్తి కలుగు యాత్ర ముగియు వేళ.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
140. శ్లో|| అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ
ద్యూతం పానం స్త్రియస్సూనా యత్రాధర్మశ్చతుర్విధః
--భాగవతం 1-17-38.
జూదం, మద్యపానం, దుష్టస్త్రీలు, ప్రాణిహింస అనే నాలుగు స్థానాలను వరుసగా అసత్యం, మదం, విషయాసక్తి, క్రూరత్వము అనే నాలుగు రకాల అధర్మాలు ఆశ్రయించి ఉంటాయి కనుక, పై స్థానాలలో నివసించవచ్చని, అభ్యర్థించిన కలిపురుషుడికి సూచిస్తాడు పరీక్షిన్మహారాజు.
అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు పరిపాలనలో దేశమంతా సుభిక్షంగా ఉంది. అతడి దిగ్విజయ యాత్రలో, ఒక చోట, మహారాజు వేషంలో ఉన్న ఒకతను ఆవును, ఎద్దును కర్రతో, కాళ్లతో కొడుతుంటాడు. ఆవు, ఎద్దులు భూదేవతకు, ధర్మదేవతకు ప్రతీకలు. తపస్సు, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలతో ఉండేదే ధర్మ స్వరూపమైన వృషభం. అందుకే, అది ఈశ్వరుడి వాహనమైంది. మూడు పాదాలు కుంటుపడిన ఎద్దును కొడుతున్నది కలి. అధర్మం చేస్తున్న అతడిని చంపడానికి పరీక్షిత్తు కత్తి తీస్తాడు.
ఆగ్రహోదగ్రుడైన పరీక్షిన్మహారాజు కత్తి దూయగనే కలిపురుషుడు రాజువేషం వదిలేసి, చేతులు జోడించి పరీక్షిత్తు కాళ్ళమీద పడి "శరణాగతుణ్ణి రాజా! నన్ను రక్షించు" అని పాదాలు పట్టుకున్నాడు. అతడిని హెచ్చరించి, అభయం ఇస్తాడు పరీక్షిత్తు. "ఇది బ్రహ్మావర్త దేశం. ఇక్కడ మహాత్ములు శ్రీహరి గుఱించి తపస్సు, యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఈ దేశం సత్యానికీ, ధర్మానికి నివాస స్థానం. ఇలాంటి పుణ్యభూమిలో నీ లాంటి దుర్మార్గుడు కాలు మోపటానికి చక్రవర్తిగా నేను అంగీకరించను.
మహారాజా, నువ్వలా కత్తిని త్రిప్పుతుంటే, దాని మెఱుపులకే నాకు భయం కలిగి, గుండెలు పగిలి పోతున్నాయి. నేనెక్కడికి పోగలను? మీరే చెప్పండి. ఈ భూమండలం అంతా నీదే. నేను ఎక్కడికి పోయినా, విల్లంబులతో, కత్తితో నువ్వే కనిపిస్తావు. ఎక్కడ తలదాచుకోవాలో చెప్పండని కలిపురుషుడు అతి వినయంగా అర్థించాడు. శ్రీకృష్ణుడు తనువు చాలించిన మరుక్షణమే, కలిపురుషుడు(అధర్మం) విజృంభిస్తాడని తెలిసిన పరీక్షిత్తు, అతడికి ఏదైనా స్థానం కల్పించాలని అనుకుంటాడు.
సరే, నీకు నాలుగు స్థానాల్లో ఉండటానికి అవకాశం ఇస్తున్నాను. ప్రాణివధ జరిగే చోట, స్త్రీలు మర్యాద వదలి ప్రవర్తించే చోట, జూదం ఆడే చోట, మద్యపాన సేవనం జరిగే చోటు, అలాగే బంగారం నీకు అప్పగిస్తున్నాను. ఈ స్థానాలు తప్ప ఇంకెక్కడా నువ్వుండడానికి వీలు లేదని, కలిపురుషుడిని ఆజ్ఙాపించాడు. పరీక్షిత్తు జాలిగుండెను గ్రహించిన కలి, మహారాజా, నాకింకా కొన్ని స్థలాలు కావాలని యాచిస్తాడు. పని జరిగేలా ఉంటే ఎవరైనా మళ్ళీ అడుగుతారు కదా!
ఇంకేముంది? పరీక్షిత్తు మెత్తబడి, బంగారానికే సంబంధించిన అసత్యం, గర్వం, కామము, హింస, వైరము అనే ఐదు కొత్త స్థానాలను ఆశ్రయించమని, కలికి అప్పగించి, ఇంకే ఇతర స్థలాల్లోనూ కనిపించరాదని కలిని కట్టడి చేశాడు. కలి సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే, ధర్మదేవతకు (వృషభానికి) తపస్సు, శౌచము, దయ అనే మూడు కాళ్ళూ బాగవగానే నాలుగు పాదాలతో హాయిగా నడవసాగింది. అది చూసిన భూదేవికి ఆనందం కలిగింది.
ఇలా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన బ్రతికి బట్టకట్టిన పరీక్షిత్తు ధర్మాత్ముడై, కౌరవ రాజ్యలక్ష్మిని రక్షిస్తూ ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తూ, భూమండలాన్ని ఆనందంగా పరిపాలించాడు. మనము కూడా బ్రతికి బట్టకట్టి, హాయిగా, ఆనందంగా ఉండాలంటే, ఎప్పుడూ ధర్మాన్నే ఆశ్రయించి ఉంటే, ఎప్పటికీ కలి మనల్ని ఏమీ చేయలేడు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
19-4-2017,
PBEL City, Hyderabad.
తే.గీ.
తపము,శౌచము,దయయు,సత్యమను నాల్గు
పాదములపై వృషభపు రూపమున నడచు
ధర్మ దేవత ముక్కాలు తఱిగి నేడు
ఒంటి కాలితో మిగిలెను కుంటిదగుచు.
తఱుగు....నశించు
సుశ్లోకవేది మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు.
గురువుగారికి నమస్సులు మరియు ఉగాది శుభాకాంక్షలు.
సీసం.
నన్ను గూర్చిన చింత నాకెన్నడును లేదు
భర్తృ గౌరవమదే బ్రతుకు నాకు
నాథుడే దైవంబు ,నాథుడే బంధుడున్
గురువు నాథుడతని పరువు నిలుప
ప్రాణమిచ్చెద నపవాదైన సైచెద
గాని నే కడసారి కన్నులార
విభుని యా నగుమోము వీక్షించు భాగ్యమ్మొ
సగినను తరియింతు సంతసింతు
ఆ.వె.
నిదియె విన్నపమను వదినమ్మ కోర్కెకు
బదులు పల్క మనసు భారమవగ
సీత పదము మొక్కి చింతతో సౌమిత్రి
చెప్పెనిట్లు దైన్య మొప్పుచుండ.
సీసం.
వదినమ్మ నేను మీ వదనమ్ము నెన్నడున్
కాంచి యెరుగనమ్మ కన్నులెత్తి
పాదపద్మములనె భక్తితో చూచెదన్
సర్వవేళల రాము సముఖమందె
అన్న లేనట్టి యీ ఆపద సమయాన
చూడజాలనిదె నా వీడుకోలు
అనుచు మరలమొక్కి యావలిగట్టుకు
చనగ లక్ష్మణ స్వామి సాగినంత
తే.గీ.
