3.రాజశేఖర శతకం
ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సులు.ప్రస్తుతానికి శ్రీ విష్ణు కందం ఆపుతున్నాను.మరికొన్ని పద్యాలు రాశాక మళ్ళీ పోస్ట్ చేస్తాను.
ఈ *రాజశేఖర శతకం* నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రాశాను.5 ఏళ్ళ క్రితం ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశాను.ఇప్పుడు మళ్ళీ మరొకసారి...
ఇంతకూ రాజశేఖర శతకం అంటే మావారి గురించి కాదు సుమండీ.అది కేవలం మకుటం మాత్రమే.
*రాజశేఖర శతకం*
(మహిళలు..మహారాణులు)
ఆరంభం
1తే.గీ.
శ్రీనివాసుడె దైవమ్ము చేరి కొలువ
తెలుగుభాషయె మధురమౌ తేనెవాక
అమ్మ ప్రేమయె మమతకు హద్దు భువిని
కలికి విజయమె స్ఫూర్తి యీ కలియుగాన.
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు.
నేటి నుండి నేను రాసిన
రాజశేఖర శతకం
నుండి ప్రతి రోజు ఒకటి ,రెండు పద్యాలు పోస్ట్ చేస్తాను.
మా శ్రీ వారి పేరు రాజశేఖర్.ఆయనకు అంకితంగా ఈ కావ్యం రాశాను.ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఈ శతకాన్ని ఆమూలాగ్రం సమీక్షించి,చక్కని ప్రశంసలతో ఆశీర్వదించారు.అలాగే ప్రముఖ కవి శ్రీ రావి రంగారావు గారు కూడా ఈ కావ్యం చాలా బాగున్నదని,తమ సంస్థ పేరున ప్రచురించి ఆవిష్కరణ చేస్తానని మాట ఇచ్చారు. ఇక ముఖ పుస్తక మిత్రులు కూడా నా కావ్యాన్ని ఆశీర్వదిస్తారనిఆశిస్తాను.
ఈ కావ్యానికి ఇతివృత్తంగా స్త్రీ ఔన్నత్యం,స్త్రీ ల సమస్యలు ప్రాచీన,ఆధునిక మహిళలు వంటి విషయాలు తీసుకున్నాను.
ఛందస్సు......తేటగీతి
మకుటం....రాజశేఖరా!వినుమిదే రమణి మాట.
1.తే. గీ.
శ్రీలు విద్యలు సౌభాగ్య చిహ్నములుగ
నిలుచు శ్రీ వాణి గిరిజల కొలుతురిలను
ముగ్గురమ్మలకును మూల మూర్తిగాను
రాజశేఖరా!వినుమిదే రమణి మాట.
సింహాద్రి
1.1.2017.
2.తే.గీ.
సరళమౌ తేటగీతిలో శతకమొకటి
వ్రాయవలెనని మదిలోన వాంఛ కలుగ
ఎంచుకొని నాతి చారిత్ర మింపుగొలుప
రూపమిడితి మన్నింపు డే లోప మున్న.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.5.2022
*రాజశేఖర శతకం*
(మహిళలు.. మహారాణులు)
3.తే. గీ.
అమ్మ నేర్పిన సంస్కారమావహింప
గురువులిచ్చిన జ్ఞానమ్ము తెరువు చూప
తెగువ జేసితి వ్రాయగా తెలుగుకవిత
ఆదరింపరే! మనసార అవధరించి.
4.తే. గీ.
మగని పేరున శతకపు మకుట ముంచి
మగువ జీవిత మిందులో మలచి నేను
వ్రాయుచుంటిని వాగ్దేవి వరముతోడ
కాయ మిచ్చి చనిన తల్లి కరుణజూడ.
సింహాద్రి జ్యోతిర్మయి
4.5.2022
*రాజశేఖర శతకం*
(మహిళలు..మహారాణులు)
*5.తే.గీ.*
కోరి వరియించి నన్నెంతొ కూర్మితోడ
సతము మన్నించు నా ప్రాణ సఖునిపేర
అల్లి కావ్యము జేసెద నంకితమ్ము
తలతునిది త్రోవయని దీర్ప తనదు రుణము.
