4/3.*గేయ రామాయణం.* అరణ్య కాండ


గేయ రామాయణం
అరణ్య కాండ (172 చరణాలు)

1.
అరణ్యకాండలో రాముని
అవతార పరమార్థమే ఉన్నది
అవనిపై క్రూర రాక్షసుల పీడ
ఇటుపైన అంతమ్ము కానున్నది 260

2.
సీతయు లక్ష్మణుడు వెంటసాగ
రాముడు దండకావని చేరెను
తపోధనులతో నిండి యలరు
ఋష్యాశ్రమాలనే అట చూచెను 261

3.
దండకారణ్యమ్ము చేరుకున్న
రామునకు ఆతిథ్యమిచ్చి మునులు
క్రూరులౌ రాక్షసుల బారినుండి
తమనింక రక్షింపమని ‌ వేడిరి 262

4.
మునివరుల కభయమ్ము నిచ్చి పిదప
దాశరథి అడవి మధ్యకు చేరెను
అక్కడొక భీకరాకారుడైన
రక్కసుడు అడ్డమై ఇటు పలికెను 263

5.
నరులార! నేను విరాధుండను 
బ్రహ్మ చే వరములే పొందినాను
నేనెట్టి ఆయుధాలకును చావను
అని పలికి పట్టుకొనె సీతమ్మను 264.

సశేషం 
సింహాద్రి జ్యోతిర్మయి

14.5.2018

గేయ రామాయణం
అరణ్య కాండ

6.
భయముతో విహ్వలించిన సీతను
విడిపించ రామలక్ష్మణులిద్దరూ
వేగమే తమ వాడి బాణాలను
వాడిపై గుప్పించి నొప్పించిరి 265

7.
గాయపడి ఆగ్రహించిన అసురుడు
సీతను నేలపై దించివేసి
తన రెండు భుజములా వారినెత్తి
 ఆడవిలో అటునిటు పరుగుదీసె 266

8.
శ్రీ రామ లక్ష్మణులు ఇర్వురంత
తమలోన తామపుడు కూడబలికి
అసురుని భుజములను రెండింటిని
ఒడుపుతో ఒకసారె తెగనరికిరి 267

9.
వేటుతిని నేలకొరిగిన అసురుడు
తనయొక్క శాపకథ వివరించుతూ
గతజన్మ యందున గంధర్వుడౌ
తుంబురుడు తానంటు తెలిపినాడు 268

10.
నా కాయ మిట మీరు పూడ్చివేసి
చేరండి శరభంగ ముని ఆశ్రమం
శుభములగు మీకనుచు దీవెనొసగి
దివ్యమౌ లోకాల కెగసెనతడు. 269.

సశేషం
 సింహాద్రి జ్యోతిర్మయి
15.5.2018.

గేయ రామాయణం
అరణ్య కాండ

11.
విరాధుని కాయమ్ము పూడ్చివేసి
శరభంగ ముని ఆశ్రమమ్ము  చేర
నీవు నా ప్రియమైన‌ అతిథివంటూ
రామునకు ఆతిథ్య మిచ్చె తపసి

12.
అటనుండి సుతీక్ష్ణ ముని ఆశ్రమం
చేరుమని రామునకు ఆనతిచ్చి
ప్రాయోపవేశాన శరభంగుడు
ఆ‌ క్షణమె బ్రహ్మ లోకము చేరెను 

13.
ఆ మౌని తపః ఫలమంతయు
ఆ క్షణమె రాముణ్ణి ఆవరింప
అగ్నివలె తేజస్సుతో వెలిగిన
రాముని శరణనిరి మౌనులంత. 

14.
ముని ఆజ్ఞ మేర ఆ శ్రీ రాముడు
చేరుకొని సుతీక్ష్ణ ముని ఆశ్రమం
దివ్యమౌ  దీవెనలు పొంది తాను
మరల మిము దర్శింతునని మరలెను. 

15.
మున్యాశ్రమాలన్ని దర్శించుతూ
మునివరుల ఆశీస్సులందుకొనుచు
కష్టమే తెలియకనె పదియేడులు
సుఖముగా గడిపిరా సచ్చరితులు. 

సశేషం
 సింహాద్రి జ్యోతిర్మయి
16.5.2018

గేయ రామాయణం
అరణ్య కాండ

16.

సుతీక్ష్ణుని ఆశ్రమము మరలజేరి
కొన్నినాళ్ళచటనే నివసించిరి
ఆపైన మౌని సమ్మతి చేకొని
అగస్త్యుని సేవించ పయనమైరి 

17.
 తొలుత ఆ మువ్వురూ వెళ్ళి తాము
అగస్త్యుని భ్రాతనే దర్శించిరి
ఆ వెనుక అటనుండి బయలుదేరి
అగస్త్యుని ఆశ్రమానికి సాగిరి 

18.
మార్గమున ‌శ్రీరామచంద్రమూర్తి
మహితమౌ అగస్త్యుని పుణ్యకథలు
తలపగా అద్భుతమ్మనిపించగా
వైదేహి సౌమిత్రులకు వినిచెను 

19.
వినుడితడు వాతాపి సోదరులను
పరిమార్చి మునులనే బ్రోచినాడు
పెరిగేటి వింధ్యాద్రి గర్వమ్మును 
అణచి‌ ఈ లోకాల గాచినాడు 

20.
ఈ మౌని ఆశ్రమము పావనమ్ము
 సిద్ధించ గలదిచట అమరత్వము
ఘనుడితడు లోకాల కారాధ్యుడు
అని తెలిపె నతనికథ శ్రీ రాముడు.

