19.సీసోత్తరం
సుశ్లోకవేది మిత్రులకు శుభోదయం.
గురువుగారికి నమస్సులు.
సీసం.
రత్నహార మొసగి రాముడా హనుమను
గారవించిన యంత ఘనముగాను
మేరువుశిఖరాన మెరయు చంద్రుడనగ
హనుమ వక్షమున యా హార మమర
వారి బంధముగని చేరి వానరులెల్ల
మురిసి రామపదము మొక్కినారు
సోదర సముడైన సుగ్రీవుడున్ రాక్ష
సాధిపుడగు విభీషణ ప్రముఖులు
తే.గీ.
రాము వీడ్కొని చన కాళ్ళు రానివారై
మిగుల దుఃఖపడుచు రాము నగరు బాసి
జీవము నొదిలి పోయెడు జీవులవలె
విభుడు శ్రీరాము సన్నిధి వీడి చనిరి.
సుశ్లోకవేది మిత్రులకు శుభ రాత్రి
గురువుగారికి నమస్సులు.
సీసం
బంధు హితులనెల్ల పరమాదరము తోడ
సత్కరించి పిదప సాగనంపి
తమ్ములతో గూడి యిమ్ముగా రాముండు
ముచ్చటాడుచు తాను మురియుచుండ
అపరాహ్ణ వేళలో యాకాశమందుండి
వినిపించె నొకవాక్కు విస్మయముగ
సౌమ్యుడా!శ్రీరామ!సన్నుతించెద నిన్ను
పుణ్యుడా!గొనుము నే పుష్పకమును
తే.గీ.
రావణు వధించి జగముల రక్షసేసి
వెలుగు రాముని జేరుమా వేడ్క మీర
యని కుబేరుడు కర్తవ్య మానతివ్వ
చేరుకొంటి చెంతకు నను స్వీకరించు.
సీసం.
ముదిమి పైబడిననూ చెదర దారోగ్యమ్ము
ప్రజలకిపుడు మృత్యు భయము లేదు
నెలలు నిండు సతులు సులువుగా ప్రసవింత్రు
పడతులకిక కాన్పు భయము లేదు
నెల మూడు వర్షమ్ము లిలను గురియుచుండె
పంట చేల కరువు భయము లేదు
హాయి గూర్చుచు వీచె వాయువు లీనాడు
ప్రకృతి ప్రకోపాల భయము లేదు
తే.గీ.
రాము డేలవలెను మమ్ము ప్రేమ తోడ
యెల్లకాలమనుచు జను లుల్ల మలర
పలుకుచుండి రన్నా!యని భరతు డనగ
సంతసించె రాముడు ప్రజ సంతసముకు.
.
సీసం.
తలచినపుడు నేను కొలువు చేయగరమ్ము
వీడ్కోలు నీకిప్డు వెడలుమనుచు
పూజించి రాముడా పుష్పకమును పంపి
రాజ్య పాలనమున రక్తుడయ్యె
రాచ కార్యమ్ముల నాచరించి పిదప
సీతమ్మ దరికేగు సేద దీర
మువ్వురత్తల సేవ మోదమ్ముతో జేసి
సింగారియై జేరు సీత పతిని
తే.గీ.
స్వర్గ లోకపు నందనవనము వోలె
బ్రహ్మ నిర్మితమగు చైత్ర రథము వోలె
హాయి గూర్చెడు వనసీమ లందు వారు
చేయి చేయిగ విహరణల్ జేసినారు
సీసం.
అవనిపైన కనగ నాదర్శ దాంపత్య
మనుమాటకే తాము అర్థమనగ
స్వర్గలోకము వీడి శచియు దేవేంద్రుడున్
వెడలి యయోధ్యలో వెలసిరనగ
సతి యరుంధతి వచ్చి పతి వశిష్ఠుని గూడి
సాకేత పురి నుండసాగె ననగ
త్రికరణ శుద్ధితో నకలంకమగు ప్రేమ
నా రాముడున్ సీత యనగి పెనగి
తే.గీ.
పూల పొదరిండ్ల విహరించి పులకరించి
సౌఖ్య వారాశి దేలుచు సంతసించి
కోరి మృష్టాన్న మిర్వురున్ కొసరి తినుచు
కనులపండువై చేసిరి కాపురమ్ము.
తే.గీ.
ముద్దు దాంపత్య మీరీతి మురిసి సాగ
నెలత సీతమ్మ నెలతప్పె నింతలోన
యెరిగి రాముడా శుభవార్త నెదను పొంగి
పత్ని లాలించి ప్రేమతో పలికెనిట్లు.
సీసం.
ఇంతిరో!నీయందు యినవంశ తేజమ్ము
రూపు దిద్దుకొనియె పాపడగుచు
రమణిరో!నీవల్ల రఘువంశ వృక్షమ్ము
మారాకు వేసె కుమారు డగుచు
మగువరో! చూలాలు మదికోర్కె లీడేర్చు
భాగ్యమబ్బెను సీత భర్తకిపుడు
చెలియరో!నీ వేడ్క చెల్లించగలవాడ
కోరుకొమ్మన కొమ్మ కోరెనిట్లు
ఆ.వె.
వనములందు నాథ!మునిపత్నులన్ గూడి
మెలగవలయు ననుచు కలిగె మనసు
ఆదరమ్ము జూపి యటకంపు మనె సీత
సాధ్వి పలుకు భావి చాటు గాదె!
సుశ్లోకవేది మిత్రులకు శుభ సాయంత్రం.
గురువుగారికి నమస్సులు.
సీసం.
బలిమితో దనుజుండు ప్రభుని కూరిమి సతి
నపహరించదలచి యామె కడకు
వడి జని జానకి నొడిని కూర్చొనజేసి
తరలించి లంకలో చెరను బెట్టి
రాక్షసాంగనలను రమణికి కాపుంచి
యేడాది యాశతో నింట నుంచ
యట్టి సతినిదెచ్చి యరమరయే లేక
యేలుకొనెడు రాముడెంత వెఱ్ఱి
తే.గీ.
మన సతుల విషయమ్మున మనముగూడ
నేటి నుండియు రాముని బాటలోన
నేగ వలెనేమొ సైరించి యేల ననగ
రాజు ననుసరింపవలెను ప్రజలు గాన.
ఆ.వె.
అనెడు జనుల మాట లచ్చటచట మేము
వింటిమనగ రామ విభుడు కుమిలి
ముచ్చటించవలెను మువ్వురు తమ్ములన్
వేగ రమ్మనుచును పిలువనంపె.
Comments
Post a Comment