11/3.రోజుకో చరిత్ర (మార్చి)
అభినవ ద్రౌపది
నేను అభినవ ద్రౌపది ని
ఆధునిక వైద్యశాస్త్రపు
శస్త్రచికిత్సాలయమనే
యజ్ఞ గుండంలో
అయోనిజగా జన్మించాను
నచ్చిన వరుడికోసం
నాన్న ప్రకటించిన
తెలుగు మాట్రిమొనీల
స్వయంవరంలో
నా మనసు మత్స్యయంత్రాన్ని
అందం,చదువు, ఆస్తి
ఉద్యోగం,హోదా అనే
ఐదు బాణాలతో పడగొట్టిన
మన్మథుణ్ణి పెళ్ళాడాను
తీరా మూడుముళ్ళు పడ్డాక తెలిసింది
అనుమానం,అహంకారం
ధన దాహం,దుర్వ్యసనం
స్త్రీ వ్యమోహమనే
పంచేంద్రులూ
అతనిలోనే దాగున్నారని
ఈ పంచ పాండవుల్లో
అతను ఎప్పుడు
ఏ రూపాన్ని బయటపెట్టినా
కాదనకుండా కాపురం చేస్తుంటాను
సౌఖ్యం రాజధానిగా
అతనిలోని అర్థభాగాన్ని
ఏలుకోమని ఆశీర్వదిస్తూనే
ధనాంధులైన
అత్తమామల సమక్షంలోనే
తాళి కట్టిన వాడు
తనకేం పట్టనట్లు
తలవంచుకు కూర్చుంటే
పెట్టుపోతలు ,లాంఛనాల
లెక్కలు తేలని
పెద్దల బేరసారాల
సభాపర్వంలో
నాకు తెలియకుండానే
నేనొక సమిధనవుతాను
అత్తింటివారి
సూటిపోటి మాటలు
నా ఆత్మాభిమనే వస్త్రాలను
నట్టింట్లో ఊడ్చేస్తుంటే
సహనమనే ఆపద్బాంధవుడిని
సాయమడిగి
పదిమందిలో నా పరువును
కాపాడుకుంటాను
మగమృగాలు
విచ్చలవిడిగా సంచరించే
అరణ్యవాసంలో
వావివరుసలెరుగని
సైంధవులను
ఉద్యోగపర్వపు సమస్యల
అజ్ఞాత వాసంలో
అల్లరిపాలు చేయాలనుకునే కీచకులను
దక్కలేదన్న అక్కసుతో
పుకార్లతో
నా మర్యాదను
మంటగలపాలనుకునే
ఉపకీచకులను
లౌక్యమనే భీమబలంతో
ఎదుర్కొంటూ
గుట్టుచప్పుడు కాకుండా
జీవితాన్ని
నెట్టుకొస్తుంటాను
నా మనసులో
జుట్టు విరబోసుకొని
భోరుమని ఏడుస్తోన్న
అసహనం
ఆవేశం ,ఆలోచనల మధ్య
నిత్య కురుక్షేత్రం
ఈ సంఘర్షణ లో
నాలో నిద్రావస్థలో ఉన్న
ఆశయం,ఆనందం
ఆత్మవిశ్వాసం
కలలు,కళలు అనే
బిడ్డల్ని పోగొట్టుకుంటాను
నన్ను నేను కోల్పోయి
సమస్తం శూన్యమైపోయిన
ఈ జీవన సంధ్యాసమయంలో
దక్కిన ఆస్తుల సింహాసనం
నాకు ఏ సంతోషాలను
పంచగలదు?
బాధలు బాధ్యతల
బరువును
అవమానాల పరంపరలను
బ్రతుకంతా మోసి మోసి
అలసిన నా
మనశ్శరీరాలకు
మనశ్శాంతినిచ్చే విశ్రాంతి
మహాప్రస్థానమేనా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
*వర్ణ సంశోభిత వనిత*
ఆమె
నుదుటి బొట్టులో *ఎరుపు* వన్నె
సోగకన్నుల్లో *నలుపు* వన్నె
చెంపల్లో *కెంపు* వన్నె
విచ్చుకున్న పెదవుల్లో *గులాబీ* వన్నె
పల్వరుసలో *తెలుపు* వన్నె
లేలేత పాదాలు *పసుపు* వన్నె
చేతి గాజుల్లో *ఆకుపచ్చ* వన్నె
చుట్టుకున్న చీరలో *నీలి* వన్నె
కురులలోని విరులు *కనకాంబరం* వన్నె
ఆభరణాలలో అందాలు *బంగారు* వన్నె
రోజుకొక్క ఆహార్యంలో మెరిసి మురిపిస్తూ
హరివిల్లును తలదన్నే అద్భుత వర్ణ సమ్మిళితమైన
ఆమె మీతో ఉందంటే
మీ జీవితం
నిత్యమూ *హోలీ పండుగే*
మరి మీరు
ఔనంటారా!