సింహాద్రి జ్యోతిర్మయి
17.5.2018.

గేయ రామాయణం
 అరణ్య కాండ

21.
అగస్త్యుని ఆశ్రమము చేరగానే
మునివరుడె ఎదురొచ్చి స్వాగతించె
అర్ఘ్యపాద్యమ్ము లొసగి మౌనీంద్రుడు
రాముణ్ణి ప్రియమార‌ అర్చించెను 

22.
రామ!నీ సుగుణాలు ఎరిగినాను
నే నీదు రాకకై వేచినాను
చెదరని నీ ధర్మ దీక్షగాంచి
శ్రీ రామ! సంప్రీతి చెందినాను 

23.
ఇది దివ్యమైనట్టి విష్ణు ధనుసు
ఇది సూర్యసంకాశ బ్రహ్మాస్త్రము
అక్షయతూణీరమ్ములివి నాయనా!
అమోఘమౌ ఖడ్గమిది తెలియుమా! 

24.
ఈ సకల దివ్యాయుధాలు నేను
ఈనాడె నీకు కానుక చేతును
శిష్టులను రక్షించు కార్యమింక
నిర్విఘ్నమగునంచు దీవింతును 

25.
రఘువరా! ఇవి నీవు స్వీకరించు
ఇక‌ సకల విజయాలు నిను వరించు
రాక్షసుల నెల్లరను సంహరించి
ఉజ్వలపు కీర్తినే‌ నువ్వు వరించు 284.

సింహాద్రి జ్యోతిర్మయి
18.5.2018

గేయ రామాయణం
 అరణ్య కాండ

26.
ఆ వరాలకు  రాముడే సంతసించి
మౌనికి కి మొక్కులిడి వినయమ్ముతో
తమకింక ఆవాసయోగ్యమేదో
దయతోటి సెలవీయమని కోరెను 285.

27.
చేరుకో గోదావరీ తీరము
ఆచోట పంచవటి బహు 
సుందరం
అది నిత్యపుష్పితమ్మౌ కాననం
నిర్మలానందాల శుభనందనం 286

28.
అని తెలిపి మౌనివరుడవ్వారిని
ఇక పోయిరండనుచు వీడుకొలిపె
సాగేటి త్రోవలో వారికపుడు
జటాయువను పక్షి తోడు కలిసె 287

29.
నేను నీ తండ్రికి స్నేహితుడను
బలశాలి సంపాతి సోదరుడను
అడవిలో చేదోడునై ఉందును
సీతను వెన్నంటి రక్షింతును 

30.
అనుచు జటాయువే వెంట సాగ
పంచవటి చేరుకొనె శ్రీరాముడు
అక్కడొక అందమౌ పర్ణశాల
నేర్పుతో నిర్మించె లక్ష్మణుండు 

సశేషం 
సింహాద్రి జ్యోతిర్మయి

19.5.2018.

గేయ రామాయణం 
అరణ్య కాండ

31.
తమ్ముని నేర్పునకు శ్రీ రాముడు
ముగ్ధుడై ప్రేమతో లాలించెను
భక్తితో సుమిత్రా నందనుండు
వారినట కొలువుంచి సేవించెను 

32.
రాముని చల్లనౌ మనసువోలె
ఆ వనిని రుతువులన్నీ శీతలం
సీతమ్మ తనువులో సొగసువోలె
ఆ వనిని ప్రతి అణువు బహు సుందరం 

33.
నియమాల‌ ముని వృత్తితో జీవనం
నిత్యమూ మునులతో సహవాసము
పుణ్యమౌ కథలతో తమ మానసం
అలరగా చేసిరట వనవాసము

 

34.
పంచవటిలో నుండ రామాదులు
రాకాసి శూర్పణఖ ఒక్కనాడు
శ్రీరామ లక్ష్మణుల నట చూచెను
దాశరథి సొగసు‌గని మోహించెను 

35
రాముని సముఖమ్ము చేరుకొనెను
 లంకేశు సోదరిని తాననియెను
నీపైన మనసాయెనని తెలిపెను
నను వలచి మురిపించమని అడిగెను

36
నీ సతిని తమ్ముని తినివేతును
ఆపైన నిను జేరి సుఖియింతును
అనుచున్న రక్కసిని పరిహసించి
చతురోక్తులాడెను రాముడిట్లు

37
నాకాంత ఉండగా నాకు తోడు
సుందరీ!నీకేల సవతి పోరు?
నా తమ్ముడీతడు ఒంటివాడు
నీకతడు కాగలడు తగినజోడు

38
ఆ మాట లాలించి వల్లెయనుచు
సుందరాకారుడౌ సౌమిత్రిని
చేరుకొన అతడా రాకాసి తో
ఈ రీతి పలికెను చిరునవ్వుతో

39
రమణి!నే దాసుడను నా అన్నకు
సేవకుని నేను మావదినమ్మకు
నన్ను చేపట్టుచో సుఖముండదు
దాస్యమే మిగులును నీకు తుదకు

40
 మా అన్ననే నీవు చేపట్టిన
నే నీకు  మరిదినై సేవించనా!
కనుకనే కోరు మా అన్న పొందు
వదినవై నావలన సేవలందు

