11/11.రోజుకో చరిత్ర (నవంబర్)









నేడు  November 13
World kindness day
సందర్భంగా నా కవిత

 ...నీ (లో )  దయ (రా)లేదా!..

ఒకప్పుడు నిన్ను
హృదయంలో
నింపుకునేవాళ్ళం

పెదవులతో వ్యక్తం చేసేవాళ్ళం

కళ్ళల్లో కురిపించేవాళ్ళం

చేతల్లో చూపించేవాళ్ళం

నేడు 
అడవుల్ని అంతం 
చేసినట్లుగా
నిన్ను అంతం చేసేశాం

సంప్రదాయాన్ని
వదిలేసినట్లుగా
నిన్ను నెట్టిపారేశాం

మానవత్వాన్ని విడిచి
మతాన్ని నమ్మినట్లుగా
భగవంతుణ్ణి విడిచి
బాబాలను ఆశ్రయించినట్లుగా
నిన్ను విదిలించికొట్టి
స్వార్థాన్ని కొలుస్తున్నాం

ఇప్పుడు నీ ఉనికి
శిలగా మారిన
బుద్ధదేవుని మోములో
మాత్రమే కనిపిస్తోంది
మదర్ థెరిస్సా
మేని ముడతల్లోనే
దాగిపోయింది
మాలో అది కలగానే 
మిగిలిపోయింది

నువ్వే మాలో ఉంటే

అనాథాశరణాలయాలు
పుట్టుకువచ్చేవా!
వృద్ధాశ్రమాలు
ఊరికొకటి వెలిసేవా!
అత్యాచారాలు
హత్యాకాండలు
నిత్యకృత్యాలు అయ్యేవా!

ఓ దయామతల్లీ!
మళ్ళీ ఒకసారి వచ్చి
మమ్మల్ని ఆవహించు
మానవతను బ్రతికించు
మానవజాతిని ఉద్ధరించు.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

13.11.2020





బాలల దినోత్సవం సందర్భంగా నా కవిత

పంతులమ్మ ప్రపంచం

అదొక ఆలయం
అక్కడ గంటలు మోగుతుంటాయి
కాలాన్ని,కర్తవ్యాన్ని
గుర్తుచేస్తూ....
ఉదయాన్నే
ఉరుకులు పరుగులతో
అందులోకి అడుగుపెడతాను

నేను నడిచివెళ్ళే
ఆ దారంతా
నానాజాతి పువ్వుల
నవనవల కదంబవనం

నవ్వుతూ
 నమస్కారం పెట్టేవాళ్ళు,
నా ఉనికినే
గుర్తించని వాళ్ళు,
కుదురులేని కోతులు,
బెదురుచూపుల జింకలు,
ముద్దుపలుకుల చిలకలు,
గుక్కపట్టిన గువ్వలు
అడుగడుగునా
ఆ ప్రాంగణం
యూనిఫాం వేసుకున్న
అమాయక ప్రాణుల
అభయారణ్యం

బడిగంట వినగానే
బారులు తీరి
ముచ్చటగా చేరి
ప్రార్థన ముగిస్తారు

క్రమశిక్షణ తో కదిలే
చీమలదండులా
క్లాసురూములకు 
కదులుతారు

ఇక నా తరగతి గదిలోని
పిల్లలు
తలా ఒకరకం

అన్నీ నేర్చుకోవాలనే
ఆసక్తి ఉన్నవాళ్ళు,
ఏదీ బుర్రలోకి
ఎక్కించుకోనివాళ్ళు,
వినయంతో శ్రద్ధగా వినేవాళ్ళు,
భయం,భక్తి లేని బద్ధకస్తులు
ఇందరికీ నేను
ఇష్టంగానే  
పాఠం చెబుతాను

ఒకరి తెలివి
జలజల జారే జలపాతం
అంచున నిలబడి
ఆనందంతో
తడిసి ముద్దవుతుంటాను

ఒకరి మెదడు
జుట్టేలేని బట్టతల
అందులో నేను
అక్షరాల మొలకలు
అసలు మొలిపించనే లేను

ఒకరి చేతిరాత
గుచ్చి కూర్చిన
ముత్యాల సరాలు
మురిసిపోయి
ముచ్చటపడుతుంటాను

ఒకరి అక్షరాలు
పంటపొలంలో
నిర్లక్ష్యం గా
విసిరేసిన విత్తనాలు
సరిచేయలేక
సతమతమవుతుంటాను

ఆ పదవర్ణ దోషాల
పద్మవ్యూహం లో
చిక్కుకున్న
అభిమన్యుడి లాంటి నన్ను,
వినయంగా
చేతులు కట్టుకుని,
ఒదిగి పక్కనే నిలబడి
చూస్తుంటారు
చిద్విలాసంగా
సైంధవుల్లా...

