12/1.గుండె గొంతుకలో



 ‌    



🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵    
🎵                          ‌.          🎵        ‌     గుండె గొంతుకలో 
🎵                                     🎵
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
I.బ్రతుకంత పాటగా....
1.ఊయల
.నీవు ఊగిన ఊయల

2.కన్నవారి కలలు
తల్లిదండ్రి భారమని తలపబోకుమా

3.రతనాలబొమ్మ
రాళ్ళబండి వారింటి రతనాలబొమ్మవే

4.లాలీ!లాలీ!
లాలమ్మ లాలనుచు జోలపాడాలి

5.కడుపుతీపి
మా ఇంటి పసిపాప

6.గారాల పాపాయి
గారాల పాపాయి జోలాలి హాయి

7.ప్రణయ కార్తీకం 
కాంతులీనెడు ఈ కార్తీక పున్నమి 

8.ఉపనయనం
మంత్ర స్వరూపిణి మాతా గాయత్రి

9.ఇలవేలుపు అమ్మ 
అమ్మ ఇంటి వేలుపని
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
1.నీవు ఊగిన ఊయల 
రెండున్నర నెలలు మురిపించిన మా మనవరాలు,సందడిగా తిరిగిన కోడలు ఈ రోజు ముంబయి వెళ్ళిపోవడంతో 
ఇల్లంతా బోసిపోయింది.ఆ దిగులుతో రాసుకున్న నా పాట

నీవు ఊగిన ఊయల
బోసిపోయెను నేడిలా
చిన్నబోయెను ఇల్లు మీ
నాయనమ్మ మనసులా ||

మొలకనవ్వుల‌ ముద్దు కూన
రెక్కరాని చిట్టి గువ్వ
ఒదిగిపోయి అమ్మ సందిట
నవ్వుకుంటూ నాన్నవెంట
వీడలేని మమ్మువీడి
వెళ్ళిపోయిన దృశ్యమే
నిలిచెనే బంగారుతల్లీ
నీరు నిండిన కన్నులా ||

పెరటిలో ఒక కోయిలమ్మ
కేరింతవినగా వచ్చి కూసి
కొమ్మ పైన రామచిలుక
నీపలుకునేర్వగ
వేచి పిలిచి
పలుకరించే ఇరుగుపొరుగు
పాప నవ్వుల పువ్వులేవిటు
సందడంతా సద్దుమణిగిన
దేమి యంటే ఏమి చెప్పను? ||

పూటకొక్క వింతచూపి
రోజుకొక్క విద్య నేర్చి
ముద్దు లన్నీ మూటకట్టి
మురిపెమంతా దాచిపెట్టి
పున్నమై పులకింపజేసి
వెన్నెలే వెదజల్లిపోగా
తనివితీర్చగ తాత ఇంటికి
మళ్ళిరావే మా చందమామ ||

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.5.2021
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
2.కన్నవారి కలలు

తల్లిదండ్రి భారమని తలపబోకుమా!
మన ఇంటి వేల్పులని మరువబోకుమా!
చిన్ననాటి కన్నప్రేమ గుర్తుచేసుకో
కన్నపేగులో ఉన్న కలత తెలుసుకో!

గోరుముద్దలే పెట్టి గోము చేసినా
ముచ్చటలే జరిపించి ముద్దు చేసినా
పొరపాట్లు నాన్నదాక పోనీయక
కప్పిపుచ్చి మమతతో కాపు కాసినా
ఆనాటి అమ్మ ప్రేమ గుర్తుచేసుకో
కన్నకడుపులో ఉన్న కలత తెలుసుకో


అడిగినంతనే ప్రతీ చిన్న ఆశ తీర్చినా
అడగకున్ననూ మనసుపడ్డ సుఖము కూర్చినా
కష్టమన్నదెప్పుడూ కలగనీయక
నీ ఉన్నతి కోసమై వెతలకోర్చినా
ఆనాటి నాన్న ప్రేమ గుర్తుచేసుకో
కన్న కడుపులో ఉన్న కలత తెలుసుకో

లోకమంత దెప్పిపొడిచి గేలిచేసినా
కోరుకున్న వారినిచ్చి పెళ్ళి చేసినా
కన్నప్రేమ కేమాత్రము విలువనీయక
ఋణము దీర్పగలవా నీవెంత చేసినా
ఆనాటి ఆ ప్రేమ గుర్తుచేసుకో
కన్నకడుపులో ఉన్న కలత తెలుసుకో

పెట్టుపోతలేవి మేము మిమ్ముకోరము
పేగుబంధమయ్యెనా నేడు నేరము
మనుమలతో ఆడిపాడి సేదదీరక
ముదిమి మాకవుతున్నది తగని భారము
ఆనాటి మీ వేడుక గుర్తుచేసుకో
ఈనాటి మా వేదన అడిగి తెలుసుకో

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.12.2021
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3.రతనాల బొమ్మ 
రాళ్ళబండి వారింటి
రతనాల బొమ్మ వే
బొజ్జనిండ పాలు తాగి
బుజ్జాయీ బజ్జోవే

రామకృష్ణాది సకల
దైవాల దీవెన
నిలిపేను నీకు నిత్య
చైత్రాలు బ్రతుకున
ముత్యాల నవ్వులొలుకు
మురిపాల మొలకవే
తాతయ్య నాన్నమ్మ ల
తనివితీర్చు ముద్దువే
రాళ్ళబండి వారింటి
రతనాల బొమ్మవే

రాజశేఖరుండు శివుడు
చల్లంగ చూడగా
జీవితమే నీ రాకతో
జ్యోతిర్మయమవ్వగా
మెరిసేటి నీలికనుల
వజ్రాల తునకవే
అమ్మమ్మ తాతయ్యల
ఆశల దీపానివే
రాళ్ళబండి వారింటి
రతనాల బొమ్మవే

ప్రత్యూష పవనాల
జోజోల ఉయ్యాల
రాజంటి మీ నాన్న
ఎదమీద ఊగాల
తిరువేంకటాద్రి స్వామి
కరుణించిన వరమువే
గారాల యువరాణి
చింటుపాప చైతువే


చిన్నారీ! నిన్ను చూసి 
కన్నవారు మురియాలి
చదువులబ్బి పదవులేలి పేరుతెచ్చుకోవాలి
సంధ్యలలో చంద్రకళలు
వెదజల్లి ఎదగగా
శ్యామసుందరుండు కాచు
దయాసింధువై నిన్నే
రాళ్ళబండి వారింటి
రతనాల బొమ్మవే
లాలిపాప డాలిపాప
డోలలూగి బజ్జోవే

రాళ్ళబండి వారింటి
రతనాల బొమ్మవే

సింహాద్రి జ్యోతిర్మయి
10.5.2020
తాతయ్య.రామకృష్ణ రాజు
నానమ్మ.. నిత్య
పెదనాన్న..శ్యాం సుందర్
అమ్మమ్మ.. జ్యోతిర్మయి
తాతయ్య.. రాజశేఖర్
పెద్దమ్మ..సింధు
మేనమామ.నిశాంత్ చంద్ర
అత్త .. శ్రావణ సంధ్య
అక్క..డాలీ
వాళ్ళ నాన్న పేరు..
జితేందర్ రాజు
వాళ్ళ నాన్న ముద్దు పేరు..చింటూ
అమ్మ పేరు.. ప్రత్యూష
పాప పేరు..కామ్య చైత్రిక(చైతూ)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
4.లాలీ!లాలీ!

లాలమ్మ లాలనుచు జోల పాడాలి
లాలి విని పాపాయి నిదురపోవాలి
ఆటపాటల చాల
అలిసేవు గానీ
చాలించి కాసేపు 
కునుకు తీయాలి
లాలీ లాలీ
లాలీ లాలీ

కౌసల్య ఒడిలోన
శ్రీ రామ లాలీ
నందగోపుని ఇంట
కన్నయ్య లాలీ
ఉయ్యాల పాపాయి
ఊళ్ళేలి పదుగురూ
మెచ్చి దీవించేటి
మేటి కావాలి
లాలమ్మ లాలి 
ఇది అమ్మమ్మ లాలీ
నీ ముద్దు మురిపాలు 
నే చూసి మురవాలి
లాలీ లాలీ లాలీ లాలీ

గజరాజ వదనునికి
నగ తనయ లాలీ
దాశరథి పుత్రులకు
ధరణిసుత లాలీ
ఆది పూజితునిలా
అమ్మ కనువెలుగులా
పెరిగి మా పాపాయి
పేరు పొందాలి
లాలమ్మా లాలి 
ఇది
నాన్నమ్మ లాలీ 
మా వంశ దీపమై
నీవు వెలగాలి
లాలీ లాలీ లాలీ లాలీ

వర శ్రీనివాసునకు
వకుళమ్మ లాలీ
నీకిదే ముక్కోటి
దేవతల లాలీ
అమ్మ ఒడిలో ఒదిగి
నాన్న కౌగిట ఎదిగి
విద్యలెన్నో చూపి
కనువిందు చేయాలి
లాలమ్మ లాలి ఇది
మీ అమ్మ లాలీ
శతమానమై సకల
శుభములందాలి
లాలీ లాలీ లాలీ లాలీ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
5.కడుపుతీపి

మా అమ్మాయి పెళ్ళి సందర్భంగా రాసిన పాట

*కడుపుతీపి*

మా ఇంటి పసి పాప
మా జంట కనుపాప
నీవేను నా తల్లి
అందాల మరుమల్లి


నిన్న మొన్ననె నిన్ను
కన్నట్లుగా ఉంది
నిన్న మొన్నే నీవు 
దోగాడినట్లుంది
నిన్న మొన్ననె మాట
 నువు నేర్చినట్లుంది
నిన్న మొన్నే బడిని
నిను చేర్చినట్లుంది
వధువుగా నిన్నిలా
కనుముందు కనుదాక
కాలమెటు గడిచెనో
ఊహకే రాకుంది

ఒప్పు తప్పులు చెప్ప
 తిట్టి ఉంటానేమొ
భయభక్తులను మప్ప
బాధ పెట్టానేమొ
ఇష్టాలు కాదంటు
కష్టపెట్టానేమొ
రుసరుసలు తగదంటు
కసరుకున్నానేమొ
కడుపు తీపిని కప్పి
కరుకుదనమును చూపు
నీ తల్లి మదినేడు
కరిగి నీరవుతోంది

చదువందునా నీవు
సాక్షాత్తు శారదవె
నా చిట్టి తల్లి
సౌందర్య మందునా
చిదిమి దీపము
పెట్టుకోవచ్చునమ్మ
సంస్కారమందునా
తావి యబ్బిన పసిడి
సుగుణాలరాశి
భూషణమ్మందునా
కరుణనిండిన మనసు కలదమ్మ నీకు
పెళ్ళాడబోతున్న ఈ చిట్టి గుమ్మ
అల్లారుముద్దు మా అపరంజి బొమ్మ

పొద్దెక్కి లేచేటి
అలవాటు మానాలి
అత్తింటి మర్యాద
తెలుసుకొని మెలగాలి
అమ్మపై మాటికిని
అలిగినటు కాదమ్మ
సర్దుకుని పోవాలి
ఎదురాడ తగదమ్మ
అత్త మామల మనసు
సేవతో గెలవాలి
భర్తమది నెల్లపుడు
ప్రేమతో నిలవాలి

నిండు ఆశీస్సులతో
అమ్మ
సింహాద్రి జ్యోతిర్మయి
25.4.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
6.గారాల పాపాయి 

గారాల పాపాయి
జోలాలి హాయి
మారాము ఇక మాని
బజ్జో బుజ్జాయి

మా ఇంటికొచ్చింది
ఓ చిన్ని అతిథి
చల్లంగ నూరేళ్ళు
మాతో ఉంటుంది
ఆ ముద్దు మురిపాలు
ఆటాపాటల్లు
వినరండి కనరండి
దీవించి పొండి

పగడాల పైనుంచి
దొరలే ముత్యాలు
ఏవేవి అనకండి
ఇదిగో చూడండి

మా పాప పెదవుల్లు
ముద్దూ పగడాలు
ఆ బోసి నవ్వుల్లు
మంచిముత్యాలు
కన్నార కన్నారా
ఒకసారి మీరు
ఔనౌను నా మాట
నిజమేనంటారు

వెలిగేటి దీపాల
చలువ కాంతుల్లు
ఏవేవి అనకండి
ఇదిగో చూడండి
మా ఇంటి దీపాలు
మా పాప కనులు
ఆ కంటి చూపుల్లొ
నిత్యా పున్నమలు
కన్నార కన్నారా
ఒకసారి మీరు
ఔనౌను నా మాట
నిజమేనంటారు

ఊకొట్టె రా చిలుక
దోగాడె హంస
ఏదేది అనకండి
ఇదిగో చూడండి
చిన్నారి ఊసంటే
చిలకా పలుకేను
దోగాడె నా తల్లి
రాయంచె తాను
కన్నారా కన్నారా
ఒకసారి మీరు
ఔనౌను నా మాట
నిజమే నంటారు

 శ్రావణపు మేఘాలు
కను గప్పకుండ
శ్రీ శ్రీనివాసుండు
కరుణించుచుండ
ముఖచంద్ర కళలందు
నిశి గమ్మకుండ
ఆ సత్యదేవుండు
దీవించుచుండ
వర్థిల్లు పాపాయి
వర్థిల్లవమ్మా
మారాము ఇక మాని
నిదురించవమ్మా!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
7.ప్రణయ కార్తీకం

కాంతులీనెడు ఈ కార్తీక పున్నమి
నా మనసు సైపదు
నువు లేక నా స్వామి 

తొలి పరిచయపు గుర్తు
తోటలో తొలి ముద్దు
మనము చేసిన బాసలు
మనసు చెప్పిన ఊసులు
తలపులో మరి మరీ
తమకాన్ని నింపేను
నిదుర మరచిన కంట
నీ రూపె నిండేను

పాతికేళ్ళున్నవి
పెళ్లి నాటికి మనకు
పాతికేళ్లయినది
పంచుకొని మన బ్రతుకు
పాతబడనేలేదు
కాపురమ్మున ప్రేమ
ప్రీతితో ఏలేము
ఈ ప్రణయసీమ

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.11.2019
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

8.ఉపనయనం

మంత్ర స్వరూపిణి
మాతా గాయత్రీ
వాక్శుద్ధి నిచ్చి
వటువును బ్రోవవే
ఇరువది నాలుగు
దివ్యాక్షరమ్ముల
రామాయణమున
రంజిలు జననీ ‌||. ||

పుట్టుక నిచ్చి
ప్రేమగ పెంచిన
జనకుని నుండి
శుభమూర్తమందున
బ్రహ్మోపదేశపు
ఫలమై అందే
వాగ్రూపనిధివే
తేజోమయివే

ఒజ్జల సేవించి విద్యలు నేర్వగ
బుద్ధి జ్ఞానము
వినయములబ్బగ లోకములందున
సత్కీర్తి వెలయగ
జననీజనకుల
తరములు తరియగ


గురునాశ్రయించి
శుశ్రూష జేసి
భిక్షాటనమున
జీవిక గడపగ
ఉపనయనమ్మును
పొందే వటువుకు
బ్రహ్మచర్యమున
సఫలత నీయవే