41
ఈ రీతి‌ గడువగా కొంత తడవు
గ్రహియించి శూర్పణఖ ఎగతాళిని
అవమాన భారమ్ము సైపలేక
సీతపై ఈసుతో రగిలిపోయె

42
వారిరువురూ తనను పరిహాసము
చేయుటకు సీతయే కారణమ్ము
అని తలచి శూర్పణఖలో కోపము
అధికమే  అవ్వగా క్షణక్షణమ్ము


43
ఈ సీత నిప్పుడే మ్రింగివేతు
శ్రీరామ లక్ష్మణుల అంతుజూతు
 అనితలచి వైదేహి పై కురికెను
సీతమ్మ చిగురాకులా వణికెను

44
అదిగని శ్రీరామ చంద్రుడంత
తక్షణమె
రాక్షసికి ముకుచెవులను 
కోయుమదె శిక్షయౌ ఆమెకనుచు తమ్మునకు ఆజ్ఞ నే ఒసగినాడు

45
శిరసావహించగా అన్న ఆజ్ఞ
సీతమ్మ పైకురుకు శూర్పణఖను
  సిగపట్టి సౌమిత్రి ఉగ్రుడగుచు
రాకాసి ముకుచెవులు కోసేసెను 

46.
వికృతమ్మయినట్టి పడతి రూపు
మరికాస్త భీకరమ్మయిపోవగా
భయశోకభావాలు ముప్పిగొనగా
నెత్తుటి ధారయే మడుగవ్వగా

47
భీతిల్లి పోయిన ఆ రాక్షసి
రోదిస్తు అటనుండి పరుగుదీసె
తన ‌సోదరుండైన ఖరుని జేరి
 కథ చెప్పి పగదీర్ప మనుచుకోరె 

47
 చెల్లెలి దురవస్థ చూడగానే
ఖరుడంత కోపాన మండిపడెను
రాముని వెంటనే చంపమనుచు
సేనాధిపతులనే పంపించెను. 297.

48
 వారొక్క పదునాల్గుమంది వచ్చి
ఏకమై రాముణ్ణి ఎదిరించిరి
దాశరథి శస్త్రాస్త్ర జ్వాలలందు
వారెల్ల మరుక్షణమె మరణించిరి. 298

50
ఆ వార్త తెలుసుకుని ఖరుడు తానే
తన సర్వసేనాని  దూషణుణ్ణి
పదునాల్గు వేలుగా సైన్యాలను
కూర్చుకొని‌ రాముపై దండెత్తెను. 299.

సింహాద్రి జ్యోతిర్మయి
21.5.2018.

గేయ‌ రామాయణం 
అరణ్య కాండ

51
భీకరపు సమరమే సాగువేళ
తొలుతగా దూషణుడు నేలకూలె
రాముని సరిలేని శౌర్యమ్మున
ఖరు సర్వసైన్యాలు నేలరాలె 300

52
అసురులౌ త్రిశిరాది వీరులంతా
అపమృత్యులోకాలు చేరినారు
అనిలోన ఖరుడు ఐంద్రాస్త్రమ్ముతో
పిడికెడు బూడిదగ మారినాడు 301

53
ఈ విధిని దండకారణ్యానికి
దనుజుల పీడలే నశియించెను
తమకింక కష్టములు తీరెననుచు
ముని లోకమంతయు తనివొందెను 302

54
సురలోక దుందుభులు మారు మోగె
దివినుండి విరివాన భువిని కురిసె
ఈతడే సాక్షాత్తు విష్ణువంటూ
ఏడేడు లోకాలు వినుతి జేసె 303

55
సమరాన హతశేషుడైన వాడు
ఏకాకి దనుజుడౌ‌ అకంపనుండు
సత్వరమె రావణుని దరికిజేరి
జరిగిన కథయెల్ల వివరించెను 304.

56.
జనస్థానమందున్న నీ వారిని
నిశ్శేషమొనరించె శ్రీరాముడు
ప్రియమైన నీ చెల్లి శూర్పణఖను
సౌమిత్రి అవమాన పరచినాడు

57
దాశరథి గర్వమ్ము నణచవలెను
సీతయూ దుఃఖార్తి పొందవలెను
తగు ప్రతీకారమ్ము చేయవలెను
ఓ ప్రభూ! రావణా! యోచించుము

58
అని పలికి తన ఎదుట నిలిచియున్న
అనుచరుడు అకంపనుడు వివరించిన
వేలాది యోధులటు సంగరాన
ఒక నరుని చేతిలో మరణించిన

59
వార్తవిని మండిపడి దశకంఠుడు
నిర్జింతు రామునని గర్జించెను
అతనిని వారించి అకంపనుండు
సీతనే హరియించి తెమ్మనియెను 

60
సరియంటు రావణుడు బయలుదేరి
 వెంటనే జనస్థానమునకు చేరి
మైథిలిని అపహరించుట కోసమై
మారీచు ‌సాయమే అర్థించెను 

61
అది విని అదిరిపడి మారీచుడు
అసాధ్య మీకార్యమని పలికెను
చేటగును వలదంచు వారించుతూ
లంకేశు యత్నమ్ము మరలించెను 


62
మరలివచ్చిన యట్టి తన అన్నను
శూర్పణఖ సభలోన తూలనాడె
జానకిని  చేపట్టకున్న యెడల
రావణుని శౌర్యమిక వ్యర్థమనియె

63
అపురూప మా సీత సౌందర్యము
వైదేహి అరుదైన స్త్రీ రత్నము
నీవంటి వీరునకు తగిన జోడు
నీ వెళ్ళి కనులార తనని చూడు

64
నీకొరకు ఆమెనిట తెచ్చేందుకే
నే వెళ్ళి పొందితిని అవమానము 
శ్రీరామ లక్ష్మణుల మోసపుచ్చి
ఆమెను తెచ్చుటే తగిన శాస్తి 


65
ఆ మాటలాలించి దశకంఠుడు
మోహాన ప్రలోభమును పొందెను
 లోకాలనన్నిటిని గెలువనేమి?
మనసునే గెలువనే లేడాయెను. 

