పంచవటి పదాలు
1.(సా)మాన్యుడవని
నువ్వు శిలవై
కోవెలలో కొలువై ఉంటే
నిన్ను మేమంతా
భగవంతుడవని గుర్తించేవాళ్ళం
భక్తితో చేతులు మోడ్చేవాళ్ళం
అనుగ్రహిస్తావని ఆశపడి
గుర్తుంచుకుని మరీ మొక్కుబడులు
చెల్లించేవాళ్ళం
శపిస్తావని భయపడి
పవిత్రంగా ఉండటానికి
ప్రయత్నించేవాళ్ళం
కానీ
నువ్వేమో
మామూలు మనిషిలా మామధ్యన తిరిగేస్తున్నావు
అందుకనే నీవు
అందుబాటులో ఉన్న
అనంతమైన నిధివన్న
నిజం
నమ్మశక్యం కాకుండా ఉంది
ఆత్మజ్ఞానమనే నిప్పును
అతి సామాన్యుడవని నమ్మించే నివురుతో కప్పి
నటించే నిన్ను
గుర్తించలేని,
గుర్తించినా
మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోయే
మాకోసం
నువ్వు
అవ్యాజమైన అనుగ్రహ వర్షాన్ని
కురిపించే మేఘమై
కరుణిస్తూనే ఉన్నావు
మా అజ్ఞానాన్ని
అతి వినయాన్ని
అవిధేయతను
పదే పదే
క్షమిస్తూనే ఉన్నావు
అందుకు నీ దర్శనమే
మాకు నిదర్శనం.🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
2.3.2026
సోమవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋
ఓం శ్రీ
*****
గురుభ్యోన్నమః
***************
గుండె గుడిగ చేసి కొలువు తీర్చగలేను
నమ్మి మీదు బాట నడువలేను
తలచుకొందు మిమ్ము తనివార సతతమ్ము
భాగ్యమిదియె యంచు భక్తి మీర.
2019 జూలై 16
🦋🦋🦋🦋🦋🦋🦋
నమస్తే గురువు గారూ!
మీరు చెప్పిన
మైండ్ కి ఉన్న 4 ఛానెల్స్ ఇంతేనా గురువుగారూ!
తే.గీ.
*మనసు* చేయు మాయ గెలువ మనుజు తరమె?
*బుద్ధి* చేయు హెచ్చరికలు పోవు మదికి
*చిత్త* మందు నిలచియుండు చేతలెల్ల
*అహము* పట్టియాడించెడు నహరహమ్ము
సింహాద్రి జ్యోతిర్మయి
2024 జూలై 2024
🦋🦋🦋🦋🦋🦋🦋🦋
గురువుగారికి నమస్సులు.
నేడు భాద్రపద శుద్ధ చతుర్దశి పూజ్యురాలైన తమ తల్లిగారి జయంతి సందర్భంగా ఆ మాతృమూర్తి ని మనసులో స్మరించుకుంటూ సమర్పిస్తున్న పద్య పుష్ప నీరాజనం.
*కం.*
మొత్తము జీవిత మంతయు
చిత్త మశాంతిని కలంగి చిక్కులు వడినన్
సత్తువ తనయుని దిద్దియు
నుత్తమ గురు నిడిన తల్లి యోర్పుకు జేజే.🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
(పంచవటి శిష్యురాలు)
17.9.2024
మంగళవార🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*సత్య (సం) భాషణం*
వాత్సల్య పూరితమైన
వారి పలకరింపు
మా నాన్నగారు ఇంకా నాతోనే ఉన్నారనే సంతోషాన్నిస్తుంది
ఆప్యాయతతో నిండిన వారి ఆదరణ
నా బాగోగులు
చూసుకోవడానికి
మూడవ అన్నదమ్ముడిని
ఆ స్వామి
అచ్చంగా నా కోసమే
పంపించాడనిపిస్తుంది
సరదాగా నవ్వుతూ
వారు మాట్లాడుతున్నంత సేపూ
బాల్యమిత్రుడు మళ్ళీ
స్నేహ పరిమళాలు
పంచడానికి
వచ్చేశాడనిపిస్తుంది
ప్రాణాలే పోతాయనుకున్న
నా కష్టాన్ని
కనుచూపుమేరలో
కనపడకుండా
తరిమేసినప్పుడు
మనసారా నమ్మడం తప్ప
ఏ సాధనలు చేశానని
ఇంతటి అభిమానం చూపిస్తున్నారు అనిపిస్తుంది
తెలిసీ తెలియక చేసే
ప్రతి తప్పునీ చక్కదిద్దాలనే బాధ్యతను తనపై వేసుకునే
అవ్యాజమైన ఆ శిష్యవాత్సల్యాన్ని చూసి
ఎప్పటికైనా పరీక్ష
పాసై
గురువుని మెప్పించగలనా
అని దిగులువేస్తుంటుంది
ప్రేమంతా కళ్ళతోనే
కుమ్మరిస్తూ
సమ్మోహనమైన చిరునవ్వుతో నావైపు చూస్తూ
నాతో మాట్లాడుతున్నప్పుడు
సాక్షాత్తూ ఆ తిరుమల శ్రీనివాసుడే
నన్ను అనుగ్రహించడానికి
నా కోసం
నా ఇంటికి వచ్చేశాడు
అని అనిపించి
మనసు ఆనందంతో గంతులువేస్తుంది
ఇది మౌన భాషణం
మనసులో భాషణం
ఇదంతా *సత్య*మే
సింహాద్రి జ్యోతిర్మయి
23.10.2024
బుధవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
కం.