శాస్త్రపూర్ణుడై
సంస్కారనిధియై
స్నాతకోత్సవపు
విధి పర్యంతము
నడిపిన తదుపరి
 గృహస్థుగ మారగ
అనుమతి నీయవె
ఆశీస్సులీయవే

మంత్ర స్వరూపిణి
మాతా గాయత్రీ
వాక్శుద్ధినిచ్చి
వటువును బ్రోవవే

మేనల్లుడి ఉపనయన సంస్కారం సందర్భంగా రాసిన పాట

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.2.2022
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
9.ఇలవేలుపు అమ్మ

*ఇలవేల్పు దూరమై
ఈనాటికి ఇరవయ్యేళ్ళు*

అమ్మ ఇంటి వేలుపని
అపుడనుకోలేదు
అమ్మ మమత లోతెంతో
అసలెరుగనె లేదు

 మాటెంతో కఠినమనీ
తలపోశానే గానీ
మనసు వెన్న
అన్న నిజం
గుర్తించనె లేదు

పనులెన్నో చెబుతుందని 
శపియించానే గానీ
ప్రావీణ్యత నేర్పిందని
గ్రహియించనె లేదు

స్నేహాలను వద్దందని
నసపెట్టానే గానీ
తప్పటడుగు దిద్దుతోందనీ
తలపోయనె లేదు

నచ్చిన పెళ్ళి నాన్న చలవని
తెగ మురిశానేగానీ
ఒప్పించిన అమ్మ మమతను
ఊహించనె లేదు

మనసుపడ్డ మనువు నాదనీ
పులకించానే గానీ
చెమరించిన అమ్మ కంటిని
కనుగొననే లేదు

కడుపులోని వ్యాధి అమ్మని
కబళించినాక గానీ
తరలెను నా ఇలవేల్పని
 తెలియరానే లేదు

ఈడేరిన పిల్లతల్లిని
నే నైనాకగానీ
ఆవహించె అమ్మ నన్నని
 అర్థమవనే లేదు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.1.2022

ముద్దుల మనవడు నవధీర్ కు
ముద్దులతో నాన్నమ్మ జోలపాట

జోలాలీ జోలాలీ
బజ్జోరా నా తండ్రీ!
అల్లరినవ్వుల అందాలకన్నులు
అలసీసొలసీ
అరమోడ్పులయే
ఆటలు చాలించి ఇకనైనా
హాయిమీరగా కాసేపైనా 
బజ్జోరా నాతండ్రీ!
జోలాలీ జోలాలీ
బజ్జోరా నాతండ్రీ!

ఆకాశంలో ఆ చందమామను
అద్దాన చూసి అది కావాలని
ముద్దుగ మారాము చేసిన నాటి
దశరథ రాముని సరిసాటి
నీవే నీవే నాతండ్రీ 
నిద్దురపోరా ఆదమరచీ
జోలాలీ జోలాలీ
బజ్జోరా నాతండ్రీ!

వెన్నను మాని మన్నును తినగా
నోరుచూపమని యశోద అనగా
 నోట భువనములు చూపిన నాటి
నందకిశోరుని సరిసాటి
నీవే నీవే నాతండ్రీ 
నిద్దురపోరా ఆదమరచీ
జోలాలీ జోలాలీ
బజ్జోరా నాతండ్రీ!


 వ్యాసుని జయకథ వ్రాసిన మేటి
పితరుల సేవే ఘనమని చాటి 
విఘ్నాధిపత్యం పొందిన నాటి
గౌరీ తనయుని సరిసాటి
నీవే నీవే నాతండ్రీ
నిద్దుర పోరా ఆదమరచీ
జోలాలీ జోలాలీ
బజ్జోరా నాతండ్రీ 



నాన్న మనసులో కలలకు రూపం
అమ్మ కన్నుల ఆశాదీపం
తోబుట్టువుకు తోడూనీడ
నీవై ఉండాలి బంగారు కొండ
 ఏడు కొండల స్వామి దీవెన
నిండుగ నీపై కురవాలి కన్నా
జోలాలీ హ్లఏ29.4.2023


 

నా ముద్దుల
మనవడ

నాన్నమ్మ
సింహాద్రి జ్యోతిర్మయి
29.4.2023
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
💐💐💐💐💐💐💐💐💐💐💐
1.
యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
అని తరతరాలుగా అంటున్నారు
అతివను మోసం చేస్తున్నారు

కలకంఠి కంట నీరొలికితే
సిరి ఇంటనుండ నొల్లబోదు
అని కల్లబొల్లి మాటలే వల్లించారు
మభ్యపెట్టి మగువనే వంచించారు

పసితనాన పెళ్ళి చేయ
వసివాడిన బాల్యము
ముసలిమొగుడు హరీ అంటే
ముసుగుకప్పె వైధవ్యము
వంటిల్లే లోకమైన
బావిలోని కప్పకు
చదువుకోను వీలులేని
సంప్రదాయ సంకెల
నేడు తెంచుకున్నది
నింగి కెదుగుతున్నది
మీ ఆటలింక సాగబోవు
ఆంక్షలింక ఆపలేవు

మరణించిన భర్తతో టి
చితినెక్కితె పతివ్రత
చిత్రహింస భరియించే ఇల్లాలే దేవత
ఆడపిల్ల నమ్ముకున్న
ఆ కన్యా శుల్కము
డబ్బుమెడకు తాళికట్టు పెళ్ళి కదా వరకట్నము
కొన్ని అధిగమించాము
కొంత ముందుకెళ్ళాము
మీ ఆటలింక సాగబోవు
ఆంక్షలింక ఆపలేవు

చదువులూ పదవులూ రెక్కలవ్వగా
నేటి వనిత ఈ జగతిని ఏలుతున్న ది
ముద్దారా నేర్పించే హృదయమున్నచో
ముదిత నేర్వలేనిదంటు ఏమున్నది
తలవంచుకు పోబోము
తలలెత్తుకు తిరిగేము
మీ ఆటలింక సాగబోవు
ఆంక్షలింక ఆపలేవు

మా ఆత్మగౌరవాన్ని సైపనివారు
అతివలంటె అబలలని తలచేవారు
ప్రేమపేరుతోటి మమ్ము వేధించేరు
కామంతో పశువులై కబళించేరు
మాకు దిశా నిర్దేశం
నేడు చేస్తున్నది నిర్భయం
మీ ఆటలింక సాగబోవు
ఆంక్షలింక ఆపలేవు

సింహాద్రి జ్యోతిర్మయి
28.2.2022
💐💐💐💐💐💐💐💐💐💐💐
2.బాల్యం మా హక్కు

గేయం

భరతమాత పిల్లలం
పెద్దలారా!
మా భవితకు మార్గమేది మాన్యులారా!

చిన్నిగుండెలోన మాకు
చింతలెన్నొ ఉన్నాయి
అందమైన రేపటిపై
ఆశలెన్నొ ఉన్నాయి
చింత తీర్చు వారికొరకు
వెతుకుచుంటిమి
ఆశతీరు అవకాశం
అడుగుచుంటిమి


పేదరికం శాపమై
చిన్నిపొట్ట భారమై
పని చేయక తప్పక
పసి వయస్సు ఓపక
గంజి నీళ్ళ కోసమై
పసిడిమేడలో
పంజరాన చిలకలల్లె
మగ్గుచుంటిమి
మాకు స్వేచ్ఛనివ్వండి
మాన్యులారా!
మనుషులల్లె చూడండి
మమ్ము కూడా!

ఆడపిల్ల పుడితేను
కాపురమే ఉండదంటు
అత్తవారు బెదిరిస్తే
అసహాయపు తల్లులు
మనసు చంపుకొనుచు మమ్ము
విసిరివేయగా
కూడు గూడు తోడు లేక
కుములుచుంటిమి
వీధిబాలలం మేము
విజ్ఞులారా!
వినరండి మా వేదన వీనులారా!

మా కోసం చట్టాలట
మాకెన్నో హక్కులంట
సంక్షేమపు హాస్టళ్ళట
నిర్బంధపు విద్యలంట
పథకాలను పెట్టినంత
ఫలితముండునా!
చిత్తశుద్ధి లేనిచేత
మార్పు తెచ్చునా!
పసివాళ్ళము చూడండి కరుణతోడ
పనివాళ్ళను చేయకండి ప్రేమలేక


రైలుపెట్టె తుడిచేము
కాఫీ కప్పు కడిగేము
గొడ్లు కాచుకుంటాము
బూట్లు తుడుస్తుంటాము
ఒక బాల్యం బడిలోపల ఎదగసాగెను
మా బాల్యం మసకబారి
మమ్మువీడెను
చిన్న మనసు తెలుసుకోండి అయ్యలా రా!
పెద్దమనసు చేసుకోండి అమ్మలారా!

భరతమాత పిల్లలం
పెద్దలారా!
మా భవితకు మార్గమేది చూపరారా!

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం
 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.11.2018

💐💐💐💐💐💐💐💐💐💐💐
3.వేద భారతి

భారతదేశం మనదేరా
భారతీయులం మనమంతా
భాగ్యము మనదే
భవితా మనదే
మనకు సాటి ఇక మనమేరా

వేదాలిచ్చట వెలసినవి
శాస్త్రాలిక్కడ పుట్టినవి
ఇతిహాసమ్ములు భగవద్గీత యు
ఈ నేలపై విలసిల్లినవి

సత్యాగ్రహమే ఆయుధము
అహింసయే మన పరమార్థం
శాంతికపోతం ఎగిరే స్వర్గం
పంచqశీలయే మనమార్గం

ఎన్నో జాతుల కాశ్రయము
ఇచ్చెను చల్లని మనతల్లి
ఏ మతమైనా మనకు సమ్మతం
పరమత సహనం మన మతము

స్త్రీ ని శక్తిగా ఆరాధిస్తాం
పుడమిని తల్లిగ పూజిస్తాం
పంటను నదులను పరకాంతలను
మాతృభావనతొ మన్నిస్తాం

అంతరిక్షమును శోధించితిమి
శాస్త్ర పురోగతి సాధించితిమి
ఏ రంగాన ఎదురేలేదు
ఎవ్వరికన్నా తక్కువకాదు
ఏ రంగాన ఎదురేలేదు
మన మెవ్వరికన్నా తక్కువకాదు

సింహాద్రి జ్యోతిర్మయి
14.8.2018

💐💐💐💐💐💐💐💐💐💐💐
4.........మాతృ దేవత..........‌

అమ్మ ఇంటి వేలుపురా
ఆలయాన దేవతరా
ఎన్ని చేసినా నీవు
కన్న ఋణము‌ తీర్చలేవు " "

తాళి మెడను పడగానే
తల్లికాగ తపిస్తుంది
కడుపున నువు పడినవేళ
వికారాలు సహిస్తుంది
తనువు భారమౌతున్నా
తనకు ముప్పు పొంచి ఉన్నా
నిండు నెలలు మోస్తుంది
నీకు పురుడు పోస్తుంది ". "

పేగు తెంచి ప్రాణమిచ్చి
ప్రేమకవచమేస్తుంది
అమ్మపాల అమృతాన
ఆయువునే పోస్తుంది
నిద్రసుఖములెరుగక
కంటిపాప తీరుగా
కాచుకుని పెంచుతుంది
కడుపుతీపి పంచుతుంది‌ ". "

ఉయ్యాలగ ఒడిని చేసి
ఊసులన్ని నేర్పుతుంది
అనుభవాలు పాఠంగా
ప్రపంచాన్ని చూపుతుంది
కష్టమంత తనదిగా
సుఖమంతా నీదిగా
కడుపులోన దాస్తుంది
భవిత బాట వేస్తుంది ". "

చదువులతో పదవులతో
నీవెదిగితె పొంగుతుంది
పెళ్ళి చేసి తోడునిచ్చి
బాధ్యత నెరవేరుస్తుంది
నీ పిల్లలనెత్తి మురిసి
నీ చల్లని బ్రతుకు చూసి
తనివిచెంది తరిస్తుంది
తన తనువును విడుస్తుంది ". "

మాతృదినోత్సవ శుభాకాంక్షలతో అమ్మ కు అంకితం.

సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్ @ OPS
13.5.2018


💐💐💐💐💐💐💐💐💐💐💐

5.తెలుగుమయం

అమ్మవంటి తెలుగురా
అమృత భాష తెలుగురా
ఆలకించ హాయినొసగు 
అజంతభాష 
తెలుగురా
కమ్మనైన భాషనేర్చి 
కన్నవారి రుణం తీర్చి 
జన్మభూమి సేవచేయ 
నీ పుట్టుక తరించురా

అమ్మ కడుపులోన మనం 
పదినెలలే ఉన్నామని
అమ్మ పాలతోటి మనం 
అరునెలలె పెరిగేమని
ఆ మమతను మరచిపోతె 
మన ఉనికికి అర్థమేది?
కన్నతల్లి జన్మభూమి 
 మాతృభాష మన పెన్నిధి

రెక్కలొచ్చి పక్షులల్లె 
 విదేశాల కెగిరిపోయి
రెక్కలిచ్చి పంపించిన 
కన్నవారి ఊసు మరచి
పర సంస్కృతి పరమైతే 
మన ఉనికికి అర్థమేది?
కన్నతల్లి జన్మభూమి 
 మాతృభాష మన పెన్నిధి

పొట్టకూటి కోసమని 
అన్యభాష లభ్యసించి 
పుట్టుకతో వంటబట్టు 
తేట తెలుగు నీసడించి 
మన భాషను వద్దంటే 
మన ఉనికికి అర్థమేది ?
కన్నతల్లి జన్మభూమి 
 మాతృభాష మన పెన్నిధి

దూరమైన తెలుగు కొరకు 
విదేశాంధ్రు లుద్యమించ 
పెరటి చెట్టు నొదిలేసి 
తెలుగు నేల బ్రతుకుతోంది 
స్వస్థానం వేష భాష 
 మన ఉనికికి ఆధారం
తెలుగులొక్క ప్రపంచం 
అని తెలుపుటకీ యత్నం

పలుకులోన తెలుగుదనం
పాటలోన తెలుగుదనం
పల్లెలోన తెలుగుదనం
పండుగలో తెలుగుదనం

అరిసెలోన తెలుగుదనం
ఆవకాయ తెలుగుదనం
పట్టుచీర తెలుగుదనం
పంచెకట్టు తెలుగుదనం

పౌరుషాన తెలుగుదనం
పద్యమందు తెలుగుదనం
అవధానం తెలుగుదనం
చాటువులో తెలుగుదనం

అణువణువున ప్రత్యేకత 
చాటు తెలుగు సంస్కృతి
అడుగడుగున ప్రత్యేకత  
చాటు తెలుగు సంస్కృతి
ఆ ఘనతను విస్మరిస్తె 
మన ఉనికికి అర్థమేది
కన్నతల్లి జన్మభూమి 
 మాతృభాష మన పెన్నిధి

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
29.8.2020

16.కళామిత్రమండలి

  కళామిత్ర‌మండలి
ఇదే తెలుగు లోగిలి
లలిత కళారాధనలో
తరిస్తున్న సేవాంజలి

ప్రకాశం ప్రమిదలోన
సాహితీ దీపకళిక
కొడిగట్టక వెలుగులీన
జేయుచుండె కదా నూనె
మహనీయుల జయంతులు
మహా కవుల వర్థంతులు
మరచిపోక మరువనీక
శ్రద్ధతోటి సలుపు సంస్థ