66
మూఢుడై ఒక కాంత మాట నమ్మి
వేరొక్క కాంతకై ఆశపడెను
పరదార నాశింపగూడ దదియే
పాపమను చింతనే విడనాడెను 



67
సత్వరమె మరల మారీచు చేరి
అతనికి వినిపించె తన మనసును
ధరియించి బంగారు లేడి రూపం
దరిజేరి వంచింపమనె సీతను 

68
మరియొక్కసారి ఆ మారీచుడు
అతనికి హితమునిటు బోధించెను
లంకేశ! రాముడే కోపించెనా
ఈ అవని అరాక్షసమ్మయిపోవును 

69
నిలువెత్తు ధర్మమే శ్రీరాముడు
సరిలేని వీరుడు సత్పురుషుడు
అతనికి అనురూప సతి జానకి
ఆ సాధ్వి ప్రాణమ్ము దాశరథికి 

70
 ఇరుమారు‌ ఎదిరించి నే రాముని
చవిజూచి నానతని కోపాగ్నిని
తప్పుకొని ప్రాణాలు కాచుకొంటి
మునివృత్తితో నేడు బ్రతుకుచుంటి. 





71
పోలేదు నా మదిని రామభయము
రకారాది పదములను విన్న చాలు
రాముడను భయముతో వణికిపోదు
లంకేశ!ఆలించు నాదు హితవు 

72
ప్రియవాక్యమది యెంతొ ప్రీతితోడ
పలుకు వారుందురు కోకొల్లలు
అప్రియమ్మయిననూ హితవచనము
వినుటకు పలుకుటకు నోపరెవరు 

73
అని పలుకు మారీచు హితవచనము
రావణుని మనసింత మార్చలేదు
నుదిటిపై లిఖితమౌ విధి రాతలు
తప్పింప తలపోయ తరముకాదు 

74
చేయునది లేక ఇక మారీచుడు
రావణుని ఆజ్ఞకే తలను వంచె
బంగారు లేడిగా రూపమెత్తె
మాయతో సీతమ్మ మనసు గెలిచె 

75
బెదురుగా చూచుచు గంతులేయు
ఆ పసిడి మృగమును తన వాకిట
అచ్చెరువుపడి సీత తిలకించెను
తన పతికి చూపించి ఇటు పలికెను

76
కంటివా ఓ నాథ!ఈ లేడిని
దోచెనిది ఈనాడు నా మనసుని
అరుదైన వింతయౌ ఈ ప్రాణిని
మచ్చికే చేయగా మనసైనది 

77
సీతమ్మ మనసుపడి ఆశించెను
లక్ష్మణుడు శంకించి వారించెను
ప్రియపత్ని మక్కువను చెల్లించుటే
తగవని దాశరథి భావించెను 

78
ఇది మాయ అయితేను ఛేదింతును
మారీచుడైనచో వధియింతును
ఈ మృగము నెటులైన సాధింతును
ఇల్లాలి ముచ్చటే చెల్లింతును 

79
అని పలికి వెంటనే‌ శ్రీరాముడు
మైథిలికి రక్షగా తమ్మునుంచి
క్షణములో నే తిరిగి వత్తునంచు
ఆ మాయలేడినే వెంబడించె 





80.
అది కనుల కొకసారి కనిపించును
అంతలో కనుగప్పి మాయమగును
రాముని కవ్వించి విసిగించెను
మృత్యువుతొ దోబూచులాడుకొనెను 


81
మాయ యని గుర్తించి శ్రీరాముడు
మంత్రించి బ్రహ్మాస్త్రమును విడిచెను
మాయను వదిలేసి మారీచుడు
రాముని స్వరముతో తానరచెను 

82
హా జానకీ! మరియు హా లక్ష్మణా!
అని‌యరచి‌ మాయావి నేలకొరిగె
పతి‌ ఆర్తనాదాలు విన్నంతనే
భయముతో సీతమ్మ గుండె‌చెదిరె 

83.
వింటివా !నా స్వామి కంఠమ్మది
ఆపదే వాటిల్లినట్లున్నది
లక్ష్మణా! నా మనసు నిలవకుంది
సాయమే వెళ్ళమని సీత అంది 

84.
ఇవి యెల్ల‌ రాక్షసుల మాయలమ్మా!
రామునకు ఏ కీడు కలగదమ్మా!
అన్నయ్య ఆజ్ఞ నే మీరనమ్మా!
నిను వీడి నేనెటకు వెళ్ళనమ్మా! 