కాదంటారా!
మిత్రులందరికీ *హోలీ పండుగ* శుభాకాంక్షలు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
కంటి నిండా....రా..నిదురా
ఆలోచనల పెనుగాలి
*నిదుర* మబ్బులను చెదరగొట్టగా
తెల్లమొహం వేసుకుని చూస్తున్నాయి...*కళ్ళు*
కనురెప్పల వాకిలి మూశాను
బంధిద్దామంటే
ఎంత వెతికినా
దొరకటం లేదు
*నిదుర* తాళంకప్ప
కంటి ప్రమిదలో
కొండెక్కిన దీపం
*నిద్దుర*
నేను వాకిళ్ళు గట్టిగానే వేశానే!
ఇది లోపలికి ఎలా వచ్చింది చెప్మా!
అని విస్తుపోయింది
*నిద్దుర*
*కలను* చూసి
ఎదుటివారికి ఉంది
తనకు లేదే!అని
మనిషి అసూయపడే
విషయాలలో
*నిదుర* కూడా ఒకటి కదూ!
అందరికీ *వరల్డ్ స్లీప్ డే* శుభాకాంక్షలు
సింహాద్రి జ్యోతిర్మయి
19.3.2022
వరల్డ్ స్పారో డే
సహానుభూతి
మానవా!
నేనెవరో గుర్తుపట్టావా!
నేను నీ చిన్నారి నేస్తాన్ని
నీ చిన్ననాటి నేస్తాన్ని
ప్రాణసంకటంలో పడ్డావంటే
పలకరించి పోదామని
తగిన శాస్తి జరిగిందని
శపిస్తున్న నా వారిని వారించి
ఈ కష్టకాలంలో నీకు
సహానుభూతి చూపి
నాలుగు మంచిమాటలు
చెప్పి పోదామని
ఎగురుకుంటూ ఇలా వచ్చాను
సెల్ ఫోన్ టవర్
రేడియేషన్
అనే బ్రహ్మాస్త్రాన్ని
నాపై ప్రయోగించి
నా జాతిని
నామావశిష్టం చేశావు
తాడిని తన్నేవాడి
తలదన్నేవాడు
ఉంటాడు అన్న
పెద్దలమాట
నీకు అనుభవంలోకి
వచ్చింది కదూ!
ఇప్పుడు కరోనా వైరస్ తో
నీ కొచ్చిన కష్టం చూస్తుంటే
మనుగడ కోసం
నా జాతి పడ్డ
మూగవేదన
గుర్తుకొస్తోంది
అయినా నేను
నిన్ను శపించను
నువ్వు ఈ విపత్తు నుండి
త్వరగా, క్షేమంగా
బయటపడాలనే
కోరుకుంటాను
ఎందుకంటే
ఉనికిని కాపాడుకోవడం లో
ఉన్న కష్టాన్ని
నేనూ అనుభవించాను కనుక.
ఓ!మనిషీ!
