11/10.రోజుకో చరిత్ర (అక్టోబర్)
October 1st
International *day of older persons*
&
International
*Coffee day*
రెండింటికీ కలిపి ఒకే కవిత
*జీవితం*
(ఓ మంచి కాఫీ లాంటి అనుభవం😍)
నిదుర మేల్కొనే
ఉదయవేళ
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
సుప్రభాతంతో పాటూ
వంటింట్లోనుంచి
మా ఆవిడ వేసే
కాఫీ ఫిల్టర్ సవ్వడులు
డికాషన్ ఘుమఘుమలు
మిళితమై
నిద్రమత్తును వదిలిస్తాయి
*మంచి రుచిగల ఉదయం
కొత్త సన్ రైజ్* అంటూ
సూర్యుని
నునులేత కిరణాలు
తనువును తాకుతుండగా
ఆ వేడి చాలదేమోనని
*కలిసే రుచిని
పంచుకోగలం* అంటూ
శ్రీమతి ఇచ్చే
నురగలు కక్కే
వేడి వేడి
ఫిల్టర్ కాఫీ
ఉదయపు
ఉత్తేజాన్నిస్తూ
గొంతులోకి
జారుతుంటుంది
పాలూ, డికాషన్, పంచదార
సమపాళ్ళలో కలిసిన
కాఫీలా
యవ్వనమంతా
మధురంగా సాగిపోయింది
కాఫీ కప్పు పై అందగించిన
నురుగు లాంటి
జవసత్వాలు మాయమైన
ఆరు పదులు నిండిన
ఈ వయసులో
మింగుడుపడని
బ్లాక్ కాఫీ అయింది వృద్ధాప్యం
జీవితం
ఇన్స్టెంట్ కాఫీలా
ఉండాలని కోరుకునే
నేటి తరానికి
ఫిల్టర్ కాఫీ లాంటి
మా తరం మాటలు
రుచించవు
మేమేదో మాకు తోచిన సలహా ఇస్తుంటాము
పిల్లలు మాత్రం
వాళ్ళకు నచ్చిందే
చేస్తుంటారు
అచ్చంగా
*ఆయన ఫిల్టర్ కాఫీ అడుగుతారు*
*నేనేమో బ్రూ ఇన్స్టెంట్ ఇస్తాను*
*వారికి తేడా ఏమీ తెలీదు*
అని మా రోజుల్లో వచ్చిన *కాంతం గారి
ఎడ్వర్టైజ్మెంట్ లా*
ఆ విషయం
అర్థమౌతున్నా పెద్దరికానికి గుర్తింపు లేదనే ఆ చేదు
బాధపెడుతున్నా
పంచదార లేని కాఫీయే
చక్కెర వ్యాధికి మందు
అని కళ్ళుమూసుకుని తాగేయట్లేదూ!
ఇదీ అంతే అని
సర్దుకుపోవాల్సిందే కదా!
ప్రస్తుతం వస్తున్న
*ప్రేమంటే బ్రూ*
*ఆత్మీయత అంటే బ్రూ ఇన్స్టెంట్*
అనే అత్యాధునికమైన యాడ్ లా
జీవితమంటే అనుభవం
దాన్ని మంచి కాఫీలా
ఆస్వాదిస్తూ
ఆనందిద్దాం
అనుకుంటూ
సాగిపోతున్నాం
వాలిపోయే
పడమర దిక్కుగా......
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.10.2022
*రంగే(యా)లా!*
నా
బాల్యాన్ని ఆనందించాను
యవ్వనాన్ని
ఆస్వాదించాను
మధ్యవయసు దాటి
ముదిమి వైపు
అడుగులేస్తున్న ఈ వయసుని మాత్రం
హుందాగా
ఆహ్వానించలేకపోతున్నాను
వయసు
మీద పడుతోందని
పండుతోన్న తల
ప్రకటిస్తున్న వాస్తవాన్ని
అంగీకరించగలగడం
అది ఒక
సాహసోపేతమైన నిర్ణయంగా
అనిపిస్తోంది
పెరిగిన ఒంటిని
తరిగిన ఓపికని
తరుముతున్న అనారోగ్యాలను
చక్కదిద్దుకోవాలనే
శ్రద్ధను పక్కకు నెట్టి
కేవలం
నల్లని రంగుపులిమి
చెల్లిన వయసును
మళ్ళించేయగలననే
భ్రమను మాత్రమే
బ్రతికించుకుంటున్న
నా అవివేకాన్ని
నేనే సమర్థించుకోలేక
ద్వైదీభావంతో
సతమతమైపోతున్నాను
భగవంతుడిచ్చిన
నా జ్ఞానమనే విభూతిని ప్రదర్శించాలనుకునే నాకు
అరవై ఏళ్ళ వరకూ
ఆయనే ఇచ్చిన
అపురూపమైన
ఆయువుకు ఆనవాలైన
ఈ పలిత కేశాలను మాత్రం
కప్పిపుచ్చేయాలనే
అజ్ఞానం ఎందుకు?
అనే ఆలోచనల
పర్యవసానంగా
బాహ్యసౌందర్యమనే
నల్లనిభ్రాంతిని
కడిగేసి
అంతస్సౌందర్యమనే
స్వచ్ఛమైన తెలుపును
అలవాటు చేసుకోమంటూ
అంకురిస్తున్న
ఈ ఆత్మ ప్రబోధాన్ని
అమలుచేసే
నా ప్రయత్నంలో
జుట్టుకు రంగువేసుకున్న
మా ఆయన పక్కన
నేను పెద్దదానిలా కనిపిస్తానేమో!