వారు తమ
అక్షరదోషాలతో
నా ఉచ్చారణ
చాలా స్పష్టమని 
విర్రవీగే
నా గర్వం సర్వం
 ఖర్వం చేసేస్తుంటారు

వాళ్ళు అల్లరి ఆకాశంలో
నవ్వుల నక్షత్రాలు
హాయి గాలిలో ఎగిరే
స్వేచ్ఛా విహంగాలు
స్వచ్ఛమైన సంతోషాల
సప్తవర్ణాల హరివిల్లులు
వెళ్ళిపోయిన నా బాల్యాన్ని
జ్ఞాపకాల మబ్బులుగా
కళ్ళల్లో నింపి
ఆనంద బాష్పాలుగా
మార్చే వాన చినుకులు

నా ఆశ ,ధ్యాస,శ్వాస
అన్నీ వారి చుట్టూనే
తిరుగుతుంటాయి

వారి ఆట,మాట,పాట
అల్లరి,అతి తెలివి
అబద్ధాలు,అద్భుతాలు
గొడవలు,గొప్పలు
విజయాలు,వింత చేష్టలు
సాహసాలు, సమయస్ఫూర్తి
సరదాలు,సంబరాలు
అన్నీ మమ్మల్ని
అలరించే వార్తలై
స్టాఫ్ రూములో
సందడి నింపి
సరదాల పందిరి అల్లుతాయి

వారి 
చదువుగురించి ఆలోచిస్తూ,
మార్కుల గురించి 
మధనపడుతూ,
ప్రవర్తన గురించి
పరితపిస్తూ,
భవిష్యత్తు గురించి
భావన చేస్తూ
తల్లిదండ్రుల బాధ్యతను కూడా
తలకెత్తుకునే నేను,
ప్రపంచ పుస్తకాన్ని
పాఠాలుగా 
పరిచయం చేసి,
బ్రతుకు పరీక్షను గెలిచే
భరోసానిచ్చి,
పంపించిన నా శ్రమ
ఫలించిన వేళ,
ఎదిగిన ఆ చిన్నారులు
ఎక్కి వెళ్ళిన నిచ్చెన
నేనేనని గర్వంగా
పరవశించి పోయే
పంతులమ్మని.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టీచర్

14.11.2018.



ఈ రోజు నవంబర్ 14
ప్రపంచ మధుమేహ (నివారణా) దినోత్సవ సందర్భంగా నా పద్య కవిత

సీసం
చక్కెర వ్యాధిగా జగతిలో పేరున్న
  మధుమేహమును గూర్చి మాన్యులార!
తెలుసుకొనుట నేడు తెలివైన పనిగాన
  చెప్పెద వినుడిదే చేదు నిజము
పేరు తీయనగాని పెనుముప్పు గొనితెచ్చి
  రోగి ఆయువు దీయు రోగమిదియె
అతిమూత్ర మతిదాహ మలసట లాదిగా
  పొడసూపు మేనిలో సడలు శక్తి

తే.గీ.
గుండె ,కనులు,కాళ్ళును ,మూత్ర పిండములను
సకల అవయవమ్ముల నిది చాప క్రింది
నీరువోలె చేరుకొనును నిజము సుమ్ము
కడకు మ్రోగించు నపమృత్యు ఘంటికలను

సీసం
వంశమందున్నచో వచ్చుట కొక కొంత
   అవకాశమున్నయ
దదియె కాక,
ఊబకాయము, తీవ్ర యొత్తిడి, శ్రమలేమి,
   ఆహారపు టలవాట్లనెడు కొన్ని
కారణముల చేత కలుగవచ్చు కనుక,
  మార్చి జీవనశైలి మనసులోన
ధృడ నిశ్చయము జేసి దినదినమ్ము, క్రమము
  తప్పక పాటించ తగ్గు ముప్పు