నాకివ్వు
గుప్పెడు గింజలు
గుక్కెడు నీళ్లు
నీవు
వర్ధిల్లాలని కోరుకుంటాం
వందేళ్ళు
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.03.2020
మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నా కవిత
*నా పేరు....కవిత్వం*
నా ఉనికి మనోజగత్తు
నాకు అక్షరాలు అనంతం
నా రూపాలు బహుముఖం
నా మూలాలు వేల యేళ్ళక్రితం
నాటుకున్నాయి
దార్శనికత నా లక్షణం
మార్మికత నా సౌందర్యం
భక్తి,రక్తి,విరక్తి
ఆగ్రహం, ఆవేశం,సందేశం
అలవోకగా పలికిస్తా
నవరసాలు తొణికిస్తా
కంటితో చూసిన దృశ్యం
ఊహలో తట్టిన భావం
బుద్ధితో పొందిన జ్ఞానం
నా కోసం
అక్షర శిల్పాలుగా
మూర్తీభవిస్తాయి
అంతరంగ సాగరాలు మధించి
ఆణిముత్యాల భావాలు వెలికితీసి
ముత్యాల సరాలల్లి
నాకు అలంకరిస్తారు
స్పందించే హృదయాలు
కుక్కపిల్ల ,సబ్బుబిళ్ళ ,అగ్గిపుల్లలో కూడా నన్ను దర్శించి
అభ్యుదయాన్ని నా కద్దుతారు
నేను వెన్నెల్లో ఆడుకునే
అందమైన ఆడపిల్లననీ
నేనొక తీరని దాహాన్ననీ
ఏవేవో అంటూ
నన్ను అనుభూతి చెందుతారు
భూతకాలాన్ని పాఠంగా
వర్తమానాన్ని దర్పణంగా
భవిష్యత్తును ఆశాకిరణంగా
నాలో నిక్షిప్తం చేస్తారు
సమాజ హితాన్ని కోరి
సరస హృదయాల సమ్మోదాన్ని నింపే
నా పేరు కవిత్వం
నా విలాసం మీ స్పందన
సింహాద్రి జ్యోతిర్మయి,
న.ర.సం.రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
*మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం*
సందర్భంగా
సినీజనారణ్యంలోని *లేడీ కూన* లపై నా కవిత
*అడవి దోచిన వెన్నెల*
ఆ చందమామ
సినీ వినీలాకాశంలో మెరిసింది
ఆ వెన్నెల
అడవిలో కాచింది
ఆ అందం చందనవృక్షమై పరిమళించింది
ఆ కుసుమం
ప్రకృతి సోయగాన్ని పెనవేసుకుంది
తాను అభయారణ్యంలో
ఉన్నానని భ్రమిసిన
ఆ పువ్వుకు
అడుగడుగునా
పొంచి ఉన్న
ఆపదలెన్నో
అవగతమైంది
మభ్యపెట్టి ఆకర్షించే మారీచులు
సాధువుల్లా సంచరించే రావణాసురులు
నిలువునా దోచుకోవాలని చూసే వీరప్పన్లు
బుస కొట్టే విష నాగులు
కోరికతో బంధించాలనుకునే కొండచిలువలు
పంజా విసరటానికి ప్రయత్నించే పెద్ద పులులు
అడవికి రారాజులమని
నమ్మించే సింహాలు
అతివినయాల గుంట నక్కలు
తోక ఊపుకుంటూ తోడుగా ఉన్నామని నమ్మించే తోడేళ్లు
తొక్కేయాలని చూసే మదగజాలు
వెకిలిచేష్టల వానరాలు
ఇన్నింటి
వాడి చూపుల
మధ్య
తానో లేడికూననని తెలుసుకున్నది
కాసింత ఆసరా కోసం
పందిరవుతుందనే ఆశతో
ఆశ్రయించిన బంధమే బంధనమైంది
క్రమంగా
ఆ చందమామను అమావాస్య ఆవరించింది
ఆ వెన్నెల మసకబారింది
ఆ పువ్వు
ఒకనాటి సౌందర్యం
ఒక్కనాటి ముచ్చటై
వెలవెల పోయింది
అది రాముడికి ఆశ్రయమిచ్చిన వనమే అయినా
అక్కడ
రమణికి మాత్రం రక్షణ లేదన్న
చేదు నిజాన్ని జీర్ణించుకోలేని
ఆ పువ్వు
ఆ
(అ) భయారణ్యంలో
అనారోగ్యంతోనో
ఆత్మహత్యతోనో
అనామకురాలిగానో
మిగిలిపోతూ
రాలిపోయిన వేళ
ఎందరో
కళాకారిణి అని
నినదించినా
కొందరు
కళంకిత అని నిందించినా
ఆమె మాత్రం
వెండితెరను
వెలిగించి వెలిగించి వెలిసిపోయిన
వెన్నెల
అది అడవి గాచిన వెన్నెల
కాదు కాదు
అడవి దోచిన వెన్నెల
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సులు.
నిన్న ప్రపంచ అటవీ దినోత్సవమట.
ఈ రోజు జల దినోత్సవమట.
రెంటినీ జతచేసి నేను రాసిన కవిత.