పదిమందిలోకి వెళ్ళినప్పుడు
నా వయసు తెలిసిపోతుందేమో!
అనే
ప్రలోభాలకు
లోనుకాని
ఆత్మవిశ్వాసం
ఇప్పుడు
నాకు అత్యవసరం.😍
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
20.10.2024
ఆదివారం
ఈ రోజు అక్టోబర్ ఒకటవ తేదీ World vegetarian day సందర్భంగా కవితలాంటి నా
మెనూ కార్డు
శాకాహారమే ఆరోగ్యం
కమ్మని నెయ్యితో
కారప్పొడితో
కొబ్బరిచెట్నీతో
మృదువైన ఇడ్లీలను
మునివేళ్ళతో తుంచుకుని
అల్పాహారంగా
ఆరగించటం
అరుగుదలకూ
ఆరోగ్యానికీ కూడా అత్యుత్తమమే కదా!
నాలుగు రకాల కూరగాయముక్కలను
నైసుగా తరుక్కుని
చిటికెడు ఉప్పు చల్లుకుని
మిరియాలపొడి అద్దుకుని
నిమ్మరసం పిండుకుని
పదకొండు గంటల వేళ
ఫైబర్ పుడ్డుగా భావించి
నమిలితిన్నావంటే
నలభైల్లో కూడా
నాజూకుదనమే సుమా!
ఆకుకూర పప్పు,
,అరస్పూను నెయ్యి
నచ్చిన కూర ,నూరిన పచ్చడి
తగినంత అన్నం
తియ్యని పెరుగుతో
మధ్యాహ్న భోజనం
నోటికి రుచికరం
కడుపుకి అవసరం
సాయంత్రం నాల్గింటికి
కాసిన్ని గుగ్గిళ్ళో
కావలసినన్ని మరమరాలో
కాలక్షేపం కోసమే సుమా!
డబ్బు ఖర్చు
జబ్బు బాధ లేని ఆహారం
చీకటి పడుతూ ఉండగానే
రెండు రొట్టెలు
సలాడ్ తోనో
రైతా తోనో తీసుకో
భుక్తాయాసం రాకుండా చూసుకో
పండునొకటి చేర్చుకో
పలుచని మజ్జిగ తాగి
పడకటిల్లు చేరుకో
రోజుకు ఒకటి రెండు టీ కాఫీలు
వారానికొకసారి విందు భోజనాలు
నేలతల్లి దీవించి ఇచ్చిన శాకాహారం
నీ ఆరోగ్యానికి వరం
అతి సర్వత్ర వర్జయేత్
అన్న సూక్తి
ఆహారంలోనూ పాటిద్దాం
ఆనందంగా జీవిద్దాం.
సింహాద్రి జ్యోతిర్మయి
1.10.2018.
అక్టోబర్ 1
ఈ రోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం.
ఈ సందర్భంగా నేను చాలా ఏళ్ళ క్రితం రాసుకున్న ఒక పేరడీ
వలపువలే తీయగా
వచ్చినావు నిండుగా
అనే పాటకు పేరడీ
వెండివలే తెల్లగా
జుట్టు నెరిసె మెల్లగా
తెలియకనే ముదిమి ఇలా
వచ్చి పడెను చల్లగా || ||
చురుకుగ చూసే కళ్ళకిప్పుడు
మసకజోడిదే వచ్చెనుగా
చకచక నడిచే కాళ్ళకు నేడు
కీళ్ళనొప్పులే కలిగెనుగా
బరువు పెరిగి
నా శక్తి తరగి ఇక
బీపి షుగరులే
తగిలెనుగా|| ||
పెద్ద చదువులకు
పిల్లలెదగగా
చంపుకొంటి
నా సరదాలు
ఇల్లు కట్టుకొను
కోర్కె పెరగగా
అప్పుకు పడితిని
అగచాట్లు
ఇన్ని చేసి
ఇటు తిరిగి చూడగా
జారిపోయె జవసత్వాలు || ||
కోడలు అల్లుడు
కొత్త అతిథులు
ముదిమికి ముచ్చట
మనవళ్ళు
బరువు బాధ్యతలు
తీరిపోవ
పరమాత్మ పిలుపుకై ప్రాణాలు
ఎదురు చూడగా
మగని నీడలో
నిండవలెను
నా నూరేళ్ళు || ||
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1.10.2020
అక్టోబర్ 2
గాంధీ జయంతి
శుభాకాంక్షలతో
*పూజా పుష్పం*
అతడు జన్మించిన రోజు
అంతర్జాతీయ
అహింసా దినం
అతడు జాతి జాగృతికి
అడుగు కదిపిన రోజు
అది దండి సత్యాగ్రహం
అతడు
జలియన్ వాలాబాగ్
దురంతానికి చలిస్తే
అది సహాయనిరాకరణం
చరఖా పట్టమని
చేనేత ధరించమని
అతడు సందేశమిస్తే
అది విదేశీ వస్తు బహిష్కరణ
ఉద్యమిద్దాం
లేదా
మరణిద్దాం
అని అతడు పిలుపునిస్తే
అది క్విట్ ఇండియా మహోద్యమం
అతడు శాంతి అహింసల
