20/3*సుప్రభాత కాంతులు* కందంలో* *శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి*(16 శ్లోకాలు)
**********************************************************
*సుప్రభాత కందం*
*స్వేచ్ఛానువాదం*
*శ్రీ వేంకటేశ ప్రపత్తిః*(16 శ్లోకాలు)
*శ్లోకం..41
ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్
తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్ క్షాంతి సంవర్థనీమ్|
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్||
*కందం..41*
లోకేశ్వరి!ప్రియమారగ
లోకేశుని హృదయసీమ లోగిలి గాగన్
చే కమలము దాల్చి సతము
శ్రీకాంతుని మురియజేయు సిరి గొను ప్రణతుల్.
తాత్పర్యం:
ఓ లోకేశ్వరీ! చేత కమలములు ధరించి,ఆ శ్రీహరి హృదయమే నివాసంగా ప్రీతితో నివసిస్తూ,ఆ స్వామికి సదా ఆనందం కలిగించే ఓ శ్రీదేవీ! నీకు నమస్సులు.
*****************************
*శ్లోకం -42*
శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ ।
స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే
*కందం - 42*
సిరి గలవాడా!కరుణకు
నిర వగువాడా!సకలము నెఱిగినవాడా!
వరదా!ఓ భక్తసులభ!
శరణంటిని నీ పదములు జగదాధారా!
తాత్పర్యం :
ఓ శ్రీనివాసుడా!కరుణామయుడా!
సమస్తము ఎఱిగినవాడా!కోరిన వరములొసగి భక్తులను అనుగ్రహించే భక్తసులభుడా!సకల జగతికి ఆధారమైనవాడా! నీ పాదములనే నేను శరణువేడుచున్నాను.
*****************************
*శ్లోకం..43*
ఆనూపురార్పిత సుజాత సుగంధిపుష్ప
సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ|
సౌమ్యౌ సదానుభవనే పి నవానుభవ్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..43*
చక్కని విరులకు దళముగ
దక్కెను నీ పదము లంట తావియు,శోభల్
చొక్కపునూపురచరణమె
దిక్కని మ్రొక్కెద శరణిడు దీనావనుడా!
తాత్పర్యం : 43
ఓ దీనశరణ్యా!నీ పాదములను చేరుటవల్లనే వికసించిన పుష్పాలకు సౌందర్యము,సుగంధము అబ్బుతున్నాయి.అటువంటి నీ పాదములే దిక్కని నమ్మిన నాకు శరణమిచ్చి రక్షించుము.
*****************************
*శ్లోకం..44*
సద్యోవికాసి సముదిత్త్వర సాంద్రరాగ
సౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తామ్ |
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ||
*కందం..44*
నవవికసితనళినారుణ
నవకమ్ముల మించెడు తిరునాథుని పదముల్
నవకిసలయమృదులమ్ములు
భవసాగరతారకములు భక్తాళి కిలన్.
తాత్పర్యం : 44
అప్పుడే వికసించిన ఎర్రకలువల సౌందర్యాన్ని మించిన సొగసుతో విలసిల్లే ఆ శ్రీనివాసుని పదములు,
చిగురాకులంత సుతిమెత్తనివి.అవి
తనను కొలిచే భక్తులను సంసారసాగరాన్ని దాటిస్తున్నాయి.
*****************************
*శ్లోకం..45*
రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర,
వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైః|
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..45*
చిన్నెలు శంఖము చక్రము
లున్నవి, ధ్వజమాతపత్ర ముండెను, కమల
మ్మున్నది, పీయూష కలశ
మున్నది తోత్రంపురేఖలుండె పదములన్.
తాత్పర్యం : 45
ఓ తిరుమలేశా!
మంగళకరములైన శంఖుచక్రాలు,
ధ్వజము, గొడుగు,కమలము,అమృతకలశము,అంకుశము మొదలైన శుభచిహ్నములచేత అలంకరించబడిన నీ పాదముద్రలే నాకు శరణము.
*****************************
*శ్లోకం..46*
తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్యైర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ ।
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥
*కందం..46*
చూడగను పద్మరాగ
మ్మోడగ, యా యింద్రనీల మోడగ,చంద్రుం
డోడ,యరుణ నీల ధవళ
మాడె క్రమముగ నరికాళ్ళ నంఘ్రి నఖములన్.