బిక్కు మనుచు మరది చను దిక్కు జూచు
నడచి పోవుచు నున్నట్టి నావ జూచు
విహ్వలించుచు దిక్కులు వెదకి జూచు
తనదు గర్భమ్ము నొకపరి తడవి జూచు.
సీసం.
పొంగిన శోకాన పొరలి యేడ్చెడు వేళ
నెలుగెత్తు నెమలియై నెలత దోప
వనములో తిరుగాడు మునికుమారులు గాంచి
వాల్మీకి చెంతకు వడిగ పోయి
మౌనివర్యా! మీకు మా వందనమ్మిదే
అడవి లోపల గంగ మడుగు చెంత
అపర లక్ష్మియనగ ,అత్యుత్తమ కుల సం
సంజాత యనగ,దివిజ వనిత యన
తే.గీ.
గ, నొక యుత్తముని సతియొ యనగ నోపు
అబల యొకతె యనాథయై యగపడినది
కష్టమేమొ మేమెరుగ మా కాంతను గని
గుండె తరుగుపడియె గావ రండి స్వామి.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
139. శ్లో|| అహో మహీయసీ జంతోః జీవితాశా యయా భవాన్
భీమేనావర్జితం పిండమ్ ఆదత్తే గృహపాలవత్
--భాగవత పురాణం 1-13-22.
మీకు బ్రతకాలనే ఆశ ఎక్కువగా ఉంది! అంతేకాదు, అలాంటి ఆశకు పూర్తిగా వశమై పోయారు. ఎందుకంటే, భీముడు తెచ్చి పెట్టే అన్నాన్ని తింటూ, ఈ ఇంటికి కాపలా కుక్కలా ఉంటున్నారని ధృతరాష్ట్రుడినితో విదురుడు అంటాడు.
మహాభారత యుద్ధంలో కౌరవులను ఓడించి, పాండవులు విజయం సాధించిన తర్వాత, ధర్మరాజు సింహాసనాన్ని అధిరోహిస్తాడు. తమ వంశోద్ధారకుడైన ఉత్తర, అభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు యొక్క ముద్దు ముచ్చటలను ఆనందిస్తూ, సూర్య తేజస్సు లాంటి సోదరులంతా కలసి సర్వోత్కృష్టమైన సంపదను అనుభవిస్తూ, ఎంతో ఆనందంగా ఉంటున్నారు.
ఈ విధంగా పాండవులు తమ తమ పాలనా బాధ్యతలు కొనసాగిస్తూ, గృహ కార్యకలాపాలలో తలమునకలై ఉంటుండగా, తమకు తెలియకుండానే ఆయుష్షు దగ్గర పడింది. ఈ లోకంలో అందరూ ఎదుర్కొనవలసిన మృత్యువు అతి దగ్గరకు సమీపించింది. అన్ని విషయాలను అవలోకిస్తున్న విదుర మహాశయుడు, వృద్ధుడైన జ్యేష్ఠ భ్రాత ధృతరాష్ట్రుడితో, తన మనసులోని అభిప్రాయాలను పంచుకుంటాడు.
ఓ రాజా "నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయమాగతమ్", ముంచుకువస్తున్న భయాలను కొంచెం గమనించండి. వీలైనంత తొందరగా మనం ఈ లోకం నుండి నిష్క్రమించాల్సిన తరుణం ఆసన్నమైంది. మీకు తెలియనిది ఏముంది? ఈ లోకంలో ఎన్ని ఉపాయాలు ప్రయోగించినా, మృత్యువును తప్పించుకోలేము. నిజం చెప్పాలంటే, మనందరం మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాము.
రోట్లో తల పెట్టాము, రోకటి పోటుకు భయపడకూడదు. అలాగే, మృత్యువును అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నాం. ఏ నిముషంలోనైనా మనల్ని కబళించవచ్చు. ఒక ప్రక్క ప్రాణాలే పోతున్నాయి, ఇంకా ఈ ధనం, రాజ్య సంపదల మీద ఆశ అనవసరం! ఆలోచించండి. మీరిక ప్రాణాల మీద ఆశ పూర్తిగా వదిలేయండి. మీ తండ్రులు, సోదరులు, మిత్రులు మరియు పుత్రులూ అందరూ మరణించారు. మీకు ముసలి వయస్సు మీద పడింది.
"మీ శరీరము 'జరయా గ్రస్తః' జీర్ణమైపోయింది, ముసలిదైపోయింది. అయినా, మీరింకా ఇతరుల పంచన పడి బ్రతుకుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. మీకు కూడా ప్రాణాలపై ఇంత తీపి ఉందంటే, నమ్మలేకపోతున్నాను. మృత్యుదేవత, ఒక ప్రక్క నిన్ను తన వశంలోకి తీసుకుంటుంటే, ఇంటికి కాపలా కుక్కలా ఉంటూ, భీమసేనుడు తెచ్చి పెట్టే అన్నాన్ని తింటూ ఆనందిస్తున్నారా"! అని, ధృతరాష్ట్రుడిని ఈసడించుకుంటాడు విదురుడు.
ఈ విషయాన్ని వేద వ్యాసుడు, విదురుడి ద్వారా వినిపించింది కేవలం ధృతరాష్ట్రుడికే కాదు, ప్రాణాల మీద ఆశలు పెట్టుకొని, ఏ క్షణం ప్రాణం పోతుందో! అని భయపడే, ప్రపంచంలో ఉండే ప్రతి వాడికి కూడా బోధ చేశాడని గ్రహించాలి. తృణప్రాయమైన ప్రాణ నిష్క్రమణకు, ఏ సమయంలోనైనా, సంతోషంగా సిద్ధంగా ఉండాలి.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
18-4-2017,
PBEL City, Hyderabad.
సీసం.
తనయులపై గల్గు తగని మోహముచేత
దయమాలి ధర్మమ్ము తప్పినావు
తమ్ముని సుతులకు తగవు చేయగలేక
అడవుల పాల్జేసి విడిచినావు
కొలువున నీ సంతు కోడలి వలువలు
ఊడ్చువేళల మిన్నకుండినావు
సమరభూమిని నేడు సర్వుల గోల్పోయి
వగపును దిగమింగి మిగిలినావు
ఆ.వె.
ఇంత ఆశయేల?ఇటువంటి గతియేల?
కుక్కవోలె బ్రతుక మక్కువేల?
భీముచేతి మెతుకు లేమి ఖర్మము నీకు?
బంధ ముక్తి కోరు మంధ రాజ!హరి ఓమ్ 🙏
శుభోదయం.
.హరి ఓమ్ 🙏
శుభోదయం.
137. శ్లో|| అనుకూలో భవేచ్చాస్య సర్వార్థేషు కథాసు చ
అప్రియం చాహితం యత్ స్యాత్ తదస్మై నానువర్ణయేత్
వ్యాస భారతం 4-4-19.
ప్రతి పనిలో, ప్రతి మాటలో సేవకుడు మహా రాజుకు అనుకూలంగానే ఉండాలి. రాజుకు అప్రియమైన పనిని చేయరాదు, హితము కాని, మాటలు ఎప్పుడూ చెప్పరాదు.
***
పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఙాతంగా ఉండబోతారన్న విషయం తెలిసిన ధౌమ్యుడు, పాండవులకు అనేక రాజ సేవాధర్మాలు బోధిస్తాడు. రాజాస్థానాలలో పనిచేసే ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తాడు. రాజు సేవలో ఉన్నవాడు, రాజుకు అతి సమీపంలో ఉండి సేవ చేస్తాడు కాబట్టి, రాజుకు సంబంధించిన పాన్పు, పీఠం, ఏనుగు, రథాలను ఉపయోగించకూడదని చెప్తాడు.
అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తుపట్టగలిగితే, మరో పన్నెండేండ్లు అరణ్య వాసానికి పంపవచ్చనే ఆశతో, విరాట నగరంలో ఉంటున్నారన్న అనుమానంతో, నగరం దక్షిణం వైపు దాడి చేయమని, సుశర్మను సైన్య సమేతంగా పంపిస్తాడు రారాజు. సుశర్మ తన సేనలతో విరాటుని గోగ్రహణం చేయగా, మరునాడు ఉదయం భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది వీరులతో కలసి విరాటనగరం ఉత్తరం వైపు గోగ్రహణానికై బయలుదేరాడు.
ఉత్తరం వైపున ఉన్న విరాటుడి గోసంపదను ముట్టడిస్తారు. అక్కడ ఉన్న కొద్ది పాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించ లేక, భయంతో వెంటనే విరాట నగరానికి బయలుదేరుతాడు గవాధ్యక్షుడు. ఆ సమయంలో నగరంలో సారథులు లేని కారణంగా, ఉత్తర కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉండగా, సైరంధ్రి బృహన్నలను ఒప్పించి ఉత్తరుడికి సారథిగా పంపిస్తుంది. శమీవృక్షం మీది గాండీవం తీసుకోగానే, నిజ తేజోరూపాన్ని పొందుతాడు అర్జునుడు. ఆనాటితో అజ్ఞాతవాసం ముగియడంతో, తమ గెలుపు సందేశాన్ని మత్స్యమహీపతికి పంపిస్తాడు అర్జునుడు.
గోపాలకులు మహోత్సాహంతో వచ్చి, ఉత్తరుడి గెలుపు కబురు తెలియపఱుస్తారు. ఆనందం ఆపుకోలేని తండ్రి, విజయ వార్తను నగరమంతా చాటింపు వేయించమని మంత్రులను పురమాయిస్తాడు. ఈలోపల అక్కడే తిరుగుతున్న సైరంధ్రిని చూచి, పాచికలు తెమ్మని, తన పుత్రుడి విజయోత్సవాన్ని స్నేహ ద్యూత క్రీడతో జరుపు నిమిత్తం కంకుభట్టుని పిలుస్తాడు. విరాటరాజు జూదం ఆడుతూ, అతి ఉత్సాహంతో చూశావా! మా ఉత్తరుడి పరాక్రమం, కౌరవులను చిత్తుచేశాడని" అంటాడు.
"దుర్యోధన, భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది మహావీరుల పరాక్రమాన్ని ఎదిరించి, ఉత్తరుడు కనుక వారిని ఓడించగలిగితే, అంతకన్నా గొప్ప ఆశ్చర్యం ఉండదని, ఈ గెలుపు కేవలం బృహన్నల వల్లనే సాధ్యమైందని" అంటాడు కంకుభట్టు. ఆవేశం ఆపుకోలేని విరటుడు, "నా దగ్గర ఆ పేడివాడిని పొగుడుతావా" అని, పడగ యెత్తిన సర్పం వలె చేయెత్తి, చేతి లోని పాచికను విసిరికొట్టగా, ధర్మరాజుకు గాయమై రక్తం కారుతుంది.
చూశారా! మహారాజుకు ప్రియంగా, అనుకూలంగా మాట్లాడక పోవడం వలన జరిగిన పరిణామాన్ని, వ్యాసుల వారు, ధౌమ్యుడి ముఖతః, పై శ్లోకంలో మనకు వివరించారు. బహుశః, ఇలాంటి శ్లోకాల ఆధారంగానే, "రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు” అని ధూర్జటి కవి వాపోయాడు. ఈ కాలంలో కూడా అధికారులకు అనునయంగా లేకుండా, ప్రతికూలంగా ఉంటే ఏమి జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
16-4-2017,
PBEL City, Hyderabad.
సీసం.
సార్వభౌముడు తాను చనువెంత యిచ్చినా
అధిక ప్రసంగమ్ము లాడవలదు
రాజు కొలువులోన తేజమ్ము ప్రకటించు
సాహసమ్మెన్నడూ సలుపవలదు
ప్రభువు కన్నను మించి వస్త్ర భూషణములు
దర్పమ్ము చూపగా దాల్చవలదు
అంతిపురములోని అతివల స్నేహమ్ము
చేయవలదు ,గుట్టు మోయవలదు
తే.గీ.
అప్రియమ్ములు సలుపక అణగియుండి
అహితమెన్నడు పలుకక అమిత భక్తి
పనుల,మాటల ప్రభువుల మనసు గెలిచి
పాండు సుతులార !సేవకులుండవలెను.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
136. శ్లో|| ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం
అశేష జగదీశిత్రీం వందే వరద వల్లభాం
పద్మాసన స్థితురాలు, సకల జగత్తుకు అధికారిణి, శేషత్వ, భోగ్యత్వ, రక్షత్వం అనే లక్షణాలు కలది, పరమాత్మకు వల్లభురాలివైన అమ్మా లక్ష్మీదేవీ, నీకు నమస్కారం.
మన హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవతయైన అమ్మ శ్రీమహాలక్ష్మి త్రిమూర్తులలోని విష్ణువుకు ఇల్లాలు. భృగు పుత్రిక (భార్గవి) లక్ష్మీదేవి, స్వచ్ఛమైన పాల సముద్రంలో పుట్టింది. అనగా, పాపాల సముద్రంలో ఆమె ఉండదని అర్థం. ధర్మబద్ధమైన సంపాదననే (స్వచ్ఛత) లక్ష్మి. అధర్మ పద్ధతిలో సంపాదించిన పాపపు సొమ్ములో ఆమె ఉండదని, అది ఎప్పటికైనా అలక్ష్మేయని అర్థం.
ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతీరోజూ ఆమెను పూజిస్తే సరిపోదు. మనం నివసించే ఇంటిని, ప్రాంతాల్ని, ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుని, ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సనాతన ఆర్ష సంప్రదాయాల్ని పాటిస్తే, ఆమె కటాక్షం లభిస్తుంది. అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళల్లో, ప్రదేశాల్లో లక్ష్మీదేవి నివసించదు. అందుకే, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పరిశుభ్రతకు తోడు మనస్సుద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రతి ఒక్కరికీ చదువుకోవడానికి, అతి సులభంగా ఉండే పై శ్లోకం, దాదాపు వెయ్యి సంవత్సరాల క్రిందటిదని, ఈ శ్లోకాన్ని మనసు పెట్టి పారాయణం చేయడం వల్ల, ధన ప్రాప్తి, ప్రాప్తించిన ధనం అనుభవంలోకి వస్తుందని, సంపదలు చేతికి రావడానికి బాగా ఉపకరిస్తుందని, మా నాన్న గారు చెబుతుండే వారు. చాలా కాలంగా ఈ శ్లోకం జనసామాన్యంలో లేకుండా ఎందుకు మరుగునపడి పోయిందో అర్థం కాని విషయం.
అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని మాత్రమే పూజిస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అయ్యవారైన శ్రీమహా విష్ణువుతో సహా పూజించాలి. ఎప్పుడూ ఇద్దరినీ విడిగా చూడకూడదు. అయ్యవారిని పూజిస్తే, 'విష్ణువక్షస్థలస్థితాం' ఆమె ఎప్పుడూ ఆయన వక్షస్థలంలోనే ఉంటుంది. ఆమెను పూజించినా పద్మం విష్ణు స్వరూపమని వేద ప్రోక్తం. అందుకని, ఉభయులనూ కలిపి పూజించడం శ్రేష్టం, మన ధర్మం కూడా.
ఋగ్వేదం పదవ మండలంలోని 'శ్రీసూక్తం', సర్వ శుభ లక్షణాలకు నిలయమై, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. శ్రీ సూక్తం రాని వారు చాలా అరుదు. లక్ష్మీదేవి వివిధ రూపాలైన అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములు వారి వారి రూపాలలో, తగిన ఫలితాలను తమ భక్తులకు, ముఖ్యంగా ముఖపుస్తక పాఠకులకు అందజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
15-4-2017,
PBEL City, Hyderabad
సుశ్లోకవేది మిత్రులందరికీ శుభోదయం.
దాదాపు పది రోజుల తర్వాత అందరినీ పలకరించే సావకాశం కలిగింది.ఆనందంగా ఉంది.గురువుగారికి శిరసా వందనాలు.
తే.గీ.
మువ్వురమ్మలకును మూల మూర్తివగుచు
పద్మ పీఠిపై కొలువుండు భాగ్యలక్ష్మి
హరికి రాణివి జగమేలు సిరులతల్లి
మొక్కి వేడెదమమ్మ మా దిక్కు నీవె.
హరిః ఓమ్ 🙏
శుభోదయం.
500 శ్లో|| అథాశరీరిణీ వాణీ అంతరిక్షాత్ప్రబోధినీ
మా వధీ రామ గృధ్రం త్వం పూర్వదగ్ధం తపోబలాత్
--రామాయణం, ప్ర. సర్గ 7-14-55.
అంతలో ఆకాశం నుండి అశరీరవాణి, 'రామా! తపోబలము చేత పూర్వమే పీడింపబడివున్న ఈ గ్రద్దను చంపవద్దు.
***
అందుచేత, సత్యము తెలిసినవాడు తప్పక సత్యమే చెప్పాలన్నాడు రామచంద్రుడు. "ఏతచ్ఛ్రుత్వా తు సచివా రామమేవాబ్రువం స్తదా, ఉలూకః శోభతే రాజన్న తు గృధ్రో మహామతే, త్వం ప్రమాణం మహారాజ రాజా హి పరమా గతిః, రాజమూలాః ప్రజాః సర్వా రాజా ధర్మః సనాతనః", శ్రీరాముడి మాటలు విన్న మంత్రులు, 'గొప్ప బుద్ధిగల రామా! గృధ్రము కంటే, ఈ ఉలూకము మంచి దానివలెనే కనబడుతుంది. అయినా, మహారాజా! మీరే నిర్ఢయం చేయాలి. రాజే పరమ గతి కదా! ప్రజలందరికీ రాజే మూలము. ఏలాంటి మానవులకు రాజు శిక్షకుడుగా ఉండునో, అలాంటి వాళ్ళు దుర్గతి పొందరు. యముని చేత విడువబడినవారై పురుషోత్తములౌతారు.
మంత్రుల మాటలు విన్న రాముడు, 'పురాణాలలో చెప్పిన విషయాన్ని చెబుతానని, "ద్యౌః సచంద్రార్కనక్షత్రా సపర్వతమహావనా, సలిలార్ణవసంపూర్థం త్రైలోక్యం సచరాచరమ్", చంద్ర, సూర్య, నక్షత్ర, పర్వత, మహారణ్యములతో కూడిన ఆకాశము, స్థావరజంగమములతో కూడిన మూడు లోకాలు కూడా ఒకప్పుడు సముద్ర జలంతో నిండిపోయింది. అప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా అయిపోయి, రెండవ మేరు పర్వతం వలె నిశ్చలంగా ఉండింది. పూర్వం భూమి లక్ష్మితో కలసి విష్ణువు జఠరంలో ప్రవేశించాయి. ఆమెను గ్రహించిన విష్ణువు అనేక సంవత్సరాల కాలం యోగనిద్రలో ఉన్నాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అతడి జఠరంలోకి ప్రవేశించాడు. విష్ణువు నాభియందున్న బంగారు పద్మము నుండి బయటకు వచ్చి యోగియై ఆలోచించాడు బ్రహ్మ.
గొప్ప తపస్సు చేసిన బ్రహ్మ భూమిని, వాయువును, పర్వతములను, వృక్షములను, మనుష్యులను, అండజాలను సృష్టించాడు. "తత్ర శ్రోత్రమలోత్పన్నః కైటభో మధునా సహ", చెవి గులిమి నుండి మహావీర్యవంతులైన మధు, కైటభులు జన్మించారు. వాళ్లిద్దరూ అత్యంత వేగంతో బ్రహ్మ పైకి యుద్ధానికి వచ్చారు. బ్రహ్మ పెద్దగా అరవగా శివకేశవులు వచ్చి, "చక్ర ప్రహారేణ సూదితౌ మధుకైటభౌ", విష్ణువు చక్రము చేత మధుకైటభులు చంపబడ్డారు. "మేధసా ప్లావితా సర్వా పృథివీచ సమంతతః, భూయో విశోధితా తేన హరిణా లోకధారిణా", మధుకైటభుల కొవ్వుతో భూమి అంతా నిండిపోయింది. విష్ణువు ఆ భూమిని మళ్ళీ పరిశీలించి పరిశోధించాడు.
అలాంటి భూమిని అన్ని వృక్షాలతో నింపివేశాడు. అలాగే, అనేకవిధములైన ఓషధులు, సమస్త సస్యములు మొలచాయి. "మేధోగంధా తు ధరణీ మేదినీత్యభిసంజ్ఞితా, తస్మాన్న గృధ్రస్య గృహములూక స్యేతి మే మతిః", కొవ్వు (మేధస్సు) వాసనచే భూమికి 'మేదిని' అనే పేరు వచ్చింది. భూమి మీద మనుష్య సృష్టి జరిగినప్పటి నుండి అది నా ఇల్లు అని గ్రద్ద చెప్పింది. చెట్లు పుట్టినప్పటి నుండి అది నా ఇల్లని గుడ్లగూబ చెప్పింది. అందుచేత, ఇల్లు గ్రద్దది కాదు గుడ్లగూబదే. పరగృహమును అపహరించి, పాపము చేసిన గ్రద్ద దండింపదగినదని' రాముడు సోదాహరణంగా చెప్పాడు.
ఇంతలో ఆకాశం నుండి అశరీరవాణి, 'రామా! తపోబలము చేత పూర్వమే పీడింపబడివున్న ఈ గ్రద్దను చంపవద్దు. "కాలగౌతమదగ్ధోయం ప్రజానాథో నరేశ్వర, బ్రహ్మదత్తేతి నామ్నైష శూరః సత్యవ్రతః శుచిః, గృహం తస్యాగతో విప్రో భోజనం ప్రత్యమార్గత, సాగ్రం వర్షశతం చైవ భోక్తవ్యం నృపసత్తమ", 'అశరీరవాణి ఇలా చెప్పింది. 'రాజా! ఇతడు కాలగౌతముడిచేత పీడింపబడిన రాజు. ఇతడి పేరు బ్రహ్మదత్తుడు. ఇతడు శూరుడు, సత్యవ్రతుడు, పరిశుద్ధుడు కూడా. ఒకసారి, ఒక బ్రాహ్మణుడు ఇతడి ఇంటికి వచ్చి, 'రాజా! నాకు కొంచెం ఎక్కువగా వంద సంవత్సరాలు భోజనం కావాలని కోరాడు. దానికి, బ్రహ్మదత్తమహారాజు ఏమి చేశాడో రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం.