*6.తే. గీ.*
తనదు పాపల గన్నట్టి తల్లినైన
నన్ను పసిపాప వలె తాను కన్నులందు
నిలిపినందుకు మారుగా నేను రుణము
తీర్చుకొందును తనపేరు తిరము జేసి.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.5.2022
*రాజశేఖర శతకం*
(మహిళలు.. మహారాణులు)
*7.తే. గీ.*
అమ్మనాన్నల మరపించు నతని మమత
అన్నదమ్ముల తలపించు నతని చెలిమి
హాయి మీరగ మురిపించు నతని ప్రేమ
అతడె దైవము,సర్వమ్మునతడె నాకు.
*అంకితం*
*8.తే.గీ.*
ఎన్ని జన్మల పుణ్యమో యేకమవగ
నీదు సతినైతి ననుకొందు నేను నిజము
పెక్కు జన్మలకైన నా మక్కువిదియె
దైవమిచ్చెనా వరమింత ధన్యనగుదు.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
6.5.2022
*రాజశేఖర శతకం*
(మహిళలు..మహారాణులు)
*అమ్మదనం*
*9.తే. గీ.*
నిన్ను గర్భాన మోయును నిండునెలలు
జన్మనిచ్చి పెంచుకొనును స్తన్యమిచ్చి
అమ్మ అనురాగ దేవత అని మరువకు
*రాజశేఖరా! వినుము నీ రమణి మాట*.
*10.తే. గీ.*
ప్రసవవేదన పడువేళ పడిన బాధ
పురిటికందును కనినంత మరచిపోవు
అమ్మదనము బ్రతుకుకెంత కమ్మదనము
*రాజశేఖరా! వినుము నీ
రమణిమాట*
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
7.5.2022
రాజశేఖర శతకం
అమ్మదనం
11.తే. గీ.
అమ్మ పైట చాటున అమృతమ్మునాని
మురిపెమున ఆమె కుచ్చిళ్ళ మోముదాచి
అంటి తిరుగాడు తల్లిని చంటి పాప
*రాజశేఖరా! వినుము నీ రమణి మాట*.
12.తే. గీ.
పెంచి కన్నయ్యకు యశోద ప్రేమ పంచె
శ్రీనివాసుడు వకుళమ్మ చెంత పెరిగె
నెన్న కన్న మమతకన్న మిన్న యిదియె
*రాజశేఖరా!వినుము నీ రమణి మాట*
సింహాద్రి
8.1.2017.
రాజశేఖర శతకం
పురాణ మహిళ.
13.తే. గీ.
వినుము దుర్గ దైత్యుని జంప విజయదశమి
నాతి తెచ్చె దీపావళి నరకు గూల్చి
శక్తి రూపిణి స్త్రీ యంట సత్యమిలను
*రాజశేఖరా !వినుము నీ రమణి మాట*.
14.తే. గీ.
సూర్యచంద్రుల గతినాపె సుమతి తాను
యముని సావిత్రి పతి కోస మనుసరించె
సాధ్విలోకము శాసింపజాలు జగతి
*రాజశేఖరా! వినుము నీ రమణి మాట*.
సింహాద్రి
9.1.2017.
రాజశేఖర శతకం
పురాణ మహిళ
15.తే. గీ.
హరుని మెప్పించి పెండ్లాడె నా యపర్ణ
పారిజాతము హరిచేత పడసె సత్య
ఔర! హరిహరాదులనైన అతివ గెల్చు
రాజశేఖరా! వినుము నీ రమణి మాట.
16.తే. గీ.
వేడి రుక్మిణి రాక్షసమాడె హరిని
వలచి వరియించె దమయంతి వరుని నలుని
ప్రేమ యిచ్చును ధైర్యమ్ము భామలకును
రాజశేఖరా! వినుము నీ రమణి మాట.
సింహాద్రి
10.1.2017.
రాజశేఖర శతకం
పురాణ మహిళ
17.తే.గీ.
ధరణి సుతకైన నిందలు తప్పలేదు
వలువలూడ్చిరి సాధ్వికి కొలువులోన
మారె యుగములు చరితలో మార్పు లేదు
రాజశేఖరా! వినుమిదే! రమణి మాట.
18.తే.గీ.
