గీతా కంద మరందం -1 అర్జున విషాద యోగం (సంపూర్ణం)


➖➖➖➖➖➖➖➖➖
గీతా (కంద) మరందం 
➖➖➖➖➖➖➖➖➖

➖➖➖➖➖➖➖➖➖
1. అర్జున విషాదయోగం
➖➖➖➖➖➖➖➖➖


శ్లోకం 1 
ధృతరాష్ట ఉవాచ 

 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ 
కిమకుర్వత సంజయ || 1-1 ||

ప్రతి పదార్థం :-

ధృతరాష్ట్ర ఉవాచ -ధృతరాష్ట్రుడు చెప్పెను

 
సంజయ =ఓ సంజయా; 
ధర్మక్షేత్రే= ధర్మభూమియైన;
 కురుక్షేత్రే= కురుక్షేత్రమునందు;
 యుయుత్సవః= యుద్ధము చేయు తలంపుగలవారై; 
సమవేతాః= కూడినట్టి; 
మామకాః =నా వారలును;
 పాండవాశ్చైవ (పాండ వాః చ ఏవ) =పాండవులును; 
కిమ్= ఏమి; 
అకుర్వత= చేసిరి?

తాత్పర్యం :- 
ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు పలికెను.
ఓ సంజయా!నా వారలగు దుర్యోధనాదులును,పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధము చేయ కుతూహలముతో ధర్మభూమియైన ఆ కురుక్షేత్రమున జేరి ఏమి చేసిరి?

అనువాద పద్యం :-
1.కందం
దురము కొఱకు ధర్మమ్మగు 
కురుభూమిని కూడినట్టి కుంతితనయులున్ 
మరి నా ప్రియసుతులు నచట 
చరియించిన విధము దెలుపు సంజయ! నాకున్.||1-1||

దురము.. యుద్ధము

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

శ్లోకం 2.

దృష్ట్వాతు పాండవానీకం
వ్యూఢం దుర్యోధనస్తదా
ఆచార్యముపసంగమ్య
రాజా వచనమబ్రవీత్

 

టీక:-
సంజయ ఉవాచ= సంజయుడు చెప్పెను ;
తదా =అప్పుడు ;
రాజా= రాజగు ;
దుర్యోధనః= దుర్యోధనుడు ;
వ్యూఢం= వ్యూహములుగా అమర్చబడియున్న ;
పాండవానీకమ్= పాండవసేనను ;
దృష్ట్వా తు= చూచి (అటుపిమ్మట);
ఆచార్యమ్= ద్రోణాచార్యుని ;
ఉపసంగమ్య= సమీపించి ;
వచనమ్ =(ఈ చెప్పబోవు) వాక్యమును;
అబ్రవీత్ =పలికెను .

తాత్పర్యం :-
ధృతరాష్ట్రునితో సంజయుడిట్లు వచించెను.
అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా అమర్చబడి యున్న పాండవసేనను జూచి,తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.

అనువాద పద్యం 
2.కందం
చూచియు పాండవ సేనను 
యోచించుచు నీసుతుడు సుయోధను డధిపా!
తోచిన తన మాట దెలుప 
నాచార్యుని ద్రోణుజేరి యతనికి ననియెన్.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

శ్లోకం 3
పశ్యైతాం పాండుపుత్రాణామ్ 
ఆచార్య మహతీం చమూమ్
వ్యూఢాం ద్రుపదపుత్రేణ 
తవ శిష్యేణ ధీమతా.

టీక :-
ఆచార్య -ఓ గురువర్యా!
తవ -నీయొక్క 
శిష్యేణ -శిష్యుడును 
ధీమతా- బుద్ధిమంతుడునగు 
ద్రుపద పుత్రేణ- ద్రుపదరాజ పుత్రుడగు ధృష్టద్యుమ్నుని  చేత
 వ్యుఢామ్ -వ్యూహాకారముగా రచింపబడిన 
పాండుపుత్రాణామ్ -పాండవుల యొక్క 
ఏతామ్- ఈ 
మహతీమ్- గొప్పది యగు 
చమూమ్- సేనను
 పశ్య -చూడుము

తాత్పర్యం:
ఓ గురువర్యా!బుద్ధిశాలియు,మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడియున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు.