అందరం సంస్కృతం నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.
అంబాళం పార్థసారథి,
14-04-2018, శనివారం,
PBEL City, Hyderabad.
గురువుగారికి నమస్సులు.నా సీసపద్యాన్ని ఇష్టపడే గురువుగారి కోసం ఈ సీస పద్య కానుక
సీసం
సంస్కృత సాహిత్య సాగరము మధించి
వెతికి శ్లోకనిధులు వెలికితీసి
భావార్థముల నెల్ల బాగుగా గ్రహియించి
అవసరమైనంత వ్యాఖ్య జేసి
ప్రతివారి స్పందన లతి జాగరూకతన్
చదివి యందరికిని బదులొసంగి
విసుగు విరామముల్ వేళ మించుట లేక
చీకట్లు విడకనే శ్లోకమిచ్చి
ఆ.వె.
యాగమటుల దీక్షగా గొనుచు నిది చే
పట్టి పూర్తి జేసె పంచ శతము
పట్టుదలకు పేరు పార్థ సారథి యన
గురిని జూపినారు గురువుగారు.
సింహాద్రి జ్యోతిర్మయి
14.4.2018.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
135. శ్లో|| ఆశాప్రతీక్షే సంగతం సూనృతాం చ
ఇష్టా పూర్తే పుత్ర పశూంశ్చ సర్వాన్
ఏతద్ వృఙ్క్తేపురుషస్యాల్ప మేధసో
యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే
--కఠోపనిషద్ 1-8.
ఎవరి ఇంట అతిథి భోజనం చేయకుండా ఉంటాడో, ఆ ఇంట ఆశలు, ఆకాంక్షలు, సజ్జన సాంగత్య ఫలం, మధుర సంభాషణా ఫలం, పుత్రులు, పశువులు, నశిస్తాయి.
అతిథి సత్కారాలు భూలోకంలోనే కాదు అన్నిచోట్లా ముఖ్యమే అని చెప్పుకునే కథ, కఠోపనిషత్ లో వస్తుంది. పరిస్థితుల దృష్ట్యా నచికేతుడు యమలోకంలో మూడు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. పని మీద వెళ్లిన యముడు రాగానే, ఆయన మంత్రులు నచికేతుని రాక, ఉపవాసం గుఱించి చెపుతూ, "వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్", యమధర్మరాజా, అగ్నిలాంటి అతిథి, గృహంలో ప్రవేశిస్తూనే ఉదకం ఇవ్వాలి. అతిథి యమలోకంలో కూడా పూజనీయుడే అని నీరు అందిస్తారు.
యమధర్మరాజులాంటి మహనీయుడే ఒప్పుకొని, అతిథి సత్కారాలు చేసినప్పుడు, మనమెంత? మనలో మార్పు తెచ్చుకోవాలంటే, అందరితో పోల్చుకోకుండా, ముందు మనం మారాలి. మనవల్ల ఆతిథ్యం పొందిన వారు, తమకు లభించిన ఆత్మానందాన్ని ఎన్నడూ మరచిపోరు. కాబట్టి, ఎవరినైనా సరే, మన అంతరాత్మ ప్రబోధంతో ఆనందంగా ఆదరించాలి. మనం ఆచరించే విధానం మంచిదైనప్పుడు సమాజం ఏదో ఒకరోజు అర్థం చేసుకొని, అభినందించి నీ మార్గంలో నడుస్తుంది.
అసూయ, అనాదరణ, అహంకారం, ఆడంబరం, లాంటివి ఎప్పుడైతే మనలో చోటు చేసుకుంటాయో, ఆపదలు మనతో పాటు మన కుటుంబాన్ని కూడా కబళిస్తాయి. అదే, సౌజన్యం, సౌశీల్యం, సానుభూతిని చూపిస్తే, అందరూ స్నేహపాత్రులౌతారు. అతిథి పట్ల మనం తప్పక చూపాల్సిన కనీస గుణాలవి. మనం సహృదయంతో మాట్లాడే మంచి మాటలతో ఎదుటి వారిలో కూడా ప్రశాంతతను తీసుకరావచ్చును.
మనమంతా ఒకరికొకరం ఆతిథ్యమిచ్చుకోవడం వలన, భౌతికంగా, మానసికంగా, పరస్పరం ఎన్నింటినో పంచుకోగలుగుతాము. దానివలన అనాదరణ, అహంకారం, అజ్ఞానం లాంటి దుర్గుణాలకు దూరమౌతాము. దీనికి తోడుగా, అనురాగం, ఆదరణ, ఆత్మీయత, ఆర్తి, ఆర్ద్రత లాంటి మంచి గుణాలకు దగ్గరౌతాము. తత్ఫలితంగా సమాజంలో మంచిని పెంచే దిశగా పయనిస్తాం.
ఈ కాలం యువతరాన్ని, ఒంటరితనం, ఒత్తిడి బాగా పట్టి పీడిస్తున్నాయి. వచ్చిన అతిథులతో చక్కగా గడపడం వల్ల, ఒంటరితనం, మానసిక ఒత్తిడి తగ్గి పోతుంది. వారి జీవితం కూడా మంచి స్థితిని పొందుతుందని, ఈనాడు చాలా మంది మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలా, తమలోని బలహీనతల్ని పోగొట్టుకొని, నేటి యువత ఒక ఆదర్శవంతమైన, బలమైన జాతిగా ఎదగాలంటే, సహృదయులందరూ కలవాలి, పరస్పరం మాట్లాడుకోవాలి, ఆహ్వానించుకోవాలి, ఆతిథ్యమిచ్చుకోవాలి, ఆదరించుకోవాలి, ఆనందించాలి. "అతిథి దేవోభవ! మర్యాదను గౌరవించుకోవాలి", గౌరవిద్దామా!
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
14-4-2017,
PBEL City, Hyderabad.
ఆ.వె.
ఆరగింపకుండ అతిథి యాకలిచేత
వెళ్ళిపోవు ఇంట మళ్ళిపోవు
పసులు,పుత్ర లాభ భాగ్యమెల్ల
మధుర వాక్ఫలమును మంటగలియు.హరి ఓమ్ 🙏
శుభోదయం.
133. శ్లో|| అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే
ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః
--రామాయణం.
చెయ్యవలసిన పని ఏమిటో తెలిసిన తర్వాత, దూతలు అనవసర విషయాల గుఱించి ఆలోచించకూడదు. 'అన్నీ మాకే తెలుసు' అనుకొని అసలు పనులను చెడగొట్టుకుంటారు.
వంద యోజనాల దూరాన్ని, గరుత్మంతుడు ఆకాశమార్గంలో ముందుకు సాగిన విధంగా, హనుమంతుడు సునాయాసంగా ఎగిరి త్రికూటపర్వతానికి సమీపంలో నున్న లంబపర్వత శిఖరం మీద దిగాడు. ఆ పర్వతం మీద నుండి ఎదురుగా త్రికూట పర్వత శిఖరం మీద నున్న లంకానగరాన్ని చూశాడు. లంకానగరం చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి. ఒకటి మట్టిది, రెండవది రాతిది. మూడవది బంగారు ప్రాకారం.