సీత కన్నీరు లంకకు చేటు దెచ్చె
నాశమయ్యెను కురురాజు నాతి పగకు
వనిత మనసు నొప్పించిన వచ్చు కీడు
రాజశేఖరా!వినుమిదే! రమణి మాట.
సింహాద్రి
11.1.2017.
రాజశేఖర శతకం
పురాణ మహిళ
19.తే.గీ.
బాల్య చాపల్యమున కుంతి బాలుని గని
గౌరవమ్ము చెడుననుచు గంగ విడిచె
పడతి తొందరపాటెంత పాటు దెచ్చు!
రాజశేఖరా!వినుమిదే !రమణి మాట.
20.తే.గీ.
కైక పంతగించి పడసె లోక నింద
నాగమ వలన పలనాడు నాశమయ్యె
చెడు తలపులున్న స్త్రీ బుద్ధి చేటు దెచ్చు
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
సింహాద్రి.
12.1.2017.
రాజశేఖర శతకం
పురాణ మహిళ
21.తే. గీ.
ఆస్తివోలె హరిశ్చంద్రు డాలినమ్మె
పాపమనక పాండు సుతుడు పందెమొడ్డె
పత్ని మన సు తెలుసుకున్న పతులు గలరె!
రాజశేఖరా! వినుమిదే!రమణి మాట.
22.కం. అర్థ నారీశ్వరుండయ్యె హరుడు ప్రీతి
హరియు సిరినెద నిలిపెను ఆదరమున
చెలిని మన్నించు విధమిదే !చెలిమి చూపి
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
సింహాద్రి
13.1.2017.
రాజశేఖర శతకం
చీర - సింగారం
23.తే.గీ.
ఎన్ని రకముల ఫ్యాషన్లు ఏటికేడు
వచ్చి పడుచున్న వారెవా! వసుధ లోన
వన్నె తగ్గని చీరలో యెన్ని కళలొ!
రాజశేఖరా!వినుమిదే! రమణి మాట.
24.తే. గీ.
కట్టుకొననెన్ని చీరెలు పెట్టెనున్న
పట్టుచీరపైనె నిలుచు పడతి మనసు
ఇట్టె మదిదోచు ఘనమైన పుట్టమిదియె
రాజశేఖరా! వినుమిదే!రమణి మాట.
సింహాద్రి
14.1.2017.
రాజశేఖర శతకం
చీర. సింగారం
25.తే. గీ.
చదువులుద్యోగముల పేర చకచకమని
పడుతు లేస్తు పరరుగులెత్తు పడతులిపుడు
ఓణి, చీరెల సవరింపు లోపలేరు
రాజశేఖరా!వినుమిదే! రమణి మాట.
26.తే. గీ.
వాలుజడయు,వోణి సొగసు పాతబడియె
పోనిటయిలు జీను హొయలు పోడిమయ్యె
నిత్య సౌకర్యమే జూచు నేటి వనిత
రాజశేఖరా!వినుమిదే !రమణి మాట.
సింహాద్రి
15.1.2017.
రాజశేఖర శతకం
స్త్రీ ఔన్నత్యం....ప్రేమ.
27.తే.గీ.
రమణి మొల్ల భక్తిని వ్రాసె రామ కథను
మోహనపు కృష్ణ కథ చెప్పె ముద్దుపళని
కలరు కవయిత్రులెందరో కాంతలందు
రాజశేఖరా! వినుమిదే! రమణి మాట.
28.తే.గీ.
అమ్మనాన్నలపై జూపు నమిత ప్రేమ
అనదమ్ముల మరచిపోదెన్నడైన
ఆడపిల్ల పుట్టింటికి వేడుకగును
రాజశేఖరా !వినుమిదే! రమణి మాట.
సింహాద్రి
16.1.2017.
రాజశేఖర శతకం
స్త్రీ ఔన్నత్యం..... ప్రేమ.
29.తే.గీ.
అడవికైనను పువ్వులు అందమొసగు
చింతదీర్చి హాయినొసగు చిన్నినవ్వు
ఇల్లు వెలిగించు దివ్వెలే ఇంతులెపుడు
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
30.తే. గీ.