చేయగ సంధ్యావందన
మాయువు నారోగ్య భాగ్య మమరును, విధిగా
గాయత్రీ మంత్రముతో
పాయక పాటించు వాని వర్ఛసు గనరే!🙏🙏🙏
2024 నవంబర్ 20
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*పంచవటికి ఏడాది ఉత్సవం*
సీసం+ఆటవెలది
*పం* డుగ యీనాడె వచ్చె పంచవటికి
*చ* ప్పున గడచిన దప్పుడె యొక
*వ* త్సర మిటు గురువర్యులు తమ వాక్ప
*టి* మను సాధకుల లోపములను
*కి* నియక సరిదిద్ద యనవరతము, జారి
*యే* మర తగదింక నీమములను
*డా* బును చూపకుండగ నమ్మకముతోడ
*ది* నదినమ్ము నడచుకొనుటె చాలు
*ఉ* ల్లమునకు వచ్చు నుత్సాహమనగ ను
*త్స* వము చేయ నిటకు సంతసమున
*వ* చ్చి చేరుకొన్న వారిదే భాగ్యము
*ము* రిసి పోదమింక మూడునాళ్ళు
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
22.11.2024
శుక్రవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
ఆశ్రమ ఆవరణలో వివిధ పనులలో నిమగ్నమైన వారిని చూసి రాసిన పద్యం
సీసం+ఆటవెలది
త్రోవలోనున్నట్టి లావు రాళ్ళను యేరి
...తీరుగ బాటను తీర్చువారు
పెరిగిన గడ్డిని పెకలించి వేయుచూ
...చెట్లకు పాదులు చేయువారు
పారిశుధ్యము కూడ పరమాత్ము సేవంచు
...కడు శ్రద్ధ చూపుచు కడుగువారు
ఆకలి నెరుగుచు నాదరమొప్పగా
..కొసరి వడ్డించుచూ మసలువారు
మాటలోన పొదుపు మనసు మీద అదుపు
సమయపాలనమ్ము సత్య వాక్కు
నిత్య జీవితమున నిజమైన సాధన
నేర్పు పంచవటియె నేర్పు మీర
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
22.11.2024
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*ఆశ్రమం తో నా అనుబంధం*
పంచవటి యోగాశ్రమం-
అమ్మ కడుపులో రూపుదిద్దుకున్న శిశువు ప్రాణం పోసుకుని మాతృగర్భం చీల్చుకుని ఈ భూమి మీదకు వచ్చి ఊపిరి పీల్చుకున్నట్లుగా,
మన గురువుగారి మదిలో రూపుదిద్దుకుని,వారి సదాశయం సాకారమై ఈ పంచవటి ఆశ్రమం ఏడాది క్రితం ప్రాణప్రతిష్ట చేసుకుంది.
కాళీమాత అనుగ్రహం, శ్రీరామకృష్ణుల ఆశీర్వచనం,శారదామాత చల్లని చూపు వెనుబలమై ఉండగా ప్రారంభమైన ఈ ఆశ్రమం అతి నిరాడంబరంగా,అత్యున్నత లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
జన్మించిన శిశువు మొదటి ఏడాదిలోనే ఎన్నో కొత్త విద్యలు నేర్చుకుని కన్నవారికి ఆశ్చర్యానందాలు కలుగజేస్తూ ఎదిగినట్లుగా మా ఆశ్రమం కూడా ఏడాదిలోనే మాకు ఎంతో నేర్పింది.