కవచాలు ధరించి
కదనానికి నడుం కడితే
అది స్వాతంత్ర్య సంగ్రామం
*హేరామ్* అంటూ అతడు
తూటాలకు
నేలకొరిగిన రోజు
జాతీయ అమరవీరుల
సంస్మరణ దినం
జాతినొక్కతాటిపై
నడిపిన నేత
అతడు జాతిపిత
భరత జాతి స్ఫూర్తికి ఆత్మ
అతడు మహాత్మ
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
అక్టోబర్ 3
ఇంటర్నేషనల్
నో షుగర్ డే
*నో(యింగ్ )షుగర్*
బాల్యపు తీపిని
బడి ఆవరణలోనే
పారేసుకున్నాను
యవ్వనపు తీపి
ఎప్పుడు మాయమైందో తెలియనే లేదు
మధ్యవయసు తీపి
బాధ్యతల వేడిలో కరిగి వెళ్ళి పోయింది
బిడ్డలపై
మమకారపు
తీపిని
పెళ్ళి చేయగానే
మళ్ళించుకోవాల్సి వచ్చింది
మనవలపై తీపి
పెంచుకోవటం అత్యాశ అనిపిస్తోంది
దాంపత్యపు తీపిలో
ఏ అడుగు ముందు ఆగుతుందోనని
ఆందోళన మొదలయ్యింది
బ్రతుకుపై తీపిని
వదిలించుకోమని
వృద్ధాప్యం హెచ్చరిస్తోంది
అనుబంధాల వలలో చిక్కి
ఆనందమే తీపని
పరుగులు తీసిన మనసు
అలసిపోయి ఆగి
దీపం క్రింద
పరచుకున్న క్రీనీడలా
బంధాల తీపి
మిగిల్చిన అనుభవాల చేదును
అవగతం చేసుకుంటూ
అంతర్యామికి
ఆత్మను అర్పించటమే
అసలైన ,
అంతులేని తీపి అని
ఆలస్యంగా గుర్తిస్తోంది
ఇప్పుడిక
no sugar
Only
Knowing sugar 😊
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
3.10.2024
October 4
World animal day సందర్భంగా
నేను చిన్నపిల్లల కోసం రాసిన
పాటల్లో పాఠాలు నుండి
ఒక గేయం
మనిషి - జంతువు
చిట్టి పొట్టి పాపలార!
చెబుతున్నా వింటారా!
మంచిచెడుల మనిషికి
జంతువులే పోలిక
ముద్దు ముద్దు మాటలకు
చిలుకతోటి పోలిక
కమ్మనైన పాటలకు
కోకిలమ్మ పోలిక
అందమైన నడకలకు
రాజహంస పోలిక
మురిపించే నాట్యానికి
నెమలితోటి పోలిక
రెక్కవిప్పు స్వేచ్ఛకు
పావురం పోలిక
బండచాకిరీని చెప్ప
గాడిదతో పోలిక
వాడియైన చూపులకు
డేగతోటి పోలిక
బెదురు బెదురు చూపులకు
లేడికూన పోలిక
గట్టిపట్టు పడితివా
ఉడుముతోటి పోలిక
కుదురులేక ఎగిరితే
కోతిపిల్ల పోలిక
సాహసం శౌర్యానికి
మృగరాజే పోలిక
కఠినత్వం క్రౌర్యానికి
పెద్దపులులు పోలిక
కొంపముంచు అతితెలివికి
గుంటనక్క పోలిక
ముప్పుగెలుచు తెలివికి
చెవులపిల్లి పోలిక
విశ్వాసం చూపుటలో
కుక్క తోటి పోలిక
మేలుపొంది కీడుచేయ
పాముతోటి పోలిక
కన్నుగప్పి దొంగిలించ
పిల్లికూన పోలిక
మోసపుచ్చి నటించగా
కొంగజపం పోలిక
సాగబోని నడకకి
నత్తతోటి పోలిక
చకచకా సాగిపోవ
చీమతోటి పోలిక
ఇల్లిల్లూ తిరిగితే
ఈగతోటి పోలిక
అరచి అరచి గోలచేయ
కాకి తోటి పోలిక
పరుగుతీయు వేగానికి
గుర్రమే పోలిక
మందమంద గమనానికి
ఏనుగుతో పోలిక
పనిచేయక తిని తిరిగిన
దున్నపోతు పోలిక
అసహ్యాన్ని తెలియజేయ
పందితోటి పోలిక
జనులపట్టి పీడించగ
జలగతోటి పోలిక
అందరికీ మేలుచేయ
ఆవుతోటి పోలిక
నోరులేని ప్రాణులివి
మనకు మంచి నేస్తాలివి
ప్రేమతోటి చూడండి
జీవహింస మానండి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
4.10.2020
UN
.నేడు అక్టోబర్ 8
భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా నా కవిత
........గ( ఘ )నత( గ )ల సేన.......
