1/5 శ్రీ విష్ణు కందం
1.కందం
. శ్రీ పాదము నడయాడిన
ఈ పావన భద్రనగము ఇల వైకుంఠ
మ్మే పరమాత్ముడు రాముని
గా పావని సీత తొ ఇట కాపురముంటన్.
2.కందం
త్రేతా యుగమున ప్రభువై
సీతాదేవికి విభుడగు శ్రీ రామునిపై
నా తరమా చెప్ప కవిత
నా తొలి భాగ్యము ఇదియని నామది తలతున్.
3.కందం
రామాయణమును రాసితి
రా, మానను నీ స్మరణము రాత్రియు పగలున్
రా మా ఇంటికి దశరథ
రామా! నన్నేలి పాప రాశిని మాపన్.
4.కందం
నీవే నా ఆత్మవయా
పావని సీతమ్మ నాదు భావము సుమ్మా!
సేవకు నా ప్రాణ మిడుదు
రావణ సంహార రామ! రక్షించవయా!
5.కందం
తమ్ముడినెన్నడు విడువవు
అమ్మ తరిమెనడవులకని అలగవు మదిలో
నెమ్మది ధర్మము విడువవు
కొమ్మను విడనాడియు మది కూర్మి మరువవే!
6.కందం
గుహునికి రామా అతిథివి
అహల్యకైతివి అతిథివి ఆదరమొప్పన్
గహనాటవిలో శబరికి
ఇహమున దొరికిన అతిథివి ఎంగిలి పండ్లన్.
7.కందం
కోతులు పక్షులు బోయలు
జాతుల భేదము తలపక సర్వుల ఎడలన్
భ్రాతగ స్నేహము జూపిన
నేతవు నీవే ఒరవడి నేడును ప్రజకున్.
8.కందం
. జననుత మునివరు డడుగగ
జనకుని పనుపున జనితివి జన్నము గావన్
జనపతు లచ్చెరువొందగ
జనకుని విలు ద్రుంచితంట జానకి మురియన్.
శ్రీ విష్ణు కందం..,....... సింహాద్రి
9. కందం
పారే గోదావరి లో
నీరే పాపము కడుగును నిజమెటులన్నన్
శ్రీరాముడు సీతమ్మయు
వారిచ్చట జలకమాడి వసియించుట చేన్.
10.కందం
నిలిపెను భద్రుడు తలపై
పలికెను నీ చరిత మొల్ల వరకావ్యముగా
కొలిచెను త్యాగయ్య కృతుల
మలిచెను గోపన్న భక్తిమై మందిరమున్
Comments
Post a Comment