1/3శ్రీ విష్ణు కందం
1.కందం
గోవిందాయన ద్రౌపది
గోవిందాయన కరిపతి,గోకులమెల్లన్
గోవిందాయన గాంచిన
గోవిందా వినుము
నాదు గోడు తెలిపెదన్.
2.కందం
కట్టితి మనసును ముడుపుగ
పట్టితి గట్టిగ విడువను పాదములిక నీ
వెట్టిల నడిపిన వెఱువను
గట్టును చేర్భుట నను దయ గగనమ్మగునే
3.కందం.
కటి హస్తముతో కష్టము
మటుమాయము చేతువంచు మది నమ్ముదుమే!
కటి లోతున మునిగితి నే
నెటులీదుదు భవజలధిని ఏలగ రావా!
4.కందం
భావించెద నీ రూపము
గోవిందాయని పిలిచెద గొంతెత్తి నినున్
సేవించెద నీ పదములు
దీవింపగ రాగదయ్య తిరుమల వాసా!
5.కందం
నిను నమ్మితి మనసారా,
కొనియాడితి కవితలల్లి కొని నా పలుకుల్
ఘన సంపదలీయవయా
ధనలక్ష్మీ ధవ తొలగగ దారిద్య్ర వెతల్.
6.కందం.
కంటను కన్నీరుబికిన
అంటిని నను మరచితివని ఆపదలన్ నా
ఇంటిని నిలబెట్ట ప్రభో!
కంటిని నీ దయ క్షమించు ,కాయుము దొసగుల్.
*7.కందం*
ఆపద మొక్కుల స్వామీ!
నీ పద సన్నిధి నిముషము నిలచుట కొఱకై
ఓపికతో నీ వాకిటి
లో పడిగాపులు పడుదుము లో దయ గొనుమా!
8.కందం
వలలో చిక్కిన చేపలు
ఇలలో ప్రాణులు ఇడుముల కేడ్చుట గనుమా!
చలువపు చూపున నీపద
జలధిని మునుగంగ జేసి సన్నిధినిడుమా!
9.కందం
తల నీలాలను ఇత్తుము
కల ముడుపులు తీర్తుమయ్య కాలములోనన్
తుల దూతుము కడు భక్తిని
నిలువుగ దోపిడి నిడుదుము నీ దయ కొరకే.
10.కందం
వినవయ్యా విన్నపములు
కనవయ్యా కష్టములను కడతేర్చవయా!
కొనవయ్యా మొక్కుబడుల
ననవయ్యా నే గలనని ఆదుకొనుటకున్.
.
11.కందం
.కల్లలు కక్షలు కపటము
పెల్లగు మోహము బ్రతుకును పెనగొని కలచెన్
ఉల్లము సైపదు వేదన
చల్లని చూపుల దయగను చరణము విడువన్.
12.కందం
కోవెల కొచ్చితి కొలువగ
పూవుగ అర్పించి మదిని పూజించెద నన్
గావుము కరుణను జూడుము
దీవెన లిడుమా తరింతు దీనత తొలగన్.
13.కందం
చేసిన దోసము లెన్నక
వేసట చెందిన మనసుకు వేంకట నాథా!
బాసట చూపుము మొక్కెద
దాసిని నీ పద యుగముకు దండన చాలున్.
14.కందం.
ఏవేవో కోర్కెలతో
నీ వాకిట నిలచినాను నీ దయ కొఱకై
దేవా!అది ఏమి మహిమ
నా వెతలన్నియు మరచితి నగు మోము గనన్.
15.కందం
నలువకు తండ్రివి నీవే
కలుముల దేవేరికి ప్రియ కాంతుడవీవే
కలియుగ దైవము నీవే
కలచెడు దుఃఖమ్ము నడచి కావగ రావే.
16.కందం
.గాయపరచి గొల్లడు నిను
గాయపరచి గునపమునను గనిరాళ్వారుల్
మాయని నీ దయ మాధవ!
గేయములను పొగడు నన్ను కృపగన లేవే!
Comments
Post a Comment