తరుణికందమగునుగాక కురులు,విరులు
నాతి సొగసు పెంచెడునేమొ నగలు,వగలు
మానధనమొక్కటే ఖ్యాతి మగువకెపుడు
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
సింహాద్రి
17.1.2017.
రాజశేఖర శతకం
స్త్రీ ఔన్నత్యం...ప్రేమ
31.తే.గీ.
ఆస్తి పంచుకుపోదు రబ్బాయిలెపుడు
పెళ్ళి చేసుకు తనదారి వెళ్ళుగాని
పుట్టినింటిని మరువరు పుణ్య సతులు
రాజశేఖరా!వినుమిదే !రమణి మాట.
32.తే.గీ.
అమ్మ ఒడి ,భార్య కౌగిలి,అక్క చనువు
చేర్చి లాలించు,సుఖమిచ్చు,సేదదీర్చు
తరుణి మగవాని లోకమ్ము తథ్యమిదియె
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
సింహాద్రి
18.1.2017.
రాజశేఖర శతకం
స్త్రీ ఔన్నత్యం... ప్రేమ
33.తే.గీ.
తల్లి,తరుణి మరియు అక్క ,చెల్లి ప్రేమ
లేనినాడు పురుషుడౌను లేనివాడు
ఇంతి మమత లేక బ్రతుకు ఇంపొసగదు
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
34.తే.గీ.
భాగమతి పేర వెలసెను భాగ్యనగరు
తాజమహలు నిర్మించెను షాజహాను
మగువ ప్రేమకన్న మహిమ మహిని గలదె!
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
సింహాద్రి
19.1.2017.
రాజశేఖర శతకం
స్త్రీ ఔన్నత్యం..... ప్రేమ.
35.తే. గీ.
భార్య భోజ్యేషు మాతగా భావమందు
యెంచు సంస్కృతి మనదయా !యెంత ఘనము!
ఇదియె మనజాతి సంస్కార మెరిగి మెలగు
రాజశేఖరా!వినుమిదే!రమణి మాట.
36.తే. గీ.
తనువు కోమలమ్ము కనగ,తరుణి పలుకు
కోమలమ్ము వినగ ,మది కోమలమ్ము
చూడ,కోమలత్వపు కొమ్మ లాడువారు
రాజశేఖరా! వినుమిదే!రమణి మాట.
సింహాద్రి
20.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ -సమస్యలు
37.తే.గీ.
ఇల్లు దిద్దవలె,మగని కింపు గూర్ప
వలెను,ఉగ్యోగ మొనరింప వలెను పైన
కత్తి మీద సాము బ్రతుకు కలికి కిపుడు
రాజశేఖరా !వినుమిదే! రమణి మాట.
38.తే.గీ.
ఆలి తెచ్చెడి సంపదలామె నగలు
కట్నకాన్కలు తలపోసి కాంతనెంచి
కూడుటేగాని మదిలోన కూరిమేది?
రాజశేఖరా ! వినుమిదే !రమణి మాట.
సింహాద్రి
21.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~ సమస్యలు
39.తే. గీ.
ఎంత చదువున్న ,తెలివైన ఇంతి గాని,
మంచి ఉద్యోగమే చేయు మహిళగాని
కట్నమివ్వక ఖాయమ్ము కాదు పెళ్ళి
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
40.తే. గీ.
రమణి పూజింపబడు చోట అమరులుంట
స్థిరమెయగునేని దైవాలు శిలలుగారె !
తరుణి వేధింపబడెడు యీ ధరణి పైన
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
సింహాద్రి
22.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~ సమస్యలు.
41.తే. గీ.
సరకు లంగడి వీధిలో దొరకు తీరు
వనిత తనువుకు వెలకట్టి వాడుకొనెడు
ఘోర కాలమ్ము మారగా పోరవలెను
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
42.తే. గీ.
నరకుడు చెరబట్టిన వేల తరుణులకును
దొరికెను విముక్తి చేపట్టి హరియె బ్రోవ
వేశ్య వాడల స్త్రీలకు వేలుపెవరు?
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
సింహాద్రి
23.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~సమస్యలు
43.తే. గీ.
మగువ దేవతయని కొల్చు మహిని నేడు
అతివ అంగాంగములు కొల్చి ఆధునికులు
తీర్పు నిత్తురు సౌందర్య దేవతలని
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
44.తే. గీ.