ప్రాకారాల చుట్టూ కందకాలు, వాటి నిండా నీరు, నీటిలో కలువ పువ్వులూ, తామర పువ్వులూ చూడ ముచ్చటగా కనిపించాయి. అనేకమంది రాక్షసులు అప్రమత్తులై కోట చుట్టూ రక్షణ వ్యవస్థ మధ్య లంకానగరం రమణీయంగా కనబడింది. అందమైన ఏడు, ఎనిమిదంతస్తుల మేడలు, వాటికి బంగారు రేకుల ముఖద్వారాలను చూసి,
లంకానగర వైభవాన్ని అంచనా వేసుకొని, సూక్ష్మ రూపంతో చేరుకున్నాడు హనుమ.
లంకానగరం బయట నుంచి చూస్తే, పటిష్టంగా, దుర్భేధ్యంగా ఉంది. చుట్టూ ఉన్న మహాసముద్రం మరో ప్రత్యేక రక్షణ. నగరం ఉత్తర ద్వారం వైపు నడుస్తూ హనుమ ఆలోచనలో పడ్డాడు. 'వానర వీరులు ఎంత మంది వచ్చినా, ఈ నగరాన్ని ఏమి చేయగలరు? "న యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి" దేవతలు యుద్ధం చేసైనా లంకను జయించలేరు, ఇక రాముడు మాత్రం ఏమి చేయగలడని' అనుకున్నాడు.
ఈ రాక్షసుల దగ్గర సామదానభేదోపాయాలు పని చెయ్యవు. యుద్ధం చేసి వీళ్లను లొంగదీసుకోవడం అంత సులభం కాదు. అయినా, కిష్కింధ నుండి ఇక్కడికి ఎంత మంది రాగలరు? అంగదుడు, సుగ్రీవుడు, నేను, నీలుడు, మాత్రమే సముద్రాన్ని దాటి రాగలరు. ఛ, ఛా! ఇదేమిటి, ఇంత పిరికిగా ఆలోచిస్తున్నాను. నన్ను దూతగా ఇక్కడ ఏమి చేయాలో చెప్పారు. సీతమ్మ ఎక్కడుందో కనిపెట్టి రమ్మన్నారు.
నేనేదో తెలిసినవాడిలా, పని చేయక ముందు ఏమౌతుంది? చేశాక ఏమౌతుంది? ఈ పని వల్ల లాభమెంత? నష్టమెంత? ఇలా అక్కరలేని విషయాలను, అతి తెలివిగా ఆలోచిస్తున్నాను. ఇలా అనవసరంగా ఆలోచించే దూత అప్పగించిన పనిని తప్పక పాడు చేస్తాడు. అసలు, నేను చేయవలసిన పని ఏమిటో, నా ప్రభువు స్పష్టంగా చెప్పారు, ఆ పని ఎలా? ఏ ఉపాయంతో సాధించాలి అని మాత్రమే ఆలోచించాలి.
అవును. ఇప్పుడు నేను వచ్చిన పని గుఱించే ఆలోచిస్తాను. ముందుగా, లంక లోకి ఎలా వెళ్లాలి? సీతమ్మను ఎలా, ఎక్కడ వెదకాలి? సీతమ్మ ప్రాణాలతో ఉందా? లేదా? ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చూడాలి? దానికేమైనా ఉపాయముందా? అని మాత్రమే ఆలోచించాలని నిర్ణయించుకుంటాడు మహావీరుడు హనుమంతుడు.
ఆ కాలంలో దూతలు, ఈ కాలంలో రాయభారులు, మధ్యవర్తులు. అలా మనం పని చెడగొట్టుకోకుండా హనుమలా సాధించుకొని రావాలి.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
12-4-2017,
PBEL City, Hyderabad.
తే.గీ.
చేయవలసిన కార్యమ్ము స్థిరముగాను
బుద్ధిలోనెంచి సాధించ పూనుటొకటె
దూతవిధి, వేరొకపనిని దూరనేల?
మేటి నేనను అహమెంతొ చేటుదెచ్చు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
131. శ్లో|| అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు
--భగవద్గీత 13-10.
మానసికంగా దేని పట్ల ఆసక్తి చూపకపోవడం, సంతానం, భార్య/భర్త, ఇల్లు, సంపద, పదవులు, ఇలాంటి వాటి మీద అనభిష్వంగః, తృష్ణ, వ్యామోహాన్ని వదిలిపెట్టాలి. అవి లేకపోతే బ్రతకలేను అనే భావాన్ని వదిలిపెట్టాలి. ఇష్టానిష్టాలు, సుఖదుఃఖాల పట్ల సమ భావం కలిగియుండాలి.
మన మనసు ప్రపంచానికి సంబంధించిన విషయాల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. కళ్లు మూసుకొని ధ్యానానికి కూర్చున్నా, పూజ చేస్తున్నా, మనసు దేవుడి మీద పట్టుమని పది నిముషాలు కూడా నిలబడదు. పనికిమాలిన విషయాలన్నీ అప్పుడే గుర్తుకు వస్తాయి. మనసును అదుపులో ఉంచుకొనే సాధన చేయాలి. మన చుట్టూ ఉన్న వాటి పట్ల ఆరాటపడడం, మమకారం పెంచుకోవడం, వెంపర్లాడడం, అవి లేకపోతే నేనుండలేను అనేవి ఉండకూడదు.
పెళ్లి కాలేదనే బాధ, పెళ్లైతే పిల్లలు కాలేదని, కొడుకులు పుడితే కూతుళ్లు లేరని, కూతుళ్లు పుడితే కొడుకులు లేరనే బాధ, కొడుక్కి ఉద్యోగం లేదనే బాధ, ఉద్యోగం వస్తే పని ఎక్కువని, కూతురుకి పెళ్లి కాలేదని, కొత్త ఇల్లు కొనలేకపోయామని, ఇలా అన్నీ బాధలే. ఇవన్నీ సఫలమైతే, వాటి వల్ల సంతోషాలుంటాయి, ఉండవనికాదు. అయితే, మనకు లభించే సంతోషం తక్కువ, దుఃఖం పాళ్లు ఎక్కువ. కాబట్టి, ఇలాంటి వాటి పైన ఆసక్తి పరిమితంగానే ఉండాలి. ఇవన్నీ అసక్తి క్రిందకు వస్తాయి.
కొందరికీ మమకారం పాళ్లు ఎక్కువగా ఉంటుంది. నేను చచ్చినా పరవాలేదు గానీ, నా ఆస్తి ఇంకొకరికి పోవడానికి వీలులేదని అంటుంటారు. అంటే, వాళ్లకు ప్రాణం కంటే ధనం ఎక్కువైపోయింది. దేనిపైనా అంతటి మమకారం, వ్యామోహం పనికిరాదు. ఏమైనా అనుకోనిది జరిగితే, దుఃఖం రెట్టింపు అవుతుంది. అందుకని, ప్రేమానురాగాలు ఒక పరిధిలోనే, హద్దులు దాటకుండా మన ఆధీనంలోనే ఉండాలి. అందువలన, అనభిష్వంగము (వ్యామోహం లేకపోవడం), అసక్తిని అలవఱచుకోవాలి.