మొక్క( కంట ) నీరు
నేను
పంచభూతాలను,ప్రకృతిని
పదిలంగా కాపాడే
పచ్చని చెట్టుని
నా ఉఛ్వాసంతో విషాన్ని గ్రహించి
నిశ్వాసంతో ప్రాణవాయువునిచ్చే
చల్లని నేస్తాన్ని
కానీ నరుడా!
నువ్వు నాశనం చేస్తున్న వనాలకి
నాటుతున్న మొక్కలకి
సమతౌల్యం ఏదీ!
నా మూలాలు నరికేసి
నాగరికత పేరుతో
నగరాలుగా ఎదిగావు
నీటిచెమ్మను నిల్వచేసే
నన్ను విస్మరించడంతో
పుడమి గర్భం ఆర్చుకుపోయి
వట్టిపోతోంది.
మట్టి తల్లి కష్టానికి
సూర్యుడు మండిపడుతున్నాడు
గాలి వేడి నిట్టూర్పులు విడుస్తూంటే
నీటి మబ్బులు ఇంకుతున్నాయి
ఆకాశం చిల్లులు పడుతోంది.
నదుల శోకం వరదలై
పల్లాలను ముంచెత్తుతోంది
కడలి గుండె కదలిపోయి
సునామీలుగా విరుచుకుపడుతోంది
పాపభారాన్ని మోయలేనంటూ
ధరణి అసహనంగా కదులుతోంది.
హిమానీ నదాలు కరిగి
మంచుపెళ్ళలు విరిగి
వన్య ప్రాణులు తరిగి
కరువు కాటకాలు పెరిగి
పర్యావరణం ప్రశ్నిస్తోంది
ఇచ్చిపుచ్చుకోవటమనే
మర్యాదను మరచిన మానవుడా!
ప్రకృతిని
ఉపయోగించు కోవటమే కాదు
ఉపయోగపడటం కూడా నేర్చుకో
నేడు దోచుకోవటం మాని
రేపటికి దాచుకోవటం నేర్చుకో
వనాలను జలవనరులను కాపాడుకో.
నీటిచుక్క ప్రాణాధారం
చిన్నమొక్క రేపటి కాధారం.
సింహాద్రి జ్యోతిర్మయి
కవయిత్రి
న.ర.సం.ఉపాధ్యక్షురాలు.వరల్డ్ వాటర్ డే
నీటితో శుభ్రం గా
వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడమే
ప్రస్తుత పరిస్థితుల్లో
కరోనాకు నివారణోపాయం అన్న నేపధ్యంలో
ఓ ప్రాణాధారమా!
భూమాత గర్భంలో
పదిలంగా దాచుకున్న నిన్ను
వెలికి తోడి
ఇష్టం వచ్చినట్టు వాడి
కలుషితం చేసి
వృధాగా పారబోసి
రేపటి తరాలకు
లేకుండా చేసే
ప్రమాదాన్ని సృష్టిస్తున్నా
ప్రేమను వీడకుండా
ప్రాణాంతకమైన
కరోనా కాటు నుండి
మానవజాతిని
కాపాడే
ఏకైక దిక్కువైనావు
మారణహోమంలో
సమిధలం కాకుండా
సంరక్షిస్తున్న
సలిలమా!
నీకదే నా వందనం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.3.2020
వరల్డ్ వాటర్ డే
వరల్డ్ వాటర్ డే
నీటితో శుభ్రం గా
వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడమే
ప్రస్తుత పరిస్థితుల్లో
కరోనాకు నివారణోపాయం అన్న నేపధ్యంలో
ఓ ప్రాణాధారమా!
భూమాత గర్భంలో
పదిలంగా దాచుకున్న నిన్ను
వెలికి తోడి
ఇష్టం వచ్చినట్టు వాడి
కలుషితం చేసి
వృధాగా పారబోసి
రేపటి తరాలకు
లేకుండా చేసే
ప్రమాదాన్ని సృష్టిస్తున్నా
ప్రేమను వీడకుండా
ప్రాణాంతకమైన
కరోనా కాటు నుండి
మానవజాతిని
కాపాడే
ఏకైక దిక్కువైనావు
మారణహోమంలో
సమిధలం కాకుండా
సంరక్షిస్తున్న
సలిలమా!
నీకదే నా వందనం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.3.2020





Comments
Post a Comment