అనంత వినీలాకాశంలో
దేశ రక్షణ ధ్యేయం తో
జాతి స్వేచ్ఛ అనే రెక్కలు తొడిగి
దూసుకుపోతోంది గగనతలాన
సాహసమే ఊపిరైన మన వాయుసేన
త్రివిధ దళాలలో
తన ప్రత్యేకతను చాటుతూ
అద్భుత వాయు క్షిపణి సంపత్తితో
అగ్రదేశాల సరసన ఠీవిగా
'టచ్ ద స్కై విత్ గ్లోరీ'
అనే నినాదంతో
కీర్తి అంచులు అందుకోవడానికి
నీలిరంగు పక్షులై
నిత్యం విహరించే
ప్రమాదపు అంచుల్లో
ప్రతి క్షణం పయనించే
ఎనభై ఏడు వసంతాలు నిండిన వీరులు
మన దేశ వైమానిక దళాలు
పొరుగుదేశాల పొగరుకు
తగిన గుణపాఠాలు నేర్పిన
ఆపరేషన్ విజయ్
ఆపరేషన్ మేఘదూత్
ఆపరేషన్ కాక్టస్ వంటి
వీరోచిత విజయాలు
మన వాయుసేన గమనంలో
మహోన్నత మైలురాళ్ళు
ఆకాశంలో చేసే
అద్భుత విన్యాసాలేకాదు
అవనిపై తన జాతికి
అనుకోనిఏ ఆపదవచ్చినా
ఆదుకోవటానికి మేమున్నామని
ఆపన్న హస్తమిచ్చి
ఆదుకునే ఆత్మీయ బంధువులు
అచ్చెరువొందగ ప్రపంచం
వాయురక్షణ విభాగంలో
ప్రపంచం దేశాలలో తాను
నాల్గవ స్థానంలో నిలిచిఉన్నా
అహంకరించి
అక్రమ దాడులకు పాల్పడని
శాంతి కపోతం
భరతజాతికి గర్వ కారణం
మన వైమానిక దళం
సెల్యూట్ చేద్దాం
శుభాకాంక్ష లందిద్దాం
జై జవాన్
జై భారత్ మాతా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
8.10.2020.
అక్టోబరు 9
ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా నా కవిత
.....మరచి(న చిరు)నామా
నా చిన్నతనంలో
నాన్న చిరునామాకు ఉత్తరం వస్తే
అమ్మకు చదివి వినిపించిన ఆ రోజులు
నాకిప్పటికీ గుర్తున్నాయి
మామయ్య వద్ద ఉండి
చదువుకుంటున్న అన్నయ్యకు
ఇంటివిషయాలన్నీ
పూసగుచ్చినట్లు
ఇన్ లాండ్ లెటర్ లో నింపేసి
నాన్నగారు రాసిన ఉత్తరాలు
నాకింకా గుర్తున్నాయి
శుభాశుభాలలో
ఏ వార్తను మోసుకొచ్చిందో ఏమో!
అనే ఆదుర్దాతో
టెలిగ్రాములు అందుకున్న
ఆ రోజులు గుర్తున్నాయి
కాలేజీ హాస్టల్ లో ఉన్న నాకు
నెల మొదటివారంలోనే
నాన్నగారు పంపిన
మనియార్డర్లు గుర్తున్నాయి
ఓ రూపాయి పెట్టి
ఇన్ లాండ్ కవరు కొనకూడదూ!
కరువొచ్చి పడ్డట్టు
ఆ కార్డుముక్క ఏం ఖర్మ అని
బాబాయి పై నాన్నగారు
విసుక్కున్న రోజులు గుర్తున్నాయి
పురిటికి పుట్టింటికి వచ్చిన అక్క
బావగారి ఉత్తరం కోసం
మధ్యాహ్నం వేళ మండుటెండలో
గుమ్మంలోనే కాచుకున్న
ఎదురుచూపులు గుర్తున్నాయి
ఆంగ్ల సంవత్సరాదికి
నిండు గర్భిణీ లాంటి సంచీలతో
ఆయాసపడి తిరుగుతూ
ఆత్మీయులు పంపిన
గ్రీటింగ్ కార్డులను పంచిపెట్టే
పోస్ట్ మేన్ సైకిలు బెల్లులు గుర్తున్నాయి
పోస్ట్ మేన్ అడిగిన
పదిరూపాయల దసరా మామూలుకి
ఏడాదికో ఉత్తరం కూడారాని మేము
ఎందుకివ్వాలి దసరా మామూలని
పక్కింటి వారు సంధించిన
వాగ్బాణాలు గుర్తున్నాయి
చెవిలో పెన్సిల్ చేతిలోసంచీ
అరిగిన చెప్పులతో వీధుల్లో తిరిగే
పోస్ట్ మేన్ గురించి
రాయడానికేముంటుంది!
అని అంటూనే
అతడిని రాజును చేసి
అమృతం కురిపించే
కవిత చెప్పిన తిలక్ రాతలు గుర్తున్నాయి
పండిత నెహ్రూ తన ప్రియ పుత్రికకి
రాసిన ఉత్తరాలు
రగిలించిన స్ఫూర్తి ని చాటిన
చరిత్ర పాఠాలు
నా చెవులకింకా గుర్తున్నాయి
హృద్యంగా నాలుగు వాక్యాలు
హృదయాన్ని తాకేటట్లు
బంధాలను పెంచేటట్లు
అందంగా పేర్చటం నేర్పిన
అలనాటి ఉత్తరం
స్మార్ట్ ఫోన్ ల సుడిగాలిలో
వాట్సప్పు ల వరదలో
ఎస్సెమ్మెస్సుల తుఫాను లో నేడు
తుడిచిపెట్టుకు పోయినా
పాతికేళ్ళక్రితం వరకూ తాను
ప్రతి ఎదురుచూపుకీ
ఆనంద హేతువు
ప్రతి గడపనూ చేరిన
ఆత్మబంధువు.