85
,నా అన్న సాటిలేని వీరుడు
భీరువై సాయమ్ము నర్థించడు
 అపజయమ్మన్నదే అతడెరుగడు
ఓ తల్లి! యుద్ధాన భంగపడడు 


86
సౌమిత్రి మాటలను విన్న‌సీత
కోపాన లక్ష్మణుని నిందజేసె
 కర్మానుసారమౌ బుద్ధియన్న
నానుడిని సీతమ్మ ఋజువు జేసె 

87
తననెపుడు తల్లివలె మన్నించెడి
తనమరిది హృదయమ్ము నెరిగియుండి
తన భర్త కేమయినదో తెలియని
తొందరలో లక్ష్మణుని తూలనాడె 

88
 నీ అన్నపై  ప్రేమ నిజమైనచో
వెంటనే సాయమై సాగివెళ్ళు
చెడు తలపులే మదిని లేకున్నచో
తక్షణమె తన కొరకు తరలివెళ్ళు 

89
రాముడే‌ నా చెంత లేనినాడు
నేనింక క్షణమైన జీవించను
మదిలోన రాముణ్ణి తప్ప నేను
అన్యమౌ పురుషులను ఆశించను 

90
అత్యంత కఠినమౌ‌ ఆ నిందలు
లక్ష్మణుని హృదయాన్ని గాయపరిచె
బాధతో వికలమౌ మనసుతోడ
సీతనట ఒంటరిగ విడిచి‌వెళ్ళె 

సశేషం

సింహాద్రి జ్యోతిర్మయి
28.5.2018

గేయ రామాయణం
 అరణ్య కాండ

91.
అట్టి తరుణమ్ముకోసమే వేచియున్న
రావణుడు తాపసి వేషమ్ముతో
శ్రీరాము నాశ్రమము చేరుకొనెను
అచ్చట సొగసరి సీత గనెను 

92
రావణుని కనినంతనే భీతితో 
ఆ వనిని గాలియే స్తంభించెను
గలగలా పారేటి గోదావరి
గమనాన సవ్వడే కరువయ్యెను 

93
రావణుడు వైదేహి వంక జూచి
తరుణి నీవెవ్వరని ప్రశ్నించెను
 సన్యాసి యతడంచు తలపోసిన
సీతమ్మ వినయాన బదులొసగెను 

94
తనదు వృత్తాంతమంత చెప్పి
ఆతిథ్యమిచ్చెద నిలువుమనెను
నీ గోత్రనామాలు నాకు తెలిపి
వచ్చిన పనియేమి పలుకమనెను 

95
సీతరో! రాక్షసాధిపుడ నేను
అపరంజి !నేనేను రావణుడను
కాంచనపు లంకాధినాథుండను
నాదు ప్రియ సామ్రాజ్ఞి చేతునిన్ను 


96
రావణుని పలుకులను విన్నంతనే
సీత ఉలికిపడి నిప్పులొలికె
సూర్య ప్రభ వంటి నన్ను నీవు
తాకనే లేవనుచు ధిక్కరించె 

97
ఆ మాట లెక్కచేయని‌ అసురుడు
నిజరూపు ధరియించి నిల్చినాడు
తన దివ్య రథములో సీతనుంచి
ఆకాశ మార్గాని కెగసినాడు 

98
దీనమౌ సీత రోదనల తోటి
దండకావని యంత మారుమోగె
తన గతిని రామునకు తెలపమంటూ
ఆ తల్లి అడవికే‌ అంజలించె 

99
సీతమ్మ చేయు దీనాలాపము
చెవినబడి జటాయు వడ్డుపడెను
ఇదె నేను జీవించి ఉన్నవరకు
సీతను గొనిపోవ లేవనియెను 

100
ధైర్యాన ఎదిరించి దశకంఠుని
తన శక్తికొలదిగా పోరాడెను
కడకు కాళ్ళుతెగి పక్షిరాజు
నెత్తుటి ముద్దయై నేలబడెను 

101
అదిగాంచి ఆశ లుడిగిన జానకి
వలవలా ఏడుస్తు విహ్వలించె
తనను విడువమని కఠినాత్ముని
పరిపరి విధముల ప్రాంజలించె 

102
నే రామచంద్రుని ఇల్లాలిని
దైత్యుని చేబడిన దీనురాల్ని
కనులార కాంచి నా దురవస్థని
ఎవరైన నా పతికి తెలుపండని 

103
ఈ విధిని పరితపించే సీతను
పరికించి ప్రకృతే విలపించెను
దశకంఠు మరణమిక తప్పదంటూ
ఈ సకల భువనాలు తలపోసెను 

104
దివ్యదృష్టితో తిలకించిన
విధాత మదిలోన ముదమునందె
సీతమ్మ దుర్గతికి తపియించినా
మునిగణము లోక హితమే యెంచెను 

105
రావణా!ఒంటరిగ ఉన్న నన్ను
ఈ రీతి అపహరించుట శౌర్యమే
రామునకు అప్రియము ఆచరించి
నీవింక జీవించుటది సాధ్యమే! 