 కళామిత్ర మండలి
అన్న పేరు సార్థకమే
అని యెల్లరు తలపోయగ
సాహితీ మైత్రి నెరపి
పదుగురినీ కలుపుకుని
ప్రతి పని తానందుకుని
శ్రమయే సౌందర్య మనగ
పేరు మోసినట్టి సంస్థ



 తెలుగంటే తగని ప్రేమ
భాషే తన శ్వాస సుమా
భాషను కాపాడుకొనే
ఉత్సాహమె ఉద్యమమా
ప్రతిభ వెతికి గుర్తించి
పురస్కార మిచ్చి మెచ్చి
భాషామతల్లి రుణం
తీర్చెడి జాతీయ సంస్థ

 బడిపిల్లల కోసమని
వ్యాసరచన, పద్యపఠన 
దేశభక్తి గీతాలు
జానపదం ,నాట్యాలు
యువకవులకు ప్రోత్సాహం
స్ఫూర్తి నింపు చైతన్యం
కలబోసి ప్రతి యేడు
ఉత్సవాలు చేయుసంస్థ


 రామకృష్ణ ‌తోడు నిలిచె
అరుణ దీప్తు లావరించె
మల్లన్న, కోటయ్య
మాటే సుప్రసాదమాయె
చందు చిరుత నాట్యాలు
సభకు శోభలద్దగా
జాతీయ స్థాయిలోన
తెలుగు కీర్తి చాటు సంస్థ

కళామిత్రమండలి
జ్యోతిర్మయమీ లోగిలి





17.
*ఈ మాసపు మధుగీతం*
గేయ కవితల పోటీ కి

ఎవరు పిలిచేరని ఎదలోకి నిన్ను
కలవోలె నీవిటుల కదలివచ్చేవు

కాటుకల కనులతో కబురంపినానా!
చిరునవ్వుతో నిన్ను స్వాగతించానా!
వణికేటి పెదవితో వలపు తెలిపానా!
అనురాగ రాగాల హారతిచ్చానా! || ‌ ‌||

తళుకు బెళుకులు చిలుకు తారకను గాను
కలలు నిద్దుర లేపు కౌముదిని గాను
మదికి హాయిని గొల్పు మల్లికను గాను
గాలివాటున విచ్చిన గరికపూవును నేను||  ||

నిరుపేద జీవితపు నిండారు ప్రేమనే
ఎదలోతులను వెదకి ఎవరాదరించేరు?
కుళ్ళులోకపు కళ్ళ ముళ్ళదారులలోన
అలసి జీవనజ్యోతి ఆరిపోయే వేళ ||  ||

శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఒంగోలు 

సెల్ నెంబర్
98660 14619












*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

https://m.facebook.com/story.php?story_fbid=563452774027289&id=100010877131389

18.
అన్నగారి జయంతి సందర్భంగా...

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిని నేను.(వెర్రి అభిమానిని మాత్రం కాదు సుమండీ)
మరి ముఖ్యంగా ఆయన పౌరాణిక సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్ ని. నా జీవితంలో నాకు ఇంతవరకూ తీరని కోరిక అంటూ ఏదైనా ఒకటి మిగిలి ఉంది అంటే అది అన్నగారిని ఒకసారి ప్రత్యక్షంగా చూడాలి అన్న కోరిక మాత్రమే.నాకు ఈ మాత్రం భాషా జ్ఞానం, పౌరాణిక సాహిత్యం పై ఆసక్తి అబ్బింది అంటే అది ఖచ్చితంగా చిన్నప్పటినుండి చూస్తూ పెరిగిన అన్నగారి పౌరాణిక పాత్రల చలవే అని చెప్పటంలో ఆవగింజంత అయినా అతిశయోక్తి లేదు.
 ఆయనపై ఇదివరకు పద్యాలు, కవితలు రాశాను.కానీ ఈ జయంతికి ఆయన నటించిన *ఆడబడుచు*చిత్రం లోని 
"అన్నా!నీ అనురాగం
ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా!"
అనే పాటకు పేరడీ రాసి వారికి నివాళులు అర్పిస్తున్నాను.

18
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
అన్నా! నీ జన్మదినం
ఆంధ్రులకందిన పుణ్యఫలం
ఓ అన్నా!నీ జన్మదినం
పుట్టినరోజున నీ సంస్మరణే
చాటునులే మా అభిమానం
ఓ అన్నా! నీ జన్మదినం

రాముడవైనా కృష్ణుడవైనా నువ్వే అనిపించావు
ఎల్లరిమదిలో తెరవేలుపువై నీవే కొలువయ్యావు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
అనితరసాధ్యం నీ నటన
ఓ అన్నా! నీ జన్మదినం||

కురువృద్ధునిగా భీష్మపాత్రలో ఒదిగీ ఒప్పించావు
నర్తనశాలను నరవర నీవే  పేడిగ మెప్పించావు
రారాజైనా రావణుడైనా
అనితరసాధ్యం నీ నటన
ఓ అన్నా! నీ జన్మదినం ||

ఆత్మగౌరవం అన్న నినాదం
ఇచ్చిన స్ఫూర్తి వి నీవే
 ఆడబడుచులకు ఆస్తి హక్కు ను పంచిన అన్నవు నీవే
తెలుగుల నేలి చిరకీర్తి నిలిపిన
అమరుడవయ్యా నటరత్నా!
ఓ అన్నా!నీ జన్మదినం 
తెలుగుకు కలిగిన ఘనతేజం
ఓ అన్నా! నీ జన్మదినం ||

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
28.5.2020.

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

గీతానికి అంజలి
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా

విశ్వకవి రవీంద్రుని గీతాంజలి కావ్యంలోని

Where the mind is without fear
అనే గేయానికి 
నా స్వేచ్ఛానువాదం


19.
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
స్వామీ వినుమా నా వినతి
జాగృతి చేయుము నా జాతి :

భయమును వీడిన భావముతో
బుద్ధి ఎన్నడిక వికసించునో
ఠీవి సడలని నైజముతో
తలవంచకనే బ్రతుకుదుమో
ఎక్కడ శారద విహంగమై
జ్ఞానము స్వేచ్ఛగ విలసిల్లునో

స్వర్గము అదియగును
కలయే నిజమగును

సంకుచితత్వం విడనాడి
స్వార్థపరత్వం పోనాడి
సోదర స్నేహం పాటించి
సమరసభావం సాధించి
ఎక్కడ లోకము ఒక్కటిగా
ముక్కలవక తాను మురిపించునో

స్వర్గము అదియగును
కలయే నిజమగును

సత్యము లోతుల పెల్లుబికి
మాటలు పెదవిని మంత్రములై
వెలువడుచోటే అమరత్వం
అక్కడ వెలయును దైవత్వం
అలుపే ఎరుగని సాధనతో
అంతిమలక్ష్యం అందుటకు
ఎప్పుడు చేతులు చాచెదవో
ఎక్కడ విజయం చూచెదవో

స్వర్గము అదియగును
కలయే నిజమగును

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
టీచర్ @ O P S

7.5.2019

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

20.
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵








*****************************👾👾👾👾👾👾👾👾👾👾****************************

[5/10, 1:59 PM] Jyothirmai Simhadri: 


🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵








[
*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని నేను రాసిన

"భారత రత్నమా
జాతికి దీపమా "
అనే పాటను ఆలపించిన మధుర గాయకుడు
చిరంజీవి నూకతోటి శరత్ కు ధన్యవాదాలు , శుభాశీస్సులు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
14.4.2020

కాగా

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
భారత రత్నమా
జాతికి దీపమా
బడుగుల దైవమై
నడిపిన నేత్రమా!
బాబా సాహెబ్ అంబేద్కర్
భాను తేజమా నీకు జోహార్

పుస్తకాన్ని హత్తుకో
ప్రపంచమే దాసోహం
వేలెత్తి ప్రశ్నించు
జడుస్తుంది జాతిమదం
వేయవోయి ముందడుగు
వెనుకబాటుతనం పరుగు
ఈ స్ఫూర్తి సందేశం
ఇస్తున్నది నీ రూపం
బాబా సాహెబ్ అంబేద్కర్
భాను తేజమా నీకు జోహార్

అజ్ఞానపు అంధ బ్రతుకు
అణచివేత నడ్డగించి
హక్కులిచ్చె మాకు నీ
రాజ్యాంగపు కళ్ళజోడు
కూడలిలో నీ ప్రతిమ
గుర్తుచేయు మా పటిమ
ఈ స్ఫూర్తి సందేశం
ఇస్తున్నది నీ రూపం
రుణము తీర్చుకోలేము
చేతులెత్తి మొక్కేము
బాబా సాహెబ్ అంబేద్కర్
భాను తేజమా నీకు జోహార్


*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************


కరో (నా) పాట

21
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
కరోనా మహమ్మారి పొంచి ఉంది రా
నరజాతిని కబళించే శత్రువంటరా
ప్రపంచమే చిగురాకై వణుకుతుండగా
పట్టనట్టు తిరుగుతావు బాధ్యతేదిరా
మాట విని జాగ్రత్తగ మసలుకొంటివా
భయం భయం భయం భయం
భయం లేదురా

నర్సమ్మ లు డాక్టర్లు నారాయణులై
బ్రతుకు ఫణం పెట్టి వైద్య మందివ్వగా
రోడ్డెక్కిన పోలీసులు నారసింహులై
నయానా భయానా నచ్చచెప్పగా
పారిశుద్ధ్య కార్మికులు సేవచేయగా
విలేఖర్లు వాస్తవాలు విప్పిచెప్పగా
ప్రమాదాన్ని లెక్కించక ఉద్యోగులు
ప్రతీ క్షణం పనిచేయుట నీకు పట్టదా
నివురుగప్పి నిప్పువలే వైరస్సుందిరా
పట్టనట్టు తిరుగతావు బాధ్యతేదిరా

పరిశుభ్రత పాటించుట మరువరాదురా
సామాజిక దూరమే రామరక్షరా
పసివారిని రెప్పవలే కాచుకోండిరా
వృద్ధులంత పసివారని పరిగణించరా
ప్రధాని మన్ కి బాత్ ఆలకించరా
ముఖ్యమంత్రి విన్నపాలు మన్నించరా
ఇటలీలో మృత్యుఘోష గుణపాఠం గా
స్వీకరించి తక్షణమే మేలుకోండిరా
నివురుగప్పి నిప్పువలే వైరస్సుందిరా
పట్టనట్టు తిరుగుతావు బాధ్యతేదిరా

నిర్బంధం ఎన్నాళ్ళని
విసుగుపడకురా
నిరాశతో క్రుంగిపోకు దైవముందిరా
ముప్పులెన్నొ గతంలో దాటించిన 
విజయాలే స్ఫూర్తిగా ఉద్యమించిన
శాస్త్రజ్ఞుల కృషి త్వరలో ఫలితమిచ్చురా
మందుదొరికి మానవాళి వ్యాధి గెలుచురా
అంతవరకు సోదరా సహనముంచరా
దొరికిన ఈ విశ్రాంతి ని అనుభవించరా
మాట విని జాగ్రత్తగ మసలుకొంటివా
భయం భయం భయం భయం భయం లేదురా

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.03 2020

కరోనా పై నేను రాసిన ఈ పాటను పాడిన చిరంజీవి నూకతోటి శరత్ కు ధన్యవాదాలు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
30.03.2020

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జెండా వందనం

22
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
మురిసి ఎగురవేద్దామా
మువ్వన్నెల పతాకం
కలసి మనం చేద్దామా
మనసారా వందనం  ||    ||

వినువీధిని ఠీవిగా
కనువిందుగ ఎగురుతున్న
ముచ్చటైన పతాకాన్ని
రూపొందించిన ఘనుడు
అచ్చమైన ఆంధ్రుడతడు
పింగళి వెంకయ్యగారు  !  !

పొలంలోన వ్యవసాయం
స్వాతంత్ర్య పోరాటం
సవ్యసాచిలా సలిపిన
మహనీయుడు మార్గదర్శి
భరతమాత ముద్దుబిడ్డ
గర్వించెను తెలుగుగడ్డ

త్యాగమనగ ధైర్యమనగ
కాషాయం చాటుతుంది
సత్యాన్ని శాంతిని
తెలుపువన్నె తెలుపుతుంది
సౌభాగ్యం చూడుమదే
ఆకుపచ్చనంటి ఉంది

తెలుపు రంగు మధ్యలోన
ముదురు నీలి వన్నెలోన
అందమైన చక్రమొకటి
హుందాగా నిలిచి ఉంది
సారనాథ్ స్తూపమందలి
ఆ చక్రం అశోకునిది
న్యాయానికి ధర్మానికి 
ప్రతీకగా నిలిచి ఉంది

పదిమందిమి కూడి మనం
పతాకాన్ని ఎగురవేసి
జనగణమన పాడి పిదప
జైహింద్ అని నినదించి
స్వేచ్ఛకొరకు పోరాడిన
త్యాగధనుల సంస్మరించి
జాతిని సేవించినట్టి
మహామహుల గౌరవించి
పండుగనే చేద్దామా
పదంపాడి పరవశించి
ప్రగతి పథం సాగుదాం
పదం కలిపి పరవశించి ‌!‌ !

మా పాఠశాల విద్యార్థుల కోసం‌ నేనురాసిన పాట

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.1.2019


*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************




🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

బాలల దినోత్సవం సందర్భంగా మా విద్యార్థుల కోసం నేను రెండేళ్ళ క్రితం రాసిన పాట.

పిల్లల‌ ఇష్టాలు

23.
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
పిల్లలము మేం పువ్వులము
ఎల్లలు‌ ఎరుగని‌ గువ్వలము
ఊసులు చెబుతాం వింటారా!
మా‌ ఇష్టాలు చెప్పమంటారా!

మా అమ్మ అంటే మాకిష్టం
ఆ చందమామ మా కిష్టం
ఆటలు పాటలు మాకిష్టం
మా బామ్మ‌ కథలు మాకిష్టం "  "

గాంధీ తాతకు మేమిష్టం
నెహురూ మామకు మేమిష్టం
మదర్ థెరిస్సకు మేమిష్టం
కలాము‌గారికి మేమిష్టం ".  "

కోరినవిచ్చే నాన్నాంటె ఇష్టం
చదువులు చెప్పే గురువులు ఇష్టం
చిటపట చినుకుల వానంటె ఇష్టం
ఇష్టాలు కలిసిన స్నేహాలు ఇష్టం ". ‌‌"

వందేమాతర గీతం ఇష్టం
జన గణ మన‌ అని పాడుట ఇష్టం
మానవులొకటను మతమే ఇష్టం
మతములు ‌అంటని ‌దేవుడు ఇష్టం ".   "

బాపూజీ కల స్వఛ్చ భారతం
మేమది సాధించి చూపిస్తాం
భారత దేశపు భావి పౌరులం
నవ భారతమును నిర్మిస్తాం"".     "

        ‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌   సింహాద్రి.

*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

ఎంత కష్టం ?