సాధ్యమయ్యేదే సాధన,
మాటే మంత్రము
దృష్టిని బట్టే సృష్టి వంటి మహనీయుల వాక్కులే ఆదర్శంగా గురువుగారు శిష్యులకు అత్యంత వాత్సల్యంతో నిత్యజీవిత సాధనా మార్గాలను సులువైన విధానంలో బోధిస్తారు.
మూడు నెలల కొకసారి మూడు రోజులపాటు జరిగే రిట్రీట్ లలో సరళమ్మ ఆదరణ ఒక చల్లని ఊరట అందరికీ.అందరినీ పేరుపేరునా పలకరిస్తూ కన్నతల్లిలా అందరి యోగక్షేమాలు విచారిస్తూ ఎంతో ప్రేమను కురిపిస్తుంది.మూర్తి,సంధ్యలు పంచవటి సభ్యులందరికీ అన్నావదినలే.అఖిల,లలిత పంచవటికి ప్రియమైన చెల్లెళ్ళు.
ఇక్కడ ఎవ్వరిలోనూ భేదభావాలు లేవు.ఎక్కువతక్కువలూ లేవు.
పేరుపేరునా అందరి గురించి చెప్పలేను గానీ మా పంచవటి ఒక ఉన్నత విలువలు గల ఉమ్మడి కుటుంబమే.
అరవై దాటిన వారికే ఆధ్యాత్మికత అనే ఒక అపప్రధను తొలగిస్తూ ఇక్కడ ఎక్కువ శాతం నలభై ఏళ్ళ వయసు లోపు వారే కావటం మరొక ప్రత్యేకత.
.ఆ పిల్లల వినయవిధేయతలు,శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుంది.
గురువు గారు బోధించే అంశాలైన
అష్టపాశాలను సడలించుకునే ప్రయత్నం చిత్తశుద్ధితో ఎలా చేయాలో, ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా సాధించాలో,మనశ్శరీరప్రాణశక్తులను
అనుసంధానం చేసుకుంటూ ఆ ముక్కాలి పీటపై స్థిరంగా ఎలా కూర్చోవాలో,నేటి ఉరుకుల పరుగుల జీవితం యాంత్రికమైపోతున్నవేళ
నిత్యజీవిత సాధనతో
ఎలా ముందుకు సాగాలో,నిజమైన ప్రార్థన అంటే ఏమిటో ,ఎలా చేయాలో అన్నీ ఇక్కడ అనుభవైకవేద్యమే గానీ ఉత్తమాటలు కావు.
ఇక శరీరం రోగగ్రస్తం కాకుండా మితంగా హితమైన ఆహారాన్ని స్వీకరించడం,
యోగా తో ఆరోగ్యాన్ని సాధించటం,హోమియోపతితో అనారోగ్యాన్ని జయించటం ఎలాగో నేర్పిస్తారు.
గురువుగారికి అద్భుతాలు చేయటం మీద ఆసక్తిలేదు.
తన శిష్యుల జీవితాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దటంపైనే ఆయన ఆసక్తి అంతా.ఆయన ఆలోచన,ఆచరణ, ఆహార్యం అన్నీ ఆదర్శప్రాయమే.
ఆయన ఒక తోటమాలిలా మారి తన శిష్యులనే పూల మొక్కలను శ్రద్ధగా తీర్చిదిద్ది పరిమళ భరితమైన సంస్కార పుష్పాలను సమాజానికి, దైవానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు.మరి ఏ తోటమాలి,భక్తుడు కూడా గుడ్డిపూలను దైవపూజకు సమర్పించరు కదా!
అందుకే విడిచిన చెప్పులు ఒక క్రమంలో పెట్టుకోవడం దగ్గరనుంచి ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా పరిశీలించి,నేర్చుకోవటం అలవాటు చేస్తుంటారు.
మాకు గురువంటే అందని మ్రానిపండు కాదు.ఆయన మాకందరికీ కరతలామలకం.
ఎన్నో వందల ప్రసంగాలు చేసినా, ప్రస్తుతం
రాస్తున్న వాటితో కలిపి దాదాపుగా వంద పుస్తకాల దాకా వ్రాసినా, ఉపనిషత్తుల సారమంతా ఔపోసన పట్టినా ఇతర ఆధ్యాత్మిక గురువుల్లా అందనంత ఎత్తులో ఉండక , అందరికీ అందుబాటులో ఉంటారు.అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తారు.ఇదొక పరిమిత సభ్యులతో కూడిన మంచి కుటుంబం.