అనువాద పద్యం:
3.కందం:
ధీమంతుడు తమ శిష్యుడు 
మీముందట నేర్పరచిన మేలగు వ్యూహం 
బో మహనీయా!గను సం
గ్రామభువిని ద్రుపదతనయు ప్రకటిత నేర్పున్.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


శ్లోకం -4,5,6

అత్రశూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
టీక :
  • అత్ర = ఈ పాండవ సైన్యంలో
  • శూరాః = శూరులు
  • మహా-ఇష్వాసాః = గొప్ప విలుకాండ్రు
  • భీమ-అర్జున-సమాః = యుద్ధంలో భీముడు, అర్జునుడితో సమానమైనవారు
  • యుధి = యుద్ధమునందు ఉన్నారు.
  • వారు ఎవరనగా: యుయుధానః = (సాత్యకి), 
  • విరాటశ్చ-విరాటః చ, విరాటుడును మరియు
  • మహారథః మహారథుడైన
  • ద్రుపదశ్చ - ద్రుపదః చ 
  • మరియు ద్రుపదమహారాజు. 


5.శ్లోకం
ధృష్టకేతుశ్చేకితానః 
కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కుంతిభోజశ్చ 
శైబ్యశ్చ నరపుంగవః || 

టీక:

    వీర్యవాన్ =పరాక్రమవంతుడగు  
ధృష్టకేతుః =శిశుపాలుని పుత్రుడు
చేకితానః =చేకితానుడనే యాదవరాజు 
కాశీరాజశ్చ = కాశీరాజును 
పురుజిత్,కుంతిభోజః చ=పురుజిత్తు,కుంతిభోజుడనే కుంతీదేవి సోదరులు 
నరపుంగవః =మనుజ శ్రేష్ఠుడగు
శైబ్యఃచ= శైబ్యుడును 

6.శ్లోకం
యుధామన్యుశ్చ విక్రాంత
 ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ 
సర్వ ఏవ మహారథాః || 

టీక:
విక్రాంతః= పరాక్రమశాలి యగు 
యుధామన్యుశ్చ= సాత్యకి యను పేరుగల యుధామన్యుడును
వీర్యవాన్ =పరాక్రమవంతుడగు 
ఉత్తమౌజాశ్చ =ఉత్తమౌజుడును 
సౌభద్రః =అభిమన్యుడును 
ద్రౌపదేయాఃచ= ద్రౌపదీ తనయులగు ఉపపాండవులును 
సర్వే =వీరందరును 
మహారథాః ఏవ =మహారథులే అయి ఉన్నారు


       

అనువాద పద్యాలు 
4,5,6
కందం:
కనుమార్యా!భీమార్జున 
ఘనశౌర్యముతో సమముగ కార్ముకవిద్యన్ 
వినుత యశముతో నొప్పుచు 
పనివిను యోధతతి వైరి పక్షమునందున్ 

*పనివిను- ఆజ్ఞావశవర్తియగు
5.
అనువాద పద్యం:

ద్రుపదవిరాటులు సాత్యకి 
యపారమౌ వీరమున్న యభియన్యుడు తా
నపజయ మెఱుగడు శైబ్యుడు 
నుపమింపగ సాటిలేని యుపపాండవులున్ 




6.అ
అనువాద పద్యం:

అతడె యుధామన్యు డనగ
పొతమున పురుజిత్తు కుంతిభోజులు వారే 
అతడేను చేకితానుం
డతడే గను యుత్తమౌజు నరివీరులలో

6.ఆ.
అనువాద పద్యం:
వీరుండగు కాశీపతి
నేరుపుగల ధృష్టకేతు నృపముఖ్యులదే 
పోరున పాండవ పక్షము 
వీరెల్లరు నిలిచినారు విఖ్యాతులనన్