24
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
 డబ్బు కోసం డాబు కోసం
విదేశాల్లో బ్రతుకుదామని
అయినవారిని కష్టపెట్టి
మాతృభూమిని విడిచిపెట్టి
వలసపోయెడు యువతరానికి
ఎంత కష్టం? ఎంత కష్టం?

అక్కడెక్కడొ రోడ్డు పైన
అడ్డగించిన అసురశక్తులు
ఒక్కసారిగ చుట్టుముట్టి
ఉక్కు పిడికిలి విసిరి నీపై
చిక్కినంత దోచుకొనగా 
నొక్కి గొంతును ఉసురుతీస్తే
దిక్కులన్నీ బిక్కుమనగా
దిక్కుమాలిన శవంలాగా
నెత్తురోడుతు నేలకొరిగే
భారతీయుల కెంత కష్టం?

వార్త తెలిసి నమ్మజాలక
కడుపు కోతను తాళలేక
వయసు మళ్ళిన తల్లిదండ్రులు
వాస్తవమ్మును తలచి తలచి
కొడుకు తమకిక లేడు లేడని
కన్నులారా కాంచబోమని
గోడుగోడున ఏడ్చి ఏడ్చి
గుండె పగిలి కుప్పకూలి
తాముకాటికి చేరువేళ
కన్నబిడ్డను కాటికంపుట
కన్నవారికి ఎంత కష్టం?

నవ్వులొలికే నాన్ననెందుకు
పెట్టెలోపల పెట్టినారో
పిలువడెందుకు?
పలుకడెందుకు?
కన్నుతెరవడు ముద్దులివ్వడు
అనుచు తలచి అర్థమవక
బిక్కచచ్చి గుక్కపట్టిన
చిట్టిపాపల ననునయించుట
ఆప్తబంధుల కెంత కష్టం?

నీదు ఒడిలో సేదదీరగ
వచ్చుచుంటిని వాలనుంటిని
మాటనమ్ము, మనసునిమ్మని
చెప్పిపోతివి చెలిమి మనదని
ఆశ వాకిట వేచియుంటిని
ఆకసమ్మును చూచుచుంటిని
పల్లకీకై పరుగులిడగా
పాడెపైనే పయనమైతివి
చంటిపాపల విడువలేను
విడిచినిన్ను బ్రతుకలేను
దారి ఏది?దిక్కు ఏది?
చావు ఏది?సౌఖ్య మేదని
చూడవచ్చిన వారికన్నులు
చెమ్మగిల్లగ సొమ్మసిల్లిన
ఇంతి దుఃఖం ఎంత కష్టం?
ఎంత కష్టం? ఎంత కష్టం?

2009 లో అమెరికాలో కిరణ్ అనే యువకుణ్ణి  కాస్త డబ్బు కోసం చంపేశారు.అది మా తమ్ముడి‌పేరు.టీ.వీ‌.లో స్క్రోల్ చూడగానే ఒక్క క్షణం నా ఊపిరి ఆగింది.మొత్తం వివరాలు చూశాక కుదుట పడ్డాను గానీ పాపం ఆ కుటుంబం దుఃఖం తలచి కలత పడ్డ మనసుతో ఈ గేయం రాశాను.
ఇది శ్రీ శ్రీ బాటసారి గేయం ప్రేరణతో రాశాను.

సింహాద్రి
12.2.2017.
*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************

మధుర జ్ఞాపకం

సినారె గారి చేతుల మీదుగా ప్రతిభామూర్తి పురస్కారం అందుకుంటూ,ఆయనకు నేను సమర్పించిన కానుక.ఆయన రాసిన పాటల్లో తొలి విఖ్యాతిగాంచిన నన్ను దోచుకొందువటే పాటకు పేరడీ.

25
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵


మధుర జ్ఞాపకం

సినారె జయంతి సందర్భంగా 

సినారె గారి చేతుల మీదుగా ప్రతిభామూర్తి పురస్కారం అందుకుంటూ,ఆయనకు నేను సమర్పించిన కానుక.ఆయన రాసిన పాటల్లో తొలి విఖ్యాతిగాంచిన నన్ను దోచుకొందువటే పాటకు పేరడీ.

మమ్ము దోచుకొంటిరయా
మహాకవి సినారె
జ్ఞానపీఠమెక్కినట్టి
మీ ప్రతిభకు భళారే
మీ ప్రతిభకు భళారే

సినీగేయకవిగ మీరు
చిరకీర్తిని పొందినారు
ఉరుదు గజల్ ప్రక్రియలో
ఉన్న రుచిని చూపినారు
విశ్వంభర మీ హృదయం
ఇంటిపేరు చైతన్యం 
కవిత నా చిరునామా 
అని చాటిన వ్యక్తిత్వం 
అక్షరాల గవాక్షం 


ఆధునిక కవిత్వాన
సంప్రదాయ ప్రయోగములు
పరిశోధన చేసిమీరు
ప్రమాణముగ నిలిపినారు
తెలుగుజాతి మనదంటూ
ఎలుగెత్తిన గళం మీది
ప్రతి పాటలొ కొత్తదనం
చూపించే కలం మీది

నాగార్జున సాగరాన
ఓలలాడె మా మనసులు
మీ నాగార్జున సాగరాన
ఓలలాడె మా మనసులు
లకుమ పాద మంజీరపు
రవళి వినెను మా వీనులు
అక్షయమగు మీ ప్రతిభకు
అక్షరాల వందనమిది
చాలదనక గ్రహించండి
ఆశీస్సులు చాలునండి.

సింహాద్రి జ్యోతిర్మయి
29.7.2018








*****************************👾👾👾👾👾👾👾👾👾👾*****************************


.




26.

కేరళ విలవిల

ఈ జల ప్రళయం
ఏ పాప ఫలం
ఈ పెను విలయం
ఇది ఏ తప్పిద మూల్యం
నిగ్రహాన్ని కోల్పోయిన ప్రకృతి
ఆగ్రహాన ఇటు విరుచుకు‌ పడినది

నిన్నమొన్న ఆ విశాఖతీరం
మరువనెలేదా కడలి దుమారం
ఇపుడీ సుందర కేరళ రాష్ట్రం
పై పగబూనెను వరద ప్రమాదం
పిచ్చుక గూళ్ళై  కూలినవిళ్ళు
పిట్టల తీరున రాలిరి ప్రజలు
ఆదుకోమని అసహాయంగా
ఎదురుచూసిరి భయంభయంగా
అక్కడ ప్రతి నయనం
 కన్నీటి మయం
అట ప్రతి హృదయం 
ఒక స్మృతి గాయం
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం

పశ్చిమ కనుమలు
పదులగు నదులు
వాగులు వంకలు
కొబ్బరితోటలు
భూతల స్వర్గం వేసవి విడిది 
అక్షరాస్యతకు పేరొందినది
పచ్చదనాన్నే చీరగకట్టి
పరవశమందే కేరళ కుట్టి
జడివానలలో పెరియార్ ఒడిలో
కారు చీకటిని కడుచింతలతో
శోభను కోల్పోయి అలమటించెను
శోకదేవతై విలవిల లాడెను
ఆపన్న హస్తం అందించేందుకు
సాయం‌చేయగ పదండి ముందుకు
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం

ఇంటిపైన గల మమకారంతో
అంటిపెట్టుకుని అసువులు బాసిరి
ఊహకు అందని ఉత్పాతంలో
వరదనీటిలో కొట్టుకుపోయిరి
పెళ్ళగించుకొని పోయెను చెట్లు
మృత్యువాతపడె మూగ ప్రాణులు
కుండపోతలో వణికెను కేరళ
గుండెకోతతో దేశం విలవిల
జనజీవనమే అతలాకుతలం
మరుభూమికదే‌ తను మరురూపం
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం

అంతరించిన అడవికడుపులో
దాగిన దుఃఖం పొంగినదేమో
వేదనతో వేడెక్కిన భూమి
వదలిన గాఢపు నిట్టూర్పేమో
నను రక్షించని మానవ జాతికి
మున్నీరేనను హెచ్చరికేమో
నది పాయలుగా 
గిరిచరియలుగా
ఉప్పెన తీరున ఊడ్చిపెట్టినది
కుప్పగ కూలుచు కోతపెట్టినవి
తగు గుణపాఠం ఇక నేర్వాలి
మన భవితవ్యం కాపాడాలి
ఈ జల ప్రళయం ఏ పాప ఫలం

సింహాద్రి జ్యోతిర్మయి
19.8.2018.






27.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా

My voice
Our equal future
నినాదంతో

నా పాట

ఆడపిల్లని 
ఇంటింటి దివ్వెని
చింతలెరుగని
చిన్నారి పాపని
రెక్కరాని గువ్వ నేను
రేకువిడని మొగ్గ నన్ను
చిదిమివేయకు
నా ఉసురుతీయకు

అమ్మ కడుపు లోన
నేను అతి భద్రంగా
రూపుదిద్దుకునేవేళ
రూపుమాపితే
అరచేతులలోన 
నన్ను అపురూపంగా
కాచుకొనుట మాని
విషపు కోర దించితే
మనగలనా!
నీవు మనిషి వనగలనా!
స్వచ్ఛమైన చూపుకొరకు
స్వేచ్ఛ నిచ్చు జగతికొరకు
ఎదురుచూసి ఎదురుచూసి
పరితపించిపోతున్న ||. ||

ఆడపిల్లని
అసహాయురాలిని
కష్టమిది అని
చెప్పలేని దానిని
రెక్క రాని గువ్వ నేను
రేకువిడని మొగ్గ నేను
చిదిమివేయకు
నా ఉసురుతీయకు

పసిదేహం పైన
నీ పంటిగాటులు
ఓర్చుకోలేక
పెనుగులాడినప్పుడు
పశువల్లే మీదపడి
కుమ్ముతుండగా
కాపాడరండంటూ
అరచినప్పుడు
ఆ సమయం
అనుక్షణం ఒక నరకం
వెన్ను విరిచివేశావు
 నాలుకనే కోశావు
చిత్రహింస సాక్షిగా
ఛిద్రమైన దేహంతో
మరణంలో సేదదీరి
చితిని మండినట్టి నేను || ||

ఆడపిల్లని కాను నేను ఆటబొమ్మని
అనుభవించనీ
స్వేచ్ఛ తోటి
  నా హక్కుని
రెక్క రాని గువ్వ నేను
రేకు విడని మొగ్గ నన్ను
చిదిమి వేయకు
నా ఉసురుతీయకు

ప్రేమనేరమంటు
నా మెడలువంచకు
పరువుపోయెనంటు
బ్రతుకు కాలరాయకు
వలపు వలలు పన్ని
నన్ను మోసపుచ్చకు
వావి వరుస విస్మరించి వేధించకు
తరిమేవా!
తనువంతా తడిమేవా!
నిర్భయమ్ముగా
నన్ను బ్రతకనివ్వమంటున్నా 
దశనుమార్చి మానవతకు
దిశను చూపమంటున్న || ||

ఆడపిల్లని
పెరటి తులసికోటని
జాతి భవితని
రేపు నిన్ను కనే అమ్మని
రెక్క రాని గువ్వ నేను
రేకు విడని మొగ్గ నేను
చిదిమి వేయకు
నా ఉసురుతీయకు


నమస్తే ఆనంద్ గారూ!
నేను సింహాద్రి కిరణ్ వాళ్ళ అక్కని.అప్పుడెప్పుడో కిరణ్ అడిగితే మనబడి కోసం ఒక పాట రాశాను.ఈ రోజు పాత పుస్తకాలు సర్దుతుంటే అది దొరికింది.అందుకని,మీ పేజ్ లో పోస్ట్ చేస్తున్నాను.

మనబడి

ఇదే ఇదే మనబడి
ఇంపైన చదువులగుడి
అమెరికా నేలమీద
అచ్చతెలుగు అమ్మ ఒడి

భాషతోటి సంస్కృతి
నిలుస్తుంది బలపడి
బ్రతుకుతెరువు దారిలోన
సేదదీర్చు నీడ అది
మా నేలను మా తెలుగు ను
మరచిపోము మేమని
ఋజువు చేసుకొందుము
ఋణముదీర్చుకొందుము

ప్రఖ్యాత తెలుగు సంస్థ
అది సిలికానాంధ్ర
అందులోని భాగము
మనబడి అను పథకము
రూపకర్త కూచిభట్ల
కులపతియే చమర్తి
పాఠ్యభాగ ప్రణాళిక
కూర్చి తీర్చె శాంతి

ఏడంచెల చదువులో
ఎన్ని తెలుగు వెలుగు లో
ఒకటి రెండు *బాలబడి*
*ప్రవేశం* తదుపరి
వికసిస్తే *ప్రసూనం*
వెలిగితే *ప్రకాశం*
చదివితే *ప్రమోదం*
పరిపూర్ణం *ప్రభాసం*

అమెరికా గడ్డమీద
ఏడేళ్ళ ప్రయాణం
లాసేంజిల్స్ నగరంలో
ఐదేళ్ళ ప్రస్థానం
పదులతోటి మొదలయ్యి
వందలయ్యె ఆ క్రమం
ముద్దు ముద్దు మాటనేర్చు
ముచ్చటైన బాలలు
విదేశీ కొమ్మమీద
తెలుగు పలుకు చిలుకలు

బాలానందము కూర్చి
మాట్లాటలు నేర్చి
సంప్రదాయ కళలకెల్ల
ఆలంబన తానిచ్చి
వేదికయ్యె మనబడి
వేడుకలకు ఒరవడి
నలుదిక్కుల ఘనకీర్తిని
చాటుదాం పదపడి

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
26.1.2022


30
ఒక సంవత్సరం 10 th class పిల్లల ఫేర్వెల్  కి (సంవత్సరం గుర్తు లేదు కానీ ఆ సంవత్సరం ఎగ్జామ్స్ అయిపోయాక ఫేర్వెల్ చేశాము)
*మనం* సినిమా లోని
కనిపెంచిన మా అమ్మ కే అమ్మయ్యానుగా 
పాటకి పేరడీ తో విద్యార్థులకు నేనిచ్చిన గిఫ్ట్

కనిపెంచిన తలిదండ్రుల ఆశలే మేముగా
చదివించిన మా గురువుల శ్రమఫలం మేముగా
ఒకరిది మమత
ఒకరిది బాధ్యత
ఇరువురి కల మా రేపటి భవిత
ఒకరిది లాలన
ఒకరిది శిక్షణ
ఇరువురి పరువును నిలిపే ఎగ్జామ్స్
ఐపోయాయీ గుండె బరువే తీరెగా
వెయిట్ చేస్తున్నాం
తొలి ఫలితం అందగా
ఇది చదివిన చదువుకు
ఫలితమునందే క్షణము కదా హహహహ

తెలుగు ఇంగ్లీష్ క్లాసులొ విన్నంత తేలిక కాదు అని
హిస్టరి జాగ్రఫి ముక్కున పెడితే మార్కులు రావు అనీ
మ్యాథ్స్ కి ప్రాక్టీసు కావాలని
బయాలజీ బాగ చదవాలని
పదే పదే మాకు సూచించిన
మా టీచర్ల మాటలు నిజమని ఋజువై
తెలిసొచ్చింది మాకపుడే తేటగా
బుద్ధొచ్చింది నిర్లక్ష్యం వదలగా
ఇది చదివిన చదువుకు ఫలితమునందే క్షణము కదా హహహహ

