గీతా కంద మరందం -2 (సంపూర్ణం)

➖➖➖➖➖➖➖➖
గీతా (కంద) మరందం
➖➖➖➖➖➖➖➖


➖➖➖➖➖➖➖➖
2.సాంఖ్య యోగం 
➖➖➖➖➖➖➖➖
శ్లోకం 1
సంజయ ఉవాచ:-

తం తథా కృపయా 22విష్టమ్
అశ్రుపూర్ణాకులేక్షణమ్
విషీదన్త మిదం వాక్యమ్ 
ఉవాచ మధుసూదనః ||


సంజయ ఉవాచ:-
సంజయుడు చెప్పెను 

టీక:-
తథా=‌అట్లు;
 కృపయా=కనికరముచేత
 ఆవిష్టమ్=కూడుకొనియున్న వాడును
 అశ్రుపూర్ణాకులేక్షణమ్=కన్నీటితో నిండిన వ్యాకులమైన నేత్రములు గలవాడును
 విషీదన్తమ్= దుఃఖించుచున్నవాడును అగు
తం =ఆ అర్జునుని గూర్చి 
మధుసూదనః=శ్రీకృష్ణమూర్తి 
ఇదం వాక్యం=ఈ (చెప్పబోవు) వాక్యమును
 ఉవాచ=పలికెను.

తాత్పర్యం:-
సంజయుడు చెప్పెను.
ఆ ప్రకారంగా కనికరముతో కూడుకొని,కంటనీరు పెట్టుకొంటూ,కలవరపాటుతో దుఃఖిస్తున్న ఆ అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికినాడు.

నా అనువాద పద్యం:-
కం.
ఈ రీతిని కలవరమున
జారెడు కన్నీటి కనుల జాలిని గొనుచున్ 
తేరున దుఃఖించు నరుని 
తీరుని గని మాధవుండు తెలియగ  బలికెన్. (2-1)

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


శ్లోకం - 2
శ్రీ భగవానువాచ:-

కుతస్త్వా కశ్మలమిదం
విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్ట మస్వర్గ్యం
అకీర్తికర మర్జున || (2-2)

టీక:-
అర్జున= ఓ అర్జునా 
అనార్యజుష్టం= పామరులచే నవలంబింపబడదగినదియు
అస్వర్గ్యం =స్వర్గప్రాప్తికి భంగకరమైనదియు 
అకీర్తికరం =అపకీర్తిని కలిగించునదియు అగు 
ఇదం= ఈ
కశ్మలం =మనోవ్యాకులత్వము (మోహము)
విషమే= ఈ విషమసమయమందు 
త్వా= నిన్ను 
కుతః =ఎక్కడినుండి ( లేక ఏ కారణము చేత)
సముపస్థితం =పొందినది?

తాత్పర్యం:-

శ్రీ భగవానుడు చెప్పెను 
ఓ అర్జునా!పామరులు అవలంబించునదియు,స్వర్గ ప్రతిబంధకమును, అపకీర్తిని కలిగించునదియు అగు ఈ మోహము ఈ విషమ సమయమందు నీకెక్కడినుండి దాపురించినది?

అనువాద పద్యం :-
కం.
ఎక్కడిదీ మోహమిటుల ?
చిక్కితివో పార్థ ! రిపుల చెండెడు వేళన్ 
దక్కదు స్వర్గము కీర్తియు 
ప్రక్కకు మరలుట తగదిది పామరు పగిదిన్.(2-2)

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం 3
క్లైబ్యం మాస్మగమః పార్థ
నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరన్తప||

టీక :-

పార్థ =ఓ అర్జునా 
క్లైబ్యం= అధైర్యమును 
మాస్మగమః= పొందకుము 
ఏతత్= ఇది 
త్వయి= నీయందు 
న ఉపపద్యతే= తగదు 
పరన్తపః =శత్రువులను తపింపజేయు ఓ అర్జునా !
క్షుద్రం= నీచమైన 
హృదయ దౌర్బల్యం= మనోదుర్బలత్వమును 
త్యక్త్వా= విడిచి 
ఉత్తిష్ఠ= (యుద్ధమునకు) లెమ్ము 

తాత్పర్యం:-
ఓ అర్జునా! అధైర్యమును పొందకుము.ఇది నీకు తగదు.నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము.

