1/4 శ్రీ విష్ణు కందం


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం.1*
హరి నిలయము హరి సముఖము
హరి వదనము, హరి చరణము లవిగవిగవిగో
హరి చరితము ,హరి వచనము
హరి కరుణయు సుమధురమది యడగక దొరికెన్.

*కందం.2*
హరియను మధురాక్షరములు
హరియించును కలుషమెల్ల ఆర్తిని మాపున్
తరియింపగ జేసెడి శ్రీ
హరి నామము స్మరణజేయు మదె తారకమౌ.

సింహాద్రి జ్యోతిర్మయి
11.4.2022


*శ్రీ విష్ణు కందం*
ఓం నమో వేంకటేశాయ

*3.కందం*
ముని తాచిన హరి ఎదపై
తను వాసము చేయనంచు తరలిన లక్ష్మిన్
కనుగొన వచ్చిన శ్రీహరి 
మన భాగ్యవశమ్మున తిరుమలపై వెలసెన్.

*4.కందం*
కొంగున ముడి వేసుకున్న
బంగారానివి కొలిచెడు భక్తులకెల్లన్
బంగరు వాకిలి ముక్తికి 
ముంగిలి గోవింద ఘోష మోగును దిశలన్.

సింహాద్రి జ్యోతిర్మయి
12.4.2022

*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం 5*
భయమున జపించి కంసుడు
స్వయముగ పిలిపించి నిన్ను పరమును పొందెన్.
ప్రియమున తపించి రుక్మిణి
స్వయముగ పిలిపించి నిన్ను పతిగా పొందెన్.


*కందం.6*
సురముని జపించు నిరతము
కురు వృద్ధుడు వే తెఱగుల కొనియాడెనదే.
వర వానరుడా హనుమకు పరమానందము నొసగిన పలుకును హరియే.

సింహాద్రి జ్యోతిర్మయి
13.4.2022

*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..7*

వేలుపులందరు
వచ్చిరి
వేలాదిగ భక్తులంత వేచిరి స్వామీ!
మేలగు దర్శనమీయగ
మేలుకొలుపులంది ఇంక మేల్కొనవయ్యా!


*కందం..8*
రోజంతయు నిలిచి నిలిచి
పూజలుగొని వరములొసగి పురుషోత్తముడా!
తేజో రూపము అలసెను
జోజో శయనించుమయ్య జోలలు వినుచున్.

సింహాద్రి జ్యోతిర్మయి
14.4.2022

*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..9*
ఎన్నో జాతుల భక్తులు
కన్నారగ నిన్ను చూడ కాచి నిలువగన్,
సన్నిధిగొల్లకు దొరుకును
పున్నెము తొలి దర్శనమ్ము పుట్టుక తరియన్.

కందం..10
ఆపద మొక్కులు వినుటకు
రేపవలటు నిలిచిన ,నడిరేయికి స్వామీ!
నీ పదములు నొచ్చెననుచు
శ్రీ పద్మావతి కరముల సేవించునయా!

సింహాద్రి జ్యోతిర్మయి
15.4.2022


శ్రీ విష్ణు కందం
(ఓం నమో వేంకటేశాయ)

కందం..11
కురుపతి కొలువున కుమతులు
వరసతి ద్రోవదిని దెచ్చి వలువల నూడ్చన్
నరవర ప్రముఖుల నమ్మక
సిరిపతి! నీవే గతియని చేడియ మొక్కెన్.

కందం..12
కురుపతి కొలువున గతిచెడి
పరువము మాసెడు క్షణముల పాంచాల సుతన్
పరువిడి‌ గాచిన హరి నిను
స్థిరముగ నిలిపెద సతతము‌ చిత్తము లోనన్.

సింహాద్రి జ్యోతిర్మయి
16.4.2022


శ్రీ విష్ణు కందం
(ఓం నమో వేంకటేశాయ)

*13.కందం*
అడుగుము కోరినదిచ్చెద
వడుగాయని ప్రీతితోటి బలి తల వంచన్
కడు వింతగ ముజ్జగములు
ముడుపుగ గైకొంటివయ్య మూడడుగులతోన్

*14.కందం*
పాపము పండిన‌ అసురుడు
చూపుము స్తంభాన హరిని చూచెద ననుచున్
పాపడి దిట్టగ నుగ్రపు
రూపున వెలువడి కలనని రూపించితివే.

సింహాద్రి జ్యోతిర్మయి
17.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం 15*
కలవని నమ్మిన డింభకు
కలవో? లేవో? అనునెడ కరిరాజునకున్
కలవని నమ్మని అసురుల
కిలలో హరికరుణ సమమె! ఇది అద్భుతమే!
    