తే.గీ.
చింతయేలేక  సుఖముగా చిరము నీవు
బ్రతుకవచ్చును సుంతయు బాధలేక
ధర్మ సాధనకు తను వా ధారమనెడు
సూక్తి గ్రహియించు చేకూరు శుభములింక.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

14.11.2018






ఈ రోజు నవంబర్ 19
International men's day సందర్భంగా నా కవిత

అతడే నా సైన్యం

అమ్మకడుపులో  నన్ను
మోసిన తొమ్మిదినెలలు
అతడు తన ఊహల్లో
నన్ను మోశాడు
ఈ లోకంలో
పాదం మోపానో లేదో
అపురూపంగా నన్ను
చేతుల్లో పొదువుకున్నాడు
గుండెలపై ఆడించాడు
వేలుపట్టి నడిపించాడు
కంటిపాపలా కాపాడాడు
కాలుకందకుండా పెంచాడు
తన శ్రమఫలాన్ని ధారపోసి
నా కలలను పండించాడు
ఆక్షేపించే లోకాన్ని లెక్కచేయక
ఆశపడ్డ జీవితాన్ని అందించాడు
అతడి జీవిత సామ్రాజ్యం లో
నేనొక అందాల యువరాణి
ఆయన నా తండ్రి
నా ఆరాధ్య దైవం
ఆచారిగారి అమ్మాయినని
చెప్పుకోవడం
అది నాకెంతో గర్వకారణం

తొలకరిలా నా జీవితం లోకి
ప్రవేశించాడు
తొలివలపు నాకు
చవిచూపించాడు
వేలుపట్టి తన 
బ్రతుకులోకి ఆహ్వానించాడు
మనుగడ మాంగల్యబంధంతో 
ముడివేశాడు
జీతాన్నీ జీవితాన్నీ కూడా
నా చేతుల్లో పెట్టేశాడు
నా కళల ప్రపంచంలో
ఎగిరే స్వేచ్ఛనిచ్చాడు
నా ఆశయానికి
ఆలంబనయై 
నన్ను ఎదగనిచ్చాడు
అతడి హృదయ సింహాసనంపై
నేనొక మహారాణిని
ఆ రాజశేఖరుడే నా సర్వస్వం
అతడి సాహచర్యం
నాకు లభించిన
జీవన సాఫల్య పురస్కారం

నా తరువాత పుట్టాడు
నాతో ఆడుతూ పాడుతూ పెరిగాడు
అమ్మ పాలతో పాటుగా
అన్నీ నాతో పంచుకున్నాడు
అందమైన అనుబంధాన్ని
నాతో పెంచుకున్నాడు
పసితనంలో మేము
పంచుకోని
ఆప్యాయత లేదు
అత్తారింటికి వెళ్ళిపోయిన 
అక్కను మరచిపోనూలేదు
తీయని బాల్యానికి
బంధువయ్యాడు
తీరని పుట్టింటి
బంధమయ్యాడు
పండుగంటే పిలిచి
పసుపు కుంకుమ లిచ్చి
కష్టమంటే  వచ్చి
కన్నీళ్ళు తుడిచి
ఆత్మీయతలను పంచిన
వాడు నా తమ్ముడు
మూర్తీభవించిన సంస్కార కిరణం

పచ్చని మా కాపురానికి
ప్రతిరూపం
తొలిసారి నేను రుచి చూసిన
మాతృత్వపు మాధుర్యం
దెబ్బలాటలు ఇంటిపైకి తెచ్చిందిలేదు
నా చేత దెబ్బలు తిన్న
సందర్భమూ గుర్తులేదు
అమ్మ మనసునెప్పుడూ
నొప్పించని సౌజన్యం
పలుకులోన కాస్తయినా
కానరాదు కాఠిన్యం
వాడు నా కొన్న కొడుకు
నా జీవితాకాశాన్ని
వెలిగించిన
నిశాంత చంద్రుడు