ఆ కుటుంబం లోకి అక్కయ్య అంటూ ఎంతో ప్రేమతో నన్ను చేర్చుకున్న గురువుగారికి
పాదాభివందనాలు.🙏🙏🙏
*రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె* అన్న వేమన వచనంలా
ఇంత చక్కని మార్గంలో నేను నడిచే అవకాశం కల్పించిన నా పెద్ద తమ్ముడు చిరంజీవి సింహాద్రి శ్రీరామమూర్తి కి నా శుభాశీస్సులు.🙌🙌🙌
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
24.11.2024
ఆదివారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*పంచవటి* కుటుంబానికి ప్రశస్తమైన
*కల్పతరు* తిథి శుభాకాంక్షలతో
*ఆ.వె.*
*క* రుణ వెల్లివిరియ పరమహంసయె యన
*ల్ప* ము నమోఘ మద్భుతమగు రీతి
*త* నదు దివ్య శక్తి ధారవోసిన నాడె
*రు* చిర *పర్వదినము* రచితమయ్యె
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
27.12.2024
శుక్రవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
[10/02/2025, 5:46 am] Simhadri Jyothirmai: *పంచవటికి పచ్చదనపు కళ*
సీ.
చుక్క చుక్కగ నీరు మొక్క మొక్కకు అంద
...బిందు సేద్యము చేయు విధములోన
పచ్చదనము తోడ పంచవటిని నింప
...అమ్మ చల్లనిచేత
ఆరంభ మొనరించి
గర్వమన్నది లేక గౌరవించి పనిని
...ఇష్టపూర్వకముగ కష్టపడుచు
రేబవలు శ్రమించి రెండువేలకు మించి
... యూకలిప్టసు సర్వి యోగ్యముగను
తే.గీ.
నాటిన తమ శిష్యులజూచి నగవులొలికి
గురువుగారును సరళమ్మ మురిసిపోయి
చేయి గలిపి
తామును పని చేసినారు
కర్మ యోగమే మిన్నయౌ ధార్మికులకు
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
9.2.2025
ఆదివారం
[10/02/2025, 2:27 pm] Simhadri Jyothirmai:
🦋🦋🦋🦋🦋🦋🦋
కందం
*నాటిరి మొక్కల నెంతయు*
దీటై తామొకరికొకరు తీరుగ శ్రద్ధన్
పాటించుచు నియమావళి
మేటిగ బృందావనమిట మేలుగ దీర్చన్.
🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*గురుపూర్ణిమ శుభదినం*
*సీసం*
*గు* లకరాళ్ళను తెచ్చి గుండెలో చోటిచ్చి
*రు* క్మమ్ముగా మార్చు రూఢి మీది
*ని* దురించు చేతముల్ నిత్యము మేల్కొల్ప
*పా* టుపడుచునున్న ప్రజ్ఞ మీది
*దా* రులు వెలుగుకు దయతోడ వేసియు
*ల* లితోడ నడిపెడు లావు మీది
*కి* నియక మాలోని కిల్బిషమెల్లను
*దే* శికా!తొలగించు దీక్ష మీది
*ఆటవెలది*
*మా* దు జన్మ తరియు మార్గము జూపుచు
*వం* త దీర్చుచున్న పరమపూజ్య!
*ద* క్కె భాగ్యమనుచు తలచి చేతుము మీకు
*నం* దిత మదితోడ వందనమ్ము.
భావం:-
గులకరాళ్ళవంటి మాకు మీ మనసులో ఒక స్థానం కల్పించి మేలిమి బంగారంగా మారుస్తున్న ప్రసిద్ధి మీది.
అలసత్వంతో నిదురిస్తున్న మా మనసుల్ని మీ ఉద్బోధలతో మేల్కొలపటం కోసం నిత్యమూ ప్రయత్నం చేస్తున్న సామర్థ్యం మీది.
వెలుగుదారులతో దయజూపి ఉత్సాహమిచ్చి నడుపుతున్న సమర్ధత మీది.
ఎంత చెప్పినా గ్రహించటం లేదని కోపగించుకోకుండా ఓ గురువర్యా!మాలోని పాపరాశిని పెంచే అష్టమహాపాశాలను తొలగించే ప్రయత్నం చేసే దీక్ష మీది.
మాజన్మ తరించే మార్గాన్ని చూపి మా దుంఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న ఓ పరమపూజ్యా! మాకు దక్కిన మీ శిష్యత్వమనే భాగ్యానికి సంతోషిస్తున్న హృదయాలతో మీకు నమస్కారాలు చేస్తున్నాం.
పంచవటి శిష్యులందరి తరపునా ఈ గురుపౌర్ణమి నాడు గురువుగారికి భక్తితో సమర్పిస్తున్న పద్యపుష్పం🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
10.7.2025
గురువారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
శ్రీరామకృష్ణుల జయంతి సందర్భంగా
కం.