పోగొట్టుకున్న ఆ చిరునామా
మరొక్కసారి
వెతికే ప్రయత్నం చేద్దామా!
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
9.10.2018
ఈ రోజు
అక్టోబర్ 10 వ తేదీ
World mental health day
ఈ యేటి నినాదం
*Young people and mental health in a
Changing world*
*మారుతున్న ప్రపంచంలో యువత మానసిక ఆరోగ్యం*
ఈ సందర్భంగా నా కవిత
............నన్ను (నన్నుగా) ప్రేమించండి...........
పడీపడని అడుగులు
వచ్చీరాని మాటలు
నిండీ నిండని రెండేళ్ళు
పాతికేళ్ళకు నా లక్ష్యాన్ని
ఇప్పుడే భావనచేసి
అమ్మ ఒడికి దూరం చేసి
అప్పుడే బడికి పంపేస్తే
ఊహల రెక్కలు కూడా రాని
చిట్టి గువ్వ లాంటి నా మనసు
విలవిల లాడిన ఆ క్షణాలు
మీ కెవ్వరికీ తెలీవు
పాఠశాల పంజరంలో
ఇంగ్లీషు గూవా ముక్కలు
ఎంగిలిపడే నేను
అమ్మా అనే ఆక్రందనను
గొంతులోనే అణిచేసుకున్నాను
మంచి చెడులు చెప్పే తీరిక
మమ్మీకి లేదు
డబ్బులడిగితే ఇచ్చేయడమే తప్ప
డాడీకి నా గురించి పట్టదు
అమ్మానాన్నలు
ఆఫీసులకు పోతే
బడినుంచి వస్తూ వస్తూ
బండి మీద నూడుల్స్
తెచ్చుకుని తినేస్తాను
టీవీలో వచ్చే చెత్త ప్రోగ్రాములు
చూడొద్దు తప్పని చక్కదిద్దేవారేరీ!
వీడియో గేములతో
కాలం కరగదీస్తుంటే
వద్దని వారించి మందలించే వారేరీ!
స్నేహితులతో చాటింగు చేస్తుంటే
గమనించి నను కాస్త గద్దించేవారేరీ!
ఎవరి గదులు వారివైన
ఏకాంత జీవితాలలో
నేతి మిఠాయిలు
రుచి చూపించే నాయనమ్మ లేదు
నీతి కథలు బోధించే
తాతయ్య లేడు
ఆధునిక సాంకేతికత
అరచేతిలో ఇమిడాక
తెలియకూడని విషయాలు కూడా
తెరచిన గుప్పిలి కాగా
అప్పుడప్పుడే పొటమరిస్తున్న ఈడు
నన్ను నిలవనీయటం లేదు
దురభ్యాసాలు తప్పుకాదని
స్నేహితుల బృందం అంటోంది
అబ్బాయిల వెర్రి చేష్టలే ప్రేమని
సినిమా నిర్దేశిస్తోంది
అమ్మాయిల బరితెగింపే ధైర్యమని
ఆధునికత అంటోంది
సంస్కారమంటే ఛాదస్తమని
సమాజం వ్యాఖ్యానిస్తోంది
తప్పొప్పులు విడమరిచి
తడబాటును సరిదిద్దే
మృదువైన స్పర్శకు
నోచుకోని గుండె
ఒత్తిడికి గురి అవుతోంది
సిలబస్సుల పోరాటమే తప్ప
టీచరుకి నన్ను
పట్టించుకునే తీరికలేదు
ర్యాంకుల ఆరాటమే తప్ప
కన్నవారికి నా శక్తిపై
కాస్తయినా అవగాహన లేదు
విద్యతో వ్యాపారమే తప్ప
విద్యాలయాలకు విలువల పట్టింపు లేదు
తల్లిదండ్రులకు ,పాఠశాలలకు
నేనొక పెట్టుబడిని
లాభం వస్తేనే నాకు గుర్తింపు
రాకుంటే ఇంటిలోనూ చీదరింపే
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
అన్న ఆర్యోక్తి
సార్థకమవ్వాలంటే
నన్ను ప్రేమించండి
ఒక తియ్యని పలకరింపుతో
మనసుకు ఆనందాన్నివ్వండి
సుతి మెత్తని మందలింపుతో
నీతి బాటకు మరలించండి
అపజయంలో ఊరడింపుతో
ఆత్మవిశ్వాసాన్ని నింపండి
నాకు కాస్త ప్రేమనివ్వండి
మానసిక ఆరోగ్యవంతునిగా
నన్ను తీర్చిదిద్ది
రేపటికి నన్ను కానుకగా ఇవ్వండి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
10.10.2018
ఈ రోజు అక్టోబర్ 2nd Thursday
World sight day
సందర్భంగా నా కవిత
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఈ యేటి నినాదం
*Eye care
Everywhere*
అరవిందాక్షుడంటారు అచ్యుతుని
ఫాలాక్షుడంటారు పరమశివుని
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి యని
కొలిచేరు ఆది పరాశక్తిని
వర్ణించారెందరో కవులు
కావ్య నాయికల కడగంటి సోయగాన్ని
నరుడి దృష్టి కి
నల్లరాయి పగులుతుందని సామెత
మహర్షుల దివ్య దృష్టి
మహోన్నతమని నిరూపించింది
మన పురాణచరిత
అర్జునుడి లక్ష్య దృష్టి
అద్భుతమన్నది భారతం
తల్లి చేసిన తప్పిద ఫలితమే
ఆంబికేయుని అంధత్వం
పరమభక్తితో పరమేశునికి
కన్నిచ్చిన ఆటవికుడు
కన్నప్పడు తిన్నడు
నేత్రదానానికతడు
దారి చూపిన ఆద్యుడు
సూక్ష్మ దృష్టిలో
సాటిలేని ది మత్తేభం
కాంతిని చూడలేని
కళ్ళు గలది దివాంధం
పొగరెక్కిన వాళ్ళను
కళ్ళు నెత్తికెక్కాయని తిడతారు
పశ్చాత్తాపం పొందితే
కనువిప్పు కలిగిందని అంటారు
మనుగడకు ఆధారమైన మన జ్ఞానేంద్రియం
కాంతిని కోల్పోవడం స్వయంకృతాపరాధం
రేచీకటి ,ఛత్వారం
నీటి కాసులు ,శుక్లాలు
మధుమేహం,ఆహారలోపం
వ్యాధి యేదైనా
ముందుగా మేల్కొంటే
ముప్పు తప్పినట్లే
కంటిక అధిక శ్రమ
కానరాని అపాయమే సుమా!