జగతి అందాల పోటీలు జరిపి వేడ్క
కొమ్మలను అందు రందాల బొమ్మలనుచు
అతివ సొగసును గనలేక అమ్మలోన
రాజశేఖరా !వినుమిదే !రమణి మాట.
సింహాద్రి
24.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~సమస్యలు
45.తే. గీ.
పత్నిని విడి రాముడు మది పరితపించె
నిందలేసి సతిని వేచు నేటి మగలు
సాటి తమకు రాముడనుచు చాటగలరు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
46.తే. గీ.
కాంత క్షమకు భూదేవి కావలెనని
పలికి వేధించు టొప్పునే పలువిధముల
సహన ముడిగెనా తరుణియే శక్తి యగును
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
25.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~సమస్యలు
47.తే.గీ.
మనువు ధర్మ శాస్త్రము లోని మర్మమేమొ
తెలియజాలక సంఘమ్ము తెలివిమీరి
నాతి స్వేచ్ఛను హరియింప నీతియగునె!
రాజశేఖరా!వినుమిదే !రమణి మాట.
48.తే.గీ.
సతిని కార్యేషు దాసిగా చాటువారు
కాంత కరణేషు మంత్రిగా కాంచరేమి?
పతులు తమకు నచ్చినదేను పాడి యనరె!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
26.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~సమస్యలు
49.తే. గీ.
కన్నతండ్రి కూతురినెంచు ఖర్చుగాను
కూర్మి సాకు తల్లి తలచు కుంపటివలె
కట్టుకున్న వాడికి సతి కాసులగని
రాజశేఖరా వినుమిదే రమణి మాట
50.తే. గీ.
కన్యలకు శుల్కమిడి కొన్న కాలమొకటి
వరుని కట్నమిచ్చి కొనెడు తరుణ మిపుడు
ఇంతికే చింత ఆచారమేది యైన
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
27.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~సమస్యలు
51.తే. గీ.
కొడుకు బ్రతుకును వెలిగించు కోడలనక
కట్న రాసుల కోసమై కష్టపెట్టి
మగువ ఉసురును దీతురే మమత వీడి
రాజశేఖరా వినుమిదే రమణి మాట
52.తే. గీ.
వెలకు అమ్ముడు పోవగా వేశ్య యవగ
కట్నముల పేర కాసుల కమ్ముడు వడు
పురుషులేమౌదురో నాకు బోధపడదు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
28.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ ~సమస్యలు
53.తే. గీ.
పరువు పోవునేమో నని పాకులాడి
ఎంత హింసనైన సహించు నింతి మనసు
ఎదురు తిరిగెనా ఆపగా నెవరి తరము?
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ--సమస్యలు
54.తే.గీ.
తరుణి నడిరేయి నొక్కతే తిరుగగలుగు
సమయమే స్వేచ్ఛ యగునని చాటినట్టి
జాతిపిత మాట కలనైన సత్యమగునె?
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
55.తే.గీ.
మాట దాచగ లేరు మీ మగువలనుచు
పలుకుచుందురు కల్లలు పడతులనుచు
కథలు చెప్పి నిందలు వేయ కలుగు బాధ
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
30.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ--సమస్యలు.
56.తే.గీ.
మగడు పోయిన యంతనె మనసు చచ్చి
కుమిలిపోయెడు మగువను కూడి చేరి
విధవ జేయగ యత్నించు విధము తగవె!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
57.తే.గీ.
అమ్మప్రేమకు రూపైన కొమ్మలార!
అత్త కాగానె ప్రేమ యెట్లంతరించు?
స్త్రీ కి శత్రువు స్త్రీ యౌట సిగ్గు గాదె!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
31.1.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ--సమస్యలు
58.తే. గీ.
ఈవు టీజింగు చేయుచు ఏడిపించి
ఆడపిల్లల వేధింప వేడుకగునె?
నాతి నుడికింప జారదే!జాతి పరువు
రాజశేఖరా!వినుమిదే !రమణి మాట.
59.తే. గీ.
తల్లిదండ్రుల తీరున తనదు అత్త
మామల నెపుడు సేవించి మన్ననలిడు
మగువ పొందును తప్పక మగని ప్రేమ
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
1.2.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ
60.తే. గీ.