ఫాల్గుణ శుక్లపు విదియన్
వెల్గెగదా! *పరమహంస* విభుడై భువిలో
వెల్గుల పర్వదినమగుచు
కల్గెనదే *పంచవటి* కి కడు పావనమై
🙏🙏🙏
*శ్రీ రామకృష్ణాయ తే నమః*
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు
అన్నాడు శ్రీ శ్రీ
పంచవటి కుటీరానికి
గురువు రాళ్ళనెత్తె చూడు
అందాం మనం
తాజమహల్
ప్రపంచవింతల్లో ఒకటి కావచ్చు
కానీ అది
ఒక *సమాధి* మాత్రమే
అయితే
మన ఆశ్రమం
ఇతర ఆధ్యాత్మిక (లోపించిన) ఆశ్రమాలతో
పోల్చుకుంటే
మన ఆశ్రమం
ఇంత సామాన్యంగా ఉండటం కూడా లోకానికి వింతే
కానీ ఇది
నిత్యజీవిత సాధనా మార్గంతో
ధ్యానంలో *సమాధి* స్థితిని
అందుకోగలిగే
స్థాయిని శిష్యులకు అందించగలిగే సామర్థ్యం కలిగిన *సత్య* స్వరూపులైన
సద్గురువుల చల్లని నీడ🙏🙏🙏
జనవరి 29 2026
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొనబోతున్న పంచవటి శిష్యబృందానికి శుభాకాంక్షలతో
తే.గీ.
పుస్తక మహోత్సవమ్మును పూని జరుప
విజయవాడ కేగుచునున్న సుజన శిష్య
గణముకెల్ల శుభముగల్గ, ఘనతరమగు
గ్రంథముల విందొనర్పుడీ ప్రజల కెల్ల
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
2.1.2026
శుక్రవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*పంచవటి* సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
*తే.గీ.*
*జ* న్మ తరియింప గురువర్యు చరణమంటి
*న* మతులర్పించి పొందిన నయములు నవ
*వ* త్సరమున *సరళ* తను బ్రతుకు సాగ
*రి* ష్టమొసగుగాత! మనకు రిష్టి బాపి
*నయములు..లాభములు*
*రిష్టము...క్షేమము*
*రిష్టి.... అశుభము*
సింహాద్రి జ్యోతిర్మయి
31.12.2025
బుధవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*ఒంగోలు పుస్తక మహోత్సవం*
1.ఆ.వె.
గురుని మస్తకమున గూఢమై యున్నట్టి
జ్ఞానరాశి యంత ధ్యానమందు
వెల్లువవగ వెడలె విలువైన పొత్తముల్
వాని ఘనత తెలియు వారలెవరు?
2.తే.గీ.
నమ్మజాలనీ ఒంగోలు నగరమందు
పుస్తక మహోత్సవములోన పూని యొకరు
ఉపనిషత్తుల సారమే యున్న నెదుట
కనులజూచి మర్మమెఱిగి కొనగరారు
3.కం.
దండిగ సభలను పాల్గొని
పండితులము మే మనుచును ప్రాగల్భ్యమునన్
గుండెల గర్వము
నిండగ
పండితపుత్రుల పగిదిని వర్తింతురయో!
4.తే.గీ
ఇలను భగవంతుడే వచ్చి యెదుట నిలువ
యెందరాతని గుర్తింతు రెఱుక గలిగి?
సత్య మెఱుగని వారిపై జాలిగొనుచు
మాదు ప్రాప్తికి మురుతుము మదిని మేము.
సింహాద్రి జ్యోతిర్మయి
20.8.2025
బుధవారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
ఓం శ్రీ గురుభ్యోనమః
(పోయిన ఏడాది
గురుపూజోత్సవ శుభదినాన నా మనసు పాడిన పాట)
ఈ భువిపై వెలసిన దైవరూపమై
అజ్ఞానము నణచే దివ్య దీపమై
ఈ గురువే శిష్యుల నాదరించెనే
మీ యోచనే జ్ఞానతరగలై
మీ మాటలే వెలుగుదారులై
ఆధ్యాత్మిక జగతిని కాంతులీనెనే
ఉపనిషత్తులకు సరళభాష్యములు
వ్రాసినారు గద మీరే
గుహ్యమైన శ్రీవిద్య పద్యముల
చెప్పినారు గద మీరే
బుద్ధదేవుని ధర్మపదమును
చూపినారు గద మీరే
అద్భుతమ్ము శ్రీలలిత నామముల
రహస్యార్థముల దీప్తి
ఆశ్చర్యమౌ గదా పంచవటిని
మీ ఉపన్యాసముల స్ఫూర్తి
త్రికరణమ్ముల శుద్ధిసాధనే
శుశ్రూషలో గలుగు ప్రాప్తి
పరమహంసనే పరమభక్తితో
అనుసరించు గురువర్యా!