తాత్పర్యం :
ఓ శ్రీరమణా! నీ అరికాళ్ళు పద్మరాగమణుల ఎర్రదనాన్ని,పాదములు ఇంద్రనీలమణుల నలుపును,నఖములు చంద్రుని ధవళకాంతిని ఓడించుచు ప్రకాశించుచున్నవి.
**********************************************************
*శ్లోకం..47*
స ప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనేపి సపది క్లమ మాధధానౌ|
కాంతా వవాఙ్మానస గోచర సౌకుమార్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..47*
కిసలయసమ హస్తమ్ముల
హసితానన యాదిలక్ష్మి యనవరతమ్మే
బిసరుహ కాంతుల పదముల
నెసగెడు యనురక్తి నొత్తు నెరగుదు వానిన్.
తాత్పర్యం : 47
మందస్మిత వదనయైన ఆ ఆదిలక్ష్మి చిగురాకులవంటి తన చేతులతో నిత్యమూ ఏ మృదుపదములను ఎంతో ప్రేమతో ఒత్తుతుంటుందో, అటువంటి నీ పాదములకు నేను నమస్కరిస్తున్నాను.
*
*****************************
*శ్లోకం..48*
లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీళాది దివ్య మహిషీ కరపల్లవానామ్ ।
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..48*
శ్రీదేవియు,భూదేవియు
మోదముతో నీళసతియు మురహరి సతత
మ్మాదట సేవించు పదము
లీదగ సంసారజలధి నిదె శరణంటిన్.
తాత్పర్యం : 48
శ్రీదేవి, భూదేవి ,నీళాదేవి ఏ చరణములనైతే నిరంతరమూ సేవిస్తుంటారో,ఆ పదములనే నేను ఈ సంసార సాగరాన్ని దాటించుమని శరణు కోరుతున్నాను.
*****************************
*శ్లోకం..49*
నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః|
నీరాజనా విధి ముదార ముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..49*
పదమంటగ బ్రహ్మాదులు
పొదిగిన నవరత్నమకుట పొత్తుక గన నీ
పదముల కెత్తిన హారతి
యది యన చెలువొందు యంఘ్రు లాత్మ గొలిచెదన్.
తాత్పర్యం : 49
ప్రతి దినమును బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలు నమస్కరించునప్పుడు వారి కిరీటములందలి మేలి నవరత్న కాంతులచే మంగళహారతి ఇవ్వబడుతున్నట్లు వెలుగులీను నీ పాదములను నేను నా మనసులో నిలిపి సేవిస్తున్నాను.
**********************************************************
*శ్లోకం..50*
విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసౌ
యౌ 'మధ్వఉత్స' ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ|
భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ||
*కందం..50*
పరమమ్ములు పావనములు
మరందముల యూట లనగ మన్ననగల నా
చరణములివియని చూపుచు
శరణొ సగెడి నీదు కరుణ జగముల గాచున్.
తాత్పర్యం : 50
"పరమపదమును చూపునవి,పావనమైనవి,తేనెల ఊటలు అని కొనియాడదగినవి అయిన నా పాదములివే.వీటిని శరణువేడు , నిన్ను కాపాడుతాను" అని నీ పదములను చూపుతున్న నీ దయయే లోకాలను పాలిస్తున్నది.
*****************************
*శ్లోకం..51*
పార్థాయ తత్-సదృశ సారధినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి ।
భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..51*
నిర్జింపను బంధులనని
వర్జింపగ నాయుధమును, వలదని మోహ
మ్మర్జునునకు శరణొసగుచు
కర్జము జరిపించినట్టి కంసారి నమో!
తాత్పర్యం : 51
ఓ కంసారీ!న బంధువధ చేయలేనంటూ ఆయుధములను విడిచి ,దుఃఖిస్తున్న అర్జునుని మోహం తొలగించి,కార్యోన్ముఖుని చేసి యుద్ధం జరిపించి, ధర్మరక్షణ చేసిన నీ పాదములను నేను శరణు కోరుతున్నాను.
*****************************
*శ్లోకం..52*
మన్మూర్థ్ని కాళియఫణే వికటాటవీషు
శ్రీవేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనామ్ |
చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
కందం..52
అల కాళీయుని పడగల
వెలసియు గరుడాద్రి శిఖరి,వేదోపనిష
త్తుల చెలువొందెడు పదములు
నిలిపెద నా హృదయ సీమ నిత్యము శ్రీశా!
