1/4 శ్రీ విష్ణు కందం

*శ్రీ విష్ణు కందం* (ఓం నమో వేంకటేశాయ) *కందం.1* హరి నిలయము హరి సముఖము హరి వదనము, హరి చరణము లవిగవిగవిగో హరి చరితము ,హరి వచనము హరి కరుణయు సుమధురమది యడగక దొరికెన్. *కందం.2* హరియను మధురాక్షరములు హరియించును కలుషమెల్ల ఆర్తిని మాపున్ తరియింపగ జేసెడి శ్రీ హరి నామము స్మరణజేయు మదె తారకమౌ. సింహాద్రి జ్యోతిర్మయి 11.4.2022 *శ్రీ విష్ణు కందం* ఓం నమో వేంకటేశాయ *3.కందం* ముని తాచిన హరి ఎదపై తను వాసము చేయనంచు తరలిన లక్ష్మిన్ కనుగొన వచ్చిన శ్రీహరి మన భాగ్యవశమ్మున తిరుమలపై వెలసెన్. *4.కందం* కొంగున ముడి వేసుకున్న బంగారానివి కొలిచెడు భక్తులకెల్లన్ బంగరు వాకిలి ముక్తికి ముంగిలి గోవింద ఘోష మోగును దిశలన్. సింహాద్రి జ్యోతిర్మయి 12.4.2022 *శ్రీ విష్ణు కందం* (ఓం నమో వేంకటేశాయ) *కందం 5* భయమున జపించి కంసుడు స్వయముగ పిలిపించి నిన్ను పరమును పొందెన్. ప్రియమున తపించి రుక్మిణి స్వయముగ పిలిపించి నిన్ను పతిగా పొందెన్. *కందం.6* సురముని జపించు నిరతము కురు వృద్ధుడు వే తెఱగుల కొనియాడెనదే. వర వానరుడా హనుమకు పరమానందము నొసగిన పలుకును హరియే. సింహాద్రి జ్యోతిర్మయి 13.4.2022 *శ్రీ విష్ణు కందం* (ఓం నమో వ...