నీలగగనమ్ములో నేడు నేను సగము
అవని అవకాశములు నాకు అందె సగము
అనుచు ఎదుగుచున్నది చూడు డతివ ఇపుడు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
61.తే. గీ.
అంతరిక్షమ్ము నవలీల నధివసించు
రాజ్యములనైన పాలించు రమణి శక్తి
తరుణి చేయగ లేనిది ధరణి గలదె!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
2.2.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ
61.తే. గీ.
చాకి పద్దులు వ్రాయగా చాలినంత
చదువులే చాలు నింతికి శాస్త్ర మేల!
అనెడు కాలము శుభమిక యంతరించె
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
62.తే. గీ.
భర్త భరియించు వాడన పాత మాట
మారి పోయెను కాలమ్ము మహిని నేడు
ప్రాణ సఖుడౌచు మెలగిన పడతి మెచ్చు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
62 వ పద్యంలో గురజాడ వారి భావమే.
మగడు వేల్పన పాతమాటది
ప్రాణ సఖుడను నీకు నేను
అని గురజాడ వారు తన ముత్యాలసరం లో చెప్పారు.
సింహాద్రి
3.2.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ.
63.తే. గీ.
నిప్పులొలుకుతూ కల్పన నింగికెగసి
నేల చేరెడు క్షణములో కూలనేమి?
స్ఫూర్తి నీవు సునీతరో !సుదతి కెపుడు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
64.తే. గీ.
అద్భుతము చదరంగాన హంపి నేర్పు
ఔర!యనిపించు సానియా ఆట తీరు
ఉషయు,మల్లీశ్వరియు మన యువిదలేగ!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
4.2.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ
65.తే. గీ.
ఉక్కు మహిళగా ఇందిర కుంది ఖ్యాతి
ప్రథమ మహిళగా ప్రతిభమ్మ ప్రతిభ జూపె
అమ్మ జయ పురుచ్చి తలైవి అయ్యె గాద
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
66.తే. గీ.
నిదురలేచిన మహిళల ఎదుగుదలను
తలచి పురుష ప్రపంచము దద్దరిల్లె
ననుచు పింగళి పలికించె అన్న నోట
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
5.2.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ
67.తే. గీ.
అత్తవారింటి ఆరళ్ళు అధికమైన
కాచు గృహ హింస చట్టాలు కలవు మగువ
ఏల భరియింతు విక వీడు బేలతనము
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
68.తే. గీ.
ఆడపిల్లకు ఆస్తిలో హక్కు ఉంది
ఆదుకొనుటకు నిర్భయ అండ ఉంది
బెదిరి తలవంచ పనిలేదు ముదిత నేడు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
6.2.2017.
రాజశేఖర శతకం
ఆధునిక మహిళ
69.తే. గీ.
చొరవతోడ మాట్లాడిన చులకన యగు
పలుకగలరు వనిత వెన్క పలు విధముల
తెలిసి హద్దులు మెలగెడు తెలివి వలయు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
70.తే. గీ.
కూళల వెకిలి చేష్ఠల క్రుంగిపోక
పరువు దీయ జూసెడి వారి పాలబడక
తెలివితోడ మసలునదే ధీరవనిత
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
7.2.2017.
.
రాజ శేఖర శతకం
నేటి ప్రేమలు,పెళ్ళిళ్ళు.
71.తే. గీ.
అమ్మనాన్నల నెదిరించి హద్దుమరచి
ప్రేమ ఘనమని చాటెడు పిల్లలార!
కన్నవారిపై లేనిది కలుగుటెట్లు?
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
72.తే. గీ.
వీడి మనజాల మనుచును జోడు కట్టి
అంతలోననె విడిపోవు వింత గనుచు
వమ్మనక పెద్దలీ ప్రేమ నమ్ముటెట్లు?
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
13.2.2017.
రాజశేఖర శతకం
నేటి ప్రేమలు --పెళ్ళిళ్ళు
73.తే. గీ.
కులమతాల సాకులు జూపి కూర్మి జతల
వేరుచేసి బాధించెడు పెద్దలార !
కలిపి దీవించి పిల్లల కాచుకొనుడు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
74.తే. గీ.