అనువాద పద్యం:-
కం.
పొందకు మధైర్య మది నీ
కందువకున్ తగదు పార్థ!కడు హేయమగున్ 
కొందలమును విడి లెమ్మా!
యందగ విజయమ్ము పట్టు మాయుధ మింకన్. (2-3)

కందువ.. సామర్థ్యం 
కొందలము.. క్షోభ 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం 4.
అర్జున ఉవాచ 

కథం భీష్మమహం సంఖ్యే 
ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి 
పూజార్హావరిసూదన || (2-4)

ప్రతిపదార్థం :-

అర్జున ఉవాచ =అర్జునుడు అడిగెను
అరిసూదన= శత్రువులను నశింపజేయునట్టి 
మధుసూదన= ఓ శ్రీకృష్ణా!
పూజార్హౌ= పూజింపదగినట్టి 
భీష్మం =భీష్ముని 
ద్రోణం చ =ద్రోణుని
సంఖ్యే= యుద్ధమునందు 
అహం= నేను 
ఇషుభిః =బాణములతో 
కథం =ఎట్లు 
ప్రతియోత్స్యామి= ఎదిరించి యుద్ధం చేయగలను?

తాత్పర్యం :-
అర్జునుడు అడిగెను -ఓ కృష్ణా! భీష్మ ద్రోణులిరువురును పూజింపదగినవారు.అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను?

అనువాద పద్యం ;-
కం.
మధుసూదన! గాంగేయుని
విధిగా పూజింపదగిన విద్యాగురులన్ 
వ్యధ చెందక బాణమ్ముల 
వధియింపగ నోపుటెట్లు?బంధుల హితులన్. (2-4)

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం 5

గురూనహత్వా హి మహానుభావాన్ 
శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే
హత్వార్థకామాంస్తు గురూనిహైవ 
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ 

ప్రతిపదార్థం:-
మహానుభావాన్= మహానుభావులైన 
గురూన్= గురువులను 
అహత్వా =చంపక 
ఇహలోకే =ఈ లోకమునందు
భైక్ష్యమపి= భిక్షాన్నమైనను
భోక్తుం= భుజించుటకు 
శ్రేయోహి= మంచిది కదా 
గురూన్ =గురువులను 
హత్వాతు= చంపియో 
ఇహైవ= ఈ లోకముననే 
రుధిరప్రదిగ్ధాన్= రక్తముచే పూయబడిన 
అర్థకామాన్ =సంపదలు,కామ్య వస్తువుల రూపమగు 
భోగాన్ =భోగములను 
భుంజీయ= భుజించువాడ నగుదును .

తాత్పర్యం:-
మహానుభావులైన గురువులను చంపక,ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది.వారిని చంపినచో అత్తఱి వారి రక్తముతో తడిసిన ధనసంపదలనే అనుభవింపవలసియుండును.

అనువాద పద్యం :-

కం.
మహనీయుల గురుల దునిమి 
యిహలోకమునందు భోగ మియ్యకొనుచు నా
నిహతుల నెత్తుటి కూటిని 
సహియింపను బిచ్చమెత్త సైతును కృష్ణా!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం - 6

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః 
యానేవ హత్వా న జిజీవిషామః
తే 2వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః (2-6)

ప్రతిపదార్థం :-

నః= మనకు 
కతరత్ =ఏది 
గరీయః= శ్రేష్టమో 
ఏతత్ చ= దీనిని కూడా 
న విద్మః =ఎఱుగము 
జయేమ యద్వా= (మనము) జయించెదమో ( లేక)
నః =మనలను 
జయేయుః యదివా= (వారే) జయించెదరో
యాన్ =ఎవరిని 
హత్వా =చంపి 
న జిజీవిషామః = జీవింపగోరెదమో 
తే ధార్తరాష్ట్రాః ఏవ =అట్టి ధృతరాష్ట్రుని సంబంధులగు భీష్మాదులే 
ప్రముఖే =ఎదుట 
అవస్థితాః =నిలిచియున్నారు 

తాత్పర్యం :-

పైగా ఈ యుద్ధమున మనము గెల్తుమో లేక వారే గెలుతురో చెప్పలేము.ఈ రెండింటిలో మనకేది శ్రేష్టమో కూడా తెలియదు.ఎవరిని చంపి మనము జీవించగోరెదమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచియున్నారు.

అనువాద పద్యం :-
కం.6

ఎఱుగము జయాపజయముల 
నెఱుగము మనకేది విహిత మీ తరుణములోఁ
నుఱుకుచు నని సేయుటెటుల?
యెఱిగిన సంబంధులాయె నెదిరి బలమునన్.