మన నిత్య జీవితంలో ఇష్టమైన వాళ్లు, ఇష్టమైన వస్తువులు, అలాగే ఇష్టంలేని వారు తారసపడుతుంటారు. వీటి రెండింటి పట్ల సమ భావన ఉండాలి. ఇష్టమైనవైనా అతిగా తింటే, అజీర్తి చేస్తుంది కదా! అలాగే, బాగా ఇష్టమైన వారితో ఎక్కువ మమకారం, అనుబంధం పెట్టుకున్నా, అంతే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి, రెండింటిని సమానంగా చూసుకోగలిగిన మనస్సుండాలి. అలా ఉంటే, వాటి చిక్కుల్లో చిక్కుకోము.
"నిత్యం చ సమచిత్తత్వమ్" అంటే, ఎవరిపైనా ద్వేష భావం లేకుండా అందరి పట్ల, అన్నింటి పట్ల సమ భావంతో మెలగాలి. జీవితమన్న తర్వాత సుఖదుఃఖాలు, లాభనష్టాలు, బాధలు, చిన్న చిన్న ఆనందాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి, అంతగా కంగారు పడిపోగూడదు. సమత్వ భావన సాధిస్తే కంగారు కొంత తగ్గుతుంది. అలాంటి భావన, మనం చేసే భగవధ్యానం వలన, అందరిలో దైవాన్ని చూడడం వల్ల ఇది సాధ్యమవుతుందని మనం తెలుసుకోవాలి.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారధి,
10-4-2017,
PBEL City, Hyderabad,
తే. గీ.
సతియు ,సంతానము,గృహము,సంపదలును
పదవులనెడు వ్యామోహము మదికి వలదు
సమమనెంచి యిష్టానిష్ట చయమదెల్ల
తామరాకున బిందువై తనరవలయు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
130. శ్లో|| అంతఃస్థః సర్వభూతానామ్ ఆత్మా యోగేశ్వరో హరిః
స్వమాయయావృణోద్గర్భం వైరాట్యాః కురుతంతవే
--భాగవతం 1-8-14.
సర్వ ప్రాణులకు ఆత్మ స్వరూపుడై, సర్వ యోగులకు ప్రభువైన శ్రీకృష్ణ భగవానుడు కురువంశము యొక్క ఒకే ఒక సంతానాన్ని నిలబెట్టుటకు విరాటరాజు పుత్రిక, ఉత్తర గర్భములోకి ప్రవేశించి, 'అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని, తన మాయా శక్తితో అడ్డుకొని వంశాంకురాన్ని కాపాడాడు'.
మహాభారత యుద్ధం చివరలో గాఢ నిద్రలోనున్న, ద్రౌపది ఐదుగురి పుత్రులైన, ఉపపాండవులను అతి కిరాతకంగా చంపిన అశ్వత్థామను పట్టుకొని, అతడి శిరస్సుపైనున్న మణిని, కేశములతో సహా కత్తితో పెకిలించి, బ్రాహ్మణుడిని చంపరాదు కాబట్టి, శ్రీకృష్ణుడి ఆజ్ఞతో శిబిరం నుండి బయటకు గెంటివేస్తాడు అర్జునుడు. తమ పుత్రులకు దహన సంస్కారం, ఇతర కర్మలు చేస్తారు పాండవులు.
మరణించిన తమ పుత్రులకు గంగానదిలో తర్పణాదులు ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, పాండవులు, వ్యాసాది మహర్షులు, శ్రీకృష్ణుడితో సహా బయలుదేరి వెళ్తారు. మరణించిన వారందరికీ తర్పణాలు విడిచి నదిలో స్నానం చేస్తారు. ఒడ్డున కూర్చొని దుఃఖిస్తున్న వారి దగ్గరకి వెళ్లి, పుట్టిన వారు గిట్టక తప్పదని వేదాంత బోధ చేసి, ఓదార్చే ప్రయత్నం చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు.
పిదప అజాతశత్రువైన ధర్మరాజు చేత మూడు అశ్వమేధ యాగాలను చేయించి, పాండవుల కీర్తిని నలు దిశలకు విస్తరింపజేస్తాడు శ్రీకృష్ణుడు. తర్వాత, ద్వారకకు వెళ్లాలని నిశ్చయించుకొని, వ్యాసుడు ఇతర మహర్షులను పూజించి, తానూ వారిచే పూజలందుకొని, పాండవులను సమీపించి, ఆప్యాయంగా కరచాలనము చేసి వచ్చి, సాత్యకి, ఉద్ధవులతో రథము ఎక్కుచుండగా, ఎంతో ఆదుర్దాగా, భయంతో, కంగారు పడుతూ, శ్రీకృష్ణుడి దగ్గరకు పరుగెత్తుకొని వచ్చింది అభిమన్యుడి భార్య ఉత్తర.
"హే! ప్రభూ, కరుణాంతరంగా, మండుచున్న ఇనుప బాణం, నా వెంట పడుతున్నది. నేను చచ్చినా పరవాలేదు, కానీ (మా మే గర్భో నిపాత్యతామ్) 'నా గర్భానికి హాని కలుగరాదు'. ఈ లోకంలో నువ్వొక్కడివే నన్ను కాపాడేది" అంది ఉత్తర. ఇంతలో మరో ఐదు బాణాలు పాండవుల వైపు రావడం గ్రహించిన పరమాత్మ, అపాండవం చేయడానికి అశ్వత్థామ ప్రయోగించిన బ్రాహ్మస్త్రమని గ్రహించి, తనయందే అనన్య భక్తి కలిగిన పాండవులకొచ్చిన ఆపదను, సుదర్శన చక్రంతో అడ్డుకుంటాడు పరమాత్మ.
ఆలస్యం చేయకుండా, ఆ ఆర్తత్రాణపరాయణుడు, పాండవుల ఆశాజ్యోతియైన ఒకే ఒక సంతానాన్ని కాపాడుటకై, ఉత్తర గర్భంలోకి ప్రవేశించి, తన మాయ చేత బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. వైష్ణవ తేజస్సు ముందు బ్రహ్మ తేజస్సు శాంతించింది. బ్రహ్మాస్త్ర తేజస్సు నుండి విముక్తులైన పాండవులు, ద్రౌపదితో సహా కుంతి వచ్చి, ప్రయాణానికి సిద్ధమవుతున్న శ్రీకృష్ణ పరమాత్మను అనన్య భక్తితో పూజించింది.
శ్లో|| కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ,
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః
(పై శ్లోకం కూడా కుంతీదేవి చేసిన శ్రీకృష్ణ స్తుతి లోనిదే:1-8-21)
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
09-4-2017,
PBEL City, Hyderabad.
సీసం.
మృత్యు ముఖములోన మిత్రుడుండగ జూచి
రోష దుఃఖ వశుడై ద్రోణ సుతుడు
సహియింప జాలక ,మహి నపాండవ మొన
రింతు నేనని,మంతరించి విడువ
బ్రహ్మాస్త్రమది యుప పాండవులను జంపి,
ఉత్తర గర్భాన నున్న వాని
చంపజూడగ నేగ,చక్రమడ్డుచు,పాండు
వంశాంకురమ్ము కాపాడు హరియె
తే.గీ.
అన్ని జీవులయందుండు ఆత్మ తాను
సర్వ యోగులకెల్లను స్వామి తాను
అతని మాయను గెలువలేరితరు లెవరు
నీవె దిక్కని మొక్కినన్ కావగలడు.
