11/6.రోజుకో చరిత్ర (జూన్)







World Milk Day is an international day established by the Food and Agriculture Organization (FAO) of the United Nations to recognize the importance of milk as a global food.[1] It has been observed on June 1 each year since 2001.[2] The day is intended to provide an opportunity to bring attention to activities that are connected with the dairy sector.[2]



June 3 rd
World bicycle day

హాయ్
This is చైతూ and this is my bike 

🚲

ఈ రోజు *వరల్డ్ బైసికిల్ డే* అట.మా అమ్మమ్మ చెప్పింది.(మా అమ్మమ్మ కి అదే పనిలెండి.ఏరోజు ఏ స్పెషల్ డే నో తెలుసుకుని కవితలు రాయడమే.😜)
బై ద వే
మొన్ననే నా పుట్టినరోజు గిఫ్ట్ గా నాన్న నాకు ఈ సైకిల్ కొనిచ్చారు.

దీనికి
*డీజిల్ ,పెట్రోల్ అవసరం లేదు
*గ్యాస్ తో పనిలేదు
*యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు
*హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి దెబ్బలు కూడా తగలవు
*పైగా ఎకో ఫ్రెండ్లీ

*గాలి కొట్టేస్తే చాలు
రయ్ రయ్ మని ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు.

*సైకిల్ తొక్కడం చక్కని వ్యాయామం కూడానూ 

ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా

ఈ సైకిల్ ఎక్కే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్ టి రామారావు గారు  తొమ్మిది నెలల్లోనే ‌సినిమా రంగం నుండి ముఖ్యమంత్రి పీఠానికి చేరుకుని ఏకంగా గిన్నెస్ బుక్ లోకి ఎక్కేశారు తెలుసా! 
చూశారా మరి! అప్పుడే నాకు ఎన్ని  విషయాలు తెలిసిపోయాయో!
ఎన్ని మంచి హేబిట్స్ ఉన్నాయో!
ఎందుకంటే
*I am a good girl*

అందరికీ *world bicycle day* శుభాకాంక్షలు


అయ్యో!
మీతో కబుర్లు చెబుతూ కూర్చుంటే నాకు లేట్ అయిపోతోంది.

నేను నా బైక్ మీద ఆడుకోవడానికి వెళ్ళాలి.
బై బై 
మీ చైతూ!


June 2 international whores day (or)
International sex workers day సందర్భంగా చాలా కాలానికి నేను రాసిన కొత్త కవిత

***************
 గాయాల చెట్టు
**************
ఏ పూల పొదరింటి దీపమో
ఏ తల్లి తెలియక చేసిన  పాపమో
ఏ తొలి ప్రేమ చేసిన మోసమో
ఏ మూఢ విశ్వాసాల దోసమో
నేను కళ్ళు తెరిచేసరికి
ఈ వాడలో మంకెనపువ్వై విచ్చుకున్నాను
నా ఆశల చిగుళ్ళు గిల్లి
నా నవ్వుల పువ్వులు నలిపి
నా సున్నితత్వపు పిందెల్ని కొరికి
నా కలల కొమ్మలు నరికి
నా భావ వసంతాలు మండించి
వెలలేని నా మనసుని చూడక
వెలకట్టి నా తనువును చూసి
వెలయాలుగా నన్ను మార్చి
వాడుకుంటున్న ఈ వాడలో
పచ్చనోట్లు పండించిన ఈ 
అందమైన శవానికి
చిల్లర మాత్రమే చిక్కుతుంటుంది
 తన 
చెల్లి, తల్లి,భార్య, ప్రియురాలు
ఇన్ని బంధాలను
కాపలా కుక్కలా కాపాడే ఆ మగాడు
నా జీవితపు విస్తరిని
చింపే కుక్కల్లో
తానూ ఒకడవడం
నాకెప్పుడూ ఆశ్చర్యమే
పాదచారుల నుండి
పడవంత కారుల దాకా
నిత్యమూ వస్తూ పోతూ ఉండే
నా శరీరమనే
తారురోడ్డుపై
ఎన్నెన్ని అకృత్యాల యాక్సిడెంట్ల 
మరకలు అంటుతుంటాయో లెక్కేలేదు
ఆ రక్త స్రావాల గుర్తుల్ని కడిగేసుకుని
మళ్ళీ మరొక దాష్టీకానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటుంటాను
ఉప్పెనలా ఉరికే
ఉప్పు నీటి సముద్రాలలో
వేసుకున్న వేషం
వెలిసిపోతుందేమోనని
ఎగసిపడే
అసహనపు అలల్ని
లోలోపలే ముడుచుకుని
కనురెప్పల చెలియలికట్టను మూసి ఉంచుతుంటాను