బలము..సైన్యము

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం - 7

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః 
యచ్ఛ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ 

ప్రతిపదార్థం :-

కార్పణ్యదోషోపహతస్వభావః= కృపణత్వమను దోషముచే కొట్టబడిన స్వభావము గల (నేను )
ధర్మసమ్మూఢచేతాః= ధర్మవిషయమున సందేహముగల మనస్సుగలవాడనై 
త్వాం =నిన్ను 
పృచ్ఛామి =అడుగుచున్నాను 
యత్= ‌ఏది
నిశ్చితం =నిశ్చయింపబడిన 
శ్రేయః =శ్రేయము 
స్యాత్ =అగునో 
తత్ =దానిని 
మే= నాకు 
బ్రూహి =చెప్పుము 
అహమ్ =నేను 
తే =నీకు 
శిష్యః =శిష్యుడను.
త్వాం =నిన్ను 
ప్రపన్నమ్= శరణుబొందిన 
మాం =నన్ను 
శాధి =శాసింపుమ.

తాత్పర్యం :-
(ఓ కృష్ణా!)కృపణత్వము అను దోషముచే కొట్టబడిన వాడనగుటచే ధర్మవిషయమున సందేహము గలిగి మిమ్మడుగుచున్నాను.ఏది నిశ్చయముగ శ్రేయస్కరమో దానిని చెప్పుము.నేను మీకు శిష్యుడను.శరణుపొందిన నన్ను (ఈ ప్రకారముగా నడువుము) అని శాసింపుము.

అనువాద పద్యం :-

కం.-7
ఎయ్యది నాకగు శ్రేయ
మ్మయ్యది నే నెఱుగకునికి యడుగుచునుంటిన్ 
చయ్యన చేకొని శిష్యుగ 
నెయ్యమునను యానతిమ్ము నెగులు తొలగగాన్.

నెగులు..బాధ, దుఃఖ రూపమైన విచారము 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం -8

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణ మిన్ద్రియాణామ్ 
అవాప్య భూమావసపత్న మృద్ధం 
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ 

ప్రతిపదార్ధం :-

భూమౌ =భూమండలమునందు 
అసపత్నం= శత్రువులు లేనట్టిదియు 
ఋద్ధమ్ =సమృద్ధమైనట్టిదియు అగు
రాజ్యమ్ =రాజ్యమును (మఱియు)
సురాణామ్= దేవతల యొక్క 
ఆధిపత్యం చ =ఆధిపత్యమున్ను 
అవాప్య అపి =పొందియు కూడా 
ఇంద్రియాణామ్ =ఇంద్రియములకు 
ఉచ్ఛోషణమ్= మిక్కిలి తాపమును కలుగజేయునట్టి 
మమ= నా యొక్క 
శోకం= దుఃఖమును
యత్ =ఏది 
అపనుద్యాత్= పోగొట్టునో 
(తత్ =దానిని )
నప్రపశ్యామి హి= కనుగొనజాలకున్నాను గదా!

తాత్పర్యం:-
ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును,(స్వర్గమున) దేవతలపై ఆధిపత్యమును పొందియు కూడా, ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ నా దుఃఖమును ఏది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను.

అనువాద పద్యం :-

కం.8
దాయరహిత రాజ్యసుఖము 
దేయపు సురలోక పదవి దీనశరణ్యా!
హాయినొసగ లేవనునటు
పాయని నా దుఃఖమునకు వారణ మెఱుగన్

*దేయము ..ఇయ్యదగినది
*వారణము..అడ్డుకట్ట 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం - 9
సంజయ ఉవాచ:-
ఏవముక్త్వా హృషీకేశం 
గుడాకేశః పరన్తపః 
న యోత్స్య ఇతి గోవిందమ్ 
ఉక్త్వా తూష్ణీం బభూవ హ


ప్రతిపదార్థం :-

సంజయ ఉవాచ =సంజయుడు చెప్పెను 
పరన్తపః= శత్రువులను తపింపజేయునట్టి 
గుడాకేశః =అర్జునుడు 
హృషీకేశమ్= శ్రీకృష్ణునితో 
ఏవం= ఈ ప్రకారముగా 
ఉక్త్వా =చెప్పి 
నయోత్స్యే= యుద్ధము చేయను 
ఇతి =అని 
గోవిన్దమ్= ఆ కృష్ణపరమాత్మ తో 
ఉక్త్వా =పలికి 
తూష్ణీం బభూవ హ =ఊరకుండెను

తాత్పర్యం:-
సంజయుడు చెప్పెను.ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయను అని ఊరకుండెను.

అనువాద పద్యం :-

కం.9

ఈవిధి యా పార్థుడపుడు 
గోవిందుని తోడ పలికి కుమిలెడు మదితో 
దేవా!ఆలము సేయను 
నావల గాదంచు నిలిచె నైరాశ్యమునన్ 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం 10.

తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత 
సేనయోరుభయోర్మధ్యే
విషీదన్తమిదం వచః 

ప్రతిపదార్థం ;-

భారత= ఓ ధృతరాష్ట్ర మహారాజా 
ఉభయోః సేనయోః =రెండు సేనల యొక్క 
మధ్యే =నడుమ 
విషీదన్తమ్= దుఃఖించుచున్న 
తం =ఆ అర్జునుని గూర్చి
హృషీకేశమ్ =శ్రీకృష్ణుడు 
ప్రహసన్నివ= నవ్వుచున్నవానివలె 
ఇదం వచః =ఈ (చెప్పబోవు) వాక్యమును
ఉవాచ= పలికెను .

తాత్పర్యం :-
ఓ ధృతరాష్ట్ర మహారాజా! రెండు సేనల మధ్య విలపించుచున్న ఆ అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్నవానివలె ఈ క్రింది వాక్యములను పలికెను.

అనువాద పద్యం :-

కం.10.

పరిపరి ఈరీతి పలికి 
మరిమరి దుఃఖించు నరుని మాధవదేవుం
డరవాయిని మాన్పదలచి 
చిరునవ్వున నాంబికేయ! చెప్పమొదలిడెన్.

*అరవాయి...సంకోచం,అధైర్యం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం 11

శ్రీ భగవానువాచ:-

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః||2-11||

ప్రతిపదార్థం :-
శ్రీ భగవానువాచ=భగవానుడు చెప్పెను 
త్వమ్ =నీవు;అశోచ్యాన్= శోకింపదగని వారిని గూర్చి ;అన్వశోచః =శోకించితివి;ప్రజ్ఞావాదామ్ చ= బుద్ధివాదముతో గూడిన మాటలను గూడ ;భాషసే =పలుకు చున్నావు ;పండితాః =ఆత్మ జ్ఞానము కలవారు;గతాసూన్ =మరణించిన వారి గురించియు ;
;అగతాసూన్ =బ్రతికి ఉన్న వారిని గురించియు;
;న అనుశోచంతి = దుఃఖింపరు.

తాత్పర్యం :-
(అర్జునా!) నీవు శోకింప దగనివారిని గూర్చి శోకించితివి. పైగా బుద్ధి వాదముతో గూడిన వాక్యములను గూడ పలుకు చున్నావు. జ్ఞానులగువారు మరణించినవారిని గురించి గానీ జీవించియున్న వారిని గురించి గానీ యెన్నటికినీ దుఃఖింపరు.

అనువాద పద్యం :-

కందం-11
శోకించెదు ప్రజ్ఞ లిటుల 
శోకింపగ దగనివారి జూచి పలుకుచున్ 
లోకమునన్ ప్రాజ్ఞులెపుడు 
శోకింపరు జననమరణ సొరిదిని గనుచున్ (2-11)

సొరిది...వరుస,క్రమము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం - 12

న త్వేవాహం జాతు నాసం 
న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః 
సర్వే వయమతః పరమ్ 

ప్రతిపదార్థం :-

అహమ్ =నేను 
జాతు =ఒకప్పుడును 
నాసం (ఇతి)= ‌లేననునది
నతుఏవ= లేనేలేదు 
త్వమ్= నీవు 
(న ఆసీః ఇతి) న= లేవనునది లేదు 
ఇమే =ఈ 
జనాధిపాః =రాజులు 
(న ఆసన్ ఇతి) న= లేరనునది లేదు 
అతః పరమ్ =ఇకమీదట
వయంసర్వే= మనముమందఱమును
న భవిష్యామః ( ఇతి) చ= లేకపోవుదు మనునదియు
న ఏవ =లేదు 

తాత్పర్యం :-

అర్జునా!నేను గానీ,నీవు గానీ,ఈ రాజులు గానీ  ఒకప్పుడును లేనివారముకాదు.ముందున్ను లేకపోవువారము కాము.

అనువాద పద్యం :-
కం.12.

నీవును నేనును పార్థా!
రావడి గనలేని శత్రురాజ నివహముల్ 
చావునెఱుంగము పూర్వము
భావిని లేకుండపోము భద్రాత్ములమై

*రావడి..ఉపద్రవం,ఆపద, ముప్పు 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సాంఖ్య యోగం 

 శ్లో|| 13

దేహినోऽస్మిన్ యథా దేహే 
కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిః
ధీర‌ స్తత్ర న ముహ్యతి ||2-13||

ప్రతిపదార్థం:-

దేహినః = జీవునకు;అస్మిన్ దేహే= ఈ శరీరమునందు;కౌమారమ్= బాల్యము;యౌవనమ్= యౌవనము ;జరా = వార్ధక్యము ;యథా =ఎట్లో ;తథా =అట్లే ;దేహాన్తర ప్రాప్తిః= మరియొక దేహమును పొందుటయు (కలుగుచున్నది);తత్ర =ఈ విషయమున ;ధీరః =జ్ఞాని ;న ముహ్యతి = మోహమునొందడు .