*కందం..16*

అన్యుల పతిగానొల్లను
కన్యను,కమలాక్ష !నీవె కాంతుడ వైనన్
ధన్య ననిన వైదర్భిని
మాన్యగ మన్నించి, చక్రి మనువాడె గదా!

సింహాద్రి జ్యోతిర్మయి
18.4.2022

*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)
*కందం..17*
వలచిన పద్మావతికిని
అలిగిన శ్రీదేవికి బదులాడక శిలవై
కలిలో భక్తుల బ్రోవగ
వెలసిన నెపమది తిరుమల వేంకట రమణా!

  *కందం..18*              
సిరినాథా! నీ సతిపై
మరులుగొనుచు నడిమి రేయి మక్కువ తోడన్
తిరుమల వాసమ్ము విడిచి
తిరుచానూరుకు నడతువు దిగి తిరునగరిన్

సింహాద్రి జ్యోతిర్మయి
19.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..19*
గోవుకు సరిలేదనుటకు
గోవులనిల కాచినావు గోపాలుడవై
సేవనుమన్నించి కలిని
ఆవు పొదుగు చేపి నీదు ఆకలి తీర్చెన్.

*కందం..20*
ఎంత మధుర మేమి ఘనత
గొంతుదిగే అమృతమట్లు ఘుమఘుమలాడే
టంతటి రుచి లడ్దుకు శ్రీ
కాంతుడు నైవేద్యము గొను కతమున కలిగెన్.
         
సింహాద్రి జ్యోతిర్మయి
20.4.2022

*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..21*

కలలో నినుగని పోతన
ఇలలో కవియై కవనము నిమ్ముగ జెప్పెన్
కలలో కనుగొనినంతనె
పలికిన ఆ అన్నమయ్య పదకవి అయ్యెన్.

*కందం..22*
పిలిచిన పలికే దైవము
కొలిచిన కొంగు పసిడి మన కొరతలు దీర్చున్
మలచగ భువి వైకుంఠము
వెలసెను తిరుమల వరగిరి వేంకటపతి యై.

సింహాద్రి జ్యోతిర్మయి
21.4.2022

*

*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)
*కందం.23*
అదివో యల్లదివో గను
మదిలో యానంద మొప్ప మలయప్పడదే  
సదనము తిరుమల కాగా
సదయుడు వేంచేసి యుండె సప్తగిరులపై.

*కందం..24*

శ్రీహరివాసము కలిలో
మోహనశోభల తిరుమల,మొఱపెట్టుచు,దా
సోహమ్మనియెడు భక్తుల
కూహింపగరాని శుభము లొనగూర్చునుగా.

సింహాద్రి జ్యోతిర్మయి
22.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..25*
మన్నేలర?అను అమ్మకు
నన్నేలర వలచితినని నమ్మిన సఖికో
యన్నా!జాగేలర?  ఆ
పన్నననెడు కృష్ణ కీవు పరమాప్తుడవే.

*కందం..26*          

సుప్రజవట కౌసల్య కు
సప్రేమను చెఱను గన్న సకి దేవకికిన్
సుప్రజవట నిను సాకిన
సప్రమదలు నందపత్ని,సాధ్వి వకుళకున్.

*సకి... స్త్రీ*

సింహాద్రి జ్యోతిర్మయి
23.4.2022


శ్రీ విష్ణు కందం
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..27*

కనగా కనుగవ ధన్యము
వినగా ధన్యత హరికథ వీను కమరుగా
ననగా పెదవులు ధన్యము
మనుగడ ధన్యము కవితల మాధవు పొగడన్.

  *కందం..28*

మధురము నీ ప్రియ నామము
మధురము నీ నీలమేఘ మై శుభ కాంతుల్
మధురము నీ వేణు రవళి
మధురము నీ చిరు నగవులు మాధవ దేవా!

సింహాద్రి జ్యోతిర్మయి
24.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..29.*
నంద యశోదల కమితా
నందము నొసగెడు చిరుచిరు నగవుల కృష్ణా!
అందిన అందని నిధివగు
సుందర వదనారవింద! శుభము లొసగవే!


*కందం..30*

దుష్టుల‌శిక్షించి ధరణి
శిష్టుల దయ రక్ష సేయ శ్రీకృష్ణుడవై
అష్టమి‌ పుట్టిన స్వామీ!
ఇష్టములను దీర్పవయ్య ఇదె కైమోడ్తున్.

సింహాద్రి జ్యోతిర్మయి
25.4.2022

*కందం..31.*
నిదురించడు నీ తనయుం
డిది చోద్యమ్మో! యశోద ఎటులన పడతుల్
యదుకుల భూషణు డదివిని
నిదానముగ కన్నుమూసి నిదుర నటించెన్.