ఏడు జన్మలకు వెనుక ఏర్పడునని
మూడు ముళ్ళతోడ మరల ముడిపడునను
నమ్మికలు విడాకుల తోడ నాశమయ్యె
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
14.2.2017.
రాజశేఖర శతకం
నేటి ప్రేమలు--పెళ్ళిళ్ళు
75.తే. గీ.
వయసు తొందరచేయగా భవితమరచి
తప్పటడుగులేసి పిదప తల్లులయ్యి
పాపలను గని పడవేయ పాపమవదె!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
76.తే.గీ.
తరచు ర్యాగింగు పేరుతో జరుగుచున్న
చిలిపి అల్లర్లు శ్రుతిమించి చేయుచుండె
నిండు బ్రతుకును క్షణములో నేరమయము
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
17.2.2017.
రాజశేఖర శతకం
77.తే.గీ.
మాతృదేశము భారత మాత అయ్యె
నదులు మన్నింప బడుచుండె నాతి తీరు
ధాత్రి కొనియాడ బడు ఇంతి ధన్యురాలు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
78.తే.గీ.
నిన్ను వహియించు భూమిని నేలతల్లి
పండి కరుణించు పంటను పైరు లక్ష్మి
అనుచు మాతృభావన జూపు ఘనత మనది
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
20.2.2017.
అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
రాజశేఖర శతకం.
షట్కర్మయుక్తా కులధర్మ పత్నీ.
81.తే. గీ.
నాతి షట్కర్మ యుక్తగా నీతి తెలిపి
సతిని కులధర్మ పత్నిగా చాటినట్టి
మహిత సంస్కృతి మనదేను మహిని జూడ
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
82.తే. గీ.
ఆలి సహధర్మచారిణి యన్నమాట
మగువ స్వేచ్ఛ హరించెడి మార్గ మనకు.
మనము ఇల్లాలి కిచ్చెడి మన్నన యది
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
83.తే. గీ.
సేవ యన బానిసత్వంపు భావ మనక
సేవ లొనరించి ప్రేమతో సేద దీర్చు
కాంత కార్యేషు దాసిగా ఖ్యాతి నొందు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
84.తే. గీ.
అలసి వచ్చెడి మగవాని ఆక లెఱిగి
కొసరి వడ్డించి కమ్మగా కూర్మి తోడ
మగువ తినిపించ భోజ్యేషు మాత యగును
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
85.తే. గీ.
మంచి చెడులు తెల్పి మగని మనసెఱింగి
ఆపదల వేళ తెలివితో అనువు జూపు
ధీర కరణేషు మంత్రియై దిద్దగలదు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
86.తే. గీ.
తప్పు చేసిన భర్తతో తగవు పడక
ఓర్పు వహియించి సరిదిద్ది మార్పు తెచ్చు
పడతి క్షమయా ధరిత్రియై పతిని గెల్చు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
87.తే. గీ.
జాణ తనమున మన్మథ బాణ మటుల
ప్రాణ పతి చేత మీటిన వీణ వోలె
రాగ రంజిత యగు కాంత రంభ గాదె!
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
88.తే. గీ.
పలుకు లందున సౌమ్యత,మొలక నగవు
కనుల నిర్మలత ,కనగ కాంతు లీను
మోము రూపేచ లక్ష్మి గా భామ నిలుపు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి
8.2.2017.
రాజశేఖర శతకం
అష్టవిధ నాయికలు.
89.తే. గీ.
అష్టవిధ నాయికలు గలరంచు మునుపు
అనుటయే గాని యెరుగరీ ఆధునికులు
తెలియజెప్పెద నొకసారి తెల్లముగను
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
90.తే.గీ.
భర్త అనుకూలుడై యుండు భాగ్యమబ్బి
అతని అనురాగమంతయు అందునట్టి
పడతి స్వాధీనపతికగా పుడమి వెలుగు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
91.తే.గీ.
మగని రాక కొరకు వేచి మందిరమును,
తనను తాను సింగారించి తరుణమునకు
కాచు మగువ వాసకసజ్జిక యనబడును
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
92.తే.గీ.
ప్రణయ భావమ్ము మదిలోన పరిమళింప
చెలుని కలువగా సంకేత సీమ జేరు
నాయిక అభిసారిక యను నామమందు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
93.తే.గీ.