జీవన పయనంలో
ఒక మలుపులో కలిశాడు
మర్యాద మన్ననలతో
నమ్మకాన్ని గెలిచాడు
ఆపద వచ్చిందంటూ
అసహాయంగా 
తన గుమ్మంలో
అడుగిడిన వేళ
అన్నం‌కంచం ముందునుంచి
అదాటున లేచివచ్చి
వెంకట రమణ మూర్తిలా
ఆదుకున్న వేలుపతడు
రామయ్య అన్న పేరుకతడు
అచ్చంగా అతుకుతాడు
అతడు
నా ప్రాణమిత్రుడు
బ్రతుకు పూలతోటను
పరిమళింప జేసిన
స్నేహ సుమ సౌరభం

పంచభూతాలు
ఈ ప్రకృతికి ప్రాణాలు
ఈ పంచ బంధాలు
ఈ పడతి మనుగడకు
 ఆధారాలు
  
నా జీవితాన్ని 
పరిపూర్ణం చేసిన
మీ  కందరికీ
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

19.11.2018.

నేడు నవంబర్ 20 యూనివర్సల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా నా కవిత

.........వీధిబాల........

నిశ్శబ్ద నిశీధిలో
అనాథబాల హాహాకారం
నిస్సహాయంగా ముడుచుకున్న
దీనురాలి‌ శోకారావం

అమ్మా!
నిన్నెవ్వరో మోసం చేస్తే
నువ్వు నన్నెందుకమ్మా!
మోసం చేశావు
నీ ప్రాణం నిలబెట్టుకోవడానికి
నాకు ప్రాణం పోశావు
నీ పరువు కాపాడుకోవటానికి
కనికరం వీడి నన్ను కాలదన్నావు
విధిని ఎదిరించలేక
సమాజానికి సమాధానం
చెప్పలేక
వీధిలోకి నన్ను
విసిరి పారేశావు

ఎండవానలలోన
ఎంత తల్లడిల్లానో!
చింకి బట్టలతోటి
చలికెంత వణికానో
పట్టెడన్నం కోసం
పాట్లెన్ని పడ్డానో
ఒదిలించుకున్న నువ్వు
ఒక్కసారైన ఊహించావా అమ్మా!
కన్నబిడ్డ కష్టానికి
కన్నపేగు కదిలిపోతుందన్నమాట
కవుల కల్పనేనా!

ఎదుగుతున్న కొద్దీ నాలో
ఏదో వెతుకుతున్న
ఆకలి చూపులు
వెకిలి తనం నింపుకుని
వేటాడే డేగ కళ్ళు
ఆసాంతం తెలియకున్నా
అపాయం అర్థమవుతోంది
అక్కున చేర్చుకుని
కాపాడే అమ్మ కోసం
మౌనంగా నా మనసు
ఆరాటపడుతోంది

పరువు పరుపుపైన 
సుఖనిద్రలో ఉన్నావేమో!
కలలోనైనా
ఒకసారి నన్ను
గుర్తుచేసుకోవా అమ్మా!
నీ జ్ఞాపకమైనా చాలు
నాకు శ్రీ రామరక్ష కాగలదేమో!
నువ్వు చేసిన పాపానికి
నాకెందుకమ్మా! ఈ శిక్ష?
తల్లికే దయలేని
ఈ దీనురాలికి ఇక
ఎక్కడ‌ దొరుకుతుంది‌ రక్ష?
 
సమాజం మారేదెన్నడు?
సమాధానం చెప్పేదెవరు?

చాలా కాలం క్రితం 
ఆంధ్రజ్యోతి దినపత్రిక లో అచ్చయిన నా కవిత ఇది.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం
 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

20.11.2020


ఈ రోజు నవంబర్ 21
World television day
సందర్భంగా నా కవిత

........టెలివిజన్.......
....తెలివి జన్......

నా పసితనం
అప్పటికింకా నువ్వు పుట్టలేదు
నా యవ్వనారంభం లోనే
తొలిసారి నిన్ను
పక్కింట్లో చూశాను
పరువాల పూబోణిపై
పడుచువాడు
మనసు పారేసుకున్నట్లు
నిన్ను చూసి నేను
తొలిచూపులోనే
మనసుపడ్డాను