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


7 వ శ్లోకం 

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే || 7 ||
✍️ ప్రతిపదార్థం
  • ద్విజోత్తమ = బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైన ఓ గురుదేవా!
  • అస్మాకం తు = మా పక్షంలో కూడా
  • యే విశిష్టాః = ఎవరైతే ముఖ్యులైనవారో
  • తాన్ = వారిని
  • నిబోధ = తెలుసుకోండి
  • మమ సైన్యస్య = నా సైన్యము యొక్క
  • నాయకాః = అధిపతులు (ఎవరో)
  • తే = మీ
  • సంజ్ఞార్థం = జ్ఞాపకార్థం (తెలియజేయడం కోసం)
  • తాన్ = వారిని (వారి పేర్లను)
  • బ్రవీమి = చెప్పుచున్నాను 
💡 భావం
"ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! మన పక్షంలో ఉన్నవారిలో ప్రముఖులైనవారెవరో, 
నా సైన్యానికి నాయకులుగా ఉన్నవారెవరో మీ సమాచారం కోసం వారి పేర్లను చెప్తాను, వినండి."

అనువాద పద్యం:
వినుడిక మన పక్షములో 
ఘనశూరుల పేర్కొనియెద కయ్యములోనన్ 
మనమున జ్ఞప్తికి రావలె 
నను యూహను తెలుపుచుంటి నార్యా!తమకున్.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

8వ‌శ్లోకం

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ 
కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ
 సౌమదత్తిస్తథైవ చ ||

ముఖ్యమైన యోధులుఈ శ్లోకంలో దుర్యోధనుడు తన వైపు ఉన్న క్రింది వీరుల పేర్లను ప్రస్తావించాడు:భవాన్: పూజ్యులైన మీరు (ద్రోణాచార్యులు)భీష్ముడు: భీష్మ పితామహుడుకర్ణుడు: సూతపుత్రుడైన కర్ణుడుకృపః (కృపుడు): యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించే కృపాచార్యుడుఅశ్వత్థామ: ద్రోణుని కుమారుడువికర్ణుడు: ధృతరాష్ట్రుని కుమారుడు (కౌరవులలో ధర్మపరుడు)సౌమదత్తి: సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు

అనువాద పద్యం:
తమరిని భీష్ముని కర్ణుని
క్రమమున కృపునిన్ వికర్ణ కౌరవ్యుల నా
ప్రముఖుం డశ్వత్థామను
తుములమ్మున సౌమదత్తి దూగుట తరమే!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
9 వ శ్లోకం 

అన్యే చ బహవః శూరా 
మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్ర ప్రహరణాః 
సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।

అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు.

తాత్పర్యం 
ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.

అనువాద పద్యం 
నాకొఱకై ప్రాణమ్ములు 
తేకువతో నీయగలుగు ధీరవరేణ్యుల్ 
కాకలు దీరిన యోధుల 
నేకులు వివిధాస్త్రశస్త్ర నిపుణనృపతులున్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
10.
అనువాద పద్యం 
పరిమితి లేనిది మనకిటు 
కురువృద్ధుని రక్షణమున కురుసైన్యంబుల్ 
పరిమితిగా నున్నవచట 
నరిసేనలు భీమసేను నండన కనగాన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
11.
అనువాద పద్యం 
మీరెల్లరు నాచార్యా!
మీరక మీ స్థానములను మేలగు రీతిన్ 
చేరక శత్రులు భీష్ముని 
నేరుపుతో గాచుటవిధి నిరపాయముగాన్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
12 వ శ్లోకం

  • తస్య: దుర్యోధనుని యొక్క
  • సంజనయన్: వృద్ధి చేయుచు (కలుగజేయుచు)
  • హర్షం: సంతోషమును, ఉల్లాసమును
  • కురువృద్ధః: కురువంశంలో వృద్ధుడైన
  • పితామహః: తాతయైన భీష్ముడు
  • ప్రతాపవాన్: ప్రతాపశాలి (పరాక్రమము గలవాడు)
  • ఉచ్చైః: బిగ్గరగా
  • సింహనాదం వినద్య: సింహం వలె గర్జించి
  • శంఖం దధ్మౌ: శంఖమును మ్రోగించెను 
భావం
అప్పుడు కురువంశపు ప్రతాపశాలి అయిన పెద్ద తాత భీష్ముడు, దుర్యోధనుని హృదయంలో సంతోషాన్ని (ఉత్సాహాన్ని) కలిగించడానికి, సింహం వలె బిగ్గరగా గర్జించి తన శంఖాన్ని పూరించాడు. 