106
అని సీత ఎన్ని విధముల వేడినా
రావణుని మది సుంత మారలేదు
వైదేహి ఎంతగా బెదిరించినా
మూఢుని చెవికేమి చేరలేదు 

107
కడకు చేయునది ఏమిలేక
జానకి ధైర్యమ్ము చిక్కబట్టి
మార్గాంతరమ్మునే యోచించెను
దూరాన వానరుల గుంపు గనెను 

108
వెంటనే బంగారు పైట చెరగు
చింపి తన నగలన్ని మూటగట్టి
నా జాడ నా పతికి ఎటులైననూ
తెలియునను ఆశతో జారవిడిచె 

109
వినువీధి విలపించు వైదేహిని
వానరులు రెప్పవేయక చూసిరి
ఆకాశ సంచారులు సముద్రుడు
ఆమె దురవస్థ గని క్షోభపడిరి 353

110
తన మృత్యుదేవతను చేజేతులా
రావణుడు లంకకే గొనిపోయెను
అచట అంతఃపురములో ఆమెనుంచి
రాకాసి మూకకిటు ఆజ్ఞ లిడెను 354

సశేషం 
సింహాద్రి జ్యోతిర్మయి
1.6.2018

గేయ రామాయణం
 అరణ్య కాండ

111
స్త్రీపురుషులెవరైన ఈ సీతను
కన్నెత్తి చూచుటకు వీలులేదు 
ఈమెను పల్లెత్తు మాట అంటే 
ఇక వారి ప్రాణాలు నిలవబోవు 

112
ఈ సీత ఏమడిగినా తక్షణం
ఇవ్వమని వారలకు ఆజ్ఞ లొసగె
అందమౌ దివ్య భవనమ్మునొకటి
సీతకు విడిదిగా బహుకరించె 

113
జానకీ!శత యోజనాల తోటి
కోమలీ !ఈ లంక వింత గొలుపు
మదిలోన రాముణ్ణి మరచిపోయి
 నీవింక నావంక వలపు నిలుపు 

114
రావణుని దుర్భాషలాలకించి
సీతమ్మ అవహేళనమ్ము చేసి
ఒక చిన్న గరిక పరకను చేగొని
పలికెనిటు రాముణ్ణి శరణనమని 

115
అదివిని ఆగ్రహించిన అసురుడు
ఆమెకొక ఏడాది గడువునిచ్చె
ఆ పిదప రాక్షసాంగనల చెరలో
సీతను ఆశోకవనము చేర్చె 

116
జనకుని గారాల కూతురైన
శ్రీ రామ చంద్రునికి ప్రాణమైన
సుకుమారి వైదేహి ఈ తీరున
శోకాన అశోకవనములోన.

117
ఆడపులులన్నియు చుట్టియున్న
ఒక లేడి కూనవలె బిక్కుమనుచు
పతిదేవునే ఎదను స్మరియించుతూ
భయ శోకభావాల తపియించెను 

118
అన్నపానాదులన్నియు త్యజియించిన
సీతగని విధాత కలతచెంది
తక్షణమె సురపతిని పిలిపించెను
ఆతనికి ఈ రీతి బోధించెను..

సశేషం 
సింహాద్రి జ్యోతిర్మయి
2.6.2018


గేయ రామాయణం
 అరణ్య కాండ

119
వైదేహి దుఃఖాన మరణించెనా
సురకార్య‌సిద్ధికే చేటువచ్చు
లంకకు రాముండు చేరువరకు
సీతను రక్షింపవలెను‌ మనము 

120
ఆకలిదప్పులను కలగనీక
జీవింపజేయగల శక్తియున్న
ఈ దివ్య పాయసము సీతకొసగి
ఆమెకు క్షేమమ్ము నొనరించుమా

121
 విధాత పలుకులను వినయమ్ముతో
విన్నట్టి దేవేంద్రు డట్లె యనుచు
నిద్రాధి దేవతను వెంట గొనుచు
లంకలో సీతమ్మ చెంతకేగె 

122
నిద్రాధి దేవి తన మహిమచేత
రాక్షసుల నెల్లరను నిదురలోన
ముంచుటను సీతమ్మ గమనించెను
తన ఎదుట నిలుచున్న ఇంద్రు గనెను

123
ఇంద్రుండు తన గూర్చి సీతమ్మకు
వివరించి సత్యమ్ము రూపించెను
నిజమెరిగి వైదేహి సంతసించి
ఆ దివ్య పాయసము తాను గొనెను 


124
ఇంద్రాగమన
 యెరుగని దశకంఠుడు
రాముణ్ణి చంపగా మదినెంచుతూ
తన కొలువు కూటమ్ము చేరుకొనెను
సభతీర్చి మంత్రులతొ చర్చించెను 

125
ఆ పిదప క్రూరాత్ములనిపించెడు
అనుచరుల రాక్షసుల రామవధకై
ఎనమండుగురిని తాను పిలిపించెను
జనస్థానమ్మునకు  పంపించెను 

126
అచట దండకారణ్యమ్మునందు
రాముడు మారీచు సంహరించి
వడివడిగ తిరిగి తానొచ్చువేళ
 దుశ్శకునాలేవొ పొడసూపెను 

127
అంతలో ఎదురుగా లక్ష్మణుండు
అల్లంత దూరాన అగుపించగా
  తన గుండె చెదరగా శ్రీరాముడు
సీతకు ఆపదను శంకించెను 

128
మీ వదిన నొంటరిగ విడిచిపెట్టి
నాయనా! నీవేల వచ్చినావు
నా సీత కాపదే వాటిల్లినా
నా శ్వాస ఆగునని మరచినావు 

129
అన్నయ్య మాటలకు లక్ష్మణుండు
దుఃఖాన తానిట్లు బదులిచ్చెను
ఓ అన్న!వదినమ్మ పరుషోక్తులు
వినలేక విధిలేక వచ్చినాను .