భయపెట్టే ఆ ఫిజిక్సు పేపరు భరోస నిచ్చింది
కష్టం అనుకున్న కెమిస్ట్రి కూడా గట్టెక్కించింది
హిందీ అంటే దిగులే లేదు
కంప్యూటర్లో నూటికి నూరు 
వస్తాయని పేరు తెస్తామని
ఘన విజయం మాదని గర్వం గా మేం
మాటిస్తున్నాం మా కష్టం సాక్షిగా
నమ్మకముంది మా గుండెల నిండుగా
ఇది చదివిన చదువుకు ఫలితమునందే క్షణము కదా హహహహ

అమ్మానాన్నల కాళ్ళకు మొక్కి అందిన దీవెనలు
గుడిలో స్వామికి దండం పెట్టి కోరిన కోరికలు
గురువులు ఇచ్చిన సలహాలూ
గుండెల నిండా స్వప్నాలు
తప్పక ఫలించి తల ఎత్తుకుని
బడి విడి మేము బైటకు వెళతాం
స్నేహితులారా! వీడ్కోలే పలుకుతూ
గురువుల్లారా!మరవద్దని కోరుతూ
ఇది భవితను వెతుకుతు
బయటకు సాగే అడుగు కదా హహహహ

సింహాద్రి జ్యోతిర్మయి 
ICSE School
 తెలుగు టీచర్


29.
అమృత తుల్యం

అమృత తుల్యమైన భాష
అందమైన మన‌ తెలుగు 
వెయ్యేళ్ళ సాహిత్యపు
 సౌరభమే తన‌ సొబగు
అన్యభాష లేవైనా
అచ్చులతో ఊతమిచ్చి
అక్కుజేర్చు సహృదయత
ఆ తల్లి కంట వెలుగు

కనులారా చూడు తనది
ఒద్దికైన ఆకృతి
నోరారా పలుకు పదం
తేనెలూరుతుంటుంది
వీనులారా విన్నావా
సాహిత్యం చెవులకింపు
చేతులార దిద్దావా
హొయలు చిలుకుతుంటుంది

భాషామతల్లి మెడను
మల్లె పూదండ తెలుగు
వెయ్యేళ్ళ సాహిత్యపు
సౌరభమే తన‌ సొబగు 


అనుభవాల సార నిధులు
అడుగడుగున సామెతలు
అందమైన పలుకుబడులు
నుడికారపు ఆమెతలు
బాలపాపలను దిద్దే
నీతి సుధలు శతకాలు
వైరాగ్యపు భావఝరులు
తలపండిన తత్వాలు

అల్లూరి సాహసాల
ప్రకాశమే మన తెలుగు
వెయ్యేళ్ళ సాహిత్యపు
సౌరభమే తన‌ సొబగు 

ప్రబంధాలు పదకవితలు
భావకవిత మధురిమలు
గురజాడ అడుగుజాడ
గుచ్చె ముత్యాలసరులు 
నవకవితలు  అభ్యుదయపు 
రాళ్ళెత్తిన కూలీలు 
అనుభూతులు రుచిచూపెను
అమృతాల విభావరులు 

దేశభాషలందులెస్స
అన్న ఖ్యాతి గన్న తెలుగు
వెయ్యేళ్ళ సాహిత్యపు
సౌరభమే తన‌ సొబగు

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

31.మణిపూర్ దుర్ఘటన 

ఉలికిపడ్డ దేశమా!
సిగ్గు సిగ్గు రాజ్యమా!
దుశ్శాసన పర్వానికి
ధృతరాష్ట్రుని సాక్ష్యమా!
ఇదేనా మన ఘనత
ఇదేనా మన ప్రగతి
ఇది నాటి భారతమా
లేక నేటి భారతమా


ప్రజాస్వామ్య విలువలకు
వలువలూడదీశారు
పదుగురిలో నడిరోడ్డున 
నగ్నంగా నడిపారు
వేదభూమి మాదంటూ
అతివ మాకు వేలుపంటూ
చెప్పుకునే గొప్పలన్ని
చేతలలో కానరాక
ప్రపంచంముందు పరువు
మేడిపండు తీరవగా
భరతమాత మువ్వన్నెలు
 అవమానం పాలుకాగ
జాత్యహంకారానికి
జగతి విస్తుపోతోంది

ఉలికిపడ్డ దేశమా!
సిగ్గు సిగ్గు రాజ్యమా!


తరిమి తరిమి కొట్టారు
వెతికి వెతికి నరికారు
అంతటితో కసితీరక
ఆడవార్ని చెరిచారు
ప్రసవించిన‌ నేరానికి
జననాంగం  బాధతో
పాలిచ్చిన పాపానికి
పాలిండ్లే జాలితో
దాడిజరుగుతున్నవేళ
 ముడుచుకోను దారిలేక
అందరిలో అమ్మతనం
విలవిలవిలలాడింది
 మానవతకు గుండెకరిగి
కనులవెంట జారింది

నీరు కాదు కనులవెంట
నిప్పుకణిక లెగయాలి
ఆగ్రహాల జ్వాలలోన
మదాంధులను దహించాలి
సహనమనే ఆనకట్ట
తెంచి వెల్లువవ్వాలి
నిరసనతో ఆగరాదు
నిజం నిగ్గు తేల్చాలి
అందరం ఒకటవుదాం
అధర్మాన్ని ఖండిద్దాం 
బాధితులకు బాసటై
నిలిచి నమ్మకాన్నిద్దాం
ఓదార్పు మైపూతల
గాయాలను మాన్పిద్దాం

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.7.2023

32.బడికి పోదాం

చదువు విలువ తెలుసుకోర తమ్ముడా!
బడి బాటయె భవిత బాట చెల్లెలా !
చిట్టి చిట్టి కూనలార!
మా రేపటి పౌరులార!
మీకోసం‌ చదువులమ్మ
గుడి తలుపులు తెరిచారు  ||   ||

ఆడపిల్ల చదువు కాదు కాదు బరువు 
ఆడపిల్ల చదువు దేశమాత పరువు 
సావిత్రి పూలేలు సరోజినీ నాయుళ్ళు 
మీలోనే ఉన్నారు
మొల్లవంటి కవయిత్రులు 
ఇందిరమ్మ వంటినేత
లింకెందరొ ఉన్నారు
ఇంజనీర్లు డాక్టర్లు 
ఇంకెన్నో పదవులు 
రాణులై మీరేలగ 
రాణించగ వేచినవి
వడివడిగా బడికి నడువు చెల్లెలా 
బడిబాటయె భవిత బాట చెల్లెలా 


ఉచిత విద్య అందించగ
సిద్ధమయ్యె
ప్రభుత్వ బడులు 
చదువుకొనుట మీ హక్కు
 కాదన్నవారు దోషులు
అక్షరమే నిచ్చెనగా
అంబేద్కరు ఎదిగాడు
జ్ఞానమే సంపద అని
కలాము గారన్నారు
బడి తరగతి గదిలోన
నాలుగు గోడల మధ్యన 
 రూపొందే చిరుతలార !
 దేశభాగ్య ధాతలార!
వడివడిగా బడికి కదులు తమ్ముడా!
బడిబాటయె భవిత బాట తమ్ముడా!

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
22.6.2024
శనివారం

33

*పితృదేవోభవ*
 
నాన్నా! నీకు వందనం
పితృదేవోభవ 
నీ యందు సార్థకం

అమ్మ కడుపులోనె నన్ను చిదమనందుకు
మీ అమ్మ రూపుగా 
నన్ను తలచినందుకు 
నాన్నా! నీకు వందనం
పితృదేవోభవ నీయందు సార్థకం 

నేను కన్ను తెరచు వేళకై కాచుకొంటివి 
పుట్టిపుట్టగానె ఎదకు 
హత్తుకొంటివి
పాపవమ్మ నా కంటి పాపవంటివి
నీ చేతుల కోటను యువరాణినంటివి 
వెలలేనిది నీ ప్రేమ 
నాకు సొంతము 
దైవముగా పూజింతును
నిను జీవితాంతము


ఓ నాన్నా నీకు వందనం 
పితృదేవోభవ నీయందు సార్థకం 

నీవు పడిన కష్టమే 
నా చదువులు 
నీ చెమట చుక్కలే
నా నగల కాంతులు 
మోసినావు‌ నాన్న
నా కలల పల్లకి
నీ రెక్కలె నిచ్చెన 
నా జీవితానికి
నేడు నీవు లేకున్నా 
నీ దీవెనున్నది 
రామరక్షగా నన్ను
కాపాడుతున్నది

నాన్నా నీకు వందనం 
పితృదేవోభవ నీయందు సార్థకం 

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
జూన్ 1 2024







 

 
34
*ఓటు నా ఉనికి*

ఓటంటే ఆత్మగౌరవం
ఓటంటే ప్రజా నిర్ణయం

జాతిమతం కులమెంచని
ప్రజాస్వామ్య దేశంలో
ప్రశ్నించే హక్కు కొరకు
సిరా చుక్క నద్దుకొని
వేలువంచి చేయునట్టి
సామాన్యుడి శాసనం‌ || ||

ప్రజల చేత ప్రజల కొరకు
ప్రజల వలన ఏర్పడే
ప్రభుత్వాన్ని ఎన్నుకునే
వెలలేని నీ హక్కుకు
వెలకడితే మోసపోకు
నోటుచూసి ఊగి ఊగి
ప్రలోభాల ఎరకు లొంగి
పొల్లు మాటలకు పొంగి
అవివేకం చూపితే
అయిదేళ్ళూ అధోగతే || ||

ఓటు నీ కన్నతల్లి
ఇవ్వాలి గౌరవం
ఓటు నీ తోబుట్టువు
చూపాలి ఆదరం
ఓటు నీ చంటిబిడ్డ
కాచుకొనుట అవసరం
ఓటు నీ అభిమానం
అమ్ముకుంటె ఆత్మ ద్రోహం ||‌‌ ||

ప్రశ్నించే నీ హక్కును
కాలరాసుకోకు
సాధించే అవకాశం
కాలదన్నుకోకు
దేశప్రజల భవితవ్యం
పాడుచేయబోకు
దేశమాత ఔన్నత్యం
వన్నె తగ్గనీకు || ||

దొంగ ఓటు వేస్తివా
దేశద్రోహి వవుతావు
ఓటే వేయ మానితే
జీవచ్ఛవమవుతావు
ఓటును వ్యర్థం చేస్తే
బాధ్యతా రాహిత్యం 
ఓటునమ్ముకొనుట అదే
దేశమాత కపచారం
ఓటుహక్కు వినియోగం
పరమోజ్వల భారతం || ||

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.3.2024

*Red cross day*
May 8th
35.
మానవతకు సంకేతం
మానవాళికొక నేస్తం
సహాయమే సందేశం
సేవలన్ని స్వచ్ఛందం
రెడ్ క్రాస్ రెడ్ క్రాస్
రెడ్ క్రాస్ రెడ్ క్రాస్

ఆస్ట్రియా యుద్ధం లో అసహాయంగా
గాయపడిన స్త్రీ పురుషులు దయనీయంగా
కళ్ళెదుటే మరణించిన ఆ దృశ్యము
కని చెలించె హెన్రీ అంతరంగము
ఆ చెయ్యే తగిన సాయ మందించింది
అదె మానవధర్మమని ఎలుగెత్తింది
మహనీయుని ఆ మహా సంకల్పమే
విస్తరించి విశ్వానికి గొడుగు పట్టిన
రెడ్ క్రాస్ రెడ్ క్రాస్
 రెడ్ క్రాస్ రెడ్ క్రాస్

కులం మతం జాతి ప్రాంత భేదభావమే
కానరాని నిష్పాక్షిక అరుణ కేతనం
రక్తనదులు పారించే స్వార్థజగతిలో
రక్తదాన నిధి కల్గిన అమృతభాండం
ప్రకృతి లో వైపరీత్య మెపుడుకల్గినా
ప్రమాదాలు,ఉపద్రవాలు ముంచుకొచ్చినా
ముందుకొచ్చి అందించే సకలసేవలు
వెలకట్టగ లేనివనుట విశ్వజనీనం
రెడ్ క్రాస్ రెడ్ క్రాస్
 రెడ్ క్రాస్ రెడ్ క్రాస్

కనీవినీ ఎరుగనట్టి మహాకష్టము
జగతికొచ్చి తల్లడిల్లిపోవు వేళలో
ఆ నలుగురు నడిచె మీవాళ్ళకోసము
ఆత్మీయుల జాడలేని చివరియాత్రలో
ఆ సేవలు మరవద్దని మా విన్నపం
మానవతకు మచ్చుతునక రక్తదానము
సామాజికసేవలో భాగమౌతాం
అని చేద్దాం అందరం ఐక్యనినాదం
రెడ్ క్రాస్ రెడ్ క్రాస్
 రెడ్ క్రాస్ రెడ్ క్రాస్

రెడ్ క్రాస్ డే కి
ఈ 2022  
 థీమ్
*Be humankind*

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

చిన్న బుజ్జి పాట
36.
వస్తున్నా వస్తున్నా 
మీకోసం వస్తున్నా
జన్మభూమి రుణం కొంత
తీర్చుకోను వస్తున్నా
చంద్రన్న పాలనలో
భాగమవగ వస్తున్నా
 మీ హక్కులు లోక్ సభ ను
సాధించగ వస్తున్నా !
దగ్గుమళ్ళ ప్రసాదును
నేను మీ వాడను 
వస్తున్నా వస్తున్నా
 మీకోసం వస్తున్నా 

రైతన్నకు సాయమై
నేతన్నకు నేస్తమై
 బాపట్లకు బాసటై
చంద్రన్నకు చేదోడై
ప్రసాదరావన్న పేరు
ప్రజల పరం చేస్తున్నా
వస్తున్నా వస్తున్నా
 మీకోసం వస్తున్నా 

జన్మనిచ్చి ఈనేల జ్ఞానమిచ్చినందుకు
శక్తినిచ్చి ఈ ఊరు
సకల మొసగినందుకు
కృతజ్ఞతను చాటగా
మీ సేవను తరించగా
వస్తున్నా వస్తున్నా
 మీకోసం వస్తున్నా 

సాధించిన నీ ఫలాన్ని
సంఘానికి తిరిగివ్వు
అన్నాడు అంబేద్కర్ 
ఆ మాటే వేదవాక్కు
పాటించగ మీ ముందుకు
ప్రజాసేవ చేసేందుకు
వస్తున్నా వస్తున్నా
 మీకోసం వస్తున్నా 

మన సాగరతీరంలో
సంపదనే సృష్టించగ
ఉన్నచోటె ఉపాధిని
మన యువతకు కల్పించగ
మన వాడల నేతపనికి 
మహర్దశను సాధించగ 
వస్తున్నా వస్తున్నా
 మీకోసం వస్తున్నా

మన అన్న నందమూరి
పాటించిన ఆదర్శం
మన నారా చంద్రన్న
చూపించిన అభ్యుదయం
మరోసారి మనకిప్పుడు
కావాలని మిమ్ముకోర
వస్తున్నా వస్తున్నా
 మీకోసం వస్తున్నా

37.చిన్న బుజ్జి పాట-2

ఊరువాడ ఏకమై
తెలుగు దేశమా
ఉద్యమించి కదలిరా
తెలుగు తేజమా!
దగ్గుమళ్ళ ప్రసాదును
‌ లోక్ సభకు అభ్యర్థిగ
మీ ముందుకు వచ్చాను
మీ ఓటును కోరాను
బాపట్లను గెలిపిస్తే
తెలుగు దేశమా
బాగుచేసుకుందాము
తెలుగు తేజమా



నందమూరి స్థాపించిన
చంద్రన్న నడిపించిన
మన పార్టీ నీనాడు
గెలిపించగ ప్రతిన బూని

ఊరువాడ ఏకమై తెలుగు దేశమా!
ఉద్యమించి కదలిరా
తెలుగు తేజమా!