వేళకు తన చెంతకు రాని విభుని కొరకు
వేచి చూచి విరహమంది వేగిరపడు
కాంతను విరహహోత్కంఠితగా నెరుంగు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
94..తే. గీ.
వచ్చెద నిదిగో తప్పక నిచ్చటికని
పల్కిన ప్రియుని గానక పరితపించు
వనిత విప్రలబ్ధ యనగ వాసికెక్కు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
95.తే.గీ.
ఛీ యనుచు తొల్త పొమ్మని ఛీత్కరించి
వెనుక పరితపించి మిగుల వేదనపడు
కాంత కలహాంతరితయగు కాంచగాను
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
96.తే.గీ.
ఇతర కాంతలతో గూడి ఇల్లుజేరు
భర్త మోసము కనిపెట్టి భగ్గుమనుచు
మండిపడునట్టి మగువయే ఖండితయగు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
97.తే.గీ.
దూర దేశమ్ము పతియేగ తోడు లేక
వయసు ,సొగసు,బ్రతుకు యెంతొ భారమవగ
కలగు కాంత ప్రోషితభర్తృక యగు గాదె
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
సింహాద్రి జ్యోతిర్మయి
23.3.2017.
రాజశేఖర శతకం
అష్టవిధ వివాహాలు.
98.తే. గీ.
అవని పేరుగన్నది భారతావని పలు
సంప్రదాయములకు నందు శాస్త్ర విహిత
మైన మన వివాహపు రీతు లతి ఘనమ్ము
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
99.తే.గీ.
కనులు,మాటలభిరుచులు,మనసులు మరి
మనువు లేకమైన పిదప మనసుదీర
మేనులేకమౌ దాంపత్యమేను సొగసు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
100.తే.గీ.
సృష్టి కార్యములను ధర్మ భ్రష్టమవక
జనులు సుఖియించి శుభములు కనుగొనంగ
అష్టవిధ వివాహమ్ముల నాడవచ్చు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
101.తే.గీ.
తగిన విద్యయు ,ఆచారము గల వరుని
తెచ్చి వస్త్రాదుల కొలిచి మెచ్చి కూతు
నిచ్చి పెళ్ళి చేయుట బ్రాహ్మ మీ విధమ్ము
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
102.తే.గీ.
యజ్ఞ యాగాదు లొనరించి ఖ్యాతిగన్న
ఋత్విజునికి కన్యనొసగి సత్వరమ్ము
చేయు పెళ్ళి దైవమనగ చెలగు భువిని
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
103.తే. గీ.
గోమిధునము ధర్మార్థము కామితముగ
పుచ్చుకొని పిదప తనయనిచ్చి శాస్త్ర
హర్షమొనర పెండ్లి జరుప నార్ష మగును
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
104.తే.గీ.
మీరు ఇర్వురు జతగూడి మీద యింక
కాపురము జేసి ధర్మమ్ము కావుడనుచు
మనువు చేయ ప్రాజాపత్యమగును మహిని
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
105.తే.గీ.
వరుని వద్ద ధనముగొని కరము ప్రీతి
వేడి సుతనొసగి వివాహమాడు మనుచు
పలుకుపద్ధతి ఆసుర పరిణయమ్ము
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
106.తే.గీ.
కోరి కన్యావరులు తాము కూడి ప్రేమ
పాటి చేయక పెద్దల మాట ప్రకృతి
సాక్షి యనుచు గాంధర్వమ్ము సలుపవచ్చు
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
107.తే.గీ.
వధువు సమ్మతి పనిలేక బలిమితోడ
కన్య నపహరించుకువచ్చి కయ్యమందు
రమణ కళ్యాణ మాడుటే రాక్షసమ్ము
రాజశేఖరా వినుమిదే రమణి మాట
108.తే.గీ.
మైమరచి యున్న కాంతను కామవాంఛ
చేకొని రహస్యముగ పెండ్లి జేసుకొనుట
అధమమగుటను పైశాచమందు రిలను
రాజశేఖరా వినుమిదే రమణి మాట.
రాజశేఖర శతకం సంపూర్ణం.
Comments
Post a Comment