చెరకు రసం మరలో
చెరకుగడలా
నాలోని రసమంతా పిండి పిప్పి చేశాక
ఆ బండికిందకి నన్ను విసిరేస్తే
రోగాల ఈగలు ముసురుకుంటున్న నన్ను
మున్సిపాలిటీ చెత్తబండి మోసుకుపోతుంది
క్షుద్ర పూజలో
బలవంతంగా
బలిపశువునైన 
నాపై ఒక కన్నీటిబొట్టయినా రాల్చే కళ్ళుండవు
గంధపు చెట్టులా
విలువకట్టి 
కావలసినంత నరుక్కుంటూ
సమూలంగా కూల్చి వేయబడి
ఆడుకోవడానికే తప్ప
ఆదుకోవడానికి నోచుకోని
ఈ గాయాల చెట్టుకు
ప్రాణం ఉంటుందని
గుర్తించే 
జగదీశ్ చంద్రబోస్ వంటి
శాస్త్ర వేత్త 
ఎప్పటికి పుడతాడో!

కమలహాసన్ మహానది సినిమా చూసి వారం రోజుల పాటు కలతనిద్రతో కలవరపడిన నాటి నా హృదయాన్ని నేటికి ఆవిష్కరించే సందర్భంగా భావించి
దగాపడి వేశ్యావాటికల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్న 
ఆడపిల్లలకు అంకితం చేస్తూ

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు




.................. నేనో కడలి....................

అప్పుడప్పుడు
నా హృదయంలో 
 ఆనందాల సూర్యోదయాలు
నా కన్నుల్లో 
 ఉప్పనైన నీరు
నా చెవుల్లో 
సముద్రపు హోరు
నా గర్భంలో
 బాధల బడబానలం

నా సుఖదుఃఖాలు
వచ్చీపోయే అలలు
నా ఆవేశాలు
బంధాల్ని తుడిచిపెట్టే సునామీలు
నా అనుభవాలు
జ్ఞాపకాలుగా ఘనీభవించిన ఆణిముత్యాలు
నా బంధుత్వాలు
నా ప్రపంచాన్ని వర్ణమయం చేసే
జలచరాలు
నా కష్టాలు
ఎంతటి తుఫానులుగా మారతాయో
తెలియని అల్పపీడనాలు
నా సంతోషాలు
నా పాదాలచెంత ఆడుకునే పసివారి కేరింతలు

మొత్తానికి నాలో ఒక సముద్రం
నేనే ఒక సముద్రం

సింహాద్రి జ్యోతిర్మయి
8.6.2018



.............పర్యావ (మ )రణం...........

ప్ర.....కృతి పరమాత్ముడిచ్చిన వరం
పం.....చ భూతాలు ప్రాణికోటికి జీవాధారం
చ.......రాచరాలు సృష్టి వైవిధ్యానికి నిదర్శనం

ప....... చ్చని చెట్టుకు మానవుడు పగవాడై, ప
ర్యా....వరణాన్ని పాడుచేస్తూ...
వ.....నాలను నిర్మూలిస్తూ...
ర....క్షించ వలసిన మూగ జీవులకు మర
ణ....శాసనాలు రాస్తుంటే ,
             సముద్రాలు సునామీలై

ది......నకరుడు అగ్ని గుండమై,గగ
నో.....పరితల ఓజోను ఛిద్రమై ,వా
త్స.....ల్యంతో వహించే భూమి 
            ‌ కాలుష్యపు కాసారమై, జీ
వం.....నింపే గాలి విషతుల్యమై
            ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది

ఓ మానవుడా!
ఇప్పటికైనా మేలుకో
ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో
చిన్న మొక్కను నాటి పెంచు
మూగజీవాలకు గుక్కెడు నీళ్ళివ్వు
అన్ని ప్రాణులనూ బ్రతకనివ్వు
వాటికోసం కాదు
నీ మేలు కోసమే
ధర్మో రక్షతి రక్షితః   
ఎలాగూ విస్మరించావు
కనీసం
వృక్షో రక్షతి రక్షితః
అన్న ఆధునిక నినాదాన్నైనా పాటించు
ప్రపంచాన్ని కాపాడు
నీవు అశాశ్వతమైనా
నీ చేత శాశ్వతం 
నీ కుటుంబం
పదితరాలు బాగుండాలని కోరుకుని 
కూడబెట్టుకునే నువ్వు
ఈ భూగోళం
ప్రాణికోటికి 
తరతరాలకు
ఆధారమని 
గుర్తించు ,రక్షించు.

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
5.6.2020






*కడలి గర్భ(0)శోకం*

ఆ నల్లని మేఘానికి
చల్లని నీటిచెలమను
నేనే ఇచ్చాను
ఉప్పంతా నేనే 
అట్టి పెట్టుకుని 

ఆనందంగా
పయనం ప్రారంభించిన
నీలిమేఘం
అనువైన నేలను చేరుకుంది
చినుకై పరిమళింపజేసింది
వర్షమై పంటనందించింది
నాకీ జన్మనిచ్చిన
కడలి నొకసారి
కన్నారా చూసొద్దాం రమ్మని
మేఘం ఆమె నడిగింది
ఛీ!ఛీ! ఆ ఉప్పంటే
నాకు తగని చిరాకు
నేను రాను పొమ్మందది

మేఘం నావైపొకసారి నిస్సహాయంగా చూసింది
నేనిచ్చిన నీరే కన్నీరుగా
నాపై కురిపించి 
జాలిగా 
వెనుకకు మరలింది 

అది చూసి నాలో ఒక
ఉద్వేగపు అల
ఉవ్వెత్తున లేచి
విరిగిపడింది
అయినా పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ..
గర్భశోకంతో 
లోలోన ఘోషిస్తూ
నిత్యం  సాగిస్తున్నా
జీవన పోరాటం 

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
23.12.2022




 




చెట్టు నీ ఊపిరి
మట్టి నీ మనుగడ
వాయువు నీ ఆయువు
జలం నీ జీవం
మొక్కను
చిగురింపజేయి
భవిష్యత్ తరాల 
ఆశలు కూడా
చిగురిస్తాయి
నీటిని ఆదా చెయ్యి
రాబోయే తరాలు
గొంతు తడుపుకుంటాయి
అశాశ్వతమైన
నీ జీవిక కోసం
శాశ్వతమైన ప్రకృతిని
వికృతికి గురిచేసి
పర్యావరణాన్ని
సమస్త జీవ రాశిని
శాపగ్రస్తం చేసే హక్కు
నీకు లేదు





The world is set to witness June's full moon, known as the Strawberry Moon, on June 11, Wednesday. This full moon will mark the final one of spring in the Northern hemisphere. What makes this year's event more special is that it will be the lowest full moon in nearly 20 years, as per the BBC. Caused by an event known as a 'major lunar standstill', the opportunity will not arise again until 2043. This rare phenomenon will give the moon a warm, golden glow, making it a must-see event for skywatchers across the northern Hemisphere. 