నిన్ను చూడాలన్న ఆశతోనే
పక్కింటి ఆంటీతో
పరిచయం పెంచుకున్నాను

వరల్డ్ కప్ ని
నీ ముఖంపై వీక్షించడానికి
ఎంత తాపత్రయ పడ్డానో!
తెల్లవారు ఝామున
నాల్గింటికే లేచి
పొరుగింటికి పరుగెత్తి
నాకిష్టమైన
కపిల్ దేవ్‌ బౌలింగ్ ని
కృష్ణమాచారి శ్రీ కాంత్
బ్యాటింగ్ ని
వీక్షించిన వింత అనుభూతిని
మరచిపోలేను
చిత్రం చూశావా!
అంతకాలమూ
ఉత్కంఠతో 
ఉర్రూతలూగించిన
రేడియో కామెంట్రీ
నీ రాకతో
మూగవోయింది

నా మనసు తెలుసుకుని
నాన్నగారు నిన్ను
నా కోసం తెచ్చినరోజున
నా సంబరం
అంబరమంటిందంటే నమ్ము

వారానికొకసారి
ప్రసారమయ్యే
చిత్రలహరి
చిత్రహార్
సినిమాల కోసం
ఇరుగు పొరుగు వారు
మాయింట్లో
కొలువుదీరినప్పుడు
కోటనేలే మహారాణిలా
నేను గర్వపడ్డ క్షణాలు 
ఇంకా గుర్తున్నాయి

ఆకాశవాణి ప్రాణాలు
అనంతవాయువుల్లో
కలిపేసినా
నిన్ను చూసి
మెచ్చుకున్న వాళ్ళే గానీ
నొచ్చుకున్న వారు 
బహుతక్కువే సుమా!

యూనివర్సిటీ లో
చదువుకునే రోజుల్లో
ఆదివారం ఉదయం
టిఫిన్ తో పాటుగా
రంగోలీని కూడా
ఆస్వాదించటం
ఉడాన్ సీరియల్ ని
ఉత్సాహంగా వీక్షించటం
అదొక అందమైన వేడుక

దూరదర్శన్ తెలుగులో
శాంతిస్వరూప్, రోజారాణి
 విజయదుర్గ , 
ఓలేటి పార్వతీశం
నట్టింట ప్రతిరోజూ
నవ్వుతూ ప్రత్యక్షమయ్యే
దేవతలయ్యారు

తెలుగు వార్తలకు
ముందుగా వినపడే
మ్యూజిక్ ఆ రోజుల్లో
ఏడాది వయసున్న
మా అబ్బాయిని
ఎంతో ఆకర్షించిన
సంగీతమయ్యింది

రామానంద్ సాగర్ 
రామాయణం
మనసుల్ని దోచేసుకుంటే
బి.ఆర్ చోప్రా మహాభారతం
యావత్ భారతాన్నీ
ఆదివారం ఎప్పుడువస్తుందా !అని
ఎదురుచూసేలా చేసింది
తెలుగు ధారావాహికలకు
తొలి బాటలు వేసిన
ఋతురాగాలు సీరియల్ని
చూడని వారు లేరన్నమాట
అతిశయోక్తి కాదు
అక్షర సత్యమే.

ఆ తరువాత వచ్చిన
ఈ టీవీ  
దూరదర్శన్ చరిత్రలో
దుమారమే సృష్టించింది
నేటి వందలాది ఛానళ్ళకు
వెలుగుబాట వేసింది

ముందొచ్చిన చెవులకంటే
వెనుక వచ్చిన కొమ్ములు వాడి
అనే నానుడిని 
ఋజువు చేస్తూ
అనంతమైన ఛానల్సుగా విస్తరించిన
నేటి‌ బుల్లితెర విప్లవం లో
నిన్ను నేడు పెద్దగా
పలకరించే వారు
లేక పోయినా
చిన్నితెరకు 
పెద్ద ముత్తయిదువు 
మాత్రం ముమ్మాటికీ నీవే.

నేటి వినోదాల విప్లవంలో
నీవొక నిత్య చైతన్య స్రవంతివి.
నీ ప్రస్థానం
హృదయాహ్లాద కారకమై
నిరంతరం సాగిపోవాలని
కోరుకుంటున్నాను.