తాత్పర్యం :51
ఓ శ్రీనివాసా! కాళీయుని పడగల పైనా, గరుడాద్రిశిఖరము పైనా,వేదోపనిషత్తులయందును అందగించే నీ పాదములను నిత్యమూ నా హృదయసీమ లో నిలిపి సేవిస్తాను.
*****************************
శ్లోకం..53
అమ్లాన హృష్య దవనీతల కీర్ణపుష్పౌ
శ్రీవేంకటాద్రి శిఖరాభరణాయ-మానౌ ।
ఆనన్దితాఖిల మనో నయనౌ తవై తౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..53*
విరులకు సౌరభ మద్దుచు,
నరుల మనమ్ములకును,నయనములకు దీపాం
కురమై,వరమై తిరుమల
గిరికిని,వెలిగెడు పదముల కేశవ! కొలుతున్.
తాత్పర్యం : 53
పుష్పాలకు సుగంధాన్ని అద్దుతూ,మానవుల నయనాలకు,హృదయాలకు వెలుగునిచ్చే దీపమై , తిరుమలకొండకు వరమై నిలిచిన నీ పాదములను నేను సేవిస్తాను.
*****************************
*శ్లోకం..54*
ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమానౌ ।
ప్రాప్తౌ పరస్పర తులా మతులాన్తరౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..54*
పాపలకును చనుబాలెటు
మాపియు ఆకలి అమృతసమమ్మగు నటులే
పాపులకును నీ చరణము
చూపును సద్గతి యని తొలి జోతల నిడెదన్.
తాత్పర్యం..54
పాపలకు తల్లిపాలు ఏ విధంగా ఆకలిని తీర్చి,అమృతంలా ఆయువును పోస్తాయో, అదే విధంగా పాపాత్ములకు సద్గతులను చూపేవి నీ చరణాలే అంటూ వాటికి తొలి వందనము చేస్తున్నాను.
*****************************
*శ్లోకం..55*
సత్త్వోత్తరైః సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన ।
సౌమ్యౌ పయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||
*కందం..55*
సుజనులు కొలిచెడి పాదము
భజియించిన దాట వచ్చు భవసాగరమున్
భుజగశయన!నీ పద పం
కజ ముడుపు తపోధనులకు కర్మము లెల్లన్.
తాత్పర్యం : 55
ఓ పన్నగశయనా! పుణ్యాత్ములు కొలిచే నీ పాదాలను సేవించినచో ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటవచ్చును.పావనమైన నీ పాదపద్మములు తపోధనుల కర్మబంధాలను తొలగించివేస్తాయి.
*****************************
*శ్లోకం..56*
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే
ప్రాప్యేత్వయి స్వయముపేయ తయా స్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ ||
*కందం..56*
భక్తియు జ్ఞానము గల్గిన
భక్తులకును మోక్షమిడెడు వైకుంఠవిభూ!
ముక్తునిగా నను జేయు మ
శక్తుడ శరణమ్ము నీదు చరణ మనియెదన్.
తాత్పర్యం : 56
ఓ వైకుంఠవాసా! భక్తి, జ్ఞానము గల్గిన భక్తులకు మోక్షమునిచ్చే నీ చరణములే శరణమని వేడుకుంటున్నాను. ఈ భవబంధములనుండి బయటపడలేని అశక్తుడనైన నాకు అభయమును ప్రసాదించుము.
****************************
*కందం..56A*
ఏ పాదము బ్రహ్మ కడిగె
నే పాదమునందు గంగ యేరైన దహో!
ఏ పాదము బలి నడచిన
దా పాదము నాకు దిక్కు హరి పాదమదే!
తాత్పర్యం.. 56A
బ్రహ్మ చేత కడగబడినది,గంగ ప్రభవించిన పవిత్ర స్థలమైనది,బలిని పాతాళానికి అణచివేసినది అయిన ఆ శ్రీహరి పాదమే నాకు దిక్కు.
*కందం..56B*
నీ పదమే ధ్యానింతును
నీ పదమే నమ్మి నాదు నిధి యనుకొందున్
నీ పదమే సేవింతును
నీ పదమే పరమపదము నీరజనాభా!
తాత్పర్యం.56B
ఓ నీరజనాభా! నీ పదమునే నేను ధ్యానిస్తాను.నీ పదమునే నమ్మి సేవించి,అదే నా భాగ్యం అనుకుంటాను.పరమపదమును చేర్చగలిగే పాదము నీదే స్వామీ!
**********************************************************
Comments
Post a Comment