130
లక్ష్మణా!ఆర్తురాలగు జానకి
పలికిన మాటలను పాటింతువా!
సీతయే లేకున్న నా ప్రాణము
నిలువదను నిజమునే మరచినావా! 

131
అని మందలించుతూ శ్రీరాముడు
తెలియని భయమేదొ ఆవరింప
అచట సీతకేముప్పు వాటిల్లెనో
అని వడిగ ఆశ్రమానికి నడచెను 

132
రాముని ఎడమ కన్నదురుచుండె
అడుగులో తడబాటు కలుగుచుండె
అశుభ సూచకాలెన్నియో ఎదురువచ్చె
మనసంత ఉద్విగ్నభరితమయ్యె 

133
ఆశ్రమము చేరుకొని చూచినంత
వైదేహి జాడయే లేదచ్చట
ఎవ్వరో పెనుగులాడిన వైనము
గని కలత నొందెను రాము మనము 

134
నా సతిని ఎత్తుకొని పోయినారో!
అబలను దయమాలి చంపినారో!
భయపడి వనములో దాగెనేమో!
నీటికై సతి నదికి పోయెనేమో! 

135
అని పలువిధమ్ముల తలపోయుచూ
పలుమారు జానకీ యని పిలచుచూ
అతివకై రామయ్య దుఃఖించెను
అడవిలో అణువణువు గాలించెను. 

సశేషం 
సింహాద్రి జ్యోతిర్మయి


గేయ రామాయణం 
అరణ్య కాండ

136
తరులార!విరులార!తీవెలార!
గిరులార!పశులార!పక్షులార!
నా సీత నెవరైన చూసినారా!
ప్రియపత్ని జాడనే చెప్పలేరా!

137
అని చెట్టు గుట్టలను వేడుకుంటూ
దీనుడై తిరుగాడె శ్రీరాముడు
అన్నిటా జానకినె తిలకించుతూ
భ్రాంతుడై దుఃఖాన కుమిలినాడు 

138
సీతమ్మ లేనట్టి ఆ ఆశ్రమం
హేమంత ఋతువులా కళలు విడిచె
సీతమ్మ లేనట్టి శ్రీరాముడు
శోకాన ధైర్యమే తాను విడిచె 

139
తానెంత అవతార పురుషుడైనా
అవనిలో అనురాగ మూర్తి యతడు
శౌర్యాన అసమాన వీరుడైనా
సీతమ్మ ఎడబాటు నోపలేడు 

140
దినకరా! నా సీత జాడ నీకు
తెలిసినా దయచేసి చెప్పమనుచూ
తూర్పు దిశ కనులెత్తి కన్నీటితో
రఘువరుడు కర్మ సాక్షి ని వేడెను 







141
పావనీ!నా పడతి నెక్కడైనా
చెప్పుమా!నీవైన చూసినావా!
అని గోడుగోడునా విలపించుతూ
అతడడిగె గోదావరీ మాతను 

142
రాముని దరిలేని శోకానికి
కరిగిన అడవి జంతువులన్నియూ
దక్షిణపు దిక్కుగా మోరెత్తగా
దాశరథి అటువైపు పరుగులెత్తె 

143
ఆ దిక్కు చనినంత నొక్కచోట
అగపడగ పెనుగులాడిన గుర్తులు
ప్రియసతిని రాక్షసులు చంపిరేమో
అని తలచి రాముడే‌ తల్లడిల్లె 

144
ఇవియేను సీత నగలో రవ్వలు
లక్ష్మణా!ఇవి సీత సిగ పువ్వులు
ఇదిగిదిగొ ఇటువైపు చూసినావా!
ఇవి యేవొ రాక్షసుల పదముద్రలు 

145
అని మదిని దుంఖమే పొంగిరాగా
అంతలో ఆగ్రహము మితిమీరగా
అగ్నివలె భగ్గుమని శ్రీరాముడు
మహినంత దహియింప సమకట్టెను 

146
నా బహి ప్రాణమగు వైదేహిని
దేవతలు రక్షించి తక్షణమ్మే
గొనివచ్చి నాకివ్వకున్నయెడల
తృటిలోన సృష్టినంతము జేతును 

147
అని ప్రతిన బూనుచూ ప్రళయాగ్నిలా
దాశరథి విల్లంది సంధించెను
తొలిసారి తన అన్న ఉగ్రరూపం
 కాంచిన సౌమిత్రి భయమందెను 

148
సోదరా!ఒకడికై లోకాలను
క్రోధాన నశియింపజేయ తగునా!
వీరుడా!నీవంటి ప్రాజ్ఞుడిట్లు
వివశుడై చరియింప న్యాయమగునా! 

149
లక్ష్మణుని ఆ హితవు నాలకించి
దాశరథి విజ్ఞుడై శాంతించెను
తన సీత జాడయే తెలుసుకొనగా
తెలివితో మార్గమ్ము తెలుపుమనెను 

150
వేవేల రాక్షసులనైనగాని
క్షణములో నేలకూల్చిన రాముడు
దీనుడై బేలతనమున సీతకై
వివశుడై విలపించు విధము చూడు.

