1/1శ్రీ విష్ణు కందం( మూలమూర్తి వర్ణన)
అందరికీ నమస్సులు. ఈ రోజు నుండి స్వామి వారి మూల మూర్తి వర్ణన చేస్తాను.సాధారణంగా వర్ణన పాదాలనుండి శిరస్సు వరకు చేస్తారు కవులు. కానీ నేను ఆనంద నిలయం లో స్వామి దర్శనం జరిగే క్రమంలో వర్ణించాను. ఆ క్రమం ఇది......
నేను రాసిన
*శ్రీ విష్ణు కందం* లోని పద్యాలు
స్వామి వారి *మూలమూర్తి* వర్ణన
*1.కందం
శ్రీలక్ష్మీ వల్లభుడవు
ఫాలాక్షుని కోరి వలచి వరియించిన యా
శ్రీలలితకు సోదరుడవు
నీలపు నీ చెలువు కనుల నిలిపితి నిటులన్.
*2.కందం
కలియుగ వేంకట నాథా!
ఇలలో నీ భక్త కోటి ఎంతయు ప్రీతిన్
కలిమికొలది కానుకలిడి
అలంకార ప్రియుడవనుచు ఆరాధింపన్
3.కందం
నిగనిగ నీలపు తనువున
ధగధగ కాంతుల నగలను దాల్చి వెలుగుచున్
జగతికి దర్శన మొసగెడు
నగధర! నే కంటి నిన్ను నఖశిఖ మెల్లన్.
సింహాద్రి జ్యోతిర్మయి
23.3.2022
4.కందం
.అదియే వజ్ర కిరీట
మ్మదే తిరుక్కోల కనుల కగుపించెనుగా
అదిగో నా స్వామి వదన
మదిగో గను బావలీలు హరి కర్ణములన్
*బావలీ గొలుసులు అనేవి పురుషులు చెవి కొనలకు ధరించే ఒక విధమైన అలంకార విశేషం.ఇవి చెవికి ధరించే ఆభరణాలకన్నా భిన్నమైనవి అని శబ్ద రత్నాకరం చెప్తోంది*
5.కందం
తిరు నామము కనుగొంటిని
అరమూసిన నేత్ర యుగళ అరవిందములన్
చిరుహాసపు పెదవులు, క
ప్పురమ్మలదినట్టి యా చుబుకమును గంటిన్.
*శ్రీ విష్ణు కందం*
(తిరుమల శ్రీవారి మూల మూర్తి వర్ణన)
*6.కందం*
కుడివైపున చక్రమదే
ఎడమన నా స్వామి శంఖ మెదలో గంటిన్
మెడలో మెరిసే పతకము
పొడగంటిని కర్ణ పత్ర పుత్తడి కాంతుల్.
*7.కందం*
ఇరువైపుల భుజకీర్తులు
నిరుగడలా వక్షమందు ఇరువురు సతులా
సిరిదేవియు భూదేవియు
పరమాత్మా! నిలువగంటి పరవశ మెసగన్.
సింహాద్రి జ్యోతిర్మయి
25.3.2022
*శ్రీ విష్ణు కందం*
(తిరుమల శ్రీవారి మూలమూర్తి వర్ణన)
*8. కందం*
చూసితి నాగాభరణము
చూసితి నా స్వామి నీదు సూర్య కటారిన్
చూసితి వడ్డాణములో
భాసిల్లు దశావతార భాసుర మూర్తుల్.
*9.కందం*
కనుగొంటిని కౌస్తుభమణి
కనకపు యఙ్ఞోపవీత కమనీయ రుచుల్
మనమున తన్మయమందుచు
ననుపమమౌ తులసిపత్ర హారముగంటిన్.
సింహాద్రి జ్యోతిర్మయి
26.3.2022
శ్రీ విష్ణు కందం
(తిరుమల శ్రీవారి మూల మూర్తి వర్ణన)
*10.కందం*.
ఎడమ కరము కటిహస్తము
సుడివడు సంసార జలధి శోకములార్చున్
కుడిపాణియె వరద కర
మ్మడిగిన వరముల నొసగుచు ఆర్తుల బ్రోచున్.
*11.కందం*
అటునిటు శుభకరమౌ ఆ
కటియును వైకుంఠ హస్త కాంతులమరగా
నటు అష్టోత్తర మాలను
కటిపై కనుగొంటి నేను కాంచన ప్రభలన్.
సింహాద్రి జ్యోతిర్మయి
27.3.2022
*శ్రీ విష్ణు కందం*
(తిరుమల శ్రీవారి మూల మూర్తి వర్ణన)
*12.కందం*
ఎదపై లక్ష్మీహార
మ్మదిగో పగడాల మాల యలరెడు నదిగో
కదలుచు ముప్పేటలుగా
నదె చూడు సహస్ర నామ హారములమరెన్.
*13. కందం*
అందరికీ ఆశ్రయమగు
సుందర పాదారవింద శుభ్రాంకితమై
అందెలు వెలుగగ గంటిని
వందనమిడి కంటి నచట వజ్రపు తొడుగుల్.
సింహాద్రి జ్యోతిర్మయి
28.3.2022
శ్రీ విష్ణు కందం
(తిరుమల శ్రీవారి మూల మూర్తి వర్ణన)
*14.కందం* పీతాంబరమును గంటిని
నీ తోమాలల సొగసులు నేనిదె గంటిన్
నా తండ్రి ! పద్మపీఠిని
చేతము లుప్పొంగ నిలుచు చెలువము గంటిన్.
*15.కందం*
ఇరువైపుల వేలాడే
సరియగు ఆ సాలగ్రామ సరములు గంటిన్
మరిమరి మై మరచి నిలిచి
తిరునాథా!నిన్ను గంటి తీరని తనివిన్.
*మూర్తి వర్ణన సంపూర్ణం*
ఓం శ్రీ వేంకటేశాయ నమః🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
29.3.2022
Comments
Post a Comment