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం 
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

21.11.2018



ఈ రోజు నవంబర్ 22

Go for a ride day 

సందర్భంగా నా కవిత

 సుదూర తీర గమనం

నాకు సైకిల్ నడపటం రాదు 
కారు నడపటం కూడా రాదు
అయినా నేను నిత్యమూ
ప్రయాణం చేస్తుంటాను

నా ఊహలనే విమానాన్ని
భావాలనే పల్లకీని
జ్ఞాపకాలనే రైలుబండిని
కాలమనే కారుని
జీవితమనే రథాన్ని
కోరికలనే గుర్రాన్ని
అలసత్వమనే ఏనుగుని
ద్వైదీ భావమనే
ద్విచక్ర వాహనాన్ని
ఆలోచనలనే పడవని
నాకు నేనే నడుపుకుంటూ
నన్ను నేనే వెతుక్కుంటూ
బహుదూరపు బాటసారినై
వెర్రిదానిలా‌ ఎందుకలా
వెళ్ళిపోతున్నానని
విస్తుపోతున్నారేమో!
వెక్కిరింతగా నన్నుచూసి
వేళాకోళం చేస్తున్నారేమో!
నా కవితా ప్రపంచమనే
ఆనంద సౌధంలో
సేదదీరడానికే
 ఈ
నా 
నిరంతర పయనం

సింహాద్రి జ్యోతిర్మయి
 న ర సం
 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

22.11.2020



స్త్రీ లపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ
నేడు నవంబర్ 25 న 
International day for
 elimination of violence against women గా ఈ రోజును ప్రకటించిన సందర్భంగా నా కవిత



ఈ రోజు నవంబర్ 25
International day for the elimination of violence against women (UN) సందర్భంగా నా స్పందన

అడుగడుగునా....

అమ్మా!
ఎంత కాలమిలా
మేలిమి బంగారంలా 
భయపడుతూ ‌నన్ను
భద్రంగా దాచిపెడతావు?
ఆత్మవిశ్వాసమనే
రత్నం పొదిగిన
ఆభరణమై మెరవనీ

నాన్నా!
ఎంత కాలమిలా
పరువుకు ప్రతిరూపంగా భావిస్తూ
నా స్వేచ్ఛను హరిస్తావు?
మెచ్చిన వాడితో నన్ను
ఏడడుగులు నడువనీ

అన్నా! 
ఎంత కాలమిలా
బరువు దించేసుకున్నాననే
భావనలో ఉంటావు?
ఆప్యాయత పంచుకున్నట్లే
ఆస్తిలోనూ హక్కు పొందనీ

మిత్రమా!
ఎంత కాలమిలా
చాటుమాటు చొరవతో
అందమైన చెలిమిని
అపహాస్యం చేస్తావు?
అమలిన స్నేహం తో
గౌరవం పెరగనీ

తాళికట్టిన బంధమా!
ఎంత కాలమిలా
శరీరంతోనే
సంసారం సాగిస్తావు?
 అనుభూతి అమృతాన్ని
నన్ను కూడా ఆస్వాదించనీ

అత్తింటి ఆధిపత్యమా!
ఎంత కాలమిలా
వారసుల్ని కనిపెట్టే
యంత్రంలా భావిస్తావు?
పుట్టింటి బెంగ
చల్లని ఆదరణలో మరువనీ

కామపుపొరలు కప్పిన కావరమా!
ఎంత కాలమిలా
అసహ్యపు చూపుల ముళ్ళతో
ఒళ్ళంతా గాయాలు చేస్తావు?
సంస్కారపు చూపు వలువ
పరదాలో నిలువనీ

మాటువేసిన మృగత్వమా!
ఎంత కాలమిలా
కర్కశంగా కబళిస్తావు?
జనారణ్యంలో లేడికూననై
మసలే దుస్థితి తొలగనీ

సభ్యత ముసుగులో సమాజమా!
ఎంత కాలమిలా
మొసలి కన్నీరు కారుస్తావు?
దగాపడిన పయనంలో
ధైర్యమిచ్చి బ్రతకనీ

అంగడి బొమ్మల సంఘమా!
ఎంత కాలమిలా
నా రక్తమాంసాలను
విక్రయిస్తావు?
చేను మేయని కంచెవై
చేయూతనిచ్చి నడువనీ

అణచివేత,అవమానాలనే
హద్దులింక చెరపనీ
చదువు సంపాదనలనే
రెక్కలతో ఎగరనీ
ఆకాశమే హద్దుగా
ఇపుడైనా ఎదగనీ.
ఇకనైనా ఎదగనీ.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.11.2020



















Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