*కందం..32*
సులభుడు భక్తికి సిరిపతి
శలభములౌ పాపరాశి శరణము నొసగన్
కలుగదు మరియొక జన్మము
చెలగిన పుణ్య ఫలము హరి చెంతకు చేర్చున్.

సింహాద్రి జ్యోతిర్మయి
26.4.2022.


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..33*
చాలవు చూడగ కన్నులు
చాలవు మాటలు నుతింప చక్రాయుధ!నిన్
చాలవు వినగా వీనులు  
లీలలు ఘనములు ముకుంద! 
లిఖియింతునుగా!

*కందం..34*

తనియదు చూచిన నయనము
తనియదు పాడినను గళము ధరణిజ నాథా!
తనియదు నా హృదయమెపుడు  
తనియగ కందము లిఖించి తరియింతు నికన్.

సింహాద్రి జ్యోతిర్మయి
27.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..35*

వేదములను ధాత కొసగి
యాదట యమృతమ్ము పంచి యాదిత్యులకున్
మేదిని కొమ్మున నిలిపియు
మోదము నొసగిన మురారి మ్రొక్కెద నీకున్.

*కందం..36*

 మూడడుగుల దిశలు గొలిచి
వీడని సతితో వనముల విడిసియు స్వామీ!
క్రీడగ గోవుల గాచియు
గోడును తొలగించు నిన్ను కొల్చెద సతమున్

సింహాద్రి జ్యోతిర్మయి
28.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..37*

ఇహమే సుఖమని భ్రమపడి
తహతహలాడుచు సతతము తలచుట తగునే?
అహమును విడి శరణంటిని
దహియింపుము పాపరాశి దనుజాంతకుడా !

*కందం..38*

కడు విసిగితి మనుగడతో
విడనాడితి మోహమెల్ల విబుధశరణ్యా!
విడబోనిక నీ పదములు
కడతేర్చుము భవము నింక కంజదళాక్షా!

సింహాద్రి జ్యోతిర్మయి
29.4.2022


*శ్రీవిష్ణు కందం*

(ఓం నమో వేంకటేశాయ)

*కందం..39*

అంతర్యామీ!అలసితి
నింతట నీ శరణు జొచ్చి హృదయసుమము నే
నుంచితి నీ పదములకడ
పంత మదేలర ?దయగొను పంకజనాభా!

*కందం..40*

పన్నగతెర తీయుము మా
విన్నపములు వినవలె కడు వింతలనగ,నే
నన్నమయను కాను ప్రభూ!
మన్నింపుము భక్తురాల మనవిని వినుమా!

సింహాద్రి జ్యోతిర్మయి
30.4.2022


*శ్రీ విష్ణు కందం*
(ఓం నమో వేంకటేశాయ)

*కందం..41*
ఏ నామము మురిపించెడు
    నే నామము సుధలు చిందు నెఱుకను మదిలో
     ఏ నామ్మీయును భక్తుల 
    కా నీ నామము పరిపరి ఆత్మ తలచెదన్ 


*కందం..42*

వందనమో వేంకట పతి!
వందన మో శ్రీనివాస! వకుళ కుమారా!
వందన మో గోవిందా!
వందన మిదె వాసుదేవ !పన్నగశయనా!

సింహాద్రి జ్యోతిర్మయి
1.5.2022



      





  



         

       











 



     
      


















 

           
       
74. మంగళ మో కలి‌నాయక
        మంగళ మో భక్త వరద‌ మాధవ దేవా!
    ‌ మంగళ మో భూ‌రమణా !
       మంగళ మో గరుడ గమన మంగళమయ్యా!

90. నా పాదము శరణమనుచు
      ఏ పొద్దును నమ్మి కొలుచు ఈ ‌భక్తుల నే
       కాపాడుదు వీడను దరి
       చూపుదునని చాటు నీదు శుభకర ముద్రల్.









107. కం. ఎరుగను‌ శాస్త్రము లేవియు
   ‌ ఎరుగను మంత్రము లెరుగను ఏ‌ దైవము నే
        ‌ ‌ ‌ నెరిగితి హరి నీ నామము
              చెరగని భక్తిని మనమున చేకొనియుంటిన్.

108. కం. ఎంతయు‌ ప్రతిభావంతులు
     ‌ ‌‌ సంతత భక్తిని‌ సతతము సన్నుతి జేయన్
     ‌ ‌ సుంతయు జ్ఞానము ‌చాలని
             ‌ కాంతను చెప్పితి కవితను కరుణను గొనుమా.

Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