*బాల(కార్మి)కులం*

భరతమాత పిల్లలం ఆర్యులారా 
మా భవితకు మార్గమేది మాన్యులారా
చిన్ని గుండెలోన మాకు
చింతలెన్నొ ఉన్నాయి
అందమైన రేపటిపై
ఆశలెన్నొ ఉన్నాయి
చింతదీర్చు వారికొరకు వెతుకుచుంటిమి
ఆశతీరు అవకాశం అడుగుచుంటిమి


పేదరికం శాపమై
చిన్నిపొట్ట భారమై
పనిచేయక తప్పక
పసి వయస్సు ఓపక
గంజినీళ్ళ కోసమై పసిడిమేడలో
పంజరాన చిలుకలల్లె మగ్గుచుంటిమి

మాకు స్వేచ్ఛనివ్వండి పెద్దలారా
మనుషులల్లె చూడండి మమ్ముకూడా

ఆడపిల్ల పుడితేను కాపురమే ఉండదంటు
అత్తవారు బెదిరిస్తే అసహాయపు తల్లులు
మనసుచంపుకోని మమ్ము విసిరివేయగా
కూడు గూడు తోడు లేక కుములుచుంటిమి
వీధిబాలలం మేము విజ్ఞులారా
వినరండి మావేదన వీనులారా

మాకోసం చట్టాలట మాకెన్నో హక్కులంట
సంక్షేమపు హాస్టళ్ళట నిర్బంధపు విద్యలంట
పథకాలను పెట్టినంత ఫలితముండునా
చిత్తశుద్ధి లేని చేత మార్పుతెచ్చునా
పసివాళ్ళము మము గనండి కరుణతోడ
పనివాళ్ళను చేయకండి ప్రేమ లేక 

రైలుపెట్టె తుడిచేము కాఫీకప్పు కడిగేము
గొడ్లుకాచుకుంటాము
బూట్లు తుడుస్తుంటాము
ఒక బాల్యం బడిలోపల ఎదుగుతున్నది
మా బాల్యం మసకబారిపోతున్నది
చిన్ని మనసు తెలుసుకోండి అయ్యలారా
పెద్దమనసు చేసుకోండి అమ్మలారా!

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు



.నేడు జూన్ 14
రక్తదాతల దినోత్సవం సందర్భంగా
రక్తదానం పై
నా అనుభవాలు
నా భావాలు మీతో పంచుకోవాలని....

నేను నర్సరావుపేట లోని PNC &KR డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు మా కాలేజీలో NSS జాతీయ సేవా పథకం బాలికల విభాగానికి నేను ప్రోగ్రాం ఆఫీసర్ ని.మాది మూడవ యూనిట్.తక్కిన రెండు బాలుర విభాగాలకి నా కొలీగ్స్ ప్రభాకర్,గురుకిషన్ ఆఫీసర్లు.మేము ఎంతో ఉత్సాహంగా విద్యార్థులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం.ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి,రక్తదాన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించి,
వారిచేత రక్తదానం రక్తదానం చేయించేవాళ్ళం.
నేను కూడా PG విద్యార్థి గా ఉన్నప్పటినుండి రక్తదానం చేశాను.కొన్నిసార్లు మా సిటీ కేబుల్ లో రోగికి రక్తం కావాలన్న అభ్యర్థన చూసి, నేను స్వయంగా ఆసుపత్రి కి వెళ్ళి రక్తదానం చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఈ బీపీ, షుగర్ వంటి వ్యాధులతో రక్తదానం చేసే అవకాశం లేక చాలా బాధగా ఉంటుంది.ఏదేమైనా నేను సైతం ఈ మహత్తరమైన సేవలో కొంత భాగస్వామిని
ఐనందుకు సంతోషిస్తూ...

నేను ఎప్పుడో రక్తదానం మీద రాసిన
నా కవిత

.....................రక్తం................

తల్లి
తన రక్తాన్ని పంచి
నీకు జన్మనిచ్చింది

తన రక్తాన్ని పాలుగా మార్చి
నీకు స్తన్యమిచ్చింది

తండ్రి
తన రక్తం ధారపోసి
నిన్ను పెంచి పెద్దజేశాడు

రైతు
తన రక్తాన్ని 
చెమటచుక్కలుగా మార్చి
నీకు అన్నం పెడుతున్నాడు

దేశభక్తులు
తమ రక్తాన్ని చిందించి
నీకు స్వాతంత్ర్య ఫలాన్ని అందించారు

వీర సైనికులు
తమ చివరి రక్తపు బొట్టువరకు
దేశమాతను రక్షించడానికి పోరాడుతున్నారు

ఇందరి రక్తబంధం
నిన్ను కాపాడుతుండగా
ఎదుటి వాడి రక్తాన్ని కళ్ళ జూడాలనే
కాఠిన్యం నీకెందుకు?