అఖిలమెరిగినా అణగిఉండెడి
మాననీయ మహనీయ
మిమ్ము తెలియ నేనెంత దానను
పాట ప్రణతి గొను మయ్యా!
🙏🙏🙏
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
కం.
సరళమ్మయె నడిపింపగ
శరణ్య మారుతి యఖిలయు సంధ్యావిజయల్
మరియును స్నేహయు నొక్కట
విరివిగ చేసిరి పనులను విస్మయమవగాన్
కం.
ఓరిమి గని గురువు మురియ
నారీశక్తికి ఋజువన నాటిరి మొక్కల్
వారికి సరిసాటి గలరె!
తీరిచి మన ప్రాంగణమును దిద్దిరి శోభన్.
2025 జూన్ 15
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*చెట్టుకి చేటు*
నా కన్నీరు
నీకు కనపడకపోవచ్చు
నా రోదన
నీకు వినపడకపోవచ్చు
నా గ్రీష్మతాపం
నీకు అర్థం కాకపోవచ్చు
కానీ ఒక్కసారి
మనసుపెట్టి తదేకంగా
నన్నుచూడు
నువ్వు సృష్టిస్తున్న
కాలుష్యం కారణంగానే
నువ్వు విస్తరింపజేస్తున్న
విషం కారణంగానే
చైత్రానికి చిగురించవలసిన నేను
ఇలా పండి,ఎండి,
ముడుచుకుని
ఆకురాల్చుకుని
అలమటిస్తున్నాను
నోరుతెరిచి
గుక్కెడు నీళ్ళు పోయమని
అడగలేకపోవడమే
నా అపరాధమా!
నోరులేని
సాటిప్రాణినన్న
సానుభూతి చూపలేవా!
నువ్వు సాకుతున్న
నీ ఇంటి చంటి బిడ్డలో
నన్ను చూడు
నేనెందుకు కృశించి పోతున్నానో గమనించు
నాకేం కావాలో
నీకే అర్థమవుతుంది
నీ సేవను నేనేం మరచిపోను
నీ ఋణం నేనేమీ ఉంచుకోను
దోసెడు పువ్వులిచ్చి
గంపెడు కాయలిచ్చి
నా జీవితాంతం నీకు
కృతజ్ఞతలు
చెల్లిస్తూనే ఉంటాను
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.3.2025.
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*తరులతలారా! తప్పు సైరించండి*
భూమిలోకి
వేళ్ళుగా విస్తరించి
భూగర్భ జలాలు కాపాడతారు
కాలుష్యాన్ని కడుగుతూ
ఆకాశపు ఓజోను పొరను
ఛిద్రం కానీకుండా
ఆపుతుంటారు
నిప్పులు చెరిగే ఎండలకు
నీడపట్టులవుతారు
మీరు వదిలిన ఊపిరిని
ప్రాణవాయువుగా ప్రసరించి
మమ్మల్ని బ్రతికిస్తారు
పంచభూతాలను మాకు అనుకూలం చేసి
ఫలించి ఆహారమై
పుష్పించి ఆహ్లాదమై
ఎండిపోయి ఆశ్రయమై
పచ్చదనమంటే
త్యాగమని ఋజువుచేస్తూ
ఏపుగా
ఎదుగుతున్న
మిమ్మల్ని
ఒక్క క్షణపు
ఏమరపాటుతో
నిమిషాలలో
నిలువెల్లా
ఎండింపజూసిన
మా అపరాధాన్ని మన్నించండి
మా కన్నీటి ధారలతో
ఈ విషాన్ని కడిగే ప్రయత్నం చేస్తున్నాము
కనికరించి
మరలా చిగురించండి
మళ్ళీ వికసించండి
మా అపరాధభావాన్ని
మీ నవనవలతో తొలగించండి
మనసారా మన్నించండి
మనసారా మన్నించండి
క్షమస్వ త్వం
క్షమస్వ త్వం 🙏🙏
😔😔
సింహాద్రి జ్యోతిర్మయి
2025 మార్చి 25
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*రామకృష్ణ పరమహంస జయంతి*
సీ.