సశేషం 
సింహాద్రి జ్యోతిర్మయి

7.6.2018

గేయ రామాయణం
 అరణ్య కాండ

151.
శ్రీరామలక్ష్మణులు ఇర్వురాపై
అడవిలో అన్వేషణము చేయుచూ
ఒకచోట నేలకొరిగిన కొండవోలె
పడియున్న పక్షి రాజును గాంచిరి 

152
ఆగిపోతూ ఉన్న తన ఊపిరి
ప్రోది గావించుకొని పక్షీంద్రుడు
 నాదు ప్రాణాలనూ సీతనూ రామచంద్రా!
రావణుడు హరియించెనని చెప్పెను 

153
శ్రీ రామభద్రుడా!కలతపడకు
అది విందమనియెడు ముహూర్తము
 కోల్పోయినట్టి నీ పెన్నిధానం
తప్పక లభియించగలదు సుమ్ము 

154
 విశ్రావసువునకు తనయుడతడు
వైశ్రవణుడనువాని  సోదరుండు
దక్షిణపు దిక్కుగా నేగి నాడు
 అనిపలికి మరణించె మహితాత్ముడు 

155
కలతపడి జటాయునకు రాముడు
అగ్నిసంస్కారములన్ని లాచరించి
మరలతను పయనమ్ము సాగించెను
క్రౌంచ మను అడవి లో కాలూనెను 



156
అడవి లో మతంగముని ఆశ్రమం
చెంతగల పాతాళ గుహలోపల
అయోముఖి అనునట్టి ఒక రాక్షసి
లక్ష్మణుని మోహించి వెంటాడెను 

157
అదిచూసి సౌమిత్రి కత్తిదూసి
అద్దాని ముకు చెవులు కోసివేయ
రాకాసి రోదిస్తు పారిపోయె
లక్ష్మణుడు అన్నతో సాగిపోయె 

158
భీకరారణ్యాన సాగుచుండ
వికృతమౌ రూపుగల రాక్షసుండు
కబంధుడనువాడు ఇరుచేతులా
శ్రీరామలక్ష్మణుల పట్టినాడు 

159
తెలివితో అన్నదమ్ములు ఇరువురూ
తెగువనే చూపించి ఒకసారిగా
అసురుని ఇరుచేతులను నరకగా
శాపమే తొలగిన అసురుడనియె 

160
శ్రీరామ!నే దనువు పుత్రుండను
అత్యంత సుందరాకారుండను
మునివరుల వేధించి ఈ రీతిగా
వికృతమౌ రూపమిది పొందినాను 

161.
దీర్ఘాయు వరము నే కలిగియున్నా
మునికోప మింద్రశాపము కూడగా
తొడలుతెగి పడియుంటి నిచటనేను
నీవల్ల విముక్తిని పొందినాను 

162
నను నీవు అగ్నిలో దహియించుమా
నాకపుడు దివ్యజ్ఞానము కలుగును
ఆ పిదప మీకు సాయము చేతును
అనినంత వారటులె చేసినారు 

163
వింతయగు దివ్య కాంతిని పొందిన
కబంధు డీరీతి మొక్కి పలికె
మిత్రమా!త్వరలోనె సీత నీకు
తప్పక లభియింపగలదు వినుమా! 

164
కలదయ్య బ్రహ్మ నిర్మిత పర్వతం
పాపులకు చేరగా రాని ప్రాంతం
ఆ శిఖరి చేరుకుని వసియింపుము
తీరునిక మదిలోని కామితార్థం 408

165
అచ్చోట వానరుడు సుగ్రీవుడు
కలడయ్య తమ్ముడగు వాలికతడు
ఆ ఋష్యమూకమ్ము చేరినంత
నీతోటి చెలిమినే చేయగలడు 



166
అతనికి నీవల్ల మేలు కలుగు
నీకతడి కతమున సీత దొరకు
అన్యోన్యమగునట్టి మైత్రి తోడ
మీ ఖ్యాతి లోకాన చెలగి వెలుగు 

167
అని దివ్యపురుషుండు తెలిపినంత
ఆశతో అటునడిచిరా ఇద్దరూ
ఆనడుమ శబరి ఆశ్రమము చేరి
ఆ శ్రమణి ఆతిథ్య మందినారు 

168
నిన్నిటుల పూజించు భాగ్యమంది
రఘువరా!నా జన్మ ధన్యమాయె
నా గురువు వాక్కులే ఫలియించెను
ఇక నేను కైవల్యమందగలను 

169
అని పలికి భక్తితో సేవలొసగి
ఆ శబరి దేహాన్ని విడిచిపెట్టె
యోగాగ్నిలో తనువు దగ్ధమవగా
ఆ తల్లి పుణ్యలోకము చేరెను 

170
మతంగ వనములో ఈ రీతిగా
మనసార సేదదీరిన రాముడు
మదిలోన ఎనలేని శాంతిపొంది
శుభమంద ఋష్యమూకము చేరెను.

సశేషం
 సింహాద్రి జ్యోతిర్మయి

11.6.2018.

గేయ రామాయణం
 అరణ్య కాండ

171
శ్రీరామ  చరితమ్మునే ఇమ్ముగా
నోరార పాడితే నువు కమ్మగా
భవ బంధనములన్ని తెగిపోవుగా
కైవల్యపథమింక కనబడునుగా 

172.
కాంచగా ఈ కాండలోన మనకు
కనిపించు కమనీయ దాంపత్యము
సీతమ్మ ప్రేమయే అతి మధురము
రామయ్య అనురాగ మసమానము 

 అరణ్య కాండ సంపూర్ణం.

సింహాద్రి జ్యోతిర్మయి

Comments

Popular posts from this blog

నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం న ర సం

4/1.*గేయ రామాయణం* ‌ బాలకాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)