హరి ఓమ్ 🙏
శుభోదయం.
132. శ్లో|| అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్
ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోన్యథా
--భగవద్గీత 13-12.
ఆధ్యాత్మిక జ్ఞానము నిరంతరం కలిగియుండుట, తత్వ జ్ఙానము ప్రయోజనమును తెలుసుకొనుట, ఇది అసలైన జ్ఞానమని చెబుతాడు కృష్ణ పరమాత్మ. దీనికి విరుద్ధమైనదంతా అజ్ఙానమని తెలుసుకోవాలి.
"అధ్యాత్మజ్ఙాననిత్యత్వమ్" అంటే ఎప్పుడో ఒకసారి భగవంతుడిని తలుచుకుంటే సరిపోదట. నిరంతరం పరమాత్మ ధ్యాస కలిగి ఉండాలి. మన చేతిలో నున్న దీపం ఆరిపోతే, వెంటనే అంధకారం ఆవరిస్తుంది. అలాగే, మనలోని జ్ఙాన దీపాన్ని జారవిడుచుకుంటే, వెంటనే అజ్ఙానమనే చీకటిలో ఉండిపోవలసి వస్తుంది.
అందుకనే, "తత్వజ్ఙానార్థదర్శనమ్" అంటే, తత్వ జ్ఙానాన్ని మాటలలో కాకుండా, ప్రత్యక్షంగా దర్శించి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు, భగవద్గీత, భాగవతం, ఇతర పుస్తకాలు కేవలం చదవడం వలన ఉపయోగం ఉండదు. ఎందుకు చదవాలి? ఎలా చదవాలి? అందులో ఏమి చదవాలి? చదివితే ఎలాంటి లాభం వస్తుంది? ఇలా తీక్షణంగా ఆలోచించి గమ్యాన్ని నిర్దేశించుకోవాలి.
ఏదో తీరిక దొరికింది కదా! ఒకసారి గీతను తిరగేస్తే పోతుందనో! ఎవరో ప్రవచనం చెబుతున్నారు, ఒకసారి వింటే సరిపోతుందనో! ఏలాంటి గమ్యం లేకుండా, అలా వెళ్లొస్తూ, ఆలోచిస్తుంటారు. ఇంకా కొంతమంది, "ఏదో ఊరికే కూర్చున్నాము కదా! పోనీలే, ప్రవచనం దగ్గర కూర్చుంటే, కొంచెం పుణ్యం, పురుషార్థమైనా వస్తాయని" అంటుంటారు. ఇవే గమ్యం లేని పనులంటే. గమ్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని చేరితే దొరికే ఆనందం, ప్రశాంతత, అది వేరు. సాధకుడికి ఆత్మ దర్శనం చాలా ముఖ్యం.
అసలు జ్ఙానము అంటే, ఈ క్రింది 20 లక్షణాలను అలవర్చుకోవాలంటాడు పరమాత్మ.
1. తనను తాను పొగుడుకోక పోవడం, 2. డంబము, దర్పము లేకపోవడం, 3. ఇతర ప్రాణులను హింసించకపోవడం, 4. ఓర్పు కలిగి ఉండడం, 5. ఆర్జవం అంటే ఋజుప్రవర్తన కలిగి ఉండడం, 6. గురువును సేవించడం, 7. శుచిత్వం, శారీరక, మానసిక శుద్ధి, 8. సన్మార్గంలోనే ఉండడం, 9. మనో నిగ్రహం,10. ఇంద్రియాలను ఆకర్షించే వాటిపై విరక్తి భావన,11. అహంకారం లేకుండుట,12. జనన, మరణ, వార్ధక్య, రోగాల వలన కలిగే దుఃఖం నుండి దూరంగా ఉండుట.
13. భార్య/ భర్త, ఇల్లు, సంతానం, ఆస్తులపై ఆసక్తి లేకుండుట,14. ఒకవేళ, ఆసక్తి ఉన్నా అదే లోకంగా చేసుకోకుండా ఉండుట, 15. సుఖదుఃఖాలు, ఇష్టానిష్టాలలో సమభావన కలిగియుండుట,16. పరమాత్మ యందు ఆనన్య భక్తి ఉండుట, 17. సాధ్యమైనంత వఱకు ఏకాంతంగా ఉండడం, 18. ఏ పని చేస్తున్నా, పరమాత్మ ధ్యాస కలిగి ఉండుట, 19. ఎప్పుడూ ఆధ్యాత్మ జ్ఙాన నిమగ్నత, 20. తత్వజ్ఙాన దర్శనం.
పైన చెప్పిన 20 లక్షణాలను బాగా తెలుసుకొని, వాటిని ఆచరించడమే జ్ఙానము. చెప్పినవి గాక మిగిలినవన్నీ అజ్ఙానమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ లక్షణాలలో కొన్నింటినైనా ఆచరణలో పెట్టటానికి ప్రయత్నిద్ధాం.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.
అంబాళం పార్థసారథి,
11-4-2017,
PBEL City, Hyderabad.
తే. గీ.
నిరత మాధ్యాత్మ విద్యలు నేర్చుటయును
తత్వ విజ్ఞాన ఫలితమ్ము దాల్చుటయును
పార్థ !అసలైన జ్ఞానమ్ము కర్థమగును
ఇతరమెల్లను యఙ్ఞానమిది నిజమ్ము.
హలో!
సుశ్లోక వేది మిత్రులందరికీ నమస్సులు.చాలాకాలం తర్వాత మిమ్మల్నందరినీ ఇలా పలకరించటం సంతోషం. పార్థ సారథుల వారిని గురువుగా భావిస్తూ,వారి అపార సాహితీ కృషిని గమనిస్తూ ఈ మాట అనకూడదు గానీ అంతటి సమయ సంయమనం ,పట్టుదల లోపించిన కారణంగా పనుల ఒత్తిడితో దాదాపుగా రెండు నెలలుగా ఈ వేదిక కు దూరమయ్యాను.గురువుగారి రెండు వందల శ్లోకాల సంపూర్తి సందర్భంగా గురువుగారి కృషిని నా పద్య భాషలో ప్రశంసించకుంటే ఆయన శిష్యురాలిని అని చెప్పుకునే అర్హత నీకులేదు అని మనసు గద్దిస్తోంది.అందుకే గురువర్యా!ఈ శుభ సందర్భంలో నా అభినందన పద్యాన్ని స్వీకరించి నన్ను ధన్యురాలుని చేయమని ప్రార్థిస్తున్నాను.
సీసం.
లోకమ్ము నిదురించు చీకటి పొద్దులన్
.......నిద్దుర మేల్కాంచి నియతితోడ
అమరభాషను గల అద్భుత శ్లోకముల్
........దినమొక్కటందించు దీక్షబూని
వంకలు చూపక,వార్ధక్యమనబోక
.........సమయభంగము కాక శ్రద్ధతోటి
సర్వులానందింప సముచిత వ్యాఖ్యలన్
.....,జోడించి వ్రాయు సుశ్లోక వేది
తేగీ.
రెండు వందల శ్లోకాల దండలోన
దార మనునట్లు తమకృషి దాగి యుంది
చదువరుల సొమ్ము సాహితీ సౌరభమ్ము
పార్థసారథి గురువర్య!ప్రణతులయ్య!
Comments
Post a Comment