అమరావతి రాజధాని
ఆ స్వప్నం కూలదోసి
ఇటుకైనా పేర్చకుండ
ఐదేళ్ళూ గడిపేసి
ఉచితాలను ఎరవేసి 
ఖజానాను ఊర్చేసి
అభివృద్ధికి ఆనవాలు
కానరాకుండ చేసి
ఓట్లడిగే ప్రభుత్వాన్ని
ఓడించగ సిద్ధమని

ఊరువాడ ఏకమై తెలుగు దేశమా!
ఉద్యమించి కదలిరా
తెలుగు తేజమా!

అంబేద్కర్ పేరనున్న
విదేశీ విద్యకు
ఆ ఘనతను తొలగించి
తన పేరును తగిలించి
గుండెల్లో కట్టుకున్న
ఆలయాన్ని కూల్చివేసి
సామాజిక న్యాయశిల్ప
మంటు ప్రజను మభ్యపెట్టి
మాయజేయు ప్రభుత్వాన్ని
కూల్చేందుకు సిద్ధమని

ఊరువాడ ఏకమై
తెలుగు దేశమా
ఉద్యమించి కదలిరా
తెలుగు తేజమా 

సుందూరు అమృతలూరు
వేమూరు కొల్లూరు
 భట్టిప్రోలు చెరుకుపల్లె
నాగారం రేపల్లె
 పిట్టలవాని పాలెము
నిజాం పట్నము
బాపట్ల చినగంజాం
కర్లపాలెము
ఇంకొల్లు ప్రజలారా!
యద్దనపూడి వాసులార!

కారంచేడు మార్టూరు
పర్చూరు అద్దంకి 
కొరిశపాడు బల్లికురవ 
జనకవరం పొంగులూరు
చీరాల మద్దిపాడు 
వేటపాలెము
సంతమాగులూరు 
చీమకుర్తిని
సంతనూతలపాడుని
 ఓటునిమ్మని
నాగులుప్పలపాడు
మండలాలని

పేరు పేరునా పిలుస్తున్నా
ప్రతీ మండలం నేనొస్తున్నా
తలచి మీ వాడిగా నను నమ్మండి 
తొలి అవకాశం నాకివ్వండి
దగ్గుమళ్ళ ఇంటి పేరు
ప్రసాదరావ్ నా పేరు

ఊరువాడ ఏకమై
తెలుగు దేశమా
ఉద్యమించి కదలిరా
తెలుగు తేజమా

 అన్నగారు ఇచ్చె 
మనకు ఆత్మగౌరవం
చంద్రబాబు నిర్మించును
ముఖ్యపట్టణం
శ్రమశక్తికి పట్టం కట్టు
సైకిల్ గుర్తు 
చంద్రన్న ఏలుబడే
ప్రగతికి మెట్టు
సమాజమే దేవాలయం
మీ ఓటే ప్రసాదం
లోక కల్యాణమింక
సాధించగ సిద్ధమని

ఊరువాడ ఏకమై
తెలుగు దేశమా
ఉద్యమించి కదలిరా
తెలుగు తేజమా

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

38.
ఒక రైతు గోడు 

దేశానికి వెన్నెముకను
నేనంటిరి నిజమేనా!
అన్నదాత అన్న పిలుపు
వట్టి నోటి మాటేనా!
మీ అందరినీ (పాలకులారా!)
ప్రశ్నిస్తున్నా!
నిరసన గళమై నిలదీస్తున్నా!(నినదిస్తున్నా!)

కానరాక వానచుక్క
వృధా అయ్యి చెమటచుక్క
రాలు కన్నీటి చుక్క
తుడిచేవారెవ్వరని
వెతికి వెతికి వేసారి
పురుగుమందుతో గొంతును
తడుపుకున్న నా నోట
నురగలుగా వెల్లువైన
తుది ప్రశ్నను వింటారా!

దేశానికి వెన్నెముకను
నేనంటిరి నిజమేనా!
అన్నదాత అన్న పిలుపు
వట్టి నోటిమాటేనా!

రాబడిపై హక్కులేని
బడుగు జీవి నేనని
పండించే పంటకు నే
ధరను కోరరాదని
అన్నందుకు ఉద్యమిస్తె
అదే మహా నేరమా!
పిడికెడు మెతుకులు పెట్టే 
ఈ పిచ్చుకపై బ్రహ్మాస్త్రమ!
రైతే రాజంటారు
బంటు విలువ నాకివ్వరు


మీ అందరినీ (పాలకులారా!)
ప్రశ్నిస్తున్నా!
నిరసన గళమై నిలదీస్తున్నా!(నినదిస్తున్నా!)


దేశానికి వెన్నెముకను
నేనంటిరి నిజమేనా!
అన్నదాత అన్న పిలుపు
వట్టి నోటి మాటేనా!

అలుగుట ఎరుగని నేనే
పొలం గట్టు దాటితే
నడుం వంచడం మాని
నాగలినే వీడితే
మీ నాలుగు వేళ్ళకు
అంటేదెలా ఎంగిలి?
అన్నమో రామచంద్రా!
అన్నా తీర దాకలి
దేశానికి వెన్నెముకను
నేనంటిరి నిజమేనా!
అన్నదాత అన్న పిలుపు
వట్టి నోటి మాటేనా!



చేసేందుకు వ్యవసాయం
అందేందుకు ఫలసాయం
అందకుంటె మీ సాయం
నా సహనం చచ్చిపోయి రణమౌతుంది
నేలతల్లి గుండె పగిలి
బీడవుతుంది 
కంటితుడుపు చర్యలతో
కడుపుమంట తీరేనా!
రైతు నుసురు పెట్టు ప్రభుత
రామరాజ్య మయ్యేనా 

దేశానికి వెన్నెముకను
నేనంటిరి నిజమేనా!
అన్నదాత అన్న పిలుపు
వట్టి నోటి మాటేనా!

ఉత్పత్తికి వెలకట్టే
వ్యాపారుల కున్న హక్కు
నమో నమో నారాయణ!
మాకేల ఉండరాదు
ప్రశ్నించే మా గొంతును
నొక్కేస్తే గర్జిస్తాం
ప్రాణాలను ఫణం పెట్టి 
మా హక్కును సాధిస్తాం
అరచేతిని అడ్డు పెడితె
సూర్యకాంతి ఆగునా 
ఉక్కుపాద మెత్తితే
ఉద్యమాలు అణగునా !

జైకిసాన్ జైకిసాన్ జైకిసాన్


సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
21.2.2024

39.
వందేమాతరం గీతానికి
స్వేచ్ఛానువాదం

వందనమో భరతమాత వందనమమ్మా
మమ్ము గన్న మా తల్లి వందనమమ్మా

శుభ్రమైన జలములు 
తీయనైన ఫలములు 
చల్లనైన కొండగాలి
కనులకింపు పైరుపచ్చ
కలిగి ఉన్న జనని నీకు వందనమమ్మా 
మమ్ము గన్న మా తల్లి వందనమమ్మా

వందనమో భరతమాత వందనమమ్మా

స్వచ్ఛమైన వెన్నెలలో
పులకితమౌ రాత్రుల
అరవిరిసిన పువ్వులతో
అలరు చెట్టు చేమల
మదిదోచే చిరునవ్వుల
మధురమైన వాక్కుల
సుఖములొసగి వరములిచ్చు చక్కనితల్లీ
వందనమో భరతమాత వందనమమ్మా
మమ్ము గన్న మా తల్లి వందనమమ్మా

40
*యుద్ధనౌక గద్దరన్న కు నివాళి*

అస్తమించిన అరుణకిరణమా
మా గద్దరన్న
వాలిన పొద్దున రాలిన తేజమా
మా గద్దరన్న
మా పాటవై వచ్చీనావయ్యో
మా గద్దరన్న
నీ పాదాలకు వందనాలయ్యో
మా గద్దరన్న 

పల్లెబ్రతుకు చూసీనావు
కంటా నీరు బెట్టీనావు
ఉజ్జోగం యిడిసీనావు
పోరూ బాట పట్టీనావు
గొంతూ విచ్చి పాడీనావు
గజ్జె కట్టీ ఆడీనావు
యుద్ధనౌకవై బతికినావయ్యో 
మా‌ గద్దరన్న 
తూటామోసి తిరిగి నావయ్యో
మా గద్దరన్న 
ఆకాశం పిలుస్తోందని  
బయలెల్లీనావొ
 నేలమ్మకు వీడుకోలిదే 
అని పలికీనావో

అస్తమించిన అరుణకిరణమా
మా గద్దరన్న
వాలిన పొద్దున రాలిన తేజమా
మా గద్దరన్న
మా పాటవై వచ్చీనావయ్యో
మా గద్దరన్న
నీ పాదాలకు వందనాలయ్యో
మా గద్దరన్న 




బండెనక బండికట్టి అని పాడితె సై యంటిమి
పొడుస్తున్న పొద్దుమీద
పాటకడితె జై కొడితిమి
కొడుకో కొమరన్న జర భద్రమంటె ఊకొడితిమి
అలుపెరుగని పోరాటాలతో 
మా గద్దరన్న 
గుండె ఆగుతాను అనబట్టేనో
 మా గద్దరన్న 
మా పాటవై పోతుంటివో పైలోకాలకు
ఎర్రజెండవై ఎగురుతావులే
 మా బాగుకొరకు


అస్తమించిన అరుణకిరణమా
మా గద్దరన్న
వాలిన పొద్దున రాలిన తేజమా
మా గద్దరన్న
మా పాటవై వచ్చీనావయ్యో
మా గద్దరన్న
నీ పాదాలకు వందనాలయ్యో
మా గద్దరన్న 

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
7.8.2023

41
ఆ నలుగురు సినిమాలో
ఒక్కడై రావడం పాట ట్యూన్ లో

పాటవై తీయగా
మాటవై హాయిగా
మనసులే దోచిన
మా బాలూ
నిండు నీ గానమే
పండితారాధ్యమై
చేసెనే గళముతో
చేవ్రాలూ

అల్లరి పాటల చిరునామా
భక్తికి నీవొక సుస్వరమా
శ్రుతిలయలే జతపడిన
మిధునాలూ
నీ పాటలూ
నీ పాటలూ
నీ పాటలూ||

శంకరాభరణమో
గాన గంధర్వమో
నేలపై బాలుడై నడయాడే
పాట పంచామృతం
పంచినా మధు పికం
సెలవనీ పయనమై దివికేగే
తుంబుర నారద గానసుధ
సినిమా పాటగ స్థిరపడగా
స్వరములకే అభిషేకం
చేసెనుగా
నీ పాటలూ
నీ పాటలూ
నీ పాటలూ||

మృతియనే సాగరం
కోరి నీ సంగమం
వ్యాధిగా తనువునే
వేధించ
అలసితీ సొలసితి
శరణిదే జొచ్చితి
అంటివో దైవమే
ఒడిజేర్చే
ఏ దివి పారిజాతమిది
భువిలో పాటల పరిమళమే
వెదజల్లీ 
తరలినదీ వాసంతం
స్మృత్యంజలీ
స్మృత్యంజలీ
స్మృత్యంజలీ||

సింహాద్రి జ్యోతిర్మయి
25.9.2021


42
రామ రామ రామ లాలి నీకు పాడనా
రామరక్ష చెప్పి ఎత్తి ముద్దులాడనా

దేవతలే నీ రూపున
పంపిరేమొ తమ దీవెన
దాగిఉన్న వేమిటట
మూసి ఉన్న నీ గుప్పిట

రామ రామ రామ లాలి నీకు పాడనా
చిట్టి కన్న నిన్ను ఎత్తి ముద్దులాడనా 


నెలలు నిండి కలలు పండి
అమ్మకందె చందమామ
మా నాన్నే మళ్ళీ పుట్టా
డనుచు మురిసె తండ్రి ప్రేమ
రామకృష్ణ రాజుగారు మీరేనని
తలచిన నాన్నమ్మ కిక నిత్య పున్నమి

ఇష్టకామ్యసిద్ధివయ్య మాకు నాయనా
కష్టమంటె రానీయక కాపుండనా

రామ రామ రామ లాలి నీకు పాడనా
చిన్ని కన్న నిన్ను ఎత్తి ముద్దులాడనా!
గుక్కపట్టి ఏడ్వకురా గుండె చెదిరిపోవును
బోసినవ్వు రువ్వితె మై మరచిపోదును
రోజుకొక్క వింతగా విద్యలు చూపి
ఇంతింతై ఎదగరా
చిట్టిచంద్రమా
బుజ్జి బొజ్జ నిండుగా పాలనుతాగి
నిండారా నిదురపో ఊయలలూగి 

రామ రామ రామ లాలి నీకు పాడనా
రామరక్ష చెప్పి ఎత్తి ముద్దులాడనా

మా చిన్ని యువరాజా! ముద్దులొలుకు ముత్యమా
రాళ్ళబండి వంశాన్నిక
వెలిగించే దీపమా
చక్కదనము చూసి రామచంద్రుడందునా
చిలిపితనము చూసి చిన్ని కృష్ణుడందునా
చూడవచ్చు వారి మదికి హాయినివ్వరా
అక్క చైతమ్మతో ఆడిపాడరా
రామ రామ రామ లాలి నీకు పాడనా 
రామరక్ష చెప్పి ఎత్తి ముద్దులాడనా!
లాలి లాలి లాలి లాలి లాలి జో జో
హాయి హాయి హాయి హాయి హాయి జోజో

అమ్మమ్మ 
సింహాద్రి జ్యోతిర్మయి 
23.9.2023

43
ఓం శ్రీ గురుభ్యోనమః 

ఈ భువిపై వెలసిన దైవరూపమై 
అజ్ఞానము నణచే దివ్య దీపమై 
ఈ గురువే శిష్యుల నాదరించెనే

మీ యోచనే జ్ఞానతరగలై 
మీ మాటలే వెలుగుదారులై
ఆధ్యాత్మిక జగతిని కాంతులీనెనే

ఉపనిషత్తులకు సరళభాష్యములు 
వ్రాసినారు గద మీరే
గుహ్యమైన శ్రీవిద్య పద్యముల 
చెప్పినారు గద మీరే 
బుద్ధదేవుని ధర్మపదమును 
చూపినారు గద మీరే 

అద్భుతమ్ము శ్రీలలిత నామముల 
రహస్యార్థముల దీప్తి
ఆశ్చర్యమౌ గదా పంచవటిని 
మీ ఉపన్యాసముల స్ఫూర్తి 
త్రికరణమ్ముల శుద్ధిసాధనే 
శుశ్రూషలో గలుగు ప్రాప్తి

పరమహంసనే పరమభక్తితో 
అనుసరించు గురువర్యా!
అఖిలమెరిగినా అణగిఉండెడి 
మాననీయ మహనీయ 
మిమ్ము తెలియ నేనెంత దానను 
పాట ప్రణతి గొను మయ్యా!