రక్తపుటేరులు పారించిన అశోకుడే
బాధాతప్త హృదయుడై
బౌద్ధాన్ని స్వీకరించలేదా!

రక్తమంటే
స్వార్థ త్యాగం
రక్తమంటే
రక్షించే బంధం

రక్తపు విలువను గుర్తించు
రక్తదానంచేసి గర్వించు

సింహాద్రి జ్యోతిర్మయి
14.6.2018


తల్లిదండ్రి భారమని తలపబోకుమా!
మన ఇంటి వేల్పులని మరువబోకుమా!
చిన్ననాటి కన్నప్రేమ  గుర్తుచేసుకో
కన్నపేగులో ఉన్న కలత తెలుసుకో!

గోరుముద్దలే పెట్టి గోము చేసినా
ముచ్చటలే జరిపించి ముద్దు చేసినా
పొరపాట్లు నాన్నదాక పోనీయక
కప్పిపుచ్చి మమతతో కాపు కాసినా
ఆనాటి అమ్మ ప్రేమ గుర్తుచేసుకో
కన్నకడుపులో ఉన్న కలత తెలుసుకో


అడిగినంతనే ప్రతీ చిన్న ఆశ తీర్చినా
అడగకున్ననూ మనసుపడ్డ సుఖము కూర్చినా
కష్టమన్నదెప్పుడూ కలగనీయక
నీ ఉన్నతి కోసమై వెతలకోర్చినా
ఆనాటి నాన్న ప్రేమ గుర్తుచేసుకో
కన్న కడుపులో ఉన్న కలత తెలుసుకో

లోకమంత దెప్పిపొడిచి గేలిచేసినా
కోరుకున్న వారినిచ్చి పెళ్ళి చేసినా
కన్నప్రేమ కేమాత్రము విలువనీయక
ఋణము దీర్పగలవా నీవెంత చేసినా
ఆనాటి ఆ ప్రేమ గుర్తుచేసుకో
కన్నకడుపులో ఉన్న కలత తెలుసుకో

పెట్టుపోతలేవి మేము మిమ్ముకోరము
పేగుబంధమయ్యెనా నేడు నేరము
మనుమలతో ఆడిపాడి సేదదీరక
ముదిమి మాకవుతున్నది తగని భారము
ఆనాటి మీ వేడుక గుర్తుచేసుకో
ఈనాటి మా వేదన అడిగి తెలుసుకో

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
24.12.2021




జూన్ 21
World music 🎶 day
....‌.............జీవన ( సం ) గీతం......‌........

కమ్మనైన అమ్మ జోలపాట
శ్రీకారం వంటి చెవులకు
ఓంకారమై సోకిన తొలి సంగీతం

ఒప్పులకుప్ప‌ ఒయారి భామ
సుబ్బీగొబ్బెమ్మ సుబ్బణ్ణియ్యవే
అంటూ ఆటను పాటను
మిళితం చేసుకుంది నా బాల్యం

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే
ఎన్నాళ్ళకొస్తాడే అంటూ
సినిమా పాటలు పాడుకుంటూ
కలలు కన్నది నా యవ్వనం

పందిట్లో మంగళ వాద్యాలు
వేదమంత్రాల ఘోషలు
సీతారాముల కళ్యాణం చూతము రారండీ
అంటూ కళ్యాణరాగాల సందడిలో
ముడిపడింది నా వివాహబంధం

పండిట్ రవిశంకర్ సితార నాదంలా
బిస్మిల్లా ఖాన్ షహనాయి సంగీతంలా
జాకిర్ హుస్సేన్ తబలా వాయిద్యంలా
హిందీ తెలుగు పాత సినిమా పాట ల్లా
మధురాతి మధురంగా
సాగింది నా సంసార జీవితం