అనువాద పద్యం 
కందం:

అంతట రారాజు మురియ 
శాంతనవుడు దిశలు మ్రోగ శంఖము వినిచెన్ 
కాంతారపు సింహధ్వని 
భ్రాంతిగొలిపి తన దళముకు ప్రమదము నిడుచున్.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
శ్లోకం 13

అనువాద పద్యం 
కందం:
గాంగేయుని ప్రేరణతో 
సంగరమున వీరవరులు శంఖులు భేరుల్ 
శృంగపు బూరల నూదగ
నింగిని కోలాహలములు నినదించె వడిన్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
శ్లోకం 14

అనువాద పద్యం 
కందం :
శ్వేతాశ్వములను బూన్చిన 
ఖ్యాతి గలుగు యరదమునను కౌంతేయుండున్
పీతాంబరుడును చేసిరి
జాతమదర దివ్య శంఖ సంరావంబుల్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
శ్లోకం 15
అనువాద పద్యం 
 కందం 
హరి పాంచజన్య మూదగ 
నరుడును తన దేవదత్త నాదము జేసెన్
సరగున భీముడు పౌండ్రము 
నరివీరుల గుండెచెదర నట పూరించెన్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
శ్లోకం 16
అనువాద పద్యం 
కందం :
ధర్మజు డనంత విజయము 
మార్మోగగ దిశలు వినిచె మరి సుఘోషమున్ 
 వర్మితుడై నకులుండును 
చర్మియు
మణిపుష్పకమును సహదేవుండున్

*వర్మితుడు=కవచము ధరించినవాడు 
*చర్మి =డాలును దాల్చినవాడు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
17 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ఘనధన్వియు కాశీపతి 
ఘనులైన మహారధులు శిఖండివిరాటుల్
ఘనుడా ధృష్టద్యుమ్నుడు 
జననుతు డపరాజితుండు సాత్యకి ప్రముఖుల్ 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
18 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ద్రౌపది తండ్రియు తనయులు 
చాపమునన్ సాటిలేని సౌభద్రుండున్ 
చూపుచు సమరోత్సాహము 
భూపతి గుమి శంఖుచయము పూరించిరటన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
19 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

వీరుల శంఖారావము 
భూరిగ మ్రోయుచు దిశలను పుడమి నభములన్ 
హోరెత్తగ రణభూమిని 
కౌరవ్యుల గుండెలదరి కంపము పుట్టెన్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
20 వ శ్లోకం 

అనువాద పద్యం 

అంతట హనుమధ్వజు డా 
కౌంతేయుడు సంగరమున కరముల వింటిన్ 
సంతసమున ధరియించెను 
శాంతనవుని యండనగల సైన్యము గనుచున్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
21 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ఇరుసేనల నడుమన మన
యరదము నొకపరి నిలుపుమ!యచ్యుత యనుచున్ 
కురునాథా!రణభూమిని
హరితో కడు వినయమొప్ప యర్జును డనియెన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
22 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ఎవ్వారలు కురు నివహం 
బెవ్వరితో సంగరంబు నే సేయవలెన్ 
దవ్వెంతగ యున్న కనగ 
నవ్వారిని వీలగు రథ మచట నిలుపుమా!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
23 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

కుమతియగు సుయోధనునకు
సమరమ్మున ప్రీతిగూర్చి సాయపడంగన్ 
సమకట్టుచు నిలిచిన యీ
సమరోత్సాహుల కనియెద చక్కగ కృష్ణా!!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
24 వ శ్లోకం