44.
ప్రపంచ శాంతి 

ప్రపంచ శాంతిని పరిరక్షిస్తాం 
అని మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం 
రేపటి పౌరులు మనమే కనుక 
మన కర్తవ్యం పాటిద్దాం 

సర్వప్రాణులను ప్రేమిస్తాం 
సాటివారికి సాయం చేస్తాం
మనసుల్లోన మంచితనాన్ని 
పెంచి అందరికి పంచిస్తాం 

పదుగురి మేలును కాంక్షించడమే 
సకల మతమ్ముల సారాంశం 
ప్రాణము తీయుట రాక్షస ధర్మం 
మానవత్వమే దైవత్వం

ఆయుధమ్ములు అణుయుద్ధాలు 
మానవజాతిని మసిచేస్తాయి 
శాంతి సహనం సమ ధర్మాలు 
ఇలలో స్వర్గం సృష్టిస్తాయి


45
మహానటి

విజయా!వివరించవే 
నిజమెరుగని జగతికి నా కథ 
విజయా వివరించవే 

నన్ను గూర్చి విన్న కథలు 
ఏవి నిజమో ఎరుగక లేక 
ఎంతగానో పరితపించే 
ప్రియమైన అభిమాని 
వ్యధ తీరగా 

తనువు మరచి తాగి తాగి 
ఏల నేను ఇటులయ్యానో
ప్రేమలేకా మనగలేక
సావిత్రి ఏరీతి కడతేరెనో

46.
ఉరీ  దారుణం 

జయహో జయ జయహో వీర సైనికా
జయహో జయ జయహో దేశ ప్రేమికా

సాహసం ఊపిరిగా 
నీ ప్రాణం పణంగా 
దేశభక్తి చాటుకునే 
సరిహద్దులు కాచుకునే 
కంటిరెప్ప వంటి ఓ ధీరుడా
నిస్వార్థపు నిజ దేశభక్తుడా 

నిను కన్నవారి నొదిలిపెట్టి 
నువు కన్నప్రేమ నణచిపెట్టి
ఇంటికి బహుదూరమై 
ఇల్లాలికి చుట్టమై
అనుక్షణం జీవించే యోధుడా!
అమ్మకొరకు మరణించే అమరుడా 

కార్గిల్ లో నీ నెత్తురు 
భరతాంబకు నుదుటి బొట్టు 
కాశ్మీరున నీ మనుగడ 
కయ్యాలకు ఆటపట్టు
వికలాంగుడ వగుదువో
విగతజీవి వగుదువో
లెక్కచేయనట్టి మేటి నీవురా 
ధైర్యత్యాగాల మేలుబంతివా 

పార్లమెంటు గౌరవం 
ముంబయిలో దారుణం
ఊరిలోన ఉపద్రవం 
ఉరీలోన ఘాతుకం 
ఆపద ఏదైనగాని అక్కడ 
ఆదుకోను నిలబడే ఆప్తుడా 

శత్రు దుశ్చర్యలకిదె 
మెరుపు దాడి గుణపాఠం 
నీ శక్తికి నీ దేశం
అంటున్నది దాసోహం 
నివ్వెరపడి చూస్తున్నది నీ వైపే ప్రపంచం 
నీళ్ళు తములుతున్నదిరా దాయాదుల నిబ్బరం 
విజయమా లేక వీరస్వర్గమా 
తేల్చుకోను తెగించిన సహనమా



 





47.
*నరసం ఆశయగీతం*

నవ్యాంధ్ర రాష్ట్రాన
రచయిత్రుల సంఘమిది
కవయిత్రుల మదిలోపల
తళుకుమన్న తలపొక్కటి
నరసంగా ఈనాడిటు
పురుడు పోసుకుంది

గతకాలం సమీక్షించి
నేటి స్థితి ని వీక్షించి
అందమైన భవితవైపు
అడుగు కదపటానికై
అతివలంత ఏకమై
ఐక్యభావ వేదికై
నరసంగా ఈనాడిటు
పురుడు పోసుకుంది

పద్య వచన కవనము
కవిత నవల గేయము
సంప్రదాయ సాహిత్యం
వైప్లవ్యం ఆధునికం
మార్గమేదైనగాని
సాధించిన అభ్యుదయం
కలబోసుకుంటాము
కదలి సాగిపోతాము

సేవకు మేం ముందుంటాం
సమానత్వ మాశిస్తాం
స్త్రీలకొరకు స్పందిస్తాం
న్యాయానికి నినదిస్తాం
మానవీయ విలువలు
మట్టిపాలు కానీయం
సంఘహితం మా లక్ష్యం
మా భూమిక సాహిత్యం

పుస్తకాలు ప్రచురించి
 మేటి రచన సమీక్షించి 
సాహిత్య సభలు జరిపి 
సంస్థలతో మైత్రి నెరపి 
అందమైన భావ సుమం 
 అక్షరమై పరిమళించ
  యువత కిచ్చి ప్రోత్సాహం 
మేం ముందుకు నడిపిస్తాం

అజ్ఞానం  అణచివేత అనే చీకట్లు చీల్చి
 ఆలోచన అక్షరం ఆయుధాలుగా దాల్చి 
సాహితీ కిరణాలు
 ప్రసరించగ ప్రభవించిన
 నరసమనే తూర్పు వేది 
నారీ సూర్యోదయమిది

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


48.
యువ (అం)తరంగం

హద్దులేనిది ఆకాశం
అంతే లేనిది సాగరం 
చింత లేనిది చిన్నతనం 
పగ్గం లేనిది పడుచుదనం 

ఉర్రూతలూగే ఉద్వేగంతో 
స్వార్థపరత్వం పనిపడతాం 
ఉరకలు వేసే ఉత్సాహంతో 
విజయపథాలకు పయనిస్తాం 
అసాధ్యమన్నది తుడిచేస్తాం 
అద్భుతాలనే సాధిస్తాం 

అష్టదిక్కుల పునాదిమీద 
నవలోకాన్నే స్థాపిస్తాం 
ఇంద్రధనుసులో సప్తవర్ణముల 
ఇలలో స్వర్గం సృష్టిస్తాం 
ఆరు ఋతువులను బ్రతుకుతోటలో 
ఆవిష్కరించి పూయిస్తాం 
పంచభూతముల పరిరక్షించి
భావితలాలకు బ్రతుకిస్తాం 
కలుపుమొక్కలను ఏరేస్తాం 
కలల ప్రపంచం చేరుస్తాం 

నీతి న్యాయం సమత మమతల 
నూతన వేదం వినిపిస్తాం 
త్రికరణశుద్ధికి తిరుగేలేదని 
తీర్మానాలను ప్రకటిస్తాం 
ఇరుతీరాలను ఏకం చేసిన 
వానరశక్తిని చూపిస్తాం 
మానవులంతా ఒకటేనంటూ 
విశ్వగీతమును విరచిస్తాం 
గ్రామప్రపంచం నిర్మిస్తాం 
ప్రపంచ గ్రామం పాలిస్తాం


49.
ఈనాటి యువత 
(ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ పాటకు పేరడీ)

భూగోళమొకపల్లె 
సంప్రదాయము చెల్లె 
పాశ్చాత్య సంస్కృతి 
విషకోర విసిరె 
ప్రేమలు పెళ్ళిళ్ళు 
మూణ్ణాళ్ళ ముచ్చట్లు 
పరువంటె పలచన 
బ్రతుకంటె చులకన 

సూర్యోదయం యువత 
చూడడం లేదు 
నడిజాము దాటినా‌ 
నిద్దరే పోదు 
ఫేస్బుక్కు ఫ్రెండ్షిప్పు
వాట్సప్పు చాటింగు 
చీటింగు జరిగాక 
టీవీలొ మీటింగు 

పెద్దలన భయభక్తులున్నవారే లేరు
చేతిలో స్మార్ట్ ఫోను లేనివారే లేరు
వీకెండు పార్టీలు
వెర్రి సెల్ఫీలు 
కూడని స్వేచ్ఛ ఇది యువతరము తీరు 

వస్త్రధారణలోన పెనుమార్పులొచ్చాయి
ఆడమగ తేడాలు అంతరించాయి
అమ్మాయి విరబోసె
అబ్బాయి పిలకేసె 
ముదుసళ్ళు అదిచూసి 
ముక్కుపై వేలేసె 

మార్కులొస్తున్నాయి 
మానవతయే లేదు
విద్య చాలా ఉన్న 
విజ్ఞతే లేదు 
ఇంట అమ్మా నాన్న దోగ కన్నీట 
డిగ్రీల రెక్కలతొ డాలర్ల వేట 

తలిదండ్రులూ గురువు
లాదమరిచారు
కట్టుబాట్లెరుగక పిల్లలెదిగేరు 
సంస్కారబలమన్న పునాదులే లేని 
విఖ్యాత భవనాన 
జాతిమనగలదా!

 సింహాద్రి జ్యోతిర్మయి



50
హ్యాపీ న్యూ ఇయర్ -1
(. పంచదార బొమ్మ బొమ్మా పాటకు పేరడీ)
వెళ్ళిపోయే ఓ ఏడాదీ!
చీరియో టాటా బైబై
వచ్చివాలే నవ వత్సరమా!
అందుకో హార్టీ వెల్ కమ్ 
చెడు అసలు చెయ్యొద్దంటూ 
శుభములను చేకూర్చంటూ 
మరి మరి కోరేమా!

నిను మురిపేందుకె 
మిడ్ నైటు హంగామా 
నువు కావాలమ్మా సుఖాల చిరునామా 

న్యూ ఇయర్ 
హ్యాపీ న్యూ ఇయర్ 
ఆల్ ద బెస్ట్ 
ఫర్ ద హోల్ ఇయర్

51
*నిర్భయ వెళిపోయింది*

మమత లేని మానవా!
మాతృఘోష వింటావా!
ఆడదంటె అమ్మరా 
ఆటబొమ్మ కాదురా!

నిండునెలలు మోస్తుంది 
నెత్తురునే పంచుతుంది 
కాన్పు గండమని తెలిసీ 
కోరి నిన్ను కంటుంది 
నీకు జన్మనివ్వడమే తన జన్మకు సాఫల్యం 
అని తలచిన అమ్మ కడుపు 
అట్టుడికి పోతోంది
మొక్క దగిన తులసికోట 
తొక్కి ఉసురు తీశావు 

పురిటికందుగా నీవు
పుడమిపైన పడగానే 
పరవశించి అమ్మ గుండె 
పాలవెల్లి అవుతుంది 
అందమైన ఎదపొంగే 
అమృతకలశ మవుతుంది
నీ ఆకలి తీర్చుతుంది నీ ఆయువు పెంచుతుంది 
బాధైనా భయమైనా 
పొదువుకునే ఆ కౌగిట 
ఆడతనం చూడకురా 
అమ్మతనం చూడరా

తన బ్రతుకు మీద అధికారం 
మనసు మీద ఆధిక్యం
తనువుపైన దౌర్జన్యం 
హక్కులపై ఉక్కుపాదం 
నిర్భయంగ తిరగరాని 
అబలవనుట దౌర్భాగ్యం 
తనకు తాను నిలవగా 
తనకెప్పుడు స్వాతంత్ర్యం
ఆకసాన సగమంటే 
శూన్యమనా దానికర్థం 

అన్యాయం జరిగిపోయె
ఆడపిల్ల బలిఅయ్యె
కొడిగడుతూ పోరాడిన 
దివ్వె వెలుగు ఆరిపోయె
ప్రతి కన్నూ చెమరించె 
ప్రతి గుండె మూగదయ్యె
కామాంధుల కివ్వాలి కఠినమైన దండన
అంతవరకు ఆగరాదు 
గళమెత్తిన స్పందన

(నిర్భయ మరణానికి చలించిపోతూ రాసిన గేయం)

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

52.
మందు (వద్దు) బాబూ!

(నిన్ను మరచి పోవాలనీ,అన్ని విడిచి వెళ్ళాలనీ పాటకు పేరడీ)

నిన్ను నేను మార్చాలని 
మందు మానిపించాలని 
ఎన్నిసార్లో అనుకున్నా 
చేతకాక మానుకున్నా
చేతకాక మానుకున్నా 

అప్పుడపుడు పార్టీల్లో 
తప్పదంటు మొదలెట్టి 
ఇప్పుడిపుడు ప్రతిరోజూ 
తప్పతాగి వస్తున్నావు 
నా మనసు పడే బాధ‌ నీవు
ఎపుడు‌ తెలుసుకుంటావు 
నీ పరువు జారిపోతుందని 
తెలియలేక ఉన్నావు 

ఎందుకిలా మారావో 
నీకైనా తెలుసా 
నేనెందుకింత తిడుతున్నానో 
నీకేమో తెలియదు 
నువ్వు దాచ చూసినా 
ఆ కంపు దాగబోదులే 
మత్తు దిగేవరకు 
మరి రాత్రి గడచువరకు 

లివరు దెబ్బతింటుంది 
డబ్బు ఖర్చు అవుతుంది 
ముసలితనం ముందేవచ్చి 
పొట్ట పొడుచుకొస్తుంది 
కాస్త కాస్త తగ్గిస్తుంటే 
మానేందుకు వీలవుతుంది 
మాని చూడు పూర్తిగా 
ఇంకేమీ కోరనుగా
🤣🤣🤣

సింహాద్రి జ్యోతిర్మయి

మనసు పలికే మౌనగీతం నేడే... స్వాతిముత్యం పాటకు పేరడీ
అరుణ గారి పుట్టిన రోజు సందర్భంగా

వెలుగులీనే అరుణ కిరణం నీవే
స్వచ్ఛమైన స్వాతి ముత్యం నీవే
అణువు అణువు స్నేహమధువు
పెదవిపై నగవు

అండలేని అతివకే
ఆసరా నేనంటివే
మారుపేరై స్ఫూర్తి కే
మంచి చేయుచునుంటివే
అంతరంగములో
అన్నివేళలలో
పరుల హితమే
నీదు మతమై
సాగు చేతనమా!