పౌష్టికాహారలోపం
గోటితో పోయే ప్రమాదం
కనుచూపును మింగేయడమే
దాని క్రమ పర్యవసానం
భూతద్దాల కళ్ళ జోళ్ళతో
భావి బుడతలను చూస్తున్నప్పుడు
కళ్ళకు కడుతోంది మన నిర్లక్ష్యం
కంటివ్యాధులపై మనకిప్పుడు
అవగాహన అవసరం
జగతిని చూపించే కన్ను
మన జీవితాంతమే కాదు
మన జీవితానంతరం కూడా
మట్టి కారాదని గ్రహిద్దాం
ఆరిపోయిన మన ప్రాణదీపం
ఇద్దరు అంధుల జీవితాలకు
వెలుగులు పంచగలదని
తెలుసుకుని చేద్దాం వాగ్దానం
మేము సైతం చేస్తామంటూ
నేత్రదానం
సులోచనాలు అవసరం లేని
లోచనాలు కావాలి
కంటి దీపాలు మలగక
కలకాలం వెలగాలి
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
11.10.2018
ఆడపిల్లలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు.
ఆడపిల్లలు
సౌకుమార్యంలో పువ్వులు
.........వికసించనివ్వండి
ఆత్మీయపు నవ్వులు
........చిలికించనివ్వండి
ఇంటింటికీ దివ్వెలు
.........వెలుగు చిందనివ్వండి
చదువులలో రవ్వలు
..........ప్రకాశించనివ్వండి
సంతోషాల గువ్వలు
............రెక్కవిప్పనివ్వండి
చైతన్యపు మువ్వలు
.............మోగనివ్వండి
ఆడపిల్ల
రేపటి అమ్మ
జాతిని సృష్టించే బ్రహ్మ.
ఆడపిల్లను
చిదిమేయకండి
చదివి ఎదగనివ్వండి
సింహాద్రి జ్యోతిర్మయి
11.10.2018
ఈ రోజు అక్టోబర్ (12)
రెండవ శుక్రవారం
World egg day సందర్భంగా నా కవిత
.................అండాహారం...................
నా మేని రంగు
జాబిల్లి తెలుపు
పైకి కఠినంగా కనిపిస్తానే గానీ
చిన్న ఒత్తిడిని కూడా
భరించలేక
బద్దలైపోతాను
వేడెక్కి నేను
కుతకుతా ఉడికిపోయినప్పుడు
దేహాత్మలు విడిపోయినట్లుగా
నాలో నేనే
రెండు భాగాలుగా విడిపోతాను
ఆరోగ్యప్రదాతగా నన్ను
ఆరాధిస్తోంది ప్రపంచం
నిరుపేదకైనా నేను
అందుబాటులో ఉండే ఆహారం
బేకరీల లోని
ఆహారాలకు మూల పదార్థం నేనే
వంటగదిలో
క్షణాల్లో తయారయ్యే
మాంసాహారమంటే నేనే
శ్రీనివాసుడికి సాటివచ్చే దైవం లేడని
కలౌ వేంకట నాయకః అని
హరిని ఆరాధించి శుభాలనందమని
ఆధ్యాత్మవేత్తలు ప్రవచిస్తుంటే
సంపూర్ణ పోషకాహారం నేనేనని
ప్రతిరోజూ నన్నారగించమని
ఆధునిక వైద్యులు సలహాలిస్తున్నారు
తల్లి రెక్కల వెచ్చదనం కింద
తలదాచుకుని
తనువును ధరించటం కన్నా
మానవసేవయే మిన్న
అని భావించే
నా త్యాగాన్ని గుర్తించి
అక్టోబర్ రెండవ శుక్రవారాన్ని
నా గౌరవార్థం కేటాయించిన
మీ సహృదయతకు
ఈ అండం
పెడుతున్నది దండం
😊😊😊😊😊
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
12.10.2018
ఈ రోజు
అక్టోబర్ 13
ప్రపంచ విపత్తుల నివారణా దినోత్సవం సందర్భంగా నా కవిత
.........................విపత్తులు....................