అనువాద పద్యం కందం 

ఈరీతిని పలికిన యా 
వీరుండగు విజయు మాట విని మాధవుడున్ 
బారులు తీరిన యిరువురి 
తీరగు సేనల నడుమన తేరును నిలిపెన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
25 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ప్రముఖులు భీష్మద్రోణులు
సముఖమ్మున సర్వ శత్రు సముదాయంబుల్ 
సమరావని నిల్చిరదే 
యమరిక కనుమంచు శౌరి యర్జును కనియెన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
26 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

అంతట యా పార్థుడచట 
పంతముతో నిలిచియున్న భ్రాతల సఖులన్ 
దొంతర తాతల తండ్రుల 
మంతులు గురువరుల మేనమామల జూచెన్ 
దొంతర..పరంపర 
మంతులు... ప్రసిద్ధులు 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
27వ శ్లోకం 
అనువాద పద్యం 

హితులను మామల బంధుల 
ప్రతివీరుల యందు తనదు పక్షమునందున్ 
ప్రతివారిని పార్థుండు ని
శితముగ పరికించి జూచి చిత్తమములోనన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
28 వ శ్లోకం 
అనువాద పద్యం 
దయమీఱగ దైన్యముతో 
నయనమ్ముల నీరునిండ నరుడు కలగుచున్ 
ప్రియులగు బంధుల గనుచు న 
నియెనిటు సంగ్రామభూమి నెగులున హరితోన్ 

నెగులున...బాధతో
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
29 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

తనువిటు క్రుంగుచునున్నది 
కనుమా! ప్రత్యంగమందు కంపమొదవె,నో 
రును యెండుచునున్న దయో 
జనియించెను గగురుపాటు సర్వుల కనగాన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
30 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 
గాండీవము చేజారుచు 
నుండెను నిలువంగ జాలకుంటిని కృష్ణా!
మండుచునుండెను చర్మము 
నిండగు నా మనసు భ్రమసి నిలువక తిరిగెన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
31 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

అపశకునమ్ములు తోచెను 
చపలత బంధువుల జంప జగతిని నీకే 
యుపయోగమ్మని కృష్ణా!
తపియించుచు నుండె మనము తల్లడపడుచున్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
32 వ శ్లోకం 

న నకాంక్షే విజయం కృష్ణ 
న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద 
కిం భోగైర్జీవితేన వా ||1-32||

ప్రతి పదార్థం:-
కృష్ణ = ఓ కృష్ణా!;విజయమ్= విజయమును;న కాంక్షే =కోరను;రాజ్యం చ =రాజ్యమును;సుఖానిచ =సుఖములను ;న (కాంక్షే) =కోరను;గోవింద =ఓ గోవిందా!;నః =మనకు ;రాజ్యేన= రాజ్యముతో ;కిమ్ =ఏమి (ప్రయోజనము)?;భోగైః =భోగములతో గానీ;వా =లేక;జీవితేన= జీవితముతో గానీ;కిమ్= ఏమి (ప్రయోజనము)?

తాత్పర్యం :-
కృష్ణా! నేను విజయమును గానీ రాజ్యమును గానీ సుఖములను గానీ కోరను.రాజ్యముతో గానీ,భోగములతో గానీ, జీవితముతో గానీ మనకేమి ప్రయోజనము?

అనువాద పద్యం :-
1.కందం
కోరను విజయము కృష్ణా!
కోరను రాజ్యము సుఖమును గోవిందా ! నే
కోరను యీ జీవితమును
కోరిన ఫలమేమి బంధుకోటి నశింపన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
33 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 
ఎవరి కొఱకు రాజ్యము,మా
ధవ!సుఖభోగములుకోరి తగులము చేతన్ 
కవియుచు నుంటిమి వారల 
పవతులుగా నెంచి పోర ప్రాణము కలగున్ 

కవియుచు...పరుగెత్తుతూ 
తగులము.. ఆసక్తి 
పవతులు...శత్రువులు 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
34 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