*రా* జిల్లు కాళికా తేజమ్ము కన్నార
*మ* హనీయుడై గాంచె మనసు దీర
*కృ* పను శిష్యులనెల్ల కెలవున బ్రోచె తృ
*ష్ణ* రహితుడై కల్ప తరువు గాను
*ప* రమార్థ మెఱుగంగ ప్రతి మత సాధన
*ర* హితోడ సాగించి రట్టు దెలిసి
*మ* ణి వివేకానందు మనకిచ్చి వసుధలో
*హం* సకీర్తిని భరతాంబ కొసగి
తే.గీ
*స* న్నగిల్లిన హైందవ సంస్కృతికిని
*జ* వము జీవముల తిరిగి సంతరించి
*యం* త్రణము జేసిన పరమహంస!మిమ్ము
*తి* రముగా నమ్మి మ్రొక్కులు తెలుపుకొనెద.🙏🙏🙏
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
1.3.2025
శనివారం
కెలవు..ప్రేమ
రహి..ఆనందం
యంత్రణము..రక్షణ
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*మాటే మంత్రం*
ఔను అది మా తమ్ముడు శ్రీరామమూర్తి
మాట
అదే నాకు మంత్రం
మా తమ్ముడితో ఈ 56 ఏళ్ళ అపురూపమైన ప్రయాణం
అదే నా మనసుకు బంధం
ఒకప్పుడు వాడి మాట
చాలా కరుకు
చాలా పదును
అయినా
అది తప్పులను ఎత్తి చూపి
మనసుకు నొప్పి కలిగించినా
అహం అడ్డుతగిలి
నేను
అంగీకరించలేకపోయినా
చాలాసార్లు
నాకు ఆచరణకు సాధ్యం కాకపోయినా
వాడి మాటలను
నా వివేకం మాత్రం
లోలోన అంగీకరిస్తూనే ఉండేది
దానికి కారణం
ఆ బంధం నా మేలు కోరేది
నన్ను సరిదిద్దేది
ఉన్నతికి నడిపించేది
తల్లిదండ్రుల బాధ్యతను
తనపై వేసుకున్నది కావడమే
వాడి మాటలో
ఉన్నతమైన భావాలు ఉంటాయి
కాదనలేని సత్యాలుంటాయి
గ్రహింపుకు తెచ్చుకోవలసిన ఆంతర్యాలు ఉంటాయి
ఆ మాటలలో
మహనీయుల వాక్కుల
అంతరార్థాన్ని
అందిపుచ్చుకోగల
సామర్ధ్యం ఉంది
తను తెలుసుకున్న తత్వాన్ని నలుగురికీ
తెలియజెప్పే
చాతుర్యం
ఉంది
ఎంత లోతైన భావాలనైనా
తేలిక మాటలలో
అందరికీ అర్థమయ్యేలా
చెప్పగల నేర్పు ఉంది
ముఖ్యంగా
గురువు అనుగ్రహాన్ని
పదిమందికీ పంచాలనే తాపత్రయం ఉంది
ఆ గురువు సాక్షాత్తూ
భగవంతుడే అనే సత్యాన్ని
గ్రహించిన
సాధికారత ఉంది
అందుకే వాడి *మాటే మంత్రం* అని నాకనిపిస్తుంది
తన భాగ్యంలో
కొంత భాగాన్ని
నాకు అందించే ప్రయత్నం
నిత్యమూ చేసే నా తమ్ముడు
నిండు నూరేళ్ళు
*సత్య* మార్గంలో పథికుడై సాగాలని
జీవన *సంధ్య* పర్యంతమూ
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని
మనసారా దీవిస్తూ
57 వ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ
ప్రేమతో
*అక్క*
28.2.2025
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
పుట్టినరోజు శుభాశీస్సులు అఖిలా!
తే.గీ.