దివిసీమ ఉప్పెన
లాతూర్ భూకంపం
తమిళనాడు తీరాన్ని
వణికించిన సునామీ
ఉత్తరాఖండ్ వరదలు
తిరుమల నల్లమల
అడవుల్లో కార్చిచ్చు
విశాఖ తుఫాను
కరీంనగర్ లో
టోర్నెడో కలకలం
కేరళలో వందేళ్ళలో
కనీవినీ ఎరుగని వర్షం
పదుల్లో ఊళ్ళను ఊడ్చి
వందల్లో ఇళ్ళను కూల్చి
వేలల్లో మనుషుల్ని చంపి
లక్షల్లో నిరాశ్రయుల్ని చేసి
కోట్లల్లో ఆస్తుల్ని హరించి
లెక్కకు మిక్కిలిగా
మూగజీవాల్ని మింగి
ప్రకృతి చేస్తున్న హెచ్చరికలేమిటి?
సమస్త సంపదలనూ ఇచ్చి
సాకుతున్న తనను
ఆధునికత పేరుతో
అతలాకుతలం చేస్తుంటే
ప్రకృతి మాత
పేగు కదిలి
గుండె రగిలి
కన్నెర్ర జేసి
నిట్టూర్పు వదలి
కన్నీరు చింది
కడలిగా పొంగితే
విజ్ఞాన ఖనినని
విర్రవీగుతున్న మానవుడు
విపత్తులను అడ్డుకోలేని అశక్తుడై
కమ్ముకొస్తున్న ఆపదలను
కబళిస్తున్న విధ్వంసాన్ని
కళ్ళప్పగించి చూడాల్సిందే తప్ప
కనీసం తనను తానైనా
కాపాడుకోలేనన్న కఠోర సత్యం
గ్రహించేదెన్నడో!
మతవిద్వేషం
యుద్ధోన్మాదం
జాత్యహంకారం
ఊచకోతలు
బాంబు దాడులు
మనిషిలోని రాక్షస తత్వం
మన స్వయంకృతాపరాధం
చేదు అనుభవాలను
చవిచూపిన చరిత్రనుండి
ఏ గుణపాఠమూ
నేర్చుకోని మానవుడు
ఇవి రెండూ స్వార్థఫలాలేనని
ఇప్పటికైనా గ్రహించాలని
చేతులెత్తి ప్రార్థిస్తున్నా
గొంతెత్తి అర్థిస్తున్నా!
ఓ మానవ సమాజమా!
ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో
ఈ ప్రకృతిని ప్రసన్నం చేసుకో
మనిషిగా మేలుకుని
మనీషిగా మారిపో
మానవత్వాన్ని మిగుల్చుకో.
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
13.10.2018.
To commemorate Dr. Kalam's birthday, the United Nations declared October 15 to be World Student's Day in 2010. Dr. Kalam received recognition from the UN for his work in education, youth development, and his sincere love for students
ఈ రోజు అక్టోబర్ 15
World hand wash day
సందర్భంగా నా కవిత
.............అరచేతి అంతరార్థం........
ప్రేమగా తలనిమిరి పొదువుకుంటుంది
స్పర్శతో హృదయాన్ని ఆవిష్కరిస్తుంది
ఆశ తీర్చమని సాచి అడుగుతుంటుంది
ఇవ్వలేని అశక్తతను సైగ చేసి చెప్తుంది
ఆగ్రహమొస్తే విసురుగా చెంపను తాకుతుంది
ఆవేశమొస్తే ముడుచుకుని పైకి లేస్తుంది
ఆదరమొస్తే రారమ్మని ఆహ్వానం పలుకుతుంది
నచ్చకపోతే ఛీపొమ్మని విదిలించికొడుతుంది
తనువునంతా తాకి శుద్ధి చేస్తుంది
ఆదమరిస్తే రోగాల్ని అంటగడుతుంది
నడకరాని బాల్యాన్ని నడిపించే సాయమది
నడుము వంగిన వృద్ధాప్యంలో చేతి కర్రకు ఊతమది
స్వతంత్ర భారతాన్ని చాలా ఏళ్ళు శాసించిన
పార్టీకి ఇందిరమ్మ ప్రకటించిన చిహ్నమది
చరిత్ర సృష్టించిన బాహుబలిలో
మాహిష్మతీ వారసుణ్ణి
బ్రతికించిన త్యాగమది
ఆశ్రయించు నా పదమని
ఆపదమొక్కులవాడు పట్టిన
అభయముద్ర చెలువమది
సంఘం శరణం గచ్ఛామి యని
గౌతమబుద్ధుడు చూపిన
అహింసా మార్గమది
ఆ అరచేతుల పరిశుభ్రత
ఏమరక పాటిద్దాం
ఆరోగ్య భారతాన్ని
అందరమూ సాధిద్దాం
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
15.10.2018
ఈ రోజు అక్టోబర్ 17 వ తేదీ
ప్రపంచ దారిద్ర్య నిర్మూలనా దినోత్సవం సందర్భంగా నా కవిత
దారిద్ర్యమా! వెళ్ళిపో (కు).
నువ్వు.....