కనుమిదె తాతల తండ్రుల 
మనుమల సుతులను గురువుల మామల కృష్ణా!
కనుమదె నిలిచిన బంధుల 
ననిలో సర్వము త్యజింప ననుమోదముతోన్ 
అనుమోదము...సమ్మతి 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
35 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

జ్ఞాతులు చంపగ వచ్చిన 
ఖ్యాతిగ త్రైలోక్య రాజ్య గద్దియకైనన్ 
ఘాతుకమున్ చేయననగ 
భూతలమునకై వధింపబోదునె? కృష్ణా!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
36.వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

 ఈ కురువీరుల జంపిన 
శ్రీకృష్ణా! మనకు నెట్టి సేమము కలుగున్?
దీకొను ఖలులే యైనను 
సోకును పాపమ్ము దునుమ సుఖము తొలగెడున్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
37 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

అంధుని సుతులందరు మన
బంధుగులే యగుట చేత పరిమార్చుటచే
కంధియగును దుఃఖము సం
బంధుల భంజించి సుఖము బడయగ జాలన్ 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
38 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ఈ భువికై కురుసంతతి 
లోభముచే మనసునిండ లోలత చేతన్
శోభింపదు కులనాశం 
బీ భావము విడిచిరి గద!యిడుగడ వశులై 

ఇడుగడ..అసూయ,హీనత్వం 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
39 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

తెలియని మూఢులు వారలు 
తెలిసియు పాపము మనమిటు తిమురుట తగవే!
తొలగింపగజేయుద మీ 
కులక్షయపు దోషమింక కూడదు కృష్ణా!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
40 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

కులము నశించినయంతనె 
కులధర్మములన్ని కృష్ణ!గోడువడు గదా!
తొలగిన కులధర్మముతో 
అలము నధర్మంబు జగతి ననివార్యముగాన్

గోడువడు...అణగిపోవు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
41 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

మీరిన యెడల యధర్మము 
నారీమణుల మరియాద నశియించునుగా 
వారల గౌరవముడిగిన 
కారణమున వంశములకు కాడ్పడు కృష్ణా!

కాడ్పడు....నష్టమగును
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
42 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

పతనమ్మగుచో వంశము 
లతిపాతము ఫలితమనగ యమపురి వాసం 
బతనుని జనకా!కలుగును 
పితరుల గతిచెడును లేక పిండోదకముల్ 

అతిపాతము....అతిక్రమము 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
43 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

కులఘాతకులగుచు తమదు 
కులసంకర దోషయుతుల కొఱగాములచే 
కులధర్మము శాశ్వతముగ 
తొలగుట తథ్యంబు కృష్ణ!తుంటరులకిలన్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
44 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

కులధర్మపు భ్రష్టత్వము 
కలిగించిన నరులకు కలకాలము కృష్ణా!
నెలవగు నరక మ్మనియెడు
పలువురు పెద్దల యువాచ పలుమరు వింటిన్
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
45 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

రాజ్యసుఖము కోరి మనము 
పూజ్యుల బంధుల వధింప బూనితి మకటా!
భోజ్యమగునె! గెలిచిననూ 
రాజ్యము యీ పాతకమ్ము రహినీయదహో!
రహి...ఆనందం 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
46 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ఆయుధములు చేదాల్చి,ని
రాయుధుడను నన్ను వారు హతమార్చిననూ 
హాయిగ చచ్చుటె వలతును 
దాయాదుల చంపబోను ధారుణి కొఱకై 
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
47 వ శ్లోకం 
అనువాద పద్యం కందం 

ఈరీతిని పలికి నరుడు 
ధీరత విడనాడి శోకదీనత చేతన్ 
జారవిడిచి విల్లమ్ములు 
తా రథమున కూలబడెను తలకు మనముతోన్ 

తలకు...చలించు,భయపడు

అర్జున విషాదయోగం సంపూర్ణం

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀




Comments

Popular posts from this blog

నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం న ర సం

పంచవటి పదాలు

4/1.*గేయ రామాయణం* ‌ బాలకాండ