తాత్పర్యం:- 

జీవునకు ఈ దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము అను అవస్థలు ఎట్లు కలుగుచున్నవో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే తటస్థించుచున్నది. కనుక ఈ విషయమున ధీరులు ఎంతమాత్రమును మోహము నొందరు.

అనువాద పద్యం :-
కం.13
వాహిత బాల్యము ప్రాయము
దేహి యనుభవించి జరయు దేహము విడువన్ 
దేహాంతరమిక కలుగును 
మోహములో దీనికొరకు మునుగరు ధీరుల్ (2-13)

వాహితం...వహింపబడినది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం - 20

న జాయతే మ్రియతే వా కదాచిత్ 
నాయం భూత్వా భవితా వా న భూయః 
అజో నిత్యశ్శాశ్వతో2యం పురాణో 
న హన్యతే హన్యమానే శరీరే 

ప్రతిపదార్ధం :-
అయమ్ =ఈ ఆత్మ 
కదాచిత్ =ఎప్పుడును
న జాయతే= పుట్టుటలేదు 
నమ్రియతేవా= చచ్చుటయులేదు 
న భూత్వా= ఇదివఱకు లేకుండి 
భూయః =మరల 
భవితావాన =క్రొత్తగా కలుగువాడును కాదు
 (లేక )
(భూత్వా =ఉండి 
భూయః =మరల 
నభవితాన= లేకుండువాడు కాదు)
అయమ్ =ఇతడు 
అజః =పుట్టుక లేనివాడు 
నిత్యః =మరణము లేనివాడు 
శాశ్వతః =ఎల్లప్పుడునుండువాడు 
పురాణః =అనాదియైనవాడు 
శరీరే హన్యమానే (సతి) =శరీరము చంపబడినను 
న హన్యతే =చంపబడుటలేదు

తాత్పర్యం :-
ఈ ఆత్మ ఎప్పుడును పుట్టుట లేదు.ఇదివరకు లేకుండి మరలా క్రొత్తగా కలుగువాడు కాదు.ఈతడు జననమరణాలు లేనివాడు.శాశ్వతుడు.పురాతనుడు.శరీరము చంపబడినను ఈతడు చంపబడుట లేదు.

అనువాద పద్యం :-

కం.-20.
జననము లేనిది,పూర్వము 
కొనలిడ లేనిదియు కాదు, క్రొత్తగ మరలా 
జనియించని దాత్మ పురా 
తనమై చిరమై నిలుచును తనువు తరలినన్.

కొనలిడుట వర్ధిల్లుట 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లోకం - 21

వేదావినాశినం నిత్యం 
య ఏనమజమవ్యయమ్ 
కథం స పురుషః పార్థ 
కం ఘాతయతి హన్తి కమ్ 

ప్రతిపదార్థం :-
పార్థ= ఓ అర్జునా 
యః =ఎవడు 
ఏనమ్ =ఈ ఆత్మ ను 
అజమ్= పుట్టుక లేనివానిగను 
అవ్యయమ్= క్షయము లేనివానిగను 
అవినాశినమ్= నాశరహితునిగను
నిత్యమ్= నిత్యునిగను 
వేద= తెలిసికొనుచున్నాడో 
సః పురుషః =ఆ మనుజుడు 
కథం =ఎట్లు 
కమ్ =ఎవనిని 
ఘాతయతి =చంపించును?
కమ్ =ఎవనిని 
హన్తి =చంపును?

తాత్పర్యం :-
ఓ అర్జునా!ఈ ఆత్మను ఎవడు జనన మరణాలు లేనివానిగను,నాశరహితునిగను,నిత్యునిగను ఎఱుంగునో, అట్టివాడు ఎట్లు ఒకనిని చంపించగలడు? తాను చంపగలడు?

అనువాద పద్యం :-

కం.21

లేనిది పుట్టువు మరణము 
కానిది గద!నాశ మాత్మ,కలుగును నిత్యం 
బీ నిజ మెరిగిన మనుజుడు 
తానెటు చంపించు?చంపు?తలపుము పార్థా!

*తలపుము..తలపోయుము, ఆలోచన చేయుము.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