చదివితే ఆలోచిస్తావని
ఆలోచిస్తే హక్కులు గుర్తిస్తావని
హక్కులు గుర్తిస్తే ప్రశ్నిస్తావని
ప్రశ్నించడం మొదలుపెడితే కూడగడతావని
కూడగడితే కూలుస్తావని
కూలిస్తే సాధిస్తావని
సాధిస్తే సంపాదిస్తావని
సంపాదిస్తే లెక్కచేయవని
అనాదిగా నిన్ను
అజ్ఞానం
అణచివేత
బానిసత్వం
పేదరికం
అనే ముసుగు కప్పి
తలెత్తనీయకుండా చేసి
చెలాయించిన నా పెత్తనం
కలకాలం
చెల్లుబాటు కావాలంటే
నువ్వు
బడుగు జీవిగానే బ్రతకాలి
మురికివాడల్లోనే మెలగాలి
ఓటుగా లెక్కకు రావాలి
నోటుకి అమ్ముడు పోవాలి
దీనుడినంటూ మొక్కాలి
దినసరి కూలీ కావాలి
మేమిచ్చే రాయితీల
నందుకుంటూ
మారాజులంటూ పొగడాలి
ఉచితాలంటూ మేము
విసిరేసిన చిల్లర
ఏరుకుంటూ ఉండాలి
నువ్వుకూడా అందలమెక్కితే
నన్నింక మోసేదెవరు?
అందుకే
వెనుకబాటుతనానికి
చిరునామావై
నా వెన్నుదన్నువై
వేళ్ళూనుకున్న నిన్ను
నలుగురి కోసం నటిస్తూ
నీ బాగుకోసమే
నా తాపత్రయమని
నమ్మబలుకుతూ
దారిద్ర్యమా!వెళ్ళిపో అని
అప్పుడప్పుడూ
ఆవేశపడి అరుస్తుంటాను
వెళ్ళిపోయేవు సుమా!
అది కేవలం వేళాకోళానికే.
యుద్ధనీతి అంటూ
ఆపద్ధర్మం అంటూ
ధర్మరాజు అసత్యంలా
నేను మింగేసిన
చివరి అక్షరం
అది నా మనసులోని మాట
మనలో మనమాట.
దారిద్ర్యమా!
వెళ్ళిపో( కు ).
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
17.10.2020
*భళారే (వి)చిత్రం*
మనసు కాన్వాస్ మీద
జ్ఞాపకాల కుంచెను
కదిలించగానే
అనుభవాల చిత్రాలెన్నో
ఆవిష్కృతమౌతుంటాయి
ఉదయసాయం సంధ్యలలో
నీలాకాశ పటంమీద
మేఘాల కుంచెను కదిలిస్తూ
సూర్యుడు దిద్దే
చిత్రాల
వర్ణమిశ్రమం నాకెప్పుడూ ఒక అద్భుతంగానే అనిపిస్తుంటుంది
*రవివర్మ* కుంచెలో
ఊపిరిపోసుకున్న
శ్రీనాథుని కావ్యనాయిక
దమయంతికి
నలమహారాజు చిత్రాన్ని తన కొనగోటితో
గీసి ఇచ్చిన
బంగారు రెక్కల రాజహంస చిత్రకళా
నైపుణ్యం
ప్రేమోద్దీపన చేసి
శృంగార నైషధ కావ్యమయ్యింది
అలవోకగా అలా ఒంగి
విల్లెక్కుపెట్టిన
ముక్కుతిమ్మన గారి సత్యభామ సౌందర్యం
*వడ్డాది పాపయ్య* గారి
కుంచెలో
వయ్యారాలు పోయి
ఆమె ప్రాణనాథుడినే కాదు
మనలనూ సమ్మోహన పరుస్తుంది
*ఇచ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొనుమంచు చూపి* న
వరూధిని తెంపరితనాన్ని
పెద్దనగారి కలం
కళ్ళకు కట్టినట్లే చిత్రిస్తుంది
ఒకప్పడు
పదహారణాల తెలుగమ్మాయిలా
కళ్ళముందు మెదిలి
నాటి బ్రహ్మచారులకు
చిటికెన వేలు పట్టుకుని
తన జీవితంలో ప్రవేశించే కలలరాణిగా
*బాపూ బొమ్మ*
నిలిచిపోయింది
*లియోనార్డో డావిన్సీ*
సౌందర్య సృష్టి అయిన
*మోనాలిసా* మోములోని
భావోద్వేగాల సమ్మేళనంలో
దేని శాతం ఎంతో
నిర్ధారించే ప్రయత్నం
రసలోకంలో
నేటికీ
చర్చనీయాంశంగానే ఉంది
ఊపిరి సినిమాలో
కార్తి వేసిన పెయింటింగ్ కి
ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యానంలా
అంతుచిక్కని
అర్థం కాని
మావారి హావభావాలకు కూడా
నాకు తోచిన భాష్యం చెప్పుకుని
సంతృప్తి చెంది
సమాధానపడే
నా హృదయం
నేటి
*మోడ్రన్ ఆర్ట్* లోని
అందాలనూ
ఆనందిస్తూ
*చిత్రం* భళారే విచిత్రం
అనుకుంటూ
ఇదిగో
ఇలా
ఊహల కుంచెకు
భావాల రంగులద్ది
మనోఫలకంపై
కవిత్వీకరించి
దృశ్యమానం చేస్తోంది
అక్టోబర్ 25 వ తేదీ
*ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ డే* ని పురస్కరించుకుని
సింహాద్రి జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
25.10.2024
శుక్రవారం












Comments
Post a Comment