నీదు హృదిలో భావమే
కవితలై అలరించగా
నీదు ఆశయరూపమే
నరసమై వెలుగొందగా
మధుర భాషణలో
చెలిమి కాంతులలో
మురియు నీదు
మిత్రబృందం
మంత్రముగ్ధులుగా

అరుణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.3.2020

పుణ్య భూమి లోన
పుట్టాను నేనని
దేవతల్లె గౌరవించేరు నన్నని
ఆదమరచి ఉండబోకే ఓ చెల్లి
ప్రేమ నమ్మి మోసపోకే నా తల్లి

మాటమాట కలిపి
చనువిచ్చినావంటే
మంచివాడేనని
మైమరచి నువ్వుంటే
ప్రేమ పంజరాన
బంధించి వేస్తారు
నీ హక్కు రెక్కల్ని
కత్తిరించేస్తారు
లేడికూనలాగ నువ్వు
బెదిరి బెదిరి పోకే చెల్లీ
శివంగిలా మీది కురికి
చీల్చి చెండాడాలి తల్లీ
పశువంటి మగవాణ్ణి చెల్లీ
పసిగట్టి మసలాలి తల్లీ
తెలుసుకోవె చిట్టిచెల్లీ!
తెలివి తప్పకమ్మ తల్లీ!
ఆదమరచి ఉండబోకే నా చెల్లి
ప్రేమ నమ్మి మోసపోకే నా తల్లి


అందమైన చందమామ వని
వెన్నవంటి మనసు దోచుకుని
వెన్నెలంటి సొగసు కబళించివేస్తారు
అమావాస్య వైపు
అడుగులేయిస్తారు
అంతంత చదువులు చదివి 
ఇంత ఇంగితమ్ము వదిలి
పదిమందిలో నువ్వు చెల్లీ
పలుచనైపోకమ్మ తల్లీ
కలకంఠి కన్నీరు భువిని
కరిగించనే లేదు శిలని
ఆదమరచి ఉండబోకే ఓ చెల్లి
ప్రేమ నమ్మి మోసపోకే నా తల్లి

నిర్భయ చట్టాలు
నీ మేలుకే గాని
దిశతోటి కష్టాలు
తీరేను నీకని
పొరపాటు పడినీవు
తప్పటడుగులేస్తె
బంగారు నీ బ్రతుకు
ఆపదపాలైతే
తనువెల్ల గాయాలమయమై
కొసప్రాణమే కొట్టుకుంటే
నడిరోడ్డుపైన శవమై
నగ్నంగా విసిరేయబడితే
కన్నకడుపుకోత నీవు
ఊహించగలవా చెల్లీ
దోషికి ఉరిశిక్ష పడినా
ఒరిగేది ఏముంది తల్లీ
ఆదమరచి ఉండబోకే నా చెల్లి
ప్రేమ నమ్మి మోసపోకే నా తల్లి

ఏరీ ఆ నలుగురు?
ఎక్కడ ఆ నలుగురు?
కన్నీటి సెలవిచ్చి
కాటికి నిను మోయువారు
ఏరీ ఆ నలుగురు?
ఎక్కడ ఆ నలుగురు?

 కష్టసుఖాలందు నిన్ను
వెన్నంటిన తోడేదీ?
కడుపారా కనిపెంచిన
కన్నబిడ్డ జాడేదీ?
ప్రాణమిత్రులెక్కడ?
పరిచయస్తులెక్కడ?
కట్టెలలో నిన్ను పెట్టి
మట్టి లోన కప్పేందుకు
ఏరీ ఆ నలుగురు?
ఎక్కడ ఆ నలుగురు?

 అభిమానం కురిపించిన
బంధుగణం ఎక్కడ?
కలివిడిగా మెలిగినట్టి
ఇరుగుపొరుగు లెక్కడ?
సహోదరులు ఎక్కడ?
సహోద్యోగులెక్కడ?
ప్రేమ గొంతు భయం నొక్క
నిస్సహాయులైన వారు
ఏరీ ఆ నలుగురు?
ఎక్కడ ఆ నలుగురు?

మందిలోన తిరిగితే
మహమ్మారి కాహ్వానం
ముక్కు మూతి కప్పకున్న
ముంచుకొచ్చు ప్రమాదం
పరిశుభ్రత ప్రధానం 
దూరమిపుడు  అనివార్యం
గుట్టలైన  శవాలతో
గుణపాఠం నేర్చుకోరె!

సింహాద్రి జ్యోతిర్మయి
29.4.2021


*నన్ను బ్రతకనివ్వరా*

ఓ మృత్యుకెరటమా!
నన్ను లోన దాచుకో
 ఓ యముని పాశమా!
నన్ను కౌగిలించుకో!

ఆదుకునే వారు లేని 
ఈ అరణ్యరోదన 
నీవైనా వినవమ్మా
నా మూగవేదన


బయటపడే దారిలేని
పోరాడే శక్తి లేని
ఈ మానభంగము 
ప్రత్యక్ష నరకము
తనువెల్ల రక్తము 
మనసంత ఛిద్రము
 అసహాయురాలిపై
పైశాచికత్వము 
నా ఊపిరాగినా 
ఆగని అకృత్యము 
భరియించలేనిక
నన్ను సేదదీర్చగా
ఓ మృత్యు కెరటమా!
నన్ను లోన దాచుకో 
ఓ యముని పాశమా!
నన్ను కౌగిలించుకో


నడిరోడ్డున చిక్కానా 
అడవి లోన ఉన్నానా 
వైద్యాలయమున అయినా
 లేదాయెను రక్షణ 
కామాంధుల వేటకు
నేను లేడి కూననా 
అణిగె ఆర్తనాదము
నా తెగిన గొంతున
ధారలాయె నెత్తురు
అంగాంగమందున
భరియించలేనిక
నన్ను సేదదీర్చగా
ఓ మృత్యు కెరటమా!
నన్ను లోన దాచుకో 
ఓ యముని పాశమా!
నన్ను కౌగిలించుకో

నీచేత ఆటబొమ్మనా 
వాడుకునే వస్తువునా
నిర్భయంగ మనలేనా 
నేను మరో నిర్భయనా
పశుబలమే చూపెను
నీ రాక్షసత్వము
నేను పడ్డ హింసకు 
నా అణువణువూ సాక్ష్యము
 ఇంత ఘోర మరణానికి 
నే చేసిన నేరమేమి?

స్వాతంత్ర్యపు సంబరాలు
నోచుకోని అబలనా!
అమృతోత్సవాల నేల
విషబిందువు నాపైనా 
నా హక్కులు కాలరాసి 
దౌర్జన్యపు  కాటు వేసి
ఉసురుదీయువేళ నా
 కొన ఊపిరి కోరుతోంది 
ఓ మాతృగర్భమా!
మగశిశువుని కనకుమా!
ఇదే నా వాంగ్మూలం 
నా మరణశాసనం

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
15.8.2024
గురువారం

కోల్ కతా మెడికో మరణానికి ఆవేశంతో ఆవేదనతో ఆక్రోశంతో 😔
బతుకంత భయమేన తల్లీ!
నీ బతుకంత హీనమా చెల్లీ 
తల్లి పొత్తిలి తప్ప 
నిన్ను కాపాడేటి 
వేరొక్క చోటేది 
కనిపించకున్నాది

పుట్టె నింట ఆడ నలుసు
అన్న నిట్టూర్పుతో జన్మ మొదలు
ఎదుగుతున్న కొద్దీ నీపై 
ఎన్నెన్నో ఆంక్షల ఉరులు 
దేవతంటూ స్త్రీని మొక్కేరు చెయ్యెత్తి 
నీదు ఒంటిపైన
చూపుల చురకత్తి 
గాయాల రుధిరాన్ని తల్లీ 
కారుస్తూ తిరిగేవ చెల్లీ
బతుకంతా భయమేనా తల్లీ!
నీ బతుకంత హీనమా చెల్లీ!

బడిలోన మాష్టారు
 బస్సులో డ్రైవరు 
నీతోటి విద్యార్థి 
రోడ్డుపై పోకిరి 
 సకిలింత సహియించి
ఇంటికొచ్చి పడితే
రెక్కల్లో నిను పొదిగే 
నాన్నే రాక్షసుడైతే 
ఏడ బోయేవింక తల్లీ 
 దిక్కెవరు నీకింక చెల్లీ
బ్రతుకంతా భయమేనా తల్లీ!
నీ బతుకంత హీనమా చెల్లీ!

పసిపాపవైనా కానీ
ముదివగ్గువైతే నేమి
కామాంధకారాన నిన్ను 
కబళించ వేసేరు కన్ను
అడుగడుగు గండాల వెనక
శాపమాయె ఆడపుటక
మగజాతిపై బూని కినుక
కనిపెంచనంటే గనక 
మాకింక దిక్కేది తల్లీ!
మన్నించవే మమ్ము చెల్లీ


ప్రేమ పేరు చెప్పు నొకడు 
నమ్మి వేయకు తప్పటడుగు 
మాటేసి కాటేయు నొకడు 
ఆదమరచి ఉండదగదు
తోడేళ్ళ గుంపుల తరిమి బ్రతకాలంటె 
కుందేలు కాబోకు
శివంగివై దూకు 
హక్కు కాలరాస్తే తల్లీ!
తొక్కి నేలరాయి చెల్లీ!
 కలకత్తా కాళివై తల్లీ!
 నీ శక్తి చూపించు చెల్లీ!

సింహాద్రి జ్యోతిర్మయి 
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
31.8.2024

మానవసేవే పరమాత్ముని సేవ 
జన్మ సఫలమై తరియించే త్రోవ
అనాథలెందరొ 
అభాగ్యులెందరొ
ఆర్తులెందరో 
అసహాయులెందరో
ఉన్న జగతిలో
ఉన్నత మతితో 
చేయూతనిచ్చి చేసే సేవ

పట్టెడు మెతుకులు దొరకని వారికి
పెట్టే అన్నము ప్రాణం నిలుపు
పుట్టెడు దుఃఖం ముసిరిన వారికి 
తట్టిన భుజమే ధైర్యము నింపు
కలతవలదని 
కలను నేనని
కనులుతుడిచి తనకు
కలిగినంతలో
సహృదయంతో సాయం చేసే 
మానవ సేవే పరమాత్ముని సేవ
జన్మ సఫలమై తరియించే త్రోవ

చదువు కోరితే పుస్తకమవుతూ 
అక్షర భిక్షను అందించినచో
అండ వేడితే ఆశ్రయమవుతూ
ముదిమికి దిక్కయి 
సాంత్వన నిడగా
వ్యాధుల బాధల 
కుమిలే వారికి
అండ మీకు నేనున్నానంటూ
గుండె నిండుగా 
దయను నింపుకుని 
నిస్వార్థంగా పరులకు చేసే 
మానవ సేవే పరమాత్ముని సేవ 
జన్మ సఫలమై తరియించే త్రోవ

కన్నుల ముందర కనపడు పేదల
కష్టం తెలిసి కన్నులు తడిసి
తోచిన సాయం చేయాలంటే
తోడై ఆర్తిని తీర్చాలంటే
కలిమితోటి అవసరమేలేదని 
మానవత్వమను నిధియే చాలని 
మాటలు కావు చేతలు మావని 
సీతారావమ్మ స్మారక సేవా సంస్థ నిరతము 
చిత్తశుద్ధితో ఆత్మతృప్తితో 
ఆచరణముతో 
రూపించే సత్యం


భరతమాత పిల్లలం 
భావి భరత పౌరులం
స్వచ్ఛమైన మనసులున్న 
ముచ్చటైన గువ్వలం 

దేశమాత కంటవెలిగి 
కాంతి చిందు దివ్వెలం 
ఆమె పెదవి జాలువారు 
నవ్వులంటి పువ్వులం 

చదువు విలువ నెరిగి మేము 
బడిబాటను సాగుతాం 
బాల్యవివాహాల బారి
పడకుండా ఎదుగుతాం 

ఆహారం ఆరోగ్యం 
మా హక్కుగ పొందుతాం 
బంగారపు బాల్యమే
మా భవితకు సోపానం

వెట్టిచాకిరీ పంజర 
పక్షులల్లె బ్రతకబోం 
ప్రభుత్వం కల్పించిన 
అవకాశం విడువబోం 

చట్టమిచ్చు హక్కులనే
దారమె ఆధారమై
ప్రభుత్వాల చేయూతతొ
దూసుకెళ్ళిపోగలం

మన దేశపు గౌరవాన్ని
కాపాడే పాపలం
మనదేశం కీర్తిచాటు 
పతాకమై ఎగురుతాం

*బంగారు బాల్యం* 

కారాదు మన పాపలకు చిట్టి బ్రతుకు భారము 
కావాలి చిన్నారులకు బంగారు బాల్యము
 బేటీ బచావో
భ్రూణ హత్య పాపము 
 బేటీ పఢావో జాతి కదే గౌరవము

కడుపులోన తానున్నపుడే ఉసురుతీసి వేయద్దు
కన్నయినా తెరవక ముందే వీధిలోకి విసిరేయద్దు
పసిమొగ్గలు అనుకోకుండా పశుబలాన చెరచద్దు 
ఆడిపాడు ప్రాయంలోనే మూడుముళ్ళు వేయించద్దు
మూఢమైన ఆచారాలు ఇకనైనా వదిలేయాలి
అడుగడుగున ఆడపిల్లకు
 అండదండ మనమివ్వాలి
బేటీ బచావో భ్రూణ హత్య పాపము 
బేటీ పఢావో జాతి కదే గౌరవము 

పౌష్టికాహారం తోటి పసిదేహం ఎదగాలి 
పుస్తకాలు చేతికిచ్చి బడి దిశగా నడిపించాలి 
తమ హక్కులు సాధించుకునే 
స్వేచ్ఛ  వారికివ్వాలి
స్వంత కాళ్ళ పైన నిలిచే అవకాశం అందించాలి
అబలవంటు ఆడపిల్లను
అణచివేయ చూడద్దు
ఆమెకున్న ఆత్మబలమును అవహేళన చేయద్దు 
 బేటీ బచావో భ్రూణ హత్య పాపము 
బేటీ పఢావో జాతి కదే గౌరవము


ప్రత్యేక హోదా

హోదా మాకేదంటూ
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ
కదం తొక్కె మా పదం
మేము కళాకారులం

తమిళులన్న అపప్రథను
తొలగించగ నినదించిన
అన్న నందమూరి స్వరం
చాటె ఆత్మగౌరవం
ఆంధ్రులకది తారకం
అదే మాకు ఆదర్శం
కదంతొక్కె మా పదం
మేము కళాకారులం

స్వేచ్ఛ ఉంది ఎగిరేందుకు
హద్దులేదు ఎదిగేందుకు
చేయూతగ మేముంటాం
భవిత తీర్చి దిద్దుతాం
అన్నమాట వట్టిదాయె
హక్కు లెక్కలీయరాయె
తెలుగునేల మేలుకొనియె
ప్రజాగ్రహం వెల్లువాయె

పన్నుపోటు తగ్గదాయె
వెన్నుపోటు పొడిచిరాయె
కత్తిపోటు కన్న వాడి
కలం పోటు తెలుసుకోండి
ఓటుపోటు పొడిచామా
పదవిపోటు తప్పదండి
కదం తొక్కె మా పదం

అమరజీవి ఆశయం
అల్లూరి పోరాటం
కందుకూరి సంస్కారం
టంగుటూరి సాహసం
మహాకవుల అడుగుజాడ
స్ఫూర్తి మాకు గురజాడ
అందిపుచ్చుకుంటాము
హక్కు కొరకు పోరుతాము

అర్థరాజ్యమంటు నాడు
అడవిపంచె ధృతరాష్ట్రుడు
మోసగించి దాన్ని కూడ
అపహరించె అతని సుతుడు
మీరువారి వారసులై
చూపినారు మొండిచెయ్యి
వట్టి మాట కట్టిపెట్టి
వాగ్దానం నిజం చెయ్యి

సింహాద్రి జ్యోతిర్మయి న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు




Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