నీవు లేక వీణ పలుకలేనన్నది
అంటూ ఆషాఢ మాసపు ఎడబాటులో
వీణపాటలా 
నిట్టూర్చింది నా విరహం

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
అంటూ అన్నమయ్య కీర్తనలా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ
అంటూ వేదవతీ ప్రభాకర్ లలితగీతంలా
మురిసిపోయింది నా మాతృత్వం

కౌసల్యా సుప్రజా‌రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే
అంటూ భక్తిభావాన్ని మనసులోనింపి
తాదాత్మ్యం చెందించింది 
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యం

పాడుదమా స్వేచ్ఛాగీతం
ఎగరేయుదమా జాతిపతాకం
అంటూ ఉత్తేజం నింపింది
 దేశభక్తి గీతం

ఏ దేశ చరిత్ర చూసినా 
ఏమున్నది గర్వకారణం
అంటూ ఆవేశపడుతూ
ఎక్కడికెళ్తోంది దేశం ఏమైపోతోంది
అంటూ అన్యాయాన్ని సహించలేక
  విప్లవ గీతమై నినదించి
ఆక్రోశించింది నా ఆవేశం

బాధతో దుఃఖంతో
మనసు తల్లడిల్లిన వేళలో
ఘంటసాల భగవద్గీత
చేకూర్చింది సాంత్వనం

నా జీవితంలోని ప్రతి సందర్భం
సంగీతంతో పెనవేసుకున్న 
అందమైన బంధం
ఇది నా జీవన ( సం ) గీతం

సింహాద్రి జ్యోతిర్మయి
21.6.2018


Father 's day
June 3rd Sunday

నాన్న లేడు నాకు

అదేంటి?
నాన్న లేకుండా నేనెలా పుట్టాను
అని అడగకండి
నీకు నాన్న లేడుగా!
నువ్వు ఫాదర్స్ డే విషెస్ ఎవరికి చెప్తావు?
అని స్నేహితులు
నా వైపు జాలిగా చూశారు
ఆ మాటే అమ్మనడిగితే
నన్ను కౌగలించుకొని
కళ్ళనీళ్ళు పెట్టుకుంది
నన్ను అమ్మ కడుపులో పడేసి
అమ్మను మోసం చేసి
నన్ను ఒక తండ్రి పేరు తెలియని వాడిగా 
సమాజంలో నిలబెట్టిన
 ఆ నాన్న
ఇంకెక్కడో
ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందుకుంటూ...
ఇంకెవరికో
నాన్న ప్రేమను 
నిండుగా పంచిపెడుతూ...
నాన్న నా హీరో
అని నమ్మే
ఏ అమాయకపు బాల్యాన్నో మోసం చేస్తూ...
నాలాంటి పిల్లల్ని కనిపారేసిన
అలాంటి నాన్నలారా!
ఫాదర్స్ డే శుభాకాంక్షలు
అందుకుంటూ
ఒక్కసారి మీ భుజాలు తడుముకోండి

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
22.6.2020











ఈ రోజు
27.6.2020
నేషనల్ సన్ గ్లాసెస్ డే అట.


*చలువ కళ్ళద్దాలు*

ఎండలో చల్లదనాన్ని
ముఖానికి అందాన్ని
ఆధునికతను
అద్దడమే కాదు

మనసు మండి
కోపంతో
కళ్ళు ఎర్రబడినా
మనసు కరిగి
దుఃఖంతో
కళ్ళల్లో
కన్నీటి పొర కప్పినా
పెదవులపై
నవ్వు పూత పూసి
మనం
సహనంతోనే ఉన్నట్లు
సంతోషంగానే ఉన్నట్లు
లోకాన్ని
మభ్యపెట్టి
అంతరంగపు అలజడికి
నల్లని తెర వేసే
నేస్తం కదూ!

సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
27.6.2020



Comments

Popular posts from this blog

4/6.*గేయ రామాయణం* ‌‌ యుద్ధ కాండ

గీతా కంద మరందం -1 (ఘంటసాల పాడిన శ్లోకాలు)

4/5.గేయ రామాయణం సుందరకాండ