*అఖిల* మాశ్రమ జీవనమనుచు తలచి
సకలము గురువనుచు నమ్మి సాధనమున
నెరపి నిష్కామ కర్మయే నిత్యవిధిగ
అలరు నీకిదె నా శుభాశీస్సు లఖిల!🙌🙌
2025 ఫిబ్రవరి 19
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*సత్య* జ్ఞానదీపాలు*
అక్కడొక పుస్తకాల తోట
విరిసిందనే వార్త
పూల సౌరభంలా
గుప్పుమంది
మనసు ఆనందంగా
అటువైపు పరుగులు తీసింది
పాదాలు
అడుగులు వేసి అనుసరించాయి
బొమ్మల కొలువులో బొమ్మల్లా
వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ
తలలెత్తుకుని ఠీవిగా
కొలువుదీరి ఉన్నాయి గ్రంథాల తరువులు
ఆ వనవాటిలో
కల్పవృక్షాల సుగంధాలను ఆఘ్రూణిస్తూ
విషవృక్షాల దుర్గంధాలను దాటుకుంటూ
చేరుకున్నాను
ఆధ్యాత్మ తరుశోభలు
వెదజల్లుతున్న
పంచవటిని
మానవాళిని రక్షించటానికి
మహావిష్ణువు దాల్చిన
అనేక అవతారాలలాగా
గురువుగారి మేధోమథనంలో
తొణికిన
అమృతబిందువులై
అలరారుతూ
అవగతం కాని వేదాంత రహస్యాలను
అరటిపండు ఒలిచి
అందించినట్లుగా
సిద్ధం చేసిన
ఆ *పంచవటి* లో
*ఉపనిషత్తుల* మూలాలు విస్తరించాయి
*మహనీయుల జాతకాలు*
ధృడమైన కాండమై
పాదుకున్నాయి
*జ్యోతిష్య* శాస్త్ర శాఖలు అలముకున్నాయి
*శ్రీవిద్యా రహస్యాలు* పుష్పించాయి
*లలితా సహస్రనామ రహస్యార్థ
ప్రదీపిక* లు పరీమళించాయి
*మధుశాల* లు పూతేనియలు స్రవించాయి
మారాకు వేసిన
*మరికొన్ని రెమ్మలు*
తొంగిచూసి
పలకరించాయి
శ్రీరాముని సందర్శనం
అహల్య పాపాన్ని
హరించివేసినట్లు
గురువుగారి
అక్షరాకృతుల
అవలోకనం చేతనే
అజ్ఞానపు చీకట్లు
అంతరిస్తుండగా
అనిర్వచనీయమైన
ఆనంద పారవశ్యాన్ని
అనుభవిస్తూ
కొద్దిసేపు ఆ మహనీయ గ్రంథరాజాల
చల్లని నీడలో సేదదీరి
పరవశించి
నిత్యజీవిత సాధనలో
నిజమైన ఆంతర్యాన్ని
ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తూ
ఇక
శేషజీవితాన్నయినా
సఫలం చేసుకువాలనే
నిశ్చయంతో
*వెలుగు దారులు*
చూపుతున్న ఆ బాటలో
*ధర్మపదం* వైపుగా
దారితీసాను.
సింహాద్రి జ్యోతిర్మయి
పంచవటి శిష్యురాలు
4.1.2025
శనివారం
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
విజయవాడ బుక్ ఫెస్టివల్ కి ఒకరోజు వెళ్ళి రావాలి అనే సంకల్పం కలిగించిన అనుభూతి ఇది.😊🙏
నమస్తే గురువు గారూ!
నేను తమ్ముడు వాళ్ళింట్లో పేరేచర్లలో ఉన్నాను.నిన్న
రాత్రి పడుకోబోయే ముందు హాల్లో నాన్నగారి ఫోటో వైపు ఒక్క నిమిషం తదేకంగా చూశాను.
నేను నాన్నగారు ఎలా ఉంటారో మర్చిపోయానా అని నాలో నేను ఒక్క క్షణం అనుకున్నాను.ఒక్కసారిగా నాన్నగారి మీద ప్రేమలాగా,బెంగలాగా అనిపించింది.
అలాగే పడుకునే ముందు నాన్నగారు ఇక్కడే మంచం మీద పడుకునేవారు కదా అనుకున్నాను.
తెల్లవారుజామున కల వచ్చింది.
అందులో నాన్నగారు కనపడ్డారు.
నమ్మలేనట్లు సంతోషపడిపోయి చేతులు చాచాను.
నాన్నగారు సంతోషంగా దగ్గరగా వచ్చి నన్ను కౌగిలించుకున్నారు.
ఆ టచ్ ని నేను ఈరోజంతా ఫీలవుతూనే ఉన్నాను.
మూర్తికి చెబితే అమావాస్య ఎఫెక్ట్ లె అక్కా అన్నాడు.
ఇదివరకు ఎప్పుడైనా నాన్నగారు కలలో కనపడ్డా ఇలా ఎప్పుడూ ఫీలవలేదు.
నా పర్సనల్ ఫీలింగ్ గ్రూపులో అడగచ్చో లేదో అని ఇందాక అడగలేదు.
మీరు ప్రస్తుతం పుస్తకాలతో బిజీగా ఉన్నట్లున్నారు.
మీకు వీలైనప్పుడు దీని అంతరార్థం గురించి చెప్పండి గురువుగారూ!
నేను మాత్రం ఆనందంగా ఉన్నాను
నమస్తే గురువు గారూ!🙏🙏🙏
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